Our Health

చర్మ మర్మాలు . 3. మొటిమలకు, కారణాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on ఏప్రిల్ 14, 2014 at 7:25 సా.

చర్మ మర్మాలు . 3. మొటిమలకు కారణాలేంటి ? 

 

మొటిమలు చర్మం మీద కలిగే అతి సామాన్యమైన మార్పులు ! కానీ ఈ మొటిమలు వస్తున్న వారికి , వారి తల్లి దండ్రులు కానీ , బంధువులు కానీ , మిత్రులు కానీ , ఇంకా అనేక మంది , వారిని భయ పెడుతూ ఉంటారు , అనేక రకాలైన  అశాస్త్రీయ మైన కారణాలు చెబుతూ ! 
1. అపోహ : మొటిమలు సరిగా తినక పోవడం వల్ల ఏర్పడతాయి !
వాస్తవం : ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల వల్ల , మొటిమలు ఏర్పడడానికి  ఈ ఆహారం  కారణమని, లేదా ఈ ఆహార లోపం కారణమనీ చెప్పలేక పోయారు ! సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్య రీత్యా మంచిదే కానీ ,అట్లా సమతుల్యమైన ఆహారం తీసుకోక పొతే మొటిమలు ఏర్పడతాయన్నది అపోహ మాత్రమే !
2. అపోహ:  మొటిమలు చర్మాన్ని శుభ్రం గా ఉంచుకోక పోవడం వల్ల లేదా , చర్మం మురికి గా ఉండడం వల్ల ‘ :
 వాస్తవం:  మొటిమలు రావడానికి మూలమైన మార్పులు , చర్మం లోపలి పొర లో మొదలవుతాయి ! అందువల్ల చర్మం శుభ్రతతో మొటిమలు ఏర్పడడానికి సంబంధం లేదు ! ముఖాన్ని చాలా సార్లు , ఆ భయం తో కడుక్కుంటూ ఉంటే , కొన్ని సమయాలలో ఆ పరిస్థితి తీవ్రత ఎక్కువ కావచ్చు ! 
3. అపోహ: ‘ మొటిమలను నొక్కి వేయడమూ , లేదా గట్టిగా వత్తి , తీసి వేస్తే అవి మళ్ళీ ఏర్పడవు ‘ 
వాస్తవం : ఇది కూడా అపోహ మాత్రమే ! అట్లా చేయడం వల్ల , మొటిమలు తీవ్రమయి ,  కొన్ని సమయాలలో శాశ్వతం గా మచ్చలు ఏర్పడే ప్రమాదం  ఉంటుంది ! దీనినే స్కారింగ్ అంటారు ! 
4. అపోహ: సెక్స్ లో ఎక్కువ గా పాల్గొనడం వల్ల కానీ , లేదా హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల కానీ మొటిమలు ఎక్కువ గా వస్తాయి !
వాస్తవం:   ఇది కూడా ఒక అపోహ. మొటిమలు ఈ చర్యలతో ఎక్కువా కావు , తక్కువా కావు ! అంటే  సెక్స్ కార్యకలాపాలకూ , మొటిమలకూ సంబంధం లేదు ! 
5. అపోహ: మొటిమలు ఒకరి నుంచి ఇంకొకరికి పాకుతాయి ! అంటే మొటిమలు అంటు వ్యాధి ‘
 వాస్తవం :ఇది కూడా ఇంకో అపోహ ! మొటిమలు అంటు వ్యాధి కాదు ! ఒకరి నుంచి ఇంకొకరికి  అంటు కోవు ! 
6. అపోహ: సన్ బాత్ చేస్తే కానీ ( అంటే బట్టలు తక్కువ గా వేసుకుని సూర్యుడికి శరీరాన్ని ఎక్స్పోజ్ చేయడం ) , సన్ బెడ్ , లేదా సన్ ల్యాంప్ లకు శరీరాన్ని , లేదా మొటిమలు ఉన్న చర్మాన్నీ ఎక్స్పోజ్ చేస్తే , మొటిమలు తగ్గుతాయి !
వాస్తవం:   ఇది కూడా ఇంకొక అపోహ మాత్రమే  ! ఇది కూడా పూర్తి గా నిరాధారమైన అపోహ ! ఇట్లా సూర్య రశ్మి కి ఒంటి మీద ఆచ్చాదన లేకుండా , అంటే బట్టలు వేసుకో కుండా , చర్మాన్ని ‘ ఎండ బెడితే ‘ చర్మ క్యాన్సర్ వచ్చే రిస్కు అధికం అవుతుంది ! 
మరి వచ్చే టపాలో మొటిమలకు కారణం ఏమిటో తెలుసుకుందాం ! 


వ్యాఖ్యానించండి