Our Health

Posts Tagged ‘Our Health’

బంధాలు ఎందుకు తెగుతాయి ? 8. సంగమం !

In Our Health on ఏప్రిల్ 9, 2015 at 8:18 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ? 8. సంగమం ! 

బంధాలు తెగడానికి , స్త్రీ పురుషులు పరస్పరం , తమ తమ భాగస్వాముల  సంగమ అవసరాలే కాకుండా , తమ కామ పరమైన అవసరాలను కూడా సరిగా అవగాహన చేసుకోక పోవడం వల్లనే అని,  మేరీ ఫే  అనే నిపుణురాలు అభిప్రాయపడుతుంది ! ఈమె అభిప్రాయం ప్రకారం , స్త్రీ పురుషుల బంధాలు , సమస్యలతో అతలాకుతలం అవుతున్నప్పుడు ,  వారిరువురూ   కామ పరమైన సంగమాన్ని కూడా అనుభవించక పొతే , ఆ బంధం ఇంకా బలహీన పడుతుందని !  కామ పరమైన కలయిక , ఒక బంధం లో ఉన్న స్త్రీ పురుషులను  భౌతికం గా దగ్గర చేయడమే కాకుండా ,  అనేక రకాలైన హార్మోనులు ,  విడుదల అయి , వారిరువురినీ , భౌతికం గా కామోచ్ఛ దశ కు చేర్చడమే కాకుండా , మానసికం గా కూడా ఉల్లాసం చేకూర్చి , వారిరువురినీ ‘ కట్టి పడేసి ‘ , వారి బంధాన్ని ‘ గట్టి పరుస్తాయి  ‘ !  అందు వల్ల నే , బంధం బలహీన పడే సమస్యలు ఉన్న స్త్రీ పురుషులు , తాము సగమించడం వాయిదా వేసుకో కూడదు ! 
ముభావం గా , అంటీ అంటనట్టు , తిరుగాడే భాగస్వామి ని , తమకు తెలిసిన , ఇతర  కామ స్థానాల లో , నవ్యత చూపిస్తూ , సంగమం లో పాల్గొంటే , బంధం గట్టి పడడానికి అవకాశం హెచ్చుతుందని , నిపుణులు సలహా ఇస్తారు !  అట్లాగే , కామోద్దీపన కలిగించి , వారిలో కామాతురత ప్రేరేపింప చేయడానికి , రెండో భాగస్వామి చేసే ప్రయత్నాలు మానుకో కూడదు !  ఆమె కు ఇష్టమైన  పువ్వు ను కానీ , స్వీట్ ను కానీ ,  లేదా , ఒక కొత్త డ్రెస్ ను కానీ కొని తీసుకు రావడం , మునుపటి సంగమాలలో , ఏ ప్రదేశాలలో తాకితే ఎక్కువ స్పందన కలుగుతుందో , ఆయా స్థానాలలో , ఆమెను ప్రేరేపింప చేయడం కూడా  వారి బంధం దృఢ పడడానికి సహకరిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?7.

In Our Health on మార్చి 17, 2015 at 12:31 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?7.

బంధాలు ఎందుకు తెగుతాయి?  అనే విషయం మీద కొన్ని టపాలను ఇంత వరకూ పోస్ట్ చేయడం జరిగింది ! వాటిలో ముఖ్యం గా  స్త్రీ పురుషుల పెరుగుదల ల తో పాటుగా , వారి ఆలోచనా ధోరణు లు కూడా ఎట్లా మార్పు చెందుతాయో , ఆ మార్పు చెందిన  ఆలోచనా ధోరణు లు , వారి , వారి బంధాలను ఎట్లా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు బంధాలు బలహీనం అవుతున్నప్పుడు , తీసుకోవలసిన జాగ్రత్తలూ , చేయ వలసిన కర్తవ్యం గురించి కూడా తెలుసుకుందాం ! 
1. కమ్యూనికేషన్ :  స్త్రీ పురుషుల మధ్య  సత్సంబంధాలకు , లేదా బలమైన సంబంధాల కు ప్రధానం గా కావలసిన బలం , వారిరువురి మధ్య  ఉన్న కమ్యూనికేషన్ ! ఈ పదాన్నే  మనం ప్రస్తుతం ఎక్కువ గా వాడుతూ ఉండడం వల్ల ,  ఈ పదం ఆంగ్ల పదమైనా కూడా , ఈ పదాన్నే ప్రస్తుతించడం జరుగుతుంది ! ( తెలుగులో కమ్యూనికేషన్ అంటే ‘ బట్వాడా ‘ అని ! కానీ బట్వాడా అనే పదం , దాదాపు కనుమరుగయింది , ప్రస్తుత వాడుక భాష లో ! ) 
బంధం బెడిసి కొడుతున్న సమయం లో స్త్రీ పురుషులు , ఒకరి మొహం , ఒకరు చూసుకోవడం తగ్గిస్తారు ! వారి జీవితం యాంత్రికం అవుతుంది !  ఒకరి తో ఒకరు సంభాషణ లు తక్కువ చేస్తారు ! ఒకరు  ఆ ప్రయత్నం చేసినా , ఇంకొకరు , తమకు విపరీతమైన పని ఒత్తిడి ఉన్నట్టూ , చాలా పనులు ఉన్నట్టూ , అభినయం చేస్తూ  ఉంటారు ! 
ఒక వేళ , నిజం గానే పని వత్తిడి ఉన్నా కూడా , అతి గా పని లో నిమగ్నమవుతూ , వారి సహచరుల తో సంబంధాలు తగ్గించుకుంటారు !  ఇక  వర్తమాన గాడ్జెట్ లు అనేకం , కూడా , ఆ పని చేయడానికి , వారికి ఎంతగానో  సహకరిస్తాయి ! అంటే , వాటిని ఉపయోగిస్తూ , వారు చాలా బిజీ గా ఉన్నట్టు , లేదా ఉంటూ , తమ బంధాలను బలహీనం చేసుకుంటూ ఉంటారు ,  లేదా నిర్లక్ష్యం చేసుకుంటారు ! 
కమ్యూనికేషన్  అనేది , స్త్రీ పురుషుల సంబంధాలలో , ఒక దృఢ మైన బంధం ! అది కనిపించక పోయినా కూడా !  ఆ ‘ బంధం ‘ బలహీన పడుతూ ఉంటే , మళ్ళీ పునరుద్దరించు కోవడం కర్తవ్యం  ! 
అందుకు , ఓపిక గా ఒకరి అభిప్రాయాలు ఒకరు వినడం అలవాటు చేసుకోవాలి !  ఒక వేళ , గట్టి గా అరుస్తూ మాట్లాడు కోవలసి వస్తే ,  ప్రైవసీ ఉన్న అంటే ఏకాంత ప్రదేశాలకు వెళ్ళడం  మంచిది !  ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకునే సమయం లో , కొన్ని నిబంధనలు పాటించాలి , ఇరువురూ ! 
ఒకరు మాట్లాడే సమయం లో ఇంకొకరు  వారి మాటలను ‘ కట్ ‘ చేయకుండా ,  వారు చెబుతున్నది , పూర్తి గా , శ్రద్ధ గా వినడం మంచిది ! శ్రద్ధ గా అనే అనడం ఎందుకంటే , ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు , వాచీ లో సమయం చూస్తూ నో , కిటికీ లోంచి ట్రాఫిక్ చూస్తూ నో , లేదా మొబైల్ లో  ‘ కెలుకుతూ నో ‘ ఉంటే , చెప్పే వారికి కూడా అసహనం పెరుగుతూ ఉంటుంది ! వారిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టం అవుతుంది !  
దేహ భాష , అంటే బాడీ లాంగ్వేజ్  తోనే మనం ఎక్కువ శాతం ఇతరులతో ‘ కమ్యూనికేట్ చేస్తాము !  మన సంభాషణ తో కేవలం కొంత శాతం మాత్రమే , ఇతరులతో  ‘ సంభాషిస్తాము ‘ !  ఇది ఆశ్చర్య కరమైనప్పటికీ , వాస్తవం ! అందుకే శ్రద్ధగా వినడం , కమ్యునికేషన్ లో ముఖ్య సూత్రం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?6.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 7, 2015 at 11:35 ఉద.

బంధాలు  ఎందుకు తెగుతాయి ?6. 

పురుషులు సర్వ సాధారణం గా , స్త్రీలు వారిని మార్చాలని ప్రయత్నిస్తున్నారని అంటారు ! 
స్త్రీలు సర్వ సాధారణం గా,  వారి పురుషులు , వారి మాట వినరని అంటూ ఉంటారు ! వారికి కావలసినది సానుభూతి ! కానీ, అందుకు భిన్నం గా పురుషులు , పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు !
స్త్రీలు తమ ఇల్లు  , పరిసరాల , శుభ్రత కు చాలా ప్రాధాన్యత ఇస్తారు ! కానీ , పురుషులు ఆ విషయానికి , అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోగా ,  శుభ్రత గురించిన ఏ  పని లోనూ , ఉత్సాహం చూపకుండా , ఇతరులు మాత్రమే చేయాలని అనుకుంటారు ! పురుషులు ఇంటి పని చేయడం , అవమానకరం గా కూడా భావిస్తారు ! 
మరి స్త్రీ పురుషుల బంధాల లో ఉన్న ఈ తేడాలకు పరిష్కారం ఏమిటి ? 
స్త్రీలు , చీకాకు , విసుగు ప్రదర్శిస్తున్న సమయం లో , పురుషులు చేయ వలసినది , పరిష్కారాలు చూపించడం కాదు ! 
వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయాలి ! 
పురుషులు , స్వాతంత్ర్యాన్నీ , అధికారాన్నీ , ఆస్వాదిస్తారు ! కోరుకుంటారు ! 
స్త్రీలూ , స్వాతంత్ర్యం కోరుకున్నా , వారికి ప్రధాన విషయాలు , వారిని అర్ధం చేసుకునే పురుషులు ! వారికి అంకితమైన పురుషులు , వారిని లాలన చేసే పురుషులు , వారికి ధైర్యం చెప్పి , జీవిత నౌక లో చేదోడు గా ప్రయాణం చేసే పురుషులు ! 
స్త్రీలు , తమ బంధం లో , ప్రత్యేకమైన వారిలా , గుర్తింపు , గౌరవం పొందు తున్నప్పుడు , ఎక్కువ ఉత్సాహ భరితులవుతారు !
తమ దైనందిన కార్యక్రమాలను , ఆనందం తో చేసుకో గలుగుతారు ! 
పురుషులు ,  తమ బంధం లో తమకు , సరి అయిన గుర్తింపు , ప్రశంస , విశ్వాసం , ప్రోత్సాహం ,లభిస్తున్నప్పుడే , ఎక్కువ క్రియాశీలం గానూ , ఆనందం గానూ , సంతృప్తి తోనూ  , ఆ బంధాన్ని కొనసాగిస్తారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

సర్వైకల్ క్యాన్సర్.3.కారణాలు.

In Our Health on ఏప్రిల్ 15, 2012 at 11:12 ఉద.

 సర్వైకల్ క్యాన్సర్.3.కారణాలు.

 
మునుపటి టపాలో చూశాము కదా HPV వైరస్ , ప్రత్యేకించి  HPV 16, 18 రకాలకు చెందిన వైరస్  డీ ఎన్యే ఎట్లా  సర్విక్స్  కణాల  డీ ఎన్యే లోకి చొచ్చుకు పోయి ,  క్యాన్సర్ కణాలను పుట్టించి క్యాన్సర్ కు ఎట్లా కారణం అవుతుందో !
ఇప్పుడు  మిగతా కారణాలు,  లేక రిస్క్  ఫాక్టర్స్  చూద్దాము.
HPV వైరస్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో సాధారణం అయినప్పటికీ , అందరిలోనూ  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కొందరిలోనే  రావటానికి , కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా కారణం అవుతాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఈ ప్రత్యేక పరిస్థితులు లేక రిస్క్ ఫ్యాక్టర్స్  ఇవి : 
 
1. సిగరెట్   స్మోకింగ్ :  స్మోకింగ్  చేస్తున్న యువతులు లేక స్త్రీలలో  సర్వైకల్  క్యాన్సర్  వచ్చే అవకాశం, స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే , రెట్టింపు అవుతుంది. అంటే ఉదాహరణ కు స్మోకింగ్ చేయని  ఒక పది మంది లో  ముగ్గురికి సర్వైకల్ క్యాన్సర్ వస్తే,  స్మోకింగ్ చేస్తున్న  పదిమంది లో  ఆరుగురికి వస్తుందన్న మాట.  దీనికి కారణం ఏంటో మీకు ప్రత్యేకం గా చెప్పనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే  స్మోకింగ్ వల్ల విడుదల అయిన  నాలుగు వేల  విష పదార్ధాలు,  సర్విక్స్  కణాలనీ, అంటే ఇంకా  ఖచ్చితం గా చెప్పాలంటే , కణాల డీ ఎన్యే నూ మార్చి వేస్తాయి.  ఇక్కడ జరుగుతున్నది : సర్వైకల్ కణాలు, ఆ కణాల డీ ఎన్యే రెండు విధాల  ముట్టడి  ఎదుర్కుంటున్నాయి. ఒకటి  HPV వైరస్, రెండు  స్మోకింగ్ వల్ల  రక్తం లో కి విడుదల అయిన  విష  పదార్ధాలు. 
2. గర్భ నియంత్ర ణ  పిల్స్  వాడే స్త్రీలు:  వీరు  అయిదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం  కాంట్రా సేప్టివ్  పిల్స్  తీసుకుంటూ ఉంటే కూడా  సర్వైకల్  క్యాన్సర్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని తెలిసింది. 
సర్వైకల్  కణాలలో  పిల్స్  తీసుకోవడం వల్ల  కలిగే హార్మోనుల  మార్పు , ఆ  కణాల  రోగ నిరోధక శక్తి ని తగ్గిస్తాయని భావించ బడుతుంది.
3. సంతానం కలిగి ఉండటం :  పిల్లలు లేని వారితో పోలిస్తే , ఇద్దరు పిల్లలు ఉన్న స్త్రీలలో  సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. అలాగే ఎంత  ఎక్కువ మంది పిల్లలను స్త్రీ కలిగి ఉంటే ,  సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం అంత  ఎక్కువ  అవుతుంది అని  వివిధ  పరిశీలనలలో తెలిసింది.  దీనికి కారణం :  ఆ  యా స్త్రీలలో రోగ నిరోధక శక్తి తగ్గి వారికి HPV virus ఇన్ఫెక్షన్  సులభం గా  వచ్చేట్టు చేయటం జరుగుతుంది. 
4. reduced  immunity :  స్త్రీలలో ఏ కారణం వల్ల నైనా రోగ  నిరోధక శక్తి అంటే ఇమ్యునిటీ అంటారు , ఈ  ఇమ్యునిటీ  తగ్గితే కూడా , ఆ స్త్రీలలో  HPV వైరస్  ఇన్ఫెక్షన్  త్వర గా వస్తుంది.  ఇలా ఇమ్యునిటీ తగ్గటానికి కారణాలు:  HIV లేక  AIDS వైరస్ ఇన్ఫెక్షన్ , లేక  కొన్ని పరిస్థితులలో తీసుకునే ఇమ్యునో సప్రేసేంట్  మందులు.
5. ఎక్కువ మంది పురుషుల తో  రతి క్రియ  :  అంటే  స్త్రీలు  ఒకరి కన్నా ఎక్కువ మంది తో కామ పరమైన  సంబంధం పెట్టుకుంటే, అలాంటి స్త్రీలలో  HPV వైరస్  ఇన్ఫెక్షన్  త్వరగా వచ్చినట్టు  గుర్తించడం జరిగింది.  ఇలాంటి  జీవన శైలి ఉన్న స్త్రీలు కండోము వాడుతున్నప్పటికీ , ఆ కండోము వారికి  HPV వైరస్ సోకకుండా  సంపూర్ణ రక్షణ  ఇవ్వటం లేదని  కూడా ఖచ్చితం గా తెలిసింది. 
 
వచ్చే టపాలో  ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము ! 

సర్వైకల్ క్యాన్సర్.2.కారణాలు.

In Our Health on ఏప్రిల్ 14, 2012 at 7:31 సా.

సర్వైకల్ క్యాన్సర్.2.కారణాలు: 

మునుపటి టపాలో చూశాము, మన జీవ కణాల లోని క్రోమోజోములలో  ఉన్న డీ ఎన్యే, మన లో ఉన్న ప్రతి లక్షణాన్ని ఎలా కాపీ చేసి కొత్త కణాలలో ప్రవేశ పెడతాయో, అలాగే కొత్త కణాల సంఖ్యను కూడా ఒక క్రమ పధ్ధతి లో నియంత్రిస్తాయో !
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకుందాము. ముఖ్య కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ కు డీ ఎన్యే కు ఉన్న సంబంధం ఏమిటో కూడా చూద్దాము.
వైరస్ లు  సృష్టి లో ఉండే అత్యంత సూక్ష్మ మైన జీవ పదార్ధాలు. వైరస్ లు బాక్టీరియా కంటే సూక్ష్మం గా ఉంటాయి. అందు వల్లనే, బాక్టీరియా ను మనం పరిశోధన శాల లో ఉండే సూక్ష్మ దర్శిని ద్వారా చూడవచ్చు. కానీ వైరస్ లు  కేవలం ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని తో మాత్రమే చూడగలం.
ఎందుకంటే ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని , వైరస్ లను కొన్ని వేల రెట్లు పెద్దవి గా చేసి మన కంటికి చూపిస్తాయి కాబట్టి.
అలాంటి వైరస్ రకాలకు చెందినదే హ్యూమన్ పాపిలోమా వైరస్. ( HPV virus ).
ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు ,  సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన దాదాపు అందరు స్త్రీలలోనూ,  ఈ హ్యూమన్ పాపిలోమా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఖచ్చితం  గా తెలిపాయి.
ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్  అంటే HPV వైరస్  లో  కనీసం వంద రకాలు  ఉన్నాయి.   తమ సెక్స్ జీవితాన్ని ( ప్రధానంగా పురుష జననాంగం యోనిలో ప్రవేశించడం ద్వారా పొందే సెక్స్  ) ప్రారంభించిన రెండు సంవత్సరాలలో ,   సాధారణం గా ప్రతి ముగ్గురిలో ఒక  యువతి లేక స్త్రీ కి  ఈ HPV  వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.  కానీ ఈ HPV వైరస్ వంద రకాలుండటం వల్ల కేవలం కొన్ని రకాలు మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ కు కారణం అని తెలిసింది.
 HPV16,  అంటే పదహారవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్, అన్ని  సర్వైకల్ క్యాన్సర్  కేసులలో  50 నుంచి 55 శాతం కేసులకు  కారణ భూతమని తెలిసింది. 
అలాగే HPV18, అంటే పద్దెనిమిదవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్ 15 నుంచి 20 శాతం కేసులకు కారణం అనీ , మిగతా కేసులకు ఇంకో పదకొండు రకాలకు చెందిన HPV  వైరస్ లు కారణం అనీ ఖచ్చితం గా తెలిసింది. 
పైన చెప్పుకున్న ఈ కొన్ని రకాలే, వంద రకాలలో మిగతా 87 రకాల కన్నా ఎక్కువ గా సర్వైకల్ క్యాన్సర్ ను ఎందుకు కలిగిస్తాయి? :
ఈ ఎక్కువ రిస్కు ఉన్న వైరస్ రకాలు శక్తి వంతమైన జన్యు పదార్ధం అంటే డీ ఎన్యే కలిగి ఉంటాయి. ఈ  డీ ఎన్యే , సర్విక్స్  లో ఉన్న కణ జాలం లోకి చొచ్చుకు పోతుంది. అంతే కాక , ఈ వైరస్ కు చెందిన డీ ఎన్యే   కణం లో ఉన్న( అంటే సర్విక్స్ కణం లో ఉన్న ) డీ ఎన్యే తో జత కడుతుంది. ఇలా జత కట్టడం వల్ల , అప్పటి వరకూ ఒక క్రమ పధ్ధతి లో  జరుగుతున్న కణ విభజన  హద్దులు , పరిమితులూ ఏవీ లేకుండా,  అంటే ఒక నియంత్రణ అంటూ ఏమీ లేకుండా,  ఇష్టం వచ్చినట్టు , అసంఖ్యాకమైన కణాల ఉత్పత్తి కి కారణం అవుతుంది.  దాని పరిణామం గా  సర్విక్స్ మీద ఒక రాచ పుండు అంటే క్యాన్సర్ మొదలై, పెరగటం ప్రారంభిస్తుంది. (  క్రింద పటం లో చూడండి , ఈ విషయాలన్నీ స్పష్టం గా అర్ధమవడం కోసం.)
 
వచ్చే టపాలో ఇంకొన్ని కారణాలు తెలుసుకుందాము.

సర్వైకల్ క్యాన్సర్.1. కారణాలు.

In Our Health on ఏప్రిల్ 14, 2012 at 12:12 సా.

సర్వైకల్ క్యాన్సర్.1. కారణాలు.

సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకునే ముందు మనం  DNA గురించి తెలుసుకోవాలి.
DNA అంటే  De oxy Ribo Nucleic Acid. తెలుగులో డీ ఆక్సీ రైబో న్యుక్లిక్ యాసిడ్.  ఈ డీ ఎన్యే   సృష్టి లో ప్రతి జీవ కణం లోనూ ఉంటుంది.  మనం   ‘ పొగాకు కు ఋణం – ప్రాణం పణం ‘ . అనే టపా ల పరంపర లో తెలుసుకున్నాము , ఈ డీ ఎన్యే  శ్వాస కోశ క్యాన్సర్ కు ఎట్లా కారణం అవుతుందో ! (  వివరాలు మళ్ళీ  తెలుసుకోవాలని ఉంటే  ఆర్కివ్స్ లో చూడండి ) ఖచ్చితం గా అదే పద్ధతిలో  ఈ డీ ఎన్యే లో కలిగే మార్పులు సర్వైకల్ క్యాన్సర్ కు కూడా కారణం.( లంగ్ క్యాన్సర్ లో ఆ పనిని  స్మోకింగ్ చేయటం వల్ల విడుదల ఆయే  టాక్సిన్ లు అంటే విష పదార్ధాలు చేస్తాయి  )   కాకపొతే, సర్వైకల్ క్యాన్సర్ లో డీ ఎన్యే మార్పులకు ఒక రకమైన వైరస్ కూడా కారణం అవుతుంది. 
 అది ఎట్లా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము:
DNA , దేహం లో ప్రతి జీవ కణం లోనూ  ఉండే  అతి సూక్ష్మమైన ,  మెమరీ. ఈ మెమరీ లో మన  దేహం లో జరిగే ప్రతి యొక్క జీవ క్రియ కు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. అంటే కేవలం బయట కు కనిపించే బాహ్య లక్షణాలే కాక, ప్రతి నిత్యం మన దేహం లో జరుగుతున్న వేలకొద్దీ జీవ రసాయన చర్యలు కూడా ఈ డీ ఎన్యే  లో  నిక్షిప్తమై ఉన్న,  నిర్దేశించిన పద్ధతులలో జరుగుతాయి.  ఇందులో  జీవ కణాల ప్రత్యుత్పత్తి కూడా.  మన దేహం లో వేలు, లక్షల కొద్దీ జీవ కణాలు, ప్రతి రోజూ ప్రత్యుత్పత్తి అవుతుంటాయి, పాత కణాలు నశిస్తూ ఉంటాయి.  ఉదాహరణ కు మన చర్మం మీద ఉండే  ఎపిడెర్మల్ కణాలు నిరంతరమూ  పాతవి ‘ ఊడి’ పోయి, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి.  మనం సాధారణంగా ఈ మార్పులను గమనించ లేము, సూక్ష్మ దర్శిని తో చూస్తే తప్ప.
ఈ విషయం ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే , ఈ కొత్త జీవ కణాలు ఎప్పుడు ఏర్పడినా,  అవి ఖచ్చితం గా పాత కణాల లానే ఉంటాయి. ఎందుకంటే పాత కణాలలో ఉండే డీ ఎన్యే  లో ఉన్న ‘ మెమరీ ‘ వల్ల !  ఇదే మెమరీ మన జీవ కణాల సంఖ్యను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల నే మనకు నిరంతరం చర్మం లో పాత కణాలు పోయి, కొత్త కణాలు పుడుతున్నా, అవి ఒక నియంత్రిత సంఖ్య లో ఉండటం వల్ల మన చర్మం అనేక పొరలు గా ఉండదు కదా! ఇదే ఉదాహరణ మన దేహం లో కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడుతున్న ప్రతి చోటా వర్తిస్తుంది.
అయితే ఏ కారణం అయినా ఈ కణ నియంత్రణ చేసే డీ ఎన్యే ‘ మెమరీ ‘ ని మార్చి వేస్తె , అపుడు జీవ కణాలు,  అనియంత్రిత సంఖ్య లో పుట్టి , క్యాన్సర్ గా పరిణమిస్తాయి. మన దేహం లో ఈ బాగం లో క్యాన్సర్ వచ్చినా  డీ ఎన్యే లో మార్పుల వల్ల జరిగే అనియంత్రిత కణ విభజన వల్లనే.  లంగ్ క్యాన్సర్ అయినా , సర్వైకల్ క్యాన్సర్ అయినా , ఏ క్యాన్సర్ అయినా !
సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం  హ్యూమన్  పాపిలోమా వైరస్ అని పరిశోధనల వల్ల తెలిసింది.  ఈ వైరస్ నే HPV వైరస్ అంటారు.  ఈ వైరస్ కధా కమామీషు , అంటే ఈ వైరస్  ఇన్ఫెక్షన్  ఎట్లా సర్వైకల్ క్యాన్సర్ కు కారణమవుతుంది,  ఈ HPV వైరస్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాము.
ఈ విషయాలు  అందరూ తెలుసుకోవాలి. ప్రత్యేకించి , యువత, వారి తల్లి తండ్రులు.  ఎందుకంటే  ప్రపంచీకరణ  పర్యవసానంగా  మన దేశం లో  యువత జీవన శైలి, ప్రత్యేకించి వారి సెక్స్ అంటే కామ జీవితం   లో జరుగుతున్న మార్పులు, వాటి  పరిణామాలు ఎట్లా ఉండ గలవో  తెలుసుకోవడానికీ , ఇంకా వారు తగిన జాగ్రత్తలు తీసుకోడానికీ !

సర్వైకల్ క్యాన్సర్.

In Our Health on ఏప్రిల్ 13, 2012 at 10:06 సా.

సర్వైకల్ క్యాన్సర్.

గర్భాశయ భాగమైన సర్విక్స్  లో వచ్చే క్యాన్సర్ ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు.
 ( సర్విక్స్ అంటే మెడ భాగం అన్న మాట.  అందుకే మెడ భాగం లో ఉన్న వెన్ను పూసను సర్వైకల్ స్పైన్  అని, అక్కడ ఉన్న ఎముకలను సర్వైకల్ వెర్టేబ్రా అనీ అంటారు) . 
గర్భాశయం మొదటి భాగం లో మెడ లా ఉండటం వల్ల ఈ భాగాన్ని కూడా సర్విక్స్ అని అందుకనే అంటారు. 
ఈ సర్విక్స్ కు వచ్చే క్యాన్సర్  ప్రపంచం మొత్తం లో క్యాన్సర్ వల్ల స్త్రీలలో సంభవించే మరణాలలో అయిదవ ముఖ్య కారణం గా పేర్కొనబడింది, మరణాల సంఖ్యా పరంగా.
ఇండియా లో స్త్రీలలో వచ్చే క్యాన్సర్ లలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రముఖమైనది. అంటే ఇండియా లో క్యాన్సర్ వల్ల మరణించే స్త్రీలలో ఎక్కువ మంది సర్వైకల్ క్యాన్సర్ వల్లనే.
ఈ సర్వైకల్ క్యాన్సర్ రావటానికి కారణాలు ఏమిటి, సర్వైకల్ క్యాన్సర్ ను మొదటి దశలలో ఎట్లా కనుక్కోవచ్చు,  చికిత్సా పద్ధతులు ఏమిటి అనే విషయాల గురించి 
వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము. 
( క్రితం టపా లో పొందుపరిచిన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించిన సంపూర్ణ సమాచారం గురించి ఆంగ్లం లో ఉన్న వీడియో ను అతి తక్కువ మంది మాత్రమే చూశారు.
ఎందుకో యు ట్యూబ్ వీడియో లకు చెప్పుకోతగ్గ స్పందన ఉండటం లేదు.  కారణాలు కూడా తెలియట్లేదు. అందు వల్ల రాత పూర్వకం గానే వీలైనంత సమాచారాన్ని తెలియ పరుస్తేనే మంచిదనే ఉద్దేశం కలుగుతుంది.  ఈ విషయం పైన మీ అభిప్రాయాలు తెలుపగలరు ) 

గర్భాశయ ఫైబ్రాయిడ్స్ లేక యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ .2.

In Our Health on ఏప్రిల్ 12, 2012 at 7:30 సా.

గర్భాశయ ఫైబ్రాయిడ్స్  లేక యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ .2.

( మనవి:  గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించి మీకు తగినంత సమాచారం అందించే ప్రయత్నం లో యు ట్యూబ్  లో వెతకడం జరిగింది.  ఒక అమెరికన్ గైనకాలజిస్ట్  రూపొందించిన ఒక వీడియో  కనిపించింది.  ఈ వీడియో  ఆసక్తి కరంగా  పూర్తి వివరాలతో  ఉంది.
ఇది ఆంగ్ల భాష లో ఉన్నా , గైనకాలజిస్ట్ చాలా నిదానం గా స్పష్టం గా మాట్లాడటం వలన సులభం గా అర్ధ మయేట్టు  ఉంది,   ఆంగ్ల భాష  కొద్ది గా తెలిసిన వారికి కూడా. అందులో కొన్ని పటాలు కూడా పొందు పరచడం వల్ల  ఆసక్తి కరం గా  కూడా ఉన్నది.
అందువల్ల మిగతా వివరాలు తెలుగులో ఇవ్వలేదు.  మీరు ఈ వీడియో ను  ఓపికగా, సంపూర్ణం గా చూస్తారని ఆశిస్తాను.
( ఎందుకంటే ఈ వీడియో, గైనకాలజిస్ట్ ద్వారా రూపొందించబడింది,  ఇది పూర్తి గా ఉచితం ! ) 
 మీరు ఈ యు ట్యూబ్ వీడియో చూసి సందేహాలుంటే  తెలియ చేయండి. అలా కాకుండా తెలుగులో వివరాలు కూడా కావాలంటే కూడా నిరభ్యంతరం గా మీ అభిప్రాయం తెలపండి.  ఎక్కువ మంది కోరితే తెలుగు లో కూడా ఈ వివరాలు పొందు పరుస్తాను ) .
వచ్చే టపాలో  ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్. ( యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ ). 1.

In Our Health on ఏప్రిల్ 11, 2012 at 5:59 సా.

గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్. ( యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ ). 1.

 
ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి ?: 
ఫైబ్రాయిడ్స్ అతి సాధారణ మైన గర్భాశయ  పెరుగుదలలు లేక కంతులు. ఇవి క్యాన్సర్ పెరుగుదలలు కావు. ఇవి చాలా నెమ్మది గా గర్భాశయ కండరాల పొరలలో పెరుగుతాయి.
ఒక్క అమెరికా లోనే ప్రతి సంవత్సరమూ  ఆరు లక్షల  గర్భ సంచి లేక గర్భాశయం తీసి వేసే ఆపరేషన్లు జరుగు తుంటాయి. అందులో సుమారు ముప్పై శాతం అంటే రెండు లక్షల వరకూ ఆపరేషన్లు  గర్భాశయం లో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల జరుగుతున్నాయి.
ఇందులో చాలా వరకూ అనవసరమైనవేనని అమెరికాకే చెందిన ఒక అనుభవజ్ఞుడైన  గైనకాలజిస్ట్ అభిప్రాయం. 
 
ఈ ఫైబ్రాయిడ్స్ మొదట చెప్పినట్టు,  సుమారు 75 శాతం మంది  స్త్రీలలో ఉంటాయి. కాక పొతే వాటి పరిమాణం, వేరు వేరు స్త్రీలలో వేరు వేరు పరిమాణాలలో ఉంటుంది.  అతి చిన్న గా ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి పెరుగుదల చాలా నెమ్మది గా జరగటం వల్ల, చిన్న పరిమాణం లో ఉన్నప్పుడు, కేవలం అతి సున్నితమైన  MRI స్కానింగ్ ద్వారానే వాటి ఉనికి గర్భాశయం లో కనిపెట్ట వచ్చు. 
కేవలం 30 శాతం మంది స్త్రీలలోనే ఈ పెరుగుదలలను  చేతుల ద్వారా అంటే చేతి స్పర్శ తో కనుక్కోవచ్చు.  అంటే మిగతా స్త్రీలలో ఉన్న ఫైబ్రాయిడ్స్  ఉన్నప్పుడు , చేతి స్పర్శకు అందనంత చిన్నవి గా ఉంటాయన్న మాట. 
 
ఈ ఫైబ్రాయిడ్స్ గురించి వివరం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాము ! 

ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం. చికిత్స.

In Our Health on ఏప్రిల్ 10, 2012 at 8:49 సా.

ఋతుక్రమం- సమస్యలు. 8.అస్తవ్యస్త ఋతుస్రావం. 

 

యనోవ్యులేటరీ ఋతుస్రావం :
 ఈ రకమైన ఋతుస్రావం పేరులో ఉన్నట్టు, అస్తవ్యస్తం గా జరుగుతుంది. కానీ ఈ అస్తవ్యస్త ఋతు స్రావం లో అండాశయం నుంచి అండం విడుదల అవదు.
అస్తవ్యస్తం గా జరిగే ఋతు స్రావాలలో 90 శాతం అంటే  నూటికి తొంభై మంది లో  ఈ రకమైన ఋతుస్రావం జరుగుతుంది.
ఇలాంటి ఋతుస్రావం సాధారణం గా రజస్వల అయిన మొదటి నెలలలో ఇంకా మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగి పోయే దశలో  ఎక్కువ గా కనిపిస్తుంది.
ఇలాంటి సమయాలలో అండాశయం నుంచి అండం విడుదల అవక పోవడం వల్ల , ఈస్త్రోజేన్ ఎక్కువ గా విడుదల అయి  గర్భాశయ లైనింగ్ పొర  మందం గా ఏర్పడుతుంది. అందువల్ల
ఋతుక్రమం సరి అయిన సమయం లో అవదు. అయినా ఎక్కువ రోజులు ఋతుస్రావం అవటం జరుగుతుంది.
ఇలా అండం విడుదల అవకుండా ఋతుస్రావం అవడం ఇంకా కొన్ని పరిస్థితులలో కూడా జరుగుతుంది.
తీవ్రం గా మానసిక వత్తిడి ఉన్నప్పుడు, అతి సన్న గా ఉన్నా లేక అతి లావు గా ఉన్నా , లేక ఆకస్మికం గా స్త్రీ బరువులో హెచ్చు తగ్గులు అయినప్పుడు, లేక థైరాయిడ్ లాంటి హార్మోనులకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా , లేక ఎక్కువ అంటే అతి గా వ్యాయామం చేసినా కూడా ఋతు స్రావం అస్తవ్యస్తం కావచ్చు.
ఎలా కనుక్కోవాలి? : 
వివరమైన వైద్య చరిత్ర అంటే లక్షణాలు మొదలైన దగ్గరినుంచి, వాటి తీవ్రత,  ఆ లక్షణాలకూ ఋతుక్రమం లో వాటి సమయానికీ ఉన్న సంబంధమూ , ఈ వివరాలన్నీ స్త్రీలు గమనించి స్పెషలిస్ట్ వైద్యులు అడిగినప్పుడు చెబితే చాలా ఉపయోగ కరం గా ఉంటుంది , ఎ రకమైన సమస్యో  ఖచ్చితమైన నిర్ధారణ చేయటానికి.
అలాగే ఎంత రక్తస్రావం జరిగిందో తెలుసుకోవడానికి హీమో గ్లోబిన్ పరీక్ష, హార్మోనుల పరీక్షలు అంటే థైరాయిడ్ హార్మోను, ఈస్త్రోజేన్, LH హార్మోనుల పరీక్షలు కూడా అవసరం అవుతాయి.
కొన్ని ప్రత్యెక సందర్భాలలో  Beta HCG, androgen, TSH, FSH, prolactin లాంటి హార్మోనులు  శరీరం లో ఎంత పరిమాణం లో ఉన్నాయో తెలుసుకోవడం  అవసరం ఉంటుంది.
శబ్ద పుంజాలతో అంటే అల్ట్రా సౌండ్ తో గర్భాశయ స్కానింగ్  చేయడము, గర్భాశయ లైనింగ్ కణజాలం పరీక్ష చేయడము కూడా అవసరం రావచ్చు, ఉన్న సమస్య ను బట్టి.
చికిత్స ఏమిటి ? : 
రక్త హీనత ఎక్కువ కాకుండా ఇనుము అంటే ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటుండాలి క్రమం గా.
హార్మోనుల తో  అంటే ఈస్త్రోజేన్ తో కానీ ప్రోజేస్తిరాన్ తో కానీ చికిత్స చేసి, సాధారణం గా ఈ అస్తవ్యస్త రుతుక్రమాన్ని సరి చేస్తారు గైనకాలజిస్టులు.
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో  గర్భాశయం తీసి వేయ వలసిన అవసరం రావచ్చు.
ఆపరేషన్ అవసరం లేకుండా గర్భాశయం లోకి ఒక  సూక్ష్మమైన కెమెరా పోనిచ్చి  గర్భాశయ లైనింగ్ ను ఒక రకం గా మాడ్చి వేసి అధిక రక్త స్రావం కాకుండా నివారించడం కూడా ఒక ఆధునిక పధ్ధతి. దీనిని  ఎండో మెట్రి యల్  అబ్లేషన్ అంటారు.   ( పైన ఉన్న పటం చూడండి )
ఇలాంటి సమస్య ఉన్న వారు స్పెషలిస్ట్ సలహా తీసుకోవడం అంటే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం శ్రేయస్కరం.
వచ్చే టపా లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !
%d bloggers like this: