Our Health

రచయత ఖజానా

ప్ర.జ.లు.1.

In ప్ర.జ.లు., Our Health on జూలై 23, 2012 at 9:04 సా.

ప్ర.జ.లు.1.

 
1. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ? :
ముఖ్యం గా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నివారణకు రెండు రకాల రిస్కు ఫ్యాక్టర్ లు ఉన్నాయి.
మొదటి రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను దాట వేసి , రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను నివారించు కోవచ్చు.రెండవ రకానికి చెందిన రిస్కు ఫ్యాక్టర్ లను ఆచరించడం ద్వారా నివారణ అవకాశాలను ఎక్కువ చేసుకోవచ్చు. 
మొదటి రకం రిస్కు ఫాక్టర్ లు ఏమిటో తెలుసుకుందాము ( ఇవి సాధ్య మైనంత వరకు ఎవాయిడ్ చేయ గలిగిన రిస్కు ఫ్యాక్టర్ లు ) : 
1.ఈస్త్రోజేన్ ( ఎన్దోజినస్ ఈస్త్రోజేన్ ) : స్త్రీలలో ఈస్త్రోజేన్ అనే హార్మోను ఎంత ఎక్కువ కాలం వారిలో ఉంటే , అంత గా రిస్కు పెరుగుతుంది. దీనినే మనం ఇంకో విధం గా చెప్పుకోవచ్చు. అతి తక్కువ వయసు అంటే పదకొండు సంవత్సరాలకూ , అంతకు ముందూ , రజస్వల అయినవారిలో , బహిష్టు లేదా ఋతు క్రమం ఆలస్యం గా ఆగి పోయిన వారిలోనూ, ఇంకా , ముప్పయి అయిదు సంవత్సరాల వయసు దాటాక సంతానం కలిగిన వారిలోనూ , లేదా అసలు సంతానమే లేని స్త్రీలలోనూ , ఈ ఈస్త్రోజేన్ హార్మోను ప్రభావం, వారి స్థనాల మీద హాని కరంగా ఉంటుంది.
2. గర్భ నిరోధానికి వేసుకునే హార్మోను మందులు: ఈ మందులలో ప్రధానం గా ఈస్త్రోజేన్ హార్మోనూ , ప్రోజేస్తోజేన్ హార్మోనూ కలిపి ఉన్న మందులు వాడు తున్న వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు అనేక పరిశోధనల వల్ల వెల్లడి అయింది.
3.రేడియేషన్ కు అతిగా ప్రభావితం కాకుండా ఉండడం: చాతీ ఎక్స్ రే తీయించు కోవడం కూడా , స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను అధికం చేస్తుంది. ప్రత్యేకించి , స్త్రీలకు ఇరవై సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసులో కనక చాతీ ఎక్స్ రే తీయించుకుంటే !
4.ఒబీసిటీ లేదా ఊబ కాయం: అతి బరువు ఉండే స్త్రీలలో , ప్రత్యేకించి బహిష్టు ఆగి పోయి అంటే ఋతు క్రమం పూర్తిగా ఆగి పోయిన, ఇంకా హార్మోనులు వాడని స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అధికం గా ఉన్నట్టు గుర్తించారు.
5. ఆల్కహాలు లేదా మద్యం సేవించడం: ఆల్కహాలు తాగే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం , వారు తాగుతున్న ఆల్కహాలు పరిమాణం బట్టీ , వారు ఎంత కాలం నుంచి తీసుకుంటున్నారు అనే విషయం బట్టీ ఆధార పడి ఉంటుంది. అంటే, ఎక్కువ కాలం , ఎక్కువ మోతాదు లో కనుక స్త్రీలు మద్యం సేవిస్తూ ఉంటే , వారిలో రొమ్ము క్యాన్సర్ అధికం గా వస్తుందని విశదమైంది.
6.అనువంశికమైన రిస్కు: BRCA1 and BRCA2  అనే జీన్సు అనువంశికం గా  సంక్రమించి నట్టయితే , ఆ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం హెచ్చుతుంది. అంతే కాక ఈ  జీన్సు లేదా జన్యువులు కనుక సంక్రమించితే , వారిలో రొమ్ము క్యాన్సర్  వారి వయసు తక్కువ గా ఉన్నప్పుడే వస్తుంది.
మిగతా జాగ్రత్తలు వచ్చే టపాలో ! 
( ప్ర.జ.లు .( ప్ర = ప్రశ్నలూ , జ= జవాబులూ ) అనే కొత్త శీర్షిక లో సాధారణమైన వైద్య సమస్యలకూ , సందేహాలకూ , సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ‘బాగు ‘ ఉద్దేశం, చదువరులకు వైద్య విజ్ఞాన పరంగా ఎక్కువ అవగాహన కలిగించడానికే. వారికి చికిత్స చేయడానికి కాదు. చదువరులు వారి సమస్యలనూ , సందేహాలనూ  పంప వచ్చు. వీలు ను బట్టి సమాధానం ఇవ్వడం జరుగుతుంది.
బాగు.నెట్ లో 200 వందల టపాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బాగు ను ఆదరిస్తున్న( ఇంత వరకూ 17,506 హిట్స్ ) సందర్శకులకు.కృతఙ్ఞతలు.)
 
 

క్యాన్సర్ నివారణ కు, మనం తీసుకోగల జాగ్రత్తలు ఏమిటి ? :

In Our Health on జూలై 22, 2012 at 11:46 ఉద.

 క్యాన్సర్ నివారణ కు  మనం తీసుకోగల జాగ్రత్తలు ఏమిటి ? :

క్రితం టపాలలో బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , ఇంకా రసాయనాలూ , ఏ విధం గా మనలో క్యాన్సర్ కారకం అవవచ్చో , పటాల సహాయం తో తెలుసుకున్నాము కదా ! ఇవే కాక  రేడియేషన్ ప్రభావం వల్ల కూడా క్యాన్సర్ రావటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తెల్ల గా ఉన్న వారు, చర్మ సౌందర్యం కోసం ఎండ లో వారి చర్మాన్ని ఎక్స్పోజు చేయడం చేస్తుంటారు. ఈ సన్ బేదింగ్ వల్ల సూర్య రశ్మి లో ఉండే యు వీ రేస్ ( UV rays or Ultra Violet rays ) వీరి చర్మ కణాలలో మార్పులు తెచ్చి మేలనోమా అనే చర్మ క్యాన్సర్ కు కారణమవుతాయి. అట్లాగే  అతి గా ఎక్స్ రే లు తీయించుకున్నా క్యాన్సర్ రిస్కు హెచ్చుతుంది. మరి మనం ఈ విషయాలు అన్నీ తెలుసుకున్నాము కదా మనకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏవైనా నివారణ చర్యలు వ్యక్తి గతం గా తీసుకో గలమా ? అని ప్రశ్నించుకుంటే కొన్ని సమాధానాలు దొరుకుతాయి. క్యాన్సర్ నివారణ లేదా ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ మనకు వచ్చే అవకాశాన్ని వీలైనంతగా తగ్గించు కోవడమన్న మాట. ఈ టపాలో మనం తీసుకునే సాధారణ చర్యలు క్యాన్సర్ నివారణ లో ఎట్లా ఉపయోగ పడ గలవో చూద్దాము. క్యాన్సర్ నివారణలో మనం ముందుగా గుర్తుంచు కోవలసినది , క్యాన్సర్  వచ్చే అవకాశం తగ్గడానికీ , లేదా హెచ్చదానికీ , మన జన్యువులు  అంటే జీన్స్ , మన జీవన శైలి , ఇంకా మన పరిసరాల ప్రభావాల కలగలసిన పరిణామమే ! క్యాన్సర్ నివారణ మీద అనేక పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రజ్ఞులు  ఈ ముఖ్య సూచనలు చేశారు.

1. క్యాన్సర్ కారక స్థితులను మనం సంపూర్ణం గా దాట వేయడమో అంటే ఎవాయిడ్ చేయడమో , లేదా  వీలైనంత వరకు ఆ పరిస్థితులను , మనలను ఎక్కువ గా ప్రభావితం చేయకుండా నియంత్రించు కోవడమో చేయడం.
2.మన ఆహార నియమాలలోనూ , మన జీవన శైలి లోనూ మార్పులు తెచ్చుకోవడం. అంటే ,changes in diet and lifestyle.
3.క్యాన్సర్ కారక స్థితులను, అంటే ప్రీ క్యాన్సరాస్ కండిషన్స్ ను వీలైనంత తోలి దశలలో గుర్తించడం, ఇంకా అవసరమైనప్పుడు ఈ క్యాన్సర్ కారక స్థితులు , క్యాన్సర్ గా మారకుండా , తగు చికిత్స తీసుకోవడం.
ఇక్కడ రెండు శాస్త్రీయ పదాలను మనం పునశ్చరణం చేసుకుందాము. కార్సినోజెనిసిస్ అంటే క్యాన్సర్ జననం లేదా క్యాన్సర్ మొదలవడం. మ్యుటేషన్ అంటే మన జీవ కణాల జన్యువులలో లేదా జీన్స్ లో వచ్చే ఆకస్మిక మార్పులు. 
మనలో క్యాన్సర్ రిస్కును ఏ ఏ  పరిస్థితులు ఎక్కువ చేస్తాయి? :
1.సిగరెట్ స్మోకింగ్ : ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల ఫలితం గా సిగరెట్ స్మోకింగ్ , లంగ్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ , మూత్రాశయ క్యాన్సర్ అంటే బ్లాడర్ క్యాన్సర్, ఇంకా పాంక్రియాటిక్ క్యాన్సర్, ఇంకా AML అనబడే ఒక రకమైన రక్త క్యాన్సర్  – వీటన్నిటికీ ప్రధానకారణం గా గుర్తించారు. ( స్మోకింగ్ ఎట్లా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో , ఆసక్తి ఉన్న వారు ఆ టపాలను మళ్ళీ చూడ వచ్చు , బాగు ఆర్కివ్స్ లో  )
2.ఇన్ఫెక్షన్: లివర్ క్యాన్సర్ కు కారణ మైన హెపటైటిస్ బీ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఒక టీకా మందు ను తయారు చేశారు. అట్లాగే సర్వికల్ క్యాన్సర్ కు కారణమైన పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో సోకకుండా కూడా ఒక టీకా మందును తయారు చేశారు. ఇవి మానవులు, అంటే శాస్త్రజ్ఞులు ఈ రకమైన క్యాన్సర్ తగ్గించడం లో సాధించిన ప్ర్పగతి.! ( సర్వికల్ క్యాన్సర్ గురించి కూడా వివరం గా క్రిందటి టపాలలో వివరించడం జరిగింది , చదువరుల సౌకర్యం కోసం. ) అదే విధం గా జీర్ణాశయ క్యాన్సర్ కు కారణమైన హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం ఇన్ఫెక్షన్ ను కూడా ట్రిపుల్ థెరపీ తో రూపు మాపి క్యాన్సర్ రిస్కు ను తగ్గించు కోవచ్చు. 
3.రేడియేషన్ : శాస్త్రజ్ఞులు  కొన్ని రకాలైన థైరాయిడ్ క్యాన్సర్లూ , రొమ్ము క్యాన్సర్ , ఇంకా ల్యుకీమియా అనే ఒక రకమైన రక్త క్యాన్సర్ కు కూడా కారణ మవుతుందని కనుక్కున్నారు. ఈ క్యాన్సర్ లు వచ్చే అవకాశం , ఎక్కువ సార్లు , శక్తి వంతమైన రేడియేషన్  ప్రభావం శరీరాన్ని తాకినప్పుడు హెచ్చుతుంది. అందు వల్లనే, అత్యవసరం అయినప్పుడే ఎక్స్ రే పరీక్షలు జరిపించుకోవాలి 
4. రోగ నిరోధక శక్తి తగ్గించే మందులు : ఈ మందులు కొన్ని సందర్భాలలో అనివార్యం అవుతాయి. ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్న వారికి. వీటి వల్ల వారిలో రోగ నిరోధక శక్తి తగ్గి , క్యాన్సర్ కారకమవుతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 
 

క్యాన్సర్ కారకాలు. 5. కెమికల్స్ , ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి?:

In Our Health on జూలై 21, 2012 at 12:35 సా.

క్యాన్సర్ కారకాలు. 5. కెమికల్స్  క్యాన్సర్ ఏ విధం గా కలిగిస్తాయి?:

మరి ఏ ఏ రసాయన పదార్ధాలు , ప్రధానం గా మానవులలో క్యాన్సర్ కారకాలు అవుతాయి ? : 
వీటి వివరాలు క్రింది చిత్రం లో చూడండి. 

మనం క్రితం టపాలలో , బ్యాక్తీరియాలూ , వైరస్ లూ మానవులలో ఎట్లా క్యాన్సర్ కలిగించ గలవో తెలుసుకున్నాము కదా! ఇపుడు వివిధ  ( విష పూరిత ) రసాయన పదార్ధాలు , మన జీవ కణాలను ఏ విధం గా ప్రభావితం చేయ గలవో తెలుసుకుందాము. సామాన్యం గా మన కందరికీ, మనం నిత్య జీవితం లో తెలిసో, తెలియకో , వివిధ రసాయన పదార్ధాలు మన దేహం లో ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి గురించి  ‘ చాలా కెమికల్స్ ఉన్నాయి , మన దేహానికీ , ఆరోగ్యానికీ మంచిది కాదు ‘ అని మాత్రమే అనుకుంటాము కానీ ఆ రసాయన పదార్ధాలు , లేదా కెమికల్స్ ఖచ్చితం గా ఎట్లా మనకు హాని కలిగిస్తాయో, ఆ అవగాహన కొంత మందికి మాత్రమె ఉంటుంది. ఆ విషయాలు, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా తెలుసుకోవచ్చు. అది బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఆ వివరాలు చూద్దాము.
పైన ఉన్న చిత్రం గమనించండి. కెమికల్స్  జీవ కణాలను రెండు దశలు గా ముట్టడి చేసి, వాటిలో మార్పులు తెచ్చి , ఆ సహజ మైన జీవ కణాలను ట్యూమర్ కణాలు గా మారుస్తాయి. ట్యూమర్  మొదలయ్యే దశ , ట్యూమర్ పెరిగే దశ, వీటినే ట్యూమర్ ఇనిషి ఏషన్ దశ , ఇంకా ట్యూమర్ ప్రొమోషన్ దశ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు దశలూ, పైన ఉన్న చిత్రం లో వివరింప బడ్డాయి.
ట్యూమర్ ఇనిషి ఏషన్ దశలో , బెంజ్ పైరీన్ అనే విష పూరిత రసాయనం , లోహం అయానుల తో కలిసి,
( ఉదాహరణకు నికెల్ అనే లోహ అయానులు ) జీవకణాలలో జన్యు పదార్ధ జీన్స్ , ప్రత్యేకించి క్యాన్సర్ జీన్స్ అయిన P53 and RAS  జీన్స్  లో మ్యుటేషన్ అంటే సమూలమైన మార్పులు తెస్తాయి. ఈ మార్పులు చెందిన జీన్స్ అంటే జన్యువులు, క్యాన్సర్ కణాలనే ఉత్పత్తి చేస్తూ పోతాయి, సహజ కణాలు కాకుండా !  దానితో క్యాన్సర్ మొదలవుతుంది.
ట్యూమర్ ప్రొమోషన్ దశలో  కొన్ని విష రసాయన పదార్ధాలు ఉదాహరణకు  డయాక్సిన్ లు ఇంకా బెంజ్ పైరీన్ లు ( వీటి గురించి మనం,  మీ ఆసక్తి ని బట్టి ! , ముందు ముందు తెలుసుకుందాము ) AhR అనే రిసెప్టార్ తో కలిసి, కనీసం నాలుగు అయిదు రకాలు గా జన్యు పదార్ధం లో మార్పులు తెస్తాయి. దానితో , క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడానికి , సహజ జీవ కణాలు ప్రోగ్రాము  అవబడతాయి. 
ప్రాధమికం గా, ఏ రసాయనం అయినా క్యాన్సర్ పైన వివరించిన  విధం గా సహజ మైన జీవ కణం లోని జన్యువు లలో మార్ప్లు తెచ్చి , అసహజ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసే విధం గా జన్యువుల సాఫ్ట్ వేర్ ను ప్రోగ్రాం చేస్తాయన్న మాట ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం ! 

క్యాన్సర్ కారక స్థితులు. 4. వైరస్ లతో క్యాన్సర్ వస్తుందా ? :

In Our Health on జూలై 20, 2012 at 6:25 సా.

క్యాన్సర్ కారక స్థితులు. 4. వైరస్ లతో క్యాన్సర్ వస్తుందా ? : 

 

మనం క్రితం టపాలలో మానవులలో క్యాన్సరు కు కారణ భూతమైన బ్యాక్టీరియాలను గురించి తెలుసుకున్నాము. మరి  వైరస్ లతో క్యాన్సర్ రిస్క్ ఎట్లా వస్తుందో తెలుసుకుందాము.
వైరస్ నిర్మాణం మొట్ట మొదటి సారిగా 1892 లో రష్యన్ శాస్త్రజ్ఞుడు ఇవానోవ్స్కీ  కనుక్కున్నాడు.తరువాత బైజరింక్ అనే శాస్త్రజ్ఞుడు టొబాకో మొజాయిక్ వైరస్ నిర్మాణాన్ని ప్ర ప్రధమం గా ప్రపంచానికి తెలియ చేశాడు ( 1898 ). మనకు సర్వ సాధారణం గా వచ్చే జలుబు  ఫ్లూ వైరస్ వల్ల వస్తుంది. దీనినే ఇన్ఫ్లూ ఎంజా  వైరస్ అంటారు. వైరస్ లు లేని చోటంటూ లేదు. పైన ఉన్న చిత్రం చూడండి, ఒక సాధారణ ఫ్లూ వైరస్ యొక్క నిర్మాణం తెలుసుకోవడం కోసం. 
కేవలం సాధారణ ఇన్ఫెక్షన్ లే కాకుండా , వైరస్ లు కూడా క్యాన్సర్ కలిగిస్తాయని మీకు తెలుసా?  వైరస్ నిర్మాణం లో ఆర్ ఎన్ ఏ వైరస్ లూ , డీ ఎన్ ఏ వైరస్ లూ అని రెండు రకాలు ఉన్నాయి. వీటినే DNA tumour virus, RNA tumour virus లు అని కూడా అంటారు.
DNA ట్యూమర్ వైరస్ లు : 
పాపిలోమా వైరస్ లు : వీటిలో ఒక వంద రకాలు ఉన్నాయి.కానీ అన్నీ క్యాన్సర్ ను కలిగించవు. కానీ అన్ని క్యాన్సర్ లలో పది శాతం ఈ పాపిలొమా వైరస్ లు కలిగిస్తాయి.HPV కలిగించే సర్వికల్ క్యాన్సర్ గురించి వివరం గా ఇంత కు ముందు టపాలలో రాయడం జరిగింది. ఆసక్తి ఉన్న వారు ఆ టపాలు చూడ వచ్చు. 
పాలియోమా వైరస్ : ఈ వైరస్ లు మానవులలో పోలియో కు కారణమవుతాయి. ఇటీవల పరిశోధనల ఫలితాల వల్ల పాలియోమా వైరస్ BK అనే రకానికి చెందినది, మానవులలో ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణ మవుతుందని కూడా తెలిసింది. అంతే కాక కొన్ని రకాలైన పోలియో వైరస్ లు ఒక అరుదైన చర్మ క్యాన్సర్ ను కూడా కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
హెర్పిస్ వైరస్: EBV ( Epstein Barr Vairas )  ఈ వైరస్  హెర్పిస్ DNA వైరస్ రకానికి చెందినది. ఈ వైరస్ మానవులలో బర్కిట్ లింఫోమా అనే  లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ ఆఫ్రికా లోని అతి పేద దేశాలలో ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలలో మలేరియా కూడా ఎక్కువ గా ఉండడం శాస్త్రజ్ఞులు గమనించారు. అందువల్ల మొదట మలేరియా వచ్చి, రోగ నిరోధక శక్తి చాలా తగ్గి పోయిన వారికి ఈ EBV వైరస్ సోకి వారిలో లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కు కారణమవుతుందని భావించడం జరుగుతుంది. కపోసీస్ సార్కోమా అనే కండరాల క్యాన్సర్ కూడా ఈ హెర్పిస్ రకానికి చెందిన వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల నే వస్తుంది.
అంతే కాక లివర్ లేక కాలేయ క్యాన్సర్ కు కారణమైన హెపటైటిస్ బీ , హెపటైటిస్ సి రకాలకు చెందిన వైరస్ లు కూడా  DNA వైరస్ లే ! 
RNA ట్యూమర్ వైరస్ లు :వీటిని రిట్రో వైరస్ లు అని కూడా అంటారు.  ఈ తరగతిలో ముఖ్యమైనది HTLV1 అనే వైరస్. ఈ వైరస్ లింఫ్ గ్రంధుల క్యాన్సర్ కలిగిస్తుంది. 
పైన ఉన్న చిత్రం చూడండి. రిట్రో వైరస్ అందం గా కనిపిస్తుంది కదూ !  అందం గా కనిపించే వైరస్ లు మానవులకు ప్రమాద కరమైనవి కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !  

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు.

In Our Health on జూలై 18, 2012 at 7:39 సా.

క్యాన్సర్ కారక స్థితులు.3. బ్యాక్టీరియాలు కలిగించే మిగతా క్యాన్సర్లు. 

( reproduced from Young et al. courtesy: Macmillan publishers  Ltd.) 

క్రితం టపాలో , హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియం, జీర్ణాశయం లో అల్సర్ లు ఏర్పడడానికీ, జీర్ణాశయం లో క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఏర్పడడం లో ప్రధాన పాత్ర ఎట్లా వహిస్తుందో తెలుసుకున్నాము కదా !  కేవలం హెలికో బాక్టర్ పైలోరి నే కాకుండా , మిగతా బ్యాక్టీరియాలు కొన్ని కూడా మానవులలో క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
సాల్మొనెల్లా టైఫి ( పిత్తాశయ క్యాన్సర్ కలిగింస్తుంది ) : ( పైన ఉన్న చిత్రం చూడండి . పైన ఉన్న చిత్రం లో మొదట సాల్మొనెల్లా టైఫి మ్యూరియం అనే బ్యాక్తీరియం ప్రేగు గోడల ( కణాల ) లోకి చొచ్చుకు పోవడం, తరువాత బీ కణాలు, టీ కణాల ద్వారా లింఫ్  గ్రంధి లోకి వెళ్ళడం చూప బడింది.  అదే చిత్రం లో కుడి వైపున సాల్మొనెల్లా టైఫి అనే ( ఇది కూడా టైఫాయిడ్ కారక ) బ్యాక్టీరియం కూడా ప్రేగు కణాల గోడల లోకి చొచ్చుకు వెళుతుంది.తరువాత బీ కణాల లోకీ , టీ కణాల లోకీ వెళుతుంది. అక్కడ నుంచి ఎముకల మూలుగ అంటే బోన్ మారో లోకీ, ప్లీహం లోకీ అంటే స్ప్లీన్  లోకీ వెళ్లి పైత్యాశయం లేదా గాల్ బ్లాడర్ ను చేరుకుంటుంది. అక్కడ ఈ బ్యాక్టీరియాలు వృద్ధి అయి , నిలువ ఉండి, గాల్ బ్లాడర్ లేదా పిత్తాశయ క్యాన్సర్ కు కారణమవుతుంది.  ) ఈ బ్యాక్టీరియం సాధారణం గా మానవులలో టైఫాయిడ్ కలిగిస్తుంది. టైఫాయిడ్ జ్వరం కొందరిలో సరిగా మానక , ( దీనికి కారణం యాంటీ బయాటిక్ లు క్రమం గా తీసుకోక పోవడం వల్ల కానీ , లేదా కొన్ని పరిస్థితులలో చికిత్స సంపూర్ణం గా తీసుకున్నా , కొందరు క్రానిక్ క్యారియర్ స్థితి కి చేరుకుంటారు. అంటే వారు కొన్ని సంవత్సరాల తరబడి , వారి మలం లో టైఫాయిడ్ బ్యాక్టీరియాలను విసర్జించుతూ ఉంటారు. అంటే వారు టైఫాయిడ్ జ్వర లక్షణాలు ఏవీ కనబరచక పోయినా , టైఫాయిడ్ బ్యాక్టీరియాలు మాత్రం వారిలో కొంత నిర్ణీత సంఖ్య లో ఉత్పత్తి అవుతూ ఉండి, వారి మల మూత్రాదుల ద్వారా బయటకు వచ్చి , ఆరోగ్య వంతులైన మిగతా వారిని , ముట్టడి చేసి , వారిలో టైఫాయిడ్ లక్షణాలనూ , టైఫాయిడ్ నూ కలిగించ గలవు. అంతే కాకుండా , ఈ సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియాలు, గాల్ బ్లాడర్ లో అంటే, మన దేహం లో పైత్య రసాలు నిలువ చేసే ఒక సంచి లేదా తిత్తి , ఈ భాగం లో దాక్కుంటాయి. ఇట్లా సంవత్సరాల తరబడి పైత్యాశయం లేదా పిత్తాశయం లో దాక్కున్న సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియాలు, ఆ పిత్తాశయం లోనే క్యాన్సర్ కలిగిస్తాయని పరిశోధనల వల్ల తెలిసింది.
స్త్రెప్తో కాకస్ బోవి  (పెద్ద ప్రేగు క్యాన్సర్ కలిగిస్తుంది ) : ఈ బ్యాక్టీరియం స్త్రెప్తో కొకై అనే రకానికి చెందిన బ్యాక్టీరియం. సామాన్యం గా మానవుల పెద్ద ప్రేగు లో ఉంటుంది. కానీ ఈ బ్యాక్టీరియం కూడా పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చిన వారిలో నలభై నుంచి అరవై  శాతం మందిలో  క్యాన్సర్ కారకం అని నిర్ణయించారు, వివిధ పరిశీలనలలో.  ఈ స్త్రెప్తో కాకస్ బోవి అనే బ్యాక్టీరియం మహా చెడ్డది !  దీని ఇన్ఫెక్షన్ సామాన్యం గా  గుండె లోపలి గోడల లోనూ , ఇంకా గుండె కవాటాలనూ పాడు చేస్తుంది.ఇట్లా గుండె ఇన్ఫెక్షన్ సోకిన చాలా సంవత్సరాల తరువాత , పెద్ద ప్రేగులో క్యాన్సర్ కలిగించడం కూడా గమనించారు. 
క్లామీడియా న్యుమోనియే (ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ కు కారణమవుతుంది )  : ఇది ఇంకో గ్రామ్ నెగెటివ్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియం. అమెరికాలో ఈ బ్యాక్టీరియం కనీసం యాభై శాతం మందిలో, వారి జీవిత కాలం లో ఎప్పుడో ఒక సారి న్యుమోనియా ఇన్ఫెక్షన్ అంటే ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సామాన్యం గా ఫ్లూ లాగా ఉండి కొన్ని రోజులలో తగ్గి పోతుంది. కానీ  కొందరిలో  క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటే దీర్ఘ కాలికం గా ఈ బ్యాక్టీరియాలు వారి ఊపిరి తిత్తులలో ఉండి , ఒక రకమైన ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని క్లామీడియాల్ హీట్ షాక్ ప్రోటీన్ 60 అంటారు. ఈ ప్రోటీన్  అత్యంత రోగనిరోధక శక్తి ని మానవులలో కలిగిస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలికం గా ఉండి, దాని పరిణామాలు దీర్ఘ కాలిక వ్యాధి రూపం లో కనిపిస్తూ ఉంటుంది. ఒక సారి ఈ బ్యాక్టీరియా కలిగించిన దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ వల్ల  లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు హెచ్చుతాయి. 
ఈ బ్యాక్టీరియాలు ఏ విధం గా క్యాన్సర్ కలిగిస్తాయి? : 
బ్యాక్టీరియాలు అన్నీ కొన్ని విష పదార్ధాలను విడుదల చేస్తాయి. వీటిని బ్యాక్టీరియల్ టాక్సిన్ లు అంటారు. ఈ టాక్సిన్ లు మన దేహం లోని జీవ కణాలలో ఉన్న డీ ఎన్ ఏ  అంటే జన్యు పదార్ధాన్ని ముట్టడి చేస్తాయి. అంతే కాక  ఆ సహజమైన ఆరోగ్యమైన జన్యు పదార్ధాన్ని శాశ్వతం గా , అసహజం గా  మార్చి వేస్తాయి. దానితో ఆ అసహజమైన జన్యు పదార్ధం ఉన్న జీవ కణాలు ఒక నియంత్రణ ఏమీ లేకుండా కణ విభజన జరిపి , లక్షలూ , కోట్ల సంఖ్య లో అసహజమైన క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేస్తాయి, ఆ అసహజ , క్యాన్సర్ కణాల సముదాయమే కంతి లేక ట్యూమర్ అని అంటాము. 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?

In Our Health on జూలై 17, 2012 at 10:27 సా.

 క్యాన్సర్ కారక స్థితులు. 2. బ్యాక్టీరియా లు క్యాన్సర్ కలిగిస్తాయా ?:

క్రితం టపాలో మనం ఒక సామాన్య జీవ కణం, జన్యువు లో మార్పు వల్ల క్యాన్సర్ కణం గా పరివర్తనం చెందుతుందో తెలుసుకున్నాము కదా ! 
మరి ఇట్లా జన్యువుల లో పరివర్తన తేవడానికి , బ్యాక్తీరియాలూ, వైరస్ లూ , వివిధ రసాయన పదార్ధాలూ కారణ మవుతాయి.  మన కు అంటే మానవులకు కలిగే కొన్ని  క్యాన్సర్ లలో ఈ బ్యాక్టీరియా లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కడుపు లో క్యాన్సర్ కు ఈ బ్యాక్టీరియా లు ఎట్లా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వివరాలు తెలుసుకుంటే మనం స్టమక్ క్యాన్సర్ లేదా జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఏమి చేయ వచ్చో కూడా విశద  పడుతుంది. 
జీర్ణాశయ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ ఎట్లా వస్తుంది?: 
జీర్ణాశయ క్యాన్సర్  దక్షిణ భారత దేశం లో ఎక్కువ గా వస్తున్నట్టు పరిశోధనల వల్ల తెలిసింది  ముఖ్యం గా మన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కారకం అవుతాయి.ఇక్కడ వివిధ పరిశీలనల లో శాస్త్రీయం గా తెలుసుకున్న ఫలితాలు చూద్దాము. బొంబాయి లో జరిపిన ఒక పరిశీలనలో ఎండ బెట్టిన చేపల తో చేసిన వంటకాలు తింటున్న వారిలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని తెలిసింది. కానీ టీ అంటే తేయాకు, ప్రత్యేకించి పాలు కలుపుకోకుండా తాగే టీ – తాగుతున్న వారిలో స్టమక్ క్యాన్సర్ తక్కువ గా వస్తున్నట్టు తెలిసింది. త్రివేండ్రం లో చేసిన ఇంకో పరిశీలనలో , ఎక్కువ  అన్నం అంటే రైస్ తినే వారిలో , ఎక్కువ వేడిగా ఉన్న ఆహారాలు తినే వారిలో , ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వారిలో, ఎక్కువ కారం తినే వారిలో , స్టమక్ క్యాన్సర్ ఎక్కువ గా వస్తున్నట్టు తెలిసింది.
( Sinha et al : Cancer risk and Diet in India )  ఫ్రైడ్ ఫుడ్ అంటే వేపుడు కూరలు, అవి కూరగాయలతో కానీ మాంసం తో చేసిన కూరలు కానీ , వేపుడు కూరలు ఎక్కువ గా తింటున్న వారిలో కూడా స్టమక్ క్యాన్సర్  ఎక్కువ గా వస్తున్నట్టు గమనించారు.
మరి వేపుడు కూరలు ఎందుకు మనకు హానికరం?  : క్యాన్సర్ కారకాలైన హెటిరో సైక్లిక్ అమీన్ లు మన ఆహారాన్ని ఎంత వేయిస్తూ ఉంటే అంత ఎక్కువ గా తయారవుతూ ఉంటాయి. ఇంకో విధం గా చెప్పాలంటే , వేపుడు కూరలలో , క్యాన్సర్ కారక విష పదార్ధాలు  ఎక్కువ గా ఉంటాయి. ఈ విష పదార్ధాలు జీర్ణాశయ గోడలలో ఉండే కణజాలం లో , ఇంకా ఖచ్చితం గా చెప్పుకోవాలంటే కణాలలోని జన్యు పదార్ధం లో అంటే జీన్స్ నిర్మాణం లో పరివర్తన తీసుకువచ్చి ఆ సహజ కణాలను అసహజమైన క్యాన్సర్ కణాలు గా  మారుస్తాయి.ఒకసారి క్యాన్సర్ కణాలు ఈ విధం గా ఏర్పడ్డ తరువాత , తమ లాంటి క్యాన్సర్ కణాలనే  అధిక సంఖ్య  లో  ఉత్పత్తి చేసి క్యాన్సర్ కు కారణమవుతాయి.  
స్టమక్ క్యాన్సర్ బ్యాక్టీరియా వల్ల వస్తుందా ? : ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకూ , స్టమక్ అల్సర్ లు కేవలం, కడుపులో ఉండే ఆమ్లాలు ఎక్కువ గా ఉత్పత్తి అయి ఆ ఆమ్లాలు లేదా యాసిడ్ లు కడుపు అంటే జీర్ణాశయ గోడలను తిని వేయడం వల్ల  స్టమక్ అల్సర్ లు ఏర్పడతాయి అని భావించ బడుతూ ఉండేది. అందుకే అల్సర్ ఉన్న చాలా మందికి ఆపరేషన్ చేసి ,యాసిడ్ ఎక్కువ గా ఉత్పత్తి చేస్తున్న వేగస్ నాడి ని కత్తిరించే వారు. క్రమేణా , స్టమక్ అల్సర్ ఏర్పడడానికి ప్రధాన కారణం హెలికో బాక్టర్ పైలోరి అనే బ్యాక్త్రీరియం కారణమని ఒక ఆస్త్రేలియన్ వైద్యుడు కనుక్కొన్నాడు. ఆ తరువాత ఈ బ్యాక్తీరియాన్ని హతమార్చడానికి  ట్రిపుల్ తిరపీ అనే మూడు రకాల యాంటీ బయాటిక్స్ ఒక వారం వాడి ఈ బ్యాక్టీరియాలను మన దేహం నుంచి సమూలం గా  నిర్మూలించి తద్వారా అల్సర్ ను కూడా  నయం చేస్తున్నారు వైద్యులు. తరువాత చేసిన, చేస్తున్న పరిశోధన లలో  ఈ హెలికో బ్యాక్తర్ పైలోరి అనే బ్యాక్తీరియం మనకు చేస్తున్న హాని ఇంతా అంతా కాదని తెలిసింది. ప్రత్యేకించి , స్టమక్ క్యాన్సర్ రావడానికి కూడా ఈ బ్యాక్టీరియం ‘ కుట్ర ‘ పన్నుతూ ఉంటుంది.
 మరి ఈ హెలికో బ్యాక్టార్ పైలోరి క్యాన్సర్ ఎట్లా కలిగిస్తుంది?: ఈ బ్యాక్టీరియాల వల్ల జీర్ణాశయ గోడలలో ఉన్న కణాలలో మార్పులు, ప్రత్యేకించి ఆ కణాల జన్యువులలో మార్పులు తీసుకు వచ్చి వాటిని క్యాన్సర్ కణాలు గా మారుస్తాయి. మనం మన వంటలలో ఉపయోగించే పసుపు కొంత వరకు మనకు స్టమక్ క్యాన్సర్ రాకుండా రక్షకం గా పనిచేస్తుంది. పసుపులో హెలికో బ్యాక్టార్ పైలోరి ను హరించే గుణం ఉందని తెలిసింది. 
జీర్ణాశయ క్యాన్సర్  వచ్చే రిస్కు ను మనం ఏవిదం గా తగ్గించుకోవచ్చు ?: 
మనం తినే ఆహార పదార్ధాలను వండుకునే విధానాలలో మార్పులు తీసుకు రావడం ద్వారా మనం రిస్కు తగ్గించు కోవచ్చు. అంతే కాక స్టమక్ అల్సర్ లు కనక వస్తే అశ్రద్ధ చేయకుండా ట్రిపుల్ తిరపీ వాడి హెలికో బ్యాక్తీరియాన్ని  దాని ఇన్ఫెక్షన్ నూ నిర్మూలించుకుంటే , ఆ బ్యాక్తీరియం మనకు ఎక్కువ హాని  చేయకుండా , అంటే క్యాన్సర్  కారకం కాకుండా నివారించుకోవచ్చు.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

క్యాన్సర్ కారక స్థితులు.1.

In Our Health on జూలై 15, 2012 at 6:36 సా.

క్యాన్సర్ కారక స్థితులు.1. 

క్యాన్సర్. దీనినే రాచ పుండు అనే వారు పూర్వ కాలం లో. అంటే  రాజులకు వచ్చే వ్యాది అని పూర్వ కాలం లో అనుకునే వారు. కాల క్రమేణా క్యాన్సర్ లేదా రాచ పుండు ను త్వరిత గతిని కనుక్కుంటున్నారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ , తోలి  దశలలోనే కనుక్కుని సరి అయిన చికిత్స చేసి , మానవుల జీవిత కాలాన్ని పొడిగిస్తున్నారు  వైద్య నిపుణులు.
ఇటీవల ప్రఖ్యాత క్రికెట్ ఆట గాడు , భారతీయులకు క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించడం లో కీలక పాత్ర వహించిన యువకుడైన  యువరాజ్ సింగ్ కు అకస్మాత్తు గా క్యాన్సర్ ను నిర్ధారించి, విదేశాలకు పంపి చికిత్స చేయించడం, అందరి హృదయాలలో ఒక ముద్ర వేసిన సంఘటన అయింది. క్యాన్సర్ అంటే భయపడడం మాని , దానిని అర్ధం చేసుకోవడానికీ, క్యాన్సర్ వచ్చిన వారికి చేయూత నీయడానికీ ప్రజలు ముందుకు వస్తున్నారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలలో ఉదారం గా పాల్గొంటున్నారు కూడా ! 
మరి సామాన్య జనానీకానికి క్యాన్సర్ గురించి ఏమాత్రం అవగాహన ఉంది ?  వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంతా దైవాదీనమేనా?  మన చేతులలో ఏమీ లేదా ?  ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, మనం క్యాన్సర్ ఏవిదం గా వస్తుందో తెలుసుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం. ఒక గమనిక : నేను క్యాన్సర్ స్పెషలిస్టును కాను. ఇక్కడి టపాలలో నాకు తెలిసిన జ్ఞానాన్ని టపాలలో తెలిపి , క్యాన్సర్ గురించి అవగాహన పెంచుదామనే. చదువరులు, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి స్పెషలిస్టు ను సంప్రదించడం ఉత్తమం. 
అసలు విషయం: 
సామాన్యం గా మానవులలో ప్రతి క్యాన్సరూ కొంత కాలం, మన దేహం లో ఉన్న కణాలలో కొన్ని మార్పులు తెచ్చిన తరువాత , క్యాన్సర్ గా బయట పడుతుంది. క్యాన్సర్ గా బయట పడడానికి ముందు ఉండే స్థితిని  ప్రీ మాలిగ్నెంట్ కండిషన్  లేదా ప్రీ క్యాన్స రస్ కండిషన్ లేదా క్యాన్సర్ కారక స్థితి అనబడుతుంది. ఈ క్యాన్సర్ కారక స్థితి గురించి మనకు మంచి అవగాహన ఏర్పడితే , ఈ క్యాన్సర్ కారక స్థితి కూడా ఏర్పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం ప్రత్యెక క్యాన్సర్లు చర్చించే సమయం లో , ఈ జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాము.
( ఉదాహరణకు: పొగాకు పీల్చితే, అంటే సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎందు వల్ల సిగరెట్ తాగితే  క్యాన్సర్ వస్తుందో కొద్ది మందికి మాత్రమె అవగాహన ఉంటుంది ) 
ఇప్పుడు ఇంకో  ఉదాహరణ చూద్దాము : లివర్ క్యాన్సర్. దీనినే శాస్త్రీయం గా హెపాటిక్ సెల్ క్యాన్సర్. పైన ఉన్న చిత్రం గమనించండి. ఈ చిత్రం లో మొదట కనిపించే కణాలు హెపాటిక్ స్టెం కణాలు అనబడతాయి. వాటినుంచి హెపాటిక్ ప్రోజేనై టార్ కణాలు పుడతాయి. చివరగా కాలేయ కణాలు లేదా హెపాటిక్ సెల్స్ , హెపాటిక్ ప్రోజెనైటార్ కణాల నుంచి పుడతాయి.ఇంత వరకూ జరిగిన చర్యలు సహజం గా ప్రతి కాలేయం లో జరిగే చర్యలే ! కానీ క్యాన్సర్ కారక సంఘటనలు , అంటే మ్యుటేషన్ లాంటివి జరిగి హెపాటిక్ ప్రోజెనైటార్ కణాలకు బదులు క్యాన్సర్ ప్రోజెనైటార్ కణాలు ఉత్పన్నం అవుతాయి. కాలేయ క్యాన్సర్ విషయం లో కొన్ని రకాల వైరస్ లు, ఇంకా అఫ్లా టాక్సిన్ అనే విష పూరితమైన ఫంగస్, ఇంకా మద్యం అంటే ఆల్కహాలు –ఇవన్నీ సహజం గా జరిగే చర్యల రూటు మార్చి , కణాలలో మ్యుటేషన్ జరగటానికి దోహదమవుతాయి. మ్యుటేషన్ అంటే కణం లో వచ్చే సమూలమైన , ఆకస్మికమైన మార్పులు. ఈ మార్పులు సామాన్యం గా కణం లోని జన్యువులలో , అంటే జీన్స్ లో వస్తాయి. ఈ మ్యుటేషన్ ఒక సారి వచ్చిన తరువాత  పుట్టే కణాలు క్యాన్సర్ కణాలు అవుతాయి. ఈ విధం గా పుట్టిన క్యాన్సర్ కణాలు, ఒక పద్ధతంటూ లేకుండా ఎడా పెడా క్యాన్సర్ కణాలను ఉత్పన్నం చేస్తాయి. దానితో రాచ పుండు లేదా క్యాన్సర్ ఏర్పడుతుంది. చూశారు గా , పటం సహాయం తో , సహజమైన కాలేయ కణాలు , క్యాన్సర్ కణాలు గా మ్యుటేషన్ లేదా పరివర్తన ఎట్లా చెందుతాయో ! 
మరి  కాలేయ క్యాన్సర్ నివారణలో మన కర్తవ్యం ఏమిటి ?: 
1. వైరస్ ఇన్ఫెక్షన్ లు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం.
2. మద్యం ముట్టక పోవడం. 
3. అఫ్లా టాక్సిన్ అనే విషం మన ఆహారం లో లేకుండా చూసుకోవడం. 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము ! 

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

In మానసికం, Our minds on జూలై 14, 2012 at 10:30 ఉద.

‘ పిచ్చి ‘ సంగతులు, తెలుసుకుంటే మంచిదే !. 7.

పైన ఉన్న కార్టూను , మందుల కంపెనీలవారి వ్యాపార పోకడలను ఎండ గట్టుతూ చూపుతున్న కార్టూన్. ( మన జీవితాలలో , సమస్యలు ఉండడం సహజమే కదా, కానీ కార్టూను లో ఆ సమస్యలను ఒక బై పోలార్ డిసార్డర్ గా ( తప్పు గా ) నిర్ధారించి దానికి , మందులు తీసుకోవడమే ఉత్తమం అంటూ సలహా ఇస్తున్న డాక్టర్ ను చూడ వచ్చు ! ) అందు వల్ల నే మనం ,   వ్యాధి నిర్ధారణ అత్యంత జాగరూకత తో చేయించుకోవాలి.  అంటే నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవాలి. 

పిచ్చి కుదిరేది ఎట్లా ? : 
ఒక సామెత మనం తరచుగా వింటూ ఉంటాము. ‘ పెళ్లయింది , పిచ్చి కుదిరింది ‘  అని. అట్లా పెళ్లి జరిగినతరువాత, పిచ్చి కుదిరిన సంఘటనలు మీ ఎరుక లో ఉంటే తెలియ చేయండి. నా అనుభవం లో ,పెళ్లి అయిన తరువాత, పిచ్చి కుదరడం మాట అటుంచి , పిచ్చెక్కడం చాలా మంది లో చూశాను. ! క్రితం టపాలలో చూసినట్టు, ఈ రకమైన పిచ్చి , పలు రకాలు గా ఉండడం కూడా గమనించాను.  ఇక పిచ్చి కుదరడానికి శాస్త్రీయం గా మందుల తో చికిత్స గురించి తెలుసుకుందాము ! ఈ మందులు కొన్ని రకాలు గా ఉంటాయి. 
1. mood stabilizers. వీటిని మన మూడ్ ను స్థిత పరిచే మందులు గా చెప్పుకోవచ్చు:
లిథియం : లిథియం ఒక ఖనిజం అంటే మినరల్. ఈ ఖనిజం యొక్క ఔషధ గుణాలూ , దానిని పిచ్చి చికిత్స లో చాలా కాలం నుంచీ ఉపయోగిస్తూ ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో కొన్ని క్షార సరస్సులలోని నీరు తాగమని సలహా ఇచ్చే వారు. మీకు తెలిసే ఉంటుంది కదా ఆమ్లాలు పుల్ల గా ఉంటాయనీ క్షారాలు ఉప్ప గా ఉంటాయనీ. క్షార సరస్సులలో నీరు తాగిన వారికి పిచ్చి కుదిరేది. కానీ ఇటీవల పరిశోధనల వల్ల, ఆ క్షార సరస్సులలో ఉన్న నీటి లో ఖనిజాలు , ప్రత్యేకించి లిథియం అనే ఖనిజం ఉందని కనుక్కునారు. జాన్ కేడ్ అనే ఆస్త్రేలియన్  మొట్టమొదటి సారి శాస్త్రీయం గా లిథియం యొక్క ఔషధ గుణాలను, పిచ్చి కి చికిత్సలో లిథియం యొక్క ఉపయోగాలూ వివరించాడు తన పరిశోధనా పత్రం లో.( 1949 ). గత యాభై ఏళ్ల గా లిథియం ను మానియా లేదా పిచ్చి చికిత్సకూ , నివారణకూ , ప్రపంచం అంతా ఉపయోగిస్తున్నారు. లిథియం ఒక మోతాదు లో తీసుకుంటే పిచ్చి పోవడమే కాకుండా , నివారణ కు కూడా ఒక మంచి ఔషధం గా పనిచేస్తుంది. కాక పొతే  ఈ లిథియం తీసుకుంటున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  వారు కిడ్నీ అంటే మూత్ర పిండాలు , ఇంకా థైరాయిడ్ పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒక సారి చేయించు కుంటూ ఉండాలి. అంతే కాక  వారి రక్తం లో లిథియం ఏ పాళ్ళ లో ఉందో కూడా క్రమం గా పరీక్ష చేయించు కుంటూ ఉండాలి. దీనిని లిథియం లెవెల్స్ టెస్ట్ అంటారు.
2. anti psychotics:  వీటిని మన ఆలోచనలను సవ్యం చేసే మందులు గా చెప్పుకోవచ్చు.  కొట యపిన్ , రిస్పరిడోన్, ఒలాంజాపిన్ అనే మూడు ప్రధానమైన యాంటీ సైకాటిక్ మందులు పిచ్చి చికిత్స లో వాడ బడుతున్నాయి.
3. anti epileptics: వీటిని మూర్చ నివారణ మందులు అని తెలుగులో అంటారు.  వాల్ప్రోఎట్ , కార్బమజపిన్ అనే మందులు ప్రధానం గా మూర్చల నివారణకు వాడుతారు. కానీ ఈ మందులు పిచ్చి నివారణకు కూడా బాగా ఉపయోగ పడతాయి. ఈ విషయం అనేక పరిశోధనల వల్ల తెలిసింది. అందువల్ల ఈ మందులను కూడా విరివి గా పిచ్చి నివారణలో కూడా వైద్యులు రికమెండ్ చేస్తారు. 
4.anti depressants: ఈ మందులను యాంటీ దిప్రేస్సేంట్ లు అంటారు. ఈ మందులు ప్రధానం గా వెన్లా ఫాక్సిన్ , ఫ్లూఆక్సిటిన్ వంటి డిప్రెషన్ కు చికిత్స గా ఉపయోగించే మందులు. కానీ పిచ్చి లో కూడా ఈ మందులు ఎందుకు ఉపయోగిస్తారంటే, పిచ్చి తగ్గగానే వారు డిప్రెషన్ కు లోనవటానికి అవకాశాలు ఎక్కువ. ఆ సమయం లో వారు డిప్రెషన్ తో బాధ పడకుండా యాంటీ దిప్రేస్సంట్ లు వేసుకుంటూ ఉండాలి.  మనకు తెలుసు కదా డిప్రెషన్లో  మానసిక స్థితి క్రుంగి పోయే విధం గా ఉంటుందని. ఈ మూడ్ పైకి పోయి పిచ్చి రూపం లో ఉండడం , అట్లాగే క్రుంగి పోయి , డిప్రెషన్ రూపం లో ఉండడం వల్లే  ఈ వ్యాధిని రెండు భిన్న ధ్రువాల వ్యాధి అంటే బై పోలార్ డిసార్డర్  అంటారు శాస్త్రీయం గా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

‘ పిచ్చి’ సంగతులు, తెలుసుకోవడం మంచిదే !.6.

In మానసికం, Our minds on జూలై 13, 2012 at 11:36 ఉద.

పిచ్చి సంగతులు తెలుసుకోవడం మంచిదే !.6.

మెదడులో ఏ మార్పులు పిచ్చి కి కారణమవుతాయి?: 
ఈ కారణాలను మనం అయిదు రకాలు గా తెలుసుకోవచ్చు.
1. ( మెదడు లో ) నిర్మాణాత్మక తేడాలు, మార్పులు: 
పక్ష వాతం అంటే స్ట్రోక్ వచ్చిన వారిలోనూ, ప్రమాద వశాత్తూ తలకు గట్టి దెబ్బ తగిలి తద్వారా మెదడు లో కొంత భాగం దెబ్బ తిన్న వారిలోనూ , ఇంకా మెదడు లో కంతులు అంటే ట్యూమర్లు   ఉన్న వారిలోనూ పిచ్చి లక్షణాలు ఉండడం జరుగుతుంది. దీని వల్ల వైద్యులకు, మెదడు లో నిర్మాణాత్మక మార్పులు వస్తే, ఆ మార్పులు పిచ్చి కి దారి తీస్తాయి అని తెలిసింది.
2. ( మెదడు ) పని చేయడం లో తేడాలు , మార్పులు: మెదడు రక్త సరఫరా లో జరిగే మార్పులను విశదం గా అధ్యయనం చేసి ( అంటే ప్రత్యేకమయిన స్క్యాన్ ల ద్వారా , వీటిని ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోనేన్స్  fMRA  స్క్యాన్ అంటారు ) పిచ్చి వచ్చిన వారి మెదడు లో ఒక భాగం లో ( దీనిని DLPFC అంటారు ) రక్త సరఫరా లోపం ఉందని గమనించడం జరిగింది.
3. ( మెదడు లోని ) జీవ రాసాయనాలలో తేడాలు , మార్పులు: నార్ ఎపినెఫ్రిన్ , డోపమిన్, గ్లుటామేట్, ఇంకా జీ ప్రోటీన్లు అనే జీవ రసాయనాలూ , సి ఆర్ ఎఫ్ ( CRF ) అనే హార్మోను లో మార్పులు కూడా పిచ్చి ఉన్న వారి మెదడు లో గమనించడం జరిగింది.మిగతా జీవ రసాయనాల వివరాలు పైన ఉన్న పటం లో చూడ వచ్చు. ఈ చిత్రం లో ఆకు పచ్చ గానూ , పర్పుల్ రంగులోనూ రెండు బుడిపెలు గమనించారా ? అవి బాగా స్థూలం గా చూప పడిన , యదార్ధానికి అతి సూక్ష్మం గా ఉండే నాడీ తంత్రుల చివరలు లేదా మొనలు. ఆ ప్రదేశం లో జీవ పటం లో వివరించినట్టు గా, వివిధ జీవ రసాయనాలు , వివిధ సంజ్ఞలను , లేదా సిగ్నల్స్ ను ఒక నాడీ తంత్రి చివర నుంచి, ఇంకో తంత్రి చివరకు సరఫరా చేస్తాయి. ఇట్లా సిగ్నల్స్ ప్రయాణం చేయడం లో లోపం అంటే అవి ఎక్కువగా , అతి వేగం గా ప్రయాణం చేసినా , లేదా తక్కువ గా, అతి నెమ్మది గా ప్రయాణం చేసినా , ఆ ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుంది. చిత్రం గా ఉంది కదూ సృష్టి రహస్యం ! 
4. ( మెదడు లో ) సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  లో మార్పులు: 
మన దేహం లో ప్రతి కణమూ , అత్యంత సున్నితం గా ఉంటుంది. అంతే కాక , ప్రతి కణమూ, కొన్ని ప్రత్యేకమైన జీవ రసాయనాలను, హార్మోనులను మాత్రమే తనలోకి , అంటే కణం లోపలికి అనుమతిస్తుంది. మన దేహం లో ప్రతి చర్యా , హార్మోనులూ, జీవ రసాయనాలూ , ఒక చోటినుంచి అంటే ఒక కణం నుంచి , ఇంకో కణానికి పంపటం వలననే జరుగుతాయి. అట్లాగే మన మెదళ్ళలో కూడా , ప్రతి  సంజ్ఞా , ప్రతి ఆలోచనా , ఒక కణం నుంచి, ఇంకో కణానికి ప్రయాణం చేస్తే నే మన ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి. ఈ ఆలోచనలు క్రియా రూపం దాల్చడానికి సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్  అనే జీవ క్రియ చాలా ముఖ్యమైనది. క్రింద ఉన్న చిత్రం చూడండి.
 పిచ్చి ఉన్న వారిలో ఈ సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ లో మార్పులు వస్తాయి.
పై కారణాలు తెలుసుకోవడం ఎందుకంటే , చికిత్స జరిగే సమయం లో , మనకు  మందులు ఎందుకు వాడడం జరుగుతుందో అర్ధం కావడానికి.   ఉదాహరణకు , మూడవ కారణాన్ని సరి చేయడానికి కొన్ని మందులు పనికి వస్తాయి. అట్లాగే నాల్గవ కారణమైన సిగ్నల్ ట్రాన్స్ డక్ షన్ ను సరి చేయడానికి కొన్ని మందులు ఉపయోగ పడతాయి.
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

In మానసికం, Our minds on జూలై 12, 2012 at 5:25 సా.

పిచ్చి సంగతులు , తెలుసుకోవడం మంచిదే !.5.

క్రితం టపాలో మరి పిచ్చి వస్తే, ఎట్లా కనుక్కోవచ్చో , దాని గురించి కొంత తెలుసుకున్నాము కదా !  పిచ్చి, మానవ మస్తిష్కం విపరీతమైన వేగం తో ఆలోచనలు వచ్చినప్పుడు , ఆ వేగం తో వస్తూన్న ఆలోచనల ప్రభావం , మన ప్రవర్తన లో కూడా కనిపించి , ప్రవర్తన అస్తవ్యస్త మవటం వల్ల  వస్తుంది. మస్తిష్కం లో ఆలోచనలు సామాన్యం గా ఉంటే ఆ స్థితి ని నార్మల్ మూడ్ లేదా యూ తైమిక్ మూడ్ అంటాము. అదే అత్యంత వేగానికి విరుద్దం గా , ఆలోచనలు కనుక అత్యంత నిదానం గా వస్తూ ఉంటే, మనం స్లో అవుతాము. డిప్రెషన్ వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. ఈ క్రింది పటం గమనించి నట్టయితే మనకు విశదమవుతుంది ఈ మూడ్ స్థితులు. ఆంగ్లం లో ఉన్నాయి పదాలు కానీ శులభం గా అర్ధమవుతాయి , అందరికీ ! 
 
ఇప్పుడు మనం మానియా కూ , హైపో మానియా కూ తేడాలు చూద్దాము. హైపో అంటే  తక్కువ , లేదా క్రింద అని అర్థం. మనం సాధారణం గా చూస్తూ ఉంటాము , అనుకుంటూ కూడా ఉంటాము ఎవరైనా , విపరీతం గానూ , ఎక్కువ హడావిడి గానూ ప్రవర్తిస్తూ , అటూ ఇటూ తిరుగుతూ ఉంటే , వీడెవడో యమ హైపర్ ‘ అని. హైపర్ అంటే ఎక్కువ లేదా ఎగువ అని అర్థం. మనం సామాన్యం గా అనుకునే హైపర్  స్థితి  శాస్త్ర రీత్యా  హైపో మానియా గా చెప్పుకోవచ్చు.  అంటే హైపో మానియా లక్షణాలు, వంద శాతం పిచ్చి లక్షణాలు గా కాక , ఏ యాభై , అరవై శాతమో ఉంటాయి. అంటే ఈ హైపో మానియా లక్షణాలు, ఉన్న వారు , సమాజం లో చాలా మంది ఉంటారు. బహుశా , నిజం గా పిచ్చి ఉన్న వారికంటే ఎక్కువ శాతం ఉంటారు. వారిలోని పిచ్చి లక్షణాలు, ఆందోళన పడ వలసిన లక్షణాలైనా,  మరీ విపరీతం గా , వెంటనే ఆస్పత్రి లో చేర్పించ వలసినంత అత్యవసరం గా ఉండవు. వీరిలో అంటే హైపో మానియా ఉన్న వారిలో రిస్కు టేకింగ్ బిహావియర్ రవంత తక్కువ గా ఉంటుంది , మానియా ఉన్న వారిలో ఉండే దానికంటే ! 
 
ఈ క్రింద పటం చూడండి , మీకు  శులభం గా అర్ధమవుతాయి , ఈ తేడాలు ! 
ఇక్కడ మొదట ఉన్నది  డిగ్ ఫాస్ట్ అనే పదం అంటే ఆంగ్లంలో ఉన్న అక్షరాలు DIGFAST  ఈ అక్షరాలతో ప్రారంభ మయే  ఆంగ్ల పదాలు, మానియా లో అంటే వంద శాతం పిచ్చి లో ఉండే లక్షణాలు. ( మానియా ను బై పోలార్ వన్ అని శాస్త్రీయం గా అంటారు )దాని క్రింద ఉన్న పటం లో ఉన్నవి , హైపో మానియా లక్షణాలు ( దీనినే బై పోలార్ టూ అని శాస్త్రీయం గా అంటారు , ఎపిసోడ్ అంటే ఒక సారి వచ్చిన వ్యాధిని సింగిల్ ఎపిసోడ్ అంటారు. )
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాము !