Our Health

Archive for ఫిబ్రవరి, 2015|Monthly archive page

బంధాలు ఎందుకు తెగుతాయి ?5.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 27, 2015 at 6:08 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?5. 

మనం, ఇప్పటి వరకూ , బంధాలు తెగి పోవడానికి  కారణమైన స్త్రీ పురుషుల మానసిక స్థితులు , వారి వారి  ఆలోచనా ధోరణులూ , ఏ రకం గా వైవిధ్యం గా ఉంటాయో తెలుసుకున్నాం ! ఇంకొన్ని వైవిధ్యాలు కూడా చూద్దాం ఇప్పుడు ! 
పురుషులు , సాధారణం గా , హేతు బద్ధం గా , విశ్లేషణా త్మకం గా , విషయాలను , పరిస్థితులనూ , అంచనా వేస్తూ ఉంటారు ! కానీ స్త్రీలు సాధారణం గా సృజనాత్మకం గానూ , స్పూర్తి దాయకం గానూ , వారి సమస్యలనూ , సంగతులనూ , అవగాహన చేసుకుంటూ ఉంటారు ! 
పురుషులు , వారి , వారి అనుభూతులనూ , మనో భావాలనూ  అర్ధం చేసుకోవడం లో వారే తికమక పడుతూ ఉంటారు , సామాన్యం గా ! అంతే కాకుండా , వారిలో నిగూఢమైన భావాలను , బహిరంగ పరచడం లో విఫలం అవుతూ ఉంటారు , అట్లా చేయడానికి  బిడియ పడుతూ ఉంటారు కూడా !  ఆ పరిస్థితులను కప్పి పుచ్చుకోవడం కోసం , తమ కు ‘ లోకువ ‘ అనిపించిన వారి మీద అధికారం చెలాయించ డమూ , వారిని తమ నియంత్రణ లో ఉంచుకోవడమూ కూడా చేస్తూ ఉంటారు ! అందుకు అవసరమవుతే , తమ శక్తి ని కూడా ఉపయోగిస్తారు ! 
పురుషులే , స్త్రీలకన్నా ఎక్కువ గా, తాము ఏర్పరుచుకున్న  బంధాల మీద ఎక్కువ గా ఆధార పడడమూ , ఆ బంధాల బలహీనతలకు ,  తీవ్రం గా స్పందించ డమూ జరుగుతుంది ! ఆ బంధాలు తెగితే , ఎక్కువ గా ఆత్మ న్యూనత చెందడం కూడా స్త్రీలకన్నా  పురుషుల లోనే ఎక్కువ !  దీనికి కారణం , ప్రధానం గా , పురుషులకు ఎక్కువ మంది ఆత్మీయులూ , స్నేహితులూ లేక పోవడమూ , ఇంకా , సహజం గానే పురుషుల లో ఉన్న  , ఇతరులకు చెప్పకుండా , తమ  బాధలను తమలోనే దాచుకునే గుణం వల్ల నూ  ! 
అందువల్లనే , పురుషులు , తమ క్రోధాన్నీ , ఉద్రేకాన్నీ ,తామే  సరిగా అర్ధం చేసుకోగలరు , తదనుగుణం గా స్పందించ గలరు కూడా , స్త్రీలకన్నా !
స్త్రీలలో కలిగే అనుభూతులూ , భావాలూ , సహజం గా చాలా లోతు గానూ , విస్తారం గానూ ఉంటాయి ! అట్లా గే , వారిలో కలిగే భావ స్పందనా తీవ్రత  కూడా ! 
ఉదా: లావణ్య  వయసు లో ఉన్న యువతి ! చదువు తో పాటుగా , ఉద్యోగమూ , సంపాదనా ఉండడం తో , ఆత్మ విశ్వాసమూ , స్వతంత్రతా , తొణికిస లాడుతూ ఉంటాయి , ఆమె  ప్రవర్తనలో !  ఆఫీసు లో మధుతో పరిచయం ! ప్రేమ గా మారింది ! కొంత కాలం ,  కలిసి ఉందామనే నిర్ణయం తీసుకున్నారు , స్వతంత్ర భావాలున్న వారవడం వల్ల ! 
మధుకు , ఉద్యోగ రీత్యా  ఇతర సిటీ లలో టూర్స్ వల్ల , లావణ్య  ఒంటరి దయింది , తాత్కాలికం గా ! ఆ సమయాలలో , మధు తో గడిపిన క్షణాలూ , పొందిన ఆనందమూ , ఆమెలో ఉవ్వెత్తున లేచి పడుతూ ఉంటాయి , అలల్లాగా !  ఈసారి ఇంటికి వచ్చాక , ఆ ఆనందాలు మధుతో మళ్ళీ పొందాలనుకుంటూ , ఎదురు చూస్తూ ఉంటే ,తిరిగి వచ్చిన మధు ,యదాలాపం గా , తనను పట్టించుకోక పోవడమూ ,  లాప్ టాప్ తో కుస్తీ పడుతూ ఉండడమూ , ఆమెలో అసహనాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి !  ఊరికే చీకాకు పడుతూ ఉంది ! తీవ్రమైన  విసుగు , కోపం ప్రదర్శిస్తూ ఉంది !  చేతి కందిన వాటిని విసిరేస్తూ ఉంది !  ఆమె కామోద్రేకానికి ,  కిచెన్ లో వంటలు మాడి పోతూ ఉన్నాయి ! మధు  కు ఆమె ప్రవర్తన లో మార్పు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది !  మధు లో కోరికలు ఫ్రీజ్ అయ్యాయి ! తను అనుకుంటున్నాడు , ఊళ్ళో తను లేకపోవడం వల్ల , జరుగుతున్న పరిణామాలేనని ! తన లావణ్య , తాను దగ్గర లేక పోవడం వల్ల , ఎవరి వలలో నైనా పడిందా ?  అర్ధం చేసుకో లేక పోతున్నాడు , లావణ్య ప్రవర్తన లో మార్పులను !  చిగురిస్తున్న బంధం ఊగిస లాడడం మొదలు పెట్టింది ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?4.

In Our Health on ఫిబ్రవరి 21, 2015 at 7:08 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి ?4. 

పురుషుల శక్తి యుక్తులు , ఆత్మ విశ్వాసమూ , కేవలం  వారి  సామర్ధ్యాల మీదనే  ఆధార పడి ఉంటున్నాయి , ఇప్పుడు కూడా , ప్రతి సమాజం లోనూ ! అందు చేతనే , పురుషులు , తమ లక్ష్యాలను సాధించడం ద్వారా , తమ ఆత్మ విశ్వాసాన్ని  కూడా పెంచు కుంటారు ! తమకు తాము గర్వం గా తల ఎత్తుకుని , తాము ఉంటున్న సమాజం లో మన గలుగు తారు ! వారికై వారు , ఇతరుల సహాయం లేకుండా  సాధించిన విజయాలతోనే , తాము పరిపూర్ణుల మైనట్టు భావిస్తారు ! ఈ  లక్ష్యాల వేటలో , పురుషులకు , సహజమైన , అనుభూతులూ , ఆప్యాయతలూ , వెనకడుగు వేస్తాయి ! అంటే , పురుషుల లక్ష్యాలు ప్రధానం గా , భౌతిక అవసరాలు సాధించే దిశలోనే ఉంటాయి ! ప్రేమానురాగాలూ , ఆప్యాయతలూ ప్రధాన పాత్ర వహించవు ! వారు సాధారణం గా సమస్యల పరిష్కారం లో ,ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి వెనుకాడతారు ! అట్లా చేయడం తమ అసమర్ధత గా భావిస్తారు ! 
పురుషులు , ఆర్ధిక వ్యవహారాలలో ఎక్కువ గా తల మునకలవుతారు ! చాలా మంది పురుషులలో  డబ్బు ప్రధాన మైన విషయం గా ఉంటుంది ! అంటే , వారి మెదడులో అధిక సమయం డబ్బు విషయాలు మాత్రమే తిరుగాడుతుంటాయి ! అబ్సెసివ్ గా !  జీవితం లో ఆర్ధికం గా విఫలమైన పురుషులు , తీవ్రం గా స్పందిస్తారు ! అంటే రియాక్ట్ అవుతారు ! చాలా విపరీతం గా నిరాసక్తత కు లోనవుతారు ! అంటే పురుషుల   రోజు వారీ అనుభూతులు , వారి ఆర్ధిక స్థితి మీద చాలా వరకూ ఆధార పడి  ఉంటాయి ! 
కానీ , అందుకు వ్యతిరేకం గా , స్త్రీల ప్రధాన విషయాలు , అందాలు , ప్రేమాను రాగాలు , ఆపేక్షా , ఆప్యాయతలు , పరిచయాలూ , బంధాలూ ! స్త్రీ  ఆత్మ విశ్వాసం , ప్రధానం గా ఆమె  అనుభూతుల మీదా , ఆమె  ఏర్పరుచుకున్న , లేదా ఏర్పరుచుకునే బంధాల  నాణ్యత మీదా ఆధార  పడి  ఉంటుంది !  
అంతే కాకుండా స్త్రీలు , తమను , తాము , భౌతికం గా కూడా తాము నివసించే సమాజం లో అందం గా కనబడాలనీ , మంచి బట్టలు కట్టుకోవాలనీ , ఇతరులతో , అనుభూతుల తో కూడిన సంభాషణలు చేయాలనీ ,  భావిస్తూ ఉంటారు ! వారి వ్యక్తి గత  వస్త్ర ధారణ లోకానీ , వారి శారిరిక మార్పులు కానీ , తమకు ఇష్టమైనవి కాక పొతే , వారిని ,  తీవ్రం గా క్రుంగ దీస్తాయి ! ఎంతగా అంటే , పురుషులు కనుక ఆర్ధికం గా నష్టపోతే ఎంతగా కృంగి పోతారో , అంత తీవ్రం గా ! స్త్రీల దృష్టి లో , ఇతరులకు సహాయ పడడమూ , లేదా సహాయం తీసుకోవడమూ , ఆత్మ న్యూనత అవ్వదు !  ఇతరులకు సహాయం చేయడం వారి బలం గా కూడా  స్త్రీలు భావిస్తారు ! తమ పురుషులు , ఎక్కువ గా పని లోనూ , డబ్బు సంపాదన లోనూ సమయం వెచ్చిస్తే , దానిని  స్త్రీలు ‘ తమను తిరస్కరిస్తున్నారన్న ‘  భావన తో కుమిలి పోతారు !
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?3.

In Our Health on ఫిబ్రవరి 14, 2015 at 10:28 ఉద.

బంధాలు ఎందుకు తెగుతాయి ?3. 

పెంపకం లో తేడాలు :
చిన్న తరగతుల నుండీ , బాలికలు , తరచూ ఆపద లో ఉన్నట్టు , లేదా నిస్సహాయురాలైనట్టు , అనేక కధలు, కార్టూను పుస్తకాలు  చదవ బడుతూ ఉంటాయి ! అట్లాగే , బాలికలు  ప్రేమ , ఆప్యాయతలు వ్యక్త పరిచే పదాలు ఎక్కువ గా వారి సంభాషణల లో వాడుతూ ఉంటారు, బాలుర కన్నా !
బాలురు , స్కూళ్ళ లోనూ , వారి ఇళ్ళ లోనూ ,  ఎక్కువ గా అల్లరి చేస్తూ ఉంటారు , బాలిక ల కన్నా ! బాలికలు , మగ వారిలా దుస్తులు వేసుకున్నా , లేదా మగ వారిలా ప్రవర్తించినా కూడా , వారిని పెద్దగా , వేలెత్తి చూపడమూ , పట్టించుకోవడమూ జరగదు , వారుంటున్న సమాజం లో ! కానీ , బాలురు బాలికల లా మాట్లాడినా , వారిలా దుస్తుల విషయం లో శ్రద్ధ కనబరిచినా కూడా , వారిని విపరీతం గా కోప్పడడం చేస్తూ ఉంటారు , తల్లి దండ్రులు ! ‘ ఆడంగి లా మాట్లాడకు , ఆడంగి వేషాలు వేయకు ‘ అంటూ ! 
బాలికలు , తమ స్నేహ బంధాలు పెరగడమూ , దృఢ మవడం కోసమూ , ఇతరుల గురించి మాట్లాడుకోవడం , వారిగురించిన రహస్యాలు చెప్పుకోవడం కూడా చేస్తూ ఉంటారు ! బాలురు , వారు చేసే పనుల మీద ఎక్కువ గా మాట్లాడు కుంటారు , అంటే  క్రీడలు కానీ , చదువులు కానీ , బాగా ఆడుతున్న , లేదా చదువు తున్న వారి గురించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు ! వస్తువులు , యంత్రాల గురించి న విషయాలు కూడా వారికి ఆసక్తి కరం గా ఉంటాయి ! కానీ బాలికలు , దుస్తుల గురించి , ఇతర బాలుర గురించి , లేదా వారి బరువు గురించి న విషయాలు తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు ! 
యుక్త వయసు లో యువతులు , సామాన్యం గా , పురుషులతో స్నేహం కోసం తపిస్తూ ఉంటారు ! సాధారణం గా ! అట్లాగే యువకులు ,  సెక్స్ విషయాల మీదా , కార్లూ , మోటర్ సైకిళ్ళ మీదా , క్రీడల మీదా ఎక్కువ ఉత్సాహం చూపుతూ ఉంటారు ! 
ఇట్లాంటి ఆలోచనా ధోరణు లే  వారి వయసు పెరుగుతూ ఉన్నా , అదే రకం గా పరిణితి చెందుతూ ఉంటాయి ! 
ఇంకో టపా లో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?2.

In మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 9, 2015 at 11:39 ఉద.

బంధాలు ఎందుకు తెగుతాయి ?2. 

పెంపకం లో తేడాలు :
వివిధ దేశాల్లో , బాల బాలికల పెంపకం లో తేడాలు , అనేక సాంఘిక , ఆచార కట్టుబాట్ల మీద ఆధార పడి ఉన్నా కూడా  , సాధారణం గా తలి దండ్రులు , ఆడ పిల్లలను , అతి గారాబం గానూ , లావణ్యం గానూ , చూసుకుంటారు , చిన్న తనం నుంచీ !  బాలికలను అతి సున్నితం గా తగ్గు స్వరం తో పిలవడమూ , పలకరించ డమూ  చేస్తూ , అబ్బాయిలను  , హెచ్చు స్వరం తో , గట్టిగా పిలవడమూ , పలకరించ డమూ  జరుగుతూ ఉంటుంది , చాలా ఇళ్ళలో !  అంతే కాకుండా , బాలికలను ఎత్తుకోవలసి వచ్చినా , లేదా  వారితో ఆడుకోవలసి వచ్చినా , వారిని అతి నున్నితం గా  పట్టుకోవడమో , లేదా ఎత్తుకోవడమో జరుగుతుంది ! కానీ బాలురను ఎక్కువ శక్తి తోనూ , మోటుగానూ , పట్టుకోవడమూ , వారితో ఆడుకోవడమూ జరుగుతూ ఉంటుంది ! 
రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకూ , తల్లి , తన కూతురు తోనే ఎక్కువ గా కళ్ళ లోకి చూస్తూ , ఎక్కువ సమయం వారితోనే గడుపుతుంది , అంతే వయసులో ఉన్న బాలుర తో , వారి తల్లులు గడిపే సమయం కన్నా ! 
తల్లులు ,వారి కూతుళ్ళు చిన్న వయసు లో ఉన్నప్పుడు , ఉద్రేక పడినా , లేదా కోపం చూపించినా , వారు ( అంటే తల్లులు ) వారి ముఖ కవళిక లలో , వారి అసహనాన్నీ , అసంతృప్తి నీ ఎక్కువ గా చూపిస్తారు , వారి కూతుళ్ళ మీద !  కానీ ,  తల్లులు,  వారి కుమారులకు క్రోధం వచ్చినప్పుడు ,  ఆ విధం గా వారి భావాలను కనిపించనీయరు ! 
అమ్మాయిలు పెరుగుతూ , చిరునవ్వు తో , ఇతరుల భావాలను త్వరగా , వారి ముఖ కవళిక ల ద్వారా కనుక్కోవడం లో ( అబ్బాయి ల కన్నా ) ముందు ఉండటం లో , చిన్న తనం లో వారితో ,వారి తల్లుల ప్రవర్తన వల్లే అని కూడా భావించ బడుతుంది , మానసిక శాస్త్ర రీత్యా ! 
అట్లాగే , తండ్రులు , తమ కుమారులతో , ప్రవర్తించే సమయం లో కూడా , వారితో ప్రేమ పూర్వకం గా ఉన్నా కూడా , బాలికలతో పోలిస్తే , కుమారులకే , ఎక్కువ గా ఆదేశాలు ఇవ్వడం కూడా గమనించడం జరిగింది ! ఈ రకమైన తండ్రుల ప్రవర్తన కూడా , కుమారుల మానసిక పెరుగుదల ను ప్రభావితం చేస్తుంది ! వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి !? 1.

In Our Health on ఫిబ్రవరి 7, 2015 at 12:21 సా.

బంధాలు ఎందుకు తెగుతాయి !? 1.

బంధం అంటే కలయిక ! ఆ కలయిక,  ఒక తాడు కు రెండు వైపులా కావచ్చు ! రెండు తాళ్ళకు  ఒక్కో వైపు కూడా కావచ్చు !  కేవలం భౌతికం గా పరిశీలిస్తే,  ఒక బంధం దృఢ మైనది గా ఉండాలంటే ,  అందుకు అవసరమయే తాడు , ఏ పదార్ధం తో చేయబడ్డదో అనే విషయం ఎంత ముఖ్యమైనదో , ఆ తాడుతో వేయ బడే ముడి ఏ రకం గా వేయ బడిందో అనే విషయం కూడా అంతే ముఖ్యమైనది ! అంతే కాకుండా , అట్లా వేయబడిన ముడి , పరిసర వాతావరణ ప్రభావాలకు కూడా  బలపడడమూ , లేదా బలహీన బడడమూ  జరుగుతూ ఉంటుంది ! అంటే ,  పరిసరాలు అతి శీతలం గా ఉన్నా , లేదా   అతిగా వర్షాలు పడి , ఆ వేయబడ్డ ముడి నానినా , లేదా  అత్యధిక ఉష్ణోగ్రత ల ప్రభావం వల్ల , అంటే మండు వేసవి వేడికి కానీ , లేదా  ముడి కి అతి దగ్గర గా  మంటలు చెల రేగడం కానీ జరిగితే , ఆ  ప్రభావం తో , వేయ బడ్డ బంధం , తెగి పోతుంది !  స్త్రీ పురుష సంబంధాలను  కూడా  చాలా వరకూ  ఈ రకం గా అన్వయించుకోవచ్చు ! ప్రస్తుత అంతర్జాల యుగం లో మానవ సంబంధాలతో పాటుగా , స్త్రీ పురుష సంబంధాలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించు కుంటున్నాయి , సహజం గానే ! స్త్రీ పురుషుల సంబంధాల లో తేడాలు , వారు స్త్రీ, పురుషులవడం వల్ల వస్తుంటాయి ! ఈ విషయం  ఒక్క ముక్క లో చెప్పగలిగినా , అనేక కారణాలు , స్త్రీ పురుష సంబంధాలను ప్రభావితం చేస్తాయి !
 మరి   స్త్రీ పురుషుల ఆలోచనా ధోరణులలో తేడాలు ఏమిటి ? 
పరిణితి అంటే డెవలప్ మెంట్ పరం గా  చూస్తే ,   అమ్మాయిల  మెదడు  కుడిభాగం త్వరగా అభివృద్ధి చెందుతుంది !  మెదడు కుడి భాగం లో త్వరగా మాట్లాడడం , ఇంకా ఒకాబులరీ అంటే అనేక  పదాలను అర్ధం తెలుసుకో గలిగే నేర్పు , ఇంకా జ్ఞాపక శక్తి కి కూడా ముఖ్యమైన స్థానాలు ఉంటాయి ! ఇంకా పదాలను వ్యక్తీకరించడం కూడా మెదడు కుడి భాగం క్రియా శీలం గా ఉంటే  జరుగుతుంది ! ‘ ఆ అమ్మాయి , నాలుక భలే చురుకు ! ఎంత బాగా మాట్లాడుతుందో ! మాటల పుట్ట !  నానిది  కూడా అదే వయసు , కానీ  మౌనం గా ఉంటాడు , అని బాలికలను ప్రశంశించడం మనం చూస్తూనే ఉంటాము ! 
అబ్బాయిలలో మెదడు లో ఎడమ భాగం, అంటే లెఫ్ట్ హెమి స్ఫియర్  త్వరగా అభివృద్ధి చెందుతుంది !  దానితో సమస్యలకు పరిష్కారం కనుక్కోవడమూ , జటిల మైన పజిల్స్ ను పరిష్కరించ గలగడమూ ,  ఏ ప్రదేశం ఎక్కడ ఉందో  కనుక్కోవడమూ , కూడా త్వరగా చేయడం జరుగుతుంది !  ‘  ప్రభాకర్ , ఊరంతా చుట్టి వస్తాడు,  ఒక సైకిల్ ఇస్తే !అని కానీ ,  ‘ వాడికి ఆ శక్తి ఉంది !  అనుకున్న పని  సాధిస్తాడు ‘ అని కానీ   అనడం కూడా వింటూ ఉంటాము,  మనం ! 
స్త్రీలు , పెరుగుతూ ఉన్న కొద్దీ , మెదడు రెండు భాగాలనూ , బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ! అంటే రైట్ అండ్ లెఫ్ట్ హెమి స్ఫియర్స్ ! ఆ రెండు భాగాలనూ జత చేసే , కార్పస్ కలోసం అనే పట్టీ , పురుషులలో కన్నా స్త్రీలలో ఎక్కువ  మందమైనది గా  కనిపించింది ( పురుషులలో కన్నా ) , శాస్త్రజ్ఞులకు ! వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: