Our Health

Archive for the ‘Our minds’ Category

సోషల్ ఫోబియా కు చికిత్స. 5.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on జనవరి 29, 2013 at 10:13 ఉద.

సోషల్ ఫోబియా కు చికిత్స. 5.

 
ఈ సోషల్ ఫోబియా ఉన్న వ్యక్తులు నలుగురి లో ఉన్నప్పుడు ,  కొన్ని ప్రవర్తనా లక్షణాలను చూపిస్తారు.
1.కళ్ళలోకి చూసి మాట్లాడక పోవడం. అంటే  తదేకం గా ఎదుటి వారి కళ్ళలోకి చూడడం దాట వేయడం. ఈ పరిస్థితి ఎదుటి వారికి మీ మీద నమ్మకాన్ని కలిగించదు. లేదా సందేహాలనూ , అపోహలనూ కలిగించు తుంది.
2. తమ వ్యక్తి గత విషయాలను ఏమాత్రం బయటకు రానీయరు. దీనికి కారణాలు ఏమైనా అవవచ్చు కూడా. కొందరు ఆత్మ న్యూనతా భావం తో అట్లా చేస్తే , ఇంకొందరు ,  కొంత వ్యక్తి గత కారణాల వల్ల  కూడా చేయవచ్చు.
3. ఎదుటి వ్యక్తి  గురించి ఆరా తీయడం , వారి గురించిన విషయాలనే ఎక్కువ గా అడగడం కూడా చేస్తూ ఉంటారు. పై విధమైన ప్రవర్తన ద్వారా వీరు , కొత్త వాతావరణం లో పరిస్థితులను , తమ నియంత్రణ లో ఉంచుకుంటూ ఉన్నట్టు భావిస్తారు. 
చికిత్స : 
ఇక ముఖ్య విషయమైన చికిత్స ఏమిటి ఈ లక్షణాలకు ?  దీనికి సమాధానం  మిగతా మానసిక రుగ్మతలూ , వ్యాధుల లాగానే , చికిత్స , కేవలం మందులతో నే కాదు.మానసిక శాస్త్రం లో చికిత్స అంటే , మందుల తో పాటుగా , మన లో మార్పు , అంటే మన  మస్తిష్కం లో మార్పులు , అంటే మన ఆలోచనా ధోరణి లో మార్పులు.మనం ఉండే వాతావరణం లో మార్పులు.  ఈ మూడూ , లక్షణాల తీవ్రత ను బట్టి , ఒకటి గానీ , రెండు కానీ లేదా మూడూ కానీ ఆచరించాలి.
A .స్వయం సహాయం :  సెల్ఫ్ హెల్ప్ : 
మీరు , ఎంత తెలివి గలవారైతే , అంత  స్వీయ సహాయం చేసుకోగలరు, లాభ పడగలరు. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది ముఖ్యం గా తెలివి తేటలు డిగ్రీలతో నో ,పరీక్షా ఫలితాలతోనో , పోల్చి చెప్పిన విషయం గాదు.  మీలో మీ లక్షణాలనూ , పరిస్థితులనూ , విశ్లేషణ చేసుకునే స్వభావం , శక్తి సామర్ధ్యాల ను గురించే !అన్ని చికిత్సా పద్ధతులలోకీ ఇది చాలా, చాలా ముఖ్యమైనది.  
మీరు చేయవలసినవి :
1. ఆత్మ విశ్వాసం పెంపొందించుకునే చర్యలు చేపట్టడం. అంటే  సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను వృద్ధి పరుచుకునే టేపు లు, సీడీ లో వినడం , చూడడం. అట్లాగే ఆందోళన లేదా యాంగ్జైటీ ను తగ్గించే , రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడం , లేదా  ఆ టేపులు వినడం. 
2. ఇతరుల మధ్య ఉన్నప్పుడు , మీలో మీరు మీ ఆలోచనా సముద్రం లో కొట్టుకు పోకుండా , ఇతరులు చెప్పేది శ్రద్ధ గా వినడం అలవాటు చేసుకోవాలి.
3.ఒక నోటు బుక్ తీసుకుని, మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ , కలత చెందిస్తున్న నిరాశావాద అంటే నెగెటివ్ ఆలోచనలు అన్నింటినీ రాసుకోండి.అప్పుడు వాటిని సవ్యం గా చేసుకోవడానికి అవకాశం ఎక్కువ గా ఉంటుంది. అంటే మీ ఆలోచనా ధోరణి లోనూ తద్వారా మీ ప్రవర్తనా ధోరణి లోనూ మంచి పురోగమన అంటే ప్రోగ్రెస్సివ్ మార్పులు వస్తాయి.
4. సోషల్ ఫోబియా మీకు వచ్చే సమయం లో జరిగే మార్పులను , ఒకటొకటి గా మీరు విభజించు కుంటే , వాటిని మొగ్గలోనే తుంచి వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఫోబియా కలుపు మొక్క మీ ఆనంద మయ జీవిత ఉద్యాన వనం లో పెరగ లేదు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని చికిత్సా పద్ధతులు ! 

 

సోషల్ ఫోబియా కు చికిత్స.4.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on జనవరి 28, 2013 at 12:46 సా.

సోషల్ ఫోబియా కు చికిత్స.4.

సోషల్ ఫోబియా ఎంత సామాన్యం ?:  ప్రతి వంద మంది లోకీ అయిదుగురు ఈ సోషల్ ఫోబియా తో బాధ పడుతూ ఉంటారు.

ఈ సోషల్ ఫోబియా దీర్ఘ కాలం గా ఉంటే  దాని పరిణామాలు ఏమిటి ?:
క్రితం టపాలో చెప్పుకున్నట్టు, సోషల్ ఫోబియా ఉన్న వారు, నలుగురి లోకీ చొరవగా వెళ్ళ  లేక , తమ శక్తి సామర్ధ్యాలను వంద శాతం బయట పెట్టలేక , తీవ్రమైన మానసిక వత్తిడికీ , సంక్షోభానికీ లోనవుతుంటారు. అప్పుడు వారికి డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. క్రమేణా  వారు బయటకు వెళ్ళడమూ , పది మంది లో కలవడమూ , పదిమంది లో జంకు లేకుండా మాట్లాడడమూ , లేదా తమ తమ పనులు చేసుకోవడమూ కూడా చేయలేక పోతారు. ఈ లక్షణాలు ఇంకా ఇంకా ఉంటే , వారు క్రమేణా  బయటకు వెళ్ళాలంటే నే ఉత్సాహం చూపరు.  బయటకు వెళ్ళాలంటే భయం ఏర్పడుతుంది.  క్రమేణా  వారు వెళ్ళే ప్రదేశం లో జన సంచారం ఏమాత్రం లేకపోయినా , వారు లేని పోని  భయాలు ఏర్పరుచుకుని , విపరీతమైన భయానికి లోనవుతారు. ఈ పరిస్థితిని శాస్త్రీయం గా అగారో ఫోబియా ( agorophobia  ) అని అంటారు. ఇంకా వీరు ఇంట్లో కూర్చొని ఆందోళన చెందుతూ , చెడు అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం కూడా ఉంది. అంటే ధూమ పానం , మద్య పానం  లాంటివి. ఇంకా కొందరు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి కూడా అలవాటు పడతారు. 
సోషల్ ఫోబియాకు కారణాలు ఏమిటి ?: 
ఈ సోషల్ ఫోబియా కు ఇతమిద్ధం గా కారణాలు అంటూ ఏవీ లేవు.  వ్యక్తిగతం గా తమ ప్రతి ప్రవర్తనకూ ఉన్నత ప్రమాణాలు ఉండాలని భావిస్తూ , ఖచ్చితమైన నిబంధనలు పాటించే వారిలో  , ఈ రకమైన ఫోబియా  రావడానికి అవకాశాలు మెండు గా ఉంటాయి. అంతే  కాకుండా, ఇట్లాంటి ఉన్నత ప్రమాణాలను, వారు చేసే ప్రతి పనిలో చిన్న తనం నుంచీ , వారి మీద రుద్దే వారు ( అంటే పెద్ద వారూ , తలి దండ్రులూ , టీచర్లూ ) ఉన్నప్పుడు కూడా , ఈ లక్షణాలు అలవడ వచ్చు.ఇంకా బాల్యం లో తత్తర పడుతూ , నత్తి ( అంటే స్టామరింగ్  ) ఉన్న వారు కూడా , పెరిగి పెద్దయాక , ఈ సోషల్ ఫోబియా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి.  
ఒక సారి ఈ సోషల్ ఫోబియా వచ్చాక , అది ఎట్లా  కొనసాగుతుంది ?: 
స్వంత అపోహలూ ఆలోచనలూ !
1. ” నేను వెళ్ళే ప్రతి చోటా , కలిసే  వారితోనూ , చాలా తెలివిగా ప్రర్తించాలి ! అంతే  కాక , నేను ఉన్న చోట ( అంటే పదుగురిలో ఉన్నప్పుడు కూడా ) పరిస్థితులన్నీ ,నా నియంత్రణ లోనే ఉండాలి ” అనే భావనలు .
2. ” నేను చాలా బోరింగ్ , నాలో ఏవీ ఉత్సాహ కరమైన లక్షణాలు లేవు ” అనే ఆత్మ  న్యూ నతాభావనలు.
3. ” నేను ఎక్కడ ఉన్నా , ఇతరులు నన్ను విమర్శించే ఉద్దేశం తో , నాలో లోపాలు వెదుకుతూ ఉంటారు” అనే భావన. 
4. ప్రవర్తన పంచనామా : అంటే ప్రతి సారీ , నలుగురి లో కలిసే  ముందూ , కలిసిన తరువాతా కూడా , తమ ప్రవర్తనను విశ్లేషించు కుంటూ , అన్నీ నెగెటివ్ అంటే నిరాశా వాద , భావనలే నెమరువేసుకుంటూ ఉండడం వల్ల.పైన చెప్పిన నెగెటివ్ భావనలు మనసు లో ఎప్పుడూ మెదులుతూ ఉంటే , ఈ ఫోబియా మొక్క కూడా  ఆ ” ఆలోచనల నీరు ” తాగుతూ, వృద్ధి చెందుతూ ఉంటుంది. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

నలుగురిలోఉంటే , బిడియం ( సోషల్ ఫోబియా ) ఎట్లా ఉంటుంది?.3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on జనవరి 27, 2013 at 12:06 సా.

నలుగురిలోఉంటే , బిడియం ( సోషల్ ఫోబియా )  ఎట్లా ఉంటుంది?.3.

 
సామాన్యం గా మానవులకు , కొత్త వారితో నలుగురినో , పది మంది నో కలిసినప్పుడు , కొంత బిడియం  ఉండడం సహజం. ఇది సామాన్యం గా వారితో కొంత సేపు ఉన్న తరువాత , లేదా మాట్లాడుతుంటే , తగ్గి పోతుంది. ఆ కొత్త వారితో కలిసి ఆ యా సందర్భాలను, ఆనందం గా గడపడం కూడా జరుగుతుంది. అట్లాగే ,మనకు అనేక మైన భయాలు ఉండవచ్చు , కొందరికి హైట్స్  అంటే ఎత్తైన భవనాల లోకి వెళ్ళాలంటే, లేదా సాలి పురుగును చూసో , కొంత భయం కలుగుతూ ఉంటుంది.
మరి భయం ఫోబియా అయ్యేది ఎప్పుడు ? : మరి ఈ రకమైన భయాలు చాలా మందికి ఉంటున్నా కూడా , వాటిని పట్టించుకోక , మనం చేయవలసిన పనులన్నీ  మామూలు గానే చేసుకుంటూ ఉంటాము ! కానీ ఈ రకమైన భయాలు , ఎప్ప్పుడైతే , మన నిత్య జీవితం లో మనం చేసుకునే మామూలు పనులకు కూడా అంతరాయం కలిగించి , మనలను ఆశక్తులను చేస్తాయో , అప్పుడు ఆ భయాలు ఫోబియా లు అనబడతాయి.సోషల్ ఫోబియా లో ముఖ్యం గా రెండు రకాలు గా ఆలోచించడం జరుగుతుంది.
A .మనం కలుసుకునే మనుషులు, మనల్ని ఏదో రకం గా విమర్శిస్తారనే భావన.
B . లేదా మనం నలుగురిలో ఏదో ఇబ్బంది కరం గా ప్రవర్తిస్తామేమో అనే భావన.
ఈ సోషల్ ఫోబియా కూడా రెండు రకాలు గా ఉంటుంది.
1. సాధారణ సోషల్ ఫోబియా :
a . ఈ రకం లో వీరు  కలుసుకోబోయే మనుషులందరూ వీరిని  చూస్తున్నారనీ, వీరు చేయబోయే ప్రతి పనినీ గమనిస్తున్నారానీ , అనుకుంటూ ఉంటారు !
b .వీరికి  ఇతరులతో పరిచయం చేసుకోవడం, లేదా ఇంకెవరితో నైనా చేయించుకోవడానికి  కూడా సుముఖం గా ఉండరు !
c .వీరు   బయటకు వెళ్లి , ఏ  షాపు కో , షాపింగ్ కాంప్లెక్స్ కో , లేదా ఏ  హోటల్ కో వెళ్ళడానికి కూడా ఇబ్బంది గా ఉండి , బయటకు వెళ్ళడం మానేస్తారు !
d .నలుగురిలో, ఏ  పానీయం గానీ , ఆహారం కానీ తీసుకోవడానికి జంకుతారు !  
e .బయటకు వెళ్లి  పై బట్టలు తీసి వేసుకోవడానికి ( అంటే ఉదాహరణకు బీచ్ కు వెళ్ళినప్పుడు ) కూడా చాల సిగ్గు పడతారు వీరు ! ( ఇట్లాంటి పరిస్థితి పాశ్చాత్య దేశాలలో సాధారణం గా ఉంటుంది ! ) సోషల్ ఫోబియా పరం గా ఇది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది ! 
f .అంతే  కాక ,  వీరు వీరి అవసరాలను తెలుపడానికి , అంటే ఎసర్టివ్  గా ఉండడానికి కూడా జంకుతూ  ఉంటారు , సోషల్  సిచు యే షన్  లలో ఉన్నప్పుడు .
ప్రత్యేకించి , ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడో , లేదా పార్టీ జరిగినప్పుడో ఈ సోషల్ ఫోబియా కనబడుతూ ఉంటుంది. ఈ ఫోబియా ఉన్న వారు ,  ఫంక్షన్ హాలు లోకి గానీ ,పార్టీ హాలులోకి గానీ ప్రవేశించడానికి జంకుతూ  ఉంటారు. అందు వల్ల , వారు ముందే అక్కడకు చేరుకున్నా , లోపలి కి ప్రవేశించక , బయటే తచ్చాడు తూ  ఉంటారు.ఈ సోషల్ ఫోబియా తీవ్రం గా ఉన్న వారు , ఒక సిగరెట్ తాగడమో , లేదా మందు పుచ్చుకోవడమో  కూడా చేస్తూ ఉంటారు , ఇట్లా పార్టీ లకు వెళ్ళే ముందు ! దానివల్ల పరిస్థితి ఇంకా సమస్యా భరితం అవుతుంది.
2.ప్రత్యేకమైన సోషల్ ఫోబియా : 
ఈ రెండో రకమైన సోషల్ ఫోబియా సాధారణం గా , సేల్స్ మెన్ లోనో , టీచర్లూ, సంగీత కారులూ , నటులు , లేదా నటీ మణులు అనుభవిస్తారు. వీరు సాధారణం గా  నలుగురిలో కలిసి సరదాగా ఉండడానికీ , సమయం గడపదానికీ ఏ విధం గానూ ఇబ్బంది పడరు. కానీ నలుగురిలో , ఒక విషయం మీద మాట్లాడ వలసి వచ్చినప్పుడు కానీ , వారికి సమాధానం ఇవ్వ వలసి వచ్చినపుడు కానీ , విపరీతం గా ఫోబియా కు లోనవుతారు !  వారి కి మాట రాక తత్తర పడుతూ ఉంటారు కూడా !  చాలా అనుభవం ఉన్న వారు కూడా ఈ ప్రత్యేకమైన సోషల్ ఫోబియా ఉంటే  ఇట్లా ప్రవర్తిస్తారు ! ఈ పరిస్తితులల్లో , వారు  ఆందోళనకు లోనై , చెమటలు పట్టడం , నోరు పొడిగా అవడం , గుండె వేగం గా కొట్టుకోవడం , మూత్ర విసర్జనకు ఆత్రుత పడడం  కూడా తరచూ జరుగుతూ ఉంటుంది ! ఇంకా తీవ్రం గా ఈ లక్షణాలు ఉంటే , అది ప్యానిక్ గా పరిణమిస్తుంది.  ఈ ప్యానిక్ ఎటాక్ లో , విపరీతమైన ఆందోళన , భయం కలిగి , వారు వారి పరిస్థితి మీద పట్టు కోల్పోతున్నామనే నిర్ణయానికి  వచ్చి , కూలబడి పోతారు ! కొన్ని క్షణాలు వారు శక్తి హీనులూ , నిర్వీర్యులూ అవుతారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం !

In మానసికం, Our Health, Our minds on జనవరి 26, 2013 at 10:34 ఉద.

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం ! 

The hospital superbug MRSA

 
ఇది అన్నది ఎవరో  చదువు రాని  వారు కాదు !  ఇంగ్లండు దేశానికి ప్రధాన వైద్య అధికారిణి  డేం సాల్లీ డేవిస్  నిన్న ఇంగ్లండు పార్ల మెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్న మాటలు ! 
అంతే  కాక , పార్లమెంటు సభ్యులు ,  అత్యవసర ప్రాతిపదికన  తదనుగుణం గా చర్యలు చేపట్టాలి అని కూడా ఆమె  అన్నది ! అంటే , అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టడం ! ఇట్లా చాలా అరుదు గా అంటే వేల  సంఖ్య  లో అంటువ్యాధుల వల్ల  ప్రజలు మరణించే ప్రమాదం ఉన్నప్పుడు. ఇటీవల , స్వైన్ ఫ్లూ ప్రమాదం సంభవించి నప్పుడు కూడా , అనేక దేశాలలో అత్యవసరం గా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. సాల్లీ డేవిస్  మరి ఇంగ్లండు దేశ ప్రజలకు అత్యవసరం అయ్యే ఈ యాంటీ బయాటిక్స్ ప్రళయం కలిగిస్తాయని ఎందుకు అన్నదో  తెలుసుకుందాం ! 
ఆమె ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ పరిణామాల పరిస్థితిని , ఒక పెద్ద విపత్కర వరద పరిస్థితి తోనూ , ఫ్లూ పాన్ డెమిక్  తోనూ , లేదా ఉగ్రవాదులు  ఎక్కువ మంది ప్రజలను పొట్టన పెట్టుకోవడం తోనూ పోల్చింది.(  ఇంగ్లండు లో పైన చెప్పిన పరిస్థితులలో , అత్యవసర పరిస్థితి ప్రకటించి వివిధ చర్యలు చేపట్టడం కూడా జరిగింది ). 
అయినప్పటికీ , ఇంగ్లండు లో యాంటీ బయాటిక్స్ విరివి గా వాడుతూ  ఉండడం వల్ల , వాటి ప్రభావం తగ్గి పోతుందని తెలుస్తుంది. ఇట్లా యాంటీ బయాటిక్స్ పని చేయక పోవడం అనేది కొన్ని వందల పేషెంట్ లలో జరిగి వారి ప్రాణాలు పోవడం జరిగింది.అంతే  కాక ఇట్లా యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్న వారి లో అవి పని చేయక పోవడం క్రమేణా  ఎక్కువ అవుతుంది. ఇదే పరిస్థితి కొన  సాగితే , వచ్చే ఇరవై ఏళ్ల  లో , మనుషులు సాధారణ ఆపరేషన్ లు చేయించుకున్నా ,ఇన్ఫెక్షన్ కనుక సోకితే ,ఇచ్చే యాంటీ బయాటిక్స్  పని చేయక , ప్రాణాలు కోల్పోవడం సామాన్యం అవుతుందని ఆమె అన్నది. ఈ యాంటీ బయాటిక్  రెసి స్టెన్స్  అనే విషయం కొత్తదేమీ కాదు.  యాంటీ బయాటిక్స్ కనుక్కున్నప్పటి నుంచీ , ఉన్నది. అంటే అవి వాడగా వాడగా , వాటితో  పోటీకా  అన్నట్టు , వివిధ రోగ కారక బాక్టీరియా లు కూడా , కొత్త కొత్త రకాలు గా వాటి లో నిరోధక శక్తిని  కలిగించుకుంటాయి. అందువల్ల , బ్యాక్టీరియా లు నాశనం అవక ,మన శరీరం లో ఇన్ఫెక్షన్ ను ఎక్కువ చేసి , మానవ మరణాలకు కారణమవుతాయి. MRSA ఎమ్మారెస్సె  అనే యాంటీ బయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్ కూడా , ప్రస్తుతం ఇంగ్లండు లో అనేక ఆసుపత్రులలో పెద్ద తలనొప్పి గా పరిణమించింది ! 
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , కొత్త కొత్త మందులు కనుక్కోవడం వల్ల , ఈ బ్యాక్టీరియా లను కూడా నిర్మూలించే అవకాశం ఉండేది ఇప్పటి వరకూ ! కానీ అత్యంత  శక్తివంతమైన కార్బిపెనెమ్  అనే యాంటీ బయాటిక్ కు కూడా, అది పని చేయక , బ్యాక్టీరియా ల లో నిరోధక శక్తి పెరిగినట్టు ఇటీవల తెలిసింది.అంతే కాక క్యాన్సర్ చికిత్స కు అనేక కొత్త మందులు కనుక్కుంటూ ఉండడం తో , అవి కూడా  శరీరం లో రోగ నిరోధక శక్తి ని తగ్గిస్తాయి. ఇది కూడా బ్యాక్తీరియాలు విజ్రుభించ డానికి , ఒక కారణం.
రోగ కారక బ్యాక్టీరియా లు  ఇదివరలో లా కాక ఇప్పుడు యాంటీ బయాటిక్స్ కు అసలే  లొంగడం లేదనడానికి ఇంకో ఉదాహరణ : గనేరియా. గనేరియా ఒక సుఖ వ్యాధి. అంటే ఈ వ్యాధి ఉన్న పురుషుడి తో( ఆరోగ్యం గా ఉన్న )  స్త్రీ కానీ , లేదా ఈ వ్యాధి ఉన్న స్త్రీతో  ( ఆరోగ్యం గా ఉన్న ) పురుషుడు కానీ సంభోగం జరిపితే గానీ వస్తుంది. ఇప్పటి వరకూ , ఈ గనేరియా వ్యాధి , టెట్రా సైక్లిన్ , పెనిసిలిన్ , అనే మనకు పరిచితమైన యాంటీ బయాటిక్స్ కనుక వాడితే చప్పున నయమయేది.కానీ  ప్రస్తుతం , 80 శాతం  కేసులలో ఈ వ్యాధి ఆ యాంటీ  బయాటిక్స్ కు  నిర్మూలనం అవడం లేదు !  అందువల్ల కొత్త యాంటీ బయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఇంకో ఆందోళన కర పరిణామం ఏమిటంటే , ఇంత  వరకూ , మల్టీ డ్రగ్  చికిత్స కు చప్పున నయమవుతున్న  టీబీ ( TB ) వ్యాధి కూడా ఆ మందులకు నయ మవ్వక తిరగబడడం మొదలు పెట్టింది. 
భారత దేశం లో ప్రజలూ , వైద్య అధికారులూ ,  ఈ మార్పులను అవగాహన చేసికొని తదనుగుణం గా చర్యలు తీసుకోవాలి ! ముఖ్యం గా ప్రజలు, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు , కనీసం జ్వరం వచ్చినా , యాంటీ బయాటిక్స్ డాక్టర్ రాయక పొతే తృప్తి పడరు. ” ఆ డాక్టరు , మళ్ళీ రావాలని , తన చుట్టూ తిప్పించుకుని , డబ్బులు లాగాలని చూస్తున్నాడు ” అని అనుకుంటారు ! వెంటనే చికిత్స కు యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని అనుకునే వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు.  ఈ ఆలోచనా ధోరణి లో మార్పు రావాలి. ఇంగ్లండు దేశం లో సామాన్యం గా యాంటీ బయాటిక్స్ ఎడా పెడా  ఎవరు బడితే వారు ప్రిస్క్రైబ్ చెయ్యరు.  అంటే యాంటీ బయాటిక్స్ ను వాడమని చెప్పే వారు తప్పని సరిగా డాక్టర్లూ , స్పెషలిస్టు డాక్టర్లు అయి ఉండాలి ( భారత దేశం లో ,విచ్చల విడిగా, ఎవరు పడితే వారు, ఆఖరికి , చాలా సందర్భాలలో మందుల షాపు లో పని చేసే వారు కూడా యాంటీ బయాటిక్స్ వాడమని సలహా ఇస్తారు ! ఇక నర్సింగ్ హోము లలో అయితే సరే సరి !  ఆ ఇచ్చే యాంటీ బయాటిక్స్ ను వీలు చేసుకుని  ఏ  సెలైన్ బాటిల్ ఇచ్చిన తరువాతో , లేదా ఏ  గ్లూకోజు బాటిల్ నరం లోకి ఎక్కించిన తరువాతో , పేషెంట్ ల నరాలలోకి ఎక్కిస్తారు !  )
( తరచూ , చీటికీ , మాటికీ , అనవసరం గా యాంటీ బయాటిక్స్ కనుక తీసుకుంటూ ఉంటే ,  మనలో రోగనిరోధక శక్తి తగ్గి పోయి , ఇన్ఫెక్షన్ కారకమైన బ్యాక్టీరియా లలో నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఆ బ్యాక్టీరియా లు  మనం తీసుకునే యాంటీ బయాటిక్స్ కు నశించక  పోగా, వృద్ధి చెందుతూ , రోగ తీవ్రత కు కారణ మావుతాయనే యదార్ధాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలి ! )
 
ఈ క్రింద ఉన్న ప్రకటన చూడండి ! ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయం లో వచ్చినది. కానీ ఇప్పటికీ వర్తిస్తుంది ! 
      వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

నలుగురిలో బిడియమూ , సిగ్గూ !.2.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on జనవరి 25, 2013 at 10:21 ఉద.

నలుగురిలో బిడియమూ , సిగ్గూ !.2. 

 
మిగతా కారణాలు :  సామాన్యం గా ఆందోళన ( ఏదో తెలియని భయం ) కూ బిడియానికీ , సంబంధం ఉందని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడతారు. చిన్న పిల్లలలో , భయం, భయం గా ఉంటున్న పిల్లల కంటే , భయం తక్కువ గా ఉన్న పిల్లలు తక్కువ సిగ్గు, బిడియం గా ఉంటారు. జీవ శాస్త్ర రీత్యా పరిశీలించినట్టయితే , భయం గా ఉన్న వారిలో కార్టిసోల్  అనే హార్మోను ఎక్కువ గా ఉత్పత్తి అవుతుంది. ఇటీవలి పరిశోధనలలో , ఇంకా కొన్ని హార్మోనులు కూడా ఈ బిడియాన్నీ, సిగ్గునూ మానవులలో ప్రభావితం చేస్తాయని తెలిసింది.
పాదరస ప్రభావం : పద్దెనిమిదవ శతాబ్దం లో ఇంగ్లండులో టోపీలు తయారు చేసే వారు , విపరీతమైన ఆందోళనా , భయాలకు లోనై , పిరికి గా ప్రవర్తిన్చేవారు ట.అంటే వారు స్త్రీ పురుషులైనప్పటికీ , ఈ లక్షణాలు తరచూ వారిలో కనిపిస్తుంటే , పరిశీలించి చూడగా , దీనికి కారణం , పాదరస ప్రభావం అని తెలిసింది.ఆ కాలం లో టోపీలు తయారు చేసే సమయం లో పాదరసం వాడే వారు. ఆ పాదరసం వారు పీల్చగా పీల్చగా , పాయిజనింగ్ అయి , వారిలో  ఆ లక్షణాలు కనిపించాయి.
చిన్న తనం లో బిడియం గా ఉండే వారు , పెద్దైనా కూడా అంతేనా ?:
చాలా మందిలో , బాల్యం లో ఉండే బిడియం , సిగ్గు, వారు పెరిగి పెద్దైన తరువాత మటు  మాయం అవుతుంది. వారు సమాజం లో చక్కగా , ఏ సిగ్గూ , బిడియామూ  లేకుండా ఇమిడి పోతారు.  కాక పొతే , బాల్యం లో ఈ బిడియమూ, సిగ్గూ , వారి చదువులో అభివృద్ధి కి అవరోధం గా ఉంటుంది.  క్లాస్ రూం లో  సిగ్గు , బిడియం ఉన్న విద్యార్ధులు , అవి లేని వారితో పోలిస్తే , తక్కువ గా పర్ఫాం చేస్తారు. అంటే వారి శక్తి సామర్ధ్యాలు పూర్తి  గా వినియోగించలేక పోతారు.చాలా సమయాలలో , ఈ సిగ్గూ , బిడియమూ , వివిధ సామాజిక  సమూహాలలో ఇతర ( కొత్త ) వ్యక్తులతో కలిసినప్పుడు  ఏమి మాట్లాడాలో తెలియక పోవడం వల్ల  ఉత్పన్నం అవుతుంది. ఇంకొన్ని సమయాలలో ఏదో తెలియని  అనీజీనెస్స్  అంటే  ఇబ్బంది గా అనిపించి కూడా , సిగ్గు పడ వచ్చు !  ఎక్కువ సమయాలలో ఈ రెండు కారణాలూ కలిసి కూడా బిడియమూ , సిగ్గూ కలిగిస్తాయి. 
తెలివి తేటలకూ, బిడియానికీ  సంబంధం ఉందా ? : 
ఇప్పటి వరకూ అనేక పరిశోధనల వల్ల , ఒకరి తెలివి తేటలకూ వారి బిడియానికీ , సిగ్గుకూ ఏమాత్రం సంబంధం లేదని తెలిసింది. ఏమైనా ఉన్నదంటే అది పాజిటివ్ సంబంధమే ! అంటే  సిగ్గు , బిడియం ఎక్కువ గా ఉన్న వారు , ఇతర ” మామూలు ” మనుషుల కంటే ఎక్కువ ప్రతిభావంతులని కూడా తెలిసింది.అందుకే , మనం చూస్తుంటాము , తరచుగా , మెడికల్ , ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలలో ప్రధమం గా వచ్చినవారు ( అంటే టాపర్స్ ) కూడా , వినయం గా సిగ్గుగా , బిడియం గా కనిపిస్తూ ఉంటారు టీవీ షో లలో !  ఈ కారణం వల్ల నే , కొందరు మానసిక విశ్లేషకులు , ఈ సిగ్గు , బిడియాలు కాస్త ఎక్కువ గా చూపించే వారు , కేవలం తమకు ఇష్టం లేని , ప్రతి కూల  సామాజిక పరిస్థితులలో, అంటే సోషల్ సిచుఎషన్స్  లో  తమ ఇష్ట ప్రకారం, చేసే ప్రవర్తన కూడా కావచ్చు  అని అంటారు ( అంటే వారు , తమకు తెలిసి ఉండే , ఈ విధం గా ప్రవర్తిస్తారు, అంటే వాలంటరీ బిహావియర్ )
 
అందుకే, బిడియ  పడే వారూ , అతిగా సిగ్గు పడే వారు , కంగారూ , ఆందోళన పడ నవసరం లేదు , వారికి ఏదో తీవ్రమైన మానసిక రుగ్మత ఉందనుకుని !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

నలుగురి లో బిడియమూ , సిగ్గూ ! ,( shyness and social phobia )

In మానసికం, Our Health, Our minds on జనవరి 24, 2013 at 11:45 ఉద.

నలుగురి లో బిడియమూ , సిగ్గూ ! ,( shyness  and  social  phobia  ) : 

 
మానసిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సిగ్గు, ఇతరులెవరైనా సమీపించి నప్పుడు కానీ , వారు ఇతరులను సమీపిస్తున్నప్పుడు కానీ అనుభవించే  , ఒక రకమైన కంగారూ , ఎబ్బెట్టు లేదా  ముభావం. ప్రత్యేకించి కొత్త వాతావరణం లో కొత్త మనుషుల దగ్గర.  ఈ అనుభవాల తీవ్రతను బట్టి వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. అంటే , ఈ సిగ్గు , బిడియం  కాస్తా తీవ్రం అయినప్పుడు , సోషల్ ఫోబియా , లేదా సోషల్ యాంగ్జైటీ అవుతుంది. పురుషుడు  ( లేదా యువకుడు )  సమీపిస్తున్నప్పుడు , లేదా చూస్తున్నప్పుడు ,వయసు లో ఉన్న  అమ్మాయి లో సహజం గా ఉండే బిడియం , సిగ్గు  పైన చెప్పుకున్న వాటి కోవ  కు చెందదు.  ఆ సిగ్గు వారిలో ప్రక్రుతి తో తమ సంగమాన్ని తెలియ చేస్తుంది .  ముగ్ధ మనోహరమైన వారి  సిగ్గులో ఒక విరిసీ విరియని సుగంధ పుష్పం సాక్షాత్కరిస్తుంది . మనం తెలుగు సినిమాలలో చూసే అసంఖ్యాక   తొలి రాత్రి ద్రుశ్యాలను , యువతి లో సిగ్గు లేకుండా ఊహించుకోలేము ! ( ఆంగ్ల సినిమాల సంగతి వేరు కదా ! ) ( కౌమార దశలో కి అడుగు పెడుతున్న బాలురు కూడా తరచూ సిగ్గు పడుతూ ఉంటారు. ఈ సిగ్గు కూడా సహజమైనదే ! అంటే ఇట్లా ఉండే సిగ్గు అసాధారణం అనబడదు. కానీ  వారు,  ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అట్లాగే సిగ్గు పడుతూ ఉంటే , ఆ విషయాన్ని  పరిశీలించాలి ! )ఈ సోషల్ ఫోబియా వల్ల  అనేకమంది ప్రతిభావంతులు అయిన యువతీ యువకులు , చొరవ ఏమీ లేని , కొన్ని సమయాలలో చేత గాని వారి లా ముద్ర వేయ బడతారు. వారికి వచ్చిన లేదా వచ్చే అమూల్య మైన అవకాశాలను కోల్పోతూ ఉంటారు.
మరి ఈ సిగ్గు , నలుగురిలో బిడియం గురించి శాస్త్రీయం గా తెలుసుకుందాం !  
ఈ సిగ్గూ , బిడియాల మూలాలేంటి ?: 
ముఖ్యం గా ఆ వ్యక్తి  కి సంక్రమించిన జన్యువుల ప్రభావం , వారు పెరిగే  వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది. ప్రత్యేకించి , వారి వారి చిన్న తనం లో వారిని  శారీరికం గా కానీ మానసికం గా కానీ చాలా అవమానం, హేళన చేసిన సంఘటనలు ఉంటే , వారి మనసులలో అవి చెరగని ముద్ర వేసి , వారి భవిష్యత్తులో కూడా  వారు అభివృద్ధి చెందలేని అగాధాలను శ్రుష్టిస్తాయి.  సిగ్గు, బిడియం , కనీసం కొంత వరకైనా వారి వారికి సంక్రమించిన జన్యువుల ప్రభావం వల్లనని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. వారి దృష్టి లో మొదట గా సిగ్గు పడడం  జరిగి , తరువాత , తరువాత , వారు వివిధ సామాజిక వాతావరణాలలో ఉన్నప్పుడు , ఆందోళన చెందడం వల్ల  సోషల్ యాంగ్జైటీ గా పరిణమిస్తుందని అభిప్రాయ పడతారు.  ఇట్లా సోషల్ యాంగ్జైటీ గా లక్షణాలు పరిణామం చెందినప్పుడు,  ఈ లక్షణాల తో పాటు గా , మానసికం గా క్రుంగి పోయే లక్షణం అంటే డిప్రెషన్ కూడా ఉంటుంది. అందువల్ల ఆ యాంగ్జైటీ ఉన్నప్పుడు , చెప్పలేని భయం అంటే ఫియర్ ఇంకా  ప్యానిక్ లక్షణాలను కూడా వారు అనుభవిస్తారు. కొన్ని పరిశీలనల ద్వారా పాశ్చాత్య దేశాలలో  గర్భం దాల్చిన కాలం లో  పగలు కాంతి తక్కువ గా ఉన్నప్పుడు కూడా వారికి పుట్టిన సంతానం లో ఈ సిగ్గు, నలుగురి లో బిడియం ఎక్కువ గా ఉంటున్నాయని కనుక్కున్నారు ( భారత దేశం లో ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే , భారత దేశం లో పగలు ఎప్పుడూ పగలే ! అంటే ఒకే రకం గా వెలుతురు  గా ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశాలలో  చలి కాలం లో కేవలం మధ్యాహ్నం మూడింటికే చీకటి పడుతుంది ! ) 
 
వచ్చే టపాలో సిగ్గు గురించి ఇంకొన్ని సంగతులు  ! 
 
 
 
 
 
  

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

In మానసికం, Our minds on జనవరి 12, 2013 at 8:31 సా.

స్త్రీ హింస ఎందుకు జరుగుతుంది?

 ( ” NO VIOLENCE AGAINST WOMEN ” )

కొన్ని కారణాలు చూద్దాం ! 

పితృస్వామ్యం :  తర తరాలు గా సమాజం లో  లోతు  గా నాటుకున్న పితృ స్వామ్య భావాలు .  స్త్రీ , చదువుకుని , బయటకు వెళ్లి , ఉద్యోగం చేస్తున్నప్పటికీ , , ప్రదానం గా పురుషుడి మాటే , అంటే తండ్రి మాటే  పై చేయి కావాలనుకునే  వాదం ! 

సజాతి వైరం : అంటే  పురుషుడి తో పాటు గా , గర్భం దాల్చిన ‘ తల్లి ” కూడా , పుట్ట బోయేది ఆడ శిశువు అన్న విషయం తెలిసినప్పటి నుంచీ , ఆ విషయాన్ని అంగీకరించలేక పోవడం ,  ఆ ఆడ శిశువుకు  గర్భం లోనో లేదా  పుట్టిన తరువాతనో  ఈ భూమి మీద నుంచి ” శాశ్వతం గా ఉద్వాసన ” చెప్పే మార్గాలు అన్వేషించడం ,  లేదా ఆ  ప్రక్రియలో సఫలం అవడం ! 

ఆడపిల్ల తల్లి దండ్రులు ,  ఆడ శిశువు పుట్టగానే ,  పెరిగి  పెద్దయి నాక  ” కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి ” అందువల్ల  తమ ఆర్ధిక పరిస్థితి విషమిస్తుంది అనే  వాదన. 

తల్లి దండ్రులు , మగ శిశువును  విపరీతమైన  గారాబం తో , శ్రద్ధ తో పెంచుతూ , అదే కుటుంబం లో ఉన్న ఆడ శిశువును అశ్రద్ధ చేయడం ,  ” క్రమ శిక్షణ ” తో పెంచడం వల్ల  ,  మగ శిశువు లోనూ , పెరిగిన తరువాత  పురుషుడి లోనూ  పెరిగే అహంకార భావం , తాను  స్త్రీకన్నా  అధికం  అనే భావాలు  అలవడడం ! 

తల్లి దండ్రుల మధ్య హింస , ఒక ఇన్ఫెక్షన్ :  చిన్న వయసు నుంచీ ,  ఆడ పిల్ల లైనా , మగ పిల్లలైనా ,  సునిశితమైన పరిశీలనా శక్తి , సామర్ధ్యాలు కలిగి ఉంటారు ! 

వారి కుటుంబం లోనూ , పరిసరాలలోనూ  జరుగుతున్న సంఘటనలు ,  ఆనంద కరమైనవి కానీ , హింసా యుతమైనవి గానీ , వారి చిన్నారి హృదయాలలో చెరగని ముద్ర వేస్తాయి !   భర్త ఏ  కారణం వల్ల  నైనా , విపరీతమైన క్రోధం , తన ” ఇల్లాలి ” మీద చూపించి  తరచూ ” చేయి ” చేసుకుంటూ  ఉంటే  ,  అది  పరిశీలిస్తున్న  చిన్నారుల  మనస్సులో ” సామాన్యమైన సంఘటనలు ” అవుతాయి !  వారు పెరిగి పెద్ద వారై   వారి వివాహ సంబంధాలు ఏర్పరుచు కున్నప్పుడు ,వాటిలో కూడా ” హింస ” సాధారణ విషయం అవుతుంది ! 

విసర్జన కన్నా  మింగుడు మేలు :  చాలా మంది అత్యాచార సంబంధాలతో  ” వివాహ బంధం ” కోన సాగిస్తున్న స్త్రీలు ,  సామాన్యం గా , ఆ సంబంధం నుంచి విడి పోయే సమయం లో ఎదురయే భయాలూ , ఆందోళన లూ ,  తలుచుకుని , తరువాత తమకు  ” సొంత వారి నుంచీ ,  ” సమాజం ” నుంచీ ఎదురయే  సమస్యలూ ,భయాల  ను భరించడం కన్నా ,  ” చెడ్డ ” మొగుడితో  ” సంసారం ” మేలు ” అనుకునే  అభద్రతా భావం ! 

పిల్లల భవిత మీద భయాలు :  స్త్రీ   తన వివాహ బంధం లో పరిస్థితులు విషమించి  అది ” విష తుల్యం ” అయినా కూడా , నిరంతరం   పెరుగుతున్న తన పిల్లల భవిత  మీద భయాందోళన లు పెట్టుకుని , వారు ( తాను  విడిపోతే ) పడే కష్టాలను తలుచుకుని ,  విడి పోయే నిర్ణయం మానుకుంటుంది , దానితో ,హింసను  భరించడం ” అలవాటు ” చేసుకుంటుంది.

” సహన మూర్తి ” స్త్రీ ! :  తర తరాలు గా సమాజం లో  వివాహం చేసుకున్న స్త్రీ ని అనేక విధాలు గా వర్ణిస్తూ ఉంటారు అందులో ఒకటి ” ఆ ఇల్లాలు ఎంతో  ఆదర్శ వంతురాలు ”  భర్త తాగి తందనాలు వేస్తున్నా , ఎంతో  సహనం తో  పిల్లలు చదువుకుని పెద్ద వారై ,  వారి దోవల్లో వారు వెళ్లి , పెళ్ళిళ్ళు చేసుకునే వరకూ ,తానే  అంతా  బాధ్యత వహించి చేసింది ” ( స్త్రీ ,  కొవ్వత్తి అయి  కొడి గడుతున్నా పరవాలేదు సమాజానికి ! ) అనే   నల్లటి సంప్రదాయ ముసుగు  వేసుకోవడం అలవాటవుతుంది !  ఆమె  నిఘంటువులో   అన్యాయానికి ఎదురు తిరగడం , ధిక్కరించడం అనే పదాలు  ” సంప్రదాయం ” అనే నల్లటి సిరా తో  శాశ్వతం గా చెరిపి వేసి ఉంటాయి ! 

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీ హింస – కారణాలు

In మానసికం, Our minds on జనవరి 11, 2013 at 9:12 సా.

స్త్రీ హింస – కారణాలు : 

 
వయసు లో ఉన్న వితంతువులు:  ఏ  కారణం చేత నైనా చిన్న వయసు లోనే వితంతువులు అవుతున్న స్త్రీల మీద కూడా హింస ఎక్కువ గా జరుగుతున్నది.వారిని , దూషణ చేయడమూ , ఆహారం సరిగా పెట్టక పోవడమూ , ఇంటెడు పనీ చేయించుకోవడమూ , ఇంట్లో జరిగే సకల అనర్దాలకూ , ఆ వితంతువే కారణమని తీవ్రం గా తిడుతూ , వారి ఆత్మ గౌరవాన్ని కించ పరచడమూ , వారిని తీవ్ర మైన ఆత్మ న్యూనత తో జీవితం గడిపెట్టు చేయడము కూడా చాలా సామాన్యం గా జరిగే సంఘటనలే ! ముఖ్యం గా దేశానికి మారు మూలల్లో ఉన్న గ్రామాలలో ఇది చాలా సాధారణం ! వారి పునర్వివాహాలను నిరశించడం , ఎంత మాత్రమూ అంగీకరించక పోవడమే కాకుండా , ఆ ప్రయత్నాలను కూడా నిరుత్సాహ పరచడం , నీరు గార్చడం కూడా జరుగుతున్నాయి. 
ఆడ శిశువును అంతం చేయడం : ఒక  విశ్వస నీయ మైన అంచనా ప్రకారం భారత దేశం లో యాభై మిలియన్ల ఆడ శిశువులు / బాలికలు/ స్త్రీలు / 
ప్రస్తుత గణాంకాల లాగానే  గర్భ విచ్చిత్తి వల్లనో , వరకట్న మరణాల వల్లనో , మరణిస్తూ పొతే , ఒక మూడు తరాలలో , కనీసం యాభై అవును అక్షరాలా యాభై మిలియన్ల మంది స్త్రీలు  ఈ భారత భూలోకం నుంచి అదృశ్యం అవుతారని  తెలిసింది. 
రిఫరెన్స్: www. 50millionmissing.wordpress.com.
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

స్త్రీల మీదా, బాలికల మీదా, హింస ఏ రకాలు గా ఉంటుంది ?:

In మానసికం, Our minds on జనవరి 8, 2013 at 9:13 సా.

 స్త్రీల మీదా, బాలికల మీదా హింస ఏ రకాలు గా ఉంటుంది ?:

మనం క్రితం టపాలలో ” మన ” భారత దేశం లో స్త్రీల మీద హింస గురించిన గణాంకాలు ( మచ్చు కి 2010 సంవత్సరం ) చూశాము కదా !
ఇప్పుడు మనం భారత స్త్రీల మీదా ఆడ శిశువుల మీదా ఈ హింస ఏ రకాలు గా ఉంటుందో చూద్దాం !
1. మన దేశం లో సర్వ సాధారణమైన హింస , స్త్రీల మీద జరగ దానికి ప్రధాన కారణం ” ఇచ్చిన కట్నం తో ( ” భర్త ” గానీ , భర్త తరుఫు వారు గానీ ) సంతృప్తి చెందక , ఆ కోపాలూ , అసంత్రుప్తులూ ఆ అమాయక స్త్రీ మీద నిరంతరం గా ఏదో రూపం లో చూపించడం జరుగుతుంది. అనుమాన పిశాచం తో వేధింప బడిన ” భర్త ” కానీ వారి తరుఫు వారు కానీ వివిధ తీవ్రత ల లో ” భార్య ” ను హింసించడం జరుగుతుంది. ఈ అనుమానపు పిశాచి ఆవహించిన ఒక ” భర్త ” చేసిన నిర్వాకం తండూరి మర్డర్ గా తీవ్ర సంచలనం కలిగించింది కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ లో !
( ఈ తండూరి హత్య వివరాలలోకి వెళితే , నయనా సహాని ఒక అందమైన స్త్రీ (  పైన ఉన్న ఫోటో చూడండి ) , ఆమె అనేక తీపి కలలు కంటూ , ఒక కాంగ్రెస్ నేత , ఎమ్మెల్యే కూడా అయిన సుషీల్ శర్మ ను వివాహమాడింది. నయనా సహానీ స్వతహా గా కాంగ్రెస్ కార్యకర్త . సుషీల్ శర్మ స్నేహితుడు మత్లూబ్ కరీం కూడా కాంగ్రెస్ కార్య కర్త. మత్లూబ్ కరీం కు నయనా సహానీ ముందే తెలిసి ఉండడం తో , వారి స్నేహం , సుషీల్ శర్మ లో అనుమాన పిశాచం దిన దినాభి వృద్ధి చెందడానికి దోహద పడ్డది. ఒకరోజు , ఇంటికి తిరిగి రాగానే , మద్యం సేవించి , ఫోనులో మాట్లాడుతూ ఉన్న నయనా సహానీ సుషీల్ శర్మ కంట బడ్డది ! దానితో విపరీతం గా కోపోద్రేకుడైన సుషీల్ శర్మ భార్య ఎవరికీ ఫోన్ చేసిందో నంబర్ చూసి కనుక్కున్నాడు. అది మత్లూబ్ కరీం దే ! వెంటనే సుషీల్ శర్మ తన సొంత భార్యను పిస్టల్ తో షూట్ చేసి చంపేశాడు ! తరువాత ( నయనా సహానీ శవాన్ని , తన స్నేహితుడైన కేశవ్ కుమార్ రెస్టారెంట్ ఒకటి ” బగియా ” అని ఉంది , అక్కడికి తీసుకు వెళ్ళాడు ! కేశవ్ కుమార్ ను ఉపాయం చెప్ప మన్న్నాడు శవాన్ని మాయం చేసే ఉపాయం ! తాను , తన భార్యను హత్య చేశాడనే నిప్పు లాంటి నిజాన్ని , తండూరీ నిప్పుల్లో కప్పేసి దాచేద్దామని అనుకున్నాడు ! అందుకోసం కేశవ్ కుమార్ సహాయం తో మరణించిన తన భార్య నయనా సహానీ శరీరాన్ని ముక్కలు ముక్కలు గా చేసి , తండూరి కుంపటి లో వేశాడు ! అనుమాన పిశాచి కాస్తా పూర్తిగా ఆవహించి సుషీల్ శర్మ ను ఒక మానవ పిశాచి గా, ఒక మానవ కసాయి గా మార్చేసింది ! నిజాన్ని నిప్పుల్లో కప్పేద్దామని అనుకున్న మానవ కసాయి ఎత్తు పారలేదు ! ఆ రాత్రి , కాపలా పోలీసులు ఇద్దరి కంట , ఎప్పుడూ తండూరీ పొగ గొట్టం లోనుంచి వచ్చే పొగ , ఇంకా ఎక్కువ గా , ( నర ) మాంస వాసనతో వస్తూ ఉంటే , అనుమానించి, రెస్టారెంట్ లో కి వెళ్ళారు. ఆ సమయం లో కేశవ్ కుమార్ తో సహా సుషీల్ శర్మ తప్పించుకుని పారి పోయాడు. ఒక వారం రోజుల తరువాత పోలీసులకు లొంగి పోయాడు. శవ పంచనామా ( పోస్ట్ మార్టం ) మొదటి సారి జరిపినప్పుడు దొరకని రెండు బుల్లెట్ లు , ( ? !! )  రెండో సారి ఒక ప్రొఫెసర్ జరిపిన పంచనామా లోనయనా  సహానీ తల, మెడ భాగాల లోదొరికాయి ! . దానితో సుషీల్ కుమార్ కు కోర్టు వారు మరణ దండన విధించారు కనీసం పది ఏళ్ళు గా ఆ ” పిశాచ కుమార్ ” జైలు చువ్వలు లెక్క పెడుతూ ఉన్నాడు, సుప్రీం కోర్టు తీర్పు కోసం ! )

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

రెండు వేళ్ళ ( అ ) న్యాయం !

In మానసికం, Our minds on జనవరి 6, 2013 at 12:01 సా.

రెండు వేళ్ళ ( అ ) న్యాయం !

ఢిల్లీ లో నివసిస్తున్న, లేదా సందర్శించిన నా స్నేహితు రాళ్ళు అందరికీ ఒక్కో కధ ఉంటుంది, అక్కడి పురుషుల గురించి చెప్పడానికి ! క్రిస్టీన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ఆన్త్రపాలజిస్ట్. ఆమె తన తల్లితో ఢిల్లీ లో కనాట్ ప్లేస్ లో వీధిలో నడుస్తుంది. ఆమె తన తల్లికి ( తల్లి మొదటి సారి ఢిల్లీ కి రావడం ) భారత దేశం ఎంత అత్భుతమైన దేశమో చెప్పాలని అనుకుంది. అంతలో అకస్మాత్తుగా ఒక పురుషుడు , క్రిస్టీన్ దగ్గరకు వచ్చి, ఆమె తల్లి ఎదురుగుండానే , ఆమె జననాంగ ప్రదేశాన్ని తన చేతితో తాకి, నవ్వుకుంటూ , జనం లో కలిసిపోయాడు. ఈ సంఘటనతో క్రిస్టీన్ విలపించింది. ఆమె ఇంకా బాధ పడ్డది, వేరే కారణానికి , భారత దేశం లో గ్రామాలలో ఉండే ,పేద వారూ , నిమ్న కులాల వారూ అయిన స్త్రీల పరిస్థితులు,  ఇంకా ఎంత అధ్వాన్నం గా ఉంటాయో ఊహించుకుని ! 

ఢిల్లీ భారత దేశం లో మిగతా పట్టణాలతో పోలిస్తే , ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ ఉన్న అవినీతిమయ రాజకీయాలు , మనుషుల ను కూడా అవినీతి మయం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత దేశం లో ప్రతి వెయ్యి మంది పురుషులకూ కేవలం 866 మంది మాత్రమె స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే చాలా మంది తలి దండ్రులు, ఆడ శిశువులను, పుట్టగానే చంపేస్తున్నారు ! ఢిల్లీ లో మిగతా పట్టణాలు ( ముంబాయి, చెన్నై , కలకత్తా , బెంగళూరు , హైదరాబాద్ ) అన్నిటిలోనూ జరిగే మాన భంగాల మొత్తం  కన్నా ఎక్కువ జరుగుతున్నాయి.

కేవలం, నిందితులకు తీవ్రమైన శిక్ష పడగానే , స్త్రీ హింస ఆగదు. భారత దేశ ప్రజలు, దేశం లో జరుగుతున్న కామ పరమైన అత్యాచారాల మీద సమూలం గా వారి ఆలోచనా ధోరణిని మార్చు కోవాలి ! అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు , పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసే విషయం లోనూ !
అంతే కాక , మాన భంగం చేయ బడ్డ స్త్రీ ని పరీక్షించే విధానం లో కూడా మార్పు ఉండాలి ! ప్రస్తుతం  భారత దేశం లో  ఈ పధ్ధతి చాలా లోప భూయిష్టం గా ఉంది. మాన భంగానికి గురైన స్త్రీ ని పరీక్షించే వైద్యుడు తన ఒక వేలిని ఆ స్త్రీ జననాంగం లో ప్రవేశ పెడతాడు. ఆ తరువాత , తన రెండు వేళ్ళను స్త్రీ జననాంగం లోకి అంటే వజైనా లోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయం లో కనుక, ఆ స్త్రీ వజైనా వదులు గా ఉండి , ఒక వేలు కానీ , లేదా రెండు వేళ్ళు కానీ ( వజైనా ) లోపలి సులభం గా ప్రవేశింప చేయగలిగితే , ఆ వైద్యుడు , అప్పుడు ” వజైన వదులు గా ఉంది ” అని ధ్రువ పత్రం ( సర్టిఫికేట్  )ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్నది, ఆ ( మాన భంగానికి గురైన ) స్త్రీ యొక్క శీలం , కేవలం , ఆమె వజైనా ఎంత వదులు గా ఉందో , దానిని బట్టి నిర్ధారించ బడుతుంది ! అంటే, పరీక్ష చేసిన ఆ వైద్యుడి రెండు వేళ్ళు కనుక ఒక స్త్రీ వజైనా లోకి ప్రవేశించ గలిగితే ,అతడు ఇచ్చే ధ్రువ పత్రం లో ” ఆ స్త్రీ కామ సంభోగానికి అప్పటికే అలవాటు పడి ఉంది ” అని ఇవ్వడం జరుగుతుంది. దీనిని సాకు గా చూపించి , ఆమె శీలం మీద సందేహాలు వెలిబుచ్చుతూ , అనేక మంది నిందితులు ” జారు కుంటున్నారు ”, చట్టం నుంచి !
ఈ ” రెండు వేళ్ళ ( అ )న్యాయం సాక్ష్యం గా పరిగణించ కూడదని భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం గా చెప్పినా , అనేక రాష్ట్రాలు  ఇంకా  , అత్యాచార నిందితుల విచారణ లో ఈ ” రెండు వేళ్ళ ( అ ) న్యాయ ” పద్ధతినే అనుసరిస్తున్నాయి ! అందు వల్ల నే మూడు వంతుల ( అత్యాచార ) కేసులలో, నిందితులు ” నిర్దోషులై ” సమాజం లో ” కలుస్తున్నారు ” !
చాలా మంది స్త్రీలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే జంకుతారు ! నా స్నేహితుడు ఒకడు భారత దేశం లో  ఒక సినీ నిర్మాత. ఇటీవల జరిగిన సంఘటన ను అతను నాకు చెప్పాడు. అతని అకౌంటెంట్ , తన డబ్బు దుర్వినియోగం చేసి పరారయ్యాడు. అప్పుడు ఆ నిర్మాత పోలీసు లకు రిపోర్ట్ చేశాడు ఆ విషయం. అప్పుడు పోలీసులు , వెంటనే ఆ అకౌంటెంట్ ను పట్టుకో లేక పోయారు. వెంటనే వారు ఆ నిందితుని చెల్లెలు ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఆ నిర్మాత ఆ పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ” ప్రస్తుతం మీ అకౌంటెంట్ చెల్లెలు ను ఇక్కడ లాకప్ లో ఉంచాం. మీరు ఆమెను ” మీ ఇష్టం వచ్చినట్టు , ఏమైనా చేయ వచ్చు ” అని  ,” భరోసా ” ఇచ్చాడు. అప్పుడు ఆ నిర్మాత ఆ ” చెల్లెలు ” పరిస్థితి కి విపరీతం గా ఆందోళన చెంది, తన సొంత మనుషులను పోలీస్ స్టేషన్ లో పగలూ రాత్రీ ” ఆమెకు రక్షణ గా కాపలా ఉంచాల్సి వచ్చింది !

ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆరుగురు ప్రస్తుత ఎమేల్సీ లు మానభంగ కేసులలో నిందితులు. ఇరువురు పార్లమెంట్ సభ్యులూ , ముప్పై ఆరుగురు రాష్ట్ర శాసన సభ సభ్యులూ , స్త్రీ హింసా నేరాలలో నిందితులు !

ఇటీవల గన్ కంట్రోల్ విషయం లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇట్లా అన్నారు ” అమెరికన్ ప్రజల ప్రమేయం లేకుండా ” ఈ విషయం లో ఏమీ చేయ లేము ” అని. అదే విధం గా భారత దేశం లో కూడా స్త్రీ ల పై అత్యాచారాల విషయం లో , భారత దేశ ప్రజలు ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వక పొతే, ఈ పరిస్థితులలో ఏ విధమైన మార్పూ ఉండబోదు !

సుకేతు మెహతా , టైం తాజా వార పత్రిక నుంచి !