Our Health

Posts Tagged ‘పని సూత్రాలు’

పని సూత్రాలు. 47. మాట తీరు తో ముందుకు పోవాలి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 15, 2014 at 11:17 ఉద.

పని సూత్రాలు. 47. మాట తీరు తో ముందుకు పోవాలి ! 

 
సామాన్యం గా మనం పనిచేసే చోట, మనం నలుగురి తో కలిసి పోవాలనే తపన తో , కాస్త ఎక్కువ గా మాట్లాడుతూ ఉంటాము ! కొన్ని సమయాలలో అనవసరమైన విషయాలు కూడా ! గాసిప్ లు కూడా సర్వ సాధారణమే !  మనం చేయ వలసిన పని కాకుండా ఇతరత్రా చేసే పనులన్నీ కూడా , ఉత్పాదన ను ప్రభావితం చేస్తాయి !ముఖ్యం గా , మన వ్యక్తి గత పురోగతి కి కూడా అవరోధం అవుతాయి ! కొన్ని సమయాలలో మనకు తెలియ కుండానే ! 
మీరు పని చేసే స్థానం లో, మీ బాసు మాట తీరు గమనించండి ! సామాన్యం గా మీ బాసు అధిక ప్రసంగం చేయడు ! ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతాడు ! అనవసర హస్కు లు వేయడు !’ మనం’ చేయవలసింది చాలా ఉంది ‘ అని అంటాడు !’ నేను’ చేయవలసింది అనడు ! అంటే, తాను  మాట్లాడే ప్రతి మాటలోనూ , సమిష్టి గా  మిగతా అందరినీ కలుపుకుంటాడు ! అంటే మీ బాసు,  మీ కంపెనీ సరిగా నడవాలంటే , మీ కంపెనీ లో పని చేస్తున్న ప్రతి వారి  పాత్రా ముఖ్యమైనదని నమ్ముతాడు ! కేవలం వ్యక్తి గతం గా , తన గురించి చెప్పుకోడు , తన వ్యక్తి గత విషయాల గురించి ఎక్కువ గా మాట్లాడడు ! 
ఇంకా మీరు, మీ బాసు ను పరిశీలిస్తే ఈ విషయాలు కూడా మీకు ప్రస్ఫుట మవుతాయి : మీ బాసు  తాను మాట్లాడే ప్రతి మాటకూ వేస్తాడు త్రాసు ! అంటే మాట్లాడే ప్రతి మాటనూ కొలిచి మాట్లాడుతాడు ! మీ బాసు ఎప్పుడూ  ఎవరినీ  తిట్టడు ! తిట్టే బాసు , ప్రత్యేకించి , ఇతరుల ముందు , ఇంకో ఉద్యోగిని తిట్టే బాసు , బాసు ఉద్యోగానికి అనర్హుడు ! మీరు క్రితం రోజు టీవీ లో వచ్చిన కార్యక్రమాలను మీ ఇతర కొలీగ్స్ తో మాట్లాడు కుంటున్నా కూడా , మీ బాస్ , ఆ విషయాలు తనకు పట్టనట్టు , చేయ వలసిన పని గురించే ఆలోచిస్తాడు ! మీరు చేయవలసిన పని గురించే మాట్లాడుతాడు కూడా ! ఇంకో ముఖ్య విషయం : మీ బాస్ ఎప్పుడూ , ఏ విషయం మాట్లాడ వలసి వచ్చినా కూడా , వెంటనే బడ బడా వాగేయ కుండా , కొంత సమయం తీసుకుని , ఆలోచించి , అప్పుడే , అవసరమైన రెండు మూడు మాటలు మాట్లాడతాడు !
అనవసరం గా నోరు ‘ పారేసుకోడు ‘ !  
మీరు ముందుకు పోవాలనుకుంటే , అంటే ఒక బాస్  అవ్వాలని లక్ష్యం ఏర్పరుచుకుంటే , పైన చెప్పిన విషయాలను ఆచరణ లో పెట్టడమే !  మీ సహా ఉద్యోగులను ఒక తండ్రి లాగానో , తల్లి లాగానో , చూడడమే , అంటే , వారి బాధ్యతలను వారికి అప్పగించి , దూరం నుంచి , పర్యవేక్షణ చేయడమే ! అట్లాగని మీ బాధ్యత మీరు మర్చి పోవడం కాదు ! మీరెప్పుడూ , మీ లక్ష్యం గురించిన పధకాల మీద  గురి పెట్టి , అప్రమత్తత తో ముందుకు పోతూ ఉండడమే ! ఎక్కువగా మాట్లాడక పోవడం అంటే , మీరు  గర్వం గానూ , ఇతర ఉద్యోగులంటే నిర్లక్ష్యం గానూ ప్రవర్తిస్తున్నట్టు కాదు !  గర్వమూ , నిర్లక్ష్య భావనా , మీరు మీ రంగం లో ఎదగడానికి ఎప్పుడూ దోహద పడవు !  మీరు మీ పనిని బాధ్యతా యుతం గా  చేస్తూ , ఒక ఆత్మ విశ్వాసం నిండిన వ్యక్తి గా, గంభీరం గా, హుందాగా , మీ లక్ష్య సాధన కై నిశ్శబ్దం గా శ్రమించడమే  ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు. 46.మీ కట్టు బట్టలతో చేయండి , కనికట్టు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 8, 2014 at 10:16 ఉద.

పని సూత్రాలు. 46.మీ  కట్టు బట్టలతో చేయండి , కనికట్టు ! 

 
ప్రపంచం చాలా భౌతికమైనది ! అంటే , భౌతి కం గా కనిపించే వాటికే , విలువలు ఇవ్వడమూ , తీసుకోవడమూ జరుగుతుంది ! ప్రత్యేకించి, కార్పోరేట్ సెక్టర్ లోనూ , మిగతా వ్యాపార దృష్టి ఉన్న  ఏ సంస్థ లోనైనా కూడా !  మీరు చేసే ఏ ఉద్యోగం లోనైనా కూడా ,  చక్కగా  వస్త్ర ధారణ చేసుకుని  ఉండాలి, ప్రతి రోజూ ! మీ  వస్త్ర ధారణ విషయం లో అత్యంత శ్రద్ధ చూపాలి !  ఇప్పటి ‘ భౌతిక వాతావరణం లో , ఎంత బాగా డ్రస్ అయి ఇంటి నుంచి బయలు దేరినా కూడా , పని చేసే చోటికి చేరుకున్నాక , వేసుకున్న బట్టలు , మలిన పడి , ముడతలు కూడా తోడై , ఇంకో రకం గా తయారవుతాయి !  అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి,ప్రతి ఉద్యోగీ కూడా ! ఎందుకంటే ,  జీవితం లో ‘ ముందుకు ‘ పోవాలి కాబట్టి ! ఈ రోజుల్లో, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని వారు కూడా, వేసుకునే డ్రస్ విషయానికొస్తే , ఎంతో ‘ డాబు , దర్పం ‘ ప్రదర్శిస్తూ ఉంటారు ! కానీ ఒక స్థానం లో పని చేస్తూ , పదోన్నతి,  అంటే ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు , మీ దృష్టి , కేవలం  తరువాతి ఉద్యోగం మీదనే కాక , మీరు వేసుకునే దుస్తుల మీద కూడా సారించాలి ! 
వస్త్ర ధారణ ను అశ్రద్ధ చేస్తున్నట్టు ఇతరులకు కనిపిస్తే,  ‘ ఆ వ్యక్తి  తన వ్యక్తి గత  సంరక్షణ అంటే పర్సనల్ కేర్ లో అశ్రద్ధ చూపిస్తున్నాడు , ఇక ఉద్యోగం ఎట్లా చేస్తాడో ‘ ? అనో , లేదా ,  ‘ ఎప్పుడూ చాలా  తక్కువ రకం బట్టలు , కొద్దిగా మాసిన బట్టలు వేసుకుని వస్తాడు , ఏంటో  ఆయన పరిస్థితి  అయోమయం గా ఉంది ! మరి వచ్చే జీతం డబ్బులు ఏం చేస్తున్నాడో ? ! అనీ , అనేక విధాలు గా అనుకుంటూ ఉంటారు మిగతా జనాలు ! 
ఆకర్షణ , అందం అనే విషయాలు పక్కన ఉంచి , విషయం పరిశీలిస్తే , కారణాలు ఏమైనప్పటికీ , వస్త్ర ధారణ లో కన బరిచే శ్రద్ధ , ఒక సదభిప్రాయం కలిగిస్తుంది మనకు, ఇతరుల మీద ! ‘ ఆమె ఎప్పుడూ చక్కగా , నీటు గా ముస్తాబై వస్తుంది ‘ అని కానీ, ‘ ఆయన ఉన్నంత లో నీటు గా తయారయి వస్తాడు ఆఫీసు కు’ అని కానీ అనుకుంటాము ! యదార్ధానికి , ఏ ఉద్యోగం చేసినా కూడా , ఆ చేసే ఉద్యోగం , ఆ ఉద్యోగి ఎంత సమర్ధ వంతం గా చేస్తున్నాడు? అనే విషయం మీదే, మనం అతనిని కానీ , ఆమెను కానీ అంచనా వేయాలి ! కానీ అట్లా నిజ జీవితం లో జరగట్లేదు ! సరిగా ముస్తాబై రాని ఉద్యోగులను , ఇతర ఉద్యోగులు కానీ , ఇతర కస్టమర్ లు కానీ , ఒక ఈసడింపు భావన తో చూస్తారు ! వారికి అట్లాంటి ఉద్యోగులను చూస్తే , ఏదో డిప్రెషన్ కు గురి అయి కృంగి పోయి ఉన్న వారి లా కనబడతారు !  జీవితం మీద ఆశా వాహ దృక్పధం కోల్పోయిన వారిలా కనబడతారు !  వారి యజమానులు కూడా ‘ ఇట్లా అయితే , వీడు మన వస్తువులను ఎట్లా అమ్మ గలడు ? అనే అనుమానం లో పడతారు ! 
ప్రతి ఉద్యోగాన్నీ మనం ఆ ఉద్యోగం చేసే వారి దుస్తుల ను పరిశీలించే చెప్పగలం కదా !  ఒక బంట్రోతు ,  ఒక కారు డ్రైవరు , ఒక  సిపాయి , ఒక డాక్టరు , ఒక లాయరు ఇట్లా , ప్రతి వృత్తి కీ ఒక నియమితమైన దుస్తుల స్టైల్ ఉంటుంది !  ప్రత్యేకించి , ఆ దుస్తులను ధరించి , ఆ ఉద్యోగం చేస్తుంటే , ఒక రకమైన ఠీవీ , దర్పం కూడా వస్తాయి !దానితో , ఆ ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఎంతో గర్వం తో చేయగలుగుతారు !మీ జీవితం లో కూడా !  అందుకే ,  మనం వేసుకునే బట్టలతో , ఇతరులను , వారి ప్రవర్తననూ ‘కనికట్టు ‘ చేయవచ్చు ! 
ప్రత్యేకించి , ఇంటర్వ్యూ లకు హాజరు అయే వారు , వారు వేసుకునే దుస్తుల విషయం లో ఎంతో శ్రద్ధ కనబరచాలి ! ఎందుకంటే , వారి దుస్తులు వారికి ఇంటర్వ్యూ కి ముందే అంటే  వారు ఇంటర్వ్యూ  హాలు లో కనిపించ గానే బోనస్ మార్కులు ఇస్తాయి , ఏ ప్రశ్నా అడగక ముందే ! అట్లాగే సరిగా దుస్తులు వేసుకోకుండా ఉంటే , ఆ వచ్చే మార్కులు ముందే తీసివేయబడతాయి కూడా ! ‘ దుస్తులకు మార్కులు ‘ అని ప్రత్యేకం గా ఎక్కడా చెప్పక పోయినా కూడా ! 
ఇంటర్వ్యూ  లో మీరు వేసుకునే దుస్తులు , మీ మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో , మీరు చేసే పనిని కూడా అంతే శ్రద్ధ తో చెయగలరనీ , మీ ఆత్మ విశ్వాసానికి కొలత గానూ , మీ ఆశావహ దృక్పధానికి తార్కాణం గానూ , అంటే, మీరు జీవితం లో పాజిటివ్ గా ఆలోచించ గలరనే నమ్మకాన్నీ ,  తెలియచేస్తాయి ! మీ పురోగతి కి సహకరిస్తాయి ! మీ దుస్తులూ , మీ చిరునవ్వూ , మీ సమయస్ఫూర్తీ , మీ మెదడూ ( అంటే అంతకు ముందు మీరు నేర్చుకున్నదీ ) ఇవన్నీ కలిసే, మీకు ప్రతి ఇంటర్వ్యూ  లోనూ విజయం కలిగిస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

పని సూత్రాలు.45. నీ లక్ష్యం కోసం నీవు , ‘ మేకల మంద లో తోడేలు ‘ కావాలి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఫిబ్రవరి 1, 2014 at 10:51 సా.

పని సూత్రాలు.45. నీ లక్ష్యం కోసం నీవు ,  ‘ మేకల  మంద లో  తోడేలు ‘ కావాలి !   

కుటుంబాలు గానూ  , సమూహాలు గానూ , ప్రాంతాలు గానూ , జిల్లాలు గానూ , రాష్ట్రాలు గానూ , దేశాలు గానూ , మనుగడ సాగించడం మానవ సహజం !  అందుకే,  మానవుడు సంఘ జీవి అని అంటారు కదా !  ఆయా సమూహాలలో ఉన్న, ఉంటున్న , మానవులు , వారి వారి సమూహాల , లేదా ప్రాంతాల , లేదా దేశాల నూ , వారి ఆచార వ్యవహారాలనూ , రక్షించు కోవడానికి ఎంత మాత్రమూ వెనుకాడరు. అవసరమైతే , తీవ్రం గా యుద్ధాలు కూడా చేస్తారు ! ఆ యా గుంపుల కు మీరు ఏరకమైన హానీ కలిగించక పోయినా కూడా , కేవలం  వారికి , మీరు  అట్లా చేస్తున్నట్టు ‘ అనిపించినా ‘ కూడా , వారు సహించరు ! వారికి ఇష్టం ఉండదు ! మనం చేరే ఏ  సమూహం లో అయినా , ఈ గుంపు మనస్తత్వం ముందే అర్ధం చేసికొని , వారి వారి ఆస్తిత్వానికీ , లేదా , వారి అలవాట్లకూ , ఏమాత్రం భంగం కలిగించ కుండా మెసలు కోవడం అలవాటు చేసుకోవాలి ! 
మీరు చేరే సమూహం లో అందరూ ‘ పులులయితే ‘ మీరూ ఒక పులి అవ్వాలి ! అంటే , మీరు ఆ సమూహం లో ఒక మేక కానీ , ఒక గంగి గోవు కానీ కాకూడదు ! అంటే , మీరు చేరే సమూహం లో మీ స్వతంత్ర భావాలను తాకట్టు పెట్ట నవసరం లేదు ! మీ వ్యక్తిత్వాన్ని, ఆ సమూహానికి  దాసోహం చేయకూడదు ! మీరు చేయ వలసినదల్లా , మీరు చేరే సమూహం తీరు తెన్నులు తెలుసుకోవడమే ! అట్లా తెలుసుకున్నాక , ఆ సమూహం లో  ‘ చేరి ‘  ఆ పరిస్థితిని మీ శ్రేయస్సు కు ఉపయోగించు కో  గలగడమే ! 
అంటే, మీరు చేరే సమూహం లో మేక వన్నె తోడేలు లా మసలు కోవాలి !  ఆ సమూహం లో అందరూ మేకల లాగా , ఒకే గుంపు గా ఉంటూ ఉంటే , ఆ స్థానం లో తోడేలు ఉండడం , సహించలేరు కదా !  సాధారణం గా, ఈ సమూహాలలో అట్లా గే  ఉండే వారికి  కొన్ని లక్షణాలు ఉంటాయి ! వారు ఆ యా సమూహాలలో,  ‘ ఎక్కువ భద్రతా భావం ‘ తోనూ , చాలా  కంఫర్ట బుల్ గానూ , సురక్షితం గానూ  ఉండి  ‘ రక్షణ ‘ పొందుతూ ఉంటారు !  అంటే వారి మానసిక స్థితి కూడా , స్వతహా గా ఆలోచించే గుణం కోల్పోయి , ఒకరి వెనుక ఇంకొకరు ‘ తోకాడిస్తూ ‘ తిరుగుతూ ఉంటారు ! యాంత్రికం గా తమ పనులు చేసుకుంటూ పోతారు ! స్వతంత్రం గా , నూతనం గా , సాహసం గా ఆలోచించే లక్షణాలకు  బూజు పట్టించి ఉంటారు !  తోడేలు లాగా,  ‘ లక్ష్యం ‘ కోసం వేటాడే గుణం మీకు ఉంటే, మీరు ఆ రకమైన సమూహాలలో ఉంటూ కూడా , మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ,  మీ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి !  తోడేలు లా ఉండడమంటే , మేకలను పొట్టన పెట్టుకోవాలనే అర్ధం తీసుకో కూడదు ! కొత్త పంధాలో ఆలోచించడం , మీ  లక్ష్యాలు సాధించు కోవడం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని , విజయం పొందడం వరకే  మీరు ‘ తోడేలు ‘ ను అనుకరించ వలసినది ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

పని సూత్రాలు. 44. ఆఫీసులో, ‘ ఏకాకి ‘ కన్నా, ‘ గుంపు లో గోవిందా ‘ మేలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 26, 2014 at 12:16 సా.

పని సూత్రాలు. 44. ఆఫీసులో, ‘ ఏకాకి ‘ కన్నా, ‘ గుంపు లో గోవిందా ‘  మేలు !  

సామాన్యం గా పని చేసే ఆఫీసులో , భిన్న మనస్తత్వాలూ , భిన్న ఆచార వ్యవహారాలూ , ఉన్న ఉద్యోగులు ఉంటారు ! కారణాలు ఏమైనప్పటికీ , వారి, వారి అలవాట్లను , వారు ఏదో ఒక రకం గా కొనసాగిస్తూ ఉంటారు !   ‘అది నా చిన్న తనం నుంచీ ఉన్న అలవాటు’  అని వారు , వారి అలవాట్లను గర్వం గా సమర్ధించు కుంటూ  ఉంటారు కూడా !  మీరు అట్లాంటి ఉద్యోగులు పని చేస్తున్న ఆఫీసు లో నిల దొక్కు కోవాలంటే ,అది  కత్తి మీద సాము లాంటిదే ! ప్రత్యేకించి , మీకు అట్లాంటి అలవాట్లు లేక పోతే , లేదా, అట్లాంటి అలవాట్లను మీరు అలవాటు చేసుకోకూడదని నిర్ణయించు కుంటే ! 
ఒక యదార్ధ అనుభవం ! 
నేను స్కూల్ లో చదివే సమయం లో, ఒక మిత్రుడు పరిచయమయ్యాడు !  వాడి ఇల్లు మా ఇంటి దగ్గర గా  ఉండడం చేతా , వాడి చక్కటి అలవాట్ల వల్ల  కూడా , మా స్నేహం పెరిగింది !  ‘ రాముడు  మంచి బాలుడు ‘ అన్న రీతి లో ,  ఉదయమే లేచి , స్నానాదికాలు ముగించుకుని , దైవ ప్రార్ధన చేసుకుని , నుదిటి మీద చక్కగా ఒక కుంకుమ బొట్టు కూడా పెట్టుకుని , స్కూల్ కు వచ్చే వాడు ! చక్కగా చదువుకోవడమే కాకుండా ,  సినిమా  డైలాగులూ , ఇతర సినిమా నటులను అనుకరించి మిమిక్రీ కూడా చేసే వాడు !  పదో తరగతి లో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు కూడా !  ఇక ఇంటర్మీడియేట్ నుంచీ , ఎందుకో చదువు మీద శ్రద్ధ సన్నగిలింది ! ఒక మాదిరి గా మార్కులు వచ్చాయి , బీ ఎస్సీ లో చేరి , సెకండ్ క్లాస్ లో పాసయ్యాడు !  ఒక కేంద్ర ప్రభుత్వ  శాఖ లో ఉద్యోగం వచ్చింది , మార్కుల ఆధారం గానూ , డిగ్రీ పట్టా ఉన్నందుకూ ! 
ఇతర ఉద్యోగులు కొందరు , ప్రత్యేకించి , తనతో పనిచేసే ఉద్యోగులు , అలవాట్లలోనూ , చదువులోనూ కూడా , వీడి కన్నా తక్కువ అయిన వారితో , వీడికి , రోజూ పనిచేసే ఉద్యోగం !  అది వారి నేరం కాదు ! కానీ  ఆ క్రమం లో వీడు , వారి అలవాట్లను ,తానూ  అలవాటు చేసుకున్నాడు !  వారితో రోజూ , చీటికీ మాటికీ , టీలూ , కాఫీలూ తాగడం తో మొదలైంది ! క్రమేణా , ఆ అలవాటు, విషమించి ,  రోజూ  ఆఫీసు ముగియ గానే , తప్పని సరిగా , మద్యం తాగటం  దాకా వచ్చింది !    అంతే కాకుండా ,ఆ తాగే మద్యం , మితి మీరి తాగడమూ ,  ఇతరులకు తాగించ డమూ , కూడా జరుగుతుంది !  వీడు సహజం గా మొహమా ట స్తుడూ , సున్నిత స్వభావం కలవాడూ అవడం వల్ల , చుట్టూ చేరిన వారు కూడా , అది అలుసుగా తీసుకుంటున్నారు  !  తన జీతం డబ్బులు ‘ ఆ అలవాట్లకు ‘ సరి పోకున్నా కూడా , బలవంతం గా వాడి చేత అప్పు చేయించి మరీ  తాగిస్తున్నారు , తాగుతున్నారు ! 
ప్రస్తుతం : రోజూ ఆఫీసు లో పని పూర్తి అవగానే , సహ ఉద్యోగులతో , విస్కీ తాగడం,ఆటోలో ఇంటికి వెళ్లి పడుకోవడం ! ఇదీ వాడి దిన చర్య !  అదృష్టం కొద్దీ , భార్య కూడా ఉద్యోగాస్తురాలవడం చేత , ఉన్న ఒక్క కొడుకునూ ఇంజనీరు చేయగలిగింది ! కానీ వాడి జీవితం , చేవ లేని జీవితం అయి పోయింది ! కేవలం స్వయంకృతాపరాధం ! 
జరగ బోయేది : మితి మీరి తాగుతూ ఉండడం వల్ల , వచ్చే అనేక రోగాలు , త్వరగా రావడమూ , జీవిత కాలం,  కనీసం పది పదేహేనేళ్ళు తక్కువ అవడమూ కూడా జరుగుతాయి ! ఇదీ నా స్నేహితుడి పరిణామ క్రమం !  చదువులో నేను ప్రేరణ పొందిన స్నేహితుడి పరిణామ క్రమం !  
ప్రతి ఆఫీసు లోనూ , సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వారూ , మద్యం తాగే అలవాటు ఉన్న వారూ , జూదం ఆడే అలవాటు ఉన్న వారూ ఉంటారు !  ఎట్టి పరిస్థితులలోనూ , వారి అలవాట్లను విమర్శించడం కూడదు ! ఎందుకంటే ,  మీ బాధ్యత , కేవలం, మీ ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మాత్రమే , వారి అలవాట్లను ,విమర్శించడం కానీ ,  మానించడం కానీ , మీ బాధ్యత కాదు ! అది మీ ఉద్యోగ విధులలో లేదు ! ఇంకో ముఖ్య విషయం : ఆ అలవాట్లు ఉన్న ఇతర ఉద్యోగులందరూ  కూడా , మానసికం గా వికలాంగులు కాదు ! అంటే , వారికి , వారి అలవాట్ల పూర్వా పరాలు ,  అనర్ధాలూ  కూడా వివరం గా తెలుసు ! ఇక మీరు  కొత్తగా చెప్పేదేమీ ఉండదు !
మీ లక్ష్యం , వారితో సఖ్యత గా ఉంటూ , మీ పని చేసుకోవడమే !  వారితో చేరమని , మీకు ‘ ఆహ్వానాలు ‘ అందుతుంటే, తెలివి గా, వాటిని తిరస్కరించాలి ! అంటే, మీకు ఇంకో  అత్యవసర మైన పని ఉందనో , ఇంకో కారణం చెప్పి కానీ , ఆ పరిస్థితి నుంచి తప్పుకోవాలి ! అంతే కానీ, వారి అలవాట్లను విమర్శిస్తూ , ‘ నాకు ఆ అలవాటు లేదు ‘ అని నిర్ద్వందం గా వారికి చెప్పడం , కేవలం  లౌక్యం లేకుండా, సమస్యలు కొని తెచ్చుకోవడమే !  మీ వ్యక్తిత్వం మీదే ! మీ అలవాట్లు మీవే ! వారి అలవాట్లు వారివే !  మీ లక్ష్యం మీదే ! మీ మార్గం మీదే ! వారి మార్గం వారిదే !  మీ గమ్యం మీదే !  వారి గమ్యం చేరుకోవాలనుకునే వ్యక్తిత్వం  మీది కాదు , కాకూడదు ! 
 వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు ! 

 

పని సూత్రాలు. 43. మీరు, మీ ఆఫీసు నడిపే వారి కుడి భుజం కావాలి !

In మన ఆరోగ్యం., మానసికం, Our minds on జనవరి 25, 2014 at 10:39 ఉద.

పని సూత్రాలు. 43. మీరు, మీ ఆఫీసు నడిపే వారి కుడి భుజం కావాలి ! 

 
సాధారణం గా పని చేసే ప్రతి చోటా , ప్రతి ఉద్యోగీ కూడా , తమకు ‘ లభించిన ‘ ఉద్యోగాన్ని ఒక విధి గా చేసుకుంటూ పోతూ ఉంటారు ! వారికి మిగతా ఉద్యోగులతో కానీ , వారి పై అధికారి తో కానీ ఎక్కువ సంబంధం ఉండదు ! వారితో తమ పనిని కానీ , తమను కానీ లంకె వేసుకోరు !  ఒక కంపెనీ  యజమాని ఆ కంపెనీ లోనే పని చేయకుండా , రిమోట్ కంట్రోల్ లా, ఇంకో ఊళ్ళో నో , సిటీ లోనో ఉండి , ఆ కంపెనీ ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ! అంటే , స్థానికం గా , ఆ కంపెనీ ని కానీ, ఆఫీసు ను కానీ నడిపే వారు వేరే ఉంటారు ! వారే , తమ క్రింద పని చేసే మిగతా ఉద్యోగుల మీద పర్యవేక్షణ చేస్తూ , పెత్తనం చెలాయిస్తూ ఉంటారు ! ఉద్యోగం లో చేరిన ప్రతి ఉద్యోగీ , ముందుగా ఈ పై అధికారి ఎవరో తెలుసుకోవాలి !  సామాన్యం గా, ఈ పై అధికారి కి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి !
1. ఈ పై అధికారి ని, కంపెనీ యజమాని ‘ చెవులు ‘ గా చెప్పుకోవచ్చు ! అంటే , ఆ కంపెనీ లో కానీ , ఆఫీసు లో కానీ , జరిగే ప్రతి విషయాన్నీ  యజమానికి  చేర వేస్తా డన్న మాట !
2. ఈ పై అధికారి , యజమాని నమ్మకాన్ని పొంది , అతనికి విశ్వాస పాత్రుడి గా మెలుగుతూ ఉంటాడు !
3. ఆ ఆఫీసు లో కానీ , ఆ కంపెనీ లో కానీ కొంత కాలం గా పాతుకుని పోయి ఉంటాడు !
4. తమ క్రింద వారిని , ఎదురు పడి ‘ నోరు పారేసుకో కుండా ‘ గుస గుసలతోనే , తాము చెప్ప వలసినదీ , చేయ వలసినదీ చేస్తారు !
5. వీరు ఎప్పుడూ , అధికారం కోసం పాకు లాడుతూ ఉంటారు ! 
6. అంతే కాకుండా , తమ  స్వార్ధం కోసం , లేదా తమ లక్ష్యాల కోసం , ఎంతకైనా తెగించ గలరు ! అవసరం అయితే , వక్ర మార్గాల ద్వారా కూడా ! 
7. ఇంకో ముఖ్య విషయం : వీరు తాము చేస్తున్న ఉద్యోగానికి  తగిన అర్హత , నిపుణతా , అనుభవమూ లేకపోయినా కానీ , ఆ ఉద్యోగం చేస్తూ ఉంటారు ! కేవలం, తమ కుయుక్తులతోనూ ,  తెలివి తేటలతోనూ  !  
ఇట్లాంటి వారు ప్రతి ఆఫీసు లోనూ తప్పకుండా ఉంటారు కదా ! మరి మీరు మీ ఉద్యోగం లో చేరగానే , వీరిని గుర్తు పట్టే ప్రయత్నం చేయాలి !  ఆఫీసులో ప్రతి ఫైలూ  వీరి టేబుల్ మీదకు ఆమోదం కోసం వెళుతూ ఉంటే , వీరే ఆ పై అధికారి అయి ఉంటారు ! ఈ పై అధికారితో  మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడమూ , ఆ సంబంధాలను పటిష్ట పరుచుకోవడమూ కూడా , మీరు చేయవలసిన ముఖ్యమైన పని !  ఈ మీ పై అధికారి ప్రవర్తనా , తీరు తెన్నులూ మీకు ఎంత మాత్రమూ ఇష్టం లేక పోయినా కానీ , మీరు ఆ ఆఫీసులో పని చేస్తున్నంత కాలమూ , అంటే మీకు ఇంకో ప్రత్యామ్నాయం ఏర్పడే వరకూ కూడా , మీ పై అధికారి తో విరోధం తెచ్చుకో కూడదు ! ఎంత మాత్రమూ !
గమనిక :  పై లక్షణాలు కలిగిన ‘ పై ‘ అధికారులు దాదాపు గా ప్రతి ఆఫీసులోనూ , ప్రతి కంపెనీ లోనూ ఉంటారు !  మీరు ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసి ,  అందులో విజయం పొంది ,  ఆ ఉద్యోగం లో చేరినా , అక్కడ కూడా ప్రత్యక్షం అవుతారు , ఇంకో రూపం లో ! అంటే సారాంశం :  ఇట్లాంటి పై అధికారి, స్థానాన్ని గుర్తించి , తదనుగుణం గా  మసలు కోవడం అలవాటు చేసుకోవడమే మీ వంతు ! కనీసం మీ స్వంత కంపెనీ పెట్టుకునే దాకా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు ! 

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on జనవరి 18, 2014 at 11:14 ఉద.

పని సూత్రాలు. 42.ముందుకు పోవాలనుకుంటే , కార్పోరేట్ కల్చర్ కు అలవాటు పడాలి ! 

 
ప్రపంచీకరణ పెరుగుతున్న ఈ రోజుల్లో, కేవలం వివిధ దేశాలలో  నడిచే ప్రభుత్వ సంస్థ లే కాకుండా,  అనేక ప్రైవేటు సంస్థలు కూడా అనేక రకాలు గా విస్తరిస్తున్నాయి !  అనేక ఉద్యోగావకాశాలు కూడా లభిస్తున్నాయి !  ప్రతిభ కలవారు, కేవలం తమ ప్రతిభ మాత్రమే కాక , వివిధ సంస్థలలో , తాము  ఇతర ఉద్యోగులతోనూ , వారు పనిచేసే సంస్థ యాజమాన్యం తోనూ అనేక విధాలు గా కలిసి పోవడమే కాకుండా , తదనుగుణం గా వారు  తమ  పని సూత్రాలనూ , అంటే పని చేసే విధానాలనూ , పద్ధతులనూ కూడా మార్చు కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి !  అప్పుడే , వారి ప్రతిభకు మాత్రమే కాకుండా , వారు ఆ యా సంస్థలలో ఇమిడి పోయి , ఆ సంస్థ పురోగతి కి కారకులయినందుకు కూడా , కేవలం ధన రూపం లోనే కాకుండా , యాజమాన్యానికి కూడా విశ్వాస పాత్రులు గా గుర్తింప బడి , అనేక విధాలు గా లాభం పొంద గలుగుతారు ! 
ఒక అంచనా ప్రకారం , వివిధ సంస్థలలో ఉద్యోగాలు కోల్పోయిన లేదా  ఉద్యోగం నుంచి తీసి వేయబడ్డ ఉద్యోగులలో 70 శాతం మంది, వారికి ఆ ఉద్యోగం చేయడానికి అవసరమైన ప్రతిభ లోపం వల్ల కాక , కేవలం వారు పని చేసే సంస్థలో ‘ ఇమడ ‘ లేక పోవడం చేతనే ! అంటే వారు, వారి ఉద్యోగం సరిగా చేస్తున్నా కూడా , ఆ కంపెనీ లో  బ్లెండ్ అవలేక పోవడం వలననే అని నిర్ధారించ బడింది ! దీనిని బట్టి ,  ఉద్యోగులు , తమకున్న ప్రతిభను మాత్రమే కాక , కార్పోరేట్ కల్చర్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలనే సత్యాన్ని మరువ కూడదు అని తేట తెల్లమవుతుంది కదా  !
మరి ఈ కార్పోరేట్ కల్చర్ అంటే ఏమిటి ? 
ప్రతి సంస్థా , లేదా ఇండస్ట్రీ , లేదా ఒక చిన్న ఆఫీసు కూడా , కొన్ని  నిర్దిష్ట మైన , నిబంధనల ప్రకారం , సూత్రాల ప్రకారం పని చేస్తూ ఉంటుంది ! ఆ యా సంస్థల యాజమాన్యాలు, ఆ సూత్రాలనూ , నిబంధనలనూ నిర్ణయిస్తాయి !  అంతే కాకుండా , ఆ యాజమాన్యాలు , వారి ఉద్యోగులను ఆ సూత్రాలనూ , నిబంధనలనూ ఎప్పుడూ పాటిస్తూ ,ఆ సంస్థ అభివృద్ధి కీ పాటు పడాలనీ , వారు కూడా లాభం పొందాలనీ కూడా ఆశిస్తాయి ! 
ఉదాహరణకు : ఒక వస్తువు ను ఉత్పత్తి చేసే  పరిశ్రమ ఉందనుకుంటే , ఆ పరిశ్రమ యాజమాన్యం , తమ ఉద్యోగులు , తాము ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత లో ఏ మాత్రమూ లోపం లేకుండా , అత్యున్నత ప్రమాణాలతో  తయారు చేయాలని ఆశిస్తారు ! అందుకు ఆ  పరిశ్రమ లో వివిధ శాఖల లో పని చేసే అందరు ఉద్యోగులూ కూడా  ఆ వస్తువు నాణ్యత లోపించకుండా , తాము చేసే ఉద్యోగాన్ని శ్రద్ధతో చేయాలి ! ఒక శాఖ లో పనిచేసే వారికి , ఇంకో శాఖ లో పనిచేసే వారితో సమన్వయం లోపిస్తే , దాని ప్రభావం , తాము ‘ కలిసి ‘ ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యత మీద పడుతుంది ! 
ఇంకో ఉదాహరణ : వినియోగ దారులకు అంటే కస్టమర్ కు సేవ లు అందించే ఇంకో సంస్థ ఉందనుకుంటే, ఆ  సంస్థ యాజమాన్యం , వారి ఉద్యోగులు , ఆ సంస్థ సూత్రాలు పాటిస్తూ , వినియోగ దారుడి  కి అత్యంత ప్రాధాన్యత నిస్తూ , వారి అవసరాలు వంద శాతమూ తీర్చడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి  అని ఆశిస్తుంది ! ఆ సూత్రాలకు విరుద్ధం గా అందులో పని చేసే ఉద్యోగులలో కొందరు , వారి కస్టమర్ తో సరిగా ప్రవర్తించక పోవడమో లేదా , వారిని, వారి అవసరాలనూ నిర్లక్ష్యం చేయడమో  జరిగితే ,  వినియోగ దారులకు అందిస్తున్న సేవలలో నాణ్యత లోపించి , దాని ప్రభావం , ఆ సంస్థ  మీద పడుతుంది ! అంటే ఆ సంస్థ ఆర్ధికం గా నష్ట పోతుంది !  దానితో పాటు యాజమాన్య సూత్రాలకు విరుద్ధం గా పనిచేసిన ఆ  ఉద్యోగుల ఉద్యోగాలు కూడా పోతాయి !  అందువల్లనే ప్రతి సంస్థా కూడా , అది పని చేసే విధానాల మీద నిర్దిష్టమైన పని సూత్రాలను రూపొందించి , ఆ సూత్రాలను , అందులో పనిచేసే ఉద్యోగులంతా పాటించాలని  నిబంధన చేస్తుంది ! 
సాధారణం గా ప్రతి ఉద్యోగీ కూడా తమదైన ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పరుచుకుని ఉంటారు ! తమకై ఒక పర్సనాలిటీ ఎర్పరుచుకుంటారు ! అంటే అది కేవలం భౌతికమైన లక్షణాలకు సంబంధించినదే కాదు !  వారు తాము పనిచేసే తీరు లోనూ , ఇతరులతో ప్రవర్తించే తీరు లోనూ , తమకై తాము చూపించే ప్రత్యేకత !  మనం అందరమూ , ఒకే పనిని చేస్తున్నా , మనం వ్యక్తి గతం గా చేసే ఆ పనిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ! అట్లాంటిదే వ్యక్తిత్వం కూడా ! ఎవరి స్టైల్ వారిది !  అది మంచిదే ! కానీ  ఈ స్టైల్ బాసులు , వారు పని చేసే సంస్థలలో కూడా , తమ స్టైల్ తమదే అని భీష్మించుకుని , యాజమాన్యం తో అనేక రకాలు గా ఘర్షణ పడుతూ , తమ ఉద్యోగాలకు అనవసరం గా ఎసరు పెట్టుకుంటూ ఉంటారు !  ఇక్కడ అట్లాంటి వారు గమనించ వలసినది ఒక్కటే ! మీ వ్యక్తిత్వాలు ఎప్పుడూ మీవే ! కానీ మీరు పనిచేసే సంస్థ లో ఉన్నంత సేపూ , కేవలం ఆ సంస్థ సూత్రాలు పాటించండి ! మీకు నచ్చక పోయినా కూడా ! ఎందుకంటే అది మీ ఉద్యోగం కాబట్టి !  మిగతా విషయాలు మీకు అనవసరమూ , అప్రస్తుతమూ కూడా ! అంటే మీరు మీ ఉద్యోగ జీవితం లో ఎట్లాంటి ఒడు దుడుకులూ లేకుండా , ముందుకు సాఫీ గా సాగి పోవాలని నిర్ణయించుకుంటే , కేవలం మీరు పని చేస్తున్న సంస్థ సూత్రాలను పాటిస్తూ , ఆ సంస్థ లో కలిసి పొండి !  మీ సంస్థ యాజమాన్యం గోల్ఫ్ ఆడుతూ ఉంటే , మీరు కూడా ఆ గోల్ఫ్ ఆట ఆడండి ! మీకు ఆ ఆట ఇష్టం లేక పోయినా కూడా ! ఎందుకంటే , మీరు పనిచేసే సంస్థకు, మీ ఇష్టా ఇష్టాలతో పని లేదు ! ఆ సంస్థ నిబంధనలనూ, సూత్రాలనూ ప్రతి ఉద్యోగీ పాటిస్తున్నాడా ? లేదా ? అనే విషయమే వారికి ముఖ్యం !  మీ వ్యక్తిత్వం మీదే ! మీకు గోల్ఫ్ ఇష్టం లేదనే అభిప్రాయం మార్చుకో నవసరం లేదు ! కానీ, మీరు యాజమాన్యం తో గోల్ఫ్ ఆడండి ! లేకపోతే , యాజమాన్యమే మీ ( జీవితాలతో )  తో గోల్ఫ్ ఆడుతుంది ! అదే కార్పోరేట్ కల్చర్  ను అలవాటు చేసుకోవడం అంటే ! 
ఇట్లా మీరు ఎప్పుడూ చేస్తూ ఉంటే , విజయం మీదే ! ఇట్లా కనీసం మీ స్వంత కంపెనీ కానీ పరిశ్రమ కానీ పెట్టే వరకూ చేస్తూనే ఉండాలి ! మరి అదే కార్పోరేట్ కల్చర్ అంటే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

పని సూత్రాలు. 41. పని చేసే చోట, మీ పరిచయాలు పెంచుకోండి !

In మానసికం, Our minds on జనవరి 12, 2014 at 11:32 ఉద.

పని సూత్రాలు. 41.  పని చేసే చోట, మీ పరిచయాలు పెంచుకోండి ! 

మీరు పని చేసే చోట, ఎట్లా ప్రవర్తిస్తే , మీరు ఎక్కువ గా లాభ పడతారో తెలుసుకోవడం లో భాగం గా, ఒక నలభై టపాలను  ఇంతకు ముందే పోస్ట్ చేయడం జరిగింది ‘ బాగు ‘ లో ! ( ఉత్సాహం ఉన్న వారు,  బాగు ఆర్కివ్స్ లో చూడండి,  ఫిబ్రవరి 13 , 2013 నుంచి ఏప్రిల్ 3 2013 వరకూ వేసిన టపాలు ! ) ఇక మిగతా పని సూత్రాలు తెలుసుకుందాం !
పని చేసే చోట , పరిచయాలు పెంచుకోవడం :
చాలా మంది తాము పని చేసే స్థానం లో కేవలం , వారి పని వారు చేస్తూ , ఎల్ల కాలం తమ కర్తవ్యం లో నిమగ్నమై ఉంటారు ! వారికి పని బాగా వచ్చినా , తదేక దీక్షతో పని చేస్తూ నే ఉంటారు ! అవన్నీ మంచి లక్షణాలే ! కానీ పని చేసే చోట ,  అనేక మానసిక పధకాలు వేయబడుతూ ఉంటాయి ! ఆఫీసు ‘ చెద ‘ రంగం లో ఎప్పుడూ పావులు కదులుతూ ఉంటాయి !  మీ రు చేసే పని బాగా ఉన్నా కూడా , మీ ‘ పని పట్టే ‘  ఊసరవెల్లులూ ,  మీ అవకాశాలను మింగేసే తిమింగలాలూ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి !  ఆ సమయాలలో , ఆ మాటకొస్తే, ప్రతి క్షణమూ ,  అప్రమత్తత తో ఉండడమే కాకుండా , ఇతర  కొలీగ్స్ తోనూ , ఇతర ఉద్యోగులతోనూ కూడా  సంబంధాలు సమతూకం లో ఉంచుకోవడం, మీకు ఎంతో లాభదాయకం ! 
పని చేయడం లో మీ క్రమ శిక్షణా , విధి నిర్వహణ లో మీ అంకిత భావం ,  మీ ఉద్యోగం లో తరచూ వచ్చే సమస్యలను పరిష్కరించడం లో మీకున్న ప్రతిభా , ఇవన్నీ కూడా మీరు పనిచేసే స్థానం లో, మీ ఇతర ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉపయోగించుకోవాలి ! ఇతర ఉద్యోగులు మీ అంత ప్రతిభ  లేని వారయినా కూడా , వారికి అవసర సమయాలలో తగిన సలహా లు ఇవ్వడమే కాకుండా , వారి సమస్యలను  పరిష్కరించడం లో మీ సహకారాన్ని ఇవ్వడం ద్వారా , మీ మానవతా దృష్టి ని కూడా పెంపొందించుకో గలుగుతారు !  అట్లాగని  ఇతరులు  ఉద్యోగ ధర్మం లో చేసే పొర పాట్లను , మీ నెత్తిన వేసుకోవడం ,లేదా వారి పొర పాట్లను కప్పి పుచ్చాలని ప్రయత్నించడం చేయకూడదు ! మీరు చేసే ఇట్లాంటి చర్యల వల్ల , కేవలం సహ ఉద్యోగి గా మాత్రమే కాక , ఒక స్నేహితుడి గా కూడా మీరు , మీ ఇతర ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన గలుగుతారు !  మీరు  ‘ సంపాదించిన ‘ ఆ అభిమానం , ముందు ముందు , మీ అవకాశాలను   ప్రకాశ వంతం చేసుకోవడం లో  ఉపయోగ పడే  ధనం !
మీదైన శైలి తో , మీ ఉద్యోగాన్ని సరిగా చేయడమే కాకుండా , ఇతర ఉద్యోగుల  మీద కూడా నిజమైన శ్రద్ధ కనబరుస్తూ , ఇతర ఉద్యోగుల  విధేయతను పొందితే , మీరు ఒక  ప్రతిభ కలిగిన ఉద్యోగి గా మాత్రమే కాక , నాయకత్వ లక్షణాలు కలిగిన  ఉద్యోగి గా కూడా పేరు తెచ్చుకో గలుగుతారు ! 
ఉద్యోగం కాక , ఇతరత్రా మీరు చేస్తున్న సహాయమూ , ఇతర ఉద్యోగులకు మీరు ఇస్తున్న సహకారమూ , మీరు వృధా గా పోనీయ కూడదు !  ఈ పనులన్నీ కూడా , మీ వ్యక్తి గత పురోగమన పధకం లో , మీరు తెలివి గా , చాకచక్యం గా కదుపుతున్న పావులు కావాలి ! మీ ఉద్యోగం లో, మీరు ఉద్యోగం చేసే స్థానం లో  చూపిస్తున్న మీ మంచి లక్షణాలన్నీ కూడా మీ అవకాశాలు  మెరుగు పరుచుకోవడానికి వేసే అడుగులు కావాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని పని సూత్రాలు !   
%d bloggers like this: