Our Health

Archive for the ‘మానసికం’ Category

విరహ వేదనా తైలం తో, ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 5, 2013 at 8:35 సా.

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?3. 

క్రితం టపా లో ఆలోచనా ధోరణిని  ఆశావహం గా ఎట్లా మార్చుకోవచ్చో , ఎందుకు మార్చుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ! మనం  బయటి ప్రపంచాన్ని ఏ ఫ్రేం లో అవుతే చూస్తామో , ఆ ఫ్రేం ను మార్చుకోవడం వల్ల , బయటి ప్రపంచం మనకు నూతనం గా కనబడుతుంది ! మనసు ‘ విరిగి ‘ పోయి నిరాశా దృక్పధం తో మీరు చూసే ఫ్రేం ను మార్చుకుని , మీరు జీవితాన్ని ఇంకో కొత్త కోణం లో , కొత్త ఫ్రేం లో చూడగలగడం అలవాటు చేసుకుంటే , మీరు  విమోచన పొందిన అనుభూతి చెందగలరు ! 
4. మరి, ఈ కొత్త ఫ్రేం లో నుంచి మీ జీవితాన్నీ , మీ కొత్త ప్రపంచాన్నీ  చూడగలగడం ఎట్లా ? 
మీ ప్రేమ , లేదా సంబంధం విఫలం అయినప్పుడు , మీరు, మీ గురించీ , మీ తో అంత వరకూ సంబంధం పెట్టుకున్న వ్యక్తి గురించీ , మీ  అభిప్రాయాలేంటి ?  ఈ విఫలమైన సంబంధం పర్యవసానం గా , మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ మీరు ఏ యే నిర్ణయాలు చేసుకున్నారు ? అంటే, మీ గురించీ , ఆ వ్యక్తి గురించీ, మీ తీర్పు ఏమిటి ? తరువాత , మీకు అత్యంత ప్రీతి పాత్రమైన , మీరు అభిమానించే వ్యక్తి , మీరు ఉన్న పరిస్థితి లోనే ఉంటే , ఏ రకమైన నిర్ణయాలు తీసుకుని ఉండే వారో ఆలోచించండి ! ఇక చివర గా మీకూ , మీ తో సంబంధం చెడి పోయిన వ్యక్తి కీ,  ఏ మాత్రం తెలియని ఒక తటస్థ వ్యక్తి , మీరున్న పరిస్థితి లో ఉంటే , ఏమి చేసే వారో , ఏ విధం గా పరిస్థితిని అంచనా వేసుకునే వారో కూడా , మీరే ఆలోచించండి ! ఇప్పుడు, ఈ మూడు రకాల ఆలోచనా తీరుల్లో కనిపించే తేడా ను గమనించండి  , మీకు అత్యంత లాభదాయకమైన , అత్యంత సంతృప్తి నిచ్చిన , అభిప్రాయం ఏమిటో   చూడండి !  అప్పుడు , మీకు , ఆలోచనా రీతులు  , సమస్యను చూసే వ్యక్తి ఫ్రేం లో ఎట్లా మారుతాయో మీకు అవగాహన అవుతుంది ! ప్రేమ విఫలం అయినవారూ , సంబంధాలు తెగి పోయినవారూ , ఆ యా సంఘటనలను కేవలం ఒక చాలెంజ్ లా తీసుకుని , ముందుకు పోయిన వారు , వారి జీవిత పధం లో ముందుకు పోతూ ఉంటారు !  అట్లా కాక ,  ప్రతి తెగి పోయిన సంబంధాన్నీ ,  విఫలమైన ప్రేమనూ , వారి జీవితాలలో వచ్చిన , అతి ఘోరమైన దుర్ఘటన  గా  భావించి , కుమిలి పోయే వారు , వారు సృష్టించుకున్న అగాధం లో  పడి ‘ బయటకు ‘ రాలేక , సతమత మవుతుంటారు ! ఇక ముందుకు పోయే మార్గం ఎట్లా కనిపిస్తుంది? ! నాణానికి రెండువైపులు గా ఉన్న ఈ  ఆశా , నిరాశ  దృక్పధాలకు తేడా ఎంతో ఉంది కదా ! ఆ దృక్పధాలు ఏర్పడడానికి , మనం చూసే ఫ్రేం మార్చుకుంటే మార్గం సుగమమవుతుంది !   ఏ ఫ్రేం లో జీవితాన్నీ , ప్రపంచాన్నీ , భవిష్యత్తు నూ , చూడాలని అనుకుంటామో , అదే ఫ్రేం లో మనకు కనిపిస్తుంది కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?. 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 4, 2013 at 8:36 సా.

విరహ వేదనా తైలం తో ఆశా దీపం వెలిగించడం ఎట్లా ?. 2. 

3. మీ ఆలోచనా ధోరణి ని మార్చు కోవడం :  తరువాతి దశ లో, మీ ఆలోచనలను మార్చుకోవడం  చేయాలి !  ‘ నా ఆలోచనలు నావే , నా ఆలోచనలు ఎన్నటికీ మార్చుకోను !’  అని  మంకు పట్టు పట్టి కూర్చుంటే ,  విరహ వేదన  , ఆనందం  గా మారదు !  మార్చుకోవడానికి  ప్రయత్నాలు చేసే ముందు , మీ ఆలోచనా ధోరణి ని అంచనా వేసుకోవడం కూడా మీరే చేయాలి !  మన  జీవితాలలో ,  క్లిష్ట మైన పరిస్థితులు ఏర్పడినప్పుడు , మన ఆలోచనా ధోరణిని  బట్టే  , మన  క్యారెక్టర్ అంటే మన ధృ ఢ చిత్తమూ , అంటే మన శీలతా తెలుస్తాయి !  ఆ పరిస్థితులలో నిరాశా జనకమైన ఆలోచనలు రావడం సహజం ! ఈ నిరాశా జనకమైన  ఆలోచనలను నెగెటివ్ కాగ్నిషన్ లు అని అంటారు ! ఈ ఆలోచనలు  ఒక సుడి గాలి లా వస్తాయి !   ప్రత్యేకించి ,  ప్రేమ విఫలం అయినప్పుడూ , లేదా పరీక్షలో విఫలం అయినప్పుడూ , లేదా ఇతర సంఘటనలు మానసికం గానూ శారీరికం గానూ తీవ్రం గా గాయ పరిచే సంఘటనలు అనుభవమైనప్పుడూ  !   అప్పుడు , జీవితం నిరాశా జనకం అనిపిస్తుంది ,   ఆ నిరాశా వాద దృక్పధాన్ని ఆది లోనే తుంచి వేయాలి ! లేక పొతే , ఆ ఆలోచనల సుడి గాలి చుట్టు ముట్టి ,  మనిషినే గల్లంతు చేసే ప్రమాదం ఏర్పడుతుంది ! ఆ పరిస్థితి లో,  సుడి గాలి , అమాంతం గా మనిషిని  ఎత్తేయక పోయినా కూడా ,  మనసులో చెల రేగే , మానసిక ఆలోచనా సంఘర్షణ ,  క్రమ క్రమం గా ఉ ధృ తమవుతూ ,  ‘ ఇక జీవించి  ప్రయోజనం లేదు ‘  ఈ జీవితాన్ని అంతం చేసుకోవడమే  శరణ్యం  అని ఆలోచింప చేసి ,  అట్లా ఆలోచిస్తున్న మనిషిని , తనకు తాను , హాని చేసుకునే పరిస్థితి కి పురి గొల్పుతుంది ! ఆ నిరాశా జనక ఆలోచనలే , ముందుకు పోనీయని సుడి గుండాలవుతాయి ! 

 అందు వల్లనే , ఈ ఆలోచనల నిజ స్వరూపం గ్రహించాలి !    అందుకు, మీ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి !  అందుకు  మీ దృక్కోణం మారాలి !  అంటే, మీరు చూసే చూపుల బట్టి , మీ ప్రపంచ  పరిధి కూడా మారుతుంది !  మీ దృక్కోణం, నిరాశా జనకం గానూ ,  సంకుచితమైనది గానూ  ఉంటే , మీరు చూసే ప్రపంచం కూడా మీకు సంకుచితం అవుతుంది, గాడాంధ కారం గా గోచరిస్తుంది  ! మీ దృక్కోణం , విశాలం గానూ , విస్తృతం గానూ ఉంటే , మీ ప్రపంచం, చాలా విశాలం గా , మీకు గోచరిస్తుంది ! అందులో,  మీకుండే అవకాశాలూ , పొంద గలిగే ఆనందాలూ కూడా , స్పష్టం గా కనిపిస్తాయి ! ప్రపంచం, ఆశా జనకం గా ఉంటుంది ! ఆ  దేదీప్యమానమైన ప్రపంచం లో, మీకు, మీ భవిష్యత్తు కూడా ఉజ్వలం గా గోచరిస్తుంది  ! నిరాశా మేఘావృతమైన  ఆకాశం లో ,  ఆశా కిరణాలు మీకు స్పష్టమవుతాయి !  జీవితం,  అందులో ప్రత్యేకించి , మీ జీవితం ఎంత విలువైనదో మీకు అవగతమవుతుంది !  విరహ బాధను,  మీరు ‘ గరళ కంఠు డి లా ‘ దిగమింగ గలుగుతారు !  ఆనంద జలపాతాన్ని, మీ శిరసు లో బంధించ గలుగుతారు ! కేవలం, మీ లో కలిగిన ఆలోచనా ధోరణి లో మార్పులతో ! ఆశావాద దృక్పధం తో ! అప్పుడు,  మీ జీవిత మాధుర్యం,  మీకు తెలుస్తుంది !   మీరు అనుభవించే విరహ వేదన ‘ కేవలం ‘ అంటే ఆఫ్టరాల్  ఒక్క వ్యక్తి మాత్రమే, నన్ను తృ ణీక రించడం జరిగింది ‘ అనుకుని , ఆ విషయాన్ని, మీరు,  మీ  ఆమూల్యమైన జీవిత పధం  లో, అడ్డు వచ్చిన ఒక గడ్డి పోచ లా, పక్కకు వంచి , తదేక దీక్షతో పురోగమించ గలుగుతారు  ! అంతటి శక్తి ఉంది ,  మీ ఆలోచనలకు ! మీ కర్తవ్యానికి మూల స్తంభాలైన  మీ ఆలోచనా ధోరణి లో మార్పు ,  మీ కర్తవ్యాన్ని పటిష్టం చేస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

విరహ వేదన తైలం గా, ఆశా జ్యోతి వెలిగించడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 3, 2013 at 1:41 సా.

విరహ వేదన తైలం గా, ఆశా జ్యోతి వెలిగించడం ఎట్లా ? 

 
క్రితం టపాలలో,  ప్రేమించడం ఎట్లాగో వివరం గా తెలుసుకున్నాం కదా ! మరి   పలు సందర్భాలలో ,  మనం ప్రేమించిన వ్యక్తులతో మనకున్న సంబంధం, అకస్మాత్తు గా చెడి పోవడం కానీ ,  లేదా  విపరీతమైన కోరికతో,  మనం కావాలనుకున్న వ్యక్తులు , మనకు దక్కక పోవడమే కాకుండా ,  మనలను ఏమాత్రం లెక్క చేయక పోవడం కూడా జరుగుతూ ఉంటుంది !  ఈ ‘ అనూహ్య పరిమాణాలకు తట్టుకోలేక, తల్ల డిల్లి పోతూ  ఉండడం సంభవిస్తూ ఉంటుంది !  ‘ మనకు అత్యంత ఆప్తుడూ , స్నేహితుడూ అయిన  మన ‘ మనసు ‘ గాడు  గాయ పడతాడు ! మనలో, అనేక సంక్లిష్ట  భావోద్వేగాలను సృష్టి స్తాడు !  మరి ఆ  పరిణామాలను ఎట్లా తట్టుకోవాలి? మనకు మనం హాని చేసుకుంటూ , తీవ్రమైన నిరాశా నిస్పృహ లకు బానిసలమై , జీవితం ‘ అంధకారమయం చేసుకోవడం తప్ప వేరే దారి లేదా !!??  మరి పవిత్రమైన దీపావళి రోజున ,  ఈ   నిరాశా తిమిరం తో,   మన జ్ఞాన దీపం తో సమరం  చేయడమూ , జీవితాలను దే దీప్య మానం చేసుకోవడం గురించీ తెలుసుకుందాం ! 
ప్రేమ విఫలం అవడం తో  మొట్ట మొదట జరిగే చర్య ,  అట్లా జరిగిందని అంగీక రించే స్థితి లో  ‘ మనసు ‘ లేక పోవడం !  దానితో మనసు ‘ గాయం ‘ అవుతుంది !  ‘ నాకే ఎందుకు జరగాలి ఇట్లాగా ? అనే తీవ్రమైన ఆత్మ శోధన కలుగుతుంది !  దానితో నిద్రాహారాలు మానడమూ ,  తీవ్రమైన మానసిక ఆందోళన కు గురి అవడమూ కూడా జరుగుతాయి ! 
మరి కర్తవ్యం ఏమిటి ? : 
1. నొప్పిని అంగీకరించడం :  మీలో కలిగే బాధను అంగీకరించి , ఆ బాధనూ , వేదననూ,  భరించాలనే నిర్ణయం తీసుకోండి !   మన శరీరం లో ఎక్కడైనా చిన్న గాయం అయినా , నొప్పి కలగడం , అత్యంత సహజమైన జీవ రసాయన చర్య !  మనం మానసికం గా ‘ గాయ ‘ పడినా , నొప్పి కలగడం సహజమే ! కాక పొతే ఆ నొప్పి , ఒక స్థానం లో  , ఖచ్చితం గా కనిపించదు , మానసిక వ్యాకులత కనుక !  సామాన్యం గా  చాలా మంది , ఈ మానసిక వేదనను , నిర్లక్ష్యం చేయడమే కాకుండా ,  మనో  వేదనను ఆమోదించే పరిస్థితి లో కూడా ఉండరు !  
‘ విరిగిన మనసు ‘  గత స్మృతు లను , అప్రయత్నం గానే ఆటో  రీ – ప్లే చేసుకుంటూ ఉంటుంది ! తరచూ !   ఆ గత స్మృతులు , మీరు , మీ ప్రేమను తృ ణీ కరించిన వ్యక్తి తో గడిపిన ఆనంద మయ క్షణాలు కావచ్చు , లేదా కలిసి చూసిన ప్రదేశాలూ ,  చేసిన సంభాషణలూ ,  ఆరగించిన విందులూ , ఇంకా ముందుకు పోయిన సందర్భాలలో పొందిన శారీరిక , మానసిక ఆనందమూ  కూడా , మన  జీవ కంప్యూటర్ లో ఉన్న హార్డ్ వేర్ లోనుంచి ,  పదే , పదే , ఆడియో గానూ , వీడియో గానూ , రీ – ప్లే అవుతూ ఉంటాయి !   ఆ  పరిస్థితిని ‘ చక్క బెట్టుకోవడం ‘ అలవాటు చేసుకోవాలి !  ఇది చెప్పినంత సులభం కాదు !  అట్లా చేయడం, మీరు, మీ   ‘ మధుర స్మృతులకు  ‘ విలువ కట్ట లేక పోవడమూ కాదు !  మీ (గత ) ప్రేమాను భూతులను , మీరు పట్టించుకోక పోవడమూ కాదు ! కొంత కాలం గా , మీ  జీవ కంప్యూటర్ లో ఈ సంఘటనలు అన్నీ కూడా  ప్రధాన మైనవి అవడం వల్ల ,  మీ జీవనం కూడా , ఆ సంఘటనలకూ , మీరు, తద్వారా పొందే , మధురానుభూతులకూ , అలవాటు  పడడం జరిగింది !  అంటే మీ ‘ మనసు గాడు ‘ మీతో పాటు గా , ఆ యా అనుభూతులకు ప్రోగ్రాం అయ్యాడు !  మీరు,  మీ ఇంద్రియాలతో , వర్తమానం లో ఉన్నా , మీ మనసు గాడు, ఆ యా ప్రదేశాలలో , మీరు తిరుగుతూ ఉంటే , అప్రయత్నం గానే , మీరు క్రితం అక్కడ ఉన్నప్పుడు మీరు పొందిన ఆనందాన్ని గుర్తు చేస్తాడు ! 
2. అలవాట్లు మార్చుకోవడం ! : పైన ఉదహరించిన ఈ పరిస్థితి నుంచి, క్రమ క్రమం గా మీరు దూరం అవాలంటే ,  మీ అలవాట్లను మార్చుకోవడం ముందుగా చేయాలి !  క్రమ క్రమం గా ,  ఆ ‘ గత ‘ సంఘటనలు ‘ మీలో రీ ప్లే అవుతూ ఉంటే కూడా , వాటిని పట్టించు కోకుండా , మీ వర్తమానం లో మీ మనసును , మీ శరీరం తో పాటుగా కేంద్రీకరించుకోవడం అలవాటు చేసుకోవాలి !  మీకు ఉత్సాహం కలిగించే , మీకు ఇష్టమైన, కొత్త  హాబీ  ను డెవలప్ చేసుకోవడం , అట్లాగే , ఒకే చోట కూర్చోకుండా , ప్రతి రోజూ శారీరిక వ్యాయామం చేయడం ,  కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకోవడం చేయడం వల్ల , మీ మానసిక వేదనను దూరం చేసుకోవడమే కాకుండా , దాని పరిణామం గా పొంచి ఉన్న ,  డిప్రెషన్ ను కూడా మీరు దూరం చేసుకుంటున్నారన్న మాటే !  నిరాశా నిస్పృహ లతో , సతమత మయ్యే , జీవ కణాలకు ప్రాణ వాయువు ను సరిపడినంత గా సమకూర్చుతుంది , మీరు,  రోజూ చేసే వ్యాయామం ! 
సూక్ష్మం గా చెప్పాలంటే , మీ గత జీవన చర్యను , మీరు మార్చుకుని ,  భావి జీవితం లో ఉత్సాహ భరితం గా ఉండడానికి మీరు  సన్నద్ధ మవుతున్నారు పై చర్యల వల్ల !  మీ జీవ కంప్యూటర్ లో కొత్త సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేసుకోవడానికి ,   మీ ‘ డిస్క్ డ్రైవ్ ‘ ను క్లీన్ చేసుకుంటున్నారు ! మీరు, మీ విలువైన జీవిత కంప్యూటర్ ను, వృధా చేద్దామనుకోవడం లేదు ! అది ఎంతో ఆనంద కరమైన నిర్ణయం ! ఎందుకంటే , మీ జీవితం ఎంతో విలువైనది !  విలువ గ్రహించ లేని వారి వల్ల , మీ జీవితం విలువ కోల్పో కూడదు ! కోల్పోదు కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

ప్రేమించడం ఎట్లా ? 8. మంచి నేస్తం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 26, 2013 at 11:06 ఉద.

ప్రేమించడం ఎట్లా ? 8. మంచి నేస్తం !

 క్షమించడం , క్షమించ బడడం : ప్రేమ లో , ఇష్టాలూ , అయిష్టాలూ ,  పలకరింపులూ , మూతి విరుపులూ కూడా ఉంటూ ఉంటాయి , కాలాను గుణం గానూ , పరిస్థితులను బట్టీ ,  అట్లాగే , మనసు విరిచే మాటలూ , సంఘటనలూ కూడా చోటు చేసుకుంటాయి ! తప్పిదాలూ జరుగుతూ ఉంటాయి !  అవి మీ వల్ల జరిగితే , మీరు  ఆత్మ న్యూనతా భావం తో కుమిలి పోకుండా , హుందా గా మీ తప్పిదాలను అంగీకరించే పరిస్థితి లో ఉండాలి ! అట్లాగే,  మీరు ప్రేమించిన వారు కనుక తప్పిదాలు చేయడమో , లేదా మీ మనసు ‘ గాయ ‘ పరచడమో చేస్తే , మీరు అప్పుడు కూడా  ‘ క్షమా గుణం  ‘ అనే బ్యాండేజ్ వేసుకుని  గాయం మాన్చు కునే చర్యలు తీసుకోవాలి ! ఆ అనుభవాల సారాంశం , మీ భావి జీవితం లో మీరు ఉపయోగించు కోవాలి ! 
మంచికి పోటీ :  ఉన్నమైన విలువలు కలిగిన ప్రేమ లో,  పరస్పరం,  మంచికి పోటీ పడుతూ ఉంటారు !  ప్రేమికులిద్దరూ , వారి వారి ఆశయాల నూ , ఆకాంక్ష లనూ  పరస్పరం గౌరవించుకోవడమే కాకుండా , ఆ ఆశయాలూ , లక్ష్యాలూ  వారు  చేరుకోవడానికి అవతలి వారు , వారి శాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు , ప్రేమ పూర్వకం గా ! అంటే వారు పరస్పరం , తమ మంచితనాన్నంతా , వారి ప్రేమలో  పెట్టుబడి పెడతారు ! ఒకరి కన్నా ఎక్కువ గా , ఇంకొకరు తమ మంచి తనాన్ని చూపించడం లో పోటీ పడతారు !  ఈ పోటీ, కేవలం ఒకరు గెలవాలనే లక్ష్యం తో కాకుండా , వారిరువురూ , తమ  గమ్యాలూ , లక్ష్యాలూ ,  చేరుకొని , ప్రేమ మయ జీవితాలు గడపడం కోసమే !  
మంచి నేస్తం :  ప్రేమ లో  ముద్దూ మురిపాలు ముఖ్యమైనా కూడా , ఇంకో ముఖ్య విషయం , మీరు  ప్రేమించిన వారితో ఒక మంచి నేస్తం గా ఉండి పోవాలి !  సదా,వారి శ్రేయస్సు కోరే,  ఒక మంచి మిత్రులు గా ఉండాలి ! జీవితాంతం !  మీ ప్రేమ భౌతికమైనదైనా , లేదా కేవలం హృదయ స్పందన తో కూడినదైనా ( అంటే ప్లాటోనిక్ ప్రేమ ! ) అయినా , మీ ప్రేమ  సఫలం అయినా , విఫలం అయినా కూడా , మీరు ప్రేమించిన వారికి,  మీరు ఒక గొప్ప స్నేహితులు గా అవ్వాలి !  వారి కష్ట కాలం లో మీ భుజం మీద తల ఆనించి సేద తీర్చుకునే విధం గా  మీ ‘ భుజం ‘ సిద్ధం కావాలి ! ప్రేమ  విలువలు దేదీప్య మానం గా  వెలిగేది అప్పుడే ! 
ప్రేమ, అతి సులభం !  

ప్రేమ, అతి జటిలం  !
 ప్రేమ అతి సున్నితం !
ప్రేమ,అతి  మధురం ! 
ప్రేమ, విచిత్రం !
ప్రేమ, పవిత్రం ! 
ప్రేమ, సౌందర్యం ! 
ప్రేమ, జీవితం ! 
ప్రేమ, శాంతి !
ప్రేమ, కాంతి ! 
వచ్చే టపాలో కలుద్దాం ! 

ప్రేమించడం ఎట్లా ? 7. విశ్వ వ్యాప్త వైవిధ్యం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 25, 2013 at 8:40 సా.

ప్రేమించడం ఎట్లా ? 7. విశ్వ వ్యాప్త వైవిధ్యం ! 

విశ్వ వ్యాప్త వైవిధ్యం ! : మానవులంతా ఒకటే !  కానీ వ్యక్తిత్వ రీతుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ , వారి, వారి ప్రత్యేకతలను సంతరించుకుని , ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని  ఏర్పరుచుకుని ఉంటారు !  దాని వలన , ఏ  ఒక్కరూ , ఇంకొకరి కన్నా ఎక్కువా కాదు , తక్కువా కాదు !  మనం ఇతర వ్యక్తుల మీద అభిప్రాయం ఏర్పరుచుకునే  సమయం లో  వారిని కేవలం ఒక వ్యక్తి గానే పరిగణించాలి కానీ , వారిని చెడ్డ వారి గానో , లేదా మంచి వారి గానో , వెంటనే వర్గీక రించ కూడదు ! అట్లాగే , మీరు ప్రేమించే వ్యక్తులను కూడా , వారు చెడ్డ వారైనా , లేదా మంచి వారైనా కూడా , అంగీక రించే స్థితి లో ఉండాలి !  మార్పు మానవ సహజం , అట్లాగే చెడు గుణాలు కూడా , మారడానికి అవకాశం ఇస్తే మారే మార్గాలు చాలా ఉన్నాయి ! మీరు ప్రేమించే వ్యక్తులకు కూడా , అట్లాంటి అవకాశం ఇవ్వాలి !  క్రితం టపా లో చెప్పు కున్నట్టు , ఒకరి మంచి గుణం , ఇంకొకరికి ఆమోద యోగ్యం కాక పొతే , అది చెడు గుణం అవ వచ్చు !  మనం ప్రేమించే వ్యక్తులను ,  ఖచ్చితం గా , ఒక్క పొరపాటు కూడా లేకుండా , అంతా , మన ‘ ఆధీనం ‘ లోనే ఉండి , మనం చెప్పిన ట్టే అనుసరించుతూ , మన లాగే  ప్రవర్తించాలి అనుకోవడం , నిరంకుశత్వం అనబడుతుంది ! ఇతరుల స్వేఛ్చా  స్వాతంత్ర్యాలను కాల రాచినట్టు అవుతుంది , అది ప్రేమించిన వ్యక్తులైనా కూడా ! ఆ పరిస్థితులు , ప్రేమ పెంపొందడానికి అనుకూలం కాదు !
మీరు ప్రేమించిన వ్యక్తులలో ఉన్న మంచి గుణాల మీద కేంద్రీకరించండి : మీరు మనసారా ప్రేమించే వ్యక్తులలో , మీరు ఎప్పుడూ , కేవలం సద్గుణాలు మాత్రమే ,  చూడండి ! అంటే పాజిటివ్ క్వాలిటీస్ !  మీ ప్రేయసి ఒక మంచి గాయని అవుతే , మీరు ఆమె లో ఉన్న ఆ గుణాన్ని పెంపొందించు కునే మార్గాలు సులభం చేయండి ! వీలు చేసుకుని , ఆమె చేత ఒక మంచి పాట ను రికార్డు చేయించండి ! ఆమెలో నిస్త్రాణం గా ఉన్న కళ ను వెలికి తీయండి !  అప్పుడు , ఆమె లో కలిగిన ఆనందం పంచుకోండి ! ఆనందం తో పాటుగా , అప్పుడు , ప్రేమ కూడా పెంపొందుతుంది !
ఆమె లో మీకు ఇష్టం లేని గుణాలను మీ చిరు నవ్వు తో  ఆమోదించండి : ప్రతి వ్యక్తి లోనూ , ఇతర వ్యక్తులకు ఇష్టమయే  విషయాలు ఉన్నట్టే , నచ్చని విషయాలు కూడా ఉంటాయి, సహజం గానే !  మన ఔదార్యం , మనకు నచ్చని విషయాలను  పట్టించు కోకుండా  ప్రవర్తించే , మన   ఓరిమి లోనే ఉంటుంది ! కొందరు స్త్రీలు , విపరీతం గా హడావిడి చేస్తూ , ఎప్పుడూ గల గల లాడుతూ ఉంటారు , ఏ సమయం లోనైనా !  ఆ సమయాల లో , వారి ప్రవర్తన ను విమర్శించ కుండా , హుందా గా ఒక చిరు నవ్వు నవ్వితే సరిపోతుంది ! మీ ప్రేయసి కి,  వంట చేయడం అంత బాగా రాక పోయినా కూడా , ఏదో ఒక్క ఐటం బాగా చేయడం వచ్చినా కూడా , మనసారా అభినందించండి,  అది తింటూ !
స్పష్టమైన  ప్రసారం ! అంటే కమ్యూని కేషన్ : మీరు ప్రేమించే వ్యక్తి తో మీరు ఒక  స్థిరమైన , తెగిపోని , ప్రసారం ఏర్పరుచుకోవాలి ! అది ఏ  ప్రసార మాధ్యమం అయినా కావచ్చు !  మీ స్వంత చేతి వ్రాత తో రాసిన ఉత్తరం నుంచి  మొబైల్ , లేదా సెల్ ఫోన్ , ఈమెయిలు ,  వీడియో చాట్ , లేదా వ్యక్తి గతం గా  కలిసి సంభాషించు కోవడం , ఇట్లా ఎన్నో రకాలు గా ! ముఖ్యమైన విషయం :  ఒక క్రమ పధ్ధతి లో , కనీసం రోజూ ( అయితే మరీ మంచిది ! ) , లేదా వారానికి , నెలకో , ఒక సారైనా  తప్పని సరిగా పరస్పరం కమ్యూని కేట్ చేసుకోవడం , ప్రేమ  కు కావలసిన ముడి సరుకు !  ఇంకో విషయం :  కేవలం కమ్యూని కేట్ చేసుకుని ,  పై పై మాటలు , హలో అంటే హలో అనుకుంటే  ప్రేమ హాలో గానే ఉంటుంది !  అరమరికలు లేకుండా , పరస్పరం  అన్ని విషయాల మీదా మాట్లాడుకోవడం చేయాలి ! అట్లాగే  పరస్పర వ్యక్తి గత సంబంధాలలో ఎదురయే సమస్యల గురించి  ప్రత్యేకం గా మాట్లాడుకోవడం చేయాలి ,  చిన్న చిన్న విషయాలను నాన్చి , జటిల సమస్యలు చేసుకోకుండా , ఎప్పటి కప్పుడు  పరిష్కరించు కుంటూ ఉండాలి ! దానితో , ఒకరి గురించి ఇంకొకరికి బాగా తెలియడమే కాకుండా , వారి వారి  అభిప్రాయాలూ , వారి సమస్యా పరిష్కార  నిపుణతా కూడా తెలుస్తాయి !  కలిసి జీవితం గడిపే సమయం లో ఈ లక్షణాలు ఎంత గానో ఉపయోగ పడతాయి కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ? 6. ప్రతి వారినీ గౌరవించడం.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 20, 2013 at 9:54 ఉద.

ప్రేమించడం ఎట్లా ? 6. ప్రతి వారినీ గౌరవించడం. 

ప్రతి వారినీ గౌరవించడం :  సాంకేతికత పెరిగి , ప్రపంచం లో  మానవ సంబంధాలు  కేవలం  వివిధ గాడ్జెట్ లతో  కొన సాగుతున్నాయి !  కానీ  ఎంతో లాభాలతో , ముందుకు దూసుకు పోతున్న కంపెనీలన్నీ కూడా మానవ సంబంధాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి, వ్యాపార ప్రకటనల తో పాటు గా ! 
ప్రతి వ్యక్తి  కూడా, ప్రేమ ప్రేమ మయ జీవితం గడపాలంటే , ప్రతి ఇతర వ్యక్తి నీ , వారి  పుట్టుక, కులం  , పెరుగుదల , వారి విద్య,  ఉద్యోగం , తాహతు , వారి సంపాదనా , ఈ విషయాలతో ప్రమేయం లేకుండా , కేవలం, వారిని తోటి మానవులలాగా గౌరవించడం  అలవాటు చేసుకోవాలి ! ఈ విధం గా, చాలా మంది అనుకుంటున్నట్టు , కేవలం సాధువులూ సన్యాసులు మాత్రమే  కాదు  ! ఎవరైనా చేయ గలరు !  మనం , దేశాలూ , ఖండాలూ ,  ఈ నాగరికతలూ , మతాలూ ,  సామాజిక వ్యత్యాసాలూ , భౌతిక అవసరాలూ , ఇవన్నీ ఒక్క క్షణం మనసులో కి రానీయకుండా , కేవలం ఈ భూలోకం లో ఉంటున్న ఒక ‘ గ్రహ వాసులు ‘ గా అనుకుంటే , కేవలం ఇతర మానవులను గౌరవించమా ?  ! కానీ యదార్ధం అందుకు భిన్నం గా ఉంది ! ఈ భూగోళం లో ఉన్న మానవులందరి మధ్యా ,  భౌతికం గా కనిపించక పోయినా కూడా ,   దుర్భేద్యమైన  అంతరాలూ ,  పరిధులూ , పరిమితులూ ఉన్నాయి !  దానికి అనుగుణం గానే , ప్రేమ కూడా  పరిణామం చెందింది !  అంటే  మానవులు కొందరినే , ప్రేమించడం , గౌరవించడం  మొదలు పెట్టారు. ఒక వ్యక్తి  , ఇంకొకరి మీద   గౌరవం  చూపించడం , వారు చూపించే ప్రేమ లో ఒక అతి ముఖ్యమైన లక్షణం !  మనం గౌరవించ లేని వారిని   ప్రేమించ   లేము కూడా !   ఇతరుల మీద గౌరవం , వారితో మన అనుభవాల బట్టీ ,  అభిప్రాయాల బట్టీ  ఏర్పడుతుంది !   వాటి పర్యవ సానం గా , మనం ఇతర వ్యక్తుల  విలువ గ్రహించ గలుగు తాము ! ప్రతి జీవితమూ , ఈ ప్రపంచం లో విలువైనదే !  అట్లాగే మానవులంతా కూడా విలువైన వారే ! మనలో ఉన్నట్టే , ఇతర మానవులందరి లోనూ , అనుభూతులూ , కోరికలూ , వాంఛ లూ , ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం  – ఈ లక్షణాలన్నీ ఉంటాయి. మీరు ప్రేమించే ప్రతి వ్యక్తి లోనూ ఉంటాయి .  ఈ సత్యాన్ని , మనం మన చేతలలో కూడా చూపిస్తే , ప్రేమ , ఒక  నిశ్చల ప్రవాహం లా మనలో ప్రవహిస్తూ ఉంటుంది,  తెలియకుండానే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా? 5.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 18, 2013 at 6:37 సా.

ప్రేమించడం ఎట్లా? 5. 

 

ఎంతో కొంత ఇవ్వడం:  ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ముందు , మన లక్షణాలు కొన్ని ఎట్లా ఉండాలో క్రితం టపాల లో తెలుసుకున్నాం కదా !  మరి ఎంతో కొంత ఇవ్వడం ఏమిటి ? ఒక సంబంధం ప్రేమ మయం గా చేసు కోవడం లో మీరు చేయవలసినది ,  మీరు ప్రేమించే వారికి ఎంతో కొంత ఇవ్వ గలగడం !  ఏ  సంబంధం అయినా , మీరు కేవలం స్వీకరించే పరిస్థితి లోనే ఉంటే , అంటే , అది ప్రేమ కానీ , లేదా ఇతర వస్తు వాహనాలు కానీ , లేదా సేవలు కానీ , మీరు ఏమీ ఇవ్వకుండా ( ఇవ్వ గలిగే పరిస్థితి లో ఉండి కూడా ) ఎదుటి వ్యక్తి నుంచి వీలైనంత స్వీకరించాలనే అనుకుంటే , ఆ సంబంధం ఎక్కువ కాలం నిలువదు !  బీటలు బారుతుంది ! పెళు సవుతుంది ! ఏ క్షణాన్నైనా , తెగి పోయేంత సున్నితం అవుతుంది ! ఘర్షణలకు ఆలవాలం అవుతుంది ! స్పర్ధ లకు మూలం అవుతుంది !  ఇట్లా చేస్తూ ప్రేమిస్తున్నాం అనుకునే వ్యక్తులను , అవతలి వ్యక్తులు , జలగలు గా ముద్ర వేయడానికి అవకాశం హెచ్చుతుంది ! తీసుకునే దానికన్నా ఎక్కువ గా ఇవ్వగలిగే లక్షణం అలవరచు కుంటే , ఆ సంబంధం  పలు శాఖలు గా పెనవేసుకుని , గట్టి పడుతుంది ! వృద్ధి చెందుతుంది ! 
మనసు విప్పడం :  మీరు ప్రేమించే వ్యక్తి ప్రేమను పొందాలంటే , దాగుడు మూతలు తొలి నాళ్ళ లో సరదాగా ఉన్నా కూడా , మీ మనసు విప్పి సాధక బాధకాలు పరస్పరం తెలుసుకోక పొతే కూడా , మీ ప్రేమ లోతు లేకుండా ఉంటుంది !  పైపైనే  తేలి పోతూ ఉంటుంది మీ జీవిత నావ ఆ ప్రేమ లో ! అదే ప్రేమ గాఢమైనది గా అవ్వాలంటే , మనసు విప్పి మాట్లాడుకోవడం ముఖ్యం ! 
ఓపిక తో వెలుగును, ప్రేమ దీపిక !  : మీరు ప్రేమను పరిగెత్తించ లేరు అంటే , తొందరపెడితే , ప్రేమ కంగారు పడుతుంది !  మీరు ఓపిక గా అంటే నిదానం గా ప్రేమ లతలను అల్లుకోనివ్వాలి ! అప్పుడే ప్రేమ దీపం వెలుగుతుంది ! మీరు మీ ప్రేమ ను ఎవరి మీదా కూడా బలవంతం గా రుద్ద లేరు కదా ! అట్లాంటి పరిస్థితి మీలో,  భావోద్వేగ పరం గా చాలా అలసి పోయేట్టు చేసి , అసంతృప్తి కలిగిస్తుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ? 4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 16, 2013 at 6:22 సా.

ప్రేమించడం ఎట్లా ? 4. 

 
నిన్ను నీవు క్షమించుకో !  :  వయసు పెరుగుతున్న కొద్దీ , మనసు కూడా పెరిగి , చాలామంది , ఆత్మ శోధన చేసుకుంటూ ఉంటారు ( రాజకీయ నాయకులు తప్ప ).  ఇట్లా ఆత్మ శోధన చేసుకోవడం లో ఉద్దేశం , తాము చేసిన తప్పులు పొర పాట్లను , బేరీజు వేసుకుని , ముందు ముందు అట్లాంటి పొర పాట్లు కానీ , తప్పులు కానీ చేయకుండా  జాగ్రత్త పడడానికి ! అంత వరకూ బాగానే ఉంది కానీ , ఆ చేసిన పొరపాట్లు మానవులను కృంగ దీయ కూడదు !  ఈ అనంత కాల చక్రం లో, మానవ జీవితం,  లిప్త కాలమే !  అంటే ఎవరూ శాశ్వతం కాదు !  తప్పులు చేయడం , మనవల్ల తప్పులు  జరుగుతూ ఉండడం కూడా సహజమే ! అవి  పొరపాట్లు ఏవీ జరగక పోవడమంత సామాన్యం ! 
తెలిసి , తెలిసి  చేసే తప్పులు క్షమించ రానివి ! అట్లాగే , కొన్ని తప్పులు తెలియకుండా కూడా జరుగుతుంటాయి ! ఈ తప్పు ఒప్పులు కూడా సాపేక్ష  సూత్రాలను పాటిస్తాయి ! అంటే  ఒకరికి  ఒక విషయం తప్పు అనిపిస్తే , ఇంకొకరికి అది ఒప్పు అనిపిస్తుంది ! అంటే, కేవలం  ఎవరికి వారు  ఆ సందర్భం లో , ఆ సంఘటన ను అంచనా వేసుకుని ,తమ తమ అభిప్రాయాలను ఏర్పరుచు కోవడం ! మరి మనల్ని ,  మనం కేవలం అంతా ఖచ్చితం గా తప్పులు లేకుండా జీవిస్తున్నప్పుడే  , ప్రేమించు కుందామా ? అంటే  అప్పుడు మనం  ఆ విషయం లో తప్పు చేస్తున్నామనే చెప్పుకోవాలి ! ఇందుకు కారణాలు రెండు !  ఒకటి : ఈ భూగోళం లో తప్పులు చేయని మానవులు అంటూ ఎవరూ లేరు ! దేవుడిని నమ్మే వారుకూడా , దేవుడు కూడా చాలా రకాలు గా తప్పులు చేయడం వారి జీవితం లో ఏదో ఒక దశలో అనుభవ పూర్వకం గా తెలుసుకుంటారు !  రెండు : మీరు కనుక ఎదుటి వారెవరూ పర్ఫెక్ట్ కాదు అని ఒక అభిప్రాయం కనుక ఏర్పరుచుకుంటే , మరి ఆ అభిప్రాయానికి మీరు ఎందుకు మినహాయింపు కావాలి ? మీరు కూడా అదే ప్రమాణాన్ని పాటించాలి ! అంటే ,  ఇతరులలో అస్సలు తప్పే చేయని వారు లేరు అని అనుకుంటున్నప్పుడు ,  ఆ అభిప్రాయం మీకూ వర్తిస్తుంది !  మనం పొరపాట్లూ , తప్పులూ చేయకుండా , జ్ఞానం సముపార్జించ లేము కదా !    ముందుగా, మనం ఈ విషయాన్ని సరిగా అవగాహన చేసికొని ,  అంటే పొరపాట్లు, లోపాలూ , మానవ సహజం అనీ ,  అందుకు ఎవరూ మినహాయింపు కాదనే సత్యాన్ని అంగీకరిస్తే , అప్పుడు మనలో క్షమా గుణం చిగురిస్తుంది ! ఇతరులలో, మనకు గోచరించే తప్పులు , పొర పాట్లూ , కూడా క్షమార్హం అవుతాయి ! అంటే మనం ప్రేమించే వ్యక్తులు కూడా మన ప్రేమకు పాత్రు లవుతారు ! అంటే,  మనం ప్రేమించే వారిలో మనం లోపాలు ఎత్తి చూపడం చేయం ! వారిలో మనకు అభినందనీయ గుణాలే గోచరిస్తాయి !  మనం ఇతరులను ప్రేమించ గలగడం లో ఒక ముఖ్య సూత్రం , మనల్ని మనం క్షమించుకోవడం , ఇతరుల లోపాలను క్షమించ గలగడం ! బాల రాజు కధ సినిమా లో ,  ఈ విషయాన్ని ముళ్ళ పూడి రమణ గారు చక్కగా చెప్పారు ఒక సూత్రం ‘ ఒక్క వేలు చూపి ఒరులను వెక్కిరింప , వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు ‘  అని !   
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ? 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 13, 2013 at 8:23 సా.

ప్రేమించడం ఎట్లా ? 3. 

 ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే  ప్రయత్నం లో ,  ఏది ప్రేమ అనిపించుకోదో తెలుసుకున్నాం కదా , క్రితం టపాలలో !  ప్రేమించడం నేర్చుకునే ముందు ప్రప్రధమం గా చేయ వలసినది,  మనలను మనం ప్రేమించడం ! మీరు మిమ్మల్ని , ప్రేమించడం తెలుసుకుంటేనే , ఇతరులను ప్రేమించ గలరు !  అంటే ,  మనం మనలను ప్రేమించడం లోనే , ప్రేమ స్వభావాన్ని సరిగా అర్ధం చేసుకోగలం ! 
ఉదా:  ప్రమోద్  ఒక మాదిరిగా చదువు కుని , ఒక ప్రైవేట్  సంస్థలో ఉద్యోగం చేస్తూ, బొటా బొటీ జీతం   తో జీవితం గడుపుతుంటాడు !  పెళ్లి వయసు కు పెళ్లి చేసుకున్నాడు , తాను ‘ప్రేమించిన’  యువతినే !   తన ప్రేమను ఆమె కు తనదైన రీతి లో చూపించే వాడు మొదట్లో ! క్రమేణా ,  ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక ‘ మద్యం ‘ తాగడం మొదలు పెట్టాడు ! తన ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం కోసం !  క్రమేణా , ఈ రకం గా ‘ వత్తిడులు ‘ తప్పించుకోవడం, ఎక్కువ సమయం చేయడం మొదలు పెట్టాడు అంటే తరచు గా తాగడం !  తాను ప్రేమించిన యువతిని అశ్రద్ధ చేయడమే కాకుండా ,చీటికీ మాటికీ , సూటి పోటి మాటలతో , ఆమెను అవమాన పరుస్తూ , అప్పుడప్పుడూ చేయి చేసుకుంటూ కూడా , మందు ప్రభావం దిగి నప్పుడు ‘ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ‘ అని  ఆమె  ‘ గాయాలకు ‘ వెన్న పూసే ప్రయత్నం చేస్తాడు !  మరి ప్రమోద్ ప్రేమ ఏమైంది ? ప్రమోద్ ప్రేమిస్తున్నాడా ?  లేదా మందు ప్రభావం లో పడి మాత్రమే , ప్రమోద్ , తన ‘ ప్రేయసి ని మానసికం గానూ , శారీరికం గానూ హింసిస్తున్నాడా ?
విశ్లేషణ:  ప్రమోద్  ఒక  సగటు మనిషి . అందులో ఏ తప్పూ లేదు కదా ! విశాల ప్రపంచం లో ఎంతో మంది సగటు మనుషులు ఉన్నారు !  కానీ , క్రమేణా , పెళ్లి చేసుకున్నాక ,  ఎదురయే సమస్యలను , పరిష్కార మార్గం కనుక్కోలేక , తాత్కాలిక ఉపశమనాలకు , మద్యం అలవాటు చేసుకున్నాడు ! క్రమేణా మద్యం తరచూ తాగడం మొదలెట్టాడు !  చీకాకులూ , ఆందోళన లూ సామాన్యం అయ్యాయి , ప్రమోద్ జీవితం లో ! దానితో , విచక్షణా  జ్ఞానం  కొర వడింది ! ,  వాటితో పాటుగా , ప్రమోద్ లో, తాను ఆశక్తుడి ననే , ఆత్మ న్యూనతా భావాలు ఎక్కువ అయ్యాయి ! తనంటే తనకు ఏహ్య భావం కలుగుతుంది ! కానీ  ఆ విషయాన్ని , తను అంగీకరించే పరిస్థితి లో లేడు !   అగ్నికి ఆజ్యం తోడైనట్టు , మద్యం  ఆ పరిస్థితిని  ఇంకా అధ్వాన్నం చేసింది !  తన చీకాకులూ, కోప తాపాలూ , తాను ఎంతగానో ప్రేమించిన ప్రేయసి మీద చూపించడం మొదలు పెట్టాడు !  ప్రతి సారీ , తన ప్రతాపం, ప్రేయసి మీద చూపించాక , విపరీతం గా పశ్చాతాప పడుతూ , ఏడుస్తాడు !  తన జీవితం తో పాటు గా , తన ప్రేయసి జీవితాన్ని కూడా , ఒక విష వలయం లోకి లాక్కున్నాడు !  తన బలహీనతలూ , తన బాధలూ , తన ప్రేయసి మీద  చూపిస్తూ ,  తన సమస్యలకు తాత్కాలిక ఉపశమనం , మద్యం తోనూ , తన భార్య మీద తన ఆధిపత్యం తోనూ , చేసుకుంటున్నాడు ! ఆ రకం గా చేయి జారిన తన పరిస్థితులు , తన నియంత్రణ లోనే లోనే ఉన్నాయనే  ప్రమాద కరమైన భ్రమ లో జీవితం గడుపుతాడు ప్రమోద్ ! 
ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి మనం !  ప్రమోద్ పరిస్థితి ని గమనిస్తూ ,  అతనిలోని మార్పులను పరిశీలిస్తూ కూడా ఏమీ చేయ లేని అసహాయ స్థితి లో భార్య కుమిలి పోతుందే కానీ , క్రియాశీలం గా ఆ పరిస్థితి నుంచి తాను బయటపడ డానికి   , లేదా ప్రమోద్ ను బయట పడేయడానికీ ఏ రకమైన ప్రయత్నమూ చెయ్యట్లేదు ! అందుకు కారణం ఏమిటి ?   మీరు చెప్ప గలరా ? ముందు ముందు తెలుసు కుందాం !
మనలను మనం ప్రేమించడం అంటే , మన అవసరాలు , ఇతరుల అవసరాల కన్నా ముందు ఉండాలనే తాపత్రయం కాదు !  మన మీద మనకు ఆత్మ విశ్వాసం ఏర్పరుచుకుని , మన  బలాలను మనం ప్రశంశించు కుంటూ , బలహీనతలను అంగీకరిస్తూ ,  ఆ బలహీనతలను కేవలం కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేయకుండా , వాటిని వీలైనంత వరకూ సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ,  ఆ బలహీనతలను ఇతరుల మీదకు ఏదో విధం గా రుద్దే ప్రయత్నం చేయకుండా,   జీవితం గడపడం నేర్చుకోవాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ప్రేమించడం ఎట్లా ?.2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 12, 2013 at 3:51 సా.

ప్రేమించడం ఎట్లా ?.2. 

క్రితం టపాలో ప్రేమ స్వభావం, ప్రేమ పరిధులూ తెలుసుకున్నాం కదా ! మరి ఏది ప్రేమ కాదు ? అనే సంగతి కూడా తెలుసుకుందాం , ప్రేమించడం ఎట్లాగో తెలుసుకునే ముందు ! 
ఏది ప్రేమ కాదు ? :
1. కేవలం కామ ప్రధాన మైన సంబంధం లో ప్రేమ కొరవడుతుంది ! అంటే సామాన్యం గా , ఒక స్త్రీని, పురుషుడు కేవలం కామాతురత తోనే చూస్తూ , తమ కామ వాంఛ లను తీర్చు కోడానికి  ఎంతో అనువైన  వ్యక్తి గా చూడడం అలవరచుకున్నప్పుడు , ఆ సంబంధం  లో ముందుండేది ప్రేమ కాదు , కామ వాంఛ మాత్రమే ! అనేక సంబంధాలలో, తుఫానులు సంభవిస్తూ ,అవి  తరచూ ఆటు పోట్లకు గురి అవుతూ ఉండడానికి  ఇది ఒక ప్రధాన కారణం ! 
2. సంపూర్ణా ధిపత్యం , నియంత్రణ  అంటే డామి నెన్స్ , అండ్ కంట్రోల్ :  ఒక సంబంధం లో ఒక వ్యక్తి , ఇంకో వ్యక్తి ని పూర్తి గా తన నియంత్రణ లో ఉంచుకుని ,  తన ఆజ్ఞలు శిరసావహించే,  విధేయులైన వ్యక్తి గా మసలుకోవాలని, తన సంబంధం లో ఆశిస్తే ,  ఆ సంబంధం లో ప్రేమ లోపిస్తుంది ! ఇట్లా సర్వ సాధారణం గా పురుషుడు , తను సంబంధం ఏర్పరుచుకున్న స్త్రీ తో ప్రవర్తించడం జరుగుతుంది . కేవలం చాలా అరుదు గానే , స్త్రీ , పురుషుని మీద ఇట్లా  ఆధిపత్యం చేయడం జరుగుతుంది ! ఈ రకమైన సంబంధాలలో  ప్రేమ ‘ బూజు పట్టి ‘ ఒక మూల దాక్కుంటుంది !  ఆ సంబంధం ప్రేమమయమైన సంబంధం అనిపించుకోదు , సహజం గానే ! 
3. సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తి గురించి అదే పని గా చింతించడం అంటే వర్రీ అవడం ! :  ఇట్లా , తల్లి తన పిల్లల గురించి కానీ , లేదా భార్య , తన భర్త గురించి కానీ విపరీతం గా వర్రీ అవుతూ , వారు తమకు దూరం గా ఉన్నప్పుడు , ప్రతి క్షణమూ ,వారి గురించి ఆలోచిస్తూ , వారి క్షేమం గురించి ఆందోళన పడుతూ ఉండడం జరుగుతుంది ! ఇట్లా అబ్ సెసివ్  వ్యక్తిత్వం ఉన్న వారు , వారి సంబంధం లో ప్రేమను సమ పాళ్ళలో పొంద లేరు , పంచ లేరు కూడా ! 
4. అనవసరమైన అభద్రతా భావన , లేదా ఆత్మ న్యూ నతా భావనల తో కొనసాగుతున్న సంబంధం లో ప్రేమ ప్రవృద్ధి చెందదు ! :  ఈరకమైన మనస్తత్వం ఉన్న వారు ,  ఇతర వ్యక్తులను తమతో ,’  ప్రేమ ‘ అనే ‘ సాధనం’  తో ‘ కట్టి వేయాలని’ అనుకోవడం జరుగుతుంది ! అది కూడా పొర పాటే ! అది కూడా ప్రేమ అనిపించుకోదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !