Our Health

Archive for the ‘Our Health’ Category

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు.

In Our Health on జూలై 18, 2012 at 7:39 సా.

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు. 

( reproduced from Young et al. courtesy: Macmillan publishers  Ltd.) 

క్రితం టపాలో , హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియం, జీర్ణాశయం లో అల్సర్ లు ఏర్పడడానికీ, జీర్ణాశయం లో క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఏర్పడడం లో ప్రధాన పాత్ర ఎట్లా వహిస్తుందో తెలుసుకున్నాము కదా !  కేవలం హెలికో బాక్టర్ పైలోరి నే కాకుండా , మిగతా బ్యాక్టీరియాలు కొన్ని కూడా మానవులలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
సాల్మొనెల్లా టైఫి ( పిత్తాశయ క్యాన్సర్ కలిగింస్తుంది ) : ( పైన ఉన్న చిత్రం చూడండి . పైన ఉన్న చిత్రం లో మొదట సాల్మొనెల్లా టైఫి మ్యూరియం అనే బ్యాక్తీరియం ప్రేగు గోడల ( కణాల ) లోకి చొచ్చుకు పోవడం, తరువాత బీ కణాలు, టీ కణాల ద్వారా లింఫ్  గ్రంధి లోకి వెళ్ళడం చూప బడింది.  అదే చిత్రం లో కుడి వైపున సాల్మొనెల్లా టైఫి అనే ( ఇది కూడా టైఫాయిడ్ కారక ) బ్యాక్టీరియం కూడా ప్రేగు కణాల గోడల లోకి చొచ్చుకు వెళుతుంది.తరువాత బీ కణాల లోకీ , టీ కణాల లోకీ వెళుతుంది. అక్కడ నుంచి ఎముకల మూలుగ అంటే బోన్ మారో లోకీ, ప్లీహం లోకీ అంటే స్ప్లీన్  లోకీ వెళ్లి పైత్యాశయం లేదా గాల్ బ్లాడర్ ను చేరుకుంటుంది. అక్కడ ఈ బ్యాక్టీరియాలు వృద్ధి అయి , నిలువ ఉండి, గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయ క్యాన్సర్ కు కారణమవుతుంది.  ) ఈ బ్యాక్టీరియం సాధారణం గా మానవులలో టైఫాయిడ్ కలిగిస్తుంది. టైఫాయిడ్ జ్వరం కొందరిలో సరిగా మానక , ( దీనికి కారణం యాంటీ బయాటిక్ లు క్రమం గా తీసుకోక పోవడం వల్ల కానీ , లేదా కొన్ని పరిస్థితులలో చికిత్స సంపూర్ణం గా తీసుకున్నా , కొందరు క్రానిక్ క్యారియర్ స్థితి కి చేరుకుంటారు. అంటే వారు కొన్ని సంవత్సరాల తరబడి , వారి మలం లో టైఫాయిడ్ బ్యాక్టీరియాలను విసర్జించుతూ ఉంటారు. అంటే వారు టైఫాయిడ్ జ్వర లక్షణాలు ఏవీ కనబరచక పోయినా , టైఫాయిడ్ బ్యాక్టీరియాలు మాత్రం వారిలో కొంత నిర్ణీత సంఖ్య లో ఉత్పత్తి అవుతూ ఉండి, వారి మల మూత్రాదుల ద్వారా బయటకు వచ్చి , ఆరోగ్య వంతులైన మిగతా వారిని , ముట్టడి చేసి , వారిలో టైఫాయిడ్ లక్షణాలనూ , టైఫాయిడ్ నూ కలిగించ గలవు. అంతే కాకుండా , ఈ సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియాలు, గాల్ బ్లాడర్ లో అంటే, మన దేహం లో పైత్య రసాలు నిలువ చేసే ఒక సంచి లేదా తిత్తి , ఈ భాగం లో దాక్కుంటాయి. ఇట్లా సంవత్సరాల తరబడి పైత్యాశయం లేదా పిత్తాశయం లో దాక్కున్న సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాలు, ఆ పిత్తాశయం లోనే క్యాన్సర్ కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
స్త్రెప్తో కాకస్ బోవి  (పెద్ద ప్రేగు క్యాన్సర్ కలిగిస్తుంది ) : ఈ బ్యాక్టీరియం స్త్రెప్తో కొకై అనే రకానికి చెందిన బ్యాక్టీరియం. సామాన్యం గా మానవుల పెద్ద ప్రేగు లో ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియం కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిన వారిలో నలభై నుంచి అరవై  శాతం మందిలో  క్యాన్సర్ కారకం అని నిర్ణయించారు, వివిధ పరిశీలనలలో.  ఈ స్త్రెప్తో కాకస్ బోవి అనే బ్యాక్టీరియం మహా చెడ్డది !  దీని ఇన్ఫెక్షన్ సామాన్యం గా  గుండె లోపలి గోడల లోనూ , ఇంకా గుండె కవాటాలనూ పాడు చేస్తుంది.ఇట్లా గుండె ఇన్ఫెక్షన్ సోకిన చాలా సంవత్సరాల తరువాత , పెద్ద ప్రేగులో క్యాన్సర్ కలిగించడం కూడా గమనించారు. 
క్లామీడియా న్యుమోనియే (ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ కు కారణమవుతుంది )  : ఇది ఇంకో గ్రామ్ నెగెటివ్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియం. అమెరికాలో ఈ బ్యాక్టీరియం కనీసం యాభై శాతం మందిలో, వారి జీవిత కాలం లో ఎప్పుడో ఒక సారి న్యుమోనియా ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సామాన్యం గా ఫ్లూ లాగా ఉండి కొన్ని రోజులలో తగ్గి పోతుంది. కానీ  కొందరిలో  క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే దీర్ఘ కాలికం గా ఈ బ్యాక్టీరియాలు వారి ఊపిరి తిత్తులలో ఉండి , ఒక రకమైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని క్లామీడియాల్ హీట్ షాక్ ప్రోటీన్ 60 అంటారు. ఈ ప్రోటీన్  అత్యంత రోగనిరోధక శక్తి ని మానవులలో కలిగిస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలికం గా ఉండి, దాని పరిణామాలు దీర్ఘ కాలిక వ్యాధి రూపం లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సారి ఈ బ్యాక్టీరియా కలిగించిన దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ వల్ల  లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు హెచ్చుతాయి. 
ఈ బ్యాక్టీరియాలు ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి? : 
బ్యాక్టీరియాలు అన్నీ కొన్ని విష పదార్ధాలను విడుదల చేస్తాయి. వీటిని బ్యాక్టీరియల్ టాక్సిన్ లు అంటారు. ఈ టాక్సిన్ లు మన దేహం లోని జీవ కణాలలో ఉన్న డీ ఎన్ ఏ  అంటే జన్యు పదార్ధాన్ని ముట్టడి చేస్తాయి. అంతే కాక  ఆ సహజమైన ఆరోగ్యమైన జన్యు పదార్ధాన్ని శాశ్వతం గా , అసహజం గా  మార్చి వేస్తాయి. దానితో ఆ అసహజమైన జన్యు పదార్ధం ఉన్న జీవ కణాలు ఒక నియంత్రణ ఏమీ లేకుండా కణ విభజన జరిపి , లక్షలూ , కోట్ల సంఖ్య లో అసహజమైన క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తాయి, ఆ అసహజ , క్యాన్సర్ కణాల సముదాయమే కంతి లేక ట్యూమర్ అని అంటాము. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?

In Our Health on జూలై 17, 2012 at 10:27 సా.

 క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?:

క్రితం టపాలో మనం ఒక సామాన్య జీవ కణం, జన్యువు లో మార్పు వల్ల క్యాన్సర్ కణం గా పరివర్తనం చెందుతుందో తెలుసుకున్నాము కదా ! 
మరి ఇట్లా జన్యువుల లో పరివర్తన తేవడానికి , బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , వివిధ రసాయన పదార్ధాలూ కారణ మవుతాయి.  మన కు అంటే మానవులకు కలిగే కొన్ని  క్యాన్సర్ లలో ఈ బ్యాక్టీరియా లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కడుపు లో క్యాన్సర్ కు ఈ బ్యాక్టీరియా లు ఎట్లా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకుంటే మనం స్టమక్ క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఏమి చేయ వచ్చో కూడా విశద  పడుతుంది. 
జీర్ణాశయ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది?: 
జీర్ణాశయ క్యాన్సర్  దక్షిణ భారత దేశం లో ఎక్కువ గా వస్తున్నట్టు పరిశోధనల వల్ల తెలిసింది  ముఖ్యం గా మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కారకం అవుతాయి.ఇక్కడ వివిధ పరిశీలనల లో శాస్త్రీయం గా తెలుసుకున్న ఫలితాలు చూద్దాము. బొంబాయి లో జరిపిన ఒక పరిశీలనలో ఎండ బెట్టిన చేపల తో చేసిన వంటకాలు తింటున్న వారిలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తెలిసింది. కానీ టీ అంటే తేయాకు, ప్రత్యేకించి పాలు కలుపుకోకుండా తాగే టీ – తాగుతున్న వారిలో స్టమక్ క్యాన్సర్ తక్కువ గా వస్తున్నట్టు తెలిసింది. త్రివేండ్రం లో చేసిన ఇంకో పరిశీలనలో , ఎక్కువ  అన్నం అంటే రైస్ తినే వారిలో , ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాలు తినే వారిలో , ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వారిలో, ఎక్కువ కారం తినే వారిలో , స్టమక్ క్యాన్సర్ ఎక్కువ గా వస్తున్నట్టు తెలిసింది.
( Sinha et al : Cancer risk and Diet in India )  ఫ్రైడ్ ఫుడ్ అంటే వేపుడు కూరలు, అవి కూరగాయలతో కానీ మాంసం తో చేసిన కూరలు కానీ , వేపుడు కూరలు ఎక్కువ గా తింటున్న వారిలో కూడా స్టమక్ క్యాన్సర్  ఎక్కువ గా వస్తున్నట్టు గమనించారు.
మరి వేపుడు కూరలు ఎందుకు మనకు హానికరం?  : క్యాన్సర్ కారకాలైన హెటిరో సైక్లిక్ అమీన్ లు మన ఆహారాన్ని ఎంత వేయిస్తూ ఉంటే అంత ఎక్కువ గా తయారవుతూ ఉంటాయి. ఇంకో విధం గా చెప్పాలంటే , వేపుడు కూరలలో , క్యాన్సర్ కారక విష పదార్ధాలు  ఎక్కువ గా ఉంటాయి. ఈ విష పదార్ధాలు జీర్ణాశయ గోడలలో ఉండే కణజాలం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే కణాలలోని జన్యు పదార్ధం లో అంటే జీన్స్ నిర్మాణం లో పరివర్తన తీసుకువచ్చి ఆ సహజ కణాలను అసహజమైన క్యాన్సర్ కణాలు గా  మారుస్తాయి.ఒకసారి క్యాన్సర్ కణాలు ఈ విధం గా ఏర్పడ్డ తరువాత , తమ లాంటి క్యాన్సర్ కణాలనే  అధిక సంఖ్య  లో  ఉత్పత్తి చేసి క్యాన్సర్ కు కారణమవుతాయి.  
స్టమక్ క్యాన్సర్ బ్యాక్టీరియా వల్ల వస్తుందా ? : ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ , స్టమక్ అల్సర్ లు కేవలం, కడుపులో ఉండే ఆమ్లాలు ఎక్కువ గా ఉత్పత్తి అయి ఆ ఆమ్లాలు లేదా యాసిడ్ లు కడుపు అంటే జీర్ణాశయ గోడలను తిని వేయడం వల్ల  స్టమక్ అల్సర్ లు ఏర్పడతాయి అని భావించ బడుతూ ఉండేది. అందుకే అల్సర్ ఉన్న చాలా మందికి ఆపరేషన్ చేసి ,యాసిడ్ ఎక్కువ గా ఉత్పత్తి చేస్తున్న వేగస్ నాడి ని కత్తిరించే వారు. క్రమేణా , స్టమక్ అల్సర్ ఏర్పడడానికి ప్రధాన కారణం హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్త్రీరియం కారణమని ఒక ఆస్త్రేలియన్ వైద్యుడు కనుక్కొన్నాడు. ఆ తరువాత ఈ బ్యాక్తీరియాన్ని హతమార్చడానికి  ట్రిపుల్ తిరపీ అనే మూడు రకాల యాంటీ బయాటిక్స్ ఒక వారం వాడి ఈ బ్యాక్టీరియాలను మన దేహం నుంచి సమూలం గా  నిర్మూలించి తద్వారా అల్సర్ ను కూడా  నయం చేస్తున్నారు వైద్యులు. తరువాత చేసిన, చేస్తున్న పరిశోధన లలో  ఈ హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం మనకు చేస్తున్న హాని ఇంతా అంతా కాదని తెలిసింది. ప్రత్యేకించి , స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా ఈ బ్యాక్టీరియం ‘ కుట్ర ‘ పన్నుతూ ఉంటుంది.
 మరి ఈ హెలికో బ్యాక్టార్ పైలోరి క్యాన్సర్ ఎట్లా కలిగిస్తుంది?: ఈ బ్యాక్టీరియాల వల్ల జీర్ణాశయ గోడలలో ఉన్న కణాలలో మార్పులు, ప్రత్యేకించి ఆ కణాల జన్యువులలో మార్పులు తీసుకు వచ్చి వాటిని క్యాన్సర్ కణాలు గా మారుస్తాయి. మనం మన వంటలలో ఉపయోగించే పసుపు కొంత వరకు మనకు స్టమక్ క్యాన్సర్ రాకుండా రక్షకం గా పనిచేస్తుంది. పసుపులో హెలికో బ్యాక్టార్ పైలోరి ను హరించే గుణం ఉందని తెలిసింది. 
జీర్ణాశయ క్యాన్సర్  వచ్చే రిస్కు ను మనం ఏవిదం గా తగ్గించుకోవచ్చు ?: 
మనం తినే ఆహార పదార్ధాలను వండుకునే విధానాలలో మార్పులు తీసుకు రావడం ద్వారా మనం రిస్కు తగ్గించు కోవచ్చు. అంతే కాక స్టమక్ అల్సర్ లు కనక వస్తే అశ్రద్ధ చేయకుండా ట్రిపుల్ తిరపీ వాడి హెలికో బ్యాక్తీరియాన్ని  దాని ఇన్ఫెక్షన్ నూ నిర్మూలించుకుంటే , ఆ బ్యాక్తీరియం మనకు ఎక్కువ హాని  చేయకుండా , అంటే క్యాన్సర్  కారకం కాకుండా నివారించుకోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు.1.

In Our Health on జూలై 15, 2012 at 6:36 సా.

క్యాన్సర్ కారక స్థితులు.1. 

క్యాన్సర్. దీనినే రాచ పుండు అనే వారు పూర్వ కాలం లో. అంటే  రాజులకు వచ్చే వ్యాది అని పూర్వ కాలం లో అనుకునే వారు. కాల క్రమేణా క్యాన్సర్ లేదా రాచ పుండు ను త్వరిత గతిని కనుక్కుంటున్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , తోలి  దశలలోనే కనుక్కుని సరి అయిన చికిత్స చేసి , మానవుల జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు  వైద్య నిపుణులు.
ఇటీవల ప్రఖ్యాత క్రికెట్ ఆట గాడు , భారతీయులకు క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించడం లో కీలక పాత్ర వహించిన యువకుడైన  యువరాజ్ సింగ్ కు అకస్మాత్తు గా క్యాన్సర్ ను నిర్ధారించి, విదేశాలకు పంపి చికిత్స చేయించడం, అందరి హృదయాలలో ఒక ముద్ర వేసిన సంఘటన అయింది. క్యాన్సర్ అంటే భయపడడం మాని , దానిని అర్ధం చేసుకోవడానికీ, క్యాన్సర్ వచ్చిన వారికి చేయూత నీయడానికీ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలలో ఉదారం గా పాల్గొంటున్నారు కూడా ! 
మరి సామాన్య జనానీకానికి క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన ఉంది ?  వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంతా దైవాదీనమేనా?  మన చేతులలో ఏమీ లేదా ?  ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, మనం క్యాన్సర్ ఏవిదం గా వస్తుందో తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఒక గమనిక : నేను క్యాన్సర్ స్పెషలిస్టును కాను. ఇక్కడి టపాలలో నాకు తెలిసిన జ్ఞానాన్ని టపాలలో తెలిపి , క్యాన్సర్ గురించి అవగాహన పెంచుదామనే. చదువరులు, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి స్పెషలిస్టు ను సంప్రదించడం ఉత్తమం. 
అసలు విషయం: 
సామాన్యం గా మానవులలో ప్రతి క్యాన్సరూ కొంత కాలం, మన దేహం లో ఉన్న కణాలలో కొన్ని మార్పులు తెచ్చిన తరువాత , క్యాన్సర్ గా బయట పడుతుంది. క్యాన్సర్ గా బయట పడడానికి ముందు ఉండే స్థితిని  ప్రీ మాలిగ్నెంట్ కండిషన్  లేదా ప్రీ క్యాన్స రస్ కండిషన్ లేదా క్యాన్సర్ కారక స్థితి అనబడుతుంది. ఈ క్యాన్సర్ కారక స్థితి గురించి మనకు మంచి అవగాహన ఏర్పడితే , ఈ క్యాన్సర్ కారక స్థితి కూడా ఏర్పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం ప్రత్యెక క్యాన్సర్లు చర్చించే సమయం లో , ఈ జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాము.
( ఉదాహరణకు: పొగాకు పీల్చితే, అంటే సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎందు వల్ల సిగరెట్ తాగితే  క్యాన్సర్ వస్తుందో కొద్ది మందికి మాత్రమె అవగాహన ఉంటుంది ) 
ఇప్పుడు ఇంకో  ఉదాహరణ చూద్దాము : లివర్ క్యాన్సర్. దీనినే శాస్త్రీయం గా హెపాటిక్ సెల్ క్యాన్సర్. పైన ఉన్న చిత్రం గమనించండి. ఈ చిత్రం లో మొదట కనిపించే కణాలు హెపాటిక్ స్టెం కణాలు అనబడతాయి. వాటినుంచి హెపాటిక్ ప్రోజేనై టార్ కణాలు పుడతాయి. చివరగా కాలేయ కణాలు లేదా హెపాటిక్ సెల్స్ , హెపాటిక్ ప్రోజెనైటార్ కణాల నుంచి పుడతాయి.ఇంత వరకూ జరిగిన చర్యలు సహజం గా ప్రతి కాలేయం లో జరిగే చర్యలే ! కానీ క్యాన్సర్ కారక సంఘటనలు , అంటే మ్యుటేషన్ లాంటివి జరిగి హెపాటిక్ ప్రోజెనైటార్ కణాలకు బదులు క్యాన్సర్ ప్రోజెనైటార్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాలేయ క్యాన్సర్ విషయం లో కొన్ని రకాల వైరస్ లు, ఇంకా అఫ్లా టాక్సిన్ అనే విష పూరితమైన ఫంగస్, ఇంకా మద్యం అంటే ఆల్కహాలు –ఇవన్నీ సహజం గా జరిగే చర్యల రూటు మార్చి , కణాలలో మ్యుటేషన్ జరగటానికి దోహదమవుతాయి. మ్యుటేషన్ అంటే కణం లో వచ్చే సమూలమైన , ఆకస్మికమైన మార్పులు. ఈ మార్పులు సామాన్యం గా కణం లోని జన్యువులలో , అంటే జీన్స్ లో వస్తాయి. ఈ మ్యుటేషన్ ఒక సారి వచ్చిన తరువాత  పుట్టే కణాలు క్యాన్సర్ కణాలు అవుతాయి. ఈ విధం గా పుట్టిన క్యాన్సర్ కణాలు, ఒక పద్ధతంటూ లేకుండా ఎడా పెడా క్యాన్సర్ కణాలను ఉత్పన్నం చేస్తాయి. దానితో రాచ పుండు లేదా క్యాన్సర్ ఏర్పడుతుంది. చూశారు గా , పటం సహాయం తో , సహజమైన కాలేయ కణాలు , క్యాన్సర్ కణాలు గా మ్యుటేషన్ లేదా పరివర్తన ఎట్లా చెందుతాయో ! 
మరి  కాలేయ క్యాన్సర్ నివారణలో మన కర్తవ్యం ఏమిటి ?: 
1. వైరస్ ఇన్ఫెక్షన్ లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం.
2. మద్యం ముట్టక పోవడం. 
3. అఫ్లా టాక్సిన్ అనే విషం మన ఆహారం లో లేకుండా చూసుకోవడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

ఆప్టిమిజం తో లాభాలూ , పెసిమిజం తో నష్టాలూ !.20.

In మానసికం, Our Health, Our minds on జూన్ 6, 2012 at 11:08 సా.

ఆప్టిమిజం తో లాభాలూ , పెసిమిజం తో నష్టాలూ.20.

మనం క్రితం టపాలలో ఆశావాదం, నిరాశావాదం, ఏ విధం గా మన ఆలోచనలనూ, మన ప్రవర్తననూ  ప్రభావితం చేస్తాయో తెలుసుకున్న్టాము కదా!.
మనం ఇప్పుడు ఆశావాదం అంటే ఆప్టిమిజం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో చూద్దాము .
1.ఆప్టిమిజం అంటే ఆశావాద మనస్తత్వం , మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తద్వారా దీర్ఘ ఆయువు కు కారకమవుతుంది.
2.ఆప్టిమిజం , మనం ఆనంద మయిన జీవితాలు గడపడానికి దోహద పడుతుంది.
3.వత్తిడీ, ఆందోళనా తగ్గటానికి కూడా , ఆప్టిమిజం తోడ్పడుతుంది.
4.మనం తీసుకున్న ఏ మార్గం అయినా, ఆప్టిమిజం తో విజయం పొంద డానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
5.తద్వారా మన విద్యావకాశాలను మనం సద్వినియోగం చేసుకోగలం.
6.మన వ్యక్తిగత మానవ  సంబంధాలను ఆప్టిమిజం తో వృద్ధి  చేసుకోగలం.
7. ఆశావాద ధోరణితో మనం సమస్యలను విజయవంతం గా నూ తొందర గానూ పరిష్కరించుకునే  నిపుణత ఎక్కువ అవుతుంది మనకు.
8.ప్రతికూల పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు మనం, ఆప్టిమిజం తో వాటిని  నేర్పుగా అధిగమించ గలుగుతాము. 
9.అలాగే  ఫెయిల్యుర్స్  అంటే మన జీవితాలలో మన వైఫల్యాలను, మనం మన ( ఆప్టిమిజ ) ధోరణి తో  ఒక సమతుల్యం అంటే బ్యాలన్స్ తో  డీల్ చేయ గలుగుతాము. 
( అంటే వైఫల్యాలు మనకు ఎదురైనప్పుడు, మన ఆశావాద ధోరణి  లేక ఆప్టిమిజం ఉంటే  , క్రుంగి పోకుండా, ఆ వైఫల్యాలను అధిగమించ గలుగుతాము. ) 
అదే మనం ఇన్ని లాభాలు చేస్తున్న ఆశావాద ధోరణి లేదా ఆప్టిమిజం ను కాదనుకొని నిరాశావాదం వైపు లేదా పెసిమిజం వైపు మొగ్గితే జరిగే నష్టాలు చూడండి.
1.పెసిమిజం, ఎక్కువ కాలం ఉంటే , డిప్రెషన్ కు కారణమవుతుంది.
2. పెసిమిజం తో , మన ఆయుష్షు తగ్గుతుంది.
3.ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు , పెసిమిజం కూడా తొడు అవుతే , ఏ చర్యా తీసుకోలేని స్తబ్దత ఏర్పడుతుంది. 
4. పెసిమిజం మన దేహం లో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ ని తగ్గించి మన అనారోగ్యానికి హేతువు అవుతుంది.
5.అనారోగ్యం వల్ల మనం మన రోజు వారీ కార్యక్రమాలు, లేదా మన ఉద్యోగాన్ని సరిగా చేయలేక ,
6, మన అభివృద్ధి కుంటు పడుతుంది.
7,అందువల్ల మనం మన మానవ సంబంధాలను కూడా సరిగా పటిష్ట పరుచుకోలేక పోతాము. 
8. పెసిమిజం తో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేని అశక్తత ఏర్పడుతుంది. 
 పైన వివరించిన లాభాలు అన్నీ వివిధ పరిశీలనల వల్ల నిర్దారింప బడినవే !  ఇప్పుడు మీకు ఆప్టిమిస్ట్ లు గా మారటానికి ఎక్కువ సమయం అక్కర లేదు కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ. బయటి, లోపలి కారణాలు . 19.

In మానసికం, Our Health, Our minds on జూన్ 1, 2012 at 11:56 సా.

పాజిటివ్ సైకాలజీ. బయటి, లోపలి కారణాలు .  19. 

క్రితం టపాలో మనం రెండవ రకానికి చెందిన ఆశా వాదులు , నిరాశా వాదులు ఏవిధం గా ఆలోచిస్తారో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మూడవ రకం ఏంటో చూద్దాము.
ఈ రకం లో  జీవితం లో పొరపాటు జరిగినప్పుడు , ఆశా వాదులు అంటే ఆప్టిమిస్ట్ లు బాహ్య కారణాలు (external ) వెతుకుతారు. అంటే వారు వారిని నిందించుకోరు. బయటి కారణాలు ఏమైనా ఉన్నాయో లేదో ఆలోచిస్తారు , తమ జీవితం లో జరిగిన పొరపాట్లకు. కానీ పెసిమిస్ట్ లు, వారి జీవితం లో జరిగిన పొరపాట్లకు వెంటనే వారిని వారే నిందించు కుంటారు. 
ఇలా బయటి కారణాలు వెతికే వారు ఎక్కువ పాజిటివ్ దృక్పధం కలిగి ఉంటారు. కానీ తమకు తామే నిందించు కునే పెసిమిస్ట్ లు నిరాశా జనకం గా ఉండి, తమను తాము నిందించు కుంటూ( internal ) , విమర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆత్మ విమర్శ కొంత వరకూ సమంజసమే కానీ ఎక్కువ గా చేసుకుంటూ ఉన్నట్టయితే, పెసిమిజం  వారిని ఆక్రమించుకుంటుంది. 
డాక్టర్ రీవిచ్ , ఈ మనస్తత్వాన్ని ‘ me, not me ‘ మనస్తత్వం గా వివరించారు. అంటే  ఆప్టిమిస్ట్ లు, తమ జీవితం లో జరిగిన పొరపాట్లకు , not me, అంటే నేను కాదు  అందుకు కారణం , అని ఇతర కారణాలు వెతుకు తారు , అంటే ఇతరులను, తమ తప్పిదాలకు కారణమంటారు. అంతే కాక, వారు ‘ ఎప్పుడూ కాదు ‘ ఆంతా కాదు ‘ not always’ , not everything ‘ అని తమను నిందించు కోకుండా ఇతర కారణాలు వెతుకు తారు. 
డాక్టర్ రీవిచ్ ఈ మనస్తత్వాన్ని , మన వ్యక్తిత్వ  తీరు కాక , మన ఆలోచనా ధోరణి అని  చెప్పి ,  ఇది మన ఆలోచనా ధోరణి అవడం వల్ల, మనం మార్చుకోవచ్చు ‘ అంటారు. 
అంటే, ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు , వెంటనే స్వీయ విమర్శలు మాని , ఆ పొరపాటు జరగటానికి ఇతర కారణాలు ఏవేవి ఉన్నాయో వాటిని పరిశీలించే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలన్న మాట. ఇలా ఇతర కారణాలు అవలోకనం చేసుకున్నప్పుడు, మనం ఎక్కువ ఆశావాదులు గా అంటే పాజిటివ్ దృక్పధం తో ఉంటాము. 

ఇలాంటి ఆలోచనా ధోరణి మన జన్యువులలో కాక అంటే జీన్స్ లో కాక, కేవలం మనం ఆలోచించే తీరు లో ఉంటుంది కనుక , మనం దానిని తెలుసుకుని , సవ్యం గా ఆలోచించే అలవాటు చేసుకుంటే , లాభ పడతాము. 
 
 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
( వచ్చే టపా  అయిదారు రోజుల తరువాత వస్తుందేమో, ఈ లోగా  టపా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.  అలా జరగక పొతే,   క్షంతవ్యుడిని ! )

హృదయం, లయ తప్పితే ఏ పరీక్షలు చేయించాలి?.38.

In Our Health on మే 19, 2012 at 9:52 ఉద.

హృదయం లయ తప్పితే  ఏ పరీక్షలు చేయించాలి?.38. 

హృదయం లేక గుండె, లయ అంటే ఏమిటి , లయ తప్పటం ఏమిటి , ఏ పరిస్థితులలో లయ తప్పుతుందో , మనం క్రితం టపాలలో వివరం గా చూశాము , తెలుసుకున్నాము కదా !
మరి ఏమి చేయాలి అట్లాంటి పరిస్థితులు ఏర్పడినా,  ఆ అనుమానం వచ్చినా? 
ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి , కార్డియాలజిస్ట్  సలహా తీసుకోవడం ఉత్తమం.
సాధారణం గా  చేసే పరీక్షలు  ఇలా ఉంటాయి.
రక్త పరీక్షలు ( రక్తం లో లవణాలు , తయిరాయిడ్  హార్మోను ,  అలాగే గ్లూకోజు  ఎంత ఉందొ తెలుసుకుంటే కొన్ని కారణాలు  కూడా తెలుస్తాయి. )
అలాగే ECG అంటే ఎలెక్ట్రో కార్డియో గ్రాం అంటే గుండె ‘రాత ‘ కనుక్కుంటే  దానివల్ల కొన్ని కారణాలు తెలియ గలవు. 
కొన్న్ని సమయాలలో కేవలం ఒక సారి తీసిన ఈ సి జీ తో ఒక ఐడియా ఏర్పడక పోవచ్చు , అందు వల్ల 24 గంటల ఈ సి జీ అంటే దానిని Holter monitoring అంటారు. అది అవసరం కావచ్చు. ఎందుకంటే గుండె కొట్టుకోవడం లో అవకతవకలు 24 ఎప్పుడో కొంత సమయం లో రావచ్చు. ఆ సమయం ఒక్క సారి చేయించుకునే ECG అంటే ఈ సి జీ పరీక్ష తో ఏకీభ వించక పోవచ్చు. అందువల్ల ఒక మానిటరింగ్ ఆపరేటస్ ను శరీరానికి ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలూ ‘ తగిలించి ‘ అందులో గుండె రాతలు అంటే ఎలెక్ట్రికల్ యాక్టివిటీ అఫ్ హార్ట్  పరిశీలించుతారన్న మాట. 
యాంజియో గ్రాం ఇంకా ఎకో కార్డియో గ్రాం కూడా అవసరం ఉండవచ్చు , ఉన్న కారణాన్ని బట్టి. 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము ! 
 

హృదయం, లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37.

In Our Health on మే 18, 2012 at 7:11 సా.

 హృదయం,  లయ ఎప్పుడు తప్పుతుంది ?. 37.

మునుపటి టపాలో చూశాము కదా !  గుండె లేక హృదయం రేటు , రిధం అంటే ఏమిటో!
ఇప్పుడు హృదయ  రిధం అంటే లయ  ఏ  ఏ  పరిస్థితులలో తప్పుతుందో తెలుసుకుందాము.
గుండె ధమనుల లో  రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు: దీనినే కరోనరీ హార్ట్  డిసీస్  అంటారు ( coronary heart disease )
రక్త పోటు, అంటే అధిక రక్త పీడనం అంటే హై బీ పీ ఉన్నప్పుడు: చాలా కాలం బీ పీ ఎక్కువగా , కంట్రోలు లో లేకుండా ఉన్నప్పుడు , హృదయం అంటే గుండె కండరాలు పెరుగుతాయి. అప్పుడు  ఆ ఎక్కువగా పెరిగిన గుండె కండరాల ద్వారా విద్యుత్  సంకేతాలు సరిగా ప్రసరించక  అవక తవకలు కలగవచ్చు. అప్పుడు లయ తప్ప వచ్చు అంటే రిధం మారుతుందన్న మాట.
తయిరాయిడ్  సమస్య  ఉంటె : తయిరాయిడ్ హార్మోను మనకు చాలా అవసరం. కానీ ఆ హార్మోను  అంటే వినాళ గ్రంధి అంటే ఎండోక్రయిన్  గ్రంధి నుంచి  ఒక నిర్ణీత పరిమాణం లోనే మన దేహం లో వస్తూ ఉండాలి. ఎక్కువ ఉన్నా , తక్కువ ఉన్నా సమస్యలు సృష్టించి, హృదయం అంటే గుండె లయ తప్పటానికి కూడా కారణం అవుతుంది. ఊబ కాయం అంటే , అధిక  బరువు ఉంటె , దానితో గుండెలో ఉత్పన్న మయే సమస్య ల వల్ల కూడా గుండె లయ తప్ప వచ్చు.
డయాబిటీస్ అంటే మధు మేహం ఉంటె: మధు మేహం  కంట్రోలు లో లేనప్పుడు, వారి  బీ పీ లో నూ గుండె లోనూ వచ్చే మార్పుల వల్ల , ఇంకా రక్తం లో తీవ్రం గా గ్లూకోజు పరిమాణం తగ్గితే ( ఈ పరిస్థితిని  హైపో , హైపోగ్లయిసీమియా లేక hypoglycaemia  అంటారు ) కూడా గుండె లయ బద్ధం గా కొట్టుకోక పోవచ్చు.
రక్తం లో ఎలేక్త్రోలయిట్స్  సమ తుల్యం లోపించినప్పుడు : మన రక్తం లో ఎలెక్ట్రో లయిట్స్ అంటే లవణాలు అంటే సోడియం, పొటాసియం , క్లోరయిడ్ , వంటి లవణాలు సమ పాళ్ళ లో ఉండాలి. ఎందుకంటే ఈ  లవణాలు అతి తక్కువ పరిమాణం లో ఉండి, మన శరీరం లో ఉండే అన్ని నాడులలో నుంచీ విద్యుత్  తరంగాలు అంటే  ఇంపల్స్  ను ప్రసారం చేస్తాయి.  అంటే  ఈ చర్య  మన నిత్య జీవితం లో  కరెంటు వైరుల గుండా ప్రసారం ఆయె  పధ్ధతి లో జరుగుతుంది. కానీ  విద్యుత్తు అంత శక్తి వంతం కాదు. అందువల్ల ఈ విద్యుత్తు ను మిల్లీ వోల్ట్ లలో చెపుతారు సాధారణం గా ( అంటే  మామూలు గా కొలిచే విద్యుత్ వోల్ట్ లో పది లక్షల వంతు ). ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలంటే , గుండె  లయ బద్ధం గా కొట్టుకోవడానికి కూడా గుండె లో ఉన్న నాడులు ఒక క్రమ పధ్ధతి లో  ఇంపల్స్ ను పంపుతూ ఉండాలి.  ఆ చర్యకు అవసరమయిన లవణాలు సమ పాళ్ళ లో లేనప్పుడు కూడా  ఇంపల్స్ సరిగా అందక , గుండె లయ తప్పుతుంది.
అతిగా కాఫీ కానీ ధూమ పానం అంటే స్మోకింగ్  చేస్తూంటే : ఈ చర్యలు కూడా , లయ తప్ప టానికి కారణాలు.
కొన్ని రకాల మందులు  తీసుకుంటుంటే వాటి  సైడ్ ఎఫెక్ట్స్  వల్ల : కొన్ని మందులు వేరే సమస్యకు తీసుకుంటున్నప్పుడు, వారి ప్రభావం వల్ల కూడా ఎరిత్మియా  రావచ్చు అంటే గుండె , లేక హృదయం లయ తప్ప వచ్చు.
మద్య పానం అతిగా చేస్తుంటే : 
‘ తకిట  తధిమి, తకిట  తధిమి , తందానా, హృదయ  లయల ,జతుల, గతుల  తిల్లానా ,
అని  అభిమాన కధా నాయకుడు కమల్ హసన్  ‘ సాగర సంగమం’ సినిమా లో  మద్య పాన  మత్తులో  బావి మీద నృత్యం చేస్తూ పాడే పాట , తెలుగు చిత్రాల  పాటల చిత్రీకరణలో  ఒక మరుపు రాని చిత్రీకరణ !
కమల్ హసన్  అలా లయ బద్ధం గా నృత్యం చేయ గలిగాడు కానీ , అతిగా మద్య పానం చేస్తే,  హృదయం లయ తప్పడం మాత్రం తధ్యం.  ఈ పరిస్థితిని ‘ హాలిడే హార్ట్ సిండ్రోం ‘ ( holiday heart syndrome ) అంటారు. ఇక్కడ కూడా కారణం, అతిగా సేవించిన మద్యం ,అవసరమయిన విద్యుత్ ఇంపల్స్ లను అవక తవక గా ప్రసరింప చేసి, తద్వారా హృదయం లయ తప్పేట్టు చేస్తుంది. దీని పరిమాణం సాధారణం గా  ఎట్రిఎల్ ఫిబ్రి లేషన్స్ ( atrial fibrillations ) గా కనిపిస్తుంది వారిలో.
( పైన ఉన్న చిత్రం చూడండి. అందులో నార్మల్ గా  గుండె  లో ఇంపల్స్ లు ఉంటె ‘  గుండె రాత ‘ ఎట్లా ఉంటుందో , అదే  ఎట్రియల్ ఫిబ్రి లేషన్స్ ఉన్నప్పుడు , అంటే గుండె అవక తవకలు గా కొట్టుకుంటున్నప్పుడు , ‘ గుండె రాత ‘ కూడా అవక తవకలు గా ఎట్లా ఉందొ ఇలా గుండె లయ తప్పితే పరిణామాలు కూడా  ‘ లయ తప్పుతాయి ‘ అంటే  ఉదాహరణకు  ఎట్రియల్ ఫిబ్రి లేషన్స్ ను కంట్రోల్ చేయక పొతే ,   గుండె లోనుంచి  రక్తం గడ్డ కట్టి ఆ గడ్డలు మెదడు కు వెళ్లి పక్ష వాతం కలిగించ వచ్చు ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

హృదయం ‘ లయ’ తప్పితే, లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.

In Our Health on మే 17, 2012 at 8:05 సా.

హృదయం ‘ లయ’ తప్పితే లక్షణాలు ఎలా ఉంటాయి ?.36.

 
మనం క్రితం టపాలో చూశాము కదా ! హృదయం లయ అంటే రిధం అంటే ఏమిటో !
మరి అలా ‘ లయ ‘ తప్పినప్పుడు  ఏ లక్షణాలు ఉంటాయి ? :
సాధారణం గా మనం గమనించే అంత స్పష్టంగా లక్షణాలు కనిపించక పోవచ్చు.  డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు చేసే పరీక్షలలో బయట పడ వచ్చు.
కొందరు  వారిలో సాధారణ వేగం కన్నా ఎక్కువ వేగం తో గుండె కొట్టుకోవడం గమనించ గలుగుతారు. ( ఇలా వేగం గా గుండె లేక హృదయం కొట్టుకోవడాన్ని , ట్యాకీ కార్దియా లేక tachy cardia అంటారు. కంగారు పడవద్దు ట్యాకీ అంటే వేగం అని , కార్డియా అంటే గుండె అని అర్ధం ) అలాగే మరి కొందరు వారిలో గుండె ఎప్పటి కంటే నిదానం గా కొట్టుకోవడం కూడా గమనించ గలుగుతారు. ఈ పరిస్థితిని  బ్రాడీ కార్దియా లేక brady cardia అంటారు. బ్రాడీ అంటే  నిదానం లేక స్లో  అని , కార్దియా అంటే గుండె అనీ అర్ధం. ఈ రెండు పరిస్థితులూ సాధారణం గా  థయిరాయిడ్  ( thyroid ) గ్రంధి సరిగా పని చేయక పోవడం వల్ల కలగ వచ్చు.  ఇలా  ఎవరికి వారు వారి వారి గుండె కొట్టుకోవడం  ఫీల్ అవుతే  అప్పుడు వారికి పాల్పిటే షన్స్  ( palpitations ) వచ్చాయి అంటారు.
ఇలా సాధారణం గా తీవ్రం గా భయ పడినప్పుడు, లేదా ,  సరిగా  ప్రిపేరు  అవకుండా పరీక్ష రాద్దామని పరీక్ష హాలు లోకి ప్రవేశించి నప్పుడు, లేదా బాగా ప్రిపేరు  అయి కూడా ,  పేపరు ఎట్లా వస్తుందో అని విపరీతం గా ఆందోళన పడుతున్నప్పుడు కూడా జరగ వచ్చు.
ఇక్కడ ఒక అనుభవం. కాలేజీలో  ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి.  క్లాసు లోని అందమయిన యువతులలో ఒక యువతి . పరీక్షల ముందు ఆందోళన పడడం  ఆమె నైజం. చక్కగా చదువుతుంది కూడా ! కానీ ఆందోళన పడడం కూడా మానదు.
ఇలా ఒక పరీక్ష రోజున, పేపరు అందుకోగానే   కళ్ళు తిరిగి పడిపోయారు అమ్మాయి గారు.  వెంటనే ఒక అసిస్టెంటు ప్రొఫెసరు గారు ఆ అమ్మాయి గారి ప్రధమ చికిత్స కోసం వచ్చారు. అందరి లోనూ తీవ్రమైన ఉత్కంటత. ముఖ్యం గా మా అందరిలో( యువకులలో  ) ఆ సమయం లో పేపరు ఎట్లా ఇచ్చారో అనే విషయం గమనించే స్థితి లో ఉంటే కదా !
వెంటనే ఆయన, ఆ అమ్మాయి ముఖం మీద చల్లని నీరు చల్లి , తుడిచి , మెల్లిగా లేపి కూర్చో పెట్టారు. కొన్ని నిమిషాల వరకూ సరిగా మాట్లాడ లేదు ఆమె. ఎవరి సహాయం లేకుండా ఆ ప్రొఫెసరు గారు  ఆమె సున్నితమైన నడుము చుట్టూ తన చేతులు పోనిచ్చి , ఆమెతో ఆలింగనం చేసుకుంటున్న రీతిలో ఆమెను లేవనెత్తి  బయటకు నడిపించుకు పోయాడు. హాలు అంతటా  అంత నిశ్శబ్దం లోనూ ,  యువకులందరి దీర్ఘ ఉచ్వాస నిశ్వాస లు ఒక్క సారి వినిపించాయి !  ఆమె అలా అర్ధ నిమీలిత నేత్రాలతో వాడి పోయిన తామర పూవు లా ఆయన గారి మీద వాలి పోయి ప్రధమ చికిత్స అయిన తరువాత మళ్ళీ పరీక్ష రాశారు.   (  అలా పడిపోయిన సమయం లో ఆమె హృదయం ఎంత వేగం తో కొట్టుకుందో లేదో ఎవరికీ  తెలియదు ! కానీ  పరీక్ష హాలు లో ఉన్న యువకులందరి హృదయాలు మాత్రం  లయ తప్పాయి ఆ కొన్ని క్షణాలూ ! ) పరీక్ష అయి పోయిన తరువాత  యువకులందరిలో  తీవ్రమైన చర్చ.  ఆ చర్చల సారాంశం ఒకటే ! ఆ అసిస్టెంట్ ప్రొఫెసరు  చాలా చాలా అదృష్ట వంతుడని.  అప్పుడే జరిగిన పరీక్ష గురించి ఒక్కడు మాట్లాడితే ఒట్టు !
ఇలా ! కొందరు కొన్ని నిమిషాలు స్పృహ తప్పి పడి  పోవచ్చు.కొంత మంది లో తల తిరిగినట్టు అవడం , కళ్ళు తిరుగుతున్నట్టు  అవడం కూడా జరగవచ్చు.
అలాగే కొందరిలో ఊపిరి తీసుకోవడం కష్ట మనిపించ వచ్చు. ఇంకొందరిలో గుండె నొప్పి  కలగ వచ్చు ,
వచ్చే టపాలో  హృదయం లయ తప్పటానికి కారణాలూ లేక రిస్కు ఫ్యాక్టర్ల గురించి తెలుసుకుందాము !

హృదయం ‘ లయ తప్పటం ‘ అంటే ఏమిటి .35.

In Our Health on మే 17, 2012 at 10:22 ఉద.

హృదయం ‘ లయ తప్పటం ‘ అంటే ఏమిటి .35.

మానవులందరి లో సహజం గా గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని మనకందరికీ తెలుసు కదా ! దీనిని హార్ట్ రేట్ ( heart rate ) అంటారు. ( గుండె యాభై నుంచి వంద సార్లు ,నిమిషానికి కొట్టుకోవడాన్ని నార్మల్ హార్ట్ రేట్ అంటారు. అంటే యాభై కంటే తక్కువ సార్లు కానీ , వంద కంటే ఎక్కువసార్లు కానీ కొట్టుకుంటుంటే అది అసాధారణం అనబడుతుంది. అప్పుడు వైద్య సలహా తీసుకోవాలి )
అంటే అరవై సెకండ్లకు రమారమి డెబ్బయి రెండు సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ డెబ్బయి రెండు సార్లూ ఒక లయ బద్ధం గా కొట్టుకుంటుంది. దీనినే రిధం ( Heart Rhythm ) అంటారు.
రిధం ( rhythm ). అంటే , ఈ అరవయి సెకండ్లలో మొదటి పది సేకనులూ ముప్పయి సార్లు కొట్టుకొని , మిగతా యాభయి సేకండ్లూ నలభయి రెండు సార్లు కొట్టుకోవడం జరగదు. ఒక లయ తో డెబ్బై రెండు సార్లూ , సమానం అయిన అంతరాయం అంటే interval తో కొట్టుకుంటుంది.
ఇది ఆరోగ్య వంతమైన మానవులలో. చాలా ఆరోగ్య వంతమైన అథ్లెట్ లకు, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం సహజం. అది ఏమీ జబ్బు అనబడదు అప్పుడు. ( ఉదాహరణ కు టెన్నిస్ ఆటలో అత్యంత ప్రముఖులలో ఒకడైన స్వీడిష్ ఆట గాడు జార్న్ బోర్గ్ కు నిద్ర లేచినప్పుడు 50, మద్యాహ్నానికి 60 సార్లు కొట్టుకునేది ట , గుండె, ( నిమిషానికి ).
అలాగే మనం ఆతురుత తో ఉన్నప్పుడు గుండె వేగం గా కొట్టుకుంటుంది. అంటే మన హార్ట్ రేట్ ఎక్కువ అవుతుందన్న మాట. అప్పుడు కూడా హార్ట్ రిధం మారదు. అంటే ఎక్కువ సార్లు కొట్టుకున్నా మొదటి ఇరవయి సేకండ్లూ నిదానం గా కొట్టుకోవడం , లేక మిగతా నలభై నిమిషాలూ వేగం గా కొట్టుకోవడం లాంటిది జరుగదు, ఆరోగ్య వంతులలో !
అలా కాక హృదయం లయ తప్పితే అంటే దాని రిధం మారితే, లేక రిధం అవకతవక గా అయితే ఆ పరిస్థితిని హార్ట్ ఎరిత్మియా ( Heart or Cardiac arrythmiya ) అంటారు.
ప్రేమ లో హృదయం లయ తప్పుతుందా ?:
ప్రేమలో ‘ పడితే ‘ , గుండె ఒక్కోసారి ఎక్కువ గా కొట్టుకుంటున్నట్టు అనిపించ వచ్చు. లేదా ‘ ఒక బీట్ మిస్సవుతున్నట్టు కూడా అనిపించవచ్చు ! ఇది కూడా సహజమే ! అంటే ప్రేమలో ‘ ఇరుక్కు పొతే ‘ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతాము మనం. దాని ఫలితమే ‘ హృదయం లయ తప్పడం ‘ అంటే హార్ట్ రేట్ కానీ రిధం గానీ మారడం. కానీ ఈ మార్పులన్నీ తాత్కాలికం మాత్రమే ! అంటే ప్రేమించడం మానితే ఆగి పోతాయని అర్ధం చేసుకోకండి ! ప్రేమ కంటిన్యూ అవుతున్నా , ఈ తీవ్ర భావోద్వేగాలు నిరంతరం ఉండవు గా !అందువల్ల. అలాగే హృదయం ‘ లయ ‘ తప్పని వాళ్ళు ప్రేమించడం లేదనీ అర్ధం చేసుకో కూడదు. ప్రేమిస్తున్నప్పుడు అలా జరిగితే కంగారు పడవద్దు ‘ ప్రేమ ‘ శృతి మించి ‘ ‘ రాగాన ‘ లేక ‘ మధుర రాగాల ‘ పాకం ‘ లో పడుతుందని మాత్రమే అనుకోవాలి మరి !
ప్రేమికులు తమ అనుభవాలు తెలియ చేయండి ‘ హృదయ పూర్వకం గా ‘ !

ఇలా హృదయం లయ తప్పితే ఏమవుతుందో వచ్చే టపాలో తెలుసుకుందాము !

కరోనరీ బైపాస్ ఆపరేషన్ అంటే ఏమిటి ?.34.

In Our Health on మే 16, 2012 at 8:00 సా.

కరోనరీ బైపాస్  ఆపరేషన్  అంటే ఏమిటి ?.34.

మనం క్రితం టపాలలో యాంజైనా కు చికిత్స లో భాగం గా  గుండె పనిచేయడానికి అవసరమైన  రక్తాన్ని సరఫరా చేసే , కరోనరీ ధమనులు పాక్షికం గా పూడుకు పొతే, వాటిని  యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ తో ఎట్లా సరి చేస్తారో  తెలుసుకున్నాము కదా !
అలాగే  బెలూన్ తో  కరోనరీ ధమని లో పూడిక తీసివేశాక  మళ్ళీ పూడుకు పోవడం కానీ, లేక  ముడుచుకు పోవడం కానీ జరగకుండా  ఆ ధమని లో కి స్టెంట్  పెట్టడం గురించి కూడా  తెలుసుకున్నాము కదా !
ఇంత వరకూ బాగానే ఉంది.  కానీ , కొన్ని పరిస్థితులలో ,  చెడు కొలెస్టరాల్ పేరుకుపోయి , గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ధమనులు చాల భాగం పూడుకు పోతాయి. అట్టి పరిస్థితి లో  ఆ ధమనులను  రిపేరు చేయడం అసాధ్యం. మరి అప్పుడు గుండె సరిగా కొట్టుకుంటూ ఉండడానికి  , గుండె కు కూడా , ఆక్సిజెన్ సరఫరా ,  రక్తం ద్వారా జరగాలి కదా ! మరి రక్తం సరఫరా చేయడానికి రక్త నాళాలు ఏవి ?  కరోనరీ ధమనులు  బ్లాక్ అయి ఉన్నాయి కదా !
అట్లాంటి పరిస్థితులలో చేసే ప్రొసీజరు ను కరోనరీ బైపాస్ ఆపరేషన్  అంటారు.  బైపాస్ అంటే  ఇంకో దోవ ( another route ) ద్వారా రక్త సరఫరాను మళ్ళీ ఏర్పరుచుతారన్న మాట.
అంటే కరోనరీ ధమని కొంత భాగం వరకు పూడుకు పొతే ,  ఆ భాగాన్ని వదిలి వేసి , చివర భాగానికి, ఇంకో ధమనిని  కానీ , అంటే artery , లేక ఇంకో సిర ను కానీ (  అంటే  vein )  మన శరీరం లో ఇంకో భాగం నుంచి తీసి అక్కడ జత చేస్తారు.
అలా జత చేయడం వల్ల, ఆ భాగం లోని గుండె కండరాలకు , మళ్ళీ రక్త సరఫరా సరిగా అంది ,  గుండె నొప్పి రాకుండా ఉంటుంది. అంటే గుండె పోటు కూడా కొన్ని దశాబ్దాల వరకూ రాదన్న మాట.
సాధారణం గా ఇంకో ధమని ని మన రొమ్ము మీద నుంచి తీసి కరోనరీ ధమని కి జత చేస్తారు. ( అంటే Internal mammary artery ) అలాగే సిర ను సాధారణం గా మన కాలికి ఉన్న సిర ( Saphenous vein ) ను తీసి, జత చేస్తారు.
ఇలా మన శరీరం లో ఇంకో చోటనుంచి పూడిక ఏమీ లేని సిర ను కానీ , ధమని ని కానీ తీసి , గుండె  ధమని కి  జత చేసి , గుండె రక్త సరఫరా  ‘ ఇంకో దోవ ‘ ద్వారా మళ్ళీ పునరుద్ధరించే  ప్రొసీజర్ మొత్తాన్ని , కరోనరీ బైపాస్ ఆపరేషన్ అంటారు.
మీలో ఎంత మందికి యు ట్యూబ్  వీడియో చూసే అమరిక ఉందొ , మీ కంప్యుటర్ లలో. వీలు కనక ఉంటె పైన ఉన్న వీడియో చూడండి , ఇది నాలుగు భాగాలు గా ఉంది. ఈ వీడియో నిజం గా జరుగుతున్న ఆపరేషన్ ను తీసిన వీడియో ఇది.
చూసి , మీ అభిప్రాయం తెలపండి.