Our Health

Archive for the ‘మానసికం’ Category

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 18, 2014 at 11:14 ఉద.

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి ! 

 
ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, కేవలం వివిధ దేశాలలో  నడిచే ప్రభుత్వ సంస్థ లే కాకుండా,  అనేక ప్రైవేటు సంస్థలు కూడా అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి !  అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి !  ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక , వివిధ సంస్థలలో , తాము  ఇతర ఉద్యోగులతోనూ , వారు పనిచేసే సంస్థ యాజమాన్యం తోనూ అనేక విధాలు గా కలిసి పోవడమే కాకుండా , తదనుగుణం గా వారు  తమ  పని సూత్రాలనూ , అంటే పని చేసే విధానాలనూ , పద్ధతులనూ కూడా మార్చు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి !  అప్పుడే , వారి ప్రతిభకు మాత్రమే కాకుండా , వారు ఆ యా సంస్థలలో ఇమిడి పోయి , ఆ సంస్థ పురోగతి కి కారకులయినందుకు కూడా , కేవలం ధన రూపం లోనే కాకుండా , యాజమాన్యానికి కూడా విశ్వాస పాత్రులు గా గుర్తింప బడి , అనేక విధాలు గా లాభం పొంద గలుగుతారు ! 
ఒక అంచనా ప్రకారం , వివిధ సంస్థలలో ఉద్యోగాలు కోల్పోయిన లేదా  ఉద్యోగం నుంచి తీసి వేయబడ్డ ఉద్యోగులలో 70 శాతం మంది, వారికి ఆ ఉద్యోగం చేయడానికి అవసరమైన ప్రతిభ లోపం వల్ల కాక , కేవలం వారు పని చేసే సంస్థలో ‘ ఇమడ ‘ లేక పోవడం చేతనే ! అంటే వారు, వారి ఉద్యోగం సరిగా చేస్తున్నా కూడా , ఆ కంపెనీ లో  బ్లెండ్ అవలేక పోవడం వలననే అని నిర్ధారించ బడింది ! దీనిని బట్టి ,  ఉద్యోగులు , తమకున్న ప్రతిభను మాత్రమే కాక , కార్పోరేట్ కల్చర్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలనే సత్యాన్ని మరువ కూడదు అని తేట తెల్లమవుతుంది కదా  !
మరి ఈ కార్పోరేట్ కల్చర్ అంటే ఏమిటి ? 
ప్రతి సంస్థా , లేదా ఇండస్ట్రీ , లేదా ఒక చిన్న ఆఫీసు కూడా , కొన్ని  నిర్దిష్ట మైన , నిబంధనల ప్రకారం , సూత్రాల ప్రకారం పని చేస్తూ ఉంటుంది ! ఆ యా సంస్థల యాజమాన్యాలు, ఆ సూత్రాలనూ , నిబంధనలనూ నిర్ణయిస్తాయి !  అంతే కాకుండా , ఆ యాజమాన్యాలు , వారి ఉద్యోగులను ఆ సూత్రాలనూ , నిబంధనలనూ ఎప్పుడూ పాటిస్తూ ,ఆ సంస్థ అభివృద్ధి కీ పాటు పడాలనీ , వారు కూడా లాభం పొందాలనీ కూడా ఆశిస్తాయి ! 
ఉదాహరణకు : ఒక వస్తువు ను ఉత్పత్తి చేసే  పరిశ్రమ ఉందనుకుంటే , ఆ పరిశ్రమ యాజమాన్యం , తమ ఉద్యోగులు , తాము ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత లో ఏ మాత్రమూ లోపం లేకుండా , అత్యున్నత ప్రమాణాలతో  తయారు చేయాలని ఆశిస్తారు ! అందుకు ఆ  పరిశ్రమ లో వివిధ శాఖల లో పని చేసే అందరు ఉద్యోగులూ కూడా  ఆ వస్తువు నాణ్యత లోపించకుండా , తాము చేసే ఉద్యోగాన్ని శ్రద్ధతో చేయాలి ! ఒక శాఖ లో పనిచేసే వారికి , ఇంకో శాఖ లో పనిచేసే వారితో సమన్వయం లోపిస్తే , దాని ప్రభావం , తాము ‘ కలిసి ‘ ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత మీద పడుతుంది ! 
ఇంకో ఉదాహరణ : వినియోగ దారులకు అంటే కస్టమర్ కు సేవ లు అందించే ఇంకో సంస్థ ఉందనుకుంటే, ఆ  సంస్థ యాజమాన్యం , వారి ఉద్యోగులు , ఆ సంస్థ సూత్రాలు పాటిస్తూ , వినియోగ దారుడి  కి అత్యంత ప్రాధాన్యత నిస్తూ , వారి అవసరాలు వంద శాతమూ తీర్చడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి  అని ఆశిస్తుంది ! ఆ సూత్రాలకు విరుద్ధం గా అందులో పని చేసే ఉద్యోగులలో కొందరు , వారి కస్టమర్ తో సరిగా ప్రవర్తించక పోవడమో లేదా , వారిని, వారి అవసరాలనూ నిర్లక్ష్యం చేయడమో  జరిగితే ,  వినియోగ దారులకు అందిస్తున్న సేవలలో నాణ్యత లోపించి , దాని ప్రభావం , ఆ సంస్థ  మీద పడుతుంది ! అంటే ఆ సంస్థ ఆర్ధికం గా నష్ట పోతుంది !  దానితో పాటు యాజమాన్య సూత్రాలకు విరుద్ధం గా పనిచేసిన ఆ  ఉద్యోగుల ఉద్యోగాలు కూడా పోతాయి !  అందువల్లనే ప్రతి సంస్థా కూడా , అది పని చేసే విధానాల మీద నిర్దిష్టమైన పని సూత్రాలను రూపొందించి , ఆ సూత్రాలను , అందులో పనిచేసే ఉద్యోగులంతా పాటించాలని  నిబంధన చేస్తుంది ! 
సాధారణం గా ప్రతి ఉద్యోగీ కూడా తమదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పరుచుకుని ఉంటారు ! తమకై ఒక పర్సనాలిటీ ఎర్పరుచుకుంటారు ! అంటే అది కేవలం భౌతికమైన లక్షణాలకు సంబంధించినదే కాదు !  వారు తాము పనిచేసే తీరు లోనూ , ఇతరులతో ప్రవర్తించే తీరు లోనూ , తమకై తాము చూపించే ప్రత్యేకత !  మనం అందరమూ , ఒకే పనిని చేస్తున్నా , మనం వ్యక్తి గతం గా చేసే ఆ పనిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ! అట్లాంటిదే వ్యక్తిత్వం కూడా ! ఎవరి స్టైల్ వారిది !  అది మంచిదే ! కానీ  ఈ స్టైల్ బాసులు , వారు పని చేసే సంస్థలలో కూడా , తమ స్టైల్ తమదే అని భీష్మించుకుని , యాజమాన్యం తో అనేక రకాలు గా ఘర్షణ పడుతూ , తమ ఉద్యోగాలకు అనవసరం గా ఎసరు పెట్టుకుంటూ ఉంటారు !  ఇక్కడ అట్లాంటి వారు గమనించ వలసినది ఒక్కటే ! మీ వ్యక్తిత్వాలు ఎప్పుడూ మీవే ! కానీ మీరు పనిచేసే సంస్థ లో ఉన్నంత సేపూ , కేవలం ఆ సంస్థ సూత్రాలు పాటించండి ! మీకు నచ్చక పోయినా కూడా ! ఎందుకంటే అది మీ ఉద్యోగం కాబట్టి !  మిగతా విషయాలు మీకు అనవసరమూ , అప్రస్తుతమూ కూడా ! అంటే మీరు మీ ఉద్యోగ జీవితం లో ఎట్లాంటి ఒడు దుడుకులూ లేకుండా , ముందుకు సాఫీ గా సాగి పోవాలని నిర్ణయించుకుంటే , కేవలం మీరు పని చేస్తున్న సంస్థ సూత్రాలను పాటిస్తూ , ఆ సంస్థ లో కలిసి పొండి !  మీ సంస్థ యాజమాన్యం గోల్ఫ్ ఆడుతూ ఉంటే , మీరు కూడా ఆ గోల్ఫ్ ఆట ఆడండి ! మీకు ఆ ఆట ఇష్టం లేక పోయినా కూడా ! ఎందుకంటే , మీరు పనిచేసే సంస్థకు, మీ ఇష్టా ఇష్టాలతో పని లేదు ! ఆ సంస్థ నిబంధనలనూ, సూత్రాలనూ ప్రతి ఉద్యోగీ పాటిస్తున్నాడా ? లేదా ? అనే విషయమే వారికి ముఖ్యం !  మీ వ్యక్తిత్వం మీదే ! మీకు గోల్ఫ్ ఇష్టం లేదనే అభిప్రాయం మార్చుకో నవసరం లేదు ! కానీ, మీరు యాజమాన్యం తో గోల్ఫ్ ఆడండి ! లేకపోతే , యాజమాన్యమే మీ ( జీవితాలతో )  తో గోల్ఫ్ ఆడుతుంది ! అదే కార్పోరేట్ కల్చర్  ను అలవాటు చేసుకోవడం అంటే ! 
ఇట్లా మీరు ఎప్పుడూ చేస్తూ ఉంటే , విజయం మీదే ! ఇట్లా కనీసం మీ స్వంత కంపెనీ కానీ పరిశ్రమ కానీ పెట్టే వరకూ చేస్తూనే ఉండాలి ! మరి అదే కార్పోరేట్ కల్చర్ అంటే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు. 41. పని చేసే చోట, మీ పరిచయాలు పెంచుకోండి !

In మానసికం, Our minds on జనవరి 12, 2014 at 11:32 ఉద.

పని సూత్రాలు. 41.  పని చేసే చోట, మీ పరిచయాలు పెంచుకోండి ! 

మీరు పని చేసే చోట, ఎట్లా ప్రవర్తిస్తే , మీరు ఎక్కువ గా లాభ పడతారో తెలుసుకోవడం లో భాగం గా, ఒక నలభై టపాలను  ఇంతకు ముందే పోస్ట్ చేయడం జరిగింది ‘ బాగు ‘ లో ! ( ఉత్సాహం ఉన్న వారు,  బాగు ఆర్కివ్స్ లో చూడండి,  ఫిబ్రవరి 13 , 2013 నుంచి ఏప్రిల్ 3 2013 వరకూ వేసిన టపాలు ! ) ఇక మిగతా పని సూత్రాలు తెలుసుకుందాం !
పని చేసే చోట , పరిచయాలు పెంచుకోవడం :
చాలా మంది తాము పని చేసే స్థానం లో కేవలం , వారి పని వారు చేస్తూ , ఎల్ల కాలం తమ కర్తవ్యం లో నిమగ్నమై ఉంటారు ! వారికి పని బాగా వచ్చినా , తదేక దీక్షతో పని చేస్తూ నే ఉంటారు ! అవన్నీ మంచి లక్షణాలే ! కానీ పని చేసే చోట ,  అనేక మానసిక పధకాలు వేయబడుతూ ఉంటాయి ! ఆఫీసు ‘ చెద ‘ రంగం లో ఎప్పుడూ పావులు కదులుతూ ఉంటాయి !  మీ రు చేసే పని బాగా ఉన్నా కూడా , మీ ‘ పని పట్టే ‘  ఊసరవెల్లులూ ,  మీ అవకాశాలను మింగేసే తిమింగలాలూ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి !  ఆ సమయాలలో , ఆ మాటకొస్తే, ప్రతి క్షణమూ ,  అప్రమత్తత తో ఉండడమే కాకుండా , ఇతర  కొలీగ్స్ తోనూ , ఇతర ఉద్యోగులతోనూ కూడా  సంబంధాలు సమతూకం లో ఉంచుకోవడం, మీకు ఎంతో లాభదాయకం ! 
పని చేయడం లో మీ క్రమ శిక్షణా , విధి నిర్వహణ లో మీ అంకిత భావం ,  మీ ఉద్యోగం లో తరచూ వచ్చే సమస్యలను పరిష్కరించడం లో మీకున్న ప్రతిభా , ఇవన్నీ కూడా మీరు పనిచేసే స్థానం లో, మీ ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉపయోగించుకోవాలి ! ఇతర ఉద్యోగులు మీ అంత ప్రతిభ  లేని వారయినా కూడా , వారికి అవసర సమయాలలో తగిన సలహా లు ఇవ్వడమే కాకుండా , వారి సమస్యలను  పరిష్కరించడం లో మీ సహకారాన్ని ఇవ్వడం ద్వారా , మీ మానవతా దృష్టి ని కూడా పెంపొందించుకో గలుగుతారు !  అట్లాగని  ఇతరులు  ఉద్యోగ ధర్మం లో చేసే పొర పాట్లను , మీ నెత్తిన వేసుకోవడం ,లేదా వారి పొర పాట్లను కప్పి పుచ్చాలని ప్రయత్నించడం చేయకూడదు ! మీరు చేసే ఇట్లాంటి చర్యల వల్ల , కేవలం సహ ఉద్యోగి గా మాత్రమే కాక , ఒక స్నేహితుడి గా కూడా మీరు , మీ ఇతర ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన గలుగుతారు !  మీరు  ‘ సంపాదించిన ‘ ఆ అభిమానం , ముందు ముందు , మీ అవకాశాలను   ప్రకాశ వంతం చేసుకోవడం లో  ఉపయోగ పడే  ధనం !
మీదైన శైలి తో , మీ ఉద్యోగాన్ని సరిగా చేయడమే కాకుండా , ఇతర ఉద్యోగుల  మీద కూడా నిజమైన శ్రద్ధ కనబరుస్తూ , ఇతర ఉద్యోగుల  విధేయతను పొందితే , మీరు ఒక  ప్రతిభ కలిగిన ఉద్యోగి గా మాత్రమే కాక , నాయకత్వ లక్షణాలు కలిగిన  ఉద్యోగి గా కూడా పేరు తెచ్చుకో గలుగుతారు ! 
ఉద్యోగం కాక , ఇతరత్రా మీరు చేస్తున్న సహాయమూ , ఇతర ఉద్యోగులకు మీరు ఇస్తున్న సహకారమూ , మీరు వృధా గా పోనీయ కూడదు !  ఈ పనులన్నీ కూడా , మీ వ్యక్తి గత పురోగమన పధకం లో , మీరు తెలివి గా , చాకచక్యం గా కదుపుతున్న పావులు కావాలి ! మీ ఉద్యోగం లో, మీరు ఉద్యోగం చేసే స్థానం లో  చూపిస్తున్న మీ మంచి లక్షణాలన్నీ కూడా మీ అవకాశాలు  మెరుగు పరుచుకోవడానికి వేసే అడుగులు కావాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !   

చదువుకోవడం ఎట్లా ? టపాలన్నీ,సంగ్రహం గా, నోట్సు రూపం లో !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 29, 2013 at 8:54 ఉద.
చదువుకోవడం ఎట్లా ? టపాలన్నీ,సంగ్రహం గా, నోట్సు రూపం లో ! 
ఈ టపాలో కొత్త విషయాలు కాకుండా , చదువుకోవడం గురించి న ఇప్పటి వరకూ ఉన్న టపాలన్నింటి నుంచీ సంగ్రహం గా నోట్సు రూపం లో  ఇవ్వడం జరుగుతుంది !  ఈ నోట్సు  జ్ఞాపకం ఉంచుకుంటే , విద్యార్ధులందరికీ ఎంతో ఉపయోగ కరం !  మీరు  మీ పాఠాలు చదువుకునే సమయం లో కూడా ఇట్లా నోట్సు రాసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది !  ఒక్కో టపా లో చూసిన వివిధ  చిత్రాలను కూడా, మీరు  నోట్సు పక్కన ‘ నోట్ ‘ చేసుకోవచ్చు ! తరువాత గుర్తు చేసుకోడానికి ఉపయోగ పడతాయి చిత్రాలు కూడా ! విజయోస్తు ! 
1 నుంచి 5 చదువుకోవడం ఎట్లా?  అనే విషయం గురించి పరిచయం ! 
చదువుకోవడం ఎట్లా ?2.
సమయం, స్థానం, చూసుకుని, దీక్ష తో  చదువుకో ! 
నీ జీవిత గమ్యాన్ని , సమయానికే చేరుకో !
దిశా నిర్దేశనం ! 
6. ఆలస్యం , అమృతం ,విషం ! 
7. ప్రతి పనికీ, వేసుకో పధకం ! 
నీ జీవితం లో, నీవే  ప్రధమం ! 
పధకం చేస్తుంది , 
నీ లక్ష్యం, సుగమం ! 
చదువుకోవడం ఎట్లా ?8. చదువుకు పధకమేమిటి ?
టైం చార్ట్ వేసుకోవడం :
ఇప్పుడు మీ చదువు లక్ష్యాలు నిర్ణయించు కోండి :  
మరి సమయం అంతా చదువు కేనా ? :
చదవడం ఎట్లా ? 9. సమయ పాలన ! ( టైం మేనేజ్ మెంట్ )
మరి నోట్స్ తీసుకోవడం లో జరిగే లాభం ఏమిటి ? : 
చదువుకోవడం ఎట్లా ? 10. నోట్స్ ఎందుకు రాసుకోవాలి ?
చదువు కోవడం ఎట్లా ? 10. సమయ పాలన. ( టైం మేనేజ్ మెంట్ )
1. మొదట ఎంత సమయం , ఏ సబ్జెక్ట్ కు వినియోగించాలి అనే విషయం నిర్ణయించు కున్నాక , ఆ విషయాలు విపులం గా ఒకే చోట మీకు గుర్తు గా ఉండే చోట నోట్ చేసుకోండి.
2. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి ?:
3. స్కూల్ లోనూ , కాలేజీలో నూ ఉండే వివిధ వ్యాపకాలకు సిద్ధ పడండి ! :
మీ చదువును, కేంద్ర బిందువు గా చేసుకోండి !  
చదువు కోవడం ఎట్లా ? 11. సమయ పాలన లో మిగతా విషయాలు ! 
మరి చదువుకునేందుకు, చోటు ఎట్లా ఉండాలి ?
కలిసి చదువుకుంటే, కలిగే ( చెడు ) ప్రభావాలు ఏమిటి ? : 
చదువుకోడం ఎట్లా? 13. నోట్స్ ఎట్లా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ?
కావలసినవి : చిన్న క్లాసులలో :
పెద్ద క్లాసులు , లేదా కాలేజీ లో లెక్చర్లకు :
శ్రవణ కుమారులవ్వాలి, విద్యార్ధు  లందరూ ! :
మీదైన శైలి ని  అభివృద్ధి చేసుకోండి ! ( అదరాలి మీ స్టైల్ !  )  : 
చదువుకోవడం ఎట్లా ? 14. నోట్సు రాసుకోవడం ఎట్లా ? 
పోలికలు మంచిదే ! 
సమీక్షించడం ( రివ్యూ ) , మళ్ళీ మళ్ళీ రాసుకోవడం ! మెరుగులు దిద్దడం :
నోట్సు   తీసుకోవడం ఎప్పుడూ, ఒక పధ్ధతి గా ఎట్లా చేయాలో సులభం గా గుర్తుంచు కోవడానికి    5R లు అంటే అయిదు R లు :  Record,Reduce, Recite, Reflect, and Review  ఉపయోగ పడతాయి , విద్యార్ధి జీవితం లో !
చదవడం ఎట్లా ? 15/ 16. పాఠ్య పుస్తకాలు  సులభం గా అర్ధం చేసుకోవడం ఎట్లా ?
S Q R 4. ( R4= RRRR ) ?
చదువుకోవడం ఎట్లా ? 17. పరీక్షల ముందు ఎట్లా చదివితే  ఎక్కువ లాభం ?
మరి పరీక్షలు కొద్ది నెలలో , కొన్ని వారాలో ఉన్నప్పుడు ఎట్లా చదవాలి ?
1. పద-చిత్రాల జత : అంటే ఇమేజ్ -వర్డ్  అసోసియేషన్ : 
చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
చూడకుండా రాసి , తరువాత పోల్చడం :
కధ చెప్పడం :  అంటే స్టోరీ టెల్లింగ్ :
చదువుకోవడం ఎట్లా? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
సంక్షిప్తాక్షరాలూ , పొట్టి పదాలు :  దీనినే ఆంగ్లం లో నెమొనిక్స్ , యాక్రోనిమ్స్ అని కూడా అంటారు ! 
చదువు కోవడం ఎట్లా ? 18. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
చూడకుండా రాసి , తరువాత పోల్చడం :
కధ చెప్పడం :  అంటే స్టోరీ టెల్లింగ్ :
చదువుకోవడం ఎట్లా ? 20. మరి పరీక్ష రోజున, ఏం చేస్తే ఎక్కువ లాభం ?
1. పరీక్ష ల కోసం తీసుకునే జాగ్రత్తలు , పరీక్ష ముందు రోజు నుంచే ప్రారంభం చేయాలి , తప్పని సరిగా !  పరీక్ష ముందు రోజు రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు తప్పని సరిగా నిద్ర పోవాలి , ఎట్టి పరిస్థితి లోనూ !
చదువు కోవడం ఎట్లా ? 20. పరీక్షల ముందు ఎట్లా చదివితే ఎక్కువ లాభం ?
ఎనాలజీ లేదా సామ్యాల తో చదవడం : 
ఆంటోనిమ్స్  :
సినానిమ్స్ :
పదే పదే వల్లె వేయడం అంటే రిపిటీషన్ : 
ఏ పధ్ధతి ఉపయోగించాలి ? :
అదే విధం గా చదువులోనూ , లక్ష్యం : నేర్చుకోవడం , పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించడం  మీదనే విద్యార్ధి దృష్టి ఎప్పుడూ కేంద్రీకరించాలి ! ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి , తనకు ఏ  పధ్ధతి వీలు అయితే దానిని అనుసరించ వచ్చు !
చదువుకోవడం ఎట్లా? 22. పరీక్ష రోజున ఏం చేస్తే ఎక్కువ లాభం ?
 రాత పరికరాలు సిద్ధం చేసుకోవడం :  
ఆహారం, నీరూ :
పరీక్షా పధ్ధతి గురించి ముందే తెలుసుకోవడం :
చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి  ?
1. ప్రశ్నా పత్రం లో ఉన్న సూచనలూ , నిబంధనలూ శ్రద్ధ గా చదివి , సందేహాలుంటే , మొహమాట పడకుండా , ఇన్విజిలేటర్ ను అడగాలి !
2.  శ్వాస సహజం గా తీసుకోవడం మర్చి పోకూడదు ! :
3. పశ్నా పత్రాన్ని సర్వే చేయడం ! :
4. ప్రతి ప్రశ్ననూ, తప్పని సరిగా, విపులం గా చదవాలి :  
చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం,  ఏం చేయాలి ?
వ్యాస పధ్ధతి లో రాసే జవాబులకు :
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ , నిజం – తప్పు ( ట్రూ ,ఫాల్స్ ) ప్రశ్నల కు సమాధానాలు రాసే సమయం లో కూ
పరీక్ష హాలు లో, ఇతర విద్యార్ధులను  పట్టించు కోక పోవడం : 
చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక,  కర్తవ్యం ఏమిటి ?
గతం గతాహి :
పరీక్ష ఫలితం విఫలం అయితే, అంటే, ఫెయిల్ అవుతే ! :  ఏ మాత్రం విచారించకండి !  కొంత నిరుత్సాహం ఉండడం సహజమే ! కానీ ఆ నిరుత్సాహం, తాత్కాలికమే అవ్వాలి !  నిరాశా నిస్పృహలకు లోనవ్వ కూడదు ! 
చదువుకోవడం ఎట్లా ? 26. పరీక్షలయ్యాక కర్తవ్యం ఏమిటి ? (2)
చదువుకోవడం ఎట్లా ?27.   విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ )
మరి సహజమైన స్ట్రెస్ కూ , హాని కరమైన ( డి ) స్ట్రెస్ కూ తేడా ఎట్లా కనుక్కోవాలి ? 
ఈ రకమైన స్ట్రెస్ ను వదిలించుకోడానికి మార్గం లేదా ? 
చదువుకోవడం ఎట్లా? 28. వత్తిడి కి చికిత్స ఏమిటి? 
1. బాగా ఊపిరి తీసుకోవడం అంటే డీప్ బ్రీదింగ్ : 
మరి ఈ ఊపిరి తీసుకోవడం ఎట్లా చేయాలి ?
సీన్ మార్చడం :
ఉత్పత్తి ఎక్కువ చేయడానికి , విరామం తప్పని సరి :
చదువుకోవడం ఎట్లా?. 29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి?
1. వత్తిడి లక్షణాలు గమనించడం :  
2. చంకింగ్ chunking  తో వత్తిడి తగ్గించుకోవడం ! :
3. పనులు దాట వేయడం, అంటే వాయిదా వేయడం మానుకోవాలి :
4. వీలు కాదని చెప్ప గలగడం :  
5. ఆరోగ్యం అశ్రద్ధ చేయకూడదు : సమ తుల్యమైన  ఆహారం, వ్యాయామం , వ్యసనాలకు దూరం , దైవ ప్రార్ధన , నిద్ర. 
30. మరి, మానవ మెదడు సామర్ధ్యం  ఏమిటి? 
31. మన మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా రెండు రకాలు గా నిక్షిప్తం చేయబడి ఉంటాయి ! ఒకటి తాత్కాలిక జ్ఞాపకాలు, రెండు శాశ్వత జ్ఞాపకాలు !
1. తాత్కాలిక జ్ఞాపకాలు, దీనినే వర్కింగ్ మెమరీ లేదా, షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు , కొన్ని స్వల్పమైన తేడాలతో !  
2. శాశ్వత జ్ఞాపకం లేదా పర్మనెంట్ మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ: 
చదువుకోవడం లో, నేర్చుకోవడం లో ఏ జ్ఞాపకాలు ముఖ్యం ?: 
32. చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ?
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ : 
2. ఫోన లాజికల్ లూప్ : అంటే  శబ్ద గ్రాహక వలయం : 
3. విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ :
4.  ఎపిసోడిక్ బఫర్ :  
 సెంట్రల్ ఎగ్జిక్యూటివ్  సరిగా పనిచేయాలంటే ఏకాగ్రత అనివార్యం !
చదువుకోవడం ఎట్లా ? 33. వర్కింగ్ మెమరీ ని పెంచుకోవడం ఎట్లా ?
1. చంకింగ్: 
2. మెమరీ గేమ్స్ :
3. పలు రకాలైన  ప్రేరణ సాధన చేయడం :
4. వత్తిడి నివారణ చర్యలు పాటించడం : 
చదువుకోవడం ఎట్లా ? 34/35

1. శ్రద్ధా శ్రవణం ( యాక్టివ్ లిజనింగ్ ) :  

2. నోట్సు చదివే సమయం లో వివిధ పద్ధతులను అనుసరించడం !
3. ఫ్లాష్ కార్డులు ఉపయోగించడం : 
4. క్రమం గా చదువుకోవడం : 
5. మెదడు ఆరోగ్యం చూసుకోవాలి : 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

చదువుకోవడం ఎట్లా ?35. పునశ్చరణం , మిగతా పద్ధతులు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 26, 2013 at 7:00 సా.

చదువుకోవడం ఎట్లా ?35. పునశ్చరణం , మిగతా పద్ధతులు ! 

మునుపటి టపాలో రికాల్, అంటే పునశ్చరణం చేయడం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాం కదా ! అందులో భాగం గా  శ్రద్ధా శ్రవణం అంటే యాక్టివ్ లిజనింగ్ గురించీ తెలుసుకున్నాం కదా !  మిగతా పద్ధతులు తెలుసుకుందాం ఇప్పుడు !
2. నోట్సు చదివే సమయం లో వివిధ పద్ధతులను అనుసరించడం ! :  ఒక సారి పాఠం శ్రద్ధగా పాఠం విని రాసుకునే నోట్సు ను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే ,   ఆ పాఠం విషయాలు చాలా వరకూ గ్రహించ గలుగుతారు విద్యార్ధులు ! ఆ చదివే సమయం లో, పైకి , అంటే తమకు వినబడేట్టు చదువుకుంటే మరీ మంచిది !  ఆ రకం గా వారు ఫోనలాజికల్ లూప్ ను వారి జ్ఞాపాకాల లో ప్రవేశ పెట్టి, జ్ఞాపకాలను బలోపేతం చేయ గలుగుతారు !   అదే నోట్సు ను చదివే సమయం లో, మళ్ళీ చిత్తు,  అంటే రఫ్ నోట్ బుక్ లో రాసుకోవడం కూడా ఇంకో మంచి పధ్ధతి ! అప్పుడు కేవలం శబ్ద తరంగాల ద్వారానే కాకుండా , దృశ్య   జ్ఞాపకాల ( తమ చేతి రాత పూర్వకం గా ) తో కూడా ఆ పాఠాన్ని పదిల పరుచుకోవడం జరుగుతుంది !  ఈ రకం గా అనేక విధాలు గా ఆ పాఠాన్ని పదే , పదే , పునశ్చరణం చేసుకోవడం వల్ల , కేవలం వర్కింగ్ మెమరీ ఏ కాక శాశ్వత జ్ఞాపకాలు అంటే లాంగ్ టర్మ్ మెమరీ లో కూడా ఆ  పాఠం నిక్షిప్తమవుతుంది !  ఆ పధ్ధతి అందువల్ల విద్యార్ధులకు అనేక విధాలు గా లాభ దాయకం ! 
3. ఫ్లాష్ కార్డులు ఉపయోగించడం : ఈ పధ్ధతి ఇంకో రకం గా ఉపయోగకరం . ఈ పధ్ధతి లో విద్యార్ధి  ఒక పాఠానికి సంబంధించిన ముఖ్య విషయాలు, ఒక పది పదిహేను చిన్న పేక  ముక్కల సైజు లో  ఉన్న  దళసరి , లేదా మందమైన కార్డుల మీద  రాసుకుంటాడు  !   రాసుకునే సమయం లో కొన్ని చిత్ర రూపం లోనూ , ముఖ్య మైన పదాల రూపం లోనూ , అంకెల రూపం లోనూ కూడా ఆ పాఠం  విషయాలను , తాను గుర్తు ఉంచుకునే రీతిలో రాసుకోవడం , తయారు చేసుకోవడం జరుగుతుంది !  ఇక ఆ కార్డు లకు రెండో వైపున ,  మొదటి వైపు న రాసుకున్న విషయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా రాసుకోవడం జరుగుతుంది !  అంటే కార్డు కు ఒక ప్రక్క ప్రశ్నలూ , రెండో ప్రక్క ఆ ప్రశ్న కు సంబంధించిన సమాధానమూ ఉంటాయి ! నేర్చుకునే సమయం లో , కార్డు మీద ఉన్న ప్రశ్న చూసి , ఆ కార్డు ను రెండో ప్రక్కకు తిప్పకుండానే , సమాధానాన్ని పైకి చెప్పడానికి ప్రయత్నించడమో , లేదా సమయం ఉంటే , చిత్తు పుస్తకం లేదా రఫ్ బుక్ లో రాయడానికి ప్రయత్నించాలి !  సమాధానం చూడడానికి ఆతృత పడకుండా !  ఇట్లా ఫ్లాష్ కార్డ్ లను ఉపయోగించి సమాధానాలు నేర్చుకోవడం ఒక మంచి పధ్ధతి !  బాగా సాధన చేస్తూ , ఆ కార్డ్ ల వరుసను తరచూ , పేక ముక్కలను కలిపినట్టు కలిపి , మళ్ళీ ఆ ప్రశ్న లకు జవాబులు ( రెండో వైపు చూడకుండానే ) చెప్పడానికి ప్రయత్నించాలి , ఆ సమాధానం నేర్చుకునే వరకూ ! 
4. క్రమం గా చదువుకోవడం : ఇది కూడా చాలా ముఖ్యమైన కిటుకు !  అంటే,  రోజూ చదువుకోవాలి !  వారం రోజులలో, ఐదు రోజులు రోజుకు రెండు గంటల చొప్పున చదివితే వంట బట్టే విషయాలు ,మెదడులో వాటి జ్ఞాపకాలు , రెండు రోజులు మాత్రమే , రోజుకు ఐదు గంటల చొప్పున చదివితే, మెదడు లో నిక్షిప్తమయే విషయాల క్వాలిటీ కన్నా ఎంతో మెరుగు గా ఉంటుంది !  రెండు రకాలు గా చదవడం లోనూ విద్యార్ధి పది గంటల సమయమూ వెచ్చిస్తూ ఉన్నా కూడా ! 
5. మెదడు ఆరోగ్యం చూసుకోవాలి : కంప్యూటర్ అయితే , చాలా వేడెక్కితే ,  అవక తవక గా పనిచేస్తుందో , అదే రకం గా మానవ మెదడు కూడా , సరి అయిన నిద్ర లేకుండా , లేదా సరైన ఆహారం లేకుండా  ఉంటే , అది చేసే పని క్వాలిటీ తగ్గి పోతుంది !  ఇంకో గమనిక : మన మెదడు మన శరీరం బరువులో యాభై లేదా అరవయ్యో వంతు ఉన్నా కూడా , తీక్షణం గా ఆలోచిస్తూ , చదువుకుంటూ ఉంటే ,   మనకు రోజూ అవసరం అయే క్యాలరీలలో నాలుగో వంతు అవసరం  ఉంటుంది , మన మెదడుకు !  అందువలన , సమతుల్యాహారం తీసుకుంటూ  మెదడుకు అందే ఆక్సిజన్ తో పాటుగా ,  ఒక క్రమ పధ్ధతి లో క్యాలరీలు కూడా, అంటే గ్లూకోజు తయారవడానికి అవసరమయే ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి !  జంక్ ఫుడ్ తింటూ ఉంటే , ఒక్క సారిగా శరీరం లో గ్లూకోజు ఎక్కువ అవడమూ , ఆ తరువాత ఒక్క సారిగా తగ్గి పోవడమూ కూడా జరుగుతూ ఉంటుంది ! ఒక  తాజా వార్త ప్రకారం , మెక్డోనాల్డ్  రెస్టారెంట్ యాజమాన్యం , వారి ఉద్యోగులనే , మెక్డోనాల్డ్స్ లో  జంక్ ఫుడ్ తినకండి అని హెచ్చరించింది ! సమ తుల్యమైన ఆహారం అంటే ,  పిండి పదార్ధాలు , ప్రోటీనులు , నూనె పదార్ధాలన్నీ సమ పాళ్ళ లో తినడమే కాకుండా , మెదడు లో నాడీ కణాలు  శక్తి వంతం గా పని చేయడానికి అవసరమయే విటమిన్లూ , ఖనిజాలూ ఉన్న ఆహారాన్ని కూడా  తగినంత తింటూ ఉండడం ఉత్తమం ! విటమిన్ లోపం వల్ల ,ఖనిజాల లోపం వల్ల , జ్ఞాపక శక్తి బలహీన మవుతుందని , ఇప్పటికే కొన్ని వందల పరిశోధనలు ,  ఏ సందేహమూ లేకుండా  నిర్ధారించాయి ! 
వచ్చే టపాలోఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా? 34. పునశ్చరణం, విద్యార్ధులకు ఎందుకు లాభదాయకం ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 25, 2013 at 3:59 సా.

చదువుకోవడం ఎట్లా? 34.పునశ్చరణం విద్యార్ధులకు ఎందుకు లాభదాయకం ? 

మునుపటి టపాలలో ,  మన మెదడులో జ్ఞాపకాలు ఎన్ని రకాలు గా నిక్షిప్తమవుతాయో , అట్లాగే వర్కింగ్ మెమరీ ఎట్లా పని చేస్తుందో ,  మనం వర్కింగ్ మెమరీ ని ఎట్లా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ! మరి ఈ వర్కింగ్ మెమరీ సరిగా పనిచేయడానికీ , తద్వారా శాశ్వత మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ బాగా ఉండడానికీ అంటే బాగా పనిచేయడానికీ , పునశ్చరణం, అంటే రికాల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం ఇప్పుడు ! 
1. శ్రద్ధా శ్రవణం ( యాక్టివ్ లిజనింగ్ ) :  ఈ పదం కొత్తగా ఉన్నా , ఎంతో ముఖ్యమైన పదం !  శ్రద్ధా శ్రవణం అంటే, శ్రద్ధ తో వినడం అని ! ఆంగ్లం లో యాక్టివ్ లిజనింగ్ అని అంటారు !  పునశ్చరణం మొదలయ్యేది , చెప్పే పాఠాలు వినడం తోనే ! విద్యార్ధులు , తమకు చెప్పే పాఠం వినే సమయం లో, ఏకాగ్రత,  ప్రధానం గా ఆ పాఠం వినడానికే ఉపయోగించాలి !  క్రితం టపాలలో చూశాము, మన వర్కింగ్ మెమరీ లో ఫోనలాజికల్ లూప్ అని  ఒక దశ ఉంటుందని , అంటే  శబ్ద గ్రాహక వలయం !  ఈ శబ్ద గ్రాహక వలయం మెదడు లో తన పని తాను చేసుకుంటూ పోతుంది ! అంటే, మనం విన్న శబ్దాలనూ , మాటలనూ , గ్రహించి , సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కు సంధానం చేస్తుంది , ఆ వివరాలను !  వినే సమయం లో ఏకాగ్రత లోపించి వింటే , గ్రహించే శబ్దాలు , పదాలు కూడా అసంపూర్ణం గా గ్రహించ బడి , మెదడు లో చెరగని ముద్రలు వేయక , పై పైన మాత్రమే , లీల గా  తమ ముద్రలు వేస్తాయి !  విద్యార్ధులు , పాఠాలు అర్ధం చేసుకోలేక పోవడానికి ఇది ఒక కారణం !  ఏకాగ్రత తో వింటూ , తదనుగుణం గా నోట్సు తీసుకుంటూ ఉంటే , విద్యార్ధులు  తాము గ్రహించిన విషయాలను అక్కడే ‘ జల్లెడ ‘ పట్టి , నోట్సు ను తయారు చేసుకో గలుగుతారు !  ఇట్లా శ్రద్ధగా వినడం , నోట్సు తీసుకోవడం అలవాటు చేసుకున్న వారు ,  విషయాలను గ్రహించి , అర్ధం చేసుకోడానికి ,  ఆ విషయాలను లోతు గా పరిశీలిస్తారు కూడా !   అందుకే , ‘ శ్రద్ధ గా ‘ క్రియాశీలం గా, అంటే యాక్టివ్ గా  వినడం, పునశ్చరణం లో ఎంతో ముఖ్యమైన భాగం ! ఇట్లా నోట్సు రాసుకునే సమయం లో విద్యార్ధుల సునిశితమైన జ్ఞాపక శక్తి ఇంకా వృద్ధి కావాలంటే , ఆ పాఠం వింటున్నప్పుడు , వాతావరణం ఎట్లా ఉందో , ఆ రోజు తాము, ఉదయం ఏమి తిన్నారో , లేదా ఆ పాఠం చెప్పే టీచర్ ఏ డ్రస్ లో ఉందో , లేదా ఉన్నాడో, కూడా నోట్సు లో రాసుకోవచ్చు !  జ్ఞాపక శక్తి వృద్ధి చేసుకోవడం లో వివిధ రకాల ప్రేరణలను అనుసంధానం చేసుకోవడం కూడా ఒక ముఖ్యమైన దశ  ! 
ఉదాహరణ :   రమేష్ కాలేజీ విద్యార్ధి !  చలాకీ గా ఉంటాడు ! తెలివైన వాడు కూడా !  అందుకే , ఈసెట్  మంచి ర్యాంక్ తెచ్చుకుని  ఇంజనీరింగ్ కాలేజీ లో చేరాడు ! మొదటి రెండు సంవత్సరాలూ , చదువు ను అశ్రద్ధ చేశాడు !  పాఠాలు వినే వాడు కాదు !   చేరిన రోజే,  చూపులతో పరిచయం అయిన  రమ  ను  చదవడం లో బిజీ అయ్యాడు ! కాలేజీ ఫ్రెషర్స్ డే నాడు ఆమె  వేసుకున్న జీన్స్ టీషర్ట్ రంగులూ , ఆమె పాద రక్షలూ , ఆమె లిప్ గ్లాస్ సువాసనలూ , పర్ఫ్యూమ్  సువాసనా ,  అదే సమయం లో వింటున్న పాటా ,  బ్రేక్ టైం లో తిన్న స్నాక్సూ , అన్నీ  అనేకమైన ముద్రలు వేశాయి , రమేష్ మనసులో , ఆ ముద్రలు, చెరగని ముద్రలు ! రమ, రమేష్ కు పాఠా లెవీ చెప్పేది కాదు ! కానీ  రమ , రమేష్ మనసులో ఓ దృశ్య కావ్యం !  ఆమె, రమేష్ మనో  నోట్ బుక్ లో, రోజు కో అధ్యాయం !  తెల్లటి సల్వార్ కమీజ్ లో మంచు లా మెరిసి పోతున్నా , అతని మదిలో వెచ్చని భావాలే !  ఆమె  చిలిపి కళ్ళు , తనవైపు చూసినా , తను స్పేస్ లో నడుస్తూ ఉన్నట్టు  అనుభూతి ! ఆమె తనతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా కంఠతా వచ్చు రమేష్ కు ! తనకు ఆమె తెలిపిన అభినందనలూ , కృతజ్ఞతలూ అయితే ,  కలలో కూడా వల్లె వేస్తుంటాడు రమేష్ !  ఆమె చిరునవ్వు ఫ్లాష్ ఫోటోలు, ఓక వెయ్యి ఉన్నాయి రమేష్  బ్రెయిన్ బాక్స్ లో ! రమేష్ చదువులో వెనక బడుతున్నాడు !  చదువు నిర్లక్ష్యం చేసి , రమ వెనక బడుతున్నాడు ! చెప్పే పాఠాలు గుర్తు ఉండడం లేదు !  మనసులో అన్నీ రమ గుర్తులే !  రమ గుర్తులు , కేవలం ఆమె ధరించే దుస్తులతోనే కాకుండా , ఆమె వాడే పర్ఫ్యూమ్ , మాట్లాడే మాటల తీరూ , ఇన్ని రకాలు గా వివిధ ప్రేరణలు ,  రమేష్ ప్రేమకు ప్రేరణ అవుతున్నాయి !  అతడి మెదడు లో అందమైన జ్ఞాపకాలకు ప్రేరణ అవుతున్నాయి ! కానీ అతనికి చదువు దూరం అవడానికి కూడా ఆ గుర్తులు కారణ మవుతున్నాయి ! 
విశ్లేషణ : అంటే రమేష్  ప్రాధాన్యతలలో, చదువు రెండో ప్రాధాన్యత అయింది ! రమ, రమేష్ మనసులో చదువును స్థాన భ్రంశం చేసింది !  ఇట్లా చాలా మంది యువకుల్లో , యువతులలో  జరిగే సామాన్యమైన సంఘటనే కదా !  కానీ రమేష్ కు చదువులో వెనక బడడానికి , కారణం , అతనికి చెప్పే పాఠాల మీద ఏకాగ్రత లోపించింది ! అంటే శ్రద్ధగా వినలేక పోవడం జరిగింది ! పర్యవసానం గా పాఠాలు అర్ధం అవడం జటిలమయింది ! గమనించ వలసినది,  తన జీవితం లో కి ఆహ్వానించ బడుతున్న రమ విషయం లో , రమకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలూ  , కలలో కూడా గుర్తు కు తెచ్చుకుంటూ , పునశ్చరణం చేసుకుంటున్న రమేష్ కు జ్ఞాపక శక్తి లో ఏమాత్రం లోపం లేదు ! రమ గురించిన అన్ని వివరాలూ నిక్షేపం గా రమేష్ మెదడు లో ఉండడమే కాకుండా , రమేష్ కు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు గుర్తుకు వస్తాయి , ఏ లోపమూ లేకుండా ! కేవలం  ఇది రమేష్ తీసుకున్న నిర్ణయం !  శ్రద్ధా శ్రవణానికి  ప్రాధాన్యత ఇవ్వక పోవడం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 33. వర్కింగ్ మెమరీ ని పెంచుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 24, 2013 at 1:01 సా.

చదువుకోవడం ఎట్లా ? 33. వర్కింగ్ మెమరీ ని పెంచుకోవడం ఎట్లా ?

 
మునుపటి టపాలో , జ్ఞాపకాన్ని ఎక్కువ చేసుకోవడం ఎట్లాగో తెలుసుకుంటూ , వర్కింగ్ మెమరీ, మన మెదడులో ఎట్లా పని చేస్తుందో తెలుసుకున్నాం కదా ! మరి  ఈ వర్కింగ్ మెమరీ ని ఎక్కువ చేసుకోవడం , దానిని చదువుకోవడం లో ఉపయోగించుకోవడం ఎట్లా ? ఈ వర్కింగ్ మెమరీ మెదడు లో ఉన్నా , ఒక పధ్ధతి లో  జ్ఞాపకాలను గ్రహించడం , మెదడులో పదిల పరుచుకోవడం అలవాటు చేసుకుంటే ,  పది కాలాల పాటు అవి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి ! ఈ క్రింది పద్ధతులలో వర్కింగ్ మెమరీని పెంచుకోవచ్చు !
1. చంకింగ్: ఈ చంకింగ్ గురించి వివరం గా మునుపటి టపా లలో తెలియ చేయడం జరిగింది !  ఆసక్తి ఉన్న వారు , చదవ వచ్చు ! 
2. మెమరీ గేమ్స్ : ఈ మెమరీ గేమ్స్ ఆడడానికి అంతర్జాలాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు ! ఈ ఆటలు ఆడితే , ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ను ఏ రకం గా  ప్రాసెస్ చేయవచ్చో తెలుసుకోవచ్చు అంటే మన మెదడు ను అందుకు సిద్ధం చేయవచ్చు ! ఈ రకమైన ఆటలు ఆడి , అవి ఆడుతున్న వారు నిరాశ చెంద కూడదు ! కేవలం ఆ ఆటలు మెదడు ను పదును పెట్టడానికే అని గుర్తు ఉంచుకోవాలి ! ఆ విషయం మర్చి పోకూడదు ! అనేక మైన గేమ్స్ ఉచితం గా అందుబాటు లో ఉన్నాయి అంతర్జాలం లో !  ఈ ఆటలు , పదాలనూ , అంకెలనూ , వ్యాకరణాన్నీ  ఆధారం చేసుకుని ఆడేవి కొన్నీ , లేదా స్థలాలనూ , మనుషుల పేర్లనూ ఆధారం చేసుకుని ఆడేవీ కూడా ఉన్నాయి ! ఉదా: www .mindgames .com . ఇట్లాంటి ఆటలు తరచూ ఆడుతూ ఉండడం వల్ల , మెదడు వివిధ రకాల ఇన్ఫర్మేషన్ ను వెంట వెంటనే గ్రహిస్తూ , సరి అయిన నిర్ణయాలు, సరి అయిన సమయం లో తీసుకునే అలవాటు చేసుకుంటుంది ! దానితో స్థబ్దత  ఉండదు మెదడు కూ , మెదడు లోని నాడీ కణాలకూ ! 
3. పలు రకాలైన  ప్రేరణ సాధన చేయడం : మెదడు ప్రేరణ చెందేది , అనేక రకాలైన  ఇంద్రియ జ్ఞానం వల్ల ! కేవలం మనం ఒక దృశ్యాన్ని చూస్తేనే ప్రేరణ పొందము కదా !  మిగతా ఇంద్రియాలు అనేక విషయాలను గ్రహిస్తూ , ప్రేరణ పొందుతూ ఉంటాయి కదా ! అంటే ఒక మంచి సంగీతం వినపడినప్పుడూ ,  లేదా ఒక రుచికరమైన వంటకం వాసన చూడడం తో పాటుగా , తింటూ రుచి ని ఆస్వాదిస్తున్నప్పుడు కూడా ! అందుకని , మన మెదడును తరచూ , రక రకాలైన ప్రేరణ లను గ్రహించే విధం గా మలచుకోవాలి !  పది మంది స్నేహితులతోనో , బంధువులతోనో కలిసి , సంభాషణలు జరుపుతూ సమయం గడపడం కూడా ఒక విలువైన ప్రేరణ ! ఈ రకమైన ప్రేరణ లన్నిటి వల్లా , వర్కింగ్ మెమరీ ఎంతో చురుకు గా తయారవుతుంది ! 
4. వత్తిడి నివారణ చర్యలు పాటించడం : క్రితం టపా లో చూశాము కదా , మన మెదడు లో వర్కింగ్ మెమరీ అనేక దశలు గా ఎట్లా ఉంటుందో !  ఈ వివిధ దశలన్నీ కూడా  వత్తిడి కి తట్టుకోలేవు !  అంటే మనసు లో ఉండే వత్తిడి మెదడు లో కూడా ఏర్పడుతుంది ! వత్తిడి అనే పదం మనం చాలా సామాన్యం గా చెప్పు కుంటున్న ప్పటికీ , వత్తిడి అనుభవించే వారి మెదడులో కొన్ని జీవ రసాయన చర్యలు జరుగుతూ , ఆ చర్యలు , వర్కింగ్ మెమరీ లో వివిధ దశలకు అవరోధాలు కలిగిస్తూ ఉంటాయి ! అందుకే , తీవ్రమైన వత్తిడి తో ఉన్న సమయాలలో , అంతకు ముందు తెలుసుకున్న అనేక విషయాలు కూడా వెంటనే స్ఫురణ కు రావు ! దానితో సమయం మించి పోయి , విద్యార్ధులు , పరీక్షా పత్రం లో అడిగిన ప్రశ్నలకు జవాబులు సరిగా రాయలేక పోతారు ! అది విద్యార్ధులలో చాలా సామాన్యం గా జరుగుతూ ఉంటుంది ! అందుకే , నేర్చుకునే సమయం లో హాని కరమైన వత్తిడి అంటే ‘ డి స్ట్రెస్ ‘ లేకుండా స్థిరమైన ఏకాగ్రత తో నేర్చుకుంటే , వర్కింగ్ మెమరీ మాత్రమే కాక , శాశ్వత జ్ఞాపకాలు అంటే లాంగ్ టర్మ్ మెమరీ కూడా  బలం గా ఉంటుంది ! ( ఈ వత్తిడి నివారణ చర్యలు కూడా మునుపటి టపాలలో వివరించడం జరిగింది , పరిశీలించవచ్చు , ఆసక్తి ఉన్న వారు ).
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 22, 2013 at 12:39 సా.

చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ? 

 
 
మునుపటి టపాలో చూశాము , మానవ మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా,  షార్ట్ టర్మ్ మెమరీ లేదా తాత్కాలిక జ్ఞాపకాలు గానూ , పర్మెనెంట్ లేదా శాశ్వత జ్ఞాపకాల గానూ  అమరి ఉంటాయో ! మనం శాశ్వత మెమరీ  అరలలోకి జ్ఞాపకాలను పదిలం గా అమర్చుకోవాలంటే ,  ముందుగా తాత్కాలిక జ్ఞాపకాలు , లేదా వర్కింగ్ మెమరీ మీద దృష్టి సారించాలి ! అంటే  వర్కింగ్ మెమరీ ని వృద్ధి చేసుకోవడం ఎట్లాగో తెలుసుకుని ,  మనం నేర్చుకునే విషయాలను  ఈ వర్కింగ్ మెమరీ లో నిక్షిప్తం చేసుకునే పధ్ధతి ని అనుసరించాలి ! ఈ వర్కింగ్ మెమరీ కధా కమామీషు ఇప్పుడు తెలుసుకుందాం !  పైన ఉన్న చిత్రం ,మానవ మెదడు లో , వర్కింగ్ మెమరీ ఎట్లా పని చేసే విధానాన్ని చక్కగా వివరిస్తుంది ! 
ఒక్కొక్క భాగాన్నీ పరిశీలిద్దాం : 
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ :  చిత్రం లో ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ చూప బడింది. కానీ మెదడు లో  అట్లాగే ఒక బాక్స్ లా ఉండదు కదా ! కేవలం మనం గ్రహిస్తున్న విషయాలనన్నింటినీ , అనుసంధానం అంటే లింక్ చేస్తూ , పై ఎత్తున పరిస్థిని పరిశీలిస్తూ ఉంటుంది ! అంటే ఒక రకం గా సూపర్విజన్ అనుకోవచ్చు ! 
2. ఫోన లాజికల్ లూప్ : అంటే  శబ్ద గ్రాహక వలయం : అంటే,మనం,  ఏ విషయాన్నైనా చూస్తున్నప్పుడు , కేవలం ఆ విషయం గురించిన చిత్ర వివరాలు మాత్రమే కాక , ఆ సందర్భం లో మనకు వినబడే శబ్దాలను కూడా మన చెవులు గ్రహిస్తాయి !  ఈ వినడం అనే పని చేయడానికి , మనం ప్రత్యేకం గా  ఏమీ చేయక్కర్లేదు మన చెవులు అనేక రకాల శబ్దాలను వింటూనే ఉంటాయి కదా !   ఉదాహరణకు , మీరు టీవీ లో ఒక కార్యక్రమం శ్రద్ధగా చూస్తున్నప్పుడు , ఆ కార్యక్రమం లో పాత్రల సంభాషణ మాత్రమే కేంద్రీకరించ గలుగుతారు , మిగతా కుటుంబ సభ్యులు మీతోనే మాట్లాడుతున్నా , మీ దృష్టి , అంటే మీ సెంట్రల్ ఎగ్జిక్యుటివ్  ఆ శబ్దాల మీద కాక టీవీ లో పాత్రల సంభాషణలు మాత్రమే కేంద్రీకరించి వింటూ ఉండడం వల్ల !  అంతే కాకుండా , తక్కువ పవర్ కలిగిన కంప్యూటర్ లలో  మీరు పాటలు వింటూ , ఇంకో సైటు లోకి వెళ్దామని ప్రయత్నిస్తే , కంప్యూటర్ స్లో అయిపోతుంది ! అట్లాగే , రెండు , లేదా మూడు ప్రదేశాలనుంచి వచ్చే శబ్దాలను , మన మెదడు కూడా ఏక కాలం లో పూర్తి గా గ్రహించ లేదు ! 
3. విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ : మన మెదడు లోనే , ఇంకో చిత్తు పుస్తకం కూడా ఉంటుంది ! అంటే పుస్తకం కాదు , చిత్తు పుస్తకం లో మనం రాసుకునే పదాల లానూ , లేదా గీసుకునే చిత్రాల నూ ఒక చోట ఉంచే అమరిక ! ఉదాహరణకు , కంప్యూటర్ లో స్కెచ్ ప్యాడ్ లో మనం రాసుకోవచ్చు , గీసుకోవచ్చు కానీ , ఒక పేజీ లా ఆ గీసిన గీతలనూ , రాసిన మాటలనూ , కంప్యూటర్ నుంచే తీసుకోలేము కదా !  ఆ పనికి , మళ్ళీ కంప్యూటర్ ను ప్రింటర్ తో అనుసంధానం లేదా లింక్ చేస్తేనే కదా అవి ప్రింటు రూపం లో మనం చూడ గలిగేది ! అదే విధం గా , మనం చూసే దృశ్యం వివరాలను , అదే రూపం లో అంటే 3D రూపం లో కూడా మన మెదడు లోని విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ లో నిక్షిప్తం అయి ఉంటుంది ! ఇంకో ఉదాహరణ: మన ఇళ్ళలో లేదా , స్కూల్ కాలేజీ లలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అంటే ఒక రూం లోనుంచి , ఇంకో రూం లోకి వెళ్ళే సమయం లో మనం మన మెదడు లో ఉన్న ఈ ‘ విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ ‘ ఆధారం గానే అడుగులు వేస్తాము ! 
4.  ఎపిసోడిక్ బఫర్ :  ఈ దశలో , మన మెదడు విన్న శబ్దాలనూ , చూసిన దృశ్యాలనూ  , కలగలిపే దశ !   అంటే మనం , ఫలానా రోజున , ఫలానా చోట , ఫలానా విషయాలు వింటూ , ఫలానా దృశ్యాలు కూడా అదే సమయం లో చూశాము అని గుర్తు చేసుకోవడడానికి , ఈ ఎపిసోడిక్ బఫర్ కారణం ! గమనించ వలసినది , పైన చెప్పుకున్న వాటిలో , 2,3,4   – ఇవన్నీ కూడా , 1 తో అంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ తో అనుసంధానం అయి ఉంటాయి !  అంటే ఈ 1 కనుక మనం ఎప్పటికప్పుడు వివిధ ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలను , సమగ్రం గా విశ్లేషించి , అవసరమైనవి ఉంచుకోవడం , అనవసరమైనవి వదిలేయడం చేయకపోతే , జ్ఞాపకాలు ,  కలకాలం ఉండలేవు ! 
పైన వివరించిన విషయాలు మరి విద్యార్ధికి ఏ రకం గా ప్రయోజన కరం ? : 
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్  సరిగా పనిచేయాలంటే ఏకాగ్రత అనివార్యం ! 
2. ఫోనలాజికల్ లూప్ క్రియా శీలం కావాలంటే , చెప్పే విషయాలను కేవలం చెవులప్పగించి వినడమే కాకుండా , మనసు కూడా లగ్నం చేసి , ఏకాగ్రత తో వింటే ,  ఆ జ్ఞాపకం ఎక్కువ కాలం మెదడు లో ఉంటుంది ! అంతే కాకుండా  తెలుసుకున్న విషయాలను పదే పదే  వల్లె వేస్తూ ఉంటే కూడా జ్ఞాపకాలు మెదడులో కేవలం దృశ్య జ్ఞాపకాలు గానే కాకుండా , శబ్ద జ్ఞాపకాలు గా కూడా మెదడు లో నిక్షిప్తం అవుతాయి ! అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు ‘ పైకి చదువు ‘ పైకి చదువు ‘ వినబడేట్టు చదువు , బాగా వస్తుంది చదువు ‘అంటూ ఉంటారు !  
3. విజయో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ కూడా :  మనం నేర్చుకునే విషయాలు , వాక్యాల రూపం లో కానీ , లేదా ఒక నమూనా చిత్రం రూపం లో కానీ ఉంటే , ఆ చిత్రం మనసులో అంటే మెదడులో చెరిగి పోకుండా ముద్ర వేసుకుంటుంది ! ఉదాహరణకు పైన ఉన్న చిత్రాన్ని , ఆ చిత్రం లేకుండా కేవలం , ఆ చిత్రం క్రింద ఇచ్చిన వివరణ మాత్రమే చదివి అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తే , జటిలం అవుతుంది కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా? 31.జ్ఞాపకాల రకాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 20, 2013 at 8:40 సా.

చదువుకోవడం ఎట్లా? 31.జ్ఞాపకాల రకాలు ! 

చదువు కోవడం లో,  మన జ్ఞాపక శక్తి కీలక మైన పాత్ర పోషిస్తుంది !  జ్ఞాపక శక్తి లోపిస్తే , ఒక పెద్ద పీపాలో , అడుగున  పెద్ద రంధ్రం ఉన్నా కూడా ,నీటితో పీపాను నింపడానికి చేసే ప్రయత్నం లాంటిది ,  మెదడులో విజ్ఞాన విషయాలు నింపుదామని ప్రయత్నించడం ! మునుపటి టపాలో సూచించినట్టు , జ్ఞాపక శక్తి కి అవసరమైన ఒక బిలియన్ నాడీ కణాలు అందరి మెదడు ల లోనూ ఉంటాయి ! ఇక  చేయవలసిందల్లా ,  ఆ నాడీ కణాలలో , జ్ఞాపకాల గుర్తులను ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే ! అంతే కాకుండా , ఒక గ్రామఫోను రికార్డు లోశబ్ద తరంగాలు నిక్షిప్తం అయి ఉంటే ,  ఆ రికార్డు లను,  ఒక నిర్ణీత సమయం లో , ఎట్లా ప్రత్యేక మైన రసాయన పదార్ధాలతో శుభ్రం చేయడం అతి ముఖ్యమైన చర్యో , అదే రకం గా , మెదడు లో ఏర్పడిన జ్ఞాపకాలను కూడా , ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే కాకుండా , నిర్ణీత సమయాలలో , ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం , అట్లా గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి లో జ్ఞాపకాలను పదిల పరచుకోవడం కూడా  ఒక కీలకమైన చర్య ! ఆ పని ఎట్లా చేసుకోవాలో తెలుసుకునే ముందు , జ్ఞాపక శక్తి గురించి కొంత తెలుసుకోవడం ముఖ్యం ! 
మన మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా రెండు రకాలు గా నిక్షిప్తం చేయబడి ఉంటాయి ! ఒకటి తాత్కాలిక జ్ఞాపకాలు, రెండు శాశ్వత జ్ఞాపకాలు !
1. తాత్కాలిక జ్ఞాపకాలు, దీనినే వర్కింగ్ మెమరీ లేదా, షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు , కొన్ని స్వల్పమైన తేడాలతో !  ఈ తాత్కాలిక లేదా వర్కింగ్ మెమరీ , మనం నేర్చుకునే ప్రతి విషయం లోనూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది !   ఈ వర్కింగ్ మెమరీకి ,మనకు ఉన్న అన్ని ఇంద్రియాలూ తోడ్పడతాయి ! అంటే మన కళ్ళూ , చెవులూ ,స్పర్శా , ఇంకా మన నాసికాలూ ( అంటే ఆఘ్రాణించే శక్తి – అది కూడా ఒక ఇంద్రియమే కదా ! )  ఈ ఇంద్రియాలు మనం నేర్చుకునే సమయం లో, ఆ నేర్చుకునే విషయాలను అతి జాగ్రత్తగా , మెదడు లోని ‘ అరలలో ‘ పదిల పరచడానికి పనికి వస్తాయి ! ఉదాహరణకు , మీరు మీ స్నేహితుల టెలిఫోన్ నంబర్ అడిగితే , వారు చెబుతున్నప్పుడు ,  మీరు జ్ఞాపకం ఉంచుకునేదే వర్కింగ్ మెమరీ  !   ఆ నంబర్ కనుక యదాలాపం గా , అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా , కనుక నేర్చుకుంటే ,  కొద్ది క్షణాలలోనే మర్చిపోవడం జరుగుతుంది ! అదే, కొంత మంది , పని కట్టుకుని , ఆ ! ఆ ! ఏమన్నారూ? , 89735614   89 తరువాత 73 అన్నారా ?  83 73 తరువాత ఏమిటి 5614 కదా ?  ఓహో ! నేను ఇప్పుడు నంబర్ పూర్తి గా చెబుతాను సరిచేయండి ! 89735614 ! అదేనా? ! అని, అనేక సార్లు,  ఆ నంబర్ ను తరచి తరచి అడుగుతూ , నోట్ చేసుకుంటే , ఆ జ్ఞాపకం బలం గా మెదడు లో నిక్షిప్తం అవుతుంది !  దానిని నోట్ కూడా చేసుకుని , మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే , ఆ జ్ఞాపకం , శాశ్వత జ్ఞాపకం అవుతుంది ! 
2. శాశ్వత జ్ఞాపకం లేదా పర్మనెంట్ మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ: ఈ రకమైన జ్ఞాపకాలు శాశ్వతం గా మెదడులో నిక్షిప్తం అయిపోతాయి ! నిజానికి ఈ శాశ్వత మెమరీ , లేదా పర్మనెంట్ మెమరీ లో జ్ఞాపకాలు , మొదట తాత్కాలికం గా మెదడు లో  నిక్షిప్తం చేయబడినవే ! వాటినే తరచుగా మననం చేసుకుంటూ ఉంటే , అవి శాశ్వత ప్రాతిపదికన మెదడు లో నిక్షిప్తం అవుతాయి !  
చదువుకోవడం లో, నేర్చుకోవడం లో ఏ జ్ఞాపకాలు ముఖ్యం ?:  చదువుకోవడం , జ్ఞానం సంపాదించడం అనే విషయాలు అనంతమైనవే కాకుండా , అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి ! అంటే  ప్రతి సబ్జెక్ట్ లోనూ , ( నేర్చుకునే ) ప్రతి విషయమూ కూడా ఇతర విషయాలతో ముడి పడి ఉంటుంది !    ఈ విషయం మనసులో ఉంచుకుని , నేర్చుకునే వారికి , జ్ఞాన సముపార్జన సులభం అవుతుంది ! నేర్చుకోవడం లో ఈ రెండు రకాల జ్ఞాపకాలూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ! పరీక్షల కోసం చదివే చదువులు, కేవలం తాత్కాలికం గానే  మెదడు లో నిక్షిప్తం అయి , విద్యార్ధి కి సమస్యలు సృష్టిస్తాయి !    అందుకే , ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం చదువుతున్నా , ఏ విషయం నేర్చుకుంటున్నా , మూల సూత్రాలు నేర్చుకోవాలి ,  అని ప్రతి ఉపాధ్యాయుడూ చెబుతూ ఉంటారు ! అంటే కాన్సెప్ట్ లు  నేర్చుకోవడం ! ఈ మూల సూత్రాలు కనుక నేర్చుకుంటే, అవి శాశ్వతం గా మెదడు లో నిక్షిప్తం అయి ముందు ముందు కూడా పనికి వస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ?.30. మట్టి బుర్రలు ఉంటాయా?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 17, 2013 at 9:05 సా.

చదువుకోవడం ఎట్లా ?.30. మట్టి బుర్రలు ఉంటాయా? 

 
సామాన్యం గా, చదివినది అర్ధం చేసుకోలేని వారిని ‘ నీది  మట్టి బుర్ర ‘ అని ఉపాధ్యాయులు తిడుతూ ఉంటారు !  ‘ తిట్టడం’  అని ఎందుకు అనడం అంటే , ఉపాధ్యాయులకు , బుర్ర సంగతి తెలియదు కాబట్టి ! మరి, నిజం గానే మనుషులకు మట్టి బుర్రలు ఉంటాయా ?  మనం నేర్చుకోలేని విషయాలకూ  , జ్ఞాపకం ఉంచుకోలేని విషయాలకూ  మన మెదడు ను  తప్పు పడదామా ?  మెదడు చిన్నదనే వంక పెట్టి , చదువు కోవడం మానేద్దామా ? దీనికి సమాధానం: కాదు , కాదు , కాదు ! శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , అనేక  మైన విషయాల మీద,సూక్ష్మాతి సూక్ష్మమైన  భాగాల నిర్మాణాన్ని , నాడీ కణాల ధర్మాలనూ ,  కూడా, అతి విపులం గా   చిత్రాల ద్వారా నూ , ఫోటోల ద్వారానూ వివరించ  గలుగుతున్నారు శాస్త్రజ్ఞులు ! ప్రత్యేకించి , మెదడు లో నాడీ కణాల రకాలూ , అవి పని చేసే తీరూ కూడా, మానవులు, నేర్చుకునే సమయం లోనూ , గుర్తు చేసుకునే సమయం లోనూ , ఏరకమైన మార్పులు చెందుతాయో , ఆ  నాడీ కణాల మధ్య ఏ యే జీవ రసాయన చర్యలు జరిగి ,  ఆ మార్పులు, జ్ఞాపకాలు గా, ఎట్లా మారుతాయో కూడా చాలా వరకూ తెలుసుకోగలిగారు, శాస్త్రజ్ఞులు ! 
మరి, మానవ మెదడు సామర్ధ్యం  ఏమిటి? :
మానవ మస్తిష్కం లో, ఒక  బిలియన్ నాడీ కణాలు ఉన్నాయి !  ప్రతి ఒక్క కణమూ , కనీసం, ఒక వెయ్యి కనెక్షన్ లు కలిగి ఉంటుంది !  అంటే  ఒక బిలియన్ కణాలు ( ఒక్కో కణం వెయ్యి కనెక్షన్ లు కాబట్టి  ) ఒక ట్రిలియన్ కనెక్షన్ ల తో అనుసంధానమై ఉన్నాయన్న మాట ! ఒక్కొక్క నాడీ కణమూ , ఒక్కొక్క విషయాన్నే నిక్షిప్తం చేస్తే , మన మెదడు లో ఉండే , జ్ఞాపక సామర్ధ్యం  ఒక పరిమితి లోనే ఉంటుంది ! కానీ వాస్తవం గా జరిగేది,  ఒక్కో నాడీ కణమూ , అనేక ఇతర నాడీ కణాలతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి అనేక జ్ఞాపకాలను ఒకే సమయం లో నిక్షిప్తం చేయగలగడమే కాకుండా , జ్ఞాపకం అంటే గుర్తు కు తెచ్చుకో గలదు కూడా !  ఈ లెక్కన మానవ మస్తిష్కం లో మనం నిలువ చేసుకునే జ్ఞాపకాల సంఖ్య 2.5 పెటా బైట్లు ! లేదా ఒక మిలియన్ గిగా బైట్ ల జ్ఞాపకాలు !  ఈ పెటా బైట్లూ , గిగా బైట్లూ  ఎవరికి కావాలి ? ‘ మన బుర్ర సంగతి తెలుసుకోవాలి కానీ’ అనుకునే వారికి ఈ క్రింద వివరించిన పోలిక ఉపయోగ పడుతుంది !
మన మెదడు కనుక డిజిటల్ వీడియో రికార్డర్ అనుకుంటే , మూడు మిలియన్ గంటల రికార్డింగ్ తో సమానం, మన జ్ఞాపక సామర్ధ్యం ! ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , మన మెదడులో ఉన్న జ్ఞాపక  సామర్ధ్యం, డిజిటల్ రికార్డర్ లో నిక్షిప్తం చేయబడి ఉంటే , దానిని మళ్ళీ టీవీ లో సంపూర్ణం గా ప్లే చేయాలంటే, అక్షరాలా మూడు వందల సంవత్సరాలు పడుతుంది ! అంతటి జ్ఞాపక సామర్ధ్యం ఉంది , మానవ మస్తిష్కానికి ! మరి మన బుర్రలను మట్టి బుర్ర లనుకుందామా ???!!! ముమ్మాటికీ కాదు ! మరి మన మెదడు కు ఉన్న ఇంతటి సామర్ధ్యాన్ని, ఎట్లా మెరుగు పరుచుకోవచ్చో ,  దానిని మనకు ఉపయోగపడే జ్ఞాపకాలకు ఆలవాలం గా చేసుకోవచ్చో , మన బంగారు మెదడు లో జ్ఞాపకాల గనులను ఎట్లా నిక్షిప్తం చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం, తరువాత టపాలలో ! 
 
 

చదువుకోవడం ఎట్లా?29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 16, 2013 at 12:28 సా.

చదువుకోవడం ఎట్లా?. 29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి? 

మునుపటి టపాలో, తీవ్రమైన హానికరమైన వత్తిడి , చదువుకునే సమయం లో విద్యార్ధులకు కలిగితే , ఆ వత్తిడిని వారూ , వారి తల్లి తండ్రులు కూడా , ముందే కనిపెట్టి , నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ! మరి  దీర్ఘ కాలిక పధకం ఏమైనా ఉపయోగ పడుతుందా , ఈ రకమైన హానికరమైన వత్తిడి నివారించుకోడానికి ?
మనం ముందే తెలుసుకున్నాం , సామాన్యమైన వత్తిడి , అంటే యూ స్ట్రెస్  , మనకందరికీ ప్రేరణ అంటే స్టిమ్యులస్ కలిగించి , కర్తవ్యోన్ముఖులను చేస్తుంది ! అంటే వత్తిడి కొంత వరకూ మన నిత్య జీవితం లో మంచిదే ! కేవలం ఆ వత్తిడి తీవ్రత మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేసి ,  మన రొటీన్, అంటే రోజు వారీ కార్యక్రమాలను , అవక తవక చేస్తున్నప్పుడే , ఆ రకమైన స్ట్రెస్ , హానికరమైన డి స్ట్రెస్ గా మారుతుంది ! 
మరి ఈ హాని కరమైన వత్తిడి నివారణకు , దీర్ఘ కాలిక పధకం ఏమిటి? 
1. వత్తిడి లక్షణాలు గమనించడం :  ఈ లక్షణాలు గమించడం గురించి ముందే చాలా వరకూ తెలుసుకున్నాం కదా ,  విద్యార్ధులు ప్రత్యేకించి  ఏ పరిస్థితులు తమకు వత్తిడి కలిగిస్తున్నాయో  గమనించాలి !  భారత దేశం లో ప్రాధమిక విద్య  నేర్చుకునే విద్యార్ధులూ , మాధ్యమిక విద్య, అంటే ప్రైమరీ , సెకండరీ స్కూల్ విద్యార్ధులు ,అనేక రకాలు గా వత్తిడి కి గురౌతూ ఉంటారు, ఉన్నారు కూడా ! వారి వారి ఉపాధ్యాయులు , అందరూ కాక పోయినా , కొందరైనా , వారికి, ఏదో తెలియని మానసిక వత్తిడి కలిగిస్తారు !  ఒక సారి ,  విద్యార్ధిని తీవ్రం గా మంద లించడమో , లేదా కొన్ని సమయాలలో భౌతికం గా తీవ్రమైన  పనిష్మెంట్ ఇవ్వడమో చేశాక ,  ఆ విద్యార్ధులు, తరువాత ఆ టీచర్ కనిపించినప్పుడు కానీ , ఆ టీచర్ క్లాసు ఉన్న సమయం లో కానీ , తీవ్రమైన వత్తిడి కి మళ్ళీ మళ్ళీ గురి అవడం జరుగుతూ ఉంటుంది !  అది విద్యార్ధి ఏకాగ్రత కూడా  లోపించ వచ్చు !  , మనసు కేంద్రీకరించి నేర్చుకోవడం కష్టమవుతుంది, ఆ పరిస్థితులలో ! విద్యార్ధి కి నచ్చని సబ్జెక్ట్  చెప్పే టీచర్ వచ్చినపుడు కానీ , ఆ సబ్జెక్ట్ కు చెందిన  పరీక్ష లు ఉన్నప్పుడు కానీ ,  వత్తిడి చెందడం కూడా సామాన్యం గా జరుగు తుండే విషయమే !  ఆ యా సందర్భాలలో విద్యార్ధులు అనుభవించే వత్తిడి,  ‘ నేను వస్తున్నాను కాచుకోండి ‘ అని వారికి చెబుతూ రాదు కదా !  విద్యార్ధులు వారి కండరాలు బిగుతు గా అంటే,  టెన్స్ గా అవడమూ , భుజాలు డీలా గా ఉండక టెన్స్ గా బిగుతుగా ఉండడం , కొన్ని వత్తిడి సమయాలలో తల నొప్పి గా ఉండడం లాంటి లక్షణాలు  మాత్రమే కనబడుతూ ఉంటాయి !   
2. చంకింగ్ chunking  తో వత్తిడి తగ్గించుకోవడం ! : ఈ చంకింగ్ అనే పదం మానసిక శాస్త్రం లో కూడా ఉపయోగించే ఒక పదం.   అంటే  నేర్చుకోవడం అనే చర్య మనం ఒక పెద్ద  ముక్క కాకుండా , చిన్న చిన్న ముక్కలు గా నేర్చుకుంటే  త్వరగా నూ , ఎక్కువ గానూ అర్ధం అవుతుందని అనేక పరిశోధనల వాళ్ళ ఋ జువయింది ! 
ఉదాహరణకు : విద్యార్ధి  ఒక పది పేజీలు  ఉన్న పాఠాన్ని  ఒక్క రోజులో నేర్చుకుందామని కూర్చోడం , వత్తిడి కి కారణం అవగలదు ! అదే ,  పది పేజీలనూ , అయిదు రోజుల్లో, రోజుకు రెండు పేజీలు  గా నేర్చుకుంటే , నేర్చుకోవడం ఎక్కువ  లాభదాయకం గా ఉండడం ( అంటే ఎక్కువ భాగం అర్ధమవడమే కాకుండా , ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది కూడా ! ) కాక వత్తిడి కూడా  కంట్రోలు లో ఉంటుంది , ! 
3. పనులు దాట వేయడం, అంటే వాయిదా వేయడం మానుకోవాలి : ఈ విషయం, చెప్పడానికి సులభమే కానీ ఆచరణ కష్టం ! కానీ అసాధ్యం కూడా కాదు కదా !  పైన చెప్పిన విధం గా నేర్చుకునే విషయాలను చంకింగ్ చేయడం ఎంతో లాభదాయకం కానీ  పై ఉదాహరణ లో ఏరోజు చదవ వలసిన రెండు పేజీల పాఠాన్నీ , ఒక్క రోజు వాయిదా వేసినా కూడా , మరునాటికి అది, నేర్చుకోవలసిన నాలుగు పేజీల పాఠం అవుతుంది కదా !  ఈ సూత్రమే అన్ని పనులలోనూ వర్తిస్తుంది !  అత్యవసర పరిస్థితులలో తప్పించి, మిగతా సమయాలలో , చీటికీ మాటికీ , ఆ రోజు చేయవలసిన పనులు , చదివి నేర్చుకోవలసిన పాఠాలు వాయిదా వేయడం, వత్తిడి తీవ్రత ను పెంచుకోవడమే ! 
4. వీలు కాదని చెప్ప గలగడం :  విద్యార్ధి జీవితం లో , అనేక మైన వత్తిడులు కలుగుతూ ఉంటాయి ! చాలా సమయాలలో , మంచి గుణాలతో , ఇతరులకు సహాయం చేయాలనే గుణం తో ఉన్న చాలా మంది విద్యార్ధులను , మిగతా వారు అలుసుగా తీసుకుని , చీటికీ మాటికీ , వారికి చిన్నా చితకా పనులు చెబుతూ ఉంటారు ! విద్యార్ధులు , మొహమాటానికి పోయి , ఒక్కొక్కరు చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ తృప్తి చెందుతూ ఉంటారు ! కానీ ఈ చిన్న చిన్న పనులన్నీ కలిసి, ఎక్కువ సమయం తీసుకుని , విద్యార్ధి చదువు మీద కేంద్రీకరించే సమయాన్ని తక్కువ చేస్తాయి !  పర్యవసానం గా , విద్యార్ధి ,  పాఠాలు నేర్చుకోవడం లో వెనక బడడమూ , వత్తిడి తీవ్రత ఎక్కువ అవడమూ కూడా జరుగుతాయి !  అందువల్ల , ప్రతి విద్యార్ధీ ,  తాము చేసే సహాయాలు మంచివే అయినప్పటికీ , ఎప్పుడూ ప్రాముఖ్యత , వారి చదువు కే ఇచ్చి , మిగతా పనులు తాము చదువుకోవలసి ఉండడం వల్ల చేయలేక పోతున్నామని స్పష్టం గా , ఆ సహాయం అడిగే వారికి చెప్పడం అలవాటు చేసుకోవాలి ! 
5. ఆరోగ్యం అశ్రద్ధ చేయకూడదు : సమతుల్యమైన ఆహారం క్రమం గా తీసుకోవడం , క్రమం గా తగినంత నిద్ర పోవడం ,  క్రమం గా  వ్యాయామం చేయడం , చెడు అలవాట్లకు దూరం గా ఉండడం , ఈ నాలుగు సూత్రాలూ , విద్యార్ధి ఆరోగ్యాన్ని  సంపూర్ణం గా ఉంచడమే కాకుండా , హానికరమైన వత్తిడికి దూరం చేసి , సామాన్యమైన, రోజు వారీ వత్తిడులు తట్టుకునే సామర్ధ్యం కలిగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !