Our Health

Posts Tagged ‘Our Health’

ఋతుక్రమం- సమస్యలు.7. అస్తవ్యస్త ఋతు స్రావం.

In Our Health on ఏప్రిల్ 9, 2012 at 10:38 సా.

 ఋతుక్రమం- సమస్యలు.7. అస్తవ్యస్త ఋతు స్రావం.

 
అస్తవ్యస్త ఋతుస్రావం: దీనినే డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అంటారు.  
ఆ పేరు లోనే ఉన్నట్టు ఈ సమస్య ఉన్న స్త్రీలలో  ఋతు స్రావం అస్తవ్యస్తం గా ఉంటుంది. అంటే మునపటి టపాలలో మనం వివరం గా తెలుసుకున్నాము, ఋతు క్రమం లో ప్రత్యేకించి ఫాలిక్యులర్  దశలో ఋతు స్రావం అవుతుందనీ అది సహజం గా జరిగే ఋతుస్రావం అనీ.
కానీ అస్తవ్యస్త ఋతుస్రావం  జరుగుతున్న స్త్రీలలో , నూటికి తొంభై మంది స్త్రీలలో  అండాశయం విడుదల కాకుండానే  జరుగుతుంది. దీనినే యనో వ్యులేటరీ డిస్ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని అంటారు.
మిగతా పది శాతం మంది స్త్రీలలో ఇలాంటి అస్తవ్యస్త ఋతు స్రావం అండాశయం విడుదల అయే సమయం లో జరుగుతుంది. అందు వల్ల  ఈ ఋతు స్రావాన్ని ఒవ్యు లేటరీ డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని పిలుస్తారు.
ఈ అస్తవ్యస్త ఋతు స్రావానికి ఎలాంటి కారణాలూ కనిపించవు  అంటే  వివిధ పరీక్షల ఫలితాలలో  ఏ కారణమూ కనిపించదు. అలా కారణం కనిపిస్తే అప్పుడు ఆ పరిస్థితిని అస్తవ్యస్త ఋతుస్రావం లేక డిస్ ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ అని పిలవరు.
అందు వల్లనే ఇలాంటి పరిస్థితిని గుర్తించి నిర్ధారణ చేసే ముందు, అన్ని పరీక్షలు జరిపించుకుని ,  అస్తవ్యస్త ఋతు స్రావానికి ఇతర కారణాలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి.
ఇత మిద్ధం గా ఇదీ అని కారణం తెలియ నప్పటికీ, ఈ అస్తవ్యస్త రుతుస్రావానికి హార్మోనులు కారణమని   విశద  పడుతున్నది. ఎందుకంటే, సాధారణం గా హార్మోనుల చికిత్స తో ఈ పరిస్థితి  చాలా వరకు సరి అవుతుంది. మనం క్రితం టపాలలో చూశాము ఋతుక్రమం లో హార్మోనుల ప్రాముఖ్యత ఏమిటో. అందు వల్లనే  ఈ విషయం పైన రాసే ముందు హార్మోనుల గురించీ, ఆ హార్మోనులు, తమ రిలే పరుగు ద్వారా ఋతు క్రమాన్ని ఎలా నియంత్రిస్తాయో వివరించడం జరిగింది. ( మీకు పునశ్చరణ కావాలనుకుంటే ఋతు క్రమం పైన రాసిన మొదటి టపాలు మరొక మారు చూడండి ) 
ఒవ్యులేటరీ డిస్ఫంక్షనల్ యుటి రైన్ బ్లీడింగ్ : ముందు తెలుసుకున్నట్టు , ఈ రకమైన  అస్తవ్యస్త ఋతుస్రావం వంద మంది లో పది మందికి  ఉంటుంది. 
ఈ రకం లో  అండాశయం విడుదలకూ, ఋతు స్రావానికీ సంబంధం ఉన్నది. అందు కే ఆ పేరు వచ్చింది.  ఋతు క్రమం లో ఉన్న ల్యూటియల్ దశలో ఇలాంటి అస్తవ్యస్త ఋతు స్రావం ఈస్త్రోజేన్ లోపం వల్ల కావచ్చు. అలాగే ఋతు క్రమంలో చివరి రెండు వారాలలో అంటే ప్రాలిఫరేటివ్ దశలో ఇలాంటి ఋతుస్రావం ప్రో జేస్తి రాన్ లోపం వల్ల కావచ్చును.
ప్రో జేస్తి రాన్ లోపం ఉంటే, తద్వారా  ‘ PGF2 alfa ‘ అనే ఇంకో జీవ రసాయనం కూడా లోపించి  ఋతు స్రావానికి కారణం అవుతుంది. అలాగే ఇంకో రసాయనం ‘ TPA’ అంటారు దానిని, అది కూడా లోపిస్తుంది. అప్పుడు  సహజం గా గడ్డ కట్టే రక్తం  ఎక్కువ సమయం తీసుకుంటుంది గడ్డ కట్టడానికి, అందు వల్ల కూడా ఋతు స్రావం ఎక్కువ గా ఉంటుంది. ( రక్తం గడ్డ కట్టడాన్ని బ్లడ్ క్లాటింగ్ అంటారు శాస్త్రీయం గా ).
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 
 
 
 
 
 
 

ఋతుక్రమం- సమస్యలు.6.డిస్ మెనో రియా చికిత్స.

In Our Health on ఏప్రిల్ 9, 2012 at 9:04 ఉద.

ఋతుక్రమం- సమస్యలు.6.డిస్ మెనో రియా చికిత్స.

 
మునుపటి టపా లో తెలుసుకున్నట్టు , ప్రాధమిక   డిస్  మెనో రియా  లేక ప్రైమరీ డిస్ మెనో రియా , కు ప్రత్యేక కారణాలు ఉండవు. సహజ ఋతు క్రమం లోనే  కనిపించే లక్షణాలు  ఇంకా తీవ్రం గా  ఉండి స్త్రీని బాధ పెడతాయి.
ఇక ద్వితీయ లేక సెకండరీ డిస్ మెనో రియా లో గర్భాశయం లో ఏ భాగం లో నైనా వచ్చే జబ్బులు, స్త్రీలను బాధించి వారికి రుతుస్రావ సమయం లో భరింప లేని నొప్పులు కలిగిస్తాయి.
ఈ రకమైన గర్భాశయ జబ్బులలో  ఎండో మెట్రియోసిస్, అడినో మయోసిస్,  ఇంకా అండాశ య తిత్తులు అంటే ఓవరియన్ సిస్టులు  ముఖ్యమైనవి.  పిల్లలు పుట్టకుండా గర్భాశయం లో వేయించుకునే కాపర్ లూపు కూడా కొన్ని సమయాలలో స్త్రీలలో రుతుస్రావ సమయం లో భరింప లేని నొప్పులకు కారణమవ వచ్చు.
ఏ ఏ పరీక్షలు అవసరం అవుతాయి? : 
ఇలాంటి లక్షణాలు గమనించిన స్త్రీలు మొదటగా చేయ వలసినది తమ లక్షణాల నన్నిటినీ క్షుణ్ణం గా అంటే వివరం గా ఒక నోట్ బుక్ లో రాసుకోవడం, తేదీ వారీ గా. ఇలా చేయటం వల్ల, తమ లక్షణాలు సహజ ఋతు క్రమం లో వస్తున్నాయా, లేక అస్త వ్యస్తం గా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయా అనే విషయం తెలుస్తుంది. అలాగే  ఋతు స్రావానికీ, ఈ నొప్పులకూ సంబంధం ఉందొ లేదో కూడా తెలుస్తుంది.
ఈ వివరాలు గమనించి స్పెషలిస్టు ను సంప్రదించినప్పుడు వివరం గా చెపితే , ప్రాధమిక డిస్ మెనో రియా కానీ , ద్వితీయ డిస్ మెనో రియా కానీ నిర్ణయించ డానికి వీలవుతుంది.
ఇక రక్త పరీక్షలు, ప్యాప్ స్మియర్ టెస్ట్ ( అంటే  గర్భాశయ ద్వారం అంటే సర్విక్స్ అనే భాగం లో ఉన్న కణ జాలాన్ని పరీక్ష చేయటం ) కూడా అవసరం ఆవ వచ్చు.  అలాగే గర్భాశయాన్ని  అల్ట్రా సౌండ్  అంటే ధ్వని పుంజా లతో పరీక్ష  చేయడం కూడా అవసరం అవవచ్చు. ఇలాంటి   పరీక్షలు ప్రత్యేకించి  ద్వితీయ డిస్ మెనో రియా  కనుక్కోవడానికి  ఉపయోగ పడతాయి.
డిస్ మెనో రియా కు చికిత్సా పద్ధతులు ఏమిటి ?: 
ఏ రకానికి చెందిన డిస్ మెనో రియా అయినప్పటికీ , నొప్పి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.  తగినంత విశ్రాంతి, క్రింద ఉదర భాగం లో వేడి నీటితో ఉన్న సంచీ ఉంచుకోవడము  అంటే (  హాట్ వాటర్ బ్యాగ్ )  ( పైన ఉన్న పటం చూడండి ) పార సెటమాల్ , బ్రూఫెన్ , మేఫెనమిక్ ఆసిడ్ వంటి నొప్పి ఉపశమనం కలిగించే మందులు  అవసరం అవుతాయి.  ఇలాంటి మందులు తరచూ వేసుకో కూడదు. కేవలం రుతుక్రమ సమయం లో నొప్పులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఈ మందులు ఖాళీ పొట్ట లో అంటే ఏమీ తినకుండా వేసుకుంటే కడుపులో మంట కలిగిస్తాయి.  అందు వల్ల మందు వేసుకోబోయే ప్రతి సారీ  సాత్విక మైన ఆహారం  ( అంటే  పచ్చళ్ళూ  , మసాలాలు  లేని ఆహారాలు ) తినాలి. అలాగే మంచి నీరు కూడా తగినంత తాగుతుండాలి.
హార్మోనుల పాత్ర:  ప్రైమరీ డిస్ మెనో రియా కూ , సెకండరీ డిస్ మెనో రియా కూ  హార్మోనులు కొంత వరకు  ఉపశమనాన్ని ఇస్తాయని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది.
 అలాగే ఋతు క్రమాన్ని తాత్కాలికం గా నిలిపి వేసేందుకు, గర్భాశయ నాళం లో వేయించుకునే కాపర్ లూప్ కూడా డిస్ మెనో రియా ఉపశమనానికి మంచి ఫలితాలనిస్తుంది.
ఇక పరీక్ష ల ద్వారా తెలిసుకున్న గర్భాశయ పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని సరి చేయటం కూడా ఈ ఋతు స్రావం లో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.  ఉదాహరణకు  కొందరిలో అండాశయం లో తిత్తులు ఏర్పడతాయి. వాటిని  తీయించు కోవలసిన అవసరం రావచ్చు.
అనుభవజ్ఞులైన  గైనకాలజిస్ట్ ను సంప్రదించడం ఉత్తమం ఇలాంటి పరిస్థితులలో.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

ఋతుక్రమం – సమస్యలు.5. డిస్మెనో రియా .

In Our Health on ఏప్రిల్ 8, 2012 at 9:22 ఉద.

డిస్మెనో రియా  ‘ Dysmernorrhoea ‘  అంటే ఏమిటి:

ఋతుస్రావం  సమయం లో నొప్పి కలిగి ( సాధారణం గా క్రింద ఉదర భాగం లో ), ఆ నొప్పి భరింప రానిది అయి స్త్రీల రోజు వారీ పనులను కుంటు పరుస్తూ ఉంటే, ఆ  స్థితిని  డిస్ మెనో రియా అంటారు.
రుతుస్రావ సమయంలో నొప్పులు చాలా సాధారణం. ప్రత్యేకించి ఋతుక్రమం మొదలైన కొన్ని నెలలు , అందులో ప్రత్యేకించి యుక్త వయసులో ఉన్న యువతులలో ఈ రకమైన నొప్పులు కనీసం వంద మందికి ఇరవై అయిదు మందిలో కనబడతాయి.
డిస్ మెనో రియా లో నొప్పి ఎలా ఉంటుంది ? : 
ఈ స్థితి లో వచ్చే నొప్పి  క్రింద ఉదర భాగం లో అంటే కటి వలయ లేక పెల్విక్ ప్రాంతం లో మొదలవుతుంది.  ఇది పలు రకాలు గా స్త్రీలలో కనిపిస్తుంది.
సూదుల తో పొడిచినట్టు గానూ, మెలితిప్పినట్టు గానూ, మంట గానూ  ఈ నొప్పులను స్త్రీలు అనుభవించ వచ్చు. కొన్ని సమయాలలో ఈ నొప్పి పెల్విక్ లేక కటి వలయ ప్రాంతం నుంచి క్రింద తొడల వరకూ లేక వెనుక వీపు లేక నడుము భాగాలకు ప్రాకినట్టు ఉండవచ్చు. ( పైన ఉన్న పటం చూడండి ) ఇంకొన్ని సమయాలలో ఈ నొప్పులు తీవ్రం గా ఉండి, వికారమూ, కడుపు లో తిప్పినట్టు ఉండటమూ, వాంతులూ , కలిగించవచ్చు.
కొందరిలో ఈ డిస్ మెనో రియా ,  మామూలు సమయం లో జరుగుతున్న రక్త స్రావం కంటే ఎక్కువ రక్త స్రావం కలిగించ వచ్చు. అప్పుడు ఈ పరిస్థితిని  మెనో రేజియా అంటారు ( menorrhagia ).
సామాన్యం గా ఈ నొప్పులు ఋతుస్రావం సమయం లోనే ఉండి ఋతుస్రావం అయిపోగానే అంటే నాలుగు అయిదు రోజులకు తగ్గుతాయి. 
డిస్ మెనో రియా మిగతా లక్షణాలు ఏమిటి ? : 
పైన చెప్పిన లక్షణాలే కాక డిస్ మెనో రియా తో బాధ పడుతున్న వారిలో  తల నొప్పి, తల తిప్పినట్టు ఉండడం, ఏ పని మీదా మనసు లగ్నం చేయలేక పోవడం, విపరీతమైన అలసట గా ఉండటమూ ,  కొద్ది శబ్దాలైనా , వెలుతురు అంటే కాంతి వంతమైన ప్రదేశాలలోనూ , వీరు ఎక్కువగా స్పందించి , ఆ పరిస్థితులను తట్టుకో లేక పోవడమూ, కొన్ని సమయాలలో స్పృహ తప్పి కింద పడటమూ కూడా జరుగుతుంటాయి.
కారణాలు ఏమిటి ? :
డిస్ మెనో రియా రెండు రకాలు. మొదటి రకాన్ని ప్రాధమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా అంటారు. రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ డిస్ మేనోరియా అంటారు. ప్రాధమిక డిస్ మెనో రియా లో  గర్భాశయ కండరాల సంకోచాలు అంటే కాన్త్రాక్షన్  అవుతాయి. అప్పుడు ఆ ప్రదేశం లో ప్రోస్టా గ్లాండిన్ లు అనే జీవ రసాయన పదార్ధాలు విడుదల అవుతాయి. గర్భాశయ కండరాలు విపరీతం గా సంకోచించడం వల్ల ఆ ప్రదేశం లో ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ కూడా తగ్గుతుంది. ఈ కారణాలన్నీ కలిసి ,కండరాల నొప్పులు గా పరిణ మించుతాయి. ఈ నొప్పులనే క్రామ్ప్స్ అని కూడా అంటారు.
ప్రాదమిక లేక ప్రైమరీ డిస్ మెనో రియా కు ఏ కారణమూ కనపడదు. కానీ ద్వితీయ లేక సెకండరీ డిస్ మెనో రియా కు కారణాలు ఉంటాయి. అదే ఆ రెండు రకాలకూ ఉన్న తేడా ! 
వచ్చే టపాలో డిస్ మెనో రియా కు చేయ వలసిన పరీక్షలూ, చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకుందాము !

ఋతుక్రమం- సమస్యలు.4.

In Our Health on ఏప్రిల్ 7, 2012 at 9:44 ఉద.

 ఋతుక్రమం- సమస్యలు.4.

PMS లేక  PMT అంటే ఏమిటి?:
PMS ( Pre Menstrual Syndrome ) లేక  ప్రీ మేన్స్త్రువాల్  సిండ్రోం లేక  PMT ( Pre Menstrual Tension ) లేక ప్రీ మెన్స్ట్రువల్  టెన్షన్ : 
స్త్రీల  లో  ఋతు క్రమ సమయం లో కనిపించే వివిధ శారీరక , మానసిక  లక్షణాలను  పై విధం గా పిలుస్తారు.
ఖచ్చితం గా చెప్పాలంటే ల్యుటియాల్  దశలో కనిపించే లక్షణాలు ఇవి. అంటే  అండాశయం నుంచి అండం విడుదల ఆయే సమయం లో కనిపించే లక్షణాలు. 85 శాతం స్త్రీలలో ఋతుక్రమ దశ లో  స్తనాలు కొద్దిగా నొప్పిగా ఉండడం, కడుపు లో వాయువు నిండినట్లుగా ఉండడం అంటే బ్లోటింగ్ సెన్సేషన్  కలగటము , అనుభవం లో ఉంటాయి. కానీ ఇలాంటి లక్షణాల  తీవ్రత ఎక్కువ అయి అవి ఆ స్త్రీల  దైనందిన  జీవితాన్ని కుంటు పరుస్తే అప్పుడు ఆ లక్షణాలను  ‘ PMS లేక  PMT ‘ అంటారు.
కేవలం వంద కు ఇద్దరి నుంచి అయిదుగురు స్త్రీలు మాత్రమే  ఈ  PMS to బాధ  పడుతుంటారు.
ఈ లక్షణాలు ఏంటో తెలుసుకుందాము: 
చీకాకు పడటం, తల నొప్పి, కడుపు నిండినట్టు ఉండడం, అలసట గా ఉండటం, కండరాల నొప్పులు, ప్రత్యేకించి కటివలయ ప్రాంతం లో కండరాలు మెలితిప్పినట్టు నొప్పులు ఉండి, తరచూ అవి భరింప లేనివి గా ఉండటం 
మానసికం గా వత్తిడి గా ఉండటం, ఆందోళన  పడటం,  నిద్ర లేమి, కామ వాంఛ లో మార్పులు, స్వల్ప కారణాలకే దుఖ్హించడం,  విచారకరం గా ఉండడం ఇలాంటివి.
సాధారణం గా ఈ లక్షణాలు  ఋతు స్రావానికి ముందు కనీసం పది రోజుల నుంచి ఉంటుంటే, అలాగే  ప్రతి నెలా ఋతు స్రావానికి ముందు ఇలాంటి లక్షణాలు వారిని బాధ పెడుతూ ఉంటే, అప్పుడు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ లక్షణాలు స్త్రీలలో ఎక్కువ  గా భరింప లేనివి గా అవుతుంటాయి.  ఈ  పరిస్థితులు: 
1. మానసిక వత్తిడి.
2. కుటుంబం లో మిగతా స్త్రీలు అంటే వారి తల్లి గానీ సోదరి గానీ  గతం లో ఈ లక్షణాలు అనుభవించితే, వారికి కూడా ఇవి రావడానికి అవకాశం ఎక్కువ అవుతుంది.
3. ఋతు క్రమ  సమయం లో  ఎక్కువ గా కాఫీలు  తాగుతే కూడా ఈ  PMS లక్షణాలు ముదురుతాయి.
4. స్త్రీలు గతం లో డిప్రెషన్  తో బాధ పడినా ,
5. వయసు ఎక్కువ  అవుతున్నా ,
6. వారు తినే ఆహారం లో విటమినులూ, ఖనిజాలూ  తక్కువ అయినప్పుడు కూడా ఈ లక్షణాల తీవ్రత ఎక్కువ గా ఉంటుంది.
ప్రత్యేకించి  విటమిన్  B6, D, E లోపిస్తే , అలాగే  మెగ్నీషియం,  మాంగనీసు  లోపిస్తే కూడా  PMS తీవ్రత ఎక్కువ  అవుతుందని వివిధ పరిశోధనల వల్ల తెలిసింది. 
PMS ను ఎలా కనుక్కోవాలి ? :  PMS కనుక్కోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు ఏవీ లేవు.  స్త్రీలు తమ  ఋతు క్రమాన్ని శ్రద్ధ  తో గమనించాలి. ప్రత్యేకించి ఒక డయరీ ఏర్పాటు చేసుకుని  వారి లో కలుగుతున్న లక్షణాలను నోట్  చేసుకోవాలి.
ఎందుకంటే ఈ లక్షణాలు సర్వ సాధారణం గా ఋతు స్రావానికి ఒక వారం పది రోజుల ముందర  మొదలయి ఆ   వారం పది రోజులూ తీవ్రం గా ఉండి ఋతుస్రావం పూర్తి అయిన తరువాత అంటే నాలుగు అయిదు రోజుల తరువాత , తగ్గు ముఖం పడతాయి. 
ఇప్పటి వరకూ శాస్త్రజ్ఞులకు  PMS కారణాలు ఖచ్చితం గా ఇవీ అని అంతు చిక్క లేదు.  ఋతు క్రమ సమయం లో స్త్రీలో కలిగే హార్మోనుల మార్పు కారణమవ వచ్చు.  ఒక పరిశీలన  లో స్త్రీలలో ఈ ఋతు క్రమ సమయం లో బీటా ఎండార్ఫిన్ అనే రసాయనం తగ్గి ఉన్నట్టు తెలిసింది.
PMS కు చికిత్స ఏమిటి ? : 
ఖచ్చితమైన ఒక్క చికిత్స ఏమీ లేదు. లక్షణాల తీవ్రత బట్టి , చికిత్సా విధానం మారాలి.  పైన ఉదాహరించిన విధం గా  వత్తిడి తగ్గించుకోవడం ( దీనికి మిగతా కుటంబ సభ్యుల సహకారం కూడా అవసరం ), సరియిన నిద్ర, విశ్రాంతి, సమతుల్య మైన ఆహారం అంటే విటమినులు, ఖనిజాల తో సంపూర్ణం గా ఉన్న ఆహారం తీసుకోవడం,   వీలైనంత వ్యాయామం – ఇవన్నీ కలిసి  PMS లక్షణాలను నియంత్రిస్తాయి. ముఖ్యం గా మిగతా కుటుంబ సభ్యులు వారి లక్షణాలను అర్ధం చేసుకుని వారికి మానసికం గా చేయూత నివ్వాలి, వారిని ఆ విధంగా డిప్రెషన్ కు దూరం గా ఉంచాలి.
ఈ లక్షణాల తీవ్రత  పై జాగ్రత్తలు తీసుకున్నా తగ్గక పొతే , స్పెషలిస్టు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం.  ఆ సమయం లో తగిన రక్త పరీక్షలు కూడా చేయించుకుని, అవసరమయితే హార్మోనులు కూడా తీసుకోవలసి ఉంటుంది.
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 

 

ఋతు క్రమం – సమస్యలు.3.

In Our Health on ఏప్రిల్ 6, 2012 at 8:37 ఉద.

 ఋతు క్రమం – సమస్యలు.3.

ఋతు స్రావం లేక  మెన్ స్ట్రు ఎషన్: 
క్రితం టపా లో చూసినట్లు ఋతు స్రావం మొదలవటం, స్త్రీ గర్భం దాల్చలేదని తెలపడమే. ఈ   ఋతు స్రావం జరిగే సమయం లో   వీర్యకణం తో కలవని అండం తో పాటు గర్భాశయ పొర  అంటే  లైనింగ్ కు ఉన్న కణ జాలం  కూడా యోని ద్వారా గర్భాశయం  నుంచి  బయటకు వస్తాయి.సాధారణం గా ఋతుస్రావం నాలుగు రోజులు జరుగుతుంది. కొంత రక్త  స్రావం కూడా జరుగుతుంది (  రమారమి  10 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్త స్రావం అవుతుంది, సగటున 35, మిల్లీ లీటర్లు ) ఈ సమయంలో.  కానీ ఈ రక్తం లో ప్లాస్మిన్ అనే పదార్ధం ఉండటం  వల్ల   గడ్డ కట్టదు.
ఇలా ఋతు స్రావం, స్త్రీ రజస్వల అయినప్పటి నుంచి, అంటే ప్యుబర్టీ నుంచి ( 8 నుంచి  18  ఏళ్ళ లోపు ) ఋతు క్రమం ఆగి పోయే వరకూ అంటే మెనో పాజ్ వరకూ ( 40 నుంచి 50 ఏళ్ళ మధ్య )   ఋతుక్రమం లో వస్తూ ఉంటుంది.
ఈ రక్త స్రావం సాధారణంగా అనీమియా కు దారి తీయదు. ఒక పరిశోధనలో సుమారు  85 శాతం మంది స్త్రీలలో   కడుపులో మంట, అల్సర్లు ఉండటం గమనించారు. అంటే అనీమియా కు కేవలం ఋతు స్రావమే కారణం కాదని తెలిసింది.
కానీ  శాక హారులూ , బక్క పలచ గా ఉన్న యువతులలో ఋతుస్రావం,  అనీమియా గా  కనపడటానికి ఎక్కువ అవకాశాలున్నాయి.
ఋతుస్రావం జరిగే సమయం లో జరిగే శారీరిక మార్పులు :  చాలా మంది స్త్రీలు, అలసట, కడుపులో తిప్పినట్లు ఉండటం,  సెక్స్ పట్ల కోరిక లో మార్పులు ,  స్తనాలలో నొప్పిగా ఉండటం,  పెల్విక్ భాగం లో అంటే కటివలయ భాగం లో క్రామ్ప్స్  లేక కండరాల నొప్పులు ,  కొద్దిగా నీరు చేరి శరీరమంతా బరువు ఎక్కువైనట్లు, ఇలాంటి లక్షణాలు, అన్నీ కానీ , కొన్ని కానీ  గమనిస్తారు.
ఋతు స్రావం సమయం లో కండరాల నొప్పులు ఎందుకు వస్తాయి.? :  మనం ముందు తెలుసుకున్నట్లు,  ఋతుస్రావం సమయం లో అండం కనుక వీర్య కణం తో కలవక పోయినట్లయితే, దానిని , దానితో పాటు గర్భాశయ లైనింగ్ కణ జాలాన్నీ వదిలించుకోడానికి  గర్భాశయ కండరాలు గట్టి గా వ్యాకోచము, సంకోచము జరుపుతాయి. ఇలా జరిగుతున్నప్పుడు , స్త్రీలు ఆ ప్రాంతమంతా మెలి తిప్పినట్టు నొప్పి అనుభవిస్తారు. కొందరిలో ఈ నొప్పులు తీవ్రం గా, భరింప లేనివి గా ఉంటాయి.  
ఇలా కండరాలు వ్యాకోచ, సంకోచాలు జరిపినప్పుడు ప్రోస్టా గ్లాండిన్స్ ఎక్కువ గా విడుదల అవుతాయి.
మానసిక మార్పులు :  ఋతుస్రావ సమయం లో జరిగే హార్మోనుల మార్పులు, తద్వారా గర్భాశయం లో జరిగే మార్పుల వల్ల స్త్రీలు సాధారణం గా, అలసి పోతుంటారు. అలాగే చీటికి  మాటికి చీకాకు పడటం ,  కళ్ళ లో నీరు నిండడం ( అంటే చిన్న కారణాలకే తట్టుకోలేక ఏడవడం ) , ఇలాంటి లక్షణాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
 
 

ఋతుక్రమం- సమస్యలు.2.

In Our Health on ఏప్రిల్ 5, 2012 at 9:52 ఉద.

ఋతుక్రమం- సమస్యలు.2.

క్రితం టపాలో చూసినట్టు, ఋతుక్రమాన్ని, ముఖ్యంగా నాలుగు హార్మోనులు  నియంత్రిస్తాయి.
ఈ నియంత్రణను పోల్చాలంటే   ఈ ముఖ్యమైన హార్మోనులు ఒక రకమైన   రిలే పరుగు  లో పాల్గొంటాయి. అంటే ఈ హార్మోనులు ,  పలు దశలలో  కీలకమైన పాత్ర వహించి  ప్రకృతి  లో   మానవ జీవన పరుగు  ను విజయ వంతం చేస్తాయి. ఎందుకంటే, ఈ హార్మోనులు వాటి క్రియలను ఏ దశ లో నైనా  నిర్వర్తించక పొతే, అండాశయం నుంచి  అండం విడుదల అవదు. కేవలం వీర్యకణాలు గర్భాశయం లో ప్రవేశించినా ( రతిక్రియ ద్వారా లేక  artificial insemination ద్వారా అయినా ),  పిండం ఏర్పడదు కదా !  దానితో మానవ సృష్టి ఆగి పోయినట్లే కదా !
ఋతు క్రమానికి   స్త్రీ  దేహం లో ఏ ఏ చోట్ల ఈ రిలే పరుగు జరుగుతుందో చూద్దాము :
మెదడు లో రెండు చోట్ల అంటే హైపో తలామస్ ఇంకా పిట్యు టరీ గ్రంధి – ఈ రెండు చోట్ల లో. 
అలాగే గర్భాశయం లో రెండు చోట్ల అంటే గర్భాశయం కు చివరల్లో ఉన్న అండాశయం లో, ఇంకా ముఖ్యమైన  గర్భాశయం లో !
క్రింద పటం చూడండి. ఆ పటం లో ఉన్న  అంకె ల వారీగా వివిధ దశలలో జరిగే మార్పులు కూడా గమనించండి. ( సులభం గా అర్ధమవటానికి  పటం లో చూపిన  రంగులనే  వివరణ అంకెలలో, వాక్యాలలో ఉపయోగించడం జరిగింది. ) ఆసక్తి కరం గా ఉండటానికి, ఈ క్రింద జరుగుతున్న మార్పులను , అంచెల వారీ గా ఒక చిన్న కధ లాగా చదవండి, మీకు ఇప్పుడు ఏ  పరీక్ష అంటే టెస్ట్ లేదు కదా ! కంగారు పడ నవసరం లేదు ! )
1. మెదడులోని హైపో త లామాస్  GnRH అనే హార్మోనును విడుదల చేస్తుంది.
2. ఈ GnRH  హార్మోను రక్తం ద్వారా పిట్యు టరీ గ్రంధి కి చేరి అక్కడ నుంచి FSH అనే హార్మోనును విడుదల చేయిస్తుంది.
3. FSH హార్మోను  మళ్ళీ రక్త ప్రసరణ ద్వారా ( పిట్యు టరీ గ్రంధి నుంచి ) ఆండాశ యానికి చేరి అక్కడ అండం విడుదల చేసే కణ జాలాన్ని  వృద్ధి చేస్తుంది.
4. అండాశయం లో వృద్ధి చెందిన కణ జాలం ( దీనినే గ్రాఫియన్ ఫాలికిల్స్ అని కూడా అంటారు ) ఈస్ట్రో జెన్ ను ఉత్పత్తి చేస్తాయి.
5. ఈ ఈస్త్రోజేన్  పిట్యు టరీ గ్రంధిని చేరి అక్కడ నుంచి FSH ను తగ్గించమని ఉత్తర్వు లిచ్చి అదే సమయం లో LH అనే ఇంకో హార్మోనును విడుదల చేయిస్తుంది, పిట్యు టరీ గ్రంధి చేత. ఈ స్ట్రోజెన్ సహాయం తో గర్భాశయం లోని రక్త నాళాలు కూడా గట్టి పడతాయి.
6. LH హార్మోను ఎక్కువ అవడం వల్ల  అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఈ అండం గర్భాశయం చివరల నుంచి ప్రయాణం కొనసాగించి ఫాలోపియన్ ట్యూబ్  ద్వారా  ( మీరు వినే వుంటారు, పిల్లలు ఇక వద్దు అనుకునే స్త్రీలకు ఈ ఫాలోపియన్ ట్యూబ్ లను కత్తిరించి, అండం గర్భాశయం లోకి చేరకుండా చేస్తారు ) గర్భాశయం చేరుతుంది.
7. అండం విడుదల అయిన తరువాత, అండాశయం లో ఉన్న కణజాలం ( అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ ) ప్రోజేస్టిరాన్ అనే హార్మోను ను విడుదల చేస్తాయి. ఈ ప్రోజేస్టిరాన్ మళ్ళీ పిట్యు టరీ కి చేరుకొని దాని చేత ‘ LH ‘ ను ఆపించేస్తుంది.( ఎందుకంటే LH పని అంటే అండాశయం నుంచి , అండం విడుదల చేయించడం, జరిగింది కనుక ) 
8. గ్రాఫియన్ ఫాలికిల్స్  విడుదల చేసిన ఈ ప్రో జేస్టిరాన్ , గర్భాశయాన్ని శిశువు పెరగటానికి అనువుగా తయారు చేస్తుంది. అంటే గర్భాశయం  ను ఒక అనువైన , సహజమైన ‘ ఊయల ‘ లేక ‘ పడక ‘ లాగా చేస్తుంది. అలాగే  గర్భాశయం లో ఉన్న కణ జాలాన్ని,
  మ్యుకస్ అంటే జిగట గా చేసి, ఆ ప్రదేశం వీర్య కణం, అండం చేరు కోడానికి  చేసే ‘ ప్రయాణాన్ని ‘ సులువు చేస్తుంది. ఆశ్చర్యం గా ఉంది కదూ ఈ క్లిష్టమైన జీవ క్రియలన్నీ తెలుసు కుంటూంటే !
గర్భాశయం చేరిన అండం, వీర్య కణం తో కలవడానికి  వేచి చూస్తూ ఉంటుంది కనీసం 24 నుంచి 48 గంటల వరకూ.
9. వీర్య కణం కనుక గర్భాశయం లో తన కొరకు వేచి చూస్తున్న అండాన్ని కలిస్తే  స్త్రీ గర్భం దాల్చినట్టే ! అంటే  ఇంకో జీవ సృష్టి జరిగినట్లే ! అప్పుడు  ఏర్పడే ‘  పిండం ‘ అంటే ఎంబ్రియో  ఇంకో హార్మోనును విడుదల చేస్తుంది. దీనినే HcG అంటారు (  స్త్రీలు గర్భం దాల్చారో లేదో తెలిపే అనేక పరీక్షలు అంటే  pregnancy tests ,  ఈ  HCG హార్మోను పరిమాణం బట్టి నిర్ణయించేవే ! )  
ఈ ‘ HCG ‘ హార్మోను  గ్రాఫియన్ ఫాలికిల్స్ చేత ప్రోజేస్టిరాన్ నూ , ఇంకా ఈస్త్రోజేన్ నూ ఉత్పత్తి  చేయిస్తుంది. ఎందుకంటే ఆ హార్మోనులు కూడా పిండం పెరుగుదల కు అవసరం కాబట్టి.
10. ఒక వేళ వీర్య కణం కనుక అండం తో కలవలేక పొతే,  అండాశయం నుంచి  ప్రోజేస్టిరాన్, ఈస్త్రోజేన్ ఉత్పత్తి అవ్వక వాటి పరిమాణం తగ్గి , ఋతు స్రావం అవుతుంది. దానితో ఋతుక్రమం మొదలవుతుంది మళ్ళీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
.

ఋతుక్రమం – సమస్యలు.1.

In Our Health on ఏప్రిల్ 4, 2012 at 1:56 సా.

ఋతుక్రమం – సమస్యలు.1.

సహజ ఋతుక్రమం . ( normal menstrual cycle ) :
ఋతుక్రమం లేక  మెన్ స్ట్రువాల్ సైకిల్  అనే పదం,  గర్భధారణ సామర్ధ్యం కల స్త్రీల శరీరం లో జరిగే మార్పులను తెలిపే శాస్త్రీయ పదం. ఋతుక్రమం అని ఎందుకు పిలవబడుతుందంటే , ఈ మార్పులు స్త్రీ లలో సహజంగా,  ప్రతి నెలా క్రమంగా వస్తాయి కాబట్టి. 
సాధారణం గా ఋతుక్రమం ఇరవై ఎనిమిది  రోజుల తరువాత మళ్ళీ మొదలవుతుంది.  ఈ ఇరవై ఎనిమిది రోజులలో జరిగే వివిధ మార్పులను మనం కొన్ని దశలుగా గమనించవచ్చు.
ఈ మార్పులు స్త్రీలలోని అండాశయం లోనూ ఇంకా గర్భాశయం లోనూ  జరుగుతుంటాయి.
అండాశయాలు రెండు, గర్భాశాయానికి రెండు వైపులా ఉంటాయి.  అండాశయం లో జరిగే మార్పులను మూడు   దశలలో మనం తెలుసుకోవచ్చు.
ఒకటి ఫాలిక్యులర్ దశ రెండవది ఒవ్యులేషన్ , మూడవది   ల్యుటియాల్ దశ. అలాగే గర్భాశయం లో జరిగే మార్పులను మూడు దశలలో ఉంటాయి. ఒకటి  మెన్సెస్, రెండవది ప్రాలిఫరేటివ్ దశ , మూడవది సేక్రీటరీ దశ. 
మనం ఋతుక్రమం సాధారణ సమయం ఇరవై ఎనిమిది రోజులు అని అనుకున్నట్లయితే మొదటి రోజు నుంచి నాలుగవ రోజు వరకు మెన్సెస్  అని చెప్పుకోవచ్చు . అంటే రమారమి ఈ నాలుగు రోజులూ ఋతుస్రావం లేక మెన్ స్ట్రువాల్ బ్లీడింగ్ అవుతుంది. 
అండాశయం లో జరిగే మార్పులూ , గర్భాశయం లో జరిగే మార్పులూ అనేక రకాలైన హార్మోనుల  పర్యవేక్షణ లో జరుగుతాయి. మనం క్రితం టపా లలో చూశాము హార్మోనులు అంటే ఏమిటో.( మన దేహంలో ఉండే, నిరంతరం తయారవుతూ ఉండే , జీవ రసాయన పదార్ధాలు. ఈ ప్రత్యేకమైన జీవ రసాయన పదార్దాలు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన జీవ క్రియలను మన దేహం లో  నియంత్రించి పర్యవేక్షిస్తూ కూడా ఉంటాయి. ) వీటి గురించి కూడా తెలుసుకుంటే   బర్తు కంట్రోలు కు అవసరమయే బిళ్ళలు ఎలా పని చేస్తాయో కూడా అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రింది పటం స్థూలం గా ఋతుక్రమం లో జరిగే మార్పులను తెలుపుతుంది.

( యు ట్యూబ్ అందుబాటు లో లేని వారు ఈ పటం లో ఆ మార్పులు గమనించ వచ్చు ) 
 
 
 
వచ్చే టపాలో ఋతుక్రమం లో వివిధ దశలలో జరిగే వివిధ మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాము.
 
సహజ ఋతు క్రమంలో ఏమి జరుగుతుందో క్లుప్తంగా వివరించిన ఈ అత్భుతమైన యు ట్యూబ్ వీడియో చూడండి:
 
 
 

ఋతుక్రమం – సమస్యలు.

In Our Health on ఏప్రిల్ 3, 2012 at 6:41 సా.

ఋతుక్రమం – సమస్యలు.

 
ఋతు క్రమం ప్రతి స్త్రీకీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన ప్రత్యేకత.   కానీ రమారమి యాభయి శాతం కంటే ఎక్కువ మంది స్త్రీలు ఋతుక్రమం లో అవకతవకల వల్ల బాధ పడుతుంటారని  వివిధ గణాంకాల వల్ల తెలిసింది. 
ఈ ఋతుక్రమం  వివరాలూ,  స్త్రీల ఋతుక్రమం లో వచ్చే  తేడాలూ, వాటి కారణాలూ, వాటికి చికిత్స పద్ధతులూ మనం తెలుసుకుందాము.
పురుషులకు కూడా ఋతుక్రమం గురించి అవగాహన ఏర్పడటం మంచిది. ఎందుకంటే,  కుటుంబం లో ఎవరి ఆరోగ్యం, బాగోలేక పోయినా, ఆ ప్రభావం ఇంట్లో ఉన్న వారందరి మీదా ఉంటుంది.  
అలాగే రుతుక్రమ సమస్యలున్నప్పుడు  ఆ లక్షణాల గురించి స్త్రీల తో పాటు పురుషులకు కూడా అవగాహన ఏర్పడితే అది, ఆ సమస్యా పరిష్కారం లో  కూడా ఉపయోగ పడుతుంది. 
 
ముందు గా సహజ ఋతుక్రమం గురించి తెలుసుకుందాము ( అప్పుడు ఋతుక్రమం లో సమస్యలు శులభం గా అర్ధం చేసుకోవచ్చు )
రుతుక్రమాన్ని  తెలుగులో ‘ ముట్టు ‘ అంటారు. చాలా సాధారణంగా ‘ పీరియడ్స్ లేక మెన్సెస్  ‘  అని కూడా అంటుంటారు. 
పీరియడ్స్ ఎందుకు వస్తాయి? : ప్రతి పిరియడ్ లో  అండాశయం నుంచి అండం విడుదల అవుతుంటుంది. ఆ అండము కనుక  పురుషుడి వీర్యం తో ( ఖచ్చితంగా చెప్పాలంటే  సాధారణంగా ఒక వీర్య కణం తో ) కలవక పొతే  పిండం ఏర్పడక మళ్ళీ పిరియడ్ వస్తుంది.
ఒక శాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించినట్టు   ‘ each menstrual period is  the cry of  the womb for want of a baby ‘ అంటే ప్రతి పిరియడూ శిశువు లేక పోవడం కారణం గా గర్భాశయం చెందే ఆవేదన ! 
ఇలా పీరియడ్స్ స్త్రీ ప్రత్యుత్పత్తి లేక సంతానోత్పత్తి దశ అంటే సహజం గా  ఆగి పోయేంత వరకూ ప్రతి నెలా వస్తుంటాయి. ఇలా పీరియడ్స్ ఆగి పోవడాన్ని మెనో పాజ్ అంటారు. 
ఋతుక్రమం మొదటి సారిగా యువతులలో రావడాన్ని మెనార్కే అంటారు.  సాధారణంగా ఈ మెనార్కే  ప్రపంచం లో చాలా  దేశాలలో యువతులకు రమారమి  పదమూడు సంవత్సరాలున్నప్పుడు వస్తుంది. కానీ ఏషియన్ యువతులలో ఒక సంవత్సరం ఆలస్యం గా వస్తుంది.  ఈ తేడాలు  వివిధ దేశ ప్రాంత పరిస్తితులబట్టీ,  జాతుల బట్టీ  మారు తుంటాయని  గమనించడం జరిగింది.  ఈ మెనార్కే రావడాన్ని  యుక్త వయసు కు సంకేతం గా పేర్కొనవచ్చు అంటే  ప్యుబర్టీ ‘ puberty ‘ .
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 
 
 
 
 

కామ వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

In Our Health on ఏప్రిల్ 2, 2012 at 9:43 సా.

కామ  వాంఛ – శాస్త్రేయ విశ్లేషణ.21.

వయాగ్రా తో కామ వాంఛ నయాగరా అవుతుందా ? 
పురుషులలో   ఆర్గాసం సమస్య పరిష్కారం కోసం గత రెండు మూడు దశాబ్దాలలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.  అమెరికా కు చెందిన ఫైజర్ కంపెనీ వారు మార్కెట్ లోకి ‘ వయాగ్రా ‘ అనే మందు బిళ్ళ ప్రవేశ పెట్టారు. గత సంవత్సరం లో కేవలం ఈ మందు బిళ్ళ తో  అమెరికా లో   రెండు బిలియన్ల  డాలర్ల  వ్యాపారం చేశారు ఫైజర్ కంపెనీ వారు.
వయాగ్రా కాకుండా ఇంకొన్ని మందు బిళ్ళలు కూడా మార్కెట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది కూడా !   ఈ రకమైన మందులలో వయాగ్రా మొదటిది కనుక దాని గురించి తెలుసుకుందాము.
వయాగ్రా అనేది  వ్యాపార నామం అంటే ట్రేడ్ నేమ్ అంటారు. మనకు మార్కెట్ లో లభ్యమయే ప్రతి మందు బిళ్ళా , అది తయారు చేసిన మందుల కంపెనీ వారు పెట్టిన పేరు తో బయటికి వస్తుంది.
కా నీ ఆ బిళ్ళ లో ఉండే ఫార్ములా అసలైన రసాయన నామం. అలా చూస్తె  వయాగ్రా  ఫార్ములా పేరు  సిల్దేనాఫిల్  ( sildenafil ) .
ఈ రసాయన ఫార్ములా మన దేహం లో జరిగే ఒక జీవ రసాయన క్రియ ను ఆపుతుంది.  దాని విషయం వివరంగా చెప్పాలంటే :
మామూలు గా పురుషులలో అంగ స్తంభనం జరిగినప్పుడు  ఆ ప్రదేశంలో నైట్రిక్ ఆక్సైడ్  ( ‘ NO ‘ అంటారు రసాయన ఫార్ములా లో), ఈ నైట్రిక్ ఆక్సైడ్  పురుషాంగం లో  ఎక్కువ అవటం వల్ల, అక్కడ ఉన్న రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. తద్వారా పురుషాంగము నిటారుగా అవుతుంది. దీనినే ‘ అంగ స్థంభన ‘ లేక ఎరెక్షన్ అంటారు.  సహజంగా ఈ ఎరెక్షన్ లేక అంగ స్థంభన  నాలుగైదు నిమిషాలు ఉంటుంది.
ఈ సమయం లో  మన దేహం లో ‘ PDE5 ‘ దీనినే దీర్ఘంగా  ఫాస్ఫో డయి ఎస్ట రేజ్  -5. అంటారు.  ఈ ఎంజైం  ఉత్పత్తి అయి అది  నైట్రిక్ ఆక్సైడ్ ను  పురుషాంగం నుంచి   తగ్గించి వేస్తుంది.
ఇది సహజం గా  ఆరోగ్య వంతులైన పురుషులలో జరిగే  జీవ రసాయన చర్య.  వివిధ కారణాల వల్ల కొందరు పురుషులలో  అంగ స్థంభన ఎక్కువ సమయం ఉండదు. దానితో ఆర్గాసం పొందలేక పోవచ్చు. అలాగే ఆ సమస్య సంతానోత్పత్తి కి కూడా అవరోధం ఆవ వచ్చు. 
ఇలాంటి పరిస్తితులలో వారికి సిల్దేనాఫిల్ లేక వయాగ్రా ఉపయోగ పడుతుంది.  ఒక్క వాక్యం లో చెప్పాలంటే ఈ బిళ్ళ పురుషులలో  ‘  PDE5 ‘ ఎంజైం ను తాత్కాలికం గా నివారిస్తుంది. దానితో నైట్రిక్ ఆక్సైడ్ పురుషాంగం లో ఎక్కువ సమయం ఉండి, అంగ స్థంభన కూడా ఎక్కువ సమయం ఉండటానికి తోడ్పడుతుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాలి.  అంగస్తంభన  ఎప్పుడూ లేని వారికి, ఈ మందును రికమెండ్ చేయరు. అలాగే రక్తనాళాల జబ్బులతో, లేక గుండె జబ్బు తో బాధ పడే వారికి  ఈ మందు రికమెండ్ చేయరు.  ఈ మందు ఉపయోగం స్పెషలిస్ట్ డాక్టర్ సలహా మీద చేయడం ఉత్తమం. 
సరియైన ఆరోగ్యం తో ఉండి , కేవలం అంగ స్థంభన  సమయం ఎక్కువ అవాలనుకునే పురుషులలో  వయాగ్రా  తో   కామ వాంఛ  నయాగరా అవుతుంది.
కేవలం ఉత్సాహం తో,  అవసరం లేక పోయినా ఇలాంటి మందులు వాడటం ఎంత మాత్రమూ మంచిది కాదు.  ముందు చెప్పినట్టు  డాక్టర్ సలహా తప్పని సరిగా తీసుకుంటే మంచిది.
స్త్రీల లో  కూడా వయాగ్రా పని చేస్తుందా ? :
ఇప్పటి వరకూ జరిపిన పరిశోధనలు ఖచ్చితం గా స్త్రీలు  వయాగ్రా వల్ల లాభ పడతారని చెప్పలేక పోయాయి. అందు వల్లే    అమెరికా లో  అన్ని మందుల వాడకానికీ  ముందుగా ఆమోద ముద్ర వేసే FDA  సంస్థ ఈ వయాగ్రా ను స్త్రీలకూ రికమెండ్ చేయలేదు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసు కుందాము !

కామ వాంచ – శాస్త్రీయ విశ్లేషణ.20.

In Our Health on ఏప్రిల్ 1, 2012 at 10:32 సా.

కామ  వాంచ – శాస్త్రీయ విశ్లేషణ.20.

సుదీర్  అలా తన తోలిరాత్రులు కొన్ని విచారకరం గా గడిపాడు. వేడి ముద్దులూ , బిగి కౌగిళ్ళతో సరిపుచ్చుకుంటున్నాడు. రతిక్రియ వద్ద  అంత వరకూ ‘ మగ ధీరుడనుకున్న’  సుదీర్ ,  బలహీనుడవుతున్నాడు.  సుజాత తన మటుకు తను, అతనితో ఎంతో ప్రేమతో, ఆప్యాయత తో సాహచర్యం చేస్తుంది.
ఆమె ప్రవర్తన సుదీర్ ను ఇంకా ఆందోళన పరుస్తూంది, ఇంకో  ప్రక్క తను కొంత వరకు అందుకు  కొంత రిలీఫ్  గా ఉన్నా ! ఈ అనుభూతులు సుదీర్ కు కొత్తగా ఉన్నాయి.
ఎందుకు తను  రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు, అదే సమయం లో ఎందుకు ఆందోళన పడుతున్నాడు?  ఎందుకు గిల్టీ గా ఫీల్ అవుతున్నాడు.?  ఏమీ అంతు పట్టడం లేదు అతనికి. 
ఇక ఇలాగే తన జీవితం సాగితే సుజాత తనకు కాకుండా పోతుందేమోనన్న భయం పీడించింది సుదీర్ ను. ధైర్యం చేసి ఒక రోజు మధ్యాహ్నం సెలవు తీసుకుని మానసిక వైద్యుణ్ణి సంప్రదించాడు.
నాలో ఏదైనా లోపం ఉందా డాక్టర్ ? అని ఆందోళన తో అడిగాడు. వివరాలన్నీ విన్న సైకియాట్రిస్ట్  ఇలా సలహా ఇచ్చాడు సుదీర్ కు
‘ సుదీర్!   నీవు అనుకుంటున్నట్లు దీనిని అనార్గాస్మియా అంటారు. కానీ ఇది సెకండరీ అనార్గాస్మియా అంటే నీ కేసు లో మానసికమైన కారణాల వల్ల సంభవించిన స్థితి ఇది. ఇది పూర్తి గా నయం అవుతుంది. అందుకు చికిత్స కూడా నువ్వే ! 
నీవు నీ బాల్యం లో సహజం గా ఉన్న కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉబలాటం దానినే ఇంక్విసిటివ్నెస్  అంటారు. దానితో నీవు బూతు బొమ్మల పుస్తకాలు చూసావు. మీ తండ్రి మీద నీకు విపరీతమైన ప్రేమా , భయము ఉండటం వల్ల, ఆయన నిన్ను మందలిస్తూ అన్న మాటలు నీ మనసులో గట్టిగా నాటుకున్నాయి.  నీలో ‘ సెక్స్ అంటే ఒక నేరం ‘ అనే భావన కలిగి, ఆ భావన నీలో సబ్ కాన్షస్ గా బలీయం గా ఉండిపోయింది, నీవు పెరుగుతున్నాకూడా!  అందుకే నీవు నీ భార్య సుజాత తో కామోత్తేజం పొందుతున్నప్పటికీ, ఆర్గాసం పొందలేక పోతున్నావు.
నీవు వెంటనే చేయవలసిన పని నీ ఆలోచనా ధోరణి మార్చుకోవడం. సెక్స్ అతి సహజమైన మానవ లక్షణం. నీవు నీ చదువు ను కూడా ఏమీ అశ్రద్ధ చేయలేదు కదా అందుకు నీవు గిల్టీ గా   గా ఫీల్ అవనవసరం లేదు. నీ మెదడు  సబ్ కాన్షస్ గా స్విచ్ ఆఫ్ అవుతూ ఉన్నది సెక్స్ కు, ఇప్పటి వరకూ. ఇందుకు కారణం నీకు రతి మీద ఉన్న అపోహలే !
‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత !’  అన్నాడు.
అంతా అతి జాగ్రత్త గా ఒక్క అక్షరం కూడా మిస్ అవకుండా విన్న సుదీర్ కు అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలాయి, కళ్ళనుంచి.
‘ థాంక్స్ డాక్టర్ ‘ అన్నాడు.
ఆగ మేఘాల మీద చేరుకున్నాడు ఇంటికి, దారిలోనే అర్జెంటు గా సుజాతను ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చి.
ఇంటికి చేరుకున్న సుజాతను నేరుగా  శయన మందిరం లో కి తీసుకువెళ్ళాడు,  విషయం కనుక్కోడానికి   నోరు విప్పుదామని సుజాత కనీసం పది నిమిషాలు ప్రయత్నించింది. ఫలితం శూన్యం. ఎందుకంటే తన పెదవుల మీద సుదీర్ పెదవులు పెనవేసుకు పోయాయి,    ఆ పది నిమిషాలూ , కృతజ్ఞతా పూర్వకంగా !
ఇంకో గంట తరువాత సుదీర్ ‘ మళ్ళీ మగ దీరు డయ్యాడు’   ‘ ఇవాళ  ఆఫీస్ నుంచి మ్యాజిక్ ల్యాంప్ ఏదైనా తెచ్చారా అలా స్వర్గం లోకి తీసుకు వెళ్ళారు ‘ అంది  సుజాత ‘ అమాయకంగా’ వినిపించీ వినిపించని స్వరంతో !
సుదీర్ మందహాసం తో ఆమె తల ముంగురులు సవరిస్తూ సైకియాట్రిస్ట్ మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు ‘ స్విచ్ ఆన్ యువర్ బ్రెయిన్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ విత్ సుజాత ‘ ! అవును! నిజంగానే సుజాత సుదీర్ జాతకం కూడా మార్చి వేసింది ఆ రోజునుంచీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !
%d bloggers like this: