Our Health

Archive for the ‘Our Health’ Category

సర్వైకల్ క్యాన్సర్.7. మిగతా లక్షణాలు.

In Our Health on ఏప్రిల్ 19, 2012 at 8:20 సా.

సర్వైకల్ క్యాన్సర్.7. మిగతా లక్షణాలు: 

 

మునుపటి టపా లో మనం తెలుసుకున్నది, సర్వైకల్ క్యాన్సర్ చాలా ప్రారంభ దశలో ఉన్నప్పుడు సర్విక్స్ లో కలిగే మార్పులూ,  ఆ మార్పుల వల్ల కనిపించే లక్షణాలు. 
ఇప్పుడు  మిగతా లక్షణాలు కూడా చూద్దాము.
1. రతి క్రియ తరువాత యోని భాగం లో  ఎక్కువ నొప్పి :  
రతి క్రియ జరిగిన తరువాత  యోని అంటే వజైనా లోపల కానీ, వజైనా చుట్టూ కానీ నొప్పి గా ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, HPV వైరస్ ఇన్ఫెక్షన్ సర్విక్స్ మీద ఉండటం వల్ల,  సర్విక్స్ చుట్టూ ఉన్న నాడీ కణజాలం ఎక్కువ సెన్సిటివ్ గా అయి,  వజైనా లోనూ, చుట్టూ పక్కలా నొప్పి గా ఉంటుంది. అంతే కాక ,  వజైనా లేక యోని , సర్విక్స్ నుంచి నొప్పి ని తెలియ చేసే నాడి ఒకటే ( ఇది S – 2, 3, 4. నాడి ) .
2. వజైనల్ డిశ్చార్జ్ :  అంటే వజైనా నుంచి  చెడు వాసనతో ద్రవాలు రావడం : 
సాధారణం గా వజైనా, సర్విక్స్ లో గ్రంధులు ఉంటాయి. ఈ గ్రంధులు స్రవించి, వజైనా నూ, సర్విక్స్ నూ తేమ గా ఉంచుతుంటాయి.
ఇలా గ్రంధులు స్రవించడం వల్ల, ఆ భాగాలు ఆరోగ్యం గా ఉండి, రతి క్రియకూ, అంటే పురుషాంగం యోనిలో సులభం గా నొప్పి లేకుండా  ప్రవేశించ డానికీ , అలాగే వీర్య కణాలు సులభంగానూ , సురక్షితం గా నూ గర్భాశయం లో కి ప్రవేశించాడానికీ, అనుకూలం గా ఉంటుంది.
ఆ భాగాలలో HPV ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు , ఆ మాటకొస్తే, ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా ఉన్నప్పుడు, ఆ గ్రంధుల స్రావం తో పాటు ఇన్ఫెక్షన్, ఇతర కణాలూ కలిసి, చెడు వాసన తో కూడిన ద్రవం ఏర్పడుతుంది. దీనినే   ‘   అన్ ప్లెసెంట్ వజైనల్ డిశ్చార్జ్ ‘ అంటారు. 
ఈ రకమైన డిశ్చార్జ్  కు కారణం, చాలా రకాల ఇన్ఫెక్షన్ లు కావచ్చు.  కానీ ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, అన్ ప్లె సెంట్ వజైనల్ డిశ్చార్జ్  ఎప్పుడూ అసాధారణమైన లక్షణం.  అది సహజం కాదు. 
అలా జరిగినప్పుడు, వెంటనే గైనకాలజిస్ట్ సలహా తీసుకోవాలి. 
3. మూత్ర విసర్జన చేసే సమయం లో నొప్పి : 
సాధారణం గా మూత్ర విసర్జన చేసే సమయం లో నొప్పి,  యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూంది.  కానీ కొన్ని సమయాలలో ఈ లక్షణానికి కారణం సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు. 
 
మునుపటి టపాలో చెప్పిన మూడు లక్షణాలు, పైన చెప్పిన మూడు లక్షణాలు,  ఈ ఆరు లక్షణాలనూ మనం  నిశితం గా గమనించి నట్టయితే, మిగతా ఋతు క్రమం లక్షణాలనూ, లేక  జననేంద్రియ భాగం లో వచ్చే ఇన్ఫెక్షన్ లక్షణాలనూ పోలి ఉన్నాయి కదా ! 
ఒక విధం గా చెప్పాలంటే,  HPV వైరస్  ను   సర్విక్స్ ను చాలా కపటం గా , అంటే కన్నింగ్ గానూ ,  గుప్తం గానూ ముట్టడి చేస్తున్న అతి సూక్ష్మమైన, క్రూరమైన  దొంగలు గా పోల్చ వచ్చు.  ఈ వైరస్ దొంగలు, సర్విక్స్ ను ముట్టడి చేసి, కొన్ని లక్షణాలను,  పరిణామాలూ కలిగిస్తాయి.   ఈ లక్షణాలు సాధారణం గా స్త్రీలలో కలిగే  మిగతా లక్షణాలను పోలి ఉన్నాయి కదా !  ఈ ‘  దొంగ లక్షణాలను ‘  అన్ని వేళల్లో అంటే అన్ని సమయాలలో కనిపెట్టడం కష్టం కదా ! అలాగని  స్త్రీల విలువైన జీవితాలను, ఈ అతి సూక్ష్మమైన దొంగలు కలిసి దోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కదా ! అందు వల్లనే  ప్యాప్ స్మియర్ టెస్ట్ ప్రాముఖ్యత.    ఈ పరిస్థితులలో  ప్యాప్ స్మియర్ టెస్ట్  ను  సర్విక్స్ మీద  HPV  వైరస్  చేసిన ముట్టడి ని పట్టుకునే  డిటెక్టివ్  గా పోల్చ వచ్చు. 
మనం  ఈ డిటెక్టివ్  ని కనక పెట్టక పొతే , అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ కనక చేయక పొతే,  ఈ సూక్ష్మమైన వైరస్ దొంగలు ఎంతో ఎక్కువ హాని చేస్తాయి, స్త్రీకీ,  ఆ కుటుంబానికీ !!  ఇప్పుడు  ప్యాప్ స్మియర్ ప్రాముఖ్యత స్పష్టం గా అందరికీ అర్ధ మయిందని అనుకుంటాను.
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము! 
 
 

సర్వైకల్ క్యాన్సర్.6. లక్షణాలు.

In Our Health on ఏప్రిల్ 18, 2012 at 11:59 సా.

సర్వైకల్ క్యాన్సర్.6. లక్షణాలు:

ఇప్పటి వరకు మనం కొంత వరకూ తెలుసుకున్నాము కదా సర్వైకల్ క్యాన్సర్ గురించి.
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడే తగు జాగ్రత్త తీసుకొని తగిన పరీక్షలు అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ వంటివి చేయించి క్యాన్సర్ అవునో కాదో తెలుసుకోవడానికి, అంతే కాకుండా, ఇంకా ముఖ్యంగా తొలి దశలోనే కనుక్కుంటే, ఎక్కువ ఉపయోగకరమైన అంటే,  జీవితాన్ని ఎక్కువ కాలం పొడిగించ గలిగే చికిత్స చేయ వచ్చు. 
ఇప్పుడు తొలిదశల లో సర్వైకల్ క్యాన్సర్ చూపే లక్షణాలు చూద్దాము:
ఇవి ముఖ్యం గా మూడు:
1. అసాధారణ  గర్భాశయ  రక్త స్రావం: 
అంటే సర్విక్స్ నుంచి వచ్చే రక్త స్రావం కూడా అనుకోవచ్చు. మనం మునుపటి టపాలలో చూశాము సర్విక్స్ కు ఆ పేరు గర్భాశయం లో మెడ భాగం లో ఉండటం వల్ల వచ్చిందని.
ఈ సర్విక్స్ మీద వ్రణం, లేక  పుండు లాంటిది ఏర్పడ్డప్పుడు కొంత రక్త స్రావం అవుతుంది. ప్రత్యేకించి ఆ పుండు లాంటి భాగానికి ఘర్షణ అంటే ఫ్రిక్షన్  కలుగుతే. సర్విక్స్ భాగం లో 
ఇలా ఫ్రిక్షన్  ప్రత్యేకించి రతిక్రియ లో జరగటానికి అవకాశం ఉంటుంది కదా ! అందు కనే  దీనిని రతి క్రియానంతర అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు.
ఇలా రతిక్రియ తరువాత కొద్దిగా బ్లీడింగ్ అంటే రక్త స్రావం జరగటం, స్త్రీ లలో  వారి  సెక్స్ జీవితం మొదటి దశలలో అంటే వారు తొలి సారి రతిక్రియ లో పాల్గొన్నప్పుడు మొదటి కొన్ని సార్లు జరగ వచ్చు. అప్పుడు అది అసాధా రణం కాదు.అలా సహజం గా జరుగుతుంది. కానీ ఆ తరువాత నుంచి జరిగే రతి క్రియల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రతిక్రియ తరువాత కనుక రక్త స్రావం జరిగితే అది అసాధా రణ రక్త స్రావం అన బడుతుంది. ఇలా కనక జరిగితే  గైనకాలజిస్ట్ ను వెంటనే సంప్రదించి తగు సలహా తీసుకోవాలి.
2.ఋతు స్రావం కాని సమయాలలో రక్త స్రావం : 
సాధారణం గా ప్రతి స్త్రీ కీ , రజ స్వల అయినప్పటి నుంచి,  వారికి ఒక ప్రత్యేకమైన ఋతు క్రమం ఏర్పడుతుంది.  ఈ ఋతు క్రమం  21 నుంచి35 రోజుల కు ఒకసారి ఉంటుంది. 
ఈ ఋతు క్రమం లో  మూడు నుంచి ఏడు రోజులు ఋతు స్రావం జరుగుతుంది. మనం ఋతుక్రమం వివరాలు మునుపటి టపాలలో చూశాము కదా, ఋతుస్రావం సమయాన్ని మెన్సెస్ అంటారనీ, ఈ సమయం లో గర్భాశయం లైనింగ్ నుంచి రక్త స్రావం జరిగి , ఆ రక్తం తో పాటు  అండం ( అంటే వీర్య కణం తో కలవలేక పోయిన అండం ) కూడా బయటకు పంప బడుతుందనీ. ఇదంతా సహజ ఋతుస్రావం అనబడుతుంది.  ఇలా కాకుండా ఋతు స్రావం కాని సమయాలలో రక్త స్రావం అవుతే, వెంటనే గైనకాలజిస్ట్ ను కన్సల్ట్ చేయాలి.
3.ఋతు క్రమం ఆగి పోయాక జరిగే ‘ ఋతుస్రావం’ : 
సాధారణం గా ఋతుక్రమం 45 నుంచి 52 ఏళ్ళ మధ్య స్త్రీలలో ఋతుక్రమం ఆగి పోతుంది. దీనినే మెనో పాజ్  అంటారు. 
( లేక తెలుగులో ‘ ముట్లుడిగి పోవడం ‘  అంటారు.)  ఇలా జరిగే సమయం లో  కొంతవరకూ ఋతుక్రమం సక్రమం గా ఉండక పోవచ్చు. కానీ ఋతుక్రమం పూర్తిగా ఆగిపోయాక మళ్ళీ  ఋతు స్రావం లేక ‘ రక్త స్రావం ‘ జరిగితే దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా గైనకాలజిస్ట్ కు చూపించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !

సర్వైకల్ క్యాన్సర్. 5. స్మియర్ టెస్ట్ అంటే ఏమిటి ?

In Our Health on ఏప్రిల్ 17, 2012 at 10:03 సా.

సర్వైకల్ క్యాన్సర్. 5. స్మియర్ టెస్ట్ అంటే ఏమిటి ? 

మునుపటి టపాలో  చదివారు కదా   రమణి , గౌతమ్ ల పచ్చని కాపురాన్ని ,  వారి తప్పు ఏమీ లేకుండానే  HPV వైరస్ ఎలా విషాదం చేసిందో !
వైరస్ లకు దయా, దాక్షిణ్యాలు ఏవీ ఉండవు. అతి క్రూరమైనవి. విచక్షణా రహితంగా  ముట్టడి చేస్తాయి, మానవులని.
నిజ జీవితం లో  సర్వైకల్ క్యాన్సర్  ను అత్యంత తోలి దశలలో గుర్తించడానికి  ఒక ప్రత్యెక మైన పరీక్ష చేస్తారు. ఆ పరీక్షను   ప్యాప్ స్మియర్ టెస్ట్ లేక సింపుల్ గా స్మియర్ టెస్ట్ అంటారు.
ప్యాప్ స్మియర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే,  జార్జ్  పాపనికలో  అనే గ్రీకు శాస్త్రజ్ఞుడు  మానవ  కణాలను, ఆ కణాలలోని మార్పులను స్పష్టం గా  గుర్తించడానికి అవసరమైన రసాయనాలను కనిపెట్టాడు. అందువలన.
ఈ ప్యాప్ స్మియర్ పధ్ధతి వలన, సర్వైకల్  ఎపితీలియల్ అంటే ఉపరితలం మీద ఉన్న కణాలలో మొట్టమొదటి గా జరిగే మార్పులు, స్పష్టం గా గుర్తించవచ్చు. ఇలా గుర్తించి నట్లయితే, చికిత్స కూడా  సులభం అవుతుంది. ఎందుకంటే, వివిధ చికిత్సా పద్ధతుల ద్వారా  ఆ  ( మార్పు చెందిన క్యాన్సర్ ) కణాలను నిర్మూలించ వచ్చు.
తోలి మార్పులు కొన్ని కణాల లోనే కదా, దాని గురించి ఎందుకు రాద్ధాంతం, దానిని ఎందుకు పట్టించుకోవాలి ? :
ఎందుకంటే క్యాన్సర్ కణాలు అత్యంత వేగం గా మల్తిప్లై  అవుతాయి. అంటే రెండు, నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు ………..ఇలా చాలా వేగంగా సంఖ్యా పెరిగి పెద్ద వ్రణం లేక రాచ పుండు లా తయారవుతుంది.
ఇంకో ముఖ్య విషయం : ఈ పెరిగిన కణాలు అక్కడే ఉండక రక్తం ద్వారా, లేక లింఫు గ్రంధుల ద్వారా శరీరం లో మిగతా భాగాలకూ పాకుతాయి. దానినే స్ప్రెడ్ అవటం అంటారు. 
ఈ కారణం వల్లనే ,  అత్యంత తొలిదశ లో ఉన్నప్పుడు కనుక్కొని, ఆ కణాల ను నిర్మూలించడం మంచి పధ్ధతి.
ప్యాప్ స్మియర్ ద్వారా చూసే కణాలను కొన్ని రకాలు గా విభ జించుతారు. CIN 1:  ఈ దశలో  సర్వైకల్ కణాలలో మార్పులు మొదటి దశలో ఉంటాయి. CIN2: ఈ దశలో కణాలలో మార్పులు మోడరేట్ గా ఉంటాయి అంటే మధ్యస్తం గా, CIN 3: ఈ దశలో కణాలు ఎక్కువ మార్పులతో క్యాన్సర్ కణాలుగా ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

సర్వైకల్ క్యాన్సర్. 4. CIN for no sin !

In Our Health on ఏప్రిల్ 16, 2012 at 9:50 సా.

సర్వైకల్ క్యాన్సర్. 4.  CIN for no sin ! 

సిన్ ఫర్ నో సిన్ : 
రమణి  చక్కటి ఇల్లాలు.  ముప్పై రెండు ఏళ్ళు  ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. ఇద్దరు రత్నాల లాంటి పిల్లలు. క్రమ శిక్షణ తో పెరిగింది. కాలేజీ  జీవితం బాగా ఎంజాయ్ చేసినా, హాస్టల్ లో ఉన్నా, ఎప్పుడూ  ‘ తను  గీసుకున్న హద్దులు ‘ దాట లేదు. స్పష్టం గా చెప్పాలంటే  బాయ్ ఫ్రెండ్స్ తో  స్నేహం రుచులు మాత్రమే ఆస్వాదించింది. తన జీవిత పధకం ప్రకారం ఇరవై రెండేళ్లకు,  చదువు అయ్యాక పెళ్లి చేసుకుంది, గౌతమ్ ను.  గౌతమ్  ఆనందానికి  హద్దులు లేవు. ఎందుకంటే ‘  బ్రహ్మచర్యాన్ని అతి  పవిత్రం గా కాపాడు కుంటున్నాడని ‘   తన కాలేజీ లో క్లాస్   మేట్స్  చాలా మంది  రెచ్చ గొట్టే వారు గౌతమ్ ను.  అయినా సరే, ఎప్పుడూ అలాంటి మాటలు పట్టించుకునే వాడు కాదు . ప్రవరాఖ్యుడి లా  తన విద్యార్ధి జీవితం  గడిపాడు.  తన ‘ దీక్ష’ కు దైవం ఇచ్చిన ‘ ప్రసాదం’ గా భావించి, రమణిని ,  తన సహా చారిణి గా, ఒక ‘  అమూల్యమైన  సుగంధ సుమం’  లా చూసుకుంటాడు. వారిరువురి  ప్రేమా, దాంపత్య సుఖం కలగలిసి  ఇద్దరు రత్నాల వంటి పిల్లలకు  జన్మ నిచ్చాయి.
ఒక శుక్ర వారం నాడు  ఆఫీసు నుంచి ఫోన్ చేశాడు గౌతమ్, ఆ రోజు సాయంత్రం వంట ఏర్పాట్లు ఏవీ చేయద్దనీ, ముగ్గురూ రెడీ గా ఉంటే,  మంచి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి రావచ్చనీ.
సాయంత్రం  రెస్టారెంట్ లో ఫామిలీ సెక్షన్ లో కూర్చుని గౌతమ్ అత్యంత రుచికరమైన డిషెస్  తింటూ వాటి సిసలైన టాపింగ్స్  గా   రమణి అందాలనూ,  తమ ఇద్దరి ప్రేమ ఫలాలనూ  ఊహించుకున్నాడు. చాలా ఆనందం గా ఉంది, ఆ చిన్న కుటుంబాని కంతటికీ.
ఇంటికి   రాగానే అలసిపోయారేమో పిల్లలిద్దరూ వెంటనే నిద్ర పోయారు. గౌతమ్ రమణి చేయి తీసుకున్నాడు అతి సున్నితంగా, రమణి కి కూడా నిద్ర వచ్చీ రాకుండా ఉంది.  బుగ్గలు ఎరుపెక్కాయి  సిగ్గుతో !  ‘  ఆ సిగ్గు చూస్తె  పెళ్ళైన కొత్తల్లో  ఉన్న రమణి గుర్తొస్తున్నది ‘ అన్నాడు గౌతమ్. అప్రయత్నంగానే రమణి మనసు పులకించింది. తన దేహం తన వశం లో లేదు. వాడి పోయిన పూవు లా గౌతమ్ భుజాల మీద వాలి పోయింది, మగత గా !  ఆ మగత కేవలం నిద్రలేకనే కాదని గౌతమ్ కూ తెలుసు.  ఆ రాత్రి ఇంకో సారి మారింది, గౌతమ్ కూ రమణి కీ,   రమణీయం గా !
ఉదయం ఎప్పుడూ లేనిది , గౌతమ్ ను నిద్ర లేపింది  ఐదింటికే ! విచారం గా కూర్చొని ఉంది బెడ్ మీద రమణి. తమ పదేళ్ళ దాంపత్య జీవితం లో  గౌతమ్   ఎప్పుడూ చూడ లేదు రమణిని అలా !  వెంటనే తన కు హత్తుకొని అడిగాడు  ఏమైందని.
రమణి  రూం లో కింద పడేసి ఉన్న తన నైటీ ని చూపించింది తన వేలితో. తెల్లటి నైటీ కి రక్తపు మరక !  కొన్ని క్షణాలు అలా చూస్తూనే ఉండి పోయాడు గౌతమ్.  పీరియడ్స్  మొదలయాయా ? అని అడిగాడు అచేతనంగా. తల ప్రక్కలకు ఊపుతూ, ‘ క్రితం శుక్రవారం  ఐదో రోజు ‘ .  ‘  ఇలా ఎప్పుడూ జరగ లేదు ‘  తగ్గు స్వరం తో అన్నది రమణి. ఖిన్నుడయాడు గౌతమ్.  పైకి  తన భావాలు కనబడ నీయలేదు.  ‘ ఇప్పుడెలా  ఉంది ? ‘ అన్నాడు.  ‘ మామూలు గానే ఉంది. నొప్పి  కూడా ఏమీ లేదు ‘ అన్నది రమణి.
‘ ఈ రోజే గైనకాలగిస్ట్ దగ్గరికి వెళ్దాము, భయ పడకు ‘ అన్నాడు కానీ  తను కూడా ఆందోళన పడుతూ ఉండడం వల్ల  ‘ భయ పడకు ‘ అన్న మాట ధైర్యం గా అన్నట్లు వినిపించలేదు రమణి కీ !
పిల్లల్నిద్దరినీ  బంధువుల ఇంట్లో  దింపి ,  దగ్గరలో ఉన్న కార్పోరేట్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ కు చూపించాడు రమణిని.  అన్ని వివరాలూ కనుక్కొని  ‘  ప్యాప్ స్మియర్  టెస్ట్ చేయాలి ‘  అన్నది ఆవిడ.
రమణి, గౌతమ్ లు ఏది జరగ కూడదనుకున్నారో అదే జరిగింది.    గైనకాలజిస్ట్  ఇద్దరినీ  కన్సల్టింగ్ రూం లో కూర్చోబెట్టి  ఇలా చెప్పింది
‘  రమణీ నీకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది.  ఇది  మీ అదృష్టం వల్ల చాలా తోలి దశలోనే తెలుసుకోవడం జరిగింది. నీకు జరిగిన రక్త స్రావాన్ని’  పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ‘  అంటారు అంటే రతి క్రియ జరిగిన వెంటనే కలిగే బ్లీడింగ్. అది సాధారణం గా జరగదు కదా.   మీరు వెంటనే నా దగ్గరికి వచ్చి మంచి పని చేశారు.   ప్యాప్ స్మియర్ టెస్ట్ లో నీ సర్విక్స్ కణాలు కొన్ని క్యాన్సర్ కణాలు గా మారాయి. దీనినే CIN లేక ‘  సర్వైకల్ ఇంట్రా ఎపితీలియల్ నియోప్లాసియా ‘ అంటారు.  మిగతా పరీక్షలు చేసి ఒక సారి ఆ కణాలు స్ప్రెడ్ అవలేదని నిర్ధారించిన తరువాత, ఒక చిన్న ప్రొసీజర్ తో ఆ క్యాన్సర్ కణాలను  తీసి వేయడమో,  లేసర్ తో  కరిగించ డమో చేయ వచ్చు. ‘  ఈ క్యాన్సర్ రావడం లో మీ ఇద్దరి తప్పూ ఏమీ లేదు. ఇది HPV అనే వైరస్ వల్ల వస్తుంది’.  
అతి భారంగా హాస్పిటల్ బయటకు నడిచాడు గౌతమ్, వాడి పోయినట్టు  ఉన్న తన ‘ సుగంధ సుమం పరిమళాన్ని’ మునుపటి కన్నా ఎక్కువ ప్రియం  గా ‘ ఆఘ్హ్రా ణిన్చుతూ ‘ !  

సర్వైకల్ క్యాన్సర్.3.కారణాలు.

In Our Health on ఏప్రిల్ 15, 2012 at 11:12 ఉద.

 సర్వైకల్ క్యాన్సర్.3.కారణాలు.

 
మునుపటి టపాలో చూశాము కదా HPV వైరస్ , ప్రత్యేకించి  HPV 16, 18 రకాలకు చెందిన వైరస్  డీ ఎన్యే ఎట్లా  సర్విక్స్  కణాల  డీ ఎన్యే లోకి చొచ్చుకు పోయి ,  క్యాన్సర్ కణాలను పుట్టించి క్యాన్సర్ కు ఎట్లా కారణం అవుతుందో !
ఇప్పుడు  మిగతా కారణాలు,  లేక రిస్క్  ఫాక్టర్స్  చూద్దాము.
HPV వైరస్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో సాధారణం అయినప్పటికీ , అందరిలోనూ  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కొందరిలోనే  రావటానికి , కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా కారణం అవుతాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
ఈ ప్రత్యేక పరిస్థితులు లేక రిస్క్ ఫ్యాక్టర్స్  ఇవి : 
 
1. సిగరెట్   స్మోకింగ్ :  స్మోకింగ్  చేస్తున్న యువతులు లేక స్త్రీలలో  సర్వైకల్  క్యాన్సర్  వచ్చే అవకాశం, స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే , రెట్టింపు అవుతుంది. అంటే ఉదాహరణ కు స్మోకింగ్ చేయని  ఒక పది మంది లో  ముగ్గురికి సర్వైకల్ క్యాన్సర్ వస్తే,  స్మోకింగ్ చేస్తున్న  పదిమంది లో  ఆరుగురికి వస్తుందన్న మాట.  దీనికి కారణం ఏంటో మీకు ప్రత్యేకం గా చెప్పనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే  స్మోకింగ్ వల్ల విడుదల అయిన  నాలుగు వేల  విష పదార్ధాలు,  సర్విక్స్  కణాలనీ, అంటే ఇంకా  ఖచ్చితం గా చెప్పాలంటే , కణాల డీ ఎన్యే నూ మార్చి వేస్తాయి.  ఇక్కడ జరుగుతున్నది : సర్వైకల్ కణాలు, ఆ కణాల డీ ఎన్యే రెండు విధాల  ముట్టడి  ఎదుర్కుంటున్నాయి. ఒకటి  HPV వైరస్, రెండు  స్మోకింగ్ వల్ల  రక్తం లో కి విడుదల అయిన  విష  పదార్ధాలు. 
2. గర్భ నియంత్ర ణ  పిల్స్  వాడే స్త్రీలు:  వీరు  అయిదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం  కాంట్రా సేప్టివ్  పిల్స్  తీసుకుంటూ ఉంటే కూడా  సర్వైకల్  క్యాన్సర్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని తెలిసింది. 
సర్వైకల్  కణాలలో  పిల్స్  తీసుకోవడం వల్ల  కలిగే హార్మోనుల  మార్పు , ఆ  కణాల  రోగ నిరోధక శక్తి ని తగ్గిస్తాయని భావించ బడుతుంది.
3. సంతానం కలిగి ఉండటం :  పిల్లలు లేని వారితో పోలిస్తే , ఇద్దరు పిల్లలు ఉన్న స్త్రీలలో  సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. అలాగే ఎంత  ఎక్కువ మంది పిల్లలను స్త్రీ కలిగి ఉంటే ,  సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం అంత  ఎక్కువ  అవుతుంది అని  వివిధ  పరిశీలనలలో తెలిసింది.  దీనికి కారణం :  ఆ  యా స్త్రీలలో రోగ నిరోధక శక్తి తగ్గి వారికి HPV virus ఇన్ఫెక్షన్  సులభం గా  వచ్చేట్టు చేయటం జరుగుతుంది. 
4. reduced  immunity :  స్త్రీలలో ఏ కారణం వల్ల నైనా రోగ  నిరోధక శక్తి అంటే ఇమ్యునిటీ అంటారు , ఈ  ఇమ్యునిటీ  తగ్గితే కూడా , ఆ స్త్రీలలో  HPV వైరస్  ఇన్ఫెక్షన్  త్వర గా వస్తుంది.  ఇలా ఇమ్యునిటీ తగ్గటానికి కారణాలు:  HIV లేక  AIDS వైరస్ ఇన్ఫెక్షన్ , లేక  కొన్ని పరిస్థితులలో తీసుకునే ఇమ్యునో సప్రేసేంట్  మందులు.
5. ఎక్కువ మంది పురుషుల తో  రతి క్రియ  :  అంటే  స్త్రీలు  ఒకరి కన్నా ఎక్కువ మంది తో కామ పరమైన  సంబంధం పెట్టుకుంటే, అలాంటి స్త్రీలలో  HPV వైరస్  ఇన్ఫెక్షన్  త్వరగా వచ్చినట్టు  గుర్తించడం జరిగింది.  ఇలాంటి  జీవన శైలి ఉన్న స్త్రీలు కండోము వాడుతున్నప్పటికీ , ఆ కండోము వారికి  HPV వైరస్ సోకకుండా  సంపూర్ణ రక్షణ  ఇవ్వటం లేదని  కూడా ఖచ్చితం గా తెలిసింది. 
 
వచ్చే టపాలో  ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము ! 

సర్వైకల్ క్యాన్సర్.2.కారణాలు.

In Our Health on ఏప్రిల్ 14, 2012 at 7:31 సా.

సర్వైకల్ క్యాన్సర్.2.కారణాలు: 

మునుపటి టపాలో చూశాము, మన జీవ కణాల లోని క్రోమోజోములలో  ఉన్న డీ ఎన్యే, మన లో ఉన్న ప్రతి లక్షణాన్ని ఎలా కాపీ చేసి కొత్త కణాలలో ప్రవేశ పెడతాయో, అలాగే కొత్త కణాల సంఖ్యను కూడా ఒక క్రమ పధ్ధతి లో నియంత్రిస్తాయో !
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకుందాము. ముఖ్య కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ కు డీ ఎన్యే కు ఉన్న సంబంధం ఏమిటో కూడా చూద్దాము.
వైరస్ లు  సృష్టి లో ఉండే అత్యంత సూక్ష్మ మైన జీవ పదార్ధాలు. వైరస్ లు బాక్టీరియా కంటే సూక్ష్మం గా ఉంటాయి. అందు వల్లనే, బాక్టీరియా ను మనం పరిశోధన శాల లో ఉండే సూక్ష్మ దర్శిని ద్వారా చూడవచ్చు. కానీ వైరస్ లు  కేవలం ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని తో మాత్రమే చూడగలం.
ఎందుకంటే ఎలెక్ట్రాన్ సూక్ష్మ దర్శిని , వైరస్ లను కొన్ని వేల రెట్లు పెద్దవి గా చేసి మన కంటికి చూపిస్తాయి కాబట్టి.
అలాంటి వైరస్ రకాలకు చెందినదే హ్యూమన్ పాపిలోమా వైరస్. ( HPV virus ).
ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు ,  సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన దాదాపు అందరు స్త్రీలలోనూ,  ఈ హ్యూమన్ పాపిలోమా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఖచ్చితం  గా తెలిపాయి.
ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్  అంటే HPV వైరస్  లో  కనీసం వంద రకాలు  ఉన్నాయి.   తమ సెక్స్ జీవితాన్ని ( ప్రధానంగా పురుష జననాంగం యోనిలో ప్రవేశించడం ద్వారా పొందే సెక్స్  ) ప్రారంభించిన రెండు సంవత్సరాలలో ,   సాధారణం గా ప్రతి ముగ్గురిలో ఒక  యువతి లేక స్త్రీ కి  ఈ HPV  వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.  కానీ ఈ HPV వైరస్ వంద రకాలుండటం వల్ల కేవలం కొన్ని రకాలు మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ కు కారణం అని తెలిసింది.
 HPV16,  అంటే పదహారవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్, అన్ని  సర్వైకల్ క్యాన్సర్  కేసులలో  50 నుంచి 55 శాతం కేసులకు  కారణ భూతమని తెలిసింది. 
అలాగే HPV18, అంటే పద్దెనిమిదవ రకానికి చెందిన హ్యూమన్ పాపిలోమా వైరస్ 15 నుంచి 20 శాతం కేసులకు కారణం అనీ , మిగతా కేసులకు ఇంకో పదకొండు రకాలకు చెందిన HPV  వైరస్ లు కారణం అనీ ఖచ్చితం గా తెలిసింది. 
పైన చెప్పుకున్న ఈ కొన్ని రకాలే, వంద రకాలలో మిగతా 87 రకాల కన్నా ఎక్కువ గా సర్వైకల్ క్యాన్సర్ ను ఎందుకు కలిగిస్తాయి? :
ఈ ఎక్కువ రిస్కు ఉన్న వైరస్ రకాలు శక్తి వంతమైన జన్యు పదార్ధం అంటే డీ ఎన్యే కలిగి ఉంటాయి. ఈ  డీ ఎన్యే , సర్విక్స్  లో ఉన్న కణ జాలం లోకి చొచ్చుకు పోతుంది. అంతే కాక , ఈ వైరస్ కు చెందిన డీ ఎన్యే   కణం లో ఉన్న( అంటే సర్విక్స్ కణం లో ఉన్న ) డీ ఎన్యే తో జత కడుతుంది. ఇలా జత కట్టడం వల్ల , అప్పటి వరకూ ఒక క్రమ పధ్ధతి లో  జరుగుతున్న కణ విభజన  హద్దులు , పరిమితులూ ఏవీ లేకుండా,  అంటే ఒక నియంత్రణ అంటూ ఏమీ లేకుండా,  ఇష్టం వచ్చినట్టు , అసంఖ్యాకమైన కణాల ఉత్పత్తి కి కారణం అవుతుంది.  దాని పరిణామం గా  సర్విక్స్ మీద ఒక రాచ పుండు అంటే క్యాన్సర్ మొదలై, పెరగటం ప్రారంభిస్తుంది. (  క్రింద పటం లో చూడండి , ఈ విషయాలన్నీ స్పష్టం గా అర్ధమవడం కోసం.)
 
వచ్చే టపాలో ఇంకొన్ని కారణాలు తెలుసుకుందాము.

సర్వైకల్ క్యాన్సర్.1. కారణాలు.

In Our Health on ఏప్రిల్ 14, 2012 at 12:12 సా.

సర్వైకల్ క్యాన్సర్.1. కారణాలు.

సర్వైకల్ క్యాన్సర్ కారణాలు తెలుసుకునే ముందు మనం  DNA గురించి తెలుసుకోవాలి.
DNA అంటే  De oxy Ribo Nucleic Acid. తెలుగులో డీ ఆక్సీ రైబో న్యుక్లిక్ యాసిడ్.  ఈ డీ ఎన్యే   సృష్టి లో ప్రతి జీవ కణం లోనూ ఉంటుంది.  మనం   ‘ పొగాకు కు ఋణం – ప్రాణం పణం ‘ . అనే టపా ల పరంపర లో తెలుసుకున్నాము , ఈ డీ ఎన్యే  శ్వాస కోశ క్యాన్సర్ కు ఎట్లా కారణం అవుతుందో ! (  వివరాలు మళ్ళీ  తెలుసుకోవాలని ఉంటే  ఆర్కివ్స్ లో చూడండి ) ఖచ్చితం గా అదే పద్ధతిలో  ఈ డీ ఎన్యే లో కలిగే మార్పులు సర్వైకల్ క్యాన్సర్ కు కూడా కారణం.( లంగ్ క్యాన్సర్ లో ఆ పనిని  స్మోకింగ్ చేయటం వల్ల విడుదల ఆయే  టాక్సిన్ లు అంటే విష పదార్ధాలు చేస్తాయి  )   కాకపొతే, సర్వైకల్ క్యాన్సర్ లో డీ ఎన్యే మార్పులకు ఒక రకమైన వైరస్ కూడా కారణం అవుతుంది. 
 అది ఎట్లా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము:
DNA , దేహం లో ప్రతి జీవ కణం లోనూ  ఉండే  అతి సూక్ష్మమైన ,  మెమరీ. ఈ మెమరీ లో మన  దేహం లో జరిగే ప్రతి యొక్క జీవ క్రియ కు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. అంటే కేవలం బయట కు కనిపించే బాహ్య లక్షణాలే కాక, ప్రతి నిత్యం మన దేహం లో జరుగుతున్న వేలకొద్దీ జీవ రసాయన చర్యలు కూడా ఈ డీ ఎన్యే  లో  నిక్షిప్తమై ఉన్న,  నిర్దేశించిన పద్ధతులలో జరుగుతాయి.  ఇందులో  జీవ కణాల ప్రత్యుత్పత్తి కూడా.  మన దేహం లో వేలు, లక్షల కొద్దీ జీవ కణాలు, ప్రతి రోజూ ప్రత్యుత్పత్తి అవుతుంటాయి, పాత కణాలు నశిస్తూ ఉంటాయి.  ఉదాహరణ కు మన చర్మం మీద ఉండే  ఎపిడెర్మల్ కణాలు నిరంతరమూ  పాతవి ‘ ఊడి’ పోయి, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి.  మనం సాధారణంగా ఈ మార్పులను గమనించ లేము, సూక్ష్మ దర్శిని తో చూస్తే తప్ప.
ఈ విషయం ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే , ఈ కొత్త జీవ కణాలు ఎప్పుడు ఏర్పడినా,  అవి ఖచ్చితం గా పాత కణాల లానే ఉంటాయి. ఎందుకంటే పాత కణాలలో ఉండే డీ ఎన్యే  లో ఉన్న ‘ మెమరీ ‘ వల్ల !  ఇదే మెమరీ మన జీవ కణాల సంఖ్యను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల నే మనకు నిరంతరం చర్మం లో పాత కణాలు పోయి, కొత్త కణాలు పుడుతున్నా, అవి ఒక నియంత్రిత సంఖ్య లో ఉండటం వల్ల మన చర్మం అనేక పొరలు గా ఉండదు కదా! ఇదే ఉదాహరణ మన దేహం లో కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడుతున్న ప్రతి చోటా వర్తిస్తుంది.
అయితే ఏ కారణం అయినా ఈ కణ నియంత్రణ చేసే డీ ఎన్యే ‘ మెమరీ ‘ ని మార్చి వేస్తె , అపుడు జీవ కణాలు,  అనియంత్రిత సంఖ్య లో పుట్టి , క్యాన్సర్ గా పరిణమిస్తాయి. మన దేహం లో ఈ బాగం లో క్యాన్సర్ వచ్చినా  డీ ఎన్యే లో మార్పుల వల్ల జరిగే అనియంత్రిత కణ విభజన వల్లనే.  లంగ్ క్యాన్సర్ అయినా , సర్వైకల్ క్యాన్సర్ అయినా , ఏ క్యాన్సర్ అయినా !
సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం  హ్యూమన్  పాపిలోమా వైరస్ అని పరిశోధనల వల్ల తెలిసింది.  ఈ వైరస్ నే HPV వైరస్ అంటారు.  ఈ వైరస్ కధా కమామీషు , అంటే ఈ వైరస్  ఇన్ఫెక్షన్  ఎట్లా సర్వైకల్ క్యాన్సర్ కు కారణమవుతుంది,  ఈ HPV వైరస్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాము.
ఈ విషయాలు  అందరూ తెలుసుకోవాలి. ప్రత్యేకించి , యువత, వారి తల్లి తండ్రులు.  ఎందుకంటే  ప్రపంచీకరణ  పర్యవసానంగా  మన దేశం లో  యువత జీవన శైలి, ప్రత్యేకించి వారి సెక్స్ అంటే కామ జీవితం   లో జరుగుతున్న మార్పులు, వాటి  పరిణామాలు ఎట్లా ఉండ గలవో  తెలుసుకోవడానికీ , ఇంకా వారు తగిన జాగ్రత్తలు తీసుకోడానికీ !

సర్వైకల్ క్యాన్సర్.

In Our Health on ఏప్రిల్ 13, 2012 at 10:06 సా.

సర్వైకల్ క్యాన్సర్.

గర్భాశయ భాగమైన సర్విక్స్  లో వచ్చే క్యాన్సర్ ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు.
 ( సర్విక్స్ అంటే మెడ భాగం అన్న మాట.  అందుకే మెడ భాగం లో ఉన్న వెన్ను పూసను సర్వైకల్ స్పైన్  అని, అక్కడ ఉన్న ఎముకలను సర్వైకల్ వెర్టేబ్రా అనీ అంటారు) . 
గర్భాశయం మొదటి భాగం లో మెడ లా ఉండటం వల్ల ఈ భాగాన్ని కూడా సర్విక్స్ అని అందుకనే అంటారు. 
ఈ సర్విక్స్ కు వచ్చే క్యాన్సర్  ప్రపంచం మొత్తం లో క్యాన్సర్ వల్ల స్త్రీలలో సంభవించే మరణాలలో అయిదవ ముఖ్య కారణం గా పేర్కొనబడింది, మరణాల సంఖ్యా పరంగా.
ఇండియా లో స్త్రీలలో వచ్చే క్యాన్సర్ లలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రముఖమైనది. అంటే ఇండియా లో క్యాన్సర్ వల్ల మరణించే స్త్రీలలో ఎక్కువ మంది సర్వైకల్ క్యాన్సర్ వల్లనే.
ఈ సర్వైకల్ క్యాన్సర్ రావటానికి కారణాలు ఏమిటి, సర్వైకల్ క్యాన్సర్ ను మొదటి దశలలో ఎట్లా కనుక్కోవచ్చు,  చికిత్సా పద్ధతులు ఏమిటి అనే విషయాల గురించి 
వచ్చే టపా నుంచి వివరం గా తెలుసుకుందాము. 
( క్రితం టపా లో పొందుపరిచిన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించిన సంపూర్ణ సమాచారం గురించి ఆంగ్లం లో ఉన్న వీడియో ను అతి తక్కువ మంది మాత్రమే చూశారు.
ఎందుకో యు ట్యూబ్ వీడియో లకు చెప్పుకోతగ్గ స్పందన ఉండటం లేదు.  కారణాలు కూడా తెలియట్లేదు. అందు వల్ల రాత పూర్వకం గానే వీలైనంత సమాచారాన్ని తెలియ పరుస్తేనే మంచిదనే ఉద్దేశం కలుగుతుంది.  ఈ విషయం పైన మీ అభిప్రాయాలు తెలుపగలరు ) 

గర్భాశయ ఫైబ్రాయిడ్స్ లేక యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ .2.

In Our Health on ఏప్రిల్ 12, 2012 at 7:30 సా.

గర్భాశయ ఫైబ్రాయిడ్స్  లేక యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ .2.

( మనవి:  గర్భాశయ ఫైబ్రాయిడ్స్ గురించి మీకు తగినంత సమాచారం అందించే ప్రయత్నం లో యు ట్యూబ్  లో వెతకడం జరిగింది.  ఒక అమెరికన్ గైనకాలజిస్ట్  రూపొందించిన ఒక వీడియో  కనిపించింది.  ఈ వీడియో  ఆసక్తి కరంగా  పూర్తి వివరాలతో  ఉంది.
ఇది ఆంగ్ల భాష లో ఉన్నా , గైనకాలజిస్ట్ చాలా నిదానం గా స్పష్టం గా మాట్లాడటం వలన సులభం గా అర్ధ మయేట్టు  ఉంది,   ఆంగ్ల భాష  కొద్ది గా తెలిసిన వారికి కూడా. అందులో కొన్ని పటాలు కూడా పొందు పరచడం వల్ల  ఆసక్తి కరం గా  కూడా ఉన్నది.
అందువల్ల మిగతా వివరాలు తెలుగులో ఇవ్వలేదు.  మీరు ఈ వీడియో ను  ఓపికగా, సంపూర్ణం గా చూస్తారని ఆశిస్తాను.
( ఎందుకంటే ఈ వీడియో, గైనకాలజిస్ట్ ద్వారా రూపొందించబడింది,  ఇది పూర్తి గా ఉచితం ! ) 
 మీరు ఈ యు ట్యూబ్ వీడియో చూసి సందేహాలుంటే  తెలియ చేయండి. అలా కాకుండా తెలుగులో వివరాలు కూడా కావాలంటే కూడా నిరభ్యంతరం గా మీ అభిప్రాయం తెలపండి.  ఎక్కువ మంది కోరితే తెలుగు లో కూడా ఈ వివరాలు పొందు పరుస్తాను ) .
వచ్చే టపాలో  ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్. ( యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ ). 1.

In Our Health on ఏప్రిల్ 11, 2012 at 5:59 సా.

గర్భాశయం లో ఫైబ్రాయిడ్స్. ( యుటి రైన్ ఫైబ్రాయిడ్స్ ). 1.

 
ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి ?: 
ఫైబ్రాయిడ్స్ అతి సాధారణ మైన గర్భాశయ  పెరుగుదలలు లేక కంతులు. ఇవి క్యాన్సర్ పెరుగుదలలు కావు. ఇవి చాలా నెమ్మది గా గర్భాశయ కండరాల పొరలలో పెరుగుతాయి.
ఒక్క అమెరికా లోనే ప్రతి సంవత్సరమూ  ఆరు లక్షల  గర్భ సంచి లేక గర్భాశయం తీసి వేసే ఆపరేషన్లు జరుగు తుంటాయి. అందులో సుమారు ముప్పై శాతం అంటే రెండు లక్షల వరకూ ఆపరేషన్లు  గర్భాశయం లో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల జరుగుతున్నాయి.
ఇందులో చాలా వరకూ అనవసరమైనవేనని అమెరికాకే చెందిన ఒక అనుభవజ్ఞుడైన  గైనకాలజిస్ట్ అభిప్రాయం. 
 
ఈ ఫైబ్రాయిడ్స్ మొదట చెప్పినట్టు,  సుమారు 75 శాతం మంది  స్త్రీలలో ఉంటాయి. కాక పొతే వాటి పరిమాణం, వేరు వేరు స్త్రీలలో వేరు వేరు పరిమాణాలలో ఉంటుంది.  అతి చిన్న గా ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి పెరుగుదల చాలా నెమ్మది గా జరగటం వల్ల, చిన్న పరిమాణం లో ఉన్నప్పుడు, కేవలం అతి సున్నితమైన  MRI స్కానింగ్ ద్వారానే వాటి ఉనికి గర్భాశయం లో కనిపెట్ట వచ్చు. 
కేవలం 30 శాతం మంది స్త్రీలలోనే ఈ పెరుగుదలలను  చేతుల ద్వారా అంటే చేతి స్పర్శ తో కనుక్కోవచ్చు.  అంటే మిగతా స్త్రీలలో ఉన్న ఫైబ్రాయిడ్స్  ఉన్నప్పుడు , చేతి స్పర్శకు అందనంత చిన్నవి గా ఉంటాయన్న మాట. 
 
ఈ ఫైబ్రాయిడ్స్ గురించి వివరం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాము !