Our Health

Archive for the ‘Our Health’ Category

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం !

In మానసికం, Our Health, Our minds on జనవరి 26, 2013 at 10:34 ఉద.

యాంటీ బయాటిక్స్( పని చేయక పొతే ) ప్రళయం ! 

The hospital superbug MRSA

 
ఇది అన్నది ఎవరో  చదువు రాని  వారు కాదు !  ఇంగ్లండు దేశానికి ప్రధాన వైద్య అధికారిణి  డేం సాల్లీ డేవిస్  నిన్న ఇంగ్లండు పార్ల మెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్న మాటలు ! 
అంతే  కాక , పార్లమెంటు సభ్యులు ,  అత్యవసర ప్రాతిపదికన  తదనుగుణం గా చర్యలు చేపట్టాలి అని కూడా ఆమె  అన్నది ! అంటే , అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టడం ! ఇట్లా చాలా అరుదు గా అంటే వేల  సంఖ్య  లో అంటువ్యాధుల వల్ల  ప్రజలు మరణించే ప్రమాదం ఉన్నప్పుడు. ఇటీవల , స్వైన్ ఫ్లూ ప్రమాదం సంభవించి నప్పుడు కూడా , అనేక దేశాలలో అత్యవసరం గా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. సాల్లీ డేవిస్  మరి ఇంగ్లండు దేశ ప్రజలకు అత్యవసరం అయ్యే ఈ యాంటీ బయాటిక్స్ ప్రళయం కలిగిస్తాయని ఎందుకు అన్నదో  తెలుసుకుందాం ! 
ఆమె ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ పరిణామాల పరిస్థితిని , ఒక పెద్ద విపత్కర వరద పరిస్థితి తోనూ , ఫ్లూ పాన్ డెమిక్  తోనూ , లేదా ఉగ్రవాదులు  ఎక్కువ మంది ప్రజలను పొట్టన పెట్టుకోవడం తోనూ పోల్చింది.(  ఇంగ్లండు లో పైన చెప్పిన పరిస్థితులలో , అత్యవసర పరిస్థితి ప్రకటించి వివిధ చర్యలు చేపట్టడం కూడా జరిగింది ). 
అయినప్పటికీ , ఇంగ్లండు లో యాంటీ బయాటిక్స్ విరివి గా వాడుతూ  ఉండడం వల్ల , వాటి ప్రభావం తగ్గి పోతుందని తెలుస్తుంది. ఇట్లా యాంటీ బయాటిక్స్ పని చేయక పోవడం అనేది కొన్ని వందల పేషెంట్ లలో జరిగి వారి ప్రాణాలు పోవడం జరిగింది.అంతే  కాక ఇట్లా యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్న వారి లో అవి పని చేయక పోవడం క్రమేణా  ఎక్కువ అవుతుంది. ఇదే పరిస్థితి కొన  సాగితే , వచ్చే ఇరవై ఏళ్ల  లో , మనుషులు సాధారణ ఆపరేషన్ లు చేయించుకున్నా ,ఇన్ఫెక్షన్ కనుక సోకితే ,ఇచ్చే యాంటీ బయాటిక్స్  పని చేయక , ప్రాణాలు కోల్పోవడం సామాన్యం అవుతుందని ఆమె అన్నది. ఈ యాంటీ బయాటిక్  రెసి స్టెన్స్  అనే విషయం కొత్తదేమీ కాదు.  యాంటీ బయాటిక్స్ కనుక్కున్నప్పటి నుంచీ , ఉన్నది. అంటే అవి వాడగా వాడగా , వాటితో  పోటీకా  అన్నట్టు , వివిధ రోగ కారక బాక్టీరియా లు కూడా , కొత్త కొత్త రకాలు గా వాటి లో నిరోధక శక్తిని  కలిగించుకుంటాయి. అందువల్ల , బ్యాక్టీరియా లు నాశనం అవక ,మన శరీరం లో ఇన్ఫెక్షన్ ను ఎక్కువ చేసి , మానవ మరణాలకు కారణమవుతాయి. MRSA ఎమ్మారెస్సె  అనే యాంటీ బయాటిక్స్ కు లొంగని ఇన్ఫెక్షన్ కూడా , ప్రస్తుతం ఇంగ్లండు లో అనేక ఆసుపత్రులలో పెద్ద తలనొప్పి గా పరిణమించింది ! 
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , కొత్త కొత్త మందులు కనుక్కోవడం వల్ల , ఈ బ్యాక్టీరియా లను కూడా నిర్మూలించే అవకాశం ఉండేది ఇప్పటి వరకూ ! కానీ అత్యంత  శక్తివంతమైన కార్బిపెనెమ్  అనే యాంటీ బయాటిక్ కు కూడా, అది పని చేయక , బ్యాక్టీరియా ల లో నిరోధక శక్తి పెరిగినట్టు ఇటీవల తెలిసింది.అంతే కాక క్యాన్సర్ చికిత్స కు అనేక కొత్త మందులు కనుక్కుంటూ ఉండడం తో , అవి కూడా  శరీరం లో రోగ నిరోధక శక్తి ని తగ్గిస్తాయి. ఇది కూడా బ్యాక్తీరియాలు విజ్రుభించ డానికి , ఒక కారణం.
రోగ కారక బ్యాక్టీరియా లు  ఇదివరలో లా కాక ఇప్పుడు యాంటీ బయాటిక్స్ కు అసలే  లొంగడం లేదనడానికి ఇంకో ఉదాహరణ : గనేరియా. గనేరియా ఒక సుఖ వ్యాధి. అంటే ఈ వ్యాధి ఉన్న పురుషుడి తో( ఆరోగ్యం గా ఉన్న )  స్త్రీ కానీ , లేదా ఈ వ్యాధి ఉన్న స్త్రీతో  ( ఆరోగ్యం గా ఉన్న ) పురుషుడు కానీ సంభోగం జరిపితే గానీ వస్తుంది. ఇప్పటి వరకూ , ఈ గనేరియా వ్యాధి , టెట్రా సైక్లిన్ , పెనిసిలిన్ , అనే మనకు పరిచితమైన యాంటీ బయాటిక్స్ కనుక వాడితే చప్పున నయమయేది.కానీ  ప్రస్తుతం , 80 శాతం  కేసులలో ఈ వ్యాధి ఆ యాంటీ  బయాటిక్స్ కు  నిర్మూలనం అవడం లేదు !  అందువల్ల కొత్త యాంటీ బయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఇంకో ఆందోళన కర పరిణామం ఏమిటంటే , ఇంత  వరకూ , మల్టీ డ్రగ్  చికిత్స కు చప్పున నయమవుతున్న  టీబీ ( TB ) వ్యాధి కూడా ఆ మందులకు నయ మవ్వక తిరగబడడం మొదలు పెట్టింది. 
భారత దేశం లో ప్రజలూ , వైద్య అధికారులూ ,  ఈ మార్పులను అవగాహన చేసికొని తదనుగుణం గా చర్యలు తీసుకోవాలి ! ముఖ్యం గా ప్రజలు, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు , కనీసం జ్వరం వచ్చినా , యాంటీ బయాటిక్స్ డాక్టర్ రాయక పొతే తృప్తి పడరు. ” ఆ డాక్టరు , మళ్ళీ రావాలని , తన చుట్టూ తిప్పించుకుని , డబ్బులు లాగాలని చూస్తున్నాడు ” అని అనుకుంటారు ! వెంటనే చికిత్స కు యాంటీ బయాటిక్స్ ఇవ్వాలని అనుకునే వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు.  ఈ ఆలోచనా ధోరణి లో మార్పు రావాలి. ఇంగ్లండు దేశం లో సామాన్యం గా యాంటీ బయాటిక్స్ ఎడా పెడా  ఎవరు బడితే వారు ప్రిస్క్రైబ్ చెయ్యరు.  అంటే యాంటీ బయాటిక్స్ ను వాడమని చెప్పే వారు తప్పని సరిగా డాక్టర్లూ , స్పెషలిస్టు డాక్టర్లు అయి ఉండాలి ( భారత దేశం లో ,విచ్చల విడిగా, ఎవరు పడితే వారు, ఆఖరికి , చాలా సందర్భాలలో మందుల షాపు లో పని చేసే వారు కూడా యాంటీ బయాటిక్స్ వాడమని సలహా ఇస్తారు ! ఇక నర్సింగ్ హోము లలో అయితే సరే సరి !  ఆ ఇచ్చే యాంటీ బయాటిక్స్ ను వీలు చేసుకుని  ఏ  సెలైన్ బాటిల్ ఇచ్చిన తరువాతో , లేదా ఏ  గ్లూకోజు బాటిల్ నరం లోకి ఎక్కించిన తరువాతో , పేషెంట్ ల నరాలలోకి ఎక్కిస్తారు !  )
( తరచూ , చీటికీ , మాటికీ , అనవసరం గా యాంటీ బయాటిక్స్ కనుక తీసుకుంటూ ఉంటే ,  మనలో రోగనిరోధక శక్తి తగ్గి పోయి , ఇన్ఫెక్షన్ కారకమైన బ్యాక్టీరియా లలో నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఆ బ్యాక్టీరియా లు  మనం తీసుకునే యాంటీ బయాటిక్స్ కు నశించక  పోగా, వృద్ధి చెందుతూ , రోగ తీవ్రత కు కారణ మావుతాయనే యదార్ధాన్ని అందరూ గుర్తు ఉంచుకోవాలి ! )
 
ఈ క్రింద ఉన్న ప్రకటన చూడండి ! ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయం లో వచ్చినది. కానీ ఇప్పటికీ వర్తిస్తుంది ! 
      వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !  

నలుగురి లో బిడియమూ , సిగ్గూ ! ,( shyness and social phobia )

In మానసికం, Our Health, Our minds on జనవరి 24, 2013 at 11:45 ఉద.

నలుగురి లో బిడియమూ , సిగ్గూ ! ,( shyness  and  social  phobia  ) : 

 
మానసిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సిగ్గు, ఇతరులెవరైనా సమీపించి నప్పుడు కానీ , వారు ఇతరులను సమీపిస్తున్నప్పుడు కానీ అనుభవించే  , ఒక రకమైన కంగారూ , ఎబ్బెట్టు లేదా  ముభావం. ప్రత్యేకించి కొత్త వాతావరణం లో కొత్త మనుషుల దగ్గర.  ఈ అనుభవాల తీవ్రతను బట్టి వాటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి. అంటే , ఈ సిగ్గు , బిడియం  కాస్తా తీవ్రం అయినప్పుడు , సోషల్ ఫోబియా , లేదా సోషల్ యాంగ్జైటీ అవుతుంది. పురుషుడు  ( లేదా యువకుడు )  సమీపిస్తున్నప్పుడు , లేదా చూస్తున్నప్పుడు ,వయసు లో ఉన్న  అమ్మాయి లో సహజం గా ఉండే బిడియం , సిగ్గు  పైన చెప్పుకున్న వాటి కోవ  కు చెందదు.  ఆ సిగ్గు వారిలో ప్రక్రుతి తో తమ సంగమాన్ని తెలియ చేస్తుంది .  ముగ్ధ మనోహరమైన వారి  సిగ్గులో ఒక విరిసీ విరియని సుగంధ పుష్పం సాక్షాత్కరిస్తుంది . మనం తెలుగు సినిమాలలో చూసే అసంఖ్యాక   తొలి రాత్రి ద్రుశ్యాలను , యువతి లో సిగ్గు లేకుండా ఊహించుకోలేము ! ( ఆంగ్ల సినిమాల సంగతి వేరు కదా ! ) ( కౌమార దశలో కి అడుగు పెడుతున్న బాలురు కూడా తరచూ సిగ్గు పడుతూ ఉంటారు. ఈ సిగ్గు కూడా సహజమైనదే ! అంటే ఇట్లా ఉండే సిగ్గు అసాధారణం అనబడదు. కానీ  వారు,  ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా అట్లాగే సిగ్గు పడుతూ ఉంటే , ఆ విషయాన్ని  పరిశీలించాలి ! )ఈ సోషల్ ఫోబియా వల్ల  అనేకమంది ప్రతిభావంతులు అయిన యువతీ యువకులు , చొరవ ఏమీ లేని , కొన్ని సమయాలలో చేత గాని వారి లా ముద్ర వేయ బడతారు. వారికి వచ్చిన లేదా వచ్చే అమూల్య మైన అవకాశాలను కోల్పోతూ ఉంటారు.
మరి ఈ సిగ్గు , నలుగురిలో బిడియం గురించి శాస్త్రీయం గా తెలుసుకుందాం !  
ఈ సిగ్గూ , బిడియాల మూలాలేంటి ?: 
ముఖ్యం గా ఆ వ్యక్తి  కి సంక్రమించిన జన్యువుల ప్రభావం , వారు పెరిగే  వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది. ప్రత్యేకించి , వారి వారి చిన్న తనం లో వారిని  శారీరికం గా కానీ మానసికం గా కానీ చాలా అవమానం, హేళన చేసిన సంఘటనలు ఉంటే , వారి మనసులలో అవి చెరగని ముద్ర వేసి , వారి భవిష్యత్తులో కూడా  వారు అభివృద్ధి చెందలేని అగాధాలను శ్రుష్టిస్తాయి.  సిగ్గు, బిడియం , కనీసం కొంత వరకైనా వారి వారికి సంక్రమించిన జన్యువుల ప్రభావం వల్లనని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. వారి దృష్టి లో మొదట గా సిగ్గు పడడం  జరిగి , తరువాత , తరువాత , వారు వివిధ సామాజిక వాతావరణాలలో ఉన్నప్పుడు , ఆందోళన చెందడం వల్ల  సోషల్ యాంగ్జైటీ గా పరిణమిస్తుందని అభిప్రాయ పడతారు.  ఇట్లా సోషల్ యాంగ్జైటీ గా లక్షణాలు పరిణామం చెందినప్పుడు,  ఈ లక్షణాల తో పాటు గా , మానసికం గా క్రుంగి పోయే లక్షణం అంటే డిప్రెషన్ కూడా ఉంటుంది. అందువల్ల ఆ యాంగ్జైటీ ఉన్నప్పుడు , చెప్పలేని భయం అంటే ఫియర్ ఇంకా  ప్యానిక్ లక్షణాలను కూడా వారు అనుభవిస్తారు. కొన్ని పరిశీలనల ద్వారా పాశ్చాత్య దేశాలలో  గర్భం దాల్చిన కాలం లో  పగలు కాంతి తక్కువ గా ఉన్నప్పుడు కూడా వారికి పుట్టిన సంతానం లో ఈ సిగ్గు, నలుగురి లో బిడియం ఎక్కువ గా ఉంటున్నాయని కనుక్కున్నారు ( భారత దేశం లో ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే , భారత దేశం లో పగలు ఎప్పుడూ పగలే ! అంటే ఒకే రకం గా వెలుతురు  గా ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశాలలో  చలి కాలం లో కేవలం మధ్యాహ్నం మూడింటికే చీకటి పడుతుంది ! ) 
 
వచ్చే టపాలో సిగ్గు గురించి ఇంకొన్ని సంగతులు  ! 
 
 
 
 
 
  

బాల బాలికలలో ఊబ కాయం.3.

In ప్ర.జ.లు., Our Health on జనవరి 23, 2013 at 11:05 ఉద.

బాల బాలికలలో ఊబ కాయం.3. 

సామాజిక కారణాలు :  ఊబకాయానికి ప్రధాన కారణాలు  అనారోగ్య కరమైన ఆహారం తినడమూ , ఏమాత్రం శారీరిక శ్రమ లేకపోవడమూ అయినా ,  బాల బాలికలు , తాము పెరుగుతున్న సమాజం లో వస్తున్న సమూలమైన మార్పులు ,ప్రత్యేకించి ఆ బాల బాలికలు నివసించే దేశాల ఆర్ధిక , సామాజిక  వ్యవస్థ లు , వారి జీవన శైలి ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఆయా ప్రాంతాలలో , వ్యవసాయం , రవాణా , నగర అభివృద్ధి ప్రణాళిక లో , ఆర్ధిక ప్రణాళిక లూ , ఆ యా ప్రదేశాలలో ఆహారాన్ని ప్రాసెస్ చేయడమూ , ఇట్లాంటి వాటిమీద బాల బాలికల ఊబకాయం రిస్కు ఆధార పడి  ఉంటుంది.  ఈ కారణాలన్నీ బాల బాలికల ఆరోగ్యాన్ని ఎందుకు ఇంతగా ప్రభావితం చేస్తున్నాయంటే , యువతీ యువకుల లాగానో , లేదా వయసు మీరిన వారిలాగానో , బాల బాలికలు తాము నివశిస్తున్న ప్రదేశాన్ని  కానీ , లేదా వారు తినే ఆహారాన్ని కానీ , వారే  ఎంచుకో లేరు !  అంతే కాక , వారు , ఆహారం విషయం లోనూ , ఇంకా ఇతర విషయాలలోనూ , ఆ వయసు లో తమ ప్రవర్తన వల్ల  కలిగే దీర్ఘ కాలిక పరిణామాలను ఊహించు కోలేరు ! అందువల్లనే బాల బాలికల భవితవ్యం, కేవలం మంచి భవిష్యత్తే కాక , మంచి ఆరోగ్యం కూడా , వారి పెద్దల మీద ఆధార పడి  ఉంది !  అందువల్ల పెద్దలు , తమ చిన్నారుల ఆరోగ్యం విషయం లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి !  
పిల్లలకు డైట్ ( Diet ):
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా నివసిస్తున్న పిల్లలకు ఇట్లా డైట్ ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు కానీ ఈ క్రింది మూడు ముఖ్య సూత్రాలు పాటించాలి , వారి ఆహారం విషయం లో ! 
1.  కూరగాయలు , పండ్లు , ధాన్యాలు , పప్పులు , ఎక్కువ గా ఆహారం లో రోజూ తీసుకునేట్టు చూడడం , ప్రోత్సహించడం .
2. క్రొవ్వు పదార్ధాలు  వీలైనంత వరకూ ఆహారం లో నియంత్రించడం, ఒక వేళ  అది తప్పని సరి అయితే , అన్ స్యాచురేటేడ్  క్రొవ్వు పదార్ధాలనే వాడడం , తినడం అలవాటు చేయాలి.
3. చెక్కెర ఉన్న ఆహార పదార్ధాలను వీలైనంత వరకు నియంత్రించడం. 
 
ఈ చర్య ల వల్ల  ఉపయోగాలు : 
1. ఆరోగ్య కరమైన ఆహారం , బాల బాలికలు చురుకు గా రోజూ నేర్చుకోవడానికి ( అంటే విద్య ) ఉపయోగ పడుతుంది.
2. బాల బాలికలు ఆరోగ్యం గా ఉండడానికి  ముఖ్య కారణం.
3. వారు పెరిగి పెద్ద వారైనప్పుడు ,  ఊబ కాయమూ , దానితో పాటు గా వచ్చే అనేక అనర్ధాలు కూడా నివారించ గలుగుతారు !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బాల బాలికలలో ఊబకాయం.2.

In ప్ర.జ.లు., Our Health on జనవరి 22, 2013 at 12:34 సా.

బాల బాలికలలో ఊబకాయం. 2. : 

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ  తాజా గణాంకాల ప్రకారం  బాల బాలికలలో ఊబకాయం లేదా ఒబీసిటీ  ఇరవై ఒకటో శతాబ్దం లో ప్రపంచమంతా విస్తరిస్తున్న , తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి గా పేర్కొన్నారు. రెండేళ్ళ క్రితం చేసిన ఒక పరిశీలన ప్రకారం ప్రపంచం మొత్తం లో అయిదు సంవత్సరాలకన్నా తక్కువ వయసు లో వారు  కనీసం నలభై రెండు మిలియన్ల మంది ఊబకాయులు గా  తయారవుతున్నారు. అంటే నాలుగు కోట్ల మందికి పైగా ! ఇంకా ఆందోళన కరమైన విషయం ఏమిటంటే , ఈ నాలుగు కోట్ల మంది లో ఎక్కువ భాగం అంటే మూడున్నర కోట్లమంది బాల బాలికలు , అభివృద్ధి చెందుతున్న దేశాల లోనే ఉన్నారు ! 
చిన్న పిల్లలు బొద్దుగా , లావుగా ఉంటే  ముద్దే కదా ! కాస్త ఊబకాయం తో ఉంటే  ఏమవుతుంది ? అని పెద్ద వారందరూ అనుకోవచ్చు !  కానీ ఈ పెద్దలంతా గుర్తు పెట్టుకోవలసిన అతి ముఖ్య మైన విషయం ఒకటి ఉంది. అది , అనేక పరిశోధనల పర్యవసానం గా తేలింది ఏమిటంటే , చిన్న వయసులో ఊబకాయం ” తెచ్చుకున్న వారు ” లేదా ” వచ్చిన వారు ”  పెరిగి పెద్ద వారైనా కూడా , ఊబకాయులు గానే  తయారు అవుతారు !  అంటే ఒబీసిటీ , చిన్న తనం లో వచ్చినది , వారు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ వారిని వదిలి పోదు !  ఈ ఊబ కాయానికీ , మధు మేహానికీ , అధిక రక్త పోటు  కూ  అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అంటే  ఊబ కాయం రాగానే వారికి అధిక రక్త పోటు  కూడా వస్తుంది. అంతే  కాక , మధు మెహ వ్యాధి అంటే డయాబెటిస్ వ్యాధి కూడా త్వరగా వస్తుంది.  ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే , ఈ ఊబకాయమూ  అంటే ఒబీసిటీ , దానితో కూడా వచ్చే , అధిక రక్త పోటు , ఇంకా మధుమేహం , ఈ మూడూ సంపూర్ణం గా నివారించ దగ్గ  పరిస్థితులే !  అందుకే తల్లి దండ్రులు , తమ పిల్లల పెంపకం లో అత్యంత జాగ్రత్త వహించాలి ! క్రితం టపాలో  చూసినట్టు పల్లవికి ,ఆమె తలి దండ్రులు , తాత అమ్మమ్మలు , తాము స్వయంగా చేసిన వంటకాలు , గారాబం తో , ప్రేమతో , తినిపిస్తూ , పల్లవిని ఎంతో  బాగా  చూసు కుంటున్నామని మురిసిపోతూ ఉంటారు ! కానీ జరుగుతున్నది  దీర్ఘ కాలికం గా పల్లవి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారపు అలవాట్లే !  పల్లవి పెరుగుతున్న కొద్దీ , వారి జీవితాలలో ” అపశ్రుతి ” కలిగిస్తుంది,  పల్లవి జీవితం లో కూడా   శృతి తప్పుతుంది ! 
 
మరి ఈ  బాల బాలికలలో వచ్చే ఊబ కాయానికి కారణాలు ఏమిటి ? :
 
ఏ  వయసులో నైనా వచ్చే ఊబకాయానికి ప్రధాన కారణం  తీసుకునే ఆహారం లో ఉండే  క్యాలరీలకీ ,  అవి ఖర్చు చేసే పని కీ ఏమాత్రం సమతుల్యం లేకపోవడం. అంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్ధమూ  పోషక విలువ అంటే  మన శరీరం లో శక్తి ని ఇచ్చేది గా ఉంటుంది.  మనం రోజూ చేసే పని కి సమానం గా ఆహారం తీసుకుంటే  మంచిదే !  కానీ అందుకు భిన్నం గా  చేసే పని తక్కువా , తినే తిండి ఎక్కువా అయినప్పుడు ఆ ఆహారం కాస్తా మన శరీరం లో క్రొవ్వు నిలువలు గా మారి పోతుంది. అప్పుడే సమస్యలు మొదలయ్యేది. ఇట్లా అతి గా తింటున్న ఆహారం కాస్తా , క్రొవ్వు నిలువలు గా మారుతూ , క్రమేణా  అతి బరువు గా మారుతుంది. దీనినే ఓవర్ వెయిట్ అంటారు కదా ! ఈ అతి బరువు కాస్తా  ఇంకా ఇంకా పెరిగి ఊబకాయం గా రూపాంతరం చెందుతుంది.  అతి బరువు  కొంత వరకూ అనారోగ్య హేతువు ! ఊబకాయం  తప్పని సరిగా అనారోగ్య హేతువు ! ఇదే అతి బరువు కూ  ఊబ కాయానికీ ఉన్న తేడా !  
ప్రపంచ వ్యాప్తం గా  బాల బాలికలు తీసుకునే ఆహారం లో వచ్చిన మార్పులు :  ఎక్కువ శక్తి ఉన్న  క్రొవ్వు , ప్రోటీన్ల తో చేసిన ఆహారం తినడం , పోషక విలువలు అంటే విటమిన్లు , ఖనిజాలు , ఉండి  తక్కువ శక్తి అంటే క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తక్కువ గా తినడం !
ఇంకా ముఖ్యం గా  శారీరిక శ్రమ ను ఏమాత్రం చేయకుండా , కనీసం నడవడానికి కూడా వేనుకాడుతూ , అన్ని ప్రదేశాలకూ వాహనాల లో ప్రయాణించడం కూడా , తీసుకున్న ఆహారాన్నీ , క్యాలరీలనూ కరిగించక , మన శరీరాలను క్రొవ్వు నిలువ చేసుకునే గిడ్డంగులు గా మార్చు తున్నాయి. 
పై విషయాల ద్వారా మనకు విశదం  అయ్యేది ఏమిటంటే ,  నవీన మానవ జీవన శైలిలో వచ్చిన  హేతుబద్ధం గాని  ధోరణు లే , మానవ అనారోగ్యానికి మూలం అవుతున్నాయి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బాల బాలికలలో ఊబకాయం.

In ప్ర.జ.లు., Our Health on జనవరి 21, 2013 at 12:56 సా.

బాల బాలికలలో ఊబకాయం :

 
పల్లవి ఒక చక్కటి అమ్మాయి. ఒక్కగానొక్క కూతురు , గారాబాల పట్టి. లేక లేక కలిగిన సంతానం. తల్లిదండ్రులు అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.పల్లవి అమ్మ తల్లిదండ్రులు , నాన్న తల్లిదండ్రులు కూడా ! బాగా ధనవంతులు కాక పోయినా , స్తోమత కలిగినవారే !  అందుచేత , ఏలోపమూ  లేకుండా పెంచుతున్నారు పల్లవిని ! పల్లవి ఆటపాటల్లో నే కాకుండా తెలివితేటల్లో కూడా చురుకు తన క్లాసులో  మొదటి ముగ్గురిలో ఉంటుంది ఎప్పుడూ ! పల్లవి తల్లిదండ్రులు బహు ముచ్చట పడుతున్నారు, పల్లవి ప్రతిభ తో , తమ జీవిత సంగీతానికి , తమ పల్లవి, కేవలం ఒక పల్లవి మాత్రమె కాక  , ఒక ఆనందకరమైన శృతి అనుకుంటున్నారు ! పల్లవి కి  భోజ నం బహు  ఇష్టం. చిరుతిండ్లు సరే సరి. ఉదయం టిఫిన్ లో నాలుగు ఇడ్లీలు నెయ్యి వేసుకుని తింటుంది.పల్లవి తల్లి కూడా  స్కూల్ లో బాగా చదువుకోవాలి , ,ఆడు కోవాలి , పల్లవి అలసి పోతుంది , బలహీన పడుతుంది అనే ఆందోళనతో , టిఫిన్నది   బాక్స్ ను టిఫిన్ బాక్స్ లా కాకుండా , ఒక చిన్న సైజు క్యారేజీ  పెడుతుంది. ఆకుకూర పప్పు , బంగాళా దుంపల వేపుడు కూర , గడ్డ పెరుగు ఒక చిన్న బాక్స్ లో ఉంచి , అన్నం లో కలుపుకు తినమని చెపుతుంది. లంచ్ చేసిన తరువాత తినడానికి ఒక చాక్లెట్ బార్ ను కూడా ఇస్తుంది.  పల్లవి తనకు ఇచ్చిన క్యారేజీ ను ఎప్పుడూ అతి  జాగ్రత్త గా  స్కూల్ కు తీసుకు వెళ్లి , ఏవీ వదలి వేయకుండా , తింటుంది. ఇంటికి రాగానే  హార్లిక్స్ తాగుతుంది, రాత్రి భోజనం సమయం లో కూడా తనకు ఇష్టమైన బంగాళా దుంపల వేపుడు కూర ఉండాల్సిందే ! సాంబారు ఉంటే  అప్పడాలు కనీసం మూడు తినాల్సిందే !  భోజనం తరువాత , తన అమ్మమ్మ స్వహస్తాలతో చేసిన సున్ని ఉండలు కానీ , లడ్డూలు కానీ, పాల కోవా కానీ అతి ప్రేమ తో తింటుంది పల్లవి ! ఇక అమ్మా నాన్నలతో , కానీ అమ్మమ్మ తాత లతో కానీ బయటకు షాపింగుకు వెళ్లిందంటే , పిజ్జాలూ , బర్గర్ లో తప్పనిసరిగా తినాల్సిందే !  మరి షాపింగులు నెలకొక సారి కాదు కదా , కనీసం అయిదారు సార్లు వెళ్ళడం జరుగుతుంది ఏదో ఒక నెపం తో ! 
పల్లవి చాలా బొద్దుగా తయారవుతుంది , చూడడానికి అందరికీ ముచ్చటగా ఉంది , ప్రత్యేకించి పండగలకూ , పబ్బాలకూ అందరు బంధువులూ కలిసినప్పుడు కూడా , పల్లవి పట్టు లంగా  వేసుకుని , గంతులు వేస్తుంటే , అందరూ ” ముద్దు గా ” ఉంది అనుకుంటున్నారు ! పల్లవి తలిదండ్రులు కూడా చాలా ఆనంద పడుతున్నారు.  
ఇక్కడ పల్లవిని అత్యంత ప్రేమ, ఆప్యాయత లతో పెంచే పల్లవి తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తున్న విషయం , పల్లవి  ఊబకాయం గురించి ! అంటే ఒబీసిటీ  ! పల్లవి బాగా లావు అవుతుంటే , ” చిన్న పిల్ల , బొద్దు గా , బంగారు బొమ్మ లా ఉంది ” అనుకుని సంతోష పడుతున్నారు కానీ , అట్లా ఒళ్ళు రావడం అనారోగ్యం అనే వాస్తవం   గమనించ లేక పోతున్నారు ! 
 
ఈ చిన్న పిల్లలలో  వచ్చే ఊబకాయం గురించి వివరం గా , శాస్త్రీయం గా వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 

మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :

In ప్ర.జ.లు., Our Health on జనవరి 20, 2013 at 3:18 సా.

మన ఆహారం లో కాల్షియమ్ అవసరమా? :

 
కాల్షియమ్ కూడా ఇనుము లాగానే మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి ! 
కాల్షియమ్ వల్ల  మనకు ఉపయోగాలు ఏమిటి ? :
కాల్షియమ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది , మన ఎముకల బలానికీ , గట్టితనానికీ , అత్యంత ఉపయోగ కరమైనది. ఎముకలు ఆరోగ్యం గా పెరిగితేనే , చిన్నారుల పెరుగుదల సక్రమం గా ఉంటుంది.  ఎముకలు బలహీనం గా ఉంటే , పెరిగే వయసులో ఆ ఎముకలు వంగిపోతాయి. ఈ పరిస్థితిని రికెట్స్ అంటారు. ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఈ కాల్షియమ్ సరి పడినంత గా మనం క్రమం గా తీసుకుంటూ ఉండక పొతే , ఆస్టియో పోరోసిస్ అనే ఎముకలు పెళుసు బారే వ్యాధి వస్తుంది.  అంటే ఎముకలలో కాల్షియమ్ తగ్గి పోయి ఎముకలు బలహీనం అయి చిన్న చిన్న ప్రమాదాలకే విరిగి పోతూ ఉంటాయి ! అదే విధం గా కాల్షియమ్ మన దంతాల పెరుగుదల కు కూడా అతి ముఖ్యమైనది. కేవలం ఎముకల పెరుగుదలా , ఆరోగ్యానికే కాక , కాల్షియమ్ , మన శరీరం లో ఉన్న అనేక కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా అతి ముఖ్యమైన ఖనిజం. అందుకే గుండె కండరాల ఆరోగ్యానికి కూడా , కాల్షియమ్ అవసరం. కాకపొతే మన శరీర కండరాలకు  అవసరమయే కాల్షియమ్ అతి తక్కువ పరిమాణం లో ఉంటుంది. మన రక్తం సహజం గా గడ్డ కట్టడానికి కూడా కాల్షియమ్ అవసరం. 
మరి కాల్షియమ్ ఏ  ఏ  ఆహార పదార్ధాలలో ఉంటుంది ?:
పాలు , జున్ను , పెరుగు వీటిలో కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. కూర గాయాలలో , కాబేజీ, బెండకాయలు , ఆకు కూరలు , బ్రాకోలీ , లలోనూ ,పప్పు దినుసులలో , సోయా విత్తనాలలోనూ , సోయా పాలలోనూ , బ్రెడ్ , ఇంకా ఇతర  పప్పు దినుసులలో కూడా కాల్షియమ్ పుష్కలం గా ఉంటుంది. చేపలలో కూడా కాల్షియమ్ సమృద్ది గా ఉంటుంది. 
మరి కాల్షియమ్ ఎంత తీసుకోవాలి రోజూ ? :
పురుషులకు రోజూ ఏడు  వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ అవసరం ఉంటుంది. బాల బాలికలకూ , గర్భావతులకూ , కొద్దిగా ఎక్కువ కాల్షియమ్ అవసరం ఉంటుంది.
కాల్షియమ్ టాబ్లెట్స్ ఎడా పెడా  వేసుకో వచ్చా ? అది బలమే కదా ? :  ఇది పొరపాటు. కాల్షియమ్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకో కూడదు. అందువల్ల కడుపు లో నొప్పి తో పాటు గా ,  విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. రోజూ వేసుకొనే టాబ్లెట్స్ లో పదిహేను వందల మిల్లీ గ్రాముల కాల్షియమ్ కన్నా ఎక్కువ తీసుకో కూడదు. 
 
పైన ఉన్న మొదటి చిత్రం లో చిన్న పిల్లలలో కాల్షియమ్ లోపం తో వచ్చే రికెట్స్ ఎట్లా ఉంటుందో గమనించ వచ్చు. రెండో చిత్రం లో  వయసు లో ఉన్న వారికి కాల్షియమ్ లోపం తో ఎముకలు పెళుసు బారి వచ్చే  ఆస్టియో పోరోసిస్ వ్యాధి ని గమనించండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

అనీమియా ( రక్త హీనత ) కు చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., Our Health on జనవరి 19, 2013 at 6:01 సా.

అనీమియా కు చికిత్స ఏమిటి ?

 
రక్త హీనత కు చికిత్స  ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలంటే రక్తాన్ని ఇవ్వడమే ! కానీ రక్తాన్ని ఇవ్వడం చాలా తీవ్ర మైన పరిస్థితుల లోనే చేస్తారు. అంటే ఏదైనా ప్రమాదం లో రక్త స్రావం అంటే  రక్తం తీవ్రం గా కారిపోతే ,  ఆ పోయిన రక్తాన్ని వెంటనే ఇంకొకరి రక్తం ఇచ్చి  సరి చేస్తారు. ఇట్లా సరిచేయడం దేనికి ?: అంటే , మన శరీరం , రక్తస్రావం అంటే రక్తం ఎక్కువ పరిమాణం లో , తక్కువ సమయం లో కోల్పోతే , ఆ పరిస్థితిని తట్టుకోలేదు. అంటే సామాన్యం గా ఉండే అయిదు లీటర్ల  రక్తం  ప్రమాదం లో నాలుగు లీటర్లు కనుక అయిపోతే , మన  గుండె కు కావలసినంత రక్తం ఉండదు , మిగతా భాగాలకు పంపు చేయడానికి.  అదే విధం గా మనకు పెద్ద ఆపరేషన్ ఏదైనా చేయవలసి వచ్చినా కూడా , మనకు రక్తం వెంటనే అవసరం అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రత్యేకించి పెద్ద ఆపరేషన్ ( అంటే మన శరీరం మీద పెద్ద గాటు పెట్టి ఆపరేషన్ చేయవలసి వచ్చినపుడు ) లలో ఎక్కువ గా రక్త స్రావం అవడానికి అవకాశం ఉంటుంది, సర్జన్ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నప్పటికీ ! 
కానీ సామాన్యం గా ఎక్కువ మంది లో రక్త హీనత , ఇనుము , ఇతర పోషక పదార్ధాల లోపం వల్ల  వస్తుంది. అంతే  కాక , ఈ లోపం చాలా కాలం గా ఉంటుంది. అందువల్ల  గుండెకు కావలసిన అయిదు లీటర్ల రక్తం  తయారు అవుతుంది. కానీ ఇక్కడ గుర్తు ఉంచు కోవలసినది ఏమిటంటే , అయిదు లీటర్ల పరిమాణం ఉన్నా , అది పలుచగా ఉంటుంది. అంటే  ఆ రక్తం లో ఉండవలసిన పదమూడు పద్నాలుగు గ్రాముల హీమోగ్లోబిన్ ఉండదు.  హీమోగ్లోబిన్ సరిపడినంత ఉంటేనే , శరీరం లో అన్ని భాగాలకూ సరిపడినంత ప్రాణవాయువు అందుతుంది. మనం నాలుగు లీటర్ల పాలను ఇంకో లీటరు నీళ్ళు కలిపి అయిదు లీటర్ల పాల గా మార్చవచ్చు కదా ! కానీ ఆ అయిదు లీటర్ల పాలను మనం నీళ్ళ పాలు అంటాము కదా ! అట్లాగే అనీమియా దీర్ఘ కాలం గా ఉంటే , పరిమాణం లో లోపం ఉండక  పోయినా, పలుచ గా ఉండడం వల్ల , బలహీనం గా నే ఉండడం జరుగుతుంది. ఇట్లా దీర్ఘ కాలం గా అనీమియా ఉంటే , దానిని ఇనుము కాప్స్యుల్స్ తో సరి చేసుకోవచ్చు.  ఈ ఇనుము లేదా ఐరన్  కాప్సుల్స్ ఫెర్రస్ సల్ఫేట్ లేదా ఫెర్రస్ ఫ్యుమరేట్ అనే పేర్లతో బజారు లో దొరుకుతాయి. లేదా ఫెరడాల్  అనే  టానిక్ లా కూడా దొరుకుతుంది. 
మరి ఈ ఇనుము కాప్సుల్స్ ను ఎక్కువ గా వేసుకోవచ్చు కదా తొందరగా అనీమియా ను చికిత్స చేయవచ్చు కదా ? : అంటే  దానికి సమాధానం : ఐరన్  కాప్సుల్స్ ను  అతి గా  రోజూ వేసుకుంటే , వాటి పరిమాణాలు , ప్రత్యేకించి సైడ్ ఎఫెక్ట్స్  తీవ్రం గా ఉంటాయి. అందువల్ల , డాక్టర్ ను సంప్రదించి , డాక్టర్ చెప్పిన విధం గానే ఈ కాప్సుల్స్ ను వేసుకోవాలి. సామాన్యం గా రోజుకు మూడు పూటలు ,  వేసుకోవాలి. 
కేవలం ఇనుము కాప్సుల్స్ వేసుకుంటే సరిపోతుందా?: 
సాధారణం గా ఇనుము లోపం కేవలం ఇనుము ఆహారం లో తగినంత తీసుకోక పోవడమే కాకుండా , ఆహారం లో ప్రోటీనులు అంటే మాంస క్రుత్తులు , ఇంకా బీ కాంప్లెక్స్ విటమిన్లు లోపం ఉన్నప్పుడు కూడా అనీమియా గా కనబడుతుంది.  ప్రోటీనుల లోపం ఉంటే  ఐరన్  లేదా ఇనుము ను ” పట్టుకుని ” ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చేరవేయడానికి అవసరమయే ఫెరిటిన్  అనే పదార్ధం లోపిస్తుంది, దానితో కూడా అనీమియా వస్తుంది. అందువల్ల , అనీమియా ఉన్న వారు కేవలం ఇనుము లేదా ఐరన్  కాప్సుల్స్ వేసుకోవడం తో  చికిత్స జరుగుతున్నది బాగా అని తృప్తి చెందక , మిగతా విషయాలలో కూడా ( అంటే , ఆహారం లో రోజూ , ప్రోటీన్లు , ఆకుకూరలు , విటమిన్లు సరిపడా ఉండేట్టు ) శ్రద్ధ తీసుకోవాలి ! 
ఎంత కాలం చికిత్స జరగాలి ? : సామాన్యం గా మూడు నుంచి ఆరు నెలల వరకూ ఈ చికిత్స జరపాలి !  అప్పుడు హీమోగ్లోబిన్ పరీక్ష జరిపి , సరిగా ఉంటే  , అప్పుడు డాక్టర్ సలహా తో మానాలి చికిత్స. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

రక్త హీనత ( అనీమియా ) ను కనుక్కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., Our Health on జనవరి 18, 2013 at 4:09 సా.

రక్త హీనత ( అనీమియా  ) ను కనుక్కోవడం ఎట్లా ? 

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=XqGmgWQKecs

చిన్న పిల్లలలో : 
బాల బాలికలలో అనీమియా ఈ క్రింది సూచనల వల్ల  అనుమానించ వచ్చు.
1. కనీసం వారం లో   మూడు రోజులైనా ఆకుకూరలు, పప్పు దినుసులు ,  తినక పోతూ ఉంటే , అంటే పోషకాహార లోపం వల్ల.
2. మాంసాహారులు కాక పొతే కూడా 
3. మాంసాహారులు అయినా కూడా , ఎర్రటి మాంసం , కాలేయం , లాంటి మాంసాలు కాక తెల్లటి మాంసం , చికెన్ తినడం వల్ల  కూడా రక్త హీనత కలగ వచ్చు.
4. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు ( కొందరు గ్రామీణ బాల బాలికలు ఇప్పటికీ , వారి మలం లో పురుగులను చూసి , తల్లి దండ్రులకు చెబుతూ ఉంటారు ) 
 
యుక్త వయసు వచ్చిన ( అమ్మాయి లలో ) వారిలో :
వనితలలో కూడా ఋతుస్రావం  మొదలైనప్పటి నుంచీ , రక్త హీనత కు అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి  వారు ఇనుము , మాంస క్రుత్తులు ( అంటే ప్రోటీనులు ) లోపించిన ఆహారమే తీసుకుంటూ ఉన్నప్పడు.  గమనించ వలసిన విషయం ఏమిటంటే , అనీమియా లక్షణాలు , క్రమేణా  అంటే రోజు రోజు కూ  పెరుగుతూ ఉంటాయి. అంటే మొదటి దశలలో హీమోగ్లోబిన్  పదమూడు ఉండవలసినది , పదకొండు అయినప్పుడు లక్షణాలు అంత  తీవ్రం గా ఉండవు. కానీ ఇనుము లోపం సరి చేయకుండా , అంటే ఆహారం లో ఇనుము ఎక్కువ గా ఉండే , ఆకు కూరలూ , కూరగాయలూ తీసుకోనప్పుడు , అనీమియా తీవ్రత హెచ్చి , హీమోగ్లోబిన్ కాస్తా ఏడూ ఎనిమిది కి తగ్గ వచ్చు. తగ్గుతున్న కొద్దీ  రక్తం అంటే రక్తం లో రక్త కణాలు , శరీరానికి అవసరమైనంత ప్రాణ వాయువు ను  సరఫరా చేయలేవు. అంటే మన శరీరం లో అను నిత్యం, ప్రతి జీవ కణాని కీ కావలసిన ప్రాణవాయువు అందక , కణాలు నీరస పడతాయి.  మానవ శరీరం అంతా  కణాల సముదాయమే కదా ! అందువల్ల మన శరీరం కూడా నీరస పడుతుంది. 
 
పైన ఉన్న వీడియో చూడండి ,   క్రింద ఉన్న చిత్రం లో హీమోగ్లోబిన్ ఎట్లా మన శరీరానికి ఉపయోగ పడుతుందో కూడా చూడండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health on జనవరి 17, 2013 at 7:49 సా.

రక్త హీనత ( అనీమియా ) లక్షణాలు ఏమిటి ? : 

 
రక్త హీనత ( అనీమియా )  లక్షణాలు ,  ఆ వ్యాధి వచ్చినప్పుడు ఉన్న వయసు ను బట్టి ఉంటాయి ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన ఇంకో ముఖ్య విషయం :అనీమియా కేవలం ఇనుము లోపం వల్ల నే కాకుండా , B  విటమిన్ల లోపం ఉన్నప్పుడు కూడా వస్తుంది. లోపానికి కారణం ఏదైనా , అనీమియా లక్షణాలు ఒకే రకం గా ఉంటాయి. ఆ లక్షణాల తీవ్రత కూడా అది వచ్చిన వయసు ను బట్టి మారుతుంటుంది ! 
ఉదాహరణకు : పిల్లలు పెరిగే వయసులో కనుక అనీమియా లేదా రక్త హీనత కలిగితే , పిల్లల పెరుగుదల కుంటు  పడుతుంది.
గర్భిణీ స్త్రీలలో కనుక అనీమియా ఉంటే , గర్భం లో ఉన్న శిశువు పెరుగుదల కూడా సరిగా ఉండక పోవచ్చు. 
విద్యార్ధులలో కనుక అనీమియా ఉంటే , వారు సరిగా మిగతా విద్యార్దులలా చురుకు గా ఉండక పోవడం , ఆట పాటలలో ఉత్సాహం ఉన్నా , కొద్ది సమయం లోనే అలసి పోవడం , నిరుత్సాహ పడడం  జరుగుతుంది. అంతే  కాక చదువులోనూ ఏకాగ్రత లోపించడం, పాఠాలు త్వరగా నేర్చుకోలేక పోవడం , స్తబ్దత గా ఉండడం కూడా జరుగుతుంది. అనీమియా తీవ్రం గా ఉన్నప్పుడు , పిల్లలు  మన్ను తినే అలవాటు చేసుకుంటారు , అట్లాగే బడిలో , గోడ మీద ఉన్న సున్నం  తినడం, లేదా  బలపం ( ఈ రోజులలో బడి లో , ఇంకా ఇస్తుంటే ) తినడం కూడా చేస్తుంటారు !  అప్పుడు తల్లులు వారిని  వెంటనే ” బాదకుండా ” డాక్టర్ కు చూపించడం మంచిది. ప్రత్యేకం గా ఈ లక్షణం ఉన్న చిన్నారులలో , కడుపులో  నులి పురుగులు అంటే రౌండ్ వార్మ్  ఇన్ఫెక్షన్ ఉంటే  కూడా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కడుపులో పెరుగుతున్న నులి పురుగులు , లోపలికి తీసుకుంటున్న ఆహారాన్ని తినేసి అవి పెరుగుతూ , పిల్లలకు పోషకాహార లోపం కలిగిస్తాయి. 
ఈ విషయం లో కూడా తల్లులు శ్రద్ధ వహించాలి ! ఇంకా మలేరియా బాగా ప్రబలి ఉన్న ప్రదేశాలలో ఉన్న వారికి కూడా అనీమియా లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మలేరియా పరాన్న జీవి రక్త కణాలలో ప్రవేశించి , వాటి పోషకాలను తీసుకుని వృద్ధి చెందుతూ , మలేరియా కలిగిస్తుంది, ఆ పరిస్థితి లో కూడా రక్త హీనత కలుగుతుంది.  
పైన  ఉన్న మొదటి చిత్రం లో సహజం గా ఆరోగ్యం గా ఉన్న రక్త కణాలు చూడండి ,ఇక అనీమియా ఉన్నప్పుడు రక్త కణాలు ఎట్లా ఉంటాయో కూడా ప్రక్కన ఉన్న  చిత్రం లో గమనించండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ ఉన్న సంబంధం ఏమిటి ?:

In ప్ర.జ.లు., Our Health on జనవరి 16, 2013 at 11:26 ఉద.

అనీమియా ( రక్త హీనత ) కీ ఇనుము కూ  ఉన్న సంబంధం ఏమిటి ?:

 
మనం క్రితం టపాలలో మన దేహానికి అవసరమయే విటమిన్ల గురించి తెలుసుకున్నాం కదా , మరి మనకు అవసరమయే ఖనిజాల సంగతి కూడా చూద్దాం ! 
మనకు అవసరమయే ఖనిజాలలో ముఖ్యమైనది ఇనుము , అదే ఐరన్. మన పోషకాహారం లో ఇనుము లోపిస్తే అది  రక్త హీనత కలిగిస్తుంది.  మానవులలో సామాన్యం గా రమారమి అయిదు లీటర్ల రక్తం ఉంటుంది. మరి ఇనుము లోపం కలిగితే  అయిదు లీటర్ల రక్తం కాస్తా తగ్గిపోయి నాలుగు లీటర్లు అవుతుందా ? దీనికి సమాధానం” కాదు ”. రక్త హీనత అనగానే రక్తం తక్కువ గా ఉన్నట్టు అర్ధం వస్తుంది కానీ , ఇనుము లోపించి నప్పుడు  జరిగేది రక్తం పలుచ బడడం !  రక్తం తక్కువ అవడం అనేది , మన దేహం లో రక్తం ఏ  భాగం నుంచైనా కారిపోతూ ఉంటే  కానీ , లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ , జరుగుతుంది.  మన రక్తం పలుచ బడ దానికి ప్రధాన కారణం  మన పోషకాహారం లో ఇనుము లోపించడమే !  
ప్రశ్న : మరి ఇనుము పుష్కలం మనం ఏవిదం గా తీసుకోగలం ?
జవాబు : శాక హారులకు : 
ముదురు ఆకు పచ్చ రంగులో ఉండే ఏ ఆకు కూరలైనా , లేదా కూరగాయలైనా .
బీన్స్, సోయా బీన్స్, ధాన్యాలు ,  పప్పులు కూడా ఇనుము ఉండే పదార్దాలే ! 
మాంసాహారులు : మాంసం , కాలేయం  లో ఇనుము బాగా ఉంటుంది. 
ప్రశ్న: మనకు రోజూ ఎంత ఇనుము అవసరం ?
జవాబు : పురుషులకు ఎనిమిది మిల్లీ గ్రాములకు పైగా నూ , స్త్రీలకూ పద్నాలుగు మిల్లీ గ్రాములకు పైగానూ అవసరం ఉంటుంది.  
ప్రశ్న: ఈ రోజుల్లో రక్త హీనత మనకు ఏవిధం  గా వస్తుంది? : 
జవాబు: రోజూ చిన్న పిల్లలకు  ఆకు కూరలు లేని వంటలు వండి పెట్టడం వల్ల . అంతే కాకుండా , వారికి బజారులో దొరికే  ” చెత్త తిండి ” లేదా జంక్ ఫుడ్ ” అలవాటు చేయడం వల్ల . బర్గర్లూ  , పిజ్జా లూ , కేవలం  అనారోగ్య కరమైన కానీ రుచికరం అయిన కాలరీలు ఇస్తాయి కానీ ,  పోషక విలువలు ఏవీ ఉండవు.  
ప్రశ్న : స్త్రీలలో రక్త హీనత ఏవిధం  గా వస్తుంది ?! : 
జవాబు : స్త్రీలలో సామాన్యం గా రెండు విధాలు గా రక్త హీనత కలుగుతుంది. సహజమైన ఋతుక్రమం  లో  కలిగే రక్త స్రావం వల్ల , ఇనుము లోపిస్తుంది. ఇట్లా లోపం సహజం గా ఉన్నప్పుడు కనుక ఇనుము ను పోషకాహారం లో కూడా తీసుకోక పొతే , ఆ లోపం ఎక్కువ అవుతుంది. అది  అనీమియా లక్షణాలు గా కనిపిస్తుంది. 
 
ఈ రక్త హీనత లక్షణాలను గురించి వివరం గా వచ్చే టపాలో తెలుసుకుందాం !