తన కోపమె … 9. కోప నియంత్రణ కు ఇంకొన్ని మార్గాలు !

పచనం , పానం , ప్రాసనం ,
చలనం , వినోదం , విరామం !
బంధు మిత్రుల( తో ) ప్రేమానురాగం !
పాటిస్తే, కోపం అవుతుంది, బహుదూరం !
పచనం, అంటే మనం వండుకునే ఆహారం లో తీసుకోవలసిన జాగ్రత్త లు క్రమం గా తీసుకుంటూ ఉంటే , మన శరీరం నిరంతరం జరుగుతూ ఉండే ,అసంఖ్యాక మైన జీవ రసాయన చర్యలు సమతుల్యం లో ఉండి , మనలో కోప నియంత్రణ కు ఉపయోగ పడతాయి ! ఉదాహరణకు , మనం రోజూ తినే ఆహారం లో ఉప్పు మనకు కావలసినది కేవలం ఆరు నుంచి ఏడు గ్రాములు మాత్రమే ! ఒక చిటికెడు ఉప్పు ఒక గ్రాము లో నాలుగో వంతు ! అంటే కనీసం పాతిక చిటిక ల ఉప్పు మనకు రోజూ అవసరం ! ఈ పాతిక చిటికలు ఒక టీ స్పూన్ లో పడతాయి ! అంటే మనకు రోజూ అవసరమయే ఉప్పు కేవలం ఒక టీ స్పూన్ కు సరిపడా ఉప్పు మాత్రమే ! కానీ ,మనం అంతకు మించి కనీసం రెండు మూడు రెట్లు ఉప్పు తింటూ ఉన్నాం రోజూ ! మన శరీరం లో నాడీ మండలానికి , ఆ మాటకొస్తే , మన శరీరం లో ప్రతి కణానికీ కూడా , మనం రోజూ ఆహారం లో తీసుకునే ఉప్పు ఉత్తేజం చేస్తుంది ! ఒక నాడీ కణం నుంచి ఇంకో నాడీ కణానికి చేరవలసిన సంకేతాలు కూడా , కేవలం ఈ ఉప్పు లోని సోడియం వల్ల నే ! మరి సహజం గానే , మన శరీరం లో ఉండవలసిన ఉప్పు కన్నా ఎక్కువ ఉంటే , ( అంటే మనకు తెలియక కానీ , తెలిసి కానీ ) తదనుగుణం గా మన జీవ కణాలు ఎక్కువ గా నే ఉత్తేజం అవుతాయి !
కేవలం వంటలోనే కాక , మనం రోజు వారీ ఆహారం తినడం ( ప్రాసనం ) లోనూ , వివిధ పానీయాలు తాగడం లోనూ కూడా , తగినంత జాగ్రత్త తీసుకోవాలి !
చలనం , వినోదం , విరామం : ఒకే చోట ఎక్కువ సమయం , ఎక్కువ కాలం కూర్చోకుండా , కాళ్ళూ , చేతులు సహక రించే వరకూ , మనం చలిస్తూ ఉంటే , అది శరీరానికీ , మనసుకూ కూడా మంచిదే ! నిద్ర సరిగా పోకుండా , పగలు, విసుక్కుంటూ , చీకాకు పడుతూ , పని చేసే వారినీ , చదువు కునే విద్యార్ధులనూ , మనం చూస్తూ ఉంటాము కదా ! సుఖ నిద్ర తో పాటుగా , విరామం కూడా మన శరీరం తో పాటుగా మనసుకూ ( అంటే మన నాడీ మండలానికీ ) తప్పని సరిగా ఉండాలి !
అట్లాగే , బంధు మిత్రులతోనూ , ఆత్మీయులతోనూ , ప్రేమానురాగాలు పంచుకోవడం , పొందడం కూడా ఆరోగ్యకరమైన అలవాటు ! పైన ఉదహరించిన అలవాట్లలో , వేటిలో అయినా పొర పాట్లు జరుగుతూ ఉంటే , అవి , శరీరానికి , అస్వస్థత కలిగించడం తో పాటుగా , మనసును కూడా చీకాకు పరుస్తాయి !
మనసు చీకాకు పడుతూ ఉంటే , శాంత స్వభావం మనకు ఉంటుంది ? దానితో , చీటికీ మాటికీ ,విసుక్కోవడమూ , కోపగించుకోవడమూ జరుగుతుంది ! పై అలవాట్లు పాటిస్తూ ఉంటే , కోపం తక్కువ అవడమే కాకుండా , కోపాన్ని నియంత్రించుకునే సమర్ధత కూడా పెరుగుతుంది !
జయ నామ సంవత్సర శుభాకాక్షాల తో ,
వచ్చే టపా తో మళ్ళీ కలుసుకుందాం !