బంధాలు ఎందుకు తెగుతాయి ?10. ఘర్షణ !
ఏ బంధం లోనైనా ఎంతో కొంత , అప్పుడప్పుడూ ఘర్షణ ఉండడం సహజమే ! కానీ ఆ ఘర్షణ నిరంతరం , అంటే విరామం అంటూ లేకుండా , పగలూ , రాత్రీ జరుగుతూ ఉంటే , ఆ బంధం తెగిపోయే అవకాశం హెచ్చుతుంది !
ఘర్షణ తీవ్రతరం అవుతున్నప్పుడు బంధం లో ఉన్న ఇరువురూ గుర్తుంచు కోవలసిన ముఖ్యమైన విషయాలు :
1. మీకు ఆ ఘర్షణ సమయం లో ఏ విధం గా ప్రతి స్పందించాలో , అంటే రియాక్ట్ అవ్వాలో, అది పూర్తి గా మీ మీదే ఆధార పడి ఉంటుంది ! అంటే ఆ స్వేచ్ఛ మీకు ఉంది !
2. ఘర్షణ సమయం లో మీరు తీసుకునే ప్రతి చర్యా , ఆ ఘర్షణ ను తీవ్రతరం చేస్తున్నదా , లేదా ఆ ఘర్షణ ను తగ్గిస్తున్నదా అనే విషయం మీరు ఆలోచించుకోవాలి ! మీరు తీసుకునే చర్య , కేవలం ఒక మాట అనడం కావచ్చు ! అంటే ఒక పరుషమైన మాట , అంటే , ఇతరుల ను ఉద్రేక పరిచే మాట , లేదా అవమాన పరిచే మాట అవ వచ్చు ! అట్లా పరుషమైన మాటలు అనే ముందు , వాటి పరిణామాలు కూడా మీరు ఆలోచించుకోవాలి ! అంటే , మీరు అనే మాట ఘర్షణ ను తీవ్రతరం చేస్తుందా లేదా అని ! లేదా ఒక పని అవ్వ వచ్చు ! ఉదాహరణ కు , ఆ ఘర్షణ వాతావరణం నుంచి , బయటకు కానీ , ఇంకో గది లోకి కానీ వెళ్ళడం ! లేదా మీ భాగస్వామి దగ్గరికి వెళ్లి అనునయం గా వారితో మాట్లాడి సర్ది చెప్పడం అవ వచ్చు ! లేదా వారిని విదిలించుకుని పోవడం కూడా అవ వచ్చు !
3. కొన్ని సమయాలలో , మీ కు బాగా బాధ కలిగించే మాటలు వినడం కానీ , లేదా ప్రవర్తన కానీ మీకు అనుభవం అవ వచ్చు ! ఆ సమయాలలో వెంటనే రియాక్ట్ అవకుండా , కేవలం కొన్ని క్షణాలు పాజ్ అంటే విరామం ఇస్తేనే , ఆ ఘర్షణ పరిస్థితి ఎంత ‘ చల్ల ‘ బడుతుందో మీరే గమనించండి ! అంటే , మీకు ఆ ఘర్షణ సందర్భం , బాధ లేదా ఉద్రేకం కలిగించినా కూడా మీరు ఓపికతో , వెంటనే ఇంకో మాట అనకుండా , కేవలం మీ మౌనం తో , ఆ పరిస్థితిని మార్చ గలరు !
4. మీ పొరపాటును ఒప్పుకోండి ! : పొరపాట్లు మానవ సహజం ! ఎందుకంటే , ఖచ్చితమైన, లేదా ఆదర్శ ప్రాయమైన ప్రవర్తన , కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది ! ఏది పొరపాటో , ఏది మంచో అనేది కేవలం సాపేక్ష ! అంటే రిలేటివ్ ! కానీ , మీవల్ల జరిగిన పొర పాట్లను సహృదయత తో అంగీకరించితే , ఆ బంధం బల పడుతుంది !
5. ఇతరుల ప్రవర్తన మార్చే ముందు , మీ లో మార్పు కు సిద్ధ పడండి ! మీ ప్రవర్తన ( బంధం లో ) ఇతరుల ప్రవర్తన ఎట్లా మారుస్తుందో గమనించండి ! మీలో మార్పే , ఎదుటి వారిలో మీకు నచ్చని ప్రవర్తనను మార్చి వేయవచ్చు ! మీ బంధం చక్కటి అనుబంధం గా మారవచ్చు !
మిగతా సంగతులు వచ్చే టపా లో !