Our Health

రచయత ఖజానా

హగ్గులూ , హ్యాండ్ షేకులూ .2. ఎట్లా హగ్ చేసుకోవాలి ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 13, 2012 at 7:07 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ .2. ఎట్లా హగ్ చేసుకోవాలి ? 

మానవులు పరస్పరం  తమ తమ ప్రేమా,  ఆప్యాయతా స్నేహ శీలతా తెలుపుకునే, లేదా ప్రకటించుకునే   ఒక అతి ముఖ్యమైన  చర్య హగ్గు లేదా ఆలింగనం. మనలో చాలా మంది ఈ అతి ముఖ్యమైన  చర్యను సరిగా పాటించక , తమ భావాలనూ , అనుభూతులనూ ,సరిగా తెలియ చేయ లేక పోతూ ఉంటారు సామాన్యంగా ! కొన్ని సమయాలలో ఈ హగ్గు ఇబ్బంది కరం గా కూడా మారుతుంది.  మరి  ఈ ఉచితమైన చర్య అత్యంత విలువైన మానవ సంబంధాలు కూడా పెంపొందింప చేస్తుంది అనుకున్నప్పుడు , సరిగా హగ్ చేసుకోవడం తెలుసుకోవడం లో తప్పేంటి ? ఆ  సరి అయిన హగ్గు వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ! 
హగ్గులలో మొదటి పాఠం ఎట్లా సమీపించాలి అని. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే , మీరు హగ్గు చేసుకోవాలనుకుంటున్న వారు మీకు బాగా తెలిసిన వారై ఉండాలి. పరిచయాలు సరిగా లేక పోయినా అతి దగ్గరకు సమీపించడం, హగ్గు చేసుకోవడం లాంటి చర్యలు తీవ్రం గా పరిగణించ బడతాయి చాలా  దేశాలలో ! 
ఫ్యామిలీ హగ్ :  కుటుంబ సభ్యులను  ఆప్యాయత తో ఆలింగనం చేసుకోవాలనుకుంటే  మీరు వారిని దయ తో సమీపించాలి. ఎక్కువ ఎమోషనల్ గా  కూడదు. 
గర్ల్ ఫ్రెండ్ ను సమీపించే సమయం లో , చాలా కేరింగ్ గా అప్రోచ్ అవాలి. కొన్ని సమయాలలో  హాస్య పూరితం గా అంటే హ్యుమరస్ గా  ఒక చిరు మంద హాసం తో కూడా అప్రోచ్ అవవచ్చు. 
తోటి మగ స్నేహితులను సమీపించే సమయం లో , మీరు  జన్యన్ గా అంటే  నిజాయితీ గా  ఒక చిరు నవ్వు తో హగ్ చేసుకోవచ్చు. ఒక వేళ  మీరు ( మగ వారై ) హగ్ చేసుకుంటున్న ( మగ ) వారు మీతో ‘ ఇంకో  ఉద్దేశం ‘ తో స్పందిస్తే , మీరు వెంటనే మీ  అయిష్టత ను వారికి తెలియ చేయాలి , అంటే వెంటనే ఆ ఆలింగనం , చాలా ఇబ్బంది కరం గా మీకు ఉన్నట్టు చెపుతున్నట్టుగా , దూరం జరగాలి.
క్రష్ హగ్: ఈ హగ్ మీ గర్ల్ ఫ్రెండ్ తో చేసే సమయం లో మీరు సిగ్గు పడకుండా , మీ స్నేహితురాలిని అప్రోచ్ చేసి , ఒకటో రెండో  లాలించే మాటలు అంటే కేరింగ్ వర్డ్స్  ఆమె చెవి లో ‘ ఊదండి ‘ ! 
ప్రేమికుల హగ్ : ప్రేమికుల హగ్ ను   ఆమె అయినా, అతడైనా  మొదలు పెట్ట వచ్చు.  ముఖ్యం గా  ఆమె భుజాల మీద అతడు తన చేతులను ఉంచాలి. లేదా ఆమె అతడి భుజాల మీద తన చేతులు సున్నితం గా  ఉంచాలి.  అంతే కానీ వారి బరువులను చేతుల ద్వారా  భుజాల మీదకు ‘ బదిలీ ‘ చేయ కూడదు. ఆ తరువాత  వారు తమ చూపులు తదేకం గా కలుపుకోవాలి !  ( వెనుక ఎక్కడ నుంచైనా చూపులు కలిసిన శుభ వేళా ! అనే పాట వినిపిస్తూ ఉంటే మరీ మంచిది , లేదంటే  ఆ పాట ను మీ మనసులలోనే ఊహించు కొండి ! )తరువాత మీరు ‘ ఆమెను ‘ ప్రేమిస్తున్నట్టు చెప్పండి. ఆమెతో ఉన్న ప్రతి క్షణం ఎంత ఆనందం గా మీరు అనుభూతి చెందుతున్నారో కూడా తెలియ చేయండి. ఆ తరువాత మీరు ఆమెలోనూ , ఆమె మీలోనూ  హృదయ పూర్వకం గా ‘ కలిసి పోండి’ , కరిగి పోండి ! 
ఇక్కడ ప్రేమికులు ఇరువురూ  ఒక్క విషయం ఎప్పుడూ గుర్తు ఉంచు కోవాలి ! ఆ ప్రేమ , నిజాయితీ గా , స్వచ్చం గా ఉండాలి ! అంతే కానీ ‘ నటన ‘ కాకూడదు ! 
 
ఇంత వరకూ మనం హగ్ చేసు కోవడానికి మనకు పరిచయం ఉన్న వారిని ఎట్లా సమీపించాలో తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో  అసలు  ‘ ఆలింగనం ‘ సంగతి కూడా తెలుసుకుందాం ! 
 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .1. అమ్మ ఆలింగనం.

In మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 10, 2012 at 7:21 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ ! .1. అమ్మ ఆలింగనం.

మన బాల్యం నుంచీ మనకు  ఏ చిన్న గాయం తగిలినా , ఏ మాత్రం ఆలోచించ కుండా  అమ్మ దగ్గరికి  పరిగెత్తే వాళ్లము కదా ! మనం ఆ విధం గా అమ్మ కమ్మని మాటలూ , దీవెనలూ , ఆప్యాయత, ప్రేమ తో కూడిన ఆలింగానాలూ , మనం పెరిగి పెద్దయాక కూడా ,అంతే ప్రభావం తో మన జీవితాలలోని వత్తిడులూ, కష్టాలూ , నిరాశా నిస్ప్రుహలూ , భయాలూ, ఆందోళన లూ  , ఆ ప్రేమా , వాత్సల్యాలతో అమ్మ ఇచ్చే ఆలింగనం లో వెన్న పూస లా కరిగి పోతాయి.  ఏళ్ళు గడిచే కొద్దీ ,  మనంతట మనం ,  మన జీవితాలలో ఒడు దుడుకులను , స్వతంత్రం గా అధిగమించి , ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగి పోతున్నా కూడా  ,  మనం సాగించే జీవన యానం లో , సదా మన శ్రేయస్సు కోరే , ఆ కమ్మని అమ్మ ఒడి కోసం , అప్పుడప్పుడూ పరితపిస్తూ ఉంటాము.  ఆ ఆలింగనం లో మన బాధలు అన్నీ కరిగించుకోవాలని అనుకుంటూ ఉంటాము కూడా ! 
జన్మ నిచ్చే తల్లి ఆలింగనం, శిశువులకు , సంతానానికీ  ఎంతో స్వాంతన చేకూరుస్తుంది.  ఇటీవల శాస్త్రజ్ఞులు , దేశ భాషల తేడాలు ఏవీ లేకుండా ,  మాత్రు మూర్తులు తమ పిల్లలకు ఇచ్చే ఆలింగనం ఎంతో ఆరోగ్య కరమైనదీ , లాభ దాయకమైనదీ అని తేల్చారు. ఇందులో పెద్దగా చెప్పుకోవలసినది ఏమీ లేదు ఎందుకంటే , ఈ విషయం అందరికీ తెలిసినదే కదా ! కానీ  శాస్త్రజ్ఞులు కించిత్తు ముందుకు పోయి , శాస్త్రీయం గా  తల్లి ఆలింగనం వల్ల  లాభాలు పరిశీలించారు. తీవ్రమైన మానసిక వత్తిడి ఉన్నపుడు, జీవితం దుర్భరమైనట్టు అనిపించినప్పుడూ , తల్లి  ఇచ్చే ఆలింగనం , వత్తిడి ని తగ్గించి , తద్వారా రక్త పీడనాన్ని కూడా తగ్గించి , మనసుకు ఎంతో ప్రశాంతత ను కలిగిస్తుందని తెలిసింది. హృదయ పూర్వకం గా తల్లి ఇచ్చే ఆలింగనం , సంతానంలో హృదయ సంబంధ మైన వ్యాధులు కూడా తగ్గిస్తుందని తెలిసింది. శాస్త్రీయ పరిశోధనలలో  హగ్గు చేసుకునే వారిలో  సిస్టోలిక్ ఇంకా డయా స్టోలిక్ రక్త పీడనాలు రెండూ , హగ్గు చేసుకొని వారి లో కంటే తక్కువ గా ఉంటాయని నిర్ధారించ బడింది ( ఈ పరిశోధన నార్త్ కరోలినా విశ్వ విద్యాలయం వారు చేశారు ) .  ఆ విధం గా సంతానం  దీర్ఘాయుషు తో జీవించడానికి సహాయ పడుతుంది కూడా !  కేవలం హగ్గు ఒక  యాంత్రిక మైన ఆలింగనం కాకుండా ,  ఆప్యాయతా, అనుభూతుల సమ్మేళనం అయినప్పుడు దాని ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. 
అందుకే ఒక కవి చక్కని పాట : అమ్మ అన్నది, ఒక కమ్మని మాట , అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూటా ! అని.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

హగ్గులూ , హ్యాండ్ షేకులూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 9, 2012 at 6:08 సా.

హగ్గులూ , హ్యాండ్ షేకులూ !

 

మానవులనందరినీ ,  జన్మ నిచ్చిన తల్లి ప్ర ప్రధమం గా తన హృదయానికి హత్తుకుని ముద్దాడుతుంది. అక్కడి తో మొదలవుతుంది, ఈ ఆలింగనాల , లేదా హగ్గుల  హడావిడి. అసూయా ద్వేషాలకు తావు లేకుండా ,  హృదయ పూర్వకం గా ఇచ్చే హగ్గు , మనసుకు ఎంతో ప్రశాంతతనూ , ఆనందాన్నీ , ఇస్తుంది. అంతే కాక  నేను నీ ఆప్తుడిని , లేదా ఆప్తురాలిని ,  నీ శ్రేయస్సు కోరే  వారము ‘ అని కూడా తెలియ చేస్తుంది ఆ హగ్గు. తల్లి దండ్రుల తో ఆలింగనం , ఆప్యాయతనూ , ఆపేక్షనూ తెలియ చేస్తూ ఉంటుంది.  స్నేహితులతో చేసే ఆలింగనం లేదా హగ్గు , స్నేహ పూర్వకం గా , రి అషురింగ్ గా ఉంటుంది. ప్రేమికుల మధ్య ఆలింగనం  ప్రేమ, ప్రణయ భావనలను ప్రతి బింబిస్తూ ఉంటుంది.  రాజ కీయ నాయకుల హగ్గు ‘ రాజకీయం ‘ గా ఉంటుంది. మరి మనం ఈ హగ్గుల, హ్యాండ్ షేకుల కధా కమామీషు తెలుసుకుందాం వచ్చే టపా నుంచి ! 

జీవన శైలి లో మార్పుల తో 50 % క్యాన్సర్ లు నివారించ వచ్చు

In ప్ర.జ.లు., Our Health on సెప్టెంబర్ 8, 2012 at 8:05 సా.

జీవన శైలి లో మార్పుల తో 50 % క్యాన్సర్ లు  నివారించ వచ్చు ! 

ప్రశ్న: మనం వివిధ క్యాన్సర్ ల గురించి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటాము. మరి  వాటి నివారణకు మనం చేయ వలసినది ఏమైనా ఉందా ? లేక  అంతా దైవాధీనమా ? 
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న .  సాధారణం గా మనం వివిధ క్యాన్సర్ ల గురించి వింటూ ఉంటాము. తెలిసిన వారికి ఆ క్యాన్సర్ వచ్చింది , లేదా వీరికి ఈ క్యాన్సర్ వచ్చింది. ‘ అయ్యో పాపం, ఆరోగ్యం గా తిరిగే వాడు లేదా చాలా ఆరోగ్యం గా ఉండేది ఆమె ‘ అని కూడా మనం  అనుకుంటూ, కలత చెందుతూ ఉంటాము , బాధ పడుతూ ఉంటాము. 
ఇటీవల ప్రపంచ క్యాన్సర్ కాంగ్రెస్ అంటే ప్రపంచ క్యాన్సర్  మీటింగ్ ఒకటి జరిగింది, కెనడా లో ( క్యుబెక్ అని ఒక పట్టణం లో ).  ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉన్న క్యాన్సర్ స్పెషలిస్టులు  ఈ మీటింగ్ లో తమ తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాటి  సంగ్రహమే ఈ టపా.వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన గ్రహం కోల్దిజ్ అనే శాస్త్రజ్ఞుడు తన పరిశోధనా  ఫలితాలను  ‘ ప్రపంచం లో వివిధ దేశాలలో  క్యాన్సర్ నివారణ చర్యలను విస్తృతం గా అమలు పరిస్తే , వచ్చే పదిహేను , ఇరవై సంవత్సరాలలో ,  అనేక  రకాల క్యాన్సర్ లను చాలా వరకూ నివారించ వచ్చు ‘ అని ఘంటా పధం గా చెప్పాడు.  ప్రస్తుతం అమెరికా లోని  యుటా  రాష్ట్రం లో స్మోకింగ్ చేస్తున్న వారు కేవలం పదకొండు శాతమే !  అంటే స్మోకింగ్ చేసే వారు, అనేక చర్యల ఫలితం గా చాలా తక్కువ అయ్యారు.  గ్రహం అంచనా ప్రకారం , స్మోకింగ్ నివారణ చర్యలను వివిధ దేశాలలో, ఇదే విధం గా ,  ఖచ్చితం గా అమలు చేస్తే , స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ లను మూడు వంతులు నివారించ వచ్చు అని పేర్కొన్నాడు.  
అదే విధం గా ఊబకాయం అంటే ఒబీసిటీ ప్రస్తుతం కనీసం ఇరవై శాతం క్యాన్సర్ లకు కారణం. వివిధ దేశాలలో ప్రజలు , ఊబకాయం లేకుండా , నివారణ చర్యలు తీసుకుంటే , ఒక ఇరవై ఏళ్ళ లో ఒబీసిటీ వల్ల కలిగే వివిధ క్యాన్సర్ లను యాభయి శాతం వరకూ నివారించ వచ్చు. మనకందరికీ తెలిసిందే కదా , ఒబీసిటీ నివారణ కేవలం మనం తీసుకునే రెండు చర్యల వల్ల  సఫలం అవుతుంది. ఒకటి  డయట్. రెండు ఎక్సర్సైజ్. 
అట్లాగే   బాల్యం లో , తప్పని సరిగా టీకాలు వేయించుకోవడం వల్ల  కూడా క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు. ప్రత్యేకించి  హ్యూమన్ పాపిలోమా వైరస్ , హెపటైటిస్  బీ ఇంకా సి  వైరస్ లు కలిగించే క్యానర్ లకు టీకాలు అందుబాటు లో ఉన్నాయి. ఇది మన వైద్య శాస్త్ర విజ్ఞానం  చేసిన  విశేషమైన పురోగతి.  ఈ టీకాలను సరి అయిన సమయం లో చేయించు కుంటే  ఈ వైరస్ లు కలిగించే అనేక క్యాన్సర్ లను వంద శాతం నివారించు కోవచ్చు.టమాక్సిఫెన్ అనే మందు కూడా  కొన్ని రకాల రొమ్ము లేదా స్తన క్యాన్సర్ లను కనీసం యాభయి శాతం నివారిస్తుంది అని అనేక పరిశోధనల వల్ల విశదమైంది. అదే విధం గా మనం సామాన్యం గా జ్వరం వచ్చినప్పుడు వేసుకునే యాస్పిరిన్ టాబ్లెట్ కూడా  పెద్ద ప్రేగు లేదా కోలన్ క్యాన్సర్ ను కనీసం నలభై శాతం నివారిస్తుంది.
తెలిసింది కదా , మానవులలో వచ్చే అన్ని క్యాన్సర్ లూ దైవాధీనం కాదు , మానవాధీనం కూడా అని !  నివారణ మీ చేతులలో నే ఉంది కదా ! కాల యాపన ఎందుకు ఆచరణకు? ! 
( రొమ్ము క్యాన్సర్ , సెర్వికల్ క్యాన్సర్ , లంగ్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి , విపులం గా క్రితం టపాలలో తెలియ చేయడం జరిగింది. వీలు చేసుకుని  బాగు ఆర్కివ్స్ లో చూడండి మీ ‘ బాగు ‘ కోసం ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు. 16. ఇన్ ఫిడిలిటీ కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 5, 2012 at 10:31 సా.

 ప్ర.జ.లు. 16. ఇన్ ఫిడిలిటీ కనుక్కోవడం ఎట్లా ? 

9. అతి రొమాన్సు ఒలక పోయడం : ఉదా:  మధు తన భార్య కు ఒక పార్టీ కి తీసుకు వెళ్ళాడు. కార్పోరేట్  సంస్థ ల ఉద్యోగులంతా కలవడం తో వాతావరణం  చాలా ఉత్సాహ భరితం గా ఉంది. చాలా మంది విదేశాలకు కూడా వెళ్లి , అక్కడ పార్టీ వాతావరణం , రొమాంటిక్ గాలులు ఎట్లా వీస్తాయో అన్నీ చవి చూశారు కాబట్టీ , తలా ఒకరు , ఒక మందు గ్లాసు , వైన్ గ్లాసు పట్టుకుని , మిగతా పార్టీ ఆహ్వానితులను చూస్తూ, కరచాలనం చేస్తూ , సంభాషణలు కూడా చేస్తూ చాలా సరదాగా సమయం వెళ్ళ బుచ్చుతున్నారు. జోకులు వేసే వారు ఉన్న చోట, చుట్టూ చేరిన వారు , నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధు తన భార్య ను కనీసం నలుగురు పర స్త్రీల దగ్గరకు తీసుకు వెళ్ళాడు. వారికి పరిచయం చేశాడు. అంతే కాక వారిని తను విష్ చేయవలసిన సమయం లో అతి ప్రేమతో వారి నాజూకు చేతులు అంది పుచ్చుకుని అతి సున్నితం గా వారి చేతి మీద తన పెదవులతో ముద్దులు పెడుతున్నాడు. మధు భార్య కు ఇదంతా చాలా ఎబ్బెట్టుగా , వింత గా ఉంది.  మధు కు ఇవన్నీ పట్టడం లేదు.’  మా ఆఫీసు లోనే పని చేస్తుంది, లతా యు ఆర్ సో స్వీట్ టుడే ‘ అని ఒక స్త్రీనీ ,  ‘ యూ లుక్ సో సో సెక్సీ టు నైట్ ‘ అని మెల్లగా చెవిలో గుస గుసలాడుతూ , ఇంకో  అమ్మాయినీ పరిచయం చేస్తున్నాడు, తన భార్యకు. ఇట్లా ఏమాత్రం సంకోచం లేకుండా ఇతర స్త్రీల మీద ఎక్కువ ప్రేమ చూపుతూ , రొమాన్సు సీన్సు క్రియేట్ చేస్తూ వారి ‘ మనసు దోచుకోడానికి ‘ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 
10. ఏకాంత సమయం, ఏకాంత కోసమైనా : ఎఫైర్స్ మొదలు పెట్టే వారు అబ్సెసివ్ గా తమకై  ప్రత్యెక సమయం, అంటే  పర్సనల్ గా సమయం ఉండాలని , తమ భార్య తో చెబుతూ ఉంటారు. అంతే కాక , ఇంట్లో భార్య తో ఉంటున్నా , తమ  కై ఒక ప్రత్యెక గది లో ఏకాంత సమయం గడుపుతూ ఉంటారు. ఈ రోజులలో , ఇంటర్నెట్  , చాట్ రూం , మొబైల్ తో  మేసేజీలూ , అన్నీ వీలవుతున్నాయి కాబట్టి , ఇతరుల తో ప్రేమ వ్యవహారాలు నడపడం బహు శులభం అయి పోయింది.  బ్యాంక్ జామా ఖర్చులు , ఫోను బిల్లులు భార్య కు కనపడకుండా దాచి పెట్టడం కూడా , ఇన్ ఫిడిలిటీ ఉన్న వారు తరచూ చేసే పనులే !  
ఒక గమనిక : పైన ఇంత వరకూ ఉదాహరించినవి సామాన్యం గా కనపడే లక్షణాలు. కానీ  వీటిలో ఒకటైనా కానీ , లేదా అన్నీ కానీ లేకుండా కూడా ఎఫైర్స్ పెట్టుకుని  ‘ విజయ వంతం గా ‘ పర పురుషులతోనూ , పర స్త్రీల తోనూ, ‘ స్వర్గ సుఖాలు ‘ అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ వ్యాసం మొదటిలో తెలుసుకున్నట్టు , ఎఫైర్స్ నూ , ఇన్ ఫిడిలిటీ నీ సంపూర్ణం గా ఖచ్చితం గా కనిపెట్టడం లేదా తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యమైన పని. అంత వరకూ , ఎఫైర్స్  ఉన్న వారు, వారి వారి  జీవితాలు , మూడు ముద్దులూ , ఆరు కౌగిళ్ళు గా ‘ సుఖం’ గా వర్ధిల్లు తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు !  
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్ర.జ.లు.15. ఇన్ ఫిడిలిటీ లక్షణాలు:

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 4, 2012 at 10:43 సా.

ప్ర.జ.లు.15. ఇన్ ఫిడిలిటీ లక్షణాలు:

6.సొంత షోకు: ఎఫైర్ లలో పడ్డవారు , లేదా పెట్టుకుంటున్న వారు , తమ స్వంత  వేష ధారణా , వ్యక్తిగత గ్రూమింగ్ అంటే పోషణా , అందం, ఆకర్షణా , ఇట్లాంటి విషయాల మీద , మునుపెన్నడూ లేని శ్రద్ధ  చూపుతారు. లేటెస్టు హెయిర్ స్టయిల్ లు చేయించుకోవడం, జిమ్ కు వెళ్ళడం , అందమైన అలంకరణలు చేసుకోవడం , ఆకర్షణీయం గా కనిపించడం ,మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. 
7. జీవితేచ్చ పెరుగుతుంది: అంత వరకూ దిగాలు పడి , జీవితం మీద, జీవించడం మీద అంత గా ఉత్సాహం చూపని వారు కూడా, ఎఫైర్స్  పెట్టుకోగానే , అత్యంత ఉత్సాహం తో , జీవితం లో ఆశా జనకమైన మార్పులు కోరుతూ , అందు కు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక విధం గా చెప్పుకోవాలంటే , ఎఫైర్స్ పెట్టుకుంటున్న వారు , డిప్రెషన్ బూజు దులుపుకుని ,ఆశ , ఉత్సాహాల వెలుగు తో  ఇన్ ఫిడిలిటీ ‘ పధం ‘ వైపు పయనిస్తారు. అంతే కాక , అంతకు ముందు ఎపుడూ చేయని సాహస వంత మైన కార్యాలు , ఆటలూ , పర్యటనలు , ఇట్లాంటివి కూడా ఎంతో ఉత్సాహం తో చేపడుతూ ఉంటారు. ఉదా:  ప్రకాష్ , ఇంటి పట్టున భార్యను అంటి పెట్టుకునే ఉండేవాడు ఎపుడూ ! ఆటలలో , వ్యాయామం లో ఎక్కువ ఉత్సాహం చూపే వాడు కాదు. అట్లాంటిది , ఒక రోజు ఉన్నట్టుండి , భార్య తో  బజారు కు వెళ్లి టెన్నిస్ ఆట కు కావలసిన సరంజామా అంతా కొనేశాడు. అంతే కాక , మంచి డిజైనర్ స్పోర్ట్ షార్ట్స్ తీ షర్ట్ లు కూడా కొన్నాడు. భార్య ఆశ్చర్య పోయినా , ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు , పైగా చాలా ఆనంద పడ్డది కూడా , తన  భర్త ఆరోగ్యం విషయం లో ఎక్కడ లేని శక్తి ఉత్సాహం తెచ్చుకుని ,తగిన వ్యాయామాలూ , ఆటలు ఆడడం మొదలు పెడుతున్నందుకు. ప్రకాష్ ఆటలు, ఆఫీసులో తన లేడీ కొలీగు తో జత కట్టి , టెన్నిస్ తో పాటుగా ఆడే  ప్రేమాటలూ, కామ వాంఛ ల మాచ్ లూ అని ఏమాత్రం తెలియదు ఆమెకు !
8. అసమంజసమైన సమర్ధన : ఈ ఇన్ ఫిడిలిటీ లక్షణాలు ఉన్న వారు , వారు చేస్తున్న పనులనూ , వ్యవహారాలనూ , చాలా అసమంజసం గా సమర్ధించు కుంటారు. అంటే వారికి ఆ విషయం అర్ధమైనా , తమ పొరపాటును , చాలా తీవ్రం గా సమర్ధించు కుంటారు, ఎట్టి పరిస్థితులలోనైనా ! ఉదా:  ‘ ఏమండీ , నా ప్రక్కన పడుకుని రాత్రంతా నిద్ర పోనిచ్చే వారు కాదు ,మీ చిలిపి పనులతో , ఇప్పుడు అది లేక పోగా మీరు కూడా నిద్ర పోవట్లేదు , ఎప్పుడూ , మొబైల్ తో ఎవరికో టెక్స్ట్ లూ ,  గుస గుసలూ , ఎవరితో చేస్తున్నారండీ , మీ ఆఫీసులో ఉన్న ఆ రమ తో నేనా? ! అని పొరపాటున అడిగితే ‘  పిచ్చి పిచ్చి గా నోరు పారేసుకోక , నీ వాదనలకూ , అపవాదులకూ అర్ధం పర్ధం లేకుండా పోతుంది మరీ , మాటలు జాగ్రత్తగా రానీయి ‘ అని భార్యను తీవ్రం గా మందలించి తాను మాత్రం రమకు మొబైల్ లో ‘  రేపు ఆఫీసుకు పింకు చీర కట్టుకు రా !  చాలా అందం గా ఉంటావు అందులో , అలా ఆఫీసు అయ్యాక  పార్కు దగ్గర కలుద్దాము ‘ అని టెక్స్ట్ పంపాడు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  ! 

ప్ర.జ.లు.14. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవచ్చు ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on సెప్టెంబర్ 2, 2012 at 12:51 సా.

ప్ర.జ.లు.14. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవచ్చు ?

జవాబు: 3. నియంత్రణా ధికారం:   ఎఫైర్స్ పెట్టుకునే వారు , తరచూ  తమ భాగ స్వామి తమను ఎక్కువ గా నియంత్రించడానికి చూస్తుందని అపవాదు వేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి , వారే తమ భాగ స్వామి ని కంట్రోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదా: ‘ ఆమె తనకు ఎక్కువ స్పేస్ కావాలని అడుగుతుంది. నాతో ఉంటే తనకు ఊపిరి అందనట్టు గా సఫోకేటింగ్ గా ఉంటుందని చెబుతుంది’ అనీ ,  ఇంకొకరు తన భార్య ‘ ఇట్ ఈజ్ మై వే ఆర్ హైవే ‘ లాగా ప్రవర్తిస్తుంది ‘ అనీ అపవాదు వేస్తారు. ఇంకా కొందరు వారు వారి సంబంధాలలో ‘ చిక్కుకు ‘ పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.  ఇక్కడ జరుగుతున్నది యదార్ధానికి ఎవరైతే , పర పురుషుడు , లేదా పర స్త్రీ వ్యామోహం లో పడతారో , వారే వారి వారి భాగ స్వాములను , వారి చర్యలనూ , గట్టి పట్టు తో ,తమ నియంత్రణ లో ఉంచుదామని సర్వ విధాలా , నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. తమ ఆత్మ న్యూనతా భావాలనూ , లేదా గిల్టు భావనలనూ , ఆ విధం గా ఎదుటి వారి మీదకు మళ్ళించడానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు.  ఒక విధం గా చెప్పుకోవాలంటే ,వారు, తమ చర్యలను సమర్ధించు కోవడానికి ఇట్లాంటి వ్యూహాలు పన్నుతూ ఉంటారు. తమ భాగ స్వాములను చిన్న బుచ్చడం, ఎమోషనల్ గా గాయ పరచడం చేస్తూ ఉంటారు. 
4.ఎక్కువ పని గంటలు:  పని గంటలు ఎక్కువ అవుతున్నట్టు ఇంట్లో చెప్పడం , మీటింగు ఉందని , బిజినెస్స్ ట్రిప్ ఉందనీ , లేక వేరే ఊరికి లేదా టౌన్ కు వెళ్లి పని చేసుకు రావాలనీ , అక్కడ ఒక వారం రోజులు పని ఉంటుందనీ కల్ల బొల్లి మాటలు చెబుతూ ఉంటారు.ఉదా:  మదన్ , సరదా మనిషి, చిన్నప్పుడే అందరూ  అనే వారు , పెళ్లి చేసుకోకు రా మదనా ! అని ఎందుకంటే , అమ్మాయిలను ‘బుట్టలో ‘ వేసుకోవడానికి ఎప్పుడూ మదనుడు బహు  సందడి చేసే వాడు. కాలేజీ లోనూ   అంతే ! తరువాత ఉద్యోగం చేసే సమయం లో చేస్తున్నదీ అదే ! చదువు లొనూ రాణించాడు , అంతే కాక , కాస్త ‘ ఉన్న ‘ కుటుంబం కూడా కావడం తో , ‘ మంచి  సంబంధం ‘ వెదికి చేశారు మదన్ కు , ఇంట్లో వాళ్ళు, ఒక ఇంటి వాడైతే , ‘ కుదురు ‘ వస్తుందని. కానీ మదనుడు , తన పేరును సార్ధకం చేయడానికా అన్నట్టు ,  కామ విశృంఖలత కు అలవాటు పడ్డాడు. అందుకు తగ్గట్టుగా తన పని గంటలు తానే నిర్ణయించు కుంటాడు  ప్రతి రోజూ ! ప్రతి వారం, ప్రతి నెలా ! కేవలం అమ్మాయిలతో వ్యవహారాలకు , సాయింత్రాలూ , పిక్నిక్ లకూ , వీకెండ్ లకూ , కొన్ని రోజులూ , స్త్రీలు నచ్చితే , హాలిడేలూ , ఇట్లా ‘ వివిధ కార్యక్రమాలకు , తన ఆఫీసు ను , పనిగంటలనూ , వోవర్ టైం నూ , బిజినెస్ ట్రిప్ లనూ , బోర్డ్ మీటింగ్ లనూ సాకు గా  చాక చక్యం గా ఉపయోగించు కుంటాడు.   భార్య  మాత్రం ‘ వారికి ఆఫీసులో చాలా పని, మరి బాధ్యత కల ఉద్యోగమాయె ! బాగా చూసుకోవాలి వారిని  నేను అనుకుంటూ , కృత నిశ్చయం తో , ‘ వారిని  బంగారం లా చూసుకుంటూ , తన శృంగారమంతా ‘ తన ‘ మదనుడికి విందు  చేస్తూ ఉంటుంది, ఇంటి పట్టున ఉన్న సమయం లో !  
5. అనారోగ్యం సాకు:  తాము ఎవరితోనైతే ఉంటున్నారో వారి ఆరోగ్యం అనివార్య కారణాల వల్ల బాగో లేనప్పుడు , ఆ సమయం లో వారు అవకాశం తీసుకుంటారు. ఇట్లా సాధారణం గా కనీసం యాభై శాతం మంది ఎఫైర్స్ లో నూ ఇన్ ఫిడిలిటీ లోనూ పడుతుంటారని ఒక పరిశీలనలో తెలిసింది.  భార్య కు ఏదైనా దీర్ఘ కాలిక వ్యాధి ఉన్నప్పుడు, లేదా కాలో , చెయ్యో విరిగి , ఆసుపత్రి పాలయినప్పుడు , వారి భర్తలు  ఆ ‘ సదవకాశాన్ని ‘ తమ  కామ లాభం కోసం ఉపయోగించు కుంటూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులలో , యుక్తా యుక్తాలు , అంటే ఏది మంచి , ఏది చెడు అని వ్యాఖ్యానించడం కూడా కష్టమే ! కొందరు ‘ భార్యలు  ‘ కూడా ‘ నీ సుఖమే నే కోరుతున్నా ! అనే భావనతో ఉంటారు. ముఖ్యం గా ఇక్కడ జరిగేది , భర్తలు, తమ భార్యల ఆరోగ్యం కన్నా , తమ  కామ వాంఛ లకు ప్రాధాన్యత ఇస్తారు, ఆ కుటుంబ విపత్కర పరిస్థితులలో కూడా ! కొందరు భార్యలు కూడా, తమ భర్తలు అనారోగ్యం పాలయినప్పుడు , పర పురుషులతో కామ సంబంధాలు  పెట్టుకుని ,’  రతి బంధాలలో తల మునకలవుతూ ‘  ఉంటారు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

ప్ర.జ.లు. 13. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవడం ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 31, 2012 at 8:49 సా.

ప్ర.జ.లు. 13. ఇన్ ఫిడిలిటీ ని ఎట్లా కనుక్కోవడం ? 

ప్రశ్న: క్రితం టపాలో తెలుసుకున్నట్టు , ఎమోషనల్ గా దూరం గా ఉండడం,  డిప్రెషన్ లో కూడా జరుగుతుంది కదా,  మరి ఇన్ ఫిడిలిటీ కీ డిప్రెషన్ కూ ఈ లక్షణాలలో తేడా ఏమిటి? :
జవాబు: ఇది చాల ముఖ్యమైన ప్రశ్న. నిజమే, డిప్రెషన్ లో కూడా  ఎమోషనల్ గా దూరం గా ఉండడం జరుగుతుంది. అంతే కాక సెక్స్ అంటే ఉత్సాహం లేకపోవడం, ఏ పని మీదా ఏకాగ్రత తో కేంద్రీకరించలేక పోవడం , మోటివేషన్ లేక పోవడం, ఎప్పుడూ విచారం గా ఉండడం , బ్రతుకు అంటే జీవితం మీద ఆశ సన్నగిల్లడం కూడా జరుగుతుంది. అంతే కాక ,  డిప్రెషన్ లో నిద్రలేమి , ఆకలి తక్కువ అవడం , తరువాత సరిగా తినక పోవడం వల్ల , బరువు కూడా తగ్గి పోవడం లాంటి లక్షణాలు కూడా కనబడతాయి. కానీ ఇన్ ఫిడిలిటీ లో, ఉద్యోగం సరిగానే చేస్తుంటారు,  అప్పుడు ఏకాగ్రతా , పని జాగ్రత్త కూడా బాగానే ఉంటుంది ( లేక పొతే డబ్బులు ఉండవు కదా ! ), కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమె , అంటే,  భార్య దగ్గర లేదా భర్త దగ్గర మాత్రమె వీరు , ముభావం గా ఉంటూ , ఎక్కువ మాట్లాడ కుండా , ఏదో కోల్పోయిన వారిలా ప్రవర్తించు తూ ఉంటారు. అంటే, వీరు ద్వి పాత్రాభినయం చేస్తూ ఉంటారు. అంతే కాక వీరు డిప్రెషన్ వచ్చిన వారిలా ఒక జీవితం మీదనే విరక్తి కలిగిన వారిలా కాక , రెండు జీవితాలను గడుపుదామని కూడా అనుకుంటారు. అంటే, వీరికి బ్రతుకు మీద ఆశ డబుల్ అవుతుంది , సన్నగిల్లదు, డిప్రెషన్ లో ఉన్న వారి ఆలోచనా ధోరణి లాగా ! 
ఇక మిగతా లక్షణాల గురించి తెలుసుకుందాము. 
2. క్రోధం , క్రూరం , విమర్శ :   అప్పుడప్పుడూ క్రోధం రావడం సహజమే కదా ! కానీ ఈ ఎఫైర్స్ లోనూ ఇన్ ఫిడిలిటీ లోనూ మునిగిన వారు  తరచూ, కోపం తెచ్చు కుంటూ ఉంటారు. ప్రత్యేకించి , అంతకు ముందు , కోపతాపాలు అరుదు గా చూపించే వారు కూడా ,   ఇంకో సంబంధం ఉన్నప్పుడు , పొరుగింటి పుల్ల కూర రుచి అన్న విధం గా , అంత వరకూ తాము కలిసి ఎవరితో నైతే ఉంటారో , వారి మీద కోపాన్నీ , క్రోధాన్నీ ప్రదర్శించుతూ ఉంటారు. ఉదా:  లక్ష్మి  నిజం గానే ఇంటికి మహా లక్ష్మి గా ఉంటుంది.  ఉదయం లేవగానే స్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని ,  వేడి కాఫీ  తో పడక గదిలో  అమృతం తీసుకు భాండం తీసుకు వస్తున్న మోహిని లా ప్రత్యక్షమవుతుంది, ఈలోగా బ్రష్ చేసుకుని  బెడ్ మీదే వెయిట్ చేస్తున్న భర్త ముందు.’  కాఫీ చాలా వేడి గా ఉంది , చల్లారే వరకూ మనం వెచ్చ గా కబుర్లు చెప్పుకుందాం అని, చెంత కు చేర్చుకుని ,  ఆ మాటా , ఈ మాటా చెప్పి సరసాలాడే వాడు. అదేంటో   మాయ కానీ  ,   ఆ సమయం లో , వేడి వేడి కౌగిళ్ళతో పాటుగా ,  అధరామృతం కూడా ఇచ్చి పుచ్చుకోవడం జరిగేది, తన భర్త తో !  అదే  తను పూజ తరువాత  ఇచ్చే  ప్రసాదమని ఎన్నో సార్లు భర్త తనతో అంటే , ఆనందం తో సిగ్గు పడి పోయేది తను. మరి ఈ మధ్య  కాఫీ అందివ్వగానే తీసుకుని , రుచి చూస్తూ , కనీసం ముఖం వైపు కూడా చూడకుండా ,  చెక్కర తక్కువైంది , కాఫీ సరిగా చేయడం కూడా నేర్చుకోలేదు !  ఇన్ని సార్లు చేస్తున్నా ! అని ఖంగు మన్న శబ్దం తో కాఫీ కప్పును ప్రక్కన పెట్టేస్తున్నాడు ! కళ్ళ నీళ్ళు కొంగు తో తుడుచుకుంటూ , తను కాఫీ కప్పు ను తీసుకు వెళుతూ ఉంటే , ‘ ఇంకా మొసలి కన్నీరు కారుస్తావేం , నేనేమన్నాను నిన్ను ? చీటికీ మాటి కీ ఏడుస్తావు ? ‘ అని మందలిస్తున్నాడు, కసురుకుంటున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ‘ మీరు వచ్చే  దోవలో షాప్ లో పాలూ , పంచదారా తెమ్మని చెప్పాను తెచ్చారా ? అని లక్ష్మి అడిగితే ‘ఇంట్లో కాలు పెట్టానో లేదో , పాలు తెచ్చారా , పంచదార తెచ్చారా అని వెధవ ప్రశ్నలు వేస్తావు !   నువ్వు తెచ్చుకుని ఏడవలేక పోయావా ? ఎంత మునిగి పోయే పనులున్నాయనీ నీకు ? ‘ అదేంటండీ , మీరు ‘ సరే తెస్తాను నేనే ‘ అని అన్నారు కదండీ పొద్దున్న ఆమాట అడిగితే ! ‘  ‘ మళ్ళీ ఎదురు సమాధానమూ నువ్వూ , సంసారం లో సుఖం లేదూ, చట్టు బండ లేదూ ! ఛీ ఛీ ! అని సంచీ ని విదిలించు కుంటూ బయట పడ్డాడు భర్త !  దానితో , ఆయన  క్రూర స్వభావం కూడా బయట పడింది. అకారణం గా అల్ప విషయాలకు ఇంటి ఇల్లాలిని, అవమానం చేస్తూ మాట్లాడడం, తీవ్రం గా మానసికం గా హింసించడం ఇక్కడ జరుగుతుంది. ఇట్లాంటి లక్షణాలు, ఆకస్మికం గా  కనుక, అంతకు ముందు, ఎంతో ప్రేమ గా ఉండే వారు కనుక చూపితే , అనుమానించాల్సిందే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని లక్షణాలు ! 

ప్ర.జ.లు. 12. ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 30, 2012 at 8:31 సా.

ప్ర.జ.లు. 12. ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ? 

ప్రశ్న: ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ?
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న. ( మనం ఇంతవరకూ స్త్రీలలో నూ , పురుషుల లోనూ , ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ కి కారణాలు ఏమిటి ? అనే విషయాన్ని సవివరం గా తెలుసుకున్నాము కదా ! ఏవైనా సందేహాలూ , ప్రశ్నలూ ఉంటే తెలియ చేయండి తెలుగులో కానీ , ఇంగ్లీషులో కానీ !  ) చాల సంబంధాలలో కారణాలు ఏమైనప్పటికీ , భాగ స్వాములు , ఆ సంబంధం విడి పోకూడదని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లాగే అనేక సంబంధాలలో ఈ ఎఫైర్స్ పెట్టుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ , అతి జాగ్రత్తగా , తమ గేమ్ లేదా ఆట ఆడుతూ ఉంటారు. ఇది అచ్చు , చిన్న తనం లో సహజం గా పిల్లలందరూ ఆడుకునే దొంగాట లాగా ఉంటుంది. చాటు మాటు గా ,  ఎవ్వరికీ దొరకకుండా అతి రహస్య ప్రదేశాలలో దాక్కోవడం !. ఈ గేమ్ ను  ఎంత నిగూ డం గా , రహస్యం గా ఆడుతూ ఉంటే , అంత త్రిల్ గానూ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక వాస్తవం ఏమిటంటే  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా శాతం వరకూ పట్టుకోవడం చాలా  కష్టం. ఎందుకంటే , ప్రేయసీ ప్రియులు చాలా పకడ్బందీ గా వ్యూహాలు పన్నుతూ ఉంటారు. అందుకే విదేశాలలో , అనేకమైన గూ ఢ చార ఏజెన్సీలు ఈ ఎఫైర్ లనూ ఇన్ ఫిడిలిటీ లనూ పట్టుకోడానికి అత్యంత ఆధునిక పరికరాలు , ఉపయోగించి , అనుభవజ్ఞులైన గూ ఢ చారుల చేత ఇన్వెస్టిగెట్ చేయిస్తూ ఉంటారు, భార్యలు  కానీ భర్తలు కానీ !  భారత దేశం లో కూడా ఈ కొవ కు చెందిన ఏజెన్సీ లు పుట్ట గొడుగుల్లా  వచ్చాయి. బాగా  సొమ్ము కూడా చేసుకుంటున్నారు. 
మరి  ఇన్ ఫిడిలిటీ ని కనుక్కోవడం ఎట్లా ? ఒక జంట లో ఏ ఒక్కరు ఎఫైర్స్ కలిగి ఉన్నా , ఇంకొకరు ఎట్లా కనుగొన వచ్చు ? : పైన చెప్పుకున్నట్టు , ఈ ఎఫైర్స్ ను కనుక్కోవడం చాలా కష్టం. కానీ కొన్ని సూచనలను గమనిస్తే , ఇన్ ఫిడిలిటీ ని అనుమానించ వచ్చు. 
1. ఎమోషనల్ గా దూరం గా ఉండడం : ఉదా:   శోభ !  ఇరవై నాలుగు సంవత్సరాల వయసు. B.A ఫైన్ ఆర్ట్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాసవగానే పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తరువాత మూడేళ్ళూ  ఆ జంట కు ఇరవై నాలుగు గంటలు సరిపోలేదు. ఎప్పుడూ, సరస సంభాషణలతో , ప్రణయ భావనలతో ,  కాలం గడిచిపోయేది.  భర్త  చాలా ‘ సంస్కారి ‘  శోభ తో తన బంధం పదిలం గా ఉండాలని కృత నిశ్చయం తో ఉండే వాడు.  అంతే కాక ,  శోభతో ప్రేమ బంధం తో పాటుగా , ఒక విడదీయ రాని రాగ బంధం కూడా ఏర్పరుచు కున్నాడు. ఎందుకంటే ,కామ సూత్రాలు చాలా శ్రద్ధ గా చదివి ఆకళింపు చేసుకుని , శోభతో ఆ బొమ్మలు కూడా చూపించి , శోభతో ఎక్స్పరిమెంట్ చేసేవాడు.  ఆ  కాలం ఎంతో మధురం గా ఉండేది. కానీ ఒక్కసారిగా అతనిలో మార్పు వచ్చింది. ఎందుకో ఏమో , ఎమోషనల్ గా చాలా దూరం గా ఉంటున్నాడు.  శోభకు భర్తను చూస్తె ఎంతో డిప్రెషన్ ఫీల్ అవుతున్న వాడిలా ఉండేవాడు. ఆమెకు  ఎదురుగా లాంజ్ లో ఫ్లవర్ వాజ్ లో వాడి పోయి , వాలి పోయి ఉన్న పూవు కాడ లో అతను కనిపించాడు. సెక్స్ లో నిరాసక్తత చూపుతున్నాడు. బెడ్ టైం లో ముసుగు తన్ని పడుకుంటున్నాడు. చాలా తక్కువ గా మాట్లాడు తున్నాడు. ఎప్పుడూ ఏదో అత్యంత ముఖ్యమైన పని ఉన్నట్టు సెల్ ఫోన్ లో మాట్లాడడమూ  చేస్తున్నాడు. ఇంట్లో , ఇదివరకటి లా పట్టించు కోవడం లేదు. ఎంత వెచ్చని , చిక్కని కౌగిలి ఇచ్చే వాడు !  ఏవి ఆ కౌగిళ్లు , ఏవి ఆ కామోచ్చ దశలు , ఏది  ఆ కామ వాంఛ ? అతను తన వాడేనా ?  అన్న అనుమానం కలుగుతుంది శోభకు. శోభ అనుమానం నిజమే ! అతని ప్రవర్తనలో మొదటి మార్పు ఎమోషనల్ గా శోభ తో దూరం గా ఉండడం, అతని ఇన్ ఫిడిలిటీ కి  బీజాలు పడుతున్నట్టే ! 
 
ఇంకొన్ని  లక్షణాలు ఇంకో టపాలో తెలుసుకుందాం ! 
 

ప్ర.జ.లు.11. స్త్రీలలో ఎఫైర్ లు, ఇన్ ఫిడిలిటీ లూ!

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 30, 2012 at 5:22 ఉద.

ప్ర.జ.లు.11. స్త్రీలలో ఎఫైర్ లు, ఇన్ ఫిడిలిటీ లూ!

ప్రశ్న: మరి ఈ ఇన్ ఇన్ ఫిడిలిటీ లలో ఇన్ ఫాంట్ ల మాటేంటి ?
జవాబు: వివాహ సంబంధాలు అతలా కుతలం అవుతున్నప్పుడు , ఆ  అస్తవ్యస్త  భాండం లో , పిల్లలు కూడా ఉడుకుతూ ఉంటారు. సరిగాలేని కుటుంబ వాతావరణం లో పిల్లలు కూడా సరిగా పెరగలేరు. అను నిత్యం భార్యా ,భర్తా , పిల్లల ముందే  కీచులాడు కుంటూ , వారి వారి కోపతాపాలు చూపించుకుంటూ ,  వాదులాడుకుంటూ , చీటికీ మాటికీ వారి కోపాలు , అన్నెం పున్నెం ఎరుగని చిన్నారుల పైన చూపిస్తూ ఉంటారు. లేక పొతే , సర్వ సామాన్యం గా భార్య , భరిస్తూ ఉంటుంది ఆ బాధ అంతా !  చిన్న పిల్లలు ఈ నిరంతర ఈ నిరుత్సాహ , నిస్సహాయ కుటుంబ వాతావరణం లో రగులుతున్న చితి మంటలలో సమిధలవుతుంటారు.  శక్తి హీనులు , నిరుత్సాహం తో ఉన్న తల్లుల పోషణ లో పిల్లలు కూడా , తీవ్రమైన ఆత్మ న్యూనతా భావం తో కుములుతూ ఉంటారు. బయటకు చెప్పక పోయినా , చిన్నారులలో సునిశితమైన పరిశీలనా జ్ఞానం ఉంటుంది. తమ కుటుంబ పరిసరాలలో జరుగుతున్న ప్రతి విషయమూ అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. కుటుంబం లో తల్లిదండ్రుల మధ్య కలతలు , వారి పిల్లల మనసులలో , పెరుగుదలలో , భవిష్యత్తు లో చెరగని ముద్ర వేస్తాయి. వారిలో అనేక మానసిక రుగ్మతలకు  కారణమవుతాయి. 
ఒక ఉదాహరణ:  శ్యాం  ఆరేళ్ళ బాలుడు.  అందరికీ శ్యాం అంటే ఎంతో ముద్దు. ఎప్పుడూ , తనదైన అల్లరి తో ఇంట్లో నూ బయటా అందరినీ  విసిగించడం తో పాటు , తన చిలిపి చేష్టలతో విపరీతం గా నవ్విస్తూ ఉంటాడు కూడా !  ఇట్లాంటి బాలుడు పెరుగుతున్న ఇంటిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శ్యాం నాన్న కు తాగుడు అలవాటైంది. ఎక్కడ ఉన్న డబ్బూ చాలట్లేదు. తాగి పారేస్తున్నాడు బాటిల్సు. దానితో పాటు తన ఆరోగ్యం కూడా పారేసుకుంటున్నాడు. భార్య మీద తరచూ చేయి చేసుకుంటున్నాడు. వాదోపవాదాల రిహార్సల్స్ పరిస్థితి దాటి ఇల్లు రణ రంగామవుతూ ఉంది. ఆ రణ రంగం లో ‘ మగ ధీరత ‘ ముందు ,  స్త్రీ  అశక్తత  ఒడి పోతున్నది.  ఓ అమాయకపు స్త్రీ మనసూ , మనువూ గాయ పడుతున్నది. ఓ చిన్నారి మనసు కూడా తీవ్రం గా గాయ పడుతున్నది , ఆ రణరంగం లో తానూ ఉంటున్నందుకే ! 
ఒక రోజు శ్యాం వెళుతున్న  స్కూల్  ప్రిన్సిపాల్ నుంచి అర్జంటు గా రమ్మని శ్యాం తల్లిదండ్రులకు పిలుపు వచ్చింది. శ్యాం తండ్రి బాటిల్ తన్ని పడుకున్నాడు. తల్లి హడావిడి గా వెళ్ళింది స్కూల్ కు. ‘ మీ శ్యాం ను వెంటనే ఇంటికి తీసుకు వెళ్ళండి !  క్లాసులో  తన తోటి అమ్మాయిని ఎడా పెడా కొట్టాడు అకారణం గా , ఆ అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. ఇట్లా అయితే మా స్కూల్ సాగినట్లే ! అని తీవ్రం గా మందలించి  టీ సి ఇచ్చి ఇంటికి పంపారు శ్యాం ను . ఏ తప్పూ చేయకపోయినా , విపరీతమైన అపరాధ భావన తో శ్యాం ను తీసుకుని ఇంటి ముఖం పట్టింది తల్లి !ఇట్లాంటి వాతావరణం నుంచి బయట పడాలని, ఆ ఇంటి ఇల్లాలు తీసుకునే నిర్ణయం , ఎంతో సాహసోపేత మైనదే కాక , శక్తి వంతమైనది కూడా అవుతుంది. ఆ నిర్ణయం ఎఫైర్ , కానీ ఇన్ ఫిడిలిటీ కానీ ,విడాకులు కానీ , ఎంతో సమంజసమైనది అవుతుంది , ఆ  రణ రంగ వాతావరణం నుంచి బయట పడడానికి.  ఆ స్త్రీకీ , ఆ చిన్నారికీ , ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఆ నిర్ణయం వల్ల. వారికి , తల్లి నిర్ణయం తో ఏర్పడిన స్వాతంత్ర్యత , వారి భవిష్యత్తును సమూలం గా మార్చి వేస్తుంది., వారి భయాన్నీ, ఆందోళనలన లనూ , ఆశక్తతనూ , నిస్సహాయ స్థితినీ  ఒక్క సారిగా సమాధి చేస్తుంది.
స్త్రీకి ఒక సంబంధం లోనూ , వివాహ బంధం లోనూ కావలసినది,  ప్రేమా , ఆప్యాయతా , ఆర్ధిక సుస్తిరతా కూడానూ. వీటితో పాటుగా , ఆదునిక స్త్రీకి   ,  ఆనంద కరమైన , ఆహ్లాద కరమైన సెక్స్ జీవితం కూడా కావాలి.  పురుషుడికి ఎంత ముఖ్యమో , స్త్రీకి కూడా సెక్స్ అంతే ముఖ్యం. ఈ సెక్స్ కేవలం ఒక ప్రెసెంట్ ఇస్తేనో లేదా ఒక హోటల్ లో ఒక భోజనానికి తీసుకు వెళితే నో రాదు !  సెక్స్ లేని స్త్రీ జీవితం ఉప్పు లేని కూడు లా చప్పిడి గా ఉంటుంది. సెక్స్ శక్తిని ఎట్లా విడుదల చేస్తుందో , అంతే వేగం తో స్త్రీ లో మానసిక శక్తిని కూడా  ఆవిష్కరిస్తుంది.
ఆ  సెక్స్ , మనసు లేని పురుషుడు ఇచ్చే సెక్స్ కాకూడదు.ప్రతి స్త్రీ తాను పాల్గొనే ప్రతి రతి లో , తన శరీరం లోని కామోత్తేజ జంక్షన్ లు అన్నీ తన పొందు కోరే పురుషుడి స్పర్శ తో , ఎర్ర ట్రాఫిక్ లైట్ల లాగా ఒక్క సారిగా  అత్యంత కాంతి వంతం అయి ఒక నూతనోత్తేజం పొందాలని కాంక్షిస్తుంది , కామిస్తుంది.  అట్లా కోరుకోవడం లో ఏ తప్పూ లేదని ఆధునిక యువతి భావిస్తుంది.  ఆమె దృష్టి లో   ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ , లేదా మ్యారేజీ లూ , ఏవైనా ఆమె కామ వాంఛలనూ, మనో వాంఛ లనూ తీర్చడమే కీలకం. ఈ విషయం లో పురుషుని తో సమానత్వం కోరుకుంటుంది స్త్రీ 
వచ్చే   టపాలో ఇంకొన్ని సంగతులు !