Our Health

Archive for the ‘మానసికం’ Category

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 28, 2013 at 11:32 ఉద.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం. 

 
పథ్యం మానకు అతివా, అను నిత్యం ,
నీ అందం చెదరదు, ఇది సత్యం!
నీ  మనసు కూడా  పదిలం !
నీ సొగసూ అపుడే  పగడం !
 

 
టీలోజెన్ ఎఫ్లూవియం స్త్రీలలో జుట్టు ఊడి పోవడానికి అతి ముఖ్యమైన పరిస్థితి లేదా జబ్బు. దీనిని గురించి మనం వివరం గా తెలుసుకుందాం ! 
కేశ ఫాలికిల్స్ సంఖ్య లో మార్పు రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. T E  ( టీలోజెన్ ఎఫ్లూవియం కు సంక్షిప్త నామం లేదా షార్ట్ ఫామ్ ) తల మీద కేశాలు నిరంతరం పాతవి పోతూ , కొత్తవి వస్తూ ఉంటాయి. ఈ క్రియల మధ్య ఉండే కాలాన్ని లేదా దశను టీలోజెన్  అని అంటారు. అంటారు ఇది సహజమైన దశే  అయినా , కొన్ని పరిస్థితులలో సాధారణ సమయానికంటే ఎక్కువ సమయం ఉండడం వల్ల , కొత్త జుట్టు రాక  పోవడం ,ఆలస్యమవుతూ ఉంటుంది . ఈ లోగా రోజూ సహజం గా ఊడి పోయే జుట్టు పోతూ ఉంటుంది.  ఫలితం గా జుట్టు పలుచ బడి పోతూ ఉంటుంది. 
ఇట్లా పలుచ బడి పోవడం ముఖ్యం గా మూడు రకాలు గా జరుగుతుంది. 
1. అకస్మాత్తు గా కలిగే షాక్ వల్ల : షాక్ కలిగిన ఒకటి రెండు నెలల నుంచి , కేశాలు పెరిగే దశ కాస్తా విశ్రాంతి తీసుకుంటుంది. అంటే దీనిని రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. ఈ రకమైన షాక్ ల ప్రభావం తాత్కాలికమే ! అంటే కనీసం నాలుగు నుంచి ఆరు నెలల కాలం లోగా మళ్ళీ సహజం గా అంటే ఇది వరలో ఎన్ని వెంట్రుక లైతే వచ్చేవో అన్నీ మామూలు గా వస్తాయి ( లేదా మొలుస్తాయి ). ఒక సంవత్సరం లోగా పూర్తి గా నార్మల్ గా అవుతుంది తల మీద పరిస్థితి !
2. రెండో రకమైన టీలోజెన్  లో తలమీద జుట్టు ఊడి పోవడం ఆలస్యం అవుతుంది కానీ దానితో పాటుగా , మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చే మధ్య సమయం , అదే టీలోజెన్  పరిస్థితి ఎక్కువ కాలం ఉంటుంది. గమనించ వలసినది టీలోజెన్  అంటే రెస్టింగ్ దశ ! ఈ రెస్టింగ్ దశ ఎంత సాగుతూ ఉంటే కొత్త వెంట్రుకలు రావడం కూడా అంత ఆలస్యం అవుతూ ఉంటుంది.కేశాల ఫాలికిల్స్ సరిఅయిన సంఖ్య లోనే ఏర్పడుతూ ఉంటాయి కానీ వాటిలో కేశాలు మాత్రం పెరగవు ఈ రకం లో.  ఈ రకమైన టీలోజెన్ లో సామాన్యం గా   ఆ వ్యక్తి  అనుభవిస్తున్న సమస్య లేదా వత్తిడి కలిగించే పరిస్థితి , పరిష్కారం కాక , కొనసాగుతూ ఉంటే , జుట్టు రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. 
3. ఇక మూడో రకమైన T E లో వెంట్రుకలు కురచగా నూ త్వర త్వరగానూ వస్తూ ఊడి పోతూ ఉంటాయి. దీనికి కారణం, వెంట్రుకలు పెరిగే సహజ దశలో అవక తవకలు జరగడం. 
పైన తెలుసుకున్న వాటిలో మొదటి రెండు రకాల టీలోజెన్ కూ , తీవ్రమైన శారీరిక వత్తిడి కానీ , మానసిక వత్తిడి కానీ కారణాలు. ఈ మూడు పరిస్థితులలో కూడా జుట్టు పలుచ బడుతుంది , కానీ పూర్తి గా రాలి పోదు. అంతే కాక సాధారణం గా ఈ మూడు పరిస్థితులూ తాత్కాలికమే. రెండో పరిస్థితి కొంత ఏర్పడితే , అది ఎక్కువ కాలం కొనసాగ వచ్చు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా?4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 26, 2013 at 7:55 సా.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా?4. 

100 most beautiful women of India Bollywood and others

అలోపీశియా ఏరి యేటా ! 
ఏడాది లో చెబుతుంది టాటా !
ఈలోగా మందులకు  డబ్బు తగ లేయ కంటా ! 
తెచ్చుకోకు, లేని పోని తంటా ! 
 
అలో పీశియా ఏరియేటా : 
క్రితం టపాలో   చూసినట్టు , ఈ పరిస్థితి లో ,  తలంతా కాకుండా   తల మీద అక్కడక్కడా  కొద్ది భాగాలలో   కొంత మేర జుట్టు ఊడిపోవడం జరిగి, ఆయా భాగాలు నున్నగా అవుతాయి. రోగనిరోధక శక్తి కి కారకమయే  కణాలు , స్వంత వెంట్రుకల కణాల మీదే తమ ప్రభావం చూపిస్తూ ఉండడం వల్ల  ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రింద చిత్రాలలో గమనిస్తే , చర్మం మీద ఉండే హేర్  ఫాలికిల్ లో సహజం గా పెరిగే వెంట్రుక , రెండో చిత్రం లో ఖాళీ గా ఉన్న ఫాలికిల్  ( వెంట్రుక పెరగక పోవడం వలన ఏర్పడే పరిస్థితి )  కనిపిస్తాయి.  
మరి,  ఎవరి ఇమ్మ్యునిటీ ,వారి తలలోని  వెంట్రుక మూలాల లో ఉండే కణాలనే  ఎందుకు ముట్టడి చేస్తాయో , కారణం తెలియదు ఇప్పటి వరకూ !  ఈ  జబ్బు 20 సంవత్సరాల లోపు వారికే సర్వ సాధారణం గా కనిపిస్తుంది. యువతులూ యువకులలో సమం గా వస్తుంది. 
మరి అలో పీశియా ఏరి యేటా ను కనుక్కోవడం ఎట్లా ?
స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్  దగ్గర అన్ని ఈ పరిస్థితి గురించిన అన్ని వివరాలూ కనుక్కొని , తల భాగాన్ని పరీక్ష చేసి  రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే  తల భాగం లో కొన్ని వెంట్రుకలను డాక్టర్ లాగి చూడడం కూడా జరుగుతుంది. 
ఇక ఏ ఏ పరీక్షలు అవసరమవుతాయి ?: 
జుట్టు ఊడిపోయే తల భాగం లో కొన్ని వెంట్రుకలను తీసుకుని , వాటిని మైక్రో స్కోప్ క్రింద పరీక్ష చేయడం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోడానికి , థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లు చేయించుకోవాలి. ఎందుకంటే ఒక వేళ  థైరాయిడ్ హార్మోను తక్కువ కానీ , ఎక్కువ కానీ అవడం జరుగుతే , తగిన చికిత్స చేయించుకోవాలి వెంటనే ! జుట్టు ఊడి పోవడానికి థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయక పోవడం ఒక ముఖ్య కారణం , అందుకని , ఆ పరీక్షలు కూడా అవసరం !
ఇక చికిత్స ఎట్లా ఉంటుంది ?:
ఒక సారి ఈ అలోపీశియా ఏరి యేటా  అనే పరిస్థితి లేదా జుట్టు సంబంధమైన జబ్బు స్పెషలిస్టు ద్వారా నిర్ధారణ అయిన తరువాత , చికిత్స చేయించుకోవాలా లేదా అనే నిర్ణయం వారి మీదే ఆధార పడి ఉంటుంది. ముఖ్యం గా గుర్తుంచు కోవలసినది ఏమిటంటే , ఈ పరిస్థితి  వచ్చిన అధిక శాతం మంది లో   కేవలం తాత్కాలికం మాత్రమే ! సామాన్యం గా ఆరు నెలలనుంచి ఒక సంవత్సరం లోగా తిరిగి తలంతా జుట్టు మునుపటి మాదిరి గా పెరుగుతుంది ! ఇక చికిత్స చేయించు కుందామనుకునే వారు కూడా , రెండు పద్ధతులలో చేయించుకోవచ్చు ! ఒకటి   కేవలం తలమీదే  మందులు లేకుండా చేయించుకునే చికిత్స,  తలమీద మందులతో చేయించుకునే చికిత్స .
కేవలం తలమీద చేయించుకునే చికిత్స :
ఈ పధ్ధతి లో మందులు ఏమీ తీసుకో కుండా , వివిధ రకాల కేశాలంకరణ ల ద్వారా , జుట్టు తక్కువ గా ఉన్న ప్రదేశాలను , మిగతా తల భాగం లో ఉన్న జుట్టు ద్వారా కప్పి  ఉంచేట్టు  ఏర్పాటు చేసుకోవడం. ఇది సామాన్యం గా బ్యూటీ షియన్ లు కూడా చేయగలరు. అంటే హేర్ స్టయిల్ లు మార్చడం. అవసరం అవుతే కొన్ని కృత్రిమ కేశాల ప్యాచ్ లను కూడా అతికించడం జరుగుతుంది , తక్కువ గా జుట్టు ఉన్న తల భాగాలలో ! 
మందులతో చేయించుకునే చికిత్స:  మనం పైన తెలుసుకున్నాము కదా , అలోపీశియా ఏరి యేటా  జబ్బు , రోగ నిరోధక కణాలు, వెంట్రుక కణాల మీద పనిచేయడం వల్ల ఏర్పడుతుందని !  అంటే ఆటో ఇమ్మ్యునిటీ ! ఈ పరిస్థితి ని ఇమ్యునో సప్రేసేంట్ మందులు వాడి , తగ్గించ గలుగుతారు. 
స్టీరాయిడ్ లు ఉన్న క్రీములు తల మీద పూయడం ద్వారానూ , లేదా అవసరం అయితే , స్టీరాయిడ్ ఇంజెక్షన్ లు తల మీద చేయడం ద్వారానూ , చికిత్స చేయించుకోవచ్చు !  తల మీద ఎక్కువ భాగం లో కనుక ఇట్లా జుట్టు రాలిపోతూ ఉంటే , పూవా , P U V A  అనే చికిత్స కూడా అవసరం కలగ వచ్చు ! ( ఈ చికిత్స లో మొదట తల మీద  సోరాలిన్ అనే మందు ను పూయడం జరుగుతుంది . తరువాత  తలమీద  అతినీల లోహిత కిరణాలను ప్రసరింప చేస్తారు ! అప్పడు   ఇమ్మ్యునిటీ  సరి అయి ,  కేశ కణాల మీద ముట్టడి తగ్గుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశ వర్ధనం . 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 24, 2013 at 10:54 సా.

స్త్రీలలో కేశ వర్ధనం . 2. 

నీ వాలు జడలో సంపెంగలు, 
ఉన్మత్తుని చేసే నులి వెచ్చని సెగ లు !  

తుమ్మెద రెక్కలు, నీ కురులు !
తగిలితే , ఆ  విద్యుత్తీగలు, 
చేసె,  గజి బిజి గమ్మత్తులు !
రేగె  నాలో, సరాగాల రవ్వలు ! 
అవి పెనవేసే వేయి బంధాల వలలు !
 అతి సున్నితం, ఈ భవ బంధం 
అత్యున్నతం, నీ  మది బంధం !  
 
అని వలచినవాడు   మీ ‘ వలలో ‘  పడి పోవాలంటే,  మీరు,   మీ శిరోజాల మీద శ్రద్ధ వహించాల్సిందే  ! 
 
మరి ఇప్పుడు  స్త్రీలలో కేశాలు ఊడిపోవడం ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకుందాం ! 
1. యాన్ డ్రో జెనిక్ అలోపీశియా :  ( యాన్ డ్రో  జెనిక్ అంటే పురుష హార్మోనుల సంబంధమైన అని , అలోపీశియా అంటే   కేశాలు తక్కువ అవడం అనీ అర్ధాలు,   పెద్ద గా కంగారు అవసరం లేదు  ఈ పదాలు చదివి ! ) :  సాధారణం గా పురుష హార్మోనులు, స్త్రీలలో కూడా అతి తక్కువ పరిమాణం లో ఉంటాయి. ఏ  కారణం చేతనైనా ఈ పురుష హార్మోనులు కొద్ది మాత్రమైనా ఎక్కువ అవుతే , జుట్టు ఎక్కువ గా రాలడం జరుగుతుంది.తల లో ఏదో కొంత భాగం లో కాకుండా , తలంతా, కొద్దిగా  పలుచబడడం జరుగుతుంది, కేశ సాంద్రత తక్కువ అవడం వల్ల.  ఈ పరిస్థితులు , స్త్రీలు గర్భవతులు గా ఉన్నపుడూ , లేదా పురుష హార్మోనులు ఉన్న కాంట్రా సె ప్టివ్  పిల్స్ కొన్ని రకాలు ఉంటాయి , అవి తీసుకోవడం వల్ల  కానీ , లేదా అరుదైన అండాశయాలలో  కణుతులు  ఏర్పడడం , అంటే ట్యూ మర్  ఏర్పడడం వల్ల కానీ , ఏర్పడవచ్చు . ఈ కారణాలలో నివారింప దగ్గవి , గర్భ నిరోధక పిల్స్ తీసుకునే ముందు ,  అవి రాసే డాక్టర్ ను వివరం గా అడిగి ,  పురుష హార్మోనులు లేని పిల్స్ నే మీరు తీసుకోవడం చేయాలి ,  ఆ పిల్స్ మీరు తీసుకోవడం తప్పని సరి  అయే  పరిస్థితులు ఏర్పడితే !
2. టీలోజేన్ ఎఫ్లూవియం :   జీవితం లోనూ , లేదా శరీరం లోనూ కలిగే తీవ్రమైన వత్తిడి కలిగించే పరిణామాలకు రియాక్షన్ లేదా ప్రతి చర్య గా , మీ శిరోజాలు ఊడి పోవడం జరుగుతుంది. ఇట్లా జరగడం సామాన్యం గా ,  వత్తిడి పరిస్థితులు సంభవించిన ఆరు వారాల నుంచి , మూడు నెలల వరకు  ఉండవచ్చు !ఈ సమయం లో సామాన్యం గా ఊడిపోయే తల వెంట్రుకల కన్నా ఎక్కువ గా అంటే వందకు పైగా రోజుకు  ఊడి  పోవచ్చు !
మరి ఈ తీవ్రమైన వత్తిడి కలిగించే పరిస్థితులు ఏమిటి ? : ఇవి ఏవైనా కావచ్చు.  ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ కానీ , ఒక పెద్ద ఆపరేషన్ కానీ , గర్భం దాల్చి శిశువుకు జన్మ నీయడం కానీ , లేదా తీవ్రమైన మానసిక వత్తిడి కానీ అవవచ్చు. ఆశా వాద పరిణామం ఏమిటంటే , సామాన్యం గా  ఈ తీవ్రమైన శారీరిక , లేదా మానసిక వత్తిడి పరిస్థితులు, కేవలం తాత్కాలికం గానే   హేర్ లాస్ అంటే తల మీద జుట్టు ఊడేట్టు చేస్తాయి. అంటే ఆ పరిస్థితులు సద్దు మణిగిన తరువాత , తిరిగి  సహజమైన జుట్టు పెరగడమూ , తక్కువ గానే రోజూ ఊడి పోవడమూ జరుగుతుంది ! కేవలం తక్కువ శాతం స్త్రీలలో త్రమే,టీలోజెన్  పరిస్థితి ఎక్కువ కాలం కొన సాగుతుంది !  అప్పుడు వారు సరి అయిన సలహా తీసుకోవాలి , స్పెషలిస్టు డాక్టర్ ను సంప్రదించి !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో, కేశ వర్ధనం ఎట్లా ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 23, 2013 at 4:11 సా.

 స్త్రీలలో కేశ వర్ధనం ఎట్లా ? 1. 

Young woman with hair blowing in wind

మగువ  ఆనందపు సిరులు, 
స్నిగ్ధ సుకుమార విరులు ! 
కలువ కనులకు శృతి లయలు, 
కనువిందు చేసే కుంతల పాయలు ! 
ఉప్పొంగే  వలపు జల పాతాలు,
కాళ  రాత్రి ని తలపించే శిరోజాలు ! 
మరులూరించే   కురులు, 
కనినంతనే మెదలు ప్రేమ భావనలు ! ‘
 
మరి  ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న శిరోజాలు  ఊడిపోతూంటే ?! 
ఎంతో కోపం వస్తుంది ! చికాకు కలుగుతుంది ! ‘ హత విధీ !  ఎంత అందం గా ఉంటానో అని నా క్లాస్ మేట్స్ ప్రతి రోజూ నన్ను తలుచుకుని పారాయణం చేస్తూ ఉంటారు కదా ! కొందరు  పైకే ప్రార్ధన చేస్తారు ! మరికొందరు మది లో మంత్రోచ్చారణ చేస్తారు కదా ! అట్లాంటిది నా టైం  బాగోలేదా ఏంటి ? అని వనితలు  కారణాలు తెలుసుకోలేక  సతమతం అవుతూ ఉంటారు !  మరికొందరు వనితలు ఆఫీసులో ‘ మిస్  ఆఫీసు ‘ గా అనధికార బిరుదులు  పొందిన వారు కూడా , తమ శిరోజాలకు అతి ప్రాముఖ్యత ఇచ్చి, ఆ కేశాలు కొద్ది గా ‘ రాలినా’ ,  విపరీతం గా వ్యధ చెందుతూ ఉంటారు ! 
మరి జుట్టు ఊడి పోతూ ఉండడానికి కారణాలు ఏమిటి ? : 
స్త్రీలలో సామాన్యం గా ఒక లక్ష వరకూ వెంట్రుకలు ఉంటాయి వారి తలమీద ! సహజం గానే కనీసం రోజుకు యాభై నుంచి ఒక వంద వరకూ కేశాలు ఊడిపోతూ  ఉంటాయి ! ఇట్లా రోజుకు వంద వరకూ వెంట్రుకలు ఊడి పోవడం సర్వ సాధారణ మైన విషయం ! జుట్టు ఊడిపోవడానికి  నాలుగు రకాల ముఖ్య కారణాలు ఉంటాయి: 
1. వంశ పారంపర్యం గా ఒక వయసు వచ్చే ముందే జుట్టు ఊడి పోవడం కనుక , కుటుంబం లో పెద్దల లో సంభవిస్తే , తరువాతి తరాల వారికి కూడా , ఆ లక్షణాలు అనువంశికం గా సంక్రమిస్తూ ఉంటాయి ! 
2. భౌతికమైన కారణాల వల్ల : అంటే శరీరం లో వచ్చే   హార్మోనులలో మార్పులు కానీ , చర్మ సంబంధ వ్యాధులు కానీ , లేదా తల మీద జుట్టు మాత్రమే  ఊడి పోతూ ఉండే కొన్ని ప్రత్యేక  వ్యాధులు వస్తే కానీ , లేదా చర్మ సంబంధ ఇన్ఫెక్షన్ లు వస్తే కానీ. 
3. మానసిక కారణాల వల్ల : విపరీతమైన శ్రమ చేస్తూ , నిద్ర లోపించడం వల్ల ,  పని వల్ల  కానీ , చదువు కారణం గా కానీ , లేదా, ఇంటర్వ్యూ లేదా పరీక్షా సమయాలలో తీవ్రమైన  మానసిక వత్తిడి అనుభవిస్తూ ఉంటే కూడా తల వెంట్రుకలు ఊడి పోతూ ఉండడం జరుగుతుంది ! ఇక్కడ  చాలా సమయాలలో , శరీరం మీద కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా ,  సరిగా తినకుండా , నీరు తాగ కుండా , డీ హైడ్రేట్ అవుతూ ,  దానికి తోడు , నిద్ర కూడా లోపించి , వత్తిడి కి  ఆందోళన కూ గురి అవుతూ ఉండడం జరుగుతుంది !
4. మందుల కారణాలు : వివిధ కారణాల వల్ల  తీసుకునే మందులు కూడా జుట్టు ఊడి పోవడానికి ( అంటే ఎక్కువ గా జుట్టు కోల్పోవ డానికి  )  అవకాశం హెచ్చుతుంది ! 
అధిక రక్త పీడనానికి , గుండె జబ్బుకూ , డిప్రెషన్ కూ , కీళ్ళ నొప్పులకూ , క్యాన్సర్ కూ  వాడే మందులు కూడా ఎక్కువ వెంట్రుకలు రాలేట్టు చేస్తాయి ! స్త్రీలలో ప్రత్యేకించి గర్భ నిరోధానికి వేసుకునే కాంట్రా సె ప్టివ్  పిల్స్ కూడా ఒక ముఖ్య కారణం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
 
 

ఎంతైనా, ఏంజలీనా !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 20, 2013 at 10:17 ఉద.

ఎంతైనా ఏంజలీనా ! 

 
ఏంజలీనా జోలీ !  హాలీ వుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరు ! ఈమె కేవలం ఒక ఉత్తమ నటీమణే కాకుండా , రచయితా , దర్శకురాలు కూడా ! ప్రపంచం లో అత్యంత అందమైన  వనితగా కూడా ఎన్నుకో బడింది ! ఈమె నటించిన లారాక్రాఫ్ట్ టూంబ్ రైడర్, సాల్ట్ , ద క్రాడిల్ అఫ్ లైఫ్ అనే చిత్రాలు అనేక హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇకార్దులు బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్లు వసూలు చేశాయి !
ఈమె జీవితం కేవలం నటనకే పరిమితం కాకుండా , అనేక మానవ సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాలు పంచుకుంటుంది !  ఐక్య రాజ్య సమితి , మానవ శరణార్ధులకు సహృద్భావ రాయ బారి గా కూడా ఆమె తన సేవలు అందించారు !
ఏంజలీనా జూన్ నాలుగు, 1975 లో జన్మించింది ! తండ్రి అప్పటికే పేరు మోసిన హాలీవుడ్ నటుడు ! ( వీలుంటే రనవేట్రైన్ సినిమా చూడండి అతడి అత్భుత నటన కోసం ! )  తల్లి బెర్ట్రాండ్.  
మూడు చిత్రాలతో తారాపధం అందుకున్న ఈ వనిత, ముచ్చట గా ఇద్దరు  మాజీ భర్తలకు విడాకులు ఇచ్చేసి , మూడో భర్త అయిన  ప్రముఖ హాలీవుడు నటుడు, బ్రాడ్ పిట్ తో  ప్రేమ మయమైన సంసార జీవితం గడుపుతుంది ! ఈ జంటకు  ముగ్గురు స్వంత ( బయలాజికల్ ) పిల్లలూ ( శిలో , నాక్స్, వివియన్ )  , ఇంకా  , ఇంకో ముగ్గురు  దత్త పుత్రులూ ఉన్నారు ! ( మాడాక్స్ ను ఏడునెలల వయసులో ఉన్నపుడు , కంబోడియా దేశం లో ఒక శరణాలయం నుంచీ ,   జహారా అనే బాలికను  ఇథియోపియా శరణాలయం నుంచీ ,  దత్తత తీసుకుంది. దత్తత సమయం లో ఆ బాలికకు ఎయిడ్స్  ఉన్నదన్న అనుమానం కూడా ఉన్నా ! ( తరువాత పరీక్షలలో  ఆ బాలిక కు ఎయిడ్స్ లేదని తేలింది ! ) మూడో దత్తత, వియత్నాం శరణాలయం లో ఉన్న ఒక బాలుడు,   పాక్స్ తీన్ ! 
ఈ మధ్యే , ఏంజలీనా  రొమ్ము క్యాన్సర్ నివారణ చర్య గా తన రెండు స్థనా లూ తీసి వేయించుకున్నానని ప్రపంచానికి తెలియ చేసి,  సంచలనం సృష్టించింది ! ఆమె మాటలలోనే ” నేను  నాకు జరిగిన ఆపరేషన్ ను రహస్యం గా ఉంచదలుచుకోలేదు ! ఎందుకంటే , ప్రపంచం లో చాలామంది స్త్రీలకు , రొమ్ము క్యాన్సర్ రిస్కు అధికం గా ఉన్నట్టు తెలియకుండానే , క్యాన్సర్ నీడ లో జీవితం  గడు పుతున్నారు. ( నాతరువాత )  , వారుకూడా జన్యు పరీక్షలు చేయించుకుని , క్యాన్సర్ కు బలి అవకుండా , తగిన చర్యలు తీసుకుంటారని నా ఆశ  !”  ”  నా పిల్లలకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను కూడా !  ( క్యాన్సర్ బారిన పడకుండా ! ) ”.  
అందమైన వనిత, అందమైన భార్య , ప్రతిభావంతురాలైన నటీమణి ,  మానవ సేవ చేస్తున్న దార్మికురాలు , దత్త పుత్రులనూ , పుత్రికనూ , కూడా , తమ స్వంత పిల్లలతో పాటుగా పెంచుతూ , పరిరక్షణ చేస్తూ , ఆనంద మయ జీవితం గడుపుతూ , వారికోసం ,  రొమ్ము క్యాన్సర్ రిస్కు  తగ్గించుకోడానికి , ఆపరేషన్ చేయించుకున్న త్యాగ వనిత ! అంతే కాక,  తోటి స్త్రీల  ఆరోగ్యం కోసం , తాను  ఆపరేషన్ చేయించుకుని, తన స్థనాలను తీయించుకున్నానని, ప్రపంచానికి బహిరంగ పరచిన వనిత  !  అనేక  మానవత్వపు విలువలకు నీరాజనం పడుతున్న మహిళ ! ఎంతైనా,  ఏంజలీనా  ఒక  ఆధునిక దేవత ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విద్యార్ధులూ ! ఊక దంపుడు కాదు, మూక్ ( MOOC ) అంటే !

In మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 15, 2013 at 10:08 సా.

విద్యార్ధులూ! ఊక దంపుడు కాదు మూక్ ( MOOC ) అంటే !

 
విద్య నిగూఢ గుప్తము ,కానీ  పంచుకుంటే పెరిగేదీ విద్యే ! విద్యార్జన కోసం పడరాని కష్టాలు పడతారు , ప్రత్యేకించి చదువుకోడానికి చాలినన్ని వనరులు లేని వారు ! ధనం ఉన్న వారు అందరూ చదువుకోలేరు ! అట్లాగే  ధనం లేనివారందరూ కూడా చదువులలో రాణించరు ! విద్య విలువ అందరికీ తెలిసినదే ! కానీ సరస్వతీ కటాక్షం మాత్రం అందరికీ ఉండదు కదా ! అంతర్జాలం ఆవిష్కరించ బడ్డాక , అది   అంచలంచలు గా అభివృద్ధి చెందుతూ , విశ్వ మానవుల కు ఆనందాన్ని పంచ గలుగుతున్నది !  ఆనందం తో పాటుగా విజ్ఞానాన్నీఅంతర్జాలం ద్వారా  పంచడానికి ” నడుం కట్టారు  ”  అంతర్జాలం అందరికీ అందుబాటు లో ఉండాలనుకునే గొప్ప విద్యావేత్తలూ , ధార్మిక దృక్పధం ఉన్న వారూ ! వారి  ఆవిష్కారమే మూక్  అంటే ” మ్యాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సెస్  ” ( MOOC )
 
( MOOC )మూక్ తో మీకు ఎన్ని లాభాలో చూడండి :
1. మీకై మీరే , మూక్ ను అంటే మీకు నచ్చిన కోర్సు ను అనుసంధానం చేసుకోవచ్చు , మీకు కావలసినదల్లా ఒక కంప్యుటరూ , ఇంటర్నెట్ కనెక్షనూ మాత్రమే ( మీరు వాడే కంప్యూటర్ , మీ సొంతది  కూడా అవనవసరం లేదు కూడా ! )
2.  ప్రధానం గా అంతర్జాతీయ భాష అయిన  ఇంగ్లీషు లోనే కోర్సులు వుంటాయి. 
3.  మీరు విద్యార్జన లో  ప్రాంతీయ , కాల , ( అంటే time and  physical  boundaries ) పరిధులను అధిగ మించి చదువుకోవచ్చు ! అంటే  ఉదాహరణకు , ఆంధ్ర ప్రదేశం లో   నిజామాబాదు లో ని గాంధారి  మండలం లో ఉన్న వారు కూడా అమెరికా లోని ప్రతిష్టాత్మక మైన విశ్వ విద్యాలయ విద్యార్ధి గా నమోదు చేయించుకుని  వారికి ఇష్టమైన కోర్సు ను ఉచితం గా చదవ వచ్చు ! అట్లాగే విశాఖ పట్టణం దగ్గర మారు మూల ఉన్న గ్రామాలలో ఉన్న విద్యార్ధి కూడా , తన ఊరు నుంచి కదలకుండా అత్యంత ప్రామాణికం అయిన కోర్సులు  చదవ వచ్చు , వేల మైళ్ళ దూరం లో ఉన్న విశ్వ విద్యాలయం లో నమోదు చేసుకుని ! 
4. మీరు ఏవిధమైన బెత్తాలూ , భయాలూ లేకుండా బాధ్యతా యుతం గా మీకై మీరే చదువుకోవచ్చు, ఇన్ఫార్మల్ వాతావరణం లో ! 
5. మీ కోర్సు లో చేరిన ఇతర విద్యార్ధులతో ఏమాత్రం  మొహమాటం లేకుండా   ఇంట రాక్ట్ అయి వారితో మీ సందేహాలను తీర్చుకోవడమే కాకుండా , మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు ! 
6. మీరు చేసే కోర్సు వరకే మీరు పరిమితం అవకుండా , ఇతర కోర్సులు చేసే వారితో కూడా  పరిచయాలు ఏర్పరుచుకోవచ్చు ! 
7. మీకు ఒరిగే దల్లా , మీరు విజ్ఞాన వంతులు అవుతూ , మీ జీవితాంతం , కొత్త విషయాలూ , విజ్ఞాన సముపార్జన చేసుకోడానికి అత్భుతమైన అవకాశం ! 
8. మీరు కోర్సు చేయడానికి కనీసం ఒక డిగ్రీ కూడా అవసరం లేదు ! కేవలం మీ విజ్ఞాన కాంక్ష తప్ప !
9. ఇంకో అతి ముఖ్యమైన విషయం , మూక్ లో లభ్యమయే కోర్సులన్నీ కూడా ఉచితమే ! 
మరి ఆలస్యం ఎందుకు?  పదండి ముందుకు ! క్రింద ఉన్న  మూక్  వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేసి , మీ అవకాశాలను అందుకోండి , కృషి తో మీ కలల ను సఫలం చేసుకోండి , మూక్  లో మీరు చదివే కోర్సు లకు ఫీజు , మీ పట్టుదలా కృషీ  మాత్రమే ! 
 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూన్ 4, 2013 at 10:51 ఉద.

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు. 

 
తలనొప్పి సర్వ సాధారాణ మైన లక్షణం కావడం చేత ,  దానిని అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా , తమ పనులు ( బాధ ను అనుభవిస్తూ కూడానే ) తాము చేసుకునే వారు చాలా మంది ఉంటారు.వారి అభిప్రాయం కొంత వరకూ యదార్ధమే ! ఎందుకంటే , తలనొప్పి సామాన్యం గా స్వల్పమైన కారణాల వల్ల వస్తుంది ! తాత్కాలికం గానే ఉంటుంది. ఉపశమనం కూడా త్వరిత గతిని ఉంటుంది. కొన్ని తలనొప్పులు ” నిజంగానే తలనొప్పులు ” అవుతాయి. ఆ తలనొప్పులను నిర్లక్ష్యం చేస్తే , కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది !వాటి గురించి కొంత తెలుసుకుందాం !
1. చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి : 
a ప్రమోద్ ఆరేళ్ళ వయసు ఉండి , చాలా చురుకు గానూ , తెలివి గానూ  ఉండే బాలుడు. కిండర్ గార్డెన్ నుంచి మారి , ప్రైమరీ స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టిననాటి నుంచీ , చురుకు తనం తగ్గింది ! తరచూ తలనొప్పి అని చెప్పే వాడు , అమ్మతో , ఇంటికి వచ్చాక ! అమ్మ కొత్త స్కూల్ ఇష్టం లేక అట్లా చెబుతున్నాడనుకుంది !మిగతా లక్షణాలు ఏమీ లేవు !  అట్లా గే బుజ్జగించుతూ , స్కూల్ కు తీసుకు వెళ్తూ ఉండేది !  కానీ ప్రమోద్ తలనొప్పి తగ్గలేదు ! క్లాసులో వెనక లైను లో కూర్చుంటున్నాడు ! బోర్డు మీద రాసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్ప లేక పోతున్నాడు !  దానితో  రిజల్టు బాగా రావాలనే లక్ష్యమే  పెట్టుకుని , ప్రమోదు కు చీవాట్లు పెడుతున్నాడు టీచరు !   కానీ టీచరు కానీ , తల్లి కానీ , లోతుగా పరిశీలించి , సమస్య ను అర్ధం చేసుకోలేక పోయారు ! వెంటనే చిన్న పిల్లల మానసిక నిపుణు రాలి దగ్గరికి తీసుకు వెళ్ళారు !  అన్ని వివరాలూ కూ లంక షం గా పరిశీలించిన తరువాత ఆమె ”  ప్రమోద్ కు ఉన్న సమస్య ప్రధానం గా కంటి చూపు లో అవకతవక లు ఉన్నాయని !  అందుకే , బోర్డు మీద రాసినది చదవలేక పోతున్నాడని ! ఇంట్లో టీవీ చాలా దగ్గరగా చూస్తూ ఉండడం వల్ల దానికే అలవాటు పడి పోయాడని , క్లాసులో చివరి లైను లో కూర్చుని బోర్డు మీద రాసేది చూడడం కష్టం అవుతుందని ! అందుకే తలనొప్పి వస్తుందని ”  కూడా వివరించింది ! తల్లి ప్రమోద్ ను హత్తుకొని, తన పొరపాటు ను అనునయం గా ప్రమోద్ కు చెప్పి కళ్ళ  పరీక్ష చేయించడానికి సిద్ధం అయింది !
ఇక్కడ తల్లి దండ్రులకు పాఠం :  కేవలం తలనొప్పే అయినా చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు ! 
b. చిన్న పిల్లలలో తక్కువ సమయం లో జ్వరమూ అంటే హై ఫీవర్  , తీవ్రమైన తలనొప్పి వచ్చి , వాంతులు చేసుకోవడమూ , ఏమీ తినక పోవడమూ చేస్తూ ఉంటే కూడా అశ్రద్ధ చేయకూడదు ! ఆ లక్షణాలు , మలేరియా లక్షణాలైనా , మెనింజైటిస్ లాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ లైనా కావచ్చు !   
c. కొన్ని కొన్ని పడని ఆహార పదార్ధాలు మొదటి సారిగా తింటే , లేదా మళ్ళీ , తెలియకుండానే తింటే కూడా, చిన్న పిల్లలలో తీవ్రమైన తలనొప్పి కలగ వచ్చు ! అతి సూక్ష్మ పరిమాణం లో వివిధ చాక్లెట్ లలోనూ , పానీయాలలోనూ కలిపే , కలరెంట్ లు అంటే రంగు రాసాయనాలు ,లేదా రుచిని ఎక్కువ చేసే రసాయనాలు కూడా తలనొప్పి కి కారణం అవ వచ్చు ! 
d. చిన్న పిల్లలు ఆటల్లోనూ అల్లరి చేస్తున్నప్పుడు కూడా క్రింద పడి , తలకు దెబ్బలు తగిలించుకోవడం కూడా సామాన్యమే ! కానీ ఇట్లా తలకు దెబ్బ తగిలాక , తీవ్రంగా తలనొప్పి కలగడమూ , వాంతులు రావడమూ , జరిగితే , ఆ లక్షణాలు , తలదెబ్బ తీవ్రత ను తెలియ చేస్తాయి ! అత్యవసరం గా స్పెషలిస్టు సహాయం తీసుకోవాలి ఆ సమయాలలో , కేవలం తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయక !
e .చిన్న పిల్లలు ఎక్కువ సమయం ఎండలో తిరిగినా , లేదా ఆడినా కూడా  ఎండ దెబ్బ లేదా వడ దెబ్బ తగిలి తలనొప్పి వస్తుంది, అప్పుడు అత్యవసరం గా ప్రధమ చికిత్స చేయాలి. ఆశ్రద్ధ చేసి పరిస్థితి ని విషమం చేసుకో కూడదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

3. మైగ్రేన్ కారణాలు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health on జూన్ 1, 2013 at 11:34 ఉద.

3. మైగ్రేన్ కారణాలు ఏమిటి ?

The Pathways of Migraine

కారణాలు ఖచ్చితం గా తెలియక పోయినా , మెదడు లో సీరొ టోనిన్ అనే జీవ రసాయనం తక్కువ అవడం తో మైగ్రేన్ మొదలవుతుందని భావించ బడుతుంది !మెదడు సరిగా పని చేస్తున్నప్పుడు , అనేక రకాలైన జీవ రసాయనాలు ఉత్పత్తి అవుతూ , మళ్ళీ వాటి ధర్మాలు నిర్వర్తించిన తరువాత, అవి విభజన చెందుతూ ఉంటాయి . సీరో టోనిన్ మెదడు లో ఒక్క సారిగా తక్కువ అవగానే మెదడు లో రక్త నాళాలు సంకోచం చెందుతాయి !  కళ్ళు బైర్లు కమ్మినట్టు , లేదా కంటి ముందు ఉండే వస్తువు మసక గా మెరుపులతో కనబడడం కూడా , ఈ కారణం వల్లనే అనుకోబడుతుంది అంటే  మైగ్రేన్ లో రెండో దశ అయిన ఆరా అనే దశ. తరువాత కొద్ది సమయానికి సంకోచం చెందిన రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. దీనితో మూడవ దశ అయిన హెడేక్ , తీవ్రమైన తలనొప్పి కలగడం జరుగుతుంది. మైగ్రేన్ కనబడుతున్న వారి మెదడు లో సీరో టోనిన్ ఆకస్మికం గా ఎందుకు తగ్గుతుంది?  అనే విషయం ఇంత వరకూ నిర్ధారణ కాలేదు. 
హార్మోనులు: ప్రత్యేకించి స్త్రీలలో మైగ్రేన్ ఎక్కువ గా ఉండడం వల్ల , మైగ్రేన్ కు స్త్రీ హార్మోనులు కూడా కారణమని భావించ బడు తుంది. మైగ్రేన్ వచ్చే స్త్రీలలో , వారికి ఋతు క్రమ సమయం లో ఈ మైగ్రేన్ లక్షణాలు ఎక్కువ గా కనబడుతూ ఉంటాయి. అప్పుడు వచ్చే ఆ మైగ్రేన్ ను ‘ ఋతుక్రమ మైగ్రేన్ ‘ అని అంటారు. కానీ ఎక్కువ మంది స్త్రీలలో మైగ్రేన్ , ఋతుక్రమం తో సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంటుంది. 
మిగతా కారణాలు ఏమిటి ?:
శారీరిక కారణాలు ( ఫిజికల్ ):పని వత్తిడి వల్ల ఎక్కువ అలిసి పోవడం , తక్కువ గా నిద్ర పోవడం , ఒకే అననుకూల పొజిషన్ లో మెడను ఎక్కువ సమయం ఉంచడం , ఎక్కువ సమయం ప్రయాణం చేయడం , ఇవన్నీ కూడా మైగ్రేన్  రావడానికి కారణాలు అవవచ్చు.
భావోద్వేగ కారణాలు ( ఎమోషనల్ ): ఏ కారణం చేత నైనా విపరీతమైన ఆందోళనా, మానసికమైన వత్తిడి చెందితే , లేదా విపరీతం గా ఉత్సాహం అంటే ఎగ్జైట్ చెందితే , లేదా తీవ్రమైన షాక్ కు గురి అవుతే ( అంటే ఎలెక్ట్రిక్ షాక్ కాదు , వారి మనసును తీవ్రం గా ఆకస్మికం గా గాయ పరిచే ఏ సంఘటన అయినా షాక్ కు కారణం అవవచ్చు ).
పరిసరాల కారణాలు ( ఎన్విరోన్ మెంటల్ ): అత్యంత వెలుతురూ, నియాన్ లైట్ ల వెలుతురూ , టీ వీ లో అప్పుడప్పుడూ కనిపించే వివిధ రకాల వెలుగు మెరుపులూ , చెవులు పేలి పోయేంత గా వినిపించే శబ్దాలూ , సంగీతాలూ , బాగా చెమట పట్టించే ఉక్క పోత గా ఉన్న పరిసర వాతావరణమూ , బాగా స్మోక్ చేసి , వారు వదిలిన స్మోక్ లో ఉండే వాతావరణం – ఇవన్నీ కూడా మైగ్రేన్ ఎటాక్ రావడానికి కారణాలు ఆవ వచ్చు. 
తినే ఆహారం ( డైట్ ): విపరీతం గా కాఫీలు, టీలు తాగే అలవాటు , మద్యం తాగే అలవాటు , ఆహారం తీసుకునే సమయాలలో అవక తవకలూ , లేదా డ యటింగ్ చేస్తూ సరిగా ఆహారం తినక పోవడం  కొన్ని పడని పదార్ధాలు , జున్ను , చాక్లెట్ , సిట్రస్ ఫ్రూట్ లాంటి ప్రత్యేక మైన ఆహార పదార్ధాలు కూడా  మైగ్రేన్ కలిగించ వచ్చు. 
తీసుకునే ఇతర మందులు: కొన్ని రకాలైన నిద్ర మాత్రలు , ముఖ్యం గా స్త్రీలు వేసుకునే  హార్మోను టాబ్లెట్లు (  కాంట్రా సె ప్టివ్ టాబ్లెట్ లు ) కూడా మైగ్రేన్ కలిగించ వచ్చు . 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

18. ఇక డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health on మే 6, 2013 at 9:50 ఉద.

18. ఇక  డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

గత టపాలలో,  వయసు వచ్చిన తరువాత అంటే టైప్ టూ  డయాబెటిస్ , కంట్రోలు లో లేకుండా ఉంటే శరీరం లో కలిగే దుష్పరిణామాలు ఏమిటో , అవి ఎట్లా వస్తాయో కూడా వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! ఇప్పుడు  డయాబెటిస్ వచ్చినపుడు మొదలుపెట్టే చికిత్సా పద్ధతుల గురించీ , సామాన్యం గా చికిత్సలో జరిగే పొరపాట్ల గురించీ తెలుసుకుందాం ! అవసరమైన పరీక్షలు చేయించు కోవడం వల్ల , డయాబెటిస్ నిర్ధారణ అయిన వారి మనస్తత్వం ఇట్లా ఉంటుంది :
1. ” నేను ఇప్పటి వరకూ ఆరోగ్యం గానే ఉన్నాను కదా ! నాకు డయాబెటిస్ రావడం ఏమిటి ? పరీక్షలలో ఏదో పొర పాటు జరిగి ఉంటుంది ” అనుకునే భావన ! ఇట్లా అనుకునే వారు , శాస్త్రీయం గా పరీక్షలు చేసి ,నిర్ధారణ చేసిన , వారి డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేసి , తమకు తెలియకుండానే వ్యాధిని తీవ్రతరం చేసుకుంటారు ! అంతేకాక, మానసికం గా, వారు  డయాబెటిస్ వ్యాధి గ్రస్తులనే యదార్ధాన్ని ఆమోదించే స్థితిలో ఉండరు !  ఈ సమయం లో వారికి కావలసింది, డయాబెటిస్ గురించి కూలంక షం గా తెలియచేసే వారు , వారు వారి మిత్రులైనా , బంధువులైనా , లేదా ముఖ్యం గా వారి డాక్టర్ అయినా పరవాలేదు ! కావలసినది వారి సందేహాలన్నీ నివృత్తి చేసి , చికిత్స యొక్క ప్రాముఖ్యత ను తెలియ జేయటమే !
2.”  నాకు ట్యాబ్లెట్లు వేసుకునే అలవాటు ఎప్పుడూ లేదు నా జీవితం లో , ఇప్పుడు ఈ వెధవ  ట్యాబ్లెట్లు  అన్నీ వేసుకుని , నా శరీరాన్ని మందుల మయం చేసుకోను ” అనుకునే ఉద్దేశం !ఇట్లా అనుకోవడం కూడా పొరపాటే ! ఎందుకంటే , చీటికీ మాటికీ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎవరికీ మంచిది కాదు, ఎవరికీ ఇష్టం ఉండకూడదు కూడానూ ! కానీ ఒక వ్యాధి నిర్ధారణ అయినప్పుడు , ఆ వ్యాధిలో, ఆ ట్యా బ్లెట్  చక్కగా పని చేస్తున్నట్టు , అనేక వందల పరిశీలనల ద్వారా స్పష్టమయినప్పుడు కూడా , అశ్రద్ధ చేసి , అనుమాన ధోరణి తో మందులు వేసుకోకుండా ఉండడం , కేవలం వారి వ్యాధిని తీవ్రతరం చేసుకోడానికే !
3.”  కాస్త తీపి పదార్ధాలు తినకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది , అప్పుడప్పుడూ అయితే పరవాలేదు ” అనుకుని తమకు తామే కన్సెషన్ లు ఇచ్చుకుందామనే  ” ఉదార ” బుద్ధి ” ఈ రకం గా ఎవరికి వారు , కన్సెషన్ లు ఇచ్చుకుంటూ వారి రోజు వారీ పథ్యం విషయాలలో రిలాక్స్ అవుతూ ఉంటే కూడా వ్యాధి కంట్రోలు లో ఉండదు ! 
4. ” డాక్టర్లు  అందరికీ చెబుతుంటారు , సిగరెట్లు తాగ కూడదనీ , మద్యం ముట్ట కూడదనీ , ఇట్లా అనేకం చెబుతూ ఉంటారు, వారు చెప్పే మాటలను ఖాతరు చేయనవసరం లేదు ఎందుకంటే , మద్యానికీ , సిగరెట్లు తాగడానికీ , మధుమేహానికీ సంబంధం ఏమిటి ? ” అనుకుంటూ , కనీసం ఆ సంబంధం ఏమిటో  తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా , వైద్య సలహాను హాస్యాస్పదం చేస్తూ ఉంటారు !  తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతూ ,వారు క్షోభ పడుతూ , వారి కుటుంబాలకు కూడా ఎంతో ఖేదం కలిగిస్తారు , కేవలం వారి అశ్రద్ధా , నిర్లక్ష్యం వల్ల !  
పైన ఉదహరించిన ఆలోచనా ధోరణులు ఉన్న వారందరికీ ఒకటే సూచన !  డయాబెటిస్ రోగ నిర్ధారణ అయిన వెంటనే , వారు, వారి రక్తం లో షుగరు కంట్రోలు కు అవసరమయే సర్వ ప్రయత్నాలూ ప్రారంభించాలి, ఆ ప్రయత్నాలను కొనసాగించాలి , వారి జీవితాంతం !  ఒక విధం గా , వారికై  వారు , రక్తం లో అధిక షుగరు మీద యుద్ధం ప్రకటించడమే ! ఆ యుద్ధం , వారి జీవితాంతం కొనసాగించాల్సిందే !  యుద్ధం ఒక్క రోజు ఆపినా కూడా , శత్రువు ( అధిక షుగరు ) ది పై చేయి అవుతుంది,శరీరానికి కలగ కూడని అపాయం జరుగుతుంది ! 
వచ్చే టపాలో  చికిత్సా సూత్రాలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం ! 

14. డయాబెటిస్ లో, స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మే 2, 2013 at 7:28 సా.

14. డయాబెటిస్ లో స్ట్రోకు ( పక్ష వాతం ) రావచ్చా ?:

 
డయాబెటిస్ వ్యాధి లో వ్యాధి తీవ్రం గా ఉంటే , అంటే ,  చాలా సంవత్సరాలు గా ఉండి , మందులకు లొంగకుండా మొండికేసిన డయాబెటిస్ లో  పక్ష వాతం లేదా స్ట్రోకు వచ్చే అవకాశాలు , డయాబెటిస్ లేని వారి లో స్ట్రోకు , పక్ష వాతం వచ్చే అవకాశాల కంటే ఎక్కువ గా ఉంటాయి ! ఈ అవకాశాలు కనీసం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ గా ఉంటాయి , డయాబెటిస్ ఉన్న వారిలో !  కానీ తగు జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ ఉంటే , డయాబెటిస్ ఉన్నా కూడా , ఈ అవకాశాలను తగ్గించు కోవచ్చు ! అందుకే కదా !  ఈ వివరాలన్నీ తెలియచేసేది 
మరి మీలో పక్ష వాతం , లేదా స్ట్రోకు వచ్చే రిస్కు ఎక్కువ ఉందో లేదో ఎట్లా తెలుసుకోగలరు ?
1. మీ వయసు యాభై అయిదు దాటితే 
2. మీరు ఊబకాయం కలిగి ఉంటే అంటే ఒబీసిటీ,
3. మీ కుటుంబం లో ఎవరికైనా పక్ష వాతం వచ్చి ఉంటే, 
4. మీరు స్మోకింగ్ చేస్తూ ఉంటే,  
5. మీకు హై బీపీ , అధిక రక్త పీడనం ఉంటే 
6. మీకు ఇంతకు ముందే మినీస్ట్రోకు లేదా TIA లేదా తాత్కాలిక పక్ష వాతం కనుక వచ్చి ఉన్నట్టయితే, 
7. మీకు గుండె జబ్బులు వచ్చి ఉన్నట్టయితే ,
8. మీ కొలెస్ట రాల్ అతలా కుతలం అయి ఉంటే , అంటే HDL తక్కువ గానూ , LDL ఎక్కువ గానూ ఉన్నట్టయితే !, 
గమనించండి పైన ఉన్న రిస్కులలో చాలా వరకూ మీ చేతులలో ఉన్నవే అంటే స్వయం కృతా లే ! అంటే వాటి  జననం , వాటి కంట్రోలూ  పూర్తి గా మీ ఆధీనం లోనే ఉంటాయి ! 
మరి పక్ష వాత సూచనలు ఏమిటి ?
1. శరీరం లో ఒక పక్క భాగాలన్నీ ఒక్క సారిగా బలహీనం అయి పోతూ ఉండడం లేదా ఉపయోగించ లేక పోవడం ! 
2. ఆకస్మికం గా మాట్లాడలేక పోవడం లేదా , మాట్లాడ డానికి ప్రయత్నిస్తే తడబడడం !
3. ఆకస్మికం గా  కన్ఫ్యూజ్ అవడం , లేదా ఎదుటి వారు చెప్పేవి ఏవీ అర్ధం కాక పోవడం ! 
4. అకస్మాత్తుగా కళ్ళు తిరగడం , కాళ్ళ మీద స్థిమితం గా నిలవ లేక పోవడం లేదా నడక లో పట్టు కోల్పోవడం !
5. ఒక కంటిలో కానీ రెండు కళ్ళతో కానీ ఆకస్మికం గా చూపు బాగా తగ్గి పోవడం లేదా కోల్పోవడం 
6. తీవ్రమైన తలనొప్పి రావడం, 
7. ఒక వస్తువు కానీ , వ్యక్తి కానీ రెండు గా కనిపించడం ! 
 
పై సూచనలన్నీ ఒక వ్యక్తి లోనే రావు. కొన్ని సూచనలు కొందరి లో రావడం జరుగుతూ ఉంటుంది. కానీ  ఈ సూచనలు అందరూ తెలుసుకోవడం ఎందుకు మంచిదంటే ,శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కదా ! అందుకు ! అంటే ఇప్పుడు పై సూచనలు ఎవరిలోనైనా గమనించిన వెంటనే కనుక నిపుణు లతో అంటే స్పెషలిస్టు లతో చికిత్స చేయించు కుంటే , పక్ష వాతాన్ని కూడా చాలా వరకూ నివారించి , చేతులూ కాళ్ళూ పడి పోకుండా నివారించవచ్చు ! అదే ఆధునిక వైద్య విజ్ఞాన మహిమ !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !