వెనక నొప్పి కి కారణాలు ( బ్యాకేక్ ). 1.
( పైన ఉన్న చిత్రం లో, మానవులలో వెన్నెముక ను కండరాలు లేకుండా చూపడం జరిగింది ) .
సమస్య: ప్రమోద్ ఓ సాఫ్ ట్ వేర్ ఇంజనీర్. రజనీ తో ఒక అందమైన అపార్ట్ మెంట్ లో నివాసం. ఆఫీసు కు రోజూ రానూ పోనూ, తనకు ఇష్టమైన బజాజ్ పల్సార్ బైక్ మీద నలభై మైళ్ళ ప్రయాణం. ఇంటి కి వచ్చాక, రజనీ ఒడి లో సేద తీర్చుకోవడం ! రోజంతా పడ్డ శ్రమ మర్చి పోవడం ! తరువాత రజనీ తో కిచెన్ లో వంట లో ప్రయోగాలు చేయడం , ఇద్దరూ కలిసి వండిన , వంటకాలు ఆస్వాదించడం , ఆ తరువాత , బెడ్ రూం లో ఇంకా కొత్త రుచులు ఆస్వాదించడం – ఇదీ ప్రమోద్ దిన చర్య ! కొంత కాలం అయ్యాక ప్రమోద్ కు వెన్ను నొప్పి మొదలైంది ! బాగా ఆరోగ్యం గా ఉండే ప్రమోద్ , తన వెన్ను నొప్పి తట్టుకోలేక పోతున్నాడు ! ఓ మాదిరి గా ఆఫీస్ లో పని చేయగలుగు తున్నా కూడా , ఇంటికి వచ్చాక , నొప్పి ఎక్కువ గా ఉంటుంది. బెడ్ రూం లో పడక మీద పూలు నలగడం లేదు ఈ మధ్య ! తనకు అనుకూలమైన పొజిషన్లో తిరిగి , ప్రమోద్ రజనీతో కేవలం నిద్ర మాత్రమే పోతున్నాడు ! రజనీ కి ప్రమోద్ మీద అనుమానం మొదలైంది ! ప్రమోద్ కు రజనీ తనను అనుమానిస్తుందని తెలిసింది ! ఈ సమస్యకు సమాధానం ఏమిటి ?
మన దేహం వెనక భాగాన వచ్చే నొప్పి కి అనేక కారణాలు ఉండ వచ్చు. ఆ నొప్పి అనేక రకాలు గానూ ఉండ వచ్చు. మానవ పరిణామ రీత్యా చూస్తే , ఆది మానవులు మొదట గా నిటారు గా నిలబడ డమూ, నడవడమూ , పరిగెత్తడమూ చేయడం మొదలు పెట్టారు . అంటే, నిటారు గా నిలబడడానికి వెన్నుపూస అంటే స్పైన్ ప్రాధాన్యం అంతా ఇంతా కాదు ! మనం ఇప్పుడు దేహానికి వెనుక భాగాన వచ్చే నొప్పి గురించి తెలుసుకుందాం !
అందుకు, వెన్ను పూస ఎక్కడ నుంచి మొదలై ఎక్కడి వరకూ ఉంటుందో కూడా తెలుసుకోవాలి ! వెన్ను పూస మానవులలో, మెడ నుంచి మొదలై , కటి వలయం అంటే పెల్విస్ వరకూ ఉంటుంది ! సాధారణం గా మనం వెన్నెముక అని ఒకటే ఎముక ఉంటుందని అనుకుంటాము ( దీనినే స్పైన్ అని కూడా అంటాము ) కానీ , ఈ వెన్ను పూస లో ఎముకలు మెడ భాగం లో ఏడు , ఛాతీ భాగం లో పన్నెండూ, నడుము భాగం లో అయిదూ అంటాయి. అంటే మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి.
ఈ ఎముకలు, చేతులలోనూ కాళ్ళ లోనూ ఉండే ఎముకల లాగా పొడుగు గా ఉండక , గుండ్రం గా ఉంటాయి , ఉదాహరణకు , అరటి కాయను కనుక అడ్డంగా అయిదారు ముక్కలు గా కొస్తే వచ్చే ముక్కాల ఆకారం లో ఉంటాయి ! వీటిని వర్టిబ్రా అని అంటారు ( వర్టిబ్రం అంటే ఒక్క వెన్ను పూస ఎముక , వర్టిబ్రా అంటే బహువచనం , అంటే , అనేక వెన్ను పూస ఎముకలు ) ఖచ్చితం గా చెప్పుకోవాలంటే , ఈ ఎముకలకు వెనుక భాగం లో పైనా కిందా , రెండు వైపులా , కొక్కేల ఆకారాలు కూడా ఉంటాయి. అట్లాగే ప్రతి వెన్ను పూసకూ , ఇంకో వెన్ను పూసకూ మధ్య, డిస్క్ అనే భాగం ఉంటుంది !
మరి డిస్క్ ప్రాబ్లెమ్ ఎట్లా వస్తుంది ?
ప్రతి వెన్ను పూస ఎముక కూడా ఇంకో వెన్నుపూస ఎముక తో నేరు గా అమర్చ బడి ఉండదు. వాటి మధ్య డిస్క్ , లేదా వర్టిబ్రల్ డిస్క్ అమర్చ బడి ఉంటుంది.
ఈ డిస్క్ ఉపయోగం ఏమిటి ? :
వర్టిబ్రల్ డిస్క్ ప్రధానం గా పైనా క్రిందా ఉన్న వెన్ను పూస ఎముకలను త్వరగా అరిగి పోకుండా నివారిస్తుంది ! అంటే ఇక్కడ కేవలం ఒక రోజో రెండు రోజులో కాకుండా , మానవులు జీవితాంతమూ , కదులుతూ ఉంటారు అనే విషయం మర్చి పోకూడదు ! డిస్క్ కనక లేకపోతే , వెన్ను పూస ఎముకలన్నీ అతి త్వరగా ‘ అరిగి ‘ పోతాయి
డిస్క్ ప్రాబ్లం లో వెన్ను పూసలు అరిగి పోవడం జరగదు కానీ , డిస్క్ ఉండ వలసిన చోట ఉండక , బయటకు వస్తుంది. ఈ బయటకు రావడం పది శాతం కానీ ఇరవై శాతం కానీ , లేదా ఇంకా ఎక్కువ గా కానీ ఉండవచ్చు ! స్థాన భ్రంశం చెందిన ఈ డిస్క్ వల్లనే నొప్పి కలగడం , కొన్ని ప్రత్యేక కదలికలు బాధ కలిగించడం జరుగుతుంది !
నాడులు ఎక్కడ ఉంటాయి ?
నాడులు అంటే, మెదడు నుంచి మన దేహం లో అన్ని భాగాలకూ విస్తరించిన తంత్రులు . వీటి ద్వారానే మనకు, స్పర్శా , నొప్పీ , తెలియడం జరుగుతుంది ! ఈ నాడులు మొదట మెదడు నుంచి బయటకు వచ్చే సమయం లో మందమైన తాళ్ళ లాగానూ , పోను పోను , చిన్న తంత్రుల లాగానూ , విస్తరించి ఉంటాయి ! ఈ నాడులను మరి జాగ్రత్తగా దేహం చూసుకోవడానికి వెన్ను పూసలో ఉంగరం లాంటి ఒక నిర్మాణం ఉంటుంది , ప్రతి వర్టిబ్రా లోనూ , ఒక పది ఉంగరాలను ఒక దాని మీద ఒకటి ఉంచి తే ఒక గొట్టం లాంటి నిర్మాణం ఏర్పడుతుంది కదా ! ఆ గొట్టం లోనుంచి మందమైన నాడులు వస్తాయి !మరి ఒకటే దృఢమైన ఎముకలతో నిర్మితమైన ఒక్క గొట్టం లాంటి నిర్మాణం ఉండ వచ్చు కదా !
ఇన్ని వెన్నుపూసలు ఎందుకు మానవులకు ?
అంటే , అదే సృష్టి వైచిత్ర్యం ! గొట్టం లాగా ఒకటే నిర్మాణం ఉంటే , మానవులు కేవలం రోబోట్ల లాగా నే కదల గలుగుతారు అంటే వంగడమూ , పక్కకు తిరగడమూ లాంటి కదలికలు చేయ లేరు కదా ! అట్లాంటి కదలికలకు అనుకూలం గానే , వెన్ను పూసలు ఒక గొట్టం లాగా కాకుండా , ఒక దాని మీద ఒకటి అమర్చ బడి ఉంటాయి !
అంతే కాదు ! మనం పైన చెప్పుకున్నట్టు గా , మెదడు నుంచి బయలు దేరిన నాడీ తంత్రులు ప్రతి రెండు వెన్నెముకల మధ్య నుండి , ఇరు ప్రక్కలా శాఖలు గా విస్తరిస్తాయి ! వాటికి అవసరమైన రక్త నాళాలు కూడా ! వెన్ను నొప్పి , మెడ లో కానీ , వీపు లో కానీ , నడుము లో కానీ రావచ్చు ! నడుము నొప్పి ని సామాన్యం గా సయాటికా అని అంటూ ఉంటాం కదా !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !