Our Health

FOMO ( ఫోమో ) అంటే ఏమిటి ? దానిని  నివారించుకోవడం ఎలా ?!

In Our Health on జనవరి 20, 2025 at 9:52 సా.

ఫియర్ అఫ్ మిస్సింగ్ అవుట్ ( FOMO = Fear Of Missing Out ):

FOMO ఉన్న వారి ప్రవర్తన ఈ క్రింది విధం గా ఉండవచ్చు !

1. అదే పని గా సోషల్ మీడియా సైట్లను వెదకటం : అంటే రోజులో ఓ అరగంటో  గంటో కాకుండా అతిగా ఫోను ఉపయోగిస్తూ ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోవడం !
2.ఇతరులు వారి వారి కార్యక్రమాలనూ, సాధించిన విజయాలనూ వివరిస్తూ పెట్టే  పోస్టులు చూస్తూ తాము మాత్రం  విచారం గా, ఆందోళన చెందడం !
3. ఇతరులనుంచి వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ , వీలైనా కాకున్నా , మిస్సవ్వ కూడదనే ఉద్దేశం తో  అంగీకరించడం !
4. గ్రూపులలోనూ , విందు వినోదాలలోనూ పాల్గొన లేక పొతే , నిరాశా నిస్పృహ లకు లోనవడం !
5. ఇతరులు సాధించిన దానితో తమను పోల్చుకుని , తాము తమ జీవితం లో తక్కువ సాధించామని ఆత్మ న్యూనతా భావం తో కుంగిపోవడం !
6. అదేపనిగా  తమ కార్యక్రమాలను కానీ , తమ దిన చర్య కానీ ఇతరులు ఏ రకంగా అంచనా వేస్తారో అని ఆందోళన చెందడం !
7.తమ ప్రస్తుతాన్ని ఆస్వాదించ లేక పోవడం !  ఆలోచనలన్నీ ఇంకో సమయం లో ఇంకో స్థలం లో జరిగే  సంఘటనలలోనూ , విందు వినోదాలలోనూ పాల్గొనలేక పోతున్నాననే విషయాల మీదనే తిరగడం ! ( preoccupation ).

పరిణామాలు :  FOMO  వల్ల  మానసిక వత్తిడి , ఆత్మ విశ్వాసం లోపించి , అదేపని గా వివిధ  సోషల్ మీడియా వస్తువులు ( అంటే స్మార్ట్ ఫోన్, లేదా మొబైల్ కానీ , PC లేదా లాప్ టాప్ కానీ , టాబ్లెట్ ను కానీ నిరంతరం  సంధానం అయి ఉండాలనే తపన పెరుగుతుంది ! ఈ తపన ఎంతగా ఏర్పడుతుందంటే , వారి వారి దైనందిన కార్యక్రమాలు మందగించేలా అంటే , విద్యార్థులు చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేక పోవడం , లేదా వారికి ఏకాగ్రత లోపించి , సరిగా చదవక , పరీక్షలలోనూ , తద్వారా చదువులోనూ వెనుక బడడం , అలాగే ఉద్యోగస్తులు , అంతకు ముందులా తమ విధులు నిర్వర్తించలేక , పై అధికారుల విమర్శలూ , వార్నింగ్ లూ పొందడం. 

పరిష్కారం ఏమిటి ?

ఫోమో  వ్యసనాన్ని వదులుకోవచ్చు !
అందుకు ముఖ్యంగా కావలసినది, తమ సమస్యను ఆత్మావలోకనం చేసుకుని  దానిని ఒక సమస్యగా అంగీకరించడం. తరువాత తమలో మార్పుకోసం  మానసిక స్థైర్యం పెంపొందించుకోవడం !  అంటే గుండె దిటవు చేసుకుని  కొన్ని మార్పులను క్రమం తప్పకుండా అనుసరించాలి  ! క్రమేణా ఆ మార్పులు నిత్య జీవితం లో చోటు చేసుకుని ఫోమో నుంచి బయట పడేస్తాయి ! జీవితాలని ఆనంద మయం చేస్తాయి !

ఆ మార్పులు ఏమిటో చూద్దాం ఇప్పుడు క్లుప్తంగా  !

1.  సోషల్ మీడియా ను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవడం !
ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే సోషల్ మీడియాకు కేటాయించాలి ! మిగతా సమయం లో స్మార్ట్ ఫోన్ గురించి కానీ , సోషల్ మీడియా గురించి కానీ ఆలోచించక , తమ తమ పనులూ బాధ్యతలూ నిర్వర్తించుకోవాలి ! అంటే విద్యార్థులు చదువు మీదా , ఉద్యోగస్తులు తమ వృత్తి ధర్మాన్నీ మరచి పోకుండా , బాధ్యత గా  ప్రవర్తించాలి . మొబైల్ ఫోన్ వాడడం అనివార్యమవుతే , రోజూ ఒక నిర్ణీత సమయాన్ని మాత్రమే దానిని వాడి, మిగతా సమయం లో కేవలం అత్యవసర కాల్స్ మాత్రమే అంటే ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుని మాట్లాడడమో , లేదా టెక్స్ట్ చేయడమో చేయాలి ! ఎందుకంటే  ప్రతివారికీ ఒక రోజులో ఉండే సమయం కేవలం 24 గంటలు మాత్రమే ! ఆ అమూల్యమైన సమయం ప్రతి ఒక్కరి హక్కు , ఆ సమయాన్ని  హరించే మిగతా ఏ కార్య క్రమాలూ మీరు అలవాటు చేసుకోకూడదు ! ఒక వేళ  తెలిసో తెలియకో అలవాటు అవుతే , దానిని మొగ్గ లోనే తుంచి వేయాలి , అంటే మొదటిలోనే ఆ అలవాటు నుంచి బయట బడే ప్రయత్నం చేయాలి !
అంటే ఫోమో మానసిక దౌర్బల్యం నుంచి బయట పడే మార్గం మానసిక స్థైర్యం తో నే సాధించాలి  ! ముల్లు ను ముల్లు తోనే తీసినట్టుగా !
2. మైండ్ ఫుల్ నెస్ ను అభ్యాసం చేయడం : అంటే  మీరు ఒక రోజులో చేయ వలసిన పనులను నిష్ఠ , నియమాలతో పూర్తి ఏకాగ్రత తో , ఏ ఇతర అవాంతరాలు కల్పించుకోకుండా చేయడం అలవాటు చేసుకోవాలి !
ఈ మైండ్ ఫుల్ నెస్ గురించి వివరం గా వచ్చే టపాలో తెలుసుకుందాం !
3. దిన చర్య స్వీయ భవిత మీద , తమ , తమ విలువలు నిర్దిష్టం గా నిర్ణయించుకుని , అందుకై తదేక దీక్ష తో , ఏకాగ్రత తో కృషి చేయ వలసిన అవశ్యం యువతకు ఉండాలి !

కేవలం , మిగతా వారు ఏమేం చేస్తున్నారో , ఆ చర్యలు తాము ఎంత మిస్సవుతున్నామో అని కలత చెందుతూ కాలక్షేపం చేస్తే , తమ తమ లక్ష్యాలను చేరుకోవడం లో విపరీతం గా కాల యాపన జరిగి , చివరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు ! అప్పుడు తమ విలువైన కాలాన్ని ఎట్లా వృధా చేసుకున్నారో అని విచార పడినా కూడా ఫలితం ఉండదు కదా ! ప్రతి రోజూ , తమ తమ భవిత ఉజ్వలంగా ఉండాలంటే చేయవలసినవి మననం చేస్తుకుంటూ , అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించు కుంటూ ఉండడం  వల్ల   ఎంతో తృప్తీ ,  లాభం ఉంటుంది , కేవలం ఇతరుల కార్యక్రమాలను పోల్చుకుంటూ  కాల హరణం చేసేకన్నా !
4. కృతజ్ఞతా భావాలు పెంపొందించుకోవడం ( gratitude ): మనకు లేనిదానికోసం బాధ పడడం కన్నా , మనకు ఉన్న పాజిటివ్ ( అంటే సకారాత్మక ) లక్షణాలూ , బలాలూ ( strengths ) ఒక క్రమపద్ధతిలో అండ్ రోజువారీగా బేరీజు వేసుకుంటూ పురోగమనం  చెందుతూ ఉండాలి !

మిగతా మార్పులు తరువాతి టపాలో తెలుసుకుందాం !

ఈలోగా మీ అభిప్రాయాలను తెలుపండి !

వ్యాఖ్యానించండి