Our Health

Posts Tagged ‘వెనక నొప్పి’

వెనక నొప్పి . 12. సయాటికా తో సెక్స్ సుఖం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 9, 2014 at 4:46 ఉద.

వెనక నొప్పి . 12. సయాటికా తో సెక్స్ సుఖం ఎట్లా ?

 
ఏ  పొజిషన్ లో నొప్పి ఎక్కువ గా ఉంటుందో కనుక్కోవడం :
1. ఒకటో రకం  వెన్ను నొప్పి బాధితులకు, కొంత కాలం తరువాత , ఏ  ఏ  పొజిషన్ లో తాము ఉంటే  ఎక్కువ నొప్పి కలుగుతుందో , ఏ పొజిషన్ లో నొప్పి ఉపశమనం కలుగుతుందో  స్పష్టం గా తెలుస్తుంది. 
ఉదాహరణకు , కొందరికి వెనకకు ఒంగినా, నిటారుగా నిలబడినా కూడా , నొప్పి చాలా ఉపశమనం కలుగుతుంది , ముందుకు ఒంగినప్పటికంటే ! ఈ రకమైన లక్షణాలు ఉన్న వారికి వెన్ను ను  నిటారు గా ఉంచే పొజిషన్ , అంటే ఛా తీని విరుచుకున్నట్టు గా నిలబడితే కానీ , లేదా నిటారు గా నిలబడితే కానీ చాలా వరకూ నొప్పి మటు మాయం అవుతుంది . దీనికి కారణం : డిస్క్ వెన్నుపూసల మధ్య నుంచి కొద్దిగా బయటకు  వచ్చి , అంటే సహజ స్థానం నుంచి , ప్రక్కన ఉన్న వెన్ను నాడిని నొక్కడం వల్ల. 
2. ఇక రెండో రకం బాధితులకు , ముందుకు ఒంగినా , లేదా ముడుచుకున్నట్టు కూర్చున్నా , లేదా పడుకుని మోకాళ్ళ దగ్గరా హిప్ దగ్గరా , కాళ్ళు నిటారు గా కాక , ముడుచుకుని పడుకున్నా కూడా  వెన్ను నొప్పి ఉపశమనం  అవుతుంది. దీనికి కారణం –  వెన్ను పూస  మధ్య లో ఉండే రంధ్రం , ఈ పొజిషన్ లో  వదులు  గా అవడం వల్ల నొప్పి ఉపశమనం కలుగుతుంది . పైన చెప్పిన ఈ రెండు రకాల బాధితులూ కూడా , తదనుగుణం గా తమ భాగస్వామి తో సెక్స్ లో పాల్గొనే సమయం లో , తమ పొజిషన్ లు , లేదా తమ స్థానాలు నిర్ణయించు కోవాలి ! 
అది ఎట్లా సాధ్యం ?
1. ఒకటో రకం బాధితులు : 
పురుషులైతే: మిషనరీ పొజిషన్ : అంటే ఈ స్థానం లో ( వెన్ను ను వెనక్కు ఉంచితే బాధ ఉపశమనం కలిగే ) పురుషుడు స్త్రీ పడక మీద ఉండి , తన మోకాళ్ళు తమ ఛాతీ వైపు ఉంచుకున్న స్త్రీ తో , వెన్ను నొప్పి కలగ కుండా , రతి లో పాల్గొనవచ్చు , ఆనందం పొంద వచ్చు ! ఈ పొజిషన్ లో పురుషుడు తన భారాన్ని స్త్రీ మీద వేయకుండా , తన చేతుల మీద వేయాలి. ఇంకో పొజిషన్ లో( వెన్ను నొప్పి ఉన్న )  పురుషుడు పడక మీద వెల్లికిలా పడుకుని ,  నొప్పి ఉన్న వెన్ను భాగం అడుగున ఒత్తు కు ఒకటో రెండో  దిళ్ళు లేదా కుషన్ లు ఉంచుకుని , తనకు మీద గా వస్తున్న స్త్రీ తో  రతి లో పాల్గొన వచ్చు ! అంటే ఈ పొజిషన్ లో స్త్రీ , పురుషుడి మీద గా ఉండి , రతి లో పాల్గొంటుంది !
స్త్రీకి వెన్ను నొప్పి ఉంటే :మిషనరీ పొజిషన్ : అంటే ఈ స్థానం లో ( వెన్ను ను వెనక్కు ఉంచితే బాధ ఉపశమనం కలిగే ) స్త్రీ  , పడక మీద వెల్లికిలా పడుకుని ఉన్న పురుషుడి తో రతి లో పాల్గొంటుంది ! అంటే ఆమె ఎక్కువ క్రియాశీలం అంటే యాక్టివ్ గా ఉంటుంది , రతి లో ! 
2. రెండో రకం బాధితులు : 
ఈ రకం బాధితులు కాళ్ళు ముడుచుకోవడం వల్ల  ఉపశమనం పొందుతారు కాబట్టి , పడక మీద మోకాళ్ళు ముడుచుకుని ఒక పక్కకు కానీ , మోకాళ్ళ మీద  పడక మీద ఉన్న స్త్రీ  వెనుక నుంచి , పురుషుడు ‘ యోని ‘ లో ‘ ప్రవేశించ వచ్చు ! సాధారణం గా , భాగస్వాము లిరువురి లో , వెన్ను నొప్పి బాధ లేని వారు ఎక్కువ క్రియాశీల పాత్ర వహించాలి రతి క్రియ లో ! అంతే కాకుండా , రతి క్రియ ను నిదానం గా అనుభవించి తే , వెన్ను నొప్పి కలుగుతుందేమో నన్న ఆందోళన తగ్గి ,  సుఖ ప్రాప్తి ఎక్కువ గా ఉంటుంది ! 
కాస్త ఆలస్యం అయినా , జీవిత భాగ స్వాములు ఇరువురూ చేసుకునే ఈ ( రతి ) ప్రయోగాలు, ఆనంద మయం అవుతాయి,  వారి అన్యోన్య జీవితం లో మూడో వ్యక్తి  ‘ ప్రమేయమూ’,  ‘ ప్రవేశం ‘ లేకుండా !  రతి సుఖం కోసం చేసే ఈ ప్రయోగాలు , భాగస్వాముల అన్యోన్యత ను పెంచడమే కాకుండా , రతి కి అతి దూరం గా ఉండడం వల్ల కలిగే ఆందోళనలనూ , తద్వారా , మానసిక వత్తిడినీ కూడా తగ్గిస్తాయి . దానితో నొప్పి తీవ్రత కూడా తగ్గి , జీవితాలు సుఖమయమవుతాయి !
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 
 

వెనక నొప్పి . 11. సయాటికా ఉంటే, సెక్స్ కు బై బై చెప్పాలా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health, Our minds on ఆగస్ట్ 3, 2014 at 2:55 సా.

వెనక నొప్పి . 11. సయాటికా ఉంటే సెక్స్ కు బై బై చెప్పాలా  ?

 
సయాటికా లేదా వెన్ను నొప్పి ఉన్న వారు అనేక విధాలు గా  బాధ పడుతూ ఉంటారు. నిత్య జీవితం లో  కలిగే అసౌకర్యాలూ ,  బాధా కాకుండా ,  గృహస్థ  జీవితం లో , తమ జీవిత భాగ స్వామి తో  రతి సుఖం కూడా పొంద లేక పోతూ ఉంటారు ! దానితో  తమ జీవితం కూడా నిస్సారమని పిస్తూ ఉంటుంది ! 
కొందరు భాగ స్వాములు , ఇంకొంత  స్పీడు తో ( పూర్వా పరాలు ఆలోచించ కుండా )  వివాహేతర సంబంధమే ఆ సమస్యకు పరిష్కారమని నిర్ణయించుకుని , ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి కుటుంబ జీవితాన్ని  అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటారు ! ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ? గమనించ వలసినది , సయాటికా ఉంటే సెక్స్ కూడదు అనే పరిస్థితి నేడు లేదు !
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెంది , వెన్ను నొప్పి  ఏ యే కారణాలో , ఏ యే  పొజిషన్ లలో వెన్ను నొప్పి ఎక్కువ అవుతుందో , ఏ యే  పొజిషన్ లలో ఆనంద భరితం అవుతుందో  తెలుసుకోవడం జరిగింది.  మరి, వెన్ను నొప్పి ఉన్న భాగ స్వామి తో సహా జీవనం చేస్తున్న వారు ఏమి చేయాలి ?
1. ప్రేమానురాగాల తో పాటుగా ఓపిక కూడా అలవరుచుకోవాలి :  వెన్ను నొప్పి ఉన్న వారితో పాటుగా , అది లేని వారి భాగ స్వామి కి కూడా , నిరాశా నిస్పృహ కలిగిస్తుంది.  భాగస్వాములు ఇరువురూ ఆశావాద దృక్పధం అలవరచు కోవడం ఎంతో ఉపయోగకరం ! దానితో పాటుగా , ఓరిమి తో  తమ భాగ స్వామి బాధలూ , సమస్యలూ కూడా అర్ధం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ! అన్యోన్య దాంపత్యానికి  పునాదులు అవే ! 
2. కమ్యూనికేషన్ కీలకం : భాగస్వామి సెక్స్ వద్దన గానే ,  వారికి తామంటే ఇష్టం లేదనే అపోహలు వెంటనే ఏర్పరుచు కోకూడదు ! అందుకే కమ్యూనికేషన్ కీలకం ! అనురాగం తో ఆప్యాయత తో కారణాలు వెతుక్కోవాలి , తెలుసుకోవాలి ! ఉదాహరణకు, ఋతు స్రావ సమయం లో ( పిరియడ్స్ లో ) స్త్రీకి  వెన్ను నొప్పి కూడా రావడం సామాన్య లక్షణమే ! ఆ సమయం లో రతి కోసం తహ తహ లాడే భర్త కు , ఆ పరిస్థితి తెలియ చేయడం మంచిది ! 
3. రతి కార్యం ముందు రంగం ముఖ్యం :  రతి ముందు ఆందోళన కలగడం వల్ల కండరాలు బిగుతు గా అవుతాయి, టెన్షన్ తో ! అందు చేత  రతి ని సుఖం గా అనుభవించే ముందు , ఆందోళన లను తొలగించు కుని ,  కండరాలను సడలించి , కామ కోరికలను రేకెత్తించే ,  చక్కని స్నానం చేసుకోవడం , లేదా  జెంటిల్ గా మసాజ్ చేయించు కోవడమూ , నొప్పి ఉపశమనానికి కండరాల మీద , క్రీములు పూసుకోవడం కూడా చేయ వచ్చు ! అట్లాగే , పడక గది లో ప్రశాంత వాతావరణం కూడా రతి కార్యాన్ని  పవిత్రమూ , ప్రణయ భరితమూ చేస్తుంది ! ఆందోళన లను  నివారిస్తుంది !  
4. రతి  ముందు , మందు ముఖ్యమా ? : రతి ముందు మద్యం తాగితే , రతి లో భాగస్వాములు ఎక్కువ సుఖం పొందుతారనేది కేవలం ఒక అపోహ మాత్రమే !  రతి ముందు మందు తాగితే , కేవలం అది కామ కోరికలనే ఎక్కువ చేస్తుంది , కామ సామర్ధ్యాన్ని కాదు ! ఇది శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని కిటుకులు ! 

 

వెనక నొప్పి . 10. బరువు లెత్తే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 26, 2014 at 10:24 ఉద.

వెనక నొప్పి . 10. బరువు లెత్తే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ! 

మునుపటి టపాలో, వెనక నొప్పి లేదా వెన్ను నొప్పి నివారణలో ముఖ్యమైన  మొదటి రెండు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకున్నాం కదా , ఇక మూడవ జాగ్రత్త గురించి చూద్దాం ! ఇది బరువు లెత్తే  సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు !  బరువు లెత్తే సమయం లో,  ‘ వెన్ను పూస జారడమూ ‘  విపరీతమైన వెన్ను నొప్పి కలగడమూ , సాధారణమైన  సామాన్యం గా మన అనుభవం లో జరుగుతూ ఉంటాయి ! కారణం : అతి బరువును అకస్మాత్తు గా ఎత్తడం వలన. ఈ రకమైన అతి బరువులు ఎత్తే ముందు, ఎత్తే సమయం లో కూడా , ఇంకా దింపే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి  ప్రతి ఒక్కరికీ తెలుసుకోవలసిన అవసరం ఉంది ! 
1. ఎంత బరువు ఎత్త బోతున్నారో ముందే ఆలోచించుకుని , ఒక నిర్ధారణ కు రావడం : ఇది చాలా ముఖ్యం. బరువు ఎంతో తెలియకుండా వాటిని ఎత్తే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అవుతుంది ! అంతే కాకుండా , ఆ చర్య అనవసర ( వెన్ను నొప్పి )  సమస్యలను చేతులారా , కొని తెచ్చుకోవడమే ! ఇంకొకరి సహాయం అవసరమా , లేదా ఏవైనా ఉపకరణాలతో అంటే బలమైన కర్రలో , లేదా గునపమో , ఉపయోగించ వచ్చా ? అనే విషయం కూడా ముందే నిర్ణయించుకోవాలి !  ఆ అతి బరువును ఎత్తి వెన్ను నొప్పి తెచ్చుకున్నాక కాదు ! 
2. పొజిషన్  : బరువులు ఎత్తే సమయం లో మనం ఎట్లా నుంచున్నామో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే, మనం నిటారు గా నిలబడి బరువులు ఎత్తే ప్రయత్నం చేస్తే , మనం ఎత్తే బరువు  ప్రభావం మన వెన్ను పూస  మీద పడుతుంది . అట్లా కాకుండా మన కాళ్ళను అనువైన పొజిషన్ లో ఉంచుకుని నుంచుంటే , ఆ ఎత్తే బరువు 
కాళ్ళ ను ముందుగా ప్రభావితం చేస్తుంది (  పైన ఉన్న చిత్రం గమనించండి ) ముఖ్య సూత్రం , ఎత్తే బరువులు వెన్ను పూస ఎముకలను , అంటే వర్టిబ్రా ను ప్రభావితం చేయకుండా ఉండడానికే కదా ! అదే విధం గా కడుపు కండరాలను బలం గా  టెన్స్ గా ఉంచుకోవాలి , మోకాళ్ళ దగ్గర కొద్ది గా వంచిన పొజిషన్ లో ఉన్న కాళ్ళను బరువులు ఎత్తడం పూర్తయాక కానీ , నిటారుగా చేయకూడదు 
3.బరువులను, నడుముకు వీలైనంత దగ్గర గా ఉంచుకోవాలి : బరువులు ఎత్తే సమయం లో , ఎత్తిన బరువును నడుముకు వీలైనంత దగ్గరగా ఉంచి మోయాలి అంటే  ఒక  కాఫీ కప్పులు ఉన్న ట్రే ను మోస్తున్నట్టు కాకుండా ! 
4. భుజాలనూ , హిప్పు నూ ఒకే పొజిషన్ లో ఉంచుకోవడం : బరువులు ఎత్తే సమయం లో వెన్నుపూసను మెలిక వేయకూడదు అంటే , ఒక పొజిషన్ లో ఎత్తుతూ , భుజాలను ఇంకో పొజిషన్ లోకి అంటే ఇంకో కోణం లోకి మారుస్తే , భుజాలతో పాటుగా వెన్ను పూస కూడా ట్విస్ట్ అయి అప్పుడు అకస్మాత్తు గా వెన్ను నొప్పి వచ్చే రిస్కు ఉంటుంది ! 
5. మీ పరిమితులు తెలుసుకోండి ! బరువును సురక్షితం గా ఎత్త గలగడం , బరువును ఎత్తడం లో ఎంతో  తేడా ఉంది కదా ! ఎక్కువ బరువును ఎత్తాక  మూడు నెలలు వెన్ను నొప్పి తో మంచాన పడితే అది సురక్షిత మెట్లా అవుతుంది ? 
6. లాగడం నష్టం , తోయడం లాభం !  : ఒక గది లోంచి ఇంకో గది లో కి బరువులు మార్చాలనుకుంటే , ఆ బరువులను తోయడం , వాటిని లాగడం కన్నా సురక్షితం ! 
7. సంచులు మోసే సమయం లో  బరువును తుల్యం చేసుకోవడం సురక్షితం : సామాన్యం గా మార్కెట్ కు వెళ్లి సరుకుల సంచీ ఇంటికి తెచ్చే సమయం లో  ఆ సంచుల బరువులు రెండు చేతుల్లోనూ సమానమో  కాదో చూసుకుని , అట్లా కాక పొతే సమానం చేసుకుని , బరువులు మోయడం సురక్షితం ! 
8. ఊళ్లకు వెళ్ళే సమయాలలో సూట్ కేసులు ఎక్కువ ధర అయినప్పటికీ కూడా వాటికి అమర్చి ఉండే  చక్రాలు దృ ఢ మైనవి ఉంటే నే కొనుక్కోవడం క్షేమ దాయకం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

వెనక నొప్పి . 8. సయాటికా కు శస్త్ర చికిత్స ఎట్లా చేస్తారు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 18, 2014 at 7:52 సా.

వెనక నొప్పి . 8. సయాటికా కు శస్త్ర చికిత్స ఎట్లా చేస్తారు ? 

సయాటికా కు శస్త్ర చికిత్స,  అంటే సర్జరీ ఏ పరిస్థితులలో చేస్తారు ? 
1. వెనక నొప్పి తీవ్రత ఎక్కువ గా ఉండి , అనేక రకాల మందులతో కూడా నొప్పి తగ్గక పోతూ ఉంటే,
2. క్రమేణా వెనక నొప్పి తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటే , అంటే  కొన్ని ఏళ్ల తరబడి ఉన్న నొప్పి అకస్మాత్తు గా తీవ్రం అవుతే ,
3. నొప్పి ఉన్న వారి ఉద్యోగాలు , కుటుంబ జీవనం,   నొప్పి వల్ల అతలాకుతలం అవుతూ ఉంటే, 
4. నొప్పి తీవ్రత ఎక్కువ అయి, మూత్ర విసర్జన లేదా మల విసర్జన లో సమస్యలు ఏర్పడితే ( ఈ పరిస్థితి  వెన్ను పూస ఎముక ( వర్టిబ్రా ) భాగం వెన్ను నాడిని నొక్కే ప్రదేశం బట్టి ఉంటుంది , అన్ని వెనక నొప్పులూ ఈ పరిస్థితి కలిగించవు )
వెన్ను నొప్పికి సర్జరీ ఎన్ని రకాలు గా ఉంటుంది ?
1. డి స్కె క్టమీ :  ఈ రకమైన శస్త్ర చికిత్స లో  సహజ స్థానం లో నుంచి బయటకి వచ్చి , పక్కన ఉన్న వెన్ను నాడిని నొక్కుతున్న డిస్కు భాగాన్ని జాగ్రత్త గా తొలగించడం జరుగుతుంది. ఇది సర్వ సాధారణం గా చేసే శస్త్ర చికిత్స.( పైన ఉన్న చిత్రం  గమనించండి  ).
2. సంధాన సర్జరీ లేదా ఫ్యూజన్ సర్జరీ : కొన్ని సమయాలలో వెన్నెముకే  అంటే వర్టిబ్రా  అమాంతం గా ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతూ ఉండి , పక్కన ఉన్న నాడులకు వత్తిడి కలిగించి , లేదా ఆ నాడులను నొక్కుతూ , నొప్పి కలిగిస్తూ ఉంటే  ఆ వెన్ను పూస ఎముకను అంటే వర్టిబ్రాను పైనా క్రిందా ఉన్న వెన్ను పూస ఎముకలతో కలిపి స్థిరం గా ఉంచుతారు. అంటే ఉక్కు మొలలతో ( స్టీల్ రాడ్స్ తో ) వెన్ను పూస ఎముకలకు రంధ్రాలు చేసి పైనా క్రిందా ఉన్న వెన్ను పూస ఎముకల సహాయం తో మధ్యలో ( ఊగుతూ ఉన్న ) వెన్ను పూస ఎముకకు స్థిరత్వం కలిగిస్తారు. దానితో ఆ స్థిరం గా ఉన్న వర్టిబ్రా , నాడుల మీద వత్తిడి కలిగించడం ఆగిపోతుంది. ఆ కారణం గా నొప్పి కూడా నివారణ అవుతుంది. గమనించ వలసినది వెన్ను పూస ఎముకలన్నీ కూడా , అంటే వర్టిబ్రా అన్నీ కూడా కొంత మేర మన జీవితాంతం , అంటే మనం కదులుతూ , వంగుతూ, లేవగలుగుతూ ఉన్నంత కాలం , కదులుతూ ఉంటాయి , కానీ అప్పుడు నొప్పి కలగదు కదా ! కేవలం  సరి అయిన పధ్ధతి లో కదలక , అస్తవ్యస్తం గా కదిలితేనే , ప్రక్కన ఉండే వెన్ను నాడి నొక్క బడి , నొప్పి కలుగుతుంది. ( పైన ఉన్న చిత్రం  గమనించండి ).
3. లామి నెక్ట మీ: ఈ రకమైన సర్జరీ లో  వెన్ను పూస ఎముక(ల ) ఎముక భాగాన్ని తొలగించి , వాటి ప్రక్కన ఉన్న నాడి మీద ఆ వెన్ను పూస ఎముక (లు ) వత్తిడి కలిగించడం లేదా నొక్కడం నివారిస్తారు. దానితో నొప్పి కూడా నివారించ బడుతుంది. ( పైన ఉన్న చిత్రం  గమనించండి ).
వెన్నెముక సర్జరీ లలో ఉండే రిస్కులు ఏమిటి ?
ప్రతి శస్త్ర చికిత్స లో ఉండే రిస్కుల లాగానే , వెన్నెముక మీద చేసే సర్జరీ కూడా కొంత రిస్కు తో కూడుకున్నది. ఆ రిస్కులు ఏమిటి ? 
1. ఇన్ఫెక్షన్ :   వెన్నెముక ఆపరేషన్ చేసే భాగం లో ఇన్ఫెక్షన్ చేర వచ్చు . అంటే  బ్యాక్టీరియా లు అక్కడ చేర వచ్చు.  సర్వ సామాన్యం గా ఈ పరిస్థితి ,  చేసే  సిబ్బంది , లేదా మేనేజ్మెంట్ వాళ్ళు కక్కుర్తి పడి కానీ , లేదా  అజ్ఞానం వల్ల కానీ , లేదా బాధ్యతా రాహిత్యం వల్ల కానీ సరి అయిన శుభ్రత పాటించక పొతే కలుగుతుంది.
2. నాడులు దెబ్బ తినడం : కొన్ని సమయాలలో , సర్జన్ ఆపరేషన్ సరిగా చేయక పొతే , కొన్ని సున్నితమైన నాడులు తెగి పోయి , ఆ భాగం లో ఉన్న కండరాలు ‘ చచ్చు ‘ బడ వచ్చు
3. సరిగా ఆపరేషన్ చేయక పొతే , నొప్పి అట్లాగే ఉండ వచ్చు !  ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , ఆపరేషన్ ఫెయిల్ అవడం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

వెనక నొప్పి . 7. సయాటికా కు చికిత్స ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 14, 2014 at 3:25 సా.

వెనక నొప్పి . 7. సయాటికా కు చికిత్స ఏమిటి ?

 

మునుపటి టపాలో, సయాటికా కు వాడే మందులతో ఏ  ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ! ప్రధానం గా చికిత్స  మూడు పద్ధతులలో ఉంటుంది. 1. మందులతో 2. వ్యాయామం తో 3. శస్త్ర చికిత్స తో .
మందులతో  వెనక నొప్పి ని తగ్గించు కోవడం ఎట్లాగో తెలుసుకున్నాం కదా  క్రిందటి టపాలో.  ఈ మందులు రోజూ తీసుకుంటున్నప్పుడు ,  సాత్విక ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి . ఎందుకంటే నొప్పి నివారణకు వేసుకునే మందులు చాలా వరకూ  కడుపులో మంట పుట్టిస్తాయి . దానికి తోడుగా , కాఫీలూ , టీలూ , ఎక్కువగా తీసుకుంటూ ,  స్పైసీ ఫుడ్ అంటే మసాలాలూ , పచ్చళ్ళూ , ఎక్కువగా ఉన్న ఆహారం కూడా తింటూ ఉంటే ,  కడుపులో మంట రెండింతలవుతుంది.   అట్లా జరుగుతుదని డాక్టర్ తో చెబితే , కడుపులో సహజం గా ఉత్పత్తి అయే  ఆమ్లాలు తగ్గించడానికి ఇంకో ట్యా బ్లెట్  రాస్తాడు !   సాధారణం గా డాక్టర్ రాసే ప్రతి ట్యా బ్లెట్ కూ  ఏదో రకం గా ప్రతి ఫలం ముడుతుంది ! సాత్విక ఆహారం అందుకే  ఆ సమస్యలను నివారిస్తుంది , అలవాటు చేసుకునే వారిలో !  అట్లాగే , రోజూ కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్ళు తాగడం కూడా మాన కూడదు , ఈ రకమైన మందులు తీసుకుంటున్నప్పుడు !  ప్రతి ఆరు నెలలకూ ఒక సారి , కిడ్నీ పరీక్షలు కూడా చేయించుకోవాలి ( కిడ్నీలు లేదా మూత్ర పిండాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం కేవలం రక్త పరీక్ష తో  కూడా సంభవం ! )
2. వ్యాయామం తో వెనక నొప్పి తగ్గుతుందా ? 
వెనక నొప్పి ఉన్న వారు , వీలైనంత వరకూ , శారీరిక వ్యాయామం , క్రమం గా అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉండడం ఎంతో  ఆరోగ్య కరం. నొప్పి  తగ్గిస్తూ , వెన్నుపూస చుట్టూ ఉన్న కండరాలు బలం గా ఉండడం కోసం అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం చేయక పొతే , ఆ కండరాలు బలహీన పడి , నొప్పి ఎక్కువ అయే ప్రమాదం ఉంటుంది.
కంప్రెషన్ ప్యాక్స్ తో నొప్పి నివారణ :  ఇవి ప్రత్యేకం గా మందుల షాపులలో అమ్ముతూ ఉంటారు . వీటితో ఏ  సైడ్ ఎఫెక్ట్ లూ ఉండవు.  ఈ ప్యాక్ లలో ఐసు ముక్కలు కానీ లేదా వేడి నీళ్ళు కానీ పోసుకుని ‘ కాపడం ‘ లాగా నొప్పి ఉన్న చోట కొంత సేపు ఉంచడం చేస్తూ ఉంటే , నొప్పి కి ఉపశమనం ఉంటుంది !
దీర్ఘ కాలిక , వెనక నొప్పి కి చికిత్స ఏమిటి ? 
కొందరి లో వెనక నొప్పి , కొన్ని నెలలు గానూ , సంవత్సరాల గానూ  ఉండి , బాధ పెడుతూ ఉంటుంది. వారిలో  ముందుగా  తీసుకునే మందులలో మార్పులు చేసి , నొప్పి నివారణ కు ప్రయత్నం చేయాలి.  పారా సెట మాల్  ( క్రోసిన్ ) , కోడీన్ , ప్రీగాబాలిన్ , గాబా పెంటిన్ , లాంటి మందులు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తాయి.
ఇంజెక్షన్ లతో ప్రయోజనం ఉంటుందా ? 
సామాన్యం గా నొప్పి తీవ్రం గా ఉంటే , ఆ నొప్పి కలిగిస్తున్న చోట , స్టీరాయిడ్ ఇంజెక్షన్ లు చేసి నొప్పి ని తగ్గించడం కూడా జరుగుతుంది. మునుపటి టపాలలో చెప్పుకున్నట్టు గా , నొప్పి ఉన్న చోట , కండరాలు వాచి , ఆ వాచి ఉన్న కండరాలు పక్కనే ఉన్న నాడిని నొక్కడం వల్ల నొప్పి ఎక్కువ అవడం జరుగుతుంది.
స్టీరాయిడ్ ఇంజెక్షన్ , ఆ రకమైన వాపును తగ్గిస్తుంది. దానితో ,  పక్కన ఉన్న నాడికి వత్తిడి తగ్గి , పర్యవసానం గా నొప్పి కూడా తగ్గుతుంది. కానీ ఈ రకమైన ఇంజెక్షన్ లు నిపుణి డి తో నే అంటే  ఎముకల స్పెషలిస్ట్ తోనే చేయించుకుంటే మంచిది.  ఎవరితో బడితే వారితో చేయించుకుంటే , ‘ కోతి పుండు బ్రహ్మ రాక్షసి అయినట్టు , తయారవుతుంది , వెనక నొప్పి ! అందుకని జాగ్రత్త అవసరం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

 

వెనక నొప్పి .6. సయాటికా కు వేసుకునే మందులతో జాగ్రత్తలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 8, 2014 at 7:39 సా.

వెనక నొప్పి .6.  సయాటికా కు వేసుకునే మందుల తో జాగ్రత్తలు. 

క్రితం టపాలలో సయాటికా అని దేనిని అంటారు , దాని లక్షణా లేంటి , దానిని ఎట్లా కనుక్కోవచ్చు అనే విషయాల గురించి చాలా వరకూ తెలుసుకున్నాం కదా ! మరి సయాటికా కు లభ్యమయే చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకుందాం ! సయాటికా కు చికిత్స , ఆ సమస్య తీవ్రత ను బట్టి చేయించు కోవడం మంచిది. అంతే కాకుండా , సమస్య  తీరు ను బట్టి కూడా చేయించుకోవాలి ! 
సమస్య తీరు : సయాటికా అంటే వెనక నొప్పి లేదా వెన్ను నొప్పి అని తెలుసుకున్నాం కదా ! మరి సమస్య తీరు అంటే ఏమిటి ? :
కారణాలు ఏమైనా సయాటికా లేదా వెన్ను నొప్పి , చివరకు , వెన్ను పూస లో నుంచి బయటకు వచ్చే సయాటిక్ నాడి  మీద పడే వత్తిడి మూలం గానే నొప్పి కలుగుతుంది. అంటే ఆ నాడి నొక్క బడుతుంది. ఉదాహరణకు : కొన్ని ప్రమాదాలలో వీపు భాగం మీద బలం గా గాయం తగిలితే , ఆ భాగం లో ఉన్న కండరాలు ఇంకా సయాటిక్ నాడి చుట్టూ ఉన్న  దట్టమైన పొరలు వీటినే ఫేషియా అని అంటారు , ఈ పొరలు ‘ చినిగి ‘ పోవడం అంటే టే ర్  అవడం జరుగుతుంది అప్పుడు కూడా  సయాటికా లక్షణాలు కలగ వచ్చు. అట్లాగే  ఎక్కువ బరువులు అననుకూల మైన కోణాలలో ఎత్తితే కూడా , వెన్ను పూసల మధ్యలో ఉండే డిస్క్ భాగం బయటకు వచ్చి సయాటిక్ నాడిని గట్టిగా నొక్క వచ్చు ! ఆ సందర్భం లో కూడా నొప్పి కలుగుతుంది ! 
సమస్య తీవ్రత : క్రితం టపాలో చెప్పుకున్నట్టు గా  సయాటికా సమస్య కొద్ది గానే ఉంటే , అంటే మైల్డ్ గా నొప్పి కలగడం , కేవలం ఒక పొజిషన్ లోనే నొప్పి కలగడం లాంటి లక్షణాలు, ప్రత్యేకించి తొలి దశలో  ఉంటే , చికిత్స కేవలం సరిపడినంత విశ్రాంతి లేదా రెస్ట్ తీసుకోవడమే ! 
రెస్ట్ వల్ల ప్రయోజనం ఏమిటి ? 
చాలామంది సయాటికా బాధితులు ‘ ఏ డాక్టర్ దగ్గర కెళ్ళినా రెస్ట్ తీసుకోమని సలహా ఇస్తారు , రోజూ పని చేసుకునే వారికి రెస్ట్ ఎట్లా కుదురుతుంది ?’  అని సందేహాలు వెలిబుచ్చుతారు, నిరుత్సాహ పడతారు ! రెస్ట్ తీసుకోవడం అనేక విధాలు గా మంచిది . 1.  రోజంతా పని చేస్తుంటే , పని వత్తిడి ఉంటుంది. 2. దానితో పాటు గా  వీపు భాగం లో ఉండే కండరాలన్నీ బిగుతు గా అవుతాయి. అంటే టెన్స్ గా అవడం ! అట్లా కండరాలు టెన్స్ గా ఉండడం వల్ల కూడా సయాటికా నాడి మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. దానితో నొప్పి ఎక్కువ అవుతుంది.
మరి భరించలేని నొప్పి అవుతే ట్యా బ్లెట్ లు తీసుకోవచ్చా ?
తప్పకుండా తీసుకోవచ్చు. కానీ ఏ   ట్యా బ్లెట్ లు పడితే అవి తీసుకోవడం మంచిది కాదు. 
కారణం ఏమిటి ? 
నొప్పి నివారణకు మార్కెట్ లో లభ్యం అవుతున్న  ట్యా బ్లెట్ లు అనేక రకాలు గా ఉంటాయి. ఏ  ట్యా బ్లెట్ కూడా వంద శాతం సురక్షితం కాదు. ఇంకో రకం గా చెప్పాలంటే , ప్రతి ట్యా బ్లెట్ కూడా కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్ లు కలిగి ఉంటుంది. కొన్ని  ట్యా బ్లెట్ లు , అప్పటికే కొన్ని రోగాల తో బాధ పడుతున్న వారు వేసుకోకూడదు ! 
ఉదాహరణ కు : ఆస్తమా ఉన్న వారికి వెన్ను నొప్పి వస్తే , వారు ఐబూ ప్రొఫెన్ అనే ట్యా బ్లెట్ తీసుకో కూడదు. ఏ కారణం చేతనైనా తీసుకుంటే , వారికి ఆస్తమా తీవ్రం అయే ప్రమాదం ఉంటుంది ! అట్లాగే , కొన్ని రకాల  ట్యా బ్లెట్ లు నొప్పిని తగ్గించినా  , మూత్ర పిండాలను దెబ్బ తీయగలవు ! ప్రత్యేకించి , నొప్పి తగ్గిస్తుంది కదా అని ఎడా పెడా , ఎన్ని పడితే అన్ని  తమ ఇష్టానుసారం ట్యా బ్లెట్ లు వేసుకుంటూ ఉంటే ! భారత దేశం లో  సాధారణం గా ఏ మందుల షాపు కు వెళ్ళినా , ఏ మందు కావాలన్నా , డాక్టరు సలహా ఉన్నా లేక పోయినా కూడా , మనకు కావలసినన్ని  ట్యా బ్లెట్ లు కొనుక్కోవచ్చు ! మందుల షాపులకు కావలసినది డబ్బు , మన ఆరోగ్యం ప్రధానం కాదు వారికి ! 
ఏ జబ్బులు ఉన్న వారు  నొప్పి నివారణ  ట్యా బ్లెట్ లు తీసుకునే సమయం లో జాగ్రత్త గా ఉండాలి ?
1. కడుపు లో అల్సర్ ఉన్న వారు : ఎందుకు ?  నొప్పి నివారణ మందుల్లో చాలా మందులు కడుపు లో మంట ఎక్కువ చేస్తాయి. కడుపు లో అల్సర్ ఉన్న వారు కనుక ఎక్కువ గా నొప్పి కి మందులు తీసుకుంటే , అల్సర్ పెద్దదయి , రక్త స్రావం అవుతుంది. ఇంకో రకం గా చెప్పుకోవాలంటే , కడుపు లో చిల్లు పడుతుంది. ప్రత్యేకించి  మద్యం ఎక్కువ గా , ఎక్కువ కాలం తాగే వారిలో ఇట్లా , కడుపులో అల్సర్ లు ఏర్పడే ప్రమాదం ఉంది. కారాలు బాగా ఎక్కువ గా ఉన్న పచ్చళ్ళు , ఊరగాయలు ఎక్కువ గా తినే వారిలో కూడా అల్సర్ లు వస్తాయి ! దక్షిణ భారతం లో ఇట్లా అల్సర్ లు ఉన్న వారు  ఎక్కువ అని కూడా పరిశీలనల వల్ల తెలిసింది.
2. పైన చెప్పుకున్నట్టు ఆస్తమా బాధితులు. 
3. గుండె జబ్బు ఉన్న వారు. 
4. కాలేయం అంటే లివర్ సరిగా పని చేయని వారు. నొప్పి నివారణ మందులు కాలేయాన్ని కూడా దెబ్బ తీయగలవు ! అందుకు. 
6. మూత్ర పిండాల జబ్బులు ఉన్న వారు. చాలా రకాల నొప్పి నివారణ మందులు మూత్ర పిండాల లో ఉండే అతి సూక్ష్మమైన జల్లెడలను పాడు చేస్తాయి అందుకు ! 
7. అధిక రక్త పీడనం అంటే హై బీపీ ఉన్న వారు. ఎందుకు? : అనేక రకాల నొప్పి నివారణ మందులు రక్త పీడనాన్ని అనేక రకాలు గా ఎక్కువ చేస్తాయి అందుకు !  
 ( పైన ఉన్న చిత్రం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ  నొప్పి తీవ్రత ను బట్టి వాడే మందులు ఒక క్రమం లో సూచించడం జరిగింది.  నొప్పి తీవ్రత 10 కి ఎన్ని పాయింట్లో దాని ప్రకారం మైల్డ్ , మోడరేట్ , సివియర్ అంటే కొద్దిగా , మధ్యస్థం గా , ఎక్కువ గా ఉన్నప్పుడు , ఏ  ఏ  మందులు వాడవచ్చో చూపించడం జరిగింది ) . 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

వెనక నొప్పి . 5. సయాటికా ఎట్లా కనుక్కోవచ్చు ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 4, 2014 at 7:22 సా.

వెనక నొప్పి . 5. సయాటికా ఎట్లా కనుక్కోవచ్చు ? 

 

వెనక నొప్పి అనేక విధాలు గా కనబడుతూ ఉంటుంది , ఒక్కొక్కరిలో !  ఆ లక్షణాలు చాలా వరకూ మునుపటి టపాలలో తెలుసుకోవడం జరిగింది కదా ! 
కనీసం ఆరు వారాల లోపు గా ఆ  లక్షణాలు కనుక చాలా వరకు తగ్గి పొతే ,  ఆ వెన్ను నొప్పి ని గురించి ఆందోళన పడనవసరం లేదు !   అంటే ,  ప్రత్యేకమైన చికిత్సలు అవసరం ఉండదు , అట్లా తగ్గిపోయే నొప్పులకు. ఆరు వారాలు దాటాక కూడా , నొప్పి  పోకుండా , వివిధ రకాలు గా బాధ పెడుతూ ఉంటే , అందుకు కారణాలు కనుక్కోవడం ఉత్తమం ! నొప్పి కి కారణాలు కనుక్కోవడం వల్ల  ఏ చికిత్స ఎక్కువ ఉపయోగమో తెలుస్తుంది ! 
వెనుక నొప్పి కారణాలు కనుక్కొనే పరీక్ష ల లో మొట్టమొదటిది చాలా తేలిక , దీనికి డబ్బు ఖర్చు ఏమీ అవ్వదు ! ఇంట్లోనే  పరీక్షించుకో వచ్చు ! కానీ, పక్కన సహాయానికి ( అవసరం ఉంటే  )  కుటుంబ సభ్యులో, లేదా స్నేహితులో ఉంటే మేలు !
వివరాలు : ఎత్తు పల్లాలు లేని సమతలం గా ఉన్న బెడ్ మీద  వెల్లికిలా పడుకోవాలి ! నిద్ర పోకూడదు ! ఆ తరువాత ఒక కాలును వంచ కుండా , నిటారు గా పైకి ఎత్తాలి కనీసం నలభై అయిదు డిగ్రీలు అంటే , బెడ్ మీద ఉన్న స్థానం నుంచి , పై  చిత్రం లో చూపినట్టు. ఆ తరువాత మీ పక్కన ఉన్న వారు ఎత్తి ఉంచిన కాలు పాదాన్ని మీ వైపుకు వంచాలి ! గమనించ వలసింది , కేవలం పాదాన్ని మాత్రమే తలవైపు వంచాలి. కాలును అదే స్థానం లో అంటే చిత్రం లో చూపిన విధం గా నే నలభై అయిదు డిగ్రీల కోణం లో ఉంచాలి. ఈ విధం గా  ఇంకో కాలునూ పరీక్షించాలి. అప్పుడు వెన్ను నొప్పి కలగడం కానీ , అప్పటికే ఉన్న వెన్ను నొప్పి ఎక్కువ అవడం కానీ జరిగితే , వెన్ను నొప్పి సమస్య ఉన్నట్టు లెక్క ! 
మిగతా పరీక్షలు :
రక్త పరీక్షలు : వెన్ను నొప్పి వస్తే రక్త పరీక్షలు ఎందుకు ? 
వెన్ను నొప్పికి కారణమైన ఇన్ఫెక్షన్ , రక్త పరీక్ష లలో కనుక్కోవచ్చు !  CRP  అనే పరీక్ష ఇంకా తెల్ల కణాల పరీక్ష ఈ రెండు పరీక్షలలో CRP , ఇంకా తెల్ల కణాలూ ఉండవలసిన దానికన్నా ఎక్కువ గా ఉంటే , ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ప్రత్యేకించి ఆ ఇన్ఫెక్షన్ కొద్ది రోజులూ , లేదా వారాలూ  ఉంటే , ఈ పరీక్షలు అబ్నార్మల్ గా ఉంటాయి . 
అట్లా కాకుండా , ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువ వారాలూ లేదా నెలలూ కనుక శరీరం లో ఉంటే , అప్పుడు ESR  అనే పరీక్ష అబ్నార్మల్ గా కనబడుతుంది రక్త పరీక్ష లో !  దీర్ఘ కాలిక ఇన్ఫెక్షన్ లు శరీరం లో ఉన్నా లేదా , క్యాన్సర్ ఉన్నా కూడా ESR  అనే పరీక్ష అబ్నార్మల్ గా ఉండ వచ్చు !
Xray పరీక్ష : వెన్నెముక Xray  తీయిస్తే , డిస్క్ బయటకు రావడం కానీ , లేదా వెన్ను పూస ఎముకలు , వర్టిబ్రా  అని అంటారు , అవి అరిగి పోయినా లేదా విరిగి పోయినా లేదా , బలం లేకుండా ఉన్నా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎముకల మధ్యలో కానీ లేదా వాటి చుట్టూ కానీ చీము చేరినా కూడా ,తెలుసుకోవచ్చు.
MRI  స్కాన్: MRI  స్క్యాన్  వల్ల పైన చెప్పిన అంటే Xray  లో కనబడేవే , ఇంకా స్పష్టం గా కనబడతాయి ! MRI లో అయస్కాంత ప్రభావం తో శరీరం లోపలి భాగాలను పరిశీలించి వాటి ఫోటోలు తీయడం జరుగుతుంది. ( Xray  లో X కిరణాలను పంపి శరీరం లోపలి భాగాలను ఫోటో తీయడం జరుగుతుంది ).
మరి శరీరం లో ఇన్ఫెక్షన్ కానీ , క్యాన్సర్ కానీ ఉంటే , వెన్ను నొప్పి తో పాటుగా మిగతా లక్షణాలు ఎట్లా ఉంటాయి ?
మన శరీరం లో ఏదో మూల దాక్కుని ఉండే ఇన్ఫెక్షన్  ఇంకో రకం గా అంటే వెన్ను నొప్పి తోనో లేదా ఇంకో నొప్పితోనో, కనిపించ కుండా బాధ పెడుతూ ఉంటే  ఒక పట్టాన కనుక్కోవడం కష్టం ! ప్రత్యేకించి  వెన్ను నొప్పి కి క్యాన్సర్  కారణ మవుతే , ఇంకా బాధాకరం ! ఇట్లాంటి పరిస్థితులలో ,  ఆ నొప్పులతో పాటుగా మిగతా లక్షణాలను కూడా ఆ బాధ పడే వారు కానీ , లేదా వారికి ఆప్తులు , బంధువులు అయిన వారు కానీ , పరిశీలించి చూస్తే , గోచరిస్తాయి . అవి ఈ క్రింది విధం గా ఉండ వచ్చు :
1. సామాన్యం గా వయసు ఒక యాభై సంవత్సరాలు పైబడిన వారిలో 
2. ఇంతకు ముందు ఎప్పుడూ వెన్ను నొప్పి రాని వారిలో 
3. వంశ పారంపర్యం గా కుటుంబం లో( ఆ )  క్యాన్సర్ వచ్చి ఉంటే,
4. జ్వరం , వణుకూ , తరచు గా వస్తూ , బరువు తగ్గి పోతూ ఉంటే ,
5. పుట్టుకతో నే వెన్నెముక  పెరగడం లో అవక తవకలు ఉండి ఉంటే, 
6. సుఖ వ్యాధులు ఉన్న వారిలో ( అంటే ఎయిడ్స్ కూడా ) . 
 
పైన చెప్పిన లక్షణాలు , ఆందోళన పడడానికి కాదు , కేవలం ముందు జాగ్రత్త తో సరి అయిన చికిత్స అవసరం అవుతే చేయించు కోవడం కోసమే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

వెనక నొప్పి . 4. సయాటికా.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on జూలై 1, 2014 at 9:17 సా.

వెనక నొప్పి . 4. సయాటికా. 

క్రితం టపా లో వెనక నొప్పి ఎట్లా వస్తుందో తెలుసుకున్నాం కదా , ఇప్పుడు సయాటికా లక్షణాలు చూద్దాం !
సయాటికా  అని దేనిని అంటారు ?
మన దేహం లో ప్రతి భాగానికీ విస్తరించి ఉన్న నాడీ మండలం లో ఉండే అన్ని నాడులూ తప్పనిసరిగా మెదడుతో అను సంధానమై  ఉంటాయి, అంటే మన శరీరం లో ఏ భాగమైనా కూడా స్పర్శ కానీ , నొప్పి కానీ , వత్తిడి కానీ ( అంటే టెన్షన్ కాదు ఇక్కడ ,  ఒక వేలు తో ఎక్కడైనా శరీరం మీద నొక్కితే ఏర్పడే అనుభవం ‘ వత్తిడి ‘ ) ఇట్లా ఎట్లాంటి స్పర్శ అయినా ఆ యా భాగాలలో ఉన్న నాడులు , మెదడుకు తెలియ చేయడం వల్లనే ‘ మనకు  తెలిసేది ‘ ! సయాటిక్ నాడి  కూడా  మెదడు తో అనుసంధానమై ఉన్న ఒక పొడవైన నాడి ! ఈ సయాటిక్ నాడి , నడుము దగ్గర నుంచి వెనుక భాగం లో రెండు కాళ్ళకూ రెండు నాడులు గా విస్తరించి ఉంటుంది. ఈ నాడి మార్గం లో ఎక్కడైనా, ఏ కారణం చేత నైనా వత్తిడి కలిగితే  , ఆ వత్తిడి తీవ్రత ను బట్టి నొప్పి కలుగుతుంది దీనినే సయాటికా అని అంటారు.
ఈ సయాటిక్ నాడి ఎంత వరకూ ఉంటుంది ? 
సయాటిక్ నాడి , మన శరీరం లో ఉండే నాడుల లోకల్లా అతి పొడవైన నాడి ! ఈ నాడి , కటివలయం అంటే పెల్విస్ నుంచి పిదురుల ( అంటే హిప్స్ ) గుండా పాదం వరకూ విస్తరించి ఉంటుంది !   అంటే, రెండు కాళ్ళ లోనూ రెండు సయాటిక్ నాడులు ఉంటాయి. 
సయాటిక్ నొప్పి ఎట్లా ఉంటుంది ?
మిగతా నొప్పులు సామాన్యం గా సమస్య ఉన్న చోటే నొప్పి కలిగిస్తాయి. కానీ సయాటికా నొప్పి  వత్తిడి ఉన్న చోట కాకుండా , ఆ నాడి విస్తరించి ఉన్న భాగం లో వస్తుంది ! సామాన్యం గా ఒకే పొజిషన్ లో ఎక్కువ సమయం నుంచుంటే కానీ, లేదా కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం కూర్చుంటే కానీ , లేదా , తుమ్మడం , దగ్గడం చేయడం ఎక్కువ సేపు బాగా నవ్వడం వల్ల , లేదా  ముందుకు వంగడం వల్ల కానీ నొప్పి ఎక్కువ గా ఉంటుంది ! కొన్ని సందర్భాలలో , నొప్పి లేకుండా , ఒక కాలు కానీ , పాదం కానీ చచ్చు బడి పోయినట్టు తిమ్మిరి గా ఉండడం, లేదా ఆ కాలు కు ఉన్న కండరాలు బలహీనం గా అనిపించడం కూడా జరుగుతుంది. వత్తిడి తీవ్రత ఎక్కువ గా ఉంటే , కొన్ని సందర్భాలలో  మల మూత్ర విసర్జన మన స్వాధీనం లో లేక పోవడం కూడా జరుగుతుంది ! అంటే మన కంట్రోలు లో లేక పోవడం ! 
మరి సయాటికా కు కారణాలు ఏమిటి ?
క్రితం టపాల లో చెప్పుకున్నట్టు గా , వెన్ను పూస ఎముకల మధ్య ఉండే డిస్క్ పదార్ధం బయటికి రావడం వల్ల కానీ , లేదా ఏదైనా ఇన్ఫెక్షన్  వెన్ను పూస లో చేరడం వల్ల కానీ ,అవ వచ్చు !  భారత దేశం లో వెన్నెముక లలో టీబీ  దానినే బోన్ టీబీ అని కూడా అంటారు , అట్లా టీబీ రావడం వల్ల  వెన్ను పూసను కరిగించి వేస్తుంది వచ్చిన ఇన్ఫెక్షన్ ! ఇంకా  క్యాన్సర్ వెన్నెముక కు పాకితే కూడా  సయాటికా లక్షణాలు కలగ వచ్చు! ప్రమాదాలు జరిగి , వెన్నెముక కు గట్టి దెబ్బ తగిలినా కూడా ఆ వెన్నెముక భాగం విరిగి పోయి సయాటిక్ నాడికి వత్తిడి కలిగి నొప్పీ , బాధా కలగ వచ్చు !  ఇక్కడ చెప్పుకున్న కారణాలలో ఇన్ఫెక్షన్ కానీ డిస్క్ కానీ ఏర్పడడం సామాన్య కారణాలు !  వెన్నెముక లో టీబీ కానీ క్యాన్సర్ కానీ రావడం అరుదు గానూ జరుగుతూ ఉంటుందనే విషయం గుర్తు ఉంచుకోవాలి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: