Our Health

Posts Tagged ‘లక్షణాలు’

సర్వైకల్ క్యాన్సర్.6. లక్షణాలు.

In Our Health on ఏప్రిల్ 18, 2012 at 11:59 సా.

సర్వైకల్ క్యాన్సర్.6. లక్షణాలు:

ఇప్పటి వరకు మనం కొంత వరకూ తెలుసుకున్నాము కదా సర్వైకల్ క్యాన్సర్ గురించి.
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడే తగు జాగ్రత్త తీసుకొని తగిన పరీక్షలు అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ వంటివి చేయించి క్యాన్సర్ అవునో కాదో తెలుసుకోవడానికి, అంతే కాకుండా, ఇంకా ముఖ్యంగా తొలి దశలోనే కనుక్కుంటే, ఎక్కువ ఉపయోగకరమైన అంటే,  జీవితాన్ని ఎక్కువ కాలం పొడిగించ గలిగే చికిత్స చేయ వచ్చు. 
ఇప్పుడు తొలిదశల లో సర్వైకల్ క్యాన్సర్ చూపే లక్షణాలు చూద్దాము:
ఇవి ముఖ్యం గా మూడు:
1. అసాధారణ  గర్భాశయ  రక్త స్రావం: 
అంటే సర్విక్స్ నుంచి వచ్చే రక్త స్రావం కూడా అనుకోవచ్చు. మనం మునుపటి టపాలలో చూశాము సర్విక్స్ కు ఆ పేరు గర్భాశయం లో మెడ భాగం లో ఉండటం వల్ల వచ్చిందని.
ఈ సర్విక్స్ మీద వ్రణం, లేక  పుండు లాంటిది ఏర్పడ్డప్పుడు కొంత రక్త స్రావం అవుతుంది. ప్రత్యేకించి ఆ పుండు లాంటి భాగానికి ఘర్షణ అంటే ఫ్రిక్షన్  కలుగుతే. సర్విక్స్ భాగం లో 
ఇలా ఫ్రిక్షన్  ప్రత్యేకించి రతిక్రియ లో జరగటానికి అవకాశం ఉంటుంది కదా ! అందు కనే  దీనిని రతి క్రియానంతర అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు.
ఇలా రతిక్రియ తరువాత కొద్దిగా బ్లీడింగ్ అంటే రక్త స్రావం జరగటం, స్త్రీ లలో  వారి  సెక్స్ జీవితం మొదటి దశలలో అంటే వారు తొలి సారి రతిక్రియ లో పాల్గొన్నప్పుడు మొదటి కొన్ని సార్లు జరగ వచ్చు. అప్పుడు అది అసాధా రణం కాదు.అలా సహజం గా జరుగుతుంది. కానీ ఆ తరువాత నుంచి జరిగే రతి క్రియల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రతిక్రియ తరువాత కనుక రక్త స్రావం జరిగితే అది అసాధా రణ రక్త స్రావం అన బడుతుంది. ఇలా కనక జరిగితే  గైనకాలజిస్ట్ ను వెంటనే సంప్రదించి తగు సలహా తీసుకోవాలి.
2.ఋతు స్రావం కాని సమయాలలో రక్త స్రావం : 
సాధారణం గా ప్రతి స్త్రీ కీ , రజ స్వల అయినప్పటి నుంచి,  వారికి ఒక ప్రత్యేకమైన ఋతు క్రమం ఏర్పడుతుంది.  ఈ ఋతు క్రమం  21 నుంచి35 రోజుల కు ఒకసారి ఉంటుంది. 
ఈ ఋతు క్రమం లో  మూడు నుంచి ఏడు రోజులు ఋతు స్రావం జరుగుతుంది. మనం ఋతుక్రమం వివరాలు మునుపటి టపాలలో చూశాము కదా, ఋతుస్రావం సమయాన్ని మెన్సెస్ అంటారనీ, ఈ సమయం లో గర్భాశయం లైనింగ్ నుంచి రక్త స్రావం జరిగి , ఆ రక్తం తో పాటు  అండం ( అంటే వీర్య కణం తో కలవలేక పోయిన అండం ) కూడా బయటకు పంప బడుతుందనీ. ఇదంతా సహజ ఋతుస్రావం అనబడుతుంది.  ఇలా కాకుండా ఋతు స్రావం కాని సమయాలలో రక్త స్రావం అవుతే, వెంటనే గైనకాలజిస్ట్ ను కన్సల్ట్ చేయాలి.
3.ఋతు క్రమం ఆగి పోయాక జరిగే ‘ ఋతుస్రావం’ : 
సాధారణం గా ఋతుక్రమం 45 నుంచి 52 ఏళ్ళ మధ్య స్త్రీలలో ఋతుక్రమం ఆగి పోతుంది. దీనినే మెనో పాజ్  అంటారు. 
( లేక తెలుగులో ‘ ముట్లుడిగి పోవడం ‘  అంటారు.)  ఇలా జరిగే సమయం లో  కొంతవరకూ ఋతుక్రమం సక్రమం గా ఉండక పోవచ్చు. కానీ ఋతుక్రమం పూర్తిగా ఆగిపోయాక మళ్ళీ  ఋతు స్రావం లేక ‘ రక్త స్రావం ‘ జరిగితే దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా గైనకాలజిస్ట్ కు చూపించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
వచ్చే టపాలో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాము !
%d bloggers like this: