Our Health

Archive for the ‘మన ఆరోగ్యం.’ Category

చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 22, 2013 at 12:39 సా.

చదువుకోవడం ఎట్లా?32. వర్కింగ్ మెమరీ ఎట్లా పెంపొందించు కోవచ్చు ? 

 
 
మునుపటి టపాలో చూశాము , మానవ మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా,  షార్ట్ టర్మ్ మెమరీ లేదా తాత్కాలిక జ్ఞాపకాలు గానూ , పర్మెనెంట్ లేదా శాశ్వత జ్ఞాపకాల గానూ  అమరి ఉంటాయో ! మనం శాశ్వత మెమరీ  అరలలోకి జ్ఞాపకాలను పదిలం గా అమర్చుకోవాలంటే ,  ముందుగా తాత్కాలిక జ్ఞాపకాలు , లేదా వర్కింగ్ మెమరీ మీద దృష్టి సారించాలి ! అంటే  వర్కింగ్ మెమరీ ని వృద్ధి చేసుకోవడం ఎట్లాగో తెలుసుకుని ,  మనం నేర్చుకునే విషయాలను  ఈ వర్కింగ్ మెమరీ లో నిక్షిప్తం చేసుకునే పధ్ధతి ని అనుసరించాలి ! ఈ వర్కింగ్ మెమరీ కధా కమామీషు ఇప్పుడు తెలుసుకుందాం !  పైన ఉన్న చిత్రం ,మానవ మెదడు లో , వర్కింగ్ మెమరీ ఎట్లా పని చేసే విధానాన్ని చక్కగా వివరిస్తుంది ! 
ఒక్కొక్క భాగాన్నీ పరిశీలిద్దాం : 
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ :  చిత్రం లో ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ చూప బడింది. కానీ మెదడు లో  అట్లాగే ఒక బాక్స్ లా ఉండదు కదా ! కేవలం మనం గ్రహిస్తున్న విషయాలనన్నింటినీ , అనుసంధానం అంటే లింక్ చేస్తూ , పై ఎత్తున పరిస్థిని పరిశీలిస్తూ ఉంటుంది ! అంటే ఒక రకం గా సూపర్విజన్ అనుకోవచ్చు ! 
2. ఫోన లాజికల్ లూప్ : అంటే  శబ్ద గ్రాహక వలయం : అంటే,మనం,  ఏ విషయాన్నైనా చూస్తున్నప్పుడు , కేవలం ఆ విషయం గురించిన చిత్ర వివరాలు మాత్రమే కాక , ఆ సందర్భం లో మనకు వినబడే శబ్దాలను కూడా మన చెవులు గ్రహిస్తాయి !  ఈ వినడం అనే పని చేయడానికి , మనం ప్రత్యేకం గా  ఏమీ చేయక్కర్లేదు మన చెవులు అనేక రకాల శబ్దాలను వింటూనే ఉంటాయి కదా !   ఉదాహరణకు , మీరు టీవీ లో ఒక కార్యక్రమం శ్రద్ధగా చూస్తున్నప్పుడు , ఆ కార్యక్రమం లో పాత్రల సంభాషణ మాత్రమే కేంద్రీకరించ గలుగుతారు , మిగతా కుటుంబ సభ్యులు మీతోనే మాట్లాడుతున్నా , మీ దృష్టి , అంటే మీ సెంట్రల్ ఎగ్జిక్యుటివ్  ఆ శబ్దాల మీద కాక టీవీ లో పాత్రల సంభాషణలు మాత్రమే కేంద్రీకరించి వింటూ ఉండడం వల్ల !  అంతే కాకుండా , తక్కువ పవర్ కలిగిన కంప్యూటర్ లలో  మీరు పాటలు వింటూ , ఇంకో సైటు లోకి వెళ్దామని ప్రయత్నిస్తే , కంప్యూటర్ స్లో అయిపోతుంది ! అట్లాగే , రెండు , లేదా మూడు ప్రదేశాలనుంచి వచ్చే శబ్దాలను , మన మెదడు కూడా ఏక కాలం లో పూర్తి గా గ్రహించ లేదు ! 
3. విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ : మన మెదడు లోనే , ఇంకో చిత్తు పుస్తకం కూడా ఉంటుంది ! అంటే పుస్తకం కాదు , చిత్తు పుస్తకం లో మనం రాసుకునే పదాల లానూ , లేదా గీసుకునే చిత్రాల నూ ఒక చోట ఉంచే అమరిక ! ఉదాహరణకు , కంప్యూటర్ లో స్కెచ్ ప్యాడ్ లో మనం రాసుకోవచ్చు , గీసుకోవచ్చు కానీ , ఒక పేజీ లా ఆ గీసిన గీతలనూ , రాసిన మాటలనూ , కంప్యూటర్ నుంచే తీసుకోలేము కదా !  ఆ పనికి , మళ్ళీ కంప్యూటర్ ను ప్రింటర్ తో అనుసంధానం లేదా లింక్ చేస్తేనే కదా అవి ప్రింటు రూపం లో మనం చూడ గలిగేది ! అదే విధం గా , మనం చూసే దృశ్యం వివరాలను , అదే రూపం లో అంటే 3D రూపం లో కూడా మన మెదడు లోని విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ లో నిక్షిప్తం అయి ఉంటుంది ! ఇంకో ఉదాహరణ: మన ఇళ్ళలో లేదా , స్కూల్ కాలేజీ లలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అంటే ఒక రూం లోనుంచి , ఇంకో రూం లోకి వెళ్ళే సమయం లో మనం మన మెదడు లో ఉన్న ఈ ‘ విజియో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ ‘ ఆధారం గానే అడుగులు వేస్తాము ! 
4.  ఎపిసోడిక్ బఫర్ :  ఈ దశలో , మన మెదడు విన్న శబ్దాలనూ , చూసిన దృశ్యాలనూ  , కలగలిపే దశ !   అంటే మనం , ఫలానా రోజున , ఫలానా చోట , ఫలానా విషయాలు వింటూ , ఫలానా దృశ్యాలు కూడా అదే సమయం లో చూశాము అని గుర్తు చేసుకోవడడానికి , ఈ ఎపిసోడిక్ బఫర్ కారణం ! గమనించ వలసినది , పైన చెప్పుకున్న వాటిలో , 2,3,4   – ఇవన్నీ కూడా , 1 తో అంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ తో అనుసంధానం అయి ఉంటాయి !  అంటే ఈ 1 కనుక మనం ఎప్పటికప్పుడు వివిధ ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలను , సమగ్రం గా విశ్లేషించి , అవసరమైనవి ఉంచుకోవడం , అనవసరమైనవి వదిలేయడం చేయకపోతే , జ్ఞాపకాలు ,  కలకాలం ఉండలేవు ! 
పైన వివరించిన విషయాలు మరి విద్యార్ధికి ఏ రకం గా ప్రయోజన కరం ? : 
1. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్  సరిగా పనిచేయాలంటే ఏకాగ్రత అనివార్యం ! 
2. ఫోనలాజికల్ లూప్ క్రియా శీలం కావాలంటే , చెప్పే విషయాలను కేవలం చెవులప్పగించి వినడమే కాకుండా , మనసు కూడా లగ్నం చేసి , ఏకాగ్రత తో వింటే ,  ఆ జ్ఞాపకం ఎక్కువ కాలం మెదడు లో ఉంటుంది ! అంతే కాకుండా  తెలుసుకున్న విషయాలను పదే పదే  వల్లె వేస్తూ ఉంటే కూడా జ్ఞాపకాలు మెదడులో కేవలం దృశ్య జ్ఞాపకాలు గానే కాకుండా , శబ్ద జ్ఞాపకాలు గా కూడా మెదడు లో నిక్షిప్తం అవుతాయి ! అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు ‘ పైకి చదువు ‘ పైకి చదువు ‘ వినబడేట్టు చదువు , బాగా వస్తుంది చదువు ‘అంటూ ఉంటారు !  
3. విజయో స్పేషియల్ స్కెచ్ ప్యాడ్ కూడా :  మనం నేర్చుకునే విషయాలు , వాక్యాల రూపం లో కానీ , లేదా ఒక నమూనా చిత్రం రూపం లో కానీ ఉంటే , ఆ చిత్రం మనసులో అంటే మెదడులో చెరిగి పోకుండా ముద్ర వేసుకుంటుంది ! ఉదాహరణకు పైన ఉన్న చిత్రాన్ని , ఆ చిత్రం లేకుండా కేవలం , ఆ చిత్రం క్రింద ఇచ్చిన వివరణ మాత్రమే చదివి అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తే , జటిలం అవుతుంది కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా? 31.జ్ఞాపకాల రకాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 20, 2013 at 8:40 సా.

చదువుకోవడం ఎట్లా? 31.జ్ఞాపకాల రకాలు ! 

చదువు కోవడం లో,  మన జ్ఞాపక శక్తి కీలక మైన పాత్ర పోషిస్తుంది !  జ్ఞాపక శక్తి లోపిస్తే , ఒక పెద్ద పీపాలో , అడుగున  పెద్ద రంధ్రం ఉన్నా కూడా ,నీటితో పీపాను నింపడానికి చేసే ప్రయత్నం లాంటిది ,  మెదడులో విజ్ఞాన విషయాలు నింపుదామని ప్రయత్నించడం ! మునుపటి టపాలో సూచించినట్టు , జ్ఞాపక శక్తి కి అవసరమైన ఒక బిలియన్ నాడీ కణాలు అందరి మెదడు ల లోనూ ఉంటాయి ! ఇక  చేయవలసిందల్లా ,  ఆ నాడీ కణాలలో , జ్ఞాపకాల గుర్తులను ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే ! అంతే కాకుండా , ఒక గ్రామఫోను రికార్డు లోశబ్ద తరంగాలు నిక్షిప్తం అయి ఉంటే ,  ఆ రికార్డు లను,  ఒక నిర్ణీత సమయం లో , ఎట్లా ప్రత్యేక మైన రసాయన పదార్ధాలతో శుభ్రం చేయడం అతి ముఖ్యమైన చర్యో , అదే రకం గా , మెదడు లో ఏర్పడిన జ్ఞాపకాలను కూడా , ఒక క్రమ పధ్ధతి లో అమర్చుకోవడమే కాకుండా , నిర్ణీత సమయాలలో , ఆ జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం , అట్లా గుర్తుకు తెచ్చుకునే పరిస్థితి లో జ్ఞాపకాలను పదిల పరచుకోవడం కూడా  ఒక కీలకమైన చర్య ! ఆ పని ఎట్లా చేసుకోవాలో తెలుసుకునే ముందు , జ్ఞాపక శక్తి గురించి కొంత తెలుసుకోవడం ముఖ్యం ! 
మన మెదడు లో జ్ఞాపకాలు, ప్రధానం గా రెండు రకాలు గా నిక్షిప్తం చేయబడి ఉంటాయి ! ఒకటి తాత్కాలిక జ్ఞాపకాలు, రెండు శాశ్వత జ్ఞాపకాలు !
1. తాత్కాలిక జ్ఞాపకాలు, దీనినే వర్కింగ్ మెమరీ లేదా, షార్ట్ టర్మ్ మెమరీ అని కూడా అంటారు , కొన్ని స్వల్పమైన తేడాలతో !  ఈ తాత్కాలిక లేదా వర్కింగ్ మెమరీ , మనం నేర్చుకునే ప్రతి విషయం లోనూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది !   ఈ వర్కింగ్ మెమరీకి ,మనకు ఉన్న అన్ని ఇంద్రియాలూ తోడ్పడతాయి ! అంటే మన కళ్ళూ , చెవులూ ,స్పర్శా , ఇంకా మన నాసికాలూ ( అంటే ఆఘ్రాణించే శక్తి – అది కూడా ఒక ఇంద్రియమే కదా ! )  ఈ ఇంద్రియాలు మనం నేర్చుకునే సమయం లో, ఆ నేర్చుకునే విషయాలను అతి జాగ్రత్తగా , మెదడు లోని ‘ అరలలో ‘ పదిల పరచడానికి పనికి వస్తాయి ! ఉదాహరణకు , మీరు మీ స్నేహితుల టెలిఫోన్ నంబర్ అడిగితే , వారు చెబుతున్నప్పుడు ,  మీరు జ్ఞాపకం ఉంచుకునేదే వర్కింగ్ మెమరీ  !   ఆ నంబర్ కనుక యదాలాపం గా , అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా , కనుక నేర్చుకుంటే ,  కొద్ది క్షణాలలోనే మర్చిపోవడం జరుగుతుంది ! అదే, కొంత మంది , పని కట్టుకుని , ఆ ! ఆ ! ఏమన్నారూ? , 89735614   89 తరువాత 73 అన్నారా ?  83 73 తరువాత ఏమిటి 5614 కదా ?  ఓహో ! నేను ఇప్పుడు నంబర్ పూర్తి గా చెబుతాను సరిచేయండి ! 89735614 ! అదేనా? ! అని, అనేక సార్లు,  ఆ నంబర్ ను తరచి తరచి అడుగుతూ , నోట్ చేసుకుంటే , ఆ జ్ఞాపకం బలం గా మెదడు లో నిక్షిప్తం అవుతుంది !  దానిని నోట్ కూడా చేసుకుని , మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే , ఆ జ్ఞాపకం , శాశ్వత జ్ఞాపకం అవుతుంది ! 
2. శాశ్వత జ్ఞాపకం లేదా పర్మనెంట్ మెమరీ లేదా లాంగ్ టర్మ్ మెమరీ: ఈ రకమైన జ్ఞాపకాలు శాశ్వతం గా మెదడులో నిక్షిప్తం అయిపోతాయి ! నిజానికి ఈ శాశ్వత మెమరీ , లేదా పర్మనెంట్ మెమరీ లో జ్ఞాపకాలు , మొదట తాత్కాలికం గా మెదడు లో  నిక్షిప్తం చేయబడినవే ! వాటినే తరచుగా మననం చేసుకుంటూ ఉంటే , అవి శాశ్వత ప్రాతిపదికన మెదడు లో నిక్షిప్తం అవుతాయి !  
చదువుకోవడం లో, నేర్చుకోవడం లో ఏ జ్ఞాపకాలు ముఖ్యం ?:  చదువుకోవడం , జ్ఞానం సంపాదించడం అనే విషయాలు అనంతమైనవే కాకుండా , అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయి ! అంటే  ప్రతి సబ్జెక్ట్ లోనూ , ( నేర్చుకునే ) ప్రతి విషయమూ కూడా ఇతర విషయాలతో ముడి పడి ఉంటుంది !    ఈ విషయం మనసులో ఉంచుకుని , నేర్చుకునే వారికి , జ్ఞాన సముపార్జన సులభం అవుతుంది ! నేర్చుకోవడం లో ఈ రెండు రకాల జ్ఞాపకాలూ అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ! పరీక్షల కోసం చదివే చదువులు, కేవలం తాత్కాలికం గానే  మెదడు లో నిక్షిప్తం అయి , విద్యార్ధి కి సమస్యలు సృష్టిస్తాయి !    అందుకే , ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం చదువుతున్నా , ఏ విషయం నేర్చుకుంటున్నా , మూల సూత్రాలు నేర్చుకోవాలి ,  అని ప్రతి ఉపాధ్యాయుడూ చెబుతూ ఉంటారు ! అంటే కాన్సెప్ట్ లు  నేర్చుకోవడం ! ఈ మూల సూత్రాలు కనుక నేర్చుకుంటే, అవి శాశ్వతం గా మెదడు లో నిక్షిప్తం అయి ముందు ముందు కూడా పనికి వస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ?.30. మట్టి బుర్రలు ఉంటాయా?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 17, 2013 at 9:05 సా.

చదువుకోవడం ఎట్లా ?.30. మట్టి బుర్రలు ఉంటాయా? 

 
సామాన్యం గా, చదివినది అర్ధం చేసుకోలేని వారిని ‘ నీది  మట్టి బుర్ర ‘ అని ఉపాధ్యాయులు తిడుతూ ఉంటారు !  ‘ తిట్టడం’  అని ఎందుకు అనడం అంటే , ఉపాధ్యాయులకు , బుర్ర సంగతి తెలియదు కాబట్టి ! మరి, నిజం గానే మనుషులకు మట్టి బుర్రలు ఉంటాయా ?  మనం నేర్చుకోలేని విషయాలకూ  , జ్ఞాపకం ఉంచుకోలేని విషయాలకూ  మన మెదడు ను  తప్పు పడదామా ?  మెదడు చిన్నదనే వంక పెట్టి , చదువు కోవడం మానేద్దామా ? దీనికి సమాధానం: కాదు , కాదు , కాదు ! శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , అనేక  మైన విషయాల మీద,సూక్ష్మాతి సూక్ష్మమైన  భాగాల నిర్మాణాన్ని , నాడీ కణాల ధర్మాలనూ ,  కూడా, అతి విపులం గా   చిత్రాల ద్వారా నూ , ఫోటోల ద్వారానూ వివరించ  గలుగుతున్నారు శాస్త్రజ్ఞులు ! ప్రత్యేకించి , మెదడు లో నాడీ కణాల రకాలూ , అవి పని చేసే తీరూ కూడా, మానవులు, నేర్చుకునే సమయం లోనూ , గుర్తు చేసుకునే సమయం లోనూ , ఏరకమైన మార్పులు చెందుతాయో , ఆ  నాడీ కణాల మధ్య ఏ యే జీవ రసాయన చర్యలు జరిగి ,  ఆ మార్పులు, జ్ఞాపకాలు గా, ఎట్లా మారుతాయో కూడా చాలా వరకూ తెలుసుకోగలిగారు, శాస్త్రజ్ఞులు ! 
మరి, మానవ మెదడు సామర్ధ్యం  ఏమిటి? :
మానవ మస్తిష్కం లో, ఒక  బిలియన్ నాడీ కణాలు ఉన్నాయి !  ప్రతి ఒక్క కణమూ , కనీసం, ఒక వెయ్యి కనెక్షన్ లు కలిగి ఉంటుంది !  అంటే  ఒక బిలియన్ కణాలు ( ఒక్కో కణం వెయ్యి కనెక్షన్ లు కాబట్టి  ) ఒక ట్రిలియన్ కనెక్షన్ ల తో అనుసంధానమై ఉన్నాయన్న మాట ! ఒక్కొక్క నాడీ కణమూ , ఒక్కొక్క విషయాన్నే నిక్షిప్తం చేస్తే , మన మెదడు లో ఉండే , జ్ఞాపక సామర్ధ్యం  ఒక పరిమితి లోనే ఉంటుంది ! కానీ వాస్తవం గా జరిగేది,  ఒక్కో నాడీ కణమూ , అనేక ఇతర నాడీ కణాలతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి అనేక జ్ఞాపకాలను ఒకే సమయం లో నిక్షిప్తం చేయగలగడమే కాకుండా , జ్ఞాపకం అంటే గుర్తు కు తెచ్చుకో గలదు కూడా !  ఈ లెక్కన మానవ మస్తిష్కం లో మనం నిలువ చేసుకునే జ్ఞాపకాల సంఖ్య 2.5 పెటా బైట్లు ! లేదా ఒక మిలియన్ గిగా బైట్ ల జ్ఞాపకాలు !  ఈ పెటా బైట్లూ , గిగా బైట్లూ  ఎవరికి కావాలి ? ‘ మన బుర్ర సంగతి తెలుసుకోవాలి కానీ’ అనుకునే వారికి ఈ క్రింద వివరించిన పోలిక ఉపయోగ పడుతుంది !
మన మెదడు కనుక డిజిటల్ వీడియో రికార్డర్ అనుకుంటే , మూడు మిలియన్ గంటల రికార్డింగ్ తో సమానం, మన జ్ఞాపక సామర్ధ్యం ! ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , మన మెదడులో ఉన్న జ్ఞాపక  సామర్ధ్యం, డిజిటల్ రికార్డర్ లో నిక్షిప్తం చేయబడి ఉంటే , దానిని మళ్ళీ టీవీ లో సంపూర్ణం గా ప్లే చేయాలంటే, అక్షరాలా మూడు వందల సంవత్సరాలు పడుతుంది ! అంతటి జ్ఞాపక సామర్ధ్యం ఉంది , మానవ మస్తిష్కానికి ! మరి మన బుర్రలను మట్టి బుర్ర లనుకుందామా ???!!! ముమ్మాటికీ కాదు ! మరి మన మెదడు కు ఉన్న ఇంతటి సామర్ధ్యాన్ని, ఎట్లా మెరుగు పరుచుకోవచ్చో ,  దానిని మనకు ఉపయోగపడే జ్ఞాపకాలకు ఆలవాలం గా చేసుకోవచ్చో , మన బంగారు మెదడు లో జ్ఞాపకాల గనులను ఎట్లా నిక్షిప్తం చేసుకోవచ్చో కూడా తెలుసుకుందాం, తరువాత టపాలలో ! 
 
 

చదువుకోవడం ఎట్లా?29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 16, 2013 at 12:28 సా.

చదువుకోవడం ఎట్లా?. 29. వత్తిడి నివారణకు, దీర్ఘ కాలిక పధకం ఏమిటి? 

మునుపటి టపాలో, తీవ్రమైన హానికరమైన వత్తిడి , చదువుకునే సమయం లో విద్యార్ధులకు కలిగితే , ఆ వత్తిడిని వారూ , వారి తల్లి తండ్రులు కూడా , ముందే కనిపెట్టి , నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ! మరి  దీర్ఘ కాలిక పధకం ఏమైనా ఉపయోగ పడుతుందా , ఈ రకమైన హానికరమైన వత్తిడి నివారించుకోడానికి ?
మనం ముందే తెలుసుకున్నాం , సామాన్యమైన వత్తిడి , అంటే యూ స్ట్రెస్  , మనకందరికీ ప్రేరణ అంటే స్టిమ్యులస్ కలిగించి , కర్తవ్యోన్ముఖులను చేస్తుంది ! అంటే వత్తిడి కొంత వరకూ మన నిత్య జీవితం లో మంచిదే ! కేవలం ఆ వత్తిడి తీవ్రత మన నిత్య జీవితాన్ని ప్రభావితం చేసి ,  మన రొటీన్, అంటే రోజు వారీ కార్యక్రమాలను , అవక తవక చేస్తున్నప్పుడే , ఆ రకమైన స్ట్రెస్ , హానికరమైన డి స్ట్రెస్ గా మారుతుంది ! 
మరి ఈ హాని కరమైన వత్తిడి నివారణకు , దీర్ఘ కాలిక పధకం ఏమిటి? 
1. వత్తిడి లక్షణాలు గమనించడం :  ఈ లక్షణాలు గమించడం గురించి ముందే చాలా వరకూ తెలుసుకున్నాం కదా ,  విద్యార్ధులు ప్రత్యేకించి  ఏ పరిస్థితులు తమకు వత్తిడి కలిగిస్తున్నాయో  గమనించాలి !  భారత దేశం లో ప్రాధమిక విద్య  నేర్చుకునే విద్యార్ధులూ , మాధ్యమిక విద్య, అంటే ప్రైమరీ , సెకండరీ స్కూల్ విద్యార్ధులు ,అనేక రకాలు గా వత్తిడి కి గురౌతూ ఉంటారు, ఉన్నారు కూడా ! వారి వారి ఉపాధ్యాయులు , అందరూ కాక పోయినా , కొందరైనా , వారికి, ఏదో తెలియని మానసిక వత్తిడి కలిగిస్తారు !  ఒక సారి ,  విద్యార్ధిని తీవ్రం గా మంద లించడమో , లేదా కొన్ని సమయాలలో భౌతికం గా తీవ్రమైన  పనిష్మెంట్ ఇవ్వడమో చేశాక ,  ఆ విద్యార్ధులు, తరువాత ఆ టీచర్ కనిపించినప్పుడు కానీ , ఆ టీచర్ క్లాసు ఉన్న సమయం లో కానీ , తీవ్రమైన వత్తిడి కి మళ్ళీ మళ్ళీ గురి అవడం జరుగుతూ ఉంటుంది !  అది విద్యార్ధి ఏకాగ్రత కూడా  లోపించ వచ్చు !  , మనసు కేంద్రీకరించి నేర్చుకోవడం కష్టమవుతుంది, ఆ పరిస్థితులలో ! విద్యార్ధి కి నచ్చని సబ్జెక్ట్  చెప్పే టీచర్ వచ్చినపుడు కానీ , ఆ సబ్జెక్ట్ కు చెందిన  పరీక్ష లు ఉన్నప్పుడు కానీ ,  వత్తిడి చెందడం కూడా సామాన్యం గా జరుగు తుండే విషయమే !  ఆ యా సందర్భాలలో విద్యార్ధులు అనుభవించే వత్తిడి,  ‘ నేను వస్తున్నాను కాచుకోండి ‘ అని వారికి చెబుతూ రాదు కదా !  విద్యార్ధులు వారి కండరాలు బిగుతు గా అంటే,  టెన్స్ గా అవడమూ , భుజాలు డీలా గా ఉండక టెన్స్ గా బిగుతుగా ఉండడం , కొన్ని వత్తిడి సమయాలలో తల నొప్పి గా ఉండడం లాంటి లక్షణాలు  మాత్రమే కనబడుతూ ఉంటాయి !   
2. చంకింగ్ chunking  తో వత్తిడి తగ్గించుకోవడం ! : ఈ చంకింగ్ అనే పదం మానసిక శాస్త్రం లో కూడా ఉపయోగించే ఒక పదం.   అంటే  నేర్చుకోవడం అనే చర్య మనం ఒక పెద్ద  ముక్క కాకుండా , చిన్న చిన్న ముక్కలు గా నేర్చుకుంటే  త్వరగా నూ , ఎక్కువ గానూ అర్ధం అవుతుందని అనేక పరిశోధనల వాళ్ళ ఋ జువయింది ! 
ఉదాహరణకు : విద్యార్ధి  ఒక పది పేజీలు  ఉన్న పాఠాన్ని  ఒక్క రోజులో నేర్చుకుందామని కూర్చోడం , వత్తిడి కి కారణం అవగలదు ! అదే ,  పది పేజీలనూ , అయిదు రోజుల్లో, రోజుకు రెండు పేజీలు  గా నేర్చుకుంటే , నేర్చుకోవడం ఎక్కువ  లాభదాయకం గా ఉండడం ( అంటే ఎక్కువ భాగం అర్ధమవడమే కాకుండా , ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది కూడా ! ) కాక వత్తిడి కూడా  కంట్రోలు లో ఉంటుంది , ! 
3. పనులు దాట వేయడం, అంటే వాయిదా వేయడం మానుకోవాలి : ఈ విషయం, చెప్పడానికి సులభమే కానీ ఆచరణ కష్టం ! కానీ అసాధ్యం కూడా కాదు కదా !  పైన చెప్పిన విధం గా నేర్చుకునే విషయాలను చంకింగ్ చేయడం ఎంతో లాభదాయకం కానీ  పై ఉదాహరణ లో ఏరోజు చదవ వలసిన రెండు పేజీల పాఠాన్నీ , ఒక్క రోజు వాయిదా వేసినా కూడా , మరునాటికి అది, నేర్చుకోవలసిన నాలుగు పేజీల పాఠం అవుతుంది కదా !  ఈ సూత్రమే అన్ని పనులలోనూ వర్తిస్తుంది !  అత్యవసర పరిస్థితులలో తప్పించి, మిగతా సమయాలలో , చీటికీ మాటికీ , ఆ రోజు చేయవలసిన పనులు , చదివి నేర్చుకోవలసిన పాఠాలు వాయిదా వేయడం, వత్తిడి తీవ్రత ను పెంచుకోవడమే ! 
4. వీలు కాదని చెప్ప గలగడం :  విద్యార్ధి జీవితం లో , అనేక మైన వత్తిడులు కలుగుతూ ఉంటాయి ! చాలా సమయాలలో , మంచి గుణాలతో , ఇతరులకు సహాయం చేయాలనే గుణం తో ఉన్న చాలా మంది విద్యార్ధులను , మిగతా వారు అలుసుగా తీసుకుని , చీటికీ మాటికీ , వారికి చిన్నా చితకా పనులు చెబుతూ ఉంటారు ! విద్యార్ధులు , మొహమాటానికి పోయి , ఒక్కొక్కరు చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ తృప్తి చెందుతూ ఉంటారు ! కానీ ఈ చిన్న చిన్న పనులన్నీ కలిసి, ఎక్కువ సమయం తీసుకుని , విద్యార్ధి చదువు మీద కేంద్రీకరించే సమయాన్ని తక్కువ చేస్తాయి !  పర్యవసానం గా , విద్యార్ధి ,  పాఠాలు నేర్చుకోవడం లో వెనక బడడమూ , వత్తిడి తీవ్రత ఎక్కువ అవడమూ కూడా జరుగుతాయి !  అందువల్ల , ప్రతి విద్యార్ధీ ,  తాము చేసే సహాయాలు మంచివే అయినప్పటికీ , ఎప్పుడూ ప్రాముఖ్యత , వారి చదువు కే ఇచ్చి , మిగతా పనులు తాము చదువుకోవలసి ఉండడం వల్ల చేయలేక పోతున్నామని స్పష్టం గా , ఆ సహాయం అడిగే వారికి చెప్పడం అలవాటు చేసుకోవాలి ! 
5. ఆరోగ్యం అశ్రద్ధ చేయకూడదు : సమతుల్యమైన ఆహారం క్రమం గా తీసుకోవడం , క్రమం గా తగినంత నిద్ర పోవడం ,  క్రమం గా  వ్యాయామం చేయడం , చెడు అలవాట్లకు దూరం గా ఉండడం , ఈ నాలుగు సూత్రాలూ , విద్యార్ధి ఆరోగ్యాన్ని  సంపూర్ణం గా ఉంచడమే కాకుండా , హానికరమైన వత్తిడికి దూరం చేసి , సామాన్యమైన, రోజు వారీ వత్తిడులు తట్టుకునే సామర్ధ్యం కలిగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

చదువుకోవడం ఎట్లా? 28. వత్తిడి కి చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 15, 2013 at 10:33 సా.

చదువుకోవడం ఎట్లా? 28. వత్తిడి కి చికిత్స ఏమిటి ?

 

మునుపటి టపాలో , విద్యార్ధులు , సామాన్యం గా , సహజం గా చదువుకునే సమయం లో వచ్చే వత్తిడి, అంటే ‘ యూ స్ట్రెస్’ నుంచి , అసహజం గా , హానికరం గా మారే డి స్ట్రెస్, లేక తీవ్రమైన వత్తిడి ని ఎట్లా గమనించాలో తెలుసుకున్నాం కదా ! ఈ పని చేయడం చాలా ముఖ్యం, ఈ రెండో రకమైన వత్తిడి అనేక రకాలు గా విద్యార్ధులకు హాని కరం కాబట్టి ! ముందుగా ఈ రెండు రకాల వత్తిడి లక్షణాలూ పరిశీలించి , హానికరమైన వత్తిడిని అనుభవిస్తూ ఉంటే , దానిని ఆమోదించే స్థితి లో ఉండాలి ! సామాన్యం గా ఈ రెండు రకాల వత్తిడు లకూ తేడా చాలా స్వల్పమనిపిస్తుంది ! ఎందుకంటే విద్యార్ధులు మానసిక వైద్యులు కాదు కాబట్టి !
ఇక చేయవలసిన దేంటో తెలుసుకుందాం !
1. బాగా ఊపిరి తీసుకోవడం అంటే డీప్ బ్రీదింగ్ : కొన్ని నిమిషాల పాటు , నిదానం గానూ , బాగా దీర్ఘం గానూ , ఊపిరి తీసుకుంటే , రక్తం లో కలిసిన ప్రాణవాయువు , మెదడు కు చేరి , మెదడు లో కణాలకు కూడా ప్రాణ వాయువునిస్తుంది ! మరి మిగతా టైం లో మనం పీల్చేది ప్రాణ వాయువు కాక మరేంటి ? అని ప్రశ్నించ వచ్చు విద్యార్ధులు ! తీవ్రమైన వత్తిడి అనుభవిస్తూ ఉన్నప్పుడు , మానసికం గా, టెన్షన్ లేదా వత్తిడి కి గురవటం వల్ల , కండరాలన్నీ సంకోచించి, అంటే కాంట్రాక్ట్ అయి ఊపిరి పీల్చుకుంటున్నా కూడా వంద శాతం మెదడు కు ప్రాణ వాయువు చేరక , ఆ వత్తిడి లక్షణాలు ఇంకా ఎక్కువ అని పిస్తాయి ! ఆ సమయం లో దీర్ఘం గానూ నిదానం గానూ ఊపిరి పీలుస్తే, ఊపిరి తిత్తుల్లోకి , వత్తిడి సమయం లోకంటే ఎక్కువ ప్రాణవాయువు చేరి , మెదడు కణాలకు కూడా అంద గలదు !
మరి ఈ ఊపిరి తీసుకోవడం ఎట్లా చేయాలి ?
కుర్చీలో కూర్చుని కానీ , లేదా ఒక సోఫాలోనో , బెడ్ మీదో పడుకుని కానీ , చేతులు రెండూ , పొట్ట మీద ( నాభి కి క్రిందగా ) పెట్టి ( బిగుతుగా కాదు ) దీర్ఘం గా ఊపిరి లోపలి తీసుకోవాలి అంటే ఉచ్వాస ఇన్ స్పి రేషన్ అని అంటారు ! వీలైనంత సమయం అట్లా లోపలి గాలి పీల్చి , కొన్ని క్షణాలు ఊపిరి తిత్తుల లోనే బిగ బట్టి ఉంచి , తరువాత నిదానం గా బయటకు వదలాలి , ఈ బయటకు గాలి వదిలే చర్యను నిశ్వాస అనీ ఎక్స్ పిరేషన్ అనీ అంటారు ! ఇట్లా డీప్ ఇన్ స్పిరేషన్ – కొన్ని క్షణాలు బిగ బట్టడం – ఎక్స్ పిరేషన్ —– > చర్యలను కొన్ని మార్లు చేస్తే , మెదడు ప్రశాంత త పొందుతుంది ! మనసు స్థిమిత పడుతుంది ! ఆలోచనలు పరుగెత్త కుండా , విచక్షణ తో నూ
ఒక క్రమ పధ్ధతి లోనూ ఆలోచించ గలుగుతారు !
సీన్ మార్చడం : అంటే ఒకే చోట ఉండి పోయి , ఆలోచనలన్నీ గజి బిజి గా అయిపోయి , ఆందోళన మితి మీరి పోతున్న సమయం లో , ఆ పరిస్థితులకు ఆల వాలం గా ఉన్న , ఆ పరిసరాల నుంచి కొంత దూరం వెళ్ళడం, కనీసం తాత్కాలికం గానైనా , శేయస్కరం !
ఉత్పత్తి ఎక్కువ చేయడానికి , విరామం తప్పని సరి : మనం చేసే పని ఏదైనా , మారథాన్ లా , చేసుకుంటూ నే పోతూ ఉంటే , అలసట త్వరగా కలుగుతుంది ! అంటే ఫటీగ్ ! మన శరీరం లో ఉన్న కండరాలూ , మెదడు లోని కణాలూ కూడా ఈ అలసట చెందుతాయి ! అనేక రకాలైన జీవ రసాయన చర్యలు వడి వడి గా జరుగుతూ , అనేక హానికరమైన వాయువులతో పాటుగా , మలినాలు కూడా రక్తం లోనూ , తద్వారా , మూత్ర పిండాలనూ , కాలేయాన్నీ చేరుతూ ఉంటాయి ! విరామం అసలు తీసుకోక పొతే , కండరాలకూ , మెదడు కూ కూడా పని వత్తిడి ఎక్కువ అవుతుంది ! ఒక రాత్రి సామాన్యం గా నిద్ర పోయేఏడు గంటల కన్నా తక్కువ గా అంటే నాలుగు గంటలు మాత్రమే, నిద్ర పోయిన సమయాలలో , ఎప్పుడైనా పరిశీలించారా మన పర్ఫామెన్స్ ఎట్లా ఉంటుందో , ఆ మరునాడు ! అదే ఆ మరునాటి రాత్రి పది గంటలు నిద్ర పోయి ఆ మరు నాడు ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతామో కూడా మనకందరికీ తెలుసుకదా ! అందు వల్లనే విరామం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది !అది, పరీక్షల ముందు సమయానికి కూడా వర్తిస్తుంది ! సామాన్యం గా విద్యార్ధులు, తాము ఒక రెండు గంటలు , తమ పని ఆపి విరామం తీసుకుంటే , తమ అమూల్యమైన కాలం వృధా చేసుకుంటున్నట్టు ఆత్మ న్యూ నతా భావం అంటే గిల్టీ గా ఫీల్ అవుతారు ! ఆ కారణం చేత , వారు ఎక్కువ సమయం పుస్తకాలతో గడుపు తున్నా కూడా , క్వాలిటీ లెర్నింగ్ అంటే , ఒక ప్రామాణికమైన విద్యార్జన చేయలేరు ! ఈ విషయం గమనించి , సరి అయిన సమయం లో సరిపడినంత విరామం తీసుకుంటూ , డి స్ట్రెస్ కు దూరం గా ఉండాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

చదువుకోవడం ఎట్లా ?27. విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ )

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 13, 2013 at 7:32 సా.

చదువుకోవడం ఎట్లా ?27.   విద్యార్ధులూ – వత్తిడీ ( స్ట్రెస్ ) 

 
చదువుకోవడం వత్తిడి తో కూడుకున్న పని ! ఎందుకంటే , చదువుకోవడం అనే పని లో , మనసు పూర్తి గా లగ్నం చేసి తదేకం గా చదువుతూ , నేర్చుకుంటూ , నేర్చుకున్న విషయాలను మర్చి పోకుండా , మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ ,  ఇట్లా అనేక రకాలైన పద్ధతులను అనుసరించుతూ, శ్రమించడం , తప్పకుండా వత్తిడి కలిగించే చర్యే ! ఈ నేర్చుకోవడం ఒక రకం గా వత్తిడి అవుతే , పరీక్షలకు సిద్దమవడం ఇంకో రకం గా వత్తిడి కలిగిస్తుంది ! 
వత్తిడి వత్తిడి వత్తిడి ! స్ట్రెస్,  స్ట్రెస్,  స్ట్రెస్, ఇట్లా లేచిన దగ్గర నుంచి పడుకో బోయే ముందు దాకా,  విద్యార్ధులను వదలదు,  ఈ స్ట్రెస్ ! చాలా మంది విద్యార్ధులను నిద్రలో కూడా పట్టుకుంటుంది ఈ స్ట్రెస్ !  మరి ఈ స్ట్రెస్ కధా కమామీషు ఏమిటి ?  విద్యార్ధులు అంత గా భయ పడే స్ట్రెస్, నిజంగానే ,  అంత ప్రమాద కరమైనదా ? ఈ సంగతులు తెలుసుకోవడం , కేవలం విద్యార్థులకే కాక వారి తల్లి దండ్రులు కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ! 
వత్తిడి, లేదా స్ట్రెస్ కలగడం సంపూర్ణం గా సహజమైన చర్యే !  వత్తిడి ని అనుభవిస్తూ ఉన్న విద్యార్ధులు , వారు వత్తిడి మూలం గా చదవ లేక పోతున్నామని కానీ ,  పాఠాలను సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నామనీ అనుకుంటే , అది పూర్తి గా పొరపాటే ! కారణం : స్ట్రెస్ లేదా వత్తిడి, సహజమైన పరిణామం కాబట్టి ! ఈ సహజమైన వత్తిడి లేదా స్ట్రెస్ ను యూ స్ట్రెస్ అంటారు ! ఈ రకమైన స్ట్రెస్ , ఆశావాద జనితమైన వత్తిడి ! ఈ రకమైన వత్తిడి తో , మానవులు తమ కర్తవ్యానికి ఊపు లేదా ఊతం దొరికినట్టు అనుభూతి చెందుతారు ! అంటే వారికి , వారు చేస్తున్న పనులలో ఆసక్తి పుడుతుంది ! పుట్టిన ఆసక్తి ,  పెరుగుతుంది కూడా !  ఇంత లాభ దాయకమైన స్ట్రెస్ కాబట్టే , అందరు మానవులూ , తమ తమ పురోగతి కోసం, ఈ రకమైన వత్తిడి ని అనుభవిస్తూ ఉంటారు ! ఇంత వరకూ బాగుంది ! 
ఇక ఇంకో రకమైన స్ట్రెస్ లేదా వత్తిడి ఉంటుంది !  డి స్ట్రెస్ లేదా నిరాశా జనకమైన స్ట్రెస్ అని ఇంకోటి ! ఈ రకమైన స్ట్రెస్ విద్యార్ధుల ఉత్సాహాన్ని నీరు గార్చి , వారి పర్ఫామెన్స్ ను తగ్గిస్తుంది ! ఈ రకమైన స్ట్రెస్ , అదే డి స్ట్రెస్ , విద్యార్ధుల పురోగతి కి అవరోధం అవుతుంది ! 
మరి సహజమైన స్ట్రెస్ కూ , హాని కరమైన ( డి ) స్ట్రెస్ కూ తేడా ఎట్లా కనుక్కోవాలి ? :
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న !  విద్యార్ధులూ , వారి తల్లి దండ్రులూ కూడా తప్పని సరిగా తెలుసుకోవలసిన విషయం ! సహజమైన స్ట్రెస్ తాత్కాలికమైనది ! అంటే , అది సందర్భానుసారం గా పెరుగుతూ  ఉంటుంది !  ఆ సందర్భం దాటాక , ఒక్క సారిగా ఒక భారీ వర్షం వచ్చి , ఆగినట్టు అనుభూతి కలుగుతుంది ! ఆ సందర్భాలు అనేక రకాలు గా ఉండ వచ్చు !  పరీక్షలు కావచ్చు , భయానక సంఘటనలు కావచ్చు ! ఇంట్లో , తరచూ తల్లి దండ్రుల మధ్యా , లేదా తమ్ముళ్ళ , అక్క చెల్లెళ్ళ మధ్య జరిగే వాగ్వివాదాలూ , ఘర్షణలూ కూడా కావచ్చు ! ఇట్లా  అనేక రకాల వత్తిడి కి గురైన మనసులో , ఆ సంఘటనలు అదృశ్యమవ గానే , ఒక్క సారిగా వాన వెలిసినట్టు అనుభూతి కలుగుతుంది ! ఆ పరిస్థితి లో మనం , ఏ మాత్రమూ వత్తిడి లేకుండా , సంపూర్ణం గా విశ్రమించ గలం , మిగతా కార్యక్రమాలలో , పరిగెత్తకుండా , అంటే కేవలం దేహం లోనే కాక మనసులో కూడా ఏ రకమైన  ఆతృతా లేకుండా, రిలాక్స్ అవ గలుగు తాము !  ఈ తాత్కాలిక వత్తిడి కలిగించే సంఘటనలలో, మన దేహం లో కలిగే అనేక జీవ రసాయన చర్యలు కూడా , తాత్కాలికమే అవుతాయి ! 
కానీ, హాని కరమైన వత్తిడి లేదా డి స్ట్రెస్ లో , ఈ సంఘటనలు చాలా తరచు గా జరుగుతూ ఉంటాయి ! అంటే ఒక రకంగా , మానవులు , తీవ్ర మైన వత్తిడి తరచూ అనుభవిస్తూ , ఇతర సామాన్య సంఘటనలకు కూడా ,వారు విపరీతమైన వత్తిడి చెందుతూ ఉంటారు !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే ,  మానవుడి మెదడు లో ఉండే వత్తిడి కి స్పందించే అలారం, పెద్ద వత్తిడీ , చిన్న వత్తిడీ అనే భేదం లేకుండా , ఒకే రకం గా పెద్దగా  మోగుతుంది అంటే రియాక్ట్ అవుతుంది !  తదనుగుణం గా దేహం లో, మెదడు లో అనేక జీవ రసాయన చర్యలు కూడా ! పర్యవసానం గా ఆ తాత్కాలిక వత్తిడి కాస్తా దీర్ఘ కాలిక వత్తిడి గా పరిణామం చెందుతుంది !  ఈ వత్తిడి అనుభవించే వారు తరచూ , తలనొప్పుల తోనూ , చిన్న పాటి పనులు చేస్తేనే అలసట చెందుతూ నూ , కడుపులో తిప్పినట్టు గా ఉండడమూ , తిన్నది అరగక పోవడమూ లాంటి లక్షణాలే కాకుండా , పదే పదే పళ్ళు కొరకడమూ , లేదా వారి చేతి వేళ్ళ గోళ్ళు మొదలంటా కొరుకుతూ ఉండడమో  కూడా చేస్తారు ! వారు చేసే పనులలో , ఏకాగ్రత కోల్పోతూ ఉంటారు !  దానితో తరచూ , తిక మక పడుతూ ఉంటారు !  అంతకు ముందు మితం గా తినే వారు ,  ఎడా పెడా కనిపించిందల్లా , అంటే చిరుతిళ్ళూ , అసలు భోజనమూ , ఎక్కువ గా తింటూ ఉంటారు ! అనేక రకాలైన కూల్ డ్రింక్స్ ఎక్కువ గా తాగుతూ ఉంటారు ! తరచూ ఎక్కువ గా వత్తిడి కలుగుతూ ఉంటే , వారి రోగ నిరోధక శక్తి తగ్గి పోయి ,వారికి తరచుగా , జలుబులూ , పడిశాలూ , తుమ్ములూ , దగ్గులూ వచ్చి , ఆందోళనతో , శ్వాస ఎగ పీల్చడమూ ,  కండరాలు టెన్షన్ తో, బిగుతు గా అవడమూ, నొప్పులు కలగడమూ కూడా సంభవిస్తూ ఉంటాయి !  
ఈ రకమైన స్ట్రెస్ ను వదిలించుకోడానికి మార్గం లేదా ? :  తప్పకుండా ఉంది !  ముందుగా తెలుసుకోవలసినది , పైన వివరించిన విధం గా, ఏది ఆరోగ్యకరమైన వత్తి డో , ఏది హాని కరమైన వత్తి డో , గ్రహించడం !  వచ్చే టపాలో , ఈ హాని కరమైన వత్తిడి నివార ణో పాయాలు తెలుసుకుందాం ! 

చదువుకోవడం ఎట్లా ? 26. పరీక్షలయ్యాక, కర్తవ్యం ఏమిటి ? (2)

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 12, 2013 at 7:42 సా.

చదువుకోవడం ఎట్లా ? 26. పరీక్షలయ్యాక కర్తవ్యం ఏమిటి ? (2) 

పాఠ్య పుస్తకాలను పదిల పరుచుకోవడం  :  సామాన్యం గా , పరీక్షలు అయిపోగానే , ఒక పెద్ద భారం తల మీద నుంచి దిగినట్టు ,  ‘ ఎంతో కష్ట పెట్టిన ‘ పాఠ్య పుస్తకాలను , త్వరగా భౌతికం గా వదిలించు కునే ప్రయత్నం చేస్తారు ! అంటే , ఎవరికైనా ఇవ్వడమో , లేదా సెకండ్ హాండ్ షాప్ లో అమ్మడమో ! 
కానీ మూల సూత్రాలన్నీ , ఉండి , మీరు అండర్ లైన్ చేసుకోవడమూ , లేదా మీకు పాఠ్య పుస్తకాలలోనే నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే , అట్లా రాసుకున్న  పాఠ్య పుస్తకాలు , మీరు చదివినదే మళ్ళీ మళ్ళీ చదవడానికి ఎంతో ఉపకరిస్తుంది !  విద్యార్ధులు గమనించ వలసినది , ప్రతి తరగతి లోనూ ఉన్న సిలబస్ ఆ పై తరగతి లో ఉపయోగ పడుతుంది !  అంటే భౌతికం గా ప్రతి పాఠ్య పుస్తకమూ , వేరు గా ఉన్నా కూడా , ఆ వివిధ పాఠ్య పుస్తకాలలో ఉన్న పాఠాలూ , విషయాలూ , ఒక క్రమ పద్ధతిలో గొలుసు లో వలయాల లాగా సంధించ బడి ఉంటాయి ! ఇట్లా సంధించ బడిన విషయాలను , ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే విద్యార్ధులు , తమ మెదడు లో కూడా , అదే పధ్ధతి లో అమర్చు కుంటే , ప్రతి సబ్జెక్టూ కూడా , చాలా సులువవుతుంది నేర్చుకోవడానికీ , రివైజ్ చేయడానికీ కూడా !  రివైజ్ చేయడం అవసరం అయితే , ఇంకో , ఇంకో పుస్తకం లో చూడడం కాకుండా , మనం చదివి అర్ధం చేసుకున్న పాఠ్య పుస్తకం లోనుండే మళ్ళీ చదువుకుంటే ,  ఎంతో సులభం అవుతుంది ! అంతే కాక , ఒక్కో సారి ,  ఆ పాత పుస్తకాలలో , పాఠాలు చదివే సమయం లో మంచి అనుభూతులు కూడా గుర్తు కు వస్తూ ఉంటాయి !  ఆ టీచర్ ఇట్లా చెప్పే వాడనో , లేదా ఆ  టీచర్ అట్లా బోధించేదనో !  కేవలం అసలు వాటి అవసరమే లేదనుకునే పరిస్థితి లోనే , పాఠ్య పుస్తకాలను వదిలించు కోవడం చేస్తే మంచిది ! కొంత వరకూ ఆర్ధిక కారణాల వల్ల కూడా , ఒక తరగతి లో చదివిన పుస్తకాలను , మార్చి , లేదా అమ్మి , ఇంకో తరగతి పుస్తకాలను కొనడం జరుగుతుంది కూడా ! అది తప్పని సరి పరిస్థితి కానీ , స్థోమత ఉన్న వారు , పాఠ్య పుస్తకాలను వారి వ్యక్తి గత గ్రంధాలయం లో పదిల పరుచు కుంటేనే ఉత్తమం ! 
రాసిన నోట్సు ను పదిల పరుచుకోవడం : పాఠ్య పుస్తకాల విషయం ఏం చేసినా కూడా , నోట్సు ను మాత్రం , తప్పనిసరిగా పదిల పరచుకుంటే ఉపయోగాలు చాలా ఉంటాయి ! ఎందుకంటే , పాఠ్య పుస్తకాలు చదివి , అర్ధం చేసుకున్న విషయాలను సంగ్రహం గా నోట్సు లో మీరే రాసుకోవడం జరుగుతుంది కాబట్టి , మీకు అవసరమైనప్పుడల్లా ,ఆ నోట్సు లో చదివి , ఆయా  పాఠ్యాం శాలను రివైజ్ చేసుకోవచ్చు ! 
కంప్యూటర్ మీద చేసిన మీ వర్క్ ను కూడా : జాగ్రత్తగా ఒక   సీడీ రూపం లోనో , లేదా పెన్ డ్రైవ్ లలోనో లేబెల్ చేసి,(పేరూ , తారీఖూ చెరగని ఇంకు తో రాసి) పదిల పరుచుకోవడం ఉత్తమం ! కంప్యూటర్ లో స్పేస్ కూడా ఏర్పడుతుంది ! 
పాసయినా , ఫెయిలయినా,   లక్ష్యం,  ముందుకు పోవడమే అవ్వాలి ! 
పరీక్షలు ఎంతో ముఖ్యమైన మైలు రాళ్ళు , జీవిత పధం లో ! ఆ  మైలు రాళ్ళను నడిచే వారూ దాట గలరు , పరిగెత్తే వారూ దాట గలరు , వాహనం మీద వెళ్ళే వారూ దాట గలరు ! పాసయిన వారూ దాట గలరు , ఫెయిల్ అయిన వారూ దాట గలరు !  వారు అనుకున్న , నిర్ణయించు కున్న లక్ష్యాలను చేరుకోగలరు ! చరిత్ర పుటల్లో , చదువు తో సంబంధం లేకుండా కూడా , జీవితం లో ఎంతో ముందుకు పోయిన వారూ , ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారూ,  కోకొల్లలు !  ఫలితాలతో నిమిత్తం లేకుండా , కేవలం, జీవితం విలువను గ్రహిస్తూ, ఆ  జీవితం లో విజయం సాధించాలనే కృత నిశ్చయం తో నో , ఆశావాదం తోనూ కృషి చేసిన వారే  విజయులయ్యారు ! అనేక పరిస్థితుల వల్ల , అనేక లక్షల మంది , చదవ లేక పోవచ్చు , లేదా చదివి ఉత్తీర్ణులు కాలేక పోవచ్చు. అది నేరం కాదు ! అది కేవలం కొన్ని అవకాశాలను కోల్పోవడం మాత్రమే ! ఆశావాదం తోనూ , సాధనతోనూ , శోధన చేసే వారికి , ప్రపంచమంతా అవకాశాలు ఎన్నో ఉంటాయి ! విద్యార్జన , ఒక ఉత్తమ మానవుడిగా తయారు చేస్తే , ఆ విద్య సార్ధకమయినట్టే కదా ! కాగితాల మీద ఫలితం ఏ విధం గా ఉన్నా కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక, కర్తవ్యం ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 11, 2013 at 6:38 సా.

చదువుకోవడం ఎట్లా ? 25. పరీక్షలయాక,  కర్తవ్యం ఏమిటి ? 

గతం గతాహి : అంటే గడచి పోయిందేమో గడచి పోయింది ! ఒక సారి , పరీక్ష పత్రాన్ని , వదలకుండా , అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాశారో లేదో , చూసుకుని , ఆన్సర్ పేపర్ ఇన్విజిలేటర్ కు ఇచ్చాక ,  ఇక ఆ విషయాన్ని తాత్కాలికం గా మర్చి పోవాలి !  ఒక వేళ , సరిగా చేశానో లేదో అని మధన పడుతూ , విపరీతం గా ఆందోళన పడినా , ఒక సారి పరీక్ష హాలు నుంచి బయట పడ్డాక ,  చేయ గలిగేది ఏమీ లేదు ! అంటే ,మీరు రాసిన జవాబు లలో పొరపాట్లు ఉన్నా , అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయ లేక పోయినా కూడా , అంతా  గతాహి అంటే అంతా జరిగి పోయింది !  ఇక పరీక్ష జవాబు పత్రం అంటే ఆన్సర్ పేపర్ మీ నియంత్రణ లో ఉండదు, ఏ మార్పులు చేయడానికీ ! అందువల్ల , ఇక ఆ పరీక్ష గురించి కానీ , మీరు రాసిన జవాబుల గురించి కానీ ఏ విధమైన చింతా పెట్టుకో కూడదు !  మీ స్నేహితులతోనో , మీ కుటుంబ సభ్యులతో నో సరదా గా మీకు తోచిన విధం గా సమయం గడపండి !  మీకు ఇష్టమైన పనులు చేయండి !  మీకు ఇష్టమైన ఆహారం తినండి ! ఇష్టమైన సంగీతం వినడమూ , సినిమా కు వెళ్ళడమూ కూడా చేయవచ్చు ! బాగా అలసి పోయి ఉంటే , కొన్ని రోజులు ఆ అలసట తీరేవరకూ , ఎక్కువ సమయం నిద్ర పొండి, రాత్రి సమయాలలో ! ఇట్లా చేసి , మీరు  ఛార్జ్ తక్కువ అయిన మీ శరీరాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకుంటున్నా రన్న మాట !  

పరీక్ష ఫలితం విఫలం అయితే, అంటే, ఫెయిల్ అవుతే ! :  ఏ మాత్రం విచారించకండి !  కొంత నిరుత్సాహం ఉండడం సహజమే ! కానీ ఆ నిరుత్సాహం, తాత్కాలికమే అవ్వాలి !  నిరాశా నిస్పృహలకు లోనవ్వ కూడదు ! అట్లా సామాన్యం గా , సరిగా రాని ఫలితాల గురించే పదే పది గా ఆలోచించుతూ , నిద్రాహారాలు మాని , బాధ పడి ,కృంగి పోవడం వల్ల జరుగుతుంది !  ఆ పరిస్థితి నుండి బయట పడడం కన్నా , ఆ పరిస్థితిని అన్ని విధాలా నివారించుకోవడమే ఉత్తమం !   పరీక్ష ఫలితం మీరు ఆశించినట్టు ఉండకపోతే , ముందుగా  చేయవలసినది ,  స్నేహితులనూ , కుటుంబ సభ్యులనూ వదల కూడదు ! వారి మధ్యనే కాలం గడపడమూ ,  లేదా  టీచర్ వద్దకు గానీ , లెక్చరర్ వద్దకు గానీ వెళ్లి ,   లోపాలను ఎట్లా సరిదిద్దు కొవచ్చో , తెలుసుకోవడం ముఖ్యం !  పరీక్షలో ఫెయిల్ అవడం , నేరం కాదు ! అందువల్ల ఆత్మ న్యూనతా భావాలు  రాకూడదు ! ఒక్క పరీక్షలో విఫలం అయితే , అనేకమైన పరీక్షలు ఎదురు చూస్తూ ఉంటాయి ! అంటే అనేకమైన అవకాశాలు  ఆహ్వానిస్తూ ఉంటాయి ! జీవితం లో, ఒక పరీక్ష సఫలానికీ , విఫలానికీ , మాటల అర్ధం లో చాలా తేడా ఉంది , కానీ మార్కుల అంతరం లో ఆ తేడా అతి స్వల్పం ! ఎందుకంటే ,  ముప్పై నాలుగు మార్కులు వస్తే దానిని ఫెయిల్ అంటారు , అదే ముప్పై అయిదు మార్కులు వందకు వస్తే దానిని పాస్ అంటారు ! మీ పరిధి విస్తృతం అవాలి !  ఆ ఒక్క శాతం మార్కులు తక్కువ వస్తే, కేవలం ఆ పరీక్ష లో ఆ సందర్భం లో మాత్రమే , వారు ఓడి పోయారు !  వారి జీవితం లో కాదు !  అసలు చదువు కోని వారూ , స్కూలూ ,కాలేజీ లకు అసలు వెళ్ళని వారు , ఈ ప్రపంచం లో అనేక కోట్ల మంది ఉన్నారు ! వారికన్నా ఎక్కువ నేర్చు కుంటారు ,  పరీక్ష రాసే వారు  , ఎందుకంటే , వారి జీవితం లో వారికి ఎదురయే అనేక రకాలైన పరీక్షలకు , వారికి ఈ చిన్న పరీక్షలు అనుభవాలూ , పాఠాలూ అవుతాయి కనుక ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం, ఏం చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 11, 2013 at 5:28 ఉద.

చదువుకోవడం ఎట్లా ? 24. పరీక్ష సమయం లో , ఎక్కువ మార్కుల కోసం,  ఏం చేయాలి ? 

మునుపటి టపాలో,  పరీక్ష సమయం లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ! ఈ రోజు ఇంకొన్ని కిటుకులు తెలుసుకుందాం ! 
వ్యాస పధ్ధతి లో రాసే జవాబులకు : 
వ్యాస పధ్ధతి లో రాయమని అడిగే ప్రశ్నలను ముందుగా కొద్ది నిమిషాలు వెచ్చించి అయినా సరే , శ్రద్ధతో చదవాలి !  వ్యాసం అడిగాడు కదా,  ఓ ఇరవై లైన్లు  రాసి, ఆన్సర్ పేపర్, ‘వాడి’ మొహాన పారేస్తే సరిపోతుంది ,కనీసం అరవై శాతం మార్కులేయక చస్తాడా ?!   అని, తలా తోకా లేకుండా రాసుకుంటూ పోకూడదు ! నిజం గా, అట్లా ఆలోచించే వారి కెపాసిటీ ఇంకా ఎంతో ఉంటుంది ! కేవలం , అట్లా ఆలోచించడం , ఆచరించడం ద్వారా , వారికి వచ్చే ఎక్కువ మార్కులను చేతులారా పోగొట్టు కుంటారు ! ఇంత కు ముందు టపాలలో రాసినట్టు , రాసే ఆన్సర్ పేపర్ , ఆ  విద్యార్ధి  మెదడు ను  ప్రతిబింబింప చేస్తుంది ! రాత పూర్వకం గా !  విషయం తెలిసి ఉండి కూడా , కేవలం వారి తృప్తి స్థాయిని తగ్గించుకోవడం వలననే , వారు మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నారని గమనించాలి !  
వ్యాస పధ్ధతి లో సమాధానం రాయమని అడిగిన ప్రశ్న లకు, మూస పధ్ధతి లో రాసుకుంటూ పోక , ఆ ప్రశ్నలో ప్రత్యేకించి ఏమడుగుతున్నాడో అర్ధం చేసుకోవాలి !   వివరించండి అని ప్రశ్న ఉంటే వివరించాలి ! నిర్వచించండి అని అడిగితే , నిర్వచించాలి ! పోల్చి చూడండి అని అడిగితే , ఆ సమాధానాన్ని వివరం గా పోల్చి ఆ పోలికలను రాయాలి ! సమాధానాన్ని , విభిన్న కోణాలలో , రాయడం , ఇంకా వీలున్న చోటల్లా , ఆ  పాఠం లో వచ్చిన సాంకేతిక పదాలను వాడడమూ మరువ కూడదు !  ఈ సాంకేతిక పదాల గురించి కూడా మనం క్రితం టపాలలో తెలుసుకున్నాం !   ప్రతి సబ్జెక్ట్ కూ  సాంకేతిక పదాలు, ఆ సబ్జెక్ట్ కు చెందిన అక్షరాల లాంటివి !  అంటే , కేవలం భాష  తెలుగైనా , ఇంగ్లీషైనా , సాంకేతిక పదాలు , నేర్చుకునే సబ్జెక్ట్ ను బట్టి , ప్రత్యేకం గా ఉంటాయి ! ఉదాహరణకు :  కంప్యూటర్ ల కు చెందిన సమాధానాలు రాసే చోట ,  దాని మెదడు కెపాసిటీ  1TB అనీ ,  వెబ్ క్యామ్ ను దాని కళ్ళు అనీ రాయడం విచిత్రం గా ఉంటుంది ! ( హార్డ్ డిస్క్ కెపాసిటీ అనీ వెబ్ క్యామ్ అనీ అంటారు కదా వాటిని ) అదే , మానవ మెదడు నూ , కంప్యూటర్ నూ పోల్చి రాయమని  అడిగితే , అప్పుడు ఆ విధం గా పోల్చి వివరించ వచ్చు ! 
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలూ , నిజం – తప్పు ( ట్రూ ,ఫాల్స్ ) ప్రశ్నల కు సమాధానాలు రాసే సమయం లో కూడా ,  మీరు అనుసరించే పధకం వేరుగా ఉండాలి !  చదవగానే ప్రశ్న కు సమాధానం రాయడానికి ఉబలాట పడకుండా , ప్రశ్నలను తిప్పి ఇస్తున్నాడా , సమాధానాలు సరి యైన వేనా ? అని ఒకటి కి రెండు సార్లు పరిశీలించుకుని , అవసరమైతే ఒక చిత్తు కాగితం మీద  సమాధానం రాసుకుని , తరువాత ఆన్సర్ పేపర్ మీదకు ఎక్కించు కోవచ్చు ! పొర పాట్లను తగ్గించుకునే భాగం గా ! 
పరీక్ష హాలు లో, ఇతర విద్యార్ధులను  పట్టించు కోక పోవడం : ఇది చాలా ముఖ్యమైన పధ్ధతి !  పరీక్ష హాలు లో కాస్త సమయం ఉంటే , ఇతర విద్యార్ధుల ప్రవర్తన పరిశీలించడం  సామాన్యమే , చాలా సమయాలలో అది అప్రయత్నం గానే జరుగుతూ ఉంటుంది !  ఇక  ఒక్కో విద్యార్ధి , ఒక్కో రకం గా ప్రవర్తిస్తూ ఉంటారు, పరీక్షా సమయం లో ! కొందరు , ప్రతి పది నిమిషాలకూ ఒక సారి , ఇన్విజిలేటర్ ను  పిలుస్తూ ఉంటారు !  కొందరు ప్రతి ఇరవై నిమిషాలకూ , అడ్ది షినల్ ఆన్సర్ షీట్ లు అడుగుతూ ఉంటారు ! వారు అట్లా అడుగుతున్నప్పుడల్లా , మిగతా విద్యార్ధులకు  ‘ నేను తక్కువ గా రాస్తున్నానా?  అనే సందేహం కలుగుతూ ఉంటుంది ! ఇంకొందరు విద్యార్ధులు , చాలా ధీమా గా  పరీక్షా సమయం లో సగం సమయం లోనే చప్పున , ఉన్న చోటినుంచి లేచి , ఆన్సర్ పేపర్ , ఇన్విజిలేటర్ కు ఇచ్చి బయటకు వెళుతూ ఉంటారు ! ఇంకొందరు పూర్తి సమయం అయిపోయినాక కూడా , పెన్నులు టేబుల్ మీద పెట్ట మన్నా కూడా , వినిపించు కోకుండా , విపరీతమైన వేగం తో రాస్తూ ఉంటారు ! 
గమనించ వలసినదీ , గుర్తుంచు కోవలసినదీ ఏమిటంటే , ఈ  వివిధ ప్రవర్తనా రీతులు, వారి  మార్కులను నిర్ణయించవు ! మీ మార్కులను కూడా నిర్ణయించ కూడదు ! ఒక వేళ నిర్ణయించ గలుగు తే అది తక్కువ మార్కుల దిశలోనే !  ఎట్టి పరిస్థితులలోనూ , ఆ ప్రవర్తనలు మీ ఏకాగ్రత కు భంగం కలిగించ కూడదు !  అందుకు మీరు చేయవలసిందల్లా , మీ ప్రశ్న పత్రం మీదా , రాసే సమాధానాల మీదా , మీకు అనుమతించిన సమయం , అంటే గడియారం మీదా, మీ  మనసునూ , మేధస్సు నూ కేంద్రీకరించడమే !  ఆ పని మీరు , మీకు ఇచ్చిన సమయమంతా కూడా చేయాలి ! ఎందుకంటే , ప్రతి ఒక్క మార్కూ , విలువైనదే , మీ జీవిత గమనాన్ని మార్చి వేసేదే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on డిసెంబర్ 9, 2013 at 8:24 సా.

చదువుకోవడం ఎట్లా ? 23. పరీక్ష సమయం లో ఏం చేస్తే, ఎక్కువ మార్కులు వస్తాయి  ? 

ఇంతకు ముందు టపాలో పరీక్షల ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా ! మరి పరీక్షా సమయం లో ఏ జాగ్రత్తలు , ఎక్కువ మార్కులు తెస్తాయి మీకు ?  ఈ ప్రశ్నకు ఒక్క వాక్యం లోనే సమాధానం కావాలంటే , ‘ సమాధానాలన్నీ బాగా రాయడమే’  ! ( ఈ నా సమాధానానికి, మీరు ఎక్కువ మార్కులు ఇవ్వరు కదా ! ) అందుకు, నా సమాధానం వివరంగా ఇవ్వ బడింది , ఈ క్రింద చదవండి ! ( అన్ని సూచనలూ, సలహాలూ , మీరు చదివాక ,  మార్కులు వేయండి ! ) : 
1. ప్రశ్నా పత్రం లో ఉన్న సూచనలూ , నిబంధనలూ శ్రద్ధ గా చదివి , సందేహాలుంటే , మొహమాట పడకుండా , ఇన్విజిలేటర్ ను అడగాలి ! కొన్ని సమయాలలో వారికి కూడా  కొన్ని ప్రశ్నలు అర్ధం కావు !  అపుడు వాటిని చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గర  క్లారిఫై చేసుకుని మీకు చెప్ప గలుగు తారు ! పరీక్షా సమయం లో , సందేహాలు రావడం సామాన్యమే ! అప్పుడు, వాటిని వెనువెంటనే నివృత్తి చేసుకోవడం మంచిది ! ప్రత్యేకించి,  ఎక్కువ మార్కులు తెచ్చుకో డానికి ! 
2.  శ్వాస సహజం గా తీసుకోవడం మర్చి పోకూడదు ! :  పరీక్షా సమయం లో ఆందోళన వల్ల , చాలా మంది విద్యార్ధులు ఎక్కువ వత్తిడి కి లోనయి ,  టెన్షన్ తో సహజమైన శ్వాసను కూడా తక్కువ తక్కువ గా తీసుకుంటూ ఉంటారు ! అట్లా చేయడం వల్ల , మెదడు కు ఆక్సిజన్ అంటే ప్రాణ వాయువు సరిగా అందక ,  ఏకాగ్రత  లోపించ వచ్చు ! కొన్ని సమయాలలో ,  తల తిరిగి పడి పోవడం కూడా జరగ వచ్చు !  అందువల్ల సహజం గా తీసుకునే ఉచ్వాస నిశ్వాస లను మరచి పోవడం కానీ , వాటికి షార్ట్ కట్ గా పై పైనే శ్వాస తీసుకోవడం కానీ చేయ కూడదు ! 
3. పశ్నా పత్రాన్ని సర్వే చేయడం ! : ఇక అసలు సంగతి , అంటే ప్రశ్న పత్రాన్ని  పూర్తి గా చదవడం ! ఇది అతి ముఖ్యమైన పని. సామాన్యం గా చాలా మంది విద్యార్ధులు , ప్రశ్నా పత్రాన్ని చూడగానే , విపరీతమైన ఆతృత తో  మొదటి ప్రశ్న కు సమాధానం రాయడం మొదలుపెడతారు !  అట్లా చేయడం కన్నా , ప్రశ్నలన్నింటినీ , కూలంక షం గా  చదవడం మంచి పధ్ధతి !  ఆ పని చేయడడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు !   అడిగే ప్రశ్నలు ఏ రకం గా ఉన్నాయి ?  అడిగిన ప్రశ్న లన్నింటికీ , సమాధానాలు రాస్తే , సమానం గా ఉన్నాయా మార్కులు , లేదా ప్రశ్న లు చిన్నవీ , పెద్దవీ కూడా ఉన్నాయా , పెద్ద ప్రశ్నలకు ఎక్కువ మార్కులు ఉంటే , మరి వాటి సమాధానాలు రాయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాలి కదా ! ఆ సమయం ఎంత ?  కాస్త ఎక్కువ గా ఆలోచించి రాయవలసిన సమాధానాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి కదా ! అందుకు సమయాన్ని ఏ విధం గా కేటాయించాలి ? ఈ విషయాలన్నీ సర్వే లో నిర్ణయించుకోవాలి !  ప్రతి ప్రశ్న గురించీ సమయాన్ని ఖచ్చితం గా నిర్ణయించలేక పోయినా కూడా , ఒక అంచనా వేసుకో గలగాలి సర్వే చేస్తున్నప్పుడే !  ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాశాక , ఒక అయిదు పది నిమిషాలు ఇంకా సమయం మిగిలేట్టు అంచనా వేసుకుంటే, ఉత్తమం ! ఆ సమయం లో రాసిన సమాధా నాలన్నింటి నీ సరిగా చూసుకుని , మర్చి పోయిన పాయింట్స్ చేర్చ దానికి ఉపయోగించ వచ్చు ! 
4. ప్రతి ప్రశ్ననూ, తప్పని సరిగా, విపులం గా చదవాలి :   ఉదా : జీవ కణం లో భాగాలను, పటం ద్వారా చూపండి .  మూడు ప్రధాన భాగాల విధులు వివరించండి. అని ప్రశ్న ఉంటే , సగం సమయాన్ని పటం వేసి భాగాలను గుర్తించడానికీ , మిగతా సగం సమయం ప్రధాన భాగాల విధులు వివరించడానికీ కేటాయించాలి ! కేవలం పటం వేస్తూ నే సమయాన్ని వెచ్చించ కూడదు ! అట్లాగే ఇంగ్లీషులో , ఒక  ఇరవై వాక్యాలలో , ఒక వ్యక్తి , గురించి రాయమంటే , ఆ ఇరవై వాక్యాలూ , వ్యాకరణ బద్ధం గా , సులభం గా అర్ధం అయ్యేట్టు ఉండాలి !  అతి గా రాసినా , తప్పులతో రాసినా , మార్కులు కోల్పోతారు కదా ! అందువల్ల , ప్రశ్నలను చదివి సరిగా అర్ధం చేసుకోవాలి  ముందే ! లెక్కల ప్రశ్నలకు కూడా సమాధానాలు రాసే సమయం లో కేవలం, సమాధానం మాత్రమే రాయకుండా, ఆ సమాధానాలు, మీరు ఎట్లా సాధించారో , మీ పేపర్ దిద్దే వారికి మీరు,  జవాబు పత్రం లో అంటే ఆన్సర్ పేపర్ లో విపులం గా రాసి తెలియ చేయాలి ! ఉదా :   నవంబరు నెలలో ఎన్ని గంటలు ఉన్నాయో సమాధానం ఎట్లా రాబట్టారో కూడా తెలియ చేయండి ? అని ప్రశ్న ఉంటే , 30 రోజులుంటాయి కాబట్టి, సమాధానం 720 గంటలు అని మాత్రమే రాయకూడదు !  నవంబర్ నెలలో 30 రోజులు , రోజుకు 24 గంటలు , 30 X 24= 720 గంటలు. అని సమాధానం రాయాలి ! ఇవి కేవలం ఉదాహరణలు  మాత్రమే ! మీరు చదివే సబ్జెక్ట్ లూ , పాఠాలను బట్టి ప్రశ్నలు కూడా మారుతూ ఉంటాయి కదా ! 
వచ్చే టపాలో, పరీక్షా సమయం లో మరచి పోకూడని  మరి కొన్ని కిటుకులు !