Our Health

Posts Tagged ‘Our Health’

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

In Our Health on మార్చి 3, 2012 at 9:37 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.6.

 
ఈ ప్రణయాకర్షణ హేల –  ప్రతి జీవితానికీ ఒక మధురానుభూతుల సుగంధ  సుమ  మాల !!
క్రింద వివరించిన అనుభూతులు ఇంకా ఏ శాస్త్రవేత్త కూ  అంతు పట్టని అనుభూతులు గానే ఉన్నాయి.
ఇవి ఇప్పటి వరకూ ఏ  జీవ రసాయనమో కారణం తెలియని  ప్రణయ రసానుభూతులు !!
 
ప్రేయసీ ప్రియులు పరస్పరం ఎమోషనల్ గా అంటే  మనోభావ పూర్వకం గా ఆధార పడటం మొదలు పెడతారు.
ఈ భావాలు,  ఆశ,  బిడియము, భావోద్వేగము, ఒకరి గురించి ఒకరు ఆలోచించ టము, ఒకరిని ఇంకొకరు విడిచి పెడతారని బెంగ పడటము, ఒకరి కొకరు దూరమైనప్పుడు ఆందోళన చెందటము,ఇలాంటివి. ఈ భావాలన్నీ వారిని ఇంకా అప్రమత్తులు గా చేసి ఒకరిని ఒకరు కనిపెడుతూ ఉండేట్టు చేస్తాయి.
వీరు భావ తమ ప్రియునితోనూ , లేక ప్రియురాలితోనూ భావ సంగమానికి తీవ్ర ఉత్కంథత  తో  ఎదురు చూస్తుంటారు.
తమ తమ దైనందిన కార్యక్రమాలలో, ఏ మాత్రము సంకోచము లేకుండా మార్పులు చేసి, తమ ప్రియురాలితో, తమ ప్రియునితో కలయిక కోసం ఎదురు చూస్తుంటారు.
అవసరమైన మార్పులు, తమ వేష ధారణ లోనూ , అలవాట్లలోనూ ,  హావ భావాల లోనూ చేస్తుంటారు.
ఒకరి గురించి ఒకరు బాధ్యతాయుతం గా  ఉండటము, ఒకరి కోసం ఇంకొకరు త్యాగం చేయటానికి కూడా సిద్ధ పడతారు, ఈ ప్రణయాకర్షణ  వల లో చిక్కుకుని !!
ఇక వారి ప్రణయానికి  అవరోధాలు ఎంత ఎక్కువ అవుతుంటే  అది అంత   ఎక్కువ తీవ్రం గా పరిణమిస్తుంది, బలపడుతుంటుంది !!
ఇంకో  విషయం:
ఈ ప్రణయాకర్షణ వల లో చిక్కుకున్న  ప్రియులు ఒకరితో ఒకరు  రతి క్రియ లో సంగమం అవ్వాలని ఎదురుచూస్తూ ఉంటారు, తీవ్రమైన కామ కోరికలతో !! ఈ ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే , తమ ప్రియులు తమకు పోటీ గా అనిపించిన ఎవరితో ఉన్నా  అత్యంత అసూయ చెందుతారు.
   జీవ పరిణామ పరం గా చూసినట్లయితే ఈ రకమైన మనోభావాలు తాము తమ ప్రియులతో రతిక్రియ లో పాల్గొని అతని లోని వీర్యం ఆమె లో చేరి  అండాశయ దిశలో ప్రయాణం చేయటానికి అంటే వారు ప్రత్యుత్పత్తి జరపటానికి ఎంతో ఉపయోగ పడతాయని తెలిసింది.
ఆమె, అతడు, రతిక్రియ కు ముందు మనో భావ సంగమం కోసం తాపత్రయ పడతారు. కానీ పాశ్చాత్య నాగరికతల లో ఎక్కువ మంది ప్రేయసి ప్రియులు, వారు రతీ సంగమమే వారికి మనో భావ సంగమం కన్నా ప్రధానమైనదని ఒక సర్వే లో తెలిపారు. 
ఈ ప్రణయానుభూతులూ, రతీ మన్మధులు వారిని గిలిగింతలు పెట్టిన మధురానుభూతులూ, ప్రేయసీ ప్రియుల  నియంత్రణ లో ఉండక,  వారు ఎంత ప్రయత్నించినా వారి ఆధీనం లో లేక వారిని ఉక్కిరి బిక్కిరి   చేస్తాయి.
ఈ ప్రణయానుభూతుల ఇంకో ప్రత్యెక లక్షణం ఏంటంటే, అవి తాత్కాలికాలు. 
అవరోధాలు ఏర్పడి ప్రేయసీ ప్రియులు, కలవటానికీ, సంభాషించు కోవటానికీ వీలు కానప్పుడు ఆ అనుభూతులు క్రమం గా బలహీనమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో పన్నెండు నుంచి పద్దెనిమిది  మాసాలలో ఈ అనుభూతులు మాయమయ్యే  ‘  అవకాశం ‘  ఉంటుంది.
( ప్రేయసీ ప్రియుల దృష్టి లో ఈ అనుభూతులు మాయమయ్యే ‘ ప్రమాదం ‘  ఉంటుంది. ) 
 
ఈ టపా పై మీ అభిప్రాయాలు తెలుపండి. 
వచ్చే టపాలో ప్రేమ గురించి వివరాలు చదవండి !!

ఆకర్షణ , ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

In Our Health on మార్చి 2, 2012 at 10:50 సా.

ఆకర్షణ , ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.5.

 
ఆకర్షణ లక్షణాలు : 
పరస్పర తదేక దృష్టి :
అంటే ప్రియుడు, ప్రియురాలి అన్ని హావ భావాలను, కదలికలను, భాషణను అంటే మాట్లాడటము, ఇవన్నీ ప్రత్యెక శ్రద్ధ తో గమనిస్తుంటాడు.
సాధారణం గా, అంతగా, పట్టించుకోని ఆమె అలవాట్లు కూడా అతనికి ఎంతో ప్రత్యేకంగా ఉండి , బాగా గుర్తువుంటాయి. ఉదాహరణకు, ఆమె తన తల ముంగురులు కళ్ళకు ముందు పడకుండా పక్కకు సవరించుకుంటే కూడా, అతను అతి శ్రద్ధ తో గమినించి గుర్తు పెట్టుకుంటాడు.
అలాగే, ఆమె అతడి లో ఉన్న సాధారణ కదలికలనూ, ముఖ కవళికలను శ్రద్ధతో  చూస్తూ, వాటినే మననం చేసుకుంటుంది.
ముఖ్యంగా ఆమె అన్న మాటలు అతనూ, అతను అన్న మాటలు ఆమె పొల్లు పోకుండా గుర్తు పెట్టుకుని ( అవి సాధారణ విషయాలైనా ) వాటినే పదే పదే మననం చేసుకుంటూ, ఆ మధుర క్షణాలను   మళ్ళీ మళ్ళీ   గుర్తు కు తెచ్చుకుంటారు.
ఈ  పరస్పర తదేక దృష్టి కి కారణం డోపమిన్ అనే  జీవ రసాయనము,  పదే పదే మననం చేసుకోటానికి నార్ ఎపినెఫ్రిన్  అనే జీవ రసాయనము కారణం. ఇలాంటి స్థితులలో ఆ జీవ రసాయనాలు ఎక్కువ గా ఉంటాయి ప్రేయసీ ప్రియులలో.
శక్తి వంతం గా అయిన అనుభూతి :
ఈ డోపమిన్, నార్ ఎపినెఫ్రిన్ లు ఇంకా ప్రేయసీ ప్రియులలో కనిపించే అనేక అనుభూతులు, ఆస్వాదనలకు కారణాలు.
హృదయం  తేలిక అయినట్టు అనిపించడం, వేగంగా కొట్టుకోవడం, శేదం పట్టడం, ఊపిరి వేగంగా తీసుకోవడం,  పెదవులు వణకటం, మేను పులకరించటం,  మాట తడబడటం, తత్తర పాటు పడటం , కడుపులో ఏదో తెలియని అనుభూతి  , ప్రియుని చెంత , ప్రియురాలి చెంత, ఏదో తెలియని ఆందోళనా, భయం, ఇవన్నీ కూడా ఈ డోపమిన్, నార్ ఎపినెఫ్రిన్ ల వల్లనే !
ఇంకా ఆకలి తగ్గి పోవటం,  నిద్ర కు దూరం అవటం, ఎక్కువ శక్తి వంతం గా అనుభూతి పొందటం, మనసు తేలిపోయినట్లు అనిపించటం కూడా ఈ రసాయనాల వలనే !
ఇంకొన్ని  ఈ ప్రణ యాకర్షణ అనుభూతులు వచ్చే టపాలో చూడండి. 
( ఈ టపా మీద మీ అభిప్రాయాలు తెలపండి  ) 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 4 .

In Our Health on మార్చి 2, 2012 at 4:20 ఉద.

ఆకర్షణ,ప్రేమ,కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 4.

 
ఆకర్షణ లక్షణాలు : 
 
అంతు లేని ప్రణయ ఆలోచనలు: 
ప్రణయాకర్షణ  దిన దినాభి వృద్ధి చెందుతున్న కొద్దీ , అతడిలోనూ , ఆమె లోనూ, ప్రణయాలోచనలు కూడా ఎక్కువ అవుతుంటాయి.
ఈ ప్రణయాలోచనలకు ఒక  కొన్ని ప్రత్యెక లక్షణాలు ఉంటాయి.
ఈ ఆలోచనలు అంతులేకుండా వస్తుంటాయి. అంటే రమారమి నిరంతరమూ, మెలకువ తో ఉన్నప్పటి నుంచీ మళ్ళీ నిద్రకు పోయే వరకూ.
ఈ ఆలోచనలకు ప్రత్యెక ఆహ్వానం అవసరం ఉండదు. అతడి మనసు, ఆమె మనసు  తలుపులు తట్టి, వారు ‘ ఆ తలుపు ‘ తీయక పోయినా, ప్రవేశించి ,  వారి మనో ప్రాంగణం లో తిష్ట వేస్తాయి.
ఈ ఆలోచనలు ఆమె, అతడు పిలవని అతిథులు గా వచ్చి,  మనసు లో తీవ్ర  అలజడి రేపుతాయి.
ఈ ప్రణయాలోచనల తీవ్రత ఎంత గా ఉంటుందంటే, అవి అబ్సెస్సివ్  గా మారుతాయి. అంటే  వద్దనుకున్నా వస్తుంటాయి. 
ఇటలీ లోని పీసా విశ్వ విద్యాలయానికి చెందిన నాడీ  శాస్త్రజ్ఞులు ఈ  అంతులేని ప్రణ యాలోచనలు  వస్తున్న ప్రేమికుల పై పరిశోధనలు చేసి వారి లో ఈ లక్షణాలు ,   వారిలో  సీరోటోనిన్  అనే జీవ రసాయనాన్ని తగ్గిస్తాయని ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్నారు. 
ప్రణ యాకర్షణ లో  ‘ పడ్డ ‘ ప్రేమికుల  రక్తం లో ఉండే ప్లేట్లెట్ లో  ఒక ప్రోటీన్  తక్కువ గా ఉందని తెలిసింది. ఈ ప్రోటీన్ పేరు  ‘ సీరోటోనిన్ ట్రాన్స్ పోర్టర్ ప్రోటీన్ ‘ .  సాధారణంగా ఈ ప్రోటీను, సీరోటోనిన్ ను ఒక నాడీ కణం నుంచి ఇంకో కణానికి చేరవేస్తుంది. ఈ ప్రోటీన్ తక్కువ అవటం వల్ల, సీరోటోనిన్ కూడా తక్కువ గా ఉంటుంది, ఆ ప్రేమికులలో.
క్లుప్తం గా చెప్పాలంటే  ప్రణయాకర్షణ నుంచి ప్రేమలో పడుతున్న కొద్దీ ఈ సీరోటోనిన్ తక్కువ అవుతూ వుంటుంది, ప్రేమికులలో. ఇక్కడ గుర్తు ఉంచుకో వలసిన విషయం ; ప్రేమికులిద్దరూ పరస్పరం ఈ ప్రణ యాకర్షణ అనుభూతులు పొందుతున్నప్పుడే. అంటే ఆకర్షించ బడుతున్నవారు కూడా ఆ అనిర్వచనీయమైన ప్రణ యాకర్షణ అనుభూతి పొందుతున్నప్పుడే ఇద్దరిలో నూ సీరోటోనిన్ తక్కువ గా ఉంటుంది. అలా కాక పొతే ఒకరిలోనే తగ్గుతుంది సీరోటోనిన్.
సీరోటోనిన్ యొక్క ప్రాముఖ్యత   గురించి ఇదే బ్లాగు లో , మునుపటి టపాలలో ఉన్న ‘  డిప్రెషన్ ఆత్మకథ’  వ్యాసం లో మీరు  వివరంగా చదివి వుంటారు. 
ఒక ఉదాహరణ: 
‘ మనసు కవి ‘ గా ప్రసిద్ధి చెందిన కీర్తి శేషుడు ఆచార్య  ఆత్రేయ గారి ఈ పాట రచన చూడండి,  ప్రణయాకర్షణ తీవ్రత  ఏక్కువైన   ప్రేమికుడు ఆవేశం తో   పాడే పాట: 
 
 ఏమనుకున్నావు ? నన్నేమనుకున్నావు ? పిచ్చి వాడిననుకున్నావా ? ప్రేమ బిచ్చ గాడిననుకున్నావా ?
వెళ్ళినట్టే  వెళ్లావు !!, కళ్ళ లోనే ఉన్నావు !! , మరచిపోను వీలు లేక మనసు లోనే  మెదిలావు !
నిన్ను నేను రమ్మన్నానా ? మనసు నాకు ఇమ్మన్నానా ? వచ్చి, వలపు రగిలించావు !!  చిచ్చు నాకు  మిగిలించావు !! ఏమనుకున్నావు ? 
ప్రేమంటేనే బాధన్నారు , ఆ బాధుంటేనే బ్రతుకన్నారు , అది  ప్రేమే కాదంటాను , ఆ బ్రతుకే వద్దంటాను , ఏమనుకున్నావు ? నన్నేమనుకున్నావూ ?
పిచ్చి వాడి ననుకున్నావా ? ప్రేమ బిచ్చ  గాడి ననుకున్నావా? !! 
 
( చక్కటి తెలుగులో చక్కగా వర్ణించిన ఈ పాట ఘంటసాల గారు నాగేశ్వర రావు గారి కోసం ‘  బంగారు బాబు’  చిత్రానికి పాడిన పాట – ఇంటర్నెట్ లో విని పూర్తిగా ఆస్వాదించండి !!!
ఇంకా నచ్చితే , యు ట్యూబ్ లో  ఈ పాటకు , నాగేశ్వర రావు గారి అత్భుత నటన కూడా చూడండి ).
 
 
వచ్చే టపాలో ఈ ప్రణయాకర్షణ  లక్షణాలు మరికొన్ని చూడండి 
 
( మీ అభిప్రాయం మరువకండి ! ) 
 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 3 .

In Our Health on మార్చి 1, 2012 at 8:33 ఉద.
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ. 3.
 
మునుపటి టపా లో చూసినట్టు,
ఆమెకూ , అతనికీ మధ్య, ఒక నవ్యమైన , ప్రత్యెక మైన  అనుభూతి ఈ ఆకర్షణ !  ఇలా ఆకర్షణ కు లోనైన వారి జీవితం లో ఆకర్షిస్తూన్న వారు ఒక ప్రత్యేకత పొందుతారు. వారి జీవితం లో అతి ముఖ్య వ్యక్తులవుతారు.
సాధారణంగా ఆకర్షణ ఒక  యువతికీ, ఒక యువకునికీ మధ్య మాత్రమే ఉంటుంది. అంటే  ఆకర్షణ కు లోనైన వారు ఏ సమయం లో నైనా ఒక్కరే  ఆకర్షిస్తూంటారు. ఈ పరిస్థితి లో వారికి వారి ప్రపంచ పటమే మారిపోతుంది !
ఆకర్షణకు మూలమైన జీవ రసాయనాలు: 
ఇలా ఆకర్షణకు లోనవుతున్న వారి మెదడు లో డోపమిన్ అనే రసాయనం ఎక్కువ అవుతుంది. ఈ డోపమిన్  కొత్త వాతావరణం లో ప్రవేశించి నప్పుడు ఎక్కువ అవుతుంటుంది.
ఎలా డోపమిన్ ఎక్కువ అవటం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ! ప్రియురాలు ప్రియుని పైన మనసు ఎక్కువ గా లగ్నం చేస్తే, అప్పుడు, స్తబ్దత తగ్గి , అప్రమత్తత ఎక్కువ అవుతుంటుంది. చేసే పని యందు ఉత్సాహమూ, ఏకాగ్రత కూడా వృద్ధి చెందుతాయి ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అవటం వల్ల.
అలాగే వారి జీవితం లో తదేక దృష్టి పెరిగి వారు ఒక  చేరుకునే లక్ష్యం వైపు వారి మనసు ను లగ్నం చేస్తుంది ఈ డోపమిన్ సాంద్రత ఎక్కువ అయి.  
డోపమిన్  తో పాటు  నార్ ఎపినెఫ్రిన్  అనే రసాయనం కూడా ఎక్కువ అయి సీరోటోనిన్ అనే రసాయనం మాత్రం తక్కువ అవుతుందని  ఇటీవలి పరిశోధనల వల్ల తెలిసింది .  
అంతే కాక ఆకర్షణకు లోనైన వారు  ఆకర్షిస్తున్న వారిని ఎంత ఏకాగ్రత తో  ఆరాధిస్తుంటే అంత డోపమిన్ రసాయనం వారి మెదడు లో ఎక్కువ అవుతుంటుంది. 
 
వచ్చే టపాలో మరి కొన్ని వివరాలు చదవండి, ఆకర్షణ గురించి.
( ఈలోగా  మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి )
 
 
   
 
 
 

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 2.

In Our Health on ఫిబ్రవరి 29, 2012 at 11:57 ఉద.
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ –  శాస్త్రీయ విశ్లేషణ – 2.
ఆకర్షణ – లక్షణాలు.
The Call of the Prairie by Andrea T. Kramer
మొదటి దశ లో  ఆకర్షణ,   ప్రతి మానవ ప్రణయ జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన అనుభూతి !!  ఆ అనుభూతి ఒక నూతన తేజాన్ని ఇస్తూంది జీవితానికి.
ఆమె అతనిలో అంతులేని ఆకర్షణ చూస్తూంది. అతడు ఆమెలో ఉండే అన్ని గుణాల వైపూ ఆకర్షించ పడతాడు. ఇద్దరూ ప్రపంచాన్ని ఒక కొత్త కోణం లో చూస్తారు.
సినీ గేయ రచయితలు ఈ ఆకర్షణ  లక్షణాలను రమణీయం గా వర్ణించి , పాటల రూపం లో మనకు అందించారు ( వారు ఏ  సర్టిఫికేట్ అవసరమూ లేని గొప్ప మానసిక విశ్లేషకులు  ఈ విషయం లో !! ).
కొన్ని ఉదాహరణలు చూద్దాము.
నా హృదయం లో నిదురించే చెలీ, కలలలోనే కవ్వించే సఖీ !! మయూరి వై నీవే నటనమాడినావే, నన్ను దోచినావే ……!!,
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, పిలువక పిలిచే కనులలోన, నీ మనసు నాదనుకొంటి లే !!
కదిలీ కదలని లేత పెదవులా తేనెల వానలు కురిసేనులే !  రుస రుస లాడుతు, విసిరినా వాల్జడ, వలపు పాశమని తలచితిలే !!!
తొలివలపే, పదే పదే పిలిచే, మది లో తొందర చేసే !!!,
మనసు పరిమళించెనే, తనువు పరవసించేనే, నవ వసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!
రేపంటీ రూపం  కంటీ పూ వింటీ తూపుల వెంటా నా పరుగంటీ !!!,
మనసు పరవసించినే, తనువు పులకరించెనే , నవవసంత రాగము తో, నీవు చెంత నిలువగనే !!!,
తొలివలపే తీయనిది !, మది లో ఎన్నడు మాయనిది !!.
కనులు కనులతో కలబడుతుంటే, ఆ తగవుకు ఫలమేమి ?- కలలే, నాకలలో నీవే కనపడుతుంటే, ఆ చొరవకు బలమేమి ?, మరులే,  మరులు మనసు లో స్థిరపడితే ఆ పై జరిగిగేదేమి ?, మనువూ,
మనువై ఇద్దరు ఒకటైతే, ఆ మనుగడ పేరేమి ?, సంసారం !!
వలపు వలె తీయగా వచ్చినావు నిండుగా ! మెరుపు వలె తళుకు మని  మెరిసి పోయే తందుకా ?
దాచాలంటే దాగవులే, దాగుడు మూతలు సాగవులే, వలపుల సంకెల బిగిసే దాకా వదలను వదలను వదలనులే !!
చేను లో ఏముంది ? నీ మేను లో ఏముంది ? చేనులో బంగారం, నీ మేను లో సింగారం అంటూనే పాట చివర నేనులో నీవుంది, నీవులో నేనుంది అంటూ ప్రణయ ప్రపంచంలో ఐక్యమవుతారు ప్రేయసీ ప్రియులిద్దరూ ఈ ఆకర్షణ వలలో చిక్కి  !!
కన్నె పిల్లవని, కన్నులున్నవని , ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ?  !! చిన్న నవ్వు నవ్వి,  ఎన్నెన్ని కలలు రప్పించావే వయ్యారి !!, సంగీతం నువ్వైతే, సాహిత్యం నేనౌతా !!!
పదహారేళ్ళకు, నీలో నాలో,  ఆ ప్రాయం చేసే చిలిపి పనులకూ కోటి దండాలు !
వలపు ఏమిటి , ఏమిటి ఏమిటి ? వయసు తొందర చేయుట ఏమిటి ? మనసు ఊయల ఊగుట ఏమిటి ? ఎచట దాగెను రాగల పెనిమిటి?  అంటూ ఆమె మతి స్థిమితం కోల్పోయిన భ్రమరం లా  ఆడుతూ పాడుతుంది ఈ తొలి వలపు అనుభవాల ఉరవడి కోసం ఉబలాట పడుతూ !!
ఇలా తొలి వలపు, ఆకర్షణ తీవ్రత, ఎంతో బలంగా ఉండి  అతడి మనసునూ ఆమె మనసునూ ఆనంద  డోలలలో తేలించి ప్రణయ భావాలను మనసులో ఉప్పొంగ చేస్తుంది.
ఇక్కడ గమనించ వలసిన విషయాలు :
అతను సహజంగా ఎక్కువ చొరవ చూపి  ఆమె మీద తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు. తొలివలపు అంటే మొదటి దశలలో ఉండే ఆకర్షణ, మన సినీ కవులు రమ్యంగా వర్ణించి నట్టు, కనుల మీదా, పొందు మీదా , పెదవుల మీదా, వయసు మీదా, వయసు తో వచ్చే అందాల మీదా,  కేంద్రీకరించ పడ్డాయి. ఆమె చిరుకోపం తో తన వాలు జడను విసిరినా, దానిని, ఆమె ఆకర్షణ మోహంలో వలపు పాశం గా భావించుతూ, ఇంకా కవ్విస్తున్నాడు !!
ఇక ఆమె,  అత్యుత్సాహం తో పరవశించి పోతూ , అతనిని తన జీవిత సహచరునిగా ఊహించుకొంటూ, తమ ఇద్దరి పొందూ ఎంత అత్భుతంగా ఉంటుందో  అని స్వప్న మేఘాల పై తేలియాడు తుంటుంది.  ఆమె ప్రపంచం లో కేవలం ఆమె, అతడే !! ఆ క్షణాలలో ! ఇంకెవ్వరూ  ఆమె ఆలోచనలలోనూ, అనుభూతులలోనూ  ఉండరు ప్రముఖంగా !!
ఈ తొలి వలపుల ‘ సంకెల ‘  అంత బలీయమైనది అందుకే ! అంత నూతనమైనదీ, ప్రత్యేకమైనదీ నూ,  ప్రతి ఒక్కరికీ !!!
ఆకర్షణ గురించి మరికొన్ని ఆకర్షణీయ మైన విషయాలు వచ్చే టపాలో చదవండి !!
 ( ఈలోగా  మీ  ఈ టపా పై మీ అభిప్రాయం తెలియ చేయండి ! )

ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 1.

In Our Health on ఫిబ్రవరి 27, 2012 at 5:24 సా.
ఆకర్షణ, ప్రేమ , కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ – 1.
ఆకర్షణ :
ఆంగ్లం లో ‘ attraction ‘ , ‘ infatuation ‘ ,’ passionate , obsessive, or romantic love ‘ అని కూడా అంటారు. ఏ పేరు తో పిలిచినా ఆకర్షణ, కౌమారం  నుంచి మొదలై,  యువతీ యువకులు   స్త్రీ, పురుషులు గా ఎదిగాక కూడా ప్రతి ఒక్కరి జీవితం లో నూ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.
ఈ ఆకర్షణ ను ‘ కోరికల సుడిగాలి ‘ అనవచ్చు. ఇక్కడ కోరికలు అంటే, ఒకరి పొందు కోసం ఒకరు ‘ తహ తహ’ లాడటం, వారి స్పర్శ కోసమూ , ఆలింగనం కోసమూ తపించడం, వారితో సమయం గడపాలనుకోవటం, ఇలాంటివి. ఈ కోరికల ‘ సుడిగాలి ‘ లో పరవశించి, అత్యత్భుతమైన అనుభూతులు పొందని మానవులు ఈ ప్రపంచంలో  లేరంటే అతిశయోక్తి కాదు !!
జీవ పరిణామ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఒక సర్వే  లో ప్రపంచం లో వివిధ ప్రాంతాలలో   ఉన్న    ‘ 166 ‘ సంఘాలలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను అధ్యయనం చేశారు. ఆ సంఘాలలో ఎక్కువ శాతం ( 147 ) ఈ ఆకర్షణ ను వివిధ రూపాలలో వ్యక్తం చేశాయి. వారు వెతికిన ప్రతి సంఘం లోనూ, స్త్రీ పురుషులు ఆకర్షణను కేంద్రీకృతం చేస్తూ, ప్రేమ గీతాలు ఆలాపించటం, నృత్యం చేయడం, ప్రేమ రసం తయారు చేయటం ( అంటే ‘ love potions ‘ ), మొదలైన కార్యక్రమాలు చేసే వారు. దీనివల్ల ‘ ఆకర్షణ ‘ విశ్వ వ్యాప్త  మానవ అనుభూతి అని శాస్త్రీయం గా తెలిసింది.
మానవులలో నే కాదు, ఇతర స్తన్య జంతువులు  ( అంటే  mammals –  పిల్లలకు వారి స్తన్యం తో పాలు ఇచ్చి పెంచుతాయి కాబట్టి స్తన్య జీవులు అంటారు  )  పక్షులలో కూడా ఈ ఆకర్షణ గుణం ఉంటుంది.
జీవ పరిణామ పితామహుడు  డార్విన్  తన సహచరుడు బాతులలో గమనించిన ఒక సంఘటనను  ‘ 1871’ వ సంవత్సరం లో ఇలా వివరించాడు ‘  ఆ ఆడ బాతు, తన జాతి లో ఉన్న మగ బాతు తో పొందు మరచి పోయి, కొత్తగా వచ్చిన వేరే జాతి మగ బాతు చుట్టూ ఈదుతూ ,  ఆప్యాయం గా దాని పైన ఎంతో ఆసక్తి కన పరుస్తూ ఉంది ‘ ‘ అది మొదటి చూపులోనే ఉన్న ఆకర్షణ ‘.
డార్విన్ ఇంకా పరిశీలన చేసి  పక్షులు రంగు రంగుల ఈకలతోనూ , స్తన్య జంతువులు ఆకర్షణీయం గా కనపడటానికి రెండు కారణాలు చూపాడు. ఒకటి  తమ వ్యతిరేక లింగ పక్షుల తో సంపర్కం కోసం, రెండు, వాటిలోనే పోటీ పడి , పోట్లాడుకోవడం కోసం.( పోట్లాట లో నెగ్గిన వాటికి సంతాన ఉత్పత్తి కి  ఎక్కువ అవకాశాలు ఉంటాయి, జీవ పరిణామ రిత్యా !! ) ఈకారణాలు వాటిలో సంతానోత్పత్తి లక్షణాలు అభివృద్ధి చెందటం వల్ల కూడా. ( అంటే        ‘ secondary sexual characters ‘  అంటే బాల్యం నుంచి  కౌమారం దశ లో కి అడుగు పెట్టినప్పుడు ప్రతి వారి దేహం లోనూ వచ్చే  మార్పులు )
కానీ డార్విన్  తన కాలం లో వివరించలేక పోయిన  ఆకర్షణకు కారణమైన వివిధ జీవ రసాయన చర్యలు , డార్విన్ తరువాత జరిగిన  శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి లో  తెలిశాయి.
ఆకర్షణకు మూలమైన జీవ రసాయన చర్యలు తెలుసుకునే ముందు  ‘ ఆకర్షణ ‘ లక్షణాలు మనలో ఎలా ఉంటాయో  వివరం గా  వచ్చే టపా లో చూద్దాము !!
( మీకు తెలుసా :  బాగు డాట్ నెట్ ను మీరు గూగుల్ లో నేరు గా కూడా సర్చ్ చేసి చదవచ్చు  )

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – శాస్త్రీయ విశ్లేషణ.

In Our Health on ఫిబ్రవరి 26, 2012 at 7:25 సా.

ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ –  శాస్త్రీయ విశ్లేషణ.

 
ఆకర్షణ, ప్రేమ, కామ వాంఛ – ఇవి మానవ జీవితాలల్లో అతి ముఖ్య మైన అనుభూతులు.
మన జీవితాలల్లోని వేరు వేరు దశల్లో ప్రవేశించి,  మనలో పెన వేసుకు పోయి విడదీయరాని బంధాలు అవుతాయి మనకు.
ఈ అనుభూతుల ఉప్పెనలలో అలా తేలిపోతూ ఆనందించేవారు కొందరు,  కొట్టుమిట్టాడుతూ  జీవిత నౌకలో తికమక పడేవారు కొందరు, కొట్టుకు పోయే వారు ఇంకొందరు !.
ఈ అనుభూతులు సమ తుల్యం లో ఉంటే  అది సుఖ జీవన సోపానానికి నాంది అవుతుంది. 
తరచూ మనలో చాల మంది ఈ  సమతుల్యం ప్రాముఖ్యత తెలుసుకోలేము. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న యువతీ యువకులు. 
కేవలం అనుభూతుల లా కాకుండా శాస్త్రీయ మూలాల పైన పరిశోధనలు జరిగాయి, వీటి కదా కమామీషు తెలుసుకోడానికి.
వీటి ఫలితాలు తెలియ చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. 
ఇవి తెలుసుకోవడం అందరికీ అవసరమే,  ముఖ్యం గా  యవ్వనులకు ( టీనేజేర్స్ ) !.
 
ఆకర్షణ గురించి వచ్చే టపా లో చదవండి !

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 15 . స్మోకింగ్ కంట్రోలు లో యువత పాత్ర.

In Our Health on ఫిబ్రవరి 25, 2012 at 1:48 సా.

పొగాకు కు ఋణం – ప్రాణం  పణం . 15.  స్మోకింగ్ ఆపటం లో యువత పాత్ర. 

ఇంతవరకూ  పోస్టు చేసిన టపా ల లో  పొగాకు గురించీ , పొగాకు పీల్చటం వల్ల మానవులలో జరిగే హానీ, మానవులు పొగ పీల్చుతూ, తమ చుట్టూ ఉన్న వారికి చేసే హాని గురించీ చాలా వివరంగా చర్చించటం జరిగింది. ఇంకా ఏవైనా విషయాలు  ఏవైనా ముఖ్యమైనవి ఇక్కడ పొందు పరచనివీ ఉంటే దయచేసి తెలియ చేయండి.
నేను గమనించిన విషయం : మన దేశం లో  యువత  చాలా శక్తి వంతమైనది గా ఎదుగుతుంది.  అనేకమంది యువకులు, అత్యంత ప్రతిభా సామర్ధ్యాలు ఉన్నా , మన దేశం లో వివిధ సేవా సంస్థలను స్థాపించి, అనేక వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటూ, ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు.
అనేకమంది నిపుణులైన యువతీ యువకులు బహుళ జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ , కొందరు ఉద్యోగాలు త్యజించీ  తమకు తోచిన రీతిలో మానవ సేవ చేస్తున్నారు.
పొగాకు నిర్మూలనలో కూడా  మన  యువత పాత్ర ఎంతో ఉంది.
వివిధ పాశ్చాత్య దేశాలలో ప్రభుత్వాలు  పొగాకు అరిష్టాలు గుర్తించి, పొగాకు నిర్మూలనకు అనేక బిలియన్ల  డాలర్లు  ఖర్చు చేస్తున్నాయి. వారు కనిపెట్టి, ఉత్పత్తి చేసిన, చేస్తున్న సిగరెట్టులు చేస్తున్న  హాని వారినే  నిర్మూలిస్తూన్నందుకు చాలా ఆందోళన పడి అనేక చర్యలు తీసుకుంటున్నారు, వేగంగా.
ఇక మన దేశ పరిస్థితి: గత ఐదు సంవత్సరాలలో అక్షరాలా యాభయి వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, సహాయం మాట అటుంచి, కనీసం భారత పార్లమెంట్ లో చర్చ కూడా చేయలేదు ఇంతవరకూ అంటే మిగతా విషయాల పైన వారి ఉత్సాహం ఎంత ఉంటుందో ఊహించ వచ్చు.
అందులో పూర్తిగా స్వయంకృతమైన పొగాకు వాడకం మీద వారికి అంటే ప్రభుత్వానికీ , ‘ నాయకులకూ’ అసలే పట్టదు.
ఈ పొగాకు వాడకం వల్ల ఎక్కువ గా నష్ట పోయేది పేద ప్రజలే !  దానికి పేదరికం తో పాటు పొగాకు వల్ల కలిగే అనర్ధాలు వివరంగా వారికి తెలియని అజ్ఞానం వల్లనే.
ఇక్కడే మన యువత కర్తవ్యం  ఎంతో ఉంది. 
విజ్ఞానం కేవలం ఇంటర్నెట్ కో , గ్రందాలయాలకో , లేక విజ్ఞాన వంతుల మస్తిష్కాలకో పరిమితం కాకుండా నిజంగా కావలసిన వాళ్లకు పంచినప్పుడే దాని ప్రయోజనం.
అంకిత భావం కల విద్యావంతు లైన  యువత స్వయంగా కానీ, వివిధ సేవా సంస్థల లో చేరి  కానీ,   పొగాకు నిర్మూలనా యజ్ఞం లో భాగ స్వామ్యులు కావచ్చు.  వారం లో  కనీసం  ఒక రోజు మీరు పొగాకు నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టి  పేద ప్రజలకు పొగాకు అనర్ధాలు తెలిపి , వారిచేత పొగాకు వాడకం మాన్పిస్తే  అది మహత్తర కార్యం అవుతుంది.
రెండో ప్రపంచ యుద్ధం లో అణు బాంబు వల్ల మరిణించిన జపనీయులు  మూడు లక్షల మంది. కానీ  పొగాకు అనర్ధాల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  కనీసం ఒక లక్ష మంది  మరణిస్తున్నారు,  ప్రతి వారమూ అంటే ప్రతి ఏడు రోజులకూ   !!!  ( currently  one lakh people are dying every seven days  around the world due to  cigarette smoking . according to the world health organisation report )  అంటే పొగాకు వాడకం  ఒక నిశ్శబ్ద బాంబు . ఈ ‘ బాంబు ‘ అణు బాంబు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ఐతే ఈ ‘ బాంబు ‘  అతి నెమ్మది గా అనేక  లక్షలమంది చేత ‘ ఆత్మహత్య ‘ చేయించుతున్న  ‘ బాంబు ‘ !!! ఇతరుల ప్రమేయం లేకుండా !!!
క్రింద పొగాకు నిర్మూలన లో ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం కొన్ని వెబ్ సైట్లు పొందు పరచటం జరిగింది.
1.WWW.WHO.INT.tobacco/en.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెబ్సైటు. పొగాకు కంట్రోలు కు వివిధ కార్యక్రమాలు  పొందు పరచ పడ్డాయి ఇందులో.
2. http://www.ash.org.uk. ( action for smoking and health ) పొగాకు వాడకం  పైన అన్ని వివరాలూ ఉన్న ఇంకో మంచి సైటు.
3. http://www.quit. org.uk ( quit organisation UK ) పొగాకు మానేద్దాము అనుకునేవారికి అన్నివిధాలా సహాయం చేసే  వెబ్సైటు.
4.www.tobaccocontrolgrants.org.  అమెరికన్ దాత ,  ‘ న్యూ యార్క్ మహానగర మేయరు అయిన  మైకేల్ బ్లూం బర్గ్ నెలకొల్పిన సేవా సంస్థ. ప్రధానం గా ఆయన దానం చేసిన నిధితో స్థాపించ పడ్డ సంస్థ. అంకిత భావమూ , ఉత్సాహమూ, పట్టుదలా, క్రుతనిశ్చయాలు కల యువతీ యువకులు. ఈ వెబ్సైటు కు వెళ్లి నేరుగా అప్లై   చేయవచ్చు,  గ్రాంటు కోసం.
మీకు తగిన ప్రావీణ్యత కూడా ఇస్తుంది ఈ సంస్థ, ఉచితంగా.  వారు నడిపే ఆన్ లైన్ కోర్సు  పూర్తిచేసి,  ( ఇది కూడా ఉచితమే ) పొగాకు కంట్రోలు కార్యక్రమం లో క్రియా శీలురవచ్చు ఎవరైనా !! .  ఈ సంస్థ ఆశయం  ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొగాకు వాడకం వీలైనంత తగ్గించాలనే. అందు వల్ల మీకు అవకాశాలు ఎక్కువ, తగిన అర్హతలు ఉంటే !! ప్రయత్నించండి.
ప్రపంచ చరిత్రలో అనేక మంది లో మార్పు తెచ్చింది అతికొద్ది మంది మానవులే కదా !!!  మీలో ఆ కొద్ది మంది ఉన్నారని నా సంపూర్ణ విశ్వాసం !!!
TRASH CIGARETTES !!! BEFORE THEY trash  (Y)OUR LIVES !!!
( TRASH =  Think Rationally And Stop Harming – yourselves and others )
 అత్యంత ప్రతికూల పరిస్థితులలో ,  కృతనిశ్చయం లో తన లక్ష్య నిర్దేశనం చేసికొని విజయానికి  అత్యున్నత శిఖరాలు అందుకొని , ఇటీవలే మరణించిన  యాపిల్ కంపెనీ అధినేత యువతకు ఇచ్చిన స్ఫూర్తి దాయకమైన  సందేశం చూడండి ! ఇందులో మన హిందూ వేదాంత ధోరణి కూడా సమ్మిళితమై ఉంది కదా !!!
 
ఈ   టపా   గురించి మీ అభిప్రాయాలు తెలుపండి !!!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 14. పొగాకు అలవాటు మానించే మందులు ఎట్లా పని చేస్తాయి?

In Our Health on ఫిబ్రవరి 23, 2012 at 6:25 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 14. పొగాకు అలవాటు మానించే మందులు ఎట్లా పని చేస్తాయి?
ఇంతవరకూ టపా లలో  పొగాకు పీల్చడం మనలో తెచ్చే విషాదకర పరిణామాలు ఎట్లా ఉంటాయో రాత పూర్వకంగానూ, వీడియో ల ద్వారానూ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను.
మీ అభిప్రాయాలను స్వేఛ్చ గా తెలపండి, అవి మంచివి అయినా, కాక పోయినా. అట్లాగే ఏవైనా  సాంకేతిక పరమైన లోపాలు ఉన్నా తెలియచేయండి, దయ చేసి.
ఇప్పుడు పొగాకు మానించే మందుల గురించి కొంత తెలుసుకుందాము.
ఇవి రెండు రకాలు.
1. నికోటిన్ రేప్లస్మేంట్ మందులు :
ఇవి, నోట్లో పెట్టుకుని చప్పరించే గం లేక బిళ్ళల  లాగా, ముక్కులో స్ప్రే చేసుకునే ఇన్హేలర్  లాగా , చర్మము మీద రోజూ అతికించుకునే ప్యాచ్ ల లాగా  మార్కెట్ లో లభ్యం అవుతాయి.
ప్రధానంగా వీటి ఉపయోగం, పొగాకు మానేశాక  వెంటనే  సాధారణం గా కలిగే క్రేవింగ్ లు (  క్రేవింగ్ గురించి  క్రితం టపా లో చదివారు కదా ! ) తగ్గించడానికి.
కొన్ని వారాలు, కనీసం వీటిని వాడుతూ క్రమంగా తగ్గించి ఆపెయ్యడం ఒక పధ్ధతి.
వీటి ఉపయోగం మీద చాలామంది  నిపుణులు సందేహాలు వ్యక్తం చేసారు. ఇటీవలి ఒక పరిశోధనలో కూడా ఈ  నికోటిన్ రిప్లస్మేంట్ మందులు, ఏ మందులూ తీసుకోకుండా పొగాకు మానేసిన వారితో పోలిస్తే ఏమాత్రమూ ఎక్కువ లాభాకారిగా లేవు అని తేలింది.
పైగా డబ్బు దండగ !!! ఇంకోవిధంగా చెప్పాలంటే ఇక్కడ కూడా మీరు  నికోటిన్ కు ఋణం ఉంటారు. మీకు డబ్బు బాగా ఉంటే, ఒక ఖచ్చితమైన పధకం తో వీటిని  తీసుకొని క్రమం గా మానేస్తే వాటి లక్ష్యం, మీ లక్ష్యం నెర  వేరినట్లే కదా !!!.
2. నికోటిన్ తో సంబంధం లేకుండా  క్రేవింగ్ తగ్గించే మందులు :
ఇవి బ్యూప్రోపియోన్ , వెరినిక్లిన్ అనే మందులు. ఇవి ప్రధానంగా క్రేవింగ్ తగ్గించే మందులు. వీటిని కనీసం ఒకటి రెండు వారాల ముందు నుంచే మొదలు పెట్టి ( పొగాకు మానేసే రోజుకు  ముందన్న మాట ) కనీసం ఆరు నెలల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈమందులు ఏవీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు కదా !!
మీ కృత నిశ్చయము అన్నిటికంటే మించిన మందు. ఎందుకంటే అది మీ మెదడు లోతులు అనండి , మీ హృదయపు లోతులు అనండి, అక్కడ నుంచి వస్తూంది. అదే  మీ అలవాటు లో మార్పుకు పునాది. కృత నిశ్చయం లోపించినప్పుడు, ఎన్ని మందులు తీసుకున్నా,అవి పని చెయ్యవు సరి కదా, మీకు ఆర్ధికంగా ఇంకో భారంగా పరిణమించవచ్చు.
మీరు పైన తెలిపిన వాటిలో ఏవి వాడుదామని అనుకున్నా, వైద్య నిపుణుడి  ని సంప్రదించి   సైడ్ ఎఫ్ఫెక్ట్స్ , లాభాలు వివరంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోండి !!!.
 
తరువాతి టపాలో  పొగాకు మాన్పించడం లో యువత పాత్ర గురించి చదవండి !!!

పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 13. పొగాకు మానేశాక, క్రేవింగ్ లు ‘ cravings ‘ వస్తే ఏంచేయాలి ?

In Our Health on ఫిబ్రవరి 22, 2012 at 9:23 సా.
పొగాకు కు ఋణం – ప్రాణం పణం. 13. పొగాకు మానేశాక,    క్రేవింగ్ లు ‘ cravings ‘  వస్తే  ఏంచేయాలి ?  
పొగాకు క్రేవింగ్  అంటే  రోజూ  ముప్పయ్యో , నలభైయ్యో , సిగరెట్టులు పీల్చి పారేసే వారిలో ఒక్కసారి గా పొగాకు  ( పీల్చడం ) మానేసిన మొదటి రోజుల్లో వచ్చే సైడ్ ఎఫ్ఫెక్ట్స్.
ఈ క్రేవింగ్ గురించి ఎంత మాత్రమూ భయ పడనవసరం లేదు. ఎందుకంటే ఒక సారి వాటి గురించి తెలుసుకున్నాక  చాలా శులభంగా వాటిని మానేజ్ చెయ్యగలరు ఎవరైనా !!
తెలియనప్పుడు ఏదో ఉత్కంథత ఉంటుంది, ఆందోళనా, భయమూ ఉంటాయి. మీరు క్రేవింగ్ లక్షణాల గురించి తెలుసుకున్నాక  ‘ ఇంతేనా ‘ అనిపిస్తుంది.
క్రేవింగ్ గురించి ఎప్పుడు తెలుసుకుందాము.
క్రేవింగ్ అంటే ‘ అదే ‘  కావాలనే తపన, ‘ అది’  పొందలేక పోతున్నందుకు  మనసులో , శరీరంలో వచ్చే తాత్కాలిక మార్పులు. ఆ ‘ అది ‘ సిగరెట్టే కావచ్చు, ఆల్కహాలే కావచ్చు, లేక మాదక ద్రవ్యాలే కావచ్చు ,  ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ఆ యా పదార్ధాలను మొదట మన శరీరం రుచి చూసి ఉంటుంది. అంటే మన మెదడు లో  ఉండే నాడీ కణాలు ఆ యా పదార్ధాలకు కనీసం కొన్ని రోజులో , వారాలో అలవాటు పడి ఉంటాయన్న మాట. ఈ క్రేవింగ్ నే  ‘ withdrawal symptoms ‘ అని కూడా అంటారు.
పొగాకు క్రేవింగ్ లో ఈ మార్పులు పలు విధాలుగా ఉండవచ్చు.  గుండె వేగంగా కొట్టుకోవడము,  రక్త పీడనం ఎక్కువ అవటము,  ఎక్కువ స్వేదం పట్టటము, నిద్ర లేమి, ఆందోళన అధికం అవటము, డిప్రెషన్ అనిపించటం , చిన్న విషయాలకు కూడా చీకాకు పడటము, కోపము, చుట్టూ ఉన్న వారిమీద  ఆ కోపము అకారణంగా చూపించడమో, ఇవన్నీ  క్రేవింగ్ లక్షణాలే !!!
ఈ క్రేవింగ్ కు కారణము, మన మెదడు లో ఉండే అనేక రకాల  నాడీ గ్రాహకాలకు అంటే ‘ receptors ‘ కు  అంత వరకూ  ఒక క్రమమైన డోసు లో అందు తున్న  నికోటిన్ అందకపోవడమే !
ఇలాంటి లక్షణాలు అనుభవం లోకి వచ్చినప్పుడు ముఖ్యం గా మీకు వీటి గురించి ముందు గా  అవగాహన ఉంటే  మీరు ఆందోళన పడకుండా వాటిని ఎదుర్కోవడానికి సన్న ద్దులు అవగలరు.
ఇక వాటిని ఎట్లా ఎదుర్కోవాలో చూద్దాము ఇప్పుడు:
మీలో భౌతికంగా వచ్చే మార్పులు:
ఎక్కువ గా చెమట పట్టడం, ఎక్కువ ఆకలి వేయటం,  నిద్ర తగ్గిపోవటం, గుండె వేగం గా కొట్టుకోవడం; ఈ లక్షణాలు  రెండు మూడు పర్యాయాలు చల్ల నీళ్ళతో నైనా , గోరు వెచ్చటి నీళ్ళ తో నైనా స్నానం చెయ్యటం,  ఎక్కువ సార్లు  రుచికరమైన ఆహారం తక్కువ మోతాదు లో ( small quantities ) తింటూ ఉండటం,  ప్రశాంతంగా నిద్ర పోవటం, ఇలాంటి చిట్కాల తో సరి చెయ్య వచ్చు.
ఎక్కువ గా సిగరెట్టు పీలుద్దామని అనిపించినప్పుడు, నోట్లో ఒక చూఇంగ్ గం నో పెప్పర్ మింటో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండవచ్చు.
ఇక మానసికం గా వచ్చే మార్పులు :
 ఎవరికి వారు మనసులో  పదే పదే ‘ నేను సిగరెట్టు మానేశాను ‘ మళ్ళీ తాగాను కాక తాగను,  ‘ నేను ఇప్పుడు స్మోకర్ ను కానే కాదు ‘ అని అనుకుంటూ ఉండాలి.
ఆందోళనా , టెన్షన్  ఎక్కువ గా ఉన్నప్పుడు, దీర్ఘ ఉచ్వాస, నిశ్వాస లు తీసుకుంటూ ఒకటి నుంచి పది లేక మీ ఇష్ట దైవాన్నో పది సార్లు ప్రార్ధన చేసుకోవడమూ చేస్తూ ఉండాలి.
మీరు పదే పదే గుర్తు చేసుకోవలసింది ఇంకోటి కూడా ఉంది. అది  ‘ ఈ క్రేవింగ్ లు  ఖచ్చితంగా తాత్కాలికమే , కొన్ని రోజులలో మటుమాయం అవుతాయి ‘ అనే యదార్ధం!!
అగరు వత్తులు, క్యాండిల్ వెలిగించి మీరు ఉంటున్న చోట సిగరెట్టు వాసనకు బదులు, వాటి సుగంధాలను వాసన చూడండి, మీకు సిగరెట్టు వెలిగించాలని తీవ్రమైన కోరిక కలిగినప్పుడు.
సిగరెట్టు పీల్చాలని అనిపించినప్పుడల్లా మీరు సిగరెట్టు వల్ల కలిగే, ఇంతకు ముందు తెలుసుకున్న విషాదకరమైన అనర్ధాలన్నీ సినిమా లో రీళ్ల లాగా మననం చేసుకోండి. గుర్తుకు తెచ్చుకోండి. అందు వల్లనే కదా నేను  చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు ఈ బ్లాగు లో ఉంచినది !!! అవసరమనుకుంటే వాటిని వల్లె వేయండి ( learn by heart ).అవి మీ ఆరోగ్యాన్ని కాపాడ గలిగే ఆణి   ముత్యాలు !!!
వచ్చే టపాలో పొగాకు మాన్పించే మందుల గురించి తెలుసుకోండి !!