Our Health

Archive for the ‘Our minds’ Category

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 23, 2012 at 8:47 సా.

ప్ర.జ.లు.4.ఎఫైర్ లూ, ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న:  మరి పురుషులు ఎఫైర్ లు ఏర్పరుచు కోవడానికి కారణాలు ఏమిటి ? : 
జవాబు: పురుషులు ఎఫైర్ లు పెట్టుకోడానికి చాలా కారణాలు ఉన్నాయి.  
1. కాదనలేక పోవడం:  అందమైన, ఆకర్షణీయ మైన యువతి ఎదురుగా ఉంది. మనసు లో రస మన్మధుడు వేయి గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటాడు.ఆ వేగం లో భావావేశాలు కూడా కనీసం వేయి మైళ్ళ దూరం వెళతాయి. ఇంక కాదనడానికి  సమయం ఏదీ ? 
2. అహం సింహాసనం ఎక్కుతుంది. : తనకు  తెలివి ఉన్నా , సరి అయిన అవకాశాలు లేక ఆమె తో పోటీ గా పెద్ద ఉద్యోగం లేదు. తీవ్రమైన ఆత్మ న్యూనతా భావానికి విరుగుడు వీలైనంత మంది  యువతులతో   ‘ నవ జీవనం ‘ రుచి చూస్తె సరే అనే భావన ! ( ఇగో బూస్టు చేసుకోవడం  ) 
3. తోటి వారితో పోటీ ! :  రమేష్  చాలా లక్కీ , భార్యకు  రవంత అయినా తెలియకుండా , కనీసం  ముగ్గురు యువతులతో శృంగారం ‘ వెలగ పెడుతున్నాడు ‘ , ఇక మధు విషయం సరే సరి !  ఆఫీసులోనే ఇద్దరితో చనువు గా ఉంటాడు. ఈ చనువు ఆఫీసు అయిపోగానే , ఏ రూపం లో ఉంటుందో ఊహించుకోడానికి మధు వారికి ఆఫీసులోనే చాటు మాటుగా చేసే  ఈ మెయిల్స్  చూపించినప్పుడే తెలిసింది. మరి తనకు ఏమి తక్కువ , ఆ మాత్రం తీసి పోనా ! అనే భావన , ‘ పోటీ ‘ తత్వం !( పీర్ ప్రెషర్ ) 
4. ఉన్న సంబంధానికి ఉద్వాసన చెప్పే విధం : తనతో నాకు పడట్లేదు ఎట్లాగూ ! ప్రయత్నం చేసినా ! ఇక ‘ కాదనుకున్నప్పుడు ‘ ఎఫైర్ ఇంకొకరి తో ఉంటే తప్పా ? అన్న భావన.  ఇంకొందరు  తాము ఇంకో ఎఫైర్ పెట్టుకున్న తరువాత కూడా , తాము ఉంటున్న వారితో వీడ్కోలు , ఆ విధం గా తీసుకుంటారు. 
5. ఆమె అమాయకత్వం :  అనసూయ కు  అతని మీద ఎంతో నమ్మకం.’  డ్యూటీ చేసి నేరుగా ఇంటికి వస్తాడు. మల్లె పూలు తెస్తాడు. దేవి భక్తీ , దైవ భక్తీ రెండూ ఉన్నాయి ‘ అని సంబర పడి పోతూ , తన ‘ భాగ్యానికి ‘ రోజూ అనేక పూజలు చేస్తూ , గుళ్ళో ప్రదక్షిణాలు కూడా చేస్తూ ‘ కాలం , ఆనంద మయం గా ‘ వెళ్ళ బుచ్చుతూ ఉంటుంది , అమాయకం గా  అనసూయ , అతను  చేసే కొన్ని డ్యూటీ లు, నేరుగా  ‘ రెండో  దేవి ‘ వద్ద కూడా చేస్తూ , తన దేవి భక్తి  చాటు మాటు గా చాటుతున్నాడని తెలియక  ! 
6. ‘ రస కీర్తి కిరీటం లో ఇంకో మణి పూస ‘ :  అందమైన యువతి తో పొందు , ఎంతో పొందిక గా అనిపిస్తుంది , భార్య కన్నా !  ఆమె చతురత , తన ఇల్లాలికి ఏదీ  అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ‘ ఆ  ఆమె చతురత ‘  ను ఆస్వాదిస్తున్న వారి వరుసలో తాను మూడో వాడు అనే  వాస్తవం ( ఆమె చతురత తో ! ), మరుగున పడుతుంది.
7. ఇతర స్త్రీ ( ల ) తో పొందు కోసం తహతహ ! : తాను  తన భార్య పొందు తో ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు.  కానీ  ‘  ఆ యువతి తో పొందు ఆ హా ! ఎంత బాగుంటుందో ! అని  ఎమోషనల్ అలల మీద తేలి పోతూ ‘ ఆ యువతి ‘ పొందు కోసం తహ తహ లాడుతారు కొందరు ! 
8. కామ విశృంఖలత : కొందరు ద్విలింగ సంపర్కులు, తాము భార్య తో సహజీవనం చేస్తూనే , ఇతర మగ వారితో సంబంధాలు ఎర్పరుచుకుంటారు.
9. మొదటి సారి , ఎవరికీ తెలియలేదు కదా ! :  ఆ తోలి రాత్రి ,  రమ్య  తో గడిపిన క్షణాలు, ఎంతో కొత్తగా ఉన్నాయి , మళ్ళీ  ఆ క్షణాలు ‘ రిప్లే ‘ చేసుకుంటే సరిపోదూ ! అందులో  తన  శ్రీమతి కి కూడా ఏ అనుమానమూ లేదు కదా !   మతులు పోగొట్టే అందాలు రమ్య లో మళ్ళీ ఆస్వాదిస్తే తప్పేంటి ? అనే భావన.  
10.   మహత్తర అవకాశం !  :  తాను వచ్చింది ఢిల్లీ కి టూరు మీద ! అందులో నవంబరు మాసం అవడం తో చాలా చిల్లీ గా కూడా ఉంది !   ఉండే హోటల్ లో  ‘ అన్ని హంగులూ ఉన్నాయి ‘ ఇక  అందాలు పొంగుతున్న అతివల కు కూడా కొదవ  ఉండదు అక్కడ ‘  అని క్రితం టూరు కు వెళ్ళిన తన కొలీగు చెప్పిన చిదంబర రహస్యం  ఒక్క సారిగా  కోటి కిరణాల సూర్య భానుడి వేడి పుట్టించింది తనలో !  ఇక హైదరాబాదు లో  ఉండే తన ఇల్లాలికి ఎందుకు  ఈ  ‘ గొడవలూ ‘ అను కొనే వారు కొందరు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ క్వాలిటీ లు ! 

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 22, 2012 at 8:12 సా.

ప్ర.జ.లు. 3. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

ప్రశ్న: స్త్రీల లోనూ  పురుషులలోనూ   ఇన్ ఫిడిలిటీ కి  తేడాలు ఉన్నాయా ? 
జవాబు: మంచి ప్రశ్న. భావావేశాలు అంటే ఎమోషన్స్ ,  అవి అనుభవించే  స్త్రీలను బట్టీ , పురుషులను బట్టీ మారుతూ ఉంటుంది. అంటే స్త్రీలకూ, పురుషులకూ ,  వారి లో నిరంతరం కలిగే భావావేశాలకూ అవినా భావ సంబంధం ఉంది. కాక పొతే వారు ఈ భావావేశాలను అనుభవించే విధం వేరుగా ఉంటుంది.  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే భావావేశాల వాహనాలలో స్త్రీలూ , పురుషులూ వేరు వేరు దారులలో ప్రయాణం చేసి ‘ సుఖ గమ్యం ‘ చేరుకుంటారు.  ఈ వేరు దారుల ప్రయాణం , వారి కామ ప్రేరణలనూ , ఎమోషన్స్ ను  కూడా వేరుగా ప్రభావితం చేస్తుంది. స్త్రీలూ , పురుషులూ , వారి వారి రీతులలో  కలిసి  సంసార సుఖాల గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు , మార్గ మద్యం లో  చిన్న బస అంటే కొన్ని షార్ట్ స్టే లు కూడా చేస్తుంటారు ! ఆశ్చర్య కరం ఏమిటంటే , ‘ కలిసి ‘ ప్రయాణం చేస్తూ కూడా , ‘ చిరు బస ‘లు అంటే షార్ట్ స్టే లు మాత్రం ఇంకొకరికి తెలియ కుండా చేస్తుంటారు ! ( అందరూ కాదు ! ) 
ఉదాహరణకు , పురుషులు ఎఫైర్స్ ఏర్పరుచు కునే సమయం లో, ( ఇతర ) స్త్రీల మీద ఎక్కువ గా ఆధార పడుతూనూ ,  వల్నరబుల్ గానూ  ఉంటారు.దీనిని స్త్రీ లోలత అనవచ్చు. అదే స్త్రీల విషయం లో ఇందుకు భిన్నం గా , ఎఫైర్స్ ఏర్పరుచుకునే సమయం లో, స్వేచ్చా యుతం గానూ , వారు ఎక్కువ శక్తి వంతం గానూ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎఫైర్స్ లో సామాన్యం గా పురుషులు ఇంటిమసీ కోసం అంటే చనువు , ఆప్యాయతల కోసం వెదుకుతూ ఉంటారు, అదే సమయం లో స్త్రీలు , వారి  భావావేశాలను అంటే కామ పరం గానూ , ఇతర విధం గానూ , వారి కి  ( వివాహ బంధం లో ) ఉన్న స్వేచ్చా స్వాతంత్ర్యాల పరిమితులు  ఛేదించడానికి  ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , స్త్రీ లకు తమ వివాహ బంధం లో కనుక , వారికి సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యాలు  ఉన్నట్టు నమ్మకం కలిగితే , వారు ఎఫైర్స్ కు అంతగా ఆకర్షితులవ్వరు. అట్లాగే పురుషులు, తమ వివాహ బంధం లో సంతృప్తి కరమైన  అనుబంధం , ఇంటిమసీ , ఇంకా ఆప్యాయత కనుక పొందుతూ ఉంటే , ఎఫైర్స్ వైపు దృష్టి మరల్చరు.  ప్రేమ , ఆప్యాయతల ‘ ఇంధనం ‘ తో పాటు గా కామ తృప్తి కూడా కలిసిన ‘ జీవిత ‘ వాహనం లో ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణం సాఫీ గా గమ్యం వైపు సాగి పోతుంది, అప్పుడు వారికి చిరు ‘ బస’ లు అంటే షార్ట్ స్టే లు ఏవీ అవసరం ఉండవు! ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లాంటి ఇంధనాలు వారికి అవసరం ఉండదు ! 
లింగ పరం గా ఎఫైర్స్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ  పురుషులలో రావడానికి కారణం, వారు వారి ‘ ప్రేయసి కానీ,  ‘భార్య ‘ కానీ , ఇతర వ్యక్తులతో కామ పరమైన సంబంధం ఏర్పరుచు కుంటే కానీ , లేదా ఏర్పరుచు కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కానీ తెలిస్తే , తీవ్రం గా కలత చెందడం వలన అని కూడా భావించడం జరుగుతుంది. కానీ స్త్రీల విషయం లో వీటికి  ( ఇన్ ఫిడిలిటీ కీ ఎఫైర్స్ కూ ) కారణం , తమ ప్రియులు ఇతరులతో భావావేశ పూరితం గా అంటే ఎమోషనల్ గా సంబంధాలు పెట్టుకుంటే సహించ లేక పోవడం అని కూడా భావించ బడుతుంది. అనేక మంది స్త్రీలనూ పురుషులనూ ప్రశ్నిస్తే , ఈ విషయం తెలిసింది , ఒక పరిశీలనలో. జీవ పరిణామ శాస్త్ర వేత్తలు స్త్రీలలోనూ , పురుషుల్లోనూ వంశ పారంపర్యం గా వచ్చే జన్యువులు అంతే జీన్స్ , వారి ఎఫైర్స్ లేదా ఇన్ ఫిడిలిటీ   ప్రవర్తనలను నిర్ణయిస్తాయి అని  నమ్ముతారు.  ఎఫైర్స్ విషయం లో  జన్యువులు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో  స్పష్టమైన విధం గా జెలసీ ను అంటే అసూయను చూపే లక్షణం కానీ బిహేవియర్ ను కానీ  నిర్ణయిస్తూ ఉంటాయి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ఇన్ ఫిడిలిటీ సంగతులు ! 

ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 21, 2012 at 10:27 సా.

 ప్ర.జ.లు.2. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ ! 

అఫైర్ కానీ ఇన్ ఫిడిలిటీ కానీ , భౌతికం గా అంటే శారీరికం గా సంబంధం కావచ్చు, లేదా ఎమోషనల్ గా సంబంధం కావచ్చు. అంతే కాక , కేవలం ఎమోషనల్ , ఇంకా శారీరికం గానే కాక ఈ సంబంధాలు , ఇరువురి మధ్యా ఉన్న నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తాయి. అప్పుడు  ఆ సంబంధాలు మోస పూరితం కూడా అవుతాయి.  ఒక దేశం లో బహిరందం గా ఒకరి తో  సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తి , అఫైర్ ఇంకో వ్యక్తి తో కలిగి ఉండవచ్చు.భావావేశ పూరితమైన అఫైర్స్ లేక సంభంధాలు  కూడా శారీరికం గా ఇంకొకరికి కలిగించేంత బాధ కలిగించ గలవు.మానవ  పరిణామం జరుగుతున్న కొద్దీ , ప్రపంచం లో వివిధ దేశాలలో ఈ అఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ , ఆ యా దేశ నాగరికతా సంస్కృతుల బట్టి మారుతూ ఉంటాయి.
ప్రశ్న:  ఈ ఎఫైర్ లూ ఇన్ ఫిడిలిటీ లూ మన సమాజం లో ఎంత సామాన్యం ? : 
జవాబు: కొందరు  పరిశోధకుల అభిప్రాయం ప్రకారం , ఈ రోజుల్లో ,  సంబంధం కలిగి ఉన్న ఇద్దరిలో ఒకరు, శారీరికం గా కానీ , మానసికం గా అంటే ఎమోషనల్ గా కానీ ఇంకొకరితో సంబంధం కలిగి ఉండడానికి, కనీసం 50- 50  చాన్స్ ఉంటుంది . అమెరికాలో వివాహం చేసుకున్న వారిలో 30 నుంచి 60  శాతం మంది, తమ జీవిత కాలం లో ఎప్పుడో ఒకప్పుడు  ఎఫైర్స్ కలిగి ఉంటారని ఒక అంచనా !  ఇంకో అంచనా ప్రకారం , విడాకులు తీసుకున్న వారిలో, కనీసం తొంభై శాతం మంది , ఎఫైర్స్ అంటే వివాహేతర సంభంధాలు కలిగి ఉన్నారని తెలిసింది. అంతే కాక , ఇరవై ఏడు శాతం మంది ( అమెరికాలో ) వివాహం చేసుకుని ఆనందం గా ఉన్నామని చెప్పిన వారు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు !
ఇటీవల యాభై మూడు దేశాలలో విశ్వ విద్యాలయాలలో చదువుతున్న పదహారు వేల మంది విద్యార్ధులలో జరిపిన ఒక పరిశీలన లో 20 శాతం మంది దీర్ఘ కాలిక సంబంధాలు ఏర్పరుచుకున్న వారు, అప్పటి కే ఇంకోరితో కూడా సంభంధాలు కలిగి ఉన్నారు. ఇంకా పరిశీలనలలో తెలిసిన నిజం. నలభై శాతం మంది అవివాహితులూ , ఇరవయి శాతం మంది దాకా వివాహితులూ కూడా , కనీసం ఒకటైనా కామ పరమైన సంబంధం కలిగి ఉన్న వారే !  స్త్రీల కన్నా , పురుషులు అధికం గా ఈ ఇతర సంబంధాలు కలిగి ఉంటారు.
2003 లో ఇంగ్లండు లో ఉన్న ఒక యాభయి మంది లాయర్లను ఒక ప్రశ్న అడిగారు ఒక పరిశీలనలో. అతి సామాన్యం అయిన కారణం ఏమిటి మీ దగ్గరకు విడాకుల కోసం వచ్చే వారికి ‘ అని  అడిగినప్పుడు , యాభై అయిదు శాతం విడాకులు పురుషులు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో , లేక నలభయి  అయిదు  శాతం  విడాకులలో స్త్రీలు ఇతర సంబంధాలు కలిగి ఉండడం వల్ల నో విడాకులు సంభవిస్తున్నాయి అని తెలిసింది.  ఈ విధమైన వివాహేతర  సంబంధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం , వారు వారి భాగస్వాములతో తక్కువ సమయం గడపడం వలెనే అనీ , ఇంకా విద్యార్ధులు , వారి వివాహం అయ్యే లో గా వీలైనంత మంది తో శారీరిక సంభంధం కలిగి ఉండాలనుకునే కామ వాంఛ తో పాటు గా యునివర్సిటీ విద్యాలయాలలో వారికి కలుగుతున్న అవకాశాలు కూడా అని పరిశీలనలలో తెలిసింది.అంతే కాక వయసు మీద పడుతున్న వారి లో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి అని తెలిసింది.
ప్రశ్న : మరి ఈ ఎఫైర్స్ , ఇన్ ఫిడిలిటీ లు కలిగి ఉండడం లో పురుషులు స్త్రీల కంటే ఎందుకు ముందున్నారు ?:
జవాబు: వచ్చే టపాలో  తెలుసుకుందాము ! 

ప్ర.జ.లు.1. ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 20, 2012 at 11:39 సా.

 ప్ర.జ.లు. 1.ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ !  

ప్రశ్న:  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ అంటే ఏమిటి ? 
జవాబు: ఇన్ ఫిడిలిటీ   ని సామాన్యం గా  ‘ మోసం చేయడం ‘ ద్రోహం చేయడం’ లేదా ‘ ఎఫైర్స్ ఉండడం ‘  అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. భాగ స్వాములు , అంటే వారు భార్యా భర్తలే కావచ్చు , లేదా  ప్రత్యెక సంబంధం ఉన్న స్నేహితులు కావచ్చు. స్త్రీ పురుషులు  కావచ్చు. ఇన్ ఫిడిలిటీ నిర్వచనం ఏమిటంటే , ఇరువురి మధ్య  ‘ సహజం గా ‘ ప్రత్యేకం గా ఉండే  ఎమోషన్స్ కానీ , కామ పరమైన అనుభూతులు కానీ వారిరువురికే  చెందక, ఇతర వ్యక్తుల తో పంచుకోవడం. అంటే ఇక్కడ ఇరువురి మధ్య ఉన్న ప్రగాఢమైన సంబంధం ఒకరికి తెలియ కుండా ఒకరు మూడో వ్యక్తీ , లేదా నాలుగో వ్యక్తి తో పంచుకోవడం. ఇక్కడ ‘ మోసం చేయడం, ద్రోహం చేయడం  అనే పదాలు  రెండో వ్యక్తి నుంచి డబ్బూ , లేక ఆస్తులు , దోచేయడం అనే అర్ధం తీసుకో రాదు. 
 నవీన కంప్యుటర్ యుగం , ఇంటర్నెట్ యుగం లో  ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ చాలా సామాన్యం అవుతున్నాయి.  ఒక ముఖ్య విషయం ఏమిటంటే , సర్వ సామాన్య మవుతున్న ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ  మనం తెలుసుకున్నంత మాత్రాన ఎక్కువ అవ్వవు. తెలుసుకో నందు వల్ల తక్కువా అవ్వవు కదా ! 
మనం ఈ ఎఫైర్ లూ , ఇన్ ఫిడిలిటీ లూ వాటి తీరు తెన్నులు పరిశీలిద్దాం , వచ్చే టపా నుంచి ! 
 

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

In మానసికం, Our minds on జూలై 14, 2012 at 10:30 ఉద.

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

పైన ఉన్న కార్టూను , మందుల కంపెనీలవారి వ్యాపార పోకడలను ఎండ గట్టుతూ చూపుతున్న కార్టూన్. ( మన జీవితాలలో , సమస్యలు ఉండడం సహజమే కదా, కానీ కార్టూను లో ఆ సమస్యలను ఒక బై పోలార్ డిసార్డర్ గా ( తప్పు గా ) నిర్ధారించి దానికి , మందులు తీసుకోవడమే ఉత్తమం అంటూ సలహా ఇస్తున్న డాక్టర్ ను చూడ వచ్చు ! ) అందు వల్ల నే మనం ,   వ్యాధి నిర్ధారణ అత్యంత జాగరూకత తో చేయించుకోవాలి.  అంటే నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవాలి. 

పిచ్చి కుదిరేది ఎట్లా ? : 
ఒక సామెత మనం తరచుగా వింటూ ఉంటాము. ‘ పెళ్లయింది , పిచ్చి కుదిరింది ‘  అని. అట్లా పెళ్లి జరిగినతరువాత, పిచ్చి కుదిరిన సంఘటనలు మీ ఎరుక లో ఉంటే తెలియ చేయండి. నా అనుభవం లో ,పెళ్లి అయిన తరువాత, పిచ్చి కుదరడం మాట అటుంచి , పిచ్చెక్కడం చాలా మంది లో చూశాను. ! క్రితం టపాలలో చూసినట్టు, ఈ రకమైన పిచ్చి , పలు రకాలు గా ఉండడం కూడా గమనించాను.  ఇక పిచ్చి కుదరడానికి శాస్త్రీయం గా మందుల తో చికిత్స గురించి తెలుసుకుందాము ! ఈ మందులు కొన్ని రకాలు గా ఉంటాయి. 
1. mood stabilizers. వీటిని మన మూడ్ ను స్థిత పరిచే మందులు గా చెప్పుకోవచ్చు:
లిథియం : లిథియం ఒక ఖనిజం అంటే మినరల్. ఈ ఖనిజం యొక్క ఔషధ గుణాలూ , దానిని పిచ్చి చికిత్స లో చాలా కాలం నుంచీ ఉపయోగిస్తూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో కొన్ని క్షార సరస్సులలోని నీరు తాగమని సలహా ఇచ్చే వారు. మీకు తెలిసే ఉంటుంది కదా ఆమ్లాలు పుల్ల గా ఉంటాయనీ క్షారాలు ఉప్ప గా ఉంటాయనీ. క్షార సరస్సులలో నీరు తాగిన వారికి పిచ్చి కుదిరేది. కానీ ఇటీవల పరిశోధనల వల్ల, ఆ క్షార సరస్సులలో ఉన్న నీటి లో ఖనిజాలు , ప్రత్యేకించి లిథియం అనే ఖనిజం ఉందని కనుక్కునారు. జాన్ కేడ్ అనే ఆస్త్రేలియన్  మొట్టమొదటి సారి శాస్త్రీయం గా లిథియం యొక్క ఔషధ గుణాలను, పిచ్చి కి చికిత్సలో లిథియం యొక్క ఉపయోగాలూ వివరించాడు తన పరిశోధనా పత్రం లో.( 1949 ). గత యాభై ఏళ్ల గా లిథియం ను మానియా లేదా పిచ్చి చికిత్సకూ , నివారణకూ , ప్రపంచం అంతా ఉపయోగిస్తున్నారు. లిథియం ఒక మోతాదు లో తీసుకుంటే పిచ్చి పోవడమే కాకుండా , నివారణ కు కూడా ఒక మంచి ఔషధం గా పనిచేస్తుంది. కాక పొతే  ఈ లిథియం తీసుకుంటున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  వారు కిడ్నీ అంటే మూత్ర పిండాలు , ఇంకా థైరాయిడ్ పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒక సారి చేయించు కుంటూ ఉండాలి. అంతే కాక  వారి రక్తం లో లిథియం ఏ పాళ్ళ లో ఉందో కూడా క్రమం గా పరీక్ష చేయించు కుంటూ ఉండాలి. దీనిని లిథియం లెవెల్స్ టెస్ట్ అంటారు.
2. anti psychotics:  వీటిని మన ఆలోచనలను సవ్యం చేసే మందులు గా చెప్పుకోవచ్చు.  కొట యపిన్ , రిస్పరిడోన్, ఒలాంజాపిన్ అనే మూడు ప్రధానమైన యాంటీ సైకాటిక్ మందులు పిచ్చి చికిత్స లో వాడ బడుతున్నాయి.
3. anti epileptics: వీటిని మూర్చ నివారణ మందులు అని తెలుగులో అంటారు.  వాల్ప్రోఎట్ , కార్బమజపిన్ అనే మందులు ప్రధానం గా మూర్చల నివారణకు వాడుతారు. కానీ ఈ మందులు పిచ్చి నివారణకు కూడా బాగా ఉపయోగ పడతాయి. ఈ విషయం అనేక పరిశోధనల వల్ల తెలిసింది. అందువల్ల ఈ మందులను కూడా విరివి గా పిచ్చి నివారణలో కూడా వైద్యులు రికమెండ్ చేస్తారు. 
4.anti depressants: ఈ మందులను యాంటీ దిప్రేస్సేంట్ లు అంటారు. ఈ మందులు ప్రధానం గా వెన్లా ఫాక్సిన్ , ఫ్లూఆక్సిటిన్ వంటి డిప్రెషన్ కు చికిత్స గా ఉపయోగించే మందులు. కానీ పిచ్చి లో కూడా ఈ మందులు ఎందుకు ఉపయోగిస్తారంటే, పిచ్చి తగ్గగానే వారు డిప్రెషన్ కు లోనవటానికి అవకాశాలు ఎక్కువ. ఆ సమయం లో వారు డిప్రెషన్ తో బాధ పడకుండా యాంటీ దిప్రేస్సంట్ లు వేసుకుంటూ ఉండాలి.  మనకు తెలుసు కదా డిప్రెషన్లో  మానసిక స్థితి క్రుంగి పోయే విధం గా ఉంటుందని. ఈ మూడ్ పైకి పోయి పిచ్చి రూపం లో ఉండడం , అట్లాగే క్రుంగి పోయి , డిప్రెషన్ రూపం లో ఉండడం వల్లే  ఈ వ్యాధిని రెండు భిన్న ధ్రువాల వ్యాధి అంటే బై పోలార్ డిసార్డర్  అంటారు శాస్త్రీయం గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే !.6.

In మానసికం, Our minds on జూలై 13, 2012 at 11:36 ఉద.

పిచ్చి సంగతులు తెలుసుకోవడం మంచిదే !.6.

మెదడులో ఏ మార్పులు పిచ్చి కి కారణమవుతాయి?: 
ఈ కారణాలను మనం అయిదు రకాలు గా తెలుసుకోవచ్చు.
1. ( మెదడు లో ) నిర్మాణాత్మక తేడాలు, మార్పులు: 
పక్ష వాతం అంటే స్ట్రోక్ వచ్చిన వారిలోనూ, ప్రమాద వశాత్తూ తలకు గట్టి దెబ్బ తగిలి తద్వారా మెదడు లో కొంత భాగం దెబ్బ తిన్న వారిలోనూ , ఇంకా మెదడు లో కంతులు అంటే ట్యూమర్లు   ఉన్న వారిలోనూ పిచ్చి లక్షణాలు ఉండడం జరుగుతుంది. దీని వల్ల వైద్యులకు, మెదడు లో నిర్మాణాత్మక మార్పులు వస్తే, ఆ మార్పులు పిచ్చి కి దారి తీస్తాయి అని తెలిసింది.
2. ( మెదడు ) పని చేయడం లో తేడాలు , మార్పులు: మెదడు రక్త సరఫరా లో జరిగే మార్పులను విశదం గా అధ్యయనం చేసి ( అంటే ప్రత్యేకమయిన స్క్యాన్ ల ద్వారా , వీటిని ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోనేన్స్  fMRA  స్క్యాన్ అంటారు ) పిచ్చి వచ్చిన వారి మెదడు లో ఒక భాగం లో ( దీనిని DLPFC అంటారు ) రక్త సరఫరా లోపం ఉందని గమనించడం జరిగింది.
3. ( మెదడు లోని ) జీవ రాసాయనాలలో తేడాలు , మార్పులు: నార్ ఎపినెఫ్రిన్ , డోపమిన్, గ్లుటామేట్, ఇంకా జీ ప్రోటీన్లు అనే జీవ రసాయనాలూ , సి ఆర్ ఎఫ్ ( CRF ) అనే హార్మోను లో మార్పులు కూడా పిచ్చి ఉన్న వారి మెదడు లో గమనించడం జరిగింది.మిగతా జీవ రసాయనాల వివరాలు పైన ఉన్న పటం లో చూడ వచ్చు. ఈ చిత్రం లో ఆకు పచ్చ గానూ , పర్పుల్ రంగులోనూ రెండు బుడిపెలు గమనించారా ? అవి బాగా స్థూలం గా చూప పడిన , యదార్ధానికి అతి సూక్ష్మం గా ఉండే నాడీ తంత్రుల చివరలు లేదా మొనలు. ఆ ప్రదేశం లో జీవ పటం లో వివరించినట్టు గా, వివిధ జీవ రసాయనాలు , వివిధ సంజ్ఞలను , లేదా సిగ్నల్స్ ను ఒక నాడీ తంత్రి చివర నుంచి, ఇంకో తంత్రి చివరకు సరఫరా చేస్తాయి. ఇట్లా సిగ్నల్స్ ప్రయాణం చేయడం లో లోపం అంటే అవి ఎక్కువగా , అతి వేగం గా ప్రయాణం చేసినా , లేదా తక్కువ గా, అతి నెమ్మది గా ప్రయాణం చేసినా , ఆ ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుంది. చిత్రం గా ఉంది కదూ సృష్టి రహస్యం ! 
4. ( మెదడు లో ) సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  లో మార్పులు: 
మన దేహం లో ప్రతి కణమూ , అత్యంత సున్నితం గా ఉంటుంది. అంతే కాక , ప్రతి కణమూ, కొన్ని ప్రత్యేకమైన జీవ రసాయనాలను, హార్మోనులను మాత్రమే తనలోకి , అంటే కణం లోపలికి అనుమతిస్తుంది. మన దేహం లో ప్రతి చర్యా , హార్మోనులూ, జీవ రసాయనాలూ , ఒక చోటినుంచి అంటే ఒక కణం నుంచి , ఇంకో కణానికి పంపటం వలననే జరుగుతాయి. అట్లాగే మన మెదళ్ళలో కూడా , ప్రతి  సంజ్ఞా , ప్రతి ఆలోచనా , ఒక కణం నుంచి, ఇంకో కణానికి ప్రయాణం చేస్తే నే మన ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి. ఈ ఆలోచనలు క్రియా రూపం దాల్చడానికి సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  అనే జీవ క్రియ చాలా ముఖ్యమైనది. క్రింద ఉన్న చిత్రం చూడండి.
 పిచ్చి ఉన్న వారిలో ఈ సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ లో మార్పులు వస్తాయి.
పై కారణాలు తెలుసుకోవడం ఎందుకంటే , చికిత్స జరిగే సమయం లో , మనకు  మందులు ఎందుకు వాడడం జరుగుతుందో అర్ధం కావడానికి.   ఉదాహరణకు , మూడవ కారణాన్ని సరి చేయడానికి కొన్ని మందులు పనికి వస్తాయి. అట్లాగే నాల్గవ కారణమైన సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ ను సరి చేయడానికి కొన్ని మందులు ఉపయోగ పడతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

In మానసికం, Our minds on జూలై 12, 2012 at 5:25 సా.

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

క్రితం టపాలో మరి పిచ్చి వస్తే, ఎట్లా కనుక్కోవచ్చో , దాని గురించి కొంత తెలుసుకున్నాము కదా !  పిచ్చి, మానవ మస్తిష్కం విపరీతమైన వేగం తో ఆలోచనలు వచ్చినప్పుడు , ఆ వేగం తో వస్తూన్న ఆలోచనల ప్రభావం , మన ప్రవర్తన లో కూడా కనిపించి , ప్రవర్తన అస్తవ్యస్త మవటం వల్ల  వస్తుంది. మస్తిష్కం లో ఆలోచనలు సామాన్యం గా ఉంటే ఆ స్థితి ని నార్మల్ మూడ్ లేదా యూ తైమిక్ మూడ్ అంటాము. అదే అత్యంత వేగానికి విరుద్దం గా , ఆలోచనలు కనుక అత్యంత నిదానం గా వస్తూ ఉంటే, మనం స్లో అవుతాము. డిప్రెషన్ వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. ఈ క్రింది పటం గమనించి నట్టయితే మనకు విశదమవుతుంది ఈ మూడ్ స్థితులు. ఆంగ్లం లో ఉన్నాయి పదాలు కానీ శులభం గా అర్ధమవుతాయి , అందరికీ ! 
 
ఇప్పుడు మనం మానియా కూ , హైపో మానియా కూ తేడాలు చూద్దాము. హైపో అంటే  తక్కువ , లేదా క్రింద అని అర్థం. మనం సాధారణం గా చూస్తూ ఉంటాము , అనుకుంటూ కూడా ఉంటాము ఎవరైనా , విపరీతం గానూ , ఎక్కువ హడావిడి గానూ ప్రవర్తిస్తూ , అటూ ఇటూ తిరుగుతూ ఉంటే , వీడెవడో యమ హైపర్ ‘ అని. హైపర్ అంటే ఎక్కువ లేదా ఎగువ అని అర్థం. మనం సామాన్యం గా అనుకునే హైపర్  స్థితి  శాస్త్ర రీత్యా  హైపో మానియా గా చెప్పుకోవచ్చు.  అంటే హైపో మానియా లక్షణాలు, వంద శాతం పిచ్చి లక్షణాలు గా కాక , ఏ యాభై , అరవై శాతమో ఉంటాయి. అంటే ఈ హైపో మానియా లక్షణాలు, ఉన్న వారు , సమాజం లో చాలా మంది ఉంటారు. బహుశా , నిజం గా పిచ్చి ఉన్న వారికంటే ఎక్కువ శాతం ఉంటారు. వారిలోని పిచ్చి లక్షణాలు, ఆందోళన పడ వలసిన లక్షణాలైనా,  మరీ విపరీతం గా , వెంటనే ఆస్పత్రి లో చేర్పించ వలసినంత అత్యవసరం గా ఉండవు. వీరిలో అంటే హైపో మానియా ఉన్న వారిలో రిస్కు టేకింగ్ బిహావియర్ రవంత తక్కువ గా ఉంటుంది , మానియా ఉన్న వారిలో ఉండే దానికంటే ! 
 
ఈ క్రింద పటం చూడండి , మీకు  శులభం గా అర్ధమవుతాయి , ఈ తేడాలు ! 
ఇక్కడ మొదట ఉన్నది  డిగ్ ఫాస్ట్ అనే పదం అంటే ఆంగ్లంలో ఉన్న అక్షరాలు DIGFAST  ఈ అక్షరాలతో ప్రారంభ మయే  ఆంగ్ల పదాలు, మానియా లో అంటే వంద శాతం పిచ్చి లో ఉండే లక్షణాలు. ( మానియా ను బై పోలార్ వన్ అని శాస్త్రీయం గా అంటారు )దాని క్రింద ఉన్న పటం లో ఉన్నవి , హైపో మానియా లక్షణాలు ( దీనినే బై పోలార్ టూ అని శాస్త్రీయం గా అంటారు , ఎపిసోడ్ అంటే ఒక సారి వచ్చిన వ్యాధిని సింగిల్ ఎపిసోడ్ అంటారు. )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! . 4.

In మానసికం, Our minds on జూలై 10, 2012 at 9:49 సా.

పిచ్చి’  సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! . 4.

మునుపటి టపాలో పిచ్చి లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు పిచ్చి అంటే మానియా వచ్చినప్పుడు దానిని ఎట్లా కనుక్కోవచ్చో తెలుసుకుందాము. ఇంతకు ముందు వివరించినట్టు , పిచ్చి ఉన్నప్పుడు , వారు వారి జీవితాలను రిస్కు లో పెట్టడమే కాకుండా , ఇతరులు జీవితాలకు కూడా ముప్పు తేగలరు. అందు వల్ల, మనకు పిచ్చి లేక పోయినా, పిచ్చి సంగతులు తెలుసుకుంటే , తగిన సమయం లో ఆ లక్షణాలు ఎవరిలో నైనా కనిపెట్టి , సరి అయిన వైద్య సహాయం తీసుకునేట్టు చూడ వచ్చు.
ఎట్లా కనుక్కోవచ్చు ? : 
ఇది  5 విధాలు గా ఉండవచ్చు.
1. వ్యాధి నిర్ణయం చేయడం. 2.వ్యాధి తీవ్రత ను నిర్ణయించడం. 3. వ్యాధి ఆ సమయం లో కనిపించడానికి గల కారణాలు వెతకడం. 4. వ్యాధి లక్షణాలు కనిపించిన వారికి ఏ సహాయం అందుతుందో అంచనా వేయడం. 5. ఇతరుల మీద వారి ( వ్యాధి లక్షణాల ) ప్రభావం. 
1. పిచ్చి మానసిక వ్యాధి: అందువల్ల  ఈ వ్యాధి లక్షణాలు  కనిపించిన వెంటనే,  వైద్య సహాయం పొందాలి.  పిచ్చి లక్షణాలు వచ్చిన వారు ఎట్లాగూ , తాము పిచ్చి గా ఉన్నట్టూ , ప్రవర్తిస్తున్నట్టూ , ఎప్పుడూ ఒప్పుకోరు. అందువల్ల వారి మానసిక లక్షణాలు , ప్రవర్తనా, వారి చుట్టూ ఉండే వారు గమనించాలి. ఈ చుట్టూ ఉన్న వారు , తల్లి దండ్రులు , తోబుట్టువులు, స్నేహితులు , బంధువులు, లేదా వారు చదువుకునే కాలేజీ లో సహా విద్యార్ధులు , లేదా పనిచేసే ఆఫీసులలో, ఫాక్టరీ లలో సహ ఉద్యోగులు – ఇట్లా ఎవరైనా కావచ్చు. అందువల్లనే ఇతరుల ప్రాముఖ్యం ఇంత గా ఉంటుంది. వారే  సరిఅయిన  వివరాలు ఇవ్వ గలరు.
అతిగా వాగటం , అతిగా ఖర్చు పెట్టడం, గొప్పలు చెప్పుకోవడం, ప్రగల్భాలు పలకడం – ఈ లక్షణాలు అన్నీ మనం సామాన్యం గా మామూలు మనుషులలో కూడా చూస్తాము కదా ! మరి వీరికీ పిచ్చి ఉన్న వారికీ తేడా ఏమిటి ? అని ఆలోచిస్తే  ఈ లక్షణాలు వీరిలో ఆకస్మికం గా వస్తాయి. అంటే అప్పటి వరకూ మామూలు గా ఉన్న వారు, ఈ లక్షణాలతో ప్రవర్తిస్తారు. వారి ప్రవర్తన పూర్తిగా అసహజం గా ఉంటుంది వారు తెలిసిన వారికి. ‘ ఇదేంటిరా వీడు సడన్ గా ఇలా ప్రవర్తిస్తున్నాడు ? ‘ అనుకుని ఆశ్చర్య పోయేట్టు గా ఉంటుంది వీరి ప్రవర్తన ! కనీసం ఒక వారం రోజులు , ఆ పిచ్చి లక్షణాలు చూపిస్తూ ఉంటే అప్రమత్తత వహించాలి. 
అంతే కాక కొన్ని సమయాలలో , ప్రత్యేకించి విద్యార్ధులు, విద్యార్ధినులు  మాదక ద్రవ్యాలు తెలిసో , తెలియకో తీసుకుంటే కూడా వారిలో  పిచ్చి లక్షణాలను పోలిన ప్రవర్తన కనిపించ వచ్చు.
2.వ్యాధి తీవ్రత కనుక్కోవడం : ఇందుకు , వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి తో పాటు , వారికి అతి దగ్గర సంబంధం ఉన్నవారు ఇచ్చే వివరాలు కూడా వ్యాధి తీవ్రతను నిర్ణయించడానికి ఏంటో ఉపయోగ పడుతుంది.  ఈ సమయం లో  వ్యాధి లక్షణాలు ఉన్న వారి జీవితాలలో వచ్చిన తీవ్రమైన వత్తిడి కలిగించే ఏ సంఘటనలు అయినా ఉన్నాయేమో కూలంక షం గా పరిశీలించాలి. అట్లాగే , వారు నిద్ర లేమి తో బాధ పడుతున్నారేమో కూడా కనుక్కోవాలి. అదే విధం గా  వారు ఇటీవల దుబారా గా ఖర్చు పెడుతున్నారో లేదో , లేదా కామ పరంగా విశృంఖలత చూపుతున్నారో కూడా కనుక్కోవడం ఉత్తమం.
3.ఆ వ్యాధి లక్షణాలు ఆ సమయం లో వారిలో కనిపించడానికి ఏమైనా ప్రత్యెక పరిస్థితులు ఉన్నాయేమో కూడా పరిశీలించాలి. మనసును తీవ్రం గా గాయ పరిచే , లేదా కలత చెందించే ఏ సంఘటన అయినా కేవలం డిప్రెషన్ గానే కాక , మానియా లేక పిచ్చి రూపం లో కూడా కనిపించ వచ్చు. ఈ కారాణాలు మనం తెలుసుకోగలిగితే , చికిత్స జరిపే సమయం లో ఈ కారణాల మీద కేంద్రీకరించవచ్చు.
4. ముఖ్యం గా వ్యాధి లక్షణాలు కనిపించిన వారి కి అందుతున్న సహాయం , సంపూర్ణం గా పరిశీలించాలి. మానసిక వ్యాధి అంటే, ‘ మన ‘ భారత దేశం లో ఇంకా ‘ చేత బడి ‘ జరిగిందనో , దయ్యం పట్టిందనో , వివిధ రూపాలలో వారిని తీవ్రం గా , మానసికం గానూ , భౌతికం గానూ , హింసించడం సర్వ సాధారణం. అందు వల్ల ఈ వ్యాధి ‘ లేదా  ‘ పిచ్చి ‘ లక్షణాలు ఉన్న వారి చుట్టూ ఉన్న వారి అవగాహన ఏమిటి ? వారి  సహాయ సహకారాలు ఏమైనా రోగి కి అందుతాయా లేదా అని నిర్ణయించాలి ముందే ! 
5. ఆ వ్యాధి  ఉన్న వారి తల్లిదండ్రులు , తోబుట్టువులు , లేదా స్నేహితులు , ప్రియులు , సహచరులు వీరు ఏ విధం గా ఆ వ్యాధి వల్ల ప్రభావితం అవుతున్నారో కూడా వివరం గా తెలుసుకుని, వారికి తగు సలహా ఇవ్వాలి. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 
 

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! .3.

In మానసికం, Our minds on జూలై 9, 2012 at 7:51 సా.

 ‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! .3.

క్రితం టపాలో మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం లో కొన్ని , మానియా లేదా పిచ్చి లక్షణాలు ఏ విధం గా ఉంటాయో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు ఇంకొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాము.
పిచ్చి ఉన్నప్పుడు మాట అంటే స్పీచ్  లో కూడా మార్పులు గమనించ వచ్చు. సామాన్యం గా ఒక వేగం తో మాట్లాడే వారు , అకస్మాత్తుగా మాట్లాడే వేగం పెంచడం కనిపిస్తుంది. అంటే ‘ గడ గడ గడా ‘ మాట్లాడుతూ నే ఉంటారు పిచ్చిలో. అంటే ఒక మాట పూర్తి అవక ముందే ఇంకో మాట మొదలుపెడతారు.ఇట్లా చేస్తూ మాటల వేగం పెంచుతారు. అంతే కాక,  వీరు మాట్లాడే విషయాలు కూడా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాయి. ముందు చెప్పుకున్నట్టు , ఆలోచనలు పగ్గాలు లేకుండా పరిగెత్తుతాయి అందు వల్ల , ఆలోచనలను ప్రతిబింబించే మాటలు కూడా , పగ్గాలు లేకుండా , పరి పరి విధాల పరిగెత్తుతాయి.
ఉదాహరణకు :’  చంద్రమండలం వెళ్లి రాగలను నేను , ఏమనుకుంటున్నారో , మన్మోహన్ సింగు తో  మాట్లాడాను నేను , స్కూటర్ మీద వెళతాను ,  చాలా పుస్తకాలు రాశాను నేను కవిత్వం మీద , దయ్యాలు కనిపిస్తే వాటిని వెళ్లి పొమ్మని చెప్పాను. నా బొటన వేలు నొప్పి గా ఉంది. లాటరీ లో ఇరవై లక్షలు గెలిచాను. మీరు వాక్సినేషన్ చేయించుకోండి. గ్రహాంతర వాసి నన్ను రమ్మన్నాడు, మార్సు మీదకు’ ఇట్లా ఉంటుంది వారు మాట్లాడడం ! కొన్ని సమయాలలో మనం క్రితం ఎప్పుడూ వినని భాష లేదా మాటలు కూడా మాట్లాడుతారు పిచ్చిలో , అంటే నిజం గా పిచ్చిగా మాట్లాడతారు. ఇంతే కాకుండా , పిచ్చి బాగా ఉన్నప్పుడు , వీరు వీరికి వచ్చే క్రోధం అంటే కోపం నియంత్రించుకొలేరు. అంటే కంట్రోలు చేసుకోలేరు. వారి సమీపం లో ఉన్న వస్తువుల మీద కానీ , మనుషుల మీద కానీ ఆ కోపాన్ని చూపిస్తారు , ఏదో ఒక రూపం లో !  అవి తిట్ల రూపం లో ఉండవచ్చు , లేదా ‘ బాదుడు ‘ రూపం లో ఉండవచ్చు !  అట్లాగే వీరికి ఆకలి అయితే కూడా ,విపరీతం గా ఆవురావురు మని సామాన్యం గా తినే దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ తింటూ ఉంటారు.  ఇంకా కామ వాంచలు కూడా వీరిలో సాధారణం గా ఉండే దానికన్నా ఎక్కువ గా ఉంటుంది. దీనితో వీరు విపరీతమైన , కామ పరమైన విశృంఖలత కూడా చూపుతూ ఉంటారు. సమస్యలలో చిక్కుకుంటారు కూడా ! ఇక వారి అపోహలు లేదా  డి ల్యుజన్ ( delusions ) లు కూడా మిగతా వారికి విచిత్రం గా ఉంటాయి.
ఉదాహరణకు : వారు దైవాంశ సంభూతులమని , వారికి రోజూ నో , లేదా వారు కోరుకున్నప్పుడో , దైవం కనిపించి మాట్లాడి, తమకు సలహాలు ఇవ్వడం చేస్తారని చెపుతూ ఉంటారు. అట్లాగే వారు తరచూ , కైలాసానికి వెళ్లి , అక్కడ ఉన్న వారితో కొంత కాలం గడిపి వస్తూ ఉంటామని కూడా చెపుతుంటారు. ఈ విధంగా ప్రగల్భాలు పలకటాన్ని గ్రాండి యోస్  డి ల్యుషన్స్ అంటారు . కొన్ని  సమయాలలో  వీరు మనుషులను కానీ జంతువులను కానీ చూస్తూ వారి సంభాషణలు కూడా వింటూ ఉంటారు, వారు సమీపం లో లేక పోయినా కూడా. ఈ పరిస్థితిని హాల్లూసి నేషన్స్ అంటారు. ( hallucinations ). వీరు ఏదైనా వాహనం నడిపించే సమయం లో కూడా విపరీతమైన ఆత్మ విశ్వాసం తో నడిపి తమ ప్రాణాల  మీదకూ , ఇతరుల ప్రాణాల మీదకూ , అలవోకగా తెచ్చుకుంటారు.వీరికి డబ్బు కానీ , క్రెడిట్ కార్డ్ లు కానీ అందుబాటు లో ఉంటే ‘ అంతే సంగతులు !  విపరీతం గా ఖర్చు చేస్తారు, ఏమాత్రం సంకోచించ కుండా !
ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ,వారి మటుకు వారికి , వారు చేసే ప్రతి పనీ ఎంతో సమంజసం గా సరి అయినది గా వారికి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అంటే వారు యుక్తా యుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. ముఖ్యం గా పిచ్చి లక్షణాలు పూర్తి గా ఉండి , పిచ్చి గా ప్రవర్తిస్తూ ఉన్న వారు , తమకు ఏ విధమైన  మానసిక వ్యాదీ లేదని , వారు సంపూర్ణం గా ఆరోగ్య వంతులు గా ఉన్నామనీ , అనుకుంటారు. 
మరి ఈ పిచ్చి లక్షణాలు ఇంకే సందర్భం లో నైనా రావచ్చా ? :  కొన్ని రకాలైన మాదక ద్రవ్యాలు  అంటే ‘  యాంఫీ టమిన్ లు , లేదా ఇతర స్టిమ్యు లెంట్ మందులు తీసుకున్న వారు కూడా , ఈ పిచ్చి లక్షణాలు చూపించ వచ్చు.  ప్రత్యేకించి నైట్ క్లబ్బు లలో ఈ రకమైన మందులు ,  రహస్యం గా అమ్ముతూ ఉంటారు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

‘పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే ! 2.

In మానసికం, Our minds on జూలై 8, 2012 at 12:34 సా.

‘పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం  మంచిదే !  2.

శాస్త్రీయం గా మరి ‘ పిచ్చి ‘ ని ఏమంటారు ?: 
పిచ్చిని  మానియా అంటారు. ఈ మానియా , డిప్రెషన్ కు ఖచ్చితం గా వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. మనం డిప్రెషన్ గురించి ‘ బాగు ‘ మొదటి టపాలలో చాలా వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! డిప్రెషన్ లో ఉండే మానసిక , ఇంకా ప్రవర్తనా లక్షణాలు  ఏ విధం గా ఉంటాయో, వాటికి వ్యతిరేకం గా మానియా లో లక్షణాలు ఉంటాయి. అంతే కాక ,  మానియా ఉండే వారిలో కొన్ని పరిస్థితులలో డిప్రెషన్ కూడా రావచ్చు. అంటే మానియా ఉన్న వారిని శాస్త్రీయం గా బై పోలార్ డిసార్డర్ ఉన్న వారు అంటారు.అంటే రెండు భిన్న ధ్రువాలు గా ఉంటుంది వీరి మానసిక స్థితి. అంటే , డిప్రెషన్ అంటే మానసికం గా క్రుంగి పోవడమూ , లేదా మానసికం గా ఎంతో  తీవ్ర స్థితి అంటే ఉచ్చ స్థితిలో ఉండడమూ ! మానవులు సాధారణంగా , అన్ని ఎమోషన్ లూ  సమ పాళ్ళలో అనుభవించుతూ, తమ నిత్య జీవితాన్నీ , తమ చుట్టూ ఉండే సమాజం లో సంతృప్తికరం గా సత్సంబంధాలు కలిగి ఉండి, ఒక సమతుల్యమైన ప్రవర్తన కలిగి ఉంటే, దానికి కారణం వారిలో , వారి ఆలోచనలూ , మూడ్లూ  అంటే mood , సమ తుల్యం గా ఉండడమే ! 
పిచ్చి లేదా మానియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ  నిర్వచనం ఏమిటంటే : మనలో సహజం గా ఉండవలసిన మూడ్ కంటే ఎంతో ఎక్కువ గా ఉండడం దీనినే ఏలే టెడ్ మూడ్ అంటారు ఆంగ్లం లో. తెలుగులో  మనం సామాన్యం గా అంటూ ఉంటాము ‘ వాడి పరిస్థితి ,పట్ట పగ్గాలు లేకుండా ఉంది ‘లేదా ‘ పట్ట శక్యం కాకుండా ఉంది ‘  అని. ఈ ప్రయోగం మన తెలుగులో చక్కగా చేశారు. అంటే మన ఆలోచనలు , ప్రవర్తనా , ఏవిధం గా ఒక అశ్వం లేదా గుర్రం  పగ్గాలు అంటే రీన్స్  లేకపోతే యధేచ్చ గా అంటే  తన ఇష్టం వచ్చిన దిశలో ఎట్లా పరిగెత్తుతుందో , ఆ పరిస్థితి లో ఉంటామన్న మాట ! ఇక్కడ ఆలోచనలు ఒక విధమైన పరుగు లో ఉంటాయి. అంటే అనేక మైన ఆలోచనలు, విపరీతమైన వేగం తో మన మనసులో లేదా మస్తిష్కం లో మెదలడం. అంతే కాక , ఆ ఆలోచనలకు ఏ విధమైన నియంత్రణా , అంటే కంట్రోలు లేక పోవడం ! ఇక ఇట్లాంటి మూడ్ తో పాటు , హైపర్ యాక్టివిటీ అంటే మామూలు కంటే ఎక్కువ గా యాక్టివ్ గా ఉండడం. అంటే  తాము, అన్ని పనులూ , ఏమాత్రం అలసట లేకుండా చేసుకుంటూ పోవడం. ఉదాహరణకు , ఆఫీసు లో సాయింత్రం దాకా పని చేసి వచ్చి, మళ్ళీ రాత్రంతా ఇల్లు సర్దడమో, లేదా టీవీ చూస్తూ ఉండడమో , లేదా కంప్యూటర్  లో బ్రౌజ్ చేస్తూ ఉండడమో చేయడం. ఇట్లా పగలూ రాత్రీ పని ఏక బిగిని చేస్తున్నా, అలసట అనుభూతి లేక పోవడం. సహజం గా మనం భౌతికం గా అలసిపోతూ ఉంటాము ఇట్లా పగలూ రాత్రీ పని చేస్తూ ఉంటే ! కానీ మానియా ఉన్న వారు ఈ అనుభూతి చెందరు. అంతే కాక వారు వారికి నిద్ర తక్కువ గా పోయినా , ఏ మాత్రం లెక్క చేయక , పైగా ఇతరులతో ‘ గొప్పలు ‘ కూడా చెపుతూ ఉంటారు, తాము రాత్రులు నిద్ర లేక పోయినా , ఎంతో సమర్ధ వంతం గా పని చేయ గలరని ! వారి మూడ్ లో వచ్చే మార్పుల వల్ల, వారు ప్రగల్భాలు పలుకుతున్నట్టు కూడా గమనించ లేరు ! దీనినే గ్రాండి యొసిటీ అంటారు. పిచ్చి కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయని తెలిపింది.  వీరి లో నిద్ర పోవాలని అనిపించదు ఇంతకు ముందు వివరించినట్టు గా ! అంతే కాక , వారికి ఎక్కడ లేని ఆత్మ విశ్వాసము వచ్చేస్తుంది ఈ పిచ్చి ఉన్న సమయం లో ! అంటే సాధారణ సమయాలలో స్తబ్దుగానో , లేదా అతి నెమ్మది గా ఉండే వారు , అకస్మాత్తు గా విపరీతమైన ఆత్మ విశ్వాసం ఎవరో వారిలో ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్టు ప్రవర్తించు తారు. అంతే కాక వీరిలో ఏకాగ్రత తీవ్రం గా లోపిస్తుంది. అంటే, వారు చేస్తున్న పనులన్నీ పూర్తి ఏకాగ్రత తో చేయ లేక పోవడం , లేదా చాలా శులభం గా వారు కేంద్రీకరించిన ఏకాగ్రతను కోల్పోవడమూ జరుగుతుంది.  ఉదాహరణకు : ఇంట్లో ,ఒక పని చేస్తున్నప్పుడు , ఫోను రింగవుతూ ఉంటే వెంటనే, ఆ పని మానేసి , ఫోను ఆన్సర్ చేయడం సహజమే కదా ! కానీ వీరు ఫోను లో మాట్లాడుతూ, అవతల వారికి వేచి ఉండమని చెప్పి ఈ లోగా , రేడియో లో పాట వినిపిస్తూ ఉంటే , ఆ పాటకు వారి స్వరం కలిపి పాడుతూ , మమైకం చెంది , నృత్యం కూడా చేయడం మొదలెట్టు తారు. వారు చేస్తున్న పని మాట ఇక  దేవుడికే ఎరుక ! 

మిగతా విషయాలు వచ్చే టపాలో !