మునుపటి టపాలో , ఫోమో అంటే ఏంటో , దానికి కారణాలు ఏమిటో , తెలుసుకుని , దాని నివారణోపాయాలు కూడా కొన్ని తెలుసుకున్నాం కదా !
ఇప్పుడు , మిగతా నివారణోపాయాలు కూడా తెలుసుకుందాం !
5. మీ నిజజీవితానికి దగ్గరగా అంటే ఊహా ప్రపంచం లో కాక , మీ యదార్ధ జీవిత పరిస్థితి ఏమిటో బేరీజు వేసుకుని , దానికి దగ్గర గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ! ఇతరులు సిరులలో తల తూగుతున్నారన్న భ్రమ లో తాము కూడా అదే జీవనశైలి ఆచరిద్దామనే అపోహలు మాని , తమ తమ లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలో , అందుకు తాము చేయవలసిన కర్తవ్యం ఏమిటో నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి ! ఒక వేళ ఇతరులతో పోల్చుకునేట్టయితే , వారిలో ఉన్న మంచి లక్షణాలను పరిశీలించి , వాటిని ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి , అంటే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి !
6. డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ ( distraction technics ) అంటే మనసు దారి మళ్లించడం ! ఈ చర్య అనుకున్నంత తేలిక కాదు ! కానీ అసాధ్యం మాత్రం కాదు ! అదేపనిగా , ఒక వ్యసనం మాదిరిగా , నిరంతరం ఫోను పట్టుకు కూర్చోవడం మాని , వారు కోల్పోతున్నదేమిటో తెలుసుకోవాలి !తమ కుటుంబ సభ్యులతోనో , బంధు మిత్రులతోనో , సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి , లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కానీ ,కొంత దూరం నడవడం కానీ చేయ వచ్చు !
7. బలమైన బంధాలు ఏర్పరుచుకోవడం ! ( Strong relationships ) : తాము నివసించే ప్రదేశం లో , తమ చుట్టూ ఉన్నవారితోనూ , తమ సన్నిహితులతోనూ ఆరోగ్య కరమైన సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ! అంటే తాము ఏర్పరుచుకునే సంబంధాలు ఇంటర్నెట్ ద్వారా మనుషులతో కాక , వ్యక్తిగతంగా , వారు చూడ గలుగుతున్న యదార్ధ వ్యక్తులతో ఏర్పరుచుకోవాలి ! కొత్త వ్యక్తులతో ఫోను లో ఏర్పరుచుకుని సంబంధాలు ఏ ఆధారాలతో ఏర్పరుచుకుంటున్నారో పరిశీలించుకోవాలి ! కృత్రిమ మేధ ద్వారా , ఈ రోజుల్లో అనేక రకాలైన మోసాలు జరుగుతున్నాయి !
8. ‘ నీ గమ్యం మరువకు బాటసారీ ! ‘ : ప్రతి ఒక్కరూ , వయసు తో నిమిత్తం లేకుండా , తమ తమ లక్ష్యాలనూ , గమ్యాలనూ నిర్దేశించుకుని , వాటిని చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉండాలి ! ప్రత్యేకించి ,తమ అత్యంత విలువైన ‘ సమయాన్ని ‘ ఏ ఇతర మానవులు కానీ , వస్తువులు కానీ వృధా చేయకుండా నివారించుకోవాలి ! ఎందుకంటే , గమ్యం చేరుకోవడానికి , కాలయాపన చేసే ఏ ఇతర పనీ , తమకు ఉపయోగపడదు ! అంతే కాక , తమ మనసులో ఎప్పుడూ ,తమ ప్రత్యేకమైన లక్ష్యాలూ , గమ్యాలూ తమకే తెలుసుకనుక !
9. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని తెలుసుకోండి ! అంటే , నాలుగు గంటలు ఫోనులో ‘ సుత్తి కొట్టటడం ‘ కానీ ‘ సుత్తి కొట్టించుకోవడం’ కానీ చేసే బదులు ఆ సమయం తమకు ఎంత ఉపయోగపడిందో కూడా తెలుసుకుంటే మంచిది ! ఫోను లో ఇంటరాక్ట్ అవకపోతే చాలా కోల్పోతామనే భావన బదులు , తాము ఎంత వరకు లాభపడుతున్నామో , తమ తమ లక్ష్యాలు ఎంతవరకు కుంటు పడుతున్నాయో కూడా ఆత్మ విమర్శ చేసుకోవడం శ్రేయస్కరం !
మిగతా మార్పులు తరువాతి టపాలో తెలుసుకుందాం !
ఈలోగా మీ అభిప్రాయాలను తెలుపండి !







