బంధాలు ఎందుకు తెగుతాయి ?11. నమ్మకం !
‘ ప్రేమకు పునాది నమ్మకమూ , అది నదీ సాగర సంగమమూ ‘ అని ఒక సినీ కవి రాశాడు. ( గుర్తుంటే చెప్పండి, ఏ సినిమా లోదో , ఈ పాట ! )
నమ్మకం వమ్ము అవుతుంటే , ప్రేమ పునాదులు బీటలు వారుతూ ఉంటాయి ! అందుకే , ఆ నమ్మకాన్ని ఎప్పుడూ దృఢ మైన పునాది గా ఉంచుకోవాలంటే, ఏమి చేయాలో చూద్దాం !
1. మీ భాగస్వామి తో, మీ ప్రవర్తన ఎప్పుడూ ఒక కనీస సమతుల్యం అంటే బాలెన్స్ గా ఉండాలి ! మనుషులన్నాక , మానసిక స్థితి, అనేక సందర్భాల లో అనేక రకాలు గా ఉండడం సహజమే ! కానీ ఆ పరిస్థితి ‘ చిత్త చాంచల్యం ‘ అని కానీ ‘ చపల చిత్తం ‘ కానీ అనిపించుకోదు ! ‘ ఎప్పుడు ఎట్లా ఉంటాడో చెప్పడం కష్టం ‘ అని కానీ ‘ ఆమె మైండ్ చాలా ఫికిల్ ‘ అని కానీ ఎవరినైనా అనగలుగుతుంటే, వారి ఆ మానసిక స్థితి సహజమైనది కాదు అని తెలుస్తుంది !
2. సమయ పాలన : అనుభవ రీత్యా , సమయానికి రాని రైళ్ళూ , విమానాలూ , రిజల్ట్సూ , ఉద్యోగాలూ , అతిథులూ , పెళ్లి వారూ , మనలను ఎంత ఇబ్బంది పెడతాయో మనకు తెలుసు ! ఒక బంధం లో కూడా సమయ పాలన లేక పొతే , అంతే ఇబ్బంది , ఆమాటకొస్తే , ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది !
3. మాట తప్పక పోవడం : మీరు మీ భాగ స్వామి తో ఏపని నైనా చేస్తానని అంటే , అది చేసి చూపండి ! కేవలం మాటలకే పరిమితం కాకుండా !
4. అబద్ధాలు కూడదు ! : బంధం తెగడానికి , అబద్ధాలు , పదునైన కత్తి లా పనిచేస్తాయి ! అవి నమ్మకాన్ని ముక్కలు ముక్కలు గా ఖండిస్తాయి , దానితో ‘ ప్రేమ బంధం ‘ పునాదులు కదులుతాయి !
5. వాదనలో కూడా న్యాయం గా ఉండండి ! : అంటే తప్పైనా కూడా మీ వాదనే నెగ్గాలనే పంతం కూడదు ! ఆ పరిస్థితి లో , మీరు నిజాన్ని ఆమోదించలేక పోతున్నారని స్పష్టం అవుతుంది , చాలా సమయాలలో మీకు నిజం తెలిసినా కూడా !
6. బాధ , సున్నితత్వం అనేవి అందరికీ ఒకటే : అంటే, మీ బాధ మాత్రమే నిజమైన బాధ అనీ , ఇతరులు ( అంటే మీ భాగ స్వాములు ) బాధ పడరనీ , లేదా మీ హృదయమే సున్నితమైనదనీ , ఇతరుల మనసు మొద్దు బారి , మొండి గా ఉంటుందనీ అనుకోవడం , అద్దం లో ఎప్పుడూ మిమ్ము మీరు చూసుకోవడమే ! దానిని, నార్సిసిజం అంటారు ! అన్న మాటలతో బాధ పడే మనస్తత్వం ఉన్న మీరు , మాటలు ఇతరులను అనే సమయం లో కూడా చాలా జాగ్రత్త గా ఉండాలి ! మాటలు కటువు గానూ , పరుషం గానూ ఉంటే , అవి అందరినీ ఒకే రకం గా బాధిస్తాయి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !