వెనక నొప్పి కి కారణాలు . 3. బ్యాకేక్.

పైన ఉన్న చిత్రం గమనించండి !
క్రితం టపాలలో , వెనక నొప్పి రకాలూ , ఆ నొప్పి ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు అసలు వెనక నొప్పి ఎట్లా వస్తుందో , ఎందుకు వస్తుందో చూద్దాం.
మన శరీర నిర్మాణం లో ఎముకలూ , కండరాలూ , నాడీ మండలం అంటే నాడులు , ఇంకా కార్టిలేజ్ , లిగమెంట్ లు ఇట్లా అనేక నిర్మాణాలు , మన కదలిక కు అనివార్యమైన శరీర భాగాలు. ఈ విషయం బాగా గుర్తు ఉంచుకుంటే , అసలు నొప్పి కి కారణం ఏమిటో తెలుసుకోవడం సులభం అవుతుంది. ఉదాహరణకు : యుక్త వయసులో , ఎముకల నిర్మాణం అప్పుడే పూర్తి అయి ఉండడం వల్ల , అప్పుడు కలిగే నొప్పి సాధారణం గా కండరాలూ , లేదా లిగమెంట్ ల వల్ల ఏర్పడుతుంది ! అంటే అతిగా వ్యాయామం చేయడం వలన కానీ , లేదా లిగమెంట్ లను ఎక్కువ గా లాగడం వల్ల కానీ ! లిగమెంట్ లు అంటే మన శరీరం లో ప్రతి కీలు అంటే జాయింట్ లోనూ ఇవి ఉండి ఒక ఎముకకూ , ఇంకో ఎముకకూ మధ్య ఏర్పడే నిర్మాణాలు. లిగమెంట్ లు మన శరీరం లో ఉండే అతి గట్టి భాగాలు. ఈ భాగాలు , ఎముకలు ఎక్కువ గా వంచడం వల్ల అంటే , ఏవైనా ఎక్కువ బరువులు మోసినప్పుడు కానీ , లేదా విపరీతం గా ఆటలు ఆడడం వల్ల కానీ , ‘ లాగ బడతాయి ‘ అంటే అతిగా స్ట్రెచ్ అవుతాయి . దానితో నొప్పి కలుగుతుంది. అట్లాగే కండరాలు కూడా !
ఇక కొన్ని రకాల నొప్పులు నాడుల మీద వత్తిడి కలిగి వస్తాయి. క్రితం టపాలలో , వర్టిబ్రా ల మధ్యనుంచి వచ్చే నాడులు గమనిస్తే , ఆ నాడుల కు ఆనుకునే డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ కనుక రెండు వర్టిబ్రా ల మధ్య సందులోంచి ఏమాత్రం బయటకు వచ్చినా కూడా , అది ఆ పక్కనే ఉన్న నాడిని నొక్కుతుంది. దానినే మనం డిస్క్ ఉంది అని సామాన్యం గా అనుకుంటూ ఉంటాం ! ఈ డిస్క్ బయటకు రావడం , మెడ భాగం లో ఉన్న వెన్ను పూస లో కానీ లేదా నడుము భాగం లో ఉన్న వెన్నుపూస లో కానీ జరగ వచ్చు ! ఎక్కడ జరిగిందీ అనేది , ఈ భాగం లో కదలికలు అవక తవక గా , అతి గా చేశామూ అనే విషయం మీద ఆధార పడుతుంది ! కేవలం ఈ డిస్క్ , కొన్ని సమయాలలో బయటకు వచ్చి పక్కన ఉన్న నాడిని నొక్కి , నొప్పి కలిగించడమే కాకుండా , వయసు మీరాక ఈ డిస్క్ కూడా అరిగి పోవడం జరిగి , తద్వారా వెన్ను పూస లు పక్కన ఉన్న నాడులను నొక్కడం వలన కూడా
నొప్పి కలగ వచ్చు !
పైన ఉన్న చిత్రం గమనించండి !
ఇక ఇంకో రకమైన నొప్పులు కూడా వస్తుంటాయి సామాన్యం గా మనకు. ఆ నొప్పులు , విపరీతమైన మసుల్ ఏక్స్ అంటే శరీరమంతా అలసట గానూ కండరాలన్నీ నొప్పులు గానూ ఉండడం. దీనికి కారణం శరీరం లో ఇన్ఫెక్షన్ కలగడం ! అంటే శరీరం లో ఇన్ఫెక్షన్ ఉంటే , కండరాలలో ఎందుకు నొప్పులు కలుగుతాయి ? అని అనుకుంటే , ఇన్ఫెక్షన్ సామాన్యం గా రక్తం లో కలుస్తుంది అనే విషయం గుర్తు చేసుకోవాలి ! అంటే ఉదాహరణకు , మలేరియా కానీ , లేదా వైరల్ ఫీవర్ అంటే ‘ విష జ్వరం ‘ వచ్చినా , లేదా ఏవైనా దీర్ఘ వ్యాధి కలిగినా కూడా , ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకుతుంది రక్తం శరీరమంతా ప్రవహిస్తుంది కాబట్టి ! అట్లా ఇన్ఫెక్షన్ కారణం గా వచ్చే నొప్పులు , ఇన్ఫెక్షన్ కు సరి అయిన యాంటీ బయాటిక్స్ కానీ లేదా మలేరియాకు మందులు కానీ వేసుకుంటే ఠ పీ మని తగ్గిపోతాయి , శరీరంలో కండరాల నొప్పులు కూడా !
ఇక ఒక వయసు వచ్చాక , శరీరం లోని ఎముకలు అరిగి పోవడం వల్ల , నొప్పులు కలుగుతాయి ఉదాహరణకు , తుంటి జాయింటు అంటే హిప్ జాయింటు లేదా తుంటి కీలు , లేదా మోకాలు కీలు. వీటిలో నొప్పి కేవలం వయసు మీరితేనే కాకుండా , యుక్త వయసు లో కూడా , వారు అతిగా బరువు గా ఉంటే రావచ్చు ! అంటే ఊబకాయం లేదా ఒబీసిటీ ! ఇట్లాంటి నొప్పులు ఒక పట్టాన తగ్గవు ఎందుకంటే , అరిగిన కీళ్ళు మళ్ళీ కొత్తగా మారవు కాబట్టి !
సారాంశం : వెనక నొప్పి కి అనేక కారణాలు ఉంటాయి ! అన్నిటికీ ఒకే మందు పని చేస్తుందని అనుకోవడం మంచిది కాదు , ప్రత్యేకించి , ఆ నొప్పి మన శరీరం లో ఏ భాగం వల్ల వస్తుందో కనుక్కోకుండా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…