పని సూత్రాలు. 41. పని చేసే చోట, మీ పరిచయాలు పెంచుకోండి !
మీరు పని చేసే చోట, ఎట్లా ప్రవర్తిస్తే , మీరు ఎక్కువ గా లాభ పడతారో తెలుసుకోవడం లో భాగం గా, ఒక నలభై టపాలను ఇంతకు ముందే పోస్ట్ చేయడం జరిగింది ‘ బాగు ‘ లో ! ( ఉత్సాహం ఉన్న వారు, బాగు ఆర్కివ్స్ లో చూడండి, ఫిబ్రవరి 13 , 2013 నుంచి ఏప్రిల్ 3 2013 వరకూ వేసిన టపాలు ! ) ఇక మిగతా పని సూత్రాలు తెలుసుకుందాం !
పని చేసే చోట , పరిచయాలు పెంచుకోవడం :
చాలా మంది తాము పని చేసే స్థానం లో కేవలం , వారి పని వారు చేస్తూ , ఎల్ల కాలం తమ కర్తవ్యం లో నిమగ్నమై ఉంటారు ! వారికి పని బాగా వచ్చినా , తదేక దీక్షతో పని చేస్తూ నే ఉంటారు ! అవన్నీ మంచి లక్షణాలే ! కానీ పని చేసే చోట , అనేక మానసిక పధకాలు వేయబడుతూ ఉంటాయి ! ఆఫీసు ‘ చెద ‘ రంగం లో ఎప్పుడూ పావులు కదులుతూ ఉంటాయి ! మీ రు చేసే పని బాగా ఉన్నా కూడా , మీ ‘ పని పట్టే ‘ ఊసరవెల్లులూ , మీ అవకాశాలను మింగేసే తిమింగలాలూ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి ! ఆ సమయాలలో , ఆ మాటకొస్తే, ప్రతి క్షణమూ , అప్రమత్తత తో ఉండడమే కాకుండా , ఇతర కొలీగ్స్ తోనూ , ఇతర ఉద్యోగులతోనూ కూడా సంబంధాలు సమతూకం లో ఉంచుకోవడం, మీకు ఎంతో లాభదాయకం !
పని చేయడం లో మీ క్రమ శిక్షణా , విధి నిర్వహణ లో మీ అంకిత భావం , మీ ఉద్యోగం లో తరచూ వచ్చే సమస్యలను పరిష్కరించడం లో మీకున్న ప్రతిభా , ఇవన్నీ కూడా మీరు పనిచేసే స్థానం లో, మీ ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉపయోగించుకోవాలి ! ఇతర ఉద్యోగులు మీ అంత ప్రతిభ లేని వారయినా కూడా , వారికి అవసర సమయాలలో తగిన సలహా లు ఇవ్వడమే కాకుండా , వారి సమస్యలను పరిష్కరించడం లో మీ సహకారాన్ని ఇవ్వడం ద్వారా , మీ మానవతా దృష్టి ని కూడా పెంపొందించుకో గలుగుతారు ! అట్లాగని ఇతరులు ఉద్యోగ ధర్మం లో చేసే పొర పాట్లను , మీ నెత్తిన వేసుకోవడం ,లేదా వారి పొర పాట్లను కప్పి పుచ్చాలని ప్రయత్నించడం చేయకూడదు ! మీరు చేసే ఇట్లాంటి చర్యల వల్ల , కేవలం సహ ఉద్యోగి గా మాత్రమే కాక , ఒక స్నేహితుడి గా కూడా మీరు , మీ ఇతర ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన గలుగుతారు ! మీరు ‘ సంపాదించిన ‘ ఆ అభిమానం , ముందు ముందు , మీ అవకాశాలను ప్రకాశ వంతం చేసుకోవడం లో ఉపయోగ పడే ధనం !
మీదైన శైలి తో , మీ ఉద్యోగాన్ని సరిగా చేయడమే కాకుండా , ఇతర ఉద్యోగుల మీద కూడా నిజమైన శ్రద్ధ కనబరుస్తూ , ఇతర ఉద్యోగుల విధేయతను పొందితే , మీరు ఒక ప్రతిభ కలిగిన ఉద్యోగి గా మాత్రమే కాక , నాయకత్వ లక్షణాలు కలిగిన ఉద్యోగి గా కూడా పేరు తెచ్చుకో గలుగుతారు !
ఉద్యోగం కాక , ఇతరత్రా మీరు చేస్తున్న సహాయమూ , ఇతర ఉద్యోగులకు మీరు ఇస్తున్న సహకారమూ , మీరు వృధా గా పోనీయ కూడదు ! ఈ పనులన్నీ కూడా , మీ వ్యక్తి గత పురోగమన పధకం లో , మీరు తెలివి గా , చాకచక్యం గా కదుపుతున్న పావులు కావాలి ! మీ ఉద్యోగం లో, మీరు ఉద్యోగం చేసే స్థానం లో చూపిస్తున్న మీ మంచి లక్షణాలన్నీ కూడా మీ అవకాశాలు మెరుగు పరుచుకోవడానికి వేసే అడుగులు కావాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !