Our Health

Archive for the ‘మన ఆరోగ్యం.’ Category

ఏ నూనెలు , ఏ వంట కు వాడాలి ? 1.

In మన ఆరోగ్యం., Our Health, Our mind, Our minds on డిసెంబర్ 26, 2015 at 12:40 సా.

ఏ నూనెలు , ఏ వంట కు వాడాలి ? 1. 

( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి ! 
అందులో , మరిగించే కాలం ఎక్కువ అవుతున్న కొద్దీ , వివిధ రకాల వంట నూనెల లో , విషపూరిత ఆల్డి హైడ్ ల శాతం ఎట్లా పెరుగుతుందో  తెలియ చేయ బడింది ! ఆశ్చర్య కరం గా ,  వెన్న , కొబ్బరినూనె ల లో , తక్కువ విషపూరిత ఆల్డి హైడ్ లు విడుదల అవుతాయి ! ) 

ఇప్పటి వరకూ , ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ , కార్న్ ఆయిల్  ( అంటే మొక్క జొన్న నూనె ) ల   తో చేసిన వంటకాలు , ఆరోగ్య కరమైనవనీ , నెయ్యి , వెన్న లతో చేసిన వంటకాలు అనారోగ్య కరమైనవనీ భావించడం జరుగుతూంది !

తాజా పరిశోధనల ఫలితాలు అందుకు భిన్నం గా ఉన్నాయి !
ప్రొఫెసర్ మార్టిన్ గ్రూట్ వెల్డ్ ( జీవ రసాయన విశ్లేషణ నిపుణుడు ) డి  మాంట్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం లో పరిశోధనలు చేసి  , ఈ ఫలితాలు ప్రకటించాడు !
మనం మామూలు గా మంచివి అనుకుంటున్న  వంట నూనెలు మంచివే , కానీ ఆ మంచి , ఆ నూనె లలో , కొద్దిగా వేడి చేసి నంత వరకే ఉంటుంది !
అంటే , ఆ నూనెలను మరిగించి , అందులో  బజ్జీలు , లేదా ఇతర  వేయించిన వంటకాలు వండితే ,  ఆ నూనెలు ఆరోగ్య కరం కాదు ! 
ఈయన గారు  అందుకు కారణాలు కూడా, స్పష్టం గా తెలియ చేశారు !
అతిగా వేడి చేసిన వంట నూనెలు , అంటే సాధారణం గా ఎక్కువ నూనె , గిన్నె , లేదా భాండీ లో సగానికి పైగా పోసే నూనెలు , బాగా ఎక్కువ ఉష్ణోగ్రతల లో వేడి చేయ బడతాయి !
ఇట్లా వేడి అయ్యాక , ఆ నూనెల లో నుంచి ,  ఆల్డి హైడ్ లు అనే రసాయనాలు బయటకు వస్తాయి !  మరి ఆ బయటకు వచ్చిన ఆల్డి హైడ్ లు , మనం తినే ఆ వంటకాల తో పాటుగా , మన శరీరాలలోకి ప్రవేశిస్తాయి ! 
ఆల్డి హైడ్ లు, విష పూరితాలు !  కానీ ఆ  విష పూరితాలు , మనకు వెంటనే హాని చేయకుండా , కొంత కాలం అయ్యాక , వాటి ప్రభావం , మన దేహం లో చూపిస్తాయి !  ( పైన ఉన్న బార్ గ్రాఫ్ గమనించండి !  ) 
గుండె జబ్బులకు , క్యాన్సర్ కూ , ఇంకా మతి మరుపు జబ్బు ( డిమెంషియా అని అంటారు ) లకూ కారణమవుతాయి ! 
మనం నూనెలను ఎక్కువ గా వేడి చేస్తే కలిగే పరిణామాలు తెలుసుకున్నాం కదా , మరి వచ్చే టపాలో , వివిధ వంట నూనెలు , ఎట్లాంటి వంటల్లో వాడాలో కూడా తెలుసుకుందాం !

ఏ వ్యాయామం ఎందుకు ? 2.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our mind on డిసెంబర్ 13, 2015 at 3:34 సా.

ఏ  వ్యాయామం ఎందుకు ? 2.

మునుపటి టపాలో , ఏరోబిక్ వ్యాయామం వల్ల, మన శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా !
మరి ఇప్పుడు,  ఏ యే  రకాల వ్యాయామాలు మన మెదడు లో ఏయే భాగాలకూ , కేంద్రాలకూ , ఉపయోగ పడతాయో తెలుసుకుందాం !
పరిణితి చెందిన మానవ మెదడు , అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన , మానవ మెదడు లో  ఉండే నాడీ కణాల సంఖ్య  వంద బిలియన్లు !
ఈ కణాలన్నీ కూడా  అనేక రూపాలలో , నిర్మితం అయి ,  అనేక లక్షల  సంధానాలతో  ,అన్ని ఇతర  కణాలతో సంబంధం కలిగి ఉంటాయి, నిరంతరం !
మన లో ఆలోచనలను జనింప చేయడానికీ , వివిధ రకాల పనులను మనతో చేయించడానికీ కూడా , మెదడు నిర్మితమై ఉంటుంది ! అందుకోసం మెదడు లో అనేక కేంద్రాలు నిర్మాణం అయి ఉన్నాయి !
ఉదాహరణకు :
ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి !  చిత్రం లోని ఎరుపు భాగమే !  )  మనం , ఏ పని చేయ బోయినా , ఆ పని యొక్క యుక్తా యుక్త విచక్షణ కలిగించి , అవకతవక పనులను నివారించి , నిర్మాణాత్మక మైన, ఒక లక్ష్య నిర్దేశన  ఉన్న పనులను మాత్రమే , మన చేత చేయించే కేంద్రమే , ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ !
రోజూ , ఒక మాదిరి బరువులను ఎత్తడం వల్ల , ఈ భాగం శక్తి  వంత మవుతుంది !
ఫ్రాంటల్ లోబ్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ! చిత్రం లోని ఎరుపు భాగమే !  ) ఇది మన మెదడు ముందు భాగం లో ఉండే నిర్మాణం !  అంటే మన నుదుటి వెనుక కపాలం అంటే స్కల్ లో ఉంటుంది !  ఈ నిర్మాణం , మానవుల కండరాలు   చేసే పనులను నియంత్రిస్తూ  ఉంటుంది !
క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల , ఈ భాగం ఎక్కువ క్రియాశీలం అవుతుంది !
హైపోతలామస్ : (క్రింద ఉన్న చిత్రం చూడండి , చిత్రం లోని ఎరుపు భాగమే ! )  ఈ కేంద్రం , అతి సున్నితమైనది. ఇది , మెదడు లోపలి భాగాలలో నిర్మితమై ఉండి , మానవుల ఆకలి నీ ,  కామ సంబంధమైన అనుభూతులనూ , లింగ నిర్ధారణ నూ ,  నియంత్రిస్తూ ఉంటుంది ! ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల  హైపోతలామస్ ఉత్తేజం అవుతుంది !
పరైటల్ లోబ్ (  క్రింద ఉన్న చిత్రం చూడండి,  చిత్రం లోని ఎరుపు భాగమే ! ) : ఈ కేంద్రం , ఫ్రాంటల్ లోబ్  తరువాత ఉండే భాగం !  ఈ భాగం లో మానవుల దృశ్య శబ్ద గ్రహణ నాడులను అనుసంధానం చేసి , మన ఆలోచనలను హేతు బద్ధం గా చేసే వ్యవస్థ ఉంటుంది !
హిప్పో క్యాంపస్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ,చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఈభాగం మన జ్ఞాపక శక్తి కి కేంద్రం !  ఈ భాగం కూడా ఏరోబిక్ వ్యాయామం వల్ల  ఉత్తేజం అవుతుంది ! విద్యార్ధులకు  ఏరోబిక్ వ్యాయామాలు , పరీక్షల సమయం లో బాగా ఉపయోగం అందుకే !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

బంధాలు ఎందుకు తెగుతాయి ?6.

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 7, 2015 at 11:35 ఉద.

బంధాలు  ఎందుకు తెగుతాయి ?6. 

పురుషులు సర్వ సాధారణం గా , స్త్రీలు వారిని మార్చాలని ప్రయత్నిస్తున్నారని అంటారు ! 
స్త్రీలు సర్వ సాధారణం గా,  వారి పురుషులు , వారి మాట వినరని అంటూ ఉంటారు ! వారికి కావలసినది సానుభూతి ! కానీ, అందుకు భిన్నం గా పురుషులు , పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు !
స్త్రీలు తమ ఇల్లు  , పరిసరాల , శుభ్రత కు చాలా ప్రాధాన్యత ఇస్తారు ! కానీ , పురుషులు ఆ విషయానికి , అంతగా ప్రాధాన్యత ఇవ్వక పోగా ,  శుభ్రత గురించిన ఏ  పని లోనూ , ఉత్సాహం చూపకుండా , ఇతరులు మాత్రమే చేయాలని అనుకుంటారు ! పురుషులు ఇంటి పని చేయడం , అవమానకరం గా కూడా భావిస్తారు ! 
మరి స్త్రీ పురుషుల బంధాల లో ఉన్న ఈ తేడాలకు పరిష్కారం ఏమిటి ? 
స్త్రీలు , చీకాకు , విసుగు ప్రదర్శిస్తున్న సమయం లో , పురుషులు చేయ వలసినది , పరిష్కారాలు చూపించడం కాదు ! 
వారిని శాంత పరిచే ప్రయత్నాలు చేయాలి ! 
పురుషులు , స్వాతంత్ర్యాన్నీ , అధికారాన్నీ , ఆస్వాదిస్తారు ! కోరుకుంటారు ! 
స్త్రీలూ , స్వాతంత్ర్యం కోరుకున్నా , వారికి ప్రధాన విషయాలు , వారిని అర్ధం చేసుకునే పురుషులు ! వారికి అంకితమైన పురుషులు , వారిని లాలన చేసే పురుషులు , వారికి ధైర్యం చెప్పి , జీవిత నౌక లో చేదోడు గా ప్రయాణం చేసే పురుషులు ! 
స్త్రీలు , తమ బంధం లో , ప్రత్యేకమైన వారిలా , గుర్తింపు , గౌరవం పొందు తున్నప్పుడు , ఎక్కువ ఉత్సాహ భరితులవుతారు !
తమ దైనందిన కార్యక్రమాలను , ఆనందం తో చేసుకో గలుగుతారు ! 
పురుషులు ,  తమ బంధం లో తమకు , సరి అయిన గుర్తింపు , ప్రశంస , విశ్వాసం , ప్రోత్సాహం ,లభిస్తున్నప్పుడే , ఎక్కువ క్రియాశీలం గానూ , ఆనందం గానూ , సంతృప్తి తోనూ  , ఆ బంధాన్ని కొనసాగిస్తారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 22, 2014 at 10:23 ఉద.

అనుమానం, పెనుభూతం . 2. పారనోయియా ! 

ఈ అనుమానం పెనుభూతం అయిన వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉంటాయో వారి మాటల్లోనే చదవండి !
సాల్లీ  ( అమెరికా ) 
” నాకు చిన్న తనం నుంచీ చీకటంటే భయం ! ఆ భయం తోనే నేను పెరిగాను కూడా , కానీ ఇప్పుడు నాకు చీకటంటే ఎక్కువ భయం లేక పోయినా , నేను ఉంటున్న రూమ్ లో నాకు కనబడనివి ఏమున్నాయో అనే భావన కలుగుతూ ఉంటుంది !  నా రూమ్ లో ఎవరో ,నన్ను కిడ్నాప్ చేయడమో , రేప్ చేసి చంపేయ డానికి ప్రయత్నం చేస్తున్నారనే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది ! నేను ఒంటరి గా ఇంట్లో ఉన్నా , ఎవరో ఒకరు , తలుపులు పగలగొట్టి , ఇంట్లో ప్రవేశించి , నాకు హాని తలపెడతారనిపిస్తూ ఉంటుంది !  నేను ఒక్కదానినే ఇంట్లో ఉంటే , ఇంట్లో అన్ని గదులూ , మారు మూలలూ , పదే ,పదే  వెదికి , ఎవరూ లేరని నిర్ధారించుకుంటాను !
నేను బాత్ రూమ్ లోకి వెళ్ళినా కూడా షవర్ కర్టెన్ ను తొలగించి , ఆ కర్టెన్ వెనక ఎవరూ లేరని నిశ్చయం చేసుకుంటాను ! నేను ఒంటరిగా , బయటకు వెళ్ళినా కూడా , ఎవరో ఒకరు నన్ను బలవంతాన ఎక్కడికో తీసుకు వెళ్లి మానభంగం చేస్తారని భయ పడుతూ ఉంటాను ! ”
వివియన్ ( అమెరికా )
” నేను బయట ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా , నా వెనక కారులో ఉన్న వారు నన్ను వెంతాడుతున్నారనే భయం నాకు ఉంటుంది !  నేను ఏ పార్టీకి వెళ్ళినా , అక్కడ ఎవరో ఒకరు , నా డ్రింకు లో మత్తు మందు కలిపి ఇస్తారనే భయం ఎప్పుడూ కలుగుతుంది ! ”
సారా ( ఇంగ్లండ్ )
” నేను నా స్నేహితురాలితో వాదులాట  కు దిగి నా స్నేహం చెడ గొట్టుకున్నా ! ఇప్పుడు , ఆ స్నేహితురాలు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుందని భయం గా ఉంది !  ఆమె మా ఇంటికి కూడా కొన్ని సార్లు వచ్చింది !  ఒక సారి నేను ఇంట్లో ఉన్న ఆహారాన్ని కూడా  చెత్త కుండీ లో పారవేశా , ఆ ఆహారం లో విషం కలిపారేమో అన్న భయం తో ” !
అహ్మద్ ( ఇండియా ) 
నేను బహిరంగ ప్రదేశాలలో వెళుతూ ఉన్నప్పుడు , మిగతా వాళ్ళంతా , నా మీసాలనూ , నా కళ్ళనూ , నా ముక్కునూ , తదేకం గా పరిశీలిస్తూ , నా మీద అభిప్రాయాలు ఏర్పరుచు కుంటున్నారని అనిపిస్తూ ఉంటుంది !  ఆ జనాలలోనుంచి , ఎవరో ఒకరు , ఏదో ఒకరోజు అకస్మాత్తుగా , నా మీద పడి , నా కళ్ళు పీకేయడమో , ఓ కత్తి తో నా ముక్కు కోసేయడమో చేస్తారనే భయం నన్ను పీడిస్తూ ఉంటుంది ! 
పైన ఉన్న అనుభవాలు చదువుతుంటే , మనకు ( బాగా విశ్లేషణ చేయగలిగే అనుభవం ఉన్న వారికి )  కలిగే అభిప్రాయం ఒకటే !  అది వారికి ఇతరుల మీద ఉన్న వక్ర అభిప్రాయం ! దానినే అట్రి బ్యూ షనల్ బయస్ అంటారు ! ( attribution bias ) అంటే , వారికి ఇతరుల మీద ఎప్పుడూ , వారు తమకు హాని కలిగిస్తారనే చెడు భావన మాత్రమే ఉంటుంది ! ఉదాహరణకు ,  ఒక బహిరంగ ప్రదేశం లో ఒక వంద మంది మనుషులు ఒక సమయం లో ఉన్నారనుకుంటే , అందులో కనీసం 90 మంది , వారి పని , వారు చేసుకు పోయే వారే ఉంటారు ! ఈ 90 మంది  ని విస్మరించి , కేవలం మిగతా పది మందీ , తమకు హాని కలిగిస్తారనే , విపరీతమైన భయం తో కాలం గడుపుతారు , ఈ పారనోయియా ఉన్న వారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

అనుమానం, పెనుభూతం ! పారనోయియా .1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 20, 2014 at 8:49 సా.

అనుమానం పెనుభూతం  ! పారనోయియా .1. 

అనుమానం పెనుభూతం అనే సినిమా  వచ్చింది కొన్ని దశాబ్దాల క్రితం ! ఆ సినిమా ను నేనైతే చూడలేదు ! కానీ  పేరు మాత్రం బాగుంది !  అనుమానం పెను భూతం ! అంటే, మన అనుమానమే పెనుభూతమై మనల్ని పట్టి పీడిస్తుందన్న మాట ! అదీ  పెనుభూతాలను నమ్మే వాళ్ళను ! (  నేను నమ్మను , అది అప్రస్తుతమేమో కూడా  !)
ఏ రకమైన అనుమానాలు పెను భూతాలవుతాయి ? ఆ పెనుభూతాల లక్షణాలు ఏమిటి ? అనుమానాలను పెనుభూతాలు గా పెరగకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి ?  ఒక సారి ఈ పెను భూతాలు , పట్టాక , వదిలించుకోవడం ఎట్లా ? మరి ఈ పెనుభూతాలు అసలు మనకు పట్టకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ తెలుసుకుందాం ! 
పెనుభూతాలయే అనుమానాలు : అనుమానం అంటే డౌట్ !  డౌట్ రావడం మానవులకు సహజమే !  కానీ ఆనుమానాలు పెనుభూతాలవుతే , అప్పుడు దానిని పారనోయియా అంటారు ( paranoia ) ! పారనోయియా అనే పదం గ్రీకు భాష నుంచి పుట్టింది ! దానికి తెలుగు లో అర్ధం ‘ పిచ్చి ‘ అని ! సాధారణం గా ఈ  పారనోయియా ఈ రకాలు గా ఉంటుంది !
1. తమకు హాని చేయడానికి  ఇతరులు కుట్ర పన్నుతున్నారనుకోవడం ! ఉదాహరణకు :తాము ఒక ప్రమాదం లో   చిక్కుకున్నా , లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఒక వేలు తెగడమో , లేదా కింద పడడమో జరిగినా కూడా , అట్లా  ఇతరుల  ప్రమేయం  తోనే జరిగి ఉంటుందనే , స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండడం !
ఫోబియా( phobia ) కూ పారనోయియా కూ తేడా ఏమిటి ?:  
ఆ అమ్మాయికి కుక్కలంటే ఫోబియా అనో ,  లేదా ఆ అబ్బాయి కి పిల్లులంటే ఫోబియా అనో వింటూ ఉంటాం మనం తరచుగా ! ఈ రకమైన భయాలు , ఒక నిజమైన  ఆపద ను విపరీతం గా విశ్లేషణ చేసుకుని ,ఎక్కువ ఆపద గా భావించడం !  ఉదాహరణకు , కొందరికి బాగా ఎత్తు ఉన్న బిల్డింగులు అంటే ఫోబియా ! అంటే , ఆ ఎత్తైన బిల్డింగు ఎక్కితే ఏదో ప్రమాదం తమకు జరుగుతుందనే విపరీతమైన భయం ! అంటే ఇక్కడ జరుగుతున్నది , ఉన్న భయాన్ని హేతు  రహితం గా అంటే ఇర్రేషనల్ గా ఎక్కువ అనుకోవడం ! కానీ పారనోయియా లో, లేని భయాలనూ , ఆపదలనూ , తమకు ఆపాదించుకోవడం జరుగుతుంది ! 
ఇంకొన్ని సంగతులు వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
ఈలోగా ,మీ అనుమానాలు ఏమైనా ఉంటే , అవి  పెనుభూతాలు కాక ముందే , తెలియచేయండి !

నిద్ర లేమి లక్షణాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on నవంబర్ 8, 2014 at 8:34 సా.

నిద్ర లేమి  లక్షణాలేమిటి ?

brain 2 300x299 Insomnia linked to brain loss

1. ఏకాగ్రత లోపించడం !
అలసి పోయిన మెదడు లో , జీవ రసాయనాలు కూడా హెచ్చు తగ్గులు జరుగుతూ , ఏకాగ్రత , అంటే కాన్సంట్రేషన్  , లోపించడానికి  దారి తీస్తుంది ! ఆ పరిస్థితి , మనం రోజూ పగలు చేసే ప్రతి పని లోనూ కనబడుతుంది ! 
2. వత్తిడిని తట్టుకోలేక పోవడం ! 
మనం , బాగా నిద్ర పోయి విశ్రాంతి తీసుకుంటేనే , అప్రమత్తం గా ఉండి ,  వత్తిడి కలిగించే పరిస్థితులను సమర్ధ వంతం గా ఎదుర్కొన గలమూ , పరిష్కరించు కో గలమూ కూడా ! నిద్ర లేమి తో ఈ సామర్ధ్యం  కుంటు పడుతుంది ! ఒక చిన్న ఉదాహరణ: రాత్రి సరిగా నిద్ర పోకుండా , ఉదయమే  ఆఫీసు కు డ్రైవ్ చేస్తుంటే , ట్రాఫిక్  లో ఎక్కువ పొరపాట్లకు అవకాశం ఎక్కువ అవుతుంది !  అది మనం అందరమూ గమనించి ఉంటాము ! అట్లాగే , ఆఫీసు లో కానీ , కాలేజీ లో కానీ , వత్తిడి కలిగించే ఏ పరిస్థితి నైనా , బాగా నిద్ర పోయిన తరువాతే , ప్రశాంత చిత్తం తో ఎదుర్కో గలము ! 
3. జ్ఞాపక శక్తి తగ్గి పోవడం !
 ఈ లక్షణం , ముఖ్యం గా విద్యార్ధులకూ , ఇంకా , ఎక్కువ ఏకాగ్రత అవసరం అయే ఉద్యోగస్తులకూ ఎక్కువ గా వర్తిస్తుంది !   అనేక పరిశోధనల్లో ఖచ్చితం గా తెలిసిన విషయం !  పరీక్ష ముందు రోజున రాత్రంతా మేలుకుని , చదివి , మంచి మార్కులు తెచ్చు కోవాలని , అనుకునే విద్యార్ధులు కేవలం అత్యాశ కు పోతున్నారే కానీ ,  వారు , పరీక్షా హాలు లో , సమాధానాలు సరిగా గుర్తు తెచ్చు కోలేక , మార్కులు కోల్పోతారనే సంగతి మర్చి పోకూడదు ! 
4. ఆకలి పెరగడం ! 
 నిద్ర తక్కువ గా పోయే వారికి , ఊబ కాయం వచ్చే రిస్కు హెచ్చుతుంది ! ఎందుకంటే , నిద్ర తక్కువ అయినప్పుడు ,  ఆకలి ని పెంచే హార్మోనులు ఎక్కువ గా రక్తం లో కలుస్తాయి ! దానితో ఆకలి పెరిగి , ఎక్కువ గా తినడం  జరుగుతుంది ! 
5. చూపు మందగించడం ! 
నిద్ర లోపం కలిగిన వారికి ,  పగలు  చూపు మందగిస్తుంది !  ఎందుకంటే , కంటి కటకాన్ని  , పలుచ గానూ , మందం గానూ చేసే కండరాలు బిగుతు గా అవుతాయి ! దానితో , చూపు స్థిరం గా ఎక్కువ సేపు వస్తువుల మీద ఉంచడం  జటిలం అవుతుంది !
6. నిర్ణయాలు తీసుకోవడం లో పొరపాట్లు !
మనం గమనించే ఉంటాము !  తగినంత నిద్ర పోయాక , మనసు ప్రశాంతం గానూ , ఉత్సాహం గానూ ఉండి , ఒక సమస్య ను అనేక కోణాలలో , వివరం గా విశ్లేషించి , ఏమాత్రం ఆదుర్దా లేకుండా , ఆ సమస్యను   పరిష్కకరించ డానికి ప్రయత్నం చేస్తాము !  మన మెదడు , నిద్ర లేమి వల్ల , అంత చురుకు గా ఉండక , నిర్ణయాలు తీసుకోవడం లో జాప్యం జరగడమే కాకుండా, తీసుకున్న నిర్ణయాలలో కూడా అవక తవకలు జరుగుతూ ఉంటాయి ! 
7. నిపుణత తగ్గడం !: 
  మనం చేసే ఏ పనికైనా , నైపుణ్యం , మన  మెదడు తోనూ , శరీరం తోనూ ముడి పడి ఉంటుంది !  అంటే ,  మన మెదడు తాజాగా ఉండి  ,  అనేక విధాలు గా , అనేక దశలలో , అతి చురుకు గా  పని చేస్తూ ఉంటేనే , మన నైపుణ్యాన్ని ,  ప్రయోగాత్మకం గా చూప గలుగుతాము ! అంటే , ప్రాక్టికల్ గా !  నిద్రలేమి తో మనం చేసే పనులు అన్నీ కూడా , ఒక మోతాదు లో మద్యం పుచ్చుకున్న వారు చేసే పనులతో సమానం గా చేస్తామని , శాస్త్రీయం గా నిరూపించ బడింది ! 
8. శారీరిక సమస్యలు : 
 ఈ శారీరిక సమస్యల గురించి , మునుపటి టపాలో వివరించడం జరిగింది , ఉత్సాహం ఉన్న వారు చూడ గలరు ! 
9. మూడ్స్ హెచ్చు తగ్గులు అవడం ! 
ఇది ఇంకో ముఖ్యమైన  లక్షణం !  కారణం లేకుండా చీకాకు పడడం , లేదా అత్యుత్సాహం గా అన్ని పనులూ , అతి వేగం గా చేయ గలననే మితి మించిన ఆత్మ విశ్వాసం కలగడం కూడా జరుగుతుంది ,నిద్రలేమి తో ! దానితో  అనేక రకాల ప్రమాదాలకు కారణ మవడమే కాకుండా ,  గాయ పడే రిస్కు కూడా హెచ్చుతుంది !  
10. మానవ సంబంధాలు దెబ్బ తినడం !
 రాత్రి నిద్ర పోకుండా , పగలు ,  ఆఫీసు లో కానీ , కాలేజీ లో కానీ , కునుకు తీస్తూ ఉంటే ,  వారి భవిష్యత్తు , వారే చేతులారా  , చెడ గొట్టు కున్న వారవుతారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

నిద్రలో ఏం జరుగుతుంది ?2. గాఢ నిద్రలో మనకు జరిగే మంచి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 31, 2014 at 10:04 సా.

నిద్రలో ఏం  జరుగుతుంది ?2. గాఢ నిద్రలో మనకు జరిగే మంచి !

 

మనలో వందకు నలభై మంది , పగటి పూట ఆవులిస్తూ ఉంటారు ! కనీసం సగం మంది అమెరికన్లు , వారి నిద్రలేమి , వారి ఏకాగ్రత ను ప్రభావితం చేస్తుందని  చెప్పారు !  కనీసం వందలో 45 మంది అమెరికన్ విద్యార్ధులు , వారు పోవలసిన దానికన్నా , తక్కువ గంటలు నిద్ర పోతున్నారు ! అందులో కనీసం 25 శాతం మంది  కనీసం వారం లో ఒకసారైనా , క్లాసులో నిద్ర పోతారు లేదా కునుకు తీస్తారు ! 
గాఢ నిద్రలో మనకు జరిగే మంచి :
1. మన ఎముకలలో , చెడు కణాలను తొలిగించి , ఉపయోగ కరమైన కణజాలం నిర్మితం అవడం ! 
2. కండరాలలో : పగలు కష్ట పడి పని చేయడం వల్ల కండరాలలో కలిగే  మార్పులను రిపేరు చేస్తుంది నిద్ర : అంటే  ఎక్కువ గా పని చేసిన కండరాలలో పేరుకున్న మలినాలను తొలగించి , కండరాలను మళ్ళీ ప్రాణవాయువు తో నింపడం , ఇంకా , ఎక్కువ గా సాగ దీయడం వల్ల  పాడయిన కండరాల పొరలను దృఢ మైనవి గా తయారు చేయడం కూడా  నిద్ర లోనే ఎక్కువ  ప్రభావ శీలం గా జరుగుతుంది ! 
3. నిద్రా సుందరుల చర్మం కాంతి వంతం గా నిగ నిగ లాడుతూ ఉంటుంది ! ఎందుకంటే , చర్మ కణాలలో అనేక జీవ రసాయన చర్యలు, మనం నిద్ర పోతున్నప్పుడే జరుగుతాయి ! అంతే కాకుండా , మన చర్మ సహజ పోషణ కు అవసరమైన గ్రోత్  ఫ్యాక్టర్ లు నిద్ర లోనే ఉత్పత్తి అవుతాయి !  ఆ పదార్ధాలన్నీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి !
చర్మ కణాలకు తగినంత  పోషక పదార్ధాలను సరఫరా చేయడం తో పాటుగా , చర్మాన్ని  చక్కటి సాగే గుణం కొన సాగించే పనులు అన్నీ కూడా నిద్ర సరిగా పోతున్నప్పుడే జరుగుతాయి ! 
4. ప్యాంక్రియాస్ : ఈ గ్రంధి మన దేహం లో ఉండే అతి ముఖ్యమైన గ్రంధి ! :   ఇది కూడా ఒక చిన్న పాటి కర్మాగారం మన దేహం లో !  ఈ గ్రంధి చేసే అతి ముఖ్యమైన  పనులలో ఒకటి , మన రక్తం లోని చెక్కర శాతాన్ని తగు పాళ్ళలో నియంత్రించడం !  ఉదాహరణ కు రెండో మూడో లడ్డూ లు తిన్నా కూడా , రక్తం లో వెంటనే చెక్కర శాతం కంట్రోలు చేసేది  ప్యాంక్రియాస్ గ్రంధి మాత్రమే !  నిద్ర లేమి వల్ల , ఈ  ప్యాంక్రియాస్ కర్మాగారం లో క్రియలు  వేగం గా జరగవు ! అంటే , రక్తం లో చెక్కర  ఎక్కువ అవుతుంది !  ఈ పరిస్థితి చాలా కాలం కొన సాగితే , మధుమేహం  గా మారుతుంది ! అంటే డయాబెటిస్ వస్తుంది ! 
5. మెదడు లో : మనం వేగం గా నడవడం గానీ , లేదా పరిగెత్తడం కానీ , లేదా ఏపని అయినా శ్రమ  పడి చేసినప్పుడు కానీ ఏ రకం గా చెమట ఏర్పడి , ఆ ఏర్పడిన చెమట చర్మం ద్వారా బయటకు వస్తుందో , అదే రకం గా , మనం పగలంతా పని  చేశాక , లేదా చదువుకున్నాక , మెదడు లో కణాలన్నీ కూడా అలసి పోయి , వివిధ రకాల జీవ రసాయన పదార్ధాలను , ఉత్పత్తి చేస్తాయి ! అందులో మలిన పదార్ధాలు కూడా చాలా  ఏర్పడతాయి !  ఈ రకం గా ఏర్పడిన మలిన పదార్ధాలు , కేవలం  నిద్ర లోనే  , మన రక్తం లో కలవడం , తద్వారా , మన మూత్ర పిండాల ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది ! 
పైన చెప్పుకున్న వన్నీ చదివాక మనకు తెలిసేది ఒకటే !  పగలు , మన దేహం, మనం చేసే  అన్ని రకాల పనులకూ , సంపూర్ణం గా తన సహకారం అందించి , రాత్రి సమయం లో మనం నిద్ర పోతున్నప్పుడు మాత్రమే , అవసరమైన రిపేరు చేసుకుంటుంది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

నిద్రలో ఏమి జరుగుతుంది ? 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on అక్టోబర్ 25, 2014 at 5:52 సా.

నిద్రలో ఏమి జరుగుతుంది ? 1. 

‘ మత్తు వదలరా నిద్దుర , మత్తు వదలరా’  ! అని ఘంటసాల గారు పాడిన పాట , సినిమా సంగీత ప్రియులందరూ విని వుంటారు ! అతినిద్రా లోలుడు , తెలివిలేని మూర్ఖుడు ! అని  కర్తవ్యాన్ని బోధిస్తాడు కృష్ణ పరమాత్ముడు ! భీముడికి ! ఆ పాట లో !  అతి నిద్ర ఎంత ప్రమాదమో , నిద్ర లేమి కూడా అంతే ప్రమాదం ! అది కూడా అనేక అనర్ధాలకు హేతువు ! ఇటీవలి పరిశోధనల ఫలితం గా ఈ నిజాలు తెలిశాయి ! 
మనం సామాన్యం గా , నిద్ర పోవడం అంటే , ఏపనీ చేయకుండా ,  కళ్ళు మూసుకుని  విశ్రాంతి తీసుకోవడం అనే అనుకుంటాం ! కానీ ,  మన దేహం లో అనేక  అవయవాలు , మనం నిద్ర పోయే సమయం లో అనేక జీవ రసాయన చర్యలలో పాలు పంచుకుంటాయి ! శాస్త్రజ్ఞులు ఈ నిద్ర వల్ల ఉపయోగాలను ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు ! అలసి పోయి , నిస్తేజం గా ఉన్న  మన దేహాన్నీ , మన మెదడునూ , ఏ  మందుల అవసరమూ లేకుండా , సహజం గానే  మళ్ళీ ఉత్తేజం కలిగించి ,  శక్తివంతం చేయగలిగే  సామర్ధ్యం కేవలం నిద్రకు మాత్రమే ఉందని ! కాక పొతే , ఈ నిద్ర వల్ల మనం పొందే ప్రయోజనాలు , సరి పడినంత నిద్ర పోతేనే  పొంద గలుగు తామని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు ! ఆత్మ న్యూనతా భావాలూ , ఆందోళనా మనస్తత్వం , ఇవి కూడా  నిద్ర సరిగా ఉంటే , మటు మాయ మవుతాయని తెలిసింది ! 
నిద్ర వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు , నిద్ర లేమి లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ఉత్తమం ! 
మన మెదడును ఒక హార్డ్ డిస్క్ గానూ , ఒక మంచి ప్రాసెసర్ గానూ మనం ఊహించుకుంటే ,మన కంప్యూటర్ లకు కనుక మనం రాత్రి సమయం లో  స్విచ్ ఆఫ్ చేసి,  చల్ల బరచి నట్టు గా,మన నిద్ర ను, పోల్చుకోవచ్చు ! మనం మెళుకువ గా ఉన్నప్పుడు మెదడు లో ఏర్పడ్డ అనేక హాని కర పదార్ధాలు ( వీటిని ఫ్రీ రాడికల్స్ అంటారు, జీవ రసాయన శాస్త్ర పరం గా అంటే, బయో కెమిస్ట్రీ లో సాంకేతిక నామాలు ) , రాత్రి సమయం లో, మెదడు నుంచి కడిగి వేయ బడుతూ ఉంటాయి.  ఇట్లా కడిగి వేసే అనేక యాంటీ ఆక్సిడెంట్ లు, రాత్రి సమయం లో, మనం నిద్ర పోతున్నప్పుడే ఎక్కువ గా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మన మెదడు కణాల లో ! నిద్ర లేమి లో,   మన మెదడు లో నిర్మితమై ఉన్న అనేక లక్షల నాడీ  కణాలు ,  బాగా అలసి పోయి ఉంటాయి , మనతో పాటుగా ! ఆ పరిస్థితి లో , హానికర పదార్ధాలను కడిగే యాంటీ ఆక్సిడెంట్ లు తక్కువ అవుతాయి !  ఒక వేళ , మనకు ఒక్క సారిగా ఎక్కువ సమయం ( లేదా తగినంత సమయం ) నిద్ర పోవడానికి అవకాశం లేక ,  గంట , రెండు గంటలు కునుకు తీసినా కూడా ,  తగినంత లాభం ఉండదు ! సరే, మరి  ఈ యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ గా లేక పొతే ఏమవుతుంది ? అనుకునే వారు చాలా మంది ఉన్నారు ! మెదడు లో ఈ  పరిస్థితి ని , మనం, కిటికీలు మూసి వేసిన గదిలో , ఒక నాలుగు గంటలు ఉంటే ఎట్లా ఉంటుందో , దానితో పోల్చుకోవచ్చు ! లేదా, కారులో విండోస్ మూసేసి  ఒక గంట సమయం కూర్చున్న పరిస్థితి తో పోల్చుకోవచ్చు ! అప్పుడప్పుడూ , నిద్ర కోల్పోవడం సహజమే ! అనుకోని పరిస్థితులలో ఇట్లా జరగ వచ్చు ! కానీ, నిద్ర లేమి ఒక అలవాటు గా మారుతున్నప్పుడే  , పరిస్థితులు తల్ల క్రిందు లవుతాయి , మెదడులోనూ , తద్వారా మన జీవితాలలోనూ !  ఇట్లా  ఫ్రీ రాడికల్స్  ఎక్కువ గా మెదడులో పేరుకు పోతూ ఉంటే , అవి మెదడు కణాలను దెబ్బ తీయగలవని , ఎలుకల మెదడుల మీద చేసిన పరిశోధనల లో ఋజువైంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

ఇదో రకం మోసం ! 4. 419 మోసం ఎట్లా చేస్తారు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our minds on సెప్టెంబర్ 6, 2014 at 8:11 సా.

ఇదో రకం మోసం ! 4. 419 మోసం ఎట్లా చేస్తారు ? 

 

 

 ఇంటర్నెట్ లో జరుగుతున్న సర్వ సాధారణ మోసాలలో ఇది ఒకటి !  ఈ మోసానికి 419 మోసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే , నైజీరియా దేశం లో ఇట్లాంటి మోసాలు చేసే వాళ్ళను 419 సెక్షన్ క్రింద విచారిస్తారు , ఒక వేళ వాళ్ళను పట్టుకో గలిగితే ! 
419 మోసం అని దేనిని అంటారు ? 
ఈ మోసం చేసే మోసగాళ్ళు , ప్రధానం గా మన ఈమెయిలు అడ్రస్ కు ఈమెయిలు చేస్తూ ఉంటారు ! లేదా ఉత్తరాలు టైప్ చేసి మన ఫాక్స్ నంబర్ లకు  ఫాక్స్ చేస్తూ ఉంటారు ! కొన్ని కేసుల్లో , ఈ మోసగాళ్ళు , మన ఇంటికి పోస్టు ద్వారా ఈ మోసం మొదటగా, అమెరికా ,  ఇంగ్లండు , నైజీరియా , దక్షిణాఫ్రికా , నెదర్లాండ్స్ , ఐవరీ కోస్టు , స్పెయిన్ దేశాలలో మొదలయింది ! 
419 మోసాన్ని ఎట్లా చేస్తారు ?
మనకు వచ్చే ఉత్తరం ఇట్లా మొదలవుతుంది ” లాయర్ ( ఒక పేరు ఉంటుంది ) డెస్క్ నుంచి రాయబడిన ఉత్తరం ” అని  కానీ , ” మీ సహాయం అవసరం  ” అని కానీ ఉంటుంది ! అందులో ప్రధాన పాత్ర ధారుడు ఒక బ్యాంకు ఉద్యోగి కానీ , లేదా , ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కానీ పరిచయం చేసుకుంటాడు ! వారికి , ఒక చోట అధిక మొత్తం లో డబ్బు ఉందనీ , లేదా బంగారం నిల్వలు ఉన్నాయనీ చెబుతారు ! అంటే ఆ బ్యాంకు ఉద్యోగి ‘ నాకు తెలిసిన ఒక కోటీశ్వరుడు నా బ్యాంకు లో అకౌంట్ కలిగి ఉన్నాడు ! ఆ కోటీశ్వరుడు , క్యాన్సర్ తో బాధ పడుతూ , అవసాన దశ లో ఉన్నాడు ! ఆయనకు ‘ నా ‘ అనే వాళ్ళెవరూ లేరు ! అని కానీ ‘ లేదా ఒక కోటీశ్వరుడు ఈ మధ్య జరిగిన విమాన ప్రమాదం లో మరణించాడు ! అతని అకౌంట్ మా బ్యాంకు లో ఉంది , ఆ డబ్బు తీసుకోవడానికి , ఎవరూ లేరు ఆయనకు ! అట్లాంటి ధనాన్ని , ఆ బ్యాంకు అకౌంట్ లోనుంచి బయటికి చేర్చడానికి ‘ మీ సహాయం కావాలి ‘ అని చక్కగా వెన్న పూసినట్టు రాసిన ఉత్తరాలు మనకు అందుతాయి ! 
గమనించ వలసినది , ఇట్లా పంపే ఈమెయిలు లు కానీ పోస్టు చేసే ఉత్తరాలూ , ఫాక్స్ లూ కానీ , అనేక మిలియన్ల లో చేస్తూ ఉంటారు, రోజూ ! అందులో అనేక మిలియన్ల మంది కి పైగా జనాలు , అట్లాంటి ఉత్తరాలను , ఈమెయిలు లను పట్టించుకోరు ! కేవలం కొన్ని వందలో వేలో మంది మాత్రమే , వారికి సమాధానం రాస్తారు ! అదే ఆ మోసగాళ్ళకు కావలసినది ! అదే వాళ్ళ పధకం కూడా ! ఇట్లా ఆ డబ్బు ను తరలించడానికి , తమకు సహాయం చేస్తే , ఆ మొత్తం డబ్బులో 20- 30 – లేదా 40 శాతం  కమీషన్ మనకు ఇస్తామని నమ్మిస్తారు ! 
ఇక సమాధానం రాసిన వారికి నమ్మకం కలిగించడానికి , వాళ్ళు , తప్పుడు ID లు ఉపయోగించి , టైపు చేసిన అనధికార పత్రాలను , అధికార పత్రాలని చెప్పుకుంటూ , పంపిస్తారు ! కొన్ని రోజులయిన తరువాత , అంటే , ఆ మోసగాళ్ళు , మన విశ్వాసం పొందిన తరువాత , బ్యాంకు నుంచి , ఆ డబ్బును రిలీజ్ చేయించడానికి , కొన్ని అవరోధాలు ఉన్నాయనీ , అందుకు ముందే ఒప్పుకున్నందుకు , ఆ బ్యాంకు వాళ్లకు , లంచం ముందుగా ఇవ్వాలనీ , మనతో చెబుతారు ! అప్పుడే  ఆ మోసగాళ్ళు వేసిన పాచికలు పారతాయి ! మన అంగీకారం తెలిపాము కనుక , కొంత లంచం ఇచ్చామంటే , ఆ మొత్తం డబ్బు బయటకు వచ్చాక , మనకు వచ్చే కమీషన్ లో ఇది ఏ పాటి ? అని కొన్ని వేలల్లో , లేదా లక్షలలో ముందుగా , ఆ మోసగాళ్ళు చెప్పిన చోటికి పంపించడం జరుగుతుంది ! ఈ వ్యవహారం అంతా , రహస్యం గా జరుగుతుంది కాబట్టీ , మనం ఎవరికీ , ఈ విషయం చెప్పకుండా , మనకు మోసగాళ్ళ నుంచి వచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాము ! మన డబ్బు ఆ మోసగాళ్ళ కు అందుతుంది కానీ , వాళ్ళ నుంచి మనకు వచ్చే డబ్బు కోసం 419 రోజులు పడిగాపులు పడ్డా , అది వృధానే ! ఎందుకంటే ,  ఆ మోసగాళ్ళది  అంతా నాటకమే ! పోయేది మన డబ్బే , వచ్చేది ఏమీ ఉండదు !
వార్నింగ్ : మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరు అడిగినా అనుమానించాల్సిందే !  2. వెస్టర్న్ యూనియన్ లేదా మనీ గ్రామ్ ద్వారా పంపే డబ్బు  అంతే సంగతులు ! అంటే , ఆ డబ్బు ను క్యాన్సిల్ చేయడం కానీ , తిరిగి  మనం పొందడం కానీ జరగదు !  ఆ మోసగాళ్ళు కోరుకునేది అదే !  ఒక సారి మనం పంపిన మన డబ్బు , వారికే చెందాలి , మనకు చెందకూడ దనే ! 
పైన ఉన్న ఉత్తరం చదివితే తెలుస్తుంది , ఈ మోసగాళ్ళు ఎంత కమ్మగా రాస్తారో  ! ( అట్లాంటి ఈమెయిలు నాకూ ఒకటి వచ్చింది ! ) 
వచ్చే టపాలో ఇంకో రకం మోసం గురించి ! 
 

ఇదో రకం మోసం !

In మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఆగస్ట్ 20, 2014 at 10:30 ఉద.

ఇదో రకం మోసం !  

 
మానవ జీవితం అమూల్యం . అది ఒక అత్భుతం ! ఒక వరం ! ఒక అవకాశం ! ఒక ప్రయాణం ! పుట్టినప్పటి నుంచీ , మానవుడు తన , మెదడూ , శరీరమూ  ఆరోగ్యం గా పెరగడానికి చేసే ప్రయత్నాలు  అనేకం ! అందుకు జీవితకాలం సరిపోదు కూడా ! 
శరీర ఆరోగ్యానికి సమతుల్యమైన ఆహారం ముఖ్యం ! అట్లాగే మెదడు పెరగడానికి , అంటే  అపరిమితమైన స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉన్న మెదడు లో విజ్ఞానాన్ని నింపడానికి , విద్య అవసరం. కానీ కోట్లాది ప్రజలకు , సమ తుల్యమైన ఆహారం తో పాటు గా సరి అయిన విద్య కూడా  అందట్లేదు అనేక కారణాల వల్ల !  అందుకే  మొదలవుతుంది సంఘర్షణ ! పోరు ! ఈ సహజ సిద్ధ మైన పోరు తో పాటుగా మానవుడు ప్రతి నిత్యం , తన  తోటి మానవులతో పోటీ తో పాటు గా ఆ తోటి మానవులు చేసే మోసాలు కూడా గమనిస్తూ అప్రమత్తత అలవరుచుకోవాలి ! 
సాధారణం గా, ఒక బడి లో కానీ , ఒక విద్యాలయం లో కానీ , కేవలం విద్య మీదే , విద్యార్ధులు తమ ఏకాగ్రత నిలపడం కోసం , మిగతా విషయాలేవీ బోధించ కుండా , కేవలం ఆ సిలబస్ కు సంబంధించిన విషయాలే పాఠాల్లో చెబుతూ ,  బయటి ప్రపంచం గురించి ఏమాత్రం తెలియ చేయకుండా విద్యార్ధులను కేవలం ‘ బావి లో కప్పల్లా ‘ తయారు చేయడం జరుగుతుంది !  
బయట ప్రపంచం లో మోసాలు అనేక రకాలు గా జరుగు తూ ఉంటాయి !  మరి ఈ మోసాల గురించి తెలుసుకోవడం లో ఉపయోగం ఏమిటి ? అనుకుంటే ,  మోసాలు ‘ ఇట్లా కూడా ఉంటాయి ‘ అని తెలుసుకుంటే నే కదా మోస పోకుండా నివారించు కో గలిగేది !  మోసాల గురించి ఏమాత్రం అవగాహన లేక పోవడం , కేవలం , పాములు ఉండే అడవి లో  నడుస్తూ , అన్ని పాములూ విష రహితం అనుకోవడం లా ఉంటుంది ! అందుకే  మోసాల గురించి  నాకు తెలిసినది నా టపా ద్వారా తెలియ చేద్దామని ప్రయత్నం !  జీవితం లో ఒక సారో , రెండు సార్లో మోస పొతే,  మోసపోయిన వారి జీవితం అనేక రకాలుగా కృంగి  పోతుంది ! కానీ  మోసాల గురించి తెలుసుకుని , తగు జాగ్రత్తలు తీసుకుంటే , వారి జీవితం  మెరుగు గా ఉంటుంది !  
ఈ బ్లాగు చూసే ప్రతి వారూ , వారి జీవితాలలో కనీసం ఒక్క సారైనా మోసపోయి ఉంటారు ! వారి నుంచి స్పందన కూడా , నా టపాను పరి పుష్టం చేస్తుంది ! మోసాల గురించి తెలుసుకుందామనుకునే వారికి ఎంత గానో ఉపయోగ పడుతుంది ! 
మోసం అని దేనిని అంటారు ? : ఉద్దేశ పూర్వకం గా,  అంటే , బాగా అలోచించుకుని , స్వంత లాభం కోసం , ఇతరులను  చేసే వంచన ను మోసం అంటారు ! అంటే , ఇతరులను మోసం చేసే వారు , ఏమీ తెలియని వారిలా నటిస్తూ ఉన్నా , వారికి వారు చేసేదేమిటో స్పష్టం గా అవగాహన కలిగి  ఉంటారు ! వారు ఇతరుల అమాయకత్వం ద్వారా లాభం పొందు దామని కూడా నిర్ణయించు కునే ఉంటారు ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !