Our Health

Posts Tagged ‘చర్మ మర్మాలు’

చర్మ మర్మాలు . 11 . చర్మ ఆరోగ్యానికి చిట్కాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 24, 2014 at 10:08 ఉద.

చర్మ మర్మాలు . 11 . చర్మ ఆరోగ్యానికి చిట్కాలు ! 

చర్మం ఎప్పుడూ , నవ నవ లాడుతూ , ఆరోగ్యం గా ఉండాలంటే , తినే ఆహారం లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం !గుర్తు  ఉంచుకోవలసినది , చర్మం , అనేక లక్షల సజీవ కణాలతో నిర్మితమైనదని ! అంటే,  చర్మం లో ప్రతి మిల్లీ మీటర్ లోనూ అనేక చర్మ కణాలు , సజీవమైనవి ఉంటాయి ! ఆ కణాలకు నిరంతరం పోషక పదార్ధాలు అందుతూ ఉంటేనే , అవి ఆరోగ్యం గా ఉంటాయి ! చర్మం , ఒక కాగితం కాదు , మనకు కావలసిన రంగులు ‘ పెయింట్ ‘ చేసుకోవడానికి , లేదా క్రీములు పూసుకోవడానికి !  అందుకే, చర్మం లోని ప్రతి కణాన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి ! 
ఆరోగ్యం కోసం శక్తి కి కావలసిన పిండి పదార్ధాలూ , కొవ్వు లేదా ఫ్యాట్ లతో పాటు గా ప్రోటీనులు లేదా మాంస కృత్తులు  అవసరం అవుతాయి !  శక్తి తో పాటుగా  అనేక విటమిన్లూ , ఖనిజాలూ కూడా అవసరం అవుతాయి !
విటమిన్లూ , ఖనిజాలూ , అనేక రకాలైన జీవ రసాయన చర్యలలో కీలక పాత్ర వహిస్తాయి ! సాధారణం గా, మనం తినే ఆహారం లో పిండి పదార్ధాలు , ఫ్యాట్ లేదా కొవ్వు పదార్ధాలూ తప్పని సరిగా ఉంటాయి , ఆ మాట కొస్తే , ఎక్కువ గా ఉండి , మనకు సమస్యలు తెచ్చి పెడతాయి , వివిధ రకాలు గా ! మాంస కృత్తులు తక్కువ గా ఉండి , వాటి లోపం ఏర్పడుతుంది , ముఖ్యం గా శాక హారుల్లో ! అట్లాగే విటమిన్లు , ఖనిజాలు కూడా తక్కువ గా ఉండి , వాటి లోపం కూడా చర్మం లో మనకు ‘ కనిపిస్తూ ఉంటుంది ‘ !
వీలైనంత వరకూ , తాజా కూరగాయలు , పళ్ళ లో మనకు కావలసిన విటమిన్లు లభ్యం అవుతాయి !  ఇక ఖనిజాల గురించి చెప్పుకోవాలంటే , అనేక రకాలైన  విత్తనాలు , ఉదా:  గుమ్మడి కాయ విత్తనాలు , ఆల్మండ్స్ , వేరు శనగ పప్పులు ( పల్లీలు )  ,  సన్ ఫ్లవర్ సీడ్స్ , నువ్వులు , మొదలైనవి ఆహారం లో తరచూ తీసుకుంటూ ఉండాలి ! జింకు , సెలీనియం, మెగ్నీషియం  లాంటి అతి ముఖ్యమైన ఖనిజాలు , విత్తనాలలో లభిస్తాయి !  ఈ ఖనిజాలు చాలా కొద్ది పరిమాణం లో మన శరీరానికి అవసరం. కానీ, అవి అసలు శరీరం లో లేకపోతే , అనారోగ్యం తో పాటుగా , చర్మం కూడా వివిధ మార్పులు చెందుతుంది !
ఈ ఖనిజాలు కేవలం జీవ రసాయన చర్యలలో ( అంటే బయో కెమికల్ రియాక్షన్స్ ) ముఖ్యమైనవే కాకుండా , సూర్య రశ్మి  చర్మ కణాలకు చేసే హానిని తగ్గిస్తాయి ! అంటే  చర్మ కణాలలో ఖనిజాలు సమ పాళ్ళ లో ఉంటే , సూర్య రశ్మి లో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణా  ల ప్రభావం వల్ల చర్మ కణాల లో క్యాన్సర్ మార్పుల నివారణ జరుగుతుంది !
వివిధ దేశాలలో , వివిధ ప్రాంతాలలో ఉండే వారు , అక్కడ స్థానికం గా దొరికే తాజా పళ్ళూ , కూరగాయలూ , ఆకు కూరలూ ,  వివిధ రకాలైన విత్తనాలూ  తరచుగా , వీలయితే రోజూ కూడా , వారు తినే ఆహారం లో తీసుకుంటే , చర్మం ఆరోగ్యం గా ఉండడమే కాకుండా , శరీరం కూడా వివిధ అనారోగ్యాలకు దూరం గా ‘ ఉండడం ‘ జరుగుతుంది ! ఆ అవకాశం లేని వారు , కనీసం  విటమిన్లు , ఖనిజాలు ఉన్న ట్యా బ్లెట్ లు కానీ , క్యాప్స్యుల్స్ కానీ తీసుకోవడం కూడా శ్రేయస్కరం !  కానీ ఈ పని , వైద్య సలహా మీద చేస్తే ఉత్తమం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

చర్మ మర్మాలు . 10 . చర్మ కాంతికి చిట్కాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 19, 2014 at 7:17 సా.

చర్మ మర్మాలు . 10 . చర్మ కాంతికి చిట్కాలు ! 

సామాన్యం గా మన చర్మ సౌందర్యానికి మార్కెట్ లో అనేక రకాల  క్రీములూ , పౌడర్ లూ , లోషన్ లూ  , దొరుకుతాయి ! ఆమాటకొస్తే , ప్రపంచం అంతటా , ఈ చర్మ సౌందర్యానికి సంబంధించిన  సాధనాల అమ్మకాల మీద , అనేక బిలియన్ డాలర్ ల వ్యాపారం జరుగుతూ ఉంది !  ఏ కంపెనీ వారి వ్యాపార ప్రకటన చూసినా , ‘ మా క్రీము పూసుకుంటే మీ చర్మం మిల మిలా మెరిసి పోతుంది ‘  ‘  ఆ తార ‘ అందమంతా ‘ మా క్రీము వాడితేనే వచ్చింది ‘ మీరూ ‘ ఆ తార లా మా క్రీము వాడండి ‘ అని ఢంకా  బజాయిస్తూ ఉంటారు ! కానీ, చర్మ ఆరోగ్యానికి  తీసుకోవలసిన కనీస జాగ్రత్తల గురించి వారు ఎప్పుడూ చెప్పరు ! 
స్మోకింగ్ :  సిగరెట్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం ( శరీర ఆరోగ్యం తో పాటుగా )  పాడవుతుంది ! ఎక్కువ గా సిగరెట్ తాగే వారి చర్మం ఎక్కువ గా ముడతలు పడి , కాంతి హీనం గా తయారవుతుంది !  సిగరెట్ తాగే వారెవరైనా సరే , ( అంటే స్త్రీలైనా , పురుషులైనా ) వారి చర్మం లో ఈ మార్పులు జరుగుతాయి !  ఈ రోజుల్లో పురుషులతో సమానం గా  కాక పోయినా , కొద్దిగా అటూ ఇటూ గా స్త్రీలు కూడా పోటీ పడి ( నట్టు ) సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు !  సిగరెట్ ( పొగాకు ) కాల్చగా వచ్చే పొగ , ఊపిరి తిత్తుల ద్వారా , రక్తం లో కలిసి , ఆ రక్తం చర్మ పొరలలో ఉండే రక్త నాళాల ద్వారా చర్మం లోని కణాలకు చేరుతుంది !  అక్కడ చర్మ కణాలను  , ఆ పొగలోని విష పదార్ధాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ! దానితో చర్మం ఆరోగ్యం కోల్పోవడం జరుగుతుంది ! గమనించ వలసినది , స్త్రీలు , వారికై  వారు స్మోకింగ్ చేయక పోయినా కూడా , వారు ఉంటున్న ఇంట్లో ఇతరులు స్మోకింగ్ చేస్తున్నా కూడా , వారి చర్మం  ఈ మార్పులు చెందే ప్రమాదం ఉంది !  ఇట్లా చర్మం లో మార్పులు , కొన్ని నెలల తరబడి లేదా కొన్ని ఏళ్ల తరబడి స్మోకింగ్ కు  గురి అవుతేనే  జరుగుతాయి ! 
మద్యం లేదా ఆల్కహాల్ : మద్యం తాగడం వల్ల  చర్మ కణాలు డీ హైడ్రేట్ అవుతాయి ! అంటే చర్మ కణాలు  దప్పిక చెందుతాయి !  బాగా ఎండ గా ఉన్నప్పుడు  దాహం వేస్తున్న అనుభవం గుర్తు తెచ్చుకుంటే , అదే పరిస్థితి లో చర్మ కణాలు ఉంటాయని  అనుకోవచ్చు ! అంతే కాకుండా , దీర్ఘ కాలం మద్యం తాగడం వల్ల శరీరం లో కలిగే మార్పులు , చర్మం మీద చూపిస్తాయి ! 
సూర్య రశ్మి : మన శరీరానికి సూర్య రశ్మి వల్ల ఉపయోగం ఏంటో మనకందరికీ తెలుసు కదా ! అత్యంత అవసరమైన విటమిన్ డీ D  లభించేది సూర్య రశ్మి ద్వారానే !  కానీ చర్మానికి ఎక్కువ గా సూర్య రశ్మి సోకితే , దాని పరిణామాలు కూడా విపరీతం గా ఉంటాయి ! అంటే చర్మం కమిలి పోతుంది !  చిన్న పిల్లలలోనూ , యుక్త వయసున్న యువతీ యువకులలోనూ , ఈ మార్పులు ప్రమాద కరం గా పరిణమించ వచ్చు !  దానికి కారణం సూర్య రశ్మి లో ఉన్న అల్ట్రా వయొలెట్ కిరణాలు , చర్మ కణాలలో తెచ్చే మార్పులు !  ఎండలో అందుకే, డీ విటమిన్ ఏర్పడడానికి అవసరమయే సమయమే చర్మాన్ని ఎక్స్పోజ్ చేయాలి !  స్కిన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కనీసం పదిహేను 15 అంత కన్నా ఎక్కువ ఉన్న క్రీములనే పూసుకోవాలి , తక్కువ SPF  ఉన్న క్రీములు అల్ట్రా వయొలెట్ కిరణాలను నివారించ లేవు, అందుకు ! 
సుఖ నిద్ర :  నిద్ర కోల్పోయిన చర్మం అలసి పోయి ‘ తడారి పోయినట్టు ‘ కనబడుతుంది !  కనీసం ఏడూ ఎనిమిది గంటలు నిద్ర పోవడం  శరీర ఆరోగ్యం తో పాటు గా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది ! 
చర్మ శుభ్రత , చర్మ ఆరోగ్యం: వీటి గురించి వచ్చే టపాలో తెలుసుకుందాం ! 

చర్మ మర్మాలు . 9. మొటిమలకూ, ఋతు స్రావానికీ సంబంధం ఉంటుందా ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 11, 2014 at 9:22 ఉద.

చర్మ మర్మాలు . 9. మొటిమలకూ, ఋతు స్రావానికీ సంబంధం ఉంటుందా ? 

 

క్రితం టపా లలో  మొటిమలు తగ్గాలంటే వాడాల్సిన క్రీములూ , యాంటీ బయాటిక్స్ గురించి తెలుసుకున్నాం కదా ! యువతులలో వచ్చే మొటిమలు కొన్ని సందర్భాలలో  క్రీములతోనూ , యాంటీ బయాటిక్స్ తోనూ తగ్గక పోవచ్చు !
ప్రత్యేకించి , కొందరు యువతులలో , మొటిమలు , వారికి ముట్టు సమయం లో, అంటే ఋతు స్రావం సమయం లో ఎక్కువ అవుతూ ఉంటాయి ! దానికి కారణం , ఋతు స్రావ సమయం లో కలిగే హార్మోనుల ప్రభావమే ! సామాన్యం గా రుతుస్రావ సమయం లో స్త్రీలలో అండం విడుదల అవుతుంది ! ఆ అండం , పురుషుడి నుంచి విడుదల అయే శుక్రం లో ఉండే పురుష బీజ కణం కోసం గర్భాశయ భాగం లో వేచి ఉంటుంది కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ! అట్లా వేచి ఉండడానికి , ఆ స్త్రీలో కలిగే హార్మోనులలో మార్పులే కారణం ! కానీ కొందరు స్త్రీలలో  ఈ మార్పులు , చర్మం లో ఉన్న హేర్ ఫాలికిల్ కు ఉన్న కొవ్వు కణాలను కూడా ఎక్కువ గా ప్రభావితం చేసి , మొటిమలకు కారణ మవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో  ఆ స్త్రీలు  గర్భ నిరోధక పిల్ వాడడం వల్ల  లాభం పొందుతారు ! అంటే వీరిలో  గర్భ నిరోధక పిల్ , మొటిమలను కూడా నిరోధిస్తుందన్న మాట !
ప్రతి యువతీ, మొటిమలు తగ్గాలంటే , గర్భ నిరోధక పిల్ వాడ వచ్చా ? : 
జవాబు : ఋతు స్రావ సమయం లో మొటిమలు ఎక్కువ అయే యువతులూ , స్త్రీలే గర్భ నిరోధక పిల్ తో ఎక్కువ లాభ పడతారు ! మిగతా యువతులూ , స్త్రీలూ కనుక గర్భ నిరోధక పిల్ వాడితే , వారికి గర్భ నిరోధమే అవుతుంది !  మొటిమల మీద ప్రభావం ఉండదు !
కో సిప్రి న్డయోల్  ( co cyprindiol ) : ఈ మందు ఒక హార్మోను. ఈ హార్మోను సీబమ్ (  చర్మం లో ఉండే కొవ్వు కణాలలో కొవ్వు )  ను తగ్గిస్తుంది ! దానితో మొటిమలు తగ్గుతాయి ! ఈ హార్మోను ను సామాన్యం గా మొటిమలు విపరీతం గా వస్తూ మిగతా పద్ధతులతో తగ్గక పోతేనే ( అదీ యువతులలోనే , యువకులలో కాదు ) వాడ వలసిన అవసరం ఉంటుంది . సామాన్యం గా, కనీసం ఆరు నెలల పాటు ఈ హార్మోను వాడాలి !
హార్మోనులు వాడే ముందు , ఆ హార్మోనులు కలిగించే మేలు తో పాటుగా , వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ లను కూడా వివరం గా తెలుసుకుని , వాటికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ! ఈ హార్మోను వాడడం వలన  కొద్ది శాతం యువతులలో స్థన క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్కు ఎక్కువ అయిందని పరిశీలన ల వల్ల తెలిసింది.
ఐసో ట్రె టినోయిన్ ( isotretinoin ) : ఇది ఇంకో మందు. ఈ మందు కూడా సీబమ్ ను తగ్గించి , తద్వారా మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా , హేర్ ఫాలికిల్  బ్లాక్ అవకుండా నిరోధిస్తుంది , ఇంకా మొటిమల లో బ్యాక్టీరియా లను నిరోధిస్తుంది.
ఈ మందు మొటిమల నిరోధం లో శక్తి వంతమైనదే అయినా , దీని వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్ లు కూడా ఎక్కువ గానే ఉంటాయి !
గర్భ వతులు కావాలనుకునే యువతులు ఈ మందు ను వాడ కూడదు ! ఎందుకంటే , గర్భం లో పెరిగే శిశువు అంగ వైకల్యం తో పెరిగే ప్రమాదం ఉంది , ఈ ఐసో ట్రె టినోయిన్ మందు తో ! అందువల్ల , గర్భం దాల్చ లేదని ఖచ్చితం గా ( ప్రెగ్నెన్సీ పరీక్ష తో ) తెలుసుకున్నాకే , ఈ మందు బిళ్ళలు వాడాలి. చర్మ నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

చర్మ మర్మాలు . 8 . మొటిమలకు మిగతా మందులు

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 3, 2014 at 4:36 సా.

చర్మ మర్మాలు . 8 . మిగతా మందులు 

మొటిమలకు,  చర్మం మీద పూసుకునే యాంటీ బయాటిక్స్ :
మునుపటి టపాలో ,  బెంజోయిల్ పెరాక్సైడ్ , ఇంకా రెటినాయిడ్ ల గురించి తెలుసుకున్నాం కదా !ఇప్పుడు మొటిమల మీద పూసుకునే యాంటీ బయాటిక్స్ గురించి తెలుసుకుందాం ! 
ఈ యాంటీ బయాటిక్స్ ఎట్లా పనిచేస్తాయి ? 
జవాబు :మొటిమల లో ప్రవేశించిన బ్యాక్టీరియా లను  యాంటీ బయాటిక్స్ నశింప చేస్తాయి ! దానితో మొటిమల లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గి పోతుంది ! ఈ యాంటీ బయాటిక్స్ రోజూ ఉదయం, సాయింత్రం పూసుకోవాలి ! కనీసం ఆరు నుంచి ఎనిమిది  వారాలు వాడ వలసిన అవసరం ఉంటుంది , ఈ క్రీములను కానీ జెల్ లను కానీ ! 
అంతకన్నా ఎక్కువ కాలం వాడితే మంచిదే కదా ? ఎప్పటికీ మొటిమల లో ఇన్ఫెక్షన్ రాదు కదా ? 
జవాబు : అవసరమైన సమయం కన్నా ఎక్కువ సమయం ఈ క్రీములు పూసుకుంటే , అక్కడ ఉండే బ్యాక్టీరియా ల లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ! దానితో ఆ బ్యాక్టీరియా లు మొండి కెత్తి ,  ఇన్ఫెక్షన్ కలిగిస్తూ నే ఉంటాయి ! అంటే మొటిమలు పుండ్లు గా మారుతుంటాయి ! ఆ పరిస్థితి లో చికిత్స మరింత కష్టం అవుతూ ఉంటుంది ! అందువల్ల , నిర్ణీత కాలం మాత్రమే యాంటీ బయాటిక్స్ ఉన్న క్రీములను పూసుకోవాలి ! 
యాంటీ బయాటిక్స్ ఉన్న టాబ్లెట్ లు : 
అంటే వీటినే నోటిలో మింగి వేసుకోవాలి ! 
టాబ్లెట్ లు వేసుకోమని సలహా ఎప్పుడు ఇస్తారు ? 
సామాన్యం గా మొటిమలు ఒక పట్టాన తగ్గకుండా ఉంటే ,  యాంటి బయాటిక్ క్రీములతో పాటుగా , నోటిలో వేసుకునే ( యాంటీ బయాటిక్ కలిగిన ) ట్యా బ్లెట్ లను  కూడా తీసుకోమని సలహా ఇస్తారు . ఎక్కువగా టెట్రా సైక్లిన్ అనే మందు కలిగిన మందు ఇస్తారు ! 
( ఈ సందర్భం గా  మన తెలుగు వారు కీర్తి శేషులు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని మనం గుర్తు చేసుకోవాలి ! ఎందుకంటే ,1945 లోనే ఈయన అమెరికా లో పరిశోధన చేసి  ఈ టెట్రా సైక్లిన్ మందును కనిపెట్టడం లో ప్రధాన పాత్ర వహించారు !  కానీ ఆయన ప్రతిభ ప్రయోగ శాలకే పరిమితమై , అతని శిష్యుడి కి మాత్రం నోబెల్ ప్రైజ్ లభించింది ! )
మరి ఈ టెట్రా సైక్లిన్ ట్యా బ్లెట్ లను ఎవరైనా తీసుకోవచ్చా ?
జవాబు:  టెట్రా సైక్లిన్ మందు ఉన్న ట్యా బ్లెట్ లను , అంతకు మునుపే ఆ మందు వికటించిన వారు , అంటే ఎలర్జిక్ రియాక్షన్ వచ్చిన వారు , ఇంకా గర్భవతులు , లేదా శిశువులకు పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు ! 
అజెలాయిక్ యాసిడ్ ( azeloic acid  ) : 
ఈమందు  క్రీము రూపం లో లభిస్తుంది , రోజుకు రెండు సార్లు ( ఉదయం , రాత్రి ) మొటిమలు ఉన్న చోట పూసుకోవాలి !  నాలుగు వారాల పాటు వాడాల్సి ఉంటుంది. 
అజెలాయిక్ యాసిడ్ క్రీము ఎవరైనా పూసుకోవచ్చా ?
జవాబు:  ముందుగా , బెంజోయిల్ పెరాక్సైడ్ కానీ, రెటినోయిక్ యాసిడ్ క్రీము కానీ వాడాక , వాటితో మంచి ఫలితం కనిపించక పోతేనే , ఈ అజలాయిక్ యాసిడ్ క్రీమును వాడడం ఉత్తమం ! 
ఈ క్రీము తో సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయా ?
జవాబు : పూసుకున్న చోట , కొద్దిగా దురద , కొద్దిగా మంట కలగడం , లేదా అక్కడ  చర్మం ఎండి పోయి డ్రై గా కనిపించ డమూ , లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ లు మాత్రమే కలుగుతాయి. 
మిగతా క్రీముల కన్నా , ఈ అజలాయిక్ యాసిడ్ ఉన్న క్రీమ్ ప్రత్యేకత ఏమిటి ? 
జవాబు:  ఈ క్రీము కూడా , మొటిమల లో ఏర్పడే మృత కణాలను తీసి వేయడమే కాకుండా , అక్కడ చేరుకున్న బ్యాక్టీరియా లను నశింప చేస్తుంది ! అంతే కాకుండా , ఈ క్రీము ను పూసుకున్నాక ఎండలో తిరిగినా పరవాలేదు !  అంటే చర్మం ఎండకు సెన్సి టివ్ అవ్వదు ( కానీ బెంజోయిల్ పెరాక్సైడ్ వల్ల , ఈ సైడ్ ఎఫెక్ట్ రిస్కు ఉంటుంది ). 
వచ్చే టపాలో ఇకొన్ని సంగతులు ! 

చర్మ మర్మాలు . 7. మొటిమలకు, ఏ మందులు, ఎందుకు మంచివి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 26, 2014 at 6:04 సా.

చర్మ మర్మాలు . 7. మొటిమలకు ఏ మందులు ఎందుకు మంచివి ? 

( పైన ఉన్న చిత్రం లో, చర్మం వివిధ పొరలలో , రెటినాయిడ్ మందు ఎట్లా పనిచేస్తుందో వివరించ బడింది ! )

రెటినాయిడ్  క్రీములు . 
క్రితం టపా లో మొటిమలకు బెంజోయిల్ పెరాక్సైడ్ ఎట్లా పని చేస్తుందో తెలుసుకున్నాం కదా ! రెటినాయిడ్ క్రీములు కూడా మొటిమలు మటుమాయం కావడానికి పని చేస్తాయి 
రెటినాయిడ్  క్రీములు ఎట్లా పని చేస్తాయి ? 
జవాబు :  రెటినాయిడ్  క్రీమును ఒక పలుచని పొర లాగా మొటిమలు వస్తున్న చోట పూసుకుంటే  ఆ క్రీము , పూసిన ప్రాంతం లో సీబం అనే పదార్ధం ఎక్కువగా  ఉత్పత్తి అవకుండా నివారిస్తుంది ! క్రితం టపాలలో , సీబం ఎక్కువ గా ఉత్పత్తి అవడానికీ , మొటిమలు ఎక్కువ గా రావడానికీ ఉన్న లింకు గురించి తెలుసుకున్నాం కదా ! 
ఈ రెటినాయిడ్  క్రీము బజారు లో ఎట్లా దొరుకుతుంది ?
జవాబు : బజారులో సాధారణం గా ఈ క్రీము ను ట్రె టినోయిన్ అనే మందు లాగా అమ్ముతారు ! అడపాలిన్ అనే ఇంకో రెటినాయిడ్  కూడా మంచిదే ! ( tretinoin  and  adepalene ). 
ఈ క్రీము ను ఎట్లా పూసుకోవాలి ? 
రాత్రి పడుకో బోయే ముందు , ముఖం కడుక్కునాక ఒక ఇరవై నిమిషాలు ఆగి , ఒక పలుచని పొర లాగా మాత్రమే పూసుకోవాలి , ఈ రెటినాయిడ్ క్రీము ను. 
మరి ఈ రెటినాయిడ్ క్రీము ను ఎంత కాలం పూసుకుంటూ ఉండాలి ?
జవాబు : సామాన్యం గా ఆరు వారాలు ఈ క్రీము ను వాడాలి ! కొన్ని సందర్భాలలో స్కిన్ స్పెషలిస్టు ఎక్కువ కాలం ఈ క్రీము ను వాడమని సలహా ఇవ్వ వచ్చు ! 
గర్భ వతులు ఈ క్రీమును పూసుకోవచ్చా ? 
జవాబు : గర్భవతులు , ప్రత్యేకించి , గర్భం దాల్చిన తోలి మాసాలలో ఈ క్రీమును, అంటే రెటినాయిడ్  క్రీమును పూసుకో కూడదు ! 
కారణం ఏమిటి ? 
గర్భవతులు , ఈ రెటినాయిడ్  క్రీమును పూసుకుంటే , గర్భం లో పెరుగుతున్న శిశువు  అభివృద్ధి లో అవక తవకలు జరిగే ప్రమాదం ఉంది ! వారికి అంగ వైకల్యం కలిగే రిస్కు హెచ్చుతుంది ! 
ఈ క్రీము సైడ్ ఎఫెక్ట్ లు ఏమైనా ఉన్నాయా ? 
రెటినాయిడ్  క్రీములు సాధారణం గా భరించలేని సైడ్ ఎఫెక్ట్ లు ఏమీ కలిగించవు ! పోసిన చోట కొద్ది గా మంట కానీ దురద గా కానీ ఉండ వచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని మందులు ! 


చర్మ మర్మాలు .6. మొటిమలకు, ఏ మందులు, ఎందుకు మంచివి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 18, 2014 at 3:10 సా.

చర్మ మర్మాలు .6. మొటిమలకు, ఏ మందులు, ఎందుకు మంచివి ? 

మొటిమలకు మందుల గురించి నిర్ణయించుకునే ముందు , చికిత్స,  కనీసం మూడు నెలలు పట్ట వచ్చనే వాస్తవం గుర్తు ఉంచుకోవాలి !  అతి త్వరగా మొటిమలు తగ్గాలనే ఆతృత తో , కనబడిన క్రీము లన్నీ పూసుకుంటూ ఉంటే , మొటిమలు నయమవడం ఆలస్యం చేసుకోవడమే ! 

మొటిమలు ఉన్న వారు మానసికం గా కూడా కృంగి పోకూడదు ! మొటిమల తీవ్రత ను బట్టి , చికిత్స తీసుకోవాలి ! ఎక్కువ గా ఏర్పడి , చీము కూడా వస్తూ , బాధ కలిగిస్తూ ఉంటే , స్పెషలిస్ట్  సలహా తీసుకోవడం అవసరం. 
చికిత్స ముఖ్యం గా మూడు రకాలు గా ఉంటుంది !
1.  మందులు, కేవలం మొటిమలు ఉన్న చోట పూసుకోవడం. 
2. నోటిలో ( మింగి ) వేసుకునే మందులు . 
3. ప్రత్యేక పరికరాలతో మొటిమల ను తీసి వేయడం !
1. మందుల క్రీములు, లోషన్ లు, జెల్ లు . 
వీటిలో,  బెంజోయిల్ పెరాక్సైడ్ అనే మందు ఉండే క్రీములు ఉత్తమం ! అంటే , ఏ డాక్టరు దగ్గర కు వెళ్ళినా , మందు క్రీము కొనుక్కునే సమయం లో బెంజోయిల్ పెరాక్సైడ్ ఉందో , లేదో చూసుకోవాలి. 
బెంజోయిల్ పెరాక్సైడ్   రెండు రకాలు గా మొటిమలను తగ్గిస్తుంది 
a . చర్మం లో ఏర్పడే మృత కణాలు  పోగు అయి, హేర్ ఫాలికిల్ ను మూసి వేయకుండా నిరోధిస్తుంది 
b . చర్మం లో ఉండే బ్యాక్టీరియా లను నాశనం చేసి , మొటిమలు ఇన్ఫెక్ట్ కాకుండా నివారిస్తుంది ! 
ప్రశ్న : మరి బెంజోయిల్ పెరాక్సైడ్ ఉన్న క్రీము ను ఎన్ని సార్లు పూసుకోవాలి ?
జవాబు : ఈ మందు ను రోజు లో రెండు సార్లు పూసుకోవాలి. అంటే పగలు , రాత్రి పూసుకోవచ్చు. 
ఈ మందు పూసుకునే ముందు , ముఖాన్ని కడుక్కోవడం మంచిది.  
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్  ను ఎక్కువ సార్లు పూసుకుంటే ఏమవుతుంది ?  మొటిమలు త్వరగా తగ్గుతాయి కదా ? 
జవాబు: బెంజోయిల్ పెరాక్సైడ్  క్రీము ను చాలా పలుచని పొర లాగానే, మొటిమలు ఉన్న చోట పూసుకోవాలి ! ఎక్కువ సార్లు పూసుకుంటే , లేదా , త్వరగా తగ్గాలనే తాపత్రయం తో , మందమైన పొర  లాగానో పూసుకుంటే , ఈ క్రీము చర్మానికి ( పోసిన చోట ) మంట కలిగిస్తుంది ! 
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్  పూసు కున్న తరువాత ఎండలో తిరగ వచ్చా ? 
జవాబు: బెంజోయిల్ పెరాక్సైడ్  పూసుకున్నాక , పూసుకున్న ఏరియా , సూర్యుడి లోని UV కిరణాలకు ( అంటే అల్ట్రా వయొలెట్ కిరణాలకు ) ఎక్కువ గా ప్రభావితం అవుతుంది . UV కిరణాలు చర్మ కణాలకు హాని చేస్తాయి ! 
ప్రశ్న : మరి ఈ క్రీము ను ఎంతకాలం వాడాలి ? 
జవాబు: చాలా మంది , సాధారణం గా కనీసం ఆరు వారాలు , ఈ క్రీము పూసుకోవాలి , మొటిమలు పూర్తి గా నయమవ్వాలంటే ! 
ప్రశ్న : బెంజోయిల్ పెరాక్సైడ్  క్రీము తో ఇతర సైడ్ ఎఫెక్ట్ లు ఏమైనా ఉంటాయా ? 
జవాబు: పూసుకున్న చోట కొంత మంట తో పాటుగా , ఆ  ప్రాంత చర్మాన్ని ఎండి పోయినట్టు డ్రై గా కూడా చేయవచ్చు ఈ క్రీము.అట్లాగే , క్రీము పూసిన చర్మం కాస్త ఎరుపెక్క వచ్చు ! కానీ ఈ చెప్పిన సైడ్ ఎఫెక్ట్ లు. మందు ( చికిత్స తరువాత ) వాడకం ఆపిన తరువాత తగ్గిపోతాయి ! 
వచ్చే టపా లో ఇంకొన్ని సంగతులు ! 

 

చర్మ మర్మాలు . 5. మొటిమలు పోవాలంటే,

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 17, 2014 at 8:08 సా.

చర్మ మర్మాలు . 5. మొటిమలు పోవాలంటే, 

 

క్రితం టపాలలో మొటిమలు రావడానికి కారణాలు తెలుసుకున్నాం కదా ! మరి మొటిమలు పోవాలంటే ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం !

1. రెండు మూడు సార్లకన్నా ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోవడం వల్ల ఉపయోగం ఉండదు ! సబ్బు కానీ, లోషన్ కానీ ముఖం కడుక్కోవడానికి ఉపయోగిస్తే , అందుకోసం మైల్డ్ సోప్ ను వాడాలి ! అంటే,  పొటాషియం కాస్త ఎక్కువ గా ఉండే సబ్బు  , మార్కెట్ లో సాఫ్ట్ సోప్ లు చాలా రకాలైనవి లభిస్తాయి ! ఆందోళనతో ముఖాన్ని ఎక్కువ సార్లు కడుక్కుంటే , మొటిమలు తగ్గక పోగా , చర్మానికి రాపిడి ఎక్కువ అయి , మొటిమలు ఎక్కువ అయే రిస్కు ఉంటుంది !
2. నీళ్ళతో ముఖాన్ని కడిగే సమయం లో ,  అతి శీతలమైన నీటితోనూ , లేదా అతి వెచ్చని నీటితోనూ కడగ కూడదు ! గోరు వెచ్చని నీటితో కడుక్కోవడం  మంచిది .
3. ఏ రకమైన మొటిమలనైనా కూడా , చిదపడం, నొక్కెయ్యడం లాంటి పనులు చేయకూడదు ! అట్లా చేస్తే , మొటిమలు మచ్చలు గా మారతాయి ! ఒక పట్టాన  ఆ మచ్చలు మానవు కూడా !
4. మేకప్ కు వాడే క్రీములలో నీటి శాతం ఎక్కువ ఉండే క్రీములను వాడడం అలవాటు చేసుకోవాలి ! ఎందుకంటే, అట్లాంటి క్రీములు  హేర్ ఫాలికిల్స్ ను మూసి వేయవు ! అంటే ,  మొటిమలు ఏర్పడడానికి అనువైన వాతావరణాన్ని కలిగించవు , చర్మం మీద !
5. ఏ రకమైన క్రీములు పెట్టుకున్నా కూడా రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా ఆ మేకప్ ను గోరు వెచ్చటి నీటితో శుభ్రం గా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి ! ఎందుకంటే చర్మం మీద కణాలు ‘ ఊపిరి తీసుకోవాలి ‘ కదా !
6. మీ ముఖ చర్మం వాడి పోయినట్టు,  డ్రై గా ఉంటే , నీటి శాతం అధికం గా ఉండే క్రీము ను పూసుకోవచ్చు !
7. క్రమం గా వ్యాయామం చేయడం నేరుగా మొటిమలను తగ్గించక పోయినా కూడా మానసికం గా ఉత్తేజం కలిగి , ఆరోగ్యం గా ఉండడానికీ , ఆశావహ దృక్పధం తో జీవితం సాగించ డానికీ ఎంతో ఉపయోగకరం ! వ్యాయామం చేయగానే , షవర్ తీసుకోవడం అంటే,  తల మీదనుంచి స్నానం చేయడం వల్ల , స్వేదం లో ఉండే లవణాలు , మొటిమలను ఇరిటేట్ చేయకుండా , అంటే మంట పుట్టించ కుండా నివారించు కోవచ్చు !
వచ్చే టపాలో మొటిమలకు తీసుకోవలసిన మందుల గురించి తెలుసుకుందాం ! 

చర్మ మర్మాలు .4. మరి మొటిమలకు కారణాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 15, 2014 at 5:14 సా.

చర్మ మర్మాలు .4. మరి మొటిమలకు కారణాలేంటి ? 

1. మన చర్మం మీద ‘ మొలిచే ‘ వెంట్రుకలు సహజం గానే , చర్మం మీద ఉండే సూక్ష్మమైన రంధ్రాల ద్వారా బయటకు వస్తాయి. అంటే ప్రతి వెంట్రుక కూ ఒక్కో సూక్ష్మ మైన రంధ్రం ఉంటుంది !  ఈ సూక్ష్మమైన రంధ్రాన్నే, హేర్ ఫాలికిల్ అని అంటారు ! 
ప్రతి సూక్ష్మ మైన రంధ్రా నికీ అంటే ప్రతి హేర్ ఫాలికిల్ కూ  ఒక సె బెసియస్ గ్లాండ్ లేదా సెబే సియస్ గ్రంధి ఉంటుంది. ఈ సెబే సియస్ గ్రంధి లోనుంచి వచ్చే నూనె పదార్ధం , వెంట్రుకను ‘ ఎండి పోకుండా ‘  ‘ నిగ నిగ ‘ లాడేట్టు ఉంచుతుంది. ఈ నూనె పదార్ధాన్ని సీబమ్ అని అంటారు !  ఈ సీబమ్  హేర్ ఫాలికిల్ లో ఏర్పడే క్షీణించిన కణాల తో కలిసి ఒక ప్లగ్ లా ఏర్పడి,  హేర్ ఫాలికిల్ ను అంటే సూక్ష్మ రంధ్రాన్ని మూసి వేస్తుంది ! చర్మం పైపొరలలో ఇట్లా  ఫాలికిల్ మూసివేయ బడడం జరిగితే , ఒక తెల్లని బొడిప లా కనిపిస్తుంది ! కానీ చర్మం లోపలి పొర లలో ఇట్లా ఏర్పడితే , అక్కడ చీము ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది ! ఎందుకంటే , మన చర్మం మీద సహజం గానే ఉండే  హాని చేయని బ్యాక్టీరియా లు అక్కడ చేరి , చీము ఏర్పరుచుతాయి ! అంటే మన శరీరం ఆ బ్యాక్టీరియా తో ‘ పోట్లాడి ‘ ఏర్పరిచే పదార్దమే ‘ చీము ‘ లేదా పస్ ! 
2. టె స్టో స్టిరాన్: ఇది ఒక హార్మోను !  స్త్రీలకూ , పురుషులకూ , అంటే స్త్రీ పురుషులకిద్దరికీ , టె స్టో స్టిరాన్ ఎంతో  అవసరం !  ఈ టె స్టో స్టిరాన్ యుక్త వయసులో ఉన్న యువకులలోనూ , యువతులలోనూ ఎక్కువ గా విడుదల అవుతుంది వారి శరీరం లో , సహజం గానే !  యువకులలో టె స్టో స్టిరాన్ , పురుషాంగం, అంటే పెనిస్ , ఇంకా వృషణాలు, అంటే టెస్టి కిల్స్  అభివృద్ధి చెందడానికి అవసరం ! యువతులలో టె స్టో స్టిరాన్, వారి ఎముకలు బాగా డెవలప్ అవడానికీ , అంటే బోన్ గ్రోత్ కూ , ఇంకా , వారి శరీరం లో వివిధ కండరాలు దృఢ మైనవి గా అవడానికీ  అవసరం ! 
మరి టె స్టో స్టిరాన్ కూ మొటిమలకూ ఉన్న సంబంధం ఏమిటి? అని అనుకుంటే , టె స్టో స్టిరాన్ విడుదల , సెబే సియన్ గ్రంధులను ఎక్కువగా ప్రభావితం చేసి , ఎక్కువ  సీబమ్ ను విడుదల అయేట్టు చేస్తుంది ! ఇట్లా ఎక్కువ గా విడుదల అయిన సీబమ్ , హేర్ ఫాలికిల్ ను మూసివేయడం జరుగుతూ ఉంటుందని భావించ బడుతుంది ! దానితో మొటిమలు ఏర్పడతాయి ! 
3. మొటిమలు వంశ పారంపర్యమా ? :
అవుననే చెప్పుకోవాలి ! తల్లిదండ్రులలో ఒకరికి , వారు యుక్త వయసులో ఉన్నప్పుడు , మొటిమలు వస్తే , వారి సంతానానికి కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది ! తల్లిదండ్రు లిద్దరికీ కనుక మొటిమలు వచ్చి ఉంటే , వారి సంతానానికి , ఆ రిస్కు హెచ్చుతుంది ! సహజం గానే సంతానం , వారి తల్లి దండ్రులను ఎన్నుకో లేరు కదా ?!!! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

చర్మ మర్మాలు . 3. మొటిమలకు, కారణాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 14, 2014 at 7:25 సా.

చర్మ మర్మాలు . 3. మొటిమలకు కారణాలేంటి ? 

 

మొటిమలు చర్మం మీద కలిగే అతి సామాన్యమైన మార్పులు ! కానీ ఈ మొటిమలు వస్తున్న వారికి , వారి తల్లి దండ్రులు కానీ , బంధువులు కానీ , మిత్రులు కానీ , ఇంకా అనేక మంది , వారిని భయ పెడుతూ ఉంటారు , అనేక రకాలైన  అశాస్త్రీయ మైన కారణాలు చెబుతూ ! 
1. అపోహ : మొటిమలు సరిగా తినక పోవడం వల్ల ఏర్పడతాయి !
వాస్తవం : ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల వల్ల , మొటిమలు ఏర్పడడానికి  ఈ ఆహారం  కారణమని, లేదా ఈ ఆహార లోపం కారణమనీ చెప్పలేక పోయారు ! సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్య రీత్యా మంచిదే కానీ ,అట్లా సమతుల్యమైన ఆహారం తీసుకోక పొతే మొటిమలు ఏర్పడతాయన్నది అపోహ మాత్రమే !
2. అపోహ:  మొటిమలు చర్మాన్ని శుభ్రం గా ఉంచుకోక పోవడం వల్ల లేదా , చర్మం మురికి గా ఉండడం వల్ల ‘ :
 వాస్తవం:  మొటిమలు రావడానికి మూలమైన మార్పులు , చర్మం లోపలి పొర లో మొదలవుతాయి ! అందువల్ల చర్మం శుభ్రతతో మొటిమలు ఏర్పడడానికి సంబంధం లేదు ! ముఖాన్ని చాలా సార్లు , ఆ భయం తో కడుక్కుంటూ ఉంటే , కొన్ని సమయాలలో ఆ పరిస్థితి తీవ్రత ఎక్కువ కావచ్చు ! 
3. అపోహ: ‘ మొటిమలను నొక్కి వేయడమూ , లేదా గట్టిగా వత్తి , తీసి వేస్తే అవి మళ్ళీ ఏర్పడవు ‘ 
వాస్తవం : ఇది కూడా అపోహ మాత్రమే ! అట్లా చేయడం వల్ల , మొటిమలు తీవ్రమయి ,  కొన్ని సమయాలలో శాశ్వతం గా మచ్చలు ఏర్పడే ప్రమాదం  ఉంటుంది ! దీనినే స్కారింగ్ అంటారు ! 
4. అపోహ: సెక్స్ లో ఎక్కువ గా పాల్గొనడం వల్ల కానీ , లేదా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల కానీ మొటిమలు ఎక్కువ గా వస్తాయి !
వాస్తవం:   ఇది కూడా ఒక అపోహ. మొటిమలు ఈ చర్యలతో ఎక్కువా కావు , తక్కువా కావు ! అంటే  సెక్స్ కార్యకలాపాలకూ , మొటిమలకూ సంబంధం లేదు ! 
5. అపోహ: మొటిమలు ఒకరి నుంచి ఇంకొకరికి పాకుతాయి ! అంటే మొటిమలు అంటు వ్యాధి ‘
 వాస్తవం :ఇది కూడా ఇంకో అపోహ ! మొటిమలు అంటు వ్యాధి కాదు ! ఒకరి నుంచి ఇంకొకరికి  అంటు కోవు ! 
6. అపోహ: సన్ బాత్ చేస్తే కానీ ( అంటే బట్టలు తక్కువ గా వేసుకుని సూర్యుడికి శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడం ) , సన్ బెడ్ , లేదా సన్ ల్యాంప్ లకు శరీరాన్ని , లేదా మొటిమలు ఉన్న చర్మాన్నీ ఎక్స్పోజ్ చేస్తే , మొటిమలు తగ్గుతాయి !
వాస్తవం:   ఇది కూడా ఇంకొక అపోహ మాత్రమే  ! ఇది కూడా పూర్తి గా నిరాధారమైన అపోహ ! ఇట్లా సూర్య రశ్మి కి ఒంటి మీద ఆచ్చాదన లేకుండా , అంటే బట్టలు వేసుకో కుండా , చర్మాన్ని ‘ ఎండ బెడితే ‘ చర్మ క్యాన్సర్ వచ్చే రిస్కు అధికం అవుతుంది ! 
మరి వచ్చే టపాలో మొటిమలకు కారణం ఏమిటో తెలుసుకుందాం ! 


చర్మ మర్మాలు . 2. మొటిమల లక్షణాలు.

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 13, 2014 at 9:39 ఉద.

చర్మ మర్మాలు . 2. మొటిమల లక్షణాలు. 

 

మొటిమలు మన చర్మం మీద వచ్చే అతి సామాన్య మైన మార్పులు . ఇవి సాధారణం గా ముఖం మీదా , వీపు మీదా , చాతీ మీదా కూడా ఏర్పడుతూ ఉంటాయి !  ముఖం మీద వచ్చే మొటిమలు సర్వ సాధారణమైనవి . ఈ మొటిమలు, అవి ఏర్పడే పరిస్థితి ని బట్టి , ముఖ్యం గా ఆరు రకాలు గా బయట పడతాయి , అంటే మనకు కనబడతాయి . 
నల్లని రంగులో ఉన్న బుడిపెలు లాగా, తెల్లని రంగు లో ఉన్న బుడిపెల లాగా కనబడ వచ్చు ! నల్లని రంగులో కనిపించడానికి కారణం , పిగ్మెన్ టేషన్ అంటే నల్లని రంగునిచ్చే కణాల వల్ల. ఇట్లా నల్లగా ఉన్న బుడిపెలను నొక్కినప్పుడు ఆ మొటిమ లోనుంచి చెడు కొవ్వు బయటకు వస్తుంది. కానీ తెల్లని బుడిపె ల లోనుంచి ఏ పదార్ధమూ బయటకు రాదు అంటే తెల్లని బుడిపె మూసుకు పోయి ఉంటుంది. 
ఇంకా నాడ్యుల్ , సిస్ట్ , పస్ట్యుల్ అని మిగతా రకాలు గా కూడా మొటిమలు ఏర్పడ వచ్చు . ఈ పరిస్థితులలో మొటిమల లో కొంత చీము చేరుతుంది. అందువల్ల అవి నొక్కినప్పుడు , నొప్పి కూడా కలుగుతుంది. 
సిస్ట్ లు ఒక రకమైన మొటిమ లే కానీ  ఇవి మచ్చలు ఏర్పడడానికి కారణమవుతాయి. ప్రత్యేకించి ఇవి ముఖం మీద ఏర్పడితే , వాటి వల్ల కలిగే మచ్చలు , యువకులనూ , ప్రత్యేకించి యువతులనూ చీకాకు పరుస్తాయి. వారికి ఆత్మ న్యూనతా భావాన్ని కూడా కలిగించ వచ్చు , ఇట్లా ఏర్పడే మచ్చలు ! అంటే వారి  కాన్ఫి డె న్స్ , అదే ఆత్మ విశ్వాసం సన్నగిలుతుంది ! 
మరి ఈ మొటిమలు ఎట్లా ఏర్పడతాయో , వాటి కారణాలూ వచ్చే టపాలో తెలుసుకుందాం ! 
%d bloggers like this: