Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

2. సేఫ్ కార్ డ్రైవింగ్. కారు కొనే ముందు ఆలోచించ వలసిన విషయాలు ….

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 10, 2013 at 10:42 సా.

2. సేఫ్ కార్  డ్రైవింగ్. కారు కొనే ముందు ఆలోచించ వలసిన విషయాలు  …. 

రోజూ ప్రయాణం లో భాగం గా ,   A నుంచి B కి వెళ్ళే ముందు కొన్ని  నిమిషాలు ఈ క్రింది విషయాలు ఆలోచించాలి !
1. వెళ్ళే చోటు  చాలా దూరమా , లేక నడక , సైకిల్  మీద వెళ్ళ వచ్చా ? అనే విషయం. ఎందుకంటే , తక్కువ దూరాలకు , తరచూ కారులో ప్రయాణిస్తే , కారు ఎక్కువ మైలేజీ ఇవ్వక పోవడమే కాకుండా , ఇంజన్ కూడా త్వరగా పాతదవుతుంది ! తరచూ గేర్ లు మార్చుతూ యాక్సిలరేట్ చేస్తూ ఉండడం వల్ల ,  పొల్యూ షన్ , అంటే వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ అవుతుంది ! మనం ఉండే ఏరియా లో ఎక్కువ మంది కి ఈ అవగాహన ఉంటే , ఆ ఏరియా పొల్యూ షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. గమనించ వలసినది , ఒక్క రోజు తో మన శరీరం కాలుష్యం చెంది అనారోగ్యం పాలవడం జరగదు. వాతావరణ కాలుష్యం , అనేక నెలలూ , సంవత్సరాల తరబడి జరుగుతూ   ఉంటే , దాని పరిణామాలు ,ఆరోగ్యం  మీద  పడతాయి !
 ఇతర ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చా ? బస్సు లోకానీ , రైలు లో కానీ వెళ్ళ వచ్చా ? లేదా కారు లోనే వెళ్ళాలను కుంటే , కారును ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చా ? ( విదేశాలలో , ఆర్ధిక మాంద్యం దృష్ట్యా , కారు స్వంత దారులు, నలుగురు,  ఒకే చోటినుంచి బయలు దేరుతూ ఉంటే , వారు వంతుల వారీ గా రోజు కొకరు డ్రైవ్ చేస్తారు , వారి కారులో మిగతా వారు కూర్చుంటారు ! ఇట్లా చేయడం స్నేహాన్ని పెంచడమే కాకుండా , అందరికీ డబ్బు కూడా ఆదా అవుతుంది ! ) 
2. వాతావరణం లో కేవలం విష వాయువుల తోనే కాకుండా , శబ్ద కాలుష్యం కూడా మానవులను చీకాకు పరుస్తుంది. ఈ శభ్ద కాలుష్యం ప్రత్యేకించి , భారత దేశం లో ఎక్కువ గా ఉంటుంది. విదేశాలలో , ఒక వెయ్యి కార్లు రోడ్డు మీద ఉంటే , ఒకటో రెండో కార్లు మాత్రమే హార్న్ మోగించడం వినబడుతుంది ! భారత దేశం లో రోడ్డు  ఇక పోల్చ నవసరం లేదనుకుంటా ! 
3. కారు కొందామనే నిర్ణయం తీసుకునే ముందు ,
a. కొత్త కారు కొనడమా , లేక సెకండ్ హాండ్ కారు పరవాలేదా ? అనే విషయం. ఉదాహరణకు , పాశ్చాత్య దేశాలలో ఒక లక్ష మైళ్ళు చేసిన కారు ఏదైనా , ఒక పది వేల రూపాయలకే కొనవచ్చు ! అంటే , కొత్త కారు విలువ సంవత్సరానికి కనీసం ఇరవై శాతం పడి పోతుంది ! సరిగా సర్విసింగ్ చేయించి ఒక్కరే నడిపిన కారు కూడా తక్కువ ధరకే కొన వచ్చు ! కానీ నాలుగు చేతులు మారిన కారు , ఎక్కువ రిపేర్ లతో , ఒక తెల్ల ఏనుగు అవవచ్చు , అత్యాశకు పోయి తక్కువ ధరలో కొంటే ! 
b . ఏ రకమైన ఇంధనం తో నడిచే కారు కొనాలని ? ఎందుకంటే,  డీజల్ తో నడిచే కార్లు ఎక్కువ మైలేజీ ఇస్తాయి , కానీ మీరు ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వస్తేనే ! 
c. పాశ్చాత్య దేశాలలో నడుపుతున్న కారు , ప్రయాణం లో ఎక్కడైనా ఏ కారణం చేత నైనా చెడిపోతే , తగిన రిపేర్ లు చేయడానికి బీమా కంపెనీలు కుక్క గొడుగుల్లా ఉంటాయి. అట్లాంటి కంపెనీ లలో ఒకదానిలో బీమా తీసుకోవడం ఉత్తమం !
d . క్రమం గా కారు సర్విసింగ్ చేయించడానికి కూడా , కొంత డబ్బు చెల్లిస్తూ ఉండాలి. ప్రత్యేకించి, పాత బడుతున్న కార్లకు ఈ జాగ్రత్త ముఖ్యం. ( కొత్త కార్లకు సామాన్యం గా కనీసం అయిదేళ్ళ వరకూ వారంటీ ఉంటుంది ! ఆ వారంటీ ఉన్న కార్లను కొనుక్కోవడం ఇంకో ఆలోచన ! ) 
e . విదేశాలలో ప్రతి కారుకూ , పాత బడుతూ ఉంటే M O T పరీక్ష ఉంటుంది ( మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ ) పరీక్ష అని అంటారు. ఈ పరీక్ష ప్రతి కారు కూ  ప్రతి సంవత్సరమూ చేయించాలి  కంపల్సరీ గా ఎందుకంటే , ఈ పరీక్ష కారు ఆరోగ్యాన్ని తెలపడమే కాకుండా , అవసరమైన రిపేర్ లు చేయించ డానికి కూడా సూచనలు ఇస్తుంది !  ఈ పరీక్ష పాసవడం , ప్రతి కారు కూ కంపల్సరీ ! దానితో , కారు నడిపే వారే కాకుండా , రోడ్డు ను వాడే ఇతరులు కూడా సురక్షితం గా ఉంటారు ! 
f . పార్కింగ్ కు క్రమం గా చెల్లించ వలసిన డబ్బు ఎంత ఉంటుంది ? 
ఈ విషయాలన్నీ ఆలోచించుకుని , ఒక నిర్ణయం తీసుకోవాలి ! ముఖ్యం గా కారు కొనమనే ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోస పోకూడదు ! ఎందుకంటే ప్రతి ప్రకటనలోనూ , కారు కేవలం ఆరు లేదా ఎనిమిది సెకండ్ల కాలం లో సున్నా నుంచి అరవై మైళ్ళ వేగం చేరుకోగలరనే చెబుతూ ఉంటారు ! కానీ బాధ్యతా రహితం గా కారు నడిపితే , కైలాసానికి కూడా అంతే వేగం గా చేరుకోగలమనే వాస్తవాన్ని మాత్రం చెప్పరు ! అంతే కాకుండా , తెప్పలు తెప్పలు గా కార్లను రోడ్ల మీద ప్రవేశ పెట్టడానికి , అనేక మైన ఆకర్షణీయమైన ప్రకటనలూ ,పధకాలూ పెడతారు కానీ , కారు నడిపే రోడ్ల గురించి ఆలోచించరు , కారు కంపెనీలు కానీ , ప్రభుత్వం వారు కానీ ! వారి ఉద్దేశం లో కారు కొనుక్కుంటే , గాలి లో ప్రయాణం చేయాలనేమో ! 
మీరు నివసిస్తున్న చోటినుంచి మీరు చేరుకోవలసిన గమ్యం లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది?  ఆ పరిస్థితి బాగు పడే అవకాశం కనీసం వచ్చే పదేళ్ళ లోనైనా ఉందా ? అనే విషయాలు ఆలోచించి , కారు కొనుక్కోవాలి ! ఇంకో ముఖ్య మైన విషయం ! కారు ఒక గ్యాలను కు నలభై మైళ్ళు ప్రయాణించ వచ్చనీ , లేదా యాభై మైళ్ళు ప్రయాణం చేయ వచ్చనీ,  అనేక ప్రలోభాలు పెడుతూ ఉంటారు ! కానీ అవన్నీ స్టాండర్డ్ , అంటే ప్రామాణికమైన పరిస్థితులలోనే , ప్రాక్టికల్ గా అతి రద్దీ గా , అతి అధ్వాన్నం గా ఉండే రోడ్ల మీద కాదు !  అధ్వాన్నం గా ఉన్న రోడ్ల మీద , అతి రద్దీ గా ఉన్న ట్రాఫిక్ లో కారు నడిపితే , చాలా తరచు గా గేర్లు మార్చడం చేత , వాడు చెప్పిన నలభై మైళ్ళూ , కారు నడుపుతే, ఒక గ్యాలన్ కు బదులు రెండు గ్యాలన్ ల ఇంధనం తప్పని సరిగా అయి , ఖర్చు కాస్తా తడిసి మోపెడవుతుంది ! ఇక ప్రత్యామ్నాయ ఇంధనాలకోసం ప్రయత్నాలు చేసి,  ఎల్ పీ జీ గ్యాస్ తో కారు నడిపే,  అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు కొందరు !  అట్లా చేయడం ,కారు నాణ్యతను దెబ్బ తీయడమే కాకుండా , పర్యావరణ కాలుష్యం తో పాటుగా ,ప్రమాదాల తీవ్రత ఎక్కువ కావడానికి కూడా అవకాశం చేజేతులా కలిగించుకోవడమే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

1. రక్షిత కారు చోదకం ( సేఫ్ గా కారు నడపడం) ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 10, 2013 at 10:50 ఉద.

1. రక్షిత కారు చోదకం ( సేఫ్ గా కారు నడపడం)  ఎట్లా ? 

కారు సేఫ్ గా నడపడానికి  ప్ర ప్రధమం గా కావలసినది ,( right attitude ) రైట్ యాటి ట్యూ డ్, అంటే సరి అయిన ప్రవృత్తి . మోటు గా , ఓపిక కోల్పోయి , బాధ్యతా రహితం గా కారు నడిపితే , నడిపే వారే కాక , ఆ కారులో ప్రయాణిస్తున్న వారితో పాటుగా , రోడ్డును ఉపయోగిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రతా , పాద చారుల భద్రతా కూడా  అపాయం లో పడుతుంది. ఈ రైట్ యాటి ట్యూ డ్,   అనేక శారీరిక , మానసిక పరిస్థితుల మీద ఆధార పడి  ఉంటుంది. ముఖ్యం గా, సరిపడినంత నిద్ర లేకపోవడమూ , విపరీతం గా అలసి పోయి ఉండడమూ , లేదా మద్యం , ఇతర మాదక ద్రవ్యాలు తీసుకుని ఉండడమూ , లేదా తీవ్రమైన మనస్తాపం చెందుతూ ఉండడమూ , అంటే తీవ్రమైన మానసిక వత్తిడి తో ఉండడమూ – లేదా ఆహారం కానీ పానీయాలు కానీ చాలా సమయం వరకూ తీసుకోకుండా , డ్రైవ్ చేయడమూ – ఈ కారణాలన్నీ కూడా రైట్ యాటి ట్యూ డ్ ను తీవ్రం గా ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితులలో , ఓపిక నశించి డ్రైవింగ్ పొరపాట్లు చేసే రిస్కు ఎక్కువ అవుతుంది ! 
నిద్ర లేక పోవడం , అప్రమత్తత ను తక్కువ చేస్తుంది, అట్లాగే మద్యం సేవించడం వల్ల కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది కానీ ఆ కాన్ఫిడెన్స్ కేవలం ఫాల్స్ కాన్ఫిడెన్స్ మాత్రమే ! అంటే   ( తాగి ) డ్రైవింగ్ చేస్తున్న వారు , తాము వంద మైళ్ళ వేగం తో డ్రైవింగ్ చేస్తున్నా కూడా చాలా సురక్షితం గా డ్రైవ్ చేస్తున్నామనే ఆత్మ విశ్వాసం తో ఉంటారు, యాక్సిడెంట్ అయ్యే కొద్ది క్షణాల ముందు వరకూ కూడా ! అందుకని మద్యం తాగి కారు నడపడం నిషిద్ధం ! వారు టాక్సీ లో బార్ కు కానీ పబ్ కు కానీ వెళ్లి , ఇంటికి కూడా టాక్సీ లో వెళ్ళడమే ఉత్తమం , ఎందుకంటే , కనీసం , రోడ్డు మీద ఉన్న ఇతర ప్రయాణికులు సురక్షితం గా ఉంటారు , అట్లా చేస్తే ! ( ఈ సలహా తో , మద్యం తాగడాన్ని ప్రోత్స హిస్తున్నట్టు కాదు ! ) 
ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే , భారత దేశం లో 2010 లో రోడ్డు ప్రమాదాల వివరాలు గమనించ వచ్చు ! అందులో కనీసం నలభై శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల సంభవించినవే ! 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

రక్షిత కారు చోదకం ! సేఫ్ కార్ డ్రైవింగ్ ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఆగస్ట్ 9, 2013 at 9:39 సా.

రక్షిత కారు చోదకం ! సేఫ్ కార్ డ్రైవింగ్  ఎట్లా ? 

కారు ! నిత్య జీవితం లో ఒక అవసరం !   పల్లె లలో కారు, ఒక భోగ వస్తువు, అంటే కంఫర్ట్ ! ( కొన్ని  ధన వంతమైన పల్లె లలో కారు ఒక అవసరం గా మారింది , ఎక్కువ మంది కొంటూ ఉండడం చేత ! ) 
నగరాలలోనూ , పట్టణాలలోనూ , నివశించే ప్రజలకు , ప్రపంచీకరణ పుణ్యమా అని , కారు ఒక నిత్యావసర వాహనం అయింది ! ఏడాది కేడాది కీ కారు అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. కేవలం అమ్మకాలే కాకుండా , కారు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ! కేవలం కారు కొనుక్కోవడం తో నే సరిపుచ్చు కోకుండా , ప్రతి కారు స్వంత దారుడూ , కారు నడపడం లో ఉన్న సాధక బాధకాలు ,వివరం గా తెలుసుకోవాలి !  కారు నడపడం గురించిన సంపూర్ణమైన అవగాహన ఏర్పడితే ,  అది సురక్షితమైన కారు చోదకానికీ , ఆనంద దాయకమైన జీవితానికీ కూడా సహాయకారి అవుతుంది !
మన దేశం లో కారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత సులభం గా వస్తుందో  అందరికీ తెలిసినదే కదా ! కానీ కారు నడపడం కేవలం లైసెన్స్ రాగానే రాదు కదా !  కారు చోదకం అనే విషయం , జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి ! ఎప్పటి కప్పుడు నిపుణతను స్వంత గానే పరీక్షించుకుంటూ , రక్షిత చోదకానికి, అంటే సేఫ్ డ్రైవింగ్ కు నిబద్ధులై ఉండాలి ప్రతి చోదకుడూ ! వచ్చే టపా నుంచి కారు సురక్షితం గా కారు నడపడం ఎట్లాగో , ఏ  ఏ  జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం ! కారు నడపడం  అనే విషయం , మన ఆరోగ్యం తో ప్రత్యక్షం గా సంబంధించక పోయినా కూడా , నానాటికీ పెరుగుతున్న కారు ప్రమాదాల రీత్యా , అట్లాంటి ప్రమాదాల బారిన పడకుండా , నివారణ కు , ప్రతి కారు చోదకుడూ , తెలుసుకోవలసిన , డ్రైవింగ్ టిప్స్ గురించి మనం వచ్చే టపా నుంచి తెలుసుకుందాం !  కొత్తగా కారు కొనే వారికే కాకుండా , ఈ విషయాలు కారు ఇప్పటికే నడుపుతున్న వారికీ , ఎంత గానో ఉపకరిస్తాయనడం లో సందేహం లేదు ! 

 

కేశవర్ధనం. హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 6, 2013 at 9:11 సా.

కేశవర్ధనం. హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు ? 

 
స్త్రీలలో కేశవర్ధనం గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో ! మరి పురుషులలో హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎట్లా చేస్తారో వివరం గా తెలుసుకుందాం ! దీనిని తెలుగులో జుట్టు మార్పిడి అనచ్చేమో ! ఎందుకంటే , ఈ పద్ధతిలో ముఖ్యం గా జుట్టు బాగా పెరుగుతున్న చోటినుంచి కొంత మేర జుట్టును తీసికొని ,జుట్టు ఊడిపోతూ ఉన్న ప్రదేశం లో అంటిస్తారు ! దీనినే హేర్  ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు ! 
ఈ క్రింది విధం గా  అసలు పధ్ధతి ఉంటుంది :  
1. పురుషులలో తల వెనుక భాగం లో పెరుగుతున్న జుట్టు చాలా కాలం వరకూ ఊడి పోకుండా పెరుగుతూ ఉంటుంది కదా !  అందువల్ల ఈ ప్రదేశం లోనుంచి కొంత మేర జుట్టును తొలగిస్తారు ! ఆ తొలగించడం కేవలం క్షవరం చేసి కాదు ! ఎందుకంటే, జుట్టు మొదలు మాతమే సజీవ కణం తో ఉంటుంది అంటే , వెంట్రుక మొదట్లోనే జీవం తో ఉన్న కణం ఉంటుంది దీనినే హేర్  ఫాలికిల్ అంటారు అది లేక పొతే వెంట్రుక పెరగదు ! అందువల్ల  అంటించ వలసిన జుట్టును చర్మం తో సహా తీస్తారు ! అంటే  ఆ తల భాగం లో నొప్పి తెలియకుండా మత్తు ఇస్తారు. దీనిని స్థానిక అనస్తీశియా అంటారు అంటే లోకల్ అనస్థీసియా అని. దీనివల్ల స్పర్శ జ్ఞానం తాత్కాలికం గా పోతుంది. దానితో నొప్పి తెలియదు. అప్పుడు సమాంతరం గా ఒక చిన్న స్కేలు మందాన తల వెనుక భాగం లో గాటు అంటే అది దీర్ఘ చతురస్రాకారం గా ఉంటుందన్న మాట ! అంత మేర చర్మాన్ని ( అంటే వెంట్రుకలతో సహా ) కట్ చేస్తారు పదునైన సర్జికల్ నైఫ్ తో ! ( ఇంకో పధ్ధతి లో చర్మాన్ని కట్ చేయకుండా కేవలం ఒక్కొక్క వెంట్రుకనూ , దాని మూలం తో సహా ‘ పెకిలిస్తారు’ జాగ్రత్త గా , ప్రత్యేకమైన పరికరం తో , దీని వివరణ పైన ఉన్న చిత్రం లో ఉంది గమనించండి ).
2. అట్లా తీసిన భాగం లో వచ్చిన గ్యాప్ ను కుట్టివేస్తారు రెండు చివరాలా కలిపి. ఈ గాయానికి అంటే , కత్తి  తో చేసిన గాయానికి పైనా , క్రిందా కూడా జుట్టు సహజం గానే పెరుగుతూ ఉంటుంది కనుక , ఆ గాయం మాన గానే , అక్కడ చేసిన గాటు ద్వారా ఏర్పడిన మచ్చ కనబడదు ఎందుకంటే ఆ మచ్చ పై భాగం లో పెరుగుతూ ఉన్న జుట్టు క్రిందకు పెరిగి మచ్చను కనబడకుండా చేస్తుంది ! 
3. ఇపుడు దీర్ఘ చతురస్రాకారం లో తీసిన చర్మం నుంచి వెంట్రుకలను అతి జాగ్రత్తగా వేరు చేస్తారు ! అతి జాగ్రత్తగా ఎందుకంటే , ఈ వెంట్రుకలను కేవలం పీకేయ్యకుండా , వారి మొదళ్ళు కూడా ఉండేట్టు ‘ పెకిలిస్తారు ‘ మనం పైన తెలుసుకున్నాం కదా , వెంట్రుకల మొదళ్ళ లోనే సజీవ కణం ఉండేది ! ఆ కణం కనుక ప్రాణం కోల్పోతే , వెంట్రుక పెరగదు ఇక ! అందుకని ! ఇట్లా వెయ్యి నుంచి  రెండు వేల వరకూ వెంట్రుకలను ఆ తల వెనుక నుంచి  కత్తిరించిన చర్మ భాగం నుంచి వేరు చేస్తారు ! ఇది చాలా సమయం తీసుకుంటుంది సహజం గానే ! 
4. ఇట్లా వేరు చేసిన వెంట్రుకలను తల పైభాగం లో అంటే కాస్త ముందు భాగం లో ( ఎక్కడైతే బట్ట తల గా ఉంటుందో ఆ ప్రదేశం లో ) అతికిస్తారు ఒక్కటొక్కటి గా !  ‘ అతికించడం ‘ అంటే కేవలం జిగురు తో అతికించడం అనుకునేరు ! కాదు !  ఒక్కో వెంట్రుకనూ , మొదళ్ళ తో సహా అత్యంత జాగ్రత్త గా పెకిలించి , కేవలం జిగురుతో అతికిస్తే ఏం ప్రయోజనం ? వెంట్రుక మొదళ్ళ లో ఉన్న సజీవ కణం నశిస్తుంది అట్లా చేస్తే ! అందువల్ల ఒక్కొక్క వెంట్రుకనూ , మళ్ళీ  ప్రత్యేక మైన శ్రద్ధ తో ఒక్కో చిన్న కత్తి గాటు పెట్టి ఆ గాటు లో , వెంట్రుక మొదలు ను అంటే ఫాలికిల్ ను ‘ పాతుతారు ‘ ఈ మొత్తం కూడా చాలా సమయమూ , శ్రమా తీసుకుంటుంది ! 
5. ఈ మొత్తం పధ్ధతి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పట్ట వచ్చు ! 
6. రెండు మూడు వారాలలో తల వెనుక చేసిన గాయమూ , తల మీద చేసిన చిన్న చిన్న గాయాలూ ( లేదా గాట్లూ ) పూర్తి గా మానుతాయి ! 
7. కొందరు వైద్యులు, తల మీద ఈ సమయం లో రాసుకోడానికి మినాక్సిడిల్  కూడా వాడమని సలహా ఇస్తారు ! అంతే కాక యాంటీ బయాటిక్స్ కూడా అవసరం ఉండవచ్చు , ఈ సమయం లో ! పైన ఉన్న చిత్రం లో వివరణ అంతా కనిపిస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశవర్ధనం. 8. మినాక్సిడిల్ మంచిదేనా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 3, 2013 at 11:51 ఉద.

స్త్రీలలో కేశవర్ధనం. 8. మినాక్సిడిల్  మంచిదేనా ? 

 
స్త్రీలలో జుట్టు పలుచ బడడం నివారించడానికి మార్కెట్ లో అనేక మందులు లభ్యం అవుతున్నాయి కదా ? అందులో ఏవి మోసం, ఏవి నిజం ?  ఈ సంగతులు వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఎవరూ చెప్పరు, కొనే వారికి ! ఎందుకంటే , వారికి కావలసినది కేవలం మీ డబ్బే కదా ! మరి మీరు జాగ్రత్త వహించి , ఆ మందులు నిజం గా పనిచేస్తాయో లేదో  తెలుసుకోవాలి. 
అమెరికాలో భారత దేశం లో లాగా కాక , మార్కెట్ లో అమ్మే ప్రతి మందునూ , పరీక్ష చేసి , ఆమందు నిజం గా నే ఉపయోగకరమో లేదో నిర్ణయించి దానిని మాత్రమే అప్రూవ్ చేస్తారు.  స్త్రీలలో జుట్టు పలుచ బడడానికి  అలోపీశియా ఏరి యేటా అనే జబ్బు ఒక ముఖ్య కారణం. ( దీనిని గురించి వివరం గా క్రిందటి టపాల లో తెలుసుకున్నాం కదా ! ) ఈ కండిషన్ లో తల మీద ఏ ఒక్క భాగం లోనో కాకుండా , తలంతా జుట్టు పలుచ బడుతుంది అంటే ఒత్తు గా ఉన్న జుట్టు పలుచ బడుతుంది. దీనికి వివిధ మందుల తో అవసరం లేని నివారణ చర్యలే కాకుండా , మందులతో కూడా చికిత్స చేయ వచ్చు ! 
అమెరికా వారు దీనికోసం అప్రూవ్ చేసిన మందు ఒకటంటే ఒకటే ! దానిపేరు మినాక్సిడిల్. దీని గురించి తెలుసుకుందాం ఇప్పడు . 
మినాక్సిడిల్  మొదట అధిక రక్త పీడనం , అంటే హై బీపీ ని తక్కువ చేయడానికి కనుక్కో బడ్డది. అధిక రక్త పీడనం తక్కువ చేయడం లో చికిత్స గా తీసుకుంటున్న వారిలో , కొత్త వెంట్రుకలు మొలవడం శాస్త్రజ్ఞులు గమనించారు ! దానితో తరువాత పరిశోధనలు కూడా చేసి , మినాక్సిడిల్ ను జుట్టు పెరగడం కోసం ఉపయోగించుకునే విధం గా ,మార్కెట్ లో ,హేర్ ఆయిల్ రూపం లో ప్రవేశ పెట్టారు. ఈ మినాక్సిడిల్ మార్కెట్ లో, రొగైన్ అనే పేరుతొ అమ్మ బడుతుంది. గుర్తుంచుకోవలసిన విషయం : ఈ మినాక్సిడిల్ రెండు శాతం మాత్రమే ఉండాలి, కొనే మందులలో.  కొన్ని బ్రాండ్ లలో అయిదు శాతం మినాక్సిడిల్  అమ్ముతారు. అయిదు శాతం మినాక్సిడిల్ ఉండే హేర్  టానిక్ లకు అమెరికా వారు లైసెన్స్ ఇవ్వలేదు. అందువల్ల కొనే సమయం లో కేవలం రెండు శాతం మినాక్సిడిల్ ఉన్న బ్రాండ్ లే కొనుక్కోవాలి , అయిదు శాతం మందు ఉంటే  ఎక్కువ జుట్టు వస్తుందేమో అని అత్యాశ కు పోకుండా ! ఎక్కువ శాతం అంటే రెండు శాతం కన్నా ఎక్కువ శాతం మినాక్సిడిల్  కనుక పూసుకుంటే , రక్త పీడనం తగ్గి లో బీపీ వచ్చి కళ్ళు తిరగడమూ , లేదా సొమ్మసిలి పడి పోవడమూ జరగ వచ్చు. ఎందుకంటే  మినాక్సిడిల్ , తల మీద పూసుకున్నపుడు , చర్మం ద్వారా శరీరం లోకి పీల్చబడి రక్త పీడనాన్ని తగ్గిస్తుంది ! 
మరి మినాక్సిడిల్ నిజంగానే స్త్రీలలో ఉపయోగ పడుతుందా ?: ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవలసినది, ఆ మందు వాడుదామనుకునే వారే ! ఎందుకంటే   ఈ మినాక్సిడిల్  మీద చేసిన పరిశోధన ఈ క్రింది విధం గా ఉంది :
1. మినాక్సిడిల్ వాడిన వారి వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంది. 
2. వారికి మైల్డ్ నుంచి మోడరేట్ గా జుట్టు పలుచబడి ఉంది ( అంటే కొద్ది నుంచి ఒక మోస్తరు గా పలుచబడి ఉంది )
3. వారికి ఎనిమిది నెలలు మినాక్సిడిల్ ఇవ్వబడింది అంటే తల మీద రాసుకునే రెండు శాతం మందు గా . 
4. అట్లా వాడిన వారిలో 40 శాతం మందికి కొద్దిగానూ , 19 శాతం మందికి ఒక మాదిరి గానూ జుట్టు పెరిగినట్టు గమనించారు. అంటే వంద మంది వాడితే , రమారమి అరవై మందికి, ఎనిమిది నెలల తరువాత జుట్టు కొంత వరకూ పెరిగింది, మినాక్సిడిల్ తో ! 
5. అదే సమయం లో ఆ మందు అప్లై చేసుకోకుండా కేవలం తల నూనె పెట్టుకున్న వారికి కూడా 7 శాతం మంది లో ఒక మాదిరిగానూ , 33 శాతం మందికి కొద్ది గానూ జుట్టు పెరిగింది ! అంటే వంద మంది ఏ మందూ వాడక పోయినా కూడా నలభై  మందిలో జుట్టు కొంత వరకూ పెరిగినట్టు గమనించడం జరిగింది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?7. ఏ గర్భ నిరోధక పిల్స్ తో జుట్టు పలుచబడదు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 30, 2013 at 9:55 సా.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?7. ఏ గర్భ నిరోధక  పిల్స్  తో  జుట్టు పలుచబడదు ?

 
 
స్త్రీలలో కేశవర్ధనం లో భాగం గా క్రితం టపాలో టీలోజెన్ అనే ముఖ్య కారణం గురించి తెలుసుకున్నాం కదా ! మరి కాంట్రా సెప్ టివ్ పిల్స్  మాటేంటి ? కాంట్రా సెప్ టివ్ పిల్స్, వీటినే గర్భ నిరోధక పిల్స్ అని కూడా అంటారు కదా ! 
సామాన్యం గా ఈ రకమైన పిల్స్  ఎంతో క్షేమ దాయక మైనవి. చాలా మందిలో ఏవిధమైన సైడ్ ఎఫెక్ట్ లూ రావు. అంతే కాక చాలా సమర్ధ వంతం గా గర్భాన్ని నిరోధిస్తాయి ! కానీ కొన్ని రకాల గర్భ నిరోధక పిల్స్ , జుట్టు ఊడి పోవడానికి కారణం అవుతాయి. ప్రత్యేకించి యాన్ డ్రో జన్  అంటే పురుష హార్మోను కలిసి ఉన్న పిల్స్ స్త్రీలు ఎక్కువ కాలం వాడితే , అవి జుట్టు పలుచ బడడానికి  కారణ మవుతాయి . 
అమెరికాలో ఈ జుట్టు ఊడి పోవడం అనే సమస్య మీద విపరీతమైన అవేర్ నెస్ ఉంది , ప్రజలలోనూ , ప్రభుత్వం లోనూ ! అందుకనే అక్కడ హేర్ లాస్ అసోసియేషన్ అని ఒక సంఘం ఉంది ( A H L A ). ఆ సంఘం , నిపుణుల తో , మార్కెట్ లో లభ్యం అవుతున్న కాంట్రా సెప్ టివ్ పిల్స్ మీద నిపుణుల చేత విశ్లేషణ చేయించి ఈ క్రింది సూచనలు చేసింది :The American Hair Loss Association (ALHA) recognizes that for the most part oral contraceptives are a safe and effective form of birth control. It also recognizes that the Pill has been clinically proven to have other health benefits for some women who use them. However, the AHLA believes that it is imperative for all women — especially for those who have a history of hair loss in their family — to be aware of the potentially devastating effects birth control pills can have on normal hair growth.The AHLA recommends that all women interested in using oral contraceptives for the prevention of conception should only use low-androgen index birth control pills. Pills with the least androgenic activity include norgestimate (in Ortho-Cyclen, Ortho Tri-Cyclen), norethindrone (in Ovcon 35), desogestrel (in Mircette), or ethynodiol diacetate (in Demulen, Zovia). 
1. తప్పని సరి పరిస్థితులలో , బర్త్ కంట్రోలు కోసం పిల్స్ వాడుదామని నిర్ణయం తీసుకుంటే , స్త్రీలు వీలైనంత తక్కువ యాన్ డ్రో జెన్ ఉన్న పిల్స్ నే వాడాలి. అంటే వారు తీసుకునే పిల్స్ లో యాన్ డ్రో జెన్ అతి తక్కువ పాళ్ళ లో ఉండాలి ! 
2. నార్ జేస్టి మేట్ , నార్ ఎథిన్ డ్రో న్ , డిసో జెస్ ట్రె ల్  ఇంకా ఎథినొ డయోల్ డై ఎసిటేట్ . ఈ మందులలో అతి తక్కువ శాతం యాన్ డ్రో జెన్ ఉంటుంది. 
ఈ క్రింద సూచించిన ప్రో జెస్టిన్ ఉన్న మందులు తీసు కుంటే అవి ఎక్కువ జుట్టు ఊడి పోవడానికి రిస్కు ఎక్కువ చేస్తాయి 
1. ప్రో జెస్టిన్ ఇంప్లాంట్ లు ( వీటినే నార్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు )
2. ప్రో జెస్టిన్  ఉన్న హార్మోను ఇంజెక్షన్ లు 
3. ప్రోజేస్టిన్ ఉన్న స్కిన్ ప్యాచ్ లూ 
4. లేదా ప్రో జెస్టిన్ ఉన్న వాజైనల్ రింగ్ లూ. 
 
పైన ఉదహరించిన పిల్స్ కనుక దీర్ఘ కాలం తీసుకుంటే , అవి సహజం గానే శరీరం లో హార్మోనులలో తీవ్రమైన మార్పులు కలిగించి , గర్భ నిరోధం కలిగించడమే కాకుండా , జుట్టు ఊడి పోవడానికీ , ముఖ్యం గా పలుచ బడ డానికి కారణమవుతాయి ! ప్రత్యేకించి వంశ పారంపర్యం గా జుట్టు ఊడి పోవడం సమస్య ఉన్న వారు ఈ విషయం లో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి ! మీకు పిల్స్ తీసుకోవడం తప్పని సరి అనిపించినపుడు , పైన ఉన్న విషయాలు మీరు అవగాహన చేసుకోవడమే కాక , మీరు స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళినపుడు , ఈ విషయాలు వారితో కూడా ముఖా ముఖీ గా చర్చించి , మీకు క్షేమ దాయకమైన పిల్స్ ను రాయించు కోవాలి ! ప్రత్యేకించి దీర్ఘ కాలం కనుక పిల్స్ వాడుదామని నిర్ణయం తీసుకుంటే ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

 

స్త్రీలలో కేశవర్ధనం. 6. T E కి కారణాలేమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 29, 2013 at 8:28 సా.

స్త్రీలలో కేశవర్ధనం. 6. T E కి కారణాలేమిటి ?

 

క్రితం టపాలో టీలోజెన్ ఎఫ్లూవియం ( T E ) అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా ! మరి స్త్రీలలో T E   పరిస్థితి ఏర్పడడానికి కారణాలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం !
1. సామాన్య మైన , సహజమైన కారణం , గర్భం దాల్చడం అంటే ప్రెగ్నెన్సీ : గర్భం దాల్చిన సమయం మొదలుకుని , శిశువు జన్మించే వరకూ , గర్భవతి శరీరం లో అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిలో అతి ముఖ్యమైనవి హార్మోనుల వల్ల  కలిగే మార్పులు. గర్భం లో శిశువు  క్షేమం గా నవ మాసాలూ పెరిగి భూమి మీదకు రావడానికి హార్మోనులు ఎంతో ఉపయోగం. కానీ ఈ హార్మోనులు అకస్మాత్తుగా ఎక్కువ తక్కువలు అవడం చేత , హేర్  ఫాలికిల్ లో వెంట్రుక , ఆ హెచ్చు తగ్గులకు తట్టుకో లేక పెరుగుదల ఒక్కసారిగా ఆగి పోతుంది. అంటే కేశాల పెరుగుదల ఒక శుప్త దశ లో కి వెళుతుంది ! అంటే రెస్ట్ తీసుకునే దశ అనుకోవచ్చు ! గర్భం పూర్తి అయి , శిశువు జన్మించిన తరువాత , హార్మోనులు మళ్ళీ యధా స్థితి కి వస్తాయి. దానితో రెస్ట్ తీసుకుంటున్న వెంట్రుకలు కూడా హుషారు గా మళ్ళీ సహజం గా పెరగడం మొదలెడతాయి ! అధిక శాతం స్త్రీలలో ఈ పరిస్థితి తాత్కాలికమే. అంటే తిరిగి నార్మల్ గా కేశాల పెరుగుదల ఉంటుంది. 
2. క్రాష్ డ యట్  లేదా అకస్మాత్తు గా పథ్యం చేయడం : ఊబ కాయం ఉన్న స్త్రీలు , అనేక విధాలు గా వారి అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. చాలా మంది వారి అధిక బరువు వల్ల విపరీతం గా విసుగు చెంది , ఒక్క సారిగా అత్యంత పట్టుదలతో , క్రాష్ డ యటింగ్  మొదలు పెడతారు. క్రాష్ డ యటింగ్ పేరులోనే ఉంది కదా ! ఒక్క సారిగా , అకస్మాత్తుగా వారి ఆహారపు అలవాట్లలో తీవ్రమైన తేడా వస్తుంది ! దానితో జుట్టు పలుచబడడం కూడా జరగ వచ్చు !  అందువలన క్రాష్ డ యటింగ్  ఏ విధం గానూ సమంజసం కాదు. అంటే డ యటింగ్ చేయాలని తీసుకునే నిర్ణయం కృత నిశ్చయం గా ఉండాలి కానీ , అకస్మాత్తు గా డయట్  లో మార్పులు తీసుకు రాకూడదు . డ యట్ లేదా పథ్యం లో మార్పులు క్రమేణా తీసుకు రావాలి. అప్పుడే పథ్యం సరి అయిన ఫలితాలను ఇస్తుంది , తల మీద జుట్టు కూడా పలుచ బడ కుండా ఉంటుంది !
3. డ యట్ లేదా పోషకాహార లోపం : ఈ కారణం ఒక ప్రధానమైన కారణం. స్త్రీలలో ఎందుకు జరుగుతుందో చూద్దాం :  యుక్త వయసు వచ్చినప్పటి నుంచీ , యువతులలో , పెరుగుదల ఎక్కువ గా ఉంటుంది. అందుకు ఎట్లాగూ అనేక పోషక పదార్ధాలు అవసరమవుతాయి. అదే సమయం లో క్రమం గా వచ్చే ఋతు స్రావం వల్ల , రక్త హీనత కలుగుతుంది. దీనినే అనీమియా అంటారు కదా ! అనీమియా , జుట్టు ఎక్కువ గా ఊడి పోవడానికి ఒక ముఖ్య కారణం. ఈ రెండు కారణాలు కూడా కలిసి , టీలోజెన్  పరిస్థితి కలిగించ వచ్చు. 
4. దీర్ఘ కాలం కొనసాగే మానసిక వత్తిడులు : ఈ పరిస్థితినే క్రానిక్ స్ట్రెస్ అని అంటారు :  యువతులలోనూ , స్త్రీలలోనూ , వత్తిడి అధికం గా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. యుక్త వయసుకు వస్తున్న యువతికి , సహజం గానే , చాలా సమాజాలలో , వివిధ కట్టుబాట్ల వల్ల , ఆంక్షలు ఎక్కువ అయి , వారు అంతకు ముందు వయసులో వారి లాగా బయటకు తిరగడమూ , ఆడుతూ , పాడుతూ ఉండడం చేయ లేక పోతున్నారు. దానికి తోడు , తాము ఎన్నుకున్న విద్యావకాశాలను , అంతు తేల్చుకునే ధోరణి తో , పగలూ రాత్రీ చెమటోడ్చి , చదువు కొన సాగిస్తారు. ఈ సమయాలలో కూడా వారు వత్తిడి కి లోనవుతారు. ఈ వత్తిడి కి తోడుగా , వయసు తో ఎగసి పడే కోరికల వత్తిడి తో , ప్రేమ లో ‘ పడడమో ‘ లేక ‘ పడేయ బడడమో ‘ కూడా జరిగి , మానసిక వత్తిడి ఇంకా తీవ్రం అవుతుంది ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on జూలై 28, 2013 at 11:32 ఉద.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా ?5. టీలోజెన్ ఎఫ్లూవియం. 

 
పథ్యం మానకు అతివా, అను నిత్యం ,
నీ అందం చెదరదు, ఇది సత్యం!
నీ  మనసు కూడా  పదిలం !
నీ సొగసూ అపుడే  పగడం !
 

 
టీలోజెన్ ఎఫ్లూవియం స్త్రీలలో జుట్టు ఊడి పోవడానికి అతి ముఖ్యమైన పరిస్థితి లేదా జబ్బు. దీనిని గురించి మనం వివరం గా తెలుసుకుందాం ! 
కేశ ఫాలికిల్స్ సంఖ్య లో మార్పు రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. T E  ( టీలోజెన్ ఎఫ్లూవియం కు సంక్షిప్త నామం లేదా షార్ట్ ఫామ్ ) తల మీద కేశాలు నిరంతరం పాతవి పోతూ , కొత్తవి వస్తూ ఉంటాయి. ఈ క్రియల మధ్య ఉండే కాలాన్ని లేదా దశను టీలోజెన్  అని అంటారు. అంటారు ఇది సహజమైన దశే  అయినా , కొన్ని పరిస్థితులలో సాధారణ సమయానికంటే ఎక్కువ సమయం ఉండడం వల్ల , కొత్త జుట్టు రాక  పోవడం ,ఆలస్యమవుతూ ఉంటుంది . ఈ లోగా రోజూ సహజం గా ఊడి పోయే జుట్టు పోతూ ఉంటుంది.  ఫలితం గా జుట్టు పలుచ బడి పోతూ ఉంటుంది. 
ఇట్లా పలుచ బడి పోవడం ముఖ్యం గా మూడు రకాలు గా జరుగుతుంది. 
1. అకస్మాత్తు గా కలిగే షాక్ వల్ల : షాక్ కలిగిన ఒకటి రెండు నెలల నుంచి , కేశాలు పెరిగే దశ కాస్తా విశ్రాంతి తీసుకుంటుంది. అంటే దీనిని రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. ఈ రకమైన షాక్ ల ప్రభావం తాత్కాలికమే ! అంటే కనీసం నాలుగు నుంచి ఆరు నెలల కాలం లోగా మళ్ళీ సహజం గా అంటే ఇది వరలో ఎన్ని వెంట్రుక లైతే వచ్చేవో అన్నీ మామూలు గా వస్తాయి ( లేదా మొలుస్తాయి ). ఒక సంవత్సరం లోగా పూర్తి గా నార్మల్ గా అవుతుంది తల మీద పరిస్థితి !
2. రెండో రకమైన టీలోజెన్  లో తలమీద జుట్టు ఊడి పోవడం ఆలస్యం అవుతుంది కానీ దానితో పాటుగా , మళ్ళీ కొత్త వెంట్రుకలు వచ్చే మధ్య సమయం , అదే టీలోజెన్  పరిస్థితి ఎక్కువ కాలం ఉంటుంది. గమనించ వలసినది టీలోజెన్  అంటే రెస్టింగ్ దశ ! ఈ రెస్టింగ్ దశ ఎంత సాగుతూ ఉంటే కొత్త వెంట్రుకలు రావడం కూడా అంత ఆలస్యం అవుతూ ఉంటుంది.కేశాల ఫాలికిల్స్ సరిఅయిన సంఖ్య లోనే ఏర్పడుతూ ఉంటాయి కానీ వాటిలో కేశాలు మాత్రం పెరగవు ఈ రకం లో.  ఈ రకమైన టీలోజెన్ లో సామాన్యం గా   ఆ వ్యక్తి  అనుభవిస్తున్న సమస్య లేదా వత్తిడి కలిగించే పరిస్థితి , పరిష్కారం కాక , కొనసాగుతూ ఉంటే , జుట్టు రావడం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. 
3. ఇక మూడో రకమైన T E లో వెంట్రుకలు కురచగా నూ త్వర త్వరగానూ వస్తూ ఊడి పోతూ ఉంటాయి. దీనికి కారణం, వెంట్రుకలు పెరిగే సహజ దశలో అవక తవకలు జరగడం. 
పైన తెలుసుకున్న వాటిలో మొదటి రెండు రకాల టీలోజెన్ కూ , తీవ్రమైన శారీరిక వత్తిడి కానీ , మానసిక వత్తిడి కానీ కారణాలు. ఈ మూడు పరిస్థితులలో కూడా జుట్టు పలుచ బడుతుంది , కానీ పూర్తి గా రాలి పోదు. అంతే కాక సాధారణం గా ఈ మూడు పరిస్థితులూ తాత్కాలికమే. రెండో పరిస్థితి కొంత ఏర్పడితే , అది ఎక్కువ కాలం కొనసాగ వచ్చు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా?4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జూలై 26, 2013 at 7:55 సా.

స్త్రీలలో కేశవర్ధనం ఎట్లా?4. 

100 most beautiful women of India Bollywood and others

అలోపీశియా ఏరి యేటా ! 
ఏడాది లో చెబుతుంది టాటా !
ఈలోగా మందులకు  డబ్బు తగ లేయ కంటా ! 
తెచ్చుకోకు, లేని పోని తంటా ! 
 
అలో పీశియా ఏరియేటా : 
క్రితం టపాలో   చూసినట్టు , ఈ పరిస్థితి లో ,  తలంతా కాకుండా   తల మీద అక్కడక్కడా  కొద్ది భాగాలలో   కొంత మేర జుట్టు ఊడిపోవడం జరిగి, ఆయా భాగాలు నున్నగా అవుతాయి. రోగనిరోధక శక్తి కి కారకమయే  కణాలు , స్వంత వెంట్రుకల కణాల మీదే తమ ప్రభావం చూపిస్తూ ఉండడం వల్ల  ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రింద చిత్రాలలో గమనిస్తే , చర్మం మీద ఉండే హేర్  ఫాలికిల్ లో సహజం గా పెరిగే వెంట్రుక , రెండో చిత్రం లో ఖాళీ గా ఉన్న ఫాలికిల్  ( వెంట్రుక పెరగక పోవడం వలన ఏర్పడే పరిస్థితి )  కనిపిస్తాయి.  
మరి,  ఎవరి ఇమ్మ్యునిటీ ,వారి తలలోని  వెంట్రుక మూలాల లో ఉండే కణాలనే  ఎందుకు ముట్టడి చేస్తాయో , కారణం తెలియదు ఇప్పటి వరకూ !  ఈ  జబ్బు 20 సంవత్సరాల లోపు వారికే సర్వ సాధారణం గా కనిపిస్తుంది. యువతులూ యువకులలో సమం గా వస్తుంది. 
మరి అలో పీశియా ఏరి యేటా ను కనుక్కోవడం ఎట్లా ?
స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్  దగ్గర అన్ని ఈ పరిస్థితి గురించిన అన్ని వివరాలూ కనుక్కొని , తల భాగాన్ని పరీక్ష చేసి  రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే  తల భాగం లో కొన్ని వెంట్రుకలను డాక్టర్ లాగి చూడడం కూడా జరుగుతుంది. 
ఇక ఏ ఏ పరీక్షలు అవసరమవుతాయి ?: 
జుట్టు ఊడిపోయే తల భాగం లో కొన్ని వెంట్రుకలను తీసుకుని , వాటిని మైక్రో స్కోప్ క్రింద పరీక్ష చేయడం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోడానికి , థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లు చేయించుకోవాలి. ఎందుకంటే ఒక వేళ  థైరాయిడ్ హార్మోను తక్కువ కానీ , ఎక్కువ కానీ అవడం జరుగుతే , తగిన చికిత్స చేయించుకోవాలి వెంటనే ! జుట్టు ఊడి పోవడానికి థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయక పోవడం ఒక ముఖ్య కారణం , అందుకని , ఆ పరీక్షలు కూడా అవసరం !
ఇక చికిత్స ఎట్లా ఉంటుంది ?:
ఒక సారి ఈ అలోపీశియా ఏరి యేటా  అనే పరిస్థితి లేదా జుట్టు సంబంధమైన జబ్బు స్పెషలిస్టు ద్వారా నిర్ధారణ అయిన తరువాత , చికిత్స చేయించుకోవాలా లేదా అనే నిర్ణయం వారి మీదే ఆధార పడి ఉంటుంది. ముఖ్యం గా గుర్తుంచు కోవలసినది ఏమిటంటే , ఈ పరిస్థితి  వచ్చిన అధిక శాతం మంది లో   కేవలం తాత్కాలికం మాత్రమే ! సామాన్యం గా ఆరు నెలలనుంచి ఒక సంవత్సరం లోగా తిరిగి తలంతా జుట్టు మునుపటి మాదిరి గా పెరుగుతుంది ! ఇక చికిత్స చేయించు కుందామనుకునే వారు కూడా , రెండు పద్ధతులలో చేయించుకోవచ్చు ! ఒకటి   కేవలం తలమీదే  మందులు లేకుండా చేయించుకునే చికిత్స,  తలమీద మందులతో చేయించుకునే చికిత్స .
కేవలం తలమీద చేయించుకునే చికిత్స :
ఈ పధ్ధతి లో మందులు ఏమీ తీసుకో కుండా , వివిధ రకాల కేశాలంకరణ ల ద్వారా , జుట్టు తక్కువ గా ఉన్న ప్రదేశాలను , మిగతా తల భాగం లో ఉన్న జుట్టు ద్వారా కప్పి  ఉంచేట్టు  ఏర్పాటు చేసుకోవడం. ఇది సామాన్యం గా బ్యూటీ షియన్ లు కూడా చేయగలరు. అంటే హేర్ స్టయిల్ లు మార్చడం. అవసరం అవుతే కొన్ని కృత్రిమ కేశాల ప్యాచ్ లను కూడా అతికించడం జరుగుతుంది , తక్కువ గా జుట్టు ఉన్న తల భాగాలలో ! 
మందులతో చేయించుకునే చికిత్స:  మనం పైన తెలుసుకున్నాము కదా , అలోపీశియా ఏరి యేటా  జబ్బు , రోగ నిరోధక కణాలు, వెంట్రుక కణాల మీద పనిచేయడం వల్ల ఏర్పడుతుందని !  అంటే ఆటో ఇమ్మ్యునిటీ ! ఈ పరిస్థితి ని ఇమ్యునో సప్రేసేంట్ మందులు వాడి , తగ్గించ గలుగుతారు. 
స్టీరాయిడ్ లు ఉన్న క్రీములు తల మీద పూయడం ద్వారానూ , లేదా అవసరం అయితే , స్టీరాయిడ్ ఇంజెక్షన్ లు తల మీద చేయడం ద్వారానూ , చికిత్స చేయించుకోవచ్చు !  తల మీద ఎక్కువ భాగం లో కనుక ఇట్లా జుట్టు రాలిపోతూ ఉంటే , పూవా , P U V A  అనే చికిత్స కూడా అవసరం కలగ వచ్చు ! ( ఈ చికిత్స లో మొదట తల మీద  సోరాలిన్ అనే మందు ను పూయడం జరుగుతుంది . తరువాత  తలమీద  అతినీల లోహిత కిరణాలను ప్రసరింప చేస్తారు ! అప్పడు   ఇమ్మ్యునిటీ  సరి అయి ,  కేశ కణాల మీద ముట్టడి తగ్గుతుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీలలో కేశ వర్ధనం ఎట్లా ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 25, 2013 at 9:31 సా.

స్త్రీలలో కేశ వర్ధనం ఎట్లా ? 3. 

( మొక్క జొన్న కండె లో  మొక్క జొన్నల మాదిరి గా ఉండే హేర్ స్టయిల్  ) 

 

అశ్వ జాలం, 
మొక్క జొన్నలు, 
వరాహ జాలం !
ఒక్కో తరహా ,  
ఒక్కో మాయా జాలం ! 
చక్కని, చిక్కని ప్రణయ గాలం !
ఎట్లా తప్పించు కోగలం?! 
 
3. అలోపీశియా ఏరియే టా   : ఈ రకం లో తల మీద జుట్టు తలంతా కాక కేవలం కొన్ని ప్రదేశాలలో , అంటే ఒకటో రెండో లేదా మూడో , ప్రదేశాలలో , కొంత మేర అంటే కొన్ని అంగుళాల వ్యాసం లో జుట్టు రాలుతుంది. అంటే తల మీద కొన్ని కొన్ని ప్రదేశాలలో జుట్టు రాలిపోవడం వల్ల , కొన్ని పాచెస్ ఏర్పడతాయి ! ఈ పాచెస్ చాలా ఆందోళన కలిగిస్తాయి, ఉన్న వారికి !  ఇట్లా అలోపీశియా ఎరియే టా అంటే  తల మీద కొన్ని ఏరియా ల లో  మాత్రమే జుట్టు ఊడిపోవడం  జరగ డానికి  ప్రధాన కారణం ,  వెంట్రుక మూలాలలో అంటే రూట్స్ లో  కొన్ని రకాలైన జీవ రసాయన చర్యలు జరగడం వల్ల. ఈ చర్యలలో ప్రధానం గా   వారి రోగనిరోధక కణాలు వారి తల మీద ఉండే వెంట్రుకల మీద పని చేసి ( ఖచ్చితం గా చెప్పాలంటే వెంట్రుకల మొదళ్ళ లో లేదా రూట్స్ లో పనిచేసి ) అవి ఊడిపోవడానికి  కారణమవుతాయి !   ఈ చర్యలు మందులు తీసుకున్నా , మందులు తీసుకోక పోయినా కూడా , కనీసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలం తరువాత , ఆగిపోయి , తిరిగి తలమీద నార్మల్ గా జుట్టు వత్తు గా పెరగ డానికి అవకాశం ఉంటుంది. కనీసం  ప్రతి వంద మంది లో డెబ్బై మంది కి ఇట్లా  జుట్టు తలమీద నార్మల్ గా పెరుగుతుంది ! అందువల్ల మెజారిటీ యువతులు ఆందోళన పడనవసరం లేదు ! 
4. ట్రాక్షన్ అలోపీశియా :  తల మీద ఆరోగ్యవంతం గా పెరుగుతున్న వెంట్రుకలను అట్లా సహజం గా పెరగనీయక , వివిధ హేర్ స్టైల్స్ అని , వాటిని గట్టి గా లాగి జడ వేయడమూ , లేదా ముడి వేయడమూ చేస్తూ ఉంటే , వెంట్రుకల మూలాలలో ట్రాక్షన్ ఏర్పడుతుంది !  ఈ ఏర్పడ్డ ట్రాక్షన్ , రోమ మూలాలను బలహీనం చేసి, అవి ఊడి పోయేట్టు చేస్తుంది ! పంది  పిలకలూ, గట్టి జడలు ,  గుర్రం తోకలూ ! రక రకాల రీతులు !  అతివల  శిరోజాలంకరణలు , ! కానీ, రక రకాలు గా బలి అవుతాయి కురులు ! ప్రత్యేకించి అట్లాంటి స్టయిల్స్  ప్రతి రోజూ చేసుకుంటూ ఉంటే  !   ( వీటినే ఆంగ్లం లో స్టైల్ గా పోనీ టెయిల్ అనీ, పిగ్ టెయిల్ అనీ , బ్రెయిడ్  అనీ పిలుస్తారు కదా ! ) 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !