Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

స్త్రీలలో కేశ వర్ధనం . 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 24, 2013 at 10:54 సా.

స్త్రీలలో కేశ వర్ధనం . 2. 

నీ వాలు జడలో సంపెంగలు, 
ఉన్మత్తుని చేసే నులి వెచ్చని సెగ లు !  

తుమ్మెద రెక్కలు, నీ కురులు !
తగిలితే , ఆ  విద్యుత్తీగలు, 
చేసె,  గజి బిజి గమ్మత్తులు !
రేగె  నాలో, సరాగాల రవ్వలు ! 
అవి పెనవేసే వేయి బంధాల వలలు !
 అతి సున్నితం, ఈ భవ బంధం 
అత్యున్నతం, నీ  మది బంధం !  
 
అని వలచినవాడు   మీ ‘ వలలో ‘  పడి పోవాలంటే,  మీరు,   మీ శిరోజాల మీద శ్రద్ధ వహించాల్సిందే  ! 
 
మరి ఇప్పుడు  స్త్రీలలో కేశాలు ఊడిపోవడం ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకుందాం ! 
1. యాన్ డ్రో జెనిక్ అలోపీశియా :  ( యాన్ డ్రో  జెనిక్ అంటే పురుష హార్మోనుల సంబంధమైన అని , అలోపీశియా అంటే   కేశాలు తక్కువ అవడం అనీ అర్ధాలు,   పెద్ద గా కంగారు అవసరం లేదు  ఈ పదాలు చదివి ! ) :  సాధారణం గా పురుష హార్మోనులు, స్త్రీలలో కూడా అతి తక్కువ పరిమాణం లో ఉంటాయి. ఏ  కారణం చేతనైనా ఈ పురుష హార్మోనులు కొద్ది మాత్రమైనా ఎక్కువ అవుతే , జుట్టు ఎక్కువ గా రాలడం జరుగుతుంది.తల లో ఏదో కొంత భాగం లో కాకుండా , తలంతా, కొద్దిగా  పలుచబడడం జరుగుతుంది, కేశ సాంద్రత తక్కువ అవడం వల్ల.  ఈ పరిస్థితులు , స్త్రీలు గర్భవతులు గా ఉన్నపుడూ , లేదా పురుష హార్మోనులు ఉన్న కాంట్రా సె ప్టివ్  పిల్స్ కొన్ని రకాలు ఉంటాయి , అవి తీసుకోవడం వల్ల  కానీ , లేదా అరుదైన అండాశయాలలో  కణుతులు  ఏర్పడడం , అంటే ట్యూ మర్  ఏర్పడడం వల్ల కానీ , ఏర్పడవచ్చు . ఈ కారణాలలో నివారింప దగ్గవి , గర్భ నిరోధక పిల్స్ తీసుకునే ముందు ,  అవి రాసే డాక్టర్ ను వివరం గా అడిగి ,  పురుష హార్మోనులు లేని పిల్స్ నే మీరు తీసుకోవడం చేయాలి ,  ఆ పిల్స్ మీరు తీసుకోవడం తప్పని సరి  అయే  పరిస్థితులు ఏర్పడితే !
2. టీలోజేన్ ఎఫ్లూవియం :   జీవితం లోనూ , లేదా శరీరం లోనూ కలిగే తీవ్రమైన వత్తిడి కలిగించే పరిణామాలకు రియాక్షన్ లేదా ప్రతి చర్య గా , మీ శిరోజాలు ఊడి పోవడం జరుగుతుంది. ఇట్లా జరగడం సామాన్యం గా ,  వత్తిడి పరిస్థితులు సంభవించిన ఆరు వారాల నుంచి , మూడు నెలల వరకు  ఉండవచ్చు !ఈ సమయం లో సామాన్యం గా ఊడిపోయే తల వెంట్రుకల కన్నా ఎక్కువ గా అంటే వందకు పైగా రోజుకు  ఊడి  పోవచ్చు !
మరి ఈ తీవ్రమైన వత్తిడి కలిగించే పరిస్థితులు ఏమిటి ? : ఇవి ఏవైనా కావచ్చు.  ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ కానీ , ఒక పెద్ద ఆపరేషన్ కానీ , గర్భం దాల్చి శిశువుకు జన్మ నీయడం కానీ , లేదా తీవ్రమైన మానసిక వత్తిడి కానీ అవవచ్చు. ఆశా వాద పరిణామం ఏమిటంటే , సామాన్యం గా  ఈ తీవ్రమైన శారీరిక , లేదా మానసిక వత్తిడి పరిస్థితులు, కేవలం తాత్కాలికం గానే   హేర్ లాస్ అంటే తల మీద జుట్టు ఊడేట్టు చేస్తాయి. అంటే ఆ పరిస్థితులు సద్దు మణిగిన తరువాత , తిరిగి  సహజమైన జుట్టు పెరగడమూ , తక్కువ గానే రోజూ ఊడి పోవడమూ జరుగుతుంది ! కేవలం తక్కువ శాతం స్త్రీలలో త్రమే,టీలోజెన్  పరిస్థితి ఎక్కువ కాలం కొన సాగుతుంది !  అప్పుడు వారు సరి అయిన సలహా తీసుకోవాలి , స్పెషలిస్టు డాక్టర్ ను సంప్రదించి !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో, కేశ వర్ధనం ఎట్లా ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 23, 2013 at 4:11 సా.

 స్త్రీలలో కేశ వర్ధనం ఎట్లా ? 1. 

Young woman with hair blowing in wind

మగువ  ఆనందపు సిరులు, 
స్నిగ్ధ సుకుమార విరులు ! 
కలువ కనులకు శృతి లయలు, 
కనువిందు చేసే కుంతల పాయలు ! 
ఉప్పొంగే  వలపు జల పాతాలు,
కాళ  రాత్రి ని తలపించే శిరోజాలు ! 
మరులూరించే   కురులు, 
కనినంతనే మెదలు ప్రేమ భావనలు ! ‘
 
మరి  ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న శిరోజాలు  ఊడిపోతూంటే ?! 
ఎంతో కోపం వస్తుంది ! చికాకు కలుగుతుంది ! ‘ హత విధీ !  ఎంత అందం గా ఉంటానో అని నా క్లాస్ మేట్స్ ప్రతి రోజూ నన్ను తలుచుకుని పారాయణం చేస్తూ ఉంటారు కదా ! కొందరు  పైకే ప్రార్ధన చేస్తారు ! మరికొందరు మది లో మంత్రోచ్చారణ చేస్తారు కదా ! అట్లాంటిది నా టైం  బాగోలేదా ఏంటి ? అని వనితలు  కారణాలు తెలుసుకోలేక  సతమతం అవుతూ ఉంటారు !  మరికొందరు వనితలు ఆఫీసులో ‘ మిస్  ఆఫీసు ‘ గా అనధికార బిరుదులు  పొందిన వారు కూడా , తమ శిరోజాలకు అతి ప్రాముఖ్యత ఇచ్చి, ఆ కేశాలు కొద్ది గా ‘ రాలినా’ ,  విపరీతం గా వ్యధ చెందుతూ ఉంటారు ! 
మరి జుట్టు ఊడి పోతూ ఉండడానికి కారణాలు ఏమిటి ? : 
స్త్రీలలో సామాన్యం గా ఒక లక్ష వరకూ వెంట్రుకలు ఉంటాయి వారి తలమీద ! సహజం గానే కనీసం రోజుకు యాభై నుంచి ఒక వంద వరకూ కేశాలు ఊడిపోతూ  ఉంటాయి ! ఇట్లా రోజుకు వంద వరకూ వెంట్రుకలు ఊడి పోవడం సర్వ సాధారణ మైన విషయం ! జుట్టు ఊడిపోవడానికి  నాలుగు రకాల ముఖ్య కారణాలు ఉంటాయి: 
1. వంశ పారంపర్యం గా ఒక వయసు వచ్చే ముందే జుట్టు ఊడి పోవడం కనుక , కుటుంబం లో పెద్దల లో సంభవిస్తే , తరువాతి తరాల వారికి కూడా , ఆ లక్షణాలు అనువంశికం గా సంక్రమిస్తూ ఉంటాయి ! 
2. భౌతికమైన కారణాల వల్ల : అంటే శరీరం లో వచ్చే   హార్మోనులలో మార్పులు కానీ , చర్మ సంబంధ వ్యాధులు కానీ , లేదా తల మీద జుట్టు మాత్రమే  ఊడి పోతూ ఉండే కొన్ని ప్రత్యేక  వ్యాధులు వస్తే కానీ , లేదా చర్మ సంబంధ ఇన్ఫెక్షన్ లు వస్తే కానీ. 
3. మానసిక కారణాల వల్ల : విపరీతమైన శ్రమ చేస్తూ , నిద్ర లోపించడం వల్ల ,  పని వల్ల  కానీ , చదువు కారణం గా కానీ , లేదా, ఇంటర్వ్యూ లేదా పరీక్షా సమయాలలో తీవ్రమైన  మానసిక వత్తిడి అనుభవిస్తూ ఉంటే కూడా తల వెంట్రుకలు ఊడి పోతూ ఉండడం జరుగుతుంది ! ఇక్కడ  చాలా సమయాలలో , శరీరం మీద కూడా ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా ,  సరిగా తినకుండా , నీరు తాగ కుండా , డీ హైడ్రేట్ అవుతూ ,  దానికి తోడు , నిద్ర కూడా లోపించి , వత్తిడి కి  ఆందోళన కూ గురి అవుతూ ఉండడం జరుగుతుంది !
4. మందుల కారణాలు : వివిధ కారణాల వల్ల  తీసుకునే మందులు కూడా జుట్టు ఊడి పోవడానికి ( అంటే ఎక్కువ గా జుట్టు కోల్పోవ డానికి  )  అవకాశం హెచ్చుతుంది ! 
అధిక రక్త పీడనానికి , గుండె జబ్బుకూ , డిప్రెషన్ కూ , కీళ్ళ నొప్పులకూ , క్యాన్సర్ కూ  వాడే మందులు కూడా ఎక్కువ వెంట్రుకలు రాలేట్టు చేస్తాయి ! స్త్రీలలో ప్రత్యేకించి గర్భ నిరోధానికి వేసుకునే కాంట్రా సె ప్టివ్  పిల్స్ కూడా ఒక ముఖ్య కారణం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
 
 

ముందు పరీక్షలతో మందు దాసులకు వార్నింగు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on జూలై 21, 2013 at 4:44 సా.
ముందు పరీక్షలతో మందు దాసులకు వార్నింగు ! 
మందు  ! అదే, మద్యం ! అంటే ఆల్కహాలు ! 
కొద్ది పరిమాణాలలో భలే పసందు ! 
మదనుడి తో మధనం చేయించే  మందు ! 
కామ కాంక్ష ను తీవ్రం చేసే మందు ! 
కోరికల జ్వాల ను రగిలించే మందు ! 
ప్రభుత్వాల ఖజానాలు నింపే మందు 
తాగే వారి జేబు కు చిల్లి పెట్టేమందు !
పరిమాణం పెరిగితే , వేయిస్తుంది చిందు !
కాలేయాన్ని కల్లోలం చేస్తుంది ముందు ! 
కిక్కు కిక్కుకూ ప్రమోదం తెరమార్చిఇస్తుంది ఖేదం !  
క్రోధం , ఉద్రేకం పెరిగి , నిషా చేస్తుంది విషాదం ! 
 
మరి రక్త పరీక్ష ల తో  మందుకు బానిస అయామో లేదో  ముందే తెలుసుకోవచ్చా ?!:  
రక్త పరీక్షలతో  మందుకు మనం బానిస అయామా లేదా అన్న విషయం ముందు గానే తెలుసుకోవచ్చు !  అంటే కొన్ని సంవత్సరాల ముందే !  అట్లా తెలుసుకుంటే , తగిన జాగ్రత్తలు తీసుకుని మందు మానితే , ఆరోగ్యం కుదుట పడడానికి అవకాశం ఉంటుంది ,  ఇల్లూ , ఇల్లాలూ దక్కడానికి అవకాశం ఉంటుంది కూడా ! ఈ ఐదు రకాల పరీక్షలూ రక్త పరీక్షలే ! వీటి వివరాలు చూద్దాం !
G : గామా గ్లుటామిక్ ట్రాన్స్ ఫరేజ్ పరీక్ష. 
A: ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ ఎంజైమ్ పరీక్ష. 
M: MCV: అంటే మీన్ కార్పస్క్యులార్ వాల్యూమ్ పరీక్ష .
U: యూరిక్ యాసిడ్  పరీక్ష .
T: ట్రైగ్లిజరైడ్లు పరీక్ష .   
పైన ఉన్న ఐదు పరీక్షలలో , నాలుగు కాలేయం లో ఉండే ఎంజైముల  పరీక్షలే ! ఈ ఎంజైములు కాలేయ కణాలు అంటే  లివర్ సెల్స్  లో సహజం గా ఉండే ఎంజైములే ! కానీ ఈ కాలేయ కణాలు  మద్యం ముట్టడి చేయడం వల్ల, శక్తి హీనం అవడమూ ,  బలహీన పడడమూ జరిగి , ఈ ఎంజైములు , ఆ కణాల నుంచి రక్తం లో కి విడుదల అవుతూ ఉంటాయి !   ఐదో పరీక్ష  MCV పరీక్ష: ఈ పరీక్షలో ఎర్ర రక్త కణాల పరిమాణం కొలుస్తారు ప్రత్యెక మైన ఎలెక్ట్రానిక్ మైక్రోస్కోపు తో !  సాధారణం గా  ఎర్ర రక్త కణం పరిమాణం ఏడు పాయింట్ రెండు మైక్రాన్ ల వ్యాసం గా ఉంటుంది !  కానీ మద్యం ఎక్కువ గా , ఎక్కువ కాలం తాగుతూ ఉంటే, ఈ ఎర్రరక్త కణం ఉబ్బుతుంది ! అంటే పరిమాణం పెరుగుతుంది !  
ఈ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి ? : 
కనీసం ఏమీ తినకుండా , తాగకుండా ( అంటే మంచి నీరు తప్ప )  ఆరు గంటల పాటు ఉండి, అప్పుడు పై పరీక్షలు చేయించుకుంటే , ఫలితాలు  ఖచ్చితం గా ఉండడానికి అవకాశం హెచ్చుతుంది ! 
ఈ ఐదు పరీక్షలూ  అబ్నార్మల్ గా ఉంటేనే లివర్ చేడిపోయినట్టా?: 
సామాన్యం గా చాలాకాలం ఎక్కువ మోతాదు లో కనుక మద్యం తాగుతూ ఉంటే, క్రమేణా లివర్ కణాలు పాడవుతాయి !  ఒక సారి లివర్ కణాలు పాడవడం మొదలైనా కూడా తాగడం మానక పొతే ,  ఒక దశలో ఇక తాగడం ఆపినా కూడా   లివర్ చెడిపోవడం ఎక్కువ అవడం వల్ల,  జీవితానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది ! అందుకే , ముందుగానే మనం మందు దాసులమో కాదో తెలుసుకోవడం అతి ముఖ్యం ! ప్రత్యేకించి ఎక్కువ  మద్యం , తరచూ తాగుతూ   ” తమకు ఏమీ అపాయం ఉండదు ” అనుకునే   వారు ఈ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం ! (  సాధారణ గణితం  వచ్చిన వారికి   పై పరీక్షలు కూడా అవసరం లేదు ! ఎందుకంటే , వారు రోజూ ఎంత మోతాదు లో తాగుతున్నారో ! వారానికి ఎన్ని సార్లు తాగుతున్నారో , మననం చేసుకుంటే , వారి లివర్ కణాలు ఎంత త్వరగా , లేదా , ఆలస్యం గా పాడవుతాయో ఇట్టే తెలిసిపోతుంది కదా !  ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
 

8. ఆస్త్మా నివారణ చర్యలు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 10, 2013 at 9:36 సా.

8. ఆస్త్మా నివారణ చర్యలు ఏమిటి ?

ఆస్త్మా  ఎటాక్ లను నివారించడానికి , తల్లి దండ్రులు కానీ , లేదా ఆస్త్మా ను అనుభవిస్తున్న వారు కానీ చేయవలసినది చాలా ఉంది ! ఆ పని కష్టమైనది కాక పోయినప్పటికీ ,  శ్రద్ధ గా ఆ జాగ్రత్తలను తీసుకుంటే ,  ఆస్త్మా ఎటాక్ లు చాలా వరకూ నివారించు కోవచ్చు ! దానితో జీవితం లో క్వాలిటీని అనుభవించ వచ్చు , రోగ గ్రస్తులు గా విచారం గా జీవితం సాగదీయడం కన్నా ! మరి ఆ జాగ్రత్తలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం ! 
1. ఆస్త్మా ట్రిగ్గర్ లను నివారించుకోవడమూ , లేదా సాధ్యమైనంత వరకూ తగ్గించుకో వడమూ చేయాలి. 
a . పరిసరాల లో ఉండే గాలి స్వచ్చం గా ఉంచుకోవడం :  మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఎంతగా నియంత్రించు కుంటే అంత ఆస్త్మా ను నివారించుకోవచ్చు !మరి ఏవి పడుతున్నాయో , ఏవి పడడం లేదో ఎట్లా తెలుసుకోవడం ? :  ఆస్త్మా డైరీ ని ఏర్పరుచుకోవడం : అంటే,  కనీసం ఆరు నెలలు కానీ, ఒక సంవత్సరం కానీ ఆస్త్మా వస్తున్న వారు, వారి రోజువారీ దిన చర్య ను ఒక నోటు పుస్తకం లో రాసుకుంటూ ఉండాలి ! అంటే వారు ఆస్త్మా తో ఎట్లా యాతన పడుతున్నదీ రాసుకో మని కాదు కదా ! కానీ ఆస్తమా వస్తున్న రోజులలో ఎటాక్ తీవ్రత ఎంత ఉందీ , అట్లా ఎటాక్ రావడానికి , వాతావరణం లో కానీ , వారు నివసించే ప్రదేశం లో కానీ , వారి బట్టలలో ,లేదా వారి ఆహార పానీయాలలో కానీ ఏవిధమైన మార్పులు కలిగాయో , వివరం గా రాసుకుంటే , ముందు ముందు , ఆ యా ట్రిగ్గర్ లను నివారించుకో డానికి ఆ డైరీ ఎంతో ఉపయోగ కరం గా ఉంటుంది ! 
b . ఎలర్జీ లను నివారించుకోవడం : పైన చెప్పిన విధం గా ఆస్త్మా డైరీ ను కనుక రాసుకుంటే , ఆ యా ఎలర్జీ కలిగించే పదార్ధాలను కానీ , వాతావరణాన్ని కానీ నివారించుకోవచ్చు.
c . చల్లటి గాలి : కొందరికి బయట కానీ , ఇంట్లో కానీ , చల్లటి గాలి తగిలినా , ఆస్త్మా ఎటాక్ వస్తుంది. అది తెలుసుకున్న వారు చల్లటి గాలి వస్తున్న రెస్టారెంట్ లలో కానీ సినిమా హాల్స్ లో కానీ ప్రవేశించక పోవడం మంచిది !అదే విధం గా  సరి అయిన గాలీ వెలుతురూ లేని ప్రదేశాలలో , ముఖ్యం గా సూర్య రశ్మి సోకని ప్రదేశాలూ , ఇళ్ళ లో , ఆస్త్మా కారకమైన క్రిములే కాకుండా , విష పూరితమైన ఫంగస్ లు కూడా పెరిగి వాటి స్పోరులు అంటే పుప్పొడి , ( మన కళ్ళకు సామాన్యం గా కనిపించని పుప్పొడి రేణువులు ) కూడా ఆస్త్మా కలిగించే ఎలర్జన్ అయి , తరచూ ఆస్త్మా ఎటాక్ కలిగిస్తుంది !  అందువల్ల అట్లాంటి ప్రదేశాలలో కూడా సమయం గడపడం మంచిది కాదు  ఆస్త్మా ఉన్న వారికి , ప్రత్యేకం గా ! కుక్కలూ , పిల్లులూ , పావురాలూ ఇతర పక్షులూ పెంచుకునే వారి ఇళ్ళ లో ప్రవేశించడం కూడా , ఆస్త్మా ఎటాక్ కోరి తెచ్చుకోవడమే !
d . ఫ్లూ వైరస్ నుంచి దూరం గా ఉండడం !:  ఫ్లూ , ఇంకా ఇతర వైరస్ ల ఇన్ఫెక్షన్ లు కనుక సోకితే , ఊపిరితిత్తులు బలహీన పడడం జరుగుతుంది ! చిన్నారులలో ముఖ్యం గా  ఈ రకమైన ఇన్ఫెక్షన్ లు చాలా ఇబ్బంది పెట్టి , వారి పెరుగుదల కు కూడా అవరోధం గా మారుతాయి ! టీకా లు వేయించుకునే అవకాశం ఉన్న చోట , క్రమం తప్పకుండా , ఆ టీకాలు వేయించాలి , ప్రత్యేకించి చిన్న పిల్లలకు వేయించాలి తలిదండ్రులు ! 
e . సైనుసైటిస్ :   ముఖం లో ఉన్న ఎముకల లోపల ఉన్న గాలి అరల లో కనుక ఇన్ఫెక్షన్ సోకితే , దానిని అశ్రద్ధ చేయక , తగిన యాంటీ బయాటిక్స్ తో చికిత్స చేయించుకోవాలి లేక పొతే , తరచూ ఆ ప్రదేశాలలో ఉన్నవ్యాధి కారక క్రిములు , ( అవి సామాన్యం గా బ్యాక్టీరియా లు )  ఊపిరితిత్తులలో చేరి ఆస్త్మా కారకం అవుతాయి !  
f . పొగ : వివిధ రకాలైన పొగలు ఊపిరితిత్తులను ఇరిటేట్ చేసి ఆస్త్మా కారకం అవుతాయి ! పొగ లలో ముఖ్యం గా పొగాకు తాగడం వల్ల వచ్చే పొగ, వాహన కాలుష్యం వల్ల వచ్చే పొగలు , ఇంకా ఇంట్లో వంట సమయాలలో వచ్చే పొగలు ( కట్టెల పొయ్యి మీద వంట చేసే సమయం లో వచ్చే పొగ లాంటి పొగలు ) వీటిని చెప్పుకోవచ్చు ! 
g . పరిమళాలు కూడా !  మనసు ను పరిమళింప చేసే , వివిధ సహజ సిద్ధమైన పుష్పాల పరిమళాలే కాక , కృత్రిమం గా వచ్చే సెంటు , పర్ఫ్యూమ్ పరిమళాలు కూడా పడకపోతే , ఆస్త్మా కు కారణమవుతాయి ! మనసును ఆనందం గా వికసింప చేసే పరిమళాలు కూడా , పడక పొతే , ఊపిరి గొట్టాల ను కుంచింప చేస్తాయి ! అంటే , ఆ సున్నితమైన నిర్మాణాలు కుంచించుకు పోయి ఆస్తమా కు కారణమవుతాయి ! ( గమనించ వలసినది , పరిమళాలు పడని వారిలోనే ఆస్త్మా కు కారణమవుతాయి ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

7. ఆస్త్మా ఇన్హేలర్ టెక్నిక్ ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 6, 2013 at 9:33 సా.

7. ఆస్త్మా  ఇన్హేలర్ టెక్నిక్ ఏమిటి ?

 
సాధారణం గా ఆస్త్మా  చికిత్స కూ , నివారణకూ వాడే ఇన్హేలర్ మందులు ( అంటే పీల్చే ఊపిరితో బాటు గా మందును కూడా పీల్చే పధ్ధతి ) ఆస్త్మా ఉపశమనానికి ఎంతగానో ఉపయోగ పడతాయి ! కానీ కొన్ని పరిశీలనల ప్రకారం , ఈ ఇన్హేలర్ లు తీసుకొనే వారిలో కనీసం తొంభై శాతం మందికి , ఆ మందులు వాడే పధ్ధతి మీద అవగాహన లేదని విశద పడ్డది !ఈ మందులను సరిగా వాడక పొతే అంటే ఎట్లా ఊపిరి తిత్తులలొకి పీల్చాలో తెలియక పొతే , ఆస్త్మా తగ్గదు కదా , డబ్బు  ఖర్చు అవడం కూడా జరుగుతుంది ! అంతే కాక , అనవసరమైన ఆందోళనల లకు కూడా కారణం అవుతుంది , ఈ పరిస్థితి ! 
మరి సరి అయిన టెక్నిక్ ఏమిటి ?
1. మొదట గా ఇన్హేలర్ మూత తీయాలి ( అంటే క్యాప్ ) 
2. ఇన్హేలర్ ను నిటారు గా పట్టుకుని అంటే నిలువు గా పట్టుకుని , అందులో ఉన్న మందు సరిగా కలవ డానికి , ఆ ఇన్హేలర్ ను బాగా కదిలించాలి అంటే షేక్ చేయాలి 
3. ఆ తరువాత శ్వాస ను నిదానం గా వదిలి వేయాలి ! దీనిని ఎక్స్పిరేషన్ అంటారు ! ఇట్లా చేయడంవల్ల , ఊపిరి తిత్తులలో ఉన్న గాలి బయటకు వదిలి వేయడం జరుగుతుంది !
4. ఆ తరువాత ఇన్హేలర్ ను నోట్లో పెట్టుకుని , మందు విడుదల అయే  భాగం చుట్టూ పెదవులు ఉంచి , సీలు చేయాలి అంటే పెదవులతో నే మూసి వేయాలి ! దీనితో మందు పీల్చే సమయం లో బయటకు పోదు !
5. అదే సమయం లో మందును విడుదల చేయడానికి ఇన్హేలర్ పై భాగాన్ని చూపుడు వేలితో నొక్కాలి !
6. నొక్కగానే విడుదల అయిన మందును  ను దీర్ఘం గా లోపలి కి పీల్చాలి !  అప్పుడు విడుదల అయిన మందంతా నోటి నుంచి ఊపిరి తిత్తుల లోకి చేరుతుంది !
7. ఇట్లా ఊపిరి పీల్చుకున్న వెంటనే , ఒక పది సెకన్ల పాటు ఊపిరి బిగ పట్టాలి ! అంటే ఆ సమయం లో ఊపిరి తీసుకోవడం కానీ , విడుదల చేయడం కానీ చేయకూడదు ! ఇట్లా ఊపిరి బిగ బట్టిన సమయం లోనే ఇన్హేలర్ ను నోటినుంచి తీసి వేయాలి. అప్పుడు నోటిని మళ్ళీ మూసుకోవాలి లేక పొతే , మందు కొంత బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా !
8. ఆతరువాత ఊపిరి దీర్ఘం గానూ నిదానం గానూ వదిలి వేయాలి. 
9. ఒక వేళ  రెండు మార్లు కనుక ఇట్లా మందు రెండు డోసులు గా తీసుకోమని కనక డాక్టర్ సలహా ఇస్తే , ఒక నిమిషం సమయం ఆగి మళ్ళీ పైన చెప్పిన 1 నుంచి 8  స్టెప్పు లు ఆచరించాలి ! 
10. చివర గా ఇన్హేలర్ మూటను రిప్లేస్ చేయాలి అంటే మూత  పెట్టాలి ! 
 
పైన ఉన్న వీడియో కూడా చూడండి , ఉపయోగ కరం గా ఉంటుంది !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

6 ఆస్త్మా మందుల సైడ్ ఎఫెక్ట్ లు ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 29, 2013 at 11:34 ఉద.

6  ఆస్త్మా మందుల సైడ్ ఎఫెక్ట్ లు ఏమిటి ?

 
క్రితం టపాలో మనం ప్రధానం గా ఆస్త్మా చికిత్స కు వాడే ఇన్హేలర్ మందులు , ఆస్త్మా నివారణకు వాడే ఇన్హేలర్ మందులు ఉంటాయని తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు వాటిని వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ ల గురించి తెలుసుకుందాం ! 
 సామాన్యం గా ఆస్త్మా కు వాడే మందులు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ లు కలిగించవు , తగిన మోతాదు లో అంటే  డాక్టర్ సలహా ప్రకారం మూడు , నాలుగు సార్లు మాత్రమే తీసుకుంటే. కానీ ఆస్త్మా సూచనలు రాగానే , ఆందోళన పడుతూ , అప్పుడే కాకుండా మిగతా సమయాలలో కూడా తరచు గా ఆ మందులు వాడుతుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు తప్పవు. రిలీవర్ మందులతో , కాస్త చేతులు వణ కడమూ , కండరాలలో నొప్పులు కలగడమూ , లేదా కండరాలు బిగుతుగా అయిన ఫీలింగ్ కలగడమూ జరుగుతుంది. తలనొప్పులు కూడా తరచు గా రావచ్చు. ఈ లక్షణాలు , ఎక్కువ డోసు లలో మందులు తరచూ వేసుకుంటూ ఉంటే కలుగుతుంది. ఈ లక్షణాలు సామాన్యం గా కొద్ది సమయమే ఉంటాయి ( కొన్ని నిమిషాలు మాత్రమే ). ఉపశమనానికి వేసుకునే ప్రి వెంటర్  మందులు  తరచూ వేసుకుంటూ ఉంటే , లేదా ఎక్కువ డోసు లో వేసుకుంటే , నోటిలోనూ , గొంతు లోనూ ,  పూత పూయడం జరుగుతుంది దీనిని ఓరల్ కాండి డియాస్ అని అంటారు ! అంటే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. నోటిలోనూ , గొంతులోనూ నొప్పి గా ఉండడమే కాకుండా స్వరం లో కూడా అంటే మాట్లాడే మాట కూడా మార వచ్చు !  ఈ పరిస్థితి ప్రత్యేకించి పాటలు పాడే వారికి  సమస్య గా మార వచ్చు, గళం లో మార్పు వచ్చి !కొందరు ఆస్త్మా వ్యాధి ఉన్న వారికి , స్పెషలిస్టు స్టీరాయిడ్ మందులు తీసుకోమని సలహా ఇవ్వ వచ్చు ! ఈ స్టీరాయిడ్ మందులు , ప్రత్యేకించి నోటిలో వేసుకునే టాబ్లెట్ ల రూపం లో , ఎక్కువ కాలం అంటే నెలలూ , సంవత్సరాలూ కనుక తీసుకుంటూ ఉంటే , కొన్ని ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ లు కలుగుతాయి. 
1. బరువు పెరగడమూ 
2. అధిక రక్త పీడనం కలగడమూ 
3. మధుమేహం వచ్చే రిస్కు ఎక్కువ అవడమూ ,
4. శుక్లాలు అంటే కేటరాక్ట్  రిస్కు ఎక్కువ అవడమూ 
5. గ్లకోమా రిస్కు ఎక్కువ అవడమూ 
6. చర్మం పలుచబడి సులభం గా చర్మం ఎర్ర గా అవడమూ జరుగుతాయి 
7. కండరాలు బలహీన పడడం కూడా గమనించ వచ్చు .
8.ఎముకలు పలుచ బడి , ఆస్టియో పోరోసిస్ కలగడం.
  
సైడ్ ఎఫెక్ట్ లు తగ్గించుకోవడం , లేదా నివారించుకోవడానికి ఏం చేయాలి మరి ?  
ఆస్త్మా వస్తూ ఉంటే  మందులు వాడడం తప్పని సరే కదా ! మరి సైడ్ ఎఫెక్ట్ లు ఎట్లా తగ్గించు కోవడం అంటే
 1. ఆస్త్మా మందులను నిర్ణీత సమయాలలో , నిర్ణీత డోసు లలోనే , స్పెషలిస్ట్ డాక్టర్ సలహా ఖచ్చితం గా పాటిస్తూ , తీసుకుంటూ ఉండాలి.
2. ప్రతి ఇన్హేలర్ మందు నూ , దానిని తీసుకునే విధానం మీద అవగాహన కలిగి ఉండాలి , మందు వాడే ముందే ! ఎందుకంటే సరి అయిన పధ్ధతి లో తీసుకోక పొతే ,శరీరం లోకి ప్రవేశించే మందు పరిమాణం తగ్గి పోయి , ఆస్త్మా లక్షణాలు ఉపశమనం కలగక పోవచ్చు. సరి అయిన పధ్ధతి లో మందు తీసుకోక పోవడం, ఆస్త్మా కంట్రోలు లో లేక పోవడానికి ,  ఒక అతి సాధారణ కారణం , ఈ పరిస్థితి లో మందు ఎక్కువ సార్లు , ఎక్కువ మోతాదు లో తీసుకునే రిస్కు ఏర్పడుతుంది , 
3. ఆస్త్మా ఉన్నవారు స్మోకింగ్ చేయడం పూర్తి గా నిషిద్ధం. ఆస్త్మా ఉన్న వారు స్మోకింగ్ చేయడం , మంటలను, పెట్రోలు పోసి ఆర్పడానికి ప్రయత్నించినట్టే ! 
4. సమతుల్యమైన పోషకాహారాన్ని రోజూ తినడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండడం కూడా  సైడ్ ఎఫెక్ట్ లను చాలా వరకూ తగ్గించడమే కాకుండా , నివారణ కూడా సంభవం ఆవ వచ్చు !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

5. ఆస్త్మా చికిత్సా సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 22, 2013 at 10:51 ఉద.

5. ఆస్త్మా  చికిత్సా సూత్రాలేంటి ?

Fig5

ఆస్త్మా  వ్యాధి ఏమిటి , అది ఏ పరిస్థితులలో వస్తుంది , దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా వ్యాధి చికిత్స లో మూల సూత్రాలు తెలుసుకుందాం ! వీటిని ప్రత్యేకించి ఆస్త్మా ఉన్న వారే కాకుండా , వారి తలి దండ్రులు , బంధువులు , స్నేహితులు కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చికిత్స లో వారి సహాయం, సహకారం కూడా ఆస్త్మా ఉన్న వారికి ఏదో ఒక సమయం లో అవసరం ఉండ వచ్చు !  
ఆస్త్మా వ్యాధిలో , మునుపే తెలుసుకున్నట్టు , ఊపిరి తిత్తులలో ఉండే అతి సూక్ష్మ కండరాలు వీటినే బ్రాంకియల్ స్మూత్ మసుల్ అంటారు ఆ కండరాలు బిగుతు గా అవుతాయి  ఆ పరిస్థితిని బ్రాంకో   స్పాసమ్ అంటారు !  అట్లా ఆ కండరాలు బిగుతు గా అవడం వల్ల , ఊపిరి తిత్తులలో గాలి శులభం గా ప్రవేశించ లేక పోవడం , ముఖ్యం  గా గాలి బయటకు వెళ్ళడం కూడా తీవ్రం గా అవరోధం గా ఉండి  ఆస్త్మా ఎటాక్ గా పరిణమిస్తుంది ! పై విషయాలు ఎందుకు తెలుసుకోవాలి ? అంటే ,  చికిత్స లో ప్రధానం గా ఈ బ్రాంకియల్ స్మూత్ మసుల్ ను వ్యాకోచించ పరిచే మందును ఇన్హేలర్ రూపం లో ఇస్తారు !ఈ మందు, ఊపిరితిత్తులలో ఉండే బ్రాంకస్ ను వ్యాకోచ పరుస్తుంది కనుక దీనిని బ్రాంకో డై లేటర్ మందు అని అంటారు ! ( broncho dilator ) వీటికి ఇంకో పేరు, బీటా టూ ఎగోనిస్ట్ మందులు ( beta 2 agonists ) ( ఉదాహరణ కు సాల్ బ్యూ టమాల్ , టె ర్ బ్యూ టలిన్ ఇన్హేలర్ మందులు ). ఆస్త్మా చికిత్స లో ప్రధానం గా రెండు రకాల ఇన్హేలర్ మందులు అవసరమవుతాయి 
1. ఉపశమనానికి వాడే ఇన్హేలర్ లు. వీటినే రిలీవర్ ఇన్హేలర్ లు అని అంటారు.
పైన ఉదహరించిన బ్రాంకో డై లేటర్ ఇన్ హేలర్ లు ఈ కోవ కు చెందినవే !  ఇవి త్వరగా ,ఊపిరితిత్తులలో ఉండే స్మూత్ మసుల్ ను వ్యాకోచింప చేసి , ఆ కండరాల బిగుతును వదులు చేసి , ఆస్త్మా ఉపశమనం కలిగిస్తాయి ! దానితో మళ్ళీ శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఈ రకమైన ఇన్హేలర్ మందులను వారానికి  రెండు మూడు సార్ల కంటే ఎక్కువ గా తీసుకో కూడదు ! అట్లా తీసుకునే అవసరం కలిగినప్పుడు , స్పెషలిస్టు ను సంప్రదించడం మంచిది ! ఎందుకంటే , ఆ పరిస్థితి , ఆస్త్మాతీవ్రత ను తెలియ చేస్తుంది ! 
2. నివారణకు వాడే ఇన్హేలర్ లు వీటినే ప్రివెంటివ్ ఇన్హేలర్ లు అని అంటారు . 
ఈ రకమైన ఇన్హేలర్ లు ఆస్త్మా ఎటాక్ ను నివారించడానికి వాడే ఇన్హేలర్లు ! వీటిని , ఆస్త్మా ఎటాక్ లు వారం లో రెండు కన్నా ఎక్కువ గా వస్తే కానీ , ఉదయమే లేవడం ఆస్త్మా తో లేవడం జరుగు తున్నప్పుడు కానీ తీసుకోవాలి ! ఎందుకంటే , ఆస్త్మా లో ఊపిరి తిత్తులు ” వాచి పోయినట్టు ” అవుతాయి. ఆ పరిస్థితి ని ఇన్ ఫ్లమేషన్ అని అంటారు. ఇన్ ఫ్లమేషన్ ఉన్నప్పుడు  ఊపిరితిత్తులలో గాలి సరిగా పోలేక , అది ఆస్త్మాకు దారి తీయ వచ్చు. అందుకని కూడా ఆస్త్మా తరచూ వచ్చే రిస్కు ఉంటుంది ! ఈ రకమైన ఇన్హేలర్ లు తక్షణ నివారణ కు కాకుండా, కాల క్రమేణా, అంటే కొన్ని రోజులలోనో , వారాలలోనో , ఊపిరి తిత్తులలో ఇంఫ్లమేషన్ ను తగ్గించి , తద్వారా ఆస్త్మా వచ్చే రిస్కు ను తగ్గిస్తాయి. సామాన్యం గా ఈ ఇన్హేలర్ లు స్టీరాయిడ్ మందులు ఉన్నవి అయి ఉంటాయి. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

4. ఆస్త్మా ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 21, 2013 at 8:22 సా.

4. ఆస్త్మా  ఎటాక్ ను ఎట్లా గుర్తించాలి ?

ఆస్త్మా లక్షణాలు ప్రధానం గా   శ్వాస తీసుకోవడం కష్టమవుతూ ఉండడం , చాతీ క్రమేణా బిగుతు గా అంటే టైట్ గా అవుతూ ఉండడం , ఇంకా శ్వాస సమయం లో పిల్లి కూతలు , దీనినే వీజ్ అంటారు , రావడం. 
పైన చెప్పిన ఈ మూడు లక్షణాలూ తీవ్రం గా ఉండి , ఈ క్రింది లక్షణాలు వాటికి తోడవుతే , దానిని ఆస్త్మా ఎటాక్ అని అంటారు !
1. ఇన్హేలర్ పని చేయక పోవడమూ 
2. పీల్చిన ఇన్హేలర్ ప్రభావం కొద్ది నిమిషాలే ఉండడమూ 
3. ఆస్త్మా లక్షణాలు తీవ్రం అవడమూ
4. శ్వాస కష్టమవుతూ , నిద్ర కోల్పోవడమూ , భోజనం సరిగా చేయలేక పోవడమూ , కనీసం కొన్ని నిమిషాలైనా మాట్లాడ లేక పోవడమూ ! ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు , ఆస్త్మా వ్యాధి ఉన్న వారు వెంటనే, వారి తలి దండ్రుల కు కానీ , బంధువులకు కానీ , స్నేహితులకు కానీ తెలియ చేసి , అత్యవసర సహాయం పొందాలి ! అశ్రద్ధ చేయక ! అట్లాగే దగ్గర ఉన్న తలిదండ్రులు , తోబుట్టువులు , బంధువులు , లేదా స్నేహితులు – ఎవరైనా సరే , ఆస్త్మా వచ్చిన వారిని ఒక ప్రశాంత ప్రదేశం లో కూర్చో బెట్టి ,వారిని ఆందోళన పడకూడదని , శాంత పరుస్తూ , వారి దగ్గర ఉన్న  ఇన్హేలర్ ఇచ్చి  ఆస్త్మా ఉపశమనానికి ప్రయత్నిస్తూనే , వెంటనే తగిన వైద్య సహాయానికి ప్రయత్నాలు చేయాలి ! కొంత మంది లో ఈ ఆస్త్మా పరిస్థితి ఏర్పడే సూచనలు కొన్ని రోజుల ముందు గానే తెలుస్తాయి !  వారు బ్లూ ఇన్హేలర్ కనుక తీసుకుంటూ ఉంటే , ఆ బ్లూ ఇన్హేలర్ ,సామాన్యం గా తీసుకునే సమయాల కన్నా ఎక్కువ గా తీసుకోవడం జరుగుతుంది ! ( బ్లూ ఇన్హేలర్ అంటే సాల్ బ్యూట మాల్ ఇన్హేలర్ – ఈ ఇన్హేలర్ లతో పాటుగా , మిగతా మందుల విషయాలు కూడా మనం వివరం గా తెలుసుకుందాం ముందు ముందు ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

3. ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 20, 2013 at 12:09 సా.

3. ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా ? 

 
క్రితం టపాలలో ఆస్త్మా అంటే ఏమిటి ? దానికి కారణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు ఆస్త్మా ను కనుక్కోవడం ఎట్లా గో తెలుసుకుందాం ! ఆస్త్మా  ఊపిరితిత్తుల వ్యాధి కనుక , ఈ పరీక్షలు ప్రధానం గా ఊపిరితిత్తుల మీదే చేయబడతాయి !
సహజం గా మన ఊపిరితిత్తులు, మనం పీల్చే గాలిని లోపల ప్రవేశింప చేసి , మలిన పదార్ధాలు ఉన్న గాలిని బయటకు పంపుతాయి ! ఆస్త్మా వచ్చినపుడు ఈ చర్యలు,నిదానం గా జరగడమే కాకుండా , వంద శాతం జరగ కుండా , తగ్గి పోతూ ఉంటుంది !
స్పైరో మీటర్ పరీక్ష : ఈ పరీక్ష ముఖ్యం గా రెండు రకాల రీడింగ్ లు తీసుకుంటుంది   FEV 1 ( Forced Expiratory Volume in one second ) : అంటే ఒక సెకన్ లో మనము మన ఊపిరితిత్తులనుంచి ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం. FVC ( Forced Vital Capacity )  : మొత్తం మనం ఎంత గాలిని బయటకు ఊద గలమో ఆ గాలి పరిమాణం ! ఈ రీడింగులు ఆరోగ్య వంతమైన వారికి ఒక సరాసరి పరిమాణం గా ఉంటుంది. కానీ ఆస్త్మా వచ్చిన వారిలో ఈ పరిమాణం తగ్గుతుంది అందుకే ఈ పరీక్ష లు !
పీక్ ఫ్లో  మీటర్ ( PEF )  : ఈ పరికరం నోటిలో పెట్టుకుని మన ఊపిరి తిత్తులలో ఉన్న గాలిని మనం ఎంత త్వరితం గా బయటకు ఊదగలమో  ఆ సమయాన్ని , పరిమాణాన్ని అంచనా కట్టి  ఆస్త్మా  పరిస్థితిని కూడా నిర్ధారిస్తారు ! ఆస్త్మా వ్యాధి ఉన్న వారు కూడా సామాన్యం గా ఆస్త్మా ఎటాక్ రాని సమయం లో ఊదగలిగే గాలిని , వారికి ఆస్త్మా ఎటాక్ వచ్చిన సమయం లో ఊద లేరు ! ఆ పరిస్థితులను పోల్చి చూసి , వారికి ఆస్త్మా లక్షణాల తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు !
ఎలర్జీ పరీక్షలు : ఈ పరిక్షలలో , చర్మం మీద ఎలర్జీ కలిగించే సామాన్య పదార్ధాలను కొద్ది పరిమాణం లో ప్రవేశ పెట్టి , చర్మం లో వచ్చే మార్పులను గమనిస్తారు ! ఎలర్జీ కనుక తీవ్రం గా ఉంటే , చర్మం లో మార్పులు కూడా ఎక్కువ గా ఉంటాయి ! 
రక్త పరీక్షలు : సామాన్యం గా ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా , దాని ప్రభావం వల్ల , రక్త కణాలలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు వస్తాయి ! ఎందుకంటే , మన రక్త కణాలు కేవలం రక్తం లో ఓల లాడుతూ ఉండవు ! ప్రతి రక్త కణానికీ కొన్ని ప్రత్యేక మైన విధులు ఉంటాయి ! ఆ యా కణాలు ఆయా పనులను నిరంతరం చేస్తూ , శరీరాన్ని ముట్టడి చేసే వివిధ ఇన్ఫెక్షన్ లను ఎదుర్కుంటూ శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ! ఈ ప్రక్రియ లో కొన్ని కణాల సంఖ్య ఎక్కువ అవడమూ , కొన్ని కణాలు తక్కువ అవడమూ జరుగుతూ ఉంటుంది ! అందువలన రక్త పరీక్షలు చేయించుకోవడం రోగ నిర్ధారణకు ఉపయోగ కరం ! 
ఉమ్మి పరీక్ష : ఆస్త్మా వచ్చిన వారి ఉమ్మి లో వివిధ కణాలతో పాటుగా , ఇన్ఫెక్షన్ కారక క్రిములు కూడా కనుక్కోవచ్చు అందుకని ఉమ్మి పరీక్ష కూడా ముఖ్యం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

2. ఆస్త్మా కారణాలేంటి ?:

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూన్ 18, 2013 at 8:22 సా.

2. ఆస్త్మా  కారణాలేంటి ?:

 
ఆస్త్మా  కు ఖచ్చితం గా ఒక కారణం అంటూ ఏమీ లేదు.  జన్యువుల లోపం అంటే జీన్స్ లో లోపాలు ఉండి , ఆ లోపాలకు పరిసర వాతావరణం లో మార్పులు కూడా తోడ వుతే , ఆస్త్మా  పరిస్థితి వస్తుంది. 
1. కుటుంబం లో, ఆస్త్మా వ్యాధి ఉన్న వారికీ , లేదా హే ఫివర్ , లేదా ఎక్జిమా , కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే పడక పోవడం ఉన్న వారికి కూడా ఈ ఆస్త్మా వ్యాధి వచ్చే అవకాశాలు మెండు. 
2. చిన్న వయసులో, అంటే బాల్యం లో ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తరచూ వచ్చి బాధ పడిన చిన్నారులు పెద్దయాక వారికి ఆస్త్మా వచ్చే రిస్కు ఎక్కువ గా ఉంటుంది. 
3. శిశువు గర్భం లో తొమ్మిది నెలలూ నిండకుండా నే కనుక జన్మించినా , లేదా 
4. జన్మించిన శిశువు పుట్టగానే ఉండవలసిన బరువు కన్నా తక్కువ గా ఉన్నా కూడా ఆస్త్మా రావచ్చు. 
5. శిశువు, పిండ దశ లో ఉన్నపుడు కానీ , లేదా శిశువు జన్మించాక ,పెరుగుతూ ఉన్నపుడు కానీ , తల్లి గానీ , వారితో వారి ఇంట్లో ఉండే తండ్రి కానీ , స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆస్త్మా  శిశువుకు వచ్చే రిస్కు హెచ్చు గా ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవడం బ్రహ్మ విద్య ఏమీ కాదు కదా ! ఎందుకంటే కనీసం మూడు వేల రకాలైన విష పదార్ధాలు పొగాకు పొగ లో ఉంటాయి !  ఆ విషతుల్య పదార్ధాలు పిండం లో కానీ పెరుగుతున్న శిశువు రక్తం లో కానీ ప్రవేశించితే , పెరుగుదల దశలో ఎక్కువ గా హానికరం గా మారుతాయి శిశువు వివిధ అవయవాల మీద ! దానితో  ఆస్త్మా  రిస్కు ఎక్కువ అవుతుంది ! 
ఆస్త్మా ట్రిగ్గర్ లు ఏమిటి ? 
తుపాకి కి ట్రిగ్గర్ ఉంటుంది. అంటే మీట ఆ మీట లేదా ట్రిగ్గర్ ను ఒకసారి నొక్కి పడితే, తుపాకి పేలుతుంది. అదే విధం గా మన లో వచ్చే వివిధ రోగాలకు ట్రిగ్గర్ లు ఉంటాయి ! అంటే ఆయా ట్రిగ్గర్ లు ఆ యా వ్యాధులను వెంటనే కలిగించ దానికి కారణమవుతాయి !
ఇప్పుడు ఆస్త్మా కు ట్రిగ్గర్ లు ఏమిటో చూద్దాము !
1. వైరస్ లు దాడి చేసి కలిగించే శ్వాస కోశ సంబంధ మైన వ్యాధులు. 
2. వాతావరణం లో ఉండే పుప్పొడి , అంటే పోలెన్ , లేదా ఇంట్లో పెరిగే కుక్కలు , లేదా పిల్లుల  జుట్టు , లేదా పక్షులు ఇంట్లో పెరుగుతూ ఉంటే , లేదా ఇంకా సామాన్యం గా , పక్షుల ఈకలతో చేసిన తలగడ లు పెట్టుకుంటే కూడా ( పిల్లో లు ) ఆస్త్మా ఎటాక్ లు ఎక్కువ అయే రిస్కు ఉంది !  ( కారణం : పైన చెప్పినవన్నీ ఎలర్జీ కలిగించే పదార్ధాలు గా పనిచేసి , ఆస్త్మా  కలిగిస్తాయి ! ) 
3. వాతావరణ కాలుష్యం :  పెట్రోలు , డీ జల్  కాలినపుడు గాలిలో విడుదల అయే వివిధ విష పదార్ధాలు , ( వాటి పొగ లో ఉంటాయి ) ఇంకా సిగరెట్ పొగలో ఉండే విష పదార్ధాలు కూడా ఆస్తమా కలిగిస్తాయి !
4. మందు బిళ్ళలు : సామాన్యం గా వేసుకునే మందు బిళ్ళలు ( యాస్పిరిన్, ఐ బూ ప్రోఫెన్ , ) కూడా ఆస్తమా కారకాలు !
5. తీవ్రమైన భావోద్వేగాలు : విపరీతం గా భావోద్వేగం చెందినపుడు , లేదా నవ్వినపుడు కూడా ఆస్తమా ( ఉన్న వారిలో ) వచ్చే రిస్కు ఉంటుంది. 
6. వ్యాయామం తో కూడా ఆస్తమా రావచ్చు. 
7. శుభ్రమైన గాలీ వెలుతురూ సోకకుండా ఉన్న గదులలో ఎక్కువ సమయం గడిపే వారికి కూడా ఆస్తమా రిస్కు హెచ్చు ! ఎందుకంటే చీకటి గా ఉంది సూర్య రశ్మి సోకని ప్రదేశాలలో ఫంగస్ లు పెరుగుతాయి ! ఈ ఫంగస్ లు చాలా చిన్న పరిమాణం లో ఉండడమే కాకుండా , వాటి స్పోరు లు కూడా అతి చిన్న పరిమాణం లో ఉంది ( అంటే కంటికి కనిపించనంత సూక్ష్మ పరిమాణం లో ఉండి ) పీల్చే గాలి ద్వారా ఊపిరి తిత్తులను చేరుకొని ఆస్తమా కారకం అవుతాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !