ప్రాణం విలువ లో తేడాలు.
దేశం: జర్మనీ.
ప్రాంతం : ఆల్ప్స్ పర్వత శ్రేణి.
సమయం : జూన్ 8, 2014.
ప్రమాదం జరిగింది: ఒక్కడికి.
పాల్గొన్న సహాయ సిబ్బంది : 728 మంది. వివిధ దేశాలకు చెందిన వారు ( జర్మనీ, స్విట్జర్లాండ్ , ఆస్ట్రియా , ఇటలీ , క్రొయేషియా ) పైన ఉన్న చిత్రం మీద క్లిక్ చేసి, వీడియో చూడండి !
జొహాన్ వెస్ట్ హాజర్ అనే జర్మనీ కు చెందిన శాస్త్రజ్ఞుడు, గుహలను పరిశీలించడం లో అపారమైన అనుభవం ఉన్న వాడు. యూరప్ లో ఎత్తైన పర్వత శ్రేణి ‘ ఆల్ప్స్ ‘ అనే పర్వత శ్రేణి , అంటే హిమాలయాల లో ఉన్న పర్వత శ్రేణి లాగా ! తన ఇరువురు సహచరులతో , ఆస్ట్రియా దేశం సరిహద్దులో ఉన్న రీ సెన్ డింగ్ గుహలను పరిశీలించడానికి బయలు దేరాడు, జూన్ ఎనిమిదవ తారీఖున . గుహల లోకి దిగుతూ , ప్రమాద వశాత్తూ , ఒక బండ రాయి విరగడం తో , వెయ్యి మీటర్ల దిగువన, అంటే ఒక కిలోమీటరు లోతులో పడి పోయాడు. తన సహచరులిద్దరూ , ఆ ప్రమాదాన్ని తప్పించుకుని, అత్యవసర సిబ్బంది ని అప్రమత్తం చేశారు.
రీ సెన్ డింగ్ గుహలు ఎంతో లోతైనవే కాకుండా , చాలా కఠిన మైన బండ రాళ్ళతో నిర్మితమైనవి. దీనితో జొహాన్ ను రక్షించడానికి , సహాయ సిబ్బంది అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. చాలా చోట్ల ఈ గుహ, కేవలం చిన్న చిన్న సందులు గానే కనిపిస్తుంది ! ఆ సందులను వెడల్పు చేయాడానికి ఏదైనా యంత్రాన్ని ఉపయోగించి , అంటే ఆ ఇరుకు గా ఉన్న రాళ్ళను తొలుచు దామనుకున్నా , ఆ సమయం లో విరిగి పడే రాళ్ళూ , రప్పలూ , వెయ్యి మీటర్ల దిగువున పడి ఉన్న జొహాన్ ను ఠ పీ మని చంపేయ గలవు ! ఇన్ని ప్రమాదాలకు నిలయమైన ఆ గుహ నుంచి , జొహాన్ కోసం వెదకడం అనవసరమనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు కొందరు , ఆ ప్రయత్నం ఆరంభం లో ! కానీ , ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకుని , తదేక దీక్ష తో , 728 మంది సిబ్బంది కలిసి , పన్నెండు రోజులు శ్రమించి , గుహలో ఒక కిలోమీటర్ లోతు లో పడి ఉన్న జొహాన్ ను ప్రాణాలతో , పైకి తీసుకు వచ్చారు ! జొహాన్ వెంటే ఇద్దరు డాక్టర్లు కూడా పైకి వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్ళారు , పరీక్షలూ , చికిత్స కోసం !
సమయం : జూన్ 20, 2014. జొహాన్ ఆస్పత్రి లో కోలుకుంటున్నాడు ! విశేషం ఏమిటంటే , జొహాన్ , 1995 లో ఇదే గుహను కనుక్కున్న వారిలో ఒకడు !
దేశం: ఇండియా .
ప్రాంతం : హిమాచల్ ప్రదేశ్.
బియాస్ నది.
సమయం: June 08. 2014.
ప్రమాదం జరిగింది : 24 మంది ( ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ) ఇంజనీరింగ్ విద్యార్ధులకు.
కారణం : బాధ్యతా రహితం గా , కనీస హెచ్చరికలు చేయకుండా , ఏ రకమైన ముందు జాగ్రత్తలూ తీసుకోకుండా , బియాస్ నది బ్యారేజీ తలుపులు తెరిచి , విద్యార్ధులందరూ కొట్టుకు పోవడానికి కారకులైన సిబ్బంది ! ఈ విషయం ఖచ్చితం గా తెలిపింది , ప్రభుత్వం వేసిన కమిషన్ రిపోర్ట్ లో ! ఈనాడు లో వార్త ( 21.06. 2014) క్లిప్పింగ్ చూడండి.
ఒక్కో విద్యార్ధి ప్రాణానికీ, కనీసం అయిదు కోట్ల రూపాయల నష్ట పరిహారం కోసం , అందరు తల్లి దండ్రులూ కలిసి , సుప్రీం కోర్టు లో కేసు వేయాలి , కనీసం, భవిష్యత్తు లో, ఇతర ప్రాణాల రక్షణ కోసమైనా !
( మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తో )
మన దేశం లో దేనికీ విలువలేదు, ఒక్క సినిమాకి,రాజకీయానికి తప్ప. సామాన్యుల ప్రాణాలంటే అసలు లెక్కే లేదు. ఇంతకాలం వెతుకుతున్నారంటేనే గొప్ప విషయం. హై కోర్ట్ సుమోటో కేస్ తీసుకోకపోతే ఇంతే సంగతులు.మారిన ప్రభుత్వపు చొరవ కూడా శవాలు వెతకడానికి కారణం.