Our Health

Posts Tagged ‘ఇదో రకం మోసం !’

ఇదో రకం మోసం ! 3. పిరమిడ్ స్కీములు, లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి !

In Our Health on సెప్టెంబర్ 2, 2014 at 8:36 సా.

ఇదో రకం మోసం ! 3. పిరమిడ్ స్కీములు,  లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి !  

‘  ఏదైనా స్కీము లో,  చేరే వారే , ఇంకా కొందరిని చేర్పించాలి ‘  అని చెప్పే స్కీము వివరాలు తెలుసుకోగానే , వారి దగ్గర నుంచి శెలవు తీసుకోవడం మంచిది ! ఎందుకో ఇప్పుడు చూద్దాం ! 
పైన ఉన్న చిత్రం చూడండి !  శ్రద్ధతో గమనించితే , పిరమిడ్ ఆకారం లో ఉన్న ఆ చిత్రం లో శిఖరాన ఉన్న వాడు ( కొంపలు కూల్చే వాడు ) ఒక స్కీములో ఓ అర డజను మంది ని  చేర్చాడని అనుకుంటే , ఆ చేరిన ఆరుగురూ , తలా ఇంకో ఆరుగురిని చేర్పించాలని నిబంధన పెడతాడు ! ‘ అట్లా చేర్పించితేనే వారికి కమీషన్ ఉంటుందని ‘  ఆశ పెడతాడు ! అంటే మొదటి ఆరుగురు ఉదాహరణకు , తలా వంద రూపాయలు కట్టి స్కీములో చేరితే , ఆ ఆరువందలూ , శిఖరాన ఉన్న వాడు తీసుకుంటాడు ! మరి ఆ ఆరుగురికీ  లాభం రావాలంటే , ‘ ఒక్కొ క్కరూ మళ్ళీ ఇంకో ఆరుగురిని చేర్చితేనే ‘ అని చెబుతాడు ! ఆ ఆరుగురూ , ఇంకో ముప్పై ఆరుగురిని చేర్చ గలిగితేనే ,  వారికి లాభం ఉంటుంది ! ఇట్లా , ఆ ముప్పై ఆరుగురూ , తాము కట్టిన డబ్బుకు మళ్ళీ లాభం పొందాలంటే ,  వాళ్ళు తలా ఆరుగురిని ( అంటే 216 మందిని )  స్కీము లో చేర్పించితేనే వారికి లాభం వచ్చేది ! ఇట్లా గుణింపు చేసుకుంటూ వెళితే , అట్టడుగున ఉన్న వారి సంఖ్య ఈ భూమి మీద ఉన్న జనాభా సంఖ్య ను మించితే గానీ , వారి పైనున్న వారికి , లాభం రాదు ! అట్లాంటి పరిస్థితి లో పిరమిడ్ లో అడుగు భాగాన ఉన్న వారు,  లాభం ఏమీ పొంద కుండా , ఆ పిరమిడ్ క్రింద భూస్థాపితం అయి పోవాల్సిందే , ఆర్ధికం గా ! పిరమిడ్ స్కీములో అందరూ లాభ  పడడం అనేది అసాధ్యం. ఇంపాజిబుల్ ! ఈ వాస్తవం,  శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ( పిరమిడ్ స్కీము లో చేరిన వారిలో,  వందకు 88 మంది నుంచి 99. 88 మంది వారి డబ్బు ను కోల్పోతారని శాస్త్రీయం గా నిరూపించ బడింది ! )  ప్రపంచం లో  నేపాల్ దేశం తో సహా అనేక దేశాలలో నిషేధించ బడిన ఈ పిరమిడ్ స్కీములు , భారత దేశం లో  ‘ అవసరమైన వారి అండ దండలతో ‘ యధేచ్చ గా  నడుస్తూ ఉన్నాయి , పేదల కష్టార్జితం తో వారి మీదే పిరమిడ్ లు కట్టి , జీవితం లో కోలుకోలేకుండా చేయడానికి ! తస్మాత్ జాగ్రత్త ! 
 
వచ్చే టపాలో ఇంకో రకం మోసం గురించి  ! 

ఇదో రకం మోసం ! 2. టెలీ మార్కెటింగ్ ఫ్రాడ్.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 30, 2014 at 9:17 ఉద.

ఇదో రకం మోసం ! 2. టెలీ మార్కెటింగ్ ఫ్రాడ్. 

 
ఈ రోజుల్లో , కడుపు నిండా తిండి తిన లేని వారు కూడా సెల్ ఫోను వాడుతున్నారు ! అంత  సాధారణం అయిపొయింది , సెల్ ఫోను  ( దానినే మొబైల్ ఫోను  అని కూడా అంటారు ) దానితో పాటుగా , ఆ సెల్ ఫోను ద్వారా మోసం చేసే మోసగాళ్ళు కూడా అనేక మంది తయారవుతున్నారు ! 
ఈ మాయ గాళ్ళు సాధారణం గా మీకు పరిచయం లేని వాళ్ళు. కానీ ఎన్నో రోజులనుంచి  మీరు తెలిసినట్టు , ఆప్యాయత , స్నేహం ఒలక బోస్తూ , మీతో సంభాషణలు కలుపుతారు !  పరిచయం చేసుకోవడం మొదలెట్టడమే ‘ మీకు ఒక బహుమతి వచ్చింది ‘  మీరు వెంటనే  తదుపరి చర్య అంటే, యాక్షన్ తీసుకోక పొతే , మీకు వచ్చిన బహుమతి కోల్పోతారు ‘ అనే అందమైన  వల విసురుతారు !  ‘ బహుమతి , బహుమతి ! ‘ అని ఆలోచిస్తూ , ఇంకో ప్రపంచం లో విహరిస్తూ ఉంటారు, వెంటనే మీ ఆలోచనలు వేయి , లేదా అనేక వేల మైళ్ళ దూరం వెళతాయి ! మీరు ఏ  అమెరికా లోనో , జపాన్ లోనో , స్విట్జర్లాండ్ లోనో  , ఆ బహుమతి డబ్బు తో , మీకు ఇష్టమైన వారితో విహరిస్తున్నట్టు  ఊహించు కుంటారు !  అదే ఆ మోసగాళ్ళకు కావలసినది ! వెంటనే తడుము కోకుండా ‘ ఎక్కడ అందుకోవాలి ఆ బహుమతి ? అని కానీ , లేదా అది అందుకోడానికి మీరు ఏం చేయాలి ? అని ఆతృత గా అడుగుతారు , మీకు ఫోన్ చేసిన ఆ పరిచయం లేని వ్యక్తి ని ! సామాన్యం గా ఆ వ్యక్తి  పురుషుడై ఉంటాడు !కానీ పాశ్చాత్య దేశాలలో , మీరు పురుషుడని తెలిస్తే , ఆ అవతల వ్యక్తి  ఒక ‘ మంచి వయసు లో ఉన్న యువతి ‘ అవుతుంది ! అంటే  యువతులు కూడా ఈ రకమైన స్క్యామ్ లలో ప్రధాన పాత్ర వహిస్తారు ! 
కేవలం బహుమతి అనే కాకుండా , మీకు విసిరే వలలో , ‘ మీరు  ఫలానా దేశం లో హాలిడే ఉచిత ఆఫర్ గెలిచారనొ , లేదా మీకు ఒక ఉచిత బహుమతి వచ్చిందనో  చెబుతారు తీయగా !  ఉచిత బహుమతి అందుకోవడానికి , మీరు కేవలం పోస్టేజీ ఖర్చులు మాత్రమే వారికి పంపాలని చెబుతారు ! 
మీరు ఆపని అనేక ఇతర విధాలు గా కూడా చేయ వచ్చని , ఒకే  సారి మీకు చెప్పేస్తారు ! అంటే మీరు ‘ మీ బ్యాంక్ ఖాతా వివరాలు  వారికి టెలిఫోన్ లో ఇవ్వమని కానీ , మనీ ఆర్డర్ చేయమని కానీ , క్రెడిట్ కార్డ్ నంబర్ వారికి ఇవ్వమని కానీ , లేదా , వారి మనిషికి మీరు మీ సంతకం చేసిన ఒక చెక్ ఇవ్వమని కానీ , ఇట్లా అనేక రకాలు గా మీ డబ్బును , మీ దగ్గరి నుంచి వీలైనంత త్వరగా రాబట్టుకో డానికి  శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు !  
ముఖ్యం గా ఈ మోసగాళ్ళు  మీకు కొన్ని సలహాలూ , సూచనలూ కూడా ఇస్తూ ఉంటారు !  అవి : ‘ ఈ విషయం లో మీరు రెండో మనిషిని కూడా సంప్రదించ నవసరం లేదు !  అంటే మీ కుటుంబం లో ఎవరితో కానీ , మీ లాయర్ తో కానీ , లేదా మీ అకౌంటెంట్ తో కానీ , ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు ( చెబితే వాళ్ళు చేస్తున్న మోసం మీరు తెలుసుకో గలుగుతారు కాబట్టి ! )  ‘ ఈ సువర్ణావకాశం ‘ మీరు వదులు కోకూడదు , మీరు అనేక విధాలు గా నష్ట పోతారు ‘ అని కూడా శెలవిస్తారు  ఈ మోస గాళ్ళు ! 
ఈ మొత్తం వ్యవహారం లో మీరు ఏ క్షణం లోనైనా , వారు విసిరిన వలలో చిక్కుకుని , వారి ప్రలోభాలకు  లోనై  మీ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చారో , అది కేవలం ఆ మోసగాళ్ళ కే  మీరు ఇచ్చే బహుమతి అవుతుంది , మీకు కాదు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

ఇదో రకం మోసం ! 1. బ్యాంకింగ్ , ఆన్ లైన్ మోసాలు.

In ప్ర.జ.లు., మానసికం, Our minds on ఆగస్ట్ 27, 2014 at 12:43 సా.

ఇదో రకం మోసం ! 1. బ్యాంకింగ్ , ఆన్ లైన్ మోసాలు. 

క్రితం టపాలో చదివాము కదా  స్క్యామ్ లు అంటే  ఇతరులను నమ్మించి వంచన చేసి , తాము స్వంత లాభం పొందడం అని !  ఇప్పుడు  రక రకాల స్క్యామ్  ల వివరాలు తెలుసుకుందాం ! 
బ్యాంకింగ్ , ఆన్ లైన్ స్క్యామ్  లు :  చాలా బ్యాంకులు తమ లావా దేవీలు ఇంటర్నెట్ ద్వారా నూ  అంటే ఆన్ లైన్ లో చేసుకునే సదుపాయం కలిగించాయి  ప్రస్తుతం ! అంటే మనం చేసే క్లిక్కులను , తమ ట్రిక్కుల తో , వంచన చేసి , మన డబ్బును స్వాహా చేసే మోస గాళ్ళు అనేక మంది ! 
ఈ రకమైన మోసగాళ్ళు , ఏదో రకం గా మన బ్యాంకు ఖాతా వివరాలను  మొదట  తమ స్వంతం చేసుకుంటారు ! 
1. ఫిషింగ్ స్క్యామ్ లు : ఈ రకమైన స్క్యామ్  లలో  మోసగాళ్ళు  తామే మీ బ్యాంకు అంటే మీరు ఖాతా లేదా అకౌంట్ తెరిచిన బ్యాంకు అధికారులు గా పరిచయం చేసుకుని , మీ అకౌంట్ వివరాలను   ఈ మెయిల్ చేయమని అడుగుతారు. 
2. ఫోనీ స్క్యామ్ లు : ఈ రకమైన మోసాలు చేసే వారు , మీ సెల్ నంబర్ కు గానీ , మీ ఇంటి టెలిఫోన్ నంబర్ కు గానీ ఫోన్ చేసి , మీతో   స్వయం గా మాట్లాడి , తాము బ్యాంకు అధికారులమని చెప్పుకుని , మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదో సమస్య వచ్చిందని , మీ బ్యాంకు అకౌంట్ వివరాలు తెలియచేయమని , మిమ్మల్ని ఆందోళన కూ ,
వత్తిడి కీ గురిచేసి , మీ ఖాతా వివరాలు సేకరిస్తారు. 
3. క్రెడిట్ కార్డ్ స్క్యామ్ లు : ఈ రకమైన మోసాలు చేసే వారు , మన క్రెడిట్ కార్డు లను దొంగతనం చేసి , వాటి వివరాలతో , తాము లాభం పొందుతారు 
4. కార్డ్ స్కిమ్మింగ్ : అంటే పాలు చిలకరించినట్టు , మన క్రెడిట్ కార్డు ల లాంటి డూప్లికేట్ కార్డు లను  తయారు చేస్తారు.  అంటే మన క్రెడిట్ కార్డు వివరాలను  తస్కరించి  డూప్లికేట్ కార్డు ను తయారు చేసుకుని తమ అవసరాలకు వాడుకొంటూ ఉంటారు !  
5. నైజీరియన్ స్క్యామ్ లు : ఈ రకమైన మోసగాళ్ళు , ఈమెయిలు పంపించి , తమ దగ్గర లక్షలలోనూ , మిలియన్ లలోనూ డబ్బు ఉందనీ , దానిని తమ దేశం నుంచి బయటకు తీసుకురావడం సమస్య అవుతుందనీ , అందుకని మీ బ్యాంకు వివరాలు పంపిస్తే ,  ఆ డబ్బు మీ అకౌంట్ లో చేరిన తరువాత  కమీషన్  ఇస్తామనీ అనేక రకాలు గా మిమ్మల్ని  తమ వరాలతో ఆకర్షించి మీ వివరాలు సేకరిస్తారు ! 
6. చెక్ ఓవర్ పేమెంట్ స్క్యామ్ :  ఇట్లాంటి స్క్యామ్  లు చదువుతూ ఉంటే , మానవ ‘ మేధస్సును ‘ ఎంత లాభదాయకం గా  వాడుకుందామని మోసగాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కదా అని అనిపించక మానదు : ఈ రకమైన మోసం లో మీరు ఏదైనా వస్తువును  ఎవరికైనా అమ్మితే ,  ఆ కొనే వారు మోసగాళ్ళు  అయి , మీకు , మీరు అమ్మ జూపిన వస్తువును కొంటున్నట్టు  మీకు నమ్మకం కలిగిస్తూ , మీకు ఒక చెక్ ను కూడా పంపుతారు . కానీ మీరు చెప్పిన ధర కన్నా ఎక్కువ డబ్బే రాసి మీ అడ్రస్ మీద చెక్ పంపిస్తారు . మీరు చాలా ఆనందం గా చెక్ అందుకుని ,  ఆ ఎక్కువ డబ్బును వెంటనే  , ఆ చెక్ పంపిన మోసగాళ్ళకు పంపిస్తారు !ఉదాహరణకు , మీరు అమ్ముదామనుకున్న వస్తువు ( ఉదా : ఒక మోటర్ బైక్ ) ఇరవై వేలని మీరు చెబితే , మీకు ముప్పై వేల రూపాయలకు చెక్ అందుతుంది ! మీరు విశ్వాస పాత్రం గా , ఆ మిగతా మొత్తాన్ని ( అంటే పది వేలనూ ) ఒక చెక్ రాసి , పంపిస్తారు !  ఆ తరువాత , మీకు పంపిన చెక్కు ను మీ బ్యాంకు లో జమ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మీకు తెలియదు , ఆ చెక్కు విలువ సున్నా అని ! ( అంటే ఆ చెక్కు బౌన్స్ అవుతుంది అని అంటారు బ్యాంకు భాష లో ! ) 
 
మీ అనుభవాలు  తెలియ చేయండి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 
%d bloggers like this: