Our Health

Archive for the ‘Our minds’ Category

పని సూత్రాలు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 12, 2013 at 9:06 సా.

పని సూత్రాలు.

 
ఆధునిక మహాభారత ఉద్యోగ పర్వం లో , యువతీ యువకులంతా , అనేక రకాలు గా ఉంటారు. చాలా మంది పట్టే ప్రధాన మైన  బాట, చదువులు పూర్తి అయిన తరువాత , ఉద్యోగం కోసం  వేట !  ఇట్లా ఉద్యోగం చేసే వారిలో ఎక్కువ శాతం మంది , పరీక్షలు పాసయిన వారుంటారు .  కొంత శాతం మంది , పరీక్షలలో సఫలం కాలేక , చదువు కు విరామం ఇచ్చి , ఉద్యోగం వేట లో పడతారు. ఆ అదృష్టానికి కూడా నోచుకోని వారు , చదువులు మానివేసి, అంటే స్కూల్ చదువులు అయ్యాకనే , పై చదువులకు వెళ్ళ కుండా ( లేదా వెళ్ళ లేక ) ఉద్యోగాలు వెతుక్కుంటారు. అనేక సంవత్సరాలు గా వారి జీవితాలలో, అతి ముఖ్యమైన భాగమైన స్టూడెంట్ లైఫ్ ను భాగా అనుభవిస్తారు , చాలా మంది యువతీ యువకులు, అందులో తప్పు ఎంత మాత్రమూ లేదు. కానీ పరీక్షా ఫలితాలు తెలిశాక , వారు ఒక జల్లెడ లోనుంచి వేరు చేయబడతారు వివిధ  గ్రూపు లు గా ! వారికి వచ్చిన మార్కుల ప్రకారం గా వారి ప్రతిభ, కొన్ని తరగతులు గా విభజింప బడుతుంది.  కానీ ప్రపంచ చరిత్రలో మనం చూస్తూ ఉంటాం తరచూ , ప్రతిభకు డిగ్రీలూ , సర్టిఫికెట్  లు మాత్రమే కొలమానాలు కాదని ! ప్రతిభ ను వారే ” సాన ” పెట్టుకుంటే లేదా పదును పెట్టుకుంటే , వారు, వారి వారి జీవితాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించ గలుగుతారు.  కావలసినది కృత నిశ్చయమూ , శ్రమా, ఆశావహ దృక్పధమూ ! వారి, వారి లక్ష్యాలను అధిగమించ డానికి  వారందరికీ కావలసినది ఇంకో ముఖ్యమైన  సాధనం ” పని సూత్రాలు ” అదే, రూల్స్ ఆఫ్ వర్క్ . వారు ఎక్కడ ఏపని చేసినా , వారికి పని సూత్రాలు పూర్తి గా తెలిస్తే , వారు నెగ్గుకు రాగలరు ! 
విచార కరమైన విషయం ఏమిటంటే , ఈ పని సూత్రాలు , చదువు కున్న వారికీ , వారి కాలేజీ లో చెప్పరు , చదువు కోలేక పోయిన వారికీ ,వీటి గురించి అవగాహన ఉండదు. పని చేసే , ప్రతి మానవ జీవితం లో అతి ముఖ్యమైన ఈ పని సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ! మన జీవితాలలో,పని సూత్రాలు పాటించి , అభివృద్ధి పధం లోకి వెళదాం !
 
వచ్చే టపా నుంచి , ఈ పని సూత్రాలు వివరం గా తెలుసుకుందాం ! 

 

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 10, 2013 at 9:57 ఉద.

పరీక్షల ముందు, విద్యార్ధులలో ఆందోళన తగ్గించడం ఎట్లా ? మిగతా పద్ధతులు. 

2. సన్నద్ధం అంటే ప్రిపరేషన్ లో నే ఉంది కిటుకు : 

పరీక్షా సమయం లో విద్యార్ధులలో ఏర్పడే భయాందోళన లకు ఇంకో ముఖ్య కారణం , సరిగా సన్నద్ధం అవక పోవడం. ఈ పరిస్థితిని యుద్ధానికి వెళ్ళే సైనికులు ,ఆయుధాలు మర్చి పోయిన  పరిస్థితి తో పోల్చ వచ్చు.  పరీక్షా స్థలం లో జరిగేది కేవలం, అంతకు ముందంతా, విద్యార్ధులు , ఏమి నేర్చుకున్నారో పరీక్ష చేయడమే కదా !  అందువల్ల  ఆ పరీక్ష కు సరిగా ప్రిపేర్ అవ్వడం ఎంతో  ముఖ్యం. ఈ సన్నద్ధం అవడాన్ని ప్రధానం గా రెండు రకాలు గా విభజించు కోవచ్చువిద్యార్ధులు.స్కూలు తెరవ గానే ఆ సంవత్సరం లో చెప్పే పాఠాల  వివరాలు తెలుసుకోవడం.ఈ పని , విద్యార్ధులు చిన్న వయసు లో ఉంటే , వారి తలిదండ్రులు కూడా చేయ వచ్చు.  పాఠాల వివరాల తో పాటుగా , క్లాసు పరీక్షల లోనూ , ఇంకా ఫైనల్ పరీక్షల లోనూ , వచ్చే ప్రశ్నల వివరాలు, అంటే మోడల్ పేపర్స్, లేదా నమూనా ప్రశ్న పత్రాలను కూడా , స్కూల్ ప్రారంభించిన సమయం లోనే సంపాదించి , ఆ యా ప్రశ్నలకు సమాధానాలు వివరం గా రాసే దిశగా , విద్యార్ధిని సన్నద్ధం చేయాలి. ఈ విధం గా చేయడం వల్ల , సంవత్సరం పొడుగునా చదువుతున్నా ,పరీక్షా సమయం లో ఇచ్చే ప్రశ్నలను చూసి ఆందోళన చెందకుండా , వాటిని సులభం గా రాసే అలవాటు విద్యార్ధికి ఏర్పడుతుంది. ఇట్లా పరీక్షా ప్రశ్నా పత్రాలు కూడా ,తరచూ  ప్రాక్టిస్ చేయిస్తూ ఉంటే , విద్యార్ధులకు , ఆత్మ స్థైర్యం పెరుగుతూ ఉంటుంది.ఇంతే కాక తలిదండ్రులు పరీక్షా సమయాలలో చేయవలసినది ఇంకో ముఖ్య మైన కార్యం ఉంది. అది అన్ని పరిస్థితులలోనూ , విద్యార్ధిని ఎంకరేజ్ చేస్తూ , అంటే ఉత్సాహ పరుస్తూ , వారిలో  ఆ పరీక్షను  తాము చక్కగా రాయగలమనే ధైర్యాన్నీ , ఆత్మ విశ్వాసాన్నీ  కలిగిస్తూ , లేదా సన్నగిలి పోతున్న వారి ఆత్మ విశ్వాసాన్ని మళ్ళీ  ఎక్కువ చేస్తూ ఉండాలి. అంతే  కానీ , ఆ పరిస్థితులలో వారికి లేని పోనీ భయాలు కలిగిస్తూ ” ఈ పరీక్షలో పాసు కాక పొతే , లేదా మంచి మార్కులు రాక పొతే ఇక చదివించేది లేదు , నీ పని చెబుతా ! ” అంటూ బెదిరిస్తూ ఉంటే , ప్రయోజనం శూన్యం ! 
3.  చిన్న వయసు నుంచే !: 
చాలా మంది విద్యార్ధులు , ప్రత్యేకించి ఒకటో , రెండో తరగతో చదివే చిన్నారులు కూడా ఈ ఆందోళన లకూ భయాలకూ లోనవుతూ ఉంటారని మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు అంటారు . ఆ సమయాలలో తలిదండ్రులు కనక వారి మానసిక  పరిస్థితి ని గమనిస్తూ , వారికి సహాయం చేయక పొతే , వారి భయాందోళన లు, వారితో పాటుగా పెరిగి , వారు ( పెద్ద క్లాసులలో ) పరీక్ష రాసే ప్రతి సారీ వారిని బాధ పెడుతూ , వారి ప్రతిభను మరుగు పరుస్తాయి ! ముఖ్యం గా చిన్న పిల్లలు , అకారణం గా ముభావం గా ఉండడమో ,  కడుపు లో తిప్పు తుందనో , లేదా అతి గా మూత్ర విసర్జన చేయడమో , చేస్తూ ఉంటారు.ఆకస్మికం గా పెద్దగా ఏడుస్తూ ఉంటారు. పిల్లలలో ఎదురయే ఈ పరిస్థితి , ప్రత్యేకించి , పరీక్షల ముందు , అతి జాగ్రత్త గా వారి తల్లి దండ్రులు గమనించి, వివరం గా వాటి కారణాలు ఆరా తీయాలి. ఇట్లా ఎక్కువ యాంగ్జైటీ కి లోనయే  చిన్నారులకు  బ్రీదింగ్ ఎక్సర్సైజు లు బాగా ఉపయోగ పడతాయని విశదం అయింది. సాధారణం గా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజులు ,లేదా  శ్వాస వ్యాయామాలు ఇంట్లో నైనా వారి స్కూల్ లో నైనా చేయించ వచ్చు. వారిని చాప మీద పడుకుని కళ్ళు మూసుకోవాలని చెప్పాలి. తరువాత వారిని వారి శ్వాస మీద కేంద్రీకరించ మనాలి. తరువాత క్రమేణా , వారిని వారి కాళ్ళనూ చేతులనూ, టెన్స్  గా చేస్తూ , తరువాత రిలాక్స్ చేస్తూ ఉండమని చెప్పాలి. అంటే వారిని వారి చేతి కండరాలనూ , కాళ్ళ కండరాలనూ బిగిస్తూ , విడుదల చేస్తూ ఉండాలి. ఈ విధం గా చేయడం వల్ల, వారి మనసు కేవలం ఎక్సర్సైజు మీదే లగ్నం అయి , వారి ఆందోళనలు తగ్గుతాయి. ఇట్లా చిన్న పిల్లలతో , ప్రత్యేకించి యాంగ్జైటీ ను అనుభవిస్తున్న చిన్నారులలో , ఇట్లా ఎక్సర్సైజులు చేయించడం వల్ల , వారి భయాందోళన లు చాలా వరకు తగ్గి పోయి ,పరీక్షలలో మంచి ఫలితాలు సాధించారని  కూడా స్పష్టమైంది. ( కొందరు పిల్లలైతే ఆ ఎక్సర్సైజులు చేస్తూ నిద్ర లోకి జారుకున్నారు ట ! )
పరీక్షలు అనేవి, పురోగమించే  ప్రతి మానవ జీవితానికీ అనివార్యం అయ్యాయి. ప్రతి మానవ జీవితం లో భాగం అయ్యాయి. వాటిని సమర్ధ వంతం గా ఎదుర్కోవడమే ఉత్తమ పధ్ధతి.  తలిదండ్రులూ , ఉపాద్యాయులూ కూడా , బాల బాలికలకు ప్రోత్సాహం, సహకారం ఇచ్చి వారిని సదా కర్తవ్యోన్ముఖులను చేస్తూ,చక్కటి ఫలితాలు కూడా పొందే లా చూడాలి. మనమంతా ఒక్కసారి గా పెరిగి, పెద్ద   అయిపోలేదు కదా !  ( టైం  పత్రిక సౌజన్యం తో ).
 
 
 

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఫిబ్రవరి 9, 2013 at 11:09 ఉద.

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

 
నిన్నటి టపా లో మనం తెలుసుకున్నాం , పరీక్షల ముందు పిల్లలు పడే ఆందోళన, ఆతురత ,వారు రాసే పరీక్షలను ఎట్లా ప్రభావితం చేస్తుందో ! వారి అసలు మేధ ను ఎట్లా తక్కువ చేసి చూపిస్తుందో ! మరి ఆ ఆందోళన తగ్గించి వారి ప్రతిభను సరిగా చూపించేట్టు చేయడానికి  వారు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !  
1. ఆందోళనలను ముట్టడించడం ! :
చాలా మంది విద్యార్ధులు , పరీక్షకు ముందుగా , ఆందోళనా , యాంగ్జైటీ చెందినా , వారు పరీక్షా సమయం లో , ప్రశ్నలను చదివి , వారికి గుర్తు వచ్చిన సమాధానాలు రాస్తూ ఉంటారని. కానీ వారి ఆందోళనల వల్ల , వారి సమాధానాలలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.సాధారణం గా మన జ్ఞాపక శక్తి , వర్కింగ్ మెమరీ ఇంకా స్టోర్డ్ మెమరీ అని ప్రధానం గా రెండు రకాలు గా ఉంటుంది. మనము ఏ  పని చేయాలన్నా , ఈ రెండు రకాల మెమరీ కూడా అవసరం. ప్రత్యేకించి  వర్కింగ్ మెమరీ , పరీక్షలు రాసే సమయం లో ముఖ్యం గా అవసరం ఉంటుంది. ఎందుకంటే , ఇచ్చిన ప్రశ్నను అర్ధం చేసుకుని,మన మెదడులో నిక్షిప్తమై ఉన్న మెమరీ అంటే అంతకు మునుపు నేర్చుకున్న , విజ్ఞానాన్ని  గుర్తు చేసుకుంటూ ,  సమాధానం రాయడం జరుగుతుంది. పరీక్షల ముందు తీవ్రం గా ఆందోళన చెందిన విద్యార్ధులు ,  ఈ వర్కింగ్ మెమరీ ను సరిగా ఉపయోగించ లేక పోతారని తెలిసింది. ఎందుకంటే ఆందోళనా, యాంగ్జైటీ లు ,వారి వర్కింగ్ మెమరీ ను కొంత మేర వినియోగించు కుంటాయి , దానితో ప్రశ్నలకు , సమాధానాలు రాయడానికి సరిపోయేంత వర్కింగ్ మెమరీ మిగిలి ఉండదు. మరి ఈ సమస్యను అధిగమించడం  కష్టమేమీ కాదంటారు , మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు. అది ఎట్లా అంటే , వారు ఎక్స్ ప్రెసివ్ రైటింగ్ అనే పధ్ధతి ని అనుసరించాలి.
ఎక్స్ ప్రెసివ్  రైటింగ్ అంటే ఏమిటి : ఈ పధ్ధతి లో విద్యార్ధి చేయవలసినది ,పరీక్ష రోజుకు ముందు , కేవలం పది నిమిషాలు తన ఆందోళన లనూ , యాంగ్జైటీ లనూ ,ఇంకా పరీక్ష గురించి తనకు ఉన్న భయాలనూ , ఒక పేపర్ మీద రాయడమే ! ఇట్లా చేయడం వల్ల  వారు, వారి భయాందోళన లను తాత్కాలికం గా , తమ మెదడు లోనుంచి తీసివేసి , పేపర్ మీద పెడుతున్నారన్న మాట ! ఇట్లా చేయడం వల్ల  పరీక్ష ముందు, విద్యార్ధుల భయాందోళన లు ఇంకా ఎక్కువ అవ గలవని కొందరు సందేహాలు వెలిబుచ్చినప్పటికీ , అనేక పరిశీలనల వల్ల , ఈ పధ్ధతి పాటించడం వల్ల  విద్యార్ధులకు మార్కులు ఎక్కువ గా వస్తున్నాయని తెలిసింది. ఎందు వల్ల నంటే , ఇట్లా పేపర్ మీద రాసుకున్న విద్యార్ధులకు , ఉపయోగించడానికి , వారి వర్కింగ్ మెమరీ పూర్తిగా వినియోగం లోకి వస్తుంది ( భయాందోళన లు పేపర్ మీదకు మార్చ బడ్డాయి కాబట్టి )  ఈ పరిస్థితిని ఇంకో ఉదాహరణ ద్వారా వివరించ వచ్చు.  మనం కంప్యూటర్  వాడుతున్నపుడు , అనేక సైట్లను ఒకేసారి ఓపెన్ చేశామనుకోండి. అప్పుడు  మనకు కావలసిన సైటు మనకు దొరకడం ఆలస్యం అవుతుంది ఎందుకంటే, కంప్యూటర్  లో మెమరీ ఎక్కువ ఉన్నా కూడా , వర్కింగ్ మెమరీ , అంటే ప్రాసెసింగ్ పవర్ పరిమితం గా ఉంటుంది కాబట్టి , వీలైనంత వరకూ , మనం ఒక సమయం లో ఒక సైటు నే చూస్తూ ఉండాలి ( ప్రాసెసింగ్ స్పీడు ఎక్కువ గా ఉన్న కంప్యుటర్ లకు ఇట్లాంటి సమస్యలు ఉండవనుకోండి  ! ) 
 
వచ్చే టపాలో మిగతా పద్ధతులు !  

పిల్లలకు, చదువుల్లో, తరచూ పరీక్షలు మంచిదేనా?

In మానసికం, Our minds on ఫిబ్రవరి 8, 2013 at 6:41 సా.

పిల్లలకు, చదువుల్లో ,తరచూ పరీక్షలు మంచిదేనా?

విద్య – క్లాసు రూములు –  పరీక్షలు – ఇవన్నీ చాలా మంది వయసు వచ్చిన   విద్యార్థులకే మనస్తాపం, ఆందోళనా , వత్తిడీ  కలిగిస్తాయన్న విషయం కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా ! ఇటీవల అమెరికా లో జరిపిన పరిశీలనా ఫలితాల వల్ల  తేలిందేమిటంటే , యుక్త వయసు లో ఉన్న విద్యార్థులకే కాకుండా ,  చిన్న వయసు లో ఉన్న బాల బాలికలు కూడా , తమ స్కూళ్ళలో , తరచూ పెట్టే  పరీక్షల వల్ల , సతమతమవుతూ , ఆందోళన  చెందుతూ  ఉంటారని. అంతే  కాక , ఆందోళన చెందుతున్నబాల బాలికలు , తాము రాస్తున్న పరీక్షలలో , తమ ప్రతిభకు తగ్గట్టు గా , ఫలితాలు సాధించ లేక పోతున్నారని , అంటే  పరీక్షా సమయాలలో పడే ఆందోళనా వత్తిడు ల వల్ల , అని తెలిసింది.ఈ రకమైన  పరీక్షా సమయాలలో పడే ఆందోళన కూ , వత్తిడికీ,  వారి ప్రతిభా సామర్ధ్యాలకూ ఉన్న లంకె లేదా ఇంగ్లీషు లో లింకు ను ఈ మధ్యే , మనో వైజ్ఞానిక శాస్త్ర వేత్తలు చేదించడం మొదలు పెట్టారు. అంతే  కాక ,  పరీక్షా సమయాల ముందూ , పరీక్ష రాసే సమయం లోనూ కలిగే వత్తిడినీ , ఆందోళనల నూ  వీలైనంత వరకూ తగ్గించుకుని , తమ ప్రతిభా పాటవాలను సంపూర్ణం గా బహిరంగ పరిచి , ఆ యా పరీక్షలలో , అధిక శాతం మార్కులు తెచ్చుకునే శాస్త్రీయ  మార్గాలు కూడా వీరు సూచిస్తున్నారు ! వీరి సలహాల ప్రకారం  పరిష్కార మార్గాలు సులభమే కాకుండా , ఖర్చు కూడా లేకుండా  ఉండడమే కాకుండా , చాలా ప్రభావ శీలమైనవి గా కూడా ఉంటాయి , ఒక క్రమ పధ్ధతి లో ఆచరిస్తే !  అని ! 

అమెరికా లోని ఒహియో రాష్ట్రం లో ఇట్లా  పరీక్షా సమయాలలో బాలికలలో వచ్చే ఆందోళనలను నివారించడానికీ , వారిని ఎక్కువ ప్రభావ శీలురు గా చేయడానికీ ఒక ప్రత్యెక మైన డిపార్ట్ మెంట్ ఉంది దానికి ఒక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు లిజా డమూర్  ఇట్లా అన్నారు ” బాలికలలో పరీక్షా సమయాలలో వచ్చే ఆందోళనలను నివారించడానికి మేము సూచించిన పద్ధతులు ఖచ్చితం గా సత్ఫలితాలు ఇస్తున్నాయి ” అమెరికా విద్యా వ్యవస్థ లో  ఒక చట్టం ఉంది. అది NCLB  అంటే నో చైల్డ్ లెఫ్ట్ బిహైండ్ ” అంటే అమెరికా విద్యావవస్థ లో ఏ  బాలుడూ , ఏ  బాలికా వెనక పడకూడదని !  ఈ చట్టం వచ్చాక , ప్రతి స్కూల్ లోనూ క్లిష్ట తరమైన పరీక్షా పద్ధతులను పాటిస్తున్నారు. దాని ప్రయోజనం ఏమిటంటే , పరీక్షా పధ్ధతి లో ఉన్నత ప్రమాణాలు పెడితే ,అది , ప్రతి బాల బాలిక లలోనూ అంతర్గతమైన ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికీ , వారి భవిష్యత్తు , ఉజ్వలం గా ఉండడానికీ  తోడ్పడుతుంది ! ” అని. అంతే  కాక ,అమెరికా ప్రభుత్వం , ఈ పధకానికి , కేవలం స్కూళ్ళ లో పరీక్షలకే , 1.7 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది. ( ఒక బిలియన్ డాలర్లంటే వెయ్యి లక్షల డాలర్లు ! )( అంటే , రమారమి వెయ్యి కోట్ల రూపాయలు ! ) 

ఇంత ప్రతిష్టాత్మక , ఇంకా కఠిన తరమైన పరీక్షలలో కనుక  , బాల బాలికలు సరిగా ఫలితాలు సాధించక పోయినట్టయితే , ఆ పరిణామాలు , వారి జీవితాంతం , వారి అవకాశాలను తగ్గిస్తాయి.  అంతే  కాక , చాలా తక్కువ స్కోర్లు వచ్చిన అంటే మార్కులు తెచ్చుకున్న బాల బాలికలు ఎక్కువ గా ఉన్న స్కూళ్ళు కూడా మూత  పడే ప్రమాదం ఉందని , ప్రభుత్వం వారు హెచ్చరించారు ! 
ఈ కారణాల వల్లనే , ఆ దేశం లో పరీక్షా సమయాలలో వచ్చే ఆందోళన మీద ఇంతగా పరిశోధనలు చేసి ఉపాయాలు సూచిస్తున్నారు ! వారి అంచనా ప్రకారం,ఈ ఆందోళనలను ఆదిలోనే తుంచి వేస్తే  మంచిది, లేక పొతే  ఈ ఆందోళన లూ , యాంగ్జైటీ లూ , వారి జీవితాంతం వారిని వెన్నాడుతూ , వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి ” అని తేల్చారు !  ఈ మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు సూచించిన సలహాలు , ఉపాయాలు ఏ  దేశం లో విద్యార్ధి కైనా వర్తిస్తాయి కదా అందుకే , మరి వచ్చే టపాలో ఈ ఉపాయాలను గురించి తెలుసుకుందాము ! 
 

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు. 4.కర్తవ్యం ?

In మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 5, 2013 at 8:57 సా.

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు. 4. కర్తవ్యం ?

 ఋణ  బంధాలలో చిక్కుకునే వారికి , ఇంగ్లండు లో ఒక అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ గారు ఇచ్చే  సలహా చూడండి !
1. మీకు ఉన్న ఆర్ధిక పరిస్థితులు మీ మానసిక ఆరోగ్యాన్ని ఏ విధం గా ప్రభావితం చేస్తున్నాయో  పరిశీలించండి, కొంత సమయం తీసుకుని. ప్రత్యేకించి , తీవ్రమైన వత్తిడి కి లోనవడమూ , లేదా డిప్రెషన్ కో ,నిద్ర లేమి కో లోనవడమూ  కూడా మీరు నిశితం గా పరిశీలించు కోవాలి. అట్లాగే ,మీరు చీటికీ మాటికీ, చీకాకు పడడం , ప్రత్యేకించి , మునుపెన్నడూ లేని విధం గా అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడే , ఈ చీకాకూ , అశాంతీ , ఆందోళన లక్షణాలు కనిపిస్తాయి ! 
2. ప్రత్యేకించి , మీరు మీ ఆలోచనా ధోరణి సరిగా ఉందో  లేదో అని రోజూ లేదా తరచూ  ఆత్మావలోకనం చేసుకోవాలి ! అప్పులు పాపాల పుట్ట లా పెరుగుతున్నా , ఏమీ పట్టనట్టు,  ” ఆనందో బ్రహ్మ ” అనే  ఆత్మ  వంచన కు మీ ఆలోచనలు మిమ్మల్ని గురిచేస్తున్నాయా ? లేదా పెరుగుతున్న అప్పులు , మిమ్మ్మల్ని నిరాశావాదులు గా , నిర్వీర్యులు గా చేస్తూ , మీకు జీవితం మీద వైరాగ్యం లేదా నెగెటివ్ అంటే నిరాశావాదపు ఆలోచనలూ , ఈ లోకం లో జీవించి ఉండడం అనవసరం ” అనే విధం గా  మీ చేత ఆలోచింప చేస్తున్నాయా ?పైన వివరించిన రెండు పద్ధతులూ అప సవ్యమైనవే అని ఎవరూ చెప్పకనే మనకు తెలుస్తున్నాయి కదా ! అందువలన  మీ ఆలోచనా ధోరణి పాజిటివ్ దృక్పధం తో ఉండాలి . మీ అప్పులు పెరుగుతున్నా , మీ ఆలోచనలు గాడి తప్పకూడదు ! 
3. మీరు ఎక్కువ సమయం పడక లోనే గడుపుతూ, మీ సొంత వాళ్ళనూ , మీ స్నేహితులకు మీ ముఖం చూపించ కుండా , మీరు తీర్చ వలసిన అప్పు ల గురించే దీర్ఘం గా ఆలోచిస్తున్నారా ? అయితే అది కూడా ఒక తిరోగమన చర్యే ! 
అయితే , మీరు చేయ వలసినది ఏమిటి ? : 
ఎట్టి  పరిస్థితులలోనూ  మీ ప్ర ప్రధమ కర్తవ్యం  ” మీ జీవితం ఎంత విలువైనదో గుర్తుంచు కోవడం ” ఈ విశాల ప్రపంచం లో మీరు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన , ఒక ప్రత్యేకమైన వ్యక్తి ! అంతే  కాక మీ జీవితం ఎంతో  అమూల్యమైనది.  మీరు ఎంత అప్పు చేసినా , మీరు ఎంత తీర్చలేక పోయినా , ఆ అప్పు కన్నా మీ ప్రాణం ఎంతో  మిన్న !  అందు చేత మిమ్మల్ని మీరు ఏ  విధమైన హానీ చేసుకో కూడదు !  తిరోగమన చర్యలు చేపట్టడం ఏ  విధం గానూ సమంజసం  కాదు , సమర్ధనీయం కాదు , హేతు బద్ధం కాదు !  మీరు అప్పు ల ఊబి లో నుంచి బయట పడే ముందు , ఏ  రకమైన నెగెటివ్ ఆలోచన ల ఊబి లోనూ కూరుకు పోకుండా మీరు జాగ్రత్త వహించాలి  ! నిండా మునిగిన వారికి చలి ఏమిటి ఇంకా అనే ” పలాయన వాదం ” తో చాలా మంది , తాగుడు , జూదం , సిగరెట్టూ , ఇట్లా రక రకాల వ్యసనాలకు బానిస లవుతుంటారు ! తెలిసి తెలిసీ ఒక విష వలయం లో కూరుకు పోతుంటారు , అది చాలా   పొర పాటు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 

 

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 4, 2013 at 10:37 ఉద.

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

అప్పు గురించిన వాస్తవాలు : 
ప్రతి నలుగురిలో ఒకరిని  జీవితం లో ఏదో ఒక సమయం లో మానసిక రుగ్మత కానీ వ్యాధి కానీ బాధిస్తుంది.అట్లా బాధింప బడే ప్రతి నలుగురిలో  ఒకరికి అప్పు సమస్యలు ఉంటాయి. అప్పు సమస్యలు ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి  మానసిక రుగ్మతలు , లేదా వ్యాధులు ఉంటాయి.
మానవులు అప్పు ఊబి లో ఎట్లా కూరుకు పోతారు ? :
1. జీవిత చక్రం లో మార్పులు : అంటే  ఉద్యోగం పోవడమో, అయిన వాళ్ళతో విడి పోవడమో , లేదా మరణించడమో , విడాకులు తీసుకోవడమో లాంటి ఊహించని పరిణామాలు వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితిని  విషమం చేస్తాయి.
2. అనుకోకుండా సంభవించిన అనారోగ్యం కూడా  మానవులను మంచానికి కట్టి  పడేయడమే  కాకుండా , వారి కంచం లో కూడా ఆహారానికి వెతుక్కునే పరిస్థితి కలిగిస్తుంది.
3. చేస్తున్న ఉద్యోగం లో కూడా , చాలీ చాలని జీతాలు వస్తూ , అవసరాలు ఎక్కువ గా ఉన్నప్పుడు .
4. విచ్చల విడి గా ఖర్చు చేయడం , ( మ్యానియా అనే మానసిక పరిస్థితి లో కూడా  విచక్షణా రహితం గా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది . )చాలా మంది మానవులు , శాస్త్రీయం గా మానసిక శాస్త్ర నిపుణు డయిన డాక్టర్ చూడక పోయినా , ఇట్లాంటి మానసిక స్థితి లో ఉంటారు, మితి మీరి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు వ్యాపారస్తులకు ప్రియం. ఎందుకంటే , వారు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటే  వ్యాపారస్తులు అంత  లాభ పడుతూ ఉంటారు.
5. తీసుకున్న అప్పు తీర్చక పోవడం.
6. కట్టవలసిన బిల్లులు ( నెల వారీ )  అశ్రద్ధ చేసి కట్టక పోవడం. 
అప్పు చేసిన వారి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది?:
1. పరిస్థితి చేయి దాటి పోతున్నట్టూ , అందుకు తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నట్టూ  భావిస్తూ ఉంటారు.
2. నిరాశా వాద పరిస్థితిలో , ప్రత్యేకించి , తీర్చ వలసిన అప్పు రోజు రోజు కూ  ఎక్కువ అవుతుంటే !
3.తీవ్ర మైన స్వీయ అపరాధ భావనలు: అంటే ఆ పరిస్థితి కంతటికీ తామే కారణమనీ , ప్రత్యేకించి వారికి , శరీర లేదా మానసిక ఆరోగ్య కారణాలు ఉన్నప్పటికీ , తీవ్రం గా తమను తాము నిందించు కుంటూ , మనస్తాపం చెందడం !
4. డిప్రెషన్ కూ  , అందోళన కూ  లోనవడం !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 3, 2013 at 11:04 ఉద.

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

 
సాధారణం గా మనమందరమూ , అప్పు చేయడానికి  సందేహిస్తూ ఉంటాము. మన ఆదాయం మించి ఖర్చులు అవుతున్నప్పుడు కంగారు పడతాము. ఎవరి దగ్గర అప్పు చేయ వలసి వస్తుందో అని, అప్పు చేయడానికి కూడా సంకోచిస్తూ ఉంటాము. వీలైతే  అప్పు లేని జీవితం గడుపుదామని అనుకుంటాము.కానీ వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ , ఆదర్శాలకూ , ఆశయాలకూ భిన్నం గా ఉంటాయి కదా ! మనం, మన పరిస్థితులకు , క్రెడిట్ కార్డులు ఎంతవరకు కారణమో చూద్దాం !
అప్పు చేసే వారికి క్రెడిట్ కార్డ్ లు ” దేవుడిచ్చిన ” వరం !  ఈ ప్రపంచం లో   అనేక కోట్ల మందిని ఒక్క సారిగా ఋణ గ్రస్తులను చేయడానికి ఉపయోగ పడే అతి చిన్న సాధనం ! అనేక పరిశీలనల వలన మనం కరెన్సీ అంటే డబ్బు నోట్ల రూపం లో మన చేతుల్లో ఉన్నప్పుడు , ఖర్చు చేయడానికి వెనుకాడు తాము , కానీ క్రెడిట్  కార్డు ఉన్నప్పుడు , ఆ జంకు  పోయి ” హుందాగా ”  క్రెడిట్ కార్డ్ ఫ్లాష్ చేస్తూ ఉంటాము.మన చేతిలో ఉన్న డబ్బు తో కాకుండా క్రెడిట్ కార్డు ఇచ్చి కొన్న వస్తువులను , ఆనందం గా కొంటాము !  ఆ సమయం లో మనం అనుభవించే ఆనందం, డబ్బు పెట్టి ,కొనే సమయం లో వచ్చే ” విచారాన్ని ” కను మరుగు చేస్తుంది ! మన మానసిక స్థితిని క్రెడిట్ కార్డ్ ఆ విధం గా ట్యూన్ చేస్తుంది. చాలా పరిశీలనల వల్ల , మన చేతిలో డబ్బు నోట్ల రూపం లో ఉన్నప్పుడు , మనం జాగ్రత్త గా ఆచి తూచి ఖర్చు చేస్తూ ఉంటాం అని తెలిసింది.
చాలా మంది  చేయని ఇంకో పని ఉంది ! అది డబ్బు విలువ తెలుసుకోవడం ! అంటే  డబ్బు గురించి మనకు ఉన్న అవగాహన ఏమిటి ? మన జీవితాలలో డబ్బుకు  ఏ  స్థానం ఇస్తున్నాము, ఇవ్వదలుచుకున్నాం , ఇవ్వ బోతున్నామనే విషయాలను , వివరం గా తెలుసుకోవాలి. కేవలం మనకు ఉన్న డబ్బు బట్టే , మన ఆస్తిత్వమూ , ఉనికీ ఆధార పడి ఉందా?  ఆ విధమైన ఆలోచన ఇంకేవరిదోనా , లేక మన నమ్మకమా ? డబ్బు లేక పొతే మనం లేమా ? !  ఈ  ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు రాబట్టు కావడానికి  ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి , తమంత తామే ! 
క్రెడిట్ కార్డు తో ”  ఋణాను బంధం ” ఎట్లా పెరుగుతుంది?:
ఒక ఉదాహరణ : లక్ష రూపాయలకు ఒక ఆకర్షణీయమైన టెలివిజన్, కనుక మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నట్టయితే , దానికి  మీరు మినిమమ్ పేమెంట్ కేవలం నెలకు వెయ్యి రూపాయలు  అనుకుంటే ,కనీసం  నూట యాభై నెలలు కడుతూ ఉండాలి , వడ్డీ తో కలిపి !  మీరు ఆ సమయం  అంటే కనీసం పన్నెండు సంవత్సరాలకు పైగా , నెలకు వెయ్యి రూపాయలు కడుతూ ఉంటే , కనీసం లక్షన్నర రూపాయలకు పైగా మీరు మీ శ్రమ ఫలితాన్ని క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పు తీర్చడానికి ధార పోయాల్సిందే కదా !  అదే మినిమమ్ పేమెంట్ లో ఉన్న కిటుకు ! మానవులను దీర్ఘ కాలికం గా ” ఋణ గ్రస్తులను ” చేయడమే !  అదే మీరు ( మీ కోరికలను నియంత్రించుకుని ) ఆ టెలివిజన్ కొనకుండా, మీ డబ్బును  నెలకు వెయ్యి రూపాయల చొప్పున బ్యాంకు లో వేసుకుంటే ( వచ్చే వడ్డీ తో సహా  ) మీకు ఎంత  డబ్బు జమా అవుతుందో ఊహించుకోండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు.1.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 1, 2013 at 9:21 ఉద.

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు.1. 

 
అప్పు చేసే వారి రకాలు :  గ్యారెట్ సటన్  అనే రచయిత  అప్పు తీసుకునే వారిని ముఖ్యంగా నాలుగు రకాలు చేశాడు ! ( ఇది ముఖ్యం గా అమెరికనుల ను దృష్టి లో ఉంచుకునే అయినా , ప్రపంచీకరణ పర్యవసానం గా ఇతర దేశాల వారికి కూడా వర్తిస్తుంది ! ) 
1.Wishers ( అభిలాషులు ) :  ఈ రకానికి చెందిన వారు , ఎప్పుడూ తాము తీసుకున్న అప్పును సకాలం లో తీర్చి వేయగలమనే , ఆశాభావం తోనూ , ధీమా తోనూ ఉంటారు.వారికి , వారు మొత్తం మీద వారు చేసే ఖర్చులమీద వారికి ఏమాత్రం అవగాహన , దూర దృష్టీ ఉండదు ! పర్యవసానం గా , ఎక్కువ వడ్డీలూ , అవి ఇంతింతై , కొండంత అయి , వారు తీర్చలేక పోలేమనే ఆలోచనా  వారికి  ఏమాత్రం ఉండదు. వారికి కేవలం ” తాత్కాలికం గా అంటే ప్రస్తుతం , విషమ పరిస్థితిని దాట  దానికి ఎంతో  కొంత నెలకు కడితే , సరిపోతుంది కదా , మనమీద వత్తిడి లేకుండా ” అనే  ( అప ) నమ్మకం తో ఉంటారు ఎప్పుడూ !  వీరు సామాన్యం గా పెద్ద పెద్ద మతపరమైన పండగలకు విపరీతం గా ఖర్చు పెడుతూ ఉంటారు ! ఇంకా వారు , వారికి మంచి ఉద్యోగం వచ్చి వారి అప్పులన్నీ తీర్చివేయగలమనే , ఫాల్స్ కాన్ఫిడెన్స్ లేదా అప విశ్వాసం తో ఉంటారు !  వీరంటే అప్పు ఇచ్చే వారికి అమితమైన ప్రేమ ! 
2.Wasters ( వ్యసన పరులు ) : ఈ రకానికి చెందిన వారిలో ఆత్మ విశ్వాసం చాలా కొరవడుతుంది, ఇంకో రకం గా చెప్పాలంటే, ఆత్మ న్యూనతా భావం అధికం గా ఉంటుంది. దానితో, ఏ సమయం లోనైనా వారికి విసుగు గా కానీ , డిప్రెషన్ గా గానీ అనిపించినప్పుడు , వెంటనే ,  ” తమ ” ” స్నేహితులతోనో , బంధువులతోనో ” ” బజారున ” పడతారు , తమ ఇష్టం వచ్చిన వస్తువులను కొంటారు , ఎంత ధర ఉన్నా , వారికి వస్తువు ధర, విలువ ల మీద ఏమాత్రం అవగాహన ఉండదు. అంతేకాక వారు , చూసిన ప్రతి వ్యాపార ప్రకటన నూ  పదే  పదే  మననం చేసుకుంటూ , మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ పరికరాలనూ ,  వస్త్రాలనూ , కోనేస్తూ ఉంటారు. ముఖ్యం గా వీరికి , డజన్ల కొద్దీ క్రెడిట్ కార్డ్ లు ఉంటాయి. అప్పు తీర్చ లేక పోతున్నా , క్రెడిట్ కార్డు లు మార్చి మార్చి , తమ కు ” కావాలను కున్నవి , అవసరం ఎక్కువ లేకపోయినా కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీర్చ లేక తంటాలు పడుతూ ఉంటారు !  వీరూ అప్పు ఇచ్చే వారికి చాలా ఇష్టం.
3.Wanters ( తక్షణ వాంఛ కులు ) : వీరు  యమ స్పీడు. వారికి కావలసినవి , వస్తువులు కానీయండి , వాహనాలు కానీయండి , ఎంత ఖర్చు అయినా , ఎట్టి  పరిణామాలు వారు ఎదుర్కోవలసి వచ్చినా , కొనేస్తారు వెంటనే , ఇక్కడ గమనించ వలసినది , వారికి చాలా సమయాలలో వారి డబ్బు ఉండదు అంటే సొంత డబ్బు ఉండదు. అందువల్ల అప్పు చేసి అయినా సరే, వారు అనుకున్న వస్తువులు కొంటారు , వెంటనే ! వారి మానసిక పరిస్థితి ని  ఇన్స్ స్టెంట్  గ్రాటి ఫికేషన్  ( instant gratification ) అని అంటారు. ఈ లక్షణం లో , మానవులకు ఓపిక ఏమాత్రం ఉండదు. అంటే పేషన్స్ ! వారు వేచి యుండడం సహించ లేరు !  ఇంకా స్పష్టం గా చెప్పాలంటే , సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమ శిక్షణ వారికి ( అలవాటు ) ఉండదు !  వీరు కూడా అప్పు ఇచ్చే వారి  గుడ్ బుక్స్ లో ఉంటారు ! ఈ పరిస్థితిని శాస్త్రీయం గా ఒక యాభై ఏళ్ల  క్రితం, శాస్త్రజ్ఞులు ఒక చిన్న  ప్రయోగం తో నిరూపించారు.
ఈ ప్రయోగాన్ని మార్ష్ మెలో  ప్రయోగం అని అంటారు !  ఈ ప్రయోగం అమెరికా లో జరిగింది స్టాన్ ఫర్డ్ అనే నగరం లో నాలుగు సంవత్సరాల వయసు ఉన్న బాల బాలికల మీద ! వారందరికీ ” మీరు తినడానికి మార్ష్ మెలో  ఇస్తాము ( మార్ష్ మెలో  అంటే ఒక రకమైన పీచు మిఠాయి  ) మీరు వెంటనే తెనేట్టైతే ఒకటి , లేదా పదిహేను నిమిషాల తరువాత తినేట్టైతే , రెండు ఇవ్వడం జరుగుతుంది ” అనే షరతు పెట్టారు !  అప్పుడు రెండు రకాల ప్రవర్తనను వారు గ్రహించారు ! ఆ గ్రూపు లో సగం మంది ఆ మార్ష్ మెలో  తీసికొని వెంటనే ( అంటే ఒకటే ! )  తినేశారు !  కానీ ఇంకో సగం మంది , పదిహేను నిమిషాలూ ఆగి రెండు తీసుకుని తిన్నారు !   అంత వరకూ సరే  ! కానీ శాస్త్రజ్ఞులు ఆ రెండు గ్రూపులనూ కనీసం మూడు దశాబ్దాల పాటు అంటే ముప్పై ఏళ్ల  వయసు వరకూ పరిశీలించారు !
వారికి ఒక ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది.  ఒక మిఠా యే , వెంటనే తీసుకు తిన్న వారు ,  ఆత్మ న్యూనతా భావం తో పెరిగి పెద్ద వారై , ఏవో అంతంత మాత్రం చదివి , చాలీ చాలని ఉద్యోగాలతో ,  ఆందోళన మయ వివాహ సంబంధాలతో , ఒడు దుడుకుల జీవితాలు గడుపుతున్నారుట ! కానీ , పదిహేను నిమిషాలు ఆగి రెండు మిఠాయి లూ తిన్న వారు బాగా చదువుకుని , ఎక్కువ జీతాలతో , స్థిరమైన వివాహ బంధాలతో , ప్రశాంతమైన జీవితాలు గడుపుతున్నారుట ! ఒక పరిశీలన ప్రకారం , ఇట్లా సెల్ఫ్ డిసిప్లిన్ లేని వారు , అమెరికా లో లక్షలలో ఉండి , అనేక కష్టాలకు లోనవుతున్నారని ! ( మిగతా దేశాలలో వీరి సంఖ్య ఏమాత్రం తక్కువ గా ఉండదు ! ) 
4.Winners ( విజయులు )  : ఇక ఈ రకానికి చెందిన వారు బహు జాగ్రత్త పరులు: వీరికి  అప్పు ఊబి లో కూరుకు పొతే బయటకు రావడం ఎంత కష్టమో స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు అనవసరమైన ఆర్భాటాలకు పోరు. ప్రతి వస్తువునూ  ఆచి తూచి కొంటారు !  ఒక ఇల్లు ఉంటే , ఆ ఇంటికి చేసిన అప్పు వారే తీరుస్తూ ఉండక ,ఒక గది అద్దెకు ఇచ్చి , ఆ వచ్చే అద్దె ను కూడా అప్పు తీర్చడానికి వాడతారు !, పది టెరీ కాట్ చొక్కాలకు బదులు , నాలుగు నూలు చొక్కాలు , ఉంటాయి వీరికి, హాయి గా !   చాలా వరకు, వీరు తమ వాంఛ లను నియంత్రించు కొనగలిగే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. వీరు దీర్ఘ కాలికం గా, జీవితం లో బాగా స్థిర పడతారు. మనశ్శాంతి కూడా వీరికి ఏర్పడుతుంది, కనీసం ఆర్ధికం గా !  వీరిని అప్పు ఇచ్చే వారు అదోలా చూస్తారు ! ” వీడు ఎక్కడనుండి  దాపురించాడు రా ” అనుకుంటారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on జనవరి 31, 2013 at 11:57 ఉద.

అప్పు  తో మనశ్శాంతి కి ముప్పు ! 

 
 
అప్పు గొని సేయు విభవము …….. దెప్పరమై మీద గీడు   దెచ్చుర సుమతీ ! అన్నాడు సుమతీ శతక కారుడు ! 
ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికీ అప్పు గురించి తెలియదు అంటే  నమ్మ లేము ! ఎప్పటికప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా , అప్పు చేసి , కనీస అవసరాలు తీర్చు కునే వారు కొందరైతే ,  అత్యాశకు పోయి , ఆడంబరాలకు , వ్యసనాలకూ  కూడా అప్పులు చేసి బేజారు చెందే వారు కొందరు. తీర్చలేక బజారు న పడే వారు కొందరు ! ఈ అప్పుకు , లింగ భేదం , వయసు , కులం , జాతి , మతం తో సంబంధం లేదు ! ఎవరినైనా ఇట్టే  పట్టేస్తుంది , జలగ లాగా ! కొందరు తీసుకున్న అప్పును మర్చిపోతారు ! మరి కొందరు , తీర్చ వలసిన అప్పు గురించి ఆలోచిస్తూ , ఆందోళన పడుతుంటారు ! ఇంకా అమాయకులు , తమ సంతానాన్ని వెట్టి చాకిరికి గురి చేస్తారు ! ఈ అప్పు తీర్చడం కోసం ! , అనేక గ్రామాలలో , ఇంకా ఇట్లా జరుగుతూ ఉండనే విషయం సత్య దూరం కాదు ! అప్పు కూ , ఆమాట కొస్తే , మానవ జీవన శైలికీ , అతడి ఆర్ధిక స్థితి కీ విడదీయ రాని  సంబంధం ఉంది.
కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా  చంద్రుడి మీదకు ” అపోలో ” ను పంపినపుడు , ఒక తెలుగు కార్టూనిస్టు, అమెరికనులు ” అపోలో ” అపోలో ” అంటూ ఉంటే , మన ( భారతీయులు  ) అప్పులో , అప్పులో అంటూ ఉన్నట్టు  గీశాడు ! ప్రస్తుతం , భారత దేశ ఆర్ధిక స్థితి కొంత మెరుగైనా కూడా , చాలా మంది ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని అనేక తాజా పరిశీలనలు తెలుపుతూ ఉన్న్నాయి కూడా ! 
ఈ అప్పు మానవులకు చేసే కీడు  అంతా ,ఇంతా కాదు.!  మనం రోజూ చూస్తూ ఉంటాము వివిధ వార్తా పత్రికలలో , అప్పు తీర్చలేక ( ఒక్కో సమయం లో కుటుంబం తో సహా ) ఆత్మహత్య లు చేసుకుంటున్న  వారిని.  వేలకొద్దీ మరణిస్తున్న రైతులు , పంట చేతికి రాక , చేసిన అప్పులు తీర్చ లేక  చేసుకునేవి  ఆత్మ హత్యలే ! అంత  తీవ్రం గా కాక పోయినా , లక్షలాది ప్రజలకు మనశ్శాంతి దూరం చేస్తుంది , ఈ అప్పు !  
మరి ఈ అప్పు గాడి సంగతి మనం శాస్త్రీయ కోణం లో చూడ చూడడానికి ప్రయత్నిద్దాం !  వాడికి దూరం గా ఉండే మార్గాలున్నాయేమో  కూడా తెలుసుకుందాం, వచ్చే టపా నుంచి ! 
   

సోషల్ ఫోబియా కు చికిత్స .5.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on జనవరి 30, 2013 at 10:28 ఉద.

సోషల్ ఫోబియా కు చికిత్స .5.

సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ :  ఈ ట్రైనింగ్ లో కొత్త ప్రదేశాలకు వెళ్లి నపుడు, కొత్త వారితో పరిచయాలు ఎట్లా మొదలు బెట్టాలి ?, సంభాషణ ఎట్లా మొదలు బెట్టాలి ? అనే విషయాలు  తెలియ చేయడం జరుగుతుంది. అంతే  కాక , మీరు ఇట్లా మాట్లాడడం మొదలు పెట్టే సమయం లో మీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది , మీ చుట్టూ ఉన్న వారు మీరు చెప్పే విషయాలను ఏవిధం  గా అంచనా వేస్తున్నారు , అంటే వారు మీ మీద ఏవిదమైన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ ఉన్నారో కూడా వీడియో ద్వారా  మీరు చూసుకుని , మీ ప్రవర్తనను పాజిటివ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ ట్రైనింగ్ కోర్సు లలో ! 
గ్రే డెడ్  సెల్ఫ్ ఎక్స్ పోజర్ : ఈ పధ్ధతి లో  మీకు ఆందోళన , యాంగ్జైటీ కలిగించే పరిస్థితులను ఒక క్రమ పధ్ధతి లో నోటు చేసుకోవాలి. అంటే అతి తక్కువ ఆందోళన, భయం , యాంగ్జైటీ ల నుంచి ఎక్కువ గా ఆందోళన , ఫోబియా కలిగించే  పరిస్థితులు. తరువాత మీరు ఒక్కో పరిస్థితినీ మీరే , ఎదుర్కోవాలి , మీ తెరపిస్ట్  సలహా , సహాయం తో ,  అంటే మీ అంతట మీరే ఈ పరిస్థితులను ఒక క్రమ పధ్ధతి లో అంటే తక్కువ ఆందోళన కలిగించే పరిస్థితి నుంచి , ఎక్కువ ఆందోళన కలిగించే పరిస్థితి కూడా , విజయ వంతం గా  మ్యానేజ్ చేసుకో గలరు. మీరు ఈ పని ఒక్క సారి గా చెయ్యట్లేదు కాబట్టి , మీ భయాలు కూడా ఎక్కువ అవక , క్రమేణా  తగ్గుతూ ఉంటాయి.
CBT : దీనినే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు : ఈ పధ్ధతి లో ముఖ్యం గా  సోషల్ ఫోబియా , మీ  గురించీ , మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ , ఇంకా మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి , మీకు ఏర్పడిన నిరుపయోగ కరమైన అభిప్రాయాలను , చాలెంజ్ చేసి అంటే వాటిని నిలదీసి , హేతు వాదన తో ఆ ఆలోచనలను మీకు ఉపయోగం కలిగే పాజిటివ్ ఆలోచనలు , అభిప్రాయాలు గా మార్చడం జరుగుతుంది. ఒక ఉదాహరణ : మీరు ఒక కొత్త వ్యక్తి  తో సంభాషణ మొదలు పెట్టారనుకోండి. ఒక పదిహేను నిమిషాల తరువాత , ఆ సంభాషణ ఆగి పోతుంది. మీకు సోషల్ ఫోబియా కనుక ఉన్నట్టయితే , మీరు ఆ సమయం లో ” నాకు ఇంకా మాట్లాడడానికి ఏ విషయాలూ తట్టడం లేదు , ఇక ఏమి మాట్టాడాలో తెలియట్లేదు , నేను ఎప్పుడూ ఇంతే ” అనుకుంటూ , ఆందోళన , యాంగ్జైటీ చెందడం మొదలు పెడతారు. కానీ మీ  తెరపిస్ట్ మాత్రం ఆ సమయం లో ” మీ తో మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తీ  మీ లానే , మాట్లాడడానికి విషయాలు ఏవీ లేక , మాట్లాడ లేక పోతూ ఉండ వచ్చు , కేవలం మిమ్మల్ని విమర్శించు కొనవసరం లేదు కదా ” అని మీకు పాజిటివ్ దృక్పధం నేర్పుతాడు.  
సోషల్ ఫోబియా కు మందుల తో చికిత్స ఉందా ?:  
పైన చెప్పిన  పద్ధతులు సోషల్ ఫోబియా పోడానికి సరి యైన మార్గాలు.  వాటన్నిటినీ  ఆచరించి , అయినా తగ్గని పరిస్థితులలోనే , మందుల సహాయం తీసుకోవాలి.ఇంకా కొన్ని ప్రత్యెక పరిస్థితులలో , అంటే సోషల్ ఫోబియా తో పాటుగా డిప్రెషన్ కూడా ఉంటే  , మందుల అవసరం ఉంటుంది. అప్పుడు ప్రత్యెక నిపుణుడి సహాయం అంటే సైకి యా ట్రిస్ట్  సలహా తీసుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !