Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

ఎట్లా నవ్వాలి ?.7. నవ్వడం ముఖ్యం !

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 13, 2012 at 7:21 సా.

ఎట్లా నవ్వాలి ?.7. నవ్వడం ముఖ్యం ! 

క్రితం టపాలో మనము ఎట్లా నవ్వాలో కొంత వరకు తెలుసుకున్నాము కదా!   మరి నవ్వడానికి విషయాలు ఏముంటాయి ? అని అనుకుంటే , మనకు ‘  మెదడుకు మేత ‘  లాగా, నవ్వుకు కూడా ‘ తినగలిగినంత ‘ అంటే నవ్వ గలిగినంత మేత  పుష్కలం గా లభిస్తుంది మనకు ! 
ఎందుకంటే , మనం ఆంద్ర దేశం లో పుట్టాము !  తెలుగు వారం మనమందరం !  ఎందరు నాయకులు మనలను  సమస్యల వలయాలలో ముంచే సినా  , మనం మాత్రం నవ్వుల  నావలలో తేలి పోగలము !  కష్టాల కడలిలో  నవ్వుతూ ఈదుకుంటూ , దరి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము నిరంతరం ! రాష్ట్రాన్ని , దేశాన్ని , చివరకు మనుషులను కూడా చీల్చే , మహా మోసగాళ్ళు వివిధ రూపాలలో మనలను ప్రలోభ పెడుతున్నా , వారు జోకర్లు అనుకుంటూ కూడా ,  నవ్వుతూ , వారి ప్రలోభాలకు పొంగి పోతూ ఉంటాము ! నవ్వుతూ ఓట్లు వేస్తాము ! ( ఈ మాట, వోట్లు వేసే వారికే వర్తిస్తుంది ! ) ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కట్టి , మనకు అంద  వలసిన నీరు అందక  పోయినా  మనకూ, ముఖ్యం గా మన ‘ నాయకులకూ ‘ ఏమాత్రం పట్టదు  !   అఖండ భారత దేశం లో అపారం గా ఉన్న ఖనిజ సంపదను  అప్పనం గా దోచుకుంటూ ఉన్న వారికి మనం నవ్వుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ,చట్ట సభలకు కూడా వారిని గెలిపిస్తాము,  నవ్వుతూ !  అడవుల ను నాశనం చేసి వాతావరణాన్ని చిన్నా భిన్నం చేసే పరిణామాలను కూడా మనం పట్టించుకోము ! ఎందుకంటే మనం, మన ఇంటి చుట్టూ గ్రీన్ బెల్టు లు పెంచమని మహా మేదావులైన మన నాయకులు ( జోకు )  సలహా ఇచ్చారు కదా అందువల్ల మనం విపరీతం గా ఆనంద పడి పోతాము, మన వంతు , వాతావరణం కోసం చేస్తున్నందుకు ! కుహానా నాయకులు, ఏనుగంత సమస్యలను చీమంత చేసీ , చీమంత సమస్యలను ఏనుగంత చేసి మాయ చేస్తున్నా , మనకు నవ్వు మాత్రమె వస్తుంది !  ఏ  రక్షణ ఏర్పాట్లూ లేని  అపార్ట్ మెంటు  లో మనకు ఒక ఫ్లాటు దొరికిందని సంతోష పడి , మన పాట్లు మనం పడే , అల్ప సంతోషు లం మనం !  ట్రాఫిక్ నిరంతరం  నత్త నడక లా సాగినా , నవ్వుతూ మన కార్య క్రమాలను చేసుకుంటూ ఉంటాము రోజూ !  మతం మానవులకు మత్తు మందు అని అన్నాడు మార్క్స్ . అదే విధం గా  సినిమా మనకు ఆనందాన్ని కలిగించే మత్తు మందు. ‘ ఆ మందు ‘ ను ‘ ఆస్వాదించు తూ , అన్ని బాధలనూ మరిచిపోయి , ‘ హాయి ‘ గా మనలను నవ్వించ  డానికీ , నవ్వుకొడానికీ , మనకు అనేక మంది హాస్య నటులు  ఉన్నారు.  ఇప్పుడు తెలిసింది కదా ! మనకు నవ్వుకోడానికి ఎంత ‘మేత ‘  లభిస్తుందో !  అందు వల్లనే మనం, కనీసం మనుగడ సాగించ గలుగుతున్నాము ! సుఖాల మాట దేవుడెరుగు ! ఎందుకంటే , ఆమాత్రం  ‘ హాస్య పోషణ ‘ మనలను  ‘ఆమాత్రం ‘ ఆరోగ్యం గా ఉంచుతుంది !  మిగతా వారెవరైనా , ఇప్పటికీ  నవ్వని వారు కనుక ఉంటే , ఇక ఆలస్యం చేయ నవసరం లేదు !  ‘ ఈ నవ్వుల బండి ని ఎక్కండి !  ‘ నవ్వుకుంటే ‘ బలుసాకు తినవచ్చు !  ‘ సుఖం గా ‘ ! అసలు సుఖాల మాట ఎట్లా ఉన్నా !  ఎవడు మనలను, ఎడా పెడా  దోచి పారేస్తున్నా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

మరి నవ్వడం ఎట్లా ? 6.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 12, 2012 at 8:03 సా.

మరి నవ్వడం ఎట్లా ? 6.

3.  హా హా హా అనండి,  బూ హూ హో అని కాదు : 
మనం నవ్వే సమయం లో సాధారణం గా హా హా హా అని నవ్వుతాము. కొందరు ‘ నవ్వు సాంగులు ‘ ఉంటారు . వారు వెకిలి నవ్వులు నవ్వుతారు. ఉదా:  హా హా హా కు బదులు బో హూ హో అనో లేదా  సివంగి అరిచి నట్టో,  పిల్లి  క్రోధం తో వికృతం గా అరిచినట్టో  నవ్వుతారు. ఇంకొందరు నవ్వితే ఏవో వింత వింత ధ్వనులు – మనం అంతకు క్రితం ఎప్పుడూ వినని ధ్వనులు విన్పిస్తూ ఉంటాయి. మరి కొందరు నవ్వుతూ ఉంటే,  వారు నవ్వుతున్నారో , ఏడుస్తున్నారో తెలియదు. మనసులో ఏడుస్తున్నా కనీసం పైకి నవ్వే సమయం లో కూడా వారి ఏడుపు నవ్వు కనిపిస్తుంది , వినిపిస్తుంది కూడా ! అందువల్లనే మనం నవ్వుతూ ఉన్నప్పుడు సహజం గా హ్హ హ్హ ,హ్హ  అని  నవ్వుకుంటే నిజం గా సహజమైన నవ్వు లా ఉంటుంది ,  ఇంకో విధం గా నవ్వే నవ్వు , అసహజం గానూ , ఏవగింపు కలిగించేది గానూ ఉంటుంది. 
4. మీ పొట్టలో నవ్వును ఫీల్ అవ్వండి : అంటే మీరు నవ్వే నవ్వు , మీ పొట్టలో నుంచి పుట్టాలి ! మీరు  మీ పొట్ట లోనుంచి కాక పై పైకి హ హ హ అన్నారనుకోండి. అది నవ్వులా లేకుండా , పేలవం గా జీవం లేకుండా ఉంటుంది. అది నవ్వు అని పించుకోదు కూడా ! మనస్పూర్తి గా నవ్వే నవ్వు ,మీ ఉదర కండరాలను కూడా బాగా సంకోచింప చేస్తుంది. అంటే మీ అబ్డామినల్ మసుల్స్ ను సంకోచ వ్యాకోచ పరుస్తుంది. అది మీ ఆరోగ్యానికి ఎంతో  ఉపయోగ కరం కూడానూ !  అందుకే మనం అంటూ ఉంటాము, సామాన్యం గా బాగా నవ్వితే ‘ పొట్ట చెక్కలయ్యే లాగా నవ్వాము  ‘ అని.ఇట్లా నవ్వుకునే నవ్వు కొన్ని తరంగాల లాగా వస్తుంది కూడా ! 
5. మీ నవ్వును కుదించండి : అంటే మనం నవ్వే నవ్వు సహజం గా మొదట ఎక్కువ శబ్దం చేస్తూ  కొంత సమయం కాగానే ఆ శబ్దం తగ్గి మనం నవ్వడం క్రమం గా ఆపేస్తాము.  కానీ కొందరు నవ్వు మొదలెట్టారంటే ఆపకుండా , విపరీతమైన శబ్దం చేస్తూ  చుట్టూ ఉన్న వారు నివ్వెర పోయేట్టు చేస్తారు. ఇంకొందరు తడిసి పోయిన  దీపావళి చిచ్చు బుడ్లలా  ‘ పుసుక్కు ‘ మని నవ్వుతూ ఉంటారు. మరి కొందరు పెద్దగా నవ్వడం మొదలు పెట్టి , సడన్  గా ఆపేస్తారు. ఇట్లా ఆకస్మికం గా నవ్వు ఆపే వారినీ , లేదా  ఒక మాదిరి శబ్దం చేస్తూ మొదలు పెట్టిన నవ్వును  క్రమేణా ఎక్కువ చేస్తూ నవ్వే వారిని అనుమానించ వలసినదే !  ప్రతి వ్యక్తికీ  ఒక ప్రత్యెక మైన నవ్వు ఉంటుంది.  నవ్వడం సహజమైన ఆనంద మైన భావన ను సంతోషం గా వ్యక్తం చేయడం. మీరు నవ్వుతూ ఉన్నారంటే , మీరు మీ చుట్టూ ఉన్న వారికే మీరు ఆనందం గా ఉన్నారని కూడా తెలియ చేస్తూ ఉన్నారన్న మాటే కదా ! అందు వల్ల  మీరు ఈ మాత్రం బిడి య  పడకుండా , సందేహించ కుండా సహజం గా నవ్వండి  ఆనందం తో , ఆ నవ్వు మీ ఆరోగ్యాన్ని కూడా ఆనంద పరుస్తుంది ! 
మీకు తెలిసిన వారు నవ్విన నవ్వు మీకు బాగా నవ్వు తెప్పిస్తే , తెలియ చేయండి , నవ్వుతూ ! 
వచ్చే టపాలో ఇంకొన్నినవ్వు  సంగతులు తెలుసుకుందాం ! 

నవ్వు నాలుగు విధాల గ్రేటు . 5. మరి నవ్వడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 11, 2012 at 9:31 సా.

నవ్వు  నాలుగు విధాల గ్రేటు . 5. మరి నవ్వడం ఎట్లా ? 

 
ప్రశ్న: నవ్వు మనకు ఎంత లాభమో తెలుసుకున్నాము కదా మరి  నవ్వడం ఎట్లా ?
జవాబు: ఇది ఒక తిక్క ప్రశ్న గా అనిపించ వచ్చు చాలా మంది కి. కానీ చాలా మందికి జీవితం లో,  లేదా నిత్య జీవితం లో మనసారా నవ్వడం ఎట్లాగో తెలియదు. మనం ఇప్పుడు కారణాలు వెదక కుండా అసలు నవ్వడం ఎట్లాగో నేర్చుకుందాం.
1.  ఫన్నీ  సంగతి ఏదైనా  మననం చేసుకోండి ! : నవ్వు మొదలు పెట్టడానికి  ఒక అతి సులువైన మార్గం , మీ జీవితాలలో మీకు ఎదురైన ఏ  హాస్య సంఘటన అయినా మననం చేసుకోండి.  అది మీకు ఎదురైన మనుషులు తెప్పించిన నవ్వే కావచ్చు,లేదా వారు ప్రవర్తించిన తీరే కావచ్చు, లేదా వారు మాట్లాడిన మాటలే కావచ్చు.  ఉదా:  భాషలో యాస:  మన తెలుగు భాష లో వివిధ ప్రాంతాలలో ఉండే ప్రజలకు  ఒక్కో ప్రత్యేకమైన యాస లేదా యాక్సెంట్  ఉంటుంది.  ఆ యాస మిగతా ప్రాంతం లో ఉండే ప్రజలకు చాలా వింతగా నవ్వు పుట్టించే ట ట్టు ఉంటుంది.  దీనిని మనం ఆ ప్రాంత ప్రజలను హేళన చేస్తున్నట్టు అనుకోకూడదు.  ప్రపంచం లోని ప్రతి భాషా కాలాన్ని బట్టి  పరిణామం చెందుతూ ఉంటుంది.  అంటే ఒక ఆదర్శ మైన  భాష అంటూ ఉండదు. కానీ మనం  ఆ యాసలను  సరదా గా నవ్వు పుట్టించే ట ట్టు  ఊహించు కోవచ్చు. ఇక్కడ గమనించ వలసినది మనం భాష  తీరు తెన్నులు తెలుసుకోవడానికి కాదు, కేవలం నవ్వుకో డానికే !  ఇక  మీ ఇష్టమైన సినిమాలో మీ అభిమాన హాస్య నటులు  మిమ్మల్ని బాగా  నవ్వించిన సంఘటన లు గుర్తు చేసుకొండి !  ఇది కూడా అతి తేలిక అయిన  పధ్ధతి మనసారా నవ్వుకోడానికి !  నలుగురి తో నవ్వడం కూడా ఒక సులభమైన మార్గం ! 
2. ఒక చిరునవ్వు  ఒలికించండి  !:    మీ అమూల్యమైన ఒక చిరు నవ్వు ను ఒలికించండి.  మీ చిరునవ్వు మిమ్మల్ని ఎంతో  అందం గా మారుస్తుంది. అంతే  కాక మీకు ఉల్లాసాన్ని కలగ చేస్తుంది.  ఇంకా మీలో మీరు బాగా ఫీల్ అవుతున్న భావనను కలిగిస్తుంది మీ చిరునవ్వు.  చిరు నవ్వులు తరువాత పెద్ద నవ్వు లకు  దారి తీస్తాయి. అంటే  మీరు మీ చిరునవ్వు తో మీ అసలు నవ్వును ఆహ్వానిస్తూ ఉన్నారన్న మాట !  ”  ఒక సారి ఆనందం గా మనసారా నవ్విన నవ్వు మీ ముఖం లోని పదిహేను  కండరాలను  సంకోచింప చేస్తుంది  ” అని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు  . అంటే   మీ ముఖ కండరాలలో రక్త ప్రసరణ ఎంతో  బాగా జరుగుతుంది మీరు నవ్వుతున్న సమయం లో !  అంతే  కాక , మీరు మీ చిరునవ్వు తో ఎన్ని ముఖం లోని కండరాలను సంకోచింప చేస్తారో అన్ని కండరాలూ మీరు విపరీతం గా నవ్వు తూ ఉన్నప్పుడు కూడా అదే విధం గా సంకోచ వ్యాకోచాలు చెందుతాయి.  ఇక్కడ  మనం గమనించ వలసినది ఏమిటంటే  మన చిరునవ్వులు, మన నవ్వులు , మనలను ఆనందింప చేయడమే కాకుండా , మన రక్త ప్రసరణను కూడా అధికం చేస్తాయి.  మునుపటి టపాలలో తెలుసుకున్నాము కదా , రక్త ప్రసరణ అధికం చేయడం అంటే , మన శరీరం లో ఉన్న వివిధ కణాలకు ప్రాణ వాయువు అధికం గా అందచేయడమే !  
తెలుసుకున్నాము కదా ఇప్పుడు మన చిరునవ్వులు , నవ్వులూ , మన శరీరానికి ప్రాణ వాయువును అధికం చేయడమే కాకుండా , మన జీవితాలకు ‘ ప్రాణం పోస్తాయి కూడా ! నవ్వు లేని , నవ్వ లేని మన జీవితాలను ఊహించుకో గలమా ??? !!!
అందుకే అన్నాడు ఒక కవి ” నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ , నవ్వుతూ చావాలి రా , చచ్చినాక నవ్వలేవు రా , ఎందరేడ్చినా తిరిగి రావు రా ” అని ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు  నవ్వు తూ తెలుసుకుందాము ! 

నవ్వితే లాభాలు.2.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 5, 2012 at 6:54 సా.

నవ్వితే లాభాలు.2.

ప్రశ్న : ప్రాణ వాయువు అంటే ఆక్సిజెన్ కూ , ఆరోగ్యానికీ , నవ్వుకూ ఉన్న సంబంధం ఏమిటి ?
జవాబు: ఇది చాలా మంచి ప్రశ్న.  మన దేహం లో ప్రతి కణానికీ , నిత్యం మన రక్తం లోని ఎర్ర రక్త కణాల ద్వారా ఆక్సిజెన్ అందుతూ ఉంటుంది నిరంతరం. ఇందులో ప్రత్యేకం గా చెప్పుకోవలసినది ఏమీ లేదు కదా ! కానీ మన దేహం లో ఉన్న జీవ కణాలన్నీ , సంపూర్ణమైన ఆరోగ్యం తో ఉండాలంటే , ప్రతి కణానికీ , ఆక్సిజెన్  గరిష్టం గా అంటే మాగ్జిమం ఎంత అంద గలదో అంతా మనం అందించ గలగాలి అంటే అంద చేయాలి.  అట్లా అంద చేయడానికి మనం చేయవలసిన ముఖ్యమైన కార్య క్రమాలలో వ్యాయామం తో పాటుగా మనం హృదయ పూర్వకం గా నవ్వుకోవడం. మనం రోజూ హాయి గా నవ్వు కుంటూ ఉంటే, మన దేహం లో ఆక్సిజెన్ ఎక్కువ గా మన జీవ కణాలను చేరుకో గలదు. 
మానవ ఆరోగ్యానికి మనం పీల్చుకునే ఆక్సిజెన్ ప్రాముఖ్యత గురించి  ప్రఖ్యాత శరీర నిర్మాణ శాస్త్రవేత్త ( cell physiologist ), ఇంకా  రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక శాస్త్రవేత్త  అటో వార్బర్గ్ (Dr. Otto Warburg )  ఏమన్నాడో గమనించండి 
” మన ఆరోగ్యం,  ముఖ్యం గా , మనం మన శరీరం లో ఉన్న ప్రతి కణానికీ మనం ఆక్సిజెన్ ను నిత్యం ఎంత అంద చేస్తామనే విషయం మీదనే ఆధార పడి ఉంటుంది. గుర్తుంచుకోండి , మన శరీరం లో ప్రతి కణానికీ  సరిగా ఆక్సిజెన్ అందుతున్నప్పుడు , క్యాన్సర్ కూడా మనకు దూరం గా ఉంటుంది. మనకు క్యాన్సర్ రాలేదు , రాదు కూడా ! ”.
 
ఆక్సిజెన్ మన దేహానికి చేసే లాభాలు ఈ క్రింద ఉన్న చిత్రం లో వివరించ బడ్డాయి గమనించండి.
మనం మన శరీరం లో వివిధ కణాలకు ఎక్కువ ఆక్సిజెన్ చేరుకునే పనులు ఏవి చేసినా ( ఉదా: వ్యాయామం , బ్రీతింగ్ ఎక్సర్సైజులు , ఇంకా హాయి గా నవ్వు కోవడం ) మన మెదడులో ఉన్న హైపో తలామాస్ అనే భాగం నుంచి బీటా ఎండార్ఫిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ రసాయనం , రక్తం ద్వారా మన శరీరం లో ఉన్న ప్రతి రక్త నాళాన్నీ ప్రభావితం చేస్తుంది. అంటే రక్తనాళం గోడలలో ఉన్న కణాలలో నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనం విడుదల చేస్తుంది. అప్పుడు ఆ రసాయనం ఆ రక్త నాళాన్ని డైలేట్ అంటే వ్యాకోచింప చేస్తుంది. (రక్తనాళాలు, సంకోచ స్థితి లో ఉండక , వ్యాకోచించి  ఎక్కువ సమయం ఉంటే , అప్పుడు రక్త పీడనం కూడా తక్కువ గా ఉంటుంది. అట్లా కాక  రక్త నాళాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలో ఉంటే , ఆ పరిణామం అధిక రక్త పీడనానికి దారి తీస్తుంది ). అంతే కాక , మన రక్తం లో ఉండే ప్లేట్ లేట్ అనే కణాలను ఒకదానికి ఒకటి తేలిక గా అతుక్కోకుండా చేస్తుంది. దీనివల్ల  మనకు పక్ష వాతం కానీ , గుండె పోటు కానీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎప్పుడూ , నవ్వుతే ముత్యాలు రాలుతాయేమో అనుకుంటూ , నవ్వులన్నీ బ్యాంకు లో వేసుకున్నట్టు తమ లోనే దాచుకునే వారికి వడ్డీ   అనారోగ్యం రూపం లో అందుతూ ఉంటుంది ! 

మరి ఆలస్యం దేనికి హాయి గా నవ్వుకోండి , నవ్వించండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని ఆనంద మయ సంగతులు ! 

నవ్వితే లాభాలు.1.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 4, 2012 at 7:10 సా.

నవ్వితే లాభాలు.1.

ప్రశ్న : మరి రోజూ నవ్వుతూ ఉంటే లాభాలు ఏమిటి?:
జవాబు: మనం రోజూ కొంత సమయం మనస్పూర్తి గా నవ్వుకుంటూ ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. ఈ లాభాలను మనం ముఖ్యం గా మూడు రకాలు గా చెప్పుకోవచ్చు.
1. ఫిజికల్ గా లాభాలు అంటే మన శరీరానికి జరిగే లాభాలు :
a. మన నవ్వు మన రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది.
b. మనకు వత్తిడి అంటే స్ట్రెస్ ( stress ) కలిగించే హార్మోనులను తగ్గిస్తుంది నవ్వు.
c.మనకు  నొప్పి తీవ్రతను కూడా తగ్గిస్తుంది మన నవ్వు.
d.మన శరీరం లో ఉన్న వివిధ కండరాలను వ్యాకోచ పరుస్తుంది నవ్వు.
e. గుండె జబ్బు లను కూడా తగ్గిస్తుంది నవ్వు. 
2. నవ్వుతో మానసికం గా లాభాలు : 
a. జీవితాన్ని అర్ధ వంతం చేయడమే కాకుండా ,  మన జీవితాలకు   ఒక అమూల్యమైన రుచిని ఇస్తుంది  మన నవ్వు.
b.మన లో ఉన్న భయాందోళనలు  తగ్గిస్తుంది మన నవ్వు.
c. మన మానసిక వత్తిడిని కూడా తగ్గిస్తుంది నవ్వు.
d.మన మూడ్స్ ను లిఫ్ట్ చేస్తుంది  మన నవ్వు.
e.మనలో ఆశావాద మనస్తత్వాన్ని వృద్ధి చేయడమే కాకుండా , మనలను ఎక్కువ గా  రిసిలిఎంట్ గా చేస్తుంది.
3. మన నవ్వుతో మనకు సామాజికం గా లేదా సాంఘికం గా కూడా చాలా లాభాలు ఉన్నాయి.
a.మనకు ఇతర మానవులతో ఉండే సంబంధాలను బలిష్టం చేస్తుంది మన నవ్వు.
b.మనలను ఇతరుల చేత ఆకర్షింప బడేటట్టు కూడా చేసేది మన నవ్వే ! 
c.మనకు ఇతర మానవులతో ఉన్న  ఘర్షణలను కూడా  మాయం చేయడమో లేదా తగ్గించడమో చేయగల శక్తి నవ్వుకు ఉంది.
d.మనం ఇతర మానవులతో కలిసి కట్టుగా ఎక్కువ ప్రభావ శీలం గా పని చేయగలిగేట్టు కూడా చేయగలదు మన నవ్వు.
e.ఆ విధం గా మనకు ఇతరులతో ఉన్న సంబంధాలను కూడా దృ ఢ పరుస్తుంది మన నవ్వు. 
వివరాలు వచ్చే టపాలో నవ్వుతూ తెలుసుకుందాం ! 

నవ్వితే లాభాలు !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on అక్టోబర్ 3, 2012 at 9:10 సా.

నవ్వితే లాభాలు.

ప్రశ్న:  నవ్వు తో లాభాలు ఏమైనా ఉంటాయా ? కేవలం నవ్వు కోవడం తప్ప ? 
జవాబు:  జీవ పరిణామ రీత్యా మానవులకు  సంక్రమించిన ఒక అమూల్యమైన  వరం నవ్వు.
నవ్వు మానవుల అతి ముఖ్య మైన ఎమోషన్స్ లో ఒకటి.  మనం ఆనందం చెందడానికి , సంతోష కరం గా జీవితం గడపడానికీ కూడా నవ్వు ఎంతో ఉపయోగ పడుతుంది.  మన రోజు వారీ కార్యక్రమాలలో నవ్వు ను కూడా సమ పాళ్ళలో ఉండేట్టు చూసుకుంటే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. 
జీవితం గడపడం కష్టమైనప్పుడు , ‘ బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ , ఆ ఎరుకే నిశ్చలా నందమోయ్ , బ్రమ్హానందమోయ్ అనుకుంటూ , బాటిల్ ను మాత్రం పట్టుకోకుండా , జీవితాలను గడిపి ,అనేక  లక్షల మందిని  సౌఖ్య సోపానాల వైపు మళ్ళించడానికి నవ్వు ఒక అత్యుత్తమ యాంటీ డిప్రె సెంట్ లాగా పని చేస్తుంది.
అదేంటో చిత్రం , కొందరు  ఇతరులు నవ్వుతుంటే , వెంటనే ఎవరో వారికి చెప్పినట్టుగా సరిగ్గా ఆ ఎమోషన్ కు వ్యతిరేకం గా ఏడవడం మొదలెడతారు. అట్లాగే,  ఇతరులు బాధలతో ఏడుస్తూ ఉంటే ,  వారు నవ్వుకోవడం మొదలు ! 
 
మరి ఇంతటి అమూల్యమైన, మానవులలో దాగి  ఉన్న   నవ్వు అనే వజ్రాన్ని బయటకు తీసి , పదును పెట్టి , నిక్కమైన జాతి వజ్రం గా మలచుకొని , సంపన్నులమవడం ఎట్లాగో వచ్చే టపా నుంచి తెలుసుకుందాం ! 

(తాత్కాలిక ) పక్ష వాతం. 9. మరి నివారణ ఎట్లా ?

In ప్ర.జ.లు., Our Health, Our minds on అక్టోబర్ 1, 2012 at 5:28 సా.

(తాత్కాలిక ) పక్ష వాతం. 9. మరి నివారణ ఎట్లా  ?

ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం గురించి చాలా విషయాలు తెలిశాయి. మరి ఈ తాత్కాలిక పక్ష వాతాన్ని నివారించడానికి చేయ వలసినది ఏమైనా ఉందా ? 
జవాబు: మినీ స్ట్రోక్ లేదా తాత్కాలిక పక్ష వాతం చాలా ఆకస్మికం గా వస్తుంది. చాలా తక్కువ సమయమే ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చినప్పుడు తీవ్రం గా రావచ్చు. అంటే అప్పుడు వచ్చే పక్ష వాతం తాత్కాలికం కాక ,  శాశ్వతం గా అంగ వైకల్యం కానీ మాట పోవడం కానీ కలిగించ వచ్చు. అందు వలన ఒక సారి మినీ స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే , లేదా ఆ లక్షణాలు అసలు కనిపించక ముందే , మనం  ఆరోగ్య ప్రధాన చర్యలు చేపట్టి, వాటిని తు.చ. తప్పకుండా నిత్యమూ ఆచరిస్తే , అవి తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చి మనలను  ఆరోగ్య వంతులు గా ఉంచుతాయి, చాలా కాలం పాటు. మరి ఆ నివారణ చర్యల వివరాలు చూద్దాము. 
1. అతి బరువు , ఊబ కాయం లేదా ఒబీ సిటీ తగ్గించు కోవడం  :  అతి గా బరువు గా ఉంటే , ఆ పరిస్థితి తప్పకుండా , అధిక రక్త పీడనానికీ , మధుమేహానికీ , గుండె జబ్బు కూ దారి తీయడం అనివార్యం. అతి బరువు తగ్గడానికి తీసుకోవలసిన చర్యల గురించి ముందు ముందు తెలుసుకుందాం.
2.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.: దీని వల్ల రక్త పీడనం తగ్గడమే కాకుండా , పక్ష వాతం, గుండె జబ్బులూ, క్యాన్సర్ లూ  వచ్చే అవకాశాలు తగ్గి పోతాయి.
3.ఆరోగ్య ఆహారపు అలవాట్లు : 
a.యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ గా ఉన్న ఆహారం తినడం.
b.ఉప్పు రోజూ  ఆరు గ్రాములకన్నా మించ కుండా  ఉన్న ఆహారం తినడం.
c.వీలైనన్ని కాయ గూరలు రోజూ తినడం.
d.నూనె పదార్ధాలు ముఖ్యం గా  సాచురే టెడ్  ఫ్యాట్స్  తక్కువగా తినడం.
e.స్మోకింగ్ చేయక పోవడం, చేస్తుంటే  వెంటనే మానడం.
f.మద్య పానం చేయక పోవడం, ఒక వేళ చేస్తుంటే మితం గా  తాగడం. 
పైన వివరించిన ఈ చర్యలు అన్నింటి లోనూ ఏ ఒక్కటి అశ్రద్ధ చేసినా , మనం  రిస్కు ను ఎక్కువ చేసుకుంటున్నట్టే ! 
ఆసక్తి ఉన్న వారు , ఈ క్రింది వీడియో తప్పకుండా  చూడండి, చాలా వివరం గా ఉన్నాయి పక్ష వాతానికి నివారణ చర్యలు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తాత్కాలిక పక్ష వాతం.8. మరి చికిత్స ఏమిటి ? :

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 30, 2012 at 10:13 ఉద.

తాత్కాలిక పక్ష వాతం.8. మరి చికిత్స ఏమిటి ? : 

ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోక్ ఒక సారి వస్తే , చికిత్స ఏమిటి?:
జవాబు:  తాత్కాలిక పక్ష వాతం లక్షణాలు ఒక సారి కనిపించ గానే, ముందుగా చేయవలసినది స్పెషలిస్టు డాక్టర్ ద్వారా అవసరమైన పరీక్షలు అన్నీ , అశ్రద్ధ చేయకుండా చేయించు కోవాలి. ఎందుకంటే , నివారణ చర్యలు తీసుకోక పొతే , మళ్ళీ మినీ స్ట్రోకు రావడానికీ , లేదా శాశ్వత పక్ష వాతం రావడానికి కూడా అవకాశాలు హెచ్చు.  మరి  చికిత్సా పద్ధతులు ఏమిటో చూద్దాము. ఇక్కడ మనం తెలుసుకోవలసినది మందుల ద్వారా చికిత్స ఏమిటో అంటే టాబ్లెట్స్  ఏ విధం గా పక్ష వాత నివారణకు ఉపయోగ పడతాయో  తెలుసు కుంటే  క్రమం తప్పకుండా , రోజూ ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాలో అవగాహన అవుతుంది.
యాంటీ ప్లేట్లెట్స్ మందులు : మన రక్తం లో ఉండే అనేక కణాలు వివిధ పనులు చేస్తూ ఉంటాయి ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు మనం పీల్చే గాలిలో ఉన్న ప్రాణ వాయువు ను అంటే ఆక్సిజెన్ ను మోసుకుపోయి మన శరీరం లో ప్రతి భాగానికీ చేరవేస్తాయి.అట్లాగే రక్తం గడ్డ కట్టడానికి ప్లేట్ లెట్స్ అనే కణాలు  ఉన్నాయి రక్తం లో. వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే , ఆ కణాలు చిన్న చిన్న ప్లేట్ ల లాగా ఉంటాయి కనుక.  సరే  ఇప్పుడు ఆ కణాల సంగతి ఇప్పుడు ఎందుకంటే ,  తాత్కాలిక పక్ష వాతం వచ్చినపుడు కానీ , శాశ్వత పక్ష వాతం వచ్చినప్పుడు కానీ , మెదడు లో రక్త నాళాల లో  రక్తం గడ్డ కడుతుంది.  మనకు తెలుసుకదా  రక్తం గడ్డ కడితే , ఆ ప్రాంతం అంతా పని చేయ కుండా పోతుంది అని. దానికి నివారణ రక్తం గడ్డ కట్టకుండా చూడడమే !  ప్లేట్ లేట్ లను కనుక రక్తం గడ్డ కట్టించే పనిని చేయకుండా నివారించడానికే మనం మందులు తీసుకోవాలి. ఆ మందులే యాస్పిరిన్ ( aspirin )  ఇంకా డై పిరడమాల్ ( dipyridamol ). ఈ రెండూ (  సామాన్యం గా ఏదో ఒకటి వేసుకోవాలి ) చాలా ముఖ్యమైన టాబ్లెట్స్.
( పైన ఉన్న చిత్రం చూడండి ) వీటిని క్రమం తప్పకుండా వేసుకుంటే , తాత్కాలిక పక్ష వాతమే కాకుండా , శాశ్వత పక్ష వాతాన్ని కూడా నివారించు కోవచ్చు.అనేక పరిశోధనల వల్ల ఇరవై అయిదు శాతం వీటిని తగ్గించుకోవచ్చు అని తెలిసింది. అంతే కాక ఈ టాబ్లెట్స్ గుండె పోటును అంటే హార్ట్ ఎటాక్ ను కూడా తగ్గిస్తాయని తెలిసింది. క్లోపి డోగ్రెల్  
( clopidogrel  )ఇంకా వార్ఫారిన్ ( warfarin )   అనే మందులు కూడా ఇంచు మించు ఇట్లాగే పని చేసి  పక్ష వాతాన్ని నివారిస్తాయి. కొన్ని పరిస్థితులలో, మెదడుకు సరఫరా చేసే రక్త ధమనులు రెండు మెడలో ఉంటాయి. వీటిని  కేరాటిడ్ ధమనులు అంటారు, వీటిలో పేరుకున్న కొవ్వు ను కూడా ఆపరేషన్ ద్వారా తీసి వేసి పక్ష వాతాన్ని నివారించ వచ్చు. 
ఇప్పుడు మనకందరికీ స్పష్టం గా అవగాహన అయింది కదా , పక్ష వాత నివారణకు మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే ఎంత గా ఉపయోగ పడతాయో ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తాత్కాలిక పక్ష వాతం. 7. ఏ ఏ పరీక్షలు ఎందుకోసం ?:

In ప్ర.జ.లు., Our Health, Our minds on సెప్టెంబర్ 29, 2012 at 5:47 సా.

తాత్కాలిక పక్ష వాతం. 7. ఏ ఏ పరీక్షలు ఎందుకోసం ?: 

ప్రశ్న: మినీ స్ట్రోకు లేదా తాత్కాలిక పక్ష వాతం వస్తే , మళ్ళీ త్వరగానే పోతుంది కదా, అంటే ఇరవై నాలుగు గంటలలోపే , ఆ లక్షణాలు మాయ మవుతాయి కదా , మరి  పరిక్షలు ఎందుకు చేయించుకోవాలి ? 
జవాబు:  మంచి ప్రశ్న. చాలా వరకు ఈ మినీ స్ట్రోకు లు  చాలా తక్కువ సమయం వాటి లక్షణాలను చూపిస్తాయి. అతి జాగ్రత్తగా అప్రమత్తత  తో ఉంటే తప్పితే ,ఈ లక్షణాలను గమనించడం కష్టం. మనం క్రితం టపాలో తెలుసు కున్నట్టు ,  ‘ ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది ‘ అని ముందు ముందు రాబోయే జడి వానకు కానీ , తుఫాను కు కానీ హెచ్చరిక ఎట్లా చేస్తారో ఆ విధం గానే , మన జీవితాలలో ఈ మినీ స్ట్రోకు లు ముందు ముందు రాబోయే పక్ష వాతానికి  సూచనలు. మరి మనం ఈ సూచనలను అశ్రద్ధ చేయగలమా ?! 
మరి ఏ పరీక్షలు ఎందుకోసమో తెలుసుకుందాం ఇప్పుడు.
1. రక్త పరీక్షలు : 
రక్త పరీక్షలలో ముఖ్య మైనవి, 
a. రక్త పీడనం లేదా బీపీ  కనుక్కోవడం : ఇది తెలుసుకోవడం ఎందుకంటే, అధిక రక్త పీడనం ఉండి, దానిని నియంత్రణ లో ఉంచుకోక పొతే , వారికి మినీ స్ట్రోకు లూ , లేదా పక్ష వాతాలూ వచ్చే అవకాశం హెచ్చు.
b. రక్తం లో కొలెస్ట రాలు ఎంత ఉందొ కనుక్కోవడం: ఎందుకంటే  రక్తం లో కొలెస్ట రాల్ అధికం గా ఉన్న వారికి పక్ష వాతం వచ్చే అవకాశం హెచ్చు. 
c. రక్తం గడ్డ కట్టడం సరిగా ఉందొ లేదో కనుక్కోవడం : ఎందుకంటే  మన శరీరం లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువ గా ఉన్నప్పుడు కూడా  పక్ష వాతమూ , లేదా తాత్కాలిక పక్ష వాతమూ రావడానికి అవకాశాలు ఎక్కువ.
d.రక్తం లో షుగర్ ఎక్కువ గా ఉందా లేదా అని కనుక్కోవడం:  ఎందుకంటే  మధుమేహం ఉండి , అది నియంత్రణ అంటే కంట్రోలు లో లేనప్పుడు కూడా  ఆ పరిణామాలు పక్ష వాతానికి దారి తీయ వచ్చు. 
2. ఈ సి జీ : అంటే ఎలెక్ట్రో  కార్డియో గ్రామ్ : ఎందు కంటే , మన హృదయం లేదా గుండె లయ బద్ధం గా కొట్టుకుంటూ ఉంటే  రక్తం కూడా సవ్యం గా ప్రవహిస్తూ ఉంటుంది. అట్లా కాక, లయ తప్పితే , లేదా అప సవ్యం గా కొట్టుకుంటూ ఉంటే , చిన్న చిన్న రక్తపు గడ్డలు గుండె లో ఏర్పడి అవి రక్త నాళాల ద్వారా  మెదడు లోకి ప్రవహించి ( అంటే రక్తం తో పాటుగా ) అక్కడ ఉన్న చిన్న చిన్న రక్త నాళాల లో ఇరుక్కు పోయి , పక్ష వాతానికి , లేదా తాత్కాలిక పక్ష వాతానికీ కారణ మవుతాయి. 
3. స్కానింగ్ :  a, b  స్కాన్ లు ఎందుకంటే, అవి మెదడు లో పక్షవాతం వల్ల వచ్చే మార్పులను తెలియ చేస్తాయి. అల్ట్రా సౌండ్ స్కాన్ గురించి మనం క్రితం టపాలో పటం సహాయం తో కూడా తెలుసుకున్నాం కదా. అట్లాగే ఎకో కార్డియో గ్రామ్ గుండె కండరాలనూ , కవాటాలనూ పరీక్ష చేసి , అవి సరిగా ఉన్నాయో లేదో , వాటిలో రక్త ప్రవాహం సరిగా ఉందొ లేదో కూడా తెలియ చేస్తుంది. 
a. సీ టీ స్కాన్ 
b. ఎం ఆర్ ఐ స్కాన్ 
c. అల్ట్రా సౌండ్ స్కాన్ 
4.ఎకో కార్డియో గ్రామ్. 
5. ఎక్స్ రే : ఎందుకంటే మన శరీరం లో మిగతా సమస్యలు ఏవైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. 
ఇప్పుడు మనం ఏ పరీక్షను  కాదనగలం మన ఆరోగ్యం కోసం ?
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పక్ష వాతం. 6.( T.I.A. ). తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ?:

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on సెప్టెంబర్ 27, 2012 at 7:52 సా.

పక్ష వాతం. 6.( T.I.A. ). తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ?: 

 
ప్రశ్న: తాత్కాలిక పక్ష వాతం అంటే ఏమిటి ? దానిని  పట్టించుకోక పొతే పరవాలేదా? 
జవాబు: తాత్కాలిక పక్ష వాతం అంటే  పక్ష వాత లక్షణాలు కొన్ని మాత్రమే వచ్చి , మళ్ళీ రమారమి ఇరవై నాలుగు గంటలలో , ఆ లక్షణాలు అన్నీ పూర్తిగా మటుమాయం అవుతాయి. ఇది వినటానికి విడ్డూరం గా ఉంది కానీ యదార్ధం. దీనిని ఇంగ్లీషు లో ట్రాన్సి ఎంట్ ఇస్కీమిక్ ఎటాక్ అనీ , లేదా క్లుప్తం గా టీ ఐ ఏ అనీ అంటారు.  దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఇంగ్లీషులో. టీ ఐ ఏ ను మినీ స్ట్రోక్  ( mini stroke ) అని కూడా అంటారు.  ఈ తాత్కాలిక పక్ష వాతం , పెద్ద కధ లో పిట్ట కధ లాగా , పక్ష వాతం  కధలో ఒక ముఖ్యమైన  చిన్న కధ ఇది.  ఈ తాత్కాలిక పక్ష వాతం కధ ను మనం పూర్తిగా నూ శ్రద్ధ గానూ అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. 
ప్రశ్న: టీ ఐ ఏ , లేదా తాత్కాలిక పక్ష వాతాన్ని పట్టించుకోక పొతే ఏమవుతుంది?
జవాబు: ఈ తాత్కాలిక పక్ష వాతం వచ్చిన ప్రతి పది మంది లో ఒకరికి ,  నాలుగు వారాలలో గా మళ్ళీ వస్తుంది పక్ష వాతం. కానీ ఈ మళ్ళీ వచ్చే పక్ష వాతం , తాత్కాలికం కాదు. దాని తీవ్రత ఎక్కువ గా ఉండడం వల్ల ,  ఆ పక్ష వాతం లక్షణాలు మటు మాయం అవ్వవు కదా శాశ్వతం గా ఉంటాయి.  ఇంకో విధం గా చెప్పుకోవాలంటే , ఈ  తాత్కాలిక పక్ష వాతం కేవలం ముందు ముందు ( అంటే  నాలుగు వారాల లో గా ) ఉధృతం గా వచ్చే పక్ష వాతానికి సూచన !. దీని లక్షణాలు కనిపించిన వెంటనే స్పెషలిస్టు ను సంప్రదించి అవసరమైన  పరీక్షలూ , చికిత్సలూ చేయించు కోవాలి. సాధారణం గా అందరూ అనుకునేది ,  ఆ లక్షణాలు కొంత సమయమే ఉన్నాయి కదా , మళ్ళీ మనిషి మామూలు గా మాట్లాడ గలుగు తున్న్డాడు, చేయి, కాలు ఊప గలుగుతున్నాడు, అంతే కాక మామూలు గా నడుస్తునాడు కదా, ఎందుకొచ్చిన తిప్పలు , ఇంటికి తీసుకు వెళదాం , పరీక్షలకూ , హాస్పిటల్ కూ ఖర్చులు తడిసి మోపెడవుతాయి ‘ అనుకుంటూ  వాస్తవం గ్రహించక , ఇంటికి తీసుకు వెళ్లి అశ్రద్ధ చేస్తారు. అట్లా ఎంత మాత్రమూ చేయ కూడదు.  అట్లా చేస్తే వారికి  మళ్ళీ రావడానికి  పక్ష వాతం పొంచి ఉంటుందని  తెలుసుకోవాలి. 
ప్రశ్న:మరి ఈ తాత్కాలిక పక్ష వాతానికి సూచనలు ఏమిటి ?
జవాబు:  తాత్కాలిక పక్ష వాతం లేదా టీ ఐ ఏ  వస్తే , దాని లక్షణాలు కూడా పక్ష వాతం సూచనలలాగానే ఉంటాయి. అంటే  మనం క్రితం గుర్తు ఉంచుకునట్టు,  F.A.S.T. ( మునుపటి టపాల లో చూడండి దీని వివరాల కోసం ) కాక పొతే ఈ లక్షణాలు, లేదా సూచనలు, మనం ఇంతకు ముందు తెలుసుకున్నట్టు , ఇరవై నాలుగు గంటలలోగా మటు మాయ మవుతాయి. అంతే కాక ఈ ఇరవై నాలుగు గంటలలో  ఈ లక్షణాలు కూడా ఎక్కువ ఉధృతం గా ఉండవు. కానీ , ఒక చేయి ఆకస్మికం గా  తిమ్మిరి ఎక్కి నట్టు అనిపించ డమో , లేదా  మాట తడ బడటమో , నడుస్తున్నప్పుడు కాలు ఆకస్మికం గా బలహీనమయి నడవలేక పోవడమో, లేదా నుంచో వాలని ప్రయత్నిస్తే , బాలన్స్ తప్పి పోతూ ఉండడమో కూడా జరగ వచ్చు.  అకస్మాత్తు గా దృష్టి మందగించడం , లేదా , భోజనం చేస్తూ ఉన్నప్పుడు ,  మింగ లేక పోవడం ,  కళ్ళు తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు. 
ఉత్సాహం ఉన్న వారందరూ ఈ క్రింది  వీడియో కూడా చూడ వచ్చు. ( ఇంగ్లీషులో ఉంది కానీ సరళం గా నే ఉంది భాష  అర్ధ మయే లాగా ! ) 
 
ప్రశ్న: మరి ఈ తాత్కాలిక పక్ష వాతం లేదా మినీ స్ట్రోకు కు కారణాలు ఏమిటి ? 
జవాబు: వచ్చే టపాలో తెలుసుకుందాం !