Our Health

Archive for the ‘Our Health’ Category

వ్యాయామం ( ఎక్సర్సైజ్ ) గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3.

In Our Health on ఏప్రిల్ 26, 2012 at 7:28 సా.

 వ్యాయామం ( ఎక్సర్సైజ్ )  గుండె జబ్బును ఎట్లా నివారిస్తుంది ?.3. 

 
ఇప్పటి వరకూ జరిపిన అనేక శాస్త్రీయ  పరిశోధనలూ, పరిశీలనల వల్ల, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ( Regular exercise )  అంటే క్రమం గా వ్యాయామం చేస్తే, కేవలం గుండె జబ్బుల నివారణే కాక , మిగతా  ఏ ఏ లాభాలు ఎంతెంత ఉంటాయో  ఈ క్రింద వివరణ చూడండి.
1.  గుండె జబ్బులూ, పక్ష వాతం అంటే  ‘ stroke ‘  వచ్చే అవకాశం 35 % అంటే ముప్పై అయిదు శాతం తగ్గుతుంది.
2. Type 2 Diabetes , టైపు టూ మధుమేహం వచ్చే అవకాశం  , 50 % అంటే యాభయి శాతం తగ్గుతుంది.
3. Colon cancer , కోలన్ క్యాన్సర్ అంటే  పెద్ద పేగు లో వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం  50 % అంటే యాభయి శాతం  తగ్గుతుంది. 
4. Breast cancer, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము , లేక స్థన క్యాన్సర్ వచ్చే అవకాశం 20  % లేక ఇరవై శాతం తగ్గుతుంది.
5. 30 % Lower risk of early death. అంటే అల్ప ఆయుష్హు 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. అంటే  దీర్ఘ కాలం జీవించే అవకాశం ముప్పై శాతం హెచ్చుతుందన్న మాట.
6.Osteoarthritis, ఆస్టియో ఆర్త్రైటిస్  అంటే కీళ్ళ నొప్పులూ, వాపు, వచ్చే వకాశం 83 % అంటే ఎనభై మూడు శాతం తగ్గుతుంది.
7. Hip fracture risk is reduced by 68 %. హిప్ ఫ్రాక్చర్ అంటే తుంటి ఎముక విరిగే అవకాశం
68 % అంటే అరవై  ఎనిమిది  శాతం తగ్గుతుంది.
8. 30 % reduction in falls అంటే వృద్ధులలో క్రింద పడి పోయే అవకాశం 30 % ముప్పై శాతం తగ్గుతుంది.
9. Depression, డిప్రెషన్ లేక మానసికం గా క్రుంగి పోయే వ్యాధి వచ్చే అవకాశం 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది.
10.Dementia, డిమెన్షియా  లేక వృద్ధుల లో వచ్చే మతి మరుపు వ్యాధి వచ్చే అవకాశం కూడా 30 % అంటే ముప్పై శాతం తగ్గుతుంది. 
 
ఎంత వ్యాయామం అవసరం ? :
19 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న వారికి కనీసం వారానికి రెండున్నర గంటల వ్యాయామం చేస్తే లాభకరం గా ఉంటుందని తెలిసింది. 
 
వ్యాయామం గుండె కు ఎట్లా లాభాకారి?:
 
క్రమం గా వ్యాయామం చేయడం వల్ల గుండె కండరాలు బల పడి తక్కువ సంకోచాలతోనే ఎక్కువ రక్తాన్ని పంపు చేయ గలుగుతుంది.
వ్యాయామం చేయటం, మన బరువును తగ్గిస్తుంది.
వ్యాయామం , మన మానసిక వత్తిడి ని కూడా తగ్గిస్తుంది.
మన బరువు, క్రమమైన వ్యాయామం తో నియంత్రణ లో ఉండటం వల్ల రక్త పీడనం కూడా నియంత్రణ లో ఉంటుంది. అంటే కంట్రోలు లో ఉంటుంది.
అలాగే , రక్తం లో చెడు కొవ్వు అంటే కొలెస్టరాల్  కూడా తగ్గుతుంది.  మధుమేహాన్ని కూడా నివారించడం వల్ల, గుండె జబ్బులు కూడా నివారింప బడతాయి. 
 

మరి ఆలస్యం ఎందుకు వ్యాయామానికి ? కట్టు బడి ఉందాం ఈ నియమానికి ! 

 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు చూద్దాము. 
 

అధిక రక్త పీడనానికి అంటే హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు ఎట్లా కారణమవుతాయి?.2.

In Our Health on ఏప్రిల్ 25, 2012 at 8:33 సా.

 అధిక రక్త పీడనానికి అంటే  హై బీ పీ కి రిస్కు ఫాక్టర్లు  ఎట్లా కారణమవుతాయి?.2.

మనం క్రితం టపాలో చూశాం కదా పటం సహాయం తో కూడా, ప్రాధమిక అధిక రక్త పీడనానికి ఏడు రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయని.
అందులో మొదటి రెండింటిని మనం ఏవిధం గానూ మార్చలేము కదా. అంటే మనం మన వయసు పెరగటాన్ని ఆపాలంటే, మనం కాలాన్ని ఒక్క క్షణం కూడా ముందుకు పోనీకుండా ఆప గలగాలి. అలా కేవలం మన ఇంట్లో ఉన్న గడియారాలతో చేయ వచ్చు కానీ నిజం గా సమయాన్ని మనం ఆపలేము కదా ! అలాగే మనం ఏ వంశం నుంచి వచ్చామో దానినీ మార్చలేము కదా ! అంటే ఈ రెండు ఫాక్టర్లూ మన చేతిలో లేనే లేవు కదా ! 
కానీ ఇక మిగిలిన అయిదు రిస్కు ఫాక్టర్లూ మన చేతి లోనే ఉన్నాయి. అంటే మన నియంత్రణ లో ఉన్నాయి. 
ఇక్కడ గమనించ వలసినది ఏమిటంటే, రిస్కు ఫాక్టర్లు ఒక్కటి ఉండి మిగతా అన్నీ లేక పోయినా అధిక రక్త పీడనం వచ్చే అవకాశం ఉంటుంది.
మరి అతి కష్టం మీద మిగతా రిస్కు ఫాక్టర్లను మన జీవితాలనుంచి తొలగించితే ఒరిగేదేమిటి? అని చాలా మంది అనుకోవచ్చు.
ఈ సందేహం వచ్చిన వారికి  శాస్త్రీయ మయిన జవాబు ఇదే:  రిస్కు ఫాక్టర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అధిక రక్త పీడనం లేక హైపర్ టెన్షన్ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా   పరిణామాలు కూడా తీవ్రం గా ఉంటాయి.  సూటి గా చెప్పాలంటే,  మెదడూ, గుండె, కళ్ళూ, మూత్ర పిండాలూ త్వరిత గతిని దెబ్బ తినే అవకాశం హెచ్చుతుంది. 
ఇప్పుడు ఈ మిగతా అయిదు రిస్కు ఫాక్టర్లూ  ఏ విధంగా అధిక రక్త పీడనానికి కారణ భూత మవుతుందో చూద్దాము.
1. మనం తినే ఆహారం లో ఉప్పు : 
మనకు ( అంటే పదకొండు ఏళ్ళ వయసు పై బడ్డ వారికి ) సామాన్యం గా రోజుకు ఆరు గ్రాముల ఉప్పు సరి పోతుంది.  అంటే daily six grammes of salt.
మరి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? : 
ఉప్పుకు నీటిని చేర్చుకునే గుణం ఉంది. ఉదాహరణకు, మనం తినే ఉప్పు ఆహారం లో నుంచి మన రక్తం లో ప్రవేశించిన దనుకోండి. అప్పుడు ఆ పరిస్థితి వల్ల మన దేహం లో మిగతా భాగాలలో ఉండే నీరు రక్తం లోకి పీల్చ బడుతుంది. దాని వల్ల సామాన్యం గా అయిదు లీటర్ల వరకు ఉండే రక్తం పరిమాణం పెరిగి అయిదున్నర లేక ఆరు లీటర్ల కు అయిందనుకోండి.  అందు వల్ల రక్తాన్ని పంపు చేయవలసిన గుండె  ఎక్కువ గా పని చేయ వలసి ఉంటుంది.  అందు వల్ల రక్త పీడనం కాస్తా అధిక రక్త పీడనం గా మారుతుంది.
సాధారణం గా మన ఆహారం లో ఉన్న అధిక ఉప్పు మూత్ర పిండాల ద్వారా బయటకు విసర్జన కూడా జరుగుతుంది. కానీ మనం తినే ఉప్పు పరిమాణం పెరిగే కొద్దీ , కొంత మూత్రం ద్వారా విసర్జించ బడినా , మిగతా ఉప్పు ( అంటే ఎక్కువ గా ఉన్న ఉప్పు ) రక్త పరిమాణాన్ని పెంచి ముప్పు కలిగిస్తుంది.
ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని సామెత. కానీ మనలో చాలా మంది ఆ సామెత ను అడ్డం పెట్టుకుని, లేక సాకు గా పెట్టుకుని ఎక్కువ ఉప్పు ఆహారం లో వేసుకుని తింటూ ఉంటారు. కానీ  పరిశీలిస్తే ఆ సామెత లో తప్పు లేదు. ఎందు కంటే ఆ సామెత ఉప్పు లేని కూడు చప్పిడి కూడు అని చెప్ప బడిందే కానీ ‘ అధిక ఉప్పు లేని కూడు చప్పిడి కూడు ‘ అని లేదు.
మనం తినే కూరలూ పప్పులలో , ముఖ్యం గా  ఊరగాయలూ, పచ్చళ్లలో,  అతి శీతలం చేసిన అంటే ఫ్రోజెన్ ఫూడ్స్  లో నూ ఎక్కువ ఉప్పు ఉంటుంది.  
మిగతా వివరాలు వచ్చే టపాలో చూద్దాము !

హై బీ పీ రకాలూ, కారణాలూ.1.

In Our Health on ఏప్రిల్ 24, 2012 at 11:31 సా.

హై బీ పీ రకాలూ, కారణాలూ.1.

మనం క్రితం టపాలలో బీ పీ అధికం గా ఉండి , చాలా కాలం కంట్రోలు లో లేక పొతే పరిణామాలు ఎట్లా ఉంటాయో పటం సహాయం తో తెలుసుకున్నాము. 
ఈ టపాలలో ఒక పటం సాధారణ రక్త పీడనం, ఇంకా అధిక రక్త పీడనం ఎంత ఉంటుందో సంఖ్య ల ద్వారా ఇవ్వటం జరిగింది కదా ! 
ఇక ఈ అధిక రక్త పీడనానికి కారణాలు చూద్దాము.  
రక్త పీడనం లో రెండు రకాలుంటాయి. మొదటి రకాన్ని ప్రాధమిక అధిక  రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్  అంటారు ( primary hypertension or essential hypertension ) ( 90 % ). 
రెండవ రకాన్ని ద్వితీయ లేక సెకండరీ హైపర్ టెన్షన్  అంటారు ( secondary hypertension ) ( 10 % )  .  నూరు మందిలో అధిక రక్త పీడనం ఉంటే అందులో, తొంభయి మంది ఈ ప్రాధమిక అధిక రక్త పీడనం తో బాధ పడతారు. మిగతా పది మంది లో సెకండరీ అధిక రక్త పీడనం ఉంటుంది. 
ప్రాధమిక అధిక రక్త పీడనం లేక ప్రైమరీ హైపర్ టెన్షన్ ముందు చెప్పుకున్నట్టు, తొంభై శాతం కేసులలో ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఈ ప్రాధమిక అధిక రక్త పీడనానికి కారణం ఖచ్చితం గా తెలియలేదు. 
కానీ చాలా ఇతర కారణాలు ఉంటే, ఈ కారణాల వల్ల ప్రాధమిక అధిక రక్త పీడనం రావటానికి కారణం అవుతాయి. అందువల్ల వీటిని రిస్కు ఫాక్టర్స్   ( risk factors ) అంటారు. 
ఈ కారణాలు ఇవి : 
1. మన వయసు మీరుతున్న కొద్దీ , ఈ రకమైన అధిక రక్త పీడనం రావడానికి అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది.
2. సాధారణంగా ఇది వంశ పారంపర్యం గా ఉంటుంది. అంటే మన వంశంలో పూర్వీకులకు ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటే మనకూ  రావటానికి అవకాశాలు ఎక్కువ.
3. మన ఆహారం లో మనం తినే ఉప్పు ( ప్రత్యక్షం గా కానీ, పరోక్షం గా కానీ ) ఎక్కువ అవుతున్న కొద్దీ , అధిక రక్త పీడనం రావడానికి అవకాశం హెచ్చుతుంటుంది. 
4. తగిన వ్యాయామం లేక పోవడం. అంటే ఎక్సర్సైజ్ లేక పోవడం.
5.టొబాకో పొగ తాగటం ( అంటే సిగరెట్, బీడీ, లేక చుట్ట – వీటిలో వేటి పొగ అయినా తాగటం, పీల్చడం లేక ) స్మోకింగ్ చేయడం .
6. ఎక్కువ పరిమాణం లో ఎక్కువ కాలం మద్యం సేవించడం.
7. స్త్రెస్స్     , లేక మానసిక వత్తిడి ( stress ). 
ఈ విషయాలను వివరం గా చూద్దాము వచ్చే టపాలలో ! 
 

బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.

In Our Health on ఏప్రిల్ 24, 2012 at 10:14 ఉద.

బీ పీ కంట్రోలు కాకపొతే ?.4.

మునుపటి టపాలో పటం ద్వారా మనం క్లుప్తం గా తెలుసుకున్నాము కదా బీ పీ కంట్రోలు కాక పొతే వచ్చే ప్రధాన పరిణామాలు.
ఇప్పుడు ఆ ఆంగ్ల పదాలను తెలుగు లో వివరించడానికి ప్రయత్నిస్తాను.
అదే పటాన్ని మళ్ళీ ఇక్కడ  పోస్ట్ చేయడం జరుగుతుంది, చదువరులు వెనకటి టపా చూడనవసరం లేకుండా !
మీరు పటం లో చూస్తున్న శీర్షిక ‘ మెయిన్ కాంప్లికేషన్స్ అఫ్ పర్సి స్టెంట్  హై బ్లడ్ ప్రెషర్ ‘ అని ఉంది. అంటే అందులో చాలా అర్ధం ఉంది.
దీనిని తెలుగులో చెప్పాలంటే  ‘ అధిక రక్త పీడనం, ఎక్కువ కాలం ఉంటే  జరిగే ప్రధాన  విపరీత పరిణామాలు ‘ అని.  ఇక్కడ గుర్తు ఉంచుకోవలసినది, ‘ చాలా కాలం ‘ కంట్రోలు లో లేని అధిక రక్త పీడనం అన్న మాట ! 
ఇక మిగతా ఆంగ్ల పదాలు చూద్దాము.
మెదడు లో పరిణామాలు :
Cerebro vascular accident or CVA :  సెరిబ్రో వాస్క్యులార్  యాక్సిడెంట్  అంటే  ‘  మెదడు లోని రక్త ప్రసరణ లో జరిగే ప్రమాదం’ దీనినే  స్ట్రోక్  అంటారు ( stroke ) తెలుగులో పక్ష వాతం అని కూడా ఉంటారు. దాని గురించి ముందు ముందు మనం తెలుసుకుందాము.
రెండో ప్రధాన పరిణామం : Hypertensive encephalopathy : ‘ హైపర్ టేన్సివ్ ఎంకేఫలో పతీ ‘   లేక అధిక రక్త పీడనా మస్తిష్కం ‘ అనవచ్చు నేమో తెలుగు లో దీనిని ( ఇంకా మంచి పదాలు తెలుగు లో ఉంటే తెలియ చేయండి )! 
ఈ పరిస్థితి ఏర్పడితే , విపరీతమైన తల నొప్పి గా ఉండటమూ, Confusion , కన్ఫ్యు షన్ అంటే మతి స్థిరం గా లేక పోవడమూ జరిగి, అధిక రక్త పీడనం అలాగే కంట్రోలు కాకుండా ఉంటే ,  మూర్చ లేక ఫిట్స్ రావడం జరుగుతుంటుంది. ఇంగ్లీషు లో convulsion    (కన్వల్స్హన్  అంటారు )
కంటిలో పరిణామాలు : Hypertensive retinopathy : హైపర్ టేన్సివ్ రేటినో పతీ  అంటే  అధిక రక్త పీడనం వల్ల ( ఇక్కడ కూడా మనం  పర్సిస్ టెంట్  అనే మాట గుర్తుంచు కోవాలి, అంటే దీర్ఘ కాలం అధిక రక్త పీడనం ఉంటే ) కంటి లోని అతి ముఖ్య మైన రెటీనా అనే భాగం లో వచ్చే మార్పులు, జరిగే పరిణామాలూ.  
Heart , లేక గుండె లో ప్రధానం గా జరిగే పరిణామాలు :
1. Myocardial Infarction, మయో కార్దియల్ ఇన్ఫార్క్షన్, దీనినే తెలుగు లో గుండె పోటు అంటారు కదా ! దీనికే ఆంగ్లం లో ఇంకో పేరుంది, అది  Heart Attack ( హార్ట్  ఎటాక్ ) . దీని గురించి మనం కూడా మనం ముందు ముందు వివరం గా తెలుసుకుందాము.
2.Hypertensive Cardiomyopathy : హైపర్ టేన్సివ్ కార్డియో మయోపతీ. అంటే అధిక రక్త పీడనం వల్ల గుండె కండరాలలో జరిగే మార్పులూ , వాటి పరిణామాలూ !
3. Heart failure: గుండె విఫలం అనవచ్చేమో ఈ పరిస్థితిని. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం. గుండె విఫలం అవగానే ప్రాణాలు పోవు అని. గుండె విఫలం కూడా కొన్ని దశలలో జరుగుతుంది, ఉంటుంది.  చాలా మంది ఈ పరిస్థితి అనుభవిస్తున్న వారు చాలా కాలం జీవించ గలుగుతున్నారు, ఆధునాతన చికిత్సా పద్ధతులతో?
Kidneys: మూత్ర పిండాలలో జరిగే ప్రధాన పరిణామాలూ, మార్పులు : 
1. Hypertensive nephropathy: హైపర్ టేన్సివ్ నెఫ్రోపతీ, అంటే మూత్ర పిండాలలో రక్త పోటు. 2. Chronic renal failure: క్రానిక్ రీనల్  ఫెఇల్యుర్  అంటే  దీర్ఘ కాలిక మూత్ర పిండాల విఫలం అవడం. ఇక్కడ కూడా విఫలం అంటే ‘ సరిగా పని చేయకపోవడం అనే గుర్తు ఉంచు కోవాలి, అంటే  పూర్తిగా విఫలం అయినట్టు కాదు. 
రక్తం లో వచ్చే మార్పులు : Elevated blood sugars. అంటే ఎలివేటేడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తం లో చెక్కెర  శాతం పెరుగుదల.
చూశారా ఈ ఒక్క పటం లో ఎంత సమాచారం ఉందొ ! అందు వల్లనే దీనిని రెండో సారి పోస్టు చేయడం జరిగింది, మీరు ఎప్పుడూ  గుర్తు ఉంచుకోడానికీ, మీకు ఉపయోగ పడటానికీ !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము !

బీ పీ కంట్రోలు కాకపొతే ?.3.

In Our Health on ఏప్రిల్ 23, 2012 at 11:11 సా.

బీ పీ కంట్రోలు కాకపొతే ?: 

క్రిందటి టపాలో మనం , మనలో రక్త పీడనాన్ని ఎలా కొలుస్తారు, సాధారణ రక్త పీడనం ఎంత ఉంటుంది ? ,  హైపర్ టెన్షన్ లో  ( అంటే రక్త పీడనం లేక రక్త పోటు లో ) ఎంత ఉంటుంది? అనే విషయాలు పటం ద్వారా తెలుసుకున్నాము కదా !.
ఈ టపా లో రక్త పీడనం ఎక్కువ అయినప్పుడు మన దేహం లోని వివిధ భాగాలమీద, ఈ అధిక రక్త పీడనం ప్రభావం ఎట్లా ఉంటుందో పరిశీలిద్దాము.
ఇక్కడ ముఖ్యం గా గమనించ వలసినది ఏమిటంటే,  అధిక రక్త పీడనం లేక, రక్త పోటు లేక హైపర్ టెన్షన్ పరిణామాలు, ఆ అధిక రక్త పీడనం లేక హైపర్ టెన్షన్, ఎంత ఎక్కువ గా ఉంది ? , ఎంత కాలం నుంచి ఉందీ ? ఎంత కాలం నుంచి కంట్రోలు లో లేదు ? అన్న విషయాల మీద ఆధార పడి ఉంటుంది. 
చాలా ఎక్కువ రక్త పీడనం ఉంటే, పరిణామాలు వెంటనే కనిపించ వచ్చు కూడా ! 
ఇంకో ముఖ్య విషయం: ఈ అధిక రక్త పోటు, లేక అధిక రక్త పీడనం లేక ( hypertentsion ) లేక హైపర్ టెన్షన్ పరిణామాలు మన దేహం లో  కళ్ళు, మెదడు, మూత్ర పిండాలూ, గుండె, వీటి మీద ఎక్కువ గా ఉంటాయి. 
ఈ క్రింద పటం చూడండి పరిశీలన గా !
వచ్చే టపాలో వీటి వివరాలు చూద్దాము !

బీ పీ కంట్రోలు కాకపొతే ?.2.

In Our Health on ఏప్రిల్ 23, 2012 at 10:19 సా.

బీ పీ కంట్రోలు కాకపొతే ….

ఇంతకు ముందు టపాలో మనం సాధారణం గా  వత్తిడి లేక పీడనం గురించి తెలుసుకున్నాము. మనం గుండె ప్రధానం గా మన శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని పంపు చేస్తుందని కూడా తెలుసుకున్నాము.
ఇలా రక్తాన్ని పదే పదే ఎందుకు పంపు చేయాలి గుండె ? అలాగే పదే పదే రక్తం మళ్ళీ గుండె లోకి ఎందుకు చేరుకోవాలి? ఎప్పుడైనా ఈ సందేహం మీకు వచ్చిందా?
ఎందుకంటే, మన దేహం లో ప్రతి భాగానికీ  ఆక్సిజెన్  అంటే ప్రాణ వాయువు కావాలి.  ఇంకా సూటి గా చెప్పాలంటే, నిరంతరం కావాలి.  మన దేహం లోని ప్రతి కణానికీ ప్రాణ వాయువు నిరంతరం అవసరం. 
మనం పీల్చే గాలి లోని ఆక్సిజెన్  మన ఊపిరి తిత్తుల ద్వారా , రక్తం లో కలుస్తుంది. ఆ రక్తం గుండెలోకి చేరుకొని, దేహం లో అన్ని భాగాలకూ పంపు చేయ బడుతుంది. అలాగే, మలినాలు మన శరీరం లోని అన్ని భాగాలనుంచీ మళ్ళీ రక్తం ద్వారా, ఊపిరి తిత్తులకు చేరుకొని, అక్కడ, మళ్ళీ శుభ్ర పరచ బడ్డ రక్తం మళ్ళీ గుండెకు చేరుకుంటుంది. అంటే గుండె నుంచి సరఫరా ఆయే రక్తంలో ఎక్కువ ఆక్సిజెన్ ఉంటుంది. గుండె కు తిరిగి వచ్చే రక్తం లో ఎక్కువ కార్బన్  డయాక్సైడ్  ఉంటుంది.
ఇప్పుడు  మానవులలో రక్త పీడనం  లేక బ్లడ్ ప్రెషర్  గురించి తెలుసుకుందాము.
 ఈ రక్త పీడనాన్ని పాదరసం లేక మెర్క్యురీ తో కొలుస్తారు కాబట్టి, ఇంకా విపులం గా చెప్పాలంటే,  బీ పీ ను చెక్ చేసే పరికరం సాధారణం గా  చారిత్రకం గా పాదరసం తో తయారు చేయ బడి ఉండేవి కాబట్టి, ఆ పాదరసం  మన  ఆర్టరీ లేక ధమని  లోని రక్త పీడనానికి స్పందించి ,  సన్నని గాజు నాళికలలో ఎంత పైకి వెళుతుందో, ఆ ఎత్తును మిల్లీ మీటర్లలో చెపుతారు.  అంటే చెప్పేటప్పుడు  ఉదాహరణ కు 120 బై 80 మిల్లీ మీటర్స్ అఫ్ మెర్క్యురీ అని చెపుతారు. దానినే  ఇలా సూచిస్తారు  : 120/ 80 mm of Hg ( Hg అంటే  పాదరసం యొక్క రసాయన నామం  పూర్తిగా hydrarginum లేక హైడ్రార్జినం  )  కానీ భారత దేశం లో చాలా మంది వైద్యులు కేవలం 120 / 80  అని  మాత్రమే  రాస్తుంటారు ఎక్కడ రాసినా !
సాధారణం గా బీ పీ ని అంటే బ్లడ్ ప్రెషర్ ను  సిస్టోలిక్ ఇంకా డయా స్టోలిక్ బీ పీ అని రెండు రకాలైన బీ పీ గా చెపుతుంటారు, దీనిని ఒక దాని మీద ఒకటి వేసి అంటే పైన ఉన్న పీడనం లేక వత్తిడి సిస్టోలిక్ పీడనం, క్రింద చూపించే వత్తిడి డయా స్టోలిక్  పీడనం. 
ఈ రెండు రకాలు గా ఎందుకు చేపుతారంటే  గుండె కొట్టుకుంటున్నప్పుడు, ( అంటే సంకోచం లేక కాంట్రా క్షన్ జరుగు తుండే సమయం లో )  అంటే పంపు చేస్తున్నప్పుడు, సరఫరా ఆయే రక్తం అన్ని భాగాలకూ చేరాలంటే ఎక్కువ పీడనం అవసరం. ఆ పీడనమే పైన చూపించ బడుతున్న పీడనం.  డయా స్టోలిక్ పీడనం సమయం లో గుండె వ్యాకోచించడం వల్ల రక్త నాళాలలో పీడనం లేక వత్తిడి తక్కువ గా ఉంటుంది అందు వల్ల క్రింద సూచించే పీడనం ఎప్పుడూ సిస్టోలిక్ లేక పైన చూపించిన పీడనానికన్నా  తక్కువ గా ఉంటుంది.
ఈ పైనా క్రిందా సూచించ బడే రెండు రక్త పీడనాలూ మనకు ముఖ్యమైనవే ! ఇప్పుడు   క్రింద పటం లో చూడండి.  అడల్ట్  అంటే వయోజనులలో  సామాన్యం గా ఉండ వలసిన రక్త పీడనం, ఎప్పుడు హై బీ పీ లేక హైపర్ టెన్షన్ గా పిలవ బడుతుందో ,( అంటే రక్త పీడనం లేక రక్త పోటు ).
ఇపుడు మనలో  రక్త పీడనం గురించి కొంత తెలుసు కున్నాము కదా ! వచ్చే టపా లో  మనలో రక్త పీడనం కంట్రోలు లో లేకుండా ఎక్కువ గా ఉంటే మానవులలో పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాము. 

బీ పీ కంట్రోలు కాక పొతే ఏం ?.1.

In Our Health on ఏప్రిల్ 22, 2012 at 3:23 సా.

బీ పీ  కంట్రోలు కాక పొతే ఏం ? :

బీ పీ గురించిన వివరాలు  తెలుసుకునే ముందు  రక్త పీడనం అంటే ఏంటో ప్రతి ఒక్కరూ కనీసం కొంత అయినా తెలుసుకోవాలి. 
మనకందరికీ  గుండె ఏమి చేస్తుందో తెలుసు కదా ! ( ఇక్కడ వీలైనన్ని తక్కువ సాంకేతిక పదాలు ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను) , వీలైనంత ఎక్కువ మంది కి అర్ధం అవటం కోసం. గుండె మన శరీరం లోని ప్రతి భాగానికీ రక్తం సరఫరా చేస్తుంది, రక్త నాళాల ద్వారా. అలాగే మన దేహం లోని ప్రతి భాగం నుంచీ మళ్ళీ రక్తం తిరిగి  గుండె కు చేరుకుంటుంది కూడా !  ఇలా జరగటానికి ఒక నిర్ణీతమయిన పీడనం అవసరం.
పీడనం అంటే ఏమిటి ?:
పీడనం  అంటే వత్తిడి. ఉదాహరణ కు మనం నీటి పంపు కు  ఇంకో పైపు ను కనెక్ట్ చేశామనుకుంటే ,  ఒక పదో ఇరవైయ్యో అడుగుల దూరం లో ఉన్న  సన్న జాజి  పూల మొక్కకు, పంపు ను కనీసం మధ్య వరకు  తిప్పితే కానీ నీరు సరిగా అందదు కదా అలాగే, పూర్తిగా తిప్పితే ఆ వత్తిడికి కొన్ని పూలు రాలి పోతాయి కదా ! ఇక్కడ పంపు లో నీటి ధారను  ఒక కవాటం ద్వారా మనం క్రమీకరిస్తున్నామన్నమాట !
కానీ మనం ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి.  భారత దేశం లో ఎడా పెడా, ఏ నిబంధనలనూ పాటించ కుండా నీటి పంపులు కనెక్షన్లు ఇవ్వటం వల్ల , మనం ఉంటున్న ఏరియా లో  నీటి పంపు లోనుంచి సరఫరా రావడమే  తక్కువ పీడనం తో వస్తూంది. ఇది చాలా సాదారాణం కదా !
 ( అందుకే ప్రజలు ‘ స్థానికం గా పేరున్న ‘ వారి ఇళ్ళకు తరువాత  ఇళ్ళలో ఉండటానికి సందేహిస్తుంటారు.  ముందు ఇళ్ళ లో పరవాలేదనుకుంటాను !  ) మనం పీడనం విషయం మాట్లాడుతున్నాము కదా !  ఇక్కడ మనకు తెలుస్తున్నది , పీడనం, ఉనికి అంటే సోర్స్ నుంచీ , అలాగే చివరల్లో కూడా క్రమీకరించ బడుతుంది అని !
ఇప్పుడు అధిక పీడనం పరిణామాలు ఎలా ఉంటాయో ఒక పోలిక చూడండి. 
పైన ఉన్న రెండు పటాలు చూడండి. మొదటి పటం లో ఉన్న చక్కటి నమూనా. అది మీరు నిశితం గా పరిశీలించండి. ఆ నమూనా మార్బుల్ అంటే పాల రాయి మీద చెక్కినది.  అలాగే రెండో నమూనా చూడండి. అది మెటల్ ను చెక్కి అందం గా తయారు చేసిన అశ్వం !
ఈ రెండిటికీ  బీ పీ కంట్రోలు కూ సంబంధం ఏమిటి ?
పైన చూస్తున్న రెండు నమూనాలనూ కేవలం ఎక్కువ వత్తిడి తో పని చేసే నీటి ప్రవాహం తో కత్తిరించారంటే నమ్మ గలరా ? ఇది పూర్తిగా నిజం ! 
ఇలా విపరీతమైన వత్తిడి ఉన్న నీటి తో  గ్రానైట్ ను కానీ లోహాన్ని కానీ కత్తిరించే పరికరాన్ని’ వాటర్ జెట్ కట్టర్ ‘ అంటారు ! 
పై ఉదాహరణ ఇవ్వటం ఎక్కువ వత్తిడి యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మీకు వివరించేందుకే !
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు చూద్దాము !

గుండె జబ్బుల గురించి అందరికీ ఎందుకు?

In Our Health on ఏప్రిల్ 22, 2012 at 9:38 ఉద.

గుండె జబ్బుల గురించి అందరికీ ఎందుకు? 

 
గుండె, లేక హృదయ సంబంధ మైన జబ్బులు, ప్రపంచం మొత్తం లో ఎక్కువ మందిని  బాధ పెడుతున్నాయి. పై పటం చూడండి.
ఈ గుండె జబ్బుల వల్ల, బాధ పడుతున్న వ్యక్తే కాక, వారి కుటుంబం కూడా కుంగి పోయి, అనేక విధాల నష్ట పోతుంటారు.
ప్రపంచమంతా, మానవులలో పెరుగుతున్న  ‘ చెడు ‘ జీవన శైలి ‘ పోకడలు, ఈ గుండె జబ్బులను ఇంకా, ఇంకా పెంచుతున్నాయి.
భారత దేశం లో కూడా, గుండె జబ్బుల వల్ల సంభవిస్తున్న మరణాలు, మిగతా అన్ని జబ్బులూ , కారణాల తో పోలిస్తే కూడా చాలా చాలా ఎక్కువ. 
మరి  అందరికీ ఈ గుండె జబ్బుల గురించి ఎంత వరకు తెలుసు?
చాలా మంది, గుండె జబ్బు తో బాధ పడుతున్న వారు, కేవలం ఉప్పు తగ్గించి ఆహారం తీసుకోవడమే చేస్తారు. మిగతా జాగ్రత్తలు అశ్రద్ధ చేస్తుంటారు.
అందుకు ప్రధాన కారణం, గుండె జబ్బుల మీద తగిన అవగాహన లేక పోవడమే !
అంతే కాక,  కుటుంబం లోని యువత ఇలాంటి విషయాల మీద పరిజ్ఞానం పెంచుకుంటే కూడా, వారి తలిదండ్రులకూ, బంధువులకూ, తగిన సలహా ఇచ్చి, సహాయం చేసిన వారవుతారు. 
అలాగే , వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుసుకుంటే, అనవసరం గా సమయం వృధా, డబ్బు వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు, క్లినిక్స్ , హాస్పిటల్స్ , వైద్యుల చుట్టూ తిరగకుండా !
 అతి ముఖ్యం గా , గుండె జబ్బుల మీద సరియిన అవగాహన  ప్రతి ఒక్కరూ ఏర్పరుచుకుని, తగు జాగ్రత్తలు క్రమం గా పాటిస్తే,  వారు ఎక్కువ ఆరోగ్య వంతులు గా, దీర్ఘ కాలం, ఆనంద మయ జీవితం గడపచ్చు. ఎందువల్ల నంటే చాలా రకాలైన గుండె జబ్బులు మన జీవనశైలి తో ప్రభావితం అవుతున్నవే ! 
తరువాతి టపా నుంచి గుండె , గుండె సంబంధమైన జబ్బులను వివరం గా తెలుసుకుందాము.
ఈ బ్లాగు చదివే ప్రతి వారి  దగ్గర నుంచి  ప్రశ్నలూ , అభిప్రాయాలూ, తెలుగు లో కానీ, ఇంగ్లీషు లో కానీ ఆహ్వానింప బడుతున్నాయి.
మీరు కేవలం, ఈ సైట్ కు మీ హిట్స్ ద్వారానే కాక, మీ ప్రశ్నల ద్వారా,  మిగతా చదువరులకు కూడా ఎక్కువ సహాయం చేసిన వారవుతారు.

సర్వైకల్ క్యాన్సర్.9. అతి ముఖ్యమైన నివారణ చర్యలు.

In Our Health on ఏప్రిల్ 21, 2012 at 10:54 ఉద.
HPV/LSIL On Pap Smear ThinPrep liquid-based Pa...

HPV/LSIL On Pap Smear ThinPrep liquid-based Pap. Normal squamous cells on left; HPV-infected cells with mild dysplasia (LSIL) on right. See also File:Low-Grade SIL with HPV Effect.jpg - Another example of LSIL with HPV changes. File:High-Grade SIL.jpg - High-grade squamous intraepithelial lesion (HSIL). (Photo credit: Wikipedia)

సర్వైకల్ క్యాన్సర్.9. అతి ముఖ్యమైన నివారణ చర్యలు:

 సర్వైకల్ క్యాన్సర్ గురించి రాసిన అన్ని టపా ల సారాంశం,  పై పటం చెపుతుంది మీకు, ఒక్క వాక్యం లో !
మునుపటి టపాలో రెండు నివారణ చర్యల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా రెండు అతి ముఖ్యమైన నివారణ చర్యలు ఏమిటో వివరం గా తెలుసుకుందాము.
3.సర్వైకల్  స్క్రీనింగ్  : స్మియర్ టెస్ట్ అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ ద్వారా  ఒక క్రమ పధ్ధతి లో  సర్విక్స్ కు చెందిన కణాలను పరీక్షించడం  ఇప్పటి వరకూ  అందుబాటు లో ఉన్న వాటి లో ఉత్తమమైన పధ్ధతి.
క్రితం టపాలలో వివరించినట్టు , HPV వైరస్ చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్. కానీ  కేవలం కొద్ది మంది లో మాత్రమే  ఈ ఇన్ఫెక్షన్, సర్వైకల్ కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చి, సర్వైకల్ క్యాన్సర్ కు కారణ మవుతుంది. ఆ కొద్ది మంది, రతి క్రియా  జీవితం అంటే సెక్స్ పరంగా  యాక్టివ్ గా ఉంటున్న వారు ఎవరైనా కావచ్చు. అంటే  ఎవరిలో ఎప్పుడు  సర్వైకల్ కణాలు మార్పు చెందుతాయో  ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయకుండా కనుక్కోవడం అసాధ్యం.  అందువల్లనే ఈ ప్యాప్ స్మియర్ ప్రాముఖ్యత పొందింది.
స్మియర్ టెస్ట్ ఎప్పుడు చేయించు కోవాలి? : 
పాశ్చాత్య దేశాలలో, ఆ దేశాలకు చెందిన ప్రతి సిటిజెన్  కూ  ఆరోగ్య పరం గా ఏ పరీక్షలు ఏ సమయం లో చేయించుకోవాలో  ఆ దేశం యొక్క ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నిర్ణయించి తదనుగుణం గా  వారికి సలహా ఇచ్చి పరీక్షలు చేయిస్తుంది వారి చేత.
భారత దేశం లో కూడా అలాంటి సంస్థ ఉంది  కానీ అది ఎలా పని చేస్తుందో  ఇప్పుడు అక్కడ ఉంటున్న వారికి తెలియాలి. ప్రత్యేకించి సర్వైకల్ క్యాన్సర్ నివారణ కు ఏ చర్యలు చేపడుతుందో,  ఈ టపా చదువుతున్న వారు ఎవరైనా తెలియ చేయవచ్చు, వారికి తెలిస్తే.
సరే ఇప్పుడు అసలు విషయం:  ఇంగ్నండు లో మాత్రం  25 నుంచి 49 ఏళ్ళ వయసు లో ఉన్న స్త్రీలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, 50 నుంచి 64 ఏళ్ళ మధ్య వయసులో ఉన్న స్త్రీలకు  ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి  ఈ స్క్రీనింగ్  పరీక్ష కు పిలవడం  జరుగుతుంది.   ఒకసారి వారు ఈ పరిక్ష ను జరిపించుకొంటే, తరువాత పరీక్షలు ఎంత త్వరగా చేయించుకోవాలి అనే విషయం మొదటి పరీక్ష లో చూసిన సర్వైకల్ కణాల మార్పు  మీద ఆధార పడుతుంది.
4.HPV టీకా  లేక HPV వాక్సిన్ :  ఇప్పటి వరకూ రెండు మందుల కంపెనీలు  ఈ HPV టీకా ను తయారు చేస్తున్నాయి.  మనం మునుపటి టపాలో తెలుసుకున్నట్టు , HPV వైరస్ లు  వంద కు పైగా ఉన్నాయి. అందు లో ముఖ్యమైన 6,11,16,18 రకాలు ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ లకు కారణం. అందు వల్ల ఈ టీకాలు వేయించుకుంటే చాలా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ HPV టీకా,  సర్వైకల్ క్యాన్సర్ రాకుండా  సంపూర్ణ రక్షణ ఇవ్వదు.
HPV టీకా ఎప్పుడు తీసుకోవాలి? : ప్రతి యువతీ, ఈ టీకాను వారు రతి క్రియ లో  ప్ర ప్రధమం గా పాల్గొన బోయే సమయానికి ముందే  వేయించుకోవాలి. ఒకసారి రతి క్రియా జీవితం మొదలు పెడితే,  ఈ టీకా పూర్తి రక్షణ ఇవ్వదు.  అంటే అలాంటి సమయాలలో ఇన్ఫెక్షన్ కనుక సంభవిస్తే, HPV టీకా పని చేయదు.
ఇంగ్లండు లో ఈ టీకా ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు ? :  12 నుంచి 13 ఏళ్ళ వయసు మధ్య ఉన్న అమ్మాయిలకు , మూడు టీకాలు, ఆరు నెలల వ్యవధి లో ఇస్తారు.
HPV టీకా తీసుకుంటే  స్మియర్ టెస్ట్  అవసరం లేదా ? : 
ముందు చెప్పు కున్నట్టు, టీకా కేవలం నాలుగు రకాల వైరస్  లకు వ్యతిరేకం గానే రక్షణ ఇచ్చి , రోగ నిరోధక శక్తి ని ఎక్కువ చేస్తుంది. క్యాన్సర్ కలిగించే ముఖ్యమైన రకాలు ఈ నాలుగే అయినప్పటికీ , మిగతా రకాలు కూడా క్యాన్సర్ కలిగించ గలవు కాబట్టి , స్మియర్ టెస్ట్  క్రమం గా అంటే  ప్రతి మూడేళ్ళకో, అయిదేళ్లకో చేయించు కోవడం ఉత్తమం.
ఈ విషయాలలో అనుమానాలు ఉంటే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది.
 వచ్చే టపా ద్వారా మళ్ళీ కలుసుకుందాం !

సర్వైకల్ క్యాన్సర్.8. నివారణ చర్యలు ఏమిటి ?

In Our Health on ఏప్రిల్ 20, 2012 at 8:05 సా.

సర్వైకల్ క్యాన్సర్.8. నివారణ చర్యలు ఏమిటి ? :

సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల గురించీ , ఎలా కనుక్కోవచ్చో  మనం ఇప్పటి వరకూ తెలుసుకున్నాము.
ఈ సర్వైకల్ క్యాన్సర్ మొదటి దశలలో తగిన పరీక్ష లు చేయించుకుని, కనుక్కోక పొతే, జరిగే పరిణామాలు,  అంటే కాంప్లికేషన్స్ , చాలా సీరియస్ గానూ,  అనుభ వించుతున్న స్త్రీకీ, ఆమె సంబందీకులకూ , చికిత్స చేసే వారికీ , చాలా బాధాకరం గా కూడా ఉంటాయి. అందు వల్ల వాటిని వివరం గా ప్రస్తావించడం లేదు ఇక్కడ.
కానీ అందరూ తెలుసుకోవలసిన  ముఖ్యమైన నివారణ చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము:
సర్వైకల్ క్యాన్సర్ నివారణ చర్యలలో నాలుగు  ముఖ్యమైనవి అందులో మొదటి రెండు :
1. సురక్షిత రతి అంటే సేఫ్ సెక్స్ 
2. స్మోకింగ్ మానటం.
1.సేఫ్ సెక్స్  అంటే సురక్షిత  రతి :  HPV వైరస్  ఒకరినుంచి ఇంకొకరికి  అరక్షిత అంటే అన్ సేఫ్  రతిక్రియ వల్లనే  పాకుతుంది. అంటే స్ప్రెడ్  అవుతుంది.   అందువల్ల రతిక్రియ  లో పాల్గొనాలని అనుకునే యువతీ యువకులు, కామ లేక రతి ద్వారా కలిగే లేక పాకే ఇన్ఫెక్షన్ లు అన్నిటికీ ముందే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.  ఇది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ ,  ఇరువురికీ ఎంతో శ్రేయస్కరం.
అంతే కాకుండా,  ప్రతి రతి క్రియకు ముందూ పురుషుడు, స్త్రీ  గర్భ నిరోధ తొడుగులు అంతే కండోము, డయాఫ్రం  లాంటివి వాడటం కూడా ముఖ్యం.
ఈ తొడుగులు కేవలం గర్భ నిరోధమే కాకుండా,  వివిధ కామ పరమైన అంటు వ్యాధులు సోకకుండా రక్షణ ఇస్తాయి.  కానీ ముఖ్యం గా గుర్తుంచు కోవలసిన విషయం : ఈ తొడుగులు  సంపూర్ణ రక్షణ ఇవ్వవు.( వంద శాతం రక్షణ ఇవ్వవు. )
2. స్మోకింగ్ మానడం :  ఉదాహరణకు అమెరికా లో అమెరికన్ లంగ్  అసోసియేషన్  అంచనా ప్రకారం 2008 లో రమారమి   25 మిలియన్ ల పురుషులు స్మోకింగ్ చేస్తుంటే,   రమారమి 21 మిలియన్ ల స్త్రీలు స్మోకింగ్ చేస్తున్నారు.
ఇలా స్మోకింగ్ చేస్తున్న స్త్రీలలో ప్రతి సంవత్సరానికీ ,  173, 940 మంది  మరణిస్తున్నారు కూడా ! ఇది ఒక్క అమెరికాలోనే ! 
స్మోకింగ్ మాన్పించడానికి  పాశ్చాత్య దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల  సిగరెట్ కంపెనీ వాళ్ళు , ‘ తాళం మార్చి ‘  అభివృద్ధి చెందుతున్న దేశాలకు  వారి  సిగరెట్ల  ( తో ప్రాణాలు తేసే ) వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. అందువల్ల మన భారత దేశం లో  స్త్రీలు కూడా ‘  ఈ పాశ్చాత్య వ్యామోహం ‘ లో పడి  సిగరెట్ స్మోకింగ్  అలవాటు చేసుకుంటున్నారు.
అయితే స్త్రీలు సిగరెట్ స్మోకింగ్ చేయడానికీ , వారికి సర్వైకల్ క్యాన్సర్ రావడానికీ సంబంధం ఏమిటి ?  ఈ బ్లాగరు  తలా, తోకా లేకుండా రాసి పారేస్తున్నాడు అని అనుకుంటారేమో ! అలాంటి వారు  ఈ వివరణ చదవండి:
ఇప్పటి వరకూ జరిగిన అనేకమైన పరిశీలనలు, పరిశోధనల వల్ల,  సిగరెట్ స్మోకింగ్ చేస్తున్న స్త్రీలలో సాధారణం గా వచ్చే HPV వైరస్ ఇన్ఫెక్షన్ కాస్తా , సర్విక్స్ కణాల డీ ఎన్యే ను ముట్టడి చేసి  దానిని క్యాన్సర్ కణాలు గా మార్చి వేస్తుంది అని ఖచ్చితం గా తెలుసుకున్నారు. ఈ విధమైన మార్పులు సిగరెట్ తాగని స్త్రీలలోనూ  జరుగుతున్నా,  స్మోకింగ్ చేస్తున్న వారిలో ఈ మార్పులు త్వరగా నూ, ఎక్కువ గాను జరుగుతున్నట్టు గుర్తించారు.  ఈ టపాల పరంపర లో మొదటి టపా ల లో  సిగరెట్ స్మోక్ లో ఉండే విష పదార్ధాలు మన దేహం లో కణాల డీ ఎన్యే ను ఎలా ముట్టడి చేసి వాటిని క్యాన్సర్ కణాలు గా మార్చుతాయో తెలుసుకున్నాము కదా !
వచ్చే టపాలో మిగతా  రెండు అత్యంత ముఖ్యమైన నివారణ చర్యల గురించి తెలుసుకుందాము !