Our Health

Posts Tagged ‘తన కోపమె …’

తన కోపమె … 10 మరి ఇతరుల కోపాన్ని, మనం ఎట్లా డీల్ చేయాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on ఏప్రిల్ 4, 2014 at 7:14 సా.

తన కోపమె … 10 మరి ఇతరుల కోపాన్నిమనం  ఎట్లా డీల్ చేయాలి ? 

చాలా సందర్భాలలో , మనం ఇతరుల తో  ఉన్నప్పుడు , వారి కోపాన్ని ‘ రుచి ‘ చూడ వలసి వస్తుంది !  ఆ కోపం,  మన మీద కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది !  ఆ పరిస్థితులలో మన మీద , వారి కోపాన్ని బలవంతం గా రుద్దుతూ ఉంటే ,  నిస్సహాయం గా  ఆ కోపాన్ని దిగ మింగుతూ ఉంటాము !
మరి ఆ పరిస్థితులలో , మనకు గత్యంతరం లేదా ? ! 
ఇతరుల కోపం, మనమీద చూపడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి ! 
1. అట్లా కోపం చూపించడం , వారి నైజం కావచ్చు ! 
2. కోపం  ప్రదర్శించడం , వారి అధికార దర్పం కావచ్చు ! 
3. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా, బల హీనుల మీద బలవంతులు చూపించే  పవర్ కూడా కావచ్చు ! 
4. ఎక్కువ కోపం ప్రదర్శించి , ఇతరులను కయ్యానికి కాలు దువ్వే  కుటిల ఆలోచనల వల్ల కూడా కావచ్చు ! 
కారణాలు ఏమైనప్పటికీ , కోపం విపరీతం గా చూపించే వారి  కి  దూరం గా ఉండడం ముందు గా చేయవలసిన పని ! అట్లాంటి వారి గురించి మనకు తెలియనప్పుడు ,  వారికి దూరం గా జరగడం ఇంకా ముఖ్యం ! వారి కోపం చల్లారాక , మీరు అక్కడ ఉండడం తప్పని సరి అవుతే ,  ప్రశాంతం గా , వారి కోపానికి కారణాలు అడగ వచ్చు ! వారిని, ఊపిరి దీర్ఘం గా తీసుకుని శాంత పడమని  సలహా ఇవ్వ వచ్చు ! 
మీరు ఆ పరిస్థితులలో, మీకు వచ్చే కోపాన్ని అదుపు లో పెట్టుకోవడం కూడా ముఖ్యమే ! అట్లా చేయక పొతే ,  ఆ కయ్యానికి కాలు దువ్వే వారి  ( మీకు కూడా కోపం తెప్పిస్తే ) లక్ష్యాలు,  మీరే నెర వేర్చి నట్టు అవుతుంది కదా !  మీరు, ఇతరుల ప్రవర్తన తో రెచ్చి పోకుండా , ప్రశాంతం గా , స్పష్టం గా మాట్లాడుతూ , వారిని శాంత పరచడానికి ప్రయత్నించాలి ! అప్పటికీ వారి కోపం తగ్గక , మీరు భయ భ్రాంతు లవుతూ ఉంటే ,  మీరు ఇతరుల సహాయం కోరడం కానీ , లేదా పోలీసు లకు ఫోన్ చేయడం గానీ చేయవచ్చు ! (  ఈ సలహా, విదేశాలలో ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది ! కారణాలు వివరించ నవసరం లేదనుకుంటా  ! ) 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తన కోపమె … 9. కోప నియంత్రణ కు ఇంకొన్ని మార్గాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 31, 2014 at 7:50 సా.

తన కోపమె … 9. కోప నియంత్రణ కు ఇంకొన్ని మార్గాలు ! 

 

 
పచనం , పానం , ప్రాసనం , 
చలనం , వినోదం , విరామం ! 
బంధు మిత్రుల( తో )  ప్రేమానురాగం ! 
పాటిస్తే, కోపం  అవుతుంది,  బహుదూరం ! 
పచనం, అంటే మనం వండుకునే ఆహారం లో తీసుకోవలసిన జాగ్రత్త లు క్రమం గా తీసుకుంటూ ఉంటే ,  మన శరీరం  నిరంతరం  జరుగుతూ ఉండే ,అసంఖ్యాక మైన  జీవ రసాయన చర్యలు సమతుల్యం లో ఉండి ,  మనలో కోప నియంత్రణ కు ఉపయోగ పడతాయి ! ఉదాహరణకు , మనం రోజూ తినే ఆహారం లో ఉప్పు మనకు కావలసినది కేవలం  ఆరు  నుంచి ఏడు గ్రాములు మాత్రమే !  ఒక చిటికెడు ఉప్పు ఒక గ్రాము లో నాలుగో వంతు ! అంటే కనీసం పాతిక చిటిక ల ఉప్పు మనకు రోజూ అవసరం !  ఈ పాతిక చిటికలు ఒక టీ స్పూన్ లో పడతాయి ! అంటే మనకు రోజూ అవసరమయే  ఉప్పు కేవలం ఒక టీ స్పూన్  కు సరిపడా ఉప్పు మాత్రమే !  కానీ ,మనం అంతకు మించి కనీసం రెండు మూడు రెట్లు ఉప్పు  తింటూ ఉన్నాం రోజూ  !  మన శరీరం లో నాడీ మండలానికి , ఆ మాటకొస్తే , మన శరీరం లో ప్రతి కణానికీ కూడా , మనం  రోజూ ఆహారం లో తీసుకునే ఉప్పు  ఉత్తేజం చేస్తుంది !  ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణానికి చేరవలసిన సంకేతాలు కూడా , కేవలం ఈ ఉప్పు లోని సోడియం  వల్ల నే !  మరి  సహజం గానే , మన శరీరం లో  ఉండవలసిన ఉప్పు కన్నా ఎక్కువ ఉంటే , ( అంటే మనకు తెలియక కానీ , తెలిసి కానీ )  తదనుగుణం గా మన జీవ కణాలు ఎక్కువ గా నే ఉత్తేజం అవుతాయి ! 
కేవలం వంటలోనే కాక , మనం రోజు వారీ ఆహారం తినడం (  ప్రాసనం )  లోనూ , వివిధ పానీయాలు తాగడం లోనూ కూడా , తగినంత జాగ్రత్త తీసుకోవాలి ! 
చలనం , వినోదం , విరామం :  ఒకే చోట  ఎక్కువ సమయం , ఎక్కువ కాలం కూర్చోకుండా ,  కాళ్ళూ , చేతులు  సహక రించే వరకూ , మనం చలిస్తూ ఉంటే , అది శరీరానికీ , మనసుకూ కూడా మంచిదే !  నిద్ర సరిగా పోకుండా , పగలు, విసుక్కుంటూ ,  చీకాకు పడుతూ , పని చేసే వారినీ , చదువు కునే విద్యార్ధులనూ , మనం చూస్తూ ఉంటాము కదా ! సుఖ నిద్ర తో పాటుగా , విరామం కూడా మన శరీరం తో పాటుగా మనసుకూ ( అంటే మన నాడీ మండలానికీ )  తప్పని సరిగా ఉండాలి ! 
అట్లాగే , బంధు మిత్రులతోనూ , ఆత్మీయులతోనూ , ప్రేమానురాగాలు పంచుకోవడం , పొందడం కూడా ఆరోగ్యకరమైన అలవాటు !   పైన ఉదహరించిన  అలవాట్లలో , వేటిలో అయినా పొర పాట్లు జరుగుతూ ఉంటే , అవి , శరీరానికి , అస్వస్థత కలిగించడం తో పాటుగా ,  మనసును కూడా  చీకాకు పరుస్తాయి ! 
మనసు చీకాకు పడుతూ ఉంటే , శాంత స్వభావం మనకు ఉంటుంది ? దానితో , చీటికీ మాటికీ ,విసుక్కోవడమూ , కోపగించుకోవడమూ జరుగుతుంది !  పై అలవాట్లు పాటిస్తూ ఉంటే , కోపం తక్కువ అవడమే కాకుండా ,  కోపాన్ని నియంత్రించుకునే సమర్ధత కూడా పెరుగుతుంది ! 
జయ నామ సంవత్సర శుభాకాక్షాల తో , 
వచ్చే టపా తో  మళ్ళీ కలుసుకుందాం ! 

తన కోపమె … 8.కోపాన్ని నియంత్రించుకునే మార్గాలు ఇంకొన్ని .

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 30, 2014 at 10:32 ఉద.

తన కోపమె … 8.కోపాన్ని నియంత్రించుకునే మార్గాలు ఇంకొన్ని . 

నిన్ను నీవు తెలుసుకో ! : 
పైన ఉన్న వాక్యం చాలా  సులభం అనిపిస్తుంది కానీ , చాలా సమయాలలో మన సంగతి, మనకే తెలియదు ! అంటే ,మనలను పరిస్థితులు , సందర్భాలు ,  మాయ పొరల తో కప్పేసి , కోపాన్ని మాత్రమే బహిరంగ పరుస్తాయి !  అప్పుడు వచ్చే కోపం కూడా ,  మనలో ఉన్న వివేచన అనే సూర్యుడిని కప్పివేసే దట్టమైన ఒక దట్టమైన మేఘం అవుతుంది !  
ఈ దృష్ట్యా , పైన ఉన్న వాక్యం , చాలా చిన్న వాక్యమే అయినా కూడా , అది సరిగా ఆచరిస్తే , ఎంతో శక్తి వంతమైన  ఉపకరణం అయి , మన జీవితాలకు మార్గ నిర్దేశనం చేస్తుంది ! ఒక సారి మీరు మీలో ఉన్న కోపం అనుభవించాక ,  పరిస్థితిని సమీక్షించు కోవడం ఉపయోగకరం ! అది , ఏ  మానసిక వైద్యుడి దగ్గరికి కానీ , సైకాలజిస్ట్ దగ్గరికి కానీ పోకుండా , మీరే విశ్లేషణ చేసుకుంటే , ఎంతో డబ్బు ఆదా అవుతుంది కూడా ! 
ఈ క్రింది విషయాలు గమనించండి :
1. నా కోపానికి ట్రిగ్గర్ లు ఏమిటి ? అంటే, నా కోపానికి కారణాలు ఏమిటి ? ( వీలయితే  ఒక పేపర్ మీద  రాసుకోండి , నిజాయితీ గా ! ) 
2. నాకు కోపం వచ్చే ముందు , నాలో కలిగే మార్పులు ఏమిటి ? 
3. కోపం వచ్చాక , నా ప్రవర్తన , అంతకు పూర్వం , నాకు కలిగిన అనుభవాల ఫలితం గా ఉంటుందా ? : అంటే  మనం , మన చిన్న తనం లో  తల్లిదండ్రులు కానీ , బంధువులు కానీ , బాగా కోపం వస్తే , వారు , కనిపించిన ఎదుటి వారిని ( అంటే సామాన్యం గా తమ కన్న పిల్లలను ) చితక బాదేయడం జరుగుతుంది ! ‘ అన్న అల్లరి చేస్తే , నన్నెందుకు కొడతావు ? అని తమ్ముడు కానీ , చెల్లెలు కానీ ప్రశ్నిస్తున్నా కూడా , ఏ మాత్రం  ఆలోచించకుండా , ‘ ఎదురు సమాధానం చెప్పకు , నాకు విసుగు తెప్పించకు ! అంటూ , కనబడిన ( దొరికిన ) వారిని బాదుతూ ఉంటారు  ‘ పెద్ద వారు ‘ !  ఆ ప్రవర్తన తరచూ జరుగుతూ , ఉంటే , మనసులో ,  ఆ  అనుభవాల ముద్రలు పడడమే  కాకుండా , ఆ ప్రవర్తన కూడా సమంజసమైనదే అన్న భావన బలం గా ఏర్పడుతుంది ! అంటే , మనసులో ,  కోపం వచ్చినపుడు ఎదుటి వారి మీద చూపించడం  , ‘ ఆమోదింప బడుతుంది , మన మనసు పొరల్లో ‘ ! 
4. నాకు కోపం వచ్చాక , నా ప్రవర్తన  ఫలితాలేంటి ? అంటే , నేను ( నా )  ఆ ప్రవర్తన తో శాంతిస్తున్నానా ? అనే విషయం. 
5. నాకు కోపం వచ్చాక ,  ఏ పరిస్థితులు నన్ను శాంత పరుస్తాయి ? అంటే   నాకోపం, దేనితో తగ్గుతుంది ? 
6. నాకు కోపం తెప్పించడానికి కారణమైన ఏ  పరిస్థితులనైనా నేను మార్చగాలనా ? 
పై విధం గా మనం ఆలోచించుకుని , మన కోపాన్ని విశ్లేషించు కుంటే ,  మన కోపం ఏ దశ లో , ఉధృతమై , మనకూ , మన చుట్టూ ఉండే వారికీ హాని కరం గా పరిణమిస్తుందో ,  ఆ దశను ఆపుకునే ప్రయత్నాలూ ,నిర్ణయాలూ చేయ వచ్చు ! అంటే మనం కోపాన్ని మొగ్గ లోనే తుంచేస్తున్నామన్న మాట ! 
ముఖ్యం గా గుర్తు ఉంచుకోవలసినది ! మనకు కోపం రావడానికీ , తెప్పించ డానికీ  అనేక కారణాలు ఉన్నప్పటికీ ,  ఆ వచ్చిన కోపం చూపించే  ‘ ప్రతాపానికి ‘ అంటే ఆ కోపం పరిణామాలకూ , ప్రవర్తనకూ , సంపూర్ణ  బాధ్యత మనదే ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తన కోపమె … 7.వ్యాయామం , ధ్యానం తో, కోపాన్ని కంట్రోలు చేసుకోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 29, 2014 at 9:11 ఉద.

 

తన కోపమె … 7.వ్యాయామం , ధ్యానం తో  కోపాన్ని కంట్రోలు చేసుకోవడం ఎట్లా ? 

 

 

పైన  హిందీ లో ఉన్న వీడియో చూడండి , బ్రహ్మ కుమారి వాళ్ళది , ఉత్సాహం ఉన్న వారు యు ట్యూబ్ లో మిగతా ఎపిసోడ్ లు కూడా చూడవచ్చు !

క్రితం టపా లో కోపం రాగానే దాని దారి మళ్ళించి , ‘ ఆకాశం ‘ లోకి పంపడం ఎట్లాగో తెలుసుకున్నాం కదా !   అట్లాంటి చర్యలలో వ్యాయామం కూడా ఒకటి ! అంటే బాగా కోపం వస్తే ,  అది ఎదుటి వారిని ఏదో రకం గా హింసించడం కోసం కాకుండా ,  ఆ కోపాన్ని శరీర వ్యాయామం కోసం వెచ్చిస్తే , ఉపయోగకరం అవుతుంది ! శరీరం లోని వివిధ భాగాల లో ఉన్న కండరాలు శక్తి వంతం అవుతాయి !  వ్యాయామం వల్ల కలిగే అనేక రకాలైన జీవ రసాయన చర్యలలో ,    ‘ నేను క్షేమం గా ఆరోగ్యం గా ఉన్నాను ‘ అనిపించే జీవ రసాయనం ఒకటుంది ! దాని పేరు ఎండార్ఫిన్ ! ఆ ఎండార్ఫి న్  లు ఎక్కువ గా విడుదల అవుతాయి వ్యాయామం చేస్తే ! ఈ రకమైన ఎండార్ఫిన్ లు కేవలం ‘ నేను క్షేమం ‘ అనిపించే భావనలే కాకుండా ,  మన కు ఉపశమనం కూడా కలిగించి , మనలను రిలాక్స్ చేస్తాయి !  అందుకే ‘ ఎక్సర్ సైజ్ ఫర్ హెల్త్ , ఎక్సర్ సైజ్ ఫర్ ఎండార్ఫిన్స్ ‘ 
ఒక వార్నింగు : కోపం ఎక్కువ గా ఉన్నప్పుడు , వ్యాయామం చేయడం ఉపయోగ కరం అయినా , వ్యాయామం అతి గా చేయ కూడదు ! ఈ మధ్యే  హైదరాబాదు లో ఒక  నలభై సంవత్సరాల వ్యక్తి , శలవులు అని , జిమ్ లో ప్రవేశించి , రెండు గంటలకు పైగా ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేసి , ఒక్క సారి గా కుప్ప కూలి పోయాడు ! ( ఈ లోకం నుంచి కూడా పోయాడు  ) కోపం లో ‘ అతి గా’  వ్యాయామం చేయకూడదు !
కోపాన్ని నియంత్రించు కోడానికి యోగాభ్యాసం , ధ్యానం మంచివేనా ? : ముమ్మాటికీ మంచివే !  కేవలం అవి మన జాతి కి వేల ఏళ్ళ నుంచీ తెలియడమే కాకుండా , అనేక రకాలైన శాస్త్రీయ పరిశోధనల వల్ల కూడా , ఆ పద్ధతులు ఉత్తమమైనవి గా నిర్దారింప బడినవి కూడా !  యోగాభ్యాసం , ధ్యానం , అంటే మెడిటేషన్ వల్ల , మనో నిగ్రహం పెరుగుతుంది ! అంటే  మన మనసు , ఆలోచనల , వివేచనల ద్వారా , మన భౌతిక శక్తులను , అంటే మన చేతలను ఎట్లా నియంత్రించు కొవచ్చో తెలియ చేసే అత్యుత్తమ మార్గాలు !  యోగా అయినా , ధ్యానం అయినా కూడా , ఒక క్రమ పధ్ధతి లో చేస్తూ ఉంటే , అది అనేక రకాలు గా ఉపయోగ పడుతుంది ! జీవన శైలి మారుతుంది ! సాత్విక మనస్తత్వం అలవడుతుంది ! ఆహార అలవాట్లలో మార్పు వస్తుంది ! అది కోపం కలిగించే ఆహార పదార్ధాలు కూడా ఎట్లా తగ్గించు కొవచ్చో తెలుస్తుంది !
మరి ఏ యోగా మంచిది ? :  ఏదైనా మంచిదే !  అది మనకు  మంచిదో ,చెడో నిర్ణయించేది మనమే కదా ! అంటే మనం క్రమం గా చేస్తూ ఉంటేనే , యోగా  కానీ ధ్యానం కానీ ఫలితాలిచ్చేది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !

తన కోపమె … 6. కోపాన్ని నియంత్రించు కోవడం ఎట్లా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 28, 2014 at 11:57 ఉద.

తన కోపమె … 6. కోపాన్ని నియంత్రించు కోవడం ఎట్లా ? 

 

పైన ఉన్న పటం , మనలో కలిగే కోపం తీవ్రతను అంచనా వేసుకోడానికి ఉపయోగ పడుతుంది !
మానవులందరికీ కోపం వస్తుంది. అది ఒక సహజమైన అనుభూతి, లేదా ఎమోషన్. సామాన్యం గా అధిక శాతం మంది , తమ కోపాన్ని ,  కంట్రోలు లో ఉంచుకుంటారు ! కానీ కొద్ది శాతం మంది , తమకు వచ్చిన కోపాన్ని ఒక నియంత్రణ లో ఉంచుకో లేక , సమస్యలు సృష్టించు కుంటూ ఉంటారు ! తమ ఆరోగ్యానికీ , తమ పురోగతి కీ కూడా ! కోపాన్ని నియంత్రించుకో గలిగిన వారు , తమ శారీరిక ఆరోగ్యం తో పాటుగా , మానసిక ఆరోగ్యం కూడా పదిలం గా ఉంచుకుంటూ , జీవితం లో తమ లక్ష్యాలను చేరుకొని , పురోగతి చెందుతూ , తమ చుట్టూ ఉన్న మానవులతో కూడా సత్సంబంధాలు ఏర్పరుచుకుని , జీవితాన్ని సంపూర్ణం గా అనుభవించ గలుగుతారు ! 
అతి సర్వత్రా ….. : అంటే కోపం వెంటనే , కర్మ కు ప్రేరేపిస్తుంది ! అంటే , కోపం వచ్చిన వెంటనే యాక్షన్ మొదలవుతుంది ! ఆ మొదలైన యాక్షన్  ‘ ఉడుకు రక్తం ‘ తో కలిసినది కనుక , విపరీత పరిణామాలకు దారి తీయ వచ్చు అంటే , హింస కు కూడా ! అట్లాగని , తమకు వచ్చిన కోపాన్ని , కేవలం ఒక సీసాలో పోసి మూత పెట్టినట్టు గా ఎప్పుడూ , మనసులోనే ఉంచుకుంటే , ఏదో ఒక సమయం లో బయటకు , ఒక్క సారిగా వెద చిమ్ముతుంది ! ఒక్క సారిగా బద్దలయిన కోపం , జీవితాలలో  లావా లా ప్రవహిస్తుంది ! జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది ! 
పెల్లుబుకే కోపాన్ని కంట్రోలు చేసుకోవడం ఎట్లా ? : 
మీలో కట్టలు తెంచుకుని బయట కు వస్తున్న కోపాన్ని, ఆపగలిగే పరమ శివులు మీరే ! కోపం బయటకు వస్తున్నట్టు అనిపించగానే , ఒక్క నిమిషం ఆగండి ! ఒక్క సారి మీ కోపానికి కారణం ఏమిటో తెలుసుకోండి ! మీ కోపం రాకెట్ విడుదల అవడానికి ముందు , పది అంకెలు లెక్కించండి , నిదానం గా , ఒకటి , రెండు , మూడు , అని మీ మనసులోనే !అంటే, మీ కోపం తో మీ యాక్షన్ జత కట్టే ముందన్న మాట ! మీ భుజాలు బిగుతు గా అయి మీరు ఏదో ఒక చర్య కు ఉపక్రమించుతూ ఉంటారు ! అప్పుడు ఒక్క సారి ఊపిరి దీర్ఘం గా పీల్చుకుని , అంటే లోపలికి తీసుకుని , మీ భుజాలను రిలాక్స్ చేయండి ! అంటే మీ భుజాల , ఇంకా చేతి కండరాలను ఒక్క సారిగా సడలించండి ! మీ ఎదుట కనిపించిన వస్తువు ( ఎదుటి వారి మీదకైనా ) విసిరేద్దామనీ , లేదా నెలకు వేసి కొట్టి , ధ్వంసం చేద్దామనీ అనిపిస్తే , అట్లాంటి వస్తువులనుంచి దూరం వెళ్ళండి !  మీకు అవసరమైనంత స్థలం లేక పొతే , మీ చేతులు కట్టుకోండి , వివేకానందుడి లాగా , ఆ సమయం లో ! ఇట్లా చేస్తే , మీ కోపం రాకెట్ , ఎదుటి వారి మీదకు  ( అప సవ్య దిశ లో ) వెళ్ళ కుండా , నేరు గా ఆకాశం లోకీ , ఆ తరువాత , అంతరిక్షం లోకీ వెళ్లి , అంతర్ధానం అవుతుంది ! 
మీ కోపం ఉపశమనం కాక పొతే , మీరు ఆ సందర్భానికి దూరం గా వెళ్ళండి ! అంటే , ఆ చోటు నుంచి , తాత్కాలికం గా నిష్క్రమించడం ! మీ స్నేహితుడి ,లేదా స్నేహితురాలి దగ్గరకు వెళ్ళండి ! మీకు కోపం వచ్చిన కారణం చర్చించు కొండి ! వీలయితే గట్టిగా అరవండి కూడా ! లేదా మీకు వచ్చిన కోపం గురించి ఓ పది పేజీల నిండా రాసి ( పారేయండి లేదా ) ఉంచుకోండి , మీరు శాంత మూర్తులు గా ఉన్నప్పుడు , అవి చదువు కుంటే ,మీ ప్రవర్తన మీద మీకే  నవ్వు తెప్పించడానికి ! 
పైన చెప్పిన చిటుకు లన్నీ కూడా , మీ కోపాన్ని మీరు నియంత్రణ లో ఉంచుకోడానికి , బాగా ఉపయోగ పడేవే ! మీకోపం అప్పటికీ తగ్గక పొతే , మీ ఆలోచనలను , మీకు నచ్చిన ఇంకో విషయం మీదకు మళ్ళించండి ! మీ సృజనాత్మక శక్తి కి పదును పెట్టండి ! అంటే మీ వ్యాపకాల లో ఒక దాని పని పట్టండి , మీ కోపం తో ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

తన కోపమె … 5. కోపం తో జరిగే హాని ఏంటి?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 27, 2014 at 7:39 ఉద.

తన కోపమె … 5. కోపం తో జరిగే హాని ఏంటి? 

 

కోపం రావడం మంచిదీ కాదూ , చెడూ కాదు ! అంటే, కేవలం కోపం రావడం హానికరం కాదు ! కానీ ఆ కోపం , తమను తాము హాని చేసుకోవడం కానీ , ఇతరులకు హాని తలపెట్టడం గానీ జరిగినప్పుడు, అనేక సమస్యలు సృష్టిస్తుంది ! కోపం వ్యక్తిగత బంధాలను బలహీనం చేస్తుంది. స్వంత వారితో , లేదా స్వంత వారనుకున్న వారితోనూ , బంధువులతోనూ , స్నేహితులతోనూ , ఇట్లా మనం ఎవరెవరితో సంబంధాలు ఏర్పరుచుకుని ఉంటామో , లేదా ఏర్పరుచుకుందామని అనుకుంటామో , వారందరి దగ్గర కూడా , మనం తెచ్చుకునే కోపం , భస్మాసుర హస్తం అవుతుంది ! అంటే , అది మనకే ముప్పు తెస్తుంది ! కోపగించుకునే వారిని, ఎవరు ఇష్ట పడతారు కనుక ! ఎప్పుడూ కోపం తెచ్చుకునే వారిలో , నిర్ణయాలు తీసుకునే సమర్ధత తగ్గిపోతుంది ! దానితో, వృత్తి పరంగానూ , ఉద్యోగ పరంగా కూడా సమస్యలు వస్తాయి. వారికి మాదక ద్రవ్యాలు తీసుకునే రిస్కు కూడా ఎక్కువ అవుతుంది. 
మానసికం గా కూడా , తరచూ కోపగించు కుంటూ ఉండే వారికి , ఆందోళన పడే గుణం అంటే యాంగ్జైటీ , డిప్రెషన్ , లేదా కృంగు బాటు , ఇంకా , తమను తాము హాని చేసుకునే ప్రమాదం , లాంటి సమస్యలు ఎదురవుతాయి ! 
ఇక శారీరకం గా, అంటే శరీరానికి కలిగే హాని కూడా తక్కువ ఏమీ ఉండదు ! తరచూ కోపగించుకునే వారికి  ఉదర సంబంధమైన వ్యాధులు , అంటే కడుపులో మంట గా ఉండడం , వికారం ఏర్పడడం , ఎసిడిటీ , అంటే కడుపులో ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి కావడం కూడా జరుగుతుంది ! ఇక రక్త ప్రసరణ విషయం లో ,  రక్త పీడనం ఎక్కువ అవుతుంది ! అంటే హై బీపీ ! దానితో పక్ష వాతం రావడానికీ , లేదా గుండె జబ్బులు రావడానికీ , అవకాశం హెచ్చుతూ ఉంటుంది ! ఎందువల్ల అంటే , కోపం  వచ్చిన ప్రతిసారీ రక్త పీడనం ఎక్కువ అవుతూ ఉంటుంది , ఇట్లా ఎక్కువ అవుతూ ఉన్న రక్త పీడనం , మెదడు లోనూ , గుండె లోనూ , మూత్ర పిండాల లోనూ ఉండే రక్త నాళాలను చిట్లింప చేస్తుంది !  ఇంకా మనకోపం , మనలో వ్యాధి నిరోధక శక్తి ని తగ్గిస్తుంది ! దానితో , తరచూ , జలుబులు రావడం , శ్వాస సంబంధ మైన వ్యాధులు రావడం  కూడా జరుగుతుంది ! 
ఎక్కువ గానూ , తరచుగానూ , కోపం తెచ్చుకుని , చీకాకు పడుతూ ఉండే వారిలో , క్యాన్సర్ వచ్చే రిస్కు కూడా హెచ్చుతుందని అనేక పరిశీలనల వల్ల తెలిసింది. దీనికి కారణం ఖచ్చితం గా తెలియక పోయినప్పటికీ , కోపం కారణం గా మన శరీరం లో జరిగే అనేక జీవ రసాయనిక చర్యలు , మన జీవ కణాలను , అస్తవ్యస్తం చేసి క్యాన్సర్ కారకం అవుతాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తన కోపమె … 4.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 21, 2014 at 5:20 సా.

తన కోపమె … 4. కోపం లో, మనం ఎట్లా ప్రవర్తిస్తాము ? 

కోపం లో, మనం ఎట్లా ప్రవర్తిస్తాము ? : 
మానవులకు వచ్చే కోపం, ఎప్పుడూ  అపాయ కరం కానవసరం లేదు !  మిగతా ఎమోషన్స్ లాగా కోపం కూడా ఒక శక్తి వంతమైన ఎమోషన్ !  కోపాన్ని అనేక మంది వివేక వంతులైన మానవులు , తమకు ఎంతో  ప్రయోజన కరం గా కూడా మలచు కో గలుగుతారు ! విజయులవుతారు కూడా !  అంటే, మనకు వచ్చే కోపాన్ని,  ఒక  సక్రమమైన నిర్దేశనం చేసుకుంటే , మన కోపం మనకు ఎంతో  ఉపయోగ కరం అవుతుంది కూడా ! 
ఉదాహరణ : కిరణ్ ఒక  పేద కుటుంబం లో పెరుగుతున్నాడు ! ఆకలి తో కాలే కడుపుకు కారణాలు వెదుకుతూ , లోకం తీరును పరిశీలించాడు !  నిరాశా , నిస్వార్ధ పరులు చుట్టూ ఉన్నా ,  స్వార్ధం తో నూ , మోస పూరితం గానూ , దౌర్జన్యం తోనూ , తమ ఉనికి ని చాటుతూ , అనేక అన్యాయాలనూ , అక్రమాలనూ , చేస్తూ , చేయిస్తూ , కోట్లు గడిస్తున్నఎంతో మంది  తోటి ‘ భారతీయులను ‘ గమనిస్తూ ఉంటే  , కిరణ్ కు అరికాలి మంట నెత్తి కెక్కుతుంది !  సమాజం లో చీడ పురుగుల్లా పెరుగుతున్న వారిని తలచుకున్నప్పుడల్లా , విపరీతమైన కోపం వస్తుంది , తరచూ ఉద్రేక పూరితమవుతున్నాడు ! స్థానిక రాజకీయ నేత లు తన లాంటి అనేక మంది యువకులను పోషిస్తూ తమ ‘ అక్కున చేర్చు కుంటున్నారు ! తన స్నేహితులు కొందరు , తనను కూడా వారితో చేరమని బ్రతిమాలారు ! అతి బలవంతం మీద , తన ఆదర్శాల కోసం , తాను కట్టుబడి ఉండాలనుకున్నాడు ! ఆ పరిస్థితులలో , తనకు ఉన్న ఆయుధాలు ,  తన మెదడు ! తన శ్రమా ! తన శ్రమతో , తన మెదడు కు పదును పెట్టాడు ! అందరూ నాలుగు గంటలు చదువుతూ ఉంటే , తను ఆరుగంటలు చదివాడు !  ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకున్నాడు ! కాంపస్ ఇంటర్వ్యూ  లో సెలెక్ట్ అయ్యాడు కూడా ! తను ఇప్పుడు, నేతలతో చేతులు కలిపిన తన స్నేహితుల కన్నా , ఎంతో ఎత్తు ఎదిగాడు ! తాను  పెరిగిన ఊరికి కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నాడు , తన వారితో పాటుగా ! 
తన విద్యార్ధి దశలో , తనకు వచ్చే కోపం గుర్తుకు వచ్చినప్పుడల్లా , ఇప్పుడు కిరణ్ నవ్వుకుంటాడు ! తన కోపాన్ని,  అతి లాఘవం గా ‘ స్పిన్ ‘ తిప్పి , తన పేదరికం ‘ వికెట్ ‘ పడ గొట్ట గలిగాడనే  ఆత్మ విశ్వాసం తో కూడిన గర్వం,  ఆ నవ్వులో ఉంది ! 
ఇంకో ఉదాహరణ : ప్రమోద్ కూడా ఒక  విద్యార్ధి ! విపరీతం గా కష్ట పడి , సంపాదిస్తూ , ఏ లోటూ లేకుండా ఆప్యాయం గా పెంచుతూ ,  అందుకు ప్రతి ఫలం గా , కేవలం,  కష్ట పడి , చదువుకుని , ఒక ప్రయోజకుడు కావాలని మనస్త్పూర్తి గా ఆశిస్తూ , ఎప్పుడూ , తన బాధ్యత  ను గుర్తు చేస్తున్న తల్లి దండ్రులంటే , అమితమైన కోపం ప్రమోద్ కు  ! ఆ కోపాన్ని , పట్టుదల తో, చదవడం మీద కేంద్రీకరించ కుండా ,  ‘ ఎప్పుడూ చదువుకో మని చెండాడు తూ  ఉంటారు ‘ అని భావిస్తూ, తన తల్లి దండ్రుల మీద తన కోపాన్నీ, తన ధిక్కార భావాన్నీ, ఆ రకం గా చూపించాలని నిర్ణయించుకున్నాడు !  , ఇతర ‘ ఊక ‘ స్నేహితులతో చేరి చెడు అలవాట్లకు చేరువయ్యాడు !  ,  తన బంగారు భవిష్యత్తు కు దూరమయ్యాడు !  హాస్పిటల్ లో తన వ్యసనాలకు విరుగుడు కై, వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నాడు !  మంచి నేటివ్ ‘ పిచ్ ‘ మీద , ‘ వాతావరణం చక్కగా ‘ ఉన్నా కూడా ,  బ్యాటింగ్ చేయలేక , సున్నా స్కోర్ తో  డక్ అవుట్  అయ్యాడు ! 
కోపమూ , దౌర్జన్యమూ ఒకటేనా ? :  కోపం అనేది  మనసు లోనూ ( లేదా మెదడులోనూ ) ఉండే ఒక అనుభూతి ( ఎమోషన్ ) ఉద్రేకం , దౌర్జన్యం లేదా అగ్రెషన్   అనేది  , మనసులో కోపాన్ని   బయటికి చూపించే ప్రవర్తన ! 
 ఉదాహరణ :  ఒక బహిరంగ సభ లో పాల్గొన్న వారు కొందరు , గొంతు చించు కుంటూ అరుస్తారు ! వారి కోపాన్ని చూపించే ప్రవర్తనలలో ఒకటి ! అంత వరకూ బాగానే ఉంది ! కొందరు ఇంకాస్త ముందుకు పోయి , ప్రత్యర్ధులను కొట్టడమో , వారి మీదా , పోలీసుల మీదా రాళ్ళు విసరడమో , తమ జేబుల్లో అగ్గి పెట్టెలు ఉంటే , తమకు కనిపించిన వాటికి నిప్పు పెట్టడమో చేస్తారు ! ఇది ఇంకో రకమైన ప్రవర్తన ! రెండు రకాలూ తమ కోపాన్ని బహిరంగ పరిచే ప్రవర్తనలే ! రెండో రకమైన ప్రవర్తన హింసాయుతం అవుతుంది కదా ! చాలా మంది కోపాన్ని , మనసులో నే పెట్టుకుంటారు ! అంటే వారు నిశ్శబ్దం గా కోప గించు కుంటూ ఉంటారు ! మన దేశం లో అనేక కోట్ల మంది ప్రజలు అట్లాంటి వారే ! వారి కోపం , తమ పరిస్థితి మీద ! తమను తోలు బొమ్మలాట ఆడిస్తున్న ,  నేతల మీద ! వారిలో ఎంతో శక్తి ఉంది ! యువత లో ఎంతో శక్తి ఉంది ! ఆమాటకొస్తే , భారత దేశం లో యాభై శాతం జనాభా, ఇరవై అయిదు సంవత్సరాల వయసు వారే  ! కానీ వారిలో ఒక స్థబ్దత ! నిర్ద్రా ణ మైన శక్తి !  ఆ యువ శక్తే , ముందు ముందు , భారత దేశం లో పరిస్థితుల  మార్పుకు దోహదం అవుతుందని ఆశిద్దాం ! 
వచ్చే టపా లో ….. 
 

 

తన కోపమె … 3.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 19, 2014 at 7:15 సా.

తన కోపమె … 3. 

మరి మనకు,  కోపం తెప్పించే కారణాలు ఏమిటి ?
మనకు కానీ మన బంధు మిత్రులకు కానీ ఆపద కలిగి , ముప్పు ఏర్పడినప్పుడు . 
మనలను , ఇతరులు దూషిస్తున్నా , లేదా భౌతికం గా అంటే ఫిజికల్ గా మనకు హాని కలిగిస్తున్నా , 
మనం ఏవైనా లక్ష్యాలు ఏర్పరుచుకుని , వాటికోసం శ్రమిస్తూ ఉండే సమయం లో  ఏ  కారణం చేత నైనా అంతరాయం కలిగితే, 
మనం ఉండే  సమాజం లో , మన ఆత్మ గౌరవాన్ని కించ పరిచే ఏ  సంఘటన అయినా జరిగినా, 
మనం ఎంతో  శ్రమ కూడ బెట్టిన ధనాన్ని , మనం కోల్పోతున్నా , లేదా నష్ట పోతున్నా కూడా ,
మనం ప్రాణ ప్రదం గా భావించి , ఆచరిస్తున్న ఆశయాలను ఇతరులు గౌరవించ కుండా ,వాటిని వమ్ము చేస్తూ ఉంటే ,
మనం ఉండే చోట , మనకు , ఇతరుల వల్ల అన్యాయం జరిగినా , మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్నప్పుడు , 
మన మీద మనం  కానీ , మనకు సంబంధించిన వారి మీద కానీ మనము  డిసపాయింట్ అయినప్పుడు, 
ఇట్లా అనేక కారణాల వల్ల మనం కోపం తెచ్చుకోవడం జరుగుతుంది , సహజం గా ! 
మనకు వచ్చే ఈ కోపం కూడా , వెంటనే వచ్చే కోపం ఒకటీ ,  కోపం , ఆ సందర్భం లో కనిపించ కుండా , అనేక నెలల తరువాత కానీ , సంవత్సరాల తరువాత కానీ , బయట పడే కోపం ఇంకో రకం !  అంటే ఒక సంఘటన జరిగిన సందర్భం లో అనేక కారణాల వల్ల , ఆ కోపం బహిర్గతం కాకుండా , ఒక బాటిల్ లో పెట్టి మూత పెట్టినట్టు  మనలో నిగూఢ మై ఉండి , ఒక్క సారి ( ఒక సుముహుర్తాన ! ) బయట పడుతుంది ! పైన వివరించినవి కాక ఇంకా ఏవైనా కారణాలు మీకు ప్రధాన మైనవీ , ముఖ్యమైనవీ అనిపిస్తే , తెలియ చేయండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
 

తన కోపమె … 2.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 16, 2014 at 10:55 ఉద.

తన కోపమె … 2. 

 
కోపం వచ్చినప్పుడు మన శరీరాలు ఎట్లా స్పందిస్తాయి ? 
క్రితం టపాలో చెప్పు కున్నట్టు , మనం , నిత్య జీవితం లో చెందే అనేకమైన అనుభూతులన్నీ కూడా , మన భౌతిక మానసిక , ఇంకా సామాజిక పరిస్థి తులకు అనుగుణం గా జరిగేవే ! మనకు వచ్చే కోపం కూడా, మన  శరీరం లో భౌతికమైన మార్పులు తెస్తుంది. వీటిని, ఫిజియ లాజికల్ మార్పులు అంటారు, వైద్య పరంగా !  శరీరం చెమటలు పట్టడం , గుండె వేగం గా కొట్టుకోవడం, లాంటి లక్షణాలు  మనకు బయటకు ‘ కనబడే ‘ లక్షణాలు ! అంటే  గుండె వేగాన్ని మనం లెక్కించ వచ్చు కదా ! అట్లాగే,  రక్త పీడనం కూడా పెరుగుతుంది , అంటే బీ పీ !  ఇంకా మన శరీరం లో ‘ ఎడ్రి నలిన్ ‘ అనే  జీవ రసాయనం లేదా హార్మోను  కూడా ఎక్కువ గా  విడుదల అవుతుంది. మన రక్తం లో , షుగరు, అంటే చెక్కెర శాతం ఎక్కువ అవుతుంది ! ఈ చర్యలన్నీ కూడా జీవ పరిణామ పరం గా చూస్తే , ఒక జీవిని , అప్రమత్తం చేసే చర్యలు , బయట ఉన్న ‘ అపాయాన్ని ‘ ఎదుర్కోవడానికి ! 
అదే సమయం లో మనకు వచ్చే కోపం , మనలను ,మనకు ముంచి ఉన్న ‘ముప్పు ‘ను ఎదుర్కోవడానికి సిద్ధం చేయడమే కాకుండా , మన ఆలోచనా ధోరణి ని కూడా వేగ వంతం చేస్తుంది !  ఆ సమయం లో, మన ఆలోచనలు దీర్ఘమైనవి గా ఉండక , కేవలం ఆ సందర్భం లో ‘ ఏది తప్పు? ‘  ‘ ఏది ఒప్పు ? ‘ అనే నిర్ణయాల మీదనే కేంద్రీకృతం అయి ఉంటాయి ! అంటే,  మనం ‘ యుక్తా యుక్త ‘ విచక్షణ ‘ ను కోల్పోతామన్న మాట , ఆ సమయాలలో !  ఇంకా వివరం గా చెప్పుకోవాలంటే , మనకు కోపం వచ్చినప్పుడు , మనం కేవలం  త్వరిత గతి ని నిర్ణయాలు తీసుకోవడమే చేస్తాము కానీ , ఆ నిర్ణయాలు  సరి అయినవా కావా అని ఆలోచించే స్థితి లో ఉండము ! 
ఆపదలు పొంచి ఉన్నప్పుడు , ఈ రకం గా ఎక్కువ సమయం తీసుకోకుండా , క్షణికావేశం లో తీసుకునే నిర్ణయాలు , మన భద్రత కు ఉపయోగకరమే అయినప్పటికీ ,  నిత్యజీవితం లో తెచ్చుకునే కోపం , మనం  విచక్షణా జ్ఞానాన్ని  కోల్పోయేట్టు చేస్తుంది !  ఆ సమయాలలో మనం, ఆలోచన కన్నా ముందు ,  చర్యలు తీసుకుంటాము ! we act, before we think ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

తన కోపమె … 1.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health, Our minds on మార్చి 15, 2014 at 10:04 ఉద.

తన కోపమె … 1. 

 
మనం , మన జీవితాలలో, అనేక సందర్భాలలో, అనేక సమయాలలో సహనం కోల్పోతూ ఉంటాము , కోపం తెచ్చుకుంటూ ఉంటాము !  ఉద్రేక పడుతూ ఉంటాము !  క్రోధం పెంచుకుంటాము !  మరి ఈ కోపం ఏమిటి ? కోపం రావడం మన ఆరోగ్యానికి మంచిదేనా ? తరుచు గా కోపం వస్తే , అది ఏ రకం గా మనలను ప్రభావితం చేస్తుంది ? చీటికీ, మాటికీ కోపం వస్తుంటే , దానికి చికిత్స ఉంటుందా ?  అసలు కోపం ఒక వ్యాధి అనుకోవచ్చా ? అనే విషయాల గురించి తెలుసుకుందాం ! 
 
ఏది కోపం అనబడుతుంది ?:
కోపం , మానవుల లోపల దాక్కున్న వత్తిడిని తెలుపడానికి ఉపయోగించే ఒక శక్తి వంతమైన ఎమోషన్ ! మానవులలో చాలా రకాలైన ఎమోషన్ లు లేదా అనుభూతులు కలుగుతూ ఉంటాయి , సమయం, సందర్భం బట్టి !  ఉద్రేకం , ఆనందం , విషాదం , ఇట్లాంటి ఎమోషన్ లు లేదా అనుభూతులు ! ‘ నాకు కోపం వస్తే పట్ట లేను ‘ అనీ ‘ నాకు కోపం వస్తే అది కట్టలు తెంచు కుంటుంది అనీ , ‘ నాకు కోపం వస్తే , నన్ను నేను కంట్రోలు చేసుకోలేను’  అనీ , ‘ నాకు కోపం వచ్చినపుడు , గట్టిగా ఎడవాలని అనిపిస్తుంది ‘ అనీ  , ఇట్లా , అనేక మంది అనేక రకాలు గా తమ కోపం గురించిచెబుతూ ఉంటారు ! మన అనుభూతులన్నీ కూడా , సహజం గా మన భౌతిక అంటే శారీరిక , మానసిక , ఇంకా సామాజిక పరిస్థితుల కనుగుణం గా  కలుగుతూ ఉంటాయి !  మరి కోపం కూడా మన అనుభూతులలో ఒకటి కనుక , అది కూడా , సహజం గానే ఈ మూడు పరిస్థితులను బట్టి ,  కలుగుతూ ఉంటుంది ! అంటే , మన శారీరిక స్థితి, మన మానసిక స్థితి , మన చుట్టూ ఉండే వాతావరణం , ఈ మూడు పరిస్థితులూ  కలిసి , మన ఇతర అనుభూతులు లేదా  ఎమోషన్స్ లాగానే , మన కోపాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ! 
బాగా రద్దీ గా ఉన్న ట్రాఫిక్ లో , అందరూ దోవ కోసం వెయిట్ చేస్తూ ఉంటే , మన పక్క నుంచి , ఎంతో అత్యవసరం ఉన్నట్టు , ఓవర్ టేక్ చేస్తూ , హారన్ అదే పని గా మోగిస్తూ , ముందుకు దూసుకు పోవాలని , శత విధాలు గా ప్రయత్నాలు చేస్తున్న వాహనదారులను చూస్తుంటే , మన అనుభూతి, ‘ కోపం ‘ కాక  ఏమవుతుంది ? రెండు గంటల నుంచి టికెట్ కోసం క్యూ లో నిలబడి ఉంటే , ‘ నేనే మొనగాడిని ‘ అని, టికెట్ కోసం, ఏదో పని ఉందన్నట్టు , ముందుకు దూసుకు పోయే ,  ‘ దేశ వాసులను’ చూస్తుంటే , వేరే అనుభూతి ఎట్లా కలుగుతుంది !? కులం , మతం , ప్రాంతం , పేర్లతో , మనుషులను , ‘ చీల్చి ‘ వేస్తూ , సొంత లాభం అంతా చూసుకుంటూ , పొరుగువాడికి తూట్లు పొడుస్తున్న  ‘ నాయకులను ‘ చూస్తుంటే  కలిగే అనుభూతి కి వేరే పేరు ఎట్లా ఉంటుంది ? 
కోపం ఎట్లా బయట పడుతుంది ? 
మనం , మన భౌతిక స్థితి నీ , మానసిక స్థితినీ , మన పరిసరాలనూ , ఎప్పుడూ బేరీజు , లేదా అంచనా వేసుకుంటూ ఉంటాము ! మన ఆలోచనలను తదనుగుణం గా విస్తృత పరుచుకుంటూ ఉంటాము ! ఆ మూడు పరిస్థితులకూ , మనం ఏ రకం గా  స్పందించాలో కూడా నిర్ణయించు కుంటూ ఉంటాము ! ఆ ఆలోచనలు , అనుభూతులు లేదా ఎమోషన్స్ గా రూపాంతరం చెందుతాయి ! అంటే , మనం నిరంతరం చేస్తున్న ఆలోచనలే , అనుభూతులు గా మారతాయి ! ఈ మార్పులు చాలా తక్కువ సమయం లో జరుగుతూ ఉంటాయి ! అంటే చాలా వేగం గా !  ఈ అనుభూతులు లేదా ఎమోషన్స్ , మనం ఆ పరిస్థితులకు ఏ రకం గా స్పందించాలో నిర్ణయిస్తాయి !  మనం కనుక , ఆ పరిస్థితిని అపాయకరమైనది గా నిర్ణయిస్తే , మనకు భయం అనే అనుభూతి కలుగుతుంది ! అదే , మనకు ఆ పరిస్థితి లో అన్యాయం జరిగిందని కనుక మనం నిర్ణయించుకుంటే , మన అనుభూతి ‘ కోపం’ అవుతుంది ! 
 
 
 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: