Our Health

కరోనా కాలంలో జాగ్రత్తలు- 1

In Our Health on జూలై 3, 2020 at 9:52 సా.

కరోనా మహమ్మారి ( Covid 19 ) గత ఆరు నెలలుగా ప్రపంచమంతటా దాదాపుగా అన్ని దేశాలలో చేస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. లక్షలాది అమాయక ప్రజలు కరోనా బారిన పడుతున్నారు, వేలల్లో చనిపోతున్నారు కూడా ! 

వివరాలు గమనిస్తే,  ఈ కోవిడ్ అంటువ్యాధి బాధితులు 90 శాతం పైగా కోలుకుంటున్నారు. కేవలం ఒక ఐదు పది శాతం ప్రజలు మాత్రమే , ఈ కరోనా  అంటువ్యాధి తో దీర్ఘకాలిక వ్యాధి పరిణామాలు అనుభవిస్తున్నారు, కొందరు వాటిని కూడా తట్టుకోలేక మరణిస్తున్నారు.  ఇక ఈ కాంప్లికేషన్స్ వచ్చినవారు ఎందుకు మరణిస్తున్నారు ? అని పరిశీలిస్తే ,అనేక రకాలైన కారణాలు కనిపిస్తున్నాయి.  అందులో ముఖ్యమైన కారణం, ఊపిరితిత్తులలో ప్రాణవాయువు మార్పిడి తగ్గి పోవడం. మనం తీసుకునే  శ్వాస లో ఉన్న ప్రాణ వాయువు ( అంటే ఆక్సిజన్ ) మన రక్తంలో కలిసేది ఊపిరితిత్తుల లోనే కదా !

ఈ కొవిడ్ అంటు వ్యాధి వల్ల ఆ రక్తంలో ప్రాణవాయువు  కలిసే ప్రక్రియ చాలా వరకు కుంటు పడి , తద్వారా మెదడుకి చేరవలసిన ప్రాణవాయువు క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. మన దేహం లో మిగతా అన్ని భాగాల కన్నా, మెదడుకు ప్రాణవాయువు అందక పోతే , మూడు నాలుగు నిమిషాల లోనే ,  మెదడు పని చేయటంలో అవకతవకలు కలుగుతాయి .  ఇది ఒక రకమైన సీరియస్ కాంప్లికేషన్ అవుతే ,రక్తనాళాల లో ఈ అంటు వ్యాధి వల్ల  మార్పులు కలిగి , తద్వారా రక్తం చిన్న చిన్న గడ్డలు గా  మారటం , ఆ మారిన గడ్డలు ( లేదా క్లాట్స్  ) మెదడులోకి ప్రవేశించి ,మెదడులోని రక్తనాళాలు మూసి పక్షవాతం రావటానికి కారణమవడం ఇంకో రకమైన సీరియస్ కాంప్లికేషన్ ( లేదా తీవ్ర పరిణామం ). ఇట్లా జరిగితే  పక్ష వాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ కోవిడ్ లేదా కరోనా వైరస్ మానవులకు జంతుజాలం ద్వారా సంక్రమించే ఒక కొత్త వ్యాధి అవటం మూలాన ఈ వైరస్ మానవులలో ఏ ఏ విధంగా హాని చేస్తుందో కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది . 

ఇక ఈ కరోనా  వైరస్ అంటువ్యాధి కి నివారణ కేవలం టీకా లేదా వ్యాక్సిన్  ద్వారా మాత్రమే.  ఈ వ్యాక్సిన్ను కనుక్కోడానికి కూడా ప్రపంచం అంతటా వివిధ దేశాలలో శరవేగంగా ప్రయత్నాలు ప్రయత్నాలూ  ,ప్రయోగాలూ  జరుగుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే ఫలిస్తాయని ఆశిద్దాం ! 

ఈ కోవిడ్  వ్యాధి సంక్రమించిన వారిలో  , కొద్దిపాటి లక్షణాలతో కోలుకుంటున్న వారు 90 శాతానికి పైగా ఉన్నారని తెలుసుకున్నాం కదా ,  ఇట్లా కొద్దిపాటి లక్షణాలతో  కోలుకోవటానికి కూడా శాస్త్రజ్ఞులు అనేక కారణాలు కనుక్కున్నారు. వాటిలో ఒక  ముఖ్యమైన కారణం, కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం.  ఈ రోగనిరోధకశక్తినే ‘ ఇమ్యూనిటీ ‘ అంటారు. 

అనాదిగా ( భారతదేశంలో ముఖ్యంగా )  సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్లు రోగ నిరోధక శక్తి ఇనుమడింప చేస్తాయి.  ఈ అలవాట్లే , సమతుల్యమైన ఆహారం తినటం,  మనసును ప్రశాంతంగానూ , ఉల్లాసంగానూ  ఉంచుకోవటం,  కంటికి తగినంత నిద్ర పోవటం మొదలైనవి .  ఇక్కడ సమతుల్యమైన ఆహారం అంటే తగినంత సూర్యరశ్మి తో పాటుగా  పోషక పదార్థాలు కూడా సమతుల్యంలో ఉండాలి , అంటే స్థూలపోషకపదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు.  స్థూల పోషక పదార్థాలు అంటే మనం తినే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఇంకా నూనె పదార్థాలు. ఇక సూక్ష్మపోషక పదార్థాలు అంటే మన దేహానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు. వీటిని సూక్ష్మ పోషక పదార్థాలు అని ఎందుకంటారంటే , మన దేహానికి కేవలం మిల్లీ గ్రాముల లోనే వీటి అవసరం ఉంటుంది. కానీ ఆ మిల్లిగ్రాముల లో అవసరం అయ్యే ఈ సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఏవైనా కారణాల వల్ల మన దేహానికి లభించకపోతే,  వాటి లోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల సహజంగా వివిధ రకాలైన వైరస్ లనూ , బ్యాక్టీరియాలనూ  నిరోధించే రోగ నిరోధక శక్తి పెరగటానికి మనం రోజూ సమతుల్య మైన ఆహారం తినాలి . 

అంతేకాకుండా , అధిక రక్త పీడనం ( అంటే హై బ్లడ్ ప్రెషర్ ) ఇంకా మధుమేహం అంటే డయాబెటిస్ ఇంకా ఆస్తమా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఆయా వ్యాధులను సాధ్యమైనంత నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి . రోజూ తగినంత సమయం వ్యాయామం కూడా చేస్తూ ఉంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. 

ఇప్పటివరకూ  మనం,  శారీరకంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో మానసికంగా ఏ రకమైన జాగ్రత్తలు ఈ కరోనా కాలంలో తీసుకోవాలో తెలుసుకుందాం !

 ఈ టపా మీద మీ అభిప్రాయాలు తెలుపగలరు ! 

అవసరమవుతేనే బయటకు వెళ్ళండి ! , ముఖానికి మాస్కు తొడుగుకోండి !, చేతులు తరచూ కడుక్కోండి సబ్బుతో !  క్షేమం గా ఉండండి , ఉంచండి ! 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: