Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

ఆస్థమా ఏమిటి.1. ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 16, 2013 at 2:22 సా.

ఆస్థమా  ఏమిటి. 1. ?

 
ఆస్థమా లేక ఆస్త్మా  ఒక ఊపిరి తిత్తులకు సంబంధించిన  దీర్ఘ వ్యాధి !  దీనిని బ్రాంకియల్ ఆస్త్మా అని కూడా అంటారు ! కనీసం రెండు కోట్ల మంది భారతీయులు ఈ ఆస్త్మా వ్యాధి తో సతమతం అవుతున్నారు !   ఇది దీర్ఘ కాల వ్యాధి అయినా కూడా , తరచు గా లక్షణాలు ఉధృతం అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితిని  ఆస్త్మా ఎటాక్ అని అంటారు ! 
ఆస్థమా పరిస్థితి లో ఏమి జరుగుతుంది ? 
పై చిత్రం గమనించండి. మన ఊపిరి తిత్తులు ముక్కు తో మొదలై ఛాతీలో రెండు వైపులా ఊపిరితిత్తులు గా ఏర్పడతాయి.  మనం పీల్చే గాలి ప్రయాణం చేసే రూట్ ను కనుక పరిశీలిస్తే, ముక్కు లోనుంచి , శ్వాస వాహిక లేదా ట్రాకియా ( గాలి గొట్టం ) ద్వారా రెండు బ్రాంకస్ లు రెండు వైపులా విడిపోయి రెండు ఊపిరితిత్తులలోకీ వెళుతుంది. ఒక మహా వృక్షం కనుక కాండము, శాఖలూ , చివరికి ఆకులు గా ఎట్లా విభజించ బడుతుందో , ఊపిరితిత్తులు కూడా అదే విధం గా నిర్మాణం అయి ఉంటాయి !  గమనించ వలసినది , ఈ బ్రాంకస్  లూ , బ్రాంకియోలై  లూ కేవలం  లోహం తో చేసిన గొట్టాల లాగా ఉండవు ! అవి సంకోచం , వ్యాకోచం చెందుతూ ఉంటాయి ! అంటే ఆ గొట్టాల వ్యాసం చిన్నది గానూ పెద్దది గానూ మారుతూ ఉంటుంది !  అంటే ఈ గొట్టాలు రబ్బరు గొట్టాల లాగా సాగుతూ కుంచించుకు పోతూ ఉంటాయి ! దీనికి కారణం , ఈ గొట్టాలలో ఉండే  కండరాల నిర్మాణమే ! అంటే  ఈ గొట్టాలు  నీటి పైపుల లాగా గట్టి గా లేకుండా రబ్బరు గోట్టాలలా సాగుతూ ఉండాలంటే ,ఈ కండరాల వ్యాకోచ సంకోచాలు జరుగుతూ ఉండడమే ! ఈ కండరాలు  అతి సున్నితమైనవి. 
మన దేహం లో కండరాలు ముఖ్యం గా నియంత్రిత కండరాలు, అనియంత్రిత కండరాలు అని రెండు రకాలు గా ఉంటాయి. అంటే మనం మన చేతులు కానీ నాలుక కానీ మనం నిర్ణయించుకుని కదిలిస్తేనే కదులుతాయి కదా ! మన కంట్రోలు లో ఉండడం వల్ల ఈ కండరాల ను నియంత్రిత కండరాలు అంటారు ! 
రెండో రకం కండరాలు గుండె , ఊపిరి తిత్తులలో అమరి ఉన్న కండరాలు : ఈ కండరాలు మన కంట్రోలు లో ఉండవు ! అవి అనియంత్రిత కండరాలు !  ఎందుకంటే , మనం ఆపుదామనుకున్నా , గుండె కండారాలు , కానీ ఊపిరి తిత్తుల కండరాలు కానీ పనిచేయడం  ఆపవు కదా ! 
ఊపిరి తిత్తులలో ఉండే కండరాలు , ఎక్కువ గా సంకోచం చెందడం వలననే ఆస్త్మా లక్షణాలు వస్తాయి !
ముఖ్యం గా మూడు లక్షణాలు : చాతీ బిగుతు గా అవ్వడం, అంటే టైట్ నెస్ , ఊపిరి తీసుకోవడం కష్టం అవుతూ ఉండడం , ఇంకా  పిల్లి కూతలు లాంటి శబ్దాలు రావడం , దీనినే వీజ్ అంటారు !,   కలుగుతాయి !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

8.సైనస్ హెడేక్ లు ఎట్లా ఉంటాయి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 14, 2013 at 10:58 సా.

8.సైనస్ హెడేక్ లు ఎట్లా ఉంటాయి ?

సైనస్ హెడేక్ లు అంటే ? : . మానవ కపాలం లో కొన్ని  భాగాలలో ఎముకలు పూర్తి గా మందం గా లేకుండా ఉంటాయి. ఉదాహరణకు , ఒక ఇటుక ను తీసుకుంటే , ఆ ఇటుక అంతా  ఏమాత్రం సందు లేకుండా చేయబడి ఉంటుంది కదా ! అట్లాగే ! కానీ సైనస్ లు ఉన్న భాగాలలో , ఎముకలు పైకి మందం గా కనిపించినా కూడా , లోపల చిన్న చిన్న గాలి గదులు గా నిర్మాణం అయి ఉంటాయి ! ఉదాహరణ కు  తేనె తుట్టె లో గాలి గదులు ( తేనె తీయబడిన తరువాత ) నిర్మాణం అయి ఉన్నట్టు !
మరి ఈ సైనస్  లు హెడేక్ కు కారణం ఎట్లా అవుతాయి ?
ఈ విషయం తెలుసుకునే ముందు , ఈ సైనస్ లు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం !  మానవ కపాలం అంటే స్కల్ లో  ముఖ భాగం లో, ఇంకా ఖచ్చితం గా చెప్పాలంటే ఫాల భాగం ( అంటే కనుబొమల మీద ఉన్న భాగం ) లో ఉన్న ఎముకలో రెండు  సైనస్ లు ఉంటాయి ( అంటే రెండు కనుబొమ్మల మీదా రెండు ) వీటిని ఫ్రాన్ ట ల్  సైనస్ లు అని అంటారు ! అట్లాగే ముక్కు లోపల ఉన్న ఎముకకు రెండు వైపులా రెండు సైనస్ లు ఉన్నాయి వీటిని ఎథ మాయిడల్  సైనస్ లు అంటారు ! పై దవడ లు రెండింటి లో ఉండే సైనస్ లను మాగ్జిలరీ సైనస్ లు అంటారు. ఈ మూడు జతల సైనస్ లు,   ముక్కుకు అనుసంధానమై ఉంటాయి ! అంటే వీటికి ముక్కు లోపలి భాగం తో కనెక్షన్ లు ఉంటాయి ! అంటే ముక్కు లోపలి పలుచటి పోర ఈ సైనస్ ల లోపలి భాగాలలో కూడా కప్పబడి ఉంటుంది !  పై చిత్రం లో చూడండి ! 
సామాన్యం గా ముక్కులో ఉండే లేదా వచ్చే ఇన్ఫెక్షన్ లు , ప్రత్యేకించి బాక్టీరియా లు కలిగించే ఇన్ఫెక్షన్లు  ముక్కులో ఉండే పలుచటి పొరను కూడా ఆక్రమిస్తాయి !అంటే ఈ పొర లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స జరుగక పొతే , ఈ ఇన్ఫెక్షన్ కాస్తా ముక్కులో ఉండే పొర ద్వారా ఈ సైనస్ లలోకి ప్రవేశిస్తుంది ! ముక్కులో ఉండే ఇన్ఫెక్షన్ ను నిర్మూలించినా కూడా , సైనస్ లలో కూడా దాగి ఉన్న ఇన్ఫెక్షన్ నిర్మూలించ బడక , సైనస్ హెడేక్ లాగా పరిణమిస్తుంది ! ఖచ్చితం గా చెప్పాలంటే , సైనస్ హెడేక్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తలనొప్పి ! అందుకే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ప్రత్యేకించి , తల వంచినప్పుడు ఎక్కువ గా వస్తుంది ! 
ఈ సైనస్ తలనొప్పి ఎట్లా ఉంటుంది ?
సైనస్ తలనొప్పి ముఖ్యం గా ముఖ భాగం లో వస్తుంది అంటే ఫేస్ లో ఎక్కువ గా వస్తుంది ! ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి , రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గు ముఖం పడుతుంది ! తలను అటూ ఇటూ కదిల్చినా , వంచినా , లేదా ఏవైనా బరువులు ఎత్తినా కూడా ఈ సైనస్ నొప్పి ఉధృతం అవుతుంది ! అట్లాగే , ఒక వెచ్చటి ప్రదేశం నుంచి అతి శీతల ప్రదేశం లోకి ప్రవేశించినపుడు కూడా ఈ సైనస్ హెడేక్ ఎక్కువ అవుతుంది ! ఎప్పుడూ ముక్కు కారుతూ ఉండడం కూడా ఒక లక్షణం కావచ్చు సైనస్ తలనొప్పికి ! అంటే జలుబు లక్షణాలు తగ్గినా కూడా కొంత మంది కి చాలా నెలల వరకూ ముక్కు కారుతూ ఉంటుంది ! కొన్ని సమయాలలో పసుపు లేదా ఆకు పచ్చ రంగులో ముక్కు లో ద్రవం ఉంటుంది , ఇట్లా జరిగితే అత్యవసరం గా డాక్టర్ కు చూపించుకోవాలి ! స్పెషలిస్ట్ డాక్టర్ తో ! ఎందుకంటే ,  రంగులో ఉన్న ముక్కు లో ద్రవం ఇన్ఫెక్షన్ తీవ్రత తెలియ చేస్తుంది !  ఆ ఇన్ఫెక్షన్ ను కనుక నిర్మూలించక పొతే, సైనస్ లకు పాకి , సైనస్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది ! మైగ్రేన్ హెడేక్ నూ , టెన్షన్ హెడేక్ నూ కూడా సైనస్ హెడేక్ లక్షణాలతో పోల్చ వచ్చు ! కొన్ని సమయాలలో వీటిని ఖచ్చితం గా గుర్తు పట్టడం కష్టం ! 
మరి చికిత్స ఏమిటి ? : 
ముక్కు కారడం తగ్గించడానికి  నేసల్ స్ప్రే లు వాడడం , యాంటీ హిస్టమినిక్ టాబ్లెట్ లు కానీ , స్ప్రే లు కానీ తీసుకోవడం , హ్యుమిడి ఫయర్ అనే పరికరం తో కొద్ది గా తేమ ఉన్న గాలిని పీల్చడం !  చేస్తే సైనస్ హెడేక్ కు ఉపశమనం కలుగుతుంది ! అవసరమైతే , యాంటీ బయాటిక్స్ కూడా వాడాలి ! సగం తీసుకున్నాక మానేయకుండా , కోర్సు పూర్తి చేయాలి ! లేక పొతే , బాక్టీరియా క్రిములు పూర్తి గా నిర్మూలించ బడక , మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ కలిగే రిస్కు ఉంటుంది !  స్పెషలిస్టు సలహా తప్పని సరిగా పాటించాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

7. మరి క్లస్టర్ హెడేక్ అంటే, ఏమిటి?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 10, 2013 at 6:19 సా.

7. మరి క్లస్టర్ హెడేక్ అంటే, ఏమిటి?

క్లస్టర్ హెడేక్ : 
ఈ క్లస్టర్ హెడేక్ లు కూడా భయంకరమైన తలనొప్పులు ఇవి సామాన్యం గా తలకు ఒక పక్క గా వస్తూ ఉంటాయి. ముఖ్యం గా ఆ భాగం లో  ఉన్న కంటి గుడ్డు వెనక భాగం లో నొప్పి తీవ్రం గా ఉంటుంది.  ఈ నొప్పులు అకస్మాత్తు గా మొదలవుతాయి. వీటి తీవ్రత మైగ్రేన్ తలనొప్పి కన్నా కూడా తీవ్రం గా ఉంటుంది ! సామాన్యం గా ఈ రకమైన నొప్పులు ఒకటి నుంచి మూడు సార్లు రావచ్చు రోజులో ! కొన్ని సమయాలలో , ఈ నొప్పులు వచ్చిన వారు , నిద్ర లేచేది కూడా ఇట్లాంటి నొప్పితోనే ! పదిహేను నుంచి అరవై నిమిషాలు ఈ నొప్పులు ఉంటాయి. ఇట్లా కొన్ని వారాలూ , నెలలూ కూడా ఈ నొప్పులు బాధించి  ” మీ ఏడుపు మీరు ఏడవండి ” అన్న రీతిగా కొంత విరామం అంటే కొన్ని నెలలు విరామం ఇచ్చాక , మళ్ళీ మీ పని పడతా అన్నట్టుగా ఈ క్లస్టర్ హెడేక్ లు వస్తాయి. ఈ క్లస్టర్ హెడేక్ తీవ్రం గా ఉంటే , చీకాకు పడడమూ , ఏకాగ్రత లోపించ డమూ , ఉంటున్న గది లో కాలు కాలిన పిల్లి లా తిరగడమూ , నొప్పి ఇంకా భరించ లేనంత ఎక్కువ గా ఉంటే , గోడకు తల కొట్టుకోవడమూ , జరుగుతుంది ! 
ఎవరు ఈ క్లస్టర్ హెడేక్ బారిన ఎక్కువ గా పడతారు ? 
ప్రతి వెయ్యి మందిలోనూ ఒక్కరికి కనీసం ఈ రకమైన నొప్పులు వస్తాయి !  ఈ నొప్పులు వచ్చే ప్రతి పదిమంది లోనూ ఎనిమిది మంది పురుషులే ! అందులోనూ ,స్మోకింగ్ చేసే పురుషులే ! ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ , స్మోక్ లో ఉన్న అనేక విష తుల్యమైన పదార్ధాలు , మెదడు లో అతి సున్నితమైన భాగాలను ముట్టడి చేసి ఈ రకమైన నొప్పులకు కారణమవుతుందని భావించడం జరుగుతుంది. ఈ స్మోకింగ్ చేసే పురుషులు మద్యం కూడా తాగుతుంటే , క్లస్టర్ హెడేక్ వచ్చే రిస్కు చాలా ఎక్కువ అవడమే కాకుండా , విరామం ఎక్కువ లేకుండా , తరచు గా ఈ రకమైన నొప్పులు ముట్టడి చేస్తాయి వారిని ! 
చికిత్స ఏమిటి ? : వెంటనే చికిత్స అయితే , సుమా ట్రి ప్టాన్ అనే మందు నోటిలో కానీ , ఇంజెక్షన్ రూపం లో కానీ తీసుకుంటే ఈ నొప్పి తగ్గుముఖం పడుతుంది !ఇంకా ప్రాణవాయువు ను సిలిండర్ లలో తీసుకుని దానిని ఇంటి దగ్గర పీల్చడం వల్ల కూడా ఉపశమనం జరుగుతుంది ! కానీ భారత దేశం లో ప్రజలు , ఈ ప్రాణ వాయువు సిలిండర్ లతో చాలా జాగ్రత్త వహించాలి ! ఎందుకంటే పొరపాటున కూడా సిలిండర్ దగ్గర కనుక అగ్గి పుల్ల వ వెలిగించినా , ( స్మోకింగ్ చేసే వారు ) లేదా కొన్ని సమయాలలో కేవలం లైటు స్విచ్ ఆన్ చేసినా కూడా అందులో ఉన్న నిప్పు రవ్వ సిలిండర్ ను పేల్చ గలదు ! ఈ క్లస్టర్ హెడేక్ నిర్ధారణ కోసం స్పెషలిస్టు ను తప్ప్పని సరిగా సంప్రదించాలి ! కేవలం స్వంత వైద్యాలు చేసుకోకుండా ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

6. నడి వయసులోవచ్చే తలనొప్పికి కారణాలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 9, 2013 at 2:31 సా.

6. నడి వయసులోవచ్చే  తలనొప్పికి  కారణాలు. 

 
క్రితం టపాలో చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి కి కారణాల గురించీ , వాటికి వెంటనే చికిత్స యొక్క అవసరం గురించీ తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు నడి వయసులో వచ్చే తలనోప్పులగురించి తెలుసుకుందాం ! 
1. సాధారణ కారణాలు :  పని వత్తిడి వల్లా , లేదా జలుబూ , దగ్గూ , లాంటి సామాన్య కారణాల వల్ల వచ్చే తలనొప్పి ఒకరకం గా ఉంటుంది ! పని వత్తిడి వల్ల వచ్చే తలనొప్పి , జ్వరం తో రాదు. మిగతా కారణాలలో జ్వరం కూడా ఉంటుంది. అంతే కాక వళ్ళు నొప్పులూ , ఆకలి లేక పోవడం కూడా ఉంటాయి !
మలేరియాలో అయితే , ఈ లక్షణాలు ఒక తరహాలో వస్తూ ఉంటాయి. అంటే మలేరియా లో కూడా రకాలు ఉంటాయి ముఖ్యం గా మూడు రకాలు ! ఆ రకాన్ని బట్టి, మొదటి రోజు పై లక్షణాలు ఉంటే , రెండో రోజు విడిచి మళ్ళీ మూడో రోజు పైన చెప్పిన లక్షణాలు ఒక రకమైన మలేరియాలో వస్తాయి ! అట్లాగే మిగతా రకాలలో కూడా రెండు రోజులు విడిచి మూడో రోజూ , నాలుగో రోజూ లక్షణాలు కనిపిస్తాయి ! దీనికి కారణం  మలేరియా సూక్ష్మ క్రిములు  ( ఇవి ప్లాస్మోడియం జాతి కి చెందినవి అని అంటారు ) ఒక నిర్ణీత సమయానికి రక్తం లోకి ఒక్క సారిగా ప్రవేశించడం వల్ల !  అదే కారణం వల్ల  తలనొప్పి కూడా నిరంతరం గా రాకుండా ఈ సమయాలలోనే వస్తూ ఉంటుంది !  ఈ లక్షణాలు గమనించిన వారు , కేవలం  క్రోసిన్ మాత్రలతో ఉపశమనం పొందుదామనుకుంటే పప్పులో కాలేసినట్టే ! వారు వెంటనే మలేరియా మాత్రల కోసం డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవడం ఉత్తమం !
2. పిడుగు లాంటి తలనొప్పి ( దీనిని ఆంగ్లం లో థన్ డ ర్ క్లాప్ హెడేక్ అంటారు ) : ఈ తలనొప్పి తీవ్రం గా ఒక్క సారిగా పిడుగు లా వచ్చి మీద పడుతుంది ! కేవలం కొద్ది సెకన్లు లేదా నిమిషాలలోనే ! అందుకనే ఆ పేరు వచ్చింది !  ముఖ్యం గా మెదడు లో రక్త నాళాలు చిట్లడం వల్ల ఈ రకమైన తలనొప్పి వస్తుంది దీనిని అప్పుడు సబారక్నాయిడ్  హెమరేజ్ అంటారు !  ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యసహాయం అత్యవసరం గా అందించాలి ! కంట్రోలు తప్పిన అధిక రక్త పీడనం కూడా ఈ రకమైన తలనొప్పికి కారణం అవుతుంది !  అప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోక పొతే , ఆ అధిక రక్త పీడనం మెదడు లోని అతి సున్నితమైన రక్తనాళాలను చిట్లింప చేసి , పక్షవాతానికి దారితీస్తుంది ! మెనింజైటిస్: మెదడు పొరలలో వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తీవ్రమైన  తలనొప్పి కి కారణం అవవచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూన్ 4, 2013 at 10:51 ఉద.

5. నిర్లక్ష్యం చేయ కూడని తలనొప్పులు. 

 
తలనొప్పి సర్వ సాధారాణ మైన లక్షణం కావడం చేత ,  దానిని అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా , తమ పనులు ( బాధ ను అనుభవిస్తూ కూడానే ) తాము చేసుకునే వారు చాలా మంది ఉంటారు.వారి అభిప్రాయం కొంత వరకూ యదార్ధమే ! ఎందుకంటే , తలనొప్పి సామాన్యం గా స్వల్పమైన కారణాల వల్ల వస్తుంది ! తాత్కాలికం గానే ఉంటుంది. ఉపశమనం కూడా త్వరిత గతిని ఉంటుంది. కొన్ని తలనొప్పులు ” నిజంగానే తలనొప్పులు ” అవుతాయి. ఆ తలనొప్పులను నిర్లక్ష్యం చేస్తే , కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది !వాటి గురించి కొంత తెలుసుకుందాం !
1. చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పి : 
a ప్రమోద్ ఆరేళ్ళ వయసు ఉండి , చాలా చురుకు గానూ , తెలివి గానూ  ఉండే బాలుడు. కిండర్ గార్డెన్ నుంచి మారి , ప్రైమరీ స్కూల్ కు వెళ్ళడం మొదలు పెట్టిననాటి నుంచీ , చురుకు తనం తగ్గింది ! తరచూ తలనొప్పి అని చెప్పే వాడు , అమ్మతో , ఇంటికి వచ్చాక ! అమ్మ కొత్త స్కూల్ ఇష్టం లేక అట్లా చెబుతున్నాడనుకుంది !మిగతా లక్షణాలు ఏమీ లేవు !  అట్లా గే బుజ్జగించుతూ , స్కూల్ కు తీసుకు వెళ్తూ ఉండేది !  కానీ ప్రమోద్ తలనొప్పి తగ్గలేదు ! క్లాసులో వెనక లైను లో కూర్చుంటున్నాడు ! బోర్డు మీద రాసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్ప లేక పోతున్నాడు !  దానితో  రిజల్టు బాగా రావాలనే లక్ష్యమే  పెట్టుకుని , ప్రమోదు కు చీవాట్లు పెడుతున్నాడు టీచరు !   కానీ టీచరు కానీ , తల్లి కానీ , లోతుగా పరిశీలించి , సమస్య ను అర్ధం చేసుకోలేక పోయారు ! వెంటనే చిన్న పిల్లల మానసిక నిపుణు రాలి దగ్గరికి తీసుకు వెళ్ళారు !  అన్ని వివరాలూ కూ లంక షం గా పరిశీలించిన తరువాత ఆమె ”  ప్రమోద్ కు ఉన్న సమస్య ప్రధానం గా కంటి చూపు లో అవకతవక లు ఉన్నాయని !  అందుకే , బోర్డు మీద రాసినది చదవలేక పోతున్నాడని ! ఇంట్లో టీవీ చాలా దగ్గరగా చూస్తూ ఉండడం వల్ల దానికే అలవాటు పడి పోయాడని , క్లాసులో చివరి లైను లో కూర్చుని బోర్డు మీద రాసేది చూడడం కష్టం అవుతుందని ! అందుకే తలనొప్పి వస్తుందని ”  కూడా వివరించింది ! తల్లి ప్రమోద్ ను హత్తుకొని, తన పొరపాటు ను అనునయం గా ప్రమోద్ కు చెప్పి కళ్ళ  పరీక్ష చేయించడానికి సిద్ధం అయింది !
ఇక్కడ తల్లి దండ్రులకు పాఠం :  కేవలం తలనొప్పే అయినా చిన్న పిల్లలలో వచ్చే తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు ! 
b. చిన్న పిల్లలలో తక్కువ సమయం లో జ్వరమూ అంటే హై ఫీవర్  , తీవ్రమైన తలనొప్పి వచ్చి , వాంతులు చేసుకోవడమూ , ఏమీ తినక పోవడమూ చేస్తూ ఉంటే కూడా అశ్రద్ధ చేయకూడదు ! ఆ లక్షణాలు , మలేరియా లక్షణాలైనా , మెనింజైటిస్ లాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ లైనా కావచ్చు !   
c. కొన్ని కొన్ని పడని ఆహార పదార్ధాలు మొదటి సారిగా తింటే , లేదా మళ్ళీ , తెలియకుండానే తింటే కూడా, చిన్న పిల్లలలో తీవ్రమైన తలనొప్పి కలగ వచ్చు ! అతి సూక్ష్మ పరిమాణం లో వివిధ చాక్లెట్ లలోనూ , పానీయాలలోనూ కలిపే , కలరెంట్ లు అంటే రంగు రాసాయనాలు ,లేదా రుచిని ఎక్కువ చేసే రసాయనాలు కూడా తలనొప్పి కి కారణం అవ వచ్చు ! 
d. చిన్న పిల్లలు ఆటల్లోనూ అల్లరి చేస్తున్నప్పుడు కూడా క్రింద పడి , తలకు దెబ్బలు తగిలించుకోవడం కూడా సామాన్యమే ! కానీ ఇట్లా తలకు దెబ్బ తగిలాక , తీవ్రంగా తలనొప్పి కలగడమూ , వాంతులు రావడమూ , జరిగితే , ఆ లక్షణాలు , తలదెబ్బ తీవ్రత ను తెలియ చేస్తాయి ! అత్యవసరం గా స్పెషలిస్టు సహాయం తీసుకోవాలి ఆ సమయాలలో , కేవలం తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయక !
e .చిన్న పిల్లలు ఎక్కువ సమయం ఎండలో తిరిగినా , లేదా ఆడినా కూడా  ఎండ దెబ్బ లేదా వడ దెబ్బ తగిలి తలనొప్పి వస్తుంది, అప్పుడు అత్యవసరం గా ప్రధమ చికిత్స చేయాలి. ఆశ్రద్ధ చేసి పరిస్థితి ని విషమం చేసుకో కూడదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

4. మైగ్రేన్ కు చికిత్స ఉందా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 2, 2013 at 10:10 ఉద.

4. మైగ్రేన్ కు చికిత్స ఉందా ?

మైగ్రేన్ తలనొప్పి బాధాకరం గానూ , జీవితాలను అస్తవ్యస్తం చేసేది గానూ ఉంటుంది.  మైగ్రేన్ కు ఖచ్చితమైన చికిత్స లేదు. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమయేవి అన్నీ కేవలం మైగ్రేన్ లక్షణాలను ఉపశమనం కలిగించే మందులే !
1. పారా సె టమాల్ ( క్రోసీన్ ) టాబ్లెట్స్ :  మైగ్రేన్ సమయం లో తలనొప్పిని తగ్గించడానికి సాధారణం గా తీసుకునే టాబ్లెట్.  ఈ టాబ్లెట్ ను మైగ్రేన్ మొదటి దశలోనే వేసుకోవడం మంచిది. ఎందుకంటే , హెడేక్ దశ వచ్చే సమయానికి , ముందే వేసుకున్న టాబ్లెట్ లు పని చేయడం మొదలెడతాయి. ( సామాన్యం గా ఏ టాబ్లెట్ అయినా పని చేయాలంటే, మింగిన తరువాత కనీసం రెండు మూడు గంటలు పడుతుంది ). అంతే కాక, రోజుకు   ఎనిమిది టాబ్లెట్స్ కన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ( అంటే  రెండు టాబ్లెట్స్ ఒక్కో సారిగా , అంటే నాలుగు నుంచి ఆరుగంటల వ్యవధి లో రోజుకు నాలుగు సార్ల కన్నా ఎక్కువ గా తీసుకోకూడదు ). 
2. ట్రి ప్టాన్ టాబ్లెట్స్ : ఈ మందులు మెదడు లోని రక్తనాళాలను సంకోచ పరిచి మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తాయి ( మైగ్రేన్ లో రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల తీవ్రమైన తలనొప్పి కలుగుతుందని భావించ బడుతుంది  అందువల్ల )కానీ ఈ ట్రి ప్టాన్ టాబ్లెట్స్ , అందరిలోనూ ఒకే విధం గా పని చేయక పోవచ్చు. 
3. ఐబూ ప్రోఫెన్ , డిక్లో ఫెనాక్ లాంటి మందులు : ఈమందులు కూడా కొంత మందిలో చక్క గా పని చేసి తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి కానీ ఆస్థమా ఉన్న వారు ఈ మందులు వేసుకో కూడదు. ఆస్థమా ఉన్న వారు , స్పెషలిస్ట్ డాక్టర్ ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.  
4. హార్మోనులు : ఋతుక్రమ మైగ్రేన్ ఉన్న వారు ( అంటే ఋతుక్రమ సమయం లో మైగ్రేన్ తలనొప్పి వస్తుంటే )  హార్మోనులు , ప్రత్యేకించి , ఈస్ట్రో జెన్ పాచెస్ ( అంటే వీటిని దేహం లో ఒక చోట అతికించుకోవాలి ) లేదా కాంట్రా సేప్టివ్ పిల్స్ తీసుకుంటే , కూడా మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.  కాక పొతే స్పెషలిస్ట్ పర్యవేక్షణ లోనే ఇది జరగాలి.  
మైగ్రేన్ ఎటాక్ వచ్చిన సమయం లో ఏమిచేయాలి ?
చాలా వరకూ , మైగ్రేన్ తలనొప్పి వచ్చిన సమయం లో  ఒక ప్రశాంతమైన, చీకటి గది లో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం , లేదా నిద్ర పోవడం లాంటి చర్యలు తీసుకుంటే , తలనొప్పి తగ్గుముఖం పడుతుంది ! కొంత మంది కి కడుపులో వికారం గా అనిపించి వాంతి చేసుకోవడం జరుగుతుంది. అట్లా వాంతి అయినాక , వారి తలనొప్పి కూడా తగ్గి పోతుంది ! 
ఇంకో ముఖ్య సూచన : మైగ్రేన్ ఉన్న వారు , తలనొప్పి తగ్గడానికి మందులు వేసుకుంటున్నా , వారు సాత్వికమైన ఆహారం కూడా తింటూ ఉండాలి ఆ సమయం లో !ఎందుకంటే , నొప్పి తగ్గించడానికి వేసుకునే మాత్రలు కడుపులో మంట కూడా కలిగిస్తాయి ! ఆ సమయాల లో మసాలా వంటకాలూ , ఎక్కువ నూనె లో వండిన వంటకాలూ తింటే , కడుపులో మంట అధికం అవడానికి అవకాశాలు ఎక్కువ ! 
మైగ్రేన్ ను నివారించ వచ్చా ?: 
క్రితం టపాలలో వివరించినట్టు గా మైగ్రేన్ ఏ ఏ  పరిస్థితులలో వస్తుందో , ఎవరికి వారు అనుభవ పూర్వకం గా తెలుసుకుని , తదనుగుణం గా నివారణ చర్యలు తీసుకోవాలి. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

3. మైగ్రేన్ కారణాలు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health on జూన్ 1, 2013 at 11:34 ఉద.

3. మైగ్రేన్ కారణాలు ఏమిటి ?

The Pathways of Migraine

కారణాలు ఖచ్చితం గా తెలియక పోయినా , మెదడు లో సీరొ టోనిన్ అనే జీవ రసాయనం తక్కువ అవడం తో మైగ్రేన్ మొదలవుతుందని భావించ బడుతుంది !మెదడు సరిగా పని చేస్తున్నప్పుడు , అనేక రకాలైన జీవ రసాయనాలు ఉత్పత్తి అవుతూ , మళ్ళీ వాటి ధర్మాలు నిర్వర్తించిన తరువాత, అవి విభజన చెందుతూ ఉంటాయి . సీరో టోనిన్ మెదడు లో ఒక్క సారిగా తక్కువ అవగానే మెదడు లో రక్త నాళాలు సంకోచం చెందుతాయి !  కళ్ళు బైర్లు కమ్మినట్టు , లేదా కంటి ముందు ఉండే వస్తువు మసక గా మెరుపులతో కనబడడం కూడా , ఈ కారణం వల్లనే అనుకోబడుతుంది అంటే  మైగ్రేన్ లో రెండో దశ అయిన ఆరా అనే దశ. తరువాత కొద్ది సమయానికి సంకోచం చెందిన రక్త నాళాలు వ్యాకొచిస్తాయి. దీనితో మూడవ దశ అయిన హెడేక్ , తీవ్రమైన తలనొప్పి కలగడం జరుగుతుంది. మైగ్రేన్ కనబడుతున్న వారి మెదడు లో సీరో టోనిన్ ఆకస్మికం గా ఎందుకు తగ్గుతుంది?  అనే విషయం ఇంత వరకూ నిర్ధారణ కాలేదు. 
హార్మోనులు: ప్రత్యేకించి స్త్రీలలో మైగ్రేన్ ఎక్కువ గా ఉండడం వల్ల , మైగ్రేన్ కు స్త్రీ హార్మోనులు కూడా కారణమని భావించ బడు తుంది. మైగ్రేన్ వచ్చే స్త్రీలలో , వారికి ఋతు క్రమ సమయం లో ఈ మైగ్రేన్ లక్షణాలు ఎక్కువ గా కనబడుతూ ఉంటాయి. అప్పుడు వచ్చే ఆ మైగ్రేన్ ను ‘ ఋతుక్రమ మైగ్రేన్ ‘ అని అంటారు. కానీ ఎక్కువ మంది స్త్రీలలో మైగ్రేన్ , ఋతుక్రమం తో సంబంధం లేకుండా కూడా వస్తూ ఉంటుంది. 
మిగతా కారణాలు ఏమిటి ?:
శారీరిక కారణాలు ( ఫిజికల్ ):పని వత్తిడి వల్ల ఎక్కువ అలిసి పోవడం , తక్కువ గా నిద్ర పోవడం , ఒకే అననుకూల పొజిషన్ లో మెడను ఎక్కువ సమయం ఉంచడం , ఎక్కువ సమయం ప్రయాణం చేయడం , ఇవన్నీ కూడా మైగ్రేన్  రావడానికి కారణాలు అవవచ్చు.
భావోద్వేగ కారణాలు ( ఎమోషనల్ ): ఏ కారణం చేత నైనా విపరీతమైన ఆందోళనా, మానసికమైన వత్తిడి చెందితే , లేదా విపరీతం గా ఉత్సాహం అంటే ఎగ్జైట్ చెందితే , లేదా తీవ్రమైన షాక్ కు గురి అవుతే ( అంటే ఎలెక్ట్రిక్ షాక్ కాదు , వారి మనసును తీవ్రం గా ఆకస్మికం గా గాయ పరిచే ఏ సంఘటన అయినా షాక్ కు కారణం అవవచ్చు ).
పరిసరాల కారణాలు ( ఎన్విరోన్ మెంటల్ ): అత్యంత వెలుతురూ, నియాన్ లైట్ ల వెలుతురూ , టీ వీ లో అప్పుడప్పుడూ కనిపించే వివిధ రకాల వెలుగు మెరుపులూ , చెవులు పేలి పోయేంత గా వినిపించే శబ్దాలూ , సంగీతాలూ , బాగా చెమట పట్టించే ఉక్క పోత గా ఉన్న పరిసర వాతావరణమూ , బాగా స్మోక్ చేసి , వారు వదిలిన స్మోక్ లో ఉండే వాతావరణం – ఇవన్నీ కూడా మైగ్రేన్ ఎటాక్ రావడానికి కారణాలు ఆవ వచ్చు. 
తినే ఆహారం ( డైట్ ): విపరీతం గా కాఫీలు, టీలు తాగే అలవాటు , మద్యం తాగే అలవాటు , ఆహారం తీసుకునే సమయాలలో అవక తవకలూ , లేదా డ యటింగ్ చేస్తూ సరిగా ఆహారం తినక పోవడం  కొన్ని పడని పదార్ధాలు , జున్ను , చాక్లెట్ , సిట్రస్ ఫ్రూట్ లాంటి ప్రత్యేక మైన ఆహార పదార్ధాలు కూడా  మైగ్రేన్ కలిగించ వచ్చు. 
తీసుకునే ఇతర మందులు: కొన్ని రకాలైన నిద్ర మాత్రలు , ముఖ్యం గా స్త్రీలు వేసుకునే  హార్మోను టాబ్లెట్లు (  కాంట్రా సె ప్టివ్ టాబ్లెట్ లు ) కూడా మైగ్రేన్ కలిగించ వచ్చు . 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

2. మైగ్రేన్ ( migraine ) తలనొప్పిని ఎట్లా కనుక్కోవచ్చు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 31, 2013 at 9:55 ఉద.

2. మైగ్రేన్ తలనొప్పిని ఎట్లా కనుక్కోవచ్చు ?

మైగ్రేన్ చాలా సామాన్యం గా  కనిపించే తలనొప్పి.  పురుషులకన్నా స్త్రీల లో, ఈ మైగ్రేన్ తలనొప్పి ఎక్కువ గా కనబడుతుంది. ఈ తలనొప్పి తలకు ఒక ప్రక్కగా వస్తుంది, అందుకనే దీనిని తెలుగులో పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు.  ఈ నొప్పి చాలా తీవ్రం గా భరించ లేనిది గా ఉంటుంది !  సాధారణం గా ఈ తలనొప్పి అయిదు దశల లో ఉంటుంది.  తరచూ ఈ రకమైన మైగ్రేన్ వస్తూ ఉంటే , ఈ దశలను గమనించడం ముఖ్యం. ఎందుకంటే ఈ దశల గురించిన అవగాహన ఉంటే ,ఈ రకమైన నొప్పి మొదటి సారిగా అనుభవిస్తున్న వారు అప్రమత్తత తో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్లి తగిన సలహా , చికిత్సా పొందగలరు !

 
1.తొలి దశ :  దీనినే ప్రోడ్రోమల్ దశ అని కూడా అంటారు : ఈ దశ  అసలైన తలనొప్పి కి ముందు కొన్ని గంటలు కానీ , రోజులు కానీ ఉంటుంది. ఈ దశలో , అతి గా చీకాకు పడడమూ , డిప్రెషన్ లో వారి మూడ్ ఉండడమూ , కోపం గా ఉండడమూ , లేదా కొంత తక్కువ స్థాయి లో కండరాల నొప్పులూ బలహీనతా ఉండడమూ జరుగుతాయి. 
2.ఆరా ( aura ): ఈ రెండవ దశ ను ఆరా అంటారు. ఈ దశలో  ముఖ్యం గా కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడమూ , కళ్ళ ను ఏ వస్తువు మీదా క్రితం లో మాదిరి గా కేంద్రీకరించలేక పోవడమూ , లేదా కళ్ళ ముందు మెరుపులూ , ఎక్కువ కాంతి గా ఉన్నట్టూ కూడా అనిపించ వచ్చు ! ఈ దశ సామాన్యం గా పదిహేను నిమిషాల నుంచి  ఒక గంట వరకూ ఉండవచ్చు ! ( పైన ఉన్న చిత్రం గమనించండి  ) 
3.తలనొప్పి దశ : ఇక ఎక్కువ బాధా కరమైన ఈ మూడో దశ లో , ఎక్కువ వెలుతురు ను చూడలేక పోవడమూ , తలకు ఒక ప్రక్క భాగం లో తీవ్రమైన నొప్పి కలగడమూ , వికారం గా కడుపులో తిప్పినట్టు ఉండడమూ , చీకటి లో ఒక మూల కళ్ళు మూసుకుని , వెలుతురు చూడలేక , పడుకోడమూ , జరుగుతుంది ! ఈ దశ కొన్ని గంటలు ఉండవచ్చు ! 
4.తగ్గే దశ : సామాన్యం గా నిద్ర పోయి లేచిన వెంటనే , నొప్పి తగ్గు ముఖం పడుతుంది. కొందరు వాంతి చేసుకోగానే కూడా ఈ పార్శ్వపు నొప్పి మాయం అవుతుంది !
5.తగ్గాక ఉండే లక్షణాలు : ఈ దశను రికవరీ దశ అని కూడా అంటారు : ఈ దశలో సామాన్యం గా ఎక్కువ గా అలసి పోయి ,  బలహీనం గా ఉన్నట్టు అనిపిస్తుంది.  
పైన తెలియ చేసిన లక్షణాలు  అన్నీ అందరిలోనూ రావాలనే నియమం ఏదీ లేదు. కొందరిలో  ఆరా లేకుండా అంటే రెండవ దశ లేకుండానే మైగ్రేన్ రావచ్చు ,అప్పుడు ఈ నొప్పిని మైగ్రేన్ అని గుర్తించడం కష్టం అవుతుంది. ఇంకొందరు అదృష్ట వంతులలో , తలనొప్పి రాకుండా , కేవలం మిగతా లక్షణాలు మాత్రమే ఉండవచ్చు. 
 
వచ్చే టపాలో మైగ్రేన్ గురించిన మిగతా సంగతులు తెలుసుకుందాం ! 

1. టెన్షన్ హెడేక్.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on మే 30, 2013 at 12:10 సా.

1. టెన్షన్ హెడేక్. 

టెన్షన్ హెడేక్ తలనోప్పులన్నిటిలోనూ  సర్వ సాధారణ మైనది. 
టెన్షన్ హెడేక్ ఎట్లా ఉంటుంది?: 
సామాన్యం గా టెన్షన్ హెడేక్ తలకు రెండు ప్రక్కలా ఉంటుంది. అంతే కాక ఇది  స్థిరం గా ఒకే రకమైన నొప్పి కలిగిస్తుంది. ఇది ఉన్న వారికి వారి మెడ వెనుక ఉన్న కండరాలు కూడా బిగుతు గా ఉన్న అనుభవమూ , ఇంకా కళ్ళ లో నొప్పులు కూడా ఉండ వచ్చు !
కనీసం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ రకమైన నొప్పి ఉండ వచ్చు. తీవ్రమైన నొప్పి, కొన్ని రోజులు కూడా బాధించ వచ్చు !
టెన్షన్ హెడేక్ రావడానికి కారణాలు ఏమిటి ?:
పేరులోనే ఉన్నట్టు , టెన్షన్ హెడేక్ , తీవ్రమైన వత్తిడి కలిగే సందర్భం ఏది ఉన్నా కూడా వస్తుంది. ఆ సందర్భం ఇతరులకు టెన్షన్ కలిగించక పోవచ్చు కానీ అనుభవించే వారికి ఆ పరిస్థితి  క్లిష్టం గానూ , వత్తిడి గానూ అనిపించ వచ్చు. విద్యార్ధులకు పరీక్షా సమయాల ముందూ , ఉద్యోగస్తులకు , వారి పని ఎక్కువ గా ఉండి , తక్కువ సమయం లో ఆ పనిని పూర్తి చేయ వలసి వచ్చినపుడూ , కూడా టెన్షన్ హెడేక్ వచ్చే అవకాశాలు హెచ్చు ! నిరంతరం భావోద్వేగాలకు లోనయే వ్యక్తులలో కూడా టెన్షన్ హెడేక్ తరచూ వస్తుంది.  స్వభావ రీత్యా అతి సున్నిత మనస్కులూ ,  శరీర రీత్యా కూడా , వారి పరిసరాలలో , వచ్చే మార్పులకు కూడా తట్టుకోలేని వారూ , ఈ టెన్షన్ హెడేక్ బారిన పడుతూ ఉంటారు ! చాలా ఎక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాలలో , లేదా ఎక్కువ  శబ్ద కాలుష్యం ఉన్న స్థానాలలో ఈ టెన్షన్ హెడేక్ వచ్చే అవకాశాలు మెండు గా ఉంటాయి. కొన్ని భరించలేని వాసనలూ , ఇంకా స్త్రీలలో ఋతుక్రమ సమస్యలూ కూడా ఈ టెన్షన్ హెడేక్ లకు కారణం అవ వచ్చు ! కాఫీలు రోజంతా తాగే వారికి , ఇంకో సమయం లో కాఫీలు అందక పొతే కూడా ఈ రకమైన హెడేక్ రావడానికి అవకాశం ఉంటుంది ( అప్పుడు ఈ పరిస్థితి ని కెఫీన్  విత్ డ్రా వల్ హెడేక్ అంటారు ). 
టెన్షన్ హెడేక్ ను ఎట్లా కనుక్కోవడం ?: సామాన్యం గా టెన్షన్ హెడేక్ ను , అది వచ్చిన వారే తెలుసుకోగలరు , వారి పరిస్థితులలో ఏ మార్పులు  వారి తలనొప్పి కి కారణం అవుతున్నాయో !  ఎందుకంటే , ఇట్లాంటి హెడేక్ లకు ఒక  పధ్ధతి ఉండి , ఆ యా ప్రత్యేక , ప్రతి కూల సమయాలలోనే వస్తుంటాయి కనుక !వారి వయసు  ముప్పై ఏళ్ళు దాటి , వారు బరువు కూడా వారి వయసుకూ , ఎత్తుకూ తగ్గట్టు ఉండక , ఊబకాయం తో ఉంటే , వారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం మంచిది , వారికి రక్త పీడనం అధికం గా ఉందో లేదో తెలుసుకోడానికి ! 
టెన్షన్ హెడేక్ కు చికిత్స ఉందా ?
సామాన్యం గా ప్రతి హెడేక్ లాగానే , తలనొప్పి మాత్రలు తీసుకుంటే , ఈ హెడేక్ తగ్గుతుంది , కానీ ముఖ్యం గా చేయ వలసినది , వారు ఏ పరిస్థితులలో అయితే ఎక్కువ టెన్షన్ పొందుతున్నారో , వాటిని నియంత్రించు కోడానికి ప్రయత్నం చేయాలి !ఎందుకంటే , రోజూ టెన్షన్ హెడేక్ వస్తుంటే , రోజూ తలనొప్పి మాత్రలు వేసుకోవడం ఎంత సమంజసం కనుక ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తల నొప్పి.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 29, 2013 at 8:50 సా.

తల నొప్పి. 

తల నొప్పి సర్వ సాధారణమైన  లక్షణం. ప్రతి వారూ వారి జీవితం లో ఎప్పుడో ఒక సమయం లో తలనొప్పిని అనుభవించి ఉంటారు ! 
కొందరికి ఉదయం లేవడం తలనొప్పి  అనిపిస్తే , స్కూల్ కు బయలు దేరి వెళ్ళడం , లేదా ఆఫీస్ కు వెళ్ళడం ఇంకో తలనొప్పి !
వెళ్ళాక అక్కడ నెగ్గుకు రావడం ఇంకో తలనొప్పి ! 
అక్కడ ఇష్టం లేని వ్యక్తులతో కలవడమే కాకుండా సాయింత్రం వరకూ పని చేయడం కూడా తల నొప్పే ! 
ఇంటికి చేర్చే బస్సు ఆలస్యం అవుతే ఒక తలనొప్పి ! 
బస్సులో ఇరుకు గా అందరి మధ్య లో ఇరుక్కుని ప్రయాణించడం ఇంకో తలనొప్పి ! 
ఇక యువతులకు , వారిని వీలైనన్ని స్థానాలలో , వీలున్నప్పుడల్లా, లేదా వీలు చేసుకుని మరీ తాకే ప్రయత్నాలు చేస్తున్న  మృగా ళ్ళను  తప్పించుకోవడం ఇంకో తలనొప్పి !
ఈ తలనొప్పులు ఒక ” తలనొప్పి ” గా పరిణమించి , ప్రపంచమంతా టన్నుల కొద్దీ తలనొప్పి మాత్రలు మింగుతున్నారు ప్రజలు ! అంతే కాక , వారు ఒక సారో రెండు సార్లో కాక , తలనొప్పి మాత్రలు ఒక అలవాటు గా నెలలూ , సంవత్సరాలూ వేసుకుంటూ ఉంటారు ! వాటి అనర్ధాలూ , సైడ్ ఎఫెక్ట్ లూ ఏమాత్రం తెలుసుకోకుండానే !  
మరి తలనొప్పులన్నీ ఒకటే కారణం చేత వస్తాయా ? ప్రతి తలనొప్పికీ మందు మాత్రలు వేసుకోవాలా ?  ఏ తలనొప్పులను అశ్రద్ధ చేయకూడదు ? అనే విషయాలు వచ్చే టపానుంచి వివరం గా తెలుసుకుందాం !  టపాలు చదువుతూ , తలనొప్పి కనుక వస్తే తెలియచేయండి !  ( అప్పుడు ,  మీరు ఏ మాత్రా వేసుకోకుండానే , మీ చేతిలో ఉన్న ” మూషికం ” తో ఒక్క క్లిక్కుతో  నే మీ తలనొప్పిని మటు మాయం చేసుకోండి , ఒక్క పైసా ఖర్చు లేకుండానే ! )