నిజాం, నిజంగా గొప్ప రాజేనా ?
నిన్న, తెలంగాణా ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావు గారు ‘ నిజాం ఎంతో గొప్ప పాలకుడని ‘ ప్రశంశ లలో ముంచెత్తారు ఆయనను ! మరి నిజాం, గొప్ప వాడో కాదో తెలుసుకునే ముందు , నిజాం గురించి కొంత తెలుసుకుందాం !
నిజాం ( మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ), హైదరాబాదు సంస్థానాన్ని పాలించిన , నిజాం వంశస్తులలో ఆఖరి వాడు ! అతడు ముప్పై ఏడు సంవత్సరాలు హైదరాబాదు సంస్థానాన్ని పాలించాడు ( 1911 -1948 ) ఉస్మానియా విశ్వ విద్యాలయాన్నీ , ఉస్మానియా ఆస్పత్రినీ , ఇంకా హైదరాబాదు లోనూ , చుట్టు పక్కలా , అనేక ఇతర కట్టడాలనూ , కట్టించాడు ! 85 శాతం మంది తెలుగు వాళ్ళు నివసించే హైదరాబాదు సంస్థానం లో, ఉర్దూ ను అధికార భాష చేసి పాలించాడు !
86 మంది స్త్రీలు , ఆ నిజాం కు ఉంపుడు గత్తె లు గా ఉండే వారు ! తాను తప్ప , మిగతా పురుషుల నెవ్వరినీ , వారి ముహం కూడా చూడ నిచ్చే వాడు కాదు ! అంటే పరదా వ్యవస్థ పటిష్టం గా ఉండేది ! వారితో , 100 మంది చట్ట విరుద్ధం గా జన్మించిన కుమారులు !
80 ఏళ్ల వయసులో , తాను చనిపోయే నాటికి ( 1967 లో ) ప్రపంచం లోని అత్యంత ధనవంతుల జాబితాలో మొట్ట మొదటి వాడు ! కాగితాలు ఎగిరి పోకుండా మీద ఉంచే పేపర్ వెయిట్ గా 50 మిల్లియన్ పౌండ్ల విలువ చేసే వజ్రాన్ని ఉపయోగించే వాడు !
1948 లో ఇంగ్లండు లోని ఒక బ్యాంకు లో ఒక మిలియన్ పౌండ్లు దాచి పెట్టాడు ! ఆ సమయం లో తను , పాకిస్తాన్ తో చేతులు కలిపి , ఆ దేశం లో అంతర్భాగం లేదా విలీనం కావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు ! అప్పట్లో ఇంగ్లండు బ్యాంకు లో పెట్టిన ఆ ఒక మిలియన్ పౌండ్ల డబ్బు విలువ ఇప్పుడు 30 మిలియన్ల పౌండ్లకు సమానం !
అంటే మూడు వందల కోట్ల రూపాయలు ! అప్పట్లో, తన మొత్తం ఆస్తి లో ఆ మొత్తం కేవలం సముద్రం లో కాకి రెట్ట మాత్రమే ! అప్పట్లోనే , 100 మిలియన్ పౌండ్ల విలువ చేసే బంగారమూ , 400 మిలియన్ల విలువ చేసే వజ్ర వై డూర్యాలూ నిజాం ఆస్తి !
నిజాం అత్యంత పీనాసి గా కూడా పేరు తెచ్చుకున్నాడు ! తన సాక్సు ను తనే అల్లుకునే వాడు ! నెలల తరబడీ ఒకసారి వేసుకున్న బట్టలను తన ఒంటి మీద అట్లాగే ఉంచుకునే వాడు ! తాను ఆతిధ్యం ఇచ్చిన అతిధుల దగ్గరనుంచి సగం కాల్చిన సిగరెట్ పీకలు తీసుకుని కాల్చేవాడు !
తన సేవకుడికి ఒక సారి, కేవలం 25 రూపాయల దుప్పటి మాత్రమే కొనుక్కు రమ్మని డబ్బు ఇచ్చి పంపాడు ! ఆ సేవకుడు , పట్టణం అంతా గాలించినా , 35 రూపాయలకు తక్కువ కాని దుప్పట్లు అమ్ముతుంటే , ఏమీ కొనకుండా తిరిగి వచ్చి , ఆ 25 రూపాయలూ తిరిగి నిజాం కు ఇచ్చాడు ట ! దానితో నిజాం కేవలం తన పాత చింకి దుప్పటి నే కప్పుకున్నాడుట !అత్యంత చౌక అయిన సిగరెట్ లు కాల్చే వాడు ! అంతే కాకుండా , కొద్దిగా తాగి పారేసిన సిగరెట్ పీకలను మళ్ళీ వెలిగించి వాటితో స్మోకింగ్ చేసే వాడు !
తనకు వస్త్రాల బీరువాలు ఒక అర మైలు దూరం వరకూ విస్తరించి ఉండేవి ! తన పదవికి ముప్పు వస్తుందని భయపడుతూ , భూగృహాలలో , ట్రక్కుల నిండా వజ్ర వైడూర్యాలనూ , మణి మాణిక్యాలనూ నింపి ఉంచేవాడు ! ( పరిస్థితి విషమిస్తే , ఆ ట్రక్కులలో , ధన రాశులనూ , వజ్రాలనూ , నగలనూ , తరలించ వచ్చనే ఆలోచన తో ! )
ఒక సారి మూడు మిలియన్ల విలువ చేసే దాచి పెట్టిన నోట్ల ను ఎలుకలు కొట్టేయగా , ఆ విషయాన్ని మంత్రులు చెబితే , కేవలం భుజాలు దులుపు కున్నాడట !
తన చట్ట బద్ధ వారసుడు , మనమడు అయిన ముకరం జా , తాత మరణించగానే , అనేక రకాలైన ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయి , ఆస్ట్రేలియా వలస వెళ్ళాడు ! అక్కడ కూడా ఒక గొర్రెల ఫార్మ్ షీప్ ఫార్మ్ మొదలు బెట్టి , అందులో కూడా రాణించ లేక పోయాడు !
నిజాం భవనం లో , 14 , 718 మంది సేవకులు , 3,000 మంది అంగ రక్షకులు , 28 మంది కేవలం నీళ్ళు మోసుకు రావడానికీ , 38 మంది పని వాళ్ళు కేవలం తన భవనం లోని దీపాలను తుడవడానికే, ఇంకా అనేక మంది కేవలం వాల్నట్ ( ఒక రకమైన బాదం కాయ లాంటి కాయ ), వాటిని ఒలిచి, పప్పును బయటకు తీయడానికే నియమించ బడి ఉండే వారు !
మరి నిజాం కు అంత డబ్బు ఎట్లా వచ్చింది ?
1. 1900 వ సంవత్సరం వరకూ ప్రపంచం లో ఒక్క ప్రదేశం లో మాత్రమే , వజ్రాల గనులు ఉండేవి, ఆ ప్రదేశమే గోల్కొండ ! , గోల్కొండ లో , ఇంకా చుట్టు పక్కలా , అపారమైన వజ్రాల గనులు ఉండేవి ! ఆ గనులలో లభించిన వజ్రాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం లో ప్రధాన భాగం నిజాం ఖజానా కు చెందేది !
2. జమీందారీ వ్యవస్థ మూలకం గా అనేక రకాలు గా శిస్తు అంటే పన్ను నిజాం ఖజానా లోకి జమ అయ్యేది ! నిజాం తన వ్యక్తి గత అవసరాలకూ , ఇంకా వివిధ ప్రజావసరాలకూ అని రెండు రకాలైన పన్నులు వసూలు చేసే వాడు ! అంటే వర్షాలు వచ్చినా రాక పోయినా , పంటలు పండినా , పండక పోయినా కూడా , తనకు రావలసిన పన్ను రావాల్సిందే ! తన ప్రభుత్వానికి రావలసిన పన్ను కూడా రావలసిందే !
3. ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ సమయం లో , అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తో చేతులు కలిపి , సిపాయిల తిరుగుబాటు ను అణిచి వేయడానికి సహాయ పడినందుకు గాను ‘ నిజాం ప్రభుత్వం ‘ అంత్యంత విధేయ సామంత రాజ్యం ‘ గా గుర్తింపు పొందింది ! దానితో పన్ను వసూళ్ళ విషయం లో , నిజాం ప్రభుత్వానికి పూర్తి స్వాతంత్ర్యం లభించి , ఇష్టారాజ్యం గా పన్నులు వసూలు చేయడం జరిగింది ! ప్రజలను పీడించి పన్నులు అనేక రకాలు గా వసూలు చేస్తున్నా , బ్రిటీష్ ప్రభుత్వం ఏ విధం గానూ ( అత్యంత విధేయ సామంత రాజ్యం హోదా ఇచ్చిన ) నిజాం పాలన లో జోక్యం చేసుకోలేదు !
ఇక నిజాం గొప్ప వాడా కాదా ? అన్న విషయం పాఠ కుల విజ్ఞతకే వదిలేస్తున్నా !