Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

ప్ర.జ.లు. 18. అబార్షన్ పద్ధతులు ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 16, 2012 at 7:33 సా.

ప్ర.జ.లు. 18. అబార్షన్  పద్ధతులు ఏమిటి ? : 

ప్రశ్న:  అబార్షన్ గురించి యువత తెలుసుకోవాలని చెపుతూ, గత టపాలలో   మిస్ క్యారేజ్  గురించి రాయడం ఎందుకు జరిగింది ? 
జవాబు:  అబార్షన్ అంటే గర్భ విచ్చిత్తి. అంటే వైద్య విధానాల ద్వారా, గర్భం లో ఉన్న ఎంబ్రియో ను కానీ , శిశువు ను కానీ తీసి వేయడం.మిస్ క్యారేజ్ అంటే సహజం గా, దురదృష్ట వశాత్తు, కొందరు స్త్రీలలో జరిగే  చర్య. ఇందులో కూడా ఎంబ్రియో కానీ శిశువు కానీ గర్భం నుంచి ఎవరి ప్రమేయమూ లేకుండానే , బయటకు వస్తుంది.  ఈ విషయం వివరం గా యువత తెలుసుకుంటే , వారికి  ఎంబ్రియో అయినా, శిశువు అయినా , జీవితం విలువ బాగా అర్ధం అవడానికి ,మిస్ క్యారేజ్ గురించి ముందుగా తెలియ చేయడం జరిగింది. మనం ఎప్పుడూ గుర్తుంచు కోవలసిన విషయం ఇంకోటి కూడా ఉంది.  ఈ భూమి మీద జన్మించిన మానవులందరూ , అత్యంత తోలి దశలో  , అంటే గర్భం లో ఉన్నప్పుడు , అత్యంత సూక్ష్మం గా  ఉండి, క్రమేణా పెరిగి , తొమ్మిది నెలలూ గర్భం లో ఉండి బయటకు వచ్చి ఇంకా పెరిగిన వాళ్ళమే కదా ! అంటే , పురుషుడి నుంచి స్త్రీలో ప్రవేశించిన అనేక మిలియన్ ల  స్పెర్ము లు అంటే వీర్య కణాలలో ఒకటి మాత్రమె , స్త్రీ గర్భాశయం కు ఆనుకుని ఉన్న అండాశయం నుంచి విడుదల అయిన అండం తో కలిసినప్పుడే , నూతన జీవానికి ఆవిష్కారం జరుగుతుంది.  ( పైన ఉన్న వీడియో చూడండి, ఎంత  అద్భుతం గా ఉందొ ఈ  జీవావిష్కారం ). ఇప్పుడు అబార్షన్ పద్ధతులు ఏమిటో కూడా తెలుసుకుందాము. 
నెల తప్పి గర్భవతి అని తెలిసిన తరువాత , ఆ గర్భం కనుక స్త్రీ వద్దనుకుంటే, వెంటనే స్పెషలిస్టు డాక్టర్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది.ఇక్కడ ఇంగ్లండు లో సాధారణం గా జరిగే పధ్ధతి వివరించడం జరుగుతుంది. దేశాలను బట్టి కొద్ది గా తేడాలూ, మార్పులూ ఉండవచ్చు. 1.మొదటి సారి అంటే, మొదటి అపాయింట్ మెంట్ లో డాక్టర్ స్త్రీ వద్ద నుంచి  అబార్షన్ చేయించు కోవడానికి ఏర్పడిన కారణాలు, ఆ స్త్రీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది.2. అవసరమైన రక్త పరీక్షలు కూడా చేయించు కోవాలి అప్పుడు. సెక్స్ పరం గా ఏర్పడిన ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేదో కూడా పరీక్ష చేయించుకోవాలి అప్పుడే ( అంటే ఎస్ టీ డీ లు , లేదా STD ) 3. అల్ట్రా సౌండ్ పరీక్ష , 4. సర్వికల్ స్క్రీనింగ్ పరీక్ష ( దీని గురించి చాలా వివరం గా క్రితం టపాలలో తెలియ చేయడం జరిగింది స్త్రీల కోసం, చూడండి ) ఇంకా 5. వజైనల్ ఎగ్జామి నేషన్ కూడా చేయడం జరుగుతుంది.  అంతకు ముందు ఎప్పుడూ స్త్రీ , వజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోక పొతే , సహజం గానే ఆందోళన గా ఉంటుంది. ఈ విషయం డాక్టర్  కు తెలియ చేస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవడం చేస్తారు.  తరువాత డాక్టరు అబార్షన్ కు ఉన్న వివిధ పద్ధతులను గురించి కూడా స్త్రీకి వివరించడం జరుగుతుంది. 
ఇక పద్ధతుల విషయం : ముఖ్యం గా మూడు పద్ధతులు ఉంటాయి. ఈ మూడు పద్ధతులూ స్త్రీ గర్భం తో ఎన్ని వారాల నుంచి ఉన్నది అనే విషయం పైన ఆధార పడుతుంది. 
1. మొదటి దశలో గర్భ విచ్చిత్తి లేదా అబార్షన్: ఈ పధ్ధతి తొమ్మిది వారాల గర్భం వరకూ చేస్తారు. ఈ పధ్ధతి లో కేవలం మందులు మాత్రమె వాడడం జరుగుతుంది.  అంటే మొదట గా ఒక మందు మెఫి ప్రిస్టన్ ( mefepristone ). ఈ మందు గర్భం దాల్చడానికి అవసరమయే హార్మోనును  పని చేయకుండా బ్లాక్ చేస్తుంది. అపుడు గర్భాశయం లో ఎంబ్రియో మిస్ క్యారేజ్ మాదిరి గా బయటకు వస్తుంది. అప్పుడు కొద్ది గా గర్భాశయ ప్రాంతం లో నొప్పి , కొద్ది గా బ్లీడింగ్ ఉండ వచ్చు. బ్లీడింగ్ కనుక ఎక్కువ గా ఉంటే , వెంటనే డాక్టరును సంప్రదించాలి. మెఫి ప్రిస్టన్ తీసుకున్న నలభై ఎనిమిది గంటల తరువాత అంటే  రెండు రోజుల తరువాత ఇంకో మందు ఇవ్వబడుతుంది. దీనిని ప్రోస్టా గ్లాండిన్ ( prostaglandin ) అంటారు. ఈ మందు తీసుకున్న నాలుగు నుంచి ఆరు గంటల తరువాత , గర్భాశయం  సంకోచం చెంది గర్భాశయం లోపలి గోడలకు ఉన్న మెంబ్రేన్  ( ఈ పలుచటి పొర , ఎంబ్రియో కూ లేదా శిశువు కు  ‘ మెత్తటి పడక ‘ లాగా పని చేస్తుంది , గర్భం  కొనసాగితే ) ఊడి పోయి, బయటకు వస్తుంది. ఈ సమయం లో కొంత నొప్పి కూడా కలగ వచ్చు గర్భాశయ కండరాల సంకోచాల వల్ల. అప్పుడు అవసరం అవుతే , నొప్పి నివారణ కు మందులు వేసుకోవచ్చు. ( పైన  ఉదాహరించిన రెండు మందులూ నోటి లో వేసుకునే మందులు ) 
మిగతా పద్ధతులు వచ్చే టపాలో తెలుసుకుందాము ! 

ప్ర.జ.లు.17. మిస్ క్యారేజ్ ను కనుక్కోవడం ఎట్లా ? :

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 15, 2012 at 7:40 సా.

 ప్ర.జ.లు.17. మిస్ క్యారేజ్ ను  కనుక్కోవడం ఎట్లా ? : 

ప్రశ్న:  మిస్ క్యారేజ్ ను  కనుక్కోవడం ఎట్లా ? :  

జవాబు:  మిస్ క్యారేజ్ అయినప్పుడు సామాన్యం గా స్త్రీ వైద్య నిపుణులు లేదా స్త్రీల స్పెషలిస్టు డాక్టరు ,  స్త్రీ జననేంద్రియ భాగాలను పరీక్ష చేస్తారు. అప్పుడు సర్విక్స్ నుంచి కొద్దిగా రక్త స్రావం అవడం జరుగుతుంది సామాన్యం గా. అంతే కాక పరీక్ష చేసినప్పుడు గర్భాశయం కూడా కొద్ది గా నొప్పి గా అనిపించ వచ్చు. కొన్ని సమయాలలో సర్విక్స్ అంటే గర్భాశయ  ద్వారము కొద్దిగా వదులు గా అవుతుంది దీనినే డైలేషణ్ అని అంటారు. దానిని కూడా పరీక్షలో గమనించ వచ్చు. స్పెషలిస్టు, అదే సమయం లో గర్భాశయం కూడా పెరిగి ఉన్నదా లేదా అని కూడా చూడడం జరుగుతుంది.
ప్రశ్న: మరి అప్పుడు చేయ వలసిన పరీక్షలు ఏమిటి ?: 
జవాబు:1. పెల్విక్ అల్ట్రా సౌండ్ పరీక్ష అంటే శబ్ద తరంగాలను పంపి గర్భాశయ భాగాలను పరీక్ష చేయడం. ఈ పరీక్ష ఎక్స్ రే లతో చేయరు కాబట్టి భయ పడ నవసరం లేదు.  ఈ పరీక్ష ద్వారా ఎంబ్రియో కానీ , శిశువు కానీ  గర్భం లో  ఎక్కడ ఉన్నదీ తెలుస్తున్నది. ముఖ్యం గా గర్భాశయం లో ఉన్న శిశువు గుండె కొట్టుకోవడం కూడా గమనించడం జరుగుతుంది  ఈ పరీక్షలోనే. ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే , గుండె కొట్టుకోవడం వల్ల మనకు శిశువు బ్రతికే ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు ఆ శిశువు ను ఆరోగ్య వంతం గా గర్భాశయం లో నే ఉండి పెరగడానికి ( అంటే ,  పూర్తిగా పెరిగి జన్మ నిచ్చే వరకూ )  చర్యలు తీసుకోవచ్చు  ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఒక పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు అల్ట్రా సౌండ్ పరీక్ష వల్ల. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లో గర్భాశయం లో కాక మిగతా చోట్ల ఎంబ్రియో లేదా పిండం పెరుగుతూ ఉంటుంది. ఇట్లా అరుదు గా జరుగుతూ ఉంటుంది. దీనిని శబ్ద తరంగాల పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 2. HcG levels:  ఇది ఒక రక్త పరీక్ష.  హెచ్ సి జీ అంటే హ్యూమన్ కోరియానిక్ గోనాడో ట్రోఫిన్. ఈ హార్మోను ఎంబ్రియో ఏర్పడగానే స్త్రీ రక్తం లో చాలా ఎక్కువగా తయారవుతుంది. ఈ పరీక్ష కూడా గర్భం లో ఎంబ్రియో సజీవం గా ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికి ఎంతో ఉపయోగకరమైన పరీక్ష. 
ప్రశ్న : త్రెతెండ్ అబార్షన్ ( Threatened abortion )   అంటే ఏమిటి ?: 
జవాబు: ఇది వైద్య చికిత్స రీత్యా అతి ముఖ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో  స్త్రీ గర్భం లో ఉన్న ఎంబ్రియో బయటకు రాదు.  కేవలం సర్విక్స్ నుంచి రక్త స్రావం అవుతుంది. సర్విక్స్ సహజంగా మిస్ క్యారేజ్ అప్పుడు అయినట్టు వ్యాకోచం అంటే డైలేట్ అవ్వదు. అంటే ఈ పరిస్థితిలో మిస్ క్యారేజ్ జరుగదు కానీ వజైనా నుంచి ( సర్విక్స్ నుంచి ) రక్తం మాత్రం కొద్ది గా కనపడుతుంది. ఈ పరిస్థితి గైనకాలజీ పరం గా అత్యవసర స్థితి అంటే ఎమర్జెన్సీ. ఎందువల్ల నంటే , వెంటనే స్పెషలిస్టు హాస్పిటల్ లో చూపించుకుని తగిన సలహా , చికిత్స తీసుకోక పొతే , ఎంబ్రియో ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 
ప్రశ్న: మరి దురదృష్ట వశాత్తు , మిస్ క్యారేజ్ జరిగినప్పుడు ఏ చికిత్స అవసరం అవుతుంది? :  
జవాబు:  ముఖ్యం గా స్పెషలిస్టు డాక్టరు  మిస్ క్యారేజ్ పూర్తి గా అయిందో లేదో  నిర్ణయం చేస్తారు.  అందుకు అవసరమయే అల్ట్రా సౌండ్ పరీక్ష , ఇతర పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది.  చాలా పరిస్థితులలో డీ అండ్ సి  ( D and C ) అనే చికిత్సా పధ్ధతి అవసరం అవుతుంది.  డీ అంటే డైల టేషన్  అంటే సర్విక్స్ ను వ్యాకోచింప చేయడం. సి అంటే క్యురెటాజ్ అంటే  ఒక పరికరం తో గర్భాశయాన్ని శుభ్రం చేయడం.  అందుకు స్త్రీ కి నొప్పి తెలియకుండా  మత్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యెక పరిస్థితులలో యాంటీ బయాటిక్ లు కూడా తీసుకోవడం అవసరం అవుతుంది. 
ప్రశ్న: ఇట్లా డైల టేషన్ అండ్ క్యురెటాజ్ చేయక పొతే ఏమవుతుంది ? : 
జవాబు: కొన్ని పరిస్థితులలో  ఎంబ్రియో కానీ  ఎంబ్రియో తో పాటు ఉన్న మిగతా గర్భాశయ భాగాలు అంటే ప్లాసేంటా  అనే భాగం లేదా మెంబ్రేన్  అంటే ప్లాసేంటా మీద పరచి ఉండే సున్నితమైన పొర కానీ ముక్కలు గా కానీ , పూర్తి గా కానీ గర్భాశయం లోనే ఉండి పోవడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి లో గర్భాశయం లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంతే కాక ఆ ఇన్ఫెక్షన్  వల్ల ఎక్కువ గా బ్లీడింగ్ జరిగే ప్రమాదం ఉంది. అంతే కాక అశ్రద్ధ చేస్తే , గర్భాశయం లో ఇన్ఫెక్షన్  సెప్టిక్ గా మారే ప్రమాదం కూడా ఉంది. 
ప్రశ్న:మిస్ క్యారేజ్ జరిగిన  స్త్రీలు  మళ్ళీ గర్భం దాల్చి సంతానం కనలేరా  ? : 
జవాబు: ఒక సారి కానీ , కొన్ని సమయాలలో రెండు సార్లు కానీ మిస్ క్యారేజ్ అయిన స్త్రీకి మళ్ళీ గర్భవతి అయి మామూలు గా తొమ్మిది నెలలూ గర్భం దాల్చి పండంటి శిశువులకు జన్మ ప్రసాదించే అవకాశం ఎనభై నుంచి తొంభై శాతం అవకాశం ఉంటుందని వివిధ పరిశీలనల లో స్పష్టమైంది. అందుకే మిస్ క్యారేజ్ అయిన స్త్రీలు కరేజ్ కోల్పో కూడదు ! 
ప్రశ్న:మిస్ క్యారేజ్ అయిన స్త్రీలు , భవిష్యత్తు లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ? 
జవాబు: సాధారణం గా పాశ్చాత్య దేశాలలో  స్త్రీకి వరుసగా  రెండు లేక మూడు మిస్ క్యారేజ్ లు అవుతే కానీ అన్ని పరీక్షలూ జరిపించరు స్పెషలిస్టులు.  ఎందుకంటే ఒక సారి మిస్ క్యారేజ్ అయిన వెంటనే కనుక అన్ని పరీక్షలూ జరిపించినా రెండవ సారి కూడా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉండి , మళ్ళీ మిస్ క్యారేజ్ అవుతే , ఆ పరిస్థితి  ఆ స్త్రీ ని ఇంకా మానసికం గా క్రుంగ దీయ వచ్చు,  అందు వల్ల. 
మరి ఏ ఏ పరీక్షలు అవసరం అవుతాయి? : 
జవాబు:భార్యా భర్తల పూర్తి వివరాల తో పాటు , మామూలు గా చేయించుకునే రక్త పరీక్ష లతో పాటు , క్రోమోజోముల పరీక్ష అవసరం ఉంటుంది. ఈ పరీక్ష ను క్యారియో టైపింగ్ అంటారు ( karyotyping ) . ఇంకా గర్భాశయం పూర్తి గా పెరిగి , సంతానోత్పత్తి కి అవసరమయే అన్ని భాగాలూ గర్భాశయం లో సరిగా ఉన్నాయో లేదో కూడా పరీక్ష చేస్తారు.ఎందుకంటే కొందరు స్త్రీలకు పుట్టుక తోనే కొన్ని వైకల్యాలు కలిగి ఉండవచ్చు గర్భాశయం లో. ఈ పరీక్ష ను హిస్టేరో సాల్పింగో గ్రాం ( hystero salpingogram ) ( HSG )  అంటారు. ఇవి కాక, కొన్ని ప్రత్యెక పరిస్థితులలో , ప్రత్యెక మైన రక్త పరీక్షలు కూడా అవసరం ఆవ వచ్చు. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము. 
 
 

ప్ర.జ.లు.16. మిస్ క్యారేజ్ లో కరేజ్ కోల్పో కూడదు !

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 14, 2012 at 11:49 ఉద.

ప్ర.జ.లు.16. మిస్ క్యారేజ్ లో  కరేజ్  కోల్పో కూడదు  ! 

 పైన ఉన్న ఫోటో అమెరికా లో ఒక స్త్రీకి ఆరు వారాల గర్భం మిస్ క్యారేజ్ అయినప్పుడు ‘ జన్మించిన’  శిశువు ది ( ఆ తల్లి ఈ శిశువు కు దీవెన  అంటే బ్లెస్సింగ్ అని పేరు కూడా పెట్టారు )
ప్రశ్న: మిస్ క్యారేజ్ అంటే ఏమిటి ?: 
జవాబు : మిస్ క్యారేజ్ అంటే  యాదృచ్చికం గా గర్భం కోల్పోవడం అంటే, గర్భాశయం లో ఏర్పడిన  ఎంబ్రియో  పూర్తిగా పెరిగి శిశువు గా  మారకుండానే  బయటకు వచ్చేయడం.  ఒక విధం గా మిస్ క్యారేజ్ ను సహజం గా జరిగే అబార్షన్ అని చెప్పుకోవచ్చు. మిస్ క్యారేజ్ కూ అబార్షన్ కూ ఉన్న ఇంకో ముఖ్యమైన తేడా ఏమిటంటే, మిస్ క్యారేజ్ లో  , తల్లి  కావాలని అనుకున్నా , ఎవరి ప్రమేయం లేకుండానే  ఎంబ్రియో లేదా అసంపూర్తి గా పెరిగిన శిశువు ను కోల్పోవడం జరుగుతుంది. అబార్షన్ లో  , తల్లి వద్దనుకుని వైద్య పరంగా గర్భాశయం నుంచి   ఎంబ్రియో లేదా అసంపూర్తి గా పెరిగిన శిశువు ను బయటకు తీయించు కోవడం జరుగుతుంది. మిస్ క్యారేజ్ ,  పదిహేను నుంచి ఇరవై  శాతం మంది స్త్రీలలో జరుగుతుంది. మిస్ క్యారేజ్ సాధారణం గా గర్భం పదమూడు వారాల కంటే తక్కువ గా ఉన్న సమయం లో జరుగుతూ ఉంటుంది. అంటే గర్భం తో ఉన్నట్టు నిర్ణయం అయిన తరువాత ( దీనినే సామాన్యం గా నెల తప్పడం అంటారు, అంటే సహజం  గా నెల నేలా వచ్చే ఋతు స్రావం, గర్భం దాల్చినప్పుడు ఆగి పోవడం ) పదమూడు వారాల లోపే  జరుగుతూ ఉంటాయి మిస్ క్యారేజ్ లు.
ప్రశ్న: మిస్ క్యారేజ్ కు కారణాలు ఏమిటి ?: ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసిన విషయం. మిస్ క్యారేజ్ కారణాలు ఎప్పుడూ ఖచ్చితం గా కనుక్కోవడం అసాధ్యం. అతి సాధారణమైన కారణాలు ఏమిటంటే  శిశువు లో ఏర్పడే  క్రోమోజోముల తేడాలు, అంటే శిశువు  జన్యు నిర్మాణం లో మార్పులు,ఇన్ఫెక్షన్ ( అంటే తల్లి కి కలిగే ఇన్ఫెక్షన్లు ),  డయాబెటిస్ , ఇంకా కొన్ని అరుదైన కొల్లాజేన్ వ్యాధులు. గర్భాశయం నిర్మాణం లో పుట్టుకతో వచ్చిన అ సాధారణ మైన మార్పులు , తేడాలు. కొన్ని సమయాలలో హార్మోనులలో తేడాలు కూడా మిస్ క్యారేజ్ రిస్కు ఎక్కువ చేస్తాయి.  
ప్రశ్న: ఏ ఏ కారణాలు మిస్ క్యారేజ్ కలిగించవు ? : 
జవాబు : సామాన్యం గా చాలా మంది  అపోహ పడుతుంటారు, బాగా వ్యాయామం చేస్తే కానీ,  రోజు వారీ పనులు చేస్తూ ఉంటే కానీ, ఉద్యోగం చేస్తూ ఉంటే కానే, లేదా తరచూ  భార్యా భర్తలు  రతి అంటే సెక్స్ లో పాల్గొనడం వల్ల కానీ , మిస్ క్యారేజ్ జరుగుతూ ఉంటుందని.ఇది కేవలం ఒక పొరపాటు అభిప్రాయం మాత్రమే !  పైన చెప్పిన చర్యలు మిస్ క్యారేజ్ కలిగించవు. కేవలం కొన్ని ప్రత్యెక పరిస్థితులలో మాత్రమే ( అంటే అంతకు ముందు మిస్ క్యారేజ్ జరిగి శిశువు కోసం పరితపిస్తున్న  తల్లులకు ) స్పెషలిస్టులు  ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు.
ప్రశ్న : స్త్రీల లైఫ్ స్టయిల్ అంటే జీవన శైలి  మిస్ క్యారేజ్ కు కారణ మవుతుందా?: 
జవాబు: రోజూ పది అంతకు మించి సిగరెట్టులు స్మోకింగ్ చేసే స్త్రీలలో మిస్ క్యారేజ్ జరగడానికి అవకాశం ఎక్కువ అవుతున్నట్టు అనేక పరిశోధనల వల్ల తెలిసింది. కొన్ని పరిశోధనలలో ఇంట్లో భర్త కానీ భాగ స్వామి కానీ స్మోకింగ్ చేస్తూ ఉంటే కూడా స్త్రీకి మిస్ క్యారేజ్ జరిగే రిస్కు హెచ్చుతున్నట్టు గమనించారు.( అది సహజమే కదా ! ఎందుకంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ! అంటే ఇంట్లో ఒకరు సిగరెట్ తాగుతున్నారు అన్న మాటే కానీ పొగ ను మాత్రం ఆ ఇంట్లో వారందరూ పీలుస్తూ ఉంటారు కదా ! ఇష్టం ఉన్నా లేక పోయినా ! )  అట్లాగే  ఆల్కహాలు అంటే మద్యం తాగే స్త్రీలలో కూడా మిస్ క్యారేజ్ రిస్కు ఎక్కువ అవుతుంది.  ఏ కారణం చేతనైనా మొదటి మూడు మాసాల ( అంటే పన్నెండు వారాల ) గర్భం లో  తీవ్రం గా జ్వరం వస్తే కానీ,  నొప్పి నివారణ కు ఎక్కువ గా మందులు వేసుకుంటుంటే కానీ, అతి గా కాఫీ తాగుతున్నప్పుడు కూడా , స్త్రీలలో మిస్ క్యారేజ్ రిస్కు ఎక్కువ అవుతున్నట్టు, కొన్ని పరిశీలనలలో స్పష్ట పడింది.  ఈ కారణాలన్నీ ముఖ్యం గా ఎంబ్రియో ఏర్పడుతున్న దశలో, జన్యువులలో మార్పులు కలిగించి , మిస్ క్యారేజ్ కలిగిస్తాయి. అంటే ముఖ్యం గా మొదటి పది, పన్నెండు వారాల గర్భం లో. 
ప్రశ్న : మిస్ క్యారేజ్ జరుగుతున్నప్పుడు కలిగే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? 
జవాబు:  ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. cramps and bleeding:   సామాన్యం గా మిస్ క్యారేజ్ జరుగుతున్నప్పుడు  గర్భాశయం  కండరాలు సంకోచిస్తాయి. అంటే కాంట్రాక్ట్ అవుతాయి అందువల్ల లోపలి ఉదర భాగం లో ( ఆ భాగం లోనే కదా గర్భాశయం ఉండేది ! )  నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు ఆ భాగం అంతా పిండి వేసినట్టు అంటే మెలి తిప్పినట్టు వస్తాయి.  ఈ నొప్పులను  క్రామ్ప్స్ ( cramps ) అంటారు. ఈ క్రామ్ప్స్ తో పాటు గా బ్లీడింగ్ కూడా అవుతుంది. అంటే రక్త స్రావం. ఈ రక్త స్రావం గర్భాశయ ద్వారం, అంటే సర్విక్స్ నుంచి వజైనా లో ప్రవేశిస్తుంది కనుక దీనిని వజైనల్ బ్లీడింగ్ అని పిలుస్తారు.  ఈ రెండు లక్షణాలు, అంటే క్రామ్ప్స్ , ఇంకా వజైనల్ బ్లీడింగ్ ల తీవ్రత,  ఎంత సమయం జరుగుతుంది అనే విషయాలు , ప్రతి స్త్రీ లో వేరు వేరు రకాలు గా ఉండ వచ్చు. అంటే  ఒక స్త్రీలో తీవ్రమైన నొప్పులు కలిగి , కొద్ది గా  బ్లీడింగ్ జరగ వచ్చు . ఇంకో స్త్రీలో , అట్లా కాక , కొద్దిగా నొప్పులు కలిగి , ఎక్కువ గా బ్లీడింగ్ ఆవ వచ్చు. 
 
మిస్ క్యారేజ్ గురించిన మిగతా ప్ర.జ.లు వచ్చే టపాలో తెలుసుకుందాము. 

ప్ర.జ.లు. 15. అబార్షన్ గురించి యువత ఏమి తెలుసుకోవాలి ? ఎందుకు తెలుసుకోవాలి ?

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 13, 2012 at 11:08 సా.

ప్ర.జ.లు. 15. అబార్షన్ గురించి  యువత  ఏమి తెలుసుకోవాలి ? ఎందుకు తెలుసుకోవాలి ? 

ప్రశ్న : అబార్షన్ అంటే ఏమిటి ?  మరి అబార్షన్ కూ మిస్ క్యారేజ్ కూ తేడా ఏమైనా ఉందా ? 
జవాబు: ఇది యువతీ యువకులు తెలుసుకో వలసిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న.  అబార్షన్ అంటే  గర్భాశయం నుంచి  స్పెషలిస్టు వైద్యులు , ఏర్పడిన పిండాన్ని , మిగతా పిండ భాగాలనూ, లేదా శిశువునూ ,  బయటకు తీసి వేయడం. దీనినే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లేదా టెర్మినేషన్ అని క్లుప్తం  గా  అంటారు. మరి డెలివరీకీ , అబార్షన్ కూ ఉన్న తేడా ఏమిటంటే , డెలివరీ లో  పూర్తిగా జీవించ గలిగే శక్తి ఉన్న శిశువును, గర్భాశయం నుంచి బయటకు తీయడం, డెలివరీ లో శిశువు సాధారణం గా జన్మించి, సహజం గా, ఆరోగ్యం గా ఉంటుంది.కానీ అబార్షన్ చేసినప్పుడు , శిశువు కానీ , పిండం కానీ స్వతంత్రం గా మన గలిగే పరిస్థితి లో ఉండవు.  
ప్రశ్న: అయితే అబార్షన్ కూ , మిస్ క్యారేజ్ కూ తేడా ఉందా ? ఎందుకు ఈ రెండు విధాలు గా అంటుంటారు? :
జవాబు: మిస్ క్యారేజ్ అంటే సహజమైన కారణాలతో , పిండం కానీ , శిశువు కానీ ,  వైద్య ప్రమేయం ఏమీ లేకుండా గర్భాశయం నుంచి బయటకు వచ్చే పరిస్థితి.  కానీ ముందుగా చెప్పుకున్నట్టు , అబార్షన్  సహజం గా కాక , కృత్రిమం గా స్పెషలిస్టు వైద్యులు చేసే పని. ( ఏ పరిస్థితులలో చేస్తారు అనే విషయం ముందు ముందు వివరం గా తెలుసుకుందాము ). వైద్య పరం గా, అభివృద్ధి చెందిన దేశాలలో ( అంటే అన్ని జాగ్రత్తలూ తీసుకుని ) చేసే అబార్షన్  చాలా సురక్షితమైనది. ఉదాహరణకు ఇంగ్లండు లో అబార్షన్ ఏ ఏ పరిస్థితులలో  చేస్తారో  చూద్దాము. ఇంగ్లండు లో  అబార్షన్ లు ఎప్పుడు చేయాలి , ఏ ఏ పరిస్థితులలో చేయాలి అనే నిబంధనలు  అమలు పరచడానికి ఒక శక్తి వంతమైన చట్టం ఉంది అంటే లా. ఈ లా ప్రకారం. 1. స్త్రీ కి  వ్యక్తి గతం గా బలవంతమైన కారణాల వల్ల 2. గర్భం లో ఉన్న శిశువుకు ఏవైనా సీరియస్ వైద్య పరమైన వ్యాధులు కానీ జన్యు పరమైన, తీవ్రమైన లోపాలు కానీ ఉన్నప్పుడు.3.శిశువు జననం, తల్లి ఆరోగ్యాన్ని తీవ్రం గా ప్రభావితం చేసే సమయం లో కానీ.  ఈ మూడు ప్రత్యెక పరిస్థితులలో , అబార్షన్ చేయడం  సమ్మతం అవుతుంది. ఈ మూడు ప్రత్యెక పరిస్థితులలో , ఒకటి కానీ, రెండు కానీ లేదా అన్నీ కానీ పరిస్థితులను నిర్ణయించ డానికి కనీసం ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు అబార్షన్ చేయించు కోవలసిన స్త్రీని పరీక్ష చేయ వలసి ఉంటుంది. అంతే కాక,  అబార్షన్ ఎప్పుడు చేయ వలసి వచ్చినా , అన్ని వసతులూ ఉన్న స్పెషలిస్టు హాస్పిటల్ లోనూ , లేదా లైసెన్స్ పొందిన ( అబార్షన్ చేయడానికి అన్ని వసతులూ ఉన్న ) క్లినిక్  లోనే  చేయ వలసి ఉంటుంది. దాదాపు ప్రతి దేశం లోనూ ఏదో ఒక రూపం లో చట్టాలు ఉన్నాయి , అబార్షన్ సురక్షితం గా జరపడానికి. భారత దేశంలో ఈ చట్టాన్ని ఎట్లా అమలు పరుస్తున్నారో మీకు తెలిస్తే తెలియ చేయండి. 
ప్రపంచం మొత్తం లో అబార్షన్  సంఖ్యలు ఏమిటి ? : ఒక అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరమూ , కనీసం నలభై నాలుగు మిలియన్ ల  అబార్షన్ లు జరుగుతున్నాయి. అందులో కనీసం సగం అబార్షన్ లు  సురక్షితం గా జరగట్లేదు. ఇట్లా సురక్షితం గా జరగని అబార్షన్ ల వల్ల ప్రతి ఏటా కనీసం డెబ్బయి వేల మంది స్త్రీలు ప్రాణాలు కోల్పో తున్నారు. అంతే కాక కనీసం అయిదు మిలియన్  ల మంది స్త్రీలు, అబార్షన్ వల్ల కలిగే కాంప్లికేషన్ ల తో బాధ పడుతున్నారు ప్రతి ఏటా ! 
 
మిస్ క్యారేజ్ / అబార్షన్ ల గురించి / మిగతా ప్ర.జ.లు. వచ్చే టపాలో ! 
 
 

ప్ర.జ.లు.14.ప్రెగ్నెన్సీ లో ప్రయాణం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 12, 2012 at 10:15 ఉద.

ప్ర.జ.లు.14.ప్రెగ్నెన్సీ లో ప్రయాణం.

ప్రశ్న:  ప్రెగ్నెన్సీ సమయం లో  ప్రయాణం చేయ వచ్చా?  అందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? : 
జవాబు:  ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.  గర్భవతులు ప్రయాణం చేయకూడదు అనే నియమం ఏదీ లేదు.  కానీ అందరు గర్భ వతులు  ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచు కోవాలి.
తాము వెళ్ళే చోట  మంచి వైద్య వసతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అందుకు తగ్గ  ఏర్పాట్లు చేసుకోవాలి. తమ వైద్య వివరాలు తెలిపే ఒక కార్డును కానీ, ఒక ఫైలు ను కానీ ప్రయాణ సమయం లో వారి దగ్గర ఉంచుకోవాలి తప్పని సరిగా. పాశ్చాత్య దేశాలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా , మంచి వైద్య వసతులు ఉంటాయి కనుక , అక్కడ నివశించే వారు విచార పడ నవసరం ఉండదు. కాక పొతే , మెడికల్ ఇన్స్యురెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే  వైద్య చికిత్స కు అయ్యే ఖర్చులు, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి కనుక. తగిన వైద్య వసతులు, మీ వైద్య వివరాలు తెలుసుకున్న డాక్టరు , భారత దేశం లో  ఎక్కడకు వెళితే , అక్కడ ఉండరు కదా ! అందువల్ల ఈ విషయం లో భారత దేశం లో ఉండే స్త్రీలు , ప్రత్యెక శ్రద్ధ వహించాలి.ఇక వివరాలు చూద్దాము.
ప్రశ్న : ఎప్పుడు ప్రయాణం చేయ వచ్చు? : 
జవాబు : కనీసం మూడు నెలల గర్భం దాటిన తరువాత , దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ఉత్తమం. ఎందుకంటే , నెల తప్పిన మొదటి మూడు మాసాలలో , వికారం, కడుపు లో తిప్పడం, తీవ్రమైన అలసట , వాంతులు , ఇలాంటి లక్షణాలు తరచూ  వచ్చేవే కదా ! సహజం గా మొదటి మొదటి మూడు మాసాలలో గర్భం పోవటానికి మిగతా నెలలలో కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, గర్భవతులు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినా , ఉన్న చోటే ఉన్నా ! అందువల్ల కొందరు స్పెషలిస్టులు , కొన్ని ప్రత్యెక కాంప్లికేషన్స్ ఉంటే తప్పితే , ప్రయాణం చేయ కూడదనే నిబంధన ఏమీ లేదు అని అభిప్రాయ పడతారు. 
విమాన ప్రయాణం :  సాధారణం గా ప్రతి ఎయిర్ లైన్స్ వాళ్ళూ , 28 వారాల గర్భం దాటిన తరువాత , ప్రయాణం చేయ దలుచుకుంటే , స్పెషలిస్టు అబ్స్తేట్రి షియన్ నుంచి ఒక ధ్రువ పత్రాన్ని అడుగుతారు,  34 వారాల గర్భవతులను సాధారణం గా ఎయిర్ లైన్స్ లో ప్రయాణాలకు అనుమతించరు. ఎందువంటే  ఈ 34 వారాలు  దాటిన తరువాత , కవలలు గర్భం లో ఉన్నప్పుడు, 37 వారాలు  దాటిన తరువాత ఒక శిశువు గర్భం లో ఉంటేనూ  ప్రసవ వేదన  మొదలవడానికి అవకాశాలు హెచ్చు. విమానం లో ఎక్కువ సమయం ప్రయాణం చేసే గర్భవతులలో , వారి కాళ్ళ లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. దీనిని డీ వీ టీ ( డీప్ వీన్ త్రాంబోసిస్  అంటారు ) .
గర్భవతులు, ప్రయాణానికి ముందు అవసరమయే వాక్సినేషన్ అంటే టీకాలు వేయించు కోవచ్చా?:
జవాబు:  చాలా పాశ్చాత్య దేశాలలో , ప్రజలు ఇతర దేశాలు ప్రయాణం  చేయ దలుచుకుంటే , ఆ యా దేశాలలో ఉండే అంటు వ్యాధుల నివారణ లో భాగం గా వాక్సినేషన్ అంటే టీకాలు  వేస్తారు. ఈ టీకాలు   గర్భం లో ఉన్న శిశువు కు హాని కలిగించే ప్రమాదం ఉంది. అందు వల్ల , టీకాలు వేయించుకోవడం తప్పనిసరి అయిన దేశాలు మీరు వెళ్ళడం మానుకోవడం ఉత్తమం. గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం.  మలేరియా నివారణకు వేసుకునే మందులు కూడా గర్భం లో ఉన్న శిశువుకు హాని కలిగించ వచ్చ్చు. అందువల్ల  మలేరియా మందులు తీసుకునే వారు కూడా  స్పెషలిస్టు ను సంప్రదించాలి. 
ప్రశ్న : గర్భవతులు కారు ప్రయాణం చేయ వచ్చా ? :
 జవాబు:  పాశ్చాత్య దేశాలలో పరవాలేదు. భారత దేశం లో కూడదు. ఎందుకంటే భారత దేశం లో కారు ప్రయాణం చాలా ప్రయాస తో కూడినది , గర్భవతులు కాని వారికే ! ఇక గర్భం లో ఉన్న శిశువు కు ఆ ప్రయాసలు అప్పుడే ఎందుకు ? ఒక వేళ కారు ప్రయాణం తప్పని సరి అయితే , తక్కువ దూరాలు మాత్రమె ప్రయాణం చేయడం , తరచూ అంటే ప్రతి రెండు గంటలకూ, ప్రయాణం ఆపి , విరామం తీసుకోవడం, తగిన  శుభ్రమైన నీరు , ఆహారం కారులో ఉంచుకోవడం, లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
ఆహారం, ద్రవాలు :  
గర్భవతులు వారి ఇల్లు విడిచి ఎక్కడకు వెళ్ళినా , వారు తీసుకునే ద్రవాహారం , ఇంకా ఘనాహారం అంటే నీరు , పాలు , మజ్జిగ , పళ్ళ రసాలు, టీ , కాఫీ , లాంటి ద్రవాలు ,  ఇంకా తినే వంటలు – ఈ విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారు ,గర్భవతులు గా ఉన్నప్పుడు ఏ ఇంఫెక్షనూ రాకుండా జాగ్రత్త వహించాలి. ఇన్ఫెక్షన్లు  వారిని బలహీన పరచడమే కాకుండా, శిశువు పెరుగుదలను కూడా నిదానం చేస్తాయి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు. 13. ప్రెగ్నెన్సీ లో , ప్రణయం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 11, 2012 at 3:24 సా.

ప్ర.జ.లు. 13. ప్రెగ్నెన్సీ  లో , ప్రణయం. 

ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయం లో,  భార్యా భర్త లు సంగమించ వచ్చా? : 
జవాబు: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. తల్లి దండ్రులవబోతున్నారని తెలిసినప్పటి నుంచీ , ప్రతి జంటకూ , సహజం గా ఉండే సందేహమే ! 
ఒక వాక్యం లో చెప్పాలంటే,  భార్యా భర్తలు, ప్రెగ్నెన్సీ సమయం లో  నిరభ్యంతరం గా సంగమించ వచ్చు. ఈ విషయం మీద చేసిన పరిశోధనలలో ,  ఆరోగ్య వంతులైన దంపతులు , గర్భ ధారణా సమయం లో సంగమించడం వల్ల, తల్లికి కానీ , గర్భాశయం లో పెరుగుతున్న శిశువు కు కానీ ఏ విధమైన హానీ జరగదు అని స్పష్టమైనది. ఇక వివరాలలోకి వెళితే  ఈ విషయం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది.
1. మీకు సెక్స్ మీద గతం లో ఉన్న అభిప్రాయాలు.
2. మీ భాగ స్వామికి గతం లో సెక్స్ మీద ఉన్న అభిప్రాయాలు.
3. మీ భౌతిక ఆరోగ్యం.
4. మీ మానసిక అంటే ఎమోషన్స్ లేదా భావోద్వేగాలు.
ప్రశ్న : మూడవ వంతు రూలు అంటే ఏమిటి ? : జవాబు: గర్భవతులైన స్త్రీలందరిలో , మూడవ వంతు మందికి ప్రెగ్నెన్సీ సమయం లో కామ వాంఛ అధికం గా ఉంటుంది. ఇంకో మూడవవంతు స్త్రీలలో కామ వాంఛ తక్కువ అవుతుంది. ఆఖరి మూడవ వంతు వారిలో మునుపటి మాదిరిగా ఉంటుంది అంటే ఎక్కువ అవడం కానీ , తక్కువ అవడం కానీ జరగదు. మరి మీరు  ఏ మూడవ వంతుకు చెందుతారో ! 
ప్రెగ్నెన్సీ సమయం లో  సంగమం చాలా కారణాల వల్ల , ఎక్కువ ఆనంద దాయకం గా కూడా ఉంటుంది.  సామాన్యం గా ప్రెగ్నెన్సీ సమయం లో అంతకు ముందు కంటే తక్కువ సార్లు సంభోగం లో స్త్రీ పురుషులు పాల్గొనడం జరుగుతుంది. దీని వల్ల కామ వాంఛ అధికం అవుతుంది.  స్త్రీ జననేంద్రియాలు, అనేక హార్మోనుల చర్యల వల్ల , ఎక్కువ స్రావాలు జరుగుతాయి, వజైనా ప్రాంతం లో. దీనివల్ల పురుషాంగం శులభం గా ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది.  అంతే కాక హార్మోనులలో వస్తున్న హెచ్చు తగ్గుల వల్ల కొందరు స్త్రీలలో సామాన్యం గా వచ్చే ఆర్గాజం ల కంటే ఎక్కువ సార్లు కూడా  ఆర్గాజం వస్తూ ఉంటుంది. ఇంకా , గర్భ నిరోధానికి ఏ పద్ధతులూ ఎట్లాగూ అమలు పరచ నవసరం లేదు కనుక , స్త్రీ పురుషులు  ఏ సంకోచాలూ లేకుండా రతి క్రియ లో పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల కూడా అధికానందం పొందుతారు. 
కొన్ని కారణాల వల్ల , ఆనంద దాయకం గా లేకనూ పోవచ్చు.  సామాన్య మైన కారణం , భార్యా భర్తలు ఇరువురూ , శిశువుకు  ఎక్కడ హాని కలుగుతుందో అన్న భయం , ఆందోళన వల్ల కూడా మనస్పూర్తి గా  సెక్స్ లో పాల్గొనలేక పోవచ్చు. ఇంకా గర్భవతి అయిన తొలి మాసాలలో , వికారం, అలసట , ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ ఏమిటి అనే భావన కూడా కలిగి  క్రితం మాదిరి గా కామోత్తేజం పొందలేక పోవచ్చు.  
 
ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ , ఏ ఏ సందర్భాలలో కూడదు? : 
కొన్ని ప్రత్యెక పరిస్థితులలో , గర్భవతులు , ప్రెగ్నెన్సీ సమయం లో సెక్స్ లో పాల్గొన కూడదు.
1. అంతకు ముందు కనుక  నెలలు నిండని శిశువును ప్రసవిస్తే.
2. కారణాలు తెలియని విధం గా గర్భ ద్వారం నుంచి అంటే వజైనల్ లేదా సర్వికల్ బ్లీడింగ్ ,  ప్రెగ్నెన్సీ సమయం లో ఎప్పుడైనా కలిగితే, అంటే , మొదటి నెల నుంచి , తొమ్మిదో నెల వరకు ,  ఏ నెలలో నైనా   రక్త స్రావం జరిగితే .
3.  గర్భాశయ పొర అంటే మెంబ్రేన్  నెలలు నిండక ముందే చీలి పోవడం . ( ఈ పొర లేదా మెంబ్రేన్ గర్భాశయాన్ని నెలలు నిండే వరకూ శిశువును భద్రం గా గర్భాశయం లో కాపాడుతుంది. నెలలు నిండగానే ఆ పొర తెగి పోతుంది, శిశు జననం జరగడానికి , కానీ కొన్ని ప్రత్యెక పరిస్థితులలో, ప్రమాద వశాత్తు , ఆ పొర లేదా మెంబ్రేన్ నెలలు నిండక ముందే తెగి పోతుంది. అప్పుడు సెక్స్ లో  పాల్గొన కుండా వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించాలి ) 
4. ఇంకా కొన్ని ప్రత్యెక సందర్భాలలో , కొందరికి గర్భాశయం క్రింద అంటే సర్విక్స్ ప్రాంతం లో శిశువు కు పోషకాలు అందించే ప్లాసేంటా ఏర్పడుతుంది.ఈ పరిస్థితిని ప్లాసేంటా ప్రీవియా అంటారు. ఈ ప్లాసేంటా చాలా రక్త నాళాల తో నిర్మించిన వల లా ఉంటుంది. సామాన్యం గా ఈ ప్లాసేంటా , గర్భాశ యానికి పై భాగం లో ఏర్పడుతుంది. పైన ఉన్న చిత్రం చూడండి. 
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు.12. ప్రెగ్నెన్సీ లో పత్యం.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 9, 2012 at 7:29 సా.

ప్ర.జ.లు.12. ప్రెగ్నెన్సీ లో  పత్యం.

బొప్పాయి పండు తినకూడదు; బొప్పాయి పండు , గర్భ ధారణా సమయలో  ఏ మాత్రం తినకూడదు.
ప్రశ్న : క్రితం టపాలో గర్భ ధారణా సమయం లో తినవలసిన సమ తుల్యమైన ఆహారం గురించి తెలుసుకున్నాము కదా ! మరి తిన కూడని ఆహార పదార్ధాలు ఏమిటి ? : 
జవాబు:  ప్రెగ్నెన్సీ సమయం లో తినకూడని పదార్ధాలు చాలా రకాలు గా ఉండ వచ్చు. ఒకటి. వారికి అంతకు ముందు ఏ ఆహార పదార్దాలైతే పడలేదో వాటిని గుర్తుంచుకొని , ఎప్పుడూ తిన కూడదు. ప్రత్యేకించి గర్భ ధారణా సమయం లో. రెండు. కొత్త ఆహార పదార్ధాలు వీలైనంత వరకూ ఇంటి లో వండినవే తినడం. ఈ విధం గా చేయడం వల్ల, మీకు  ఇష్టమైన వంటకాలు మీకు నచ్చినట్టు వండుకుని తినే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యం గా వండడం లో శ్రద్ధ వహిస్తారు కాబట్టి ,ఉడికీ ఉడకని వంటకాలు తినడం అనే సమస్య ఉత్పన్నం అవదు. 
మరి ఏ ఆహార పదార్ధాలు తిన కూడదు? : 
1.సరిగా ఉడకని కోడి   గుడ్లు : కోడి గుడ్లు  తినే అలవాటు ఉన్న వారు, వాటిని బాగా గట్టి పడే వరకూ ఉడికించి తినాలి. సరిగా ఉడకని కోడి గుడ్డు లో సాల్మొనెల్లా అనే బ్యాక్తీరియం ఉంటుంది. అది మనుషుల ఆహారం లో ప్రవేశించితే, తీవ్ర మైన అస్వస్థత కు కారణం అవుతుంది.
2.సరిగా ఉడికించని చేపలు , మాంసమూ కూడా తినకూడదు. అంతే కాక , రొయ్యలు , ఆలి చిప్పలు తినే వారు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఈ విషయం లో ! 
3. పాశ్చరైజ్ చేయని పాలు , జున్ను, పెరుగు కూడా తినకూడదు. పాశ్చ రైజేషన్ అంటే ప్రతి ఆహారాన్నీ ఒక నిర్ణీత మైన ఉష్ణోగ్రత వరకూ వేడి చేసి, ఆ పైన త్వరగా చల్లార్చడం. ఇట్లా చేయడం వల్ల ఆ ఆహార పదార్ధం లో ఉన్న బ్యాక్టీరియాలు చాలా వరకూ నశించుతాయి.ఒక వేళ ఈ విషయం పట్టించుకోకుండా కనుక ఆ ఆహార పదార్ధాలను తింటే, ఆ యా బ్యాక్టీరియాల వల్ల  మనుషులలో  వాంతులు , విరేచనాలు కలిగి తీవ్ర అస్వస్థత కలగ వచ్చు. 
4. సరిగా ఉడకని బంగాళా దుంపల కూరలు కూడా తిన కూడదు. బంగాళా దుంప ల లో సోలానిన్ అనే విష పదార్ధం ఉంటుంది. బాగా ఉడికిస్తే కానీ వేయిస్తే కానీ ఈ విష పదార్ధం విరిగి పోతుంది. అందు వల్ల మనుషులకు ఏ హానీ కలిగించదు. అంతే కాక , లిస్టీరియా అనే బ్యాక్టీరియాలు   కూడా ఉంటాయి ఉదికించని బంగాళా దుంప లలో, అవి గ్యాస్ట్రో ఎంటి రైటిస్ కలిగించ వచ్చు గర్భిణి స్త్రీలలో. 
5.బొప్పాయి పండు తినకూడదు; బొప్పాయి పండు , గర్భ ధారణా సమయలో  ఏ మాత్రం తినకూడదు. ఎందుకంటే బొప్పాయి పండు , గర్భ నిరోదానికీ , అబార్షన్ కూ కారణమవుతుంది. పూర్వం వెస్టిండీస్ లో బానిస స్త్రీలు తాము గర్భవతులు కాకుండా ఉండడానికి బొప్పాయి పళ్ళు తినే వారు ( ఎందుకంటే , వారికి కలిగే ఇల్లీగల్ సంతానం కూడా బానిసలు గా బ్రతకడం వారికి ఇష్టం లేక ! ) 
5.మద్యం ఏ రూపం లోనైనా తాగ కూడదు ప్రెగ్నెన్సీ సమయం లో ! అంటే బీరు, వైన్ , విస్కీ , సైడర్ , ఇట్లా ఏ రూపం లో ఉన్నా అందులో ఆల్కహాలు ఉంటుంది కాబట్టి. ఆల్కహాలు నిర్మాణం అవుతున్న శిశువు లో అనేక అవయవ లోపాలు కలిగిస్తుందని , అనేక పరిశీలనల వల్ల ఖచ్చితం గా, అంటే ఏ విధమైన అనుమానాలూ , సందేహాలూ లేకుండా విశదమైంది.
వచ్చే టపాలో ఇంకొన్ని ప్ర.జ.లు. 

ప్ర.జ.లు.11. ప్రెగ్నెన్సీ లో ఆహార నియమాలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 8, 2012 at 7:31 సా.

ప్ర.జ.లు.11. ప్రెగ్నెన్సీ లో ఆహార నియమాలు. 

ప్రశ్న : గర్భధారణ సమయం లో  ఏ ఆహారం తీసుకోవాలి ? పత్యం ఏమైనా ఉందా? : 
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న , ముఖ్యమైన ప్రశ్న కూడా ! 
ప్రెగ్నెన్సీ లేదా గర్భ ధారణా సమయం లో  సమ తుల్యమైన ఆహారం తీసుకోవడం  రెండు విధాలు గా ముఖ్యం, అంటే తల్లి ఆరోగ్యానికీ, గర్భం లో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం కూడా ! 
మరి సమ తుల్యమైన ఆహారం అంటే ఏమిటి ?:  అంటే కేవలం త్రాసు తో తూచి సమం గా అంటే రోజూ ఇన్ని గ్రాముల ఆహారం అని కాదు కదా!  సమ తుల్యమైన ఆహారం అంటే  కార్బోహైడ్రేటు లు , కొవ్వు, మాంస కృత్తులు, విటమిన్లు , ఇంకా ఖనిజాలూ , తల్లికీ ,  శిశువు పెరుగుదలకూ  సరిపోయినంత పరిమాణం  లో రోజూ తీసుకోవడం. అంటే అన్ని పోషక పదార్ధాలూ  రోజూ ఆహారం లో సమ పాళ్ళలో ఉండేట్టు చూసుకొని తినడం.  ఒక ఉదాహరణ:  తోలి మాసాలలో, తల్లికి ఇష్టమైన ఆహారం అని  మెక్ డొనాల్డ్స్ లోనూ ,లేదా కే ఎఫ్ సి లోనూ రోజూ   పిజ్జాలూ , చిప్స్ , బర్గర్ తిన్నారనుకోండి. వాటిలో కేవలం  కొవ్వు, ఇంకా  కార్బోహైడ్రేటులు మాత్రమె ఉండే ఆహారం అవుతుంది అది. అది సమతుల్యమైన ఆహారం కాదు కదా ! అది జంక్ ఫుడ్ అనబడుతూ ఉంటుంది పాశ్చాత్య దేశాలలో ! 
మన భారత దేశ ఆచార వ్యావహారాలు గమనించి నట్టయితే , గర్భవతులకు శ్రీమంతం అని చేస్తారు. అంటే మొదటి మూడు మాసాలలో గర్భవతి అని తెలియగానే కుటుంబం లో అందరూ ఆనందం గా చేసుకునే పండగ. అందులో గర్భవతి కోసం మొలకలు వచ్చిన శనగలూ ఇంకా బెల్లం తో చేసిన చలిమిడి ఉండలూ , నువ్వులూ తినమని పెడతారు. శాస్త్రీయం గా చూస్తె మన పెద్దలకు ఎంత దూర దృష్టి ఉందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే , మొలకలు వేస్తున్న శనగలు , పెసలలో విటమిన్ లు సంవృద్ది గా ఉంటాయి , ప్రత్యేకించి  ఫోలిక్ యాసిడ్ మిగతా బీ కాంప్లెక్స్ విటమిన్లు. చలిమిడి ఉండలు బెల్లం తో చేయబడినవి కాబట్టి వాటిలో ఇనుము అంటే ఐరన్  సరిపడినంత గా ఉంటుంది. ఇక నువ్వులూ , ఇతర  విత్తనాలలో  మినరల్స్ లేదా ఖనిజాలు పుష్కలం గా ఉంటాయి. ఈ ఖనిజాలూ,విటమిన్లూ పెరుగుతున్న శిశువు కు ఎంతో ముఖ్యం ప్రత్యేకించి మొదటి మూడు మాసాలలో. ఇంకా ఇవన్నీ సహజం గా దొరికేవే కదా !  కాల క్రమేణా  ఈ ఆచార వ్యవహారాలు ఎంత మంది పాటిస్తున్నారో మనకు తెలుసు కదా ! 
సరే మనం ఇప్పుడు ముఖ్యమైన విషయం తెలుసుకుందాము.  
ప్రశ్న :  నేను  ప్రెగ్నెన్సీ సమయం లో ఏ ఆహారం తినాలి ? : 
జవాబు: మీరు రోజూ మూడు సార్లు  భోజనం చేయాలి అంటే మేజర్ మీల్స్. ఇంకా కనీసం రెండు మూడు సార్లు రోజుకు టిఫిన్లు కానీ స్నాక్స్ ( లేక చిరుతిళ్ళు )  కానీ తినవచ్చు. ముఖ్యం గా భోజనం సమతుల్యం గా ఉండేట్టు చూసుకోవాలి.  పళ్ళూ , కాయగూరలూ , ఆకు కూరలూ వీలైనన్ని తింటూ ఉండాలి. విటమిన్లు కాక పీచు పదార్ధం కూడా సరిపడినంత గా ఉంటుంది.  హోల్ గ్రేయిన్స్ అంటే పొట్టు తీయని  పప్పు ధాన్యాలు విటమిన్లకు నిలయాలు. లో ఫాట్  పాలు , పళ్ళ రసాలూ , సూప్స్ కూడా తీసుకోవచ్చు. సంవృద్ది గా నీరు తాగడం కూడా చేస్తూ ఉండాలి.  వంటకాలలో నూనె వీలైనంత వరకు తక్కువగానూ , వెజిటబుల్ నూనె , మొక్కజొన్న అంటే కార్న్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ , ఇంకా సన్ ఫ్లవర్ ఆయిల్ ను వాడడం మంచిది. ఈ నూనెలు మార్చి వాడడం వల్ల కూడా , శరీరానికి అవసరమైన వివిధ ఖనిజాలు లభిస్తాయి. ప్రాసెస్స్ చేసిన ఆహార పదార్ధాలు అంటే డబ్బాలలో అమ్మే ఆహార పదార్ధాలు తినడం మానాలి, వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండడమే కాక , విటమిన్లు , ఏవీ ఉండవు. అంతే కాక నిలువ చేయడం వల్ల రుచి కూడా తగ్గుతుంది, తాజా దనం కోల్పోయి. టీలూ కాఫీలూ రోజుకు మూడు నాలుగు సార్ల కన్నా ఎక్కువగా తాగ కూడదు. అవి గుండె ను  వేగం గా కొట్టుకునేట్టు చేయడమే కాక , స్వేదం అంటే చెమట పుట్టించడం,యాంగ్జైటీ కలిగించడం, నిద్ర కోల్పోవడం – వీటికి కారణమవుతాయి. చిరుతిళ్ళు తినవలసి వస్తే , చాక్లెట్లూ , బిస్కెట్ లూ, కేకులూ , క్రిస్ప్ లూ  చాలా తగ్గించితే మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో మీకు కావలసినది సమతుల్యమైన ఆహారం. కేవలం  కాలరీలు మాత్రమె కాదు కదా ! 
ప్రశ్న: మరి తినగూడనివి ఏమిటి ? 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము.
 

ప్ర.జ.లు.10. గర్భ వతులు చేయించుకోవలసిన పరీక్షలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 7, 2012 at 7:37 సా.

ప్ర.జ.లు.10. గర్భ వతులు చేయించుకోవలసిన పరీక్షలు.

ప్రశ్న: గర్భవతులు చేయించుకోవలసిన పరీక్షలు ఏమిటి ? ముఖ్యం గా,  ఆ పరీక్షలు అవసరమా? : 
జవాబు:  గర్భ వతి అని నిర్ణయం అయిన   వెంటనే మొదటి సారిగా స్పెషలిస్టు డాక్టరు ( అంటే అబ్స్తే ట్రిషి యాన్ ) ను సంప్రదించే సమయం లో ఆ డాక్టరు మీ వద్ద నుంచి కొన్ని వివరాలు అడగటమే కాకుండా ,కొన్ని పరీక్షలు కూడా చేయించు కొమ్మని సలహా ఇస్తారు.ఆపరీక్షలు ఏమిటో , ఎందుకు చేయించుకోవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. 
1. మీ యొక్క మెడికల్ సమస్యలు , లేదా సర్జికల్ సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం. ఒక వేళ ఉంటే , వాటి వివరాలు కూడా తెలుసుకోవడం. ఇంకా మీ ఆహారపు అలవాట్లు, అంటే మీరు పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా ! అని కూడా తెలుసుకోవడం జరుగుతుంది.
2.మీ మానసిక , సామాజిక జీవన శైలి: అంటే స్మోకింగ్ చేస్తారా లేదా , మద్యం తాగుతారా లేదా, మాదక ద్రవ్యాలు ఏవైనా తీసు కుంటున్నారా ? మీకు మీ బంధువుల నుంచి కానీ , స్నేహితుల నుంచి కానీ మీ గర్భ దారణ సమయం లో ఎంత సహాయం అందుతుంది?మీరు మానసిక వత్తిడి తట్టుకోగలరా?  శారీరికం గా మీరు ఎంత శ్రమ పడుతున్నారు? ఈ విషయాలన్నీ స్పెషలిస్టు  మిమ్మల్ని అడగ వలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ , మీ గర్భం లో ఉన్న శిశువు నిర్మాణాన్నీ , పెరుగుదలనూ ప్రభావితం చేస్తాయి కాబట్టి. 
3. డాక్టరు చేసే పరీక్షలు ఏమిటి ? : ముఖ్యం గా మీ బరువు ఎంత ఉంది ? , మీ రక్త పీడనం, అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందీ ?  ఇంకా మీ వక్షోజాల ఆరోగ్య స్థితి , అట్లాగే మీ గర్భాశయం ఆరోగ్య స్థితి తెలుసు కోవడానికి ( స్పెషలిస్టు చేతులతో ) పరీక్షలు చేస్తారు. వక్షోజ పరీక్ష ( బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ) , గర్భాశయ పరీక్ష ( పెల్విక్ ఎగ్జామినేషన్ ) అని  ఆంగ్లం లో అంటారు వీటిని .
4. ఇక ప్రయోగశాల పరీక్షలు ఏవి చేయించుకోవాలి ? :  1. హీమోగ్లోబిన్ పరీక్ష. ఇంకా 2. మూత్ర పరీక్ష. ఈ రెండు పరీక్షలూ  అందరు గర్భవతులూ  తప్పని సరిగా చేయించుకోవలసిన పరీక్షలు.  హీమోగ్లోబిన్ పరీక్ష మీలో రక్త హీనత ఉంటే తెలియ చేస్తుంది. రక్త హీనత ఉంటే , శిశువు పెరుగుదల సరిగా జరగదు.అంతే కాక  డెలివరీ సమయం లో రక్త స్రావం  సహజం గా జరిగే రక్త స్రావానికీ , లేదా ఆకస్మికం గా మీలో ఎక్కువ గా జరిగే రక్త స్రావానికీ మీరు సన్నద్ధులు అవాలి గర్భ ధారణ తోలి దశల నుండీ, అందువల్ల హీమోగ్లోబిన్ పరీక్ష అత్యంత ముఖ్యమైన పరీక్ష. అట్లాగే మూత్ర పరీక్ష కూడా ముఖ్యమైనదే. మూత్రం లో ఇన్ఫెక్షన్ ఉంటే,  గర్భాశయం లో పెరుగుతున్న పిండానికి  పాక డానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు అబార్షన్ అయ్యే రిస్కు ఏర్పడుతుంది.ఇక కొందరు ప్రత్యెక కారణాల వల్ల , షుగర్ పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబం లో డయాబెటిస్ ఉన్న స్త్రీలు. అట్లాగే రీసస్ అంటే Rh అనే రక్త గ్రూపు పరీక్ష కూడా చేయించుకోవలసిన అవసరం ఏర్పడ వచ్చు కొందరిలో. ఇంకా సిఫిలిస్ పరీక్షలూ , గోనేరియా పరీక్షలూ కూడా కొందరికి చేసుకోవలసిన అవసరం రావచ్చు.
5. ఇంకా ప్రతి గర్భవతి అయిన స్త్రీకీ, గర్భ ధారణ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలూ, ఆహార నియమాలూ, వ్యాయామాలూ, వీటన్నిటి గురించీ తగిన విధం గా సలహా ఇచ్చి , వారికి గర్భం దాల్చడం , ప్రసవించడం, శిశు పోషణ ఇలాంటి విషయాల మీద తగిన అవగాహన కలిగించి, వారి సందేహాలు, అపోహలూ తీర్చి , వారిని ఆనంద కరం గానూ , ఆరోగ్యం గానూ  శిశు జననానికి సమాయత్తం చేయడం కూడా మొదటి దఫా స్పెషలిస్టు ను సంప్రదించినప్పుడు చేయవలసిన కార్యాలే ! 
 
ప్రశ్న:  మూడు నుంచి ఆరు నెలల గర్భధారణ సమయం లో ఏ మార్పులు జరుగుతాయి?  గర్భవతులకు ఏ జాగ్రత్తలు అవసరం ?:
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాము. 

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., Our Health on ఆగస్ట్ 6, 2012 at 8:10 సా.

ప్ర.జ.లు.9.గర్భవతులు – జాగ్రత్తలు.

క్రితం టపాలో మనం గర్భవతులు మొదటి మూడు మాసాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అందుకు గల కారణాలు కూడా తెలుసుకున్నాము కదా ! 
ప్రశ్న:  మరి మొదటి మూడు మాసాలలో గర్భం దాల్చిన స్త్రీలలో ఉండే సామాన్య లక్షణాలు ఏమిటి? :
జవాబు: నెల తప్పిన మొదటి మాసం లోనే  గర్భవతులు పలు లక్షణాలు అనుభవిస్తారు. దీనికి కారణం స్త్రీలలో ఉండే హార్మోనులలో వచ్చే పలు మార్పుల వల్లే !  అంటే  గర్భాశయం లో ఏర్పడిన పిండం, నిర్మాణం అయి , సక్రమం గా పెరగటానికి ఈ హార్మోనుల మార్పులు అత్యవసరం. ఈ హార్మోనుల మార్పుల వల్ల స్త్రీ లోని ప్రతి భాగం ప్రభావితమవుతుంది.
మరి ఏ లక్షణాలు సామాన్యం గా ఉంటాయి?:
1.తీవ్రమైన అలసట.
2.స్తనాలలో నొప్పులు రావడం, పుండు లా అయినట్టు నొప్పి కలగడం, కుఛ ద్వయం కూడా పొడుచుకు వచ్చినట్టు ఉండడం.
3.కడుపులో తిప్పినట్టు ఉండడం, కొన్ని సమయాలలో వాంతి వచ్చే ఫీలింగ్ కలగడం లేదా వాంతి కూడా రావడం. దీనినే ఆంగ్లం లో మార్నింగ్ సిక్ నెస్ అంటారు.
4. కడుపులో వికారం గా అయి, అంతకు ముందు రుచి గా ఉన్న పదార్ధాలు రుచించక పోవడం, లేదా కొన్ని పదార్ధాలు ఎక్కువ గా తినాలని తాపత్రయ పడడం. దీనిని ఆంగ్లం లో క్రేవింగ్ అంటారు.
5. మానసిక స్థితి అంటే మూడ్ మారడం. సామాన్యం గా ఆనందం తగ్గి , దిగాలు పడి ఉండడం. 
6. కడుపు లో మంట గా ఉండడం,  మల బద్ధకం అంటే కాన్స్తిపేషన్  అవడం.
7. తల నొప్పి.
8. మూత్రం రాకపోయినా , తరచూ , బాత్ రూం కు వెళ్లాలని పించడం.
9.కొంత బరువు తగ్గడమూ లేదా పెరగడమూ . 
ప్రశ్న : మరి ఈ లక్షణాలకు చికిత్స ఉందా ?: 
జవాబు: పైన తెలుసుకున్నట్టు, ఈ లక్షణాలన్నీ సాధారణం గా ప్రతి గర్భవతి లోనూ, అన్నీ కానీ , కొన్ని కానీ , కనిపించే లక్షణాలే. ప్రతి లక్షణానికీ ఒక టాబ్లెట్ వేసుకుని, చికిత్స చేయించుకోవాలనే భావన మానుకోవాలి స్త్రీలు , ఈ సమయం లో( ప్రత్యేకించి మొదటి మూడు మాసాలూ, పిండం నిర్మాణ దశలో ఉంటుంది కనుక ) . ఆహారం కొంచం పరిమాణం లో ఎక్కువ సార్లు తినడం, ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం లాంటి చిన్న చిన్న కిటుకులు పాటించాలి.  క్రమేణా అంటే  మూడు, నాలుగు మాసాల గర్భం సమయం లో ఈ లక్షణాలు తగ్గు ముఖం పడతాయి. లక్షణాలు తీవ్రం గా ఉన్నప్పుడే వైద్య సలహా తీసుకోవాలి.
గర్భవతులు – బాడీ ఇమేజ్  అంటే ఏమిటి ?: 
కొందరు స్త్రీలు తాము గర్భం దాల్చగానే , తమ శరీరం లో క్రమేణా వస్తున్న మార్పులతో తాము నెగెటివ్ గా ప్రభావితం అవుతారు. తమను తాము, తమ క్రితం రూపం తో గర్భం దాల్చిన తరువాత మారుతున్న రూపం తో పోల్చుకుని, తీవ్రం గా నిస్పృహ చెందుతారు. ఈ విధమైన భావన ఒక మానసిక స్థితి.  ప్రత్యేకించి, నవీన ప్రపంచం లో చక్కటి అవయవ సౌష్టవం కల స్త్రీని మాత్రమె ఆదర్శ మైన అందమైన యువతి గా చూపించే వివిధ వ్యాపార , వాణిజ్య ప్రకటనల ప్రభావమే అది. 
ప్రశ్న : మరి  గర్భవతులు వారి బాడీ ఇమేజ్ గురించి ఏమి చేయాలి? 
జవాబు : 
1. మీరు గర్భం దాల్చక ముందు మీ శరీరాన్ని ప్రేమించండి. గర్భం దాల్చడం అనేది ఒక తాత్కాలిక శరీర స్థితి. ఆ స్థితి అత్యంత సహజమైన స్థితి. దాని  ప్రధాన ఉపయోగం శిశువుకు జన్మ నీయడం. ఆ మహత్తర కార్యం  అవగానే మీ శరీరం మామూలు స్థితి కి చేరుకుంటుంది. అందువల్ల గర్భం దాల్చిన సమయం లో మీరు ప్రశాంతం గా శిశువు కు జన్మ నీయడం మీదనే మీ దృష్టి కేంద్రీకరించండి.
2. ఈ విషయం మీద మీకు ఉన్న అపోహలూ , ఆలోచనలూ , నిర్భయం గా, సంకోచం లేకుండా , మీ జీవిత భాగస్వామి తో పంచుకోండి. ఆ రకమైన ఆలోచనలు మీలోనే నిగూడమై ఉంటే, మీ మానసిక స్తితి మరింత దిగాలు పడవచ్చు.
3. సెల్ఫ్ మస్సాజ్ అంటే మీ శరీరాన్ని మీరే సున్నితం గా స్పృశించడం. ఈ విధం గా చేయడం వల్ల మీ శరీరం మీద మీకు ఇష్టత ఎక్కువై  మీరు మీ ( గర్భం దాల్చిన ) స్థితిని ఆమోదించే  వీలు ఎక్కువ అవుతుంది.
4.  మీకు అనుకూలమైన వ్యాయామం చేయడం , స్విమింగ్ చేయడం లాంటివి కూడా మీకు ఉపయోగ పడతాయి.
5.  సున్నితమైన వ్యాయామం తో పాటు యోగాభ్యాసం కూడా గర్భవతులకు ఎంతో ఉపయోగ పడుతుంది. 
6. సహజమైన గర్భ ధారణ అంటే ప్రెగ్నెన్సీ గురించి , ప్రెగ్నెన్సీ లో వచ్చే సహజమైన మార్పుల గురించీ వీలైనంత ఎక్కువ అవగాహన ఏర్పరుచుకోండి. దీని వల్ల మీ సందేహాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. అపోహలు మాయమవుతాయి.
ప్రశ్న : నా మునుపటి శరీరం పోయింది , నేను తల్లి నయ్యాక ! ఈ లాంటి ఫీలింగ్స్ కు చికిత్స ఏమిటి?:
జవాబు: ఈ భావన కూడా చాలా మంది స్త్రీలలో కలుగుతుంది, శిశువు జన్మించిన తరువాత. ఈ భావన కు కూడా  మీకు ప్రెగ్నెన్సీ మీద మంచి అవగాహన ఏర్పడితే  పోతుంది. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ , డెలివరీ అయ్యాక స్త్రీలు పాల్గొనే వివిధ వ్యాయామాలతో , గర్భం దాల్చడానికి ముందు ఉన్న శరీరం ను తిరిగి పొంద వచ్చు అని వివిధ పరిశీలనల తరువాత, స్త్రీలకు రికమెండు చేస్తుంది. అందువల్ల నిరుత్సాహ పడనవసరం లేదు. 
 
ప్రశ్న: మొదటి మాసాలలో గర్భవతులు చేయించు కోవలసిన పరీక్షలు ఏమిటి ?: 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం.