వెనక నొప్పి . 10. బరువు లెత్తే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు !
మునుపటి టపాలో, వెనక నొప్పి లేదా వెన్ను నొప్పి నివారణలో ముఖ్యమైన మొదటి రెండు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకున్నాం కదా , ఇక మూడవ జాగ్రత్త గురించి చూద్దాం ! ఇది బరువు లెత్తే సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ! బరువు లెత్తే సమయం లో, ‘ వెన్ను పూస జారడమూ ‘ విపరీతమైన వెన్ను నొప్పి కలగడమూ , సాధారణమైన సామాన్యం గా మన అనుభవం లో జరుగుతూ ఉంటాయి ! కారణం : అతి బరువును అకస్మాత్తు గా ఎత్తడం వలన. ఈ రకమైన అతి బరువులు ఎత్తే ముందు, ఎత్తే సమయం లో కూడా , ఇంకా దింపే సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసుకోవలసిన అవసరం ఉంది !
1. ఎంత బరువు ఎత్త బోతున్నారో ముందే ఆలోచించుకుని , ఒక నిర్ధారణ కు రావడం : ఇది చాలా ముఖ్యం. బరువు ఎంతో తెలియకుండా వాటిని ఎత్తే ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అవుతుంది ! అంతే కాకుండా , ఆ చర్య అనవసర ( వెన్ను నొప్పి ) సమస్యలను చేతులారా , కొని తెచ్చుకోవడమే ! ఇంకొకరి సహాయం అవసరమా , లేదా ఏవైనా ఉపకరణాలతో అంటే బలమైన కర్రలో , లేదా గునపమో , ఉపయోగించ వచ్చా ? అనే విషయం కూడా ముందే నిర్ణయించుకోవాలి ! ఆ అతి బరువును ఎత్తి వెన్ను నొప్పి తెచ్చుకున్నాక కాదు !
2. పొజిషన్ : బరువులు ఎత్తే సమయం లో మనం ఎట్లా నుంచున్నామో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే, మనం నిటారు గా నిలబడి బరువులు ఎత్తే ప్రయత్నం చేస్తే , మనం ఎత్తే బరువు ప్రభావం మన వెన్ను పూస మీద పడుతుంది . అట్లా కాకుండా మన కాళ్ళను అనువైన పొజిషన్ లో ఉంచుకుని నుంచుంటే , ఆ ఎత్తే బరువు
కాళ్ళ ను ముందుగా ప్రభావితం చేస్తుంది ( పైన ఉన్న చిత్రం గమనించండి ) ముఖ్య సూత్రం , ఎత్తే బరువులు వెన్ను పూస ఎముకలను , అంటే వర్టిబ్రా ను ప్రభావితం చేయకుండా ఉండడానికే కదా ! అదే విధం గా కడుపు కండరాలను బలం గా టెన్స్ గా ఉంచుకోవాలి , మోకాళ్ళ దగ్గర కొద్ది గా వంచిన పొజిషన్ లో ఉన్న కాళ్ళను బరువులు ఎత్తడం పూర్తయాక కానీ , నిటారుగా చేయకూడదు
3.బరువులను, నడుముకు వీలైనంత దగ్గర గా ఉంచుకోవాలి : బరువులు ఎత్తే సమయం లో , ఎత్తిన బరువును నడుముకు వీలైనంత దగ్గరగా ఉంచి మోయాలి అంటే ఒక కాఫీ కప్పులు ఉన్న ట్రే ను మోస్తున్నట్టు కాకుండా !
4. భుజాలనూ , హిప్పు నూ ఒకే పొజిషన్ లో ఉంచుకోవడం : బరువులు ఎత్తే సమయం లో వెన్నుపూసను మెలిక వేయకూడదు అంటే , ఒక పొజిషన్ లో ఎత్తుతూ , భుజాలను ఇంకో పొజిషన్ లోకి అంటే ఇంకో కోణం లోకి మారుస్తే , భుజాలతో పాటుగా వెన్ను పూస కూడా ట్విస్ట్ అయి అప్పుడు అకస్మాత్తు గా వెన్ను నొప్పి వచ్చే రిస్కు ఉంటుంది !
5. మీ పరిమితులు తెలుసుకోండి ! బరువును సురక్షితం గా ఎత్త గలగడం , బరువును ఎత్తడం లో ఎంతో తేడా ఉంది కదా ! ఎక్కువ బరువును ఎత్తాక మూడు నెలలు వెన్ను నొప్పి తో మంచాన పడితే అది సురక్షిత మెట్లా అవుతుంది ?
6. లాగడం నష్టం , తోయడం లాభం ! : ఒక గది లోంచి ఇంకో గది లో కి బరువులు మార్చాలనుకుంటే , ఆ బరువులను తోయడం , వాటిని లాగడం కన్నా సురక్షితం !
7. సంచులు మోసే సమయం లో బరువును తుల్యం చేసుకోవడం సురక్షితం : సామాన్యం గా మార్కెట్ కు వెళ్లి సరుకుల సంచీ ఇంటికి తెచ్చే సమయం లో ఆ సంచుల బరువులు రెండు చేతుల్లోనూ సమానమో కాదో చూసుకుని , అట్లా కాక పొతే సమానం చేసుకుని , బరువులు మోయడం సురక్షితం !
8. ఊళ్లకు వెళ్ళే సమయాలలో సూట్ కేసులు ఎక్కువ ధర అయినప్పటికీ కూడా వాటికి అమర్చి ఉండే చక్రాలు దృ ఢ మైనవి ఉంటే నే కొనుక్కోవడం క్షేమ దాయకం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !