Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

4. ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారిస్తుంది ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం. on ఏప్రిల్ 13, 2013 at 11:46 ఉద.

4. ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారిస్తుంది ?

డయాబెటిస్ నివారణలో మనం తినే ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి క్రితం టపాలలో తెలుసుకున్నాం కదా ! మరి వ్యాయామం లేదా ఎక్సర్సైజు డయాబెటిస్ ను ఎట్లా నివారించ గలదు ?: 
1. మనం రోజూ చేసే వ్యాయామం , మన రక్తం లో చెక్కెర శాతాన్నీ , చెడు కొవ్వు శాతాన్నీ , ఇంకా రక్త పీడనాన్నీ అంటే బీపీనీ తగ్గించడమే కాకుండా నియంత్రణ లో ఉంచుతుంది !
2. వ్యాయామం , మనకు  డయాబెటిస్ , పక్షవాతం , ఇంకా గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని , లేదా రిస్కును తగ్గిస్తుంది !
3. వ్యాయామం , మన గుండెనూ , ఎముకలనూ , ఇంకా మన శరీరం లో ఉన్న కండరాలనూ బలవర్ధకం చేస్తుంది !
4. మన శరీరం లో రక్త ప్రసరణ ను కూడా అభివృద్ధి చేస్తుంది !
5. మన శరీరం లోని అన్ని రకాల కీళ్ళనూ అంటే జాయింట్ లనూ బిగుతు గా కాక వ్యాకోచింప చేసి సులభం గా మనం ఏ నొప్పులూ లేకుండా మన కీళ్ళు కదిలించ గలిగేట్టు చేసుంది !
 
మరి దేనిని మనం వ్యాయామం అంటాము ?:
మన శరీరానికి సంపూర్ణ వ్యాయామం కావాలంటే మనం ఈ క్రింద పేర్కొన్న శరీర వ్యాయామం చేస్తూ ఉన్నామో లేదో  పరిశీలించుకోవాలి !
1. నడవడమూ , రోజూ మన పనులు చేసుకుంటున్నప్పుడు ఒకే చోట స్థిరం గా ఉండక అటూ ఇటూ తిరుగాడుతూ ( అంటే నిరంతరం కాదు, తరచుగా ! ) అవసరమైనప్పుడు మెట్లు ఎక్కుతూ , దిగుతూ ఉండడం ! 
2. వడి వడి గా నడవడమూ , అంటే బ్రిస్క్ వాకింగ్ చేయడమూ , ఈత కొట్టడమూ , లేదా డాన్సు చేయడమూ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు చేస్తూ ఉండడం ! సైకిల్ తొక్కడం కూడా ఈ రకమైన వ్యాయామం క్రింద చెప్పుకోవచ్చు !
3. స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు అంటే , తరచూ బరువులు ఎత్తుతూ ఉండడం లాంటి వ్యాయామాలు ( ఇక్కడ గమనించ వలసినది కేవలం డంబెల్స్ ఎత్తడమే వ్యాయామం కాదు, మనం రోజూ చేసే పనులలో అనేక సార్లు నీళ్ళ బకెట్ మోయడమో , లేదా కూరలు మోసుకు రావడమో , లేదా పసి పిల్లలను ఎత్తుకు తిప్పడమో 
లాంటి పనులు కూడా ఈ రకమైన వ్యాయామం కోవలోకి వస్తాయి ! ) 
4. స్ట్రెచ్ చేసే వ్యాయామాలు అంటే మన కండరాలను వ్యాకొచింప చేసి చేసే వ్యాయామాలు !
ఇవన్నీ కూడా మన వ్యాయామ కార్యక్రమం లో భాగం గా ఉండేట్టు మనం చూసుకోవాలి ! 
 
ఎంత సేపు చేయాలి ?
వ్యాయామం  కనీసం రోజూ అరగంట చేసినా ,  ఆ వ్యాయామం వల్ల అనేక లాభాలు ఉంటాయని , పరిశోధనల వల్ల స్పష్టమైంది !  ఊబకాయం అంటే ఒబీసిటీ ఉన్నవారు ,ఎక్కువ సమయం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి , ( వారి ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పుల తో పాటుగా ! ) 
 మధుమేహం ఉన్నవారు వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ క్రింది వీడియో చూడండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అంతర్జాలం లో మీ కుటుంబ ఆరోగ్య వివరాల పేటిక , మైక్రోసాఫ్ట్ ” హెల్త్ వాల్ట్ ” Health Vault ” !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 11, 2013 at 11:02 ఉద.

అంతర్జాలం లో మీ  కుటుంబ  ఆరోగ్య  వివరాల పేటిక  , మైక్రోసాఫ్ట్ ” హెల్త్ వాల్ట్ ” Health Vault ” !

 
మైక్రో సాఫ్ట్ వారు అంతర్జాల వాడక దారులందరికీ అందిస్తున్న  విలువైన కానుక హెల్త్ వాల్ట్  !
1. మీ ఆరోగ్య వివరాలన్నీ పొందు పరుచు కోవచ్చు  అంతర్జాలం లో !
2. మీ బీపీ మానిటర్ ను  మీ కంప్యూటర్   తో అనుసంధానం చేసుకోవచ్చు !
3. మీ హృదయ స్పందన మానిటర్ ను అనుసంధానం చేసుకోవచ్చు 
4. మీ రక్తం లో చెక్కర ను సూచించే గ్లూకోజు మానిటర్ ను  అనుసంధానం చేసుకోవచ్చు 
5. మీ రక్త పరీక్షల , ఎక్స్ రే ల వివరాలను కూడా పొందు పరుచు కోవచ్చు ఇక్కడ !
6. మీరు తీసుకునే మందుల వివరాలు , మీకు ఉన్న ఎలర్జీ ల వివరాలు కూడా ఇక్కడ చేర్చ వచ్చు !
7. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలనూ ఈ సాఫ్ట్ వేర్ లో ఎక్కించు కోవచ్చు ! 
8. మీరు ప్రపంచం లో ఎక్కడైనా ( అంతర్జాలం ఉన్న చోట ) మీ వివరాలను  ఓపెన్ చేసి చూసుకోవచ్చు ! 
9. మీరే కాక , మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు ! 
 
మీకు కావలసినదేమిటి ?:
 
మైక్రో సాఫ్ట్ వారు మీకు ఈ అవకాశాన్ని ఉచితం గా అందిస్తున్నారు ! మీకు కావలసినదల్లా మీ కంప్యుటరూ , ఇంకా మీ హాట్ మెయిల్ ( ఈమెయిలు ) అడ్రసూ ! మీకు ఒకవేళ ఇప్పటికే లేకపోతే , హాట్ మెయిల్ లో మీ ఈమెయిలు అడ్రస్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఉచితమే ! 
 
శ్రీవిజయ నామ సంవత్సరం లో మీరు మీ కోసమూ , మీ కుటుంబ సభ్యుల కొసమూ , అంతర్జాలం లో హెల్త్ వాల్ట్ ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారా ? అయితే ప్రయత్నించండి ! మైక్రో సాఫ్ట్ వారి ఉచిత కానుక  ” హెల్త్ వాల్ట్ ” ! మిగతా అన్ని వివరాలకూ  www .healthvault.com  చూడండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 
 

డయాబెటిస్ రిస్కు తగ్గించు కోవడం ఎట్లా ? .2. ways to lower the risk of diabetes.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 6, 2013 at 4:49 సా.

డయాబెటిస్  రిస్కు తగ్గించు కోవడం ఎట్లా ?  

క్రితం టపాలో మనం డయాబెటిస్ రిస్కు ఎట్లా కనుక్కోవాలో చూశాము కదా ! ఇప్పుడు మనం తీసుకోవలసిన నివారణ చర్యల గురించి కొంత తెలుసుకుందాం ! ఈ చర్యలన్నీ కూడా అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారి  సలహాలే ! కాక పొతే వారు పొందు పరిచిన వివరాలు ఆగ్లం లో ఉన్నాయి ! ఈ క్రింద ఇచ్చిన లింకు మీద మీరు క్లిక్ చేస్తే  అవి కనిపిస్తాయి. తెలుగు మాత్రమే వచ్చిన వారికోసం ఈ క్రింద ఆ నివారణ చర్యలు ఇవ్వడం జరుగుతూంది ! ఈ కారణాలన్నీమనలో చాలా మందికి తెలుసుకానీ ఈ కారణాలు ఏ విధం గా  మధుమేహానికి లేదా డయాబెటిస్ కు కారణ మవుతాయో అవగాహన ఉండదు. అందువల్ల మనం ఆ విషయాలు కూడా తెలుసుకోవడం ఉత్తమం ! 
 డయాబెటిస్  నివారణ చర్యలు: 
1. ఊబకాయం  
2. రక్తం లో అధిక గ్లూకోజు ( దీనినే హైపర్ గ్లైసీమియా అంటారు )
3. గర్భం దాల్చినపుడు వచ్చే డయాబెటిస్. 
4. అధిక రక్త పీడనం అంటే హై  బీ పీ 
5. చెడు కొలెస్టరాల్ 
6. చెడు ఆహారపు అలవాట్లు 
7. వ్యాయామం చేయక పోవడం 
8. స్మోకింగ్ చేయడం 
9. వయసు, మగ వారు, జాతి , ఇంకా కుటుంబం లో ఎవరికైనా డయాబెటిస్ అంత క్రితమే వచ్చి ఉండడం లాంటి ఇతర రిస్కులు. 
 
ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయండి ” చెకప్ అమెరికా ” అనే డయాబెటిస్ నివారణ వివరాల కోసం ! 
 
టపాలో మీకు కావలసిన విషయాలు లభించక పొతే లేదా, ఇంకా వివరాలు కావలిస్తే , తెలియ చేయండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు !

మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? (type 2 diabetes-risk-test )

In ప్ర.జ.లు., Our Health on ఏప్రిల్ 5, 2013 at 12:02 సా.
మీరు ఎప్పుడైనా , మీ డయాబెటిస్ రిస్కు కనుక్కున్నారా? 
 
డయాబెటిస్ , అదే షుగర్ వ్యాధి , లేదా మధు మేహం అనబడుతుంది. ఈ వ్యాధి ముఖ్యం గా రెండు రకాలు గా ఉంటుంది . చిన్నతనం లో వచ్చే డయాబెటిస్ ను టైప్ వన్ డయాబెటిస్ అంటారు. కొంత వయసు మళ్ళాక ( అంటే ముప్పై నలభై సంవత్సరాల వయసున్నపుడు ) వచ్చే డయాబెటిస్ ను టైప్ టూ  డయాబెటిస్ అంటారు.మనం ఇప్పుడు మాట్లాడు కొనేది ఈ టైప్ టూ డయాబెటిస్ గురించి. ఈ టైప్ టూ డయాబెటిస్ ఆసియా వాసులలో అధికం గా వస్తూ ఉంటుంది. కొంత వరకూ ఆసియా వాసులలో జీన్స్ అంటే జన్యువుల  అమరిక వల్లనూ , ముఖ్యం గా వారి ఆహార అలవాట్ల వల్ల నూ  ఈ టైప్ టూ డయాబెటిస్ అధికం గా వస్తుంది !  ఇట్లా డయాబెటిస్ రావడానికి కొన్ని సంవత్సరాల ముందే , కొన్ని కారణాలు కలిసి ,మనలో డయాబెటిస్ ముందు ముందు వచ్చే అవకాశాలను అధికం చేస్తాయి ! అందుకే ఈ కారణాలను రిస్కు ఫ్యాక్టర్ లు అంటారు ! ఈ రిస్కు ఫ్యాక్టర్ లను ముందే మనం తక్కువ చేసుకుంటే , ముందు ముందు డయాబెటిస్ రాకుండా నివారించు కోవచ్చు. లేదా ఆ వచ్చే అవకాశాలను చాలా కాలం పాటు వాయిదా వేసుకోవచ్చు ! మన జీన్స్ అంటే జన్యువులలో మార్పులు మనం నియంత్రించడం కానీ , నివారించడం కానీ చేయ లేక పోయినప్పటికీ , ఈ రిస్కు ఫ్యాక్టర్ లను తగ్గించు కుంటే ,మనం డయాబెటిస్ ( అంటే టైప్ టూ డయాబెటిస్ ) వ్యాధి నివారణ లో విజయ వంతం అవవచ్చు !
 
ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా మీరు మీ రిస్కు ను లెక్క కట్టుకోండి ! ( లింకు మీద ఒక్క క్లిక్కు తో !  )  రిస్కు కనుక అధికం గా ఉంటే , మీరు మీ వైద్యుడిని సంప్రదించి , అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి ! మీ ఆరోగ్యం కోసం ఈ ముందు జాగ్రత్త  తీసుకోవడం లో తప్పు లేదు కదా !  అంతే కాక ఇది ఉచితం కూడా ! ( ఒక గమనిక : పరీక్ష వివరాలలో మీ ఎత్తు అడుగులలో ఉంది కాబట్టి మీ బరువు కూడా పౌండ్ల లో రాయాలి. ఇది కష్టమేమీ కాదు. మీ బరువును కిలోలలో కొలుచుకుని, రెండు పాయింట్ రెండు తో గుణిస్తే మీ కిలోలలో ఉన్న మీ బరువు పౌండ్ల లో మారుతుంది ( ఎందుకంటే ఒక కిలో బరువు 2. 2 పౌండ్ల తో సమానం కనుక ).
 
వచ్చే టపాలో ఇంకొన్ని విషయాలు ! 
 
 
 
 
 
 

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త !

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఏప్రిల్ 1, 2013 at 6:47 సా.

పని సూత్రాలు . 38. మీ వీపు కూడా జాగ్రత్త ! 

సాధారణం గా , మనం చేసే ఉద్యోగాలలో , ఇతర కొలీగ్స్ , లేదా ఇతర ఉద్యోగులలో అధిక శాతం  మంచి వారే ! వారూ మన లానే , కష్టపడి పని చేసే స్వభావం కల వారే ! కానీ కొద్ది శాతం మంది , మన మీద అసూయా ద్వేషాలు కలిగి ఉంటారు ! ఏదో రూపం లో వెన్ను పోటు పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ! ధర్మరాజుకు అందరూ మంచి వారిలానే కనిపించారు ట ! అంటే , ధర్మరాజు అందరిలోనూ మంచినే చూసే వాడుట ! కానీ దుర్యోధనుడు అందరిలోనూ చెడునే చూసే వాడుట ! అంటే దుర్యోధనుడికి అందరూ చెడ్డ వారిలానే కనపడ్డారు ట ! మీరు ధర్మరాజులూ , దుర్యోధనులూ కానవసరం లేదా ప్రస్తుత భారతం లో ! మీకు కావలసినది అప్రమత్తత ! మనం చీకటి గా ఉన్న దోవలో వెలుతురు తోడు లేకుండా నడవడానికి  సందేహిస్తాము !  కానీ ఆ చీకటి లో నడుస్తే, ఎప్పుడో కానీ  పాము కాటు వేయడం కానీ, లేదా ముళ్ళు గుచ్చుకోవడం కానీ , లేదా  గోతి లో పడడం కానీ సంభవించదు  ! ఎప్పుడో జరుగుతాయని , మనం చీకటి లో ఏ  దీపమూ లేకుండా నడవం కదా ! అదే పరిస్థితి మనం చేసే ఉద్యోగం కూడా !  మీ పని మీరు సవ్యం గా చేస్తూ , మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే వారి గురించి మీరు అప్రమత్తత తో ఉండాలి ! ఎప్పుడూ ! మీ అప్రమత్తత మీకు విరోధులను తక్కువ చేస్తుంది. అట్లాగే మీ ఆపదలను కూడా తక్కువ చేస్తుంది ! 
అందుకు మీరు ఏమి చేయాలి ? 
1. వ్యక్తి గత విలువలు నిర్ణయించుకోవడం !  మీరు చేసే ఉద్యోగం లో అప్రమత్తులై ఉండడం అంటే, ముందుగా ,  మీకు మీరు గా,  కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి ! ఆ విలువలు మీ శీలాన్ని అంటే మీ క్యారెక్టర్ ను దృ ఢ మైనది గా చేస్తాయి ! ఇతరులు వేలు పెట్టి మీలో తప్పులు ఎంచ డానికీ , లేదా వెన్ను పోటు పొడవడానికీ జంకుతారు ! మీరు ఏర్పరుచుకునే వ్యక్తిగత విలువలు అనేకం ఉండవచ్చు ! కానీ అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగం లో మీ సమగ్రత అంటే ఇంటిగ్రిటీ ను బలోపేతం చేసేవి గా ఉండాలి ! 
ఉదాహరణకు : మీరు ఈ క్రింది విధం గా,  మీలో మీరు ప్రతిన బూన వచ్చు : 
” నేను నా ఉద్యోగం కోసం ఇతరులను ( అంటే ఇతర ఉద్యోగులను ) ఏరకంగానూ శారీరికం గానైనా , మానసికం గానైనా హింసించను !”
నేను పని చేసే కంపెనీ నిబంధనలు ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించను ”
” నేను నా నీతి నియమాలను కూడా ఎప్పుడూ పాటిస్తాను ” !
” నా యజమాని శ్రేయస్సుకూ , నా కుటుంబ శ్రేయస్సు కూ ఎప్పుడూ పాటు పడతాను ” !
”ఉద్యోగం లో నాకు తెలిసిన నిపుణత అంటే స్కిల్స్ , ఇతర ఉద్యోగులకు , ఏ స్వలాభాపేక్షా  లేకుండా నేర్పుతాను”  ! 
నేను ఉద్యోగం చేసే చోట , ఇతర సహోద్యోగులు ఎవరైనా పదోన్నతి పొందినా , నేను ఏ విధమైన అసూయా ద్వేషాలను పొందను , వారిమీద ప్రదర్శించను ”
ఈ రకమైన వ్యక్తి గత విలువలను మీకు మీరే ఏర్పరుచుకునే లక్ష్మణ రేఖలు ! వీటికి బద్ధులై ఎప్పుడూ , మీ పూర్తి శక్తి యుక్తులను మీరు చేసే ఉద్యోగం లో ప్రదర్శించడం అలవాటు చేసుకుంటే, మీరు మానసికం గా అత్యంత బలవంతులవుతారు ! దానితో మీ లక్ష్యాలు మీరు చేరుకోవడం సులభమవడమే  కాకుండా ,మీ ఉద్యోగం లో మీకు శత్రువులు ఏర్పడరు, ఒకవేళ ఏర్పడినా,  వజ్రం లాంటి మీ శీలాన్ని ఛే దించ లేరు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పని సూత్రాలు. 20. ” కూల్ ” గా ఉండడం అంటే ఏమిటి ?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on మార్చి 9, 2013 at 1:30 సా.

పని  సూత్రాలు. 20. ” కూల్ ” గా ఉండడం  అంటే ఏమిటి ? 

 
పని సూత్రాలలో ఇంకో ముఖ్య సూత్రం  ” టు బి  కూల్  ఎట్  ఆల్ టైమ్స్ !” . అంటే దీనిని తెలుగులో అనువాదం చేస్తే , ఎప్పుడూ చల్ల గా ఉండమని అర్ధం వస్తుంది ,కానీ అది నిజం కాదు. అందు వల్లనే  కూల్  అనే ఆంగ్ల పదాన్నే వాడడం జరిగింది ! నవీన  ప్రపంచం లో కూల్  గా ఉండడం అంటే , ప్రశాంత చిత్తం తో , ఆత్మ విశ్వాసం తో  ఆదుర్దా ఏమీ లేకుండా అనేక నిత్య జీవిత సందర్భాలలో ప్రవర్తించడం ప్రత్యేకించి ,స్కూల్ లోనూ, కాలేజీ లోనూ , లేదా పని చేసే చోటా కూడా !  ఈ ఈ సందర్భాలలో , లేదా స్థలాల లో , ఆందోళన పడకుండా  ఇతరులలో కలిసి పోతూ కూడా తమ పని తాము సక్రమం గా చేయ గలగడం ! అంతే కాక, తమ పరిస్థితుల మీద తాము నియంత్రణ కలిగి ఉండడం !
మరి కూల్ గా ఉండాలంటే, ఏ లక్షణాలు అలవాటు చేసుకోవాలి ?: 
1. మీ  పరిసరాలను సదా గమనించండి ! :
అంటే కేవలం మీ చుట్టూ ఉండే స్థలాలనూ , చెట్లనూ , చేమలనూ , కట్టడాలనూ , అంటే బిల్డింగు లనూ , ఫర్నిచర్ నూ అనుకుంటే అది పొరపాటు ! మానవ సంబంధాలు కేవలం వాటితో కాదు కదా ! ముఖ్యం గా మీరు మీ చుట్టూ ఉన్న మనుషుల ను పరిశీలిస్తూ ఉండాలి ! అంటే వారి దృష్టి లో మీ మీద వారి  అభిప్రాయం ఎట్లా ఉంటుందో గమనించడం !  ఈ విషయం లో మీకు ఉపయోగ పడే ” సాధనాలు ” మీ వేషం , మీ భాషా ఇంకా మీ ప్రవర్తనా !  అవే వారికి మీ మీద  ఒక మంచి అభిప్రాయం కలిగిస్తాయి !  ఈ విషయం లో ” వారితో నాకేం పని ? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ” అనుకునే వారు చాలా మంది ఉంటారు !  అది నిజమే ! కానీ పని సూత్రాలలో ముఖ్య సూత్రం మీ పురోగతి అంటే మీ ప్రోగ్రెస్ !  దానికోసం మీరు మీ వర్క్ ప్లేస్ లో ఇతరులతో చక్కటి సంబంధాలు కలిగి ఉండడం అతి ముఖ్యం ! కేవలం మీరు ఒక ప్రతిభావంతులైన శాస్త్రగ్నులైతే తప్ప ! ( మీ అంత  మీరు,  ఒక ప్రయోగ శాల లో ప్రయోగాలు చేస్తూ ఉండవచ్చు ! ) 
2. స్వతంత్రత అలవాటు చేసుకోండి ! :  కూల్  గా ఉండే వారు ఇతరులతో బాగా మెసల గలిగినా , వారు ఇతరుల మీద ఆధార పడకుండా , సాధ్యమైనంత వరకూ , వారి పనులు వారే స్వతంత్రం గా చేసుకుంటూ ఉంటారు ! 
3. మీ ప్రత్యేకత కోల్పోవద్దు ! : బురద లో పెరిగినా తామర పూవు అందం గా ఉంటుంది , తన ప్రత్యేకత ఎప్పుడూ కోల్పోదు ! అది ” బురద పూవు ” అనిపించుకోదు కదా !  కూల్ గా ఉండడం అంటే ఇతరులతో కలిసిపోవడం నిజమే ! కానీ ఈ ప్రయత్నం లో మీరు  మీ ప్రత్యేకతలను కోల్పోకూడదు ! అంటే మీ సహచరులు  సిగరెట్ తాగుతూ ఉంటే  మీరు స్మోకింగ్ అంత వరకూ చేయక పొతే , ఆ అలవాటు చేసుకో నవసరం లేదు !  అట్లాగే మీరు శాక హారులైతే , మీ చుట్టూ ఉన్న వారు మాంసం తింటూ ఉంటే , మీరు కూడా ఆ పని చేయ నవసరం లేదు ! అట్లా వారిని అనుకరించడం ” కూల్ ” గా ఉండడం అనిపించుకోదు ! అదే విధం గా మద్యానికి అలవాటు పడడం , ఇంకా ఇతర వ్యసనాలు కూడా !
4. మీ హృదయం విప్పండి ! : అంటే మీ హృదయాన్ని హనుమంతుడి లా చీల్చుకోమని అర్ధం చేసుకోకండి !  మీ సహచరుల దగ్గర మీరు  ఏ  అరమరికలు లేకుండా ,మీ వ్యక్తిగత విషయాలు  చెప్పుకోండి !  సమస్యలూ, కష్టాలూ లేని మానవులు లేరు కదా !  మీరు వాటిని మీ హృదయం లో ” తొక్కి పట్టి ఉంచితే ” అది మీ హృదయానికి మంచిది కాదు ! 
5. సమ దృష్టి కలిగి ఉండండి ! : మీరు ఇతర మానవులతో సంబంధాలు ఏర్పరుచుకునే సమయం లోనూ లేదా వారితో ఆ సంభంధాలు కొనసాగించే సమయం లోనూ ,వారి మీద సమ దృష్టి కలిగి ఉండండి ! అంటే వారు మీకన్నా ఎక్కువా కాదూ , తక్కువా కాదు !  వారు మీలానే మానవులు ! వారికి మీరు ఇచ్చే గౌరవం ఇస్తూ ఉన్నా ,వారిపైన సమ దృష్టి కలిగి ఉంటే , మీలో ఆత్మ న్యూనతా భావాలు కానీ , అహం భావం కానీ ఏర్పడవు ! ఆ గుణాలు,  మీ మానసిక ఆరోగ్యాన్ని  ప్రభావితం చేసే మలినాలు ! 
 
వచ్చే టపాలో ఇంకో పని సూత్రం ! 

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఫిబ్రవరి 9, 2013 at 11:09 ఉద.

పరీక్షలకు ముందు, విద్యార్ధుల యాంగ్జైటీ ను తగ్గించడం ఎట్లా?

 
నిన్నటి టపా లో మనం తెలుసుకున్నాం , పరీక్షల ముందు పిల్లలు పడే ఆందోళన, ఆతురత ,వారు రాసే పరీక్షలను ఎట్లా ప్రభావితం చేస్తుందో ! వారి అసలు మేధ ను ఎట్లా తక్కువ చేసి చూపిస్తుందో ! మరి ఆ ఆందోళన తగ్గించి వారి ప్రతిభను సరిగా చూపించేట్టు చేయడానికి  వారు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !  
1. ఆందోళనలను ముట్టడించడం ! :
చాలా మంది విద్యార్ధులు , పరీక్షకు ముందుగా , ఆందోళనా , యాంగ్జైటీ చెందినా , వారు పరీక్షా సమయం లో , ప్రశ్నలను చదివి , వారికి గుర్తు వచ్చిన సమాధానాలు రాస్తూ ఉంటారని. కానీ వారి ఆందోళనల వల్ల , వారి సమాధానాలలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.సాధారణం గా మన జ్ఞాపక శక్తి , వర్కింగ్ మెమరీ ఇంకా స్టోర్డ్ మెమరీ అని ప్రధానం గా రెండు రకాలు గా ఉంటుంది. మనము ఏ  పని చేయాలన్నా , ఈ రెండు రకాల మెమరీ కూడా అవసరం. ప్రత్యేకించి  వర్కింగ్ మెమరీ , పరీక్షలు రాసే సమయం లో ముఖ్యం గా అవసరం ఉంటుంది. ఎందుకంటే , ఇచ్చిన ప్రశ్నను అర్ధం చేసుకుని,మన మెదడులో నిక్షిప్తమై ఉన్న మెమరీ అంటే అంతకు మునుపు నేర్చుకున్న , విజ్ఞానాన్ని  గుర్తు చేసుకుంటూ ,  సమాధానం రాయడం జరుగుతుంది. పరీక్షల ముందు తీవ్రం గా ఆందోళన చెందిన విద్యార్ధులు ,  ఈ వర్కింగ్ మెమరీ ను సరిగా ఉపయోగించ లేక పోతారని తెలిసింది. ఎందుకంటే ఆందోళనా, యాంగ్జైటీ లు ,వారి వర్కింగ్ మెమరీ ను కొంత మేర వినియోగించు కుంటాయి , దానితో ప్రశ్నలకు , సమాధానాలు రాయడానికి సరిపోయేంత వర్కింగ్ మెమరీ మిగిలి ఉండదు. మరి ఈ సమస్యను అధిగమించడం  కష్టమేమీ కాదంటారు , మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు. అది ఎట్లా అంటే , వారు ఎక్స్ ప్రెసివ్ రైటింగ్ అనే పధ్ధతి ని అనుసరించాలి.
ఎక్స్ ప్రెసివ్  రైటింగ్ అంటే ఏమిటి : ఈ పధ్ధతి లో విద్యార్ధి చేయవలసినది ,పరీక్ష రోజుకు ముందు , కేవలం పది నిమిషాలు తన ఆందోళన లనూ , యాంగ్జైటీ లనూ ,ఇంకా పరీక్ష గురించి తనకు ఉన్న భయాలనూ , ఒక పేపర్ మీద రాయడమే ! ఇట్లా చేయడం వల్ల  వారు, వారి భయాందోళన లను తాత్కాలికం గా , తమ మెదడు లోనుంచి తీసివేసి , పేపర్ మీద పెడుతున్నారన్న మాట ! ఇట్లా చేయడం వల్ల  పరీక్ష ముందు, విద్యార్ధుల భయాందోళన లు ఇంకా ఎక్కువ అవ గలవని కొందరు సందేహాలు వెలిబుచ్చినప్పటికీ , అనేక పరిశీలనల వల్ల , ఈ పధ్ధతి పాటించడం వల్ల  విద్యార్ధులకు మార్కులు ఎక్కువ గా వస్తున్నాయని తెలిసింది. ఎందు వల్ల నంటే , ఇట్లా పేపర్ మీద రాసుకున్న విద్యార్ధులకు , ఉపయోగించడానికి , వారి వర్కింగ్ మెమరీ పూర్తిగా వినియోగం లోకి వస్తుంది ( భయాందోళన లు పేపర్ మీదకు మార్చ బడ్డాయి కాబట్టి )  ఈ పరిస్థితిని ఇంకో ఉదాహరణ ద్వారా వివరించ వచ్చు.  మనం కంప్యూటర్  వాడుతున్నపుడు , అనేక సైట్లను ఒకేసారి ఓపెన్ చేశామనుకోండి. అప్పుడు  మనకు కావలసిన సైటు మనకు దొరకడం ఆలస్యం అవుతుంది ఎందుకంటే, కంప్యూటర్  లో మెమరీ ఎక్కువ ఉన్నా కూడా , వర్కింగ్ మెమరీ , అంటే ప్రాసెసింగ్ పవర్ పరిమితం గా ఉంటుంది కాబట్టి , వీలైనంత వరకూ , మనం ఒక సమయం లో ఒక సైటు నే చూస్తూ ఉండాలి ( ప్రాసెసింగ్ స్పీడు ఎక్కువ గా ఉన్న కంప్యుటర్ లకు ఇట్లాంటి సమస్యలు ఉండవనుకోండి  ! ) 
 
వచ్చే టపాలో మిగతా పద్ధతులు !  

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 4, 2013 at 10:37 ఉద.

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు .3.

అప్పు గురించిన వాస్తవాలు : 
ప్రతి నలుగురిలో ఒకరిని  జీవితం లో ఏదో ఒక సమయం లో మానసిక రుగ్మత కానీ వ్యాధి కానీ బాధిస్తుంది.అట్లా బాధింప బడే ప్రతి నలుగురిలో  ఒకరికి అప్పు సమస్యలు ఉంటాయి. అప్పు సమస్యలు ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి  మానసిక రుగ్మతలు , లేదా వ్యాధులు ఉంటాయి.
మానవులు అప్పు ఊబి లో ఎట్లా కూరుకు పోతారు ? :
1. జీవిత చక్రం లో మార్పులు : అంటే  ఉద్యోగం పోవడమో, అయిన వాళ్ళతో విడి పోవడమో , లేదా మరణించడమో , విడాకులు తీసుకోవడమో లాంటి ఊహించని పరిణామాలు వ్యక్తిగత ఆర్ధిక పరిస్థితిని  విషమం చేస్తాయి.
2. అనుకోకుండా సంభవించిన అనారోగ్యం కూడా  మానవులను మంచానికి కట్టి  పడేయడమే  కాకుండా , వారి కంచం లో కూడా ఆహారానికి వెతుక్కునే పరిస్థితి కలిగిస్తుంది.
3. చేస్తున్న ఉద్యోగం లో కూడా , చాలీ చాలని జీతాలు వస్తూ , అవసరాలు ఎక్కువ గా ఉన్నప్పుడు .
4. విచ్చల విడి గా ఖర్చు చేయడం , ( మ్యానియా అనే మానసిక పరిస్థితి లో కూడా  విచక్షణా రహితం గా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది . )చాలా మంది మానవులు , శాస్త్రీయం గా మానసిక శాస్త్ర నిపుణు డయిన డాక్టర్ చూడక పోయినా , ఇట్లాంటి మానసిక స్థితి లో ఉంటారు, మితి మీరి ఖర్చు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు వ్యాపారస్తులకు ప్రియం. ఎందుకంటే , వారు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటే  వ్యాపారస్తులు అంత  లాభ పడుతూ ఉంటారు.
5. తీసుకున్న అప్పు తీర్చక పోవడం.
6. కట్టవలసిన బిల్లులు ( నెల వారీ )  అశ్రద్ధ చేసి కట్టక పోవడం. 
అప్పు చేసిన వారి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది?:
1. పరిస్థితి చేయి దాటి పోతున్నట్టూ , అందుకు తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నట్టూ  భావిస్తూ ఉంటారు.
2. నిరాశా వాద పరిస్థితిలో , ప్రత్యేకించి , తీర్చ వలసిన అప్పు రోజు రోజు కూ  ఎక్కువ అవుతుంటే !
3.తీవ్ర మైన స్వీయ అపరాధ భావనలు: అంటే ఆ పరిస్థితి కంతటికీ తామే కారణమనీ , ప్రత్యేకించి వారికి , శరీర లేదా మానసిక ఆరోగ్య కారణాలు ఉన్నప్పటికీ , తీవ్రం గా తమను తాము నిందించు కుంటూ , మనస్తాపం చెందడం !
4. డిప్రెషన్ కూ  , అందోళన కూ  లోనవడం !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 3, 2013 at 11:04 ఉద.

అప్పుతో మనశ్శాంతి కి ముప్పు.2. క్రెడిట్ కార్డులు కారణమా ?

 
సాధారణం గా మనమందరమూ , అప్పు చేయడానికి  సందేహిస్తూ ఉంటాము. మన ఆదాయం మించి ఖర్చులు అవుతున్నప్పుడు కంగారు పడతాము. ఎవరి దగ్గర అప్పు చేయ వలసి వస్తుందో అని, అప్పు చేయడానికి కూడా సంకోచిస్తూ ఉంటాము. వీలైతే  అప్పు లేని జీవితం గడుపుదామని అనుకుంటాము.కానీ వాస్తవ పరిస్థితులు ఎప్పుడూ , ఆదర్శాలకూ , ఆశయాలకూ భిన్నం గా ఉంటాయి కదా ! మనం, మన పరిస్థితులకు , క్రెడిట్ కార్డులు ఎంతవరకు కారణమో చూద్దాం !
అప్పు చేసే వారికి క్రెడిట్ కార్డ్ లు ” దేవుడిచ్చిన ” వరం !  ఈ ప్రపంచం లో   అనేక కోట్ల మందిని ఒక్క సారిగా ఋణ గ్రస్తులను చేయడానికి ఉపయోగ పడే అతి చిన్న సాధనం ! అనేక పరిశీలనల వలన మనం కరెన్సీ అంటే డబ్బు నోట్ల రూపం లో మన చేతుల్లో ఉన్నప్పుడు , ఖర్చు చేయడానికి వెనుకాడు తాము , కానీ క్రెడిట్  కార్డు ఉన్నప్పుడు , ఆ జంకు  పోయి ” హుందాగా ”  క్రెడిట్ కార్డ్ ఫ్లాష్ చేస్తూ ఉంటాము.మన చేతిలో ఉన్న డబ్బు తో కాకుండా క్రెడిట్ కార్డు ఇచ్చి కొన్న వస్తువులను , ఆనందం గా కొంటాము !  ఆ సమయం లో మనం అనుభవించే ఆనందం, డబ్బు పెట్టి ,కొనే సమయం లో వచ్చే ” విచారాన్ని ” కను మరుగు చేస్తుంది ! మన మానసిక స్థితిని క్రెడిట్ కార్డ్ ఆ విధం గా ట్యూన్ చేస్తుంది. చాలా పరిశీలనల వల్ల , మన చేతిలో డబ్బు నోట్ల రూపం లో ఉన్నప్పుడు , మనం జాగ్రత్త గా ఆచి తూచి ఖర్చు చేస్తూ ఉంటాం అని తెలిసింది.
చాలా మంది  చేయని ఇంకో పని ఉంది ! అది డబ్బు విలువ తెలుసుకోవడం ! అంటే  డబ్బు గురించి మనకు ఉన్న అవగాహన ఏమిటి ? మన జీవితాలలో డబ్బుకు  ఏ  స్థానం ఇస్తున్నాము, ఇవ్వదలుచుకున్నాం , ఇవ్వ బోతున్నామనే విషయాలను , వివరం గా తెలుసుకోవాలి. కేవలం మనకు ఉన్న డబ్బు బట్టే , మన ఆస్తిత్వమూ , ఉనికీ ఆధార పడి ఉందా?  ఆ విధమైన ఆలోచన ఇంకేవరిదోనా , లేక మన నమ్మకమా ? డబ్బు లేక పొతే మనం లేమా ? !  ఈ  ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు రాబట్టు కావడానికి  ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి , తమంత తామే ! 
క్రెడిట్ కార్డు తో ”  ఋణాను బంధం ” ఎట్లా పెరుగుతుంది?:
ఒక ఉదాహరణ : లక్ష రూపాయలకు ఒక ఆకర్షణీయమైన టెలివిజన్, కనుక మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నట్టయితే , దానికి  మీరు మినిమమ్ పేమెంట్ కేవలం నెలకు వెయ్యి రూపాయలు  అనుకుంటే ,కనీసం  నూట యాభై నెలలు కడుతూ ఉండాలి , వడ్డీ తో కలిపి !  మీరు ఆ సమయం  అంటే కనీసం పన్నెండు సంవత్సరాలకు పైగా , నెలకు వెయ్యి రూపాయలు కడుతూ ఉంటే , కనీసం లక్షన్నర రూపాయలకు పైగా మీరు మీ శ్రమ ఫలితాన్ని క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అప్పు తీర్చడానికి ధార పోయాల్సిందే కదా !  అదే మినిమమ్ పేమెంట్ లో ఉన్న కిటుకు ! మానవులను దీర్ఘ కాలికం గా ” ఋణ గ్రస్తులను ” చేయడమే !  అదే మీరు ( మీ కోరికలను నియంత్రించుకుని ) ఆ టెలివిజన్ కొనకుండా, మీ డబ్బును  నెలకు వెయ్యి రూపాయల చొప్పున బ్యాంకు లో వేసుకుంటే ( వచ్చే వడ్డీ తో సహా  ) మీకు ఎంత  డబ్బు జమా అవుతుందో ఊహించుకోండి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు.1.

In ప్ర.జ.లు., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 1, 2013 at 9:21 ఉద.

అప్పు తో మనశ్శాంతి కి ముప్పు.1. 

 
అప్పు చేసే వారి రకాలు :  గ్యారెట్ సటన్  అనే రచయిత  అప్పు తీసుకునే వారిని ముఖ్యంగా నాలుగు రకాలు చేశాడు ! ( ఇది ముఖ్యం గా అమెరికనుల ను దృష్టి లో ఉంచుకునే అయినా , ప్రపంచీకరణ పర్యవసానం గా ఇతర దేశాల వారికి కూడా వర్తిస్తుంది ! ) 
1.Wishers ( అభిలాషులు ) :  ఈ రకానికి చెందిన వారు , ఎప్పుడూ తాము తీసుకున్న అప్పును సకాలం లో తీర్చి వేయగలమనే , ఆశాభావం తోనూ , ధీమా తోనూ ఉంటారు.వారికి , వారు మొత్తం మీద వారు చేసే ఖర్చులమీద వారికి ఏమాత్రం అవగాహన , దూర దృష్టీ ఉండదు ! పర్యవసానం గా , ఎక్కువ వడ్డీలూ , అవి ఇంతింతై , కొండంత అయి , వారు తీర్చలేక పోలేమనే ఆలోచనా  వారికి  ఏమాత్రం ఉండదు. వారికి కేవలం ” తాత్కాలికం గా అంటే ప్రస్తుతం , విషమ పరిస్థితిని దాట  దానికి ఎంతో  కొంత నెలకు కడితే , సరిపోతుంది కదా , మనమీద వత్తిడి లేకుండా ” అనే  ( అప ) నమ్మకం తో ఉంటారు ఎప్పుడూ !  వీరు సామాన్యం గా పెద్ద పెద్ద మతపరమైన పండగలకు విపరీతం గా ఖర్చు పెడుతూ ఉంటారు ! ఇంకా వారు , వారికి మంచి ఉద్యోగం వచ్చి వారి అప్పులన్నీ తీర్చివేయగలమనే , ఫాల్స్ కాన్ఫిడెన్స్ లేదా అప విశ్వాసం తో ఉంటారు !  వీరంటే అప్పు ఇచ్చే వారికి అమితమైన ప్రేమ ! 
2.Wasters ( వ్యసన పరులు ) : ఈ రకానికి చెందిన వారిలో ఆత్మ విశ్వాసం చాలా కొరవడుతుంది, ఇంకో రకం గా చెప్పాలంటే, ఆత్మ న్యూనతా భావం అధికం గా ఉంటుంది. దానితో, ఏ సమయం లోనైనా వారికి విసుగు గా కానీ , డిప్రెషన్ గా గానీ అనిపించినప్పుడు , వెంటనే ,  ” తమ ” ” స్నేహితులతోనో , బంధువులతోనో ” ” బజారున ” పడతారు , తమ ఇష్టం వచ్చిన వస్తువులను కొంటారు , ఎంత ధర ఉన్నా , వారికి వస్తువు ధర, విలువ ల మీద ఏమాత్రం అవగాహన ఉండదు. అంతేకాక వారు , చూసిన ప్రతి వ్యాపార ప్రకటన నూ  పదే  పదే  మననం చేసుకుంటూ , మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ పరికరాలనూ ,  వస్త్రాలనూ , కోనేస్తూ ఉంటారు. ముఖ్యం గా వీరికి , డజన్ల కొద్దీ క్రెడిట్ కార్డ్ లు ఉంటాయి. అప్పు తీర్చ లేక పోతున్నా , క్రెడిట్ కార్డు లు మార్చి మార్చి , తమ కు ” కావాలను కున్నవి , అవసరం ఎక్కువ లేకపోయినా కొంటూ ఉంటారు. చేసిన అప్పులు తీర్చ లేక తంటాలు పడుతూ ఉంటారు !  వీరూ అప్పు ఇచ్చే వారికి చాలా ఇష్టం.
3.Wanters ( తక్షణ వాంఛ కులు ) : వీరు  యమ స్పీడు. వారికి కావలసినవి , వస్తువులు కానీయండి , వాహనాలు కానీయండి , ఎంత ఖర్చు అయినా , ఎట్టి  పరిణామాలు వారు ఎదుర్కోవలసి వచ్చినా , కొనేస్తారు వెంటనే , ఇక్కడ గమనించ వలసినది , వారికి చాలా సమయాలలో వారి డబ్బు ఉండదు అంటే సొంత డబ్బు ఉండదు. అందువల్ల అప్పు చేసి అయినా సరే, వారు అనుకున్న వస్తువులు కొంటారు , వెంటనే ! వారి మానసిక పరిస్థితి ని  ఇన్స్ స్టెంట్  గ్రాటి ఫికేషన్  ( instant gratification ) అని అంటారు. ఈ లక్షణం లో , మానవులకు ఓపిక ఏమాత్రం ఉండదు. అంటే పేషన్స్ ! వారు వేచి యుండడం సహించ లేరు !  ఇంకా స్పష్టం గా చెప్పాలంటే , సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమ శిక్షణ వారికి ( అలవాటు ) ఉండదు !  వీరు కూడా అప్పు ఇచ్చే వారి  గుడ్ బుక్స్ లో ఉంటారు ! ఈ పరిస్థితిని శాస్త్రీయం గా ఒక యాభై ఏళ్ల  క్రితం, శాస్త్రజ్ఞులు ఒక చిన్న  ప్రయోగం తో నిరూపించారు.
ఈ ప్రయోగాన్ని మార్ష్ మెలో  ప్రయోగం అని అంటారు !  ఈ ప్రయోగం అమెరికా లో జరిగింది స్టాన్ ఫర్డ్ అనే నగరం లో నాలుగు సంవత్సరాల వయసు ఉన్న బాల బాలికల మీద ! వారందరికీ ” మీరు తినడానికి మార్ష్ మెలో  ఇస్తాము ( మార్ష్ మెలో  అంటే ఒక రకమైన పీచు మిఠాయి  ) మీరు వెంటనే తెనేట్టైతే ఒకటి , లేదా పదిహేను నిమిషాల తరువాత తినేట్టైతే , రెండు ఇవ్వడం జరుగుతుంది ” అనే షరతు పెట్టారు !  అప్పుడు రెండు రకాల ప్రవర్తనను వారు గ్రహించారు ! ఆ గ్రూపు లో సగం మంది ఆ మార్ష్ మెలో  తీసికొని వెంటనే ( అంటే ఒకటే ! )  తినేశారు !  కానీ ఇంకో సగం మంది , పదిహేను నిమిషాలూ ఆగి రెండు తీసుకుని తిన్నారు !   అంత వరకూ సరే  ! కానీ శాస్త్రజ్ఞులు ఆ రెండు గ్రూపులనూ కనీసం మూడు దశాబ్దాల పాటు అంటే ముప్పై ఏళ్ల  వయసు వరకూ పరిశీలించారు !
వారికి ఒక ఆశ్చర్య కరమైన విషయం తెలిసింది.  ఒక మిఠా యే , వెంటనే తీసుకు తిన్న వారు ,  ఆత్మ న్యూనతా భావం తో పెరిగి పెద్ద వారై , ఏవో అంతంత మాత్రం చదివి , చాలీ చాలని ఉద్యోగాలతో ,  ఆందోళన మయ వివాహ సంబంధాలతో , ఒడు దుడుకుల జీవితాలు గడుపుతున్నారుట ! కానీ , పదిహేను నిమిషాలు ఆగి రెండు మిఠాయి లూ తిన్న వారు బాగా చదువుకుని , ఎక్కువ జీతాలతో , స్థిరమైన వివాహ బంధాలతో , ప్రశాంతమైన జీవితాలు గడుపుతున్నారుట ! ఒక పరిశీలన ప్రకారం , ఇట్లా సెల్ఫ్ డిసిప్లిన్ లేని వారు , అమెరికా లో లక్షలలో ఉండి , అనేక కష్టాలకు లోనవుతున్నారని ! ( మిగతా దేశాలలో వీరి సంఖ్య ఏమాత్రం తక్కువ గా ఉండదు ! ) 
4.Winners ( విజయులు )  : ఇక ఈ రకానికి చెందిన వారు బహు జాగ్రత్త పరులు: వీరికి  అప్పు ఊబి లో కూరుకు పొతే బయటకు రావడం ఎంత కష్టమో స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు అనవసరమైన ఆర్భాటాలకు పోరు. ప్రతి వస్తువునూ  ఆచి తూచి కొంటారు !  ఒక ఇల్లు ఉంటే , ఆ ఇంటికి చేసిన అప్పు వారే తీరుస్తూ ఉండక ,ఒక గది అద్దెకు ఇచ్చి , ఆ వచ్చే అద్దె ను కూడా అప్పు తీర్చడానికి వాడతారు !, పది టెరీ కాట్ చొక్కాలకు బదులు , నాలుగు నూలు చొక్కాలు , ఉంటాయి వీరికి, హాయి గా !   చాలా వరకు, వీరు తమ వాంఛ లను నియంత్రించు కొనగలిగే శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. వీరు దీర్ఘ కాలికం గా, జీవితం లో బాగా స్థిర పడతారు. మనశ్శాంతి కూడా వీరికి ఏర్పడుతుంది, కనీసం ఆర్ధికం గా !  వీరిని అప్పు ఇచ్చే వారు అదోలా చూస్తారు ! ” వీడు ఎక్కడనుండి  దాపురించాడు రా ” అనుకుంటారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !