ఏ వ్యాయామం ఎందుకు ? 2.
మునుపటి టపాలో , ఏరోబిక్ వ్యాయామం వల్ల, మన శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకున్నాం కదా !
మరి ఇప్పుడు, ఏ యే రకాల వ్యాయామాలు మన మెదడు లో ఏయే భాగాలకూ , కేంద్రాలకూ , ఉపయోగ పడతాయో తెలుసుకుందాం !
పరిణితి చెందిన మానవ మెదడు , అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన , మానవ మెదడు లో ఉండే నాడీ కణాల సంఖ్య వంద బిలియన్లు !
ఈ కణాలన్నీ కూడా అనేక రూపాలలో , నిర్మితం అయి , అనేక లక్షల సంధానాలతో ,అన్ని ఇతర కణాలతో సంబంధం కలిగి ఉంటాయి, నిరంతరం !
మన లో ఆలోచనలను జనింప చేయడానికీ , వివిధ రకాల పనులను మనతో చేయించడానికీ కూడా , మెదడు నిర్మితమై ఉంటుంది ! అందుకోసం మెదడు లో అనేక కేంద్రాలు నిర్మాణం అయి ఉన్నాయి !
ఉదాహరణకు :
ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ! చిత్రం లోని ఎరుపు భాగమే ! ) మనం , ఏ పని చేయ బోయినా , ఆ పని యొక్క యుక్తా యుక్త విచక్షణ కలిగించి , అవకతవక పనులను నివారించి , నిర్మాణాత్మక మైన, ఒక లక్ష్య నిర్దేశన ఉన్న పనులను మాత్రమే , మన చేత చేయించే కేంద్రమే , ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ !

రోజూ , ఒక మాదిరి బరువులను ఎత్తడం వల్ల , ఈ భాగం శక్తి వంత మవుతుంది !
ఫ్రాంటల్ లోబ్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ! చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఇది మన మెదడు ముందు భాగం లో ఉండే నిర్మాణం ! అంటే మన నుదుటి వెనుక కపాలం అంటే స్కల్ లో ఉంటుంది ! ఈ నిర్మాణం , మానవుల కండరాలు చేసే పనులను నియంత్రిస్తూ ఉంటుంది !

క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల , ఈ భాగం ఎక్కువ క్రియాశీలం అవుతుంది !
హైపోతలామస్ : (క్రింద ఉన్న చిత్రం చూడండి , చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఈ కేంద్రం , అతి సున్నితమైనది. ఇది , మెదడు లోపలి భాగాలలో నిర్మితమై ఉండి , మానవుల ఆకలి నీ , కామ సంబంధమైన అనుభూతులనూ , లింగ నిర్ధారణ నూ , నియంత్రిస్తూ ఉంటుంది ! ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల హైపోతలామస్ ఉత్తేజం అవుతుంది !

పరైటల్ లోబ్ ( క్రింద ఉన్న చిత్రం చూడండి, చిత్రం లోని ఎరుపు భాగమే ! ) : ఈ కేంద్రం , ఫ్రాంటల్ లోబ్ తరువాత ఉండే భాగం ! ఈ భాగం లో మానవుల దృశ్య శబ్ద గ్రహణ నాడులను అనుసంధానం చేసి , మన ఆలోచనలను హేతు బద్ధం గా చేసే వ్యవస్థ ఉంటుంది !

హిప్పో క్యాంపస్ : ( క్రింద ఉన్న చిత్రం చూడండి ,చిత్రం లోని ఎరుపు భాగమే ! ) ఈభాగం మన జ్ఞాపక శక్తి కి కేంద్రం ! ఈ భాగం కూడా ఏరోబిక్ వ్యాయామం వల్ల ఉత్తేజం అవుతుంది ! విద్యార్ధులకు ఏరోబిక్ వ్యాయామాలు , పరీక్షల సమయం లో బాగా ఉపయోగం అందుకే !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !