Our Health

Archive for the ‘Our minds’ Category

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే !.1.

In మానసికం, Our minds on జూలై 8, 2012 at 9:41 ఉద.

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం  మంచిదే ! 1.

పిచ్చి – మనం సాధారణం గా వాడే పదం. దీనినే ఆంగ్లం లో మానియా అంటారు. మనం నిత్య జీవితం లో అనేక మంది ని చూస్తూ ఉంటాము.’ ఆవిడ గారి కేదో పిచ్చి లా ఉంది ‘ , లేదా ‘  ఆయన కేదో పిచ్చి అనుకుంటా !’, ‘ వీడికేదో  పిచ్చి ముదిరినట్టుంది ‘  అని. పిచ్చి చాలా రకాలు గా ఉంటుంది. మనం ఏ దుకాణానికైనా  వెళ్ళినప్పుడు  మనకు కావలసిన వస్తువు ధర విని అది ఎక్కువ గా ఉంటే ‘ నేనేమైనా పిచ్చివాడిననుకున్నావా ? ‘ అని అచ్చ తెలుగులోనో లేదా ‘ ముజే పాగల్ సంజా క్యా ? ‘  అని హిందీ లోనో అడుగుతాము షాపు వాడిని ! 
అందుకే  స్వర్గీయ డాక్టర్ భానుమతి గారు కూడా ‘ పిచ్చి పిచ్చి , పిచ్చి , రక రకాల పిచ్చి , ఏ పిచ్చీ లేని వారికి , అది అచ్చ మైన పిచ్చి ‘ అని ఒక చిత్రం లో పాడారు !  ప్రేమ పిచ్చి లో పడ్డ వారు కూడా వారు ప్రేమ లో విఫలం అవుతున్నా , లేదా అయితే కానీ , పిచ్చి గా ప్రవర్తిస్తారు. అంటే ఇక్కడ ప్రేమ లో పడితే ఒక రకం గానూ , ప్రేమ విఫలం అయితే ఇంకో రకం గానూ ఉంటుందన్న మాట పిచ్చి ! నాగేశ్వర రావు గారు ఇంకో చిత్రం లో పాడిన పాట లో ‘ ఏమనుకున్నావు ?, నన్నేమనుకున్నావూ ? , పిచ్చి వాడిననుకున్నావా ? ప్రేమ బిచ్చ గాడిననుకున్నావా ? ‘అని నిలదీసి తన ప్రేయసిని అడగటం  మీకు గుర్తుండే వుంటుంది. 
కొందరు బట్టలు విపరీతం గా కొంటూ ఉంటారు. ఇల్లంతా నిండి పోతున్నా మానరు. పాశ్చాత్య దేశాలలో అయితే దీనికి ఏకం గా రిటైల్ తిరపీ అని పేరు కూడా పెట్టారు. అంటే, మనసు బాగో లేనప్పుడు , షాపుల్లో పడి , కనిపించిన వస్తువులను, అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం ! ఇక్కడ కొనేయడం పిచ్చి గా ఉంటుంది. ఇంకొందరికి సినిమాలో  శ్రేయ అందాలో , లేదా ఇలియానా (  ఏంటో షామియానా , ఇగువానా లా ఉంది పేరు ! ) అందాలో చూస్తున్నప్పుడు ఉండే( ఉండే అనడం కన్నా వచ్చే అంటే సమంజసం గా ఉంటుందేమో ! ) పిచ్చి ఒకలా ఉంటుంది. ఇంకో రకం పిచ్చి లో సినిమా లో అభిమాన  హీరో , ఓ పది మంది విలన్లను ఎడా పెడా కొట్టి , పది సెకన్లలో మట్టి కరిపిస్తే ‘ పిచ్చి గా కొట్టేశాడు ‘ అంటారు.  ఇంకో రకం ,  ! ఇంకొందరికి కనపడ్డ వారికల్లా ‘ సుత్తి వేలు ‘ లా ‘ సుత్తి కొట్టే పిచ్చి ! ఇంకొందరికి , ప్రపంచం లో ఏమి జరుగుతున్నా ‘ మూతి కి సీలు వేసినట్టు ‘ మౌనం వహించడం ఒక రకమైన పిచ్చి ! ఇంకొందరికి తాగి తందానాలాడడం పిచ్చి ! కొందరు బాసులకు,  ఆఫీసులో అందరి మీదా చిందులు వేయడం పిచ్చి ! 
మరి ఇంత తేలిక గా , తరచూ  ఉపయోగించే  ‘ పిచ్చి ‘ పదం,  శాస్త్రీయం గా ఏమిటి ? మన మెదడు లో ఏమి జరిగితే ‘ పిచ్చి ‘ గా పరిణమిస్తుంది ? ఈ ‘ పిచ్చి ‘ పరిణామాలేంటి ? మరి  చాటు మాటు గా కనిపించే ‘ పిచ్చి ‘ ని గుర్తించడం ఎట్లా ? ఇంకా  ‘ పిచ్చి ‘ చికిత్స , పిచ్చి నివారణ ఎట్లా చేయవచ్చు ? ఈ విషయాలన్నీ వివరం గా తెలుసుకుందాము వచ్చే టపా నుంచి  ‘ పిచ్చి ‘ గా ! ( కంగారు పడకండి , నేను ‘ పిచ్చిగా ‘ రాయను లెండి , ఒక వేళ అట్లా  అనిపిస్తే ,  నాకు తెలియ చేయండి ! ) 

అసాంఘిక వ్యక్తిత్వం. 11.

In మానసికం, Our minds on జూలై 6, 2012 at 10:29 సా.

అసాంఘిక వ్యక్తిత్వం. 11.

( పైన ఉన్న రెండు స్కాన్ చిత్రాలలో మొదటిది నార్మల్ మెదడు. రెండవది అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారిది. దానిలో కేవం సెప్టం పెల్లూసిడం అనే ఒక మార్పు శాస్త్రజ్ఞులు గమనించారు. ) 
అసాంఘిక వ్యక్తిత్వం లేదా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్,  మానసిక రుగ్మతలు ఉన్న వారిలో మూడు నుంచి ముప్పై శాతం వరకూ కనిపిస్తుంది. మనం ఈ వ్యక్తిత్వం ఉన్న వారిని భారత దేశం లో సాధారణం గా ప్రతి చోటా చూస్తూ ఉంటాము. అంటే మనం ఎక్కడైనా క్యూ లలో నుంచుని ఉన్నప్పుడు , బస్ స్టాప్ లో నూ , సినిమా థియేటర్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద , ఇట్లా ఏ ప్రదేశం లోనైనా కనిపిస్తారు , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు . ‘ పదండి ముందుకు , పదండి  ముందుకు , పోదాం , పోదాం పై పై కి ‘ అని అన్న శ్రీ శ్రీ వాక్యాన్ని ఎట్టి పరిస్థితి లో నైనా ఆచారించాలనే కంకణం కట్టుకుంటారు వీరు. వీరు వెనక ఎక్కడో ఉన్నా, ముందు ఒక వంద మంది ఉన్నా లెక్క చేయకుండా , అతి లాఘవం గా గంటల తరబడి క్యూ లలో వేచి ఉన్న వారిని ఏమాత్రం లెక్క చేయకుండా ,  ముందుకు దూసుకు పోయి, క్యూ లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటూ , అభ్యంతర పెట్టిన వారిని డేగ కన్ను తో చూస్తూ , తమ పని జరుపు కుంటారు. ఈ  నీటి ఎద్దడి సందర్భం గా , నీళ్ళ ట్యాంకు సరఫరా చేస్తున్న సమయం లో కూడా , ఈ అసాంఘిక  వ్యక్తులు , ( ఇక్కడ లింగ భేదం లేక పోవడం స్పష్టం గా కనిపిస్తుంది ! ) వారి బిందెల తోనూ , బకెట్ల తోనూ చేసే ఘర్షణ,  చూడలేక , పడలేక  వాటర్ ట్యాంకు లోనుంచి ఏక ధారగా గంగా భవానీ,  కన్నీరై , నేలమీద వృధాగా జాలువారుతుండడం  కూడా మనకు సామాన్యం గా దర్శనీయమే ! ఈ సందర్భాలలో సామ, దాన , భేద , దండోపాయాలను , మానవులు, అంటే వివిధ వ్యక్తిత్వాలు ఉన్న మానవులు ఎట్లా ఉపయోగిస్తారో కూడా మనకు తెలియనిది కాదు. ఇక సిటీ బస్సులలో ,  రైళ్ళలో ప్రయాణం చేసే సమయం లో కూడా , ఈ రకమైన వ్యక్తులు పుష్కలం గా తారస పడుతుంటారు మనకు. ఇక బందులు, రాస్తా రోకో లు జరిగినప్పుడు వీరు చేసే ‘ తాండవం ‘ అంతా ఇంతా కాదు , ప్రతి దుకాణానికీ ఒక్కొక్కరూ తమకన్నా కాస్త పొడవాటి దుడ్డు కర్రలతో  వెళ్లి , నానా హంగామా చేసి , షట్టర్లు మూయించి వేస్తారు వీరు. రాస్తా రోకో లు జరిపినప్పుడు కూడా , అనేక మంది అమాయక ప్రజలు విపరీతం గా, నానా రకాలు గా అవస్థలు పడుతుంటే , ఈ వ్యక్తిత్వం కలవారు , కాలర్లు ఎగరేసుకుని , మనకు స్వాతంత్రం సముపార్జించినంత విజయ గర్వం తో తిరుగుతూ కనిపిస్తారు. ఇక ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారి లక్షణాలు ఇక్కడ నామ మాత్రం గానే మీకు వివరించడం జరుగుతుంది, ఎందుకంటే మీకు ఈ వ్యక్తిత్వం ఉన్న వారు తరచూ తటస్థ పడుతూ ఉంటారు కదా ! 
1.వీరు ఇతరుల చట్ట బద్ధమైన హక్కులు ఏమాత్రం గుర్తించడం కానీ , గౌరవించడం కానీ చేయరు. అంతే కాక, పదే పదే , తమను , అరెస్టు చేయదగిన తప్పిదాలు చేస్తూ ఉంటారు.
2. సమాజం లో సామాన్యం గా అమలు చేస్తున్న కట్టుబాట్లను కాల రాస్తూ ఉంటారు. 
3.వారి స్వంత లాభాలకూ , స్వార్ధానికీ , వారి పేరును మార్చుకోవడానికీ , అబద్ధాలు చెప్పడానికీ, మోసాలు చేయడానికి  కూడా వెనుకాడరు. 
4.ఇతరుల భద్రత మీద కూడా వీరికి ఏమాత్రం పట్టదు. తాగి కార్లు , బస్సులు నడిపే వారు ఈ కోవకు చెందుతారు.  
5. తరచూ చీకాకు పడుతూ , విసుగు చెందడం, పట్టరాని కోపం క్షణాలలో రావడం కూడా వీరి లక్షణాలు.
6.ఒక స్థిరమైన బాధ్యతా రహిత జీవితాలు గడుపుతూ ఉంటారు వీరు. అంటే తీసుకున్న అప్పులు ఎగ కొట్టడం , అమాయకులకు టోపీ పెట్టడం , ఉద్యోగం సరిగా చేయక పోవడం లాంటివి.
7. ఇంకో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే , ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారు చేసే నీచమైన , కుటిలమైన పనులు, అన్నీ తెలిసి కూడా చేస్తూ ఉంటారు అంటే, అజ్ఞానం తో కాదు. అంతే కాక వీరికి వీరు చేసే పనుల గురించి కానీ , పరిణామాల గురించి కానీ , ఏమాత్రం చీకూ , చింతా , అపరాధ భావనా ఉండవు. దీనినే రిమోర్స్ లేకపోవడం అంటారు.
ఈ అసాంఘిక వ్యక్తిత్వం ఉన్న వారి  ‘ ఆధునిక  మహా ప్రస్థానం ‘  చదవండి: 
 
కూలీ కూడు,
సిపాయి గూడు, 
గనిలో ఇనుము,  
జనం ధనము, 
రైతు  పొలం,
‘మందు’ బలం 
నోటుకు ఓటు,
పదవుల  ‘ మాటు ‘ 
బ్యాంకుల స్క్యాము ,
సాగని స్కీము,
ఎంతో  ద్రోహం !,
అయినా తీరని  దాహం !
కాదేదీ  స్వాహా కనర్హం!
ఔనౌను మోసమనర్ఘం ! 
 
 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 
 

బార్డర్ లైన్ వ్యక్తిత్వం. 10.

In మానసికం, Our minds on జూలై 5, 2012 at 8:24 సా.

బార్డర్ లైన్ వ్యక్తిత్వం. 10.

బార్డర్ లైన్ వ్యక్తిత్వం పాశ్చాత్య దేశాలలో రెండు శాతం ఉంది. అంటే ప్రతి వంద మంది లోనూ , ఇద్దరు ఈ రకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీనిని గురించి మనం తెలుసుకునే ముందు ఈ వ్యక్తిత్వం ఎందుకు అలవడుతుందో తెలుసుకుంటే, దాని అవసరం కూడా మనకు  బోధ పడుతుంది. 
బార్డర్ లైన్ వ్యక్తిత్వానికి మూల కారణాలు ఏమిటి ?: మిగతా మానసిక వ్యాధుల లాగానే , ఈ వ్యక్తిత్వానికి కారణాలు కూడా , ఇత మిద్ధం గా చెప్పలేని , క్లిష్టమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యం గా బాల్యం లో అనుభవమయే  క్లిష్ట పరిస్థితులు,  అంటే దురానుభావాలు , బాల్యం లో ఉన్న చిన్నారులను తీవ్రం గా కలత చెందించే సంఘటనలు ,తల్లి తండ్రులు తమ పిల్లలను సరిగా చూసుకోక పోవడమూ , వారి పెంపకం లో తీవ్రమైన అశ్రద్ధ చేయడమూ, లేక బాల్యం లో  వారు , ఎవరి చేతనైనా , మానసికం గా కానీ , భౌతికం గా కానీ , లేదా కామ పరం గా కానీ హింసించ బడడం. ఈ కారణాలన్నీ ,వారు పెరిగి పెద్దయిన తరువాత , బార్డర్ లైన్ వ్యక్తిత్వం ఏర్పడడానికి దోహదాలు.  కొంత వరకూ , వారి జన్యువుల అంటే జీన్స్ లో లోపాలు ఉన్నా, లేదా , పరిసరాల ప్రభావం వల్ల , లేదా మెదడు లో సహజం గా ఉండే జీవ రసాయనాల సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ రకమైన వ్యక్తిత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 
 ఈ వ్యక్తిత్వం భారత దేశం లో వారు, ముఖ్యం గా తల్లి దండ్రులు ఎందుకు తెలుసుకోవాలి ?: 
పాశ్చాత్య నాగరికత , మన దేశ నాగరికతా పునాదులను కదిలిస్తూ ఉంది. వేగం గా జరుగుతున్న ప్రపంచీకరణ కూడా ఇందుకు కారణం. యుక్తా యుక్త విచక్షణ లేకుండా , మన భౌతిక అవసరాలతో పాటు , మన ఆలోచనలను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఓపెన్ మైండ్ దృక్పధం మంచిదే కానీ , దురలవాట్ల కూ , చెడు ఆచార వ్యవహారాలకు కూడా ఓపెన్ మైండ్ ఉండడం సమంజసం కాదు. కానీ ఇదే ప్రస్తుతం జరుగుతుంది, భారత దేశం లో! దీని పరిణామాలు మన సాంఘిక కట్టు బాట్ల మీద, కుటుంబ వ్యవస్థ మీదా పడుతున్న్నాయి. పర్యవసానం గా పిల్లలు, అశ్రద్ధ చేయ పడడమూ , గృహ హింస , లేదా అబ్యూజ్ కు గురి అవడమూ తరచూ జరుగుతున్నాయి. ఈ టపా రాస్తున్న సమయం లోనే ఎన్డీ టీవీ లో ఒక వార్త ! మన ఆంద్ర ప్రదేశం లో ఒక తల్లిదండ్రుల జంట తమ కూతురు ( ఒక బాలిక ) ను పది వేల రూపాయలకు అమ్మితే ఆ బాలికను కొన్న వారు , ఆ అమ్మాయిని చిత్ర హింస కు గురి చేసి , ఆ తరువాత ఆమెను కాల్చి వేసి, ప్రాణం తీశారని. మనం అప్పుడప్పుడూ వింటున్న, లేదా చూస్తున్న వార్తలు కేవలం ‘  టిప్ అఫ్ ది ఐస్ బర్గ్ ‘మాత్రమె !  పాఠం ఏమిటంటే , బార్డర్ లైన్ వ్యక్తిత్వం ఏర్పడడానికి అవసరమయే అన్ని పరిస్థితులూ మన భారత దేశం లో పుష్కలం గా ఉంటున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కూడా ! దానితో ఈ వ్యక్తిత్వం ఉన్న వారు కూడా రానున్న తరం లో ఎక్కువ అవుతారనడం లో  సందేహం లేదు. 
మరి ఈ వ్యక్తిత్వ లక్షణాలు ఎట్లా ఉంటాయి?:
1. వారికంటూ ఒక వ్యక్తిత్వం లేక పోవడం.2. తమ నిజ జీవితం లో కానీ , ఊహా జీవితం లో కానీ, ఎడబాటు ను, ఎట్టి పరిస్థితులలోనూ సహించ లేక పోవడం. 3.దీర్ఘ కాలం గా తమలో ఏదో అసంతృప్తి, వెలితి అనుభవిస్తూ ఉండడం. 4.ఎమోషనల్ గా అంటే భావావేశాలు ఒక సమతుల్యం లో లేక పోవడం దీనినే ఎమోషనల్ లెబిలిటీ అంటారు. 5. ఇంపల్సి విటీ అంటే  దుడుకు స్వభావం అంటే వెనకా ముందూ ఆలోచించ కుండా , ఏ క్షణం లో ఏ ఆలోచన మెదిలినా వెంటనే  ఆ పని చేయడం.( ఉదాహరణకు , దుర్వ్యసనాలకు ఏ మాత్రం విచక్షణ లేకుండా అలవాటు పడడం, లేక అలవాటు చేసుకోవడం , కామ పరం గా కూడా విశృంఖలం గా ప్రవర్తించి, ఒకరి కంటే ఎక్కువ మంది తో కామ పరం గా సంబంధాలు ఏర్పరుచు కోవడం ).  6. చీటికీ మాటికీ చీకాకు పడడం, కోపం తెచ్చుకోవడం. 7. ఇతరుల మీద సదభిప్రాయం లేక పోవడం , లేదా ఇతరులను విపరీతం గా అనుమానించడం, అంటే పారనాయిడ్ ఫీలింగ్స్ ఉండడం. 8. స్వీయ హింస, అంటే , నిద్ర టాబ్లెట్ లు మింగి కానీ , చేతులు కోసుకోవడం కానీ చేసుకొని , ప్రాణాల మీదకు తెచ్చుకోవడం , అంతే కాక ప్రాణాలు కూడా తీసుకునే ప్రయత్నాలు చేయడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

హిస్త్రియోనిక్ వ్యక్తిత్వం.9.

In మానసికం, Our minds on జూలై 4, 2012 at 10:19 ఉద.

హిస్త్రియోనిక్  వ్యక్తిత్వం.9.

Histrionic Personality Disorder ( HPD ): ఈ వ్యక్తిత్వం కల వారిని మన జీవితాలలో తరచుగా చూస్తుంటాము. వీరు కనీసం ప్రతి వంద మంది లో ముగ్గురు  ఉంటారు. వీరు సాధారణం గా సమాజం లో ఉన్నత మైన పదవులలో స్థానాలలో ఉంటారు. అంతే కాకుండా వీరు తమ తమ రంగాలలో విజయ వంతంగా తమ ప్రతిభా పాటవాలను చూపిస్తూ ఉంటారు. అంటే వారు అధిక సామర్ధ్యం కలిగి ఉంటారు.  వీరిలో ప్రధాన లక్షణం  అత్యధికం గా ఎమోషనల్ గా ఫీల్ అవడం అంటే వారి భావావేశాలను ఎక్కువగా పొందడం, అంతే కాక వాటిని నలుగురిలో ఏ విధమైన బిడియం లేకుండా చూపించడం. ఈ భావావేశాలు ఆనంద కరమైనవి, ఉద్రేక పూరితమైనవి, లేదా కామ పరమైనవి కూడా కావచ్చు. వీటన్నిటినీ ఈ వ్యక్తిత్వం కల వారు ఏ మాత్రం సంకోచం లేకుండా అందరిలో బహిర్గతం చేస్తుంటారు.ఈ రకమైన వ్యక్తిత్వం ఒక పురుషుడిలో ఉంటే , నలుగురు స్త్రీలలో ఉంటుంది. అంటే స్త్రీలలో నాలుగు రెట్లు, పురుషులకంటే అధికం గా ఈ వ్యక్తిత్వం ఉంటుంది. వీరు నిరంతరం ఇతరుల కళ్ళలో పడాలని తాపత్రయ పడుతూ ఉంటారు. అంటే ఇతరులు వారిని సదా పరిశీలిస్తూ వారి ప్రవర్తన, వేష భాషలలో ఉత్సాహం చూపాలని ఆశిస్తూ ఉంటారు. నిరంతరం ఏదో ఒక ప్రేరణకు అంటే స్టిమ్యులస్ కోసం వెదుకుతూ ఉంటారు. 
వీరు తమ వేషం అంటే వస్త్ర ధారణా , మేకప్ ఈ విషయాలలో మిగతా మిగతా సామాన్య స్త్రీల కంటే  ఆకర్షణీయం గా , కామ వాంఛ రేకెత్తించే రీతిలో చేసుకుంటారు. అంటే ప్రోవొకేటివ్ గా ! అంతే కాక వీరు ఇతర పురుషులతో రొమాంటిక్ అంతే సరస శృంగారాల కోసం  ఉవ్విళ్ళూరుతుంటారు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. వీరి ప్రవర్తన సాధారణం గా సహజం గా ఉండక , నాటకీయం గా ఉంటుంది. వీరు తమ లక్ష్యాలు నెరవేరడం కోసం, తమ శక్తి సామర్ధ్యాలను  కొన్ని సమయాలలో వక్రీకరించ డానికి  కూడా వెనుకాడరు,  అంటే మ్యానిప్యులేట్ చేస్తూ ఉంటారు. వీరు ఇతరులు తమ గురించి చేసే ఏ విమర్శనైనా, తీవ్రం గా పరిగణిస్తారు, ఆ విమర్శలు తమ భద్రత కు ముప్పు అవుతుందని దురభిప్రాయ పడుతూ ఉంటారు. తరచూ ఇతరుల పొగడ్తలూ , మంచి అభిప్రాయాలూ ఆశిస్తూ ఉంటారు. చీటికీ మాటికీ , విసుగు చెందుతూ ఉంటారు. ఎందుకంటే వారు నిరంతరం నవ్యత కోరుకుంటూ ఉంటారు. ఆ నవ్యత తాము అనుకున్న విధం గా పొందలేక పొతే , విసుగూ , ఫ్రస్ట్రేషన్ కు లోనవుతూ ఉంటారు. ఇలాంటి సమయాలలో వీరు ఏవో తమ శారీరిక సమస్యలు , అంటే తలనొప్పి అనో , కడుపులో మంట అనో చెప్పి , ఇతరుల అ టెన్షన్  కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ ఇతరుల అ టెన్షన్ కు కేంద్ర బిందువు అవాలని ఆశిస్తూ ఉంటారు. వారి సమస్యలను ఇతరులకు చెప్పే సమయం లో చాలా స్వల్ప విషయాలను కూడా ఎంతో తీవ్రమైనవి గా చేసి చెపుతారు. అంటే ‘ గోరంతలు , కొండంతలు చేయడం ‘. వీరు వీరి జీవితాలలో నవ్యత కోసం , కామ పరమైన అనుభవాల కోసం తరచూ, చాలా రిస్కు తీసుకుంటూ ఉంటారు. దీనితో వీరు క్లిష్ట పరిస్థితులలో ఇరుక్కుని , ఉద్యోగం లో సమస్యలు ఉత్పన్నం కావడం , లేదా ఉద్యోగం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. వీరు తరచూ డిప్రెషన్ కు కూడా లోనవుతూ ఉంటారు. 
వీరి లక్షణాలను శులభం గా గుర్తు పెట్టుకోవడానికి  ఈ పదం ఉపయోగ పడుతుంది. ‘ ప్రైజ్ మీ ‘  PRAISE ME ( P=Provocative, R=Relationships are considered intimate than they are, A=Attention seeking, I= Influenced easily, S= Speech wants to impress and lacks detail, E= Emotional  lability , M=Make up physical appearance is used to draw attention to self. and E= Exaggerated, theatrical emotions ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం. 8.

In మానసికం, Our minds on జూలై 3, 2012 at 10:33 ఉద.

నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం. 8.

దీనినే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఆంగ్లం లో అంటారు.మేగాలో మానియా అని కూడా ఈ వ్యక్తిత్వం పిలవ బడుతూ ఉంటుంది. నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం అనే  పేరు ఎందుకు వచ్చిందంటే , గ్రీకు ఇతిహాసాలలో నార్సిస్సస్ అని ఒక వేట గాడు ఉండే వాడు.ఆ వేట గాడు అందం గా అంటే హ్యాండ్సం గా ఉండి తన అందం చూసుకుని అతి గర్వ పడే వాడు. నెమిసిస్ అనే దేవత ఈ అంద గాడయిన నార్సిస్సస్ ను ఒక కొలను దగ్గరికి తీసుకు వెళ్లి ఆ కొలను లో అతడి ప్రతిబింబాన్ని చూపించింది. దానితో , నార్సిస్సస్  ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటూ , కొలను దగ్గరే ఉండి, కొంత కాలమైన తరువాత తనువు చాలించాడు.
నార్సిసిస్టిక్ వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటి ?:
ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వారు , వారి పైన ఏ విమర్శలు చేసినా, విపరీతమైన , అవమానం చెంది , క్రోధం తో స్పందిస్తారు. వారు ఇతరులను తమ స్వంత లాభానికి ఉపయోగించు కుందామని సర్వదా ప్రయత్నిస్తూ ఉంటారు.వారి ప్రాముఖ్యతనూ , ప్రతిభా పాటవాలను , ఉన్న వాటికంటే ఎక్కువ చేసి అందరికీ తమ ‘ గొప్ప ‘ లు చెపుతూ ఉంటారు. వారు అవాస్తవికమైన ఊహా ప్రపంచం లో విహరిస్తూ ఉంటారు. అంతే కాక వారు, అధిక సామర్ధ్యం కలవారుగానూ , అధిక శక్తి మంతులు గానూ , చాలా తెలివైన వారిగానూ, రొమాంటిక్ గానూ ఊహించుకుంటూ ఉంటారు. శులభం గా ఇతరులను చూసి అసూయ చెందుతూ ఉంటారు. ఇతరులు తమను నిరంతరం పొగుడుతూ, సద్విమర్శలు చేస్తూ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల సానుభూతి చాలా తక్కువ గా ఉంటుంది వీరిలో.ఎంత సేపూ  సొంత డబ్బా కొట్టుకుంటూ , స్వార్ధ పూరితమైన ప్రవ్రుత్తి  కలిగి ఉంటారు. వారు చాలా  గట్టి వారు , ఎమోషన్స్ ఎక్కువగా లేని వారు గా కనిపిస్తూ ఉంటారు. అవాస్తవికమైన లక్ష్యాలను నిర్దేశించు కుంటూ ఉంటారు, వారి జీవితాలలో. అంటే అన్ రియలిస్టిక్ గోల్స్. వారికి ప్రతిదీ అత్యుత్తమమయినదే కావాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ రకమైన మనస్తత్వం వల్ల, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం లో తరచూ విఫలం అవుతూ ఉంటారు.
విపరీతమైన ఆత్మ విశ్వాసం కలవారికి కూడా పైన చెప్పిన లక్షణాలలో చాలా ఉంటాయి. కానీ గమనించ వలసినది ఏమిటంటే , నార్సిసిస్టిక్ వ్యక్తిత్వం ఉన్న వారు, వారి సెల్ఫ్ ఇమేజ్  తక్కువ గా కలిగి ఉంటారు.అంటే వారికై వారు చాలా ఆత్మ న్యూనతా భావం కలిగి ఉంటారు. దానితో ఇతరులు తమ మీద చేస్తున్న విమర్శలు వారు హుందా గా స్వీకరించక, అతి గా స్పందించడమే కాకుండా , ఇతరులను బాగా కించ పరుస్తూ ఉంటారు. 
వర్తమానం లో ఈ వ్యక్తులు మనకు ఎక్కడ తారస పడతారు?:  మన రాజకీయ నాయకులు పైన ఉన్న లక్షణాలకు ప్రత్యక్ష సాక్షులు. ఆనూహ్యం గా ఈ రకమైన వ్యక్తిత్వం కలవారు, భారత దేశ రాజకీయాలలో ఎక్కువ గా కనిపిస్తారు. మనం పని చేసే ప్రదేశాలలోనూ , మన బంధువులలో కూడా మనం తరచూ గమనిస్తూ ఉంటాము , ఈ వ్యక్తిత్వం కల వారిని. మీకు తెలిసిన వారెవరైనా ఈ వ్యక్తిత్వం కలిగి ఉంటే తెలియచేయండి.
మిగతా సంగతులు వచ్చే టపా లో చూద్దాము ! 
 
 

ఆధార పడే వ్యక్తిత్వం – చికిత్స.7.

In మానసికం, Our minds on జూలై 2, 2012 at 7:31 సా.

ఆధార పడే వ్యక్తిత్వం. 7.

మరి ఈ డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వానికి చికిత్స ఏమిటి ?: 
మనం చికిత్స గురించి మాట్లాడుకునే ముందు , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు, తమ మనస్తత్వం సరి అయినది అవునా కాదా అని ప్రశ్నించు కోవాలి ? 
అంటే ఈ ఆధార పడే వ్యక్తిత్వం , దేశ,  కాల , సంప్రదాయ , పరిస్థితుల బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు: ఇంగ్లండు దేశం లో యుక్త వయసు వచ్చిన యువతి కానీ, యువకుడు కానీ ఏ కారణం చేతనైనా తాము ఉంటున్న ఇంటి నుండి ( అంటే సాధారణం గా తల్లి దండ్రుల ఇంటి నుండి ) బయటకు కనుక వచ్చేస్తే , వెంటనే వారికి  సోషల్ సర్వీసెస్ వారు, నిలవడానికి నీడ ( అంటే ఒక మంచి వసతి ) తినటానికి తిండీ ( అంటే ప్రతి వారమూ కొంత డబ్బు భత్యం గా నూ ) ఉచితం గా  ఇచ్చే ఏర్పాటు చేస్తారు. వారికి వీలైనంత రక్షణ కూడా కలిగిస్తారు.
మరి భారత దేశం లో అయితే  ఇదే పరిస్థితి లో ఉన్న యువతి కి కానీ యువకుడికి కానీ ఏ విధమైన సహాయం ఇవ్వక పోగా ,  వారిని మానసికం గానూ , భౌతికం గానూ , లేదా కామ పరం గానూ , హింస పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ( ఆ అవకాశాలు పాశ్చాత్య దేశాలలో కూడా ఉంటున్నా , మరీ రోడ్డు మీద పడరు కదా , డబ్బూ ,ఆహారమూ , వసతీ లేకుండా ! ) అంటే భారత దేశం లో మరి యువతీ యువకులు తమ తల్లి దండ్రుల మీద ఆధార పడుతుంటే, అది ఆధార పడే వ్యక్తిత్వం అవ్వదు కదా ! అంతే కాక , భారత దేశం లో తల్లిదండ్రులు ఇంకా , తమ పిల్లల విద్యకు అవసరమయే డబ్బు చాలావరకూ  తామే సహాయం చేస్తారు, సంతోషం గా ! కానీ పాశ్చాత్య దేశాలలో పిల్లలు విశ్వ విద్యాలయం లో చేరాక , ‘ అతి స్వతంత్రులు ‘ అవుతారు. వారు తమ తల్లి దండ్రుల వద్ద ఉండరు. అంతే కాక వారి చదువులకు అయ్యే ఖర్చు వారే  బ్యాంకు లో లోన్ తీసుకుని, వారి చదువులు పూర్తి  అయి , ఉద్యోగాలలో చేరాక , వాయిదాల పధ్ధతి లో  తీర్చు కుంటారు. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే , యువతీ యువకులను, భారత దేశం లో నైనా , పాశ్చాత్య దేశాలలో నైనా , మనం ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారని ముద్ర వేయలేము పైన చెప్పిన కారణాల వల్ల. అంతే కాక వారు కూడా ఈ వ్యక్తిత్వం ఉన్న వారని అనుకోరు కదా!
ఎవరికి చికిత్స కావాలి మరి?: ఈ వ్యక్తిత్వ రీతులు అన్నీ ఇగో  సిం టోనిక్,  అంటే, ఈ వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు , తమ వ్యక్తిత్వ రీతులు సరి అయినదే అని అనుకుంటూ ఉంటారు. వారికి వారి వ్యక్తిత్వం ఏవిదం గానూ అప సవ్యం గా తోచదు. ఇట్లాంటి వారికి , వారి వ్యక్తిత్వం అపసవ్యం అని చెప్పడం , హాస్యాస్పదం గా ఉంటుంది. వారికి వారి మనస్తత్వాల మీద ఒక మంచి అవగాహన ఏర్పడితేనే వారు తమను ఇంకో కోణం లో పరిశీలించు కోవడానికి ఉత్సాహం చూపుతారు. 
చికిత్సా పద్ధతులు ఏమిటి? : 
1. గ్రూపు సైకో థెరపీ.
2. మందుల ద్వారా చికిత్స. 
ఇక్కడ,  అంటే ఆధార పడే వ్యక్తిత్వం సవ్య మైనది గా మార్చడానికి కొన్ని పరిస్థితులలో మందులు బాగా పని చేస్తాయని పరిశోధనల వల్ల విశదం అయింది.
ఈ డిపెండెంట్ వ్యక్తిత్వం అట్లాగే ఉంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి? : 
ఈ రకమైన వ్యక్తిత్వం  చాలా కాలం ఉంటే , డిప్రెషన్ , యాంగ్జైటీ, ఫోబియా , లాంటి రుగ్మతలకు దారి తీయ వచ్చు , లేదా ఈ వ్యక్తిత్వం లో భాగం ఆవ వచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 
 
 
 

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

In మానసికం, Our minds on జూలై 1, 2012 at 10:58 సా.

ఆధార పడే వ్యక్తిత్వం. 6.

క్రితం టపా లో చూశాము కదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఏ లక్షణాలు కలిగి, ఎట్లా వారు ‘ అంధ కార మయ జీవితం ‘ లో  వెలుగునిస్తూ, తాము మైనం లా కరిగి పోతూ ఉంటారో !  ఈ ఆధార పడే మనస్తత్వం , వ్యక్తిత్వం ఉన్న వారు పలు రకాలు గా  కూడా ఉండ వచ్చు.  మిల్లన్ అనే సైకాలజిస్ట్  వారి వారి మనస్తత్వాల, వ్యక్తిత్వ తీరు ల బట్టి మళ్ళీ ఈ ఆధార పడే వ్యక్తిత్వాన్ని కొన్ని రకాలు గా విభజించాడు. ఒక రకానికి చెందిన వారు , ఇతరుల మీద ఆధార పడినా, ఆ విషయం పెద్ద గా వారు సీరియస్ గా తీసుకోరు. అది వారి విజ్ఞానం మీద కూడా ఆధార పడి ఉంటుంది. అంటే వారు  విద్యావంతులు కాక పొతే, వారు వారి జీవితాలను ఇతరుల చేతుల్లో పెట్టామనే విషయం వారికి తట్టదు. ఇంకో రకం వారు ,ఆ విషయ పరిజ్ఞానం ఉన్నా , అసంతృప్తి గానే, ఇతరుల మీద ఆధార పడతారు. ఇంకో రకం వారు ఇమ్మేచూర్ గా అంటే వారు మానసికం గా పరిణితి చెంద కుండా, ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవరచుకుంటారు.  ఇంకో రకం వారు తాము ఎట్లాగూ  తమ జీవితం లో సవాళ్ళను సమర్ధ వంతం గా ఎదుర్కో లేక , ఇతరుల మీద ఎక్కువ గా ఆధార పడతారు. ఇంకో రకం వారు తమ స్వార్ధం చూసు కోకుండా, త్యాగ శీలురై , ఇతరుల మీద ఆధార పడే వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటారు. ఈ రకానికి చెందిన వారు మాసోచిజం  అనే ప్రవ్రుత్తి కి కూడా లోనవుతారు. ( మాసోచిజం అంటే , తాము  పొందే బాధ, కష్టాల తో తాము సంతృప్తి , ఆనందం పొందడం ! ఆశ్చర్యం గా ఉంది కదా ! కానీ, భౌతికం గానూ , మానసికం గానూ తాము హింశించ బడితే, సంతృప్తి , సంతోషం పొందే వారు , ఈ ప్రపంచం లో చాలా మంది ఉన్నారు ! ) 
మరి ఇతరుల పైన ఆధార పడే ఈ డిపెండెంట్ వ్యక్తిత్వాన్ని ఎట్లా కనుక్కోవచ్చు ? : ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని లక్షణాలు ఒక వ్యక్తి లో ఎక్కువ కాలం అంటే కనీసం కొన్ని నెలలూ , లేదా సంవత్సరాలూ ఉంటే , వారిలో ఆధార పడే వ్యక్తిత్వం ఉందని తెలిపింది. ఆ లక్షణాలు ఇవే : 
1. తమ జీవితాలలో తమకు చెందిన , ముఖ్య మైన సంఘటనలకు సంబంధించిన నిర్ణయాలను , ఇతరులనే తీసుకోమని, ఇతరులను ప్రోత్సహించడం , లేదా ఇతరులు తీసుకుంటుంటే దానిని ఆమోదించడం. 
2. తాము ఆధార పడిన వారికి విధేయత కలిగి ఉండడం , వారి ఆశయాలకు తాము అంగీకార యోగ్యం గా ప్రవర్తించడం. 
3. తాము ఆధార పడిన వారిమీద , తాము , కనీస ఆంక్షలు కూడా విధించడానికి అయిష్టం గా ఉండడం ,  ఆ కనీస ఆంక్షలు హేతు బద్ధమైనవి అయినా కూడా  !.
4. తాము ఒంటరి గా ఉన్నప్పుడు , ఇబ్బంది గా , నిస్సహాయత గా ఉండడం, ( ఎందువల్ల నంటే , వారు తాము స్వతంత్రం గా ఉండలేమేమో అన్న భయం తో ) 
5. తమ జీవిత విషయాల మీద నిర్ణయాలు చేస్తున్న వారు, తమను ఎక్కడ , ఎప్పుడు వదిలేస్తారో అన్న ఆలోచలనలతో దిగులు గా ఉండడం. 
6.ఇతరుల సహాయ సహకారాలు పొందలేక పొతే , తమంత తాము గా పరిమితమైన ప్రతిభా సామర్ధ్యాలు మాత్రమే కలిగి ఉండడం. 
పైన చెప్పిన లక్షణాలలో ఏ మూడు ఉన్నా , వారు , ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారని నిర్ధారించ బడుతుంది.
ఒక సమస్య : జ్యోతి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయింది. మనసు కూడా వెన్న. తండ్రి రెండు మూడేళ్ళలో రిటైర్ అవుతాడు. తల్లి కి కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయి. చెల్లెలు కూడా ఇంజినీరింగ్ పాసయి ఉద్యోగం చేస్తుంది. సంబంధాలు వెతుకుతున్నారు. జ్యోతికి సమర్ధుడైన భర్త దొరికాడు. అంతే కాక , ఒక నిలకడ అయిన ఉద్యోగం కూడా చేస్తున్నాడు.సంపాదనా చెప్పుకో తగ్గదే ! ఇద్దరు పిల్లలు పుట్టడం వల్ల, జ్యోతి కి ఉద్యోగం చేయడానికి అవకాశం చిక్కలేదు, పెళ్లి అయిన పది ఏళ్ల వరకూ . ‘ పిల్లలు పెరుగుతున్నారు కదా ! స్కూల్ కు కూడా వెళుతున్నారు. ‘ నేను ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను ‘ అని తన ఆంతర్యం తెలిపింది భర్త తో ఒక సందర్భం లో ! అప్పటి నుంచీ ‘ ఆయన గారి చికాకూ , చిర్రు బుర్రు లాడడం మొదలైంది. మొదటి లో జ్యోతికి, ఈ పరిస్థితి వల్ల ఆందోళన అధికం అయింది. ‘  చక్కని సంసారం లో  అలలు , ఆటు పొట్లూ ఎందుకు ?, పిల్లలు కూడా చక్క గా పెరుగుతున్నారు , చదువు కుంటున్నారు అని’ మధన పడుతూ , ప్రశాంతత వహించింది. కొంత కాలం అయిన తరువాత ఆ ప్రస్తావన మళ్ళీ తెచ్చింది భర్త దగ్గర. ‘ నేను నీకేం తక్కువ చేస్తున్నాను ! అన్నీ నేనే చూసు కుంటున్నా కదా ! నీవు ఉద్యోగం చేస్తేనే జరుగుతుందా ? అన్నాడు ! ‘  నేను ఇప్పటి వరకూ పిల్లల సంరక్షణ చూశాను కదా ఇంటి దగ్గరే ఉండి ! వారు మరీ చిన్న వారు కాదు కదా ఇప్పుడు ! నేను కూడా స్వతంత్రం గా కొంత సంపాదించ గలిగే అవకాశం కూడా ఉంది కదా ! అన్నది జ్యోతి. అప్పటి నుంచీ ఆయన  ముభావం గా ఉంటారు. ఈ మధ్య కొద్ది గా ఆలస్యం గా ఇంటికి రావడం. కొన్ని సార్లు పిల్లలు  నిద్ర పోయిన తరువాత ,   ఇంటి లోనే ‘ మందు ‘ పుచ్చు కోవడం !  ఇప్పుడు  జ్యోతి పరిస్థితి మీరు వ్యాఖ్యానించ గలరా ? జ్యోతి సమస్య కు  ( అసలు జ్యోతి కి సమస్య ఒకటి ఉందని మీకు అనిపిస్తే ) ,  మీ పరిష్కారాలు  ఏమిటో తెలియ చేయండి ! 
వచ్చే టపాలో మిగతా వివరాలు తెలుసుకుందాము ! 

డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం. 5.

In మానసికం, Our minds on జూలై 1, 2012 at 9:35 ఉద.

డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం. 5.

పేరు లోనే ఉంది కదా ! ఈ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు , ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. అందులో తప్పు ఏముంది ? మానవుడు సంఘ జీవి కదా ! నలుగురితో సహాయ సహకారాలు తీసుకోవడమే  స్థిత ప్రజ్ఞుల లక్షణం కూడా కదా అని మీరు అన వచ్చు.డిపెండెంట్ పర్సనాలిటీ లేదా ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు, వారి జీవితం లో ప్రతి విషయానికీ ఇతరుల మీద ఆధార పడుతూ ఉంటారు. అంతే కాక , ఇతరులను , తమ జీవితం లో జరుగుతూన్న సంఘటనలకూ , సమస్యలకూ, కీలకమైన నిర్ణయాలు తీసుకోమని వారికి  వదిలేస్తారు. ఒక విధం గా ఈ వ్యక్తిత్వం ఉన్న వారి పరిస్థితి ఎమోషనల్ గా ‘ తెగిన గాలి పటం ‘ మాదిరిగా ‘గాలి దయా దాక్షిణ్యం’ మీద ఉన్నట్టు గా ఉంటుంది, వారు ఇతరులను , తమ జీవిత నౌక కు చుక్కాని అయి, వారిని దరి  చేర్చాలని అనుకుంటారు. వారి జీవితం మీద , వారి జీవిత నిర్ణయాల మీద ఏమాత్రం భారమూ , బాధ్యతా వారికి లేనట్టు ప్రవర్తిస్తారు. వీరి దృష్టి లో ఇతరులు తమ అంచనాలకూ , ఊహలకూ అనుగుణం గా ఉండాలని అనుకుంటారు కానీ , ఇతరులు ఒక వ్యక్తిత్వం కలిగి వారికై వారు ప్రత్యేకతలు కలిగి ఉంటారనే విషయాన్ని విస్మరిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకో వలసి వచ్చిన ప్రతి పరిస్థితినీ వీరు దాట వేస్తూ ఉంటారు. 
ఈ ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు వారిమీద ఏ విధమైన సెల్ఫ్ ఇమేజ్ కలిగి ఉంటారో చూద్దాము:
వీరు తాము అసంపూర్ణ వ్యక్తులమనీ , ఈ ‘ మోస పూరిత , ప్రమాద కర బాహ్య ప్రపంచం ‘ లో తాము ఇమడలేమనీ, అసహాయత ఎర్పరుచుకుంటారు. అందువల్ల తమ జీవిత నిర్ణయాలు , ఇతరులకు వదిలేస్తారు. దానితో , వీరికి , పెద్ద కోరికలూ, ఆశయాలూ , ఆకాంక్షలు కూడా తక్కువ గా ఉంటాయి. ఈ విధమైన అభిప్రాయం కలిగి వారు ఇతరుల ‘ రక్షణ ‘ లో ఉండడమే మంచి మార్గం అనుకుంటారు. అందుకోసం వారు, ఇతరులు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉన్నా , వాటిని ఆమోదిస్తూ ఉంటారు.వారి వ్యక్తిత్వాన్ని ,ఇతరుల ఆమోదం కోసం ‘ తాకట్టు ‘ పెడుతూ ఉంటారు. అట్లాగే అతి విధేయత తో ఇతరుల ‘రక్షణ’ లో ‘ అణిగి మణిగి  ఉంటారు. దీనితో అనేక కీలకమైన జీవిత నిర్ణయాల సమయం లో వీరు ఎక్కువ గా ‘ తమ మెదడు కు పని పెట్టరు’ అంటే ఎక్కువ గా ఆలోచించరు.
ఆధార పడే వ్యక్తిత్వం ఉన్న వారు ఇతరులతో ఏ రకమైన సంబంధాలు కలిగి ఉంటారు? : వీరు తాము మనుగడ సాగించాలంటే , తమ కన్నా గొప్ప వారితో సంబంధాలు ఎప్పుడూ అవసరమని భావిస్తారు. వారు ఇన్ఫీరియర్ గా ఫీలవుతూ , సుపీరియర్స్ ను విధేయత, ప్రేమ , వాత్సల్యలతో చూసుకుంటూ ఉంటారు. అంతే కాక , వారికి ఆమోద యోగ్యం కాని పనులు కూడా చేస్తూ , త్యాగ మయ జీవితాలను గడపడానికి కూడా వీరు వెనుకాడరు. ఈ విధమైన సంబంధాలు ఏర్పరుచుకున్నాక , వారికి, లేక వారు ఆధార పడిన వ్యక్తులకూ ఏ రకమైన వైఫల్యాలు ఎదురైనా కూడా , వాటిని సీరియస్ గా తీసుకోకుండా , వాటిని అల్ప విషయాలు గా పరిగణిస్తారు. వారికై వారు కేవలం ఇతరులతో ఎట్టి పరిస్థితులలోనైనా సహకారమూ, తాము ఆమోదించ  పడటమూ ఆశిస్తారు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

అబ్సెసివ్ వ్యక్తిత్వం.OCPD . 4.

In మానసికం, Our minds on జూన్ 30, 2012 at 10:26 సా.

అబ్సెసివ్ వ్యక్తిత్వం.OCPD . 4.

క్రితం టపాలో ఈ వ్యక్తిత్వం ఉన్న వారి లక్షణాలు కొన్ని తెలుసుకున్నాము కదా ! వీరు చేసే ప్రతి పనీ అత్యంత జాగరూకత తో చేయడమే కాక , ప్రతి విషయానికీ విపరీతం గా అనుమాన పడుతూ , అనేక రకాలైన సందేహాలు తెచ్చు కుంటూ ఉంటారు.  ప్రతి చిన్న విషయానికీ , అత్యంత శ్రద్ధ అంటే మెటిక్యులాస్ గా ఒక కాగితం మీద నోట్ చేసుకోవడమో. లేదా ఒక పుస్తకం లో వివరం గా రాసుకోవడమో చేస్తుంటారు. వీరు చేసే పనుల గురించీ , ఇతరులు చేసే పనుల గురించీ వీరికి రెండే రెండు అభిప్రాయాలు ఉంటాయి. అవి రైట్ అండ్ రాంగ్. అంటే సరైనది , లేదా తప్పు అయినది. ఇక మధ్యస్థం ఉండదు వీరి నిఘంటువులో ! 
అబ్సెసివ్ వ్యక్తిత్వ లక్షణాలకు కారణాలు :
1.జన్యువుల లోపం లేదా జీన్స్ లో లోపాలు : కొన్ని పరిశీలనల వల్ల ఒక ప్రత్యెక రకమైన జీన్స్ అంటే DRD3 అనే రకమైన జీన్  ఉన్న వారిలో ఈ అబ్సెసివ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 
2.పరిసరాల ప్రభావం : ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు , వారి చిన్న తనం నుంచీ , తల్లిదండ్రుల ద్వారా కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ ఈ వ్యక్తిత్వ లక్షణాలను తమకు తెలియకుండానో , తెలిసో , నేర్చుకుంటారు.  అత్యంత క్రమ శిక్షణ తో , చాలా కఠినం గా వారిని పెంచితే , ఆ లక్షణాలు వారికి అలవడుతాయి. అంతే కాక , బాల్యం లో భౌతికం గా కానీ , ఎమోషనల్ గా కానీ, కామ పరం గా  కానీ ఏ విధమైన  అబ్యూజ్ కు లోనైనా , క్రమేణా ఆ  విషాద కర అనుభవాలు ,  అబ్సెసివ్ వ్యకిత్వం గా పరిణితి చెందవచ్చు. అందువల్లనే , ఈ వ్యక్తిత్వం ఉన్న వారు , వారి ఆందోళనా , ఆత్రుతా , తమ అబ్సెస్సివ్ వ్యక్తిత్వ లక్షణాలతో తగ్గించు కున్నట్టు అనిపించినా , వారు చాలా టెన్షన్ కు కూడా లోనవు తుంటారు.
OCPD కీ OCD కీ తేడా ఏమిటి ?: 
అబ్సెసివ్ వ్యక్తిత్వం ( అంటే OCPD or Obsessive , compulsive, Personality disorder ) ఒక వ్యక్తిత్వ  రీతి. అంటే  వ్యక్తిత్వ లక్షణం. కానీ  OCD  అంటే  Obsessive Compulsive Disorder ఒక మానసిక వ్యాధి. అంటే OCD ఉన్న వారు , వారు చేసే పనులు చాలా వ్యధా , బాధా కలిగిస్తున్నా , వారు ఆ పనులు చేయక పొతే వారి మనసు శాంతించదు. ఉదాహరణకు , OCD ఉన్న వారు వారి చేతులను కనీసం ఒక యాభై సార్లైనా కడుగుతూ ఉంటారు రోజులో ! వారి చేతులు ఎర్రగా సబ్భు తో కడిగీ కడిగీ కండి పోయినా కూడా , వారు వారి చేతులకు , ఇంకా ఇన్ఫెక్షన్ ఉందేమో అని అనుమాన పడుతూ ఉంటారు. కానీ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు అంత విపరీతం గా ప్రవర్తించరు.
మరి ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారికి చికిత్స ఏమైనా ఉందా ?: 
మానసికం గా పరివర్తన తీసుకు వచ్చే , సైకాలజికల్ చికిత్స లు పలు విధాలు గా వీరికి చేయవచ్చు.
అంటే కాగ్నిటివ్ బిహావియర్  థెరపీ , బిహావియర్ థెరపీ , ఇంకా  కాగ్నిటివ్ అనలిటికల్ థెరపీ ( దీనినే మానసిక విశ్లేషణ చికిత్స అంటారు ) ఈ పద్ధతులలో ఏ ఒక్కటైనా ఉపయోగించి , వారి మనసులలో క్రమం గా మార్పు తేవచ్చు.  ఈ మార్పు కొన్ని సమయాలలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్టి పరిస్థితులలో , మందుల సహాయం తో కూడా , ఈ వ్యక్తిత్వ లక్షణాలను కొంత వర కూ నియంత్రించ వచ్చు. 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

అబ్సెసివ్ వ్యక్తిత్వం.3.

In మానసికం, Our minds on జూన్ 29, 2012 at 11:57 సా.

అబ్సెసివ్  వ్యక్తిత్వం.3.

అబ్సెసివ్ వ్యక్తిత్వం  ఉన్న వారు నిరంతరమూ , తామూ , తమ పరిసరాలూ ,అతి  శుభ్రం గా ఉంచుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ తాపత్రయం ఎంత వరకూ పోతుందంటే , వారు చేపట్టిన పనులు, నిదానం గా చేస్తూ ఉంటారు. అంతే కాక , ఈ విధం గా నిదానం గా చేస్తూ ఉండడం వల్ల , పనులు కూడా పూర్తి చేయ లేక పోతారు.వారు చేస్తున్న పని మీద వారు అన్ని సమయాలలోనూ సంపూర్ణమైన నియంత్రణ ఉండాలని చూస్తారు.  వారు ప్రతి పనీ ఇట్లా చేస్తూ ఉండడం వల్ల , వారు పని చేస్తున్న ఏ చోట నైనా , ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోలేక పోతారు.కారణం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది.ఇతరులు వీరి పనిచేసే పధ్ధతి ని అంత శులభం గా ఆమోదించలేరు, సహించ లేరు కనుక. !  వారి పని చేసే తీరు రిజిడ్ గా అంతే అత్యంత కఠినం గా ఉండడం వల్ల, అంటే ఏమాత్రమూ ,రాజీ పడక పోవడం వల్ల కూడా, ఇతరులు వీరిని , వీరి పని తీరునూ అంగీకరించ లేరు. దీనితో, ఈ అబ్సెసివ్ వ్యక్తిత్వం ఉన్న వారు , ఎక్కువ మంది స్నేహితులూ , శ్రేయోభిలాషులు లేక, జీవితం లో చాలా వత్తిడి , లేదా టెన్షన్ అనుభవించుతూ ఉంటారు. అంటే వారి ప్రవర్తన వల్ల , వారితో స్నేహం చేయడానికీ, సహకరించడానికీ , ఇతరులు  అంత శులభం గా ఉత్సాహం చూపరు. ఈ వ్యక్తిత్వం కల వారు, ఒక పట్టాన రిలాక్స్ అవలేరు.అంటే మిగతా వారు ,తీసుకుంటునట్టు, పనిలో విరామం తీసుకోలేరు. అదే పని గా పని చేస్తూ ఉంటారు, రాటపాకుల లాగా ( ఈ పదం ఈ కాలం లో చాలా తక్కువ గా ఉపయోగిస్తూ ఉంటారు కానీ నిరంతరం పని చేసే వారిని కానీ , విరామం లేకుండా ఆడుతూ తిరిగే పిల్లలను కానీ  ‘ రాటపాకుల లాగా ‘ అంటారు. అంటే నూలు వడికే  రాట్నం తిరుగుతూ ఉంటే దానికి ఉన్న చక్రం కూడా నిరంతరం తిరుగుతూ ఉంటుంది కదా , ఆ విధం గా ) వారు ఎక్కడ పని చేస్తున్నా , ఆ పని యొక్క వివరాలు అన్నీ కాచి వడ పోస్తారు. అంటే ఆ పని నిబంధనలు అన్నీ కూడా వారికి కొట్టిన పిండి. అంటే ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా నేర్చుకుని , ఆ పనిని అంతే జాగ్రత్త తో చేస్తూ ఉంటారు. వారు చేయవలసిన పనిని కూడా ఆ నిబంధనలకు తగిన విధం గా ఏ మాత్రం లోపం లేకుండా చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని ఒక విధం గా ‘ పర్ఫెక్షనిస్ట్ లు’  అనవచ్చు .’  రూలంటే రూలే ‘  ! అంటూ ఉంటారు.  ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల వారు పనులను సకాలం లో పూర్తి చేయలేక పోతారు. వారు ఉండే ఇంటిలో కూడా వారు ఈ రకమైన పర్ఫెక్షనిజం వల్ల , ప్రతి పనినీ అతి జాగ్రత్తగా, అతి నిదానం గా  చేస్తూ ,  ఆ పనులకు అధిక సమయాన్ని వెచ్చిస్తూ కూడా ఉంటారు. వారికి ఉండే ఇంకో లక్షణం ఏమిటంటే , వారి ఇంటిలో ప్రతి వస్తువుకూ , ఒక ప్రత్యేకతను ప్రతి పాదించి, అంటే సెంటిమెంటల్ వ్యాల్యూ తో చూస్తూ , ఏ వస్తువు నూ పార వేయకుండా ,ఇంట్లో పోగు చేస్తూ ఉంటారు ( ఈ లక్షణాన్ని హోర్డింగ్  అంటారు, ఆంగ్లం లో ) అంటే వారు, వారికి ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను కూడా , ఇంట్లోనే ఉంచుకుని , ఇల్లంతా ఇరుకు అవుతున్నా ఏమాత్రం లెక్క చేయరు.  వారు ఆర్ధికం గా ఖర్చు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా ,’  పిల్లికి బిచ్చం పెట్టడు’ అని ఇతరులతో అనిపించుకుంటారు.అంటే పరమ లోభి గా ఉంటారు. 
 వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !