Our Health

Archive for the ‘మానసికం’ Category

ABCDE ల తో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.22.

In మానసికం, Our minds on జూన్ 7, 2012 at 12:48 సా.

ABCDE  ల తో ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవచ్చు ?.22.

( ‘ మనం , అన్నీ కలిగి ఉన్నప్పుడు నిద్రాణ స్థితిలో ఉండే మన శక్తి సామర్ధ్యాలను, నైపుణ్యాన్నీ  వెలికి తీయగల ప్రభావం ,  మన జీవితాలలో మనం ఎదుర్కునే ప్రతికూలతకు  ఉంది ‘ – హోరేస్. )
 ఆప్టిమిజం అలవరుచు కోవడానికి ఆల్బర్ట్  ఎల్లిస్ సూచించిన   కిటుకులు ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యం గా మనం ఈ కిటుకులను ABCDE అని గుర్తు పెట్టుకోవచ్చు.
అందులో  ‘ A ‘  అంటే ఏమిటి ? : మన జీవితాలలో  ప్రతి రోజూ అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి.  అందులో  కొన్ని కానీ, ఎక్కువ గా కానీ సంఘటనలు, రోజూ కానీ , అప్పుడప్పుడూ కానీ మనం, అనుకున్న విధం గా జరగవు. అంటే మన జీవితాలలో మనకు సంబంధించిన సంఘటనలు, మనకు ప్రతికూలం గా జరుగుతాయి. ఆ పరిస్థితినే   అడ్వర్సి టీ  ( Adversity ) అంటారు (  A is abreviation for Adversity ). ఈ  పరిస్థితులు , మన ఆహారం, ఆరోగ్య విషయాలలో కానీ,  చదువు , ఉద్యోగం , ప్రయాణాలలో కానీ,  లేక మన కుటుంబ, ప్రేమ, లేక ఇతర మానవ సంబంధాలలో కానీ అవవచ్చు కదా ! ఉదాహరణలు చూద్దాము :  ఉదయమే  బ్రేక్ ఫాస్ట్  అనుకున్నట్టు లేకపోవడం , లేదా  బస్సు కానీ , కారు , స్కూటర్ కానీ, ప్రయాణించే రైలు కానీ  చెడి పోవడం వల్ల , స్కూల్, కాలేజీ, ఆఫీసు లేదా  చేరుకోవలసిన ఏ గమ్యం అయినా సరిగా చేరుకోలేక పోవడం : ఇట్లాంటివి ఒక రకానికి చెందుతాయి.. ఇంట్లో  ఉన్న వారితో చీకాకు పడటం ,  వాదులాడుకోవడం , లేదా  తిట్టుకొని , ఆగ్రహించుకోవడం , లేదా ఆందోళన చెందడం.  కాలేజీ లో కానీ ఆఫీసులో కానీ ఇతరులతో ఘర్షణ పడడం,  మాటా మాటా పెరిగి ఉద్రిక్త  వాతావారణం ఏర్పడడం, ఉద్యోగం ఏకారణం చేతనైనా ఊడి పోవడం ,  ప్రియమైన వారితో ఉన్న   సంబంధం బలహీన పడడం లేదా విఫలం అవడం, అది విడి పోవడానికీ, విడాకులకూ దారి తీయడం  : ఇలాంటివి  ఇంకో రకమైనవి. తీవ్ర అనారోగ్యం , లేదా మరణం – ఇలాంటివి ఇంకో విధమైన  ప్రతి కూల పరిస్థితులు కూడా సహజం గా  మానవ జీవితాలలో సంభవిస్తుంటాయి. వీటిని మనం ప్రతికూల పరిస్థితులు అని ఎందుకు అనుకుంటామంటే, అట్లాంటి పరిస్థితులు మనం ఎప్పుడూ ,  అవి ఎంత అల్పమైనవి అయినా, తీవ్రమైనవి అయినా,  మన జీవితాలలో మనకు  జరుగ కూడదు అని అనుకుంటాము కనుక ! ,ఆప్టిమిజం  నేర్చుకోవడం లేదా అలవరుచు కోవడం లో  మరి  ఈ  ‘ A ‘  అంటే అడ్వర్సి టీ  ( Adversity ) పాత్ర ఏమిటి ? :: ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం వాటిని  మనదైన శైలి లో , ఆలోచనా ధోరణి తో  విశ్లేషణ చేస్తూ ఉంటాము !   దానిని   మన బిలీఫ్ సిస్టం ( Belief ) అంటారు.  Belief , మనం ఆశావాద మనస్తత్వం లేక ఆప్టిమిజం తో ఉండడానికి  ఉపయోగ పడే అత్యంత కీలకమైన కిటుకు. దీని గురించి వచ్చే టపాలో తెలుసుకుందాము ! 

ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవాలి ?.21.

In మానసికం, Our minds on జూన్ 7, 2012 at 10:18 ఉద.

ఆప్టిమిజం ఎట్లా నేర్చుకోవాలి ?.21.

మనం ఇంత వరకూ టపాలలో  ఆప్టిమిజం గురించి చాలా వివరం గా తెలుసుకున్నాము కదా ! ముఖ్యం గా ఈ ఆప్టిమిజం వల్ల మనకు కలిగే లాభాలు కూడా స్పష్టం గా తెలిశాయి కదా! ఇప్పుడు మనం ఈ ఆశావాద ధోరణి ని  అంటే ఆప్టిమిజాన్ని ఎట్లా నేర్చుకోవాలి ? ఎట్లా మన జీవితం లో భాగం గా చేసుకోవాలి ? అనే విషయాలు పరిశీలిద్దాము. 
ఈ ఆప్టిమిజాన్ని ఏ  వయసు నుండి నేర్చుకోవచ్చు?  :
మనకు తెలిసింది కదా ఎక్స్ప్లనేటరీ అంటే విశదమైన ఆశావాదం లేక ఆప్టిమిజం మనకు ఎంతో లాభదాయకమని !  శాస్త్రవేత్తలు,  కవలల మీద అనేక పరిశోధనలు చేసి మన జన్యువులలో  అంటే జీన్స్ ( genes ) లో 25 నుంచి 50 శాతం వరకు  మనం ఆశావాద దృక్పధం  లక్షణాలు ఉంటాయి అని తేల్చారు. అంటే  కొంత వరకూ ఈ ఆశావాద మనస్తత్వం  అనువంశికం అంటే హెరి డి టరీ అన్న మాట. మరి మనం నేర్చుకునే  ఆశావాదం  మనకు,  మిగతా 50 నుంచి 75 శాతం  ఉపయోగ పడుతుంది. దీనిని మనం నేర్చుకోవడమే కాకుండా కుటుంబం లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఈ విశదమైన ఆశావాదం  ( మనలను చూసి ) నేర్చుకోవడానికి దోహద పడుతుంది. అట్లాగే పిల్లలు స్కూల్ కు వెళుతూ ఉన్నప్పుడు , వారి టీచర్ల ఆశా వాద మనస్తత్వం కూడా , వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.  స్పోర్ట్స్  కోచెస్  కూడా ఈ ఆశావాద ధోరణి పిల్లలకు నేర్పటం లో ప్రధాన పాత్ర వహించ గలరు. అంటే పిల్లలు కూడా తమ చిన్న తనం లో తమ చుట్టూ ఉన్న వారు ( అంటే  కుటుంబంలో, తల్లి , తండ్రి , స్కూల్ లో టీచర్లు , స్పోర్ట్స్ కోచెస్ ) ఏ దృక్పధం తో ఉంటారో , ఆ దృక్పధాన్ని తాము కూడా అలవరుచుకో గలరు.ఆల్బర్ట్ ఎల్లిస్ అనే అమెరికన్ సైకాలజిస్ట్  ఈ  ( ఆశావాద ) దృక్పధం నేర్చుకోవడానికి కొన్ని కిటుకులు సూచించాడు.  ఈ కిటుకులు  ఉపగించడం నేర్చుకుని , వాటిని మన  నిత్య జీవితం లో భాగం గా చేసుకుంటే మనం చాలా  లాభ పడగలం.మన జీవితాలను ఎక్కువ ఆనంద మయం చేసుకోగలం.  మిగతా ప్రముఖ సైకాలజిస్ట్ లు అయిన  సెలిగ్మన్, రీవిచ్ లు కూడా ఆల్బర్ట్ ఎల్లిస్  సూచించిన కిటుకులు పరిశీలించి , అవి ఎక్కువ ప్రయోగాత్మకం గా అంటే ప్రాక్టికల్ గా , అందరూ ఉపయోగించ గలిగేటట్టు ఉన్నాయని తేల్చారు.  ఆల్బర్ట్ ఎల్లిస్  తాను  సూచించిన ఈ పద్ధతికి ‘  ఏ బీ సి టెక్నిక్ ‘  ( ABC technique on building optimism ) అని పేరు పెట్టాడు.
వచ్చే టపాలో ఈ ఏ బీ సి టెక్నిక్ వివరాలు చూద్దాము ! 

ఆప్టిమిజం తో లాభాలూ , పెసిమిజం తో నష్టాలూ !.20.

In మానసికం, Our Health, Our minds on జూన్ 6, 2012 at 11:08 సా.

ఆప్టిమిజం తో లాభాలూ , పెసిమిజం తో నష్టాలూ.20.

మనం క్రితం టపాలలో ఆశావాదం, నిరాశావాదం, ఏ విధం గా మన ఆలోచనలనూ, మన ప్రవర్తననూ  ప్రభావితం చేస్తాయో తెలుసుకున్న్టాము కదా!.
మనం ఇప్పుడు ఆశావాదం అంటే ఆప్టిమిజం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో చూద్దాము .
1.ఆప్టిమిజం అంటే ఆశావాద మనస్తత్వం , మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తద్వారా దీర్ఘ ఆయువు కు కారకమవుతుంది.
2.ఆప్టిమిజం , మనం ఆనంద మయిన జీవితాలు గడపడానికి దోహద పడుతుంది.
3.వత్తిడీ, ఆందోళనా తగ్గటానికి కూడా , ఆప్టిమిజం తోడ్పడుతుంది.
4.మనం తీసుకున్న ఏ మార్గం అయినా, ఆప్టిమిజం తో విజయం పొంద డానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
5.తద్వారా మన విద్యావకాశాలను మనం సద్వినియోగం చేసుకోగలం.
6.మన వ్యక్తిగత మానవ  సంబంధాలను ఆప్టిమిజం తో వృద్ధి  చేసుకోగలం.
7. ఆశావాద ధోరణితో మనం సమస్యలను విజయవంతం గా నూ తొందర గానూ పరిష్కరించుకునే  నిపుణత ఎక్కువ అవుతుంది మనకు.
8.ప్రతికూల పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు మనం, ఆప్టిమిజం తో వాటిని  నేర్పుగా అధిగమించ గలుగుతాము. 
9.అలాగే  ఫెయిల్యుర్స్  అంటే మన జీవితాలలో మన వైఫల్యాలను, మనం మన ( ఆప్టిమిజ ) ధోరణి తో  ఒక సమతుల్యం అంటే బ్యాలన్స్ తో  డీల్ చేయ గలుగుతాము. 
( అంటే వైఫల్యాలు మనకు ఎదురైనప్పుడు, మన ఆశావాద ధోరణి  లేక ఆప్టిమిజం ఉంటే  , క్రుంగి పోకుండా, ఆ వైఫల్యాలను అధిగమించ గలుగుతాము. ) 
అదే మనం ఇన్ని లాభాలు చేస్తున్న ఆశావాద ధోరణి లేదా ఆప్టిమిజం ను కాదనుకొని నిరాశావాదం వైపు లేదా పెసిమిజం వైపు మొగ్గితే జరిగే నష్టాలు చూడండి.
1.పెసిమిజం, ఎక్కువ కాలం ఉంటే , డిప్రెషన్ కు కారణమవుతుంది.
2. పెసిమిజం తో , మన ఆయుష్షు తగ్గుతుంది.
3.ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు , పెసిమిజం కూడా తొడు అవుతే , ఏ చర్యా తీసుకోలేని స్తబ్దత ఏర్పడుతుంది. 
4. పెసిమిజం మన దేహం లో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీ ని తగ్గించి మన అనారోగ్యానికి హేతువు అవుతుంది.
5.అనారోగ్యం వల్ల మనం మన రోజు వారీ కార్యక్రమాలు, లేదా మన ఉద్యోగాన్ని సరిగా చేయలేక ,
6, మన అభివృద్ధి కుంటు పడుతుంది.
7,అందువల్ల మనం మన మానవ సంబంధాలను కూడా సరిగా పటిష్ట పరుచుకోలేక పోతాము. 
8. పెసిమిజం తో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేని అశక్తత ఏర్పడుతుంది. 
 పైన వివరించిన లాభాలు అన్నీ వివిధ పరిశీలనల వల్ల నిర్దారింప బడినవే !  ఇప్పుడు మీకు ఆప్టిమిస్ట్ లు గా మారటానికి ఎక్కువ సమయం అక్కర లేదు కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ. బయటి, లోపలి కారణాలు . 19.

In మానసికం, Our Health, Our minds on జూన్ 1, 2012 at 11:56 సా.

పాజిటివ్ సైకాలజీ. బయటి, లోపలి కారణాలు .  19. 

క్రితం టపాలో మనం రెండవ రకానికి చెందిన ఆశా వాదులు , నిరాశా వాదులు ఏవిధం గా ఆలోచిస్తారో తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మూడవ రకం ఏంటో చూద్దాము.
ఈ రకం లో  జీవితం లో పొరపాటు జరిగినప్పుడు , ఆశా వాదులు అంటే ఆప్టిమిస్ట్ లు బాహ్య కారణాలు (external ) వెతుకుతారు. అంటే వారు వారిని నిందించుకోరు. బయటి కారణాలు ఏమైనా ఉన్నాయో లేదో ఆలోచిస్తారు , తమ జీవితం లో జరిగిన పొరపాట్లకు. కానీ పెసిమిస్ట్ లు, వారి జీవితం లో జరిగిన పొరపాట్లకు వెంటనే వారిని వారే నిందించు కుంటారు. 
ఇలా బయటి కారణాలు వెతికే వారు ఎక్కువ పాజిటివ్ దృక్పధం కలిగి ఉంటారు. కానీ తమకు తామే నిందించు కునే పెసిమిస్ట్ లు నిరాశా జనకం గా ఉండి, తమను తాము నిందించు కుంటూ( internal ) , విమర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆత్మ విమర్శ కొంత వరకూ సమంజసమే కానీ ఎక్కువ గా చేసుకుంటూ ఉన్నట్టయితే, పెసిమిజం  వారిని ఆక్రమించుకుంటుంది. 
డాక్టర్ రీవిచ్ , ఈ మనస్తత్వాన్ని ‘ me, not me ‘ మనస్తత్వం గా వివరించారు. అంటే  ఆప్టిమిస్ట్ లు, తమ జీవితం లో జరిగిన పొరపాట్లకు , not me, అంటే నేను కాదు  అందుకు కారణం , అని ఇతర కారణాలు వెతుకు తారు , అంటే ఇతరులను, తమ తప్పిదాలకు కారణమంటారు. అంతే కాక, వారు ‘ ఎప్పుడూ కాదు ‘ ఆంతా కాదు ‘ not always’ , not everything ‘ అని తమను నిందించు కోకుండా ఇతర కారణాలు వెతుకు తారు. 
డాక్టర్ రీవిచ్ ఈ మనస్తత్వాన్ని , మన వ్యక్తిత్వ  తీరు కాక , మన ఆలోచనా ధోరణి అని  చెప్పి ,  ఇది మన ఆలోచనా ధోరణి అవడం వల్ల, మనం మార్చుకోవచ్చు ‘ అంటారు. 
అంటే, ఏదైనా పొరపాటు సంభవించినప్పుడు , వెంటనే స్వీయ విమర్శలు మాని , ఆ పొరపాటు జరగటానికి ఇతర కారణాలు ఏవేవి ఉన్నాయో వాటిని పరిశీలించే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలన్న మాట. ఇలా ఇతర కారణాలు అవలోకనం చేసుకున్నప్పుడు, మనం ఎక్కువ ఆశావాదులు గా అంటే పాజిటివ్ దృక్పధం తో ఉంటాము. 

ఇలాంటి ఆలోచనా ధోరణి మన జన్యువులలో కాక అంటే జీన్స్ లో కాక, కేవలం మనం ఆలోచించే తీరు లో ఉంటుంది కనుక , మనం దానిని తెలుసుకుని , సవ్యం గా ఆలోచించే అలవాటు చేసుకుంటే , లాభ పడతాము. 
 
 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !
( వచ్చే టపా  అయిదారు రోజుల తరువాత వస్తుందేమో, ఈ లోగా  టపా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.  అలా జరగక పొతే,   క్షంతవ్యుడిని ! )

పాజిటివ్ సైకాలజీ – విశదమైన ఆశావాదం. 18.

In మానసికం, Our minds on మే 31, 2012 at 8:01 సా.

పాజిటివ్ సైకాలజీ – విశదమైన ఆశావాదం. 18.

మునుపటి టపాలో విశదమైన ఆశా వాదంలో  ఆశావాదులు ( అంటే ఆప్టిమిస్ట్  లు ) ,  తమకు  విఫలమైన సంఘటన ను ఎట్లా తాత్కాలికం గా భావిస్తారో , అదే విఫలమైన సంఘటన ను నిరాశా వాదులు ( అంటే పెసిమిస్ట్లు లు )  ఎట్లా  వారి శాశ్వతమైన  దురదృష్టం గా భావిస్తూ ఉంటారో తెలుసుకున్నాము కదా ! 
ఇప్పుడు రెండవరకం చూద్దాము .  ఈ రకం లో , ఆశావాదులు అంటే ఆప్టిమిస్ట్ లు తమకు ఏదైనా అనుకోని సంఘటన సంభవిస్తే , దానిని కేవలం ఆ సంఘటనలో  తమకు అనుకూలం గా పరిస్థితులు లేక పోవడం చేతనో లేదా ఆ ప్రత్యెక సంఘటనలో తాము సరిగా చర్యలు తీసుకోలేదని  అనుకుంటారు. అదే పెసిమిస్ట్ లు అంటే నిరాశావాదులు  తాము అనుకున్నట్టు గా ఏదైనా జరుగక పొతే , ఆ ఒక్క సంఘటనలో  పొరపాటు జరిగిందని కాక ,  తమకు ఎప్పుడూ ఇట్లాగే జరుగుతుందనీ , తాము  ఎప్పుడూ దురదృష్ట  వంతులనీ అనుకుంటారు. ఉదాహరణ : రత్న  ఇద్దరు పిల్లల తల్లి . చేస్తున్న ఉద్యోగాన్ని మాని పిల్లల సంరక్షణ చూసుకుంటుంది. చదువు బాగా చెపుతారని  వారిని ఇంకో  స్కూల్ లో చేర్పించింది కూడా. వారు కొద్దిగా వెనక పడ్డారు కొత్త స్కూల్ సిలబస్ అందుకోవడం లో. దానికి తోడు, చిన్నమ్మాయి  స్కూల్ లో ఆటల్లో  క్రింద పడి మోకాలు మీద గాయం చేసుకుంది.  దానితో రత్న  బాగా కలత చెందింది. ‘ నేను ఎప్పడూ ఇంతే,  నేను మంచి తల్లిని కాను , పిల్లలిద్దరూ సరిగా చదవట్లేదు ,  ఇంకా గాయాలు కూడా , నా దురదృష్టం.నేను అనుకున్నవి అనుకున్నట్టుగా  ఏవీ జరగవు ! అని నిరాశ గా  ఆత్మ నింద చేసుకుంటుంది. ఇక్కడ రత్న  తన పిల్లలు సరిగా చదవక పోయినా , లేక గాయ పడినా , అది తల్లిగా తన తప్పు అనుకోవడమే కాకుండా , తాను ‘ ఎప్పుడూ దురదృష్ట  వంతురాలు’అని  ఆ జరిగిన సంఘటనలను జెనరలైజ్  చేసి తనను విమర్శించుకుంటుంది. అదే స్కూల్ లో ట్రాన్స్ఫర్ మీద ఆ టౌన్ కు మారిన  పుష్ప , తన ఇద్దరు పిల్లలనూ , తాను కూడా ఇంట్లో ఉండి చూసుకుంటుంది. వారు కూడా సరిగా చదవట్లేదు. అందులో రెండో వాడు దుడుకు. ఆటల్లో పడి చేయి  కూడా విరిగింది. పుష్ప బాధ పడ్డది. కానీ ‘ వెంటనే దగ్గరలోని  హాస్పిటల్ కు తీసుకు వెళ్లి  ఎక్స్ రే తీయించి  బ్యాండేజ్  వేయించడం అదృష్టమే ! అందులో  ఎముక లోపలే చిట్లింది, బయటకు గాయం అవలేదు ,  త్వరగా మానుతుంది అందువల్ల’  అని డాక్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ,తన పిల్లలను ‘  శ్రద్ధగా చదువుకోండి ఈ సారి ఇంకా బాగా మంచి మార్కులు రావాలి అని ప్రోత్సహిస్తూ వారిని చూసుకుంటుంది.  ఈ విషయాలలో పుష్ప తనను నిందించుకోవడం లేదు. తాను తల్లి గా బాధ పడుతున్నా , తనను నిందించుకోవడం కానీ , లేదా తనకు ఎప్పుడూ అదృష్టం బాగోదని  అనుకోవట్లేదు. 
డాక్టర్ రీవిచ్ ఈ మనస్తత్వాన్ని ‘ ఎవ్రీథింగ్ అండ్ నాట్ ఎవ్రీతింగ్ ‘ ( every thing and not every thing ) గా వర్ణించారు.  అంటే నిరాశావాదులు తమ కు జరిగిన అనుకోని సంఘటనను, తమకు ‘ ప్రతిదీ ‘ అట్లాగే జరుగుతుందని పెసిమిస్టిక్ గా ఆలోచించుతారు. అదే ఆప్టిమిస్ట్ లు అంటే ఆశావాదులు తమకు ఒక సంఘటన తాము అనుకున్నట్టుగా జరగక పొతే  ‘ ప్రతి విషయమూ అట్లా జరగదు ‘  అప్పుడు పరిస్థితులు బాగో లేవు లేదా ఆ సంఘటనలో తాము ఇంకో విధం గా చేసి ఉండాల్సింది ‘ అని అనుకుంటారు. అంటే వారి ఆలోచనా ధోరణి  నాట్ ఎవ్రీతింగ్ ‘ అనుకునే విధం గా ఉంటుంది. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !

పాజిటివ్ సైకాలజీ- విశదమైన ఆప్టిమిజం – 17.

In మానసికం, Our minds on మే 30, 2012 at 7:37 సా.

పాజిటివ్ సైకాలజీ- విశదమైన  ఆప్టిమిజం  – 17.

మనం మార్టిన్ సెలిగ్మన్ ప్రతిపాదించిన  ఆశావాదం లేక ఆప్టిమిజం గురించి తెలుసుకుంటున్నాము కదా ! ఇప్పుడు మానవులలో ఈ ఆప్టిమిజం ఏ ఏ రకాలు గా కనపడుతుందో చూద్దాము ! 
ముఖ్యం గా  ఈ మనస్తత్వం మూడు రకాలు గా కనిపించ వచ్చు. అంటే ఈ మూడు రకాలూ ఒకే వ్యక్తి లో కాక ,  ఈ మనస్తత్వాన్ని బట్టి మానవులు మూడు రకాలకు చెందుతారు అంటే సరి గా ఉంటుంది. మొదటి రకం : తాత్కాలికమూ , శాశ్వతమూ : ఈ రకం లో  నిరాశా వాద మానవులు , వారి జీవితం లో ఏదైనా అనుకున్నట్టు జరగక పొతే , ఇక వారికి ఎప్పుడూ ఏదీ సక్రమం గా జరగదు అనుకుంటారు. 
 ఒక ఉదాహరణ : ప్రమోద్ ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగానికి ఇంటర్వ్యు లో భాగం గా బోర్డ్  రూం లో   ఒక టాక్ ఇవ్వ వలసి వచ్చింది. తను అనుకున్నట్టు మాట్లాడ లేక పోయాడు.  ఇక అంతర్మధనం మొదలైంది. నేను ఎప్పుడూ ఇంతే ! నాకు మాట్లాడం చేత కాదు ! దానికి తోడు ఆ వెధవ  పవర్ పాయింట్ కూడా అప్పుడే ఫ్రీజ్ అయి చావాలీ ! మొత్తం ప్రెజెంటేషన్  ను నాశనం చేశాను!  బోర్డ్ రూం లో ఉన్న వారందరూ ఏమనుకుంటారు? నేను ఫస్ట్ క్లాస్ లో పాసయిన ఇంజినీర్ లా  ఇంప్రెషన్ ఇవ్వలేదు ! అని తనను విమర్శిచుకుంటూ ,  విచార పడుతున్నాడు 
ఇలాంటి పరిస్థితి నే  ఆనంద్  కూడా ఫేస్ చేశాడు. కానీ ఆనంద్ , ప్రమోద్ కాదు , ఆనంద్ ఆనందే ! ఆనంద్ ఆశావాది అంటే ఆప్టిమిస్ట్ . ఇంటర్వ్యు కాగానే ‘  ఆ కొద్ది గా పవర్ పాయింట్  సరిగా పని చేసి ఉంటే , ఇంకా బాగుండేది నా ప్రెజెంటేషన్. అందులో  బోర్డ్ రూం లో అందరూ లంచ్ తరువాత భుక్తాయాసం తో   మగత నిద్ర లో ఉన్నట్టున్నారు, సరిగా కాన్సంట్రేట్ చేయలేదు నా టాక్ మీద . ఇంకో ఇంటర్వ్యు  లో నాకు ముందే అవకాశం వస్తే , ( ఇంటర్వ్యు బోర్డ్ మెంబర్లు ఎలర్ట్ గా ఉన్నప్పుడు ) నేను ఇంకా బాగా  నా టాక్ ప్రిపేర్ చేసుకొని , ఇంకా బాగా టాక్ ఇచ్చి  సెలెక్ట్ అవుతాను  !  అని  అనుకున్నాడు 
డాక్టర్ కారెన్ రీవిచ్ అనే సైకాలజిస్టు  ఇలా తాత్కాలికం గా నూ శాశ్వతం గానూ ఆశావాద , నిరాశా వాద మనస్తత్వాలను ఇంకో విధం గా కూడా  వివరించారు. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్ధి ‘ నేను శుంట ను ‘ అని అనుకున్నా డనుకోండి. ఇందులో నిరాశావాదం శాశ్వతం గా  గుప్తమై ఉంది. అంటే ఈ విద్యార్ధి  ఆలోచనా ధోరణి  ఒక శాశ్వతమైన నిరాశా ధోరణి ని ప్రతి బింబిస్తుంది. అంటే దాని ప్రభావం తను తరువాత మళ్ళీ తీసుకునే పరిక్ష మీద కూడా ఉంటుంది. అలాగే పరీక్ష ఫెయిల్ అయిన ఇంకో విద్యార్ధి ‘ పరీక్షల ముందు నేను సరిగా రివైజ్  చేయను ‘ అని అన్నాడనుకొండి. అప్పుడు ఆ విద్యార్ధి మనస్తత్వం , కేవలం తాత్కాలిక పెసిమిజాన్నే  ప్రతిబింబిస్తుంది. అంటే ఈ విద్యార్ధి లో   ‘ సరిగా పరీక్ష ముందు కూడా రివైజ్ చేస్తే  పాస్ అవగలను అనుకునే ఆశావాదం తొంగి చూస్తుంది. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ – ఆశావాదం ( ఆప్టిమిజం ).16.

In మానసికం, Our minds on మే 29, 2012 at 9:17 సా.

పాజిటివ్ సైకాలజీ – ఆశావాదం ( ఆప్టిమిజం ).16.

మనం సామాన్యం గా చాలా మందిని చూస్తూ ఉంటాము మన అనుభవం లో.   మనం ప్రత్యేకించి పరిశీలనగా చూడక పోయినా, కొంత మంది ,  కష్ట సమయాలలో , నిరంతరం అంటే కష్టాలు ఒక దానిమీద ఒకటి అనుభవిస్తున్నా కూడా , మంచి రోజులు వస్తాయి ‘ అనుకుంటూ ,జీవనం సాగిస్తారు. అలాగే ఇంకొంతమంది , కష్ట సమయాలలో , ఇంకా క్రుంగి పోయి , తమనూ , తమ ‘ తల రాత ‘ నూ , లేదా ‘ విధి రాత నూ ‘ నిందించు కుంటూ కాలం వెళ్ళ దీస్తారు. 
గత ఇరవై సంవత్సరాల కాలం లో ఈ ఆశావాదం లేక ఆప్టిమిజం  మీద  విస్తృతం గా పరిశోధనలు జరిగాయి.  వీటితో , ఆశా వాదం , లేదా ఆప్టిమిజం  అంటే పైన ఉదహరించినట్టు కాక చాలా లోతైన అర్ధం ఉందని. 
ఈ ఆప్టిమిజం  ను రెండు విధాలుగా , చెప్పుకోవచ్చు. 
షియార్ ఇంకా కార్వార్  అనే సైకాలజిస్టులు ఆప్టిమిజం ను ‘  మన జీవితం లో ఎప్పుడూ,  మనకు  చెడు కన్నా మంచే జరుగుతుంది అని అనుకునే స్వభావం లేదా  ప్రవ్రుత్తి   అని నిర్వచించారు.  అలాంటి వారు , మీద పిడుగులు పడుతున్నా , తమకు ఏమీ అపాయం జరుగదు అని అనుకునే వారు.   మన రోజు వారీ భాష లో అలాంటి వారు ఎప్పుడూ  జీవితం లో వెలుగు వైపు తమ   దృష్టి ఉంచుతారు. అదే  పెసిమిస్టు లు , అంటే నిరాశా వాదులు ,  వారి జీవితం లో ఏదో ఒకటి ఎప్పుడూ వారికి ప్రతికూలం గా జరుగుతుంది , తప్పకుండా ‘  అని అనుకునే వారు. 
ఇంకో సైకాలజిస్టు ,  మన పాజిటివ్ సైకాలజీ గురువు మార్టిన్ సెలిగ్మన్ ఈ ఆశావాదాన్ని  ఇంకో రకం గా నిర్వచించారు. ఆయన నిర్వచనం లో 
‘ ఆశావాదం మూలాలు కేవలం   మంచి మాటలు అంటే  ఆశాజనకమైన, లేదా విజయం గురించి  మాటలు అనుకోవడం కానీ , దృశ్యాలు ఊహించడం  లో కానీ ఉండదు.  ఆశావాదం లేక ఆప్టిమిజం  కారణాల గురించి మనం ఆలోచించే ధోరణి లో ఉంటుంది’ . 
( ‘ The basis of optimism  does not lie in positive phrases or images of victory, but the way you think about  causes’ )
దీనినే ‘ విశదమైన  ఆశావాదం’  లేదా  ఎక్స్ప్ల నేటరీ  ఆప్టిమిజం ( explanatory optimism ) అంటారు.  ఈ విశదమైన  ఆశావాదం , లేదా ఆప్టిమిజం మనకు నిత్య జీవితం లో చాలా ముఖ్యం. దీనిని అలవాటు చేసుకుంటే , జీవితానందం అధికం అవుతుంది. 
 ఈ విశదమైన ఆశా వాదం గురించి వచ్చే టపా లో విపులం గా తెలుసుకుందాము ! 

పాజిటివ్ సైకాలజీ – మతం చేసే హితం. 15.

In మానసికం, Our minds on మే 29, 2012 at 12:15 ఉద.

పాజిటివ్ సైకాలజీ –  మతం చేసే హితం. 15.

మన జీవితార్ధం తెలుసుకోవడం లో మన మతం చేసే హితం ఎంతో ఉంది. త్రికరణ శుద్ధి తో
( అంటే, మనసా , వాచా , కర్మణా ) ఆచరించే ఏ మతం అయినా  ఇహ పర సాధనకు సోపానం అవుతుంది. మతం తో  దానగుణం , సేవా దృక్పధం అలవడుతాయి.అలాగే వేదాంత ధోరణి , పరోపకార  నైజం , ఇలాంటి గుణాలు కూడా , జీవితార్ధాన్ని , జీవిత పరమార్ధాన్ని  మనకు ఎప్పటికప్పుడు తెలియ చేస్తూ , అధికానంద హేతువు అవుతాయి.  నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలనే తృష్ణ , జిహ్వ కూడా అధికానందం పొందడానికి దోహద పడతాయి.  
చిన్న చిన్న సేవా కార్యాలు ఒక క్రమం గా అంటే వారానికో పక్షానికో కొన్ని సార్లు  చేస్తూ ఉంటే కూడా , మనం  అధికానందం పొందుతాము.  అంతే కాకుండా, మనం చేసే చిన్న చిన్న సేవా కార్యాల  వల్ల మనం మన ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఏర్పరుచుకో గలుగు తాము. అలాగే వారి నుంచి పాజిటివ్ అభిప్రాయాలు కూడా స్వీకరించ గలుగుతాము .
క్షమా గుణం : మనం మన జీవితాలలో  ఎన్నో సంఘటనలు , మనకు కోపం , ఉద్రేకము కలిగిస్తూ ఉంటాయి. ఇలా మన కోపానికి ఇతరులు కూడా చాలా సమయాలలో కారకులవుతుంటారు. కానీ మనం క్షమా గుణం అలవరుచు కుంటే, మన మనసు తేలిక అవుతుంది.  మనకు అధికం గా కోపం తెప్పించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే , వారిని క్షమిస్తూ ఉన్నట్టు ఒక ఉత్తరం రాసి పారేస్తే కూడా ఆ కోపం మాయ మవడమో, లేక తగ్గి పోవడమో జరుగుతుంది.  అలా కాక మనం, వారిని క్షమించ కుండా  తరచూ కోపం తెచ్చు కుంటూ ఉంటే ,  ఆ ( కోపం కలిగించిన ) సంఘటనలు పదే పదే  మన మనసులను తోలిచినట్టు అయి , మనను కలత పెడుతూ ఉంటాయి. 
ఇక్కడ సుమతీ శతక కారుడు వందల ఏళ్ల క్రితం వ్రాసిన పద్యం మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే  ఆ పద్యం యదార్ధం కూడా ! 
తన కోపమే తన శత్రువు, 
తన శాంతమె తనకు రక్ష,దయ చుట్టంబౌ , 
తన సంతోషమే  స్వర్గము  
తన దుక్ఖమే నరకమండ్రు తధ్యము సుమతీ !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !

పాజిటివ్ సైకాలజీ – జీవితార్ధం తెలుసుకోవడం తో అధికానందం .14.

In మానసికం, Our minds on మే 27, 2012 at 7:09 సా.

పాజిటివ్ సైకాలజీ – జీవితార్ధం తెలుసుకోవడం తో అధికానందం .14.

క్రితం టపాలో చూశాము కదా ఫ్లో మన జీవితం లో ఎట్లా ఉపయోగ పడుతుందో. ఇప్పుడు అధికాననందం కోసం  మన జీవితార్ధం తెలుసుకుని తదనుగుణం గా మన జీవన శైలి ని మార్చుకునే సంగతులు కూడా తెలుసుకుందాము. 
మనం మన జీవితాలలో ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్ర కు ఉపక్రమించే వరకూ , ‘ ఒకటే పరుగు ‘ !   సామాన్యం గా ఈ  ‘ పరుగు ‘  ఎంత తీవ్రం గా మన జీవితాలను  ఆక్రమించిందంటే , మనం జీవితాన్ని యాంత్రికంగా గడుపుతూ ఉంటాము. అంటే  పని తరువాత ఇంకోటి చేస్తూ , ఈ జంజాటం లో జీవితార్ధం పూర్తిగా మన దృష్టి లో ఉండదు.ఈ క్రింది పద్ధతులతో  మనం జీవితార్ధం కూడా తెలుసుకుని , వాటిని అమలు పరుస్తూ , తద్వారా అధికానందం పొందవచ్చు. ఇక్కడ కూడా ఈ పద్ధతులకు వయసు తో నిమిత్తం లేదు.ఏ వయసుకు చెందినా వారైనా వీటిని పాటించ వచ్చు. 
జీవితం బేరీజు వేసుకోవడం:  అంటే మనం మన జీవితం లో ఒక  నిర్ణీత సమయాలలో మన, ఆరోగ్యం గురించీ,  కుటుంబం గురించీ,  ఆర్ధిక సమస్యల గురించీ , మనం మనకు ఉల్లాసం కలిగించే కార్య క్రమాల గురించీ ( అంటే , ఆడే ఆటలు , చేసే విహారాలూ లాంటివి ), కొంత సమయం వెచ్చించి , ఆ యా విషయాలలో తీసుకోవలసిన చర్యలు , జాగ్రత్తలు ,ఏవైనా ఉన్నాయా అని  వివరం గా ఆలోచించి ,  మన జీవన శైలి  లో తగు మార్పులు తెచ్చుకుంటూ ఉండాలి. అలాగే  దీర్ఘ కాలికం గా మన లక్ష్యాలు ఏమిటి ? , అందుకు మనం ఏ పధకాలు వేసుకోవాలి ? అన్న విషయాలు కూడా మనం కూలంకషం గా  ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకో గలగాలి. 
డైరీ లో క్రమం గా నోట్ చేసుకోవడం : ప్రతి రోజూ , ఆ రోజులో మనకు ఆనందం కలిగించిన సంఘటనలు కొన్ని అంటే కనీసం మూడైనా , క్రమం గా మన దిన చర్య లేక డైరీ లో నోట్ చేసుకుంటే , మనకు ఆనందం కలిగిసుందని వివిధ పరిశీలనల వల్ల తెలిసింది. అలాగే ఆ సంఘటనలు మనకు ఎందుకు ఆనందం కలిగించాయో కూడా వ్రాసుకుంటే , మనం తరువాత ఏ సమయం లో నైనా అది చూసుకుని  ఆనందం పొందగలుగు తామన్న మాట. 
కృతఙ్ఞతలు తెలుపుకోవడం : మనం మన జీవితాలలో, వివిధ దశలలో , ఎంతో కొంత ఇతరులతో , అంటే మన గురువులతో కానీ , బంధువులతో కానీ , లాభం పొందుతాము. మన మనసులలో కృతజ్ఞతా భావం ఉన్నా , ఆ కృతజ్ఞతను వారికి వ్యక్తం చేయడంలో విపరీతమైన  ఆలస్యం , తాత్సారం చేస్తూ ఉంటాము. అలా కాకుండా , మనకు మేలు చేసిన వారికి తగిన సమయం లో ( ఆలస్యం లేకుండా ) మన కృతఙ్ఞతలు తెలియ చేస్తూ ఉంటే కూడా  మన ఆనందం అధికమవుతుందని  తెలిసింది. 
మన కృతజ్ఞతలను , చిన్న బహుమతుల రూపం లో కానీ , గ్రీటింగ్ కార్డు రూపం లో కానీ , లేక వ్యక్తిగతం గా మేలు చేసిన వారిని కలిసి, వారితో కొంత సమయం గడిపి గానీ, ఇలా ఎన్నో విధాలు గా తెలుపు కోవచ్చు. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 

పాజిటివ్ సైకాలజీ – మన నిత్య జీవితం లో ఫ్లో ( flow ) తో ప్రయోజనాలు . 13.

In మానసికం, Our minds on మే 26, 2012 at 7:40 సా.

పాజిటివ్ సైకాలజీ –  మన నిత్య జీవితం లో ఫ్లో ( flow ) తో ప్రయోజనాలు . 13.

మనం క్రితం టపాలో తెలుసుకున్నాము కదా ! ఫ్లో ( flow ) స్థితి ఎట్లా ఏర్పడుతుందో ! అంటే మనం చేయవలసిన పని అంటే ఏ కార్యం అయినా సరే , బాగా కష్టం గా ఉన్నప్పుడు , దానితో మన  నైపుణ్యం అంటే , మన శక్తి యుక్తులు కూడా సరితూగుతున్నప్పుడు, మనం  ప్రవాహ స్థితి లో అంటే ఫ్లో స్థితిని పొందుతాము . అంటే ఆ స్థితి లో మనం పూర్తి ఏకాగ్రత తో పని చేస్తూ , ఆ పనిలో  ‘ మమైకం ‘ చెంది అంటే పూర్తి గా లీనమై ,  ఆ   పనిని , లేక కార్యాన్ని విజయ వంతం గా పూర్తి చేస్తూ , అత్యంత ఆనందం పొందుతామన్న మాట.
ఇప్పుడు మనం మన నిత్య జీవితం లో ఈ ఫ్లో వల్ల  ఉపయోగాలు చూద్దాము . ముఖ్యం గా  కుటుంబం అంటే ఫ్యామిలీ ( family ) లో ఈ  ఫ్లో ఎట్లా ఏర్పడుతుందో  తెలుసుకుందాము. 
మనకందరికీ మన సంతానం, చక్కగా చదువు నేర్చుకొని , ప్రతిభావంతులు కావాలని ,   పెరిగి పెద్ద వారై , ప్రయోజకులు కావాలనీ, ఆశలు, ఆశయాలూ ఉంటాయి కదా !  ఈ ఆశలూ, కోరికలూ నెరవేరాలంటే , కుటుంబం లో  ‘ఫ్లో ‘ ముఖ్యం.
 ప్రతి తల్లి దండ్రులకూ ,  ఈ ఫ్లో స్థితి  కి అనువైన  వాతావరణం కల్పించ వలసిన బాధ్యత ఉంది కదా ! అందువల్ల తల్లి దండ్రులు కూడా ఈ విషయం తెలుసుకోవడం వల్ల లాభం పొందుతారు. 
ప్రతి కుటుంబం లో తమ   సంతానానికి    ఈ  ఫ్లో స్థితి ఉండాలంటే  అయిదు లక్షణాలు  చాలా ముఖ్యం.  ఈ అయిదు లక్షణాలూ ఇవి :
1.స్పష్టత : అంటే పిల్లలకు వారి తల్లిదండ్రులు , వారినుంచి , ఏమి ఆశిస్తున్నారో, ఆ విషయం మీద వారికి ( అంటే పిల్లలకు ) స్పష్టమైన  అవగాహన ఉండాలి. ( అంటే తలిదండ్రులు  తమ సంతానానికి  చిన్నప్పటినుంచే  ఈ విషయాలు  తెలియచేస్తూ వారిలో  విజయ సాధన  బీజాలు నాటాలి ! )
2.అవకాశాలు:  పిల్లలకు వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చే అనేకమైన అవకాశాలు కూడా వారికి తెలియాలి ( అంటే తలిదండ్రులు తమ పిల్లలకు ఏ ఏ అవకాశాలు ఇవ్వగలరో , లేక కల్పించ గలరో వారి పిల్లలకు  తెలియ చేయాలి )
3.కేంద్రకం : అంటే  పిల్లలు కుటుంబం లో వారే కేంద్రం అనీ , ప్రస్తుతం వారు చేస్తున్నది (  అంటే ప్రతి క్షణం లోనూ పిల్లలు చేస్తున్నది ! ) తెలుసుకోవాలని వారి తలి దండ్రులు ఉత్సాహ పడుతూ ఉంటారనీ పిల్లలకు తెలియాలి.( ఈ విషయం లో కూడా తలిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కలిగించాలి ) 
4.బాధ్యత : అంటే తలిదండ్రులు తమ పిల్లల మీద ఉంచుకునే విశ్వాసం వల్ల , పిల్లలలో , ఒక  కమిట్ మెంట్ అంటే   ఏ పనినైనా బాధ్యత తో చేయాలనే భావన కలుగుతుంది. దానితో వారు, మిగతా భయాలనూ, ఆందోళనలనూ పక్కన పెట్టి , అప్రయత్నం గా నే కర్తవ్యోన్ముఖులవుతారు. 
5. క్లిష్టమైన లేక చాలెంజింగ్ అవకాశాలు:  సమయానుకూలం గా పిల్లలకు చాలెంజింగ్ సమస్యలు ఇస్తూ ఉంటె, వారు వారి శక్తి సామార్ధ్యాలకు  పదును పెడుతూ , ఆ కార్యం లో పూర్తిగా నిమగ్నమై  విజయాలు సాధిస్తూ , తద్వారా , అధికానందం కూడా పొందుతారు. అంటే ఫ్లో లేక ప్రవాహ స్థితి లో ఉంటారు.  ( అంటే ఉదాహరణకు వారి చదువులో, తీసుకోవలసిన  పరీక్షలూ, ఇతర ఎంట్రెన్స్ పరీక్ష లూ ఈ కోవకు చెందుతాయి )
పైన చెప్పిన అయిదు విషయాలూ కుటుంబాన్ని కూడా ఒక ఫ్లో అంటే ప్రవాహ స్థితి లో ఉంచుతాయి.  తల్లి దండ్రులు, వారి సంతానానికి , కేవలం  భౌతిక మయిన  అవసరాలు  కలిగించడమే కాకుండా, పై విషయాలలో కూడా శ్రద్ధ చూపించి, ఆ పరిస్థితులు కూడా కల్పిస్తే , కుటుంబం అంతా అధికానందం పొందుతుంది. 
వచ్చే టపాలో మిగతా సంగతులు తెలుసుకుందాము !