Our Health

Archive for the ‘మానసికం’ Category

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ మీ ఇంటర్వ్యూ రోజు అనుకోండి !

In మానసికం, Our minds on మార్చి 7, 2013 at 11:20 సా.

పని సూత్రాలు. 18. ప్రతి రోజూ  మీ ఇంటర్వ్యూ  రోజు అనుకోండి ! 

 క్రితం టపాలో పని సూత్రాలలో వస్త్ర ధారణా , ఆభరణాలూ , పాద రక్షలూ మొదలైన విషయాలలో మీరు తీసుకో వలసిన జాగ్రత్తలూ, శ్రద్ధా  ఎట్లా ఉండాలో చూశాము కదా ! ఇప్పుడు ఇంకొన్ని వ్యక్తి గతమైన శ్రద్ధ ఏ  రకం గా మీ ఉద్యోగం లో మీ అభి వృద్ధి కి దోహద పడతాయో తెలుసుకుందాం ! 
1. మీరు ధరించే బట్టలు , ఎప్పుడూ ,  ఉతికి ఇస్త్రీ చేసినవీ , తాజాగా మడతలు లేకుండా ఉన్నవీ ధరించండి ! అంతే కాకుండా , గుండీలు అంటే బటన్స్ లేదా బొత్తాములు కొన్ని ఊడి పోయినవీ , లేదా కొన్ని చివర్లలో కుట్లు ఊడి పోయినవీ, లేదా చిన్న వైనా  మచ్చలు ఉన్న వస్త్రాలు ధరించి ఆఫీసుకు గానీ మీరు పని చేసే స్థానానికి గానీ వెళ్ళడం శ్రేయస్కరం కాదు ! 
2. రోజూ తాజాగా , స్నానం చేసి , డి  ఓడరెంట్  స్ప్రే చేసుకుని ఆఫీసు కు వెళితే  మీ శరీరం తో పాటుగా , మీ మనసు కూడా ఉల్లాసం గా ఉండి , మీరు బాగా పని చేయగలగడమే కాకుండా , మీ బాసు మెప్పు కూడా పొంద గలరు ! 
3. మీ కేశాలంకరణ కూడా తాజాగా చేసుకుని వెళ్ళడం మంచిది. ట్రిమ్ చేసిన హేర్ కట్ చేసిన తలలు కూడా  కార్పోరేట్ కల్చర్ కు అనుగుణం గా ఉంటాయి ! ఉష్ణ దేశాలలో , మీ తల మీద హేర్  ట్రిమ్ చేసి ఉంటే హాయి గా కూడా ఉంటుంది ! 
4. పురుషులు రోజూ షేవ్ చేసుకుని ఆఫీసు కు వెళితే వారు వారి బాసు మీద మంచి ఇంప్రెషన్ ఏర్పరచడమే కాకుండా , వారి సహచర యువతుల్లో ప్రేమ భావనలు, అవి లేక పొతే కనీసం స్నేహ భావనలైనా కలిగించ గలరు ! ఎందుకంటే చాలా మంది యువతులు, పురుషులు ఫ్రెష్ గా షేవ్ చేసుకుంటే నే ఇష్ట పడతారు ! 
5. చేతులు ఎప్పుడూ శుభ్రం గా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి !  కారు డ్రైవ్ చేసీ, లేదా  బైక్ కానీ సైకిల్ కానీ నడిపి , మాసి పోయీ , నల్లని గ్రీజ్ మరకలు, మసీ అంటి ఉన్న చేతులతో ఆఫీసులో ఎవరికీ కనపడడం మంచిది కాదు !  మీ పని రీత్యా,  కొంత సమయం మీ చేతికి మలినాలు అంటినా కూడా ! ఎందుకంటే , అపరి శుభ్రం గా ఉన్న చేతులు ముఖ్యం గా అనారోగ్య కరం !  మానవుల కు వచ్చే అనేక రకాలైన ఇన్ఫెక్షన్ లు కేవలం చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. మీ ఆఫీసు లో ఇతర ఉద్యోగులు కానీ  లేదా మీ కస్టమర్స్ కానీ మీతో హ్యాండ్ షేక్ లేదా కరచాలనం చేయడానికి ఇష్ట పడరు , మీ చేతులు మలినం గా ఉంటే ! ఇంకో ముఖ్య విషయం , ఆఫీసులలో కానీ , మీరు పని చేసే స్థానం లో కానీ , ప్రేమాయణాలు కనుక జరిపే వారి కి  మలినమైన చేతులు చాలా నష్ట దాయకం  ! 
6. చేతి వేళ్ళ గోళ్ళు , అమ్మాయిలకు అందం గానే ఉంటాయి , క్రమం గా మ్యానిక్యూర్ చేయించు కుంటూ ఉంటే , కానీ పెరిగి ఉన్న గోళ్ళు , లేదా గోళ్ళ క్రింద మలినాలతో నల్ల గా మారి ఉన్న గోళ్ళూ, పురుషులకు ఉంటే ఆ పురుషులు అపరిశుభ్రం గా ఉన్నట్టు కనిపిస్తారు !
7. చాలా మంది  ఆఫీసుకు వెళ్ళే తొందరలో ఫలహారం అంటే టిఫిన్ చేసీ , లేదా అన్నం తినీ , వెంటనే తమ వాహనాల మీద ఆఫీసులకు ప్రయాణం అవుతూ ఉంటారు ! దానితో , పళ్ళ మధ్య చేరిన ఆహార పదార్ధాలు ఇరుక్కుని, తరువాత కొన్ని గంటలకు, వారు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు , దుర్వాసన వస్తూ ఉంటుంది ! అందువల్ల క్రమం గా బ్రష్ చేసుకోవడమూ ( ప్రత్యేకించి ఏమైనా ఆహారం తిన్న తరువాత ), లేదా ఆ అవకాశం లేని స్థలాల్లో  నోటిని తాజాగా ఉంచే చూయింగ్ గం ను నమలడమో  చేయాలి ! కానీ ఆఫీసులో కాదు ! 
8. ఆల్కహాలు , టీలు , కాఫీలు అలవాటు ఉన్న వారు కూడా వారి నోటి పరిశుభ్రత విషయం లో శ్రద్ధ తీసుకోవాలి ! ప్రత్యేకించి ఆల్కహాలు తాగే అలవాటు ఉన్న వారి దగ్గర రెండు రకాలు గా వాసన రావడానికి అవకాశం ఉంది ! ఒకటి  వారు క్రితం రాత్రి ఎక్కువ  మోతాదు లో తాగితే , వారు ఊపిరి వదులు తున్నప్పుడు , ఒక రకమైన ఆల్కహాలు వాసన వస్తుంటుంది ! వారి శరీరం ఎక్కువ గా చెమట పట్టి కూడా వాసన వస్తుంది ! అంతే కాక , వారి నోటిలో ఆల్కహాలు నోటి చర్మం లో కలిగించే మార్పుల వల్ల కూడా వాసన వస్తుంది !   పని సూత్రాలలో ముఖ్య సూత్రం: సిగరెట్లూ ,  మద్యమూ , మాదక ద్రవ్యాలూ ముట్టుకోక పోవడం ! ఎందుకంటే అవి  పని సూత్రాలు పాటించే వారి  దీర్ఘ కాలిక లక్ష్యాలను  ఒక్క సారి గా అగాధం లో పడవేస్తాయి !  ఎందుకంటే ఆ లక్షాలు వారు చేరుకునే లోగానే , వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ! ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఇట్లాంటి అలవాటు ఉన్న వారు పని సూత్రాలు పాటించినా , వాటి ప్రయోజనాలు అనుభవించకుండానే అనారోగ్య బారిన పడతారు ! వారికి పని సూత్రాలు  నిరుపయోగం ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

 

పని సూత్రాలు . 17. మీ స్టైల్ ఎట్లా కనిపించాలి ?:

In మానసికం, Our minds on మార్చి 6, 2013 at 9:09 సా.

పని సూత్రాలు . 17.  మీ స్టైల్ ఎట్లా కనిపించాలి ?:

 

1. మీ ప్రత్యేకమైన స్టైల్ ఇతరులకు కనిపించాలంటే , మీ ట్రేడు మార్కు బట్టలనే ఎప్పుడూ ధరించండి ! 
2. బట్టలను ఎప్పుడూ చాలా బిగుతు గా అంటే టైట్ గా ఉన్నవి ధరించకండి ! ఎందుకంటే , బిగుతు గా ఉన్న బట్టలు , మీరు ఏ  కారణం చేత వేసుకుంటున్నా , మీరు చాలా పీనాసి గా కనిపించడం జరుగుతుంది ! అంటే మీరు మీ కోసం మంచి బట్టలు కూడా కొనరన్నతేలిక  అభిప్రాయం ఏర్పడుతుంది చూసే వారికి .  కొద్దిగా వదులు గా ఉన్న బట్టలు వేసుకుంటే , మీలో ఎంతో  ” నాణ్యత ” అంటే క్వాలిటీ ,  ఎంతో  హుందాతనం కనిపిస్తుంది మీలో , ఇతరులకు ! 
3. మీరు వేసుకునే బట్టలు కొంత  ఆలస్యం గా కొంటున్నా , మంచి నాణ్యత గల బట్టలు కొనండి ! అంటే మీరు ఆరు నెలలకు ఒక సారి చవక బట్టలు కొనే కంటే, తొమ్మిది నెలలకు ఒకసారి , మంచి నాణ్యత గల బట్టలు కొనుక్కుని వేసుకుంటూ ఉండండి ! 
4. ఆభరణాలను మీ ఆఫీసులో తక్కువగా ధరించండి ! కానీ పెట్టుకునేవి చాలా నాణ్యత గల , ఖరీదు గల వాటినే పెట్టుకోండి !  విచ్చల విడి గా ఖర్చు చేసి ఆభరణాల ఎగ్జిబిషన్  కోసమా అన్నట్టు ఆఫీసు కు పెట్టుకోవడం  మీ  అలంకరణ పట్ల మీకున్న రుచి అంటే టేస్ట్  మీద ఇతరులకు అనుమానాలు రేకెత్తిస్తుంది !  అంతే  కాక విపరీతం గా ఖర్చు చేస్తుంటే , మిమ్మల్ని మీ ఇతర కొలీగ్స్  ” వేరు చేసి చూసే ‘ ప్రమాదం ఉంటుంది ! అంటే మీరు వారి ”గ్రూపు ” కు చెందిన వారిగా వారు భావించరు ! 
5. మీరు యువతులయితే , మీరు ఏ  మేకప్ వేసుకుంటే ఎక్కువ అందం గా కనబడతారో , అదే మేకప్ రోజూ వేసుకుంటూ ఉండండి !  ఎండా కాలానికీ, వానా కాలానికీ , లేదా చలికాలానికీ , ఇట్లా ఒక్కో ఋతువు కు ఒక్కో మేకప్ వేసుకోవడం పని సూత్రాలకు విరుద్ధం !  మిమ్మల్ని అందం గా గుర్తు ఉంచుకునే మేకప్ నే ఎప్పుడూ వేసుకుంటూ ఉండండి ! 
6. చాలా నిరాడంబరం గా  వస్త్ర ధారణ చేసుకోవడం కన్నా , కాస్త డాబు దర్పం గా నే ఉండేట్టు మీ బట్టలు వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం అలవాటు చేసుకోండి ! 
7. మీరు మీ శరీరం మీద బట్టలైనా , పాదరక్షలైనా , లేదా ఆభరణాలు అయినా ధరించేప్పుడు మీరు ప్రత్యేకం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం ! 
అవి ఎప్పుడూ , నాణ్యత ఉన్నవీ , ప్రియమైనవీ , స్టైలిష్ గా ఉన్నవీ , అవి ధరించిన మిమ్మల్ని గుర్తు పట్టేవీ అయి ఉండాలి . అంతే కాక అవి మీ అందాన్నీ , హుందా తనాన్నీ  ఇనుమడింప చేసేవి గా ఉండాలి ! 
పని సూత్రాలలో మీ వస్త్ర ధారణా , మీరు ధరించే ఆభరణాలూ , పాదరక్షలూ , మీ మేకప్ , ఇవన్నీ ,  మీలో ఉన్న కళా దృష్టి ని   ప్రతిబింబించడమే కాకుండా , స్టైలిష్ గా కూడా  కనిపించాలి !   ఉద్యోగం లో మీ పురోగతి కి ఇవి ఎంత గానో సహకరిస్తాయి ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !  
 

పని సూత్రాలు . 16. మీ స్టైల్ చూపించండి !

In మానసికం, Our minds on మార్చి 5, 2013 at 10:55 సా.

పని సూత్రాలు . 16. మీ స్టైల్ చూపించండి ! 

 
పని లో లేదా మీరు పని చేసే స్థానం లో మీ దైన  శైలి చూపించడం, కేవలం మీ ప్రత్యేకత ను  ఇతరులకు తెలపడమే ! 
కార్పోరేట్ సంస్థ లో పని చేసే మాధవి  కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుఎట్.  ఆఫీస్ లో తను ఎప్పుడూ ప్రత్యేకం గా కనబడుతుంది. ఫార్మల్ గా ఎక్కువగా తయారవనట్టు కనిపిస్తుంది !  ఎడమ చేతి మణికట్టు కు ఒక టైమెక్స్ వాచ్ గోల్డ్ స్ట్రాప్ ది  పెట్టుకుంటుంది. కుడి చేతికి ఒకటే సన్నని బంగారు గాజు ! దానితో చేతులు  బోసి గా ఉన్నా , మాధవి సన్నగా ఉండడం తో ,  ఆ చేతులు తామర కాడల్లా  సున్నితం గా కనబడుతూ ఉంటాయి ! కాస్త చామన ఛాయ గా ఉన్నా లేత పసుపు రంగు, లేత ఆకుపచ్చ రంగు లేదా పింక్ రోజా రంగు  ఫైన్ కాటన్ చీరలే కట్టుకుంటుంది !  చీర పమిట ను అలవోకగా, యదా లాపం గా వదిలేసినట్టు  కట్టుకుంటుంది !  ఆ పమిట ఎప్పుడూ, మాధవి అందాలను కప్పి ఉంచడానికి ఏదో గిల్టీ గా ఫీలై పోయి , జారి పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ! మాధవి పని చేస్తున్న సమయం లో  పదే  పదే  జారి పోతున్న తన  పమిట ను  అప్రయత్నంగానే మళ్ళీ  మళ్ళీ తన వక్షోజాల పైకి సరి చేసుకుంటుంది. కొన్ని సార్లు  ఆ సరి చేసుకున్న పమిట మళ్ళీ ” తన బుద్ధి ” పొనిచ్చు కోక, జారడం మొదలెడుతూ ఉంటే , ఈ సారి తన పెదిమలు బిగబెట్టి ఆ పమిటను , తన వక్షోజాల మీదగా పోనిచ్చి ,  అంచును కసిగా తన నడుము లోకి బిగుతుగా పోనిస్తుంది !  ఆ ప్రయత్నం లో ఆమె సఫలం అయినా , ఇంక జారిపోలేని  పమిట మాటున ఒదిగిన తన అందాలను చూసుకుని తనలో  తనే ఒక మందహాసం చేసుకుంటుంది !  కాస్త ఓపిక పట్ట మన్నట్టు గా ! మాధవి తన ముఖం అలంకరణ విషయం లో ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకుంటుంది ! తన చెవులకు ఉండీ ఉండనట్టు ఉన్న రాళ్ళ స్టడ్స్ పెట్టుకుంటుంది ! వాటి వెలుగు కొంచమే  అయినా , ఎప్పుడూ చిరు నవ్వు తో ఉండే , మాధవి ముఖం వెలుగుకు ఇంకా కాంతి వంతం గా మెరుస్తూ ఉంటాయి ! తన పెదవులకు , లిప్ స్టిక్ ఎప్పుడూ తన పెదిమల రంగువే వేసుకుంటుంది ! దానితో  దేవుడి కి కూడా తెలియదు మాధవి లిప్ స్టిక్ పెట్టుకుందని ! తన హాండ్ బ్యాగ్ , ఫైన్ లెదర్ తో తయారు చేసినదే తెస్తుంది ఆఫీసుకు ! కాళ్ళకు చెప్పులు కూడా ఫైన్ లెదర్ చెప్పులు ,హై  హీల్స్ వేసుకుంటుంది ! తన బాసు మీద ఒక అంగుళం పొడవు గా ఉన్నట్టు కనిపిస్తుంది ! ఎలిగెంట్  గా ! 
అది మాధవి స్టైల్ !  ఒక ప్రత్యేకమైన శైలి ! ఇంక తన ఆఫీసులో ఎవ్వరికీ లేని స్టైల్ ! ఆమె నడుస్తున్నా , పని చేస్తున్నా, కూర్చున్నా , టేబుల్ మీద, పేపర్ మీద రాస్తున్నా , కంప్యుటర్ మీద  వర్క్ చేస్తున్నా, ఒక ప్రత్యేకమైన స్టైల్ !  ఆమెకు తను చేసే పని మీద కూడా చాలా శ్రద్ధ !  చాలా ఎఫిషియెంట్ !  ఆమె తన ఉద్యోగాన్ని ఎంత బాగా చేస్తుందో , అంతే  బాగా తన అప్పియరెన్స్ ను కూడా చూసుకుంటుంది ! దానితో ఆమె తన పనిని కూడా చాలా ఉత్సాహం గా , సంతోషం గా చేయ గలుగుతుంది !  అది మాధవి స్టైల్ !  
 
వచ్చే టపాలో మీ ప్రత్యేకమైన శైలి కి మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం ! 

 

పని సూత్రాలు. 15. మీ ప్రత్యేకమైన స్టైల్ ( శైలి ) కనబరచండి !

In మానసికం, Our minds on మార్చి 3, 2013 at 5:24 సా.

పని సూత్రాలు. 15.  మీ ప్రత్యేకమైన స్టైల్ ( శైలి )  కనబరచండి ! 

క్రితం టపాల  లో  ఉద్యోగం లో మీరు పాటించ వలసిన సూత్రాలు !  ఈ పని సూత్రాలు  ఎక్కడా రాసి ఉండవు !  ఏ  ఉద్యోగం చేరే సమయం లోనూ మీకు చెప్పరు  కూడా ! ఎందుకంటే , మీరు చేరిన ఉద్యోగాన్నే మీరు అతుక్కుని , చాలా ఏళ్ల  వరకూ అదే పొజిషన్ లో ఉంటే  నే  మేనేజర్లకూ , యజమానులకూ అనుకూలమైన పరిస్థితి ! కానీ మీరు సదా మీ పురోగతి గురించి మీ  ఆలోచిస్తూ ఉండాలి !  ఎందుకంటే , మీలో చాలా మంది కి ఆ శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి , మీరు ముందుకు పోగలరు ! 
ఇప్పుడు మీదైన స్టైల్ అంటే ఏమిటో చూద్దాము !  మానవులందరూ ఒకటే అయినా ,  ఏ  ఒక్క మానవుడూ మిగతా వారి లా ఉండడు  కదా !  అంటే భౌతిక లక్షణాలలో , అందరికీ అన్ని అవయవాలూ ఉన్నా  ప్రతి వారూ ఇంకో వారి ని పోలి ఉండరు కదా !  ఇక మానసిక పరిస్థితి , క్యారెక్టర్ విషయాలు చూసినా , ప్రతి ఒక్కరిదీ ఒక్కో తీరు కదా !  అంటే  ప్రతి వారూ పెరుగుతూ ఉన్నప్పుడు , శారీరిక మార్పుల తో పాటుగా , మానసిక మార్పులూ , ఇంకా వారి ప్రవర్తన లో మార్పులు కూడా వారిదైన ప్రత్యేకతను సంతరించు కుంటారు ! ఈ మార్పులే వారి వారి స్టైల్ గా చెప్పుకోవచ్చు ! 
ఇట్లా ప్రతి ఒక్కరి స్టైల్ ను వారు  భౌతికం గా కనిపించేట్టు బహిరంగ పరచేందుకు ఉపయోగ పడే సాధనమే స్టైల్ ! లేదా శైలి ! 
ఆధునిక మానవ జీవితం లో ఈ స్టైల్ చాలా ప్రాముఖ్యత సంతరించు కుంది !  ముఖ్యం గా వారి దుస్తులూ , ఆభరణాల విషయం లో ! ఈ స్టైల్ ను ఒక రకం గా పెట్టుబడి దారీ వ్యవస్థ ను విపరీతం గా ప్రోత్సహించే రీతి గా ఉంటుంది ! ఎందుకంటే , కాల క్రమేణా ,  వివిధ మీడియా లలో వచ్చే వివిధ ప్రకటనల రూపం లోనూ,సామాన్య మానవులకు అందుబాటు లో ఉండే  వినోదం , సినిమా ద్వారానూ , రాత్రనక , పగలనక , అదే పని గా , వస్తూ , సామాన్య మానవుల ఆలోచనా ధోరణి లో కూడా సమూలమైన మార్పులు తెచ్చి , ఈ స్టైల్ కు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితి కల్పించాయి ! 
కారణాలు ఏమైనప్పటికీ , ప్రతి వారూ , తమదైన శైలి కోసం ఆత్రుత పడుతూ ఉంటారు, నిరంతరం ! మీరు చేసే ఉద్యోగం విషయం మనం ప్రస్తుతం మాట్లాడు కుంటున్నాం కాబట్టీ ,  మీరు మీ మీ ఉద్యోగాలలో మంచి పేరు తెచ్చు కోవడానికీ , లేదా మీరు ఇంకా పురోగ మించ డానికీ , మీ స్టైల్ మీకు ఎంతో  ఉపయోగకరం గా ఉంటుంది ! ఫలానా వ్యక్తి , ఫలానా ఆఫీసు లో పని చేస్తాడు ! అతను   ఎప్పుడూ  మల్లె పూవులాంటి తెల్ల బట్టలే కట్టుకుంటాడు !  అతనితో ఏ  సమస్యా ఉండదు ! పని జాగ్రత్త ఎక్కువ , ఏ  ఫైలూ పెండింగ్ లో ఉంచడు ! అనో ,లేదా  ‘ఆమె పని చేసే ఆఫీసులో  చాలా పాపులర్ బాంబే డయింగ్ ప్రింట్స్ సారీ కట్టుకుని చాలా ఆకర్షనీయం గా ఉంటుంది ! ఎవరు ఏ  ప్రాబ్లమ్  తో అప్రోచ్ అయినా నవ్వుతూ మాట్లాడించి వారి సమస్యను సాల్వ్ చేస్తుంది ! మిగతా వాళ్ళ లా కాదు ! ‘ అనో వారి వారి స్టైల్ గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు సామాన్యం గా ! 
మరి ఈ స్టైల్ ను  స్త్రీలూ  పురుషులూ  ఏ విధం గా మెయిన్ టెయిన్  చేయాలో వచ్చే టపాలో చూద్దాం !  

పని సూత్రాలు. 14. మీ ఆత్మ విశ్వాసమూ , శక్తీ కనిపిస్తూ ఉండాలి !

In మానసికం, Our Health, Our minds on మార్చి 2, 2013 at 1:31 సా.

పని సూత్రాలు. 14. మీ ఆత్మ విశ్వాసమూ , శక్తీ  కనిపిస్తూ ఉండాలి ! 

పని లో ప్రవేశించే సమయం లో మీరు   ఆత్మ  విశ్వాసం తొ ణికిస  లాడుతూ కనిపించాలి !  మీలో ఉత్సాహమూ , శక్తీ కూడా కనిపించాలి ! క్రితం రాత్రి అంతా  నిద్ర పోకుండా,  నీరు కారిపోతూ నిరుత్సాహం గా , తోటకూర కాడ  లా వాలి పోయి , ఆఫీసు లో ప్రవేశిస్తే , మిగతా సహా ఉద్యోగులకు మీ పై అభిప్రాయం ఎట్లా ఉంటుందో  గమనించండి , ముఖ్యం గా మీ పై అధికారి కానీ , మేనేజరు కానీ మీ పరిస్థితి గమనిస్తే  వారి అభిప్రాయం కూడా ఎట్లా ఉంటుందో చూడండి ! పని ఎంత కష్టం గా ఉన్నా, మీరు ఆత్మ న్యూనతా భావం తో  అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పని మొదలు పెడితే మీరు చేస్తున్న పనిని సకాలం లో పూర్తి చేయలేక పోవడమే కాకుండా ,  ” పని సరిగా చేయరు ” అనే అపవాదు కూడా పడుతుంది !  మీరు ఏ  ఆఫీసు లో మీ పని కోసం వెళితే , అక్కడ ఉన్న ఉద్యోగులను గమనిస్తారు !  అక్కడ ,మాసి పోయిన బట్టలతో , చాలా ఆయాస పడుతూ , నీరసం గా కనిపిస్తూ  ఉన్న ఉద్యోగి ని మీరు కనక  చూస్తే , మీరు వచ్చిన పని మర్చిపోయి  ” అతడేంటో అదోలా ఉన్నాడు ! పని లో అనుభవం ఉందో  లేదో దేవుడికెరుక ! కానీ ,ఇచ్చిన పని మాత్రం రోజుల్లో చేయవలసినది నెలల తరబడి చేసేట్టు ఉన్నాడు ” అని అనుకుంటారు వెంటనే ! నిజానికి అతడు తన పనిలో సమర్దుడే అయి ఉండ వచ్చు ! కానీ అతడిని చూడగానే ఏర్పడే అభిప్రాయం అదే కదా !  అతి తొందరగా కదులుతూ , ఇతర ఉద్యోగులను పలకరిస్తూ , చక చకా పని చేసే వారిని గమనిస్తే , వారు ఉత్సాహ పూరితం గానూ , ఆత్మ విశ్వాసం తోనూ పని చేస్తున్నట్టు కనిపిస్తుంది ! వారు తాము చేస్తున్న పని ( ఉద్యోగం ) లో అంత  సమర్ధత లేక పోయినా కానీ , వారి ని చూస్తే  కలిగే అభిప్రాయం అట్లా ఉంటుంది ! పై లక్షణాలు , మీరు చేసే వివిధ ఉద్యోగాల ను బట్టి కొద్దిగా తేడాలు ఉంటాయి !  మన దేశం లోకొందరు పోలీసు లను ను కనుక చూస్తే ,  వారు ఎన్నో సంవత్సరాల పూర్వమే ,వారి శారీరిక వ్యాయామం గురించి మరచి పోయారని వారి ని చూడగానే చెప్ప వచ్చు !  వారి ముందే దొంగతనం చేయడానికి కూడా దొంగలకు ఏమాత్రం భయమూ , బెరుకూ ఉండవు, ఎందుకంటే వారికి  ( అనుభవ పూర్వకంగా ! )తెలుసు అట్లాంటి పోలీసులు తమను పట్టుకోలేరని ! పనిలో మీ ఉత్సాహమూ , శక్తీ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటే ,  మీ పురోగతి కూడా అదే విధం గా ఉంటుంది !
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !

పని సూత్రాలు. 13. మీ స్మైల్ తీసుకు వెళుతుంది, మిమ్మల్ని వేల మైళ్ళు !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 28, 2013 at 9:55 సా.

పని సూత్రాలు. 13. మీ స్మైల్   తీసుకు వెళుతుంది, మిమ్మల్ని,  వేల మైళ్ళు ! 

 
సదా చిరునవ్వు చిందించండి ! :నవ్వు !  చిరునవ్వు ! సృష్టి లో మానవులకు మాత్రమే  ఉన్న అతి  ప్రత్యేక  లక్షణం ! ఉదయం  మీ ఉద్యోగం లో ప్రవేశించ గానే మీ ఇతర ఉద్యోగులకు మీ అమూల్యమైన చిరునవ్వు చూపించండి ! కరచాలనం , అదే హ్యాండ్ షేక్ , చేసే సమయం లో కూడా మీ ఇతర ఉద్యోగులతో , చిరునవ్వు నవ్వండి ! మీరు చేసే పని కష్టం అవుతున్నప్పుడు , నవ్వండి ! , మీ చుట్టూ ఉండే సమస్యల వలయాన్ని కూడా ఛే దించ డానికి , ఏకైక మార్గం, మీరు చిరునవ్వు చిందిస్తూ, ముందుకు పోవడమే !  అది అనేక  సూర్యోదయాలకు సమానం !  మీ నవ్వు , మీలో ఏదో తెలియని నూతనోత్సాహం నిండుతుంది, మీలో ఒక కొత్త కాంతి జనిస్తుంది !  మీరు చేసే పని ని ఏకాగ్రత తో చేయ గలుగుతారు ! మీ రోజు హాయి గా మొదలై హాయిగా పూర్తి  కూడా అవుతుంది ! 
మరి అసలు సిసలైన మీ చిరునవ్వు ఎట్లా ఉండాలి ?:
మీ చిరునవ్వు , స్నేహ పూర్వకం గా ఉండాలి ! మీలో ఏ  భేషజాలు లేకుండా నవ్వినట్టు ఉండాలి , అంటే మీలో ఇతర వ్యక్తుల మీద అసూయ  కానీ, మీ ఆఫీసు లో మీ స్థానం అంటే మీ పొసిషన్  గురించి గానీ ఏమాత్రం మీకు గర్వం కానీ, అహం కానీ లేకుండా నిర్మలం గా నిష్కల్మషం గా ఉండాలి ! అభం శుభం తెలియని ఓ చిన్నారి చిరు నవ్వు ఎట్లా ఉంటుందో , అట్లా మీ చిరు నవ్వు ఉండాలి ! మీ చిరునవ్వు  సిన్సియర్ గా ఆనెస్ట్ గానూ , ఫ్రాంక్ గానూ ఉండాలి ! సంతోషం గానూ ఉండాలి !
కొందరు వ్యక్తులతో మనం కలిసినప్పుడు ,  ” పొద్దున్నే వీడి మొహం చూడాల్సిన ఖర్మ పట్టింది నాకు ! ఇక రోజంతా ఎట్లా ఉంటుందో ఏమో ” అనుకుంటూ నవ్వినట్టు గా ఉంటుంది  వారి నవ్వు ! ఇంకొందరు  ఏడిచినట్టు  నవ్వుతారు, చక్కటి చిరునవ్వును  వారి  మనసు ఉక్కు గోడలలో దాచేసి ! కొందరు  పురుషులు ఉద్యోగం లో తమ తోటి పురుష ఉద్యోగులతో ” వీడెక్కడ దాపురించాడు రా ,ఆఫీసు కు రాగానే అన్న విధం గా ఓ పొడి నవ్వు వారికి ” పడేసి ” వారినుంచి దూరం గా ” పడతారు ” ! అదే వారి తోటి స్త్రీ ఉద్యోగినులతో , వారి మొహం అంతా  సూర్యకాంతి పుష్పమంత చేసుకుని మరీ కృత్రిమమైన నవ్వులు అనేకం ” పండిస్తూ ” ఉంటారు ! స్త్రీ ఉద్యోగుల ముందు వారు నవ్వే ప్రతి నవ్వూ చిలిపి తనం తో  ఏదో ఒక నిగూఢమైన కోరిక తో  నిండి ఉంటుంది !  ఏదైనా పబ్లిక్ ఆఫీసు లో క్యాష్ కౌంటర్ దగ్గర ఉండే క్లర్క్  ను ఎప్పుడైనా గమనించారా ? వారి చూపులు ఎప్పుడూ మీ చేతుల మీదే ఉంటాయి ! మీరు చిరునవ్వు నవ్వి  మీ పనిని త్వరగా చేయమని వివరించి చెబుతూ ఉంటే  ” ఎవడ్రా వీడు నాకు కహానీ లు చెబుతున్నాడు ? అన్నట్టు మీ మొహం వంక తేరి పార చూస్తూ , వారి చేతులలో ఉన్న నోట్లు అతి వేగం గా లెక్క పెడుతూ ! అదే మీరు ”  మీరు కట్ట వలసిన డబ్బు కాకుండా విడిగా ఓ పదో ఇరవయ్యో నోట్లు ఇంకో చేత్తో పట్టుకుని క్యాషియర్ వైపు చూడండి ! వారి మొహం ఒక్క సారి గా వెలిగి పోయి , వారు చేస్తున్న పనిని ఆపి మీ విషయం చూస్తారు ! క్షణాల్లో పూర్తి  చేస్తారు ! 
మీ నవ్వు  మీలో ఎదుటి వ్యక్తి  మీద ఏ విధమైన అసూయా , ఈర్ష్యా ద్వేషాలు , క్రోధాలూ లేనప్పుడు , సహజం గా, నిర్మలం గా , ప్రశాంతం గా , సంతోషకరం గా ఉంటుంది!  అటువంటి మీ చిరునవ్వు  అతి శక్తి వంతమైనది !   మిమ్మల్ని  మీ జీవిత పధం లో అనేక వేల మైళ్ళు ముందుకు తీసుకు వెళుతుంది, అతి వేగం గా ! అందుకే మీ అమూల్యమైన చిరు నవ్వు సదా నవ్వుతూ ఉండండి !  మీ జీవితాలకు ” జీవం ” పోస్తూ ఉండండి నిరంతరం ! 
 
వచ్చే టపా లో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 12. ఉద్యోగాలలో వనితల వస్త్ర ధారణ.

In మానసికం, Our minds on ఫిబ్రవరి 27, 2013 at 11:00 సా.

పని సూత్రాలు. 12. ఉద్యోగాలలో వనితల వస్త్ర ధారణ. 

 
క్రితం టపాలో మనం ఉద్యోగాలలో స్త్రీ పురుషులు అసందర్భ వస్త్ర ధారణ  చేస్తే  ఎట్లా అనిపిస్తుందో చూశాము !  ఆధునిక స్త్రీ పురుషులు చాలా పురోగమించారు. పని సరిగా చేసినంత కాలం  ఎవరు ఎట్లా డ్రస్ చేసుకుంటే ఏం ? హూ కేర్స్ ? అనే భావనలో , స్వేఛ్చా భావనలతో , స్వతంత్ర భావనల తో ఉంటారు అది మంచిదే ! ఆధునిక  మేనేజర్లు కూడా వారి వారి స్వేఛ్చా  స్వాతంత్ర్యాలను  గౌరవించుతూ ,  వారి ఉద్యోగస్తులకు తగిన స్వతంత్రాన్ని ఇచ్చే వారు కూడా ఉన్నారు ఈ కాలం లో ! కానీ , స్వేఛ్చా స్వాతంత్ర్యాలు, ఆధునిక భావాలు ఉన్న స్త్రీ పురుషులు వారి వారి స్వంత ఎంటర్ప్రైజెస్ లో వారికి ఇష్టం వచ్చిన రీతి లో వస్త్ర ధారణ  కూడా చేయ వచ్చు ! కానీ ఇంకొకరి కార్పోరేట్ ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు , ఆ కంపెనీ యొక్క ఇమేజ్ ను వారి వస్త్ర ధారణ  ఏ  విధం గా ప్రభావితం చేస్తుందో  ఆలోచించి తదనుగుణం గా ప్రవర్తించాలి ! గుర్తు ఉంచుకోండి !  పని సూత్రాలలో ముఖ్యమైనది ,  మీరు పని చేసే చోట మీరు కేవలం అదే సీటు కు అతుక్కు పోకుండా , మీ దీర్ఘ కాలిక లక్ష్యాన్ని విస్మరించ కుండా, పురోగమిస్తూ ఉండాలి ! అందుకు  మీ వస్త్ర ధారణ కూడా అందుకు ఒక ముఖ్య మైన విషయం ! మరి వనితలకు వస్త్ర ధారణ ఎట్లా ఉండాలి ? ఈ విషయం లో ప్రముఖం గా వనితలు పరిశీలించ వలసిన విషయాలు , ప్రయాణం చేసే సమయం లోనూ ( అది మళ్ళీ వారి ప్రయాణ వాహనాన్ని బట్టి కూడా మారుతుంది కదా ! ముఖ్యం గా స్కూటర్ మీదా , సైకిల్ మీదా ప్రయాణం చేసే యువతులు చీర కొంగులూ , సల్వార్ చెంగులూ చక్రాలలో ఇరుక్కోకుండా జాగ్రత్త తీసుకోవాలి ! ) , ఇంకా వారి వారి ఆఫీసులోనూ వారికి , అక్కడి వాతావరణానికీ , ఉష్ణోగ్రత లకు తగినట్టుగా , వారికి వీలైనంత అనుకూలం గా ఉండేట్టు చూసుకోవాలి !  వారు పని చేసే సమయం లో కూడా వారికి ఎక్కువ కంఫర్ట్  కలిగిస్తూ ఉండాలి ! 
 
( పైన ఉన్న చిత్రం లో ఆధునిక పాశ్చాత్య యువతుల నమూనా  ఆఫీసు వస్త్ర ధారణ చూడ వచ్చు. )
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు. 11. వేష ధారణ ముఖ్యం !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 25, 2013 at 9:14 సా.

పని సూత్రాలు. 11. వేష ధారణ ముఖ్యం ! 

పని సూత్రాలలో రెండవ అధ్యాయం. మిమ్మల్ని మీరు పని చేసున్నంత కాలమూ , అంటే మీరు మీ ఉద్యోగం చేస్తున్నంత కాలమూ ,  అంచనా వేస్తూ ఉంటారనే విషయం మర్చి పోకూడదు !  యు అర్  బీయింగ్ జడ్జ్ డ్  ఎట్ ఆల్ టైమ్స్ !  మిమ్మల్ని అంచనా వేస్తున్న వారు, తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచుకుంటూ ఉంటారు మీ మీద !  ఆ అభిప్రాయాలు సదభిప్రాయాలు గా ఏర్పడడానికి , మీరు  మీ వంతు ప్రయత్నం చేయాలి !  ఇతరులు మనలను పరిశీలించడానికీ,మన మీద తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచుకోడానికీ , మన  అనుమతి ఏమీ అవసరం లేదు కదా !  కానీ మన వేష ధారణా , భాష తీరు , ఇంకా ప్రవర్తనా , ఇట్లాంటి  లక్షణాలు మనం అశ్రద్ధ చేయకుండా ,  మనదైన తీరు ను ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటే ,  మన మీద ఏర్పడే అభిప్రాయం, ఉన్నతం గా ఉంటుంది. 
అందుకే ఈ ప్రక్రియ లో మొదటి సూత్రం మీ వేష ధారణ. మీరు మీ ఆఫీసుకు కానీ వర్క్ ప్లేస్ కు గానీ వెళుతున్నప్పుడు మీ వస్త్రాలను అశ్రద్ధ చేయకూడదు. అతిగా డ్రస్ చేసుకోకూడదు. అట్లాగే మరీ కక్కుర్తి గానూ  మీ వేష ధారణ ఉండ కూడదు ! మీరు  ధరించే బట్టలలో, మీ మీద మీకు ఉన్న శ్రద్ధ కనిపించాలి ! మనం ఇతరులను చూడగానే ప్ర ప్రధమం గా వారి వేష ధారణ పరిశీలిస్తాము !  ఒక పురుషుడు ఆఫీసుకు , మల్లె పూల లాంటి తెల్లటి బట్టలు వేసుకుని వస్తే , ” పూల రంగడు ” లా ఉన్నాడు ! అనుకుంటాము ! అదే ఒక స్త్రీ  తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని , తన పొడవాటి శిరోజాల లో ఉయ్యాల లూగుతూ ,  ఘుమ ఘుమ లాడుతూ  ఉన్న మల్లె చెండు  తో ఆఫీసు కు వస్తే ! !!  లేదా ఇంకో రోజు  తెల్లటి చీర , తెల్లటి రవిక లో ఆఫీసు కు వస్తే ! ? ! ?  ఆఫీసులో ఫైళ్ళు అసలు కదలవు ! అందరి కళ్ళూ ( ప్రత్యేకించి పురుషుల కళ్ళు ! )  టెలిస్కోపు లలా  ముఖం నుంచి ముందుకు వస్తాయి ! 
జయదేవ్  కార్టూన్ అనుకుంటా చాలా కాలం క్రితం చూసినా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా నా కు గుర్తు ఉంది ! ఒక వనిత, ఉల్లి పాయ పొర లాంటి పలుచని చీర, నాభి క్రిందకు కట్టుకుని, తన పాలిండ్లను ఒక పారదర్శకమైన ! పమిట ” చాటున  దాచి ” అలవోక గా  నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఆసమయం లో , అక్కడ ఉన్న  ఒక పురుషుడు , ఇంకో పురుషుడి తో అంటూ ఉంటాడు, ” ఈమె మా ఆఫీసు లో పని చేస్తుంది , ఛస్తే ఒళ్ళు దాచుకోదు ” అని ! 
ఈ వస్త్ర ధారణ  ను జెనరలైజ్ చేయడం కష్టం !  ఉష్ణ దేశాలలో , వస్త్ర ధారణ,  టై లూ గై లూ  లేకుండా ఉంటే  హాయిగా ఉంటుంది. అట్లాగే శీతల దేశాలలో టై కట్టు కోకుండా పురుషులు ఆఫీసుకు వెళ్తే , మిగతా వారి దృష్టి లో కొంత తేలిక భావం ఉంటుంది  వారి మీద ! ట్రైనర్స్ , జీన్స్ వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం, లేదా హవాయి చెప్పులు వేసుకుని ఆఫీసు కు వెళ్ళడం కూడా ఇతరులకు మీ మీద ఉండే అభిప్రాయాన్ని మార్చేస్తుంది,నెగెటివ్ గా ! చాలా మంది తాము పని చేసే స్థలాలలో  చక్కటి గాలీ, వెలుతురూ లేక పోయినా , సింథ టిక్ వస్త్రాలను తరచూ ధరిస్తారు ! పైకి మడతలు పడనట్టు కనిపించినా, ఆ రకమైన వస్త్రాలు , విపరీతం గా స్వేదం కలుగచెస్తాయి.  చక్కటి నూలు వస్త్రాలలా, స్వేదాన్ని అంటే చెమటను పీల్చలేవు !  దానితో  చాలా అనర్ధాలు ఉన్నాయి ! ఎందుకంటే, అవి వేసుకున్న వారికే  మగ్గి పోయినట్టు ఉక్క పెట్టడమే కాకుండా , మిగతా వారు కూడా వారి దగ్గరకు రావడానికి జంకుతారు ! ఆ పరిస్థితి లో ఒక సమస్య మీద దృష్టి కేంద్రీకరించి, పరిష్కారం కనుక్కోవడం, సులభమో 
కష్టమో ,  ఆ వస్త్ర ధారణ చేసుకునే వారికే ఎరుక !   
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు.10. మీ స్వేదం కనపడనీయకండి !

In మానసికం, Our minds on ఫిబ్రవరి 24, 2013 at 2:48 సా.

పని సూత్రాలు.10. మీ స్వేదం కనపడనీయకండి ! 

 

పని సూత్రాలలో ఇంకో ముఖ్యమైనది,  మీరు చేసే పని లేదా ఉద్యోగం లో మీరు పడే శ్రమను బహిరంగ పరచకుండా జాగ్రత్త పడడం ! మీరు ఆఫీసులలో గమనిస్తే, పై అధికారులు అట్లా కనిపిస్తారు ! ఆఫీసులో తమ సీట్లో కూర్చుని, చాలా ప్రశాంతం గా మౌన ముద్రలో ఉన్నట్టు ఉంటారు ! నిత్యం ఎదురయే సమస్యలను, ఏమాత్రం ఆందోళన, ఆదుర్దా లేకుండా  పరిష్కరిస్తూ ఉంటారు !  చేసే పనిని అతి చాక చక్యం గా చేస్తూ ఉంటారు ! ( ఇట్లా ప్రవర్తిస్తూ ,  తమ హస్త లాఘవం కూడా  ప్రదర్శించే వారి విషయాలు ప్రస్తుతం మనం పట్టించుకోవట్లేదు ! ) 
ఇంకో ఉదాహరణకు ( మన ) ప్రస్తుత  భారత దేశ నాయకులను చూడండి !  అనేక విధాలుగా రోజూ వివిధ మీడియా లో తమ ” ప్రకటనల ” లో  ” ప్రతాపం ” చూపిస్తూ ఉంటారు ! విపరీతమైన హడావిడి చేస్తూ ఉంటారు !  అవి నీటి మాటలే అయినా నిత్యం మీడియా లో కనపడుతూ ఉంటే లేదా వారి మాట వినపడుతూ ఉంటే నే వారు , ” బాగా పని చేస్తున్నట్టు ! ”  అన్ని విధాలా దేశాన్ని దోచుకునే వారు, పల్లె పల్లెలలో కూడా తమ నిలువెత్తు  విగ్రహాలు ప్రతిష్టించుకుంటారు. ఏళ్ల తరబడి తాగే నీటి వసతి లేని ఊళ్లు చాలా ఉన్న మహారాష్ట్ర లో ఈ మధ్య ఒక ” మహా నాయకుడు ” తన కొడుకు  పెళ్ళికి  22 హెలి ప్యాడ్ లను ఏర్పరిచి , ఒక లక్ష మంది అతిథులను ఆహ్వానించి , ఒక అరవై  ఐటమ్స్ తో విందు చేశాడు ! అదీ ప్రస్తుత నాయకుల  ” నిస్వార్ధ ” సేవా జీవితం ! జనాలు కూడా వారికి జే జే లు కొడుతూ ఉంటారు ! మీడియా మత్తులో మునుగుతున్న చాలా మంది జనాలకు, అసంఖ్యాకమైన నిస్వార్ధ దేశ భక్తులు, తమ సర్వస్వాన్నీ త్యాగం చేసి , స్వాతంత్ర్యం తెచ్చిన సంగతి, గుర్తుకు రాదు ! విగ్రహాలు లేక పోయినా , కనీసం వారి పేర్లు కూడా  తెలుసుకునే స్థితిలో వారు  లేరు !  కానీ నిజం గా పని చేసే వారు, కాశ్మీరు లోయలలో, మంచు అంచున ,ఆహార్నిశాలూ సరిహద్దు ను కాపలా కాస్తూ ఉండే సిపాయీలు !  వారికి ఏ  విగ్రహాలో అవసరం లేదు ! వారి స్వేదం కనపడదు మనకు ! నిశ్శబ్దం గా తమ ధర్మం నిర్వర్తిస్తున్నారు ! మనకు అమూల్యమైన స్వేఛ్చ ను అందిస్తున్నారు ! 
అసలు విషయానికి వద్దాము ! 
మీరు  ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకుంటే , వాటి కోసం మీరు పడే శ్రమను , మీ వర్క్ ప్లేస్ లో ఏమాత్రం చూపకండి ! మీరు మీ ఉద్యోగం లో కానీ , చేసే పనిలో కానీ ,మీ విసుగును కానీ , కోపాన్ని కానీ మీ ఆందోళనలను కానీ చూపించ కండి !  మీ ఇతర ఉద్యోగులతో మీ పని ఎక్కువ గా ఉందనో , లేదా మీకు ఆ పని చేయడం చాలా కష్టం గా ఉందనో  ” నస  ” పెడుతూ ఉండకండి !  ఈ భయాందో ళనలు  అన్నీ  మీ ఉద్యోగం చేయడం లో మీకు ఉన్న శక్తి సామార్ధ్యాలను  మరుగున పరిచి ,మిమ్మల్ని  ఆ పని లో లేదా ఉద్యోగం లో ” అసమర్ధులు ” గా ముద్ర వేసే ప్రమాదం ఉంది ! పని లో కష్టాలూ , జటిల  సమస్యలూ ఉన్నా కూడా , మీరు ” నిండు కుండ ” లా తొణ కకుండా, బెణక కుండా ఉండాలి ! చాలా రిలాక్స్ అయి ఉండాలి ! హుందా గా ఉండాలి !  అంతే  కాక , మీరు మీకు ఇచ్చిన పని గడువు తీరే సమయం లోనే చేయడం అలవాటు చేసుకోవాలి !  ఇతరుల సహాయం సాధ్యమైనంత తక్కువ గా తీసుకుంటూ ఉండాలి !  మీకు ఉన్న పనిని త్వర గా పూర్తి  చేసుకుంటూ మీరు విరామం తీసుకుంటూ ఉండాలి !  
మీ స్వేదం ( శ్రమ )  ఇతరులకు కనపడ నీయకండి !  ( ఇది అక్షరాలా  కూడా నిజమే ! అంటే మీరు ఆందోళన పడుతూ , ఆదుర్దా పడుతూ చెమటలు కారుకుంటూ ఎప్పుడూ కనపడ కండి ! ) ఎందుకంటే, మీరు సమర్ధులు, మీ లక్ష్యం ఉన్నతమైనది !   ఇవే ఇతరులకు మీలో కనపడాలి !  
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 
 

పని సూత్రాలు.9. సమ దృష్టి ! ( రైట్ యాటి ట్యూ డ్ )

In మానసికం, Our minds on ఫిబ్రవరి 23, 2013 at 9:11 సా.

పని సూత్రాలు.9. సమ దృష్టి ! ( రైట్ యాటి ట్యూ డ్ )

 

క్రితం టపాలో చేస్తున్న ఉద్యోగాన్నీ, పనినీ ఇష్టపడి చేయడం వల్ల  కలిగే లాభాలు తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు చేసే ఉద్యోగం లో   రైట్ యాటిట్యూడ్  అంటే సమ దృష్టి కలిగి ఉండడం ఎంత ప్రయోజన కారో తెలుసుకుందాం ! 
సామాన్యం గా  మేనేజ్మెంట్ ఒక గ్రూపూ , పని చేసే ఉద్యోగులు ఇంకో గ్రూపు గా ఉండడం ప్రతి ఆఫీసులో నూ  జరిగే విషయమే ! అంతే  కాకుండా , ప్రతి ఉద్యోగీ మేనేజ్మెంట్  మీద తన అక్కసు వెళ్ళ బోసుకునే వాడే !   మేనేజ్ మెంట్ రూల్స్ వల్ల  తాము పడ్డ లేక పడే కష్టాలూ , ప్రతి కూల  పరిస్థితులూ సహ  ఉద్యోగులకు చెప్పుకునే వారే !  మీరు మీ జీవిత పధం లో పైకి వెళదా మనే కృత నిశ్చయం తో కనక  ఉంటే ,  ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు , సమ దృష్టి కలిగి ఉండాలి ! అంటే రైట్ యాటి ట్యూ డ్ !  మీరు ఇతర ఉద్యోగులు మేనేజ్ మెంట్ వల్ల  తమకున్న సాధక బాధకాలు మీకు చెబుతున్నపుడు , తల ఊపుతున్నా , మీరు మీ అభిప్రాయాలను , ఖచ్చితం గా ఉద్యోగుల తరఫున కానీ , మేనేజ్ మెంట్ తరఫున కానీ వెల్లడించక పోవడం ఉత్తమం ! మీ మనసు లో మీకు నిజం ఏమిటో తెలిసినా ! అదే రైట్ యాటి ట్యూ డ్ !  మీరు మాత్రం మీ సాధక బాధకాలను ఇతర ఉద్యోగులతో చెప్పుకోకండి ! ఎందుకంటే మీకు పని సూత్రాలు బాగా తెలుసు కనుక ! మేనేజ్ మెంట్ వారి పాలసీలు ఏమిటో , వాటి బాగోగులు ఏమిటో కూడా విశ్లేషించి తెలుసుకోండి ! కానీ  మీరు మాత్రం మీ సమ దృష్టి ని వదలకండి ! సమ దృష్టి ,   అంటే  ఉద్యోగులందరితోనూ  మంచి గా స్నేహ పూర్వకం గా ఉండడం , దయా పూర్వకం గా ఉండడం , మానవత్వం తో  సమస్యలను పరిశీలించడం , ఆశావహ దృక్పధం తో ఉండడం అంటే పాజిటివ్ గా ఆలోచించడం ,మీ శక్తి సామర్ధ్యాలను  సరిగా ఉపయోగించుకోవడం !  మీరు ఇతర ఉద్యోగులను ఏ  విధం గానూ వంచన చేయకుండా ప్రవర్తించడం,అంతే  కాక , ఇతరులు స్తబ్దు గా ఉన్నపుడు , కానీ లేదా తప్పు అయినప్పుడు , మీరు ఆ అవకాశాన్ని జార విడుచు కోకుండా సద్వినియోగం చేసుకోవడం కూడా  ! 
ఎందుకంటే , పని సూత్రాలు బాగా తెలిసిన మీ లక్ష్యం  పదోన్నతి ! ప్రధమ స్థానం ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం !