నిద్రలో ఏమి జరుగుతుంది ? 1.
‘ మత్తు వదలరా నిద్దుర , మత్తు వదలరా’ ! అని ఘంటసాల గారు పాడిన పాట , సినిమా సంగీత ప్రియులందరూ విని వుంటారు ! అతినిద్రా లోలుడు , తెలివిలేని మూర్ఖుడు ! అని కర్తవ్యాన్ని బోధిస్తాడు కృష్ణ పరమాత్ముడు ! భీముడికి ! ఆ పాట లో ! అతి నిద్ర ఎంత ప్రమాదమో , నిద్ర లేమి కూడా అంతే ప్రమాదం ! అది కూడా అనేక అనర్ధాలకు హేతువు ! ఇటీవలి పరిశోధనల ఫలితం గా ఈ నిజాలు తెలిశాయి !
మనం సామాన్యం గా , నిద్ర పోవడం అంటే , ఏపనీ చేయకుండా , కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం అనే అనుకుంటాం ! కానీ , మన దేహం లో అనేక అవయవాలు , మనం నిద్ర పోయే సమయం లో అనేక జీవ రసాయన చర్యలలో పాలు పంచుకుంటాయి ! శాస్త్రజ్ఞులు ఈ నిద్ర వల్ల ఉపయోగాలను ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు ! అలసి పోయి , నిస్తేజం గా ఉన్న మన దేహాన్నీ , మన మెదడునూ , ఏ మందుల అవసరమూ లేకుండా , సహజం గానే మళ్ళీ ఉత్తేజం కలిగించి , శక్తివంతం చేయగలిగే సామర్ధ్యం కేవలం నిద్రకు మాత్రమే ఉందని ! కాక పొతే , ఈ నిద్ర వల్ల మనం పొందే ప్రయోజనాలు , సరి పడినంత నిద్ర పోతేనే పొంద గలుగు తామని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు ! ఆత్మ న్యూనతా భావాలూ , ఆందోళనా మనస్తత్వం , ఇవి కూడా నిద్ర సరిగా ఉంటే , మటు మాయ మవుతాయని తెలిసింది !
నిద్ర వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు , నిద్ర లేమి లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ఉత్తమం !
మన మెదడును ఒక హార్డ్ డిస్క్ గానూ , ఒక మంచి ప్రాసెసర్ గానూ మనం ఊహించుకుంటే ,మన కంప్యూటర్ లకు కనుక మనం రాత్రి సమయం లో స్విచ్ ఆఫ్ చేసి, చల్ల బరచి నట్టు గా,మన నిద్ర ను, పోల్చుకోవచ్చు ! మనం మెళుకువ గా ఉన్నప్పుడు మెదడు లో ఏర్పడ్డ అనేక హాని కర పదార్ధాలు ( వీటిని ఫ్రీ రాడికల్స్ అంటారు, జీవ రసాయన శాస్త్ర పరం గా అంటే, బయో కెమిస్ట్రీ లో సాంకేతిక నామాలు ) , రాత్రి సమయం లో, మెదడు నుంచి కడిగి వేయ బడుతూ ఉంటాయి. ఇట్లా కడిగి వేసే అనేక యాంటీ ఆక్సిడెంట్ లు, రాత్రి సమయం లో, మనం నిద్ర పోతున్నప్పుడే ఎక్కువ గా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మన మెదడు కణాల లో ! నిద్ర లేమి లో, మన మెదడు లో నిర్మితమై ఉన్న అనేక లక్షల నాడీ కణాలు , బాగా అలసి పోయి ఉంటాయి , మనతో పాటుగా ! ఆ పరిస్థితి లో , హానికర పదార్ధాలను కడిగే యాంటీ ఆక్సిడెంట్ లు తక్కువ అవుతాయి ! ఒక వేళ , మనకు ఒక్క సారిగా ఎక్కువ సమయం ( లేదా తగినంత సమయం ) నిద్ర పోవడానికి అవకాశం లేక , గంట , రెండు గంటలు కునుకు తీసినా కూడా , తగినంత లాభం ఉండదు ! సరే, మరి ఈ యాంటీ ఆక్సిడెంట్ లు ఎక్కువ గా లేక పొతే ఏమవుతుంది ? అనుకునే వారు చాలా మంది ఉన్నారు ! మెదడు లో ఈ పరిస్థితి ని , మనం, కిటికీలు మూసి వేసిన గదిలో , ఒక నాలుగు గంటలు ఉంటే ఎట్లా ఉంటుందో , దానితో పోల్చుకోవచ్చు ! లేదా, కారులో విండోస్ మూసేసి ఒక గంట సమయం కూర్చున్న పరిస్థితి తో పోల్చుకోవచ్చు ! అప్పుడప్పుడూ , నిద్ర కోల్పోవడం సహజమే ! అనుకోని పరిస్థితులలో ఇట్లా జరగ వచ్చు ! కానీ, నిద్ర లేమి ఒక అలవాటు గా మారుతున్నప్పుడే , పరిస్థితులు తల్ల క్రిందు లవుతాయి , మెదడులోనూ , తద్వారా మన జీవితాలలోనూ ! ఇట్లా ఫ్రీ రాడికల్స్ ఎక్కువ గా మెదడులో పేరుకు పోతూ ఉంటే , అవి మెదడు కణాలను దెబ్బ తీయగలవని , ఎలుకల మెదడుల మీద చేసిన పరిశోధనల లో ఋజువైంది !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !