Our Health

రచయత ఖజానా

గుండె జబ్బు నివారణకు ఇంకో రెండు రక్త పరీక్షలు. 20.

In Our Health on మే 8, 2012 at 10:04 సా.

గుండె జబ్బు నివారణకు ఇంకో  రెండు రక్త పరీక్షలు. 20.

Lipoprotein a  test. లైపో ప్రోటీన్ ఎ  లెవెల్స్ టెస్ట్ : 
                         
మనం మునుపటి టపాలలో వివరం కా తెలుసుకున్నాము కదా చెడు కొలెస్టరాల్ గురించి. లైపోప్రోటీన్ ఎ, ఈ చెడు కొలెస్టరాల్ LDL  కొలెస్టరాల్ కు చెందుతుంది.
పైన ఉన్న  మొదటి చిత్రం చూడండి ఈ లైపోప్రోటీన్ ఎ  అణువు ఎంత అందం గా ఉందొ.  కానీ ఈ అందమైన లైపోప్రోటీన్ ఎ అణువు  మన ఆరోగ్యానికి ఎంత హానికరమో రెండవ చిత్రం లో  ఒక కార్టూన్ రూపం లో చూప బడింది.  ఈ కార్టూన్ లో రక్త నాళం లోపలి గోడలలో అతుక్కుని కూర్చున్న రాక్షసి లాంటి LDL కొలెస్టరాల్ ను  ప్రక్కనే ఉండి రక్తనాళం గోడలను అంటే ఇంటిమా ను ‘ శుభ్రం’ చేస్తున్న  HDL కొలెస్టరాల్ నూ గమనించ వచ్చు.
మన దురదృష్టం ఏమిటంటే  మనలో ఈ  LDL  కొలెస్టరాల్ ఎంత ఉండేదీ మన జీన్స్ అంటే జన్యువులు నిర్ణయిస్తాయి. అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు.  మనం ఏమైనా చేయగలిగితే,   ఈ లైపోప్రోటీన్ ఎ లెవెల్ ఎంత ఉందొ పరీక్ష చేయించుకుని , ఎక్కువ గా ఉంటె తగు జాగ్రత్తలు తీసుకోవడమే కదా !
BNP test or B type Natri Uretic Peptide test  బీ ఎన్ పీ పరీక్ష లేదా  బీ టైపు  నెట్రి యురెటిక్ పెప్టైడ్ పరిక్ష : 
ఈ పరీక్ష లో BNP అనే రసాయనం పరిమాణం మన రక్తం లో ఎంత ఉందొ  కొలిచి, దాని ద్వారా  మన గుండె జబ్బు తీవ్రత కనుక్కుంటారు.
ఈ BNP ఎక్కడ నుంచి వస్తుంది ? :  ఇది అత్భుతమైన  ప్రకృతి చిత్రాలలో ఒకటి  అనుకోవచ్చు.
ఎందుకంటే ,  గుండె జబ్బు వచ్చినప్పుడు , గుండె నుంచీ , ఇంకా మనలో ఉన్న రక్తనాళాల నుంచీ విడుదల అయే ఈ BNP,  అనవసరమైన  ద్రవాలను  మూత్రము ద్వారా పంపించి , మన రక్తం  పరిమాణం లో మార్పులు తీసుకువచ్చి  ,  తద్వారా గుండె చేసే పనిని  తగ్గించి , గుండె కు తగు విశ్రాంతి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ BNP  హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా విడుదల అవుతుంది.  గుండె జబ్బు తీవ్రం గా ఉంటె , ఎక్కువ గానూ విడుదల అవుతుంది.
ఈ BNP గుండె జబ్బు వల్ల వచ్చే ఆయాసం ,  లేక  ఊపిరితిత్తుల జబ్బుల వల్ల వచ్చే ఆయాసం లో తేడా కనుక్కోవడానికి కూడా ఉపయోగ పడుతుంది.  ఎందువల్ల నంటే ఈ BNP  ఎక్కువ గా విడుదల అయేది గుండె జబ్బు లోనే !
క్రింద చిత్రం లో చూడండి ఈ BNP  ఏ పరిస్థితులలో విడుదల అవుతుందో !  
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

HbA1C పరీక్ష దక్షిణ ఆసియా వారందరికీ గుండె జబ్బు నివారణలో ఎందుకు విలువైనది ?19.

In Our Health on మే 8, 2012 at 8:45 సా.

HbA1C   పరీక్ష దక్షిణ ఆసియా  లో వారందరికీ గుండె జబ్బు నివారణలో  ఎందుకు విలువైనది ? 19.

దక్షిణ ఆసియా దేశాలలో భారత దేశమూ, నేపాలు , పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్  మొదలైన దేశాలున్నాయి. ఇటీవలి పరిశోధనల  వల్ల  ఈ  దేశ వాసులందరిలో , డయాబెటిస్  వచ్చే రిస్కు  పలు కారణాల వల్ల  ఎక్కువ గా ఉంటుందని తెలిసింది. ఈ రిస్కు , వారు , వారి దేశం వదిలి వెళ్లి , వేరే ఏ  ఇతర దేశం లో స్థిర పడ్డా కూడా మారదని కూడా వివిధ పరిశీలనల వల్ల విశదమయింది. ( మనం డయాబెటిస్ లేక మధుమేహ వ్యాధి  గురించి ముందు ముందు టపాలలో వివరం గా తెలుసుకుందాము  ).
ఇప్పుడు HbA1C పరీక్షకూ , గుండె జబ్బులకూ సంబంధం ఏమిటి ? : 
మనం గుండె జబ్బు నివారణ  ఎట్లా చేయ వచ్చో తెలుసుకుంటున్నాము కదా !  డయాబెటిస్  అంటే మధుమేహాన్ని అత్యంత తొలి దశలలో  కనుక్కోవడానికి  HbA1C test అంటే  హెచ్  బీ  ఎ  వన్  సి  పరీక్ష  అత్యంత  ఉపయోగకరమైనది. మనం ఇప్పటి వరకూ  మధుమేహాన్ని కనుక్కోవడానికి  మన రక్తం లో ఉన్న  చెక్కెర పరిమాణాన్ని కొలిచి  నిర్దారించడం జరుగుతూ ఉన్నది.  కానీ ఇటీవల  HbA1C test ను  మధుమేహాన్ని నిర్ధారించే  ప్రధాన  పరీక్ష గా  ప్రపంచం అంతా ఆమోదించడం జరిగింది.
ఈ పరీక్ష వివరాలు చూడండి. 
మన రక్తం లో సహజం గా ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా ! ఈ  ఎర్ర  రక్త కణాలలో  హీమోగ్లోబిన్  ఉంటుంది
కదా !  ఈ  హీమోగ్లోబిన్  సహజం గా  ఆక్సిజెన్ ను ఆకర్షించి  మన  శరీరం లో ప్రతి భాగాన్నీ చేరవేస్తుంది.
కానీ ఇటీవల శాస్త్రజ్ఞులు  మన  రక్తం లో ఉన్న  గ్లూకోజు  కూడా  ఈ  హీమోగ్లోబిన్ చేత  ఆకర్షింప  బడుతుంది.  అప్పుడు  దానిని   గ్లయికోజిలేతేడ్  హీమోగ్లోబిన్  అంటారు ( glycosilated hemoglobin  or HbA1C ). కొన్ని ప్రత్యెక పద్ధతుల ద్వారా  ఈ  గ్లయికోజిలేటేడ్  హీమోగ్లోబిన్  పరిమాణం కొలిచి,  నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటె అప్పుడు మధుమేహాన్ని లేక డయాబెటిస్ ను నిర్దారించుతారు.
పై చిత్రం చూడండి. వివరణ : మొదటి చిత్రం లో  రక్తనాళం ను కోసినట్టు చూపించారు.  అందులో సహజం గా ఉండే గ్లూకోజు అణువులు రక్త కణాలకు ఎక్కువ గా అతుక్కోవు. కానీ మన రక్తం లో అవే గ్లూకోజు అణువులు ఎక్కువ అయినప్పుడు ,  రక్త కణాలకు ఎట్లా అతుకు కుంటాయో కూడా చక్క గా చూపబడింది. 
మధుమేహాన్ని ముందుగా కనుక్కోక పొతే ,  కంట్రోలు లో లేని మధుమేహం  గుండెజబ్బులకు  అత్యధిక రిస్కు అవుతుంది. అందువల్ల  ఈ HbA1C పరీక్ష అత్యంత విలువైనది, ఉపయోగ కరమైనది కూడా ! 
ఎవరు చేయించుకోవాలి ఈ పరీక్షను ? :
కుటుంబం లో మధుమేహం ఉంటె, లేక అత్యధిక బరువు ఉంటె, ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సహజం గా కుటుంబం లో ఎవరికైనా మధుమేహం ఉంటె , ఆ జన్యువులు లేక జీన్స్  మనలో కూడా ఉండి, మధుమేహం కలిగించడానికి అవకాశం హెచ్చుతుంది. అలాగే ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ ఉన్నవారికి మధుమేహం రావడానికి అవకాశం హెచ్చు. అందువల్ల ఈ పరీక్ష  చాలా  ప్రయోజనకారి.
పై  చిత్రం లో ఎన్ని మిల్లీగ్రాముల గ్లూకోజుకు  ఎంత HbA1C ఉందొ  చాలా అర్ధ వంతం గా రంగులతో చూపబడింది. 
ఇక్కడ సాధారణ లెవెల్స్ ఆకు పచ్చ రంగులోనూ , ప్రమాదకర లెవెల్స్ ఎరుపు రంగులోనూ చూపబడ్డాయి.  ప్రమాద కరం అంటే  రక్తం లో ఒక లెవెల్ లో ఉండవలసిన పరిమాణం కన్నా ఎక్కువ గ్లూకోజు ఉంటె ఆ పరిస్థితి పరిణామాలు తీవ్రం గా ఉంటాయి.
వచ్చే టపాలో ఇంకో పరీక్ష గురించి తెలుసుకుందాము !

గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ ( homocysteine ) పరీక్ష ఎందుకు ?.18.

In Our Health on మే 7, 2012 at 10:27 సా.

 గుండె జబ్బు నివారణలో హోమోసిస్టీన్ పరీక్ష ఎందుకు ?.18.

రక్త పరీక్షలు మనలో అత్యంత తొలి దశలలో వ్యాధులు కలిగించే సూక్ష్మమైన మార్పులు తెలిపి,  భవిష్యత్తు లో మన ఆరోగ్య నిర్దేశన చేసే టెలిస్కోపులు !  

మనం క్రితం టపాలో కొన్ని రక్త పరీక్షలు, ముందుగా చేయించుకుంటే, మనకు గుండె జబ్బు లక్షణాలను ఎట్లా కనిపెడతాయో  చూశాము కదా ! గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ రక్త పరీక్షల వల్ల , మన దేహం లో, రక్త నాళాల లో చాలా ముందుగా జరిగే మార్పులు మనకు తెలుస్తాయి. అంటే  కొన్ని దశాబ్దాల క్రితం మాదిరిగా జబ్బు ముదిరే దాకా వేచి ఉండనవసరం లేదు.  శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ , అతి సున్నితమైన పరీక్షలు, అవి రక్త పరీక్షలు కానీయండి , వేరే  ఇమేజింగ్ పరీక్షలు కానీయండి , చాలా మనకు అందుబాటు లోకి వచ్చాయి. ఇక మనం చేయవలసిందల్లా తగు జాగ్రత్త లు తీసుకోవడమే ! లేక తక్షణ వైద్య సహాయం తీసుకోవడమో ! ఈ రెండు పనులు చేయడానికీ మనకు ఈ పరీక్షల గురించి తెలియాలి కదా !  ఆ అవగాహన కలిగించడానికే ఈ ప్రయత్నం !
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్ : 
హోమో సిస్టీన్ కధ ఏమిటో చూద్దాము ఇప్పుడు :  మన దేహం లో 22 రకాల అమీనో యాసిడ్స్ ఉంటాయి.  అందులో 9 అంటే తొమ్మిది రకాల అమీనో యాసిడ్స్ ను మనం ఎసెన్షియల్  అమీనో యాసిడ్స్ అంటాము. ఎందుకంటే ఈ తొమ్మిదీ మన దేహం లో తయారు కాలేవు.  కానీ మనకు ఇవి చాలా ముఖ్యం. అందువల్ల మనం మన ఆహారం లో ఈ తొమ్మిది అమీనో యాసిడ్స్ నూ తీసుకోవాలి.  ఈ హోమోసిస్టీన్ అనే అమీనో యాసిడ్ ,  రూపాంతరం చెందిన సిస్టీన్ అనే అమీనో యాసిడ్. ఒక రకం గా చెప్పుకోవాలంటే ఈ హోమోసిస్టీన్ కూడా ఎసెన్షియల్ అమీనో యాసిడ్ కోవ కు చెందుతుంది.
ఇటీవలి పరిశోధనల వల్ల ఈ హోమోసిస్టీన్  గుండె జబ్బులలో ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిసింది.
ఒక్క ముక్క లో చెప్పాలంటే ఈ హోమోసిస్టీన్  మన రక్త నాళా లను ‘  కరోడ్ ‘ చేసే జీవ రసాయనం.
  ( homocysteine is a biological corrosive ) 
మనకు మన  నిత్య జీవితం లో , ఇనుము ‘ తుప్పు ‘ పట్టడమూ, లేక రాగి పాత్రలు చిలుము పట్టడమూ , అనుభవం లోనిదే కదా ! అలాగే  మన రక్త నాళాల లోపలి ‘ గోడలను ‘  ( ఇంటిమా – intima ,  అని మనం క్రితం టపాలలో పటం సహాయం తో తెలుసుకున్నాము ), వివిధ రసాయన చర్యలతో  ఈ హోమోసిస్టీన్  బలహీనం చేస్తుందని  తెలిసింది.  పై చిత్రం లో  ఈ హోమో సిస్టీన్   ఉదాహరణకు ఒక  కరోనరీ ధమని గోడను  ఎలా ‘ చీల్చుతుందో ‘ చూపబడింది. ఇది అత్యంత సూక్ష్మమైన చీలిక అయినా , ఆ చీలిక తరువాత  అక్కడ జరిగే మార్పులు , అంటే అక్కడ ‘ చెడు కొవ్వు పేరుకోవడమూ, తదనంతరం ,  ప్లేక్ ఫార్మేషన్ అంటే ఒక ‘ పెచ్చు ‘ ఏర్పడడమూ, ఆ తరువాత ఆ పెచ్చు ఊడి పోయి , ఆ ప్రాంతం లో రక్తస్రావం జరగడమూ, అప్పుడు అక్కడ రక్తం గడ్డ కట్టడమూ,  అంటే త్రాంబస్ ఏర్పడడమూ ,  అప్పుడు ఆ రక్తనాళం పాక్షికం గానో  , లేక సంపూర్ణం గానో మూసుకు పోయి , యాంజైనా కానీ , హార్ట్ ఎటాక్ కానీ కలిగించడమో  జరుగుతాయి.  ఇప్పుడు మనకు అవగాహన అయింది కదా ఈ హోమోసిస్టీన్ మన రక్త నాళాలను ఏ విధం గా ‘ తుప్పు ‘  లేక ‘ చిలుం ‘  పట్టిస్తుందో !
ఈ హోమోసిస్టీన్  నార్మల్ లెవెల్స్ ఏమిటి ?: 
4.4 to 10.8 micromols per litre అంటే  4.4 నుంచి 10.8 మైక్రో మోల్స్ పర్ లీటర్.
ఎవరు చేయించుకోవాలి ఈ హోమోసిస్టీన్ టెస్ట్ ? :  ఈ పరీక్ష కూడా గుండె జబ్బు కు రిస్కు ఫ్యాక్టర్లు ఉన్న వారు చేయించుకోవాలి. ( మునుపటి టపాలో తెలుసుకున్నాము కదా చాలా వివరం గా ఈ రిస్కు ఫ్యాక్టర్ల గురించి ! )
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్. ( దీని గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము ) 
( ఈ టపా నచ్చితే మీ స్నేహితులకు  www.baagu.net. గురించి తెలియచేస్తారు కదూ ! )

గుండె జబ్బు నివారణ కు మిగతా రక్త పరీక్షలు ఏమిటి ? ఎందుకు ? .17.

In Our Health on మే 7, 2012 at 1:52 సా.

గుండె జబ్బు నివారణ కు మిగతా రక్త పరీక్షలు ఏమిటి ? ఎందుకు ? .17.

 క్రితం టపాలో మనం  గుండె జబ్బుల నివారణలో  ఫాస్టింగ్  కొలెస్టరాల్  పరీక్ష  ప్రాముఖ్యత తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మిగతా ముఖ్యమైన పరీక్షలు కూడా  ఏమిటో , ఆ పరీక్షలు మనకు  గుండె జబ్బు గురించి ఏమి చెబుతాయో కూడా తెలుసుకుందాము.
1. C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్  టెస్ట్.
2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.
3.Homocysteine levels test. హోమో సిస్టీన్ లెవెల్స్ టెస్ట్.
4.Lipoprotein ‘ a ‘ levels test. లేక లైపో ప్రోటీన్ లెవెల్స్ టెస్ట్.
5. Natriuretic peptides. లేక  నెట్రి యురెటిక్ పెప్ టైడ్ లెవెల్స్ టెస్ట్. 
6. HbA1C test. 
1. C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్  టెస్ట్. :   ఈ ప్రోటీన్  మన కాలేయం అంటే లివర్
( liver ) లో ఉత్పత్తి అవుతుంది.  ఎప్పుడంటే , మన దేహం లో ఏదైనా  గాయం ఉన్నప్పుడు, అంటే ఆ గాయం బయటకు కనిపించేదే ఆవ నవసరం లేదు.  ( పైన ఉన్న C – reactive protein  చిత్రం చూడండి.  ) 
అలాగే, మన దేహం లో ఎక్కడైనా, ఇన్ఫెక్షన్ కానీ ( infection ) ,  ఇన్ఫ్లమేషన్  అంటే inflammation  ఉన్నప్పుడు.   గుండె జబ్బుకు సంబంధించిననంత వరకూ , ప్లేక్ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నాము కదా మునుపటి టపాలలో పటం సహాయం తో ! అలా జరిగినప్పుడు కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ విడుదల అవుతునుందన్న మాట.  అంటే ఎక్కడైనా గాయం మానేటప్పుడు.
C – reactive protein , లేక  సి – రియాక్టివ్  ప్రోటీన్ నార్మల్ లెవెల్స్ ఏమిటి ? :  
లీటర్ కు ఒక మిల్లీగ్రాము  కన్నా తక్కువ ఉంటె గుండె జబ్బు రిస్కు తక్కువ ఉన్నట్టు.
( low risk  if less than 1 milligram per litre ).
లీటర్ కు ఒకటి నుంచి మూడు మిల్లీ గ్రాముల మధ్య ఉంటె  యావరేజ్  రిస్కు అంటే ఒక మాదిరిగా రిస్క్ ఉన్నట్టు. ( average risk if the levels are between 1 and 3 milligrams per litre ) 
లీటర్ కు మూడు, అంతకు మించీ ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్నట్టు.
( High risk if levels are 3 or above 3 milli grams per litre ). 
ఈ పరీక్ష ఎవరు చేయించుకోవాలి ? :  అమెరికన్ హార్ట్  అసోసి ఎషన్  ఈ పరీక్షను గుండె జబ్బులు వచ్చే రిస్కు ఎక్కువ గా ఉన్న వారే చేయించుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఈ పరీక్ష అందరూ చేయించు కొనవసరం లేదు.
 2. Fibrinogen levels test. లేక ఫైబ్రినోజెన్ లెవెల్స్ టెస్ట్.: 
ఫైబ్రినోజేన్ అంటే ఏమిటి ? : ఇది మన రక్తం లో ఉండే ఒక ప్రోటీన్.  రక్తం గడ్డ కట్టే క్రియ లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.  అంటే బ్లడ్ క్లాటింగ్ ( blood clotting ). ఈ ఫైబ్రినోజెన్  సహజం గా మనందరిలోనూ  ఒక నిర్ణీత పరిమాణం లో ఉంటుంది. ఎక్కువ గా ఉంటే రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
 కొన్ని ప్రత్యెక పరిస్థితులలో ఈ ఫైబ్రినోజెన్ దేహం లో ఎక్కువ అవుతుంటుంది. 
స్మోకింగ్ చేసే వారిలోనూ , మద్యపానం ఎక్కువ గా చేసే వారిలోనూ,  ఈస్త్రోజేన్  ( estrogen containing drugs or contraceptive pills ) ఉన్న మందులు తీసుకునే వారిలోనూ,  వ్యాయామం అసలే చేయక, అతి తక్కువగా కదిలే వారిలోనూ , ఈ ఫైబ్రినోజెన్ పరిమాణం ఎక్కువ అవుతుంది.  ఇలా ఎక్కువ అయిన ఫైబ్రినోజెన్  కరోనరీ ధమనులలో కూడా రక్తాన్ని గడ్డ కట్టించి  ( అంటే ప్లేక్ దిస్రప్షన్ జరిగినప్పుడు , మనం చూశాము కదా , మునుపటి టపాలలో , దీని గురించి కూడా , పటం సహాయం తో ! ) , గుండె పోటు కు  కారణం అవుతుంది.
అలాంటి పరిస్థితులలో , వారు ఫైబ్రినోజెన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
 ( కింద ఉన్న అత్భుతమైన ఎలెక్ట్రాన్ ఫోటో లో  ఫైబ్రిన్ మన దేహం లో  రక్తం గడ్డ కట్టడానికి  ఎర్ర రక్త కణాల మీద ఒక వల లా ఏర్పడుతుందో ! మన దేహం లోని ఈ అత్యంత సహజమైన   బ్లడ్ క్లాటింగ్ చర్య ,  సమ తూకం లోనే జరగాలి ఎక్కువగా జరిగితే  గుండె కు హానికరం. తెల్లటి పోగుల రూపం లో ఉన్నది  ఫైబ్రినోజెన్ నుంచి జనించిన  ఫైబ్రిన్ పోగులు. గుండ్రం గా ఎర్రగా ఉన్నవి మన ఎర్ర రక్త కణాలు ) 
మిగతా పరీక్షల గురించి కూడా వచ్చే టపాలో తెలుసుకుదాము !

గుండె జబ్బు నివారణ కు కొలెస్టరాల్ రక్త పరీక్ష ఎందుకు?.16.

In Our Health on మే 6, 2012 at 11:10 ఉద.

గుండె జబ్బు నివారణ  కు  కొలెస్టరాల్ రక్త పరీక్ష ఎందుకు?.16.

నెయ్యి నూనెలన్ని, ఒక్క పోలికనుండు ,
చూడ చూడ రుచుల జాడ వేరు,
కొవ్వులందు ‘ మంచి కొవ్వులు ‘ వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ !
( కీ.శే. వేమన గారికి  కృతజ్ఞతలతో ! )
మనం ఇంత  వరకూ గుండె జబ్బులకు రిస్కు ఫ్యాక్టర్లు ఏమిటి ?  ఇంకా   ACS గురించీ కొంత వరకు తెలుసుకున్నాము కదా !  ప్రత్యేకించి , కొలెస్టరాల్ అంటే చెడు కొలెస్టరాల్ , అంటే LDL కొలెస్టరాల్  ఎట్లా మన రక్త నాళాలకు అతుక్కొని ప్లేక్ ఫార్మేషన్ కు కారకమవుతుందో కూడా చూశాము కదా !
ఇప్పుడు కొలెస్టరాల్ పరీక్షల గురించి తెలుసుకుందాము.
అసలు ఈ కొలెస్టరాల్ పరీక్షలు ముందుగా ఎందుకు చేయించుకోవాలి?:
మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది కదా సమాధానం. మనకు చెడు కొలెస్టరాల్, ( LDL Cholesterol ) మన రక్త నాళాలకు ఒక పూత లాగా అటుక్కుంటుంది. ఇలా అతుక్కోవడం ఒక రోజులో జరగదు. కొన్నిసంవత్సరాలు   జరిగి,  ప్లేక్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కొలెస్టరాల్  మన రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే, అంత త్వరితం గా ప్లేక్ ఫార్మేషన్ కు ఆస్కారం ఉంది. అందువల్ల మనం ముందే మన రక్తం లో ఉండే చెడు కొలెస్టరాల్ ఎంత ఉందొ కనుక్కుంటే , తగు   జాగ్రత్తలు తీసుకోవచ్చు,  గుండె జబ్బును దశాబ్దాలకు పైగా వాయిదా వేయవచ్చు కదా !
ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫయిల్ అంటే ఏమిటి ?: ( Fasting Lipid Profile ) :
అంటే మనం ఒకరోజు రాత్రి  భోజనం  తరువాత ఏమీ తినకుండా, పర కడుపుతో అంటే ఖాళీ కడుపుతో , ఉదయం లిపిడ్ అంటే కొవ్వు అంటే  మన రక్తం లో కొవ్వు శాతం ఎంత ఉందీ, అందులో HDL , లేక LDL కొవ్వు ఎంత శాతం ఉందీ అనే పరీక్షలు చేస్తారు. కనీసం  తొమ్మిది నుంచి పన్నెండు గంటలు మనం ఏమీ తినకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మనం సహజం గా ఏమైనా తింటే మన రక్తం లో కొలెస్టరాల్ ఎలాగూ ఎక్కువ అవుతుంది. అందువల్ల తప్పు ఫలితాలు ( errors in results ) వస్తాయి. 
HDL ( High Density Lipoproteins ) గురించి మనకు ఏమి తెలుసు ?:
 కొలెస్టరాల్ మన రక్తం లో మూడు రూపాలలో ఉంటుంది. ఒకటి ట్రై గ్లిజారైడ్స్ ( Tri glycerides ), రెండు హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్  ( HDL or High density Lipoproteins ) మూడు: లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్
( LDL or Low  Density Lipo Proteins ) అని.( పై చిత్రం లో ఈ వివరణ  చిత్ర రూపం లో గమనించండి )  సాధారణం గా లిపిడ్ ప్రొఫయిల్ టెస్ట్ లో ఈ మూడూ ఎంత ఉన్నాయనే విషయం మనకు తెలుస్తుంది.
HDL  కొలెస్టరాల్ మనకు అవసరం. ఇది మంచి కలిగించే గుడ్ కొలెస్టరాల్  ( good cholesterol ) అన బడుతుంది,. ఎందుకంటే , ఈ మంచి కొలెస్టరాల్ రక్తం లో తగిన పరిమాణం లో ఉన్న వారికి గుండె జబ్బులు తక్కువ గా వస్తాయని అనేక పరిశోధనల వల్ల ఖచ్చితం గా నిర్ధారణ అయింది.
ఈ HDL కొలెస్టరాల్ ఎంత ఉండాలి? :   
60 mg. % లేక  మిల్లీ మోల్స్ లో 1.55 మిల్లీ మోల్స్ per litre  కన్నా ఎక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రాకుండా రక్షణ ఇస్తుంది.
పురుషులలో  40 mg.% అంటే , స్త్రీలలో  50 mg %, అంటే  మిల్లీ మోల్స్ లో చెప్పాలంటే 1.03 mmols per litre  కన్నా తక్కువ ఉంటే వారికి గుండె జబ్బు రిస్కు ఎక్కువ గా ఉంటుంది.
ఇంకో రకం గా కూడా గుండె జబ్బు రిస్కు ను చెపుతారు. 
మన రక్తం లో HDL కొలెస్టరాల్, LDL  కొలెస్టరాల్ నిష్పత్తి . సాధారణం గా ఈ నిష్పత్తి  2.5 – 4.5: 1  ఉండాలి. అంటే మన రక్తం లో  LDL  ఒక భాగం ఉంటే , HDL  రెండున్నర నుంచి నాలుగున్నర పాళ్ళు  ఉండాలి. అంటే మంచి కొవ్వు లేక గుడ్ కొలెస్టరాల్ అయిన HDL , ఎక్కువ పాళ్ళు ఉండి LDL తక్కువ గా ఉండాలి.
మరి మనకు ఇంత మంచి చేసే ఈ మంచి HDL  or Good cholesterol ఎలా మన రక్తం లో ఎక్కువ నిష్పత్తి లో ఉండేట్టు చూడడం ? :
అనేక శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ క్రింది విషయాలు తెలిశాయి.
అధిక బరువు తగ్గడం,  క్రమం గా వ్యాయామం చేయడం, ( trans fats ) , ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆహారం లో లేక పోవడం, నికోటినిక్ యాసిడ్ అనే విటమిన్ మన ఆహారం లో ఉండడం, స్మోకింగ్ మానడం
( అంటే స్మోకింగ్ చేస్తున్న వారు ఆ అలవాటు మానుకున్నా వారిలో గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుందన్న మాట ) ,  మన ఆహారం లో ఒమేగా – 3- ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం,( అంటే Omega-3-fatty acids ), మన ఆహారం లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉండేట్టు చూసుకోవడం, మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆహారం లో ఉండడం  – ఈ చర్యలన్నీ మన రక్తం లో HDL కొలెస్టరాల్ శాతాన్ని పెంచి, గుండె జబ్బు రిస్కు తగ్గిస్తాయి.
 (  ఈ ‘ మంచి ‘   HDL కొలెస్టరాల్   చిత్రం క్రింద చూడండి, అందం గా ఉంది కదూ ! )
( ఈ టపా మీకు నచ్చితే, మీ అభిప్రాయాలతో పాటు ,  www.baagu.net. గురించి మీ ప్రియ స్నేహితులకు చెపుతారు కదూ ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

లో బీ పీ కారణాలు ఏమిటి ?.15.

In Our Health on మే 5, 2012 at 8:13 సా.

లో బీ పీ కారణాలు ఏమిటి ?.15.

మనం హై బీపీ కి కారణాలూ లక్షణాలూ తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు లో బీ పీ అంటే అల్ప రక్త పీడనం,  దీనినే హైపో టెన్షన్ ( hypotension ) అంటారు. గురించి కూడా తెలుసుకుందాము.
హై బీ పీ లానే  అల్ప రక్త పీడనాన్ని కూడా సిస్టోలిక్ ఇంకా  డయా స్టోలిక్ రక్త పీడనం లాగా చెపుతారు.
సాధారణం గా 90/60 mm Hg. కన్నా తక్కువ వుంటే  అప్పుడు , అల్ప రక్త పీడనం లేదా   లో బీ పీ అంటారు.
మంచి ఆరోగ్య వంతులైన యువతీ యువకులకు  115/75 mm Hg రక్త పీడనం ఉండ వచ్చు. ఇట్లా ఉన్నప్పుడు , కేవలం సిస్టోలిక్ కానీ డయా స్టోలిక్ కానీ 20 mm Hg. కన్నా తగ్గినా  వారు లో బీపీ లక్షణాలు చూపిస్తారు.
లో బీపీ ఉంటే ఏమవుతుంది ? : 
లో బీ పీ వల్ల మన శరీరం లో ని  వివిధ భాగాలకు  అందవలసినంత ఆక్సిజెన్ అంటే ప్రాణ వాయువు అందదు. దాని వల్ల తల తిప్పటము, వికారం గా అవటము, కళ్ళు తిరిగినట్టయి క్రిందకు వాలిపోవడమో , లేక క్రింద పడిపోవడమో జరగవచ్చు.  దీనినే ఫెయింటింగ్ లేక fainting అంటారు. ఈ లక్షణము సాధారణంగా యుక్త వయసులో ఉన్న యువతులలో చూస్తుంటాము. వారు సాధారణంగా అతి నాజూకు గా ఉండి ఆహారం కూడా చాలా మితం గా తీసుకుని,  ఉదయం సరిగా తినక, కాలేజీ కి వచ్చి , అతి ప్రయాస పడటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడ వచ్చు. అలాగే , ఋతుస్రావం ఎక్కువగా అయినా,  ఆహారం అశ్రద్ధ చేసి కాలేజీలకూ, వారి  కార్యాలయాలకూ , వచ్చి  కష్ట పడటం వల్ల కూడా , ఈ ఫెయింటింగ్  జరగవచ్చు.
లో బీ పీ కి ఇంకో అతి సామాన్య కారణం : అతి సారం. అంటే డయేరియా. మన భారత దేశం లో అన్ని వయసుల వారినీ ఈ అతి సారం ( అంటే సాధారణం గా బాక్టేరియా లేక వైరస్, లేక ఫుడ్ పాయిజానింగ్  వల్ల ) ప్రాణాంతకం అవుతుంది. ఈ అతిసార వ్యాధి ప్రబలినప్పుడు, మన శరీరం లోని ద్రవం, లవణాలు, ఎక్కువ పరిమాణం లో అతి తక్కువ సమయం లో పోయి బీ పీ చాలా పడి పోయి , అతి ప్రమాదకరం గా మారుతుంది.
పైన ఉన్న పటంలో  లో బీ పీ కి వివిధ కారణాలు చూడండి. 
ఇందులో గుండె కు సంబంధించిన కారణాలలో గుండె సరిగా కొట్టుకోక పోవడమూ , లేక గుండె కవాటాలు ఏ కారణం చేతనైనా సరిగా పనిచేయక పోయినప్పుడు కానీ , లేక రక్తం పరిమాణం అకస్మాత్తుగా తగ్గి పోవడం ( అంటే ప్రమాదాలలో రక్త స్రావం అవడం, లేక అతిసార వ్యాధికి ఫ్లూయిడ్స్  తగ్గి పోవడం అంటే బ్లడ్ వాల్యూం తగ్గి పోవడం , ( అంటే డీ హైడ్రేషన్ జరగడం )లాంటి కారణాలున్నాయి.
కొన్ని సమయాలలో  సెప్సిస్ ( sepsis )  జరిగినప్పుడు ( అంటే మన శరీరం లో   తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల , విష పదార్ధాలు  విడుదల అయి లో బీ పీ కలిగిస్తాయి ) అంటే అప్పుడు రక్త  పరిమాణం తగినంత ఉన్నప్పటికీ  ఇన్ఫెక్షన్ వల్ల  జనించిన వివిధ  విష పదార్ధాలు , వీటినే టాక్సిన్లు ( toxins ) అంటారు , అవి మన శరీరం లో ఉన్న రక్త నాళాలను తీవ్రం గా వ్యాకో చింప చేస్తాయి. దానితో లో బీ పీ ఏర్పడుతుంది.  దీనినే సెప్టిక్ షాక్
( septic shock ) అని అంటారు.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము.
మీ స్నేహితులకు  www.baagu.net గురించి తెలియ చేస్తున్నారు కదూ ! 

హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి?.14.

In Our Health on మే 5, 2012 at 9:43 ఉద.

హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి?.14. 

మనం ఇప్పటి వరకూ గుండె, రక్తనాళాలకు సంబంధించిన వివరాలలో ,  హై బీ పీ అంటే అధిక రక్త పీడనానికి  కారణ  భూతమయే  రిస్కు ఫ్యాక్టర్ల గురించి వివరం గా తెలుసుకున్నాము. ఇందులో  నివారించ తగ్గ రిస్కు ఫ్యాక్టర్లు  మనం అశ్రద్ధ చేసిన కొద్దీ , వాటి ప్రభావం మన గుండె మీదా , రక్తనాళాల మీదా ఎంత తీవ్రం గా ప్రభావం చేస్తాయో  మనకు చాలా వరకు అవగాహన అయింది కదా!
ఇక మనం  హై బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము .
హై బీ పీ అంటే అధిక రక్త పీడనం షుమారు తొంభై శాతం కేసులలో కారణం ఖచ్చితం గా తెలియదు అని. కానీ రిస్కు ఫ్యాక్టర్లు మనకు ఎక్కువ అవుతున్న కొద్దీ ( మనం ఎక్కువ చేసుకుంటున్న కొద్దీ  అనవచ్చు ) ఈ హై బీ పీ కూడా త్వరగా మనల్ని చేరి , చికిత్స కు కూడా  సరిగా కంట్రోలు కాక పోవచ్చు.
తల నొప్పి : తలనొప్పి చాలా సాధారణమైన  లక్షణం కదా ! అందు వల్ల మనం ఈ లక్షణాన్ని సాధారణం గా అశ్రద్ధ చేస్తుంటాము.  ఎందువల్ల నంటే , పని వత్తిడి ఎక్కువ గా ఉందనుకునో, లేక మనం ఉన్న చోట గాలి స్వచ్చం గా లేదనో , లేక చాలా ఇరుకు గా ఉన్న చోట అంటే crowded space లో ఉన్నామనుకునీ , ఈ తల నొప్పిని మనం అశ్రద్ధ చేస్తాము.  మరీ ఎక్కువ గా ఉంటె, క్రోసిన్ బిళ్ళలు కానీ,  బ్రూఫెన్ బిళ్ళలు కానీ వేసుకుని , కాఫీ అయినా , టీ అయినా తాగుతాము. విశ్రాంతి కూడా తీసుకుంటాము.
అంత వరకూ బాగానే ఉంది. మనం  జాగ్రత్త పడవలసినది ఎప్పుడంటే,  ఈ తల నొప్పి తరచూ వచ్చి, చాలా సమయం వరకూ తగ్గక పోవడం, లేక  అసలు తగ్గకుండా , అలాగే ఉండడమూ జరిగినప్పుడు అంటే అప్పుడు ఈ తల నొప్పిని పర్సి స్టెంట్ హెడేక్ లేక persistent headache అంటారు. ఇలా పర్సిస్టెంట్ హెడేక్ ఉండటం , హై బీ పీ లక్షణం కావచ్చు. ఇలా జరిగినప్పుడు అశ్రద్ధ చేయ కూడదు. కనీసం ఒక సారి అయినా  రక్త పీడనం , అంటే బీ పీ చెక్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర కు వెళ్లి.
కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడం లేక చూపు స్పష్టం గా లేక పోవడం ( blurred vision or double vision ) : 
హై బీ పీ ఉన్నప్పుడు కళ్ళలో ఈ లక్షణాలు ఎందుకు ఉంటాయి ? : మనం తెలుసుకున్నాము కదా, అధిక రక్త పీడనం ప్రభావం ఎక్కువ గా అతి సన్నని , లేక సూక్ష్మ రక్త నాళాల మీద ఉంటుందని, అంటే కంటి లో, మెదడు లో , మూత్ర పిండాలలో , లేక , గుండె లో ఉండే రక్త నాళాలలో. అందు వల్ల కంటిలో దృష్టి మందగించినట్టు  అనిపించడమూ, లేక చూసే వస్తువు కానీ , చదివే అక్షరం కానీ చేదిరినట్టు అనిపించడమూ , లేక ఒక అక్షరం కానీ , వస్తువు కానీ రెండు గా కనిపించడమూ, జరుగుతుంటాయి.
ఇలా జరిగినప్పుడు,  కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళే ముందు, బీ పీ చెక్ చేయించుకోవడం ముఖ్యంగా చేయవలసిన పని. ఎందుకంటే, హై బీ పీ కనక ఉన్నట్టయితే,  కళ్ళ జోడు వాడినా, ఆ  లక్షణాలు తగ్గవు కదా !
ముక్కులో నుంచి రక్తం కారటం : ( epistaxis ): కొందరిలో అధిక రక్త పీడనం ఉన్నప్పుడు , వారి ముక్కు లోనుంచి రక్త స్రావం అవుతుంది. ఎందుకంటే, ముక్కు లో కూడా , అతి సున్నితమైన రక్త నాళాలు , అధిక రక్త పీడనానికి తట్టుకోలేక చిట్లి పోతాయి. అప్పుడు రక్త స్రావం అవుతుంది.  అందు వల్ల ఈ లక్షణాన్ని కూడా అశ్రద్ధ చేయ కూడదు.
ఇంకొందరిలో  అధిక రక్త పీడనం ఉన్నప్పుడు వారు అంతకు ముందు కంటే ఎక్కువ ఆయాస పడుతుంటారు , వారు చేసే పనులలో. ఇది కూడా హై బీ పీ లక్షణం కావచ్చు.
చూశారు కదా పైన ఉన్న లక్షణాలు అతి సాధారణమైనవి గా ఉన్నప్పటికీ,  హై బీ పీ కి మొదట కనపడే వార్నింగ్ సైన్స్ అవవచ్చు. మన నేత్రాలు కూడా ఈ లక్షణాలు చూపిస్తే, అప్పుడు మనం , మన మనో నేత్రం తెరిచి మనం తగు జాగ్రత్త తీసుకోవాలి కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !
(  ‘ బాగు ‘ మీకు నచ్చితే ,  మీ ‘ బాగు ‘ కోరుకునే మీ ప్రియ స్నేహితులకు కూడా ‘  www.te.wordpress. లో  www.baagu.net. గురించి చెపుతారు కదూ ! )

పురుషులలో గుండె పోటు లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

In Our Health on మే 4, 2012 at 8:03 ఉద.

పురుషులలో గుండె పోటు  లక్షణాలు ఎట్లా ఉంటాయి ?.13.

మనం క్రితం టపాలో  వివరంగా, స్త్రీలలో గుండె నొప్పి లక్షణాలు ఎట్లా బయట పడతాయో ! ఇప్పుడు పురుషులలో ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయో చూద్దాము.
షుమారు అరవై శాతం పైగా పురుషులలో గుండె నొప్పి లక్షణాలు,  గుండె పోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలన లో తెలిస్సింది. కానీ తరచూ పురుషులు ముందు గా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలన లో తెలిసింది.
గుండె నొప్పి ఎట్లా ఉంటుంది? : 
గట్టి గా పిండినట్టు , తీవ్రమైన వత్తిడి తో ఉంటుంది. ఇలాంటి నొప్పి చాతీ కి మధ్య లో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగం గా కొట్టుకోవడం అంటే సాధారణం గా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా.
డిస్కంఫర్ట్ : గుండె నొప్పి తో పాటు చాలా డిస్కంఫర్ట్ కూడా వీరు అనుభవించ వచ్చు. 
మిగతా భాగాలలో నొప్పి : లోపలి కడుపు భాగం లో నొప్పి , ఈ నొప్పి పైభాగం లో ఉన్న గుండె నొప్పి కలిగించే వత్తిడి వల్ల, క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయం లో ఉన్నట్టు అనిపించవచ్చు ఈ నొప్పి. అందుకనే ఇలాంటి నొప్పిని అశ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్ద్  పెయిన్ అంటారు . ( referred pain ) . ఎలాంటి నొప్పి భుజాలకూ ప్రత్యేకించి ఎడమ భుజానికీ, ఎడమ చేయి కీ , ఎడమ ముంజేతికీ పాకవచ్చు. అలాగే వీపు భాగానికీ, రెండు చేతి రెక్కల మధ్య భాగానికీ పాక వచ్చు అంటే ( between the shoulder blades ). ఇలా గుండె లో మొదలైన నొప్పి శరీరం లో మిగతా భాగాలకు పాక టానికి కారణం , గుండె కు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియ చేసే నాడులు ఒకటే అవటం వలన.
ఊపిరి అందక పోవడమూ, కళ్ళు తిరిగినట్టూ, తల తిరిగినట్టూ , ఆత్రుత గా ఉండడము, వాంతులు రావడమూ, ఒళ్ళు  చమటలు పట్టడమూ,  తిన్న ఆహారం అరగనట్టు అనిపించడము కూడా జరగ వచ్చు .
పైన చెప్పిన లక్షణాలు , సాధారణం గా కనిపించేవి. కానీ  హార్ట్ ఎటాక్ లేక గుండె పోటు లక్షణాలు  కొద్ది తీవ్రత నుంచి , చాలా తీవ్రత తో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించ వచ్చు.
అలా కాకుండా, పురుషులలో  షుమారు నాలుగో వంతు కేసులలో , ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్ మయోకార్డియల్ ఇంఫార్క్షన్ అని అంటారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలూ చూపించకుండా’ నిశ్శబ్దం గా  వస్తుంది కాబట్టి.  అందువల్లనే  ఛాతీలో నొప్పి ఎప్పుడు వచ్చినా, లేక అనుమానం గా ఉన్నా వెంటనే అత్యవసరంగా అంటే అర్జెంటు గా వైద్య సహాయం తీసుకోవాలి, అశ్రద్ధ చేయకుండా !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ! 
 

స్త్రీలలో గుండె పోటు లక్షణాలు ఏమిటి ?.12.

In Our Health on మే 3, 2012 at 10:43 ఉద.

స్త్రీలలో గుండె పోటు లక్షణాలు ఏమిటి ?.12.

క్రితం టపాలో చదువుకున్నట్టు , ఈ గుండె పోటు లక్షణాలు , కేవలం గుండె నొప్పికే పరిమితం కాక, మిగతా లక్షణాలు, అంటే మిగతా అవయవ భాగాలు చూపించే లక్షణాలు గా కూడా కనిపించ వచ్చు. అయితే, ప్రధానం గా గుండె నొప్పి ఉంటుంది.
ఒక సూచన : ఇక్కడ మనం తెలుసుకునే విషయాలు గుండె నొప్పి ఎలా ఉంటుంది అన్న అవగాహన ఏర్పడటానికి, తగు జాగ్రత్తలు తీసుకోవడానికే !   ఆందోళన పడటానికీ, భయ పడటానికీ కాదు కదా !
గుండె నొప్పి : 
ఎందుకు వస్తుంది ?  : 
మనం మునుపటి టపాలలో వివరం గా చూశాము కదా ,  కరోనరీ ధమనులు , చెడు కొవ్వు చేరి ఎలా పూడుకు పోగలవో ! ఇలా పూడుకు పోయినప్పుడు, గుండె కండరాలకు సరిపడినంత ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ అందక,  ఆ ప్రదేశం లోని గుండె కండరాలు  నొప్పి కలిగిస్తాయి. ఈ గుండె నొప్పి, లేక చాతీ నొప్పి, నాడులద్వారా అంటే నెర్వ్ ( nerves ) ద్వారా నొప్పి మనకు తెలుస్తుంది.
ఎలా ఉంటుంది ?: 
ఈ నొప్పి సాధారణం గా గుండె ను ‘ పిండి  వేసినట్టో, గట్టిగా ఒత్తి నట్లు కానీ,  ఉంటుంది. ఇలాంటి నొప్పి సాధారణం గా కొన్ని నిమిషాలు మాత్రమె ఉంటుంది, లేక వచ్చి , పోతూ , ఉంటుంది.
ఈ రకం గా చాతీ లో మొదలైన నొప్పి , వీపు కూ, భుజాలకూ , దవడ కూ, చేతులకూ , మెడకూ పాకుతున్నట్టు కూడా అనిపిస్తుండవచ్చు.  ఇలా జరగటం చాలా దిస్కంఫర్ట్  కలిగించ వచ్చు. ఆ ప్రదేశం అంతా నంబ్ గా అంటే మొద్దు బారినట్టు , స్పర్శ లేకుండా ఉన్నట్టు కూడా అనిపించవచ్చు.
ఇక శరీరం లో మిగతా భాగాలలో  లక్షణాలు : 
తల తిప్పినట్టుండడం,  విపరీతం గా అలసిపోయినట్టు అనిపించడం , ఊపిరి తీసుకోవడం కష్టం అనిపించడం,  కడుపులో తిప్పుతున్నట్టు అనిపించి, ఆకలి మందగించడం , కడుపు లో మంట గా ఉన్నట్టు అనిపించడం,   కొన్ని సార్లు వాంతులు కూడా అవడం, శరీరం అంతా  చల్లని చెమటలు పట్టడం కూడా  జరుగుతుంది.
గుండె జబ్బు కు ఉండే రిస్కు ఫ్యాక్టర్లు మనం మునుపటి టపాలలో చూశాము కదా ! అలాంటి రిస్కు ఫ్యాక్టర్లు కూడా తోడైనప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉంటె, వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
గుండె నొప్పి లేకుండా , మిగతా లక్షణాలు అంటే మిగతా అవయవాలలో పైన చెప్పిన లక్షణాలు కనిపించడం అరుదు గా జరుగుతుంటుంది. అంటే సాధారణం గా గుండె నొప్పి తో పాటు మిగతా శరీర భాగాలలో లక్షణాలు కూడా కనిపిస్తాయన్న మాట.
వచ్చే టపాలో పురుషులలో  గుండె పోటు లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాము !

ACS అంటే యాంజైనా, హార్ట్ ఎటాక్ లక్షణాలు ఏమిటి ?.11.

In Our Health on మే 3, 2012 at 9:42 ఉద.

ACS  అంటే  యాంజైనా, హార్ట్  ఎటాక్  లక్షణాలు ఏమిటి ?.11.

మనం ఇంత వరకూ , ఎక్యూట్ కరోనరీ సిండ్రోం లేక ACS or Acute Coronary Syndrome  లో గుండె కు సరఫరా చేసే రక్త నాళాల లో అంటే ధమనులలో జరిగే మార్పులు వివరం గా తెలుసుకున్నాము కదా !
ఇప్పుడు  అలాంటి మార్పులు  ఎట్లా కనిపిస్తాయో , లేక  ఎట్లా అనుభవం అవుతాయో కూడా తెలుసుకుందాము. ఈ విషయాలు కూడా అందరూ ఉత్సాహం తో తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా ఉపయోగ పడవచ్చు.
ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం. ఈ ACS సంభవించినప్పుడు, మనం సమయానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఈ మార్పులు, మనం గమనించినా, అనుమానించినా, వెంటనే వైద్య సహాయం అందేట్టు చూడాలి. ఎందుకంటే, అత్యంత ఆధునిక చికిత్సా పద్ధతులతో,  ACS లో జరిగే మార్పులను నియంత్రించి,  మరణాలను నివారించ డమూ , లేక చాలా వరకూ తగ్గించడమూ చేయ వచ్చు.  అందుకే  ఇలాంటి మార్పులు జరిగిన వెంటనే ఉన్న అరవై నిమిషాలనూ , గోల్డెన్ అవర్ ( golden hour )అంటారు. అంటే ఈ బంగారు గంట లో మనం తీసుకునే చర్యలూ , అందే సహాయమూ , ఎంతో విలువైనవి ! సరి అయిన సమయం లో సరి అయిన చికిత్స కు అందుకే అంత ప్రాముఖ్యత ! 
ఇక ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయి? : 
ఈ లక్షణాలను మనం వివరంగా తెలుసుకుందాము. ప్రధానం గా గుండె నొప్పి , లేక చాతీ లో నొప్పి.  ఈ గుండె నొప్పి కాక, అనుభవించే మిగతా లక్షణాలు.
మనకు తెలుసు కదా ! ACS లో కరోనరీ ధమనులు కొన్ని మార్పులకు లోనవుతాయని. ఈ మార్పుల తీవ్రత బట్టి , బయటకు కనిపించే లక్షణాలు కూడా మారుతుంటాయి. ఉదాహరణకు పై పటం చూడండి. అందులో గుండెకు  రక్తం సరఫరా చేసే ఈ కరోనరీ ధమనులు పాక్షికం గా నూ, లేక సంపూర్ణం గానూ మూసుకుంటే ఎలా కనిపిస్తాయో  చక్కగా చూపబడింది.
వచ్చే టపాలో  ముందు గా స్త్రీలలో ఈ ACS లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాము !