ఇదో రకం మోసం ! 1. బ్యాంకింగ్ , ఆన్ లైన్ మోసాలు.

క్రితం టపాలో చదివాము కదా స్క్యామ్ లు అంటే ఇతరులను నమ్మించి వంచన చేసి , తాము స్వంత లాభం పొందడం అని ! ఇప్పుడు రక రకాల స్క్యామ్ ల వివరాలు తెలుసుకుందాం !
బ్యాంకింగ్ , ఆన్ లైన్ స్క్యామ్ లు : చాలా బ్యాంకులు తమ లావా దేవీలు ఇంటర్నెట్ ద్వారా నూ అంటే ఆన్ లైన్ లో చేసుకునే సదుపాయం కలిగించాయి ప్రస్తుతం ! అంటే మనం చేసే క్లిక్కులను , తమ ట్రిక్కుల తో , వంచన చేసి , మన డబ్బును స్వాహా చేసే మోస గాళ్ళు అనేక మంది !
ఈ రకమైన మోసగాళ్ళు , ఏదో రకం గా మన బ్యాంకు ఖాతా వివరాలను మొదట తమ స్వంతం చేసుకుంటారు !
1. ఫిషింగ్ స్క్యామ్ లు : ఈ రకమైన స్క్యామ్ లలో మోసగాళ్ళు తామే మీ బ్యాంకు అంటే మీరు ఖాతా లేదా అకౌంట్ తెరిచిన బ్యాంకు అధికారులు గా పరిచయం చేసుకుని , మీ అకౌంట్ వివరాలను ఈ మెయిల్ చేయమని అడుగుతారు.
2. ఫోనీ స్క్యామ్ లు : ఈ రకమైన మోసాలు చేసే వారు , మీ సెల్ నంబర్ కు గానీ , మీ ఇంటి టెలిఫోన్ నంబర్ కు గానీ ఫోన్ చేసి , మీతో స్వయం గా మాట్లాడి , తాము బ్యాంకు అధికారులమని చెప్పుకుని , మీ బ్యాంక్ అకౌంట్ లో ఏదో సమస్య వచ్చిందని , మీ బ్యాంకు అకౌంట్ వివరాలు తెలియచేయమని , మిమ్మల్ని ఆందోళన కూ ,
వత్తిడి కీ గురిచేసి , మీ ఖాతా వివరాలు సేకరిస్తారు.
3. క్రెడిట్ కార్డ్ స్క్యామ్ లు : ఈ రకమైన మోసాలు చేసే వారు , మన క్రెడిట్ కార్డు లను దొంగతనం చేసి , వాటి వివరాలతో , తాము లాభం పొందుతారు
4. కార్డ్ స్కిమ్మింగ్ : అంటే పాలు చిలకరించినట్టు , మన క్రెడిట్ కార్డు ల లాంటి డూప్లికేట్ కార్డు లను తయారు చేస్తారు. అంటే మన క్రెడిట్ కార్డు వివరాలను తస్కరించి డూప్లికేట్ కార్డు ను తయారు చేసుకుని తమ అవసరాలకు వాడుకొంటూ ఉంటారు !
5. నైజీరియన్ స్క్యామ్ లు : ఈ రకమైన మోసగాళ్ళు , ఈమెయిలు పంపించి , తమ దగ్గర లక్షలలోనూ , మిలియన్ లలోనూ డబ్బు ఉందనీ , దానిని తమ దేశం నుంచి బయటకు తీసుకురావడం సమస్య అవుతుందనీ , అందుకని మీ బ్యాంకు వివరాలు పంపిస్తే , ఆ డబ్బు మీ అకౌంట్ లో చేరిన తరువాత కమీషన్ ఇస్తామనీ అనేక రకాలు గా మిమ్మల్ని తమ వరాలతో ఆకర్షించి మీ వివరాలు సేకరిస్తారు !
6. చెక్ ఓవర్ పేమెంట్ స్క్యామ్ : ఇట్లాంటి స్క్యామ్ లు చదువుతూ ఉంటే , మానవ ‘ మేధస్సును ‘ ఎంత లాభదాయకం గా వాడుకుందామని మోసగాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కదా అని అనిపించక మానదు : ఈ రకమైన మోసం లో మీరు ఏదైనా వస్తువును ఎవరికైనా అమ్మితే , ఆ కొనే వారు మోసగాళ్ళు అయి , మీకు , మీరు అమ్మ జూపిన వస్తువును కొంటున్నట్టు మీకు నమ్మకం కలిగిస్తూ , మీకు ఒక చెక్ ను కూడా పంపుతారు . కానీ మీరు చెప్పిన ధర కన్నా ఎక్కువ డబ్బే రాసి మీ అడ్రస్ మీద చెక్ పంపిస్తారు . మీరు చాలా ఆనందం గా చెక్ అందుకుని , ఆ ఎక్కువ డబ్బును వెంటనే , ఆ చెక్ పంపిన మోసగాళ్ళకు పంపిస్తారు !ఉదాహరణకు , మీరు అమ్ముదామనుకున్న వస్తువు ( ఉదా : ఒక మోటర్ బైక్ ) ఇరవై వేలని మీరు చెబితే , మీకు ముప్పై వేల రూపాయలకు చెక్ అందుతుంది ! మీరు విశ్వాస పాత్రం గా , ఆ మిగతా మొత్తాన్ని ( అంటే పది వేలనూ ) ఒక చెక్ రాసి , పంపిస్తారు ! ఆ తరువాత , మీకు పంపిన చెక్కు ను మీ బ్యాంకు లో జమ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మీకు తెలియదు , ఆ చెక్కు విలువ సున్నా అని ! ( అంటే ఆ చెక్కు బౌన్స్ అవుతుంది అని అంటారు బ్యాంకు భాష లో ! )
మీ అనుభవాలు తెలియ చేయండి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !